రచయిత వివరాలు

దాసరి అమరేంద్ర

పూర్తిపేరు: దాసరి అమరేంద్ర
ఇతరపేర్లు:
సొంత ఊరు: విజయవాడ
ప్రస్తుత నివాసం: ఢిల్లీ
వృత్తి:
ఇష్టమైన రచయితలు: కొ. కు., సోమర్‍సెట్ మామ్
హాబీలు: ప్రయాణాలు, పుస్తకాలు, మనుషులు
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

ఈ పర్వతాల రంగులు కూడా వివిధ సమయాల్లో వివిధ రకాలుగా మనకు కనబడతాయి. సూర్యోదయ సమయంలో నారింజరంగు కలసిన పసిడి వర్ణం, మధ్యాహ్న సమయంలో మచ్చ లేని ధవళ వర్ణం, సూర్యాస్తమయ సమయంలో ధగధగల బంగారు వర్ణం… క్రమక్రమంగా అరుణారుణ గిరిశిఖరం!

ఎక్కడో సుదూరపు మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ప్రజల గురించి రాసిన పుస్తకం కాదిది – సమస్త మానవాళి ఆశనిరాశలను, సుఖదుఃఖాలను, కష్టనష్టాలను, ఉత్థానపతనాలను, విజయపరాజయాలను, కరుణాక్రౌర్యాలను, స్వార్థాలూ ఉదారతలను విప్పి చెప్పే రచన ఇది.

సామాన్యంగా అందరూ ఎవరెస్ట్ అని పిలచుకొనే శిఖరాన్ని నేపాల్‌లో సగర్‌మాథా అంటారు. స్వర్గశీర్షమని దాని అర్థం. టిబెట్‍లో ఆ శిఖరాన్ని చోమో లుంగ్మా (పర్వతరాణి) అని పిలుస్తారు. మనిషి కంట అంత సులభంగా పడకపోవడంవల్ల కాబోలు – హిందూ పురాణాలలో ఎవరెస్ట్ ప్రస్తావన దాదాపు లేదు.

మహాకవి కాళిదాసు ఐదవ శతాబ్దంలో తన సంస్కృత కావ్యం కుమారసంభవంలోనూ, అలాగే మన అల్లసాని పెద్దన పదహారవ శతాబ్దంలో మనుచరిత్రలోనూ చూపించిన హిమాలయాల పదచిత్రాలు నా మనసులో నాటుకుపోయాయి. ఆ వర్ణనలలో అతిశయోక్తులు ఉండి ఉండవచ్చు – కానీ అవి అద్వితీయం.

మనసు తరచూ మరో ప్రశ్న వేస్తుంది. ఈ ప్రశ్నకు నా మనసిచ్చే జవాబు – ఖర్చులూ ఫలితాల సంగతి నాకు అనవసరం. ఏదో సాధించాలని నేను ప్రయాణం చెయ్యడం లేదు. ప్రయాణమే నా జీవితం కాబట్టి ప్రయాణాలు చేస్తున్నాను. జీవించడానికి నాకు తెలిసిన ఒకే ఒక మార్గం ప్రయాణం…

డబ్బు సమకూర్చగల అన్ని విలాసాలూ ఆ కారాగారంలో ఉన్నాయి. బహుశా ఈ ల కథెడ్రాల్ జైలు ప్రపంచంలోకెల్లా అతి విలాసవంతమైన జైలయి ఉండాలి. అలాగే ఓ ఖైదీ తనకు తానే నిర్మించుకుని తన వారినే కాపలాగా పెట్టుకొన్న ఏకైక కారాగారమూ ఇదే అయి ఉండాలి. ఎంత తాపత్రయపడినా ఎస్కోబార్‌కు తన స్వంతజైలులోనూ రక్షణ లభించలేదు.

కార్తహేన పాతపట్నపు సందుగొందుల్లో మనసుతీరా తిరుగుతున్నప్పుడు ఓ పందిరి బాట, దిగువన బారులు తీరి ఉన్న చిరుదుకాణాలు కనిపించాయి. అందులో ఒక దానిలో కొకాదాస్ బ్లాంకాస్ అన్న మిఠాయిని అమ్ముతున్నారు. తురిమిన కొబ్బరిని రంగురంగుల తియ్యటి పాకంలో ఉడికించి చేస్తోన్న మిఠాయి అది.

విమానం పైకి ఎగిరినపుడు పైనుంచి కొన్ని ద్వీపాలు కనిపించి పలకరించాయి. ఆ ద్వీపాల మీద అడుగు పెట్టాను, రెండు మూడు రోజులు తిరిగాను అన్న ఆలోచనే నాకు విభ్రమ కలిగిస్తోంది. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతానికి శిలాన్యాసం చేసిన ద్వీపాలవి. జీవరాసుల గురించి ప్రపంచపు అవగాహనను సమూలంగా మార్చిన సిద్ధాంతానికి పుట్టినిళ్ళవి.

క్వెన్క నుంచి గుయాకీల్ 250 కిలోమీటర్లు. మధ్యలో ఒకచోట విరామం కోసం ఆగాం, అంతే. అంతా కలసి ప్రయాణానికి నాలుగున్నర గంటలు పట్టింది. దారంతా వర్షం – బయట అసలేమీ కనిపించనంత వర్షం. క్వెన్క వదిలీ వదలగానే రోడ్డు ఆండీస్ పర్వతాల మధ్య మెలికలు తిరుగుతూ సాగింది.

ఆండీస్ పర్వత శ్రేణి విస్తరించి ఉన్న దక్షిణ అమెరికా దేశాలలో మొక్కజొన్ననుంచి తయారు చేసే చిచా అన్న మదిర తెప్పించుకొని రుచి చూశాను. ఆ పానీయం ఆ ప్రదేశాల్లో మాత్రమే తయారవుతుందట. దాని మూలాలు ఇన్కా నాగరికత పూర్వపుదినాల నాటివట. ఇన్కా ప్రజానీకం కూడా పండుగలు పబ్బాలలో ఈ మదిరను కాచి విరివిగా సేవించేవారట.

ఆ మేడమీది రెస్టరెంటు పాతపట్నపు సంపూర్ణ దృశ్యాన్ని కళ్ళకు కట్టింది. పట్నంలోని ఎన్నో భవనాలూ లాండ్‌మార్కులూ ఆ దీపాల వెలుగుల్లో చక్కగా కనిపించాయి. సెంట్రల్ ప్లాజా, మెట్రోపాలిటన్ కథెడ్రల్, కొండమీద నెలకొన్న వర్జిన్ మేరీ విగ్రహం, ఊళ్ళోని బసీలికా స్పైరు – అన్నీ ఎంతో చక్కగా కనిపించాయి.

నాకు ముందునుంచీ ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలలో యూరోపియన్ల రాకకు పూర్వమే విలసిల్లిన మాయన్, ఇన్కా నాగరికతల విషయంలోను, అవి యావత్ ప్రపంచానికీ అందించిన సాంస్కృతిక వారసత్వం విషయంలోనూ ఆసక్తీ ఆరాధనా ఉన్నాయి. అక్కడి దేశాలలో ఇప్పటికీ కొనసాగుతోన్న ఘనమైన దేశవాళీ సంస్కృతి పట్ల ఆకర్షణ ఉంది.

సూర్యాస్తమయం నేనున్న చోటుకు వ్యతిరేక దిశలో అయింది కాని, అస్తమయం తరువాత వెల్లివిరిసే సంధ్యాకాంతులు పరిసరాలను సువర్ణభరితం చెయ్యడం గమనించాను. అవును – ఒక్కోసారి సూర్యాస్తమయ దృశ్యం కన్నా దాని తరువాత జరిగే వర్ణలీల మరింత మనసుకు హత్తుకొంటుంది.

ఒంటరి ప్రయాణాలను నేను బాగా ఇష్టపడతాను. కెంట్‌ కౌంటీలోని కాంటర్‌బరీ, ససెక్స్‌లోని ఈస్ట్‌బర్న్‌ పట్టణాలను కేంద్రంగా చేసుకొని అక్కడి పల్లెలూ పట్నాల్లో సాగేలా ఐదారు రోజులపాటు ఇంగ్లండ్‌ దేశపు గ్రామ సీమల్లో సోలో ప్రయాణం చెయ్యాలన్నది నా అభిలాష.

విమానం గాలిలోకి ఎగరగానే నేను గుడ్‌బై చెపుతున్నది ఒక పనమాకే కాదు; 18 రోజులు తనివితీరా తిరుగాడి ఆయా ప్రదేశాలు, మనుషులు, సంస్కృతులతో సహజీవనం చేసిన యావత్ మధ్య అమెరికాకు అన్న విషయం మనసులోకి ఇంకింది. నేను చేసిన అనేకానేక ప్రయాణాల్లో ఇది ఒక ముఖ్యమైన సంతృప్తికరమైన ప్రయాణం.

మానవ నిర్మాణ అద్భుతాలలో ఒకటైన పనమా కెనాల్ దగ్గర ఆ అపరాహ్ణ సమయం ఎంతో ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా గడిచింది. ఈ కెనాలే లేని పక్షంలో పనమా అనేకానేక చిరుదేశాలలో ఒకటిగా ఉండిపోయేది. ఈ కాలువకున్న వ్యూహాత్మక ప్రాముఖ్యత పనమాను ఒక నిర్దుష్టమైన ఉనికి ఉన్న దేశంగా నిలబెట్టింది.

గ్రనాద నడకరాయుళ్ళ స్వర్గసీమ. పెద్దగా దూరాలేమీ లేవు. ఏ వీధిని చూసినా రంగులీనుతూ కళకళలాడుతూ కనిపించింది. నాలో ఉత్సాహం నింపింది. ఎలాంటి అభద్రతాభావమూ కలుగలేదు. జనజీవితం నింపాదిగా సాగిపోతోంది. మనుషులు సౌమ్యుల్లా కనిపించారు. ఆప్యాయంగా పలకరించారు. స్నేహంగా సాయపడేవారిలా అనిపించారు.

పొరుగున ఉన్న గ్వాతెమాల, ఓందూరాస్ దేశాలలో ఉన్నట్టుగా కాకుండా ఎల్ సల్బదోర్ ప్రజల రూపురేఖలు ఎక్కువగా యూరోపియన్లను పోలి ఉన్నాయనిపించింది. కాస్తంత పరిశోధన తర్వాత అక్కడి జనాభాలో ఎనభై ఆరుశాతం మెస్తీహోలు అని, పదమూడు శాతం యూరోపియన్లు అని, ఒకే ఒక్కశాతం నేటివ్ ఇండియన్లనీ తెలిసింది.

అక్కడి ఒక కూడలిలో ‘చూడు చూడు అంటూ ఒక శిల్పం చూపించాడు మార్కో. అతను ముందే చెప్పిన, హనుమంతుడి పోలికలు పుష్కలంగా ఉన్న ఆకృతి అది. దానికి మార్కో పెట్టిన పేరు ‘మాయన్ హనుమాన్’. ఆమాట అక్కడికి వచ్చిన ఒక భారతీయ టూరిస్టు మార్కోతో అన్నాడట – దాన్ని మార్కో ఖరారు చేసి వాడేస్తున్నాడు.

అడవి వృక్షాలు, వాటిని ఆనుకున్న దట్టమైన పొదలూ లతల మధ్య ఉన్నాయా శిథిలాలు. మేము వెళ్ళినప్పుడు మరికొంత మంది సందర్శకులు ఉన్నారు కాబట్టి సరిపోయింది గానీ లేనట్టయితే అదంతా వింతగా, కాస్తంత భీతి కొలిపేలా అనిపించేదే. అక్కడ అవన్నీ చూపించడానికి సహాయకులు, గైడ్‌లూ లేరు. కనీసం సమాచారం చెప్పే బోర్డులన్నా లేవు.

కొండల వెనకాల నుంచి మా ముందున్న సరోవరాన్ని వర్ణభరితం చేస్తూ సూర్యుడు మెలమెల్లగా రంగప్రవేశం చెయ్యడం కానవచ్చింది. ‘అసలు నువ్వా శునకాలకు థాంక్స్ చెప్పుకోవాలి. వాటి పుణ్యమా అని ఇంత చక్కని ప్రదేశం చేరి సూర్యోదయం చూడగలుగుతున్నావ్’ అని చెణికింది జెమ్మా. ఆమె ఈ ప్రదేశానికి తరచూ వస్తూ ఉంటుందట.

సాహిత్యం సమాజంలో మార్పులకు దోహదం చెయ్యాలి అని ఆశించడం, ఆ సాహిత్యంలోనూ భాష, వాస్తవికతల పరంగా మౌలికమైన మార్పులు ఆశించడం, తీసుకురావడం – ఆ ప్రక్రియలో ఆధునిక సాహిత్యానికి గురజాడ మూల పురుషుడవడం వివినమూర్తిని బాగా ఆకట్టుకున్న విషయం, వాటికన్నా ఎక్కువగా మూర్తిని ఆకర్షించింది గురజాడలోని వివేచన.

సెంట్రల్ అమెరికా దేశాలు ప్రపంచంలోకెల్లా అతి తక్కువమంది యాత్రికులు తిరుగాడేవి. నేరాల పుట్టలుగా, రాజకీయ అవ్యవస్థ దిట్టలుగా, నియంతల కంచుకోటలుగా, మాఫియా ముఠాలకు స్వర్గసీమలుగా, సైనిక తిరుగుబాట్లకు కేంద్రబిందువులుగా అపార అపఖ్యాతిని గడించాయి. యాత్రికులకు వెంపరం కలిగించే ఖ్యాతి అది.

కర్ణాటక సంగీతానికి ప్రాచుర్యం తీసుకువచ్చిన దేవదాసీల గురించి పరిశోధనలు జరిగాయి. జీవిత చరిత్రలూ వచ్చాయి. కానీ అవి ఒకరిద్దరిని తప్ప ప్రతిభావంతులైన ఎంతో మందిని పట్టించుకోలేదు. వీళ్ళంతా తుదీ మొదలూ లేని అయోమయంలోకి జారిపోయారు. నవలారూపంలో అయినా వారికి మాట్లాడే కనీసపు హక్కుని ఇవ్వడానికి నేను ప్రయత్నించాను.

అందరం సంబరంగా 2020కు స్వాగతం చెప్పాం. చిట్టచివరి సారిగా మొరాకన్ విందుభోజనాన్ని ఆస్వాదించాం. ఎంతో హాయిగా సంతృప్తితో నిద్రాదేవత ఒడిలో సేదదీరాం. తెల్లవారగానే చుట్టూ కమ్ముకున్న కొత్త సంవత్సరపు పరిమళాలను మనసారా ఒంటపట్టించుకుంటూ తిరుగు ప్రయాణం కోసం విమానాశ్రయం దారి పట్టాం.

ఒకే ఒక్కరోజులో మేమంతా నాగరికత నిండిన మరాకేష్‌ నుంచి గంటన్నర దూరం ప్రయాణించి నగరంతో ఏ మాత్రం పోలికలేని కొండచరియల్లో వేలాడే బెర్బర్‌ గ్రామాలను, సారవంతమైన లోయలను, హిమ శిఖరాలను, నిర్జీవపుటెడారులనూ చూడగలిగామన్నది విస్మయ పరిచే విషయం.

స్వీరా నగరాన్ని ఒక ఆరుబయలు మ్యూజియం అనడం సబబు. అక్కడ మనకు లభించగల చక్కని అనుభవం ఏమిటీ అంటే గమ్యమంటూ లేకుండా ఆ నగరపు వీధుల్లో గంటలతరబడి తిరుగాడటం, ఆ ప్రక్రియలో కాస్సేపు మనల్ని మనమే కోల్పోవడం. ఏ ఆలోచనలకూ తావు లేకుండా సేదదీర్చే ఆ వాతావరణం ఏ మనిషినైనా మత్తెక్కిస్తుంది.

చురుకుదనం మూర్తీభవించినట్టు కనిపించే జానకమ్మ తన అయిదు నెలల నివాసాన్ని, రెండు నెలల పైచిలుకు సాగరయానాన్నీ వింతలూ విశేషాలూ వినోదాలకూ పరిమితం చెయ్యలేదు. ఉన్న సంపదతో, తమతో తీసుకువెళ్ళిన ముగ్గురు సేవకుల సాయంతో సుఖంగా, విలాసంగా గడపలేదు. జిజ్ఞాస, ఆలోచన, పరిశీలన, పరిశోధన ఆమెను అనుక్షణం నడిపించాయి.

మధ్యాన్నం అయ్యేసరికి సూర్యుని ప్రతాపం పెరిగిపోయింది. ఎండ తీక్షణమయింది. వేడి భరించడం కష్టమయింది. మనం వర్ణచిత్రాలలో చూసే ఎడారిలోని ఒంటెల బిడారుల్లో ఈ తీక్షణత గోచరించదు. చిత్రకారుల తూలికలకు అందని అసౌకర్యమది. జీవశక్తిని పీల్చేసే ఆ ఎండల మండిపాటును ప్రత్యక్షంగా అనుభవిస్తే తప్ప ఆ అసౌకర్యాలు మనకు బోధపడవు.

ఈ బృహత్ పర్వతాలు ప్రకృతి మాత దేవాలయాలు, ఈ శిఖరారోహణలు ఆమెకు మనం అర్పించే పూజా నైవేద్యాలు. మేము కూడా తీర్థయాత్రికులమే గదా అనిపించింది. పర్వతాలు ఎక్కడం, పాదయాత్రాంజలులు అర్పించడం, ఆ ప్రక్రియలో మనలోకి మనం తొంగి చూసుకోవడం… అది కదా కొండల మీద నెలకొన్న కోనేటిరాయళ్ళ దర్శనాల అంతరార్థం!

ప్రస్తుత మొరాకో యాత్ర నేను కోవిడ్‌ ఉపద్రవంలో ఎదుర్కొన్న కష్టనష్టాలనుంచి బయటపడటానికి బాగా ఉపకరించింది. మనసుకు ఎంతో అవసరమయిన శాంతిని ఇచ్చింది. నాలో స్ఫూర్తిని నింపింది. ప్రయాణ దాహాన్ని పునరుద్ధరించింది. గత ఆరేళ్ళలో ఇది నా మూడో మొరాకో యాత్ర. అంతా కలసి దాదాపు నెలరోజులు మొరాకోలో తిరుగాడాను. మూలమూలలూ చూశాను.

తిరిగి హోటలుకు వెళ్ళేటపుడు ఆ దేశపు పార్లమెంటు భవనము, సాయుధ రక్షకుల పర్యవేక్షణలో ఉన్న రాజప్రాసాదమూ కనిపించాయి. రబాత్‌ నగరాన్ని నడకరాయుళ్ళ స్వప్నసీమ అనవచ్చు. నగరంలో తిరుగుతోంటే ఆత్మీయంగా అనిపిస్తుందే తప్ప సంభ్రమాశ్చర్యాలు, మనమీద నగరం వాలిపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న భావన కలగనే కలగవు.

జిబ్రాల్టర్ జలసంధి దక్షిణ తటాన, మధ్యధరా సముద్రం అట్లాంటిక్ మహాసముద్రాన్ని పలకరించే చోట కాపలా సిపాయిలా నిలచి ఉండే నగరం టాంజియర్. ఆ జలసంధి ఎంతో సన్నపాటిది. ఒకచోట భూభాగాల మధ్య దూరం పదమూడు కిలోమీటర్లే. విరామమంటూ లేకుండా కార్యకలాపాలు సాగే సముద్ర మార్గాలలో జిబ్రాల్టర్ జలసంధి ప్రముఖమైనది.

షెఫ్‌సాన్ ప్రజలు మృదుభాషులు, ప్రశాంతజీవులు. తమ పనేదో తాము చేసుకుంటూ పోయేవాళ్ళు. మరకేష్, ఫెజ్ నగరాల్లో మొహం మీద గుచ్చి గుచ్చి మాట్లాడే మనుషుల్ని చూశాక ఇక్కడివాళ్ళను చూస్తే పిల్లగాలి వీస్తున్నట్టనిపించింది. ఇతర పట్టణాల్లో లాగా ఇక్కడ దళారీల వేధింపులు లేవు. బలవంతపు అమ్మకాలు లేవు.

నాకు ఆశ్చర్యమనిపించింది. ఈ ప్రాంగణం ఎంతో విశాలంగా ఉన్నమాట నిజమే గానీ దీని దిగువున అరవైవేలమంది బానిస ఖైదీలు ఉండటం సాధ్యమనిపించడం లేదు అన్నాను. ఒక గట్టి నిట్టూర్పు విడిచి- వాళ్ళంతా గొలుసులతో గోడలకి కట్టివేయబడ్డారు. నిలబడటానికి కూడా చోటు లేనంతగా కిక్కిరిసి ఉండేదీ జైలు. వాళ్ళల్లో చాలామందికి నిలబడే నిద్రపోవలసివచ్చేది అని వివరించాడు హఫీద్.

ఫెజ్‌లో ప్రతి ఏడాదీ జరిగే ప్రపంచ ధార్మిక సంగీతోత్సవం ఒక విలక్షణ కార్యక్రమం. ఈ ఉత్సవం గురించి షఫియా రైలు ప్రయాణంలో చెప్పింది కూడానూ. ఈ సంగీతోత్సవానికి ప్రపంచపు నాలుగు మూలలనించీ విద్వాంసులు వస్తారట. సూఫీ ఖవ్వాలీల నుంచి హిందూ భజనల దాకా, క్రైస్తవ గీతాల నుంచి బౌద్ధమతపు మంత్రోచ్ఛారణ దాకా విభిన్న బాణీల సంగీత ప్రపంచం.

ఈ కథల్లో మనిషి, అతని జీవనపోరాటం, విధ్వంసాల మధ్యనయినా బతకాలన్న ఆరాటం, ఆ ఆరాటపోరాటాల మధ్యనే స్నేహాలు, ఆత్మీయతలు, ఎల్లలు ఎరుగని ప్రేమలు, మానవీయ స్పందనలు – అవును ఎల్లలు ఎరగని కథలు ఇవి. శ్రీలంక నుంచి కెనడా దాకా, ఆఫ్రికా నుంచి అమెరికా దాకా, గ్రీస్ నుంచి భారతదేశం దాకా – ఈ కథల రంగస్థలాల్లో ప్రపంచమంత వైవిధ్యం.

నమీరూ అతని భార్యా చక్కని ఆతిథ్యమిచ్చే మనుషులు. ఆ రియాద్ వాళ్ళిద్దరి చిన్నపాటి సుందర ప్రపంచం. ప్రపంచపు నలుమూలలనుంచీ వచ్చే అతిథులతో దాన్ని పంచుకోవడం వారికి ప్రీతిపాత్రమైన విషయం. ఫెజ్ నగరంతో స్నేహ సామరస్యాలు సాధించడంలో నమీర్ నాకు ఎంతో సాయంచేశాడు. చక్కని సలహాలూ సూచనలూ ఇచ్చాడు.

ఒకసారి చదివి వదిలేసే నవలగాదు. అలా చేస్తే ఆ అనుభవం ‘కష్టాల కొలిమి’ అనిపించే అవకాశం ఉంది. రెండోసారీ మూడోసారీ చదవడం, అనువాదం కోసం ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్నీ మథించడం – ఏ నవల విషయంలో అయినా ఇవి ఒక సమగ్ర అవగాహనకు రహదారి అవుతాయి. ఈ నవల విషయంలోనూ అదే జరిగింది.

నలుగురు యాత్రికులు – నలుగురిదీ ఒకటే బాణీ. జీవితానికీ ప్రయాణానికీ అంతరం లేదని భావించినవారు. జడజీవితం మీద తిరుగుబాటు జెండా ఎగరేసినవారు. ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త జీవితాన్ని, ఆ ప్రక్రియలో తమను తాము అన్వేషించుకుంటూ సాగినవారు.

విప్పారిన కళ్ళతో, వికసించిన మనసుతో, శ్రుతి అయిన సర్వాంగాలతో అడవిని తమలోకి ఆవాహన చేసుకొని కాలపు ప్రమేయమూ స్పృహా లేకుండా ఏనాడో వదిలివచ్చిన మనల్ని మనం వెదుక్కుంటూ, తిరిగి ఆవిష్కరించుకొంటూ తిరుగాడే వ్యక్తులు అత్యంత అరుదు.

గల్ఫ్ దేశాలు మళ్ళా వెళతానా? ఎందుకు వెళ్ళనూ, తప్పకుండా వెళతాను! ఆ దారిలో అక్కడ జలరహితంగా పరచుకొన్న అనంత అరేబియా సైకత సాగరంలో గతకాలపు సాహసికులు వదిలివెళ్ళిన పాదముద్రలను వెదకడానికి వెళతాను; ఆ అడుగుల్లో నాలుగడుగులు వెయ్యడానికి వెళతాను. వెళతాను. త్వరలో వెళతాను.

జగదేకవీరుని కథ సినిమాలో ’దేవకన్యలు రాత్రిపూట వచ్చి జలకాలాడే ఒక తటాకం’ అన్న చక్కని కల్పన ఉంది. బహుశా ఏ స్టూడియోలోనో ఆ తటాకపు సెట్టువేసి ‘ఏమి హాయిలే హలా’ అని ఆ పూల్‌గర్ల్స్‌తో పాడించి ఉంటారు. కానీ కె. వి. రెడ్డిగారు, మాధవపెద్ది గోఖలేగారూ ఈ వాదీదర్బత్ చూసి వుంటే ఆ సెట్టూ గిట్టూ ఆలోచన పెట్టుకోకుండా ఆ సన్నివేశాన్ని ఇక్కడే చిత్రించి ఉండేవారు.

ఆ సముద్రతీరపు అల్‌బహ్రీ రోడ్డు మస్కట్‌ నగరానికి సరి అయిన కంఠాభరణమని మెల్లగా అర్థమయింది. ఎడమవేపున సాగర జలాలు, వాటిలో సీగల్స్- కుడివేపున ఏవేవో భవనాలు, ఆఫీసులు. పనిరోజు కావడంవల్లనేమో, పర్యాటకులు యాత్రికులు దాదాపు లేరు. అయినా అంత ఎండలో కొత్త బిచ్చగాళ్ళు తప్ప ఎవరొస్తారూ?

ఎడారిలో పూలు చూడటమన్నది వింతగొలపడం ఎప్పుడో మానేసిందిగానీ ఆ సాయంత్రం స్టేడియం మెట్రో స్టేషన్నుంచి ఇంటికి నడుస్తోన్నపుడు కురిసి గొడుగు తెరిచేలా చేసిన పది నిమిషాల వాన మాత్రం నాకు అపురూపమైన అనుభవాన్ని మిగిల్చింది. పూలను వికసింపజేయడం మానవ సాధ్యమే కావచ్చుగానీ ఆరుబయట వాన కురిపించటానికి దేవతలే కరుణించాలి.

ఈ నాలుగురోజులూ బుద్ధిగా పద్ధతిగా ఒక ప్రణాళిక ప్రకారం నడిచాయన్నమాట ఇంకా నిజం. అసలు ఇది నా పద్ధతి కాదు. ప్రణాళిక అంటూ ఏమీలేకుండా, అలా నగరంలో తిరుగాడుతూ ఎక్కడ నచ్చితే అక్కడ ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆయా ప్రదేశాల్లో ఉంటూ నగర ప్రవాహంలో ఒక పిల్లకాలువను కాగలనా?

“బావుంది. ఏడు ఎమిరేట్లు. ఎనభైవేలనుంచి ముప్ఫయిమూడు లక్షలదాకా జనాభా వ్యత్యాసాలు. రెండొందల ఏభై చదరపు కిలోమీటర్ల నుంచి అరవైవేల కిలోమీటర్ల దాకా భౌగోళిక వ్యత్యాసాలు. అసలు ఈ ఉమ్మడి కుటుంబం ఎలా బతుకుతోందీ? డబ్బుల విషయంలోనో సరిహద్దుల విషయంలోనో, హక్కులూ ఆధిపత్యాల విషయంలోనో గొడవలు పడరా వీళ్ళు?!”

చల్లని తెల్లని కట్టడమది. పాలరాయి విరివిగా వాడిన సంగతి ప్రాంగణంలోకి వెళ్ళగానే బోధపడింది. అసంఖ్యాకంగా ఉన్న గుమ్మటాలు, నాలుగు పక్కలా కనిపించే మీనార్లు, ఎంతో ఎత్తుగా ఉన్న ప్రవేశ ద్వారం, శీతాకాలపు ఆరుబయట సన్నపాటి పొగమంచు వీచికలా అక్కడంతా పరచుకొని ఉన్న కళాత్మకత-వినమ్రభావన కలిగింది.

మా డెజర్ట్ సఫారి ఒక ప్యాకేజ్ డీల్. రవాణా ఛార్జీలు, వెల్‌కమ్ డ్రింకులు, స్థానికదుస్తులలో ఫోటోలు, ఒంటెమీద సవారీ, విరివిగా పానీయాలు, కాస్త కాస్త చిరుతిళ్ళు, చేతికి గోరింటాకు, చిత్రవిచిత్రమైన వినోదకార్యక్రమాలు, చివరగా కబాబ్ కేంద్రీకృత భోజనం–రానూపోనూ ఆరేడు గంటలు.

“ఎమిరేట్స్‌కి స్వాగతం! మొత్తానికి రెండేళ్ళు పట్టింది మీరు ఇక్కడికి చేరడానికి.” నిజమే. మిన్నీ 2018లో వేసిన బీజం నిలదొక్కుకొని, మొలకెత్తి, మారాకు వెయ్యడానికి రెండేళ్ళు పట్టేసింది. క్రమక్రమంగా వెనకబడిపోయిన దుబాయి ప్లాను. ఢిల్లీకీ దుబాయ్‌కూ మధ్య ఉన్న నాలుగు గంటల దూరాన్ని దాటడానికి నాకు రెండేళ్ళు పట్టింది. 2020 ఫిబ్రవరిలో ఆ దూరం దాటగలిగాను.

తన బలిపీఠం నవల మలిప్రచురణకు ముందుమాట రాస్తూ, ఆ నవలలోని అనంగీకార భావాలనూ భాగాలనూ ఉతికి, ఆరవేస్తూ రంగనాయకమ్మ ‘ఇపుడు ఈ నవలకు ప్రభుత్వం ఎందుకు అకాడమీ అవార్డు ఇచ్చిందో నాకు స్పష్టంగా, శాస్త్రీయంగా తెలుసు’ అంటారు. శప్తభూమి నవలను మరోసారి మరోసారి చదివితే ఆ మాట నాకు పదేపదే గుర్తొస్తోంది.

మరో రెండు మూడు వారాలు గడిపితే బావుండునన్న ఊహ. నచ్చిన దేశాన్ని వదిలివెళ్తున్నందుకు చిన్నపాటి బెంగ. అమెరికాలూ, ఆస్ట్రేలియాలూ, జర్మనీలూ తిరిగినపుడు తెలియకుండానే పరాయి దేశమన్న స్పృహ నావెంట ఉంటూవచ్చింది. సింగపూరు, ఇండోనేషియాలు వెళ్ళినపుడూ అవి విదేశాలనే అనుకొన్నాను. మరి ఈ థాయ్‌లాండ్‌లో ఎప్పుడూ లేనిది ఈ స్వదేశ భావన ఏమిటీ?

వీళ్ళకు మనలాంటి శ్రుతిమించిన పోటీతత్వం లేదు. నింపాదిగా తమ పని తాము చేసుకొంటూ పోతారు. రేయింబవళ్ళు పనిచేసి అందరికన్నా ముందు ఉండాలి అన్న తాపత్రయం లేదు. ఒక పట్టాన సహనం కోల్పోరు, ఆవేశపడరు. మనం కోల్పోయి ఆవేశపడినా స్పందించనే స్పందించరు. తరిమో, ఆశపెట్టో, భయపెట్టో వీళ్ళతో పనిచేయించలేం.

రంగు, భాష, సంస్కృతి, మతం, జాతి అన్న పొరలు దాటివెళితే మనిషికీ మనిషికీ మధ్య మరీ అంతంత దూరం లేదన్న వాస్తవం కనిపిస్తుంది. జర్మనీ అయినా అమెరికా అయినా; భారతదేశంలోని అనేకానేక రాష్ట్రాలు అయినా; కారణాలు వేరువేరు అయినా; భిన్న జాతులవాళ్ళూ భాషలవాళ్ళూ కలసిపోయి బతకడం అన్నది ఈ కాలపు అవసరం. నిజానికి అదో గొప్ప అవకాశం.

రెండో ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతోన్న రోజులవి. పర్ల్ హార్బర్ మీద దాడి ద్వారా జపాన్ విజయవంతంగా ఆ యుద్ధంలో అడుగుపెట్టిన సందర్భమది. ఆగ్నేయాసియా దేశాలన్నీ జపానువారి అధీనంలో ఉన్న సమయమది. అండమాన్ నికోబార్ ద్వీపాలు కూడా ఆక్రమించబడిన సమయమది. భారతదేశం మొత్తాన్ని జయించాలన్న సంకల్పంతో జపాను ఉరకలు వేస్తోన్న వేళ అది.

నూటయాభై అడుగుల పొడవూ పాతికడుగుల ఎత్తూ ఉన్న బృహత్తర విగ్రహమది. ఒకప్పుడు ఈ విగ్రహం గుడి లోపల ఉండేదట. మామూలే… దండయాత్రలు, విధ్వంసాలు, పునర్నిర్మాణాలు. ఈ రోజుకు ఇలా ఏ నీడా లేకుండా మిగిలిందా విగ్రహం. మహాపరినిర్యాణం భంగిమ అది. ఈ విగ్రహమూ, అది ఉండిన గుడీ పద్నాలుగో శతాబ్దం నాటివనీ, 1767లో అవి బర్మీయుల దాడికి గురయ్యాయనీ చరిత్ర చెపుతోంది.

ఆ జలతీరపు రెస్టారెంటూ, అక్కడి వాతావరణమూ, స్పీకర్లలో వినిపిస్తోన్న థాయ్ సంగీతమూ నన్ను ఆకట్టుకొన్నాయి. అప్పటికే గంటా రెండుగంటలుగా ఎండంతా నాదే! కాస్సేపు నీడపట్టున ఆగుదామనీ, ఇలాంటి సమయాల్లో నాకు బాగా ఇష్టమైన పెప్సీ తాగుదామనీ అనిపించింది. లోపలికి నడిచాను. వేళగాని వేళ దేశంగాని దేశం నుంచి అలా ఓ మనిషి నడచి రావడం వాళ్ళను ఆశ్చర్యపరిచింది…

అప్పుడే బ్యాంకాక్ నగరం మేలుకొంటోంది. ఆకాశంలో వెలుగు రేకలు. దారిలో ఏదో జలప్రవాహపు ఉనికి. చక్కని రోడ్లు… ఫ్లై ఓవర్లు… మెల్లగా పుంజుకొంటోన్న వాహనాల జోరు. నగరం గురించి సరళమైన ఇంగ్లీషులో నా చిన్న చిన్న ప్రశ్నలు. తడబడుటాంగ్లంలో అతని సమాధానాలు. కుదిరిన సామరస్యం.

నిజానికి ఇది ఒక్క అమెరికా తెలుగువాళ్ళకే చెందిన కథ కాదు. మూలాల నుంచి విడివడి బ్రతుకుతోన్న ప్రతి ఒక్కరి కథ ఇది. తరాల తరబడి తమ తమ మూలాలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కొత్త జీవితాల నిర్మాణాలకు ఆపూర్వ అస్తిత్వాలు అవరోధమవడమన్న విషయాన్ని గ్రహించడం, వాటిల్ని దాటుకోవడం ఇంకా ముఖ్యం అన్న విషయాన్ని సమర్థవంతంగా ప్రతిపాదించిన కథ ఇది.

దాదాపు కుష్యంత్‌సింగ్‌ను కలిసిన సమయంలోనే నాకు కవనశర్మతో మొట్టమొదటి సంపర్కం. అప్పటికి పాతికేళ్ళుగా ఆయన కథలూ నవలలూ వ్యంగ్య రచనలూ చదివి ఇష్టపడిన నేపథ్యంలో విశాఖ ద్వారకానగర్‌ లోని కందులవారింటికి వెళ్ళి కలిసి ఓ గంట గడిపి వచ్చాను. అప్పటికాయన ఏభైలు దాటుకొని అరవైకేసి వెళుతున్నారు. కానీ, ఆ మనిషిలోని వాడీ వేడీ వగరూ చూస్తే నాకు పాతిక ముప్పై ఏళ్ళ మనిషి అనిపించారు.

‘నీలితురాయి పూలను చూస్తే ఆకాశంలో నెమలి పింఛం విప్పారినట్లు అనిపిస్తుంది. పూల సోయగాలను చూస్తూ కూర్చోవడమే నాకు ధ్యానం. ఆకులు లేని లోటు తీర్చడానికా అన్నట్టు కొమ్మల మీద లెక్కలేనన్ని చిలుకలు, గోరింకలు, తేనెపిట్టలు!’ అని పరవశించే మంగాదేవి, తమ ప్రాంగణానికి జయతి గత నవంబరులో వచ్చినపుడు, ‘తెల్లవారే లేచి పిల్లల్ని వెంటేసుకొని తోటలో ఏయే పక్షులున్నాయో వాళ్ళకి చూపించాలి,’ అని ప్రేమతో ఆదేశించారట.

శబ్దానికీ నిశ్శబ్దానికీ, ఊహకూ వాస్తవానికీ, చలనానికీ అచేతనకూ, ఉనికికీ ఉనికి లేమికీ, బయట ప్రపంచానికీ అంతర్లోకాలకూ, ప్రయాణానికీ జీవితానికీ మధ్య హద్దులు చెరిపేసి ఆలోచనకూ, భావానికీ, అనుభూతికీ, అక్షరానికీ, పదానికీ, వాక్యానికీ, రచనకూ మధ్య ఉండే హద్దులు అధిగమించి, నిన్నటికీ రేపటికీ మధ్య నిర్మించిన అక్షరవారధి ఈ పుస్తకం.

హఠాత్తుగా అడవి అదృశ్యమై సాగర దృశ్యానికి తెరతీసింది. అదో విభిన్న సముద్రం. కంటిచూపుకు ఆనేంత దూరంలో చిన్నాపెద్ద ద్వీపాలు. మ్యాపును సంప్రదించగా అవే లిటిల్ డైమండ్, గ్రేట్ డైమండ్ ద్వీపాలని చెప్పింది. ఏమని వర్ణించనూ ఆ సాగర దృశ్యాన్నీ! మాటలను కోప్పడి మనసే సర్వస్వంగా ఆ సుందర దృశ్య భావనను మనసులో ఆకళించుకోవలసిన క్షణాలివి.

ఎనిమిది వందల సంవత్సరాలనాటి విషయాల గురించి, బౌద్ధం నుంచి సామ్రాజ్యవాదం, రాచరికం, ఫ్యూడలిజం, కమ్యూనిజం, నక్సలిజం వరకూ వివిధ నేపథ్యాలలో కథలు కట్టాలంటే ఎంతో సాహసం కావాలి. దాన్ని మించిన ఆత్మవిశ్వాసం ఉండాలి. ఈ రెంటినీ మించిన అధ్యయనం, పరిశీలన, సాంఘిక ఆర్థిక రాజకీయ తాత్వికతా ఉండాలి.

“వర్షాలు మొదలయ్యాయి. కొండలు పచ్చగా మెరిసే సమయం. సెలయేళ్ళు గలగల పారే సమయం. ఇంట్లోనే ఉండిపోతే ఎలా?” సలహా, కన్సర్న్, మందలింపు ఆ స్వరంలో. ఎవరదీ? ఎవరదీ? చుట్టూ చూశాను. కనబడలేదు. మరో క్షణానికల్లా అర్థమయింది–గత పది రోజులుగా కురుస్తోన్న వానలు పలుకుతోన్న పలుకులవి.

మూడేళ్ళ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ తర్వాత కూడా నేనేమీ నేర్చుకోలేదనీ, ఎప్పటిలాగే అహంకారం నిండిన వదరుబోతుగా కొనసాగుతున్నాననీ అర్థమయింది. నన్ను నేను మాయబుచ్చుకుంటున్నాననీ తెలిసివచ్చింది. అటు ఓమ్‌ పురిని చూస్తే తన వినమ్రతా స్వభావంతో అంకితభావంతో ఎంతో ఎంతో నేర్చుకుంటున్నాడన్నదీ స్పష్టం.

ఊరు వదిలి నైజాం రాజ్యం వెళ్ళిపోయిన చాలాకాలానికి కనపర్తి మీద కతలు రాద్దామనుకున్నాక మళ్ళా ఆ ఊరికి వెళ్తారు శౌరీలు. పల్లెకాస్తా పట్నమయిపొయి, ఇళ్ళల్లో మనుషులకు బదులుగా టీవీలే మాట్లాడుతున్న వైనం చూసి బిక్కచచ్చిపోతోన్న శౌరీలుకు వాళ్ళ పెద్ద జీతగాడు బాలయ్య ఇంట్లో మళ్ళీ అప్పటి కనపర్తి దొరుకుతుంది.

నాలుగు గోడల మధ్యనేగాకుండా ప్రకృతి ఒడిలో, సాగర తీరంలో, జలపాతాల పొరుగున, పర్వతాల నడుమన కథకులను చేర్చి ఒకే కుటుంబంగా గడిపే అవకాశం కథా ఉత్సవం కలిగించింది. ‘శిబిరాలు, శిబిరాలు’ అని పదేపదేపదే వాపోయే సాహితీ ప్రియులకు చెప్పని సమాధానాలు ఈ కథా ఉత్సవాలు.

అక్షరాలే తప్ప ఆస్తులు బొత్తిగా లేని సామాన్య కుటుంబానికి చెందిన మనిషి వాడ్రేవు పాండురంగారావు. ‘ఇంగ్లీషు మీద చిన్నప్పట్నించీ విపరీతమైన వ్యామోహం’ ఉన్న మనిషి. భాషా చదువూ అంటే ఎంత ఇష్టం ఉన్నా, హైస్కూలు చదువుతో విద్యను పక్కనబెట్టి టెలిగ్రాఫిస్టు ఉద్యోగాన్ని అందుకొన్న మనిషి.

సురపురం చదివితే ఒక అతి సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన వైనం కనిపిస్తుంది. తనమీద తనకు నమ్మకం ఉన్న మనిషి, తనతోనూ పరిసర ప్రపంచంతోనూ సామరస్యం సాధించిన మనిషి– ఎన్ని గొప్ప పనులూ సాహసాలూ చెయ్యగలడో స్పష్టమవుతుంది. కీర్తీ, జీతభత్యాలూ తనకు అందకపోయినా అలాంటి నిరాశల గురించి యథాలాపంగా, నిర్లిప్తంగా చెప్పే ఒక స్థితప్రజ్ఞత ఆయన జీవనసూత్రం.

సాహిత్యాన్ని సీరియస్‍గా తీసుకునే చాలామందికి సాహిత్యానికీ జీవితానికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలుసు. ఆ సంబంధం వ్యక్తిగతమే గాదు, సామాజికం అని కూడా లీలగా తెలుసు. ఈ విషయంలో అనేకానేకుల భావనలు స్పష్టాతిస్పష్టంగా ఉండే అవకాశం ఉంది. మరి, తెలుగు సాహిత్యంలో రాజ్యాంగనైతికత స్థానమేమిటి? అవసరమేమిటి?

2015లో దాసరి అమరేంద్ర ఆక్టివా స్కూటరు మీద దక్షిణభారతదేశమంతా తిరిగారు. ఆ అనుభవాలు ‘కొన్నికలలు ఒక స్వప్నం’ అన్న పేరుమీద పుస్తకంగా ఈ నెల వస్తున్నాయి. ఆ సందర్భంగా ఆ పుస్తకం నుంచి ఒక అధ్యాయం ఈమాట పాఠకుల కోసం.

ఈనాటి కథను తలచుకొంటే ఆనాటి ఒరవడి కొనసాగడం లేదేమోనన్న ఆందోళన. బెంగ. నిజమేనా? మంచి కథలు రావడంలేదా? కొత్త కథకులు కలం పట్టడంలేదా? గత ఏడెనిమిదేళ్ళుగా, స్థూలంగా 2010 తర్వాత- కాలక్షేపం కోసమో పేరు కోసమో పోటీల కోసమో రాసేవాళ్ళని పక్కన పెట్టి- కథలు రాస్తోన్నవాళ్ళను చూసినట్టయితే ఆ నిర్వేదమూ నిస్పృహ అనవసరం అన్న భావన కలుగుతుంది. కొత్త కథకులు, యువ కథకులు వస్తున్నారు. మంచి కథలు రాస్తున్నారు అన్న ఆశ కలుగుతుంది.

యాత్రల్లో పరాయివాళ్ళు సొంతవారయిపోతారని, దూరం దగ్గరవుతుందని, మన మనసులు విశాలమవుతాయనీ తెలుసుకొన్నారట. 2009లో మొట్టమొదటిసారి విదేశీ ప్రయాణం చేస్తూ నేపాల్ వెళ్ళినపుడు కొత్త మిత్రులతో, ఐయామ్ ఫ్రం ఇండియా! అని అంటూ వింత అనుభూతికి లోనయిన మనిషి కాస్తా 2016లో బ్రెజిల్ దేశంలో ఎవరో ‘ఇండియన్‌వా?’ అని అడిగినపుడు, ‘కాదు. గ్లోబియన్ని!’ అని చెప్పారట.

ప్రయాణాలంటే వింతలూ విశేషాలే కాదు.
ప్రకృతీ పరవశమూ మాత్రమే కాదు.
మనుషులు… మనుషులు… మనలాంటి మనుషులు!!
నిజానికి ఒకో మనిషీ ఒకో నడిచే మహాగ్రంథం…

మనం చదివే అలవాటూ బతికే అలవాటూ పోగొట్టుకోనట్టయితే!

“యాత్రలకు ధనమూ సమయమూ అవరోధాలు కావు. భాష, భద్రత, రక్షణ అధిగమించలేని సమస్యలు కానే కావు.” నిస్సందేహంగా!! పాతికేళ్ళ క్రితం ఓ ఢిల్లీ పెద్దాయన వందేవంద రూపాయల్లో తాను హిమాలయాల్లో రెండురోజులపాటు చేసిన ముప్పై కిలోమీటర్ల ట్రెక్ గురించి రాశాడు. అది మనసులో నిలిచిపోయింది. ‘నేనూ అలా చెయ్యాలి!’ అన్న ఆకాంక్షగా పరిణమించింది.

మెయిన్‌ స్ట్రీమ్‌ తెలుగు సాహిత్యంలో ఉన్నట్టే యాత్రాసాహిత్యంలోనూ అనేకానేక ధోరణులు ఉన్నాయి. అక్కడ పాపులర్‌ సాహిత్యం ఉన్నట్టే ఇక్కడా కాస్తంత సమాచారం దట్టించిన కాలక్షేపం ట్రావెలాగ్స్‌ ఉన్నాయి. అక్కడ సమాజ హితం కోసం తపించే సాహిత్యమున్నట్టే ఇక్కడా అనుభూతీ అనుభవాలూ మానవ సంబంధాలూ ప్రధానంగా సాగే యాత్రా రచనలు ఉన్నాయి.