గల్ఫ్ గీతం: 8. సలాలా

“ఏవోయ్ సుబ్బారావ్! ఏవిటి నీ పేరూ?” కుర్రాణ్ని చూడగానే చతురాడాలనిపించింది.

“సాయి. మరి నీ పేరేమిటీ, అప్పారావా?” ఆ కుర్రాడి సమస్పందన!

సలాలాలో నేను ఉండే రెండురోజులూ బాగా గడవబోతున్నాయని ఆ సాయి వేసిన ప్రశ్న–దాన్ని జవాబు అనడమే సరి–చెప్పింది. అతనికి అంతా కలిసి ఎనిమిదేళ్ళ వయసు.

సామాన్యంగా నాకు బస్సు ప్రయాణాల్లో నిద్ర పట్టదు. అనేక కారణాలు కలసివచ్చాయి కాబోలు-ఆ రాత్రంతా మంచి నిద్రే పట్టింది. కానీ ఒకటి రెండుసార్లు టీ కోసం బస్సు ఆగింది-నిద్రకు అదో ఆటంకం. దానితోపాటు మరొకటి రెండుసార్లు బయట కాస్తోన్న కృష్ణపంచమి నాటి లేటువెన్నెల కిటికీలోంచి చొచ్చుకువచ్చి తట్టిలేపి ‘ఎడారి ఎడారి అన్నావ్, చూడవేం?’ అని నిలదీసింది. ఒకటి రెండుమైళ్ళ దూరాన విద్యుద్దీపాల వెలుగులు… గ్రామాలయి ఉండాలి. అవి ఒయాసిస్సుల తీరపు గ్రామాలేమోనన్న ఉత్తేజపు ఊహలు. ఇదంతా పగటిపూట చూడలేకపోయానే అని నూటపదహారోసారి విచారం. ఈలోగా కొండలకు దారి ఇచ్చిన ఎడారి. సలాలా దగ్గరపడుతోందన్నమాట. ఆ కొండల్లో ఉషఃకాంతులు. ఆ లేత వెలుగులో అద్భుతంగా మెరుస్తోన్న లోయలు. కొండల చాటునుంచి బయటపడిన సూరీడు. పలచబడుతోన్న కొండలబారులు. దూరాన లీలగా పట్నపు ఛాయలు. ఉదయం ఏడు.

హరికృష్ణకు ఫోను చేశాను, నగరం కనబడుతోందని చెప్పడానికి. ఊళ్ళో ఈ బస్సు ఎన్నెన్నిచోట్ల ఆగుతుందో, నేను ఎక్కడ దిగాలో ఆ వివరాలు ఒకటికి రెండుసార్లు అడిగి తెలుసుకొన్నాను. ‘మీరేం కంగారు పడకండి. మీరు దిగవలసింది మీ బస్సుకు చిట్టచివరి స్టాపులోనే. చేరడానికి మరో ముప్పై నలభై నిముషాలు పడుతుంది. మీరు దిగేసరికి ఎదురుగా నేను కనిపిస్తాను.’ భరోసా ఇచ్చాడు హరికృష్ణ.

చివరి స్టాపులో కింద కనిపించిన హరికృష్ణను బస్సులోంచే చూసి ఠక్కున గుర్తుపట్టాను. అతనితోపాటు వాళ్ళ బాబు, సాయి.

“సారీ! బస్సు లేటయింది. మళ్ళా మీరు ఆఫీసుకు లేటవుతారేమో!”

“ఇవాళా రేపూ వీకెండు కదా. రెండ్రోజులూ మీకోసమే అట్టిపెట్టాను.”

రిటయిరయిన వాళ్ళకి, యాత్రలు చేసేవాళ్ళకీ వారాలు గుర్తుండవు. రిటయిరయి యాత్రలు చేసేవారికి అసలే గుర్తుండవు. ఆరోజు శుక్రవారం!

బస్టాండ్ పక్కనే వాళ్ళిల్లు. అయిదు నిముషాలు కూడా పట్టలేదు.

శ్రీమతి శిరీష, పాప షమిత ఆప్యాయంగా పలకరించారు. ఎక్కడో ఇండియా నుంచి ఈ మారుమూల సలాలాకు వచ్చిన మనిషి ఎవరా అని ఆసక్తిగా చూశారు. షమిత పసితనం నుంచి బయటపడి ఇపుడిపుడే ప్రపంచాన్ని అందుకొంటోన్న పదీ పదకొండేళ్ళ పాప. సాయి ఇంకా పసితనపు అంచులు వదలని పిల్లాడు. క్షణాల్లో వీళ్ళంతా మనవాళ్ళే అన్న భావన కలిగింది. ఆ కలిగిన భావన క్షణక్షణానికీ బలపడింది. ముప్ఫయి గంటల తర్వాత విడివడినపుడు పాతమిత్రుల్లా కాస్తంత బెంగలు పడ్డాం కూడానూ!


ఇంటికి చేరిన గంటలోపలే హరికృష్ణ కారులో బయటపడ్డాం.

“రాత్రి బాగా నిద్ర పోగలిగేరా? ఇవాళ రోజంతా మనం ఇలా రోడ్డు పట్టుకొనే తిరుగుతాం, పర్లేదు కదా?” వాకబు చేశాడు హరికృష్ణ. ఆ మాటలు విని ఆశ్చర్యమూ సంతోషమూ! ఏదో కాస్త గైడెన్సు ఇచ్చి పంపిస్తాడనుకొన్నానే కాని, తానే ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్‌గా వ్యవహరిస్తాడని ఊహించలేదు. అతని మాటలు వింటోంటే ఏ గంట ఎక్కడ గడపాలీ అన్నది చక్కగా ప్లాను చేసినట్టు బోధపడింది. ఆ వివరాలు అడగడం కూడా అవసరమని అనిపించలేదు. ‘అన్ని ప్రదేశాలూ, అన్ని అనుభవాలూ సరికొత్తగా వచ్చి నన్ను ఆవహించనీ’ అనుకొన్నాను. అయినా ఆగలేకపోయాను. “ఎడారిలో కేరళ అంటూ రాజేష్ మీ ఊరి గురించి ఊరించి ఊరించి చెప్పాడు. ముందు అవి చూపిస్తారా?” అడిగాను. నవ్వాడు. “అట్నించే వెళ్ళబోతున్నాం” అన్నాడు.

ఐదారు నిముషాల్లో కొబ్బరిచెట్ల మధ్య ఉన్నాం! కొంచెం లోపలికి తొంగి చూస్తే అరటి తోటలూ కనిపించాయి. రోడ్డు పక్కనే వరసాగ్గా కొబ్బరికాయలూ అరటిపళ్ళూ అమ్మే చిన్న చిన్న షాపులు కేరళ వాతావరణ ప్రతిసృష్టికి తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. అప్పటికే రాజేష్ ఈ ప్రక్రియ గురించి వివరంగా చెప్పినా, వాస్తవం ఊహకన్నా మిన్నగా ఉండి అది ఆనందమో ఆశ్చర్యమో తెలియని మిశ్రమ అనుభూతికి కారకమయింది.

నా స్పందన గమనిస్తోన్న హరికృష్ణ వివరంగా చెప్పుకొచ్చాడు.

“తెలుసు గదా, ఈ అరేబియా దేశాలన్నీ ఎడారి దేశాలు. అటు యు.ఎ.ఇ. గాని, ఇటు ఒమాన్‌ గానీ పక్కనే సముద్రం ఉన్నా, స్థూలంగా ఎడారి ప్రాంతాలే. కానీ ఒమాన్‌లో సముద్రానికీ ఎడారికీ మధ్య చాలావరకు కొండల వరుసలు ఉన్నాయి. నిన్న మస్కట్‌లో మీరు కొండల్ని గమనించి ఉంటారు. ఇక్కడ మా దోఫార్ రాష్ట్రంలో తూర్పున యెమన్ సరిహద్దులనుంచి పడమరన మిర్బాత్, సథా పట్నాల దాకా దాదాపు రెండొందలఏభై నుంచి మూడువందల కిలోమీటర్ల మేర పర్వతశ్రేణి ఉంది. అంచేత ఈ ప్రాంతపు వాతావరణం మిగిలిన ప్రాంతాల వాతావరణానికి భిన్నంగా ఉంటుంది. వేసవిలో ఎండలు మరీ మండించవు. శీతాకాలంలో చలి మరీ వణికించదు.”

“మరి వర్షాలూ?” నా ప్రశ్న.

“మనదేశంలో ఉన్నట్టే సలాలా ప్రాంతంలో కూడా వర్షాకాలం ఉంది. జూన్ నుంచి సెప్టెంబరు దాకా ఋతుపవనాలు తీసుకువచ్చే వర్షాలు పడతాయి. ఇండియాలో అంత భారీగా కాకపోయినా ఆ కాలమంతా చిన్నా చితకా జల్లులు పడుతూనే ఉంటాయి. మేఘాలు కమ్ముకుంటూనే ఉంటాయి. అంచేత ఈ ప్రాంతం ఈ అరేబియా దేశాలవారికి సిమ్లా ఊటీలతో సమానం. వర్షాకాలంలో అయితే ఇతర ప్రాంతాల వేడి నుంచి పారిపోయి ఇక్కడికి అరబ్ టూరిస్టులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. టూరిజమ్ ఈ పట్నపు ముఖ్య ఆర్థికవనరు. ఆ సంగతి ఎలా ఉన్నా ఈ కొండలూ మైదానాలూ గోధుమ రంగు వదిలిపెట్టి వర్షాకాలంలో చక్కని చిక్కని పచ్చరంగు పులుముకొంటాయి. స్థూలంగా చెప్పాలంటే కొబ్బరీ అరటి తోటలకు, ఇతర పళ్ళూ కూరగాయల పెంపకానికీ ఎంతో అనువైన వాతావరణం సలాలాది.”

కాస్త ముందుకు వెళ్ళాం. హరికృష్ణ తన వివరణ కొనసాగించాడు: “అదిగో, అటు కుడివేపున చూడండి. అవన్నీ మా సుల్తాన్‌గారి పొలాలు. వందలకు వందల ఎకరాల వ్యవసాయ భూములు. అన్నట్లు మొన్న వెళ్ళిపోయిన ఖబూస్ సుల్తాన్‌ పుట్టిపెరిగింది ఈ సలాలాలోనే. వాళ్ళ నాన్నగారు-సుల్తాన్ తైమూర్ ఆయన పేరు-ఆయన కాలంలో సలాలానే ఒమాన్‌కు రాజధానిగా ఉండేది. తండ్రి పాతకాలపు పాలనా పద్ధతులు నచ్చని ఖుబూస్‌ తండ్రిని తప్పించి 1970లో తాను సుల్తాన్ అయ్యాక రాజధానిని మస్కట్‌కు మార్చారు.” సమీప చరిత్ర చెప్పాడు హరికృష్ణ.

“ఒమాన్‌లో ఎప్పట్నించీ ఉంటున్నారూ?” అని అడిగాను. పదిహేనేళ్ళ నుంచి అట. ముందు ఆరేళ్ళు మస్కట్‌లో, గత తొమ్మిదేళ్ళుగా సలాలాలో. అక్కడి ఒక ఎలక్ట్రిసిటీ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు హరికృష్ణ. లోతైన స్థానిక పరిజ్ఞానం ఉంది. ఈయన సాహచర్యం దొరడం నా అదృష్టం అనిపించింది. అది ఒట్టి అదృష్టమే కాదు. మహద్భాగ్యం అని అక్కడున్న రెండురోజుల్లో స్పష్టమయింది.

రోడ్డు బావుంది. పశ్చిమంగా సాగుతోంది.

“ఇవాళ మనం సలాలాకు ఎనభై కిలోమీటర్లు పడమరన ఉన్న మిర్బాత్ పట్నం దాకా వెళుతున్నాం. మధ్యలో రెండుమూడు గ్రామాలు చూస్తాం. ఒక చిన్నపాటి ట్రెక్కింగ్ చేస్తాం. ఒక జలపాతం కూడా…”

కొండలూ, పల్లెలూ, పట్నమూ, ట్రెక్కింగూ అంటే సరే… జలపాతం కూడానా! అందులోనూ ఈ ఎడారి దేశంలో, ఫిబ్రవరి నెలలో! ఆశ్చర్యమనిపించింది.

రాజుగారి పొలాలు దాటాక మరో ఇరవై నిముషాల్లో చిన్నపాటి పట్నం కనిపించింది. తాఖా అనుకొంటాను. అక్కడ కాసేపు ఆగాం. నగరాలు కాకుండా నేను మొదటిసారిగా ఆ ప్రాంతాల్లో చూస్తోన్న అతిచిన్న పట్నం అది. అంచేత కుతూహలంతో ఆ పరిసరాలను గమనించసాగాను. ఈలోగా హరికృష్ణ వెళ్ళి ఓ పెప్సీ తీసుకొచ్చాడు. ఆశ్చర్యానందాలతో చూస్తోంటే, “మీరు వస్తున్నారని రాజేష్ చెప్పగానే మీ ఎఫ్‌బి వివరాలు, మీరీమధ్య రాసిన థాయ్‌లాండ్ యాత్రాగాథా చూశాను. పెప్సీ ప్రియులని తెలిసింది!” అంటూ నవ్వాడు. ముచ్చటేసింది. “ఈ పట్నం జనాభా ఎంతుండొచ్చు?” అడిగాను. “ఇరవై పాతిక వేలు” అతని జవాబు.

తాఖాలో హైవే వదిలిపెట్టి, ఎడమవేపున కొండల్లోకి సాగిపోతోన్న స్థానిక మార్గం పట్టుకొన్నాం. మనుషులు గాని, ఊళ్ళు గాని, వాహనాలు గానీ లేని ఏకాంతమార్గం. ఉన్నట్టుండి పక్కనున్న గుట్టల్లోంచి ఒక మేకల మంద రోడ్డు దాటుతూ మా కారును నిలవేసింది. ఒక పెద్దాయన, మరో పదిపన్నెండేళ్ళ పసివాడూ-మనవడుగాబోలు… “అదిగో అటు చూడండి!” అంటూ హరికృష్ణ. చూశాను. దూరాన ఒక చిన్న గుడ్డపేలికలా జలధార!

“అదే వాదీదర్బత్ జలపాతం. మనం మరికాస్త ముందుకు వెళితే చక్కని పిక్నిక్ స్పాట్ ఉంది. అక్కడ ఈ వాగు బండలమీద నుంచి సాగుతూ ఎంతో అందంగా కనిపిస్తుంది.”

మరో పావుగంటలో అక్కడికి చేరాం.

జగదేకవీరుని కథ సినిమాలో ‘దేవకన్యలు రాత్రిపూట వచ్చి జలకాలాడే ఒక తటాకం’ అన్న చక్కని కల్పన ఉంది. బహుశా ఏ స్టూడియోలోనో ఆ తటాకపు సెట్టువేసి ‘ఏమి హాయిలే హలా’ అని ఆ పూల్‌గర్ల్స్‌తో పాడించి ఉంటారు. కానీ కె.వి. రెడ్డిగారు, మాధవపెద్ది గోఖలేగారూ ఈ వాదీదర్బత్ చూసి వుంటే ఆ సెట్టూ గిట్టూ ఆలోచన పెట్టుకోకుండా ఆ సన్నివేశాన్ని ఇక్కడే చిత్రించి ఉండేవారు. పగడపు రంగు బండలమీంచి ఐదారడుగులు క్రిందకు దూకుతూ, ఆ ప్రయత్నంలో చిన్నపాటి కొలనును సృష్టించిన లేత ఆకుపచ్చరంగు జలాలు. ఒడ్డున ఉన్న చెట్ల సముదాయం. చిన్నపాటి బండలమీదుగా మేము దిగివెళ్ళి కొలను అంచులు చేరడం-అదో మరపురాని అనుభవం.

మరో అయిదు నిముషాల్లో ఇందాక దూరం నుంచి కనిపించిన జలపాతపు బిందువు పక్కకు చేరుకొన్నాం. అప్పటిదాకా పేలికలా కనిపించిన జలధార ఇప్పుడు గౌరవనీయమైన జలపాతంలా దర్శనమిచ్చింది.

“రెండేళ్ళ క్రితం ఇక్కడ ‘మీకునూ’ అనే కనీవినీ ఎరుగని తుఫాను వచ్చింది. ఒక్కరోజులో ఆరువందలు మిల్లీమీటర్ల వాన కురిసింది. రెండొందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అప్పుడు ఇదే జలపాతం ఒక మినీ నయగారాలా పరవళ్ళు తొక్కింది. చిన్నాపెద్దా అంతా కలసి పాతిక ముప్పై జలధారలు వందానూటేభై మీటర్ల మేర వ్యాపించి కొండలమీంచి కిందికి దూకాయి. మళ్ళీ మళ్ళీ మేము ఆ దృశ్యాన్ని చూస్తామనుకోను.” వర్ణించి వర్ణించి చెప్పాడు హరికృష్ణ.


కొండల్లో మరో పదీపదిహేను నిముషాలు సాగాక తావి అట్టయ్‌ర్ అన్న గ్రామం వచ్చింది. గ్రామం దాటుకొని మరికాస్త ముందుకు వెళితే రహదారిలోంచి ఓ పెద్దపాటి కాలిబాట చీలి మరో వందారెండొందల గజాలు కారును ముందుకు తీసుకువెళ్ళింది. అక్కడ మాకోసం ఎదురు చూస్తూ ఇద్దరు యువకులు!

“ఇతని పేరు మామర్ అమ్రి. మా ఆఫీసులో నాతోపాటే పనిచేసే అకౌంట్స్ ఆఫీసరు. అతను అమర్ మహద్. వీళ్ళిద్దరే ఈరోజు మనకు ట్రెకింగ్ గైడ్లు. స్థానికులు కాబట్టి ఈ ప్రాంతపు అణువణువూ వీళ్ళకి పరిచయమే. అమర్ అయితే మంచి ఫోటోగ్రాఫర్ కూడానూ!” పరిచయం చేశాడు హరికృష్ణ. మామర్‌ను చూడగానే బాలీవుడ్ చిరుతారడు జావెద్ జఫ్రీ గుర్తొచ్చాడు. చువ్వలాంటి చురుకైన శరీరం, గలగలా మాట్లాడే ప్రకృతి. అమర్ బాగా చిన్నాడు. పాతిక కూడా నిండి ఉండవు. కానీ చూస్తే కార్యశూరుడిలా కనిపించాడు. ట్రెక్కు సంగతి ఎలా వున్నా ఇలా ఇద్దరు స్థానిక యువకులతో గంటా రెండుగంటలు గడపడమన్నదే చక్కని అవకాశమని సంబరం కలిగింది.

“అదిగో అక్కడ లోయలా ఉంది చూశారా? ఆ లోయ అట్టడుగున ఒక నీటిచెలమ ఉంది. ఆ జలాలు మహా పవిత్రమైనవని మా నమ్మకం. ఆ బిందువును తావి అట్టయ్‌ర్ సింక్‌హోల్ అంటారు. రెండొందల మీటర్లు దిగాలి. ఇప్పుడు మనం అక్కడకు వెళుతున్నాం. అంతా కలసి గంటా గంటన్నర ట్రెక్కు. బాగా ఎక్కడాలూ దిగటాలూ ఉంటాయి. మీకు పర్లేదు కదా?” నాయకత్వపు  పాత్ర అందుకొంటూ అడిగాడు మామర్. చిరునవ్వుతో మరేం పర్లేదని సమాధానం చెప్పాను.

నలుగురం మెల్లగా గులకరాళ్ళూ చిట్టిపొదలూ నిండిన ఆ కాలిబాటల్లో అడుగులు వెయ్యసాగాం. అవి మేకల దారులు కూడా అనుకొంటాను, నాలుగడుగులు వేస్తే బాట చీలుతోంది. మామర్-అమర్‌ల సాయం లేకపోతే మాలాంటివాళ్ళు అనుక్షణం తికమక పడే అవకాశం ఉన్న ప్రదేశమది. కాస్సేపు మామూలు నడక సాగాక మెల్లగా లోయలోకి దిగడం మొదలెట్టాం. ఆకుపచ్చరంగు పరిసరాలు శ్రమను కాస్తంత తగ్గించసాగాయి. సింక్‌హోల్ దగ్గరపడుతోన్నకొద్దీ దిగటమన్నది నిట్టనిలువు స్థాయికి చేరింది. చూసిచూసి అడుగులు వేయవలసివచ్చింది. అదీ కష్టమనుకొంటోంటే హఠాత్తుగా దిట్టమైన ఇనుపనిచ్చెనల పరంపర కనపడింది. ఆమధ్యే ఈ నిచ్చెనల వ్యవస్థ ఏర్పరచారట… ఆ అంచెలంచల నిచ్చెనల్లో కొన్నింటికి పదిమెట్లే అయితే మరికొన్ని ఏభై దాకా! అలా దిగుతూ దిగుతూ అక్కడక్కడ బాగా బండల అంచులదాకా వెళ్ళి దిగువున తళుక్కుమంటోన్న జలాల దర్శనం చేసుకొంటూ, మాలాంటి సామాన్య మానవులు ఎంతవరకూ చేరుకోగలరో అంతవరకూ వెళ్ళాం. ‘కొంచెం ధైర్యం చేస్తే మరికాస్త కాస్త కిందకు దిగవచ్చు’అని  మామర్ ప్రోత్సహించబోయాడు గానీ మేం వద్దనుకొన్నాం. అక్కడే ఓ పదినిముషాలు. ఏభై ఏళ్ళనాటి మెకన్నాస్ గోల్డ్ సినిమాలోని కొండచరియలు, ప్రమాదభరిత అధిరోహణా మార్గాలూ గుర్తొచ్చాయి.

“చెప్పా కదా, ఈ సింక్‌హోల్ జలాలు మాకు బాగా పవిత్రం. ఇక్కడివాళ్ళమంతా ఆ కొండచరియల్లో పాకుతూ పాకుతూ క్రిందకు దిగి అక్కడినించి నీళ్ళు నింపుకొని తెచ్చుకొంటాం. మా ఇళ్ళల్లో దాచి ఉంచుకొని పండుగలూ ఉత్సవాల సమయంలో ఆయా కర్మకాండలకు వాడుతూ ఉంటాం. నేను ఇంకా చిన్నపిల్లాడుగా ఉన్న రోజుల్లో మా అమ్మా అమ్మమ్మా కింద దాకా దిగివెళ్ళి నీళ్ళు తెచ్చుకొన్నారు. అలా వెళ్ళడం ప్రాణాలతో చెలగాటమని తెలిసినా అది ఒక పవిత్ర ధర్మం అని మేము నమ్ముతాం.” స్థలప్రాధాన్యాన్ని వివరించాడు మామర్. మనకూ గంగాజలం విషయంలో ఈ నమ్మకం ఉంది గదా. దేశాలు, ప్రాంతాలు, మతాలూ వేరయినా మనిషిలోని మౌలిక స్పందనలు ఒక్కటే అనిపించింది.

లోయలోంచి పైకి వచ్చాక ఆ పక్కనే ఉన్న పీఠభూమి మీదకు వెళ్ళాం. ఆ చుట్టుపక్కల వర్షాకాలంలో నీళ్ళు బాగా పారిన చిన్నచిన్న వాగుల జాడలు. ఒక బిందువు దగ్గర మళ్ళా లోయ లోయంతా కనిపించే సౌలభ్యం.

అనుకొన్నట్లుగానే ఆ గంటా గంటన్నరలో మేము నలుగురం వయసూ దేశాల తారతమ్యాలు పూర్తిగా మర్చిపోయి బోలెడన్ని కబుర్లు చెప్పుకొన్నాం. వాళ్ళిద్దరూ స్థానిక జానపద గీతాలు పాడి వినిపించారు కూడానూ. విడివడేప్పుడు నిజమైన చిరుబెంగలు. నేను తిరిగి ఢిల్లీ చేరాక కూడా మామర్ ఆడియో మెసేజ్ పెట్టాడు: ‘అమర్, మరోసారి రా. ఈసారి వర్షాకాలంలో రావాలి. ఇక్కడి పచ్చదనమంతా మూటకట్టి ఇస్తాను.’

సింక్‌హోల్ ట్రెక్కింగ్ ముగించాక మామర్, అమర్‌లకు వీడ్కోలు చెప్పి కొండల్లో ముందుకు సాగిపోయాం.

“మన తదుపరి మజిలీ మిర్బాత్ పట్నం. తిన్నగా వెళితే ముప్ఫై కిలోమీటర్లు. కానీ మధ్యలో జబల్‌సమ్హన్ అన్నచోట అద్భుతమైన వ్యూపాయింట్ ఉంది. అది మీకు చూపించాలని నా కోరిక. మరో ఇరవై కిలోమీటర్లు డీటూర్ అవుతుంది.” చెప్పాడు హరికృష్ణ. ఈ లోపల ఆ కొండల్లో ఎక్కడ్నించో మూడు ఒంటెలు బయటపడి దారి కాచాయి! ‘ఏవయ్యా మా ఎడారి దేశానికి వచ్చావు, మమ్మల్ని పలకరించకుండానే వెళతావా’ అన్నట్లు మా వాహనాన్ని నిలువరించాయి. అందులో ఒక ఒంటె ‘పోన్లే ఫోటో తీసుకో’ అన్నట్టు మహా అనువుగా నిలబడి పోజిచ్చింది.

ఆ వ్యూపాయింట్ నిజంగా మిస్సవరాని ప్రదేశం. అది ఎంతో ఎత్తయిన ప్రదేశమే అయినా ఆ దిగువన అంతా సమతలమే. కొండల చిటారు అంచున ఉన్న భావన. సమతల ప్రదేశంలో ఒకటికి నాలుగు వాగుల జాడలు. అవన్నీ ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసిపోయే దారులు. బాగా దూరాన కనిపిస్తోన్న అరేబియా సముద్రం. ఈ దృశ్యం ఇప్పుడే ఇంత గొప్పగా ఉంటే ఇహ వర్షాకాలంలో ఎంత అందంగా ఉంటుందోగదా అనిపించింది. కొండలు దిగబోతున్నామనగా హరికృష్ణ కారు ఆపి ఓ బోర్డు చూపించాడు. ‘లొకేషన్ ఆఫ్ గ్రావిటీ’ అని రాసి ఉంది. కాస్త ముందుకు తీసుకువెళ్ళి కొంచం ఎత్తు ఎక్కవలసిన చోట కారు నిలిపాడు హరికృష్ణ. నిలిపి, న్యూట్రల్ గేర్ వేసి కారును వదిలేశాడు. కారు మెల్ల్లగా ఆ స్లోపు మీద పైకి ఎక్కడం మొదలెట్టింది! దాదాపు నలభై ఏభై మీటర్లు అలా గ్రావిటీని ప్రశ్నిస్తూ ముందుకు సాగింది! అది ఆంటీ గ్రావిటీ పాయింటట! మన లేహ్ లఢాక్‌లో కూడా ఇలాంటి మాగ్నెటిక్ హిల్ ఉందని విన్నాను. వీడియోలు చూశాను. ఈరోజు అది ప్రత్యక్షంగా ‘అనుభవించాను’.


మిర్బాత్ సలాలాకు ఎనభై కిలోమీటర్లు దూరాన పశ్చిమ దిశలో సముద్రతీరాన ఉన్న చిన్న పట్టణం. శతాబ్దాల క్రిందట సాంబ్రాణి గుగ్గిలం లాంటి ధూప సామగ్రి సేకరణ, ఎగుమతులతో ఒక వెలుగు వెలిగిందట. ఆ రోజుల్లోనే కాబోలు దోఫార్ ప్రాంతానికి రాజధానిగానూ వ్యవహరించిందట. ఇప్పుడా ప్రాభవం సమసిపోయింది. ఉదయం చూసిన తాఖా లాగా ఇది ఇప్పుడు పదిహేనూ ఇరవైవేల జనాభాతో చిన్నపాటి పట్నంగా మనుగడ సాగిస్తోంది.

పట్నపు మనుగడ సంగతి ఎలా ఉన్నా, నా థాయ్‌లాండ్ యాత్రాగాథ రాయల్టీలు అందించడం ఈ మిర్బాత్‌లోనూ కొనసాగింది. షాపు కనపడీ కనపడగనే హరికృష్ణ పెప్సీ కొని అందించాడు. ట్రెక్కులు చేసీ ఎండను కాసీ ఉన్న నాకు ఆ పెప్సీనే అమృతం.

ఊళ్ళోకి ప్రవేశించగానే ఓ పక్కన ఆకర్షణీయమైన మసీదు పలకరించింది. బిన్ అలీ అన్న పధ్నాలుగో శతాబ్దపు స్థానిక ఇస్లామ్ పండితుని సమాధి మీద నిర్మించిన మసీదట అది. మరికాస్త ముందుకెళితే ఎడమ పక్కన చిన్నపాటి కోట-మిర్బాత్ కాసిల్ అన్నారు దాన్ని. ఎన్నెన్ని ఘర్షణలు చూసిందో గాని, ఆ కట్టడపు ప్రాంగణంలో చిట్టచివరి యుద్ధం 1972లో సుల్తాన్‌ సేనలకూ వామపక్షపు తిరుగుబాటుదార్లకూ మధ్య జరిగిందట. పొరుగున ఉన్న యెమెన్‌కు ఆ రోజుల్లో రష్యాతో సత్సంబంధాలు ఉండేవి. ఆ దేశపు ఉత్తర దక్షిణ  ప్రాంతాల మధ్య అంతర్యుద్ధం జరిగినట్టు గుర్తు. దాని ప్రభావం ఈ తిరుగుబాటు మీద ఉందా? తెలియదు!

ఆ కోటకు ఎదురుగా సముద్రం. బీచ్. తీర్చిదిద్దినట్టున్న సముద్రతీరం. మృదువైన అలలతో సముద్రం రమ్మని పలకరిస్తోన్నా, ‘ఈ మిట్టమధ్యాన్నపువేళ నడకలూ గిడకలూ పెట్టుకోకండి’ అని సూర్యుడు హెచ్చరించాడు. ‘ఎలాగూ వచ్చాంగా, కాసేపు ఊరి వీధుల్లోకి వెళ్ళివస్తే బావుంటుంది’ అనుకొన్నాను. మనసెరిగిన హరికృష్ణ కారును చిన్న చిన్న సందుల్లోకి మళ్ళించాడు! సన్నటి సందులు, ఒక్కోచోట కారు వెళ్ళగలదా అన్న అనుమానం వచ్చేంత సన్నని వీధులు, మనవేపు గ్రామాల్లో లాగానే సందుల మొగలో వృక్షాలు, రచ్చబండలు, సముద్రం దగ్గరలో కొత్తరకంగా కనిపిస్తోన్న ఒకేలాంటి పాతబడిన ఇళ్ళు… ‘అవి యెమెన్ దేశపు వాస్తురీతిలో పచ్చి ఇటుకలతో కట్టిన ఇళ్ళు’ అన్న హరికృష్ణ వివరణ. వ్యాపారాలు జోరుగా సాగుతున్న సమయంలో వ్యాపారస్తులు కట్టుకొన్న ఇళ్ళట అవి.

ఆరోజు నాకోసం కొత్త అనుభవాల పరంపర ఎదురుచూస్తోందని లంచ్‌కి ఒక రెస్టారెంటుకు చేరగానే అర్థమయింది. కాస్తంత లేటవుతోన్నా హరికృష్ణ మిర్బాత్‌నుంచి వెనక్కి తాఖా దాకా వచ్చి అక్కడ లంచ్ చేయ్యడానికి ఇష్టపడ్డాడు. కారణం: అక్కడ తనకు తెలిసిన స్థానిక సంప్రదాయ పద్ధతి వంటకాలు, భోజనపు రీతీ అందించే అయిమన్‌మండీ రెస్టారెంటు.

ముందే చెప్పి ఉంచినట్టున్నాడు- రెస్టారెంటు నిర్వాహకులు ఎదురొచ్చి ఆహ్వానించారు. హరికృష్ణ ఆఫీసు కూడా తాఖా ప్రాంతాల్లోనే ఉందనుకొంటాను- తరచూ ఈ రెస్టారెంటుకు వచ్చిపోతూ ఉంటాడట. బూట్లు బయటే విడిచిపెట్టి లోపలికి వెళ్ళాం. ఓ పక్క పొడవాటి టేబుల్ మీద రకరకాల వంటకాలు. అన్నీ మాంసాహారపు వంటకాలే. శాకాహారం ఉన్న గుర్తే లేదు. నేను అప్పటివరకూ రుచి చూడని ఒంటె మాంసపు కూర కూడా అక్కడ కొలువు తీరి ఉంది. కూర్చోడానికి టేబులు కోసం చూశాను. ఒక్కటీ లేదు. ఎదురుగా గోడను ఆనుకొని పరుపులు… కింద నేలమీద పరచి ఉన్న జంపఖానాలు. పదార్థాలవీ వేరువేరు ప్లేట్లలో తెచ్చి పెట్టుకొని మనకోసం ఒక ఖాళీ ప్లేటు కూడా ముందు పెట్టుకొని నేలమీద బాసింపట్టు వేసి కూర్చొని తీరిగ్గా ఆ పదార్థాలు ఆస్వాదించాలట. అలా భోంచేయడాన్ని ‘మండి’ బాణీ అంటారట. రకరకాల కూరలు, బిరియానీ లాంటి మెయిన్ డిష్షూ తెచ్చుకొని, భోజనం కన్నా భోజనం చేసే పద్ధతిని ఎక్కువగా ఆస్వాదిస్తూ-అక్కడో నలభై నిముషాలు. తర్వాత ఆ ఫోటో చూసిన రాజేష్, ‘షార్జాలోనే మీకు ఆ అనుభవం రుచి చూపిద్దామనుకొన్నాను. కుదరలేదు. బావుంది. సలాలాలో ఆ లోటు తీరింది’ అంటూ సంతోషపడ్డాడు.


మొహంజొదారో అంటే పీనుగుల దిబ్బ అని అర్థం.

1920లలో హరప్పా మొహంజొదారోల ఉనికి కనిపెట్టారు. తవ్వకాలు జరిపారు. కాలపు మేటల మాటున కప్పడిపోయి ఉన్న ఎప్పటివో నగరాలను వెలికితీశారు. కానీ స్థానికులకు మాత్రం ఆ దిబ్బలు అడపాదడపా బయటపడే మానవాస్థికల నిలయాలు. పీనుగుల దిబ్బలు.

సరిగ్గా అదే భావం ఉంది-సుమ్‌హరమ్ అన్న వందేళ్ళ క్రితం బయటపడిన, రెండువేల సంవత్సరాలనాటి రేవుపట్నపు శిథిలాల గురించి అక్కడి స్థానికులకు! ఎక్కడివారైనా మనుషులు మనుషులే మరి.

ఈ సుమ్‌హరమ్ అన్న అలనాటి శిథిలనగరం తాఖా పట్నానికి పది కిలోమీటర్ల దూరంలో సముద్రాన్ని హత్తుకొని ఉంది. మనం పైన కొండల్లో చూసిన దర్బాత్ వాగు సముద్రంలో సంగమించే స్థలమిది. వందా నూట ఏభై మీటర్ల వెడల్పు ఉన్న దర్బాత్ ప్రవాహాన్ని వాగు అని కించపరచకుండా నది అని గౌరవించాలనిపించే ప్రదేశమది.

నూటపాతిక సంవత్సరాల క్రితం ఒక ఆంగ్ల జంట ‘ఇక్కడేదో ప్రాచీన జనావాసం ఉండేది’ అని కనిపెట్టిందట. 1920లలో తవ్వకాలు జరిగాయట. ’50లలో ఒక అమెరికన్ ఫౌండేషన్ అధ్యయనాలు చేసిందట. 1994 నుంచి ఒక ఇటాలియన్ సంస్థ ఆ పరిశోధనలు కొనసాగిస్తోందట. ఈమధ్యనే సలాలా శివార్లలో ఉన్న అల్‌ బలీద్ ఆర్కియలాజికల్ సైట్‌తో పాటు దీన్ని, మరో రెండు ‘సాంబ్రాణి’ స్థలాల్నీ జోడించి యునెస్కోవారు ఆ నాలుగింటికీ ఉమ్మడిగా ప్రపంచ వారసత్వ సంపద-వరల్డ్ హెరిటేజ్ సైట్-ముద్ర వేశారట.

క్రీస్తుశకపు మొదటి శతాబ్దంలో ఇప్పటి యెమెన్ దేశపు ముఖ్యరాష్ట్రం హద్రమౌత్‌ రాజ్యపు అలనాటి రాజు సాంబ్రాణి ఎగుమతికి ఈ స్థలం ఎంతో అనువైన ప్రదేశం అని గ్రహించి తనవాళ్ళను వలస రప్పించి, కోట నిర్మించి, రేవు కట్టించి నగరస్థాపన చేశాడట. అటు మధ్యధరా ప్రాంతపు దేశాలతోను, ఇటు భారత ఉపఖండంతోనూ వ్యాపారాలు సాగించి ఈ నగరం ఆ రోజుల్లో ఒక వెలుగు వెలిగిందట.

“ఇప్పటికీ సలాలా ప్రాంతంలో యెమెన్ దేశపు పోలికలూ సంస్కృతీ ఛాయామాత్రంగా కనిపిస్థాయి” అన్నాడు హరికృష్ణ. సరళ సరిహద్దులు ఉన్న రాష్ట్రాలూ దేశాల మధ్య ఆయా సరిహద్దు ప్రాంతాల్లో అలా పోలికలు కనిపించడం సహజమే!

అదిగో ఆ శిథిల నగరం సుమ్‌హరమ్ చూడటానికి నేనూ హరికృష్ణ మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో అక్కడికి చేరుకొన్నాం. అత్యాధునికమైన రిసెప్షన్ భవనం మమ్మల్ని ఆహ్వానించింది. లోపలి ఉద్యోగి ఆ ప్రాంతం గురించి వివరించాడు. ఒక వీడియో కూడా చూపించాడు. తీరా చేసి అతను తెలుగు మనిషి! ‘లోపల శిథిలాలతోపాటు కాస్తంత దూరాన ఓ మ్యూజియం కూడా ఉంది. అదీ తప్పకుండా చూసి రండి’ అని చెప్పాడు.

రెండు మూడువందల మీటర్ల దూరాన, చిన్నపాటి గుట్ట మీద శిథిలాలు ఉన్నాయి. బండరాళ్ళతో కట్టుకొన్న ఇళ్ళు, కాలిబాటలు, సువిశాలమైన ప్రధాన భవనం, అందులో పాతిక మీటర్ల లోతుందని చెప్పే అప్పటి బావి, నీటి తొట్టెలు, ఒక దేవాలయం, అప్పటి పనిముట్లు-పరికరాలు, పక్కనే సువిశాలంగా నది, నదికీ సముద్రానికీ మధ్య పొడవాటి ఇసుక మేట (పోటు సమయంలో అదంతా నీళ్ళలో మునిగిపోతుందని స్థానిక సమాచారం), తూర్పు ఆఫ్రికా మధ్యధరా ప్రాంతాలకూ ఇండియా చైనాలకూ అప్పటి సముద్ర వాణిజ్య మార్గాలను చూపించే చక్కని ఛార్టులు-ఆసక్తికరమైన ప్రదేశం. పడిపోయిన చాలా కట్టడాలను ఏభై, వందేళ్ళ నాటి పునరుద్ధరణ కార్యక్రమాల్లో తిరిగి నిర్మించారట.

శిథిలనగరం చూశాక అక్కడికి అరకిలోమీటరు దూరాన ఉన్న మ్యూజియం చూడ్డానికి వెళ్ళాం. చిన్న మ్యూజియమది. కొన్ని కుడ్య చిత్రాలు, కుండ పెంకులు, మరికొన్ని పనిముట్లు, వంట పాత్రలు, గ్రీసు ఇండియా ఇరాన్ దేశాలతో ఈ ప్రదేశపు బాంధవ్యాన్ని ధృవీకరించే నాణేలు, ఆభరణాలు, సూదులు, తూకపురాళ్ళు- అక్కడో అరగంట. అక్కడ పనిచేస్తోన్న ఇద్దరు తెలుగు యువకులు కనిపించారు. ఒకరిది కోనసీమ. మరొకరిది తెలంగాణ. ఇద్దరూ కాంట్రాక్టు ఉద్యోగులట. ‘జీతమెంతా?’ అని అడిగితే, ‘ముందు రెండొందల రియాళ్ళు అన్నారు. ఇపుడు నూటపాతిక మాత్రమే ఇస్తున్నారు’ అని ఫిర్యాదు నిండిన సమాధానం. ‘సరిపోతుందా మరి?’ అనడిగితే, ‘పర్లేదు. సరిపెట్టుకొంటున్నాం. మూడు నెలలకోసారి ఇంటికి ఇరవై పాతికవేలు పంపిస్తున్నాం’ అని సంతృప్తి నిండిన సమాధానం. కోనసీమ కుర్రాడి పెళ్ళి నిశ్చయమయిందట. ప్రేమ పెళ్ళి. ‘అయ్యో! మరి ఆమె అక్కడా నువ్వు ఇక్కడా’ అని సానుభూతి ప్రదర్శించబోతే, ‘మరేం పర్లేదు సార్. నేనిక్కడ ఉండబోవటంలేదు. మరో ఆర్నెల్లు పనిచేసి ఇంటికెళిపోతా. అక్కడే ఏదైనా ఉద్యోగం చేసుకొంటా’ అంటూ అతని విశ్వాసం నిండిన సమాధానం.


సుమ్‌హరమ్ నుంచి బయటపడి రోడ్డు పట్టుకోగానే హరికృష్ణ టైమ్ చూసుకొన్నాడు. “ఫ్రాన్కిన్సెన్స్ ఇవాళ అవదేమో అనుకొన్నాను. మనకింకా టైముంది. ప్రయత్నిద్దాం” అన్నాడు. బావుంది అని అనిపించిందే గానీ ఆ ఫ్రాన్కిన్సెన్స్ ఏమిటో ఎక్కడుందో, వెళ్ళడానికీ చూడటానికీ ఎంత సమయం పడుతుందో ఆ అవగాహనే లేదు. అయినా, హరికృష్ణ లాంటి బాధ్యత తీసుకొనే వ్యక్తి పక్కన ఉంటే ఆ వివరాల్లోకి వెళ్ళడమెందుకూ?!

అరగంటా నలభై నిముషాల్లో సలాలా శివార్లలో ఉన్న ‘ది మ్యూజియం ఆఫ్ ఫ్రాన్కిన్సెన్స్ లాండ్’ ప్రాంగణం చేరాం. మ్యూజియం ముంగిట నిలచిన బోస్వెలియా శాక్రా వృక్షం స్వాగతం పలికింది. ఉష్ణమండలాల్లో పెరిగే ఈ చెట్టు కాండానికి గాట్లుపెట్టి ఆ వచ్చే స్రవాన్ని సేకరించి గట్టిపరిస్తే ఆ గట్టిపడిన సాంబ్రాణి పలుకులు ధూపం వెయ్యడానికి ఉపకరిస్తాయి. కొన్ని వందల సంవత్సరాలపాటు ఒమాన్ ప్రాంతం ఈ ధూప ద్రవ్యపు వర్తకానికి రాజధానిగా నిలచిందట. దాన్ని విదేశాలకు ఎగుమతి చెయ్యడంలో సుమ్‌హరమ్ రేవు, ఈ మ్యూజియం పక్కనే ఉన్న అల్ బలీద్ అన్న రేవు పట్నమూ ప్రముఖపాత్ర వహించాయట. వీటితోపాటు బోస్వెలియా చెట్లు బాగా ఉండే వాద్-ఇ-దవ్‌ఖా అన్న ప్రదేశము, ఆ ద్రవ్యాన్ని సేకరించి విపణ వీధులకు పంపే షిస్ర్ అన్న ఎడారి సరిహద్దుల్లో ఉన్న ఒయాసిస్సు పట్నమూ- ఈ నాలుగూ కలసి ‘ఫ్రాన్కిన్సెన్స్ లాండ్’గా వ్యవహరింపబడి వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపును సంయుక్తంగా పొందాయి.

“ముందు మ్యూజియం చూస్తే బావుండేది గానీ చీకటి పడిపోతోంది. పక్కనే ఉన్న ఆర్కియలాజికల్ సైట్ చూసివద్దాం. పెద్ద సైటది. కనీసం గంట పడుతుంది” అంటూ హరికృష్ణ అక్కడ అందుబాటులో ఉన్న గోల్ఫ్ కార్ట్ ఒకటి అద్దెకు తీసుకొన్నాడు. ఈలోగా నేను అవకాశం చేజిక్కించుకొని కౌంటరు దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ టికెట్లు తీసుకొన్నాను. ‘మొరాకో మనిషివా?’ అని పలకరించాడు కౌంటరు పెద్దమనిషి!

సుమ్‌హరమ్ ప్రాభవం తగ్గాక క్రీస్తుశకం ఏడూ ఏనిమిది శతాబ్దాల నుంచి పధ్నాలుగూ పదిహేను శతాబ్దాల దాకా ఈ అల్‌ బలీద్ రేవుపట్నం ముఖ్యమైన వాణిజ్యకేంద్రంగా వ్యవహరించిందట. పదమూడో శతాబ్దపు ఇబ్న్‌ బటూటా తన యాత్రా స్మృతుల్లో ఈ పట్నం గురించి చెప్పాడట. దక్షిణాన సముద్రం తూర్పూ ఉత్తరాలలో సముద్రపు కయ్యల మధ్య నూటయేభై ఎకరాల స్థలంలో చుట్టూ రక్షణ ప్రాకారంతో కట్టుకొన్న పట్నమిది. అన్నట్టు బలీద్ అన్న పదానికి పట్టణం అనే అర్థం. ధూపద్రవ్యంతో పాటు భారతదేశపు పడమర తీరపు ప్రాంతాలకు ఇక్కడనుంచి మేలుజాతి గుర్రాల సరఫరా జరిగిన దాఖలాలూ ఉన్నాయట. సుమారు నాలుగు కిలోమీటర్ల చుట్టుకొలత ఉన్న ఈ పట్నంలో ఒక ప్రాంతాన భారతదేశస్థుల ఇళ్ళూ ఉన్నాయని నిపుణుల అభిప్రాయం.

గోల్ఫ్ కార్ట్ ఎక్కి సముద్రపు కయ్యను దాటి ఆ పురాతన పట్నంలోకి ప్రవేశించగానే ఒక పక్కన విశాల ప్రాంగణంలో నిలచి కనిపించే మసీదు ఆనవాళ్ళు మరోపక్క చిన్నపాటి గుట్టమీద ‘ఇక్కడ ఒకప్పుడు సువిశాలమైన రాజ సౌధం నిలచి ఉంది’ అని స్పష్టంగా చెప్పే గుర్తులూ కనిపించి ఆకట్టుకొన్నాయి. మసీదు ప్రాంగణంలో ఇప్పటికీ అరవిరిగి నిలచి ఉన్న స్థూపాకారపు స్థంభాలు ఈ సాయంత్రపు నీరెండలో వింత శోభను సంచరించుకొని గ్రీకు నగర శిథిలాల దృశ్యాలను గుర్తుకుతెచ్చాయి. అంతా కలసి పదమూడు వరుసల్లో  వరుసకు పన్నెండు చొప్పున ఈ స్థంభాలు ఉండేవట.

మసీదూ రాజప్రాసాదమూ చూశాక మా కార్ట్‌లో పట్నం మొత్తం తిరిగిచూశాం. అయిదారు కిలోమీటర్లు వెళ్ళివుంటాం. పట్నపు దక్షిణభాగంలో, సముద్రానికి అతిచేరువలో ఈ మధ్యనే తవ్వకాల్లో బయటపడిన కట్టడాలు కనిపించాయి. పెద్దపాటి సరుకుల గిడ్డంగి, నాలుగు ఓడజెట్టీలు, రెండు కిలోమీటర్ల పొడవున నగర ప్రాకారం, దానికి మళ్ళా నాలుగయిదు ద్వారాలు-అదో ప్రపంచం.

ఆరుబయటి శిథిలనగరం చూడటం ముగిశాక మ్యూజియంలోకి వెళ్ళాం.

ఫ్రాన్కిన్సెన్స్ వ్యవహారానికి చెందిన నాలుగు ప్రదేశాల నుంచీ సేకరించిన పురావస్తువులు ఈ మ్యూజియంలో కొలువుదీరాయి. ఆ మ్యూజియంను రెండు ప్రధాన విభాగాలుగా అమర్చారు. చరిత్ర విభాగంలో ఒమాన్ దేశపు తరతరాల చరిత్రా సంస్కృతీ వివరాలు, ఆయా వస్తువులూ ఉన్నాయి. నౌకాయానపు విభాగంలో అలనాటి ఒమానీ నౌకల నమూనాలు, నౌకాభాగాలకు చెందిన వస్తువులూ ప్రదర్శనకు పెట్టారు. అవన్నీ చూస్తే ఆ దేశానికి సముద్రంతో ఎంత సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో అనిపించింది.

ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినపుడు ముందు మ్యూజియం చూసి ఆ తర్వాత ఆయా ఆరుబయలు ప్రదేశాలకు వెళితే ఒక స్పష్టతతో వాటిల్ని ఆస్వాదించవచ్చు అని మళ్ళా మరోసారి అనిపించింది.


మ్యూజియం నుంచి బయటపడేసరికి బాగా చీకటి పడిపోయింది. ఒళ్ళూ మనసూ బాగా అలసిపోయినట్టు నాకే తెలుస్తోంది. కానీ యువకుడు హరికృష్ణకు ఆ అలసట తాకిడి ఉన్నట్టు లేదు. పైగా నాకు వీలయినంత ఎక్కువ ‘సలాలా అనుభవం’ అందించాలన్న అభిలాష అతనిలో తొణికిసలాడుతూ ఉండగా, “పదండి, మీకింకో రెండు చూపించదగ్గ ప్రదేశాలు ఉన్నాయి” అంటూ ఊరి వెలుపలికి దారితీశాడు. ఈసారి ఉత్తరాభిముఖ పయనం.

నగరపు ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం దాటాక, దూరాన కొండల అచూకీ కనబడుతూ ఉండగా, రోడ్డు పక్క సర్వీస్ లేన్‌లోకి కారు తీసుకువెళ్ళి ఆపాడు. ఆ వరుస వరుసంతా స్ట్రీట్‌ఫుడ్ స్టాళ్ళు. కనీసం పాతిక ముప్పై స్టాళ్ళు ఉండివుంటాయి. ఆ ప్రదేశం పేరు ‘ఈటిన్ మౌంటెన్‌సైడ్ స్ట్రీట్‌ఫుడ్ మార్కెట్’ అట. మనవేపు పెద్దపెద్ద పెనాలలో వేడివేడి గండ్ర ఇసుకలో వేరుశెనగలు వేసి వేయించడం చూస్తూ వుంటాం. అదే బాణీలో వేడివేడి రాతి ముక్కల మధ్య మాంసపు తునకల్ని వేసి వండి వడ్డించడం అక్కడి ప్రత్యేకత. నూనె చుక్క అన్నది పడకుండా మాంసాన్ని సమపాళ్ళలో పక్వమయ్యేలా చేసే నైపుణ్యం వారిది!

కాసేపు ఆ దుకాణాల మధ్య గడిపాక కారును కొండ మీదకు తీసుకువెళ్ళాడు హరికృష్ణ. అంతా కలసి మూడు నాలుగు కిలోమీటర్లలో ఒక వ్యూపాయింట్ చేరుకొన్నాం. అక్కడ్నించి చూస్తే ఊరు ఊరంతా వెలుగులు చిందుతూ కనిపించింది. అది చూసి మనసు పసిపిల్ల అయిపోయింది.

ఇంటికి చేరేసరికి దాదాపు తొమ్మిది. శిరీషగారితోనూ పిల్లలతోనూ కాసేపు కబుర్లు. పిల్లలు క్షణాల్లో కలసిపోయి కథలూ కబుర్లూ చెప్పారు. నేను ఎప్పుడో పాతికేళ్ళ క్రితం మా పాప మిన్నీకి అప్పటికప్పుడు కల్పించి చెప్పిన ‘సింహాలు సర్కసుల్లో ఎందుకు చేరాయంటే’ అనే కథను వినిపించాను. పిల్లలు ఆ కథను ఇష్టపడ్డారు.

(సశేషం)