మనమెరుగని మధ్య అమెరికా 2

అందమైన అగ్నిపర్వత సీమ!

ఆంతీగా పట్టణాన్ని వదిలి గ్వాతెమాల దేశపు పర్వతప్రాంతంలో ఉన్న అతిత్‌లాన్ సరోవరం దిశగా సాగిపోయే సమయం వచ్చింది. పనహాచేల్ వెళ్ళే ఎనిమిది గంటల షటిల్ బస్సు పట్టుకోవడంతో ఆ ఘట్టం ఆరంభమయింది. అంతా కలసి రెండున్నర గంటల ప్రయాణం. మనవేపు లానే ఇక్కడా ఈ షటిల్ బస్సులు ఊళ్ళోని హోటళ్ళ దగ్గర, కొన్ని పికప్ పాయింట్ల దగ్గరా పాసింజర్లను ఎక్కించుకొని గమ్యంకేసి సాగుతాయి. ఇవి చికెన్ బస్సులతో పోలిస్తే బాగా ఖరీదు. కానీ వేగంగా వెళతాయి, తక్కువ సమయం తీసుకుంటాయి కాబట్టి వీటి మీద మనం భరోసా పెట్టుకోవచ్చు. కాకపోతే వీటిల్లో చికెన్ బస్సుల్లో లాగా స్థానిక జనజీవన సంపర్కం సాధ్యం కాదు.

మా ప్రయాణంలో కొంతభాగం పాన్ అమెరికన్ హైవే మీదగా సాగింది. ఆ తర్వాత సియెర్రా మాద్రె (Sierra Madre) పర్వతశ్రేణి లోని మెలికల మార్గం పట్టింది. దారిలో కొన్ని గ్రామాలు కనిపించాయి. పర్వతప్రాంతమే అయినా అదంతా సారవంతమైన సీమ. అగ్నిపర్వతాల ప్రభావం వల్ల ఏర్పడ్డ ఫలవంతమైన నేల అది. అక్కడి పర్వతసానువుల్లో విశాలమైన మొక్కజొన్న చేలు, పళ్ళతోటలు, కూరఅరటి (plantain) తోటలూ కనిపించాయి. అవొకాడోలూ విరివిగా కనిపించాయి. స్థానికుల్లో చాలామందికి వ్యవసాయమే ముఖ్యవృత్తి అనిపించింది.

కాసేపటికల్లా ఆకాశం లోకి శంఖువుల్లా చొచ్చుకుపోతున్న అగ్నిపర్వతాల శిఖరాలు కనిపించాయి. మరి కాసేపటికే అతిత్‌లాన్ సరోవరం కనిపించింది. అందాలు చిందే ఆ సరోవరం ప్రపంచంలోని అతి సుందర తటాకాలలో ఒకటి, మధ్య అమెరికాలోకెల్లా లోతైనది కూడానూ. ఒకప్పుడు నిప్పులు చిమ్మి కూలబడిపోయిన బృహత్తర అగ్నిపర్వతాల లోతైన బిలముఖాలలో (Caldera) ఏర్పడిన సరోవరమది. దాని చుట్టూ మూడు బృహదాకారపు జ్వాలాముఖులు – సాన్ పెద్రో ఒకటయితే తొలిమాన్-సాంతియాగో (Tolimán-Santiago) అన్న జంట జ్వాలాముఖులు మిగిలిన రెండూనూ. నూటముప్ఫై చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఆ అతిత్‌లాన్ లేక్ తీరప్రాంతంలో ఎన్నో అందమైన గ్రామాలూ ఉన్నాయి.

మా షటిల్ బస్సు నన్ను పనహాచేల్ పట్నంలో నేను ఉండబోయే హోటలుకు అరకిలోమీటరు దూరాన దింపింది. హోటలు వేపు నడుస్తూ ఉండగా దారిలో ఒక ట్రావెల్ ఏజన్సీ ఆఫీసు కనిపించింది. అక్కడున్నది ఒకే ఒక్క మనిషి. లోపలికి వెళ్ళి ఓ కుర్చీ లాక్కుని కూర్చుని అతగాడి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశాను. అడగాల్సినవి ఎన్నో ప్రశ్నలున్నాయి – అతను వినడానికి సిద్ధంగానే ఉన్నా భాష అడ్డుగోడగా నిల్చింది. ఇద్దరం గూగుల్ ట్రాన్స్‌లేట్ మార్గం పట్టాం. అతగాడు నేనడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగాడు. ఆ ‘సంభాషణ’ పుణ్యమా అని నేను మర్నాడు రోజంతా తిప్పి చూపించే బోట్ టూర్ అక్కడే బుక్ చేసుకోగలిగాను. సరోవరమంతా తిప్పి చూపించడమే కాకుండా దాని ఒడ్డున ఉన్న మూడు మాయన్ గ్రామాలనూ పరిచయం చేసే ప్రయాణమది.


ఒతేల్ రేహిస్ (Hotel Regis) అనబడే మా హోటల్ చేరానన్న మాటేగాని చెక్ఇన్ చేయడానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. అంచేత నా బాక్‌పాక్‌ను హోటల్ రిసెప్షన్‌లో పదిలపరచి చిచికాస్తెనాంగో (Chichicastenango) అన్న ఆసక్తికరమైన పేరున్న ఆ ప్రాంతపు గ్రామం చూసి వద్దామని సంకల్పించాను. రిసెప్షన్‌లో ఉన్నావిడ పెట్టుకున్న బాడ్జ్ చూస్తే ఆమె ఆ గ్రామానికి చెందిన మనిషేనని తెలిసింది. మరింకేమీ! ఎలా వెళ్ళాలో ఆమెనే అడిగాను. వెళ్ళడానికి రెండు పద్ధతులున్నాయని చెప్పింది. తిన్నగా టాక్సీ పట్టుకుని వెళ్ళిపోవడం ఒక పద్ధతి – దానికి వంద డాలర్లవుతుంది. అలా కాకుండా మూడు చికెన్ బస్సులు పట్టుకుని వెళ్ళడం రెండో పద్ధతి – సొలొలా (Sololá), లోస్ ఎన్‌క్వెంత్రోస్ (Los Encuentros) అన్న ఊళ్ళలో బస్సులు మారాలట. దానికి అయే ఖర్చు నాలుగే నాలుగు డాలర్లు. పాతికరెట్లు ఖర్చు తప్పించుకోవడం ఎంతో ప్రలోభపరిచే విషయమన్నది అటుంచి అసలు టాక్సీలో వెళ్ళడమన్నదే నా యాత్రాస్ఫూర్తికి విరుద్ధం అనిపించింది. ఇంతింత దూరాలు వచ్చింది స్థానిక సంస్కృతితో సంపర్కం కోసం కదా… ఈ చికెన్ బస్సులన్నవి అక్కడి సమకాలీన సంస్కృతీ ప్రతీకలు కదా… టాక్సీలో వెళ్ళడమన్నది లక్ష్యానికే విరుద్ధం కదా – మరో ఆలోచన లేకుండా మూడంచెల చికెన్ బస్సుకే వోటు వేశాను.

హోటల్ రేహిస్ నుంచి సొలొలా వెళ్ళే బస్సులు ఉండే చోటికి పది నిమిషాల నడక. ఉదయం పదిన్నర ప్రాంతంలో సొలొలా బస్సు పట్టుకోగలిగాను. వంపులు తిరిగే మార్గంలో ఇరవై నిమిషాల ప్రయాణమది. పనహాచేల్ పట్టణం అతిత్‌లాన్ సరోవరపు ఒడ్డునే ఉంటే సొలొలా ఆ పరిసరాల్లోని కొండల మధ్యన ఉంది. చూడ్డానికి పెద్ద పట్టణమనే అనిపించింది. అక్కడ బస్సు దిగగానే మా కండక్టర్ ‘అదిగో, రోడ్డుకు అటు వేపున నువ్వు ఎక్కాల్సిన లోస్ ఎన్‌క్వెంత్రోస్ బస్సుంది’ అని చూపించాడు. వెంటనే ఎక్కేశాను. బస్సంతా పూర్తిగా నిండిపోయి ఉంది. ఒక టూసీటర్‌లో ఐదేళ్ళ కుర్రాడితో పాటు కూర్చుని ఉన్న ఓ యువకుడు కనిపించాడు. అతగాడు ఆ కుర్రాడిని తన ఒళ్ళోకి లాక్కుని సీటు ఖాళీ చేసి ఇచ్చాడు. ఊరు చేరడానికి ఎంతసేపు పడుతుందీ అని అతగాడిని అడిగాను. ‘నో ఇంగ్లెస్’ అని సమాధానం చెప్పి నన్నేదో స్పానిష్‌లో అడిగాడు – అది నాకర్థం కాలేదు. ఇలా మా ప్రయత్నాలన్నీ విఫలమయాక, ఇక ఇలాకాదు అనుకుని మళ్ళీ గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను ఆశ్రయించాను. నా ఫోన్‌లో ఇంగ్లిష్‌లో ప్రశ్నలు టైపు చేసి దాన్ని స్పానిష్ లోకి అనువదించడం, అతగాడు దాన్ని చదివి అదే పద్ధతిలో నాకు ఇంగ్లిష్‌లో సమాధానం చెప్పడం – ఈ పద్ధతి బాగా పని చేసింది. అతని పేరు సెల్విన్.

లోస్ ఎన్‌క్వెంత్రోస్ రాగానే నన్ను హెచ్చరించమని సెల్విన్‌ను కోరాను – దాటి వెళ్ళిపోతే కష్టం కదా… ‘మీరేం కంగారు పడకండి. నేను దిగేదీ అక్కడే’ అని భరోసా ఇచ్చాడు. మా ఎలక్ట్రానిక్ సంభాషణ పుణ్యమా అని సెల్విన్ వయసు తొలి ఇరవైలలో అని, ఈమధ్యే ఒక యూనివర్సిటీ కోర్స్ ముగించాడనీ తెలిసింది. వాళ్ళది వ్యవసాయ కుటుంబమట. వాళ్ళ గ్రామం ఆ దగ్గర్లోనే ఉందట. సొలొలా నుంచి వాళ్ళ ఊరు తిరిగి వెళుతున్నాడట.

భారతదేశం గురించి ఎన్నో ప్రశ్నలు అడిగాడు సెల్విన్. ‘గ్వాతెమాల రావాలని మీకెందుకు అనిపించింది?’ అని ప్రశ్న. ‘మీ దేశం ఎంతో అందంగా ఉంటుంది’ అన్న నా మాట విని పొంగిపోయాడు. దేశపు లోలోపలికి వెళ్ళబోతున్నానని, తటాకాలు కొండలు పీఠభూములూ శోధించబోతున్నానని, అనాది మాయన్ సంస్కృతి ఇంకా సజీవంగా నిలిచి ఉన్న చిచికాస్తెనాంగో లాంటి ఊళ్ళకూ వెళుతున్నాననీ తెలుసుకుని ఎంతో సంతోషపడ్డాడు. మా దేశాన్ని ఆక్రమించిన స్పానిష్‌వాళ్ళూ ఇతర యూరోపియన్లూ మమ్మల్ని రెడ్ ఇండియన్‌లని పిలిచారు. ఇప్పటికీ మాకు అదేమాట అతుక్కుని ఉంది. ఏదేమైనా నా జీవితంలో మొట్టమొదటిసారి అసలు సిసలు ఇండియన్‌తో మాట్లాడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని చెణికాడు సెల్విన్. (ఆ పిలుపు ఇప్పుడు అవమానకరం. ఇప్పుడు వారినందరినీ నేటివ్ అమెరికన్లు అని పిలవడమే మర్యాద.) నోటి వెంట ఒక్క మాటయినా మాట్లాడకుండా స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మేమిలా సుదీర్ఘ సంభాషణలో నిమగ్నమై ఉన్న సమయంలో మా బస్సు చిన్న చిన్న గ్రామాలను దాటుకుంటూ సాగింది. బస్సంతా ఒకటే తొక్కిడి – అంగుళం ఖాళీ లేదు… అరగంటలో బస్సు లోస్ ఎన్‌క్వెంత్రోస్ చేరింది. అక్కడ ఎటు చూసినా బస్సులే!

నేను కంగారు పడేలోగానే ‘మరేం పర్లేదు. మా ఊరు చిచికాస్తెనాంగో వెళ్ళే దారిలోనే. నేనూ అదే బస్సులో కొంచెం దూరం వస్తాను’ అంటూ అభయహస్తమిచ్చాడు సెల్విన్. అలాగే వచ్చి, పదినిమిషాల ప్రయాణం తర్వాత ఆదియోస్ చెప్పి దిగిపోయాడు. చక్కని మనిషి నాకు తోడయ్యాడు కొద్దిసేపు! కొత్త విషయాలు తెలుసుకోవాలన్న పిపాస, తన దేశం గురించి ఒక పరదేశికి చెప్పెయ్యాలన్న తహతహ – మంచి అనుభవం.


బస్సు మెల్లమెల్లగా ఎత్తులెక్కడం ఆరంభించింది. చిచికాస్తెనాంగో సముద్రతలానికి రెండువేల మీటర్ల ఎగువన ఉంది. ఆ చుట్టుపక్కల ఉండే వంద పైచిలుకు గ్రామాల నేటివ్ ఇండియన్ రైతులందరూ తమ తమ పంటల్ని అమ్ముకోడానికి ఆ ఊరి మార్కెట్‌కే వస్తారు. మధ్య అమెరికా ప్రాంతంలోకెల్లా అతిపెద్ద ఆరుబయలు మార్కెట్‌గా దానికి పేరు ఉందిట. ఆ ప్రాంతాల పద్ధతులు, జీవనసరళులలో పెద్ద మార్పేమీ లేకుండా అలా సాగిపోతోందట.

గురువారం, ఆదివారం అక్కడి సంత రోజులు. అనుకోకుండా ఆ రోజు ఆదివారమయింది. మార్కెట్ వైభవ విస్తృతిని చూడగలిగాను. చిన్నా పెద్దా వీధుల్లో అటూ ఇటూ చిన్న చిన్న దుకాణాలు క్రిక్కిరిసి కనిపించాయి. సంప్రదాయ దుస్తుల్లో తిరుగాడుతోన్న స్థానిక ప్రజానీకం పుణ్యమా అని ఆ ప్రదేశమంతా రంగుల హేల. మహిళల దుస్తులయితే మరీ ఆకట్టుకొనేట్టుగా ఉన్నాయి. గడిచిపోయిన కాలాలలోకి అడుగుపెట్టి విభిన్న ప్రపంచంలో మునిగితేలుతున్న భావన.

రెండు మూడు గంటలపాటు ఆ విపణి వీధుల్లో తీరిగ్గా తిరిగాను. మధ్యాహ్నం కదా, ఎండ వేడి చురుక్కుమంది. ఓ వీధి చివర టూరిస్ట్ సమాచార కేద్రం కనిపించి లోపలికి వెళ్ళాను. ఎ.సి. నుంచి వస్తున్న శీతలవాయువులు మొహానికి తగిలి ఎంతో సుఖమనిపించింది. కాసిని టూరిస్టు బ్రోషర్‌లు తీసుకుని అక్కడ ఉన్న సొగసు దుస్తుల మహిళ దగ్గరికి సలహాలకోసం వెళ్ళాను. బహుశా తొలి ముప్ఫైలలో ఉన్న ఆమె చక్కని ఇంగ్లిష్‌ మాట్లాడింది – అదనపు భాషాసౌఖ్యమది. ఆమె దగ్గర కాస్తంత సమాచారం సేకరించి అక్కడి సోఫాలో చేరగిలబడి బ్రోషర్‌ల అధ్యయనం మొదలెట్టాను. ఒక్కతే ఉండీ ఉండీ ఆమెకు విసుగు పుట్టింది కాబోలు – వచ్చి మాటలు మొదలెట్టింది.

భారతదేశమంటే తనకెంతో ఆరాధన అని చెప్పింది. ఒక్కసారైనా ఆ దేశం చూడాలని ఉంది అనీ చెప్పింది. నన్ను సంతోషపరచడానికి అలా అంటోందా అన్న చిన్నపాటి అనుమానంతో – భారతదేశమంటే మీకు అంత ఆసక్తి, ఆరాధన కలిగించే విషయం ఏమిటి? అని అడిగాను. ఆధ్యాత్మికత – స్పిరిచువాలిటీ అన్నది ఆమె సమాధానం. మా అలనాటి మాయన్ సంస్కృతికీ మీ భారతీయ సంస్కృతికీ ఎన్నో పోలికలు కనిపిస్తాయి. రెండింటిదీ ఉజ్వల చరిత్ర. ఎన్నెన్నో ఆచారాలు, సంప్రదాయాలు, ఎందరెందరో దేవుళ్ళు; మాలానే మీ దుస్తులూ వర్ణభరితం అంటూ చెప్పుకొచ్చింది. మరి చైనావారి సంస్కృతీ నాగరికతలు కూడా అతి పురాతనం కదా అని నేను రెట్టించాను. నా పరిమిత పరిజ్ఞానంలో నాకు భారతదేశం అంటే ఆధ్యాత్మికత స్ఫురిస్తుంది. చైనా అనగానే ఫక్తు వ్యాపారధోరణి మనసులో మెదులుతుంది – ఆమె సమాధానం.

స్పెయిన్ దేశం మెహికో, మధ్య అమెరికాలను ఆక్రమించాక అక్కడి మాయన్ నాగరికతకు, జీవనవిధానానికీ తిరుగులేని అఘాతం సంభవించిందని చెప్పిందావిడ. యూరప్ నుంచి దిగుమతి అయిన ఎన్నో జబ్బుల బారిన పడి ఎంతోమంది నేటివ్ అమెరికన్లు మరణించారట. ఏదేమైనా చిచికాస్తెనాంగో పరిసరాల్లోని గ్వాతెమాల పర్వతప్రాంతాల్లో స్పానిష్‌వాళ్ళ ప్రభావం ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే తక్కువని, అంచేత అక్కడ ఇంకా మాయన్ నాగరికత, జీవనవిధానం కాపాడబడి కొనసాగుతున్నాయనీ చెప్పింది. ఆ ప్రాంతాల్లో అంతా మాయన్ భాషే మాట్లాడతారట. గ్వాతెమాలలో అలాంటి ఇరవై రెండు భాషలు ఇంకా మనుగడ కొనసాగిస్తున్నాయట. బ్రిటిష్‌వారి వలసపాలన తాకిడిని తట్టుకుని భారతదేశం తన సంస్కృతిని, నాగరికతనూ కాపాడుకోగలగడం ఎంతో ప్రశంసనీయం అన్నది ఆ మహిళ. చూస్తోంటే ఆమెకు ఎన్నో స్థిరాభిప్రాయాలు ఉన్నట్టనిపించింది. ఏది ఏమైనా ఆ సమయంలో ఆమెతో మేధోచర్చలో పాల్గొనే ఉద్దేశ్యం నాకు లేదు. అయినా ఆగలేక ఒక మాటన్నాను – వలసపాలన వల్ల మాకు కలిగిన నష్టాల సంగతి ఎలా ఉన్నా ఇంగ్లిష్ భాషాసంపర్కం అన్న ఒక గొప్ప మేలు మాకు కలిగింది. మా తరం వాళ్ళం ప్రపంచమంతటా విస్తరించడానికి అదో పాస్‌పోర్ట్‌లా ఉపయోగపడింది, అని. అవునవును, నేను కూడా టూరిజం రంగంలో ఉద్యోగావకాశాలు మెరుగు పరచుకోవడం కోసం ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాను అని ముక్తాయించింది ఆవిడ. సంభాషణ సజావుగా సాగిపోతున్న మాట నిజమే; ఎ.సి. లోంచి వస్తున్న చల్లటి గాలి ఉపశమనం కలిగిస్తోన్న మాటా నిజమే – కానీ ఆమె సూచించిన ప్రదేశాలూ అవీ చూసి రావాలి కదా… అక్కణ్ణుంచి కదిలాను.


అక్కణ్ణుంచి ఒక కిలోమీటరు నడిచేసరికి, రంగులతో నిండివుండి చూడగానే ఆకట్టుకొనే ఒక ఖననభూమి కనిపించింది. లోపలికి వెళ్ళాను. అక్కడ కాసేపు గడిపి మాయన్ సంప్రదాయ కార్యకలాపాలు జరిగే ప్రదేశమొకటి చూశాను. విభిన్న తాత్విక వ్యవస్థలను సమాదరించే సెయింట్ థామస్ చర్చ్ – ఇగ్లేసియా దె సాంతో తొమాస్ (Iglesia de Santo Tomás) – ఆ ఊళ్ళో నేను చూసిన చివరి ప్రదేశం. ఆ ప్రాంతాల్లోని కెథాలిసిజమ్ మీద మాయన్ పద్ధతులు, కర్మకాండల ప్రభావం బాగా ఉంది. స్పానిష్‌వాళ్ళు అక్కడ అడుగు పెట్టినప్పుడు మాయన్ల మీద కేథొలిక్ మతాన్ని రుద్దారు. వాళ్ళ మందిరాలనూ ధ్వంసం చేశారు. అయినా ఆ ప్రక్రియ విజయవంతం కాలేదు. ఇప్పటికీ చాలామంది మాయన్లు తమ సంప్రదాయ ధర్మాన్నే పాటిస్తూ ఉంటారు. కేథొలిక్ మతాన్ని అనుసరించేవాళ్ళు కూడా ఆ మతపు భావనలకు మాయన్ పద్ధతులు, కర్మకాండలూ జోడించి (Syncretism) మరీ అనుసరిస్తూ ఉంటారు.

పనహాచేల్ నుంచి చిచికాస్తెనాంగోకు వచ్చిన పద్ధతిలోనే మళ్ళా మూడు బస్సులు పట్టుకుని తిరిగి పనహాచేల్ చేరుకున్నాను. ఈ ప్రయాణాల పుణ్యమా అని చికెన్ బస్సుల విషయంలో చెప్పుకోదగ్గ ప్రావీణ్యం సాధించాను. సాయంత్రం అయిదయింది. ఊరి ముఖ్యమార్గం పట్టుకుని సరోవర తీరం వేపుగా సాగిపోయాను. దారిలో అమెరికా ఖండాలకు చెందిన విభిన్న శైలుల వంటకాలను అందించే రెస్టరెంట్లు బారులు తీరి కనిపించాయి. దారి పొడవునా ఆహారపు సువాసనలు… ఒకచోట ఆకట్టుకునే చాకొలెట్ పరిమళం ముక్కుపుటాలకు సోకి నన్ను నిలవరించింది. కోకో గింజలనుంచి అప్పుడే తీసి చేసిన హాట్ చాకొలెట్ పానీయపు తాజా పరిమళమది. ఒక కప్పు రుచి చూడకుండా అడుగు ముందుకు వేయలేకపోయాను. ఆహాఁ! అనిపించే తాజాదనం, లీలగా కోకో గింజల వగరు…

నేను చేరుకునేసరికి సరోవరం సూర్యాస్తమయానికి సమాయత్తమవుతోంది. అక్కడ దొరికిన, బొగ్గులకుంపటిలో కాల్చిన, మొక్కజొన్న కండెను చేతబట్టుకుని, గింజలని నింపాదిగా నమిలి ఆస్వాదిస్తూ తీరం వెంబడే నడక సాగించాను. తటాకపు జలాలు, కనిపించే కొండలు, అగ్నిపర్వతాలు – సూర్యాస్తమయ క్రీడ కొనసాగే క్రమంలో రంగులు మార్చుకుంటూ మనసును రంజింపచేశాయి. దారిలో కనిపించే రెల్లుగడ్డి రెస్టరెంట్లు నా నడకకు అవరోధాలుగా నిలిచాయి. వాటిల్లో రెస్తౌరాంతె ఎల్ అతిత్‌లాన్ అన్నది నన్ను బాగా ఆకట్టుకొంది. అక్కడి రెస్టరెంట్లు అన్నింటిలోకీ అది పురాతనమయినదట. సరోవర దృశ్యం బాగా కనిపించే జాగా ఎన్నుకొని ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాను. కూర్చుని నా జీవితంలో మరపురాని అద్భుత సూర్యాస్తమయాన్ని తనివితీరా అనుభవించాను.

సూర్యాస్తమయం అయిపోయినా నాకు ఆ రెస్టరెంటును వదలాలని అనిపించలేదు. భోజనం చెయ్యడానికి అదింకా సమయం కాదు. అయినా అక్కడ గడిపే అవకాశాన్ని వదులుకోవాలని అనిపించక బీరు ఆర్డర్ చేశాను. అత్యంత నింపాదిగా తాగుతూ దాన్ని ఖాళీ చేశాను. ఆనాటి నా పీన ప్రక్రియ నత్తతో పోటీ పడిన మాట నిజమే అయినా రెండు గంటలు గడిచేసరికి మూడు బీర్లు పొట్టలో సర్దేసుకున్నాయి. భోజనానికి సోపా దె మరిస్కోస్ అన్న వంటకం ఆర్డర్ చేశాను. చేపలు, రొయ్యలతో కాచిన సూప్ అది. ఆ సరస్సు ప్రసాదించినవేనట ఆ జలచరాలు!

భోజనం ముగిసేసరికి రాత్రి తొమ్మిదయింది. నేనింకా హోటల్లో చెక్ఇన్ చెయ్యనే లేదు. మళ్ళా రేపు ఉదయమే ఖాళీ చెయ్యాలి కూడానూ. ఆనాటి విశేషాలను గుర్తు చేసుకుంటూ హోటల్ రేహిస్ వైపు నడిచాను. మాయన్ సంస్కృతి నట్టనడుమన తిరుగాడుతున్నానన్న సంగతి గొప్ప ఉత్తేజం కలిగించసాగింది.


పొద్దున్నే అయిందింటికి లేచాను. సూర్యోదయం కోసం సరోవర తీరం వైపుగా నడిచాను. ఇంకా చీకట్లు విడనేలేదు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఒంటరిగా ఉన్నాననుకున్నానే కాని, నాకు తోడుగా అరడజను బెరుకు పుట్టించే ఊరకుక్కలు నాతోపాటూ రాసాగాయి. గ్వాతెమాలలో రోడ్ల మీద కుక్కలు కనిపించడం సాధారణ విషయమే. అయినా ఇవి మరీ మరీ దగ్గరికి రావడం, వాటి మూతీ ముక్కూ నా కాళ్ళకు తగిలించడం చేసేసరికి కాస్తంత బెరుకు పుట్టింది. ముందటిరోజే ఓ సాటి యాత్రికుడు గ్వాతెమాలలో రాబీస్ కేసులు బాగా ఉన్నాయని చెప్పాడు. నాకేమో వీధికుక్కలంటే చెప్పలేనంత బెరుకు – చిన్నప్పుడు మా పల్లెటూళ్ళో వాటితో నాకో గగుర్పొడిచే, ఇప్పటికీ వెంటాడే, అనుభవం ఉంది. ఏం చేయాలో పాలు పోలేదు. పరిగెడదామా అంటే అవి మరింత విజృంభించి కరిచినా కరవచ్చు. గట్టిగా అరచి కోప్పడి వాటిని చెదరగొడదామా అంటే ఆ ప్రక్రియలో అవి మరింత దూకుడుగా మీద పడచ్చు. ఇదికాదు పని అనుకొని మెల్లగా నడక వేగం పెంచాను.

దారిలో ఎవరైనా కనిపించి ఈ గండం గట్టెక్కించక పోతారా అన్న ఆశ… ఇంకా నయం, ఎందుకో అనిపించి నిక్కరూ శాండల్సూ కాకుండా దిట్టమైన జీన్స్ పాంటూ గట్టిపాటి షూసూ వేసుకొని ఉన్నాను – అదో మేలు!

అప్పుడే నిద్ర లేచి షాపు తెరుస్తున్న మహానుభావుడొకాయన కనిపించాడు. గబగబా వెళ్ళి ఆయన వెనుక రక్షణ కోసం నిలబడ్డాను. కుక్కలన్నీ గుమిగూడి వినోదం చూడసాగాయి. ఆయన వాటిల్ని కసిరి చెదరగొట్టి, ఇవేమీ హానికరం కావు అని నవ్వుతూ చెప్పాడు. హమ్మయ్య, వెళ్ళిపోయాయి! అని నిశ్చింతగా ముందుకు అడుగు వేశాను. వెళ్ళాయనుకున్నానే కానీ మరో నిమిషంలో మరికొన్ని స్నేహితుల్ని వెంటేసుకుని అవి ప్రత్యక్షమయ్యాయి. అందులో ఒక మహా స్నేహశీలి శునకం బాగా దగ్గరకొచ్చి నా జీన్స్ పాంట్ నాకే ప్రయత్నం చెయ్యసాగింది. బెరుకు స్థానంలో భీతి చోటు చేసుకుంటున్న సమయమిది. దూరాన మెషీన్ గన్ పట్టుకుని ఉన్న ఓ హోటల్ సెక్యూరిటీ గార్డ్ కనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నా గోడు వినిపించే ప్రయత్నం చేశాను. తనకేమో అర్థం కాదు! గూగుల్ ట్రాన్స్‌లేట్ ఉండనే ఉంది కదా, దానిలో రక్షించు తండ్రీ రక్షించు! అంటూ విన్నపాలు చేసుకున్నాను. అది చూసి అతగాడు గట్టిగా నవ్వేసి ఇవేమీ చెయ్యవు, ప్రమాదం ఏమీ లేదని చెప్పి ఇక నన్ను పట్టించుకోడం మానేశాడు. ఇహ చేసేది లేక శునకబృందంతో దాగుడుమూతలు ఆడుతూ నడక సాగించాను. ఆ ఆట వాటికీ సంబరం కలిగించినట్టుంది!

దూరాన జెట్టీ అంచున నీళ్ళలోకి కాళ్ళు వేసి కూర్చుని ఉన్న ఒక మహిళ ఆకృతి కనిపించింది. ఆ దగ్గరికి వెళితే నా గోడు వెళ్ళబోసుకోడానికంటూ ఒక మనిషి దొరుకుతుంది కదా అనిపించింది. పైగా నీటి అంచుల దాకా రావడానికి కుక్కలకూ సంకోచం ఉండొచ్చనీ అనిపించింది. వెళ్ళాను. నేననుకున్నది కొంతవరకూ నిజమే – మూడు కుక్కలే నావెంట వచ్చాయి. మిగిలినవి తప్పుకున్నాయి. ఏదేమైనా ఆ విధంగా ఆ ఉదయాన జెమ్మా అన్న ఆ వనితను కలుసుకోగలిగాను. నాలాగే పొద్దున్నే వచ్చి సూర్యోదయం కోసం ఎదురు చూస్తోందావిడ. నా కుక్కల ప్రహసనం చెప్తే ఆవిడ నవ్వేసి తను దీనికో విరుగుడు కనిపెట్టానంది. ఈ ఊళ్ళోకి వచ్చిన తొలిదినాలలో ఆమెకూ ఇదే సమస్య ఎదురయిందట. అలాంటప్పుడు తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసి నీళ్ళు కుక్కల మీద చల్లసాగిందట. అమ్మో, ఈవిడ ఎవరో అసాధ్యురాలు అనుకొని అవి వెంటబడటం మానేశాయట.

జెమ్మా ఆస్ట్రేలియా లోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన వనిత. గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేస్తోంది. వాళ్ళాయన వెబ్ డిజైనర్. ఇద్దరూ పనహాచేల్‌ను స్థావరంగా చేసుకొని రిమోట్‌గా పని చేసుకుంటున్నారు. అతిత్‌లాన్ సరోవరపు శాంత సుందరతీరాల రసాస్వాదనను తమ దైనందిన ఉద్యోగ కలాపాలలో కలగలిపిన దంపతులు వారు. వాళ్ళ ఉద్యోగాలు ప్రపంచం లోని ఏ మూలనుంచయినా చేసే వెసులుబాటు ఉంది కాబట్టి వాళ్ళా నిర్ణయం తీసుకోగలిగారు. ఉద్యోగాలే కాకుండా యెహోవా సాక్షులు (Jehovah’s Witnesses) అనే ఒక క్రిస్టియన్ శాఖలో వలంటీర్లుగా కూడా పని చేస్తున్నారట. కోవిడ్ లాక్‌డౌన్ సమయమంతా పనహాచేల్ లోనే గడిపారట. ఇంతటి సుందర ప్రదేశంలో బందీలై ఉండగలగడం ఎంత భాగ్యమో అని సంబరపడింది జెమ్మా.

మీరీ ప్రదేశాల్లో చాలా కాలం ఉన్నారు కదా, మరి సెక్యూరిటీకి సంబంధించిన ఇబ్బందులేమైనా వచ్చాయా అని అడిగాను. పనహాచేల్ ఆ విధంగా ఎంతో సురక్షితమైన ప్రదేశం అన్నదావిడ. అయినా గ్వాతెమాల సిటీ లాంటి పెద్ద నగరాల్లో నేరబృందాలు చెలరేగడం వింటూ ఉంటాం. వాళ్ళు మారుమూల ప్రాంతాల్లో బస్సుల్ని ఆపి దోచుకున్న సంఘటనలూ ఉన్నాయి అన్నారావిడ.

కొండల వెనకాల నుంచి మా ముందున్న సరోవరాన్ని వర్ణభరితం చేస్తూ సూర్యుడు మెలమెల్లగా రంగప్రవేశం చెయ్యడం కానవచ్చింది. ‘అసలు నువ్వా శునకాలకు థాంక్స్ చెప్పుకోవాలి. వాటి పుణ్యమా అని ఇంత చక్కని ప్రదేశం చేరి సూర్యోదయం చూడగలుగుతున్నావ్’ అని చెణికింది జెమ్మా. ఆమె ఈ ప్రదేశానికి తరచూ వస్తూ ఉంటుందట. అక్కడ చేరి పుస్తకాలు చదువుకోవడం ఆమెకు ఇష్టమైన పని. ‘ఈ అతిత్‌లాన్ సరోవరం ఉంది చూశావూ… చుట్టూ ఆకట్టుకునే అగ్నిపర్వతాలు, సుందరమైన గ్రామాలు – సురలోక సమానమీ ప్రదేశం’ అని పరవశించిందామె.

ఆమెకు వీడ్కోలు చెప్పి తిరిగి హోటలుకేసి నడిచాను. ఆపాటికి వీధుల్లో కుక్కల కన్నా మనుషులే ఎక్కువ కనిపించడంతో ధైర్యంగా ముందుకు సాగాను.


ఊరి పెద్దరోడ్డు మీద ఉదయం ఎనిమిది గంటలకల్లా మూడు గ్రామాల బోట్ టూరుకోసం చెప్పిన చోటికి చేరిపోయాను. మొట్టమొదటగా అక్కడి ఓ రెస్టరెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆగాం. నా టేబుల్ దగ్గర నాతోపాటు మరిద్దరు – సాంద్రా అన్న ఆంతీగాకే చెందిన స్పానిష్ టీచరొకామె; యు.ఎస్. లోని మేరీలాండ్‌కు చెందిన జూలియా అన్న ఫ్రెంచ్ టీచరు రెండో ఆమె. ఈ జూలియా స్పానిష్ భాష నేర్చుకోవడం కోసం ఆంతీగా వచ్చిందట. సాంద్రా ఆమెకా భాష నేర్పుతోంది. ఇద్దరూ ఆ రోజు అతిత్‌లాన్ సరోవర విహారం కోసం కలసి వచ్చారు. జూలియా పుట్టింది ఫ్రాన్స్‌లో అయినా చిన్నవయసులోనే తల్లిదండ్రులతో కలిసి యు.ఎస్.లో స్థిరపడిందట.

ముగ్గురికీ ఇంగ్లిష్ బానే వచ్చు కాబట్టి మా టేబుల్ దగ్గర సంభాషణ గలగలా సాగింది. ఆంతీగా ఈ మధ్యకాలంలో స్పానిష్ నేర్పే కేంద్రంగా ఎలా రూపుదిద్దుకుందో సాంద్రా చెప్పింది. జూలియా స్పానిష్ నేర్చుకోడానికి తనను సంప్రదించడమూ ఆ ప్రక్రియలో ఇద్దరూ స్నేహితులవడమూ చెప్పుకొచ్చింది సాంద్రా. మీ మాతృభాషలే మీకు ఉద్యోగావకాశాలు కల్పించడము, జీవనోపాధి మార్గాలవడమూ బాగు బాగు – అని నేను ముక్తాయించాను.

ప్రపంచంలో ఏమూల అయినా సులభంగా తిరగడానికి ఇంగ్లిష్ తోపాటు స్పానిష్, ఫ్రెంచ్ భాషలు బాగా ఉపయోగపడతాయన్నది నేను నా ప్రయాణాల్లో గ్రహించిన విషయం. ఆంగ్లం వర్తమాన అంతర్జాతీయ భాష అన్నమాట నిజమే కాని, ప్రపంచంలో ఇంగ్లిషే కాకుండా ఫ్రెంచి, స్పానిష్షూ మాట్లాడే దేశాలు అనేకం ఉన్నాయి. ఇరవై దేశాల్లోని యాభై కోట్లమందికి స్పానిష్ మాతృభాష. అలాగే ఇరవై తొమ్మిది దేశాలకు చెందిన మరో యాభై కోట్లమంది ఫ్రెంచ్ మాట్లాడతారు. ఈ లెక్కలు ఇంగ్లిష్‌తో పోలిస్తే తక్కువే కానీ ఇంగ్లిష్ మాట్లాడని దేశాల్లోకి వెళ్ళినప్పుడు ఈ భాషల ఆవశ్యకత మనకు బోధపడుతుంది. అసలు ఇలా యూరప్‌కు చెందిన చిన్న చిన్న దేశాల భాషలు ఇప్పటికీ ప్రపంచాన్ని ఎలా శాసించగలుగుతున్నాయా అన్నది నాకు అప్పుడప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. మాండరిన్, హిందీ, అరబిక్ భాషలు మాట్లాడేవాళ్ళూ గొప్ప సంఖ్యల్లో ఉన్నమాట నిజమే కానీ వాటికి స్థానికతే తప్ప అంతర్జాతీయ విస్తృతి లేదు.


టూర్ గైడ్ ఎలేనాతో

భాషల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సాంద్రా ఒక ఆర్తితో మాట్లాడింది: ఇక్కడ ఇంకా ఇరవై రెండు భాషలు సజీవంగా ఉన్నాయి. అందులో కొన్ని భాషలు మాట్లాడేవారి సంఖ్య పది లక్షల దాకా ఉంది. ఇక్కడ స్పానిష్ సెకండ్ లాంగ్వేజ్ మాత్రమే. బాగా లోపలి గ్రామాలలో ఉన్నవారికి స్పానిష్ అర్థం కాదు కూడానూ… మా అందరికీ మా మాయన్ వారసత్వ సంపదను చూస్తే ఎంతో గర్వంగా ఉంటుంది. ఇక్కడివాళ్ళలో షుమారు నలభై ఐదుశాతం ఆదిమస్థానీయులైన ప్రజలే. మా అందరికీ మా పురాసంస్కృతీ సంప్రదాయాలంటే ఎంతో మక్కువ. బయటకు మేమంతా కేథొలిక్ మతాన్ని అనుసరించేవాళ్ళలా కనిపించవచ్చు కానీ తరచి చూస్తే మా అంతరాంతరాల్లో మాయన్ సంస్కృతి, సంప్రదాయాలే కనిపిస్తాయి… నిజమే, ఒకానొకప్పుడు నరబలుల వంటి దారుణమైన క్రతువులు ఉండేవి. ఇప్పుడు కేవలం కోళ్ళు బలి ఇవ్వడంతోనే సరిపెడుతున్నాం. మా దేవుళ్ళు కూడా కోడి రక్తంతోనే సరిపెట్టుకోవాలి…

జూలియా వీగనిజమ్ అనుసరించే వ్యక్తి. పాలతో సహా జంతువులనుంచి వచ్చే ఏ పదార్థాలనీ వీళ్ళు తినరు. భారతదేశపు బ్రాహ్మణుల గురించి, వారు అనుసరించే శాకాహార పద్దతుల గురించీ ఆమె కొన్ని సూటి ప్రశ్నలు సంధించింది. వాళ్ళంతా వీగన్‌లేనా? అన్న ప్రశ్న నాముందుంచింది. ‘కాదు… వాళ్ళు శాకాహారులే కాని వీగన్లు కారు’ అని విశదపరిచాను. పాలు, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలు వాళ్ళ ఆహారంలో ముఖ్యమైన అంశాలని వివరించాను. ఆమె కాస్త నిరాశపడింది. ‘అయ్యో, నేను వాళ్ళంతా పాలలాంటి ఏ పదార్థమూ ముట్టుకోరనుకున్నానే’ అని వాపోయింది.

మీ ప్రధాని మోదీగారంటే నాకు ఇష్టం అన్నది జూలియా. ఆయనొక ప్రతిభావంతుడైన నాయకుడు, భారతీయ సంస్కృతీ పరిరక్షకుడు అని కొనియాడింది. అంతర్జాతీయంగా ఆయనకంత మంచి పేరు ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది.

మేమలా ముచ్చట్లలో ఉండగానే ఆనాటి మా టూర్ గైడ్ ఎలేనా వచ్చి మాతో చేరింది. ఆమె ముప్ఫై అయిదేళ్ళ స్థానిక మహిళ; సంప్రదాయ దుస్తుల్లో ఉంది. అదే సమయానికి మరికొంతమంది పర్యాటకులు వచ్చి మాతో కలిశారు. వాళ్ళంతా ఆంతీగా నుంచి పొద్దున్నే బయల్దేరి వచ్చినవాళ్ళట. బ్రేక్‌ఫాస్ట్‌కు మాకంత సమయం ఎందుకిచ్చారా అని అప్పటిదాకా అనుకుంటున్నాం – ఇందుకన్నమాట.

అంతా కలిసి మేమంతా పట్టే ఒక సన్నపాటి మోటర్ బోట్‌లో చేరి ప్రయాణం ఆరంభించాం. బోటు ముందుగా సాన్ పెద్రో అన్న అగ్నిపర్వతం మీదుగా సాగింది. అలా సాగి సాన్ హ్వాన్ ల లగూనా (San Juan la laguna) అన్న గ్రామం చేరుకుంది. పడవ రేవు దగ్గరంతా మొక్కజొన్న చేలు… అదిగో, అటు చూడండి అంటూ ఎలేనా మాకో దూరపు కొండను చూపించింది. చూడ్డానికి అది ఒక నిద్రపోయే మనిషి ఆకృతిలో ఉంది. నిజమే – దానిపేరు ది స్లీపింగ్ ఇండియన్ అట.

సాన్ హ్వాన్ ఒక రంగులీనే గ్రామం. రంగురంగుల కుడ్యచిత్రాలు, మాయన్ నాగరికతా ప్రతీకలు, గొడుగులే పైకప్పుగా ఉన్న వీధులు – అందమైన లోకమది. చాకొలెట్లు తయారు చేసే ఒక నిపుణుడి దగ్గర కాసేపు ఆగాం. చేత్తో చాకొలెట్ చెయ్యడమన్నది అక్కడ ఒక ముఖ్యమైన కుటీర పరిశ్రమ. బట్టలు నేసే ఓ కార్యశాల దగ్గర కాసేపు గడిపాం. స్పానిష్, ఇంగ్లిష్ కలగలిపి అక్కడి ఓ యువతి త్రాహె (Traje) అన్న వర్ణభరిత సంప్రదాయ వస్త్రాన్ని రంగురంగుల పోగులు కూర్చి ఎంత నైపుణ్యంతో నేస్తారో వివరించింది. ఆ నేతపనిలో సహజంగా దొరికే రంగులనే వాడతారట. వెయ్యేళ్ళ నాటి పరికరాలనే ఇప్పటికీ యథాతథంగా ఉపయోగిస్తున్నారట. మహిళల సంప్రదాయ దుస్తుల్లో నాలుగు భాగాలున్నాయిట: ఉయ్‌పిల్ (Huipil – బ్లౌజు), ఫహా (Faja – బెల్ట్), కోర్తె (Corte – స్కర్టు), సింతా (Cinta- హెడ్‌బాండ్). ఈ దుస్తులు నేయడమన్నది మా సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడానికి ఒక మార్గం; ఇవి మాకు ఎంతో పవిత్రమైన వస్త్రాలు, మా పూర్వీకులతో మాకుండే బలమైన బంధాలు – అని వివరించిందా యువతి.

తర్వాత అక్కడి కమ్యూనిటీ హాల్‌కు వెళ్ళాం. బయట బాగా ఎండగా ఉన్నప్పుడు స్థానికులు ఆ హాల్‌లో చేరి సేద తీరుతారట. అది చూశాక ఆ ఊరి వీధుల్లో కాసేపు తిరుగాడాం. అక్కడి వాళ్ళంతా నాకేసి ఆసక్తి నిండిన చూపులు రువ్వడం గమనించాను. అంతమంది నేటివ్ ఇండియన్‌ల మధ్య నేనొక్కడినే అసలైన ఇండియన్‌ని – అదీ వాళ్ళ కుతూహలం! వాళ్ళ తరఫున ఎలేనా వచ్చి ఒక ఊహించని అభ్యర్థన చేసింది: వాళ్ళంతా మీతో ఫోటో దిగాలనుకుంటున్నారు, మీకు సమ్మతమేనా? క్షణకాలపు సెలబ్రిటీ హోదా అయాచితంగా వస్తుంటే నేనెందుకు కాదంటానూ? సరే అన్నాను!

ఇక మరో ఇరవై నిమిషాల బోట్ ప్రయాణం మమ్మల్ని సాన్ పెద్రో గ్రామం చేర్చింది. అదే పేరు మీద ఉన్న అగ్నిపర్వత పాదాల దగ్గర ఉన్నది ఆ ఊరు. గాఢనీలపు అతిత్‌లాన్ సరోవరజలాలు, చుట్టూ అలుముకొని ఉన్న ముదురాకుపచ్చ పర్వతాలు, పైన లేత నీలిరంగు గగనం – అవన్నీ ఒకదానితో ఒకటి సహకరించుకుంటూ ఆ మధ్యాహ్నపు తొలి ఘడియల సూర్యకాంతిలో తళతళా మెరిసిపోవడం – గుర్తుంచుకోదగ్గ, గుర్తుండిపోయే జ్ఞాపకమది.

సాన్ పెద్రో గ్రామం హిప్పీలకు ప్రీతిపాత్రమైన ప్రదేశం. మేమంతా అక్కడి రెస్టరెంట్‌లో భోజనం చేశాం. పెపియాన్ దె పోయో (Pepián de Pollo) అన్న గ్వాతెమాల దేశపు జాతీయ వంటకాన్ని ఆర్డర్ చేశాను. కూరగాయలు, పళ్ళతో కలిపి మసాలాలు దట్టించి చిక్కగా వండిన చికెన్ వంటకమది. దానితోపాటు అన్నం, తోర్తీయాలూ సరే సరి. భోజనాల బల్ల దగ్గర నాతోపాటు శాంద్రా, జూలియాలే కాకుండా ఒక కొస్తా రికా జంట, మరో ఫ్రెంచి జంట, ఇద్దరు అమెరికన్ బాక్‌పాకర్ యువతులు, ఐర్లండ్ నుంచి వచ్చిన బైరన్ అన్న ముప్ఫైయేళ్ళ సోలో యాత్రికుడు – అంతా కలిసి పదిమందిమి.

ఒకే జాతిపక్షులు ఒకే గూటికి చేరతాయన్న చందంగా బైరన్‌తో వెంటనే స్నేహం ఏర్పడిపోయింది. నూటయిరవై దేశాలు చూసిన అనుభవజ్ఞుడైన యాత్రికుడు బైరన్. ఇప్పటి యాత్రను మెహికో దగ్గర ప్రారంభించాడట – కొలంబియా దగ్గర ముగుస్తుందట. ఏడాదిపాటు అక్కడి లోకల్ బస్సుల్లో ఆఫ్రికా ఖండంలో తిరిగాడట. దాదాపు అక్కడి అన్ని దేశాలూ చూశాడట – అందులో పశ్చిమ ఆఫ్రికాలో మామూలు వాళ్ళు సులువుగా చేరుకోలేని దేశాలు కూడా ఉన్నాయట. వెంటవెంటనే మా యాత్రానుభవాలను పంచుకున్నాం. మేము చేయబోయే యాత్రలకు ఉపకరించే సూచనలూ ఇచ్చిపుచ్చుకున్నాం.

ఆ రెస్టరెంట్ వాళ్ళు ప్రతి వంటకాన్నీ మేము ఆర్డర్ చేసిన తర్వాతే వాటి వాటి మూలాలనుంచి వండటం మొదలు పెట్టినట్లున్నారు – అవన్నీ టేబుల్ మీదకు చేరేసరికి యుగాలు గడిచాయి. అయినా ఆ జాప్యం మాకేమీ ఇబ్బంది అనిపించలేదు. అందరం చక్కగా కబుర్లలో పడిపోయాం. కాస్తంత పిచ్చాపాటీ సాగాక చర్చ మధ్య అమెరికా దేశాలలోని ప్రజల మూలాల మీదకు మళ్ళింది. మా బృందంలోని కొస్తా రికా జంట థియాగో-వలెంతీనాలకు ఈ విషయంలో బాగా పరిజ్ఞానం ఉంది. మధ్య అమెరికాలోను, దక్షిణ అమెరికాలోనూ ఉండేవాళ్ళు చాలా వరకూ అక్కడి స్థానికులకు, స్పానిష్ వారికీ కలిగిన సంతానం అని వివరించారా జంట. ఆ మిశ్రమ జాతిని మెస్తీహోస్ (Mestijos) అని వ్యవహరిస్తారట.

థియాగో ఇంకోమాట కూడా చెప్పాడు: మధ్య అమెరికా దేశాల వాళ్ళకు గ్వాతెమాల దేశంతో గాఢమయిన మానసిక అనుబంధం ఉంటుంది. ఆయా దేశాలన్నిటిలోను స్వచ్ఛమైన మాయన్ జాతివారు ఎక్కువగా కనిపించేది గ్వాతెమాల లోనే కాబట్టీ వారికి ఆ అనుబంధం. మళ్ళా గ్వాతెమాలలో ఈ అతిత్‌లాన్ సరోవరం, దాని పరిసర పర్వత ప్రాంతాలూ అలాంటి స్వచ్ఛమైన మాయన్ల స్థావరాలట. అంచేత ఈ ప్రదేశాలలో చెదరక నిలిచిన పురాసంస్కృతిని, దానితోపాటు అక్కడి సమ్మోహనపరిచే ప్రకృతి సౌందర్యాన్నీ ఆవాహన చేసుకోడానికి మధ్య అమెరికా దేశాల ప్రజలు ఎంతో ఇష్టంగా ఇక్కడికి వస్తూ ఉంటారట.

స్పెయిన్ నుంచి వచ్చిన ఆక్రమణదారులు (conquistadors) వారితోపాటు మహిళలను తీసుకురాలేదు. అంచేత స్థానిక మహిళలనే వివాహం చేసుకోవడం, దానివల్ల మెస్తీహోస్ అన్న మిశ్రమజాతి రూపు దిద్దుకోడం, వాళ్ళంతా మెహికో, మధ్య అమెరికాలలో విస్తరించడం – అది చరిత్ర. ఈ మెస్తీహోలది సహజంగానే యూరప్-మధ్య అమెరికాలకు చెందిన మిశ్రమ సంస్కృతి. ముందే చెప్పుకున్నట్టు ఈ మెస్తీహోల జనసంఖ్య ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది. గ్వాతెమాలలో వారిది యాభై శాతం, అనాది మాయన్‌లది నలభై శాతం. ఎల్ సల్బదోర్, నికరాగువా, ఒందూరస్ దేశాల్లో మెస్తీహోల సంఖ్య ఇంకా ఎక్కువ.


ఆనాటి యాత్రలో మా చిట్టచివరి మజిలీ సాంతియాగో పట్టణం. ఆ జులై 25 సాంతియాగోలో సంత సంబరాల దినం. స్థానికంగా ఆ సంబరాలను ఫియెస్తా దె సాంతియాగో (Fiesta de Santiago) అంటారు. ఊరంతా వేడుక బృందాలతో క్రిక్కిరిసిపోయి కనిపించింది. ఎలేనా మమ్మల్ని రెండు బృందాలుగా విడదీసింది. ఇంగ్లిష్ తెలిసిన ఎదువార్దో అన్న స్థానిక వ్యక్తిని గైడ్‌గా తీసుకుంది. ‘క్రిక్కిరిసిన వీధుల్లో తిరిగేటపుడు అందరూ కలిసి ఉండేలా జాగ్రత్తపడండి, తప్పిపోతే కష్టం’ అని జాగ్రత్త చెప్పింది. ఊరు ఊరంతా సంబరాల్లో మునిగి కనిపించింది – దుకాణాలు, అమ్మకందార్లు, రంగుల రాట్నాలు, జెయింట్ వీల్స్ – సంబరమే సంబరం.

ఆ ఊరి కూడలిలో బ్రహ్మాండమైన సంగీత విభావరి సాగుతోంది. మేమంతా ఆ దగ్గర్లో ఉన్న సింక్రెటిక్ చర్చ్ ప్రాంగణం లోకి వెళ్ళి చూశాం. అక్కడ క్రైస్తవానికి, మాయన్ సంస్కృతికీ చెందిన కళాకృతులు విరివిగా కనిపించాయి. ఊళ్ళో తిరిగి, తిరిగి వచ్చేటప్పుడు స్పానిష్ వారికీ స్థానికులకూ మధ్య జరిగిన యుద్ధాలను సూచించే వీధి విన్యాసాల కవాతు కనిపించి అలరించింది. వారిలో కొంతమంది పదహారో శతాబ్దపు యూరోపియన్ దుస్తులూ తెల్ల ముసుగులూ పెట్టుకున్నారు – వారు స్పానిష్ బృందాలన్నమాట. మరికొంతమంది నల్లటి ముసుగులూ స్థానికమైన దుస్తులూ ధరించారు – వీరు నేటివ్ ఇండియన్ యోధులన్నమాట. ఈ సంతలూ తిరునాళ్ళూ ఏ ప్రదేశంలో అయినా స్థానిక సంస్కృతీ సంప్రదాయాలకు చిరుదర్పణాలు. కవాతు చూసుకొని మా బృందం బోటు దగ్గరికి చేరాక మా రెండో బృందంవారు ఈ కవాతు వేడుక మిస్ అయ్యారని తెలిసింది.

మరో అరగంటలో మేమంతా పనహాచేల్ చేరుకున్నాం. ఎలేనాకు, బైరన్‌కు, మా బృందంలోని మిగతావారికీ గుడ్‌బై చెప్పాను. వారు అందించిన స్నేహసౌరభానికి ధన్యవాదాలు చెప్పాను. పనహాచేల్‌ను వదిలిపెట్టాలని అనిపించలేదు. అవకాశం దొరకాలే గానీ మరోసారి మరోసారి ఆ ఊరికి రావాలనిపించింది. వీడ్కోళ్ళు, వేదనలూ ముగిశాక ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ ఆఫీసుకు వెళ్ళి గ్వాతెమాల సిటీకి వెళ్ళే షటిల్ బస్ పట్టుకున్నాను.

షటిల్ బస్‌లో మళ్ళీ బైరన్ కనిపించగానే సంతోషం కలిగింది. అతనూ ఆంతీగా దాకా వస్తున్నాడట. ఆరోజు అనుభవాలను ఇద్దరం మరోసారి నెమరు వేసుకున్నాం. మూడు చూడచక్కని గ్రామాలు – నిజానికవి చిరుపట్నాలు. బైరన్ నాతో విడియో ఇంటర్‌వ్యూ తీసుకున్నాడు. బాగా ప్రయాణాలు చేసిన వాళ్ళను ఇలా ఇంటర్‌వ్యూలు చేయడం అతనికి అలవాటట. ‘అయ్యో, మీ విడియో తీసుకోలేదే అని ఇప్పటిదాకా బాధ పడ్డాను. ఇప్పుడా కొరత తీరింది’ అన్నాడు. ఇద్దరం మా యాత్రానుభవాలని తీరిగ్గా చెప్పుకుంటూ ప్రయాణం చేశాం.

ఆంతీగాలో బస్సు ముప్పావు గంటసేపు ఆగింది. సాయంత్రం ఏడు గంటల సమయం. డిన్నరు టైము. బస్సు ఆగిన ల మెర్సేద్ చర్చి ముందు చాలా రోడ్‌సైడ్ దుకాణాలు కనిపించాయి. బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తు, దానితోపాటు అవొకాడో గుజ్జు, ఉల్లిపాయ చక్రాలు వేసి ఘాటు సాస్ పైన పోసిన తాకో (Taco) ఒకటి తీసుకున్నాను. అదే ఆనాటి నా డిన్నరు. రుచికరమైన డిన్నరు. వాటితోపాటు వేడి వేడి చాకొలెట్ డ్రింకు…


షటిల్ బస్ గ్వాతెమాల సిటీకి వేళ్ళేటప్పుడు దానిలో నాతోపాటు ఒక స్వీడిష్ జంట ప్రయాణించారు – ఇద్దరూ టీచర్లు. స్వీడన్ లోని గోథెన్‌బర్గ్ నగరానికి చెందినవాళ్ళు. వాళ్ళూ ఈ ప్రాంతాల్లో మూడు నెలలపాటు ప్రయాణాలు చేస్తున్నారట. వాళ్ళది నాకు వ్యతిరేక దిశ – కొలంబియా నుండి మెహికో. వాళ్ళు కొస్తా రికా, ఎల్ సల్బదోర్, నికరాగ్వా దేశాలలో తమ అనుభవాలు చెప్పుకొచ్చారు. నికరాగ్వాలో ఇప్పటికీ నిప్పులు కక్కే మసాయ (Masaya) అగ్నిపర్వతాన్ని తప్పకుండా చూడమని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం, స్వీడన్ నాటోలో చేరాలని తీసుకున్న నిర్ణయమూ మా మాటల్లో చర్చకు వచ్చాయి. ఈ మధ్య దాకా వీళ్ళిద్దరూ స్వీడన్ తటస్థదేశంగా ఉంటేనే బాగుంటుంది అనుకునేవారట – ఇప్పుడు ఉక్రెయిన్ పరిణామాల తర్వాత తమదేశం నాటోలో చేరడమే మంచిది అని భావిస్తున్నారట. వాళ్ళిద్దరూ ఆనాటి సాయంత్రం గ్వాతెమాల సిటీనుంచి దేశపు ఉత్తరభాగాన ఉన్న ఫ్లొరెస్ (Flores) అన్న నగరానికి చేర్చే రాత్రిపూట బస్సు పట్టుకుంటున్నారట. మర్నాడు నేనూ విమానం పట్టుకుని ఆ నగరమే వెళ్ళబోతున్నాను. వాళ్ళలాగా బస్సు పట్టుకొని దేశాన్ని చూస్తూ వెళ్ళడమన్నది నాకూ ఇష్టమయిన విషయమే. కానీ రాత్రి బస్సు అన్నది దేశం చూడాలన్న అభిలాషకు ఏమాత్రం దోహదం చెయ్యదు కదా – అంచేత విమానం ఆలోచన. మర్నాటి ఉదయం విమానం పట్టుకోడానికి సులువుగా ఉంటుందని గ్వాతెమాల సిటీ విమానాశ్రయం దగ్గరే ఓ హాస్టల్ రూమ్ తీసుకొన్నాను.

మా షటిల్ బస్సు నేనారోజు రాత్రి ఉండబోయే విల్లా తొస్కానా అన్న టూరిస్ట్ హాస్టల్‌ ముందు దింపింది. ఆ హాస్టల్ ఎయిర్‌పోర్ట్‌కు దగ్గర్లోనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. గేటు దగ్గరి సెక్యూరిటీ గార్డులు ఎంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ నా దగ్గరున్న వసతి రిజర్వేషన్ పేపరు, పాస్‌పోర్టూ బాగా పరిశీలించాకే నన్ను లోపలికి వదిలారు. సెర్హియో అన్న మా హోస్టు నన్ను సాదరంగా ఆహ్వానించాడు.

ఈ సెర్హియో అన్నాయన మనుషుల మనోభావాలను పసిగట్టడంలో దిట్ట అని చెప్పుకోవాలి. మన మనసులో మాట పెదవి దాటకముందే గ్రహించి సమాధానాలు చెప్పేస్తాడు. సామాను ఎక్కడ పెట్టుకోవాలి, ఎయిర్‌పోర్ట్‌కు ఎలాంటి రవాణా సౌకర్యం ఉంది, బట్టలు ఉతుక్కునే సౌకర్యం ఉందా – ఈ ప్రశ్నలు అడిగేలోపే సెర్హియో సమాధానాలు అందించాడు. ఈ సదుపాయాలన్నిటికీ కాస్తంత రుసుము వసూలు చేస్తామనీ చెప్పాడు. నాకిచ్చిన గది బహు చిన్నది – కానీ సౌకర్యంగానే ఉంది. నేను పెడుతున్న ఖర్చుకు సరిగ్గా సరిపోయే గది అది.

నేను చేసే ప్రయాణాల్లో షవర్‌కు, కొన్ని గంటలసేపు నిద్ర పోవడానికీ తప్ప నేను హోటల్ గదుల్లో గడిపే సమయం అతి స్వల్పం… పైగా తిరిగి తిరిగి అలసి ఉండే నా శరీరం అలాంటి చోట్ల ఆశించేది విశ్రాంతి తీసుకోవడం కోసం ఒక చిన్న సదుపాయం – సుఖసౌఖ్యాల నిలయం కాదు.

పంతొమ్మిది రోజులకు సరిపడే బట్టల్ని అరవై లీటర్‌ల బాక్‌పాక్‌లో సర్దుకోవడమన్నది నిజంగా గొప్ప సవాలు. రోజుకో జత బట్టలు తీసుకువెళ్ళడం అన్న ప్రశ్నే లేదు – మితంగా పెట్టుకోవాలి. కాస్తంత ఆగిన చోట బట్టలు ఉతుక్కునే సదుపాయం కోసం వెతుక్కోవాలి. పాంట్లంటే నేను డెనిమ్ జీన్సే తీసుకెళతాను. అవి మూడు నాలుగు రోజులు వాడినా మరేం పర్లేదు. చొక్కాలు అలా కాదు కదా – రెండో రోజు వాడలేం… మార్చాలి.

పన్నెండు బట్టలకు పది డాలర్ల రుసుముతో వాటిల్ని ఉతికే సదుపాయం అమర్చిపెట్టాడు సెర్హియో. అదో గొప్ప ఉపశమనం. ఈ ఉతికిన బట్టల సాయంతో నా మిగతా ప్రయాణమంతా గడచిపోతుంది.

(సశేషం)