గల్ఫ్ గీతం: 2. షార్జా

రాజేష్ అసలు సిసలు పరేంగితజ్ఞాని.

మాకు అంత గొప్ప సాన్నిహిత్యం అప్పటిదాకా లేకపోయినా సాటి యాత్రాభిమానిగా నా మనసెరిగిన మనిషి అని ఆ ఫిబ్రవరి ఆరో తారీఖు ఉదయం బోధపడింది.

కాఫీలు తాగుతున్నప్పుడు చెప్పాడు: ఇవాళ మీ ప్రోగ్రామ్ అచ్చం మీకు నచ్చేపద్ధతిలో ఏర్పాటు చేశాను–ఉదయమంతా మీరే ఒంటరిగా తిరిగి షార్జా చూడటం, మధ్యాహ్నం నుంచి ఇక్కడికి ముప్ఫై నలభై కిలోమీటర్ల దూరాన ఉన్న ఎడారికి వెళ్ళి డెజర్ట్ సఫారి రుచి చూడటం. నిన్న మీరు వెళ్ళినట్టుగానే షార్జాలో కూడా నాలుగు గంటల్లో ఊరంతా తిప్పిచూపించే బస్సులున్నాయి కానీ ఊరు చిన్నది కదా, మీ బాణీలో కాలినడకన తిరిగిచూద్దురు గాని…

“ఏయే ప్రదేశాలూ?” నాకు కుతూహలం.

“ముందుగా మనింటికి ఆరు కిలోమీటర్లు దూరాన ఉన్న కల్చరల్ స్క్వేర్‌లో మిమ్మల్ని దింపి ఆఫీసుకు వెళతాను. అక్కడ మీరు ఈజీగా గంటన్నర రెండు గంటలు గడిపేస్తారు. అది ముగించాక నాకు ఫోన్ చేస్తే వచ్చి మిమ్మల్ని రోల్లా మాల్ అన్న చోట దింపుతాను. అక్కడో గంట. అదీ ముగిశాక అక్కణ్ణుంచి ఓ మైలు దూరంలో మన ఇంటిదగ్గరే ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియమ్‌కు నడుచుకుంటూ, ఊరిదారులు పగటిపూట చూసుకుంటూ వచ్చెయ్యండి. లంచ్ సమయానికి ఇద్దరం ఇంటికి చేరదాం. భోజనమయ్యాక మిమ్మల్ని సఫారీకి తీసుకెళ్ళే వాహనం ఎక్కిస్తాను…”

భలే భలే. ఇది కదా నేను ఇష్టపడే పర్యటన రీతి!

“ఇక్కడ వారం వారం ఇండియానుంచి వచ్చిన వలస కార్మికులంతా ఒకచోట చేరి ఒకరినొకరు కలుసుకొని కష్టసుఖాలు చెప్పుకుంటారని విన్నాను. అది చూడాలని నా కోరిక. వాళ్ళతో కనీసం రెండు గంటలు గడపాలని ఉంది.”

“నిజమే. కాని అదంతా నిన్న మనం వెళ్ళిన డెయ్‌రా సెంటర్ దగ్గర ప్రతి శుక్రవారం సాయంత్రం జరుగుతుంది. శుక్రవారం ఇక్కడివాళ్ళకు ఆదివారం లాగా వీకెండ్ అన్నమాట. కానీ ఈ శుక్రవారం రోజు రోజంతా అబూదాబీ వెళుతున్నాం. మీ కోరిక తీరకపోవచ్చు. అయినా ఇంకోమార్గం ఉంది. ఇవాళ మీరు వెళ్ళే రోల్లా మాల్ దగ్గరే ఓ పెద్ద పార్కు ఉంది. అక్కడ పనికోసం ఎదురుచూసేవాళ్ళు, పని ముగిశాక వచ్చి తీరిగ్గా కబుర్లాడుకునేవాళ్ళూ బాగా కనిపిస్తారు. తెలుగువాళ్ళు, భారతీయులే కాకుండా పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలవాళ్ళూ కనిపిస్తారు. పలకరిస్తే అంతా పలికేరకం మనుషులే. అక్కడ మీ కోరిక కొంతయినా తీరుతుంది.” దారి చూపాడు రాజేష్.

హమ్మయ్య అనిపించింది.

గబగబా బ్రేక్‌ఫాస్ట్ ముగించుకొని ఇద్దరం కల్చరల్ స్క్వేర్ చేరాం. మరోసారి వివరాలు, జాగ్రత్తలూ చెప్పి రాజేష్ వెళ్ళిపోయాడు. పేరు కల్చరల్ స్క్వేర్ అన్నమాటే గాని నిజానికదో సువిశాలమైన వృత్తాకారపు రహదారి కూడలి (రౌండ్ ఎబౌట్). కూడలి మధ్యలోని మినీపార్క్ కేంద్రబిందువులో ఓ బృహత్తర ఖుర్ఆన్ శిల్పం. స్థానికపరిభాషలో ఈ కూడలిని ఖుర్ఆన్ సర్కిల్ అని వ్యవహరిస్తారట.

మాకంటే రోజు మొదలయ్యి రెండు మూడు గంటలు గడిచిపోయాయి కానీ ఆ కల్చరల్ స్క్వేర్ మాత్రం అప్పుడే నిద్రకళ్ళు తెరుచుకుంటోంది. కాస్తంత ఎగువకు చేరుకొని ఆ ప్రదేశాన్నంతా పరకాయించాను. నా వెనక కల్చరల్ పాలెస్ అన్న పెద్ద భవనం, కుడివేపున ఏదో పెద్ద మసీదు. ఎదురుగా బంగారురంగు డోమ్‌లో ఓ రాజభవనం, కాస్త ఎడమన ఇంకో రెండు విలక్షణమైన భవనాలు… గూగుల్ సహాయంతో ఆ బంగారు గోపురం ఉన్న భవనం నిజంగానే రాజుగారి కార్యాలయ సముదాయమని, మిగిలిన రెండు భవనాల్లో ఒకటి షార్జా గ్రంథాలయమని, మరొకటి గవర్నమెంట్ ఆఫీసులుండే భవనమనీ తెలుసుకున్నాను.

ఇవన్నీ చూసేసరికి రెండు గంటలు పట్టేస్తుందేమో అన్న అనుమానం, ‘టైము సంగతి నీకెందుకూ? నీకు నచ్చిన రీతిలో నువ్వు చూసుకుంటూ వెళ్ళు. ఆ తర్వాత సమయం గురించి ఆలోచిద్దాం’ అని హితవు చెప్పే వివేకం… కల్చరల్ పాలెస్ వైపు అడుగులేశాను.

ఆదిలోనే హంసపాదు లాగా కల్చరల్ పాలెస్ అసలు రూపం నన్ను నిరుత్సాహపరిచింది.

అది ఆ అరబ్ ఎమిరేట్‌ల సంస్కృతీభండారమనుకొన్నాను. కాని, అడుగు లోపలికి వెయ్యగానే అది మతసంస్కృతి అధ్యయనకేంద్రం అని స్పష్టమయింది. ఆ విషయాన్ని అర్థంచేసుకొనే శక్తీ, ఆసక్తీ నాకు లేవని తెలుసు. అయినా ఒకసారి ఆయా విభాగాల్లోకి వెళ్ళి చూసివద్దామని ఉబలాటపడ్డాను. అదీ సాగలేదు. విజిటర్లను పై అంతస్తులకు అనుమతించరు. కాసేపు ఆ గ్రౌండ్‌ఫ్లోర్ రిసెప్షన్ ఏరియాలోనే తారట్లాడి, కనిపించిన ఒకరిద్దరు పనివారితో కాసిని కబుర్లు పంచుకొని, పెద్ద నిరుత్సాహం లేకుండానే ఆ భవనంలోంచి బైటపడ్డాను.

కుడిచేతివైపుకు నాలుగడుగులు వేసి రోడ్ దాటితే మసీదు ప్రాంగణం. అహ్మద్ ఇబ్న్ హస్బల్ మసీదు అన్నది దానిపేరు. విశాలమైన ప్రాంగణం. ఒకరిద్దరు విదేశీ పర్యాటకులు తప్ప మరింకే సందడీ లేదు. ఈ మధ్యే కట్టారా అనిపించేంత అందంగా శుభ్రంగా కనిపించి ఆహ్లాదం కలిగించింది. ఆ మసీదు మినార్లు, గోడలు, కిటికీలూ — అన్నీ అతినైపుణ్యంతో శ్రద్ధతో తీర్చిదిద్దారనిపించింది. ఇస్లామ్ వాస్తురీతుల మీద ఆసక్తి ఉన్నవారికి ఇది ఆరుబయలు గ్రంథమే అనిపించింది. అక్కడ కనిపించిన ఉద్యోగిని సందేహిస్తూనే ‘లోపలికి వెళ్ళవచ్చునా?’ అని అడిగాను. ‘మహదానందంగా!’ అతని జవాబు. వెళ్ళాను. విశాలమైన ప్రార్థనాప్రాంగణం. మసీదు అనగానే మనదేశంలో ఎప్పుడూ కనిపించే ఒక పురాతన కట్టడం అన్న భావనకే ఎందుకో నా మనసు కట్టుబడిపోయి ఉంది. ఆ భావన తొలగిపోవడానికి ఈ షార్జా మసీదు నాంది పలికింది. లోపల విషయ పరిజ్ఞానం ఉన్న మనిషిలా కనిపించిన పెద్దాయనను ‘ఈ ఇబ్న్ హస్బల్‌గారు ఎవరూ?’ అనడిగాను. ‘ఎనిమిదవ శతాబ్దపు న్యాయవేత్త. సున్నీ ఇస్లామ్ న్యాయశాస్త్రకోవిదుడు. బాగ్దాద్‌కు చెందిన మనిషి.’ అన్నది అతని జవాబు.

మసీదు నుంచి బైటపడి పూలమధ్య నిలబడి పిలుస్తోన్న ఆ ట్రాఫిక్ ఐలండ్ దగ్గరికి వెళ్ళాను. పూలమాసాలలో అనేకానేక వర్ణాలు విరజిమ్ముతూ వాహనాలనూ వాహనచోదకులనూ పలకరించే ఢిల్లీ నగరపు రౌండ్-ఎబౌట్ మినీపార్కులు గుర్తొచ్చాయి. అలాంటివి అప్పటికే ఎన్నో చూసినా ఇలా ఒక గ్రంథాన్ని కేంద్రబిందువుగా నిలబెట్టి ఆరాధించడమన్నది నేను ఇప్పటివరకూ ఎరుగని విషయం. బైబుల్‌నూ గీతనూ ఇలా నిలబెట్టాలన్న ఆలోచన ఎవరికీ ఇప్పటిదాకా ఎందుకు రాలేదా అనిపించింది.

మరో రేడియల్ రోడ్ దాటివెళితే రాజుగారి ఆఫీస్ కాంప్లెక్స్. అది దాటుకొని వెళితే ప్రభుత్వ కార్యాలయాల భవనం. ఆపక్కనే షార్జా పబ్లిక్ స్కూల్ అన్న సైన్‌బోర్డ్. ఓ పదినిమిషాలు ఆ స్కూల్ ప్రాంగణాన్ని పరకాయిస్తూ అటూ ఇటూ అడుగులు… చివరికి నన్ను కట్టిపడేసే చోటికి చేరాను. షార్జా లైబ్రరీ.

చిన్నప్పటి అలవాటు – ఎప్పుడు ఎలాంటి గ్రంథాలయం కనిపించినా ఒళ్ళు పులకించిపోవడం, కాళ్ళు నడిపించి లోపలికి తీసుకెళ్ళడం.

కాస్తంత సంకోచిస్తూనే ఆ గంభీరమయిన భవనంలోకి అడుగుపెట్టాను. ప్రవేశద్వారం దాటగానే నిడుపాటి వెడల్పాటి నడవా. రెండో అంచె ద్వారం దగ్గర సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఓ పసియువతి. ఆ వస్త్రధారణ ఉన్న మనుషులతో ముఖాముఖీ మాట్లాడడం నాకు బహుశా అదే మొదటిసారి అనుకుంటాను.

“నేను హిందూస్తాన్ నుంచి వచ్చాను. మీ గ్రంథాలయం చూడాలని ఉంది. లోపలికి వెళ్ళవచ్చా?” ఆంగ్లంలో అడిగాను. “సంతోషంగా!” అన్నది ఆమె. లోపల ఉన్న పెద్దపాటి రిసెప్షన్ ప్రదేశం దాకా నాకు సాయంగా వచ్చి అక్కడివాళ్ళకు నన్ను అప్పగించింది.

ఆ రిసెప్షన్‌లో ముగ్గురు యువతీయువకులు. యువతులిద్దరూ సంప్రదాయదుస్తుల్లోనే ఉన్నారు గానీ మాటలు మొదలవగానే వాళ్ళు గలగలా ఆంగ్లంలో స్నేహం ఉట్టిపడేలా మాట్లాడేయడంతో వస్త్రాలు, సంప్రదాయాలు, సంకోచాలూ ఎటో వెళ్ళిపోయి అచ్చమైన మానవ సంభాషణే నడిచింది.

“మీ లైబ్రరీలో ఆంగ్లవిభాగం ఉందా? హిందీ పుస్తకాలు ఉన్నాయా?”

“ఉన్నాయి. రెండో అంతస్తుకు వెళ్ళండి.”

“తెలుగు?” ఆపుకోలేక అడిగాను.

తెలియదన్నారు. కాసేపు ఆ భాష ఎక్కడిదో వాళ్ళకు వివరించాను. వివరించానో, విసిగించానో తెలియదు!

దాదాపు శతాబ్దం కిందట స్థాపించబడిన షార్జా లైబ్రరీ ఎన్నెన్నో ప్రాంగణాలు మారి, ఎన్నో పురోగమన పరిణామాలను చవిచూసి, చివరకు 2011లో ఈ కల్చరల్ స్క్వేర్‌లోని తన సొంత భవనంలో స్థిరపడిందట. లక్షలాది పుస్తకాలు, విశాలమైన పుస్తక ప్రాంగణాలు, అధునాతనమైన కంప్యూటర్ ఉపకరణాలు, హిందీ పుస్తకాలు, ఇంగ్లీష్ గ్రంథాలు, అనేకానేక విషయాలకు చెందిన అపురూపమైన రాతప్రతులు–చదివినా చదవకపోయినా అలా పుస్తకాలను చూస్తేనే కడుపు నిండిపోయే బాపతు మనిషిని.

“ఏ ఊ…రు…న్నుంచి…వచ్చా…రూ?”

పుస్తకాలమత్తులో ముణిగిపోయివున్న నాకు వెనకనుంచి వినిపించిన ప్రశ్న విభ్రమ కలిగించింది. నవ్వుతూ కనిపించాడు ఇందాక రిసెప్షన్‌లో ఇద్దరు యువతులతోపాటు ఉన్న యువకుడు. అతనికి షార్జాలో తెలుగు మిత్రులున్నారట. ట్యునీసియా దేశపు మనిషట. తన స్నేహితులతో హైద్రాబాద్ వచ్చి ఆ మధ్యన ఒక నాలుగువారాలు గడిపాడట. కాసిన్ని తెలుగు ముక్కలు నేర్చుకున్నాడట. ఎడారిలో పూలు పూయడమన్నా ఊహించగలనుగానీ షార్జాలో ఒక ఆఫ్రికన్ యువకుడు తెలుగులో పలకరించడం ఊహాతీతం.


కల్చరల్ స్క్వేర్ తర్వాత నా మజిలీ రోల్లా మాల్ ప్రాంతం. అయిదారు కిలోమీటర్లు. ఫోన్ చేస్తే తానొచ్చి దింపి వెళతానని రాజేష్ చెప్పాడు కానీ ఈమాత్రం దూరానికి అతన్ని ఆఫీసునుంచి రప్పించడం అసమంజసం అనిపించింది. ఊబర్ కోసం ప్రయత్నించాను, ఫలించలేదు.

దగ్గర్లో ఎక్కడన్నా టాక్సీ స్టాండ్ ఉందేమోనని వెతుకులాట మొదలుపెట్టాను. కనిపించలేదు. వాకబు చేద్దామని అటువైపు వెళుతున్న ఓ మనిషిని ఆపాను. గుజరాత్ మనిషట. రెండుమాటలు సాగేసరికి నాకు టాక్సీ స్టాండ్ చూపించటమే కాకుండా ఆ టాక్సీడ్రైవర్‌తో వివరంగా మాట్లాడి నన్ను క్షేమంగా గమ్యం చేర్చే బాధ్యతను కూడా తనమీద వేసుకున్నాడా మధ్యవయసు గుజరాతీ మిత్రుడు! నిన్నమొన్నటిదాకా ఏదో టాక్సీ ఏజన్సీలో పనిచేశాడట. అంచేత ఆ విషయపు ఆనుపానులు అతనికి కరతలామలకం. సర్రున సాగిపోతున్న ఓ టాక్సీని ఆపాడు. కాస్తంత సాధికారికంగా ఆ డ్రైవరుతో స్థానికభాషలో మాట్లాడాడు. నన్ను తిన్నగా క్షేమంగా తీసుకెళ్ళమని ఒకటికి రెండుసార్లు హెచ్చరించాడు. ఒక గాఢకరచాలనంతో వీడ్కోలు చెప్పాడు.

రోల్లా స్క్వేర్ నగరపు కేంద్రబిందువుల్లో ఒకటి. బడుగుజీవులు, దిగువమధ్యతరగతివారు, తిండీతిప్పలకు, కబుర్లు కాలక్షేపాలకు, తమస్థాయి కొనుగోళ్ళకూ రోజంతా వచ్చీపోయే ప్రదేశమది. ముఖ్యమార్గానికి ఒక పక్కన సుందరమైన రోల్లా పార్క్. అంతాకలిసి ఒక కిలోమీటర్ చుట్టుకొలత ఉన్న దీర్ఘచతురస్రాకారపు ఉద్యానమది. రోడ్డుకు మరోపక్కన సగభాగం రకరకాల షాపులు, మరోసగభాగం చిన్నచిన్న టీదుకాణాలు, రెస్టారెంట్లూ. అంత సొగసుగా లేకపోయినా దీన్ని చూడగానే ఢిల్లీలోని జనపథ్ పేవ్‌మెంట్ మార్కెట్ గుర్తొచ్చింది.

రాజేష్ చెప్పినట్టు వలస కార్మికుల పలుచని సమూహాలు పార్కుకూ దుకాణాలకూ మధ్యవున్న రోడ్డు పొడవునా కనిపించాయి. వాళ్ళల్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వరకూ అన్ని దేశాల ఛాయలూ కనిపించాయి. ఒక విడత నడకలో పరిశీలన ముగిశాక రెండో విడత నడకలో రెండు మూడు బృందాల దగ్గర ఆగి, వాళ్ళతో పాటు అప్పటికి ఇంకా మూసేవున్న దుకాణాల మెట్ల మీద కూర్చొని కబుర్లాడాను. సరళంగానే కబుర్లు సాగాయి, భాషాసమస్య ఎలానూ లేదు కదా.

ఒక బృందం ఫక్తూన్‌లది. మన సరిహద్దుగాంధీకి చెందిన ప్రదేశమన్నమాట. అక్కడ ఉన్న నలుగురూ ఆరడుగుల పొడవుతో ఆజానుబాహుల్లానే కనిపించారు. మాటల్లో స్నేహం చూపించారు. తోపుడుబళ్ళవాళ్ళట వాళ్ళు. ఫర్నిచర్ లాంటిది కొన్నవాళ్ళ ఇళ్ళకు చేర్చాల్సి వచ్చినప్పుడు వెళతారు. మళ్ళా ఆ పని దొరికేదాకా ఇలా కలసి కబుర్లు చెప్పుకుంటారు.

మరో బృందం బంగ్లాదేశ్ కట్టుబడి పనివారిది. ‘ఏరోజుకారోజు పని వెతుక్కోవడమే అవుతోంది. ఎకానమీ మందగించడం వల్ల భవనాలు కట్టే పనీ తగ్గింది. అయినా కడుపుకు ఇంత తినడం, ఎంతోకొంత ఇంటికి పంపడమూ చేయగలుగుతున్నాం.’ అన్నారు వాళ్ళు.

అరగంట వాళ్ళతో గడిపానే గాని అది ఏమూలకు?

అక్కడ ఉన్న మళయాళీ టీ దుకాణాల గురించి రాజేష్ పదేపదే చెప్పాడు–అక్కడ టీ బావుంటుంది, తప్పకుండా వెళ్ళితాగండి అని. వెదుక్కుంటూ వెళ్ళాను. ఈ లోపల రాజేష్ ఫోను, ఎక్కడున్నారూ అంటూ. చెప్పాను. మా మాటలు వినిపించిన అక్కడి టీ అందించే మనిషి వచ్చి పలకరించాడు. కడప మనిషట. వచ్చి పదేళ్ళు దాటిందట. ‘సంతోషంగా ఉన్నారా?’ అని అడిగితే ‘ఆఁ! సంతోషమే. విచారపడటానికి కారణాలేమీ లేవు.’ అన్న తాత్విక సమాధానమిచ్చాడా పెద్దమనిషి.

ఆ ఉదయం నే అనుకున్న చిట్టచివరి పని అల్-మహత్తా ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియమ్ చూడటం. అన్నట్టు రాజేష్‌వాళ్ళ ఇల్లు ఉన్నదీ అక్కడి అల్-మహత్తా పార్క్ ప్రాంతంలోనే. రోల్లా స్క్వేర్ నుంచి మ్యూజియం, అంతా కలిసి ఒక మైలు దూరం. సెల్‌ఫోన్‌లో నావిగేషన్ పెట్టుకొని, దారిని పరిశీలనగా చూస్తూ, దారిలో షార్జా హెడ్‌పోస్టాఫీస్ భవనం కనిపించి ఆకర్షిస్తే అక్కడో అయిదు నిమిషాలు ఆగి, రోజూ కనిపించి మురిపిస్తున్న ఓ పెద్దపాటి మసీదు దగ్గర మరోపది నిమిషాలు గడిపి, కంటికి నదురుగా మనుషులు కనిపించినప్పుడు వాళ్ళను ఆపి నాకు తెలిసిన దారే మరోసారి వారితో చెప్పించుకుంటూ–అలా ఆడుతూ పాడుతూ విమానాల మ్యూజియమ్ చేరాను.

బయట ఉన్న సమాచార ఫలకం ఇదీ షార్జా ఫోర్ట్ అంది. తప్పు ప్రదేశానికి వచ్చానా అని లోపలికి చూస్తే లోపలి భవనపు గోడలోంచి చొచ్చుకువచ్చిన ఓ అలకాలపు విమానపు నాసికాగ్రం కనిపించి రా, రమ్మంది. ఆ పక్కనే ఒక ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ స్టేషన్‌లా అనిపించే అతి చిన్న–దాదాపు నమూనా బొమ్మలాంటి–ఆకృతి కనిపించి ఇదే ఆ విమాన సంగ్రహాలయం అని నిర్ధారించింది. దుబాయ్‌లో ఉన్నట్టు ఇదీ ఓ చిన్నపాటి కోట అన్నమాట. లోపల ఉన్న బోర్డ్ ‘అప్పటి విమానాశ్రయ పరిరక్షణ కోసం కట్టిన పటిష్టమైన భవనసముదాయమే ఈ షార్జా కోట’ అని చెప్పినా అనుమానం వచ్చింది. కోట అనగానే గోల్కొండ, రెడ్‌ఫోర్ట్ గుర్తొచ్చే నాకు ఇది అవసరమైన మనోసవరణ!

ఆ గురువారం మధ్యాహ్నం ఆ ప్రాంగణంలో సెక్యూరిటీ మనుషులే తప్ప మరో ప్రాణి లేదు. ‘ఎవరితగాడు? దారితప్పివచ్చాడా?’ అని వాళ్ళ అనుమానపు చూపులు. కాదు బాబూ… ఈ మ్యూజియమ్ చూడటానికే వచ్చానని చెప్పి, ఐదు దిర్హమ్‌ల టికెట్ తీసుకొని, వాళ్ళే సమకూర్చిన గైడ్‌తో సహా మ్యూజియమ్‌లోకి అడుగుపెట్టాను.

ఒక మధ్యపరిమాణపు హాలులో పది పదిహేను మన తాతల తరానికి చెందిన పురాతన విమానాలు వివిధ భంగిమల్లో కనిపించాయి. నేలమీద ఉన్నవి కొన్ని, తాళ్ళతో పైకప్పుకు వేళ్ళాడదీసినవి కొన్ని, మెట్లు పెట్టి కాక్‌పిట్‌లోకి వెళ్ళిచూడటానికి అనువుగా అమర్చినవి కొన్ని. హాలు గోడల మీద ఆయా విమానాల గురించి, షార్జా విమానాశ్రయం గురించి వివరాలున్న ఫలకాలు.

ప్రపంచపు గగనతలంలో విమానాలు ప్రవేశించిన తొలినాళ్ళలో అప్పటి సూపర్ పవర్ ఇంగ్లండుకు పర్షియాదేశంలో ఎయిర్‌బేస్ ఉండేదట. ఎంచేతనో వాళ్ళతో చెడి బ్రిటిష్ ప్రభుత్వం ఈ గల్ఫ్ ప్రాంతంలో తమ విమానయాన పరిశ్రమకు ఒక అనువు వెదికినప్పుడు, అప్పటికే కట్టబడి ఉన్న షార్జా ఎయిర్‌స్ట్రిప్ కనిపించిందట. అప్పటి షార్జా ప్రభువుతో బ్రిటిష్ దేశపు ఇంపీరియల్ ఎయిర్‌లైన్స్‌వారు నెలకు ఎనిమిదివందల రూపాయలు అద్దె కట్టేలానూ, విమానం దిగినప్పుడల్లా మరో అయిదు రూపాయలు చెల్లించేలానూ ఒప్పందం చేసుకున్నారట. షార్జా ప్రభువుకు పేపర్ కరెన్సీ మీద నమ్మకం లేక వెండి నాణాలు తీసుకొనేవాడట! లండన్ నుంచి భారతదేశం, ఆస్ట్రేలియాలకు వెళ్ళే విమానాలు నైట్‌హాల్ట్ చేయడం కోసం ఈ షార్జా విమానాశ్రయం ఉపకరించేదట. ఇంపీరియల్ ఎయిర్‌లైన్స్‌వారి మొట్టమొదటి విమానం నలుగురు ప్రయాణీకులతో 1932 అక్టోబర్ 5వ తారీఖున ఇక్కడ దిగిందట. రెండో ప్రపంచ యుద్ధంలో రాయల్ ఎయిర్‌ఫోర్స్‌ ఈ సదుపాయాన్ని విరివిగా వినియోగించుకుందట. ఈ విమానాశ్రయం ఇలా 1977దాకా ఉపయోగించబడిందట. షార్జాలో కొత్త విమానాశ్రయం వచ్చి దీన్ని వాడటం ఆపేశాక ఓ పదీ పదిహేనేళ్ళు దుమ్ము పేర్చుకుంటూ ఉండిపోయిందట. మళ్ళీ, 1990ల తొలినాళ్ళలో ఆ దుమ్మంతా దులిపి మ్యూజియమ్‌గా చేశారట.

ఆ హాల్లో ఆ చిన్నచిన్న విమానాల మురిపాలను చూస్తూ, అప్పట్లో అవి ఎంత సేవలందించాయో ఆ వివరాలు వింటూ, కాసేపు కాక్‌పిట్‌లోకి వెళ్ళి కేరింతలు కొడుతూ, ఒకటికి పదిఫోటోలు తీసుకుంటూ, ఆదిమానవుడు పక్షులను కీటకాలను గమనించడం నుంచి లియొనార్దో దవించీ మీదుగా రైట్‌ సోదరుల వరకూ మానవుని ఆకాశయాత్ర చరిత్రను అక్కడ ఉన్న చిత్రాల సాయంతో పునశ్చరణ చేసుకుంటూ, అలనాటి ఒక బ్రిటిష్ ఎయిర్‌హోస్టెస్ కటౌట్‌తో ఫోటో తీసుకుంటూ–అక్కడ దాదాపు గంటసేపు గడిపాను.


“ఛీర్స్!” అన్నాను రెండోసారి నింపుకున్న కాఫీ కప్పు పైకెత్తి.  ఆ యువ బెంగాలీ దంపతులకు నేనన్నది ముందు అర్థంకాలేదు. క్షణంలో విషయం గ్రహించి వాళ్ళు తమ కాఫీకప్పులు పైకెత్తి ఛీర్స్ చెప్పారు.

ఆనాటి మధ్యాహ్నం షార్జాలో బయలుదేరి నలభై నిమిషాల్లో ఎడారిలోని ఇసుకతిన్నెల మధ్యకు చేరి అక్కడ మా హోతలు అందిస్తున్న ఉచిత కాఫీ సౌకర్యాన్ని ఆస్వాదిస్తూ మేము చెప్పుకున్న ఛీర్స్ అవి.

మేమంతా కలిసి, ఓ పన్నెండు మందిమి, ఓ మినీవ్యాన్‌లో ఇసుకతిన్నెల ప్రాంతానికి చేరాం. అక్కడ రెండో మూడో లాండ్‌క్రూజర్ వాహనాలు ఎక్కి వాటి వాటి డ్రైవరుగార్లు చేసిన వాహనవిన్యాసాల భయదసౌందర్యాలు అనుభవించి అరుదైన అనుభూతిని పొంది, అక్కడి ఇసుకదిబ్బల మధ్య ఏర్పడిన అనేకానేక విహారకేంద్రాలలో ఒకదాని దగ్గరకు చేరి, ఆ వాతావరణాన్ని మనసులోకి ఇంకించుకుంటూ, వాళ్ళు అందిస్తోన్న పానీయాలను సేవిస్తూ గడుపుతోన్న క్షణాలవి. ఒక కియాస్క్‌లో కాఫీసరంజామా అంతా అమర్చివుంది. కండెన్స్‌డ్ మిల్క్, కాఫీపొడి, పంచదార, ఒక పెద్ద థెర్మోస్‌లో ఉన్న వేణ్ణీళ్ళు.  మన ఇష్టం ప్రకారం కలుపుకొని కాఫీ చేసుకోవాలన్నమాట. అప్పటికే ఒక కాఫీ చేసుకొని ఉన్నాను కాబట్టి ఆ నా పరిజ్ఞానాన్ని ఈ సహచర బెంగాలీ దంపతులకు అందించి, చిరుస్నేహం సంపాదించి, ఛీర్స్ అనే చనువు పొందానన్నమాట.

షార్జాలో మా మినీవ్యాను బయలుదేరిన పదినిముషాలలోనే ఇసుక ఎడారి చుట్టూ పరచుకొని కనిపించింది. ‘ఈ దుబాయ్, షార్జా ఇప్పుడు మీకు అధునాతన నగరాల్లా కనిపిస్తున్నాయి కాని నిజానికి ఇవన్నీ ఎడారి మీద కట్టిన నగరాలు. దుబాయ్‌లో ఇసుక ఛాయలు కనిపించకుండా అంగుళం అంగుళం పచ్చికతోనో కాంక్రీట్‌తోనో నింపేశారు. షార్జాలో ఇంకా అలా జరగలేదు. అంతదాకా ఎందుకు, మా హాల్‌లో గ్లాస్‌డోర్స్ ఒకరాత్రి తెరిచివుంచితే మర్నాటి ఉదయానికల్లా హాలంతా సన్నని ఇసుకపొర చేరి కనిపిస్తుంది’ అన్న రాజేష్ మాటలు గుర్తొచ్చాయి.

మా డెజర్ట్ సఫారి ఒక ప్యాకేజ్ డీల్. రవాణా ఛార్జీలు, వెల్‌కమ్ డ్రింకులు, స్థానికదుస్తులలో ఫోటోలు, ఒంటెమీద సవారీ, విరివిగా పానీయాలు, కాస్త కాస్త చిరుతిళ్ళు, చేతికి గోరింటాకు, చిత్రవిచిత్రమైన వినోదకార్యక్రమాలు, చివరగా కబాబ్ కేంద్రీకృత భోజనం–రానూపోనూ ఆరేడు గంటలు.

లాండ్‌క్రూజర్ లోంచి దిగగానే ఇసుక స్కూటర్లు కనిపించాయి. ఒక పెంపుడు డేగతో అరబ్ దుస్తుల మనిషి కనిపించాడు. రాయల్ అడ్వెంచర్ అని పేరున్న మా తండా గేటు మొగదలలో అప్పటి నీళ్ళబావి విత్ ఈతచెట్లు కనిపించింది. పక్కనే మమ్మల్ని ఒంటెల మీద తిప్పబోయే ఒంటెలవాళ్ళు కనిపించారు. అవన్నీ కాస్తకాస్త గమనించి లోపలకి వెళ్ళాను.

లోపల ఉన్న రెండు ఆకర్షణలు నాలోని బాలుడిని కట్టివేశాయి: చేతికి గోరింటాకు, అరబ్ దుస్తుల్లో ఛాయాచిత్రం.

హెన్నా పెట్టేచోట టూరిస్ట్ మహిళలు సందడి చేస్తోంటే ఓపిగ్గా నా వంతు వచ్చేవరకూ ఆగాను. ‘పాకేజ్ టూర్లో ఉన్నది అతి మితమైన డిజైన్. ఇంకా ఎక్కువెక్కువ పెట్టించుకోవాలంటే అదనంగా చెల్లించాలి’ అని అతిమృదువుగా చెప్పింది హెన్నా పెట్టే ఆ పాకిస్తానీ పాప. డిగ్రీ రెండో ఏడు చదువుతోందట. అదనపు సంపాదన కోసం ఇలా అప్పుడప్పుడూ సాయంకాలాలు పనిచేస్తుందట. నా బాణీలో నేను మరిన్ని వివరాల్లోకి వెళ్ళినా విసుక్కోకుండా అంకుల్, అంకుల్ అంటూ స్నేహంగా, ఆదరంగా మాట్లాడింది. ఆమెకు నాకు చేతనైన సాయం చెయ్యాలన్న ఉద్దేశ్యంతో మరో పెద్ద డిజైన్ కూడా వేయించుకున్నాను.

అరబ్ దుస్తుల దగ్గర మనకు తొడిగేవాళ్ళంటూ ఎవరూ లేరు. సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. పాదాలదాకా సాగే అంగీ, తలకు చుట్టుకొనే అరబ్ పాగా అక్కడి కొక్కీలకు తగిలించి ఉన్నాయి. ఏముందీ, అంగీ వేసుకొని పాగా చుట్టుకోడమే గదా అనుకున్నా గాని అది అనుకున్నంత సులభం కాదని ధరించడం మొదలెట్టగానే భోదపడింది. సహాయం కోసం నిస్సహాయంగా దిక్కులు చూస్తుంటే ఒక పంజాబీ మహిళ వచ్చి అంగీని సరిగ్గా సర్ది, తలపాగాను శ్రద్ధగా అమర్చింది. ‘ఇవి చాలవు. కళ్ళజోడూ పెట్టుకో’ అని వాళ్ళాయన కళ్ళకోడు నా మొహానికి తగిలించింది. అది పెద్దదయ్యేసరికి తను పెట్టుకున్న కళ్ళజోడే ఎంతో దయతో నా మొహానికి అమర్చింది. ఆమె స్ఫూర్తి సోకిన ఆ భర్తగారు ఊరికే కెమేరా నొక్కేసి ఊరుకోకుండా ‘భంగిమ, భంగిమ, లైటింగ్, లైటింగ్’ అంటూ చక్కని ఫోటో తీసిపెట్టాడు. చక్కని జ్ఞాపకమది. ఫోటోనైనా మర్చిపోతానేమోగాని, ఆ దంపతులను మర్చిపోవడం సాధ్యంకాదు.

గంట గడిచింది కాని ఇంకా వెలుతురు తగ్గలేదు. ఆకాశంలో సూర్యుడు మరో అరగంటలో డ్యూటీ దిగనున్నానని సూచించాడు. లీలగా కనిపిస్తున్న ద్వాదశచంద్రుడు రానున్నది వెన్నెల ఘడియ అని చెప్పేశాడు. ఈ లోపల నాలుగడుగులు ఎడారి నడకలు నడిచి అనువైన ఇసుకగుట్టను ఎక్కి సూర్యాస్తమయాన్ని కెమేరాలో బంధిద్దామని వేటకు బయలుదేరాను.

రెండుమూడు వందల గజాల దూరాన ఉన్న ఇసుక కొండ మీద రెండుమూడు తండాలకి చెందిన టూరిస్టులు కలిసిపోయి కనిపించారు. అనుకోకుండా తెలుగు మాట. నవయవ్వనపు సాఫ్ట్‌వేర్ జంట. ఇసుకలో స్కేటింగ్, ఆ దృశ్యాలను ఫోటోలు తియ్యడంలో మునిగివుండి కనిపించారు. మాట కలిపి కుశలమడిగి, వాళ్ళు కొన్నాళ్ళు గుర్తుంచుకోదగ్గ ఫోటోలు తీసిపెట్టి సంతోషం పంచుకున్నాను.

నా సూర్యాస్తమయం వేట చక్కని ఫలితాలనే ఇచ్చింది. ఒకటికి రెండు ఇసుక గుట్టలు ఎక్కి, రెల్లుగడ్డి నిండివున్న ఓ చక్కనిచోట చారగిలబడి దిగిపోతోన్న సూర్యుణ్ణి చూస్తూ, ఫోటోలు తీస్తూ–మళ్ళీ మళ్ళీ దొరికేనా అటువంటి భాగ్యం!

సాయంత్రపు గంటన్నర వినోదకార్యక్రమానికి సన్నాహాలు మొదలయ్యాయి.

మా తండా ప్రాంగణం నట్టనడుమ విశాలమైన వేదిక. ఆ వేదికకు నాలుగు వైపులా అంతగా ఎత్తులేని సుఖమైన సోఫాలూ టేబుళ్ళూ. అప్పటికే అందుబాటులోకి వచ్చిన పెప్సీకోలాలు, పనీర్ పకోడీ, చికెన్ కబాబ్… అందరిలోనూ ఉత్సవ ఉత్సుకత. ఆ రెండుమూడు గంటలు కలిసి తచ్చాడటం వల్ల ముఖాలు తెలిసివచ్చి, పరస్పరం చిరునవ్వులు నవ్వుకునేంత చిన్నచిన్న పరిచయాలు.

చెవులు హోరెత్తించే అరబిక్ సంగీతం ఆరంభమయింది. కాసేపటికల్లా అంతాకలిసి ముగ్గురు మహిళలు వేదిక మీదకు చేరారు. ఆరంభంలో రంగురంగుల పూర్తిదుస్తులతోనూ, క్రమక్రమంగా దుస్తులు తగ్గించుకుంటూనూ సినీమాటిక్ సంప్రదాయనాట్యాలు, రంగులు నిండిన దీపాల కాంతిప్రసారాలు… అవన్నీ కలసి వెగటు పుట్టిస్తాయేమోనని భయపడ్డాను కాని, ఆ నాట్యకత్తెల చురుకుదనం, అరబిక్ సంగీతంలోని లయ నన్ను ఆకట్టుకున్నాయి. కాసేపటికల్లా ఆ నాట్యకారులంతా ప్రేక్షకులను తమలో భాగం చేసేసుకొని, పిల్లా పెద్దా యువతీ యువకులను ఎంపిక చేసి వేదిక మీదకు ఆహ్వానించి, వాళ్ళతో కూడా ఓ క్షణమో, పదిక్షణాలో నాట్యం చేసి, దానినో విస్తృతకుటుంబ వ్యవహారంగా మలచగలిగారు! ఆ ప్రక్రియనంతా నాతోపాటు చిరునవ్వులు చిందిస్తూ పైనుంచి చందమామ చూస్తూపోయాడు. నాట్యాలు ముగిశాక దీపనృత్యాలు, అగ్నినాట్యాలు.

ముగ్గురు నవయువకులు, యారానా సినిమాలో అమితాబ్ బచన్‌లాగా ఒళ్ళంతా వెలిగే దీపతోరణాలతో ఒక నృత్యం… నోటినుండా కిరోసిన నింపుకొని చిత్రవిచిత్రమైన ఆకృతుల్లో రెండు మూడుమీటర్ల దూరం వరకూ వెలుగులు వెదజల్లుతూ ఒళ్ళు గగుర్పొడిచేలా వాళ్ళు చేసిన విన్యాసాలు… అప్పటికే ఆ సమయపు ఉల్లాసపు ప్రభావానికి లొంగిపోయిన టూరిస్టులు తమలో తాము చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి వేదికకు కాస్తంత దూరాన చేస్తోన్న విడివిడి నాట్యాలు… అద్భుతమైన నాట్యకౌశలం ప్రదర్శిస్తున్న ఓ పదేళ్ళ చిన్నారి. ఆమెను ప్రోత్సహిస్తూ చుట్టూ ఇరవై పాతికమంది. కళ్ళముందు కనిపిస్తున్న దృశ్యాలు మనసుదాకా చేరుకొని ఉల్లాసానికి, ఉత్సాహానికి హేతువులయ్యాయి.

తొమ్మిది గంటల ప్రాంతంలో సంబరాలు ముగిశాయి.  భోజనాలు మొదలయ్యాయి. వాహనాలన్నీ ఒకటొకటిగా ఇసుక ఎడారిని వదిలి షార్జా వైపు పరుగులు పెట్టాయి. ఇంటికి చేరి గుడ్‌నైట్ చెప్పుకొనేసరికీ పదకొండున్నర.