ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 2

ఈస్ట్‌బోర్న్ – బ్రైటన్

కాంటర్‌బరీలో నేను గడపబోయే చివరి ఉదయం అదే అన్న ఎరుకవల్ల కాబోలు ఇంకా తెల్లవారకముందే మెలకువ వచ్చేసింది. కాఫీ మగ్గుతో పాన్ అండ్ స్టాన్ బెంచి, స్టోన్ హెంజ్, హంసరెక్కల రెల్లుపొద గడిచాక ఆ కాలేజి ప్రాంగణమంతా ఒక చుట్టు చుట్టాను. బాగా చిన్న ప్రాంగణం. ప్రవేశద్వారం దగ్గరే కెరీర్ & ఎంప్లాయబిలిటీ సర్వీసెస్ సెంటర్ కనిపించింది. ఎడమకు మళ్ళి ముందుకు సాగితే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ & ఇంటర్నేషనల్ స్టడీస్ అన్న భవనం… హాస్టల్ బ్లాకులని చుట్టి వెళితే ఒక డక్ పాండ్… కాసేపు వాటితో ముచ్చట్లు. అది దాటి నాలుగడుగులు వేస్తే మళ్ళా మా హాస్టలు గది – అంతా కలిసి పావుగంట. ఉదయం ఆరుంబావు. కాలేజ్ కాంపస్‌ను దాటుకొని మెయిన్ రోడ్ చేరుకున్నాను. ఒక మైలు నడిచాక, అందమైన ప్రాంగణం… నిర్మానుష్యమైన రోడ్లు, ఒకటీ అరా కార్లు, అప్పుడే సిటీ వైపుగా వెళుతోన్న బస్సు ఒకటి – ఉల్ఫ్ కాలేజ్, టేలర్ హిల్… పర్లేదు, కెంట్ యూనివర్సిటీ కాంపస్ కొంతయినా కాలినడకన చూడగలిగాను అన్న సంతృప్తి.

“మళ్ళీ నువ్వే మా మొట్టమొదటి అతిథివి. స్వాగతం” అని పలకరించింది రెస్టరెంట్ వనిత. ఊళ్ళో ఏమేం చూశావూ? ఎవరెవర్ని కలిశావూ? అని వాకబు చేసింది. ‘ఛాసర్‌ని’ అన్న నా సమాధానం విని ముచ్చటపడింది. “సెయింట్ అగస్టీన్ ఆబీ చూశావా? అది కూడా ముఖ్యమైన ప్రదేశం” అని అడిగింది. చూడలేదంటే నొచ్చుకుంది. ‘అవున్లే, నీకున్న కొద్దిపాటి సమయంలో ఎన్నని వెళతావూ’ అని తనే సమాధానం చెప్పుకొంది.

“మీ కాలేజ్ కాంపస్‌లోని క్లాస్‌రూములు, ఆడిటోరియం చూడాలని ఉంది. సాయం చెయ్యగలరా?” అని బ్రేక్‌ఫాస్ట్ ముగించాక అడిగాను. తన పక్కనున్న స్టూడెంటుతో కళ్ళతో మాట్లాడింది. ఓ పావుగంట చూపించిరా అని పంపించింది. ఆ విద్యార్థి సహాయంతో అవన్నీ చూసి హాస్టల్ లోంచి బయటపడ్డాను. అప్పుడే రిసెప్షన్ డ్యూటీలో చేరిన పూణే యువతి ఆప్యాయంగా వీడ్కోలు చెప్పింది. “ఇంకో నెల యూకేలో ఉంటున్నానంటున్నారు కదా, మరోసారి రండి. లండన్ నుంచి రైలయితే మా ఊరూ గంటన్నరే” అన్నది.

మరో అరగంటకల్లా కాంటర్‌బరీ విడిచిపెట్టాను.


ఐదారు గంటలు అనుకున్న ఈస్ట్‌బోర్న్ (Eastbourne) అంచెలంచెల బస్సు ప్రయాణం ఏకంగా ఏడు గంటలు పట్టేసింది. ఏడు అర్థవంతమైన గంటలు! సంతోషం కలిగించిన గంటలు.

ఉదయం తొమిదిన్నరకు కాంటర్‌బరీ వదిలిన బస్సు క్షణాల్లో పట్నం వొదిలి పల్లె బాట పట్టింది. గట్టిగా రెండు రోజులు గడపలేదు – అయినా ఊరు వదిలివెళుతోంటే కాస్తంత బెంగ! సరిగ్గా చూసీ చూడకుండానే, ఊసులాడకుండానే ఊరు వొదిలేస్తున్నానే… మళ్ళీ వస్తానో రానో… ఈ పండీ పండని అనుభవాలూ జ్ఞాపకాలూ నా మనసును సంతృప్తి పరచడంలేదే అన్న సన్నపాటి వేదన. ఏది ఏమైనా వ్యక్తం చెయ్యలేని ఆత్మీయత ఏదో ఆ ఊరూ నేనూ పరస్పరం అంది పుచ్చుకున్నాం.

ఊరు దాటీ దాటగానే సంపూర్ణ ప్రాకృతిక సౌందర్యంతో నిండిన పరిసర శోభ నా మనసును కాంటర్‌బరీ నుంచి మళ్ళించింది! రెండే రెండు లైన్లు ఉన్న తిన్నని గ్రామీణ రహదారి… అటూ ఇటూ పంటలు ఉండీ లేని పొలాలు, గడ్డిభూములు… రోడ్డుకు రెండువైపులా చెట్ల వరుసలు… శ్రుతి అయిన మనసు ఆనందగీతాలాపన ఆరంభించింది. నేనింతకన్నా అందమైన రోడ్ల మీద ప్రయాణాలు చెయ్యలేదా? చేసే ఉంటాను. కాని, రోడ్లూ పరిసరాలూ ప్రకృతీ అందమూ అంటే అది భౌతికమూ భౌగోళికమూ మాత్రమేనా? కంటికి కనిపించేదేనా? మనసూ ఆలోచనలూ సమపాళ్ళలో నైసర్గిక సౌందర్యంతో ప్రతిధ్వనించినప్పుడు ఆనందగీతాలాపన ఆరంభమవుతుంది కదా!

ఏ సంతోషానికైనా ఎక్కడో ఒకచోట హద్దు ఉంటుంది – ఆ సంగతి మా బస్సుకూ తెలుసనుకుంటాను. మెల్లగా బ్రేకు వేసుకొని ఆగింది. ముందు మరో రెండు కార్లు ఆగి ఉన్నాయి. ట్రాఫిక్ అన్న మాటేలేని ఈ రోడ్డు మీద ఇలా వాహనాలు ఆగడమేమిటా అని పరిశీలించాను. రోడ్డు మీద ఒక పక్కన ఏవో మరమ్మత్తులు జరుగుతున్నాయి. చిన్నపాటి తవ్వకపు జాడలూ కనిపించాయి. ఆ ప్రాంతమంతటినీ ఎరుపు తెలుపు రంగుల ప్లాస్టిక్ శంఖువులతోను, వాటిని ఆధారంగా చేసుకొని కట్టిన రిబ్బనుతోనూ ‘కార్డన్ ఆఫ్’ చేసేశారు. ఒక తాత్కాలిక ఎర్రదీపాన్ని ప్రతిష్టించారు. వాహనాలను క్రమబద్ధంగా నియంత్రిస్తున్నారు. అవసరమనిపిస్తే ఆ మరమ్మత్తు పనివారే తగు సూచనలు కూడా ఇచ్చి కార్లు, బస్సులను వీలైనంత తక్కువ అసౌకర్యంతో ముందుకు సాగేలా చేస్తున్నారు. ఈ బాణీ కార్యసరళి, శ్రద్ధాగౌరవాలతో కూడిన ట్రాఫిక్ నియంత్రణ నేను ఆ తరువాత కూడా ఎన్నోసార్లు ఇక్కడి రోడ్ల మీద గమనించాను. హైవేలపై కూడా ఏ సమన్వయమూ లేకుండా అడ్డదిడ్డంగా తవ్వకాలూ మరమ్మత్తులూ చేస్తూ సృష్టించే ట్రాఫిక్ సంక్షోభాలకు అలవాటుపడిన నాకు ఇక్కడి క్రమబద్ధత ముందు ఆశ్చర్యం కలిగించింది. ఆపైన బోలెడంత ముచ్చటవేసింది.

పదిన్నర ప్రాంతంలో బస్సు ఆష్‌ఫర్డ్ అన్న ఊరు చేరింది. నా నాలుగంచెల ప్రయాణంలో అది మొదటి మజిలీ. మరీ పెద్ద ఊరేం కాదు – చిన్న పట్టణం/పెద్ద గ్రామం కోవకు చెందిన ఊరు అది. అక్కడ దిగి టెన్‌టెర్డెన్ (Tenterden) వెళ్ళే బస్సు పట్టుకోడానికి ఇంకా ఇరవై నిమిషాల వ్యవధి ఉందని తెలిసింది. కాస్తంత కాలు సాగించాను. ఆష్‌ఫర్డ్‌ను పెద్ద గ్రామం అనేశానే కానీ ఆ ఊరు కూడలి, ఆ కూడలి లోని కాలిబాటల అలంకరణలు, ఆ బాటలకు అటూ ఇటూ అమర్చిన పచ్చని చెట్లూ – అది ఏదో మహానగరపు శివార్లలోని ఉపనగరంలా ఉందే తప్ప గ్రామపు ఛాయలు లేనే లేవు. ఆ ఆలోచనను నిర్ధారిస్తూ ఒక మలుపు తిరిగీ తిరగగానే పది అంతస్తుల బృహత్‌భవనం ఒకటి కనిపించింది! ఈపాటి ఊరుకు ఇంత పెద్ద భవనమా అని ఆశ్చర్యపడబోయాను కానీ ఆ మధ్యనే మన ప్రాంతపు చల్లపల్లి గ్రామంలో మొలుచుకొచ్చిన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ గుర్తుకొచ్చి – అవును, ఇది ప్రపంచమంతటా విస్తరిస్తోన్న సామాన్యపరిణామం అనుకొని ఆశ్చర్యంలోంచి బైటపడ్డాను. ఏది ఏమైనా ఆ చిన్నపట్నం చైతన్యం తొణికిసలాడే సుందరప్రదేశం అన్న విషయంలో సందేహం లేదు. ఒకరోజు ఇక్కడ ఆగిపోయి ఊరిని మరింత ఆకళింపు చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. యూకేలో ఉన్నంతకాలం ఎన్నోమార్లు అలా అనిపించింది.

ఆష్‌ఫర్డ్‌కూ టెన్‌టెర్డెన్‌కూ మధ్య పన్నెండు మైళ్ళ దూరం. కానీ కాలం దగ్గరికి వస్తే ఆ కాస్త దూరానికీ గంట పట్టేసింది. అనేకచోట్ల ఆగుతూ, ఒకటీ రెండూ దారిలో వచ్చిన గ్రామాలలోకి ప్రవేశిస్తూ నిష్క్రమిస్తూ – అచ్చంగా మనం అనుకొనే ఎర్రబస్సుల బాణీ ఈ యూకే పల్లె బస్సులది. కాకపోతే ఇవి ఫస్ట్ వర్‌ల్డ్‌కు చెందిన ఎర్రబస్సులు. చూపులకూ సౌకర్యానికీ కూడా ఇవి ఉన్నతశ్రేణికి చెందిన బస్సులే అయినా అనుభవాలు, అనుభూతుల విషయంలో స్థూలంగా ఈ పల్లె బస్సులూ మన ఊళ్ళ బస్సులూ ఒక్క తీరువే అనిపించింది. ఎక్కడో ఏదో కుగ్రామంలో అతి చక్కని చర్చి దగ్గర ఆగిన ఒక నిమిషం… ఒకచోట రహదారి నుండి విడివడి లోలోపలికి వెడుతున్న మట్టి బాట… మరోచోట తన పెంపుడు శునకంతో ఎంతో తీరిగ్గా వాకింగ్ చేస్తున్న మలివయసు మహిళ – అవును. ఇవి మన ఊళ్ళే. ఇది మన ఊళ్ళలో ప్రయాణమే!

బస్సు మెల్లమెల్లగా టెన్‌టెర్డెన్ పట్నంలోకి ప్రవేశించింది. ఊరి మొగదలలోనే గృహనిర్మాణానికి అవసరమయ్యే ఉపకరణాల దుకాణాల సముదాయం నా దృష్టిని ఆకర్షించింది. ఊరి ముఖ్యకూడలి చక్కని బాటలు పచ్చని చెట్లతో నన్ను ఆహ్వానించింది. అక్కడ ఉన్న ఓ సైన్‌బోర్డ్ ఆ ఊళ్ళో ఒక బ్రూవరీ, మరో మ్యూజియమ్, వాటికి తోడు రైల్వే స్టేషనూ ఉన్నాయని చెప్పింది. ఎదురుగా కనిపిస్తోన్న ‘ద వైన్’ అన్న పబ్ ఊరి స్థాయిని చెప్పుకొచ్చింది. ఆసక్తి పెరిగి ఈ ఊరి జనాభా ఎంత? అని గూగుల్‌ని అడిగాను. ఎంతా – అంతా కలిసి ఎనిమిది వేలు – అంతే!

దిగి మరో బస్సు పట్టుకోవలసిన ప్రదేశమా టెన్‌టెర్డెన్. ఊరి మెయిన్ రోడ్డులో బస్సు దిగినమాట నిజమే కానీ అక్కడ ఇతర ఊళ్ళల్లో ఉన్నట్టు నిర్దుష్టమైన బస్‌స్టాండ్ ప్రాంతం అంటూ ఏమీ కనిపించలేదు. మరీ చిన్న ఊరు అవడంవల్ల కాబోలు. నా తదుపరి మజిలీ హేస్టింగ్స్‌కు బస్సు ఎక్కవలసిన ప్రదేశం ఎక్కడా అని నిన్నటిరోజున కాంటర్‌బరీలో సమాచారకేంద్రపు మహిళ అందించిన మూడు పేజీల ప్రింట్ఔట్‌ని సంప్రదించాను. రైల్వే స్టేషనుకు చేరువలో అని చెప్పిందా ప్రింట్ఔటు. మరి రైల్వే స్టేషన్ ఎక్కడా? అదిగో ఆ సందులో వందమీటర్లు అని దారి చూపించాడో పరదేశపు పరోపకారి పాపన్న.

స్టేషను ప్రాంతానికి చేరాను. పిక్చర్ పోస్టుకార్డులలో కనిపించేలాంటి చక్కని చిట్టి స్టేషనది. కానీ అక్కడ ఒక్క పిట్టయినా కనిపించలేదు. ఓ పక్కన మాత్రం నలుగురైదుగురు యూనిఫామ్‌ధారులు ఏదో కంచెను మరమ్మత్తు చేస్తూ కనిపించారు. ఆ ప్రాంతపు చాయలు చూస్తే అక్కడ బస్సులు ఆగడమన్న ప్రస్తావనే లేని ప్రదేశమనిపించింది. బెరుకు బెరుగ్గా లోపలికి అడుగు పెట్టాను. వేళగాని వేళ దేశంగాని దేశపు మనిషి అక్కడికి చేరుకోవడం చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. వాళ్ళల్లో ఒక దృఢకాయుడు వచ్చి ‘ఏమిటి? ఏమిటి సంగతి? ఇటెందుకు వచ్చావ్?’ అని అదోరకపు యాసతో ప్రశ్నించాడు. నాలోని బెరుకువల్ల కాబోలు ఆ అడిగిన పద్ధతిలో కాస్తంతా దూకుడు కనిపించింది. నా బాణీ ఇంగ్లీషు యాసలో నేను వివరించాను. అయినా వాళ్ళకి అర్థమయింది. ‘బస్‌స్టాండంటూ ఈ ఊళ్ళో లేదు. మెయిన్ రోడ్డులోనే నాలుగైదు బస్‌స్టాపులున్నాయి. అందులో ఒకటి హేస్టింగ్స్ బస్‌స్టాపు. అయినా ఈ బస్సుల సంగతి ఎందుకూ – మరో ముప్పావుగంటలో ఈస్ట్‌బోర్న్ వెళ్ళే రైలుంది. గంటంబావులో నిన్ను అక్కడికి చేరుస్తుంది. అది ఎక్కు’ అని సలహా చెప్పాడా దృఢకాయుడు. ఊఁహూఁ, నాకు బస్సులే కావాలి అని నసిగాను. క్యాడ్‌బరీస్ వద్దు, పిప్పరమెంటే కావాలి అని మారాం చేసే పిల్లాడి కంఠస్వరం నామాటల్లో నాకే వినిపించింది. అతనికీ వినిపించింది కాబోలు, కాసేపు నాతోపాటు నడచి వచ్చి మెయిన్ రోడ్డుకు వెళ్ళే దారి చూపించాడాయన. అది నేను అంతకుముందు వచ్చిన దారే!

మళ్ళీ మెయిన్ రోడ్డుకు చేరుకొని హేస్టింగ్స్ వెళ్ళే బస్‌స్టాపు అడిగి అడిగి తెలుసుకొని పట్టుకోడానికి ఓ పదినిమిషాలు పట్టింది. బస్‌స్టాపైతే దొరికింది కాని, అక్కడి వివరాలను పరిశీలిస్తే మరో అరగంటకు కానీ బస్సు లేదని తెలిసింది. అదీ మంచిదే అనిపించింది. ఆ రోడ్డు మీదే నడక సాగించాను. దారికి అటూ ఇటూ ఉన్న అలకాలపు వాస్తురీతికి చెందిన భవనాలను మరికాస్త శ్రద్ధగా చూశాను. కాస్తంత లోపలకు ఉండి, నిడుపాటి గోపురాలతో రారమ్మని పిలుస్తోన్న ఊరి చర్చి వేపుగా ఓ అడుగు వేశాను. అన్నీ ముగించుకొని బస్సు రావడానికి ఒక అయిదు నిమిషాల ముందే బస్‌స్టాపుకు చేరాను. ఈలోగా నాలాగే బస్‌స్టాపులు వెతుక్కుంటున్న ఒకరిద్దరికి నా పరిశోధనాఫలాలు అందించి దారి చూపించాను.

టెన్‌టెర్డెన్ నుంచి హేస్టింగ్స్‌కు గంటన్నర ప్రయాణం. ఇరవై మైళ్ళు. నిజానికి హేస్టింగ్స్ అన్న పేరుతో ఒక ఊరు ఉందన్న స్పృహ నాకు అప్పటిదాకా లేదు. ఆ ఊరి పేరు వినగానే అది మన వారెన్ హేస్టింగ్స్‌గారి స్వగ్రామమేమో అన్న బాల్యపుటాశ కలిగింది. వివరాల్లోకి వెళితే ఆ చాయలేమీ కనిపించలేదు. అయినా, లక్ష దాకా జనాభా ఉన్న ఆ సముద్రతీర ప్రాంతపు పట్టణం చారిత్రకంగా ప్రముఖమట. వెయ్యేళ్ళ క్రితం 1066లో బాటిల్ ఆఫ్ హేస్టింగ్స్ జరిగిన రణస్థలమది. సముద్రపు ఆవలి వేపునుంచి వచ్చే అనేక దాడులను చవిచూసిన ఆ నగరం 1066లో పరాజయం పాలయింది. నార్మన్ డ్యూక్‌కు, ఇంగ్లండ్ రాజుకూ మధ్య జరిగిన సంగ్రామంలో ఇంగ్లండ్ రాజు ఓడిపోయాడు. వధించబడ్డాడు. ఏది ఏమైనా ఇప్పుడు కనిపిస్తోన్న హేస్టింగ్స్ నగరం నా కంటినీ మనసునూ ఆకర్షించింది. మరోసారి ‘అయ్యో! మరోరోజు…’ అంటూ వగచేలా చేసింది.

మూడో మజిలీ హేస్టింగ్స్ నుంచి ఆనాటి అంతిమగమ్యం అయిన ఈస్ట్‌బోర్న్ వెళ్ళే బస్సు వెంటనే దొరికింది. మధ్యాహ్నం రెండింటికి బయలుదేరిన బస్సు పద్దెనిమిది మైళ్ళు ప్రయాణించి ఈస్ట్‌బోర్న్ చేరుకోవడానికి ఏకంగా రెండున్నర గంటల సమయం తీసుకుంది. బహుశా స్కూళ్ళు వదిలిన సమయం కావచ్చు… ఊరిలోని అన్ని వీధులు, ఊరి శివార్లలోని అన్ని పేటలూ తడుముతూ, ప్రతీచోటా పిల్లల్ని ఎక్కించుకుంటూ దింపుతూ, వారి వారి తల్లిదండ్రులకు హలోలూ బైబైలూ చెబుతూ గంటసేపు నగరపు సరిహద్దుల్లోనే తచ్చాడింది. ముందు వింతగా అనిపించినా కాసేపట్లో నేనూ ఆ హలోలూ బైబైల కార్యసరళిలో భాగమైపోయాను. ముందు ఆ పదీ పదకొండేళ్ళ పిల్లలతో మాట కలిసింది. కలిసిన మాట వాళ్ళు దిగేటప్పుడు పరస్పరం అభిమానంగా బైబైలు చెప్పుకోడానికి దారి తీసింది. పనిలో పనిగా వారి తల్లిదండ్రులతోనూ చూపు కలపడం, అడపాదడపా మాట కలపడమూ జరిగింది. ఇహ డ్రైవరు మహాశయుడైతే నన్ను తన టీమ్‌లో గౌరవసభ్యుడిగా చేర్చేసుకున్నాడు. పిల్లలంతా దిగిపోయి బస్సు హేస్టింగ్స్ నగరాన్ని దాటి వెళుతోన్నప్పుడు మనసు నిండా వింత సంతృప్తి… ఇది కదా యాత్రావిలాసం అంటే, అన్న భావన.

సాయంత్రం నాలుగున్నరకు ఈస్ట్‌బోర్న్ చేరుకున్నాను. ముందే అన్నట్టు ఆనాటి ప్రయాణం అరవై అయిదుమైళ్ళు, నాలుగు మజిలీలు, ఏడు గంటలు, రెండు ఊళ్ళతో పరిచయం, ఒక ఊరితో చిన్నపాటి స్నేహం, పిల్లల బృందంలో సభ్యత్వం…


ఈస్ట్‌బోర్న్‌లో మేము ఎంచుకున్నది బర్లింగ్‌టన్ హోటల్. సముద్రతీరాన వందలాది గదులు ఉన్న నూటడెబ్భై ఏళ్ళనాటి హోటలది. అప్పటి గాంభీర్యం, వాస్తురీతి మనల్ని ఆకట్టుకొనే మాట నిజమే కానీ లోపలికి వెళితే దాని కీర్తి అంతా గతకాలానిదే అన్నమాట స్పష్టమవుతుంది. అయినా అక్కడ ఒకటి రెండు రోజులు ఉండటం అన్నది గతంలోకి వెళ్ళి జీవించడం కాదు, వర్తమానంతో కరచాలనం చెయ్యడమే అన్ని విషయం కూడా త్వరలోనే అర్థమయింది.

ఊళ్ళోకి అడుగు పెట్టగానే సముద్రతీరపు బర్లింగ్‌టన్ అంటూ వాకబు చెయ్యడం మొదలుపెట్టాను. ఎలా వెళ్ళాలో అవగాహన ఉంది కానీ మనుషుల్ని అడగడంలోని సంబరం వేరు. ఇంకా బాగా వెలుతురు ఉంది కాబట్టి చీకట్లో వెతుకులాట అన్న సమస్యే లేదు. ఒకటీ ఒకటిన్నర కిలోమీటర్ల దూరాన ఉన్న హోటలుకు చేరడానికి – రెండుసార్లు దారి తప్పి – అరగంట పట్టింది. ఆ అరగంటలోనే ఆ ప్రాంతమంతా కాలినడకకు ఎంతో అనువైన ప్రదేశం అని బోధపడింది. మనుషులకే కాకుండా పక్షులకూ అక్కడ రైట్ ఆఫ్ వే ఉందన్న సంగతి అక్కడ కూడళ్ళలో ఏ బెంగా లేకుండా పచార్లు చేస్తున్న సీగల్స్ చెప్పాయి. కాస్తంత సంతోషకరమైన తడబాటు తర్వాత బర్లింగ్‌టన్ చేరనే చేరాను.

ఊహించినట్టే లోపలి వాతావరణం ముతక వాసన వేసినా రిసెప్షన్‌లోని యువకబృందం ఆ ముతకతనాన్ని అధిగమించే మల్లెల పరిమళం వెదజల్లింది! ఇద్దరు యువతులు, ఒక యువకుడు – వారివారి మూలాలూ భాషలూ యాసలూ పసిగట్టగల పరిజ్ఞానం నాకు లేకపోయినా ప్రపంచంలో ఏమూలనైనా ఆత్మీయతా తరంగాలను గుర్తించే శక్తి సాయంతో క్షణాల్లో వారితో మాటలే కాదు, చెతుర్లూ చెణుకుల్లోకి వెళ్ళిపోగలిగాను. ఆ ఊరు రావడంలో నా ఉద్దేశ్యం గ్రహించిన వారిలోని నాయకురాలు పనిగట్టుకొని మరీ ఏ అడ్డంకులూ లేకుండా సముద్రదృశ్యం కనిపించే చక్కని గది కేటాయించింది. మొహమాటాపడుతూ కెటిల్‌లో కాఫీ కాచుకోవడానికి కాఫీపొడి, పాలపొడి సాషేలు మరికొన్ని ఎక్కువ కావాలని అడిగితే ఒక చిన్నపాటి ప్లాస్టిక్ సంచిలో పుష్కలంగా నింపి ఇచ్చింది. మొత్తానికి ఆ ముగ్గురూ కలిసి ఆ ఊరు ఊరంతా నాకు స్వాగతం చెప్తోన్న భావనను నాలో నింపగలిగారు.

చిన్న రూము. సింగిల్ బెడ్డు. ఒక పట్టాన తెరుచుకోని కిటికీలు. ఎప్పటివో చెక్క అలమరాలు. ముతకరంగుల కిటికీ కర్టెన్లు… ఇవేమీ అంత ఉత్తేజం కలిగించే శక్తి కలవి కావు కాని, ఒక్కసారి కిటికీ కర్టెన్లు తెరిస్తే ఎదురుగా రోడ్డుకు అటూ ఇటూ రంగురంగుల పూలమడులు, చేతివేటు దూరంలోనే ఉన్నట్టు అనిపిస్తున్న అనంతజలరాశి! ఎంత అదృష్టమోయ్ అమరేంద్రా! అనిపించింది.

గబగబా ఫ్రెషప్ అయిపోయి, దారిలో కొనితెచ్చుకొన్న పళ్ళూ బన్నులతో లంచ్ అయిందనిపించి, దాన్ని కాఫీతో ముక్తాయించి వెంటనే గదిలోంచి బయటపడ్డాను. కాస్తంత దూరాన, ఎడమవేపున సముద్రంలోకి చొచ్చుకుపోయిన కాలిబాట, ఆ బాటకు ఆ చివర కొట్టవచ్చినట్టు కనిపించే నీలిరంగు వృత్తాకారపు కట్టడం నన్ను రారమ్మని పిలిచాయి. దగ్గరకు వెళితే అది ఆ ఊరికే తలమానికమైన ఈస్ట్‌బోర్న్ పియర్ అని, నేను కాలిబాట అనుకున్నది దారుదూలాలపై నిర్మించిన చెక్కపలకల బోర్డ్‌వాక్ అని, వృత్తాకారపు కట్టడం పేరు విక్టోరియన్ టీరూమ్ అని, అసలది దానికదే ఒక మినీ ప్రపంచమని, అటూ ఇటూ కనిపించే సముద్రాన్నీ ఎదురుగా నిలబడి ఉన్న ఈస్ట్‌బోర్న్ నగరపు భవనాలనీ చూడటానికి అది అతిచక్కని ప్రదేశమనీ బోధపడింది. ఆనాటి సాయంత్రం ఆ పియర్‌తోనే ముడిపడి ఉందన్న మాటా స్పష్టమయింది.

ఒడ్డునుంచి వెయ్యి అడుగుల మేర సముద్రంలోకి చొచ్చుకుపోయిన కట్టడమది. కట్టి అప్పుడే నూటయాభై ఏళ్ళు అయిందట. తుఫానులు, అగ్నిప్రమాదాలు, సినిమా షూటింగులు, ప్రపంచయుద్ధంలో అక్కడ నిలబెట్టిన ఫిరంగులు, శాంతిసమయాల్లో నిర్వహించబడిన బర్డ్‌మాన్ పోటీలు (రెక్కలు కట్టుకొని ఎవరు ఎంతదూరం ఎగిరి వెళ్ళగలరు అన్నది ఆ పోటీ) – ఇలా ఎన్నెన్నో ఘటనలకు ప్రత్యక్షసాక్షి ఆ పియర్. ఆరంభప్రదేశంలో ఒక ఫాస్ట్‌ఫూడ్ సెంటర్ ఉంది. చివరికొసలో ఆకట్టుకొనే టీరూమ్, దానితోపాటు ఒకటీ రెండు బార్‌లు, ఓ నైట్‌క్లబ్ ఉన్నట్టున్నాయి. వాటి సంగతి నాకు అంతగా పట్టదు కానీ అక్కణ్ణుంచి కనిపించే దృశ్యాలు నేననుకున్నట్టే బాగా ఆకట్టుకున్నాయి. సూర్యాస్తమయ సౌందర్యం చూద్దామని ఆశపడ్డాను కానీ ఆ కట్టడం ఉన్న దిశ అస్తమయం చూడటానికి అనువైనది కాదు. పోన్లే, సూర్యుడెక్కడికి వెళతాడు – మళ్ళా రేపు ఉదయం ఇటువేపే కదా ఉదయించేదీ అనుకుంటూ ఒడ్డుకేసి వచ్చాను. ఫాస్ట్‌ఫూడ్ సెంటర్ల ప్రాంగణం చేరాను. రోజంతా సరైన తిండి తినలేదు కదా, ఏదైనా బర్గర్ తీసుకుందామని అటువైపు అడుగు వేశాను.

అక్కడ బర్గర్లు అమ్మే కుర్రాడు కేరళ మనిషి అనిపించాడు. నాతోపాటు కొంటున్న యువతి తెలుగు అమ్మాయి అనిపించింది. ఇద్దర్నీ మాటల్లో పెట్టాను – నా అంచనాలు కాస్తంత గురి తప్పాయి. వాళ్ళు శ్రీలంకకు చెందిన తమిళులు. కుర్రాడు షాపు పనుల్లో తీరిక లేకుండా ఉండిపోయేసరికి అతనితో కబుర్లు హలోల దగ్గరే ఆగిపోయాయి. ఆ అమ్మాయి నాలానే తిరుగాడడానికి వచ్చింది కాబట్టి మాటలు ముందుకు సాగాయి. ఒకరికొకరం ఫొటోలు తీసుకున్నాం. ఎందుకో మనిషి భారంగా ఉందనిపించింది. వివరాలడిగాను, చెప్పింది. నిన్నమొన్నటిదాకా తను, తన భర్త, పిల్లవాడూ జర్మనీలో ఉండేవారట. ఇద్దరిదీ ఐటీ రంగం. భర్తకు మరింత మంచి ఉద్యోగం వచ్చి అంతా ఈస్ట్‌బోర్న్ చేరారు. ఈమె ఉద్యోగం వదిలి రావలసివచ్చింది. ఇక్కడ అనుకున్నంత సులభంగా మరో ఉద్యోగం దొరకటంలేదు – ఆదాయం, వృత్తిసోపానాల సంగతులెలా ఉన్నా మెలమెల్లగా అలముకొంటోన్న అస్తిత్వసమస్యతో బాధపడుతోందావిడ – చెప్పినదంతా విన్నాను. నాకు తోచింది చెప్పాను: ‘ఇది ఇప్పట్లో ఎంతోమందిని వెంటాడుతోన్న సమస్య. కొంతమంది ధైర్యంగా తమ మార్గం తాము వెతుక్కుంటున్నారు. కొంతమంది ఆ తెగింపు లేక, వాస్తవంతో రాజీ పడలేకా సతమతమవుతున్నారు. నీకు ఉన్న మార్గాలను స్పష్టంగా గుర్తించు. తెగించి తిరిగి జర్మనీ వెళ్ళగలిగితే వెళ్ళు. లేదా వాస్తవాన్ని అంగీకరించు. అంతేగాని నిన్ను నువ్వు మానసిక ఒత్తిడికి గురి చేసుకోకు.’ ఇవన్నీ చెప్పానే కానీ నేను సమస్యనూ పరిష్కారాన్నీ మరీ బ్లాక్ అండ్ వైట్‌లో పరిగణించి మాట్లాడుతున్నానని అనిపించింది. నేను చెప్పిన మాటలు చిట్కావైద్యంలా ఉన్నాయనిపించింది. ఆమె మాత్రం ‘నీతో మాట్లాడాక నాకు కాస్తంత మనసు కుదుటపడింది’ అని చెప్పి వెళ్ళింది.

సూర్యాస్తమయం ముగిసి పావుగంట అయింది. అస్తమయం అంటే నేనున్న చోటుకు వ్యతిరేక దిశలో అయింది కాని, అస్తమయం తరువాత వెల్లివిరిసే సంధ్యాకాంతులు పరిసరాలను సువర్ణభరితం చెయ్యడం గమనించాను. అవును – ఒక్కోసారి సూర్యాస్తమయ దృశ్యం కన్నా దాని తరువాత జరిగే వర్ణలీల మరింత మనసుకు హత్తుకొంటుంది. ఆ అవకాశం ఆరోజున ఉందని గ్రహించి మళ్ళీ ఆ చెక్కబాటను పట్టి టీరూమ్ దాకా వెళ్ళాను. అనుకొన్నట్టే వాతావరణం శాంతి నిండిన సుకుమార వర్ణాలతో మిళితమై కనిపించింది. దిగువన తీరాన్ని తాకి వెళుతోన్న చిరు అలలు, వాటితో ఆడుకుంటోన్న పిల్లలు, ఇటు పక్కన ఆ పిల్లలు కూడా లేని సైకత తీరం, మరికాస్త ఎగువన తీరం దగ్గర అప్పుడే వెలిగిన దీపాలు, ఇంకా ఆరిపోని సంధ్యాకాంతులూ – ఆ రెండింటినీ ఆపోశన పట్టి తనదైన దివ్యవైభవంతో మెరిసిపోతోన్న ఏదో చక్కని భవనం…

చక్కని రోజుకు అతి చక్కని ముగింపు.


నాలుగో రోజు ఉదయం ఆరింటికల్లా హోటలు గదిలోంచి బైట పడ్డాను. సూర్యోదయం ఆరున్నరకు అని గూగుల్ చెప్పింది. సూర్యోదయానికి ముందు ఇరవై ఇరవైయైదు నిమిషాలపాటు నడిచే వర్ణహేల సౌందర్యం పోగొట్టుకోకూడనిది అని నా అనుభవం నాకు నేర్పింది. వెరసి ఆరూ అయిదుకల్లా సముద్రం ఒడ్డుకు చేరాను. సూర్యోదయం చూడటానికి అనువైన ప్రదేశం ఏదీ అని ఒక నిమిషం పాటు అటూ ఇటూ పరిశీలించాను. హోటలుకు దగ్గర్లో నిలబడితే కాస్తంత దూరాన ఉన్న పియర్ చిట్టచివర ఉన్న వృత్తాకారపు కట్టడం – విక్టోరియన్ టీరూమ్ – కనిపించే బిందువు అందుకు సరి అయిన ప్రదేశం అని అనిపించింది.

నా అంచనా తప్పలేదు. సరిగ్గా నేను అనుకున్న పాయింట్ దగ్గరే సూర్యుడి ఆకాశయానం మొదలయింది. ఒక అందమైన దినానికి నాంది పలుకుతున్నట్టు ఆకాశంలో మేఘాల తోరణాలు. పైగా వాటి అమరిక ఎవరో నిర్దేశించినట్టు సూర్యబింబానికి ఏమాత్రం అడ్డు తగలని రీతిలో ఉంది. వెరసి టీరూమ్ ఒకపక్కనా మిగిలిన పియర్ భాగం రెండోపక్కనా ఆసరాగా చేసుకొని, నా కంటికి అతిచేరువలో ఉన్న రెల్లుగడ్డి పొదలను ఫోర్‌గ్రౌండ్‌గాను, పైన తారాడుతోన్న మేఘాలను బాక్‌గ్రౌండ్‌గానూ చేసుకొని తానే చక్కని సూర్యోదయ చిత్రమై రవిబింబం నింపాదిగా సాగరగర్భం నుంచి వెలికి వచ్చింది. తనివి తీరక గబగబా పక్కకు వెళ్ళి టీరూమ్‌ను ఒక పక్క మాత్రమే ఆసరా చేసుకొని యావత్ సముద్రాన్నీ తనకు ఆధారపీఠంగా చేసుకొని ఉదయిస్తోన్న సూర్యుణ్ణి మరోసారి ఫోటోలో బంధించాను. తనివి తీరింది.

సూర్యోదయమంటే జరిగిపోయింది కానీ ఆ తర్వాత మరో అరగంట సేపు సూర్యుడు ప్రపంచం మీద గుమ్మరించే కుంకుమా బంగారు వర్ణాల సంగతేమిటి? పైగా ఆ దిమ్మరింపు సాగరతలం మీద జరుగుతున్నప్పుడు, ఆ అందాలను చూడకుండా, కెమేరాలో బంధించకుండా ఉండగలమా? మరో అరగంట నడిచివద్దాం అని తీరం వెంబడే, రోడ్డుకూ సముద్రానికీ నడుమన ఉన్న విశాలమైన కాలిబాట మీద నడక సాగించాను. ఇటు సముద్రం అటు బర్లింగ్‌టన్ హోటల్ లాంటి గంభీరమైన భవనాలు… నాలానే కెమేరా సహితంగా వచ్చి సూర్యుడికి చిత్రారాధన చేస్తోన్న మరికొంతమంది ఫొటోగ్రాఫర్లు… వాళ్ళతో చిన్న చిన్న కబుర్లు, పంచుకున్న సంతోషాలు… అప్పుడే ఉదయపు నడకల కోసం ఆ కాలిబాటను చేరుతోన్న స్త్రీ పురుషులు…

‘ఈ కాలిబాట ఇలా ఇంకా ఎంతదూరం సాగుతుందీ?’ యథాలాపంగానే అడిగాను ఒక సాటి నడకరాయుణ్ణి. “ఓ! చాలా చాలా దూరం – అదిగో ఆ చివర కొండ చరియ సముద్రంలోకి చొచ్చుకు వస్తోంది చూశావా? అక్కడ ఇటాలియన్ గార్డెన్స్ ఉన్నాయి. చెట్లు నిండిన చోటది. అక్కడితో బాట ఆగిపోతుంది. అన్నట్టు ఈ ప్రాంతంలో ఉన్న సెవెన్ సిస్టర్స్ తెల్లని కొండచరియల గురించి విన్నావా?” ఉప్పందించాడాయన.

“తెల్లని కొండ చరియలంటే డోవర్ దగ్గర్ ఉన్నలాంటివా?” కుతూహలం, ఆతృత నా గొంతులో.

“అలాంటివే. కాని వాటికన్నా విశాలమైన ప్రదేశంలో ఉన్నాయివి. సమయముంటే ట్రెక్ చేసుకుంటూ సెవెన్ సిస్టర్స్ దాకా వెళ్ళి రావచ్చు. కొండదారి. రానూపోనూ ఆరేడు గంటలు పడుతుంది. అందమైన సీమ.” వివరించాడాయన.

ఊరడమేమిటి, కరిగి నీరైపోతాను ఇలాంటి వాటిగురించి వింటే. తప్పదు. ట్రెక్కు తప్పదు. కానీ ఆరేడు గంటలంటే – అంత సమయం కేటాయించగలనా? పైగా కడుపులో ఏమీ పడనే లేదు. దారిలో ఏమైనా తినడానికి దొరుకుతుందా?

“కొండప్రాంతం ఆరంభమయ్యే చోట చక్కని రెస్టరెంట్ ఉంది. కానీ దాన్ని తొమ్మిదిన్నరా పది దాకా తెరవరు.” సమాచారం అందించాడు నా సహనడకరాయుడు.

క్రమక్రమంగా ఒక సరళప్రణాళిక నా మనసులో రూపు దిద్దుకొంది. ఇప్పుడు మొదలు పెట్టి రెండు గంటలు ముందుకు నడుద్దాం. తిరిగి రావడానికి మరో రెండు. వెరసి పదకొండు దాకా నడిచి ఆపైన గూటికి చేరడం. చేరి సేదదీరి మధ్యాహ్నం ఉన్న మా సాహితీవేదిక ఢిల్లీవారి నెలసరి జూమ్‌ మీటింగులో పాల్గొనడం – సాయంత్రం సిటీలో తిరుగుళ్ళు – యెస్, ఆనాటి నా ప్రణాళిక సిద్ధమయింది.

నాలుగు నిమిషాలు నడిచేసరికి ఆ ఊరి బ్యాండ్‌స్టాండ్ కనిపించింది. ఊరికే ఒక బ్యాండ్ వాయించే వేదిక మాత్రమే కాకుండా లోపలికి వెళితే ఏదో థియేటర్ స్థాయి ఏర్పాట్లు ఉన్నాయని ఆ పరిసరాలు చెప్పాయి. వెళ్ళి చూడాలనే కోరికను నిగ్రహించుకొని ముందుకే సాగాను. మరికాస్త దూరం నడిచేసరికి కాలిబాటకూ పక్కనున్న రహదారికీ మధ్య చక్కని పచ్చని లాన్‌లు వచ్చి పిలిచాయి. ఇంకాస్త నడిస్తే ‘ఫర్ ట్రీ వాక్’ అంటో మరో ప్రలోభం కనిపించింది. దాన్నీ దాటుకొని ముందుకు సాగితే ఇటాలియన్ గార్డెన్స్ – ఇక ఆపైన అంతా కొండదారే.

ఆ కొండబాట ఆరంభంలోనే ది కియోస్క్ అన్న చక్కని రెస్టరెంట్ కనిపించింది. కాసేపటి క్రితం నా నడకసహచరుడు చెప్పింది దీనిగురించే. కొండబాటలో నాలుగు అడుగులు వేయగానే ‘సౌత్ డౌన్స్ వే నేషనల్ ట్రెయ్‌ల్’ అన్న చెక్క ఫలకం కనిపించింది. హాంప్‌షైర్ కౌంటీలోని వించెస్టర్ నగరం నుంచి ససెక్స్‌లోని ఈస్ట్‌బోర్న్ దాకా ప్రకృతి నడుమన సాగే వందమైళ్ళ నడకదారి అది. ఆ దేశంలో నడక అంటే ఇష్టపడేవాళ్ళు పదిరోజులపాటు ఈ ట్రెయ్‌ల్‌లో నడవడానికి ఇష్టపడతారు అని అంతకు వారం క్రితం మేమంతా వించెస్టర్‌కు వెళ్ళినప్పుడు శేషగిరిగారు చెప్పిన సంగతి గుర్తొచ్చింది. వెంటనే ఆయనకు ఫోన్ చేసి నేను ఎక్కడున్నానో చూడండి అంటూ ఆ చెక్కఫలకాన్ని చూపించాను. మహా సంబరపడ్డాడాయన! మూడేళ్ళ క్రితం ఆయన ఆ వందమైళ్ళూ నడిచారు కూడానూ!

ముందుకు సాగాను. కొండ అన్న మాటేగాని అది ఎంతో సరళమైన బాట. జెంటిల్ స్లోప్. కాసేపు ఎక్కేసరికి దాదాపు సమతల ప్రదేశం… వెనకకు తిరిగిచూస్తే దిగువన కనిపిస్తోన్న ఈస్ట్‌బోర్న్ నగరం… పక్కన తోడుగా వస్తోన్న ఇంగ్లిష్ ఛానల్ జలాలు… మరోపక్కన అడపాదడపా కనిపించి పలకరించే బీచీ హెడ్ రోడ్డు… ఎదురుగా పచ్చికబయళ్ళు… మధ్యన కాలిబాట… బాటకు అటూ ఇటూ చిన్నపాటి పొదలు… వాటికి ఎర్రెర్రని పూలు… పేరేమిటో తెలియని పూలు – అయినా పేరులో నేమున్నది పెన్నిధి, ఏ పేరిట పిలిచినా గులాబీ పూవు వెదజల్లేదీ పరిమళమే కదా అనలేదూ ఆ ట్యుడోర్ కాలపు నాటకాల పెద్దాయన! అలాగే సుందరమైన ప్రతీదీ చిరకాలపు ఆనందహేతువు అని రెందొందల ఏళ్ళ క్రితమే చెప్పాడు కదా పాతికేళ్ళకే మరణించిన కీట్స్ మహాశయుడు – అంచేత పేర్లగురించి ఆతృత పడకుండా పూల సుకుమారత, నైసర్గిక సౌందర్యమూ మనసుకు పట్టించుకోవోయ్ అని బుద్ధి హృదయానికి సర్దిచెప్పింది. అయినా ఒకమాట – అక్కడ రెల్లుగడ్డి తుప్పలే తప్ప పెద్ద పెద్ద చెట్లన్న మాటే లేదు. అదే ఆ పరిసరాలకు ప్రశాంతతను, విలక్షణ శోభనూ సంతరించి పెట్టింది. నావరకూ నేను ఎన్నేన్నో ట్రెక్కులు చేశాను కానీ ఆ కొండల మీద ఆ రెండు గంటల నడక అందించిన శాంతి, సుఖం, సంతోషం మరి ఏ ఇతర ట్రెక్‌లోనూ లభించలేదని చెప్పగలను. మనసు దూదిపింజలా, బూరుగు విత్తులా మారి గాలిలో తేలియాడిన భావన.

కారణాలేమైనా ఆ సమయంలో నాతోపాటు నడిచే మనుషులే కనిపించలేదు. అయ్యో, ఇంత సౌందర్యమూ ఇంత సంతోషమూ వృధా అయిపోతోందే అనిపించింది. ఒకరిద్దరు కనిపించినప్పుడు ‘ఇంకా సెవెన్ సిస్టర్స్ ఎంత దూరం’ అంటూ ఊరికే వాళ్ళని మాటల్లో పెట్టే ప్రయత్నం చేశాను. అంతా స్పందించారు. ఒకాయన నా ఆనాటి ప్రయత్నపు వివరాలు విని – నువ్వనుకున్న సమయంలో సెవెన్ సిస్టర్స్ చేరుకోలేవు కాని, మరో అరగంట ముందుకు వెళితే మొట్టమొదటి తెల్లకొండ, దాని దిగువన ఒక చక్కటి లైట్ హౌసూ కనిపించే ప్రదేశం చేరుకుంటావు. నీ ప్రయత్నానికి సరి అయిన ఫలితం అక్కడ దొరుకుతుంది అని హితవు చెప్పాడు.

ఆ సలహా పాటించాను. నిమిషాల్లో బీచీ హెడ్ (Beachy Head) అన్న ప్రాంతం చేరుకున్నాను. అన్నట్టు బీచీ హెడ్ అన్న పదానికి మూలంలో సుందరమైన శిఖరం అని అర్థం అట. ఏదో ఫ్రెంచ్ పదం ఎన్నెన్నో అపభ్రంశాలకు గురై బీచీ హెడ్‌గా మారిందట. పేరుకు తగ్గట్టు అది ఎంతో చక్కని ప్రదేశం. ఆంగ్లపరిభాషలో చెప్పాలంటే అది ఒక ఏరియా ఆఫ్ ఔట్‌స్టాండింగ్ నాచురల్ బ్యూటీ. సుమారు ఐదు వందల అడుగుల ఎత్తు ఉన్న శిఖరం, దిగువన సముద్రతలం దాకా తెల్లని కొండచరియ, దానికి కాస్త దూరంలో సముద్రం మధ్యన ఓ రంగురంగుల లైట్‌హౌస్ టవరు, ఎదురుగా కనుచూపు మేరకు విస్తరించి ఉన్న సముద్రజలాలు – అవును, అది ఒక విలక్షణ సౌందర్యసీమ. మరి ఎంచేతనో అంత నిడుపాటి కొండ చరియ ప్రాంతంలోనూ దిట్టమైన కంచె కట్టి కనపడలేదు! అక్కడక్కడా కంచె తునకలు ఉన్నా అవి ఎవరూ పట్టించుకోని రక్షణ ఉపకరణాలే అనిపించాయి. అంతటి అజాగ్రత్తకు కారణమేమిటో!

మరో నాలుగడుగులు ముందుకు వేస్తే రెండో ప్రపంచ యుద్ధకాలపు నీలినీడలూ కనిపించాయక్కడ. అప్పట్లో ఆ ప్రదేశంలో ఓ రాడార్ స్టేషన్ ఉండేదట. ఇంగ్లిష్‌ ఛానల్‌ని దాటుకుని దాడికి వచ్చే జర్మన్ విమానాలను పసిగట్టే ప్రయత్నం చేసేదట. అలాగే, యుద్ధకాలంలో ఏర్పడిన రాయల్ ఎయిర్‌ఫోర్స్ బాంబర్ కమాండ్‌వారికీ ఈ బీచీ హెడ్ ప్రాంతం ఒక పురాజ్ఞాపక హేతువట. శతృవు మీదకు ఉరకలు వేస్తూ వెళ్ళే ఎయిర్‌మెన్ చూసే, చూడగల చిట్టచివరి యూకే భూభాగం ఈ బీచీ హెడ్ ప్రాంతం. అలా వెళ్ళినవారిలో ఎందరో తిరిగి రాలేదన్నది ఒక యుద్ధవాస్తవం. అలా తిరిగిరాని యాభై వేలమంది ఎయిర్‌మెన్ జ్ఞాపకార్థం అక్కడొక మెమోరియల్ నిర్మించారు.

ఆ ప్రాంతానికి బాగా దగ్గరలోనే, రోడ్డుకు ఆనుకొని బీచీ హెడ్ స్టోరీ అన్న పేరిట ఒక మ్యూజియమ్ భవనం కనిపించింది. కానీ అది పదీ పదిన్నరకు కానీ తెరవరు. ఆ ప్రాంతంలో తినడానికేమైనా దొరుకుతుందా అని తచ్చాడుతోంటే కారు పార్కింగ్ లాట్ లోంచి ఓ మలివయసు మహిళ వచ్చి పలకరించింది. ఏమీ దొరకవని చెప్పి తన బాక్‌పాక్ లోంచి ఒక బిస్కట్ పాకెట్ తీసి బహుకరించింది. ఇహ వెనకకు మళ్ళుతున్నానని విని ‘అయ్యో! మరో అరగంట నడిస్తే సెవెన్ సిస్టర్స్ కనిపించే బర్లింగ్ గాప్ అనే గ్రామం చేరుకోగలవు కదా, వెనకకు వెళ్ళడం ఎందుకూ’ అని వాపోయింది. నిజానికి నాకు ఇలాంటి గమ్యాలు చేరడం లోని సుఖాలూ సంతృప్తులకన్నా ఆయా గమనాలు కలిగించే సంతోషం మీదే ఎక్కువ గురి. బహుశా గమ్యాలూ లక్ష్యాలూ అంటే నాలో ఏదోమూల తెలియని విముఖత ఉందనుకొంటాను – చిట్టచివరి అంచెలను నిర్లక్ష్యం చేసి గమ్యాలు చేరకుండానే వచ్చేస్తూ ఉంటాను. ఏదేమైనా ఆరోజు నడకదారిలో గమనించీ గమనించకుండా వచ్చేసిన పొదలూ లతలు, వాటికి తోడు ఇటాలియన్ గార్డెనూ ఇంకా మిగిలి ఉన్నాయి కదా… వాటితోనూ మరికొంత సమయం గడపాలి కదా…

కొండ దిగువన ముందే గమనించి వెళ్ళిన ద కియోస్క్ రెస్టరెంట్‌లో అల్పాహారం కోసం కుదురుకున్నాను. అప్పటికే పది దాటేసింది. ఆరుబయట వేసిన టేబుళ్ళ దగ్గర పల్చగా కస్టమర్లు. ఆర్డర్లు తీసుకొనే వసారాలోకి వెళ్ళి మెనూబోర్డ్ చూశాను. అన్నీ ఇంగ్లిష్ వంటకాలు… నాకు పరిచయం లేనివి. శుభ్రంగా బ్రెడ్డూ ఆమ్లెట్టూ అడగొచ్చు కానీ ఆ చక్కని ప్రదేశంలో, ఇంకా చక్కని సమయంలో అలాంటి సాదాసీదా పదార్థాలు ఆర్డర్ చెయ్యడం సరైన పని కాదని అనిపించింది. అక్కడి యువతిని, ‘నేను కాస్త ఆకలిమీదే ఉన్నాను. కడుపు నిండేలాను, మీ ప్రాంతపు పదార్థాలు రుచి చూసేలానూ నువ్వే కాస్తంత ఎంపిక చేసి ఇవ్వగలవా’ అని అడిగాను. ఆమె అలానే అందించింది. అక్కడ చేరిన స్థానిక కస్టమర్లనూ వారి వేషభాషలనూ గమనిస్తూ అల్పాహారం ముగించాను.

తిరిగి హోటలుకు వెళ్ళేటప్పుడు దారిలో కనిపించి నేను చూసీ చూడకుండా ఒదిలేసిన ఇటాలియన్ గార్డెన్, బాండ్‌స్టాండ్‌లను మరికాస్త వివరంగా చూడాలన్న విషయం మర్చిపోలేదు. ఇటాలియన్ గార్డెన్ కన్నా ముందుగా హెలెన్ గార్డెన్ కనిపించింది. 1933లో హెలెన్ రీడ్ అన్న ఆవిడ ‘ఇక్కడ గడిపిన అనేకానేక మధురక్షణాల స్మృతిలో’ ఆ గార్డెన్‌కు రూపకల్పన చేసి పురప్రజలకు అంకితం చేసిందట. విశాలమైన ప్రాంగణం. ఓ క్లబ్ హౌసు, దిగువన ఉన్న సముద్రపు సుందర దృశ్యాలు… అయినా అప్పటిదాకా హద్దులెరుగని ప్రకృతిలో గడిపిన నన్ను ఆ హెలెన్ గార్డెన్ పెద్దగా నిలువరించలేకపోయింది.

ఆ పక్కనే ఉన్న ఇటాలియన్ గార్డెన్‌ది వేరే కథ. పేరుకు గార్డెనే కానీ వాస్తవానికి అది ఒక చిరు అడవి. నూటపాతికేళ్ళ వరకూ అక్కడ సున్నపురాయి వెలికితీత జరిగేదట. పర్యావరణ కారణాలవల్ల ఆ పనిని ఆపేసి 1905లో ఆ ప్రాంగణాన్ని గార్డెన్స్‌గా మలిచారట. ఓ కొండచరియలో కట్టిన ఆంఫిథియేటరు, దానిచుట్టూ ఆవరించి ఉన్న బాగా ఎదిగిన చెట్లు – అదో మాంత్రికప్రదేశం. చిన్న చిన్న కాలిబాటలు, పెద్ద పెద్ద చెట్లు, ఆ కొమ్మలూ రెమ్మల్లోంచి కనిపించే సముద్రం, నేను అక్కడ ఒక అరగంట గడిపేలా చేశాయి.

అప్పటికే ఎండ ఊపందుకొంది. అయినా సెప్టెంబర్ నెల కదా – వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంది. ఉదయం ఉండీలేనట్టు కనిపించిన మనుషుల జాడ ఆ పదకొండు గంటల సమయంలో ఇబ్బడిముబ్బడై కనిపించింది. మనుషులైతే పెరిగారు కానీ వారిలో చాలావరకూ పెద్దవయసువాళ్ళే! వర్కింగ్ డే అవటం వల్లనా? అదే అయి ఉండాలి. కాదు, అసలు ఆ ఊరే పెద్దవయసు వారి స్వర్గధామం అని తరవాత తెలిసింది.

కాసేపట్లో బ్యాండ్‌స్టాండ్ దగ్గరకు చేరాను. 1820లో కట్టారట. సముద్రం ఒడ్డునే ఎత్తయిన వేదిక. రెండు మూడు వందలమంది కూర్చొనే వసతి. మామూలు బ్యాండులే కాకుండా ఇతర సంగీత కచేరీలూ అక్కడ జరుగుతాయట. ప్రతీరోజూ సాయంత్రం ఏదో ఒక ప్రదర్శన ఉంటుందట. ఆ వాతావరణం నచ్చి ఆనాటి సాయంత్రం అక్కడే గడుపుదామని టికెట్లకోసం వాకబు చేశాను. బాక్సాఫీసు ప్రదర్శనకు ఓ గంట ముందుగా తెరుస్తారని చెప్పారు.


సోలో యాత్రల్లో నాకు ఎక్కువగా నచ్చే అంశం – నేను ఎదురు చూసే అనుభవం – నాకెవ్వరూ తెలియని, నన్నెవ్వరూ ఎరుగని ప్రదేశాలలో తిరుగాడగలగడం. ఇండియాలో తిరిగినప్పుడు కూడా ఈ అజ్ఞాతవాసానికి భంగం కలిగిన సందర్భాలు లేవు. ఇంగ్లండ్ దేశపు ఆగ్నేయసీమలో అలాంటి భంగం వాటిల్లడం నా ఊహకు కూడా అందని విషయం. కానీ ఆనాటి సాయంత్రం అదే జరిగింది. జరగడమేగాక నా యాత్రానుభవాల శిఖరపరంపరలో ఎన్నదగినదిగా ఆ సాయంత్రం జ్ఞాపకాలలో నిలిచిపోయింది.

ఉన్నట్టుండి తెలుగులో ఫోను: “మీరు ఇంగ్లండ్ వచ్చారని, ప్రస్తుతం ఈస్ట్‌బోర్న్ ప్రాంతంలో ఉన్నారనీ గమనించాను. ఇంకా ఊళ్ళోనే ఉన్నట్టయితే, మీకు అభ్యంతరం లేనట్టయితే సాయంత్రం ఓ గంటసేపు కలుద్దాం.” అవతలి వేపునుంచి పరుచూరి శ్రీనివాస్‌గారు. ఆయన గురించి నేను గత ఇరవై పాతికేళ్ళుగా వింటున్నాను. తెలుగు సాహిత్యమన్నా, భాష అన్నా, సంగీతమన్నా ఎంతో అభిమానమని తెలుసు. ఆ విషయాలలో ఆయన ప్రామాణికత తెలుసు. కొన్ని పత్రికల్లో అరుదుగాను, ఒక పత్రికలో క్రమం తప్పకుండానూ వస్తోన్న ఆయన వ్యాసాలు తెలుసు. ఆ వ్యాసాల నాణ్యత, ప్రాసంగికత, మన్నిక తెలుసు. దాదాపు ఇరవై ఏళ్ళక్రితం మద్రాసులో వి.ఎ.కె. రంగారావుగారింట్లో అనుకోకుండా శ్రీనివాస్‌ను కలిశాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఓ గంట విన్నాను.

“నేను యూకే వచ్చానని ఎలా తెలుసు? ఈస్ట్‌బోర్న్‌లో ఉన్నానని ఎలా ఊహించారూ?”

“జంపాల చౌదరి మొన్న వచ్చి వెళ్ళారు కదా – ఆయన చెప్పారు. ఈస్ట్‌బోర్న్ గురించి ఎఫ్.బి. చెప్పింది.”

“నేనింకా మీరు జర్మనీలో ఉంటున్నారనుకున్నానే…”

“2007లో యూకే వచ్చాం. ఇప్పుడు ఈస్ట్‌బోర్న్‌లో ఉంటున్నాం. ఉంటున్నానే కానీ యూకే, ఫ్రాన్స్, జర్మనీల మధ్య తరచుగా తిరుగుతూనే ఉన్నాను.” వివరించారాయన. సాయంత్రం నాలుగింటికి మా బర్లింగ్‌టన్ హోటల్‌కే కలవడానికి వచ్చారు.

నాకు తెలిసినంతవరకూ ఆయన పండితుడు. లక్ష్యాలను తానే నిర్దేశించుకొని వాటికేసి అటూ ఇటూ తొణకకుండా సాగిపోయే మనిషి. ఆయన లక్ష్యాలు, వాటి లోతులూ నాకు అందవని తెలుసు. అంచేత వాటి గురించి – వేటి గురించి అయినా – ఆయనతో చర్చించే శక్తి నాకు లేదు. మరి కలసినప్పుడు ఆ కలయికను ఎలా సార్థకం చేసుకోవాలి?

ఒక మార్గం ఎన్నుకున్నాను – వినడం. విని వీలయినంత వరకూ ఆకళింపు చేసుకోవడం. అర్థమయినా కాకపోయినా ఆయన మాటలతోటలో ఓ గంట గడిపితే ఆ పరిమళాలు నా మనసుకు పట్టవూ? ఆయన మాట్లాడతారు, నేను వింటాను. అవసరం అయినచోట ఒకటీ రెండు ప్రశ్నలు అడుగుతాను, అంతే.

ఈ పథకం ఫలించింది. బ్రిటిష్ రాజకీయాలు, సునాక్ ప్రధానమంత్రి అవడం; ఎకానమీ మందగించడం, ఆందోళనలో ఆర్ధికవ్యవస్థ; బ్రెక్సిట్ రోజుల్లో ప్రజలని మభ్యపెట్టిన యూకే నాయకులు; బ్రిటిష్ ఎకానమీ మీద ఆశతో 2014నాటి రిఫరెండమ్‌లో కలిసి ఉండటానికే వోటు వేసిన స్కాట్‌లండ్ వాసులు, తక్కిన మూడు దేశాలనూ – స్కాట్‌లండ్, నార్త్ ఐర్లండ్, వేల్స్ – ఏనాడో ఒత్తిడి తెచ్చి తనతో కలుపుకున్న ఇంగ్లండ్, ఇప్పటికీ కొనసాగుతున్నా ఆనాటి అసంతృప్తులు, న్యూనతలు; పెద్దవాళ్ళ విరామ స్థలంగాను, పిల్లల విద్యాకేంద్రంగానూ ఈస్ట్‌బోర్న్‌కున్న విశిష్టత; యూకేలో విదేశీ విద్యార్థులు ఎదురుకొనే సాధకబాధకాలు; తెలుగు కవిత్వం, సాహిత్యం, ప్రచురణ రంగం, సంగీతం – ఎన్నో ఎన్నెన్నో విషయాలు. ఆయన్ని అలా రెండు గంటలపాటు వినడమే సాటిలేని మేటి అనుభవం. అన్నట్టు నేను ఆ ఉదయం బీచీ హెడ్ దగ్గరకు వెళ్ళడం గురించి ఉత్సాహంగా చెప్పినప్పుడు “నిజమే, అది అందమైన ప్రదేశమే. కానీ ఆత్మహత్యలకు నిలయంగా దానికి అపఖ్యాతి కూడా ఉంది” అన్నారాయన. ఆ మాట విన్నాక అక్కడ ఉండీ లేని కంచెలు గుర్తొచ్చాయి. ఆత్మహత్యలు జరుగుతోన్నా అంత అజాగ్రత్త ఏమిటో బోధపడలేదు.


ఈస్ట్‌బోర్న్‌లో సమయమంతా సముద్రతీరాన్నే గడిపానని, లాంఛనంగా అయినా ఊళ్ళోకి అడుగు పెట్టలేదనీ తట్టింది. శ్రీనివాస్ వెళ్ళాక కాలు అటువేపు సారించాను. బయటకు వెళ్ళీ వెళ్ళగానే ‘టుక్‌టుక్ ఇండియన్ స్ట్రీట్ ఫూడ్’ అన్న రెస్టరెంట్ కనిపించింది. నాలుగడుగులు వేసేసరికి ‘మళయాళీ మదర్స్ క్విజీన్’ అంటూ మరో భోజనశాల. గ్రీక్ యీరోలు… అమెరికన్ మెక్ డానల్డ్స్, కెఎఫ్‌సి, స్టార్‌బక్స్ – సంస్కృతి సంగతి ఎలా ఉన్నా తిండితిప్పల్లో ఈస్ట్‌బోర్న్ అచ్చమైన కాస్మోపలిటన్ నగరం అనిపించింది. అప్పటికే చీకట్లు అలుముకోసాగాయి. మనుషుల ఒత్తిడి సన్నగిల్లసాగింది. సీగల్స్ హడావిడి మాత్రం ఏ అవధీ లేకుండా సాగుతోంది. షాపులు మెల్లిగా మూతపడసాగాయి. ఆ వాహనరహిత వీధుల్లో గమ్యమంటూ లేకుండా ఓ అరగంట తిరిగాను. బర్గర్ కింగ్ ఔట్‌లెట్‌లో ఆనాటి భోజనపు బాకీ తీర్చుకున్నాను. అక్కడి మానేజరు, కిచెన్ కౌంటర్ మనిషీ – ఇద్దరూ కేరళవాళ్ళు. కాసేపు వారితో కబుర్లు. రాత్రి ఎనిమిదిన్నర. మర్నాడు ఉదయం ఏడూ ఏడున్నరకల్లా బ్రైటన్ బస్సు పట్టుకోవాలన్నది నా ఆలోచన. వాకబు చేస్తే బస్సులు రైల్వే స్టేషన్ దగ్గర్నించే బయలుదేరతాయని తెలిసింది. ఆ ప్రదేశమూ చూసివద్దాం, రేపు తడబాటు లేకుండా ఉంటుంది అని అటు అడుగు వేశాను. అరగంటలో ముగిద్దామనుకొన్న పనికి గంటన్నర పట్టింది.  ముగియడానికి ముందు కాస్తంత డ్రామా కూడా నడిచింది.

రైల్వే స్టేషను, బస్సులూ ఆగే చోటూ చూసిన తర్వాత స్టేషనులోని వాతావరణం నన్ను ఆకర్షించింది. లోపలికి వెళ్ళాను. వెళ్ళి కాసేపు అక్కడ తిరిగాక నేను ఇంతకుముందు వచ్చిన దారినే కాకుండా మజెలన్ లాగా వ్యతిరేక దిశలో వెళ్ళినా సముద్రము, బర్లింగ్‌టన్ హోటలూ వస్తాయని మనసుకు తోచింది. స్థూలంగా ఆ దిశాజ్ఞానం సరి అయినదే కానీ ఎక్కడో తప్పటడుగు వేసి రైల్వేయార్డ్ ప్రాంగణంలోకి వెళ్ళిపోయాను. అంతే కాదు, వెళ్ళాక సెన్సర్ ఆపరేటెడ్ అయివుండాలి – గేటు నా వెనుక మెల్లిగా మూసుకుపోయింది. సాయం అడుగుదామంటే మనిషి జాడ లేదు. యాభై మీటర్ల దూరాన ఏదో కార్యాలయపు జాడ… దీపపు నీడలు… వెళ్ళి అక్కడ ఉన్న ఒకే ఒక్క మనిషితో నా గోడు చెప్పుకున్నాను. విన్నాక అతను గేటు తెరిచి బయటకు దారి చూపిస్తాడో, అధికారులకు అప్పజెప్పి మరిన్ని గేట్లు మూయిస్తాడో తెలియదు. నేను భయపడ్డట్టు ఆ ఉద్యోగి అధికారుల ప్రస్తావన తేలేదు. తానే నావెంట వచ్చి నా కొత్త మజెలన్ రూటులోనే నన్ను ముందుకు నడిపించి ‘ఇదిగో, ఈ బాట పట్టుకొని వెళ్ళు. సముద్రతీరానికి చేరతావు’ అని సాగనంపాడు. సముద్రపు ఆసరా దొరికితే బర్లింగ్‌టన్ చేరుకోవడం ఎంతసేపు! బతుకుజీవుడా! అనుకొని జాగ్రత్తగా హోటల్ చేరాను. అంత కష్టసమయంలోనూ చక్కని భవనాలు కనిపించినప్పుడు కెమేరా తన పని ఆపలేదు.


కొన్ని కొన్ని ఆశలకు అంతు ఉండదు. ఉండకూడదు.

సముద్రం ఒడ్డున ఆరు దశాబ్దాలుగా కొన్ని వందలసార్లు నడిచి ఉంటాను. తెల్లారీ తెల్లారకముందే సముద్రంతో ఊసులాడటం కూడా ఎన్నెన్నోసార్లు చేసి ఉంటాను. అయినా, ఆ ఉదయమే బ్రైటన్ బస్సు పట్టుకోవాలన్న ఒక కార్యక్రమం ఉన్నా – బర్లింగ్‌టన్ హోటల్ ఎదురుగా, కిటికీలోంచి పలకరిస్తోన్న సముద్రాన్ని నిర్లక్ష్యం చేయడం నాకు సాధ్యం కాలేదు. ఆరింటికల్లా సముద్రతీరం చేరాను.  ఓ పావుగంట పియర్ దాకా నడచివెళ్ళి – ఈ ఉదయం సూర్యోదయం అంత ఉత్తేజకరంగా ఉండేలా లేదులే అని – నన్ను నేనే సముదాయించుకొని తిరిగి రూముకు చేరాను.

రూముకు చేరిన వెంటనే బ్యాగు సర్దుకొని బయట పడదామనుకొన్నాను కానీ రిసెప్షన్ మిత్రబృందం ‘అదేమిటీ, ఒక్క పూటయినా మా రెస్టరెంట్ రుచులు చూడకుండా వెళతావా’ అని కోప్పడ్డారు. లొంగిపోయాను. తిండిపదార్థాల రుచులంటే పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చు కానీ ఆత్మీయతా మాధుర్యానికి ఎలా మోకాలు అడ్డు పెట్టగలం? రూము వదిలేసరికి ఎనిమిది దాటేసింది. మరో పావుగంటలో – తెలిసిన దారే కదా – గబగబా వెళ్ళి బస్సు పట్టుకోగలిగాను. ఈస్ట్‌బోర్న్ నుంచి బ్రైటన్ పాతిక మైళ్ళు. గంటా గంటంబావు ప్రయాణం.

అప్పటికే శేషగిరిగారి మార్గదర్శకత్వంలోను, నా అంతట నేనూ కొన్ని వందలమైళ్ళు యూకే రోడ్ల మీద తిరిగిన మాట నిజమే కానీ ఆనాటి ఉదయం ఆ పాతికమైళ్ళ ప్రయాణం వాటన్నిటికీ తలమానికం అనిపించింది. ఇప్పటికీ అనిపిస్తోంది.

బస్సు బయలుదేరిన నాలుగయిదు నిమిషాలకే పాతపట్నపు వీధుల్లోకి దారి తీసింది. ఆ దారులు షాపుల మధ్య ది లామ్ ఇన్ (The Lamb Inn) అన్న బోర్డు ఉన్న పెద్దపాటి పెంకుటిల్లు కనిపించింది. వివరాల్లోకి వెళితే అది ఒట్టి పెంకుటిల్లు కాదు – క్రీస్తు శకం 1180 నుంచీ కొనసాగుతోన్న అతిథిగృహమని తెలిసింది. ప్రస్తుతం అదో మూడు నక్షత్రాల హోటలు.  అది దాటీ దాటగానే ఏదో దృష్టిని ఆకట్టుకొన్ని పురాతన భవనం – చర్చి అనుకుంటాను. ఏదేమైనా ఆ చర్చి వందల ఏళ్ళక్రితం కట్టినదన్న మాట వాస్తవం.

మరి కాసేపట్లో బస్సు నగరాన్ని విడిచి అతిచక్కని దారిలో బ్రైటన్ వేపు పరుగు అందుకుంది. అటూ ఇటూ పచ్చదనమే కాదు – దూరాన వరుసలు వరుసలుగా సాగుతోన్న రోలింగ్ హిల్స్. అలా మరో పదినిమిషాలు గడిచేసరికి పరిసరాలు మారి మెట్టభూముల మధ్యగా బస్సు సాగింది. ఎడమవేపు చూస్తే దిగువన సముద్రం! ఇదే సెవెన్ సిస్టర్స్‌కు వెళ్ళే దారి అన్న సైన్‌బోర్డు… ఆ ప్రాంతం పేరు ఈస్ట్ డీన్ అట. నిన్న దాదాపు అక్కడిదాకా నడిచాను కదా. మరో పావుగంటలో సీఫోర్డ్ అన్న చిన్నపాటి పట్టణం. ఉదయపు లేలేత ఎండలో మెరుసున్న పురాతన భవనాలు… అందమైన పట్టణం. ఇంకాసేపటికి న్యూ హేవెన్ అన్న రేవు పట్నం.

ఈ న్యూ హేవెన్‌తో నాకు 1989నాటి చిన్నపాటి అనుబంధం ఉంది. లండన్ నుంచి పారిస్ తిరిగి వెళ్ళేటప్పుడు ఈ పట్నంలోనే ఓడ పట్టుకోవడానికి ఓ గంట ఆగాను. ఊళ్ళో తిరిగి చూసిందేమీ లేదు కానీ అప్పట్నించీ ఆ ఊరు పేరు నా జ్ఞాపకాల్లో నిలిచిపోయింది.

బ్రైటన్ మరో ఐదారు మైళ్ళు ఉందనగా బస్సు సాల్ట్ డీన్ అన్న శివారు పట్నం మీదగా సాగింది. నిజానికా పట్నం సముద్రతీరాన ఉన్న ఓ గుట్ట మీద ఉంది. ఆ గుట్ట అంచు మీద రోడ్డు… ఆ రోడ్డు మీదకు ఎక్కుతున్న బస్సు… గుట్టకు అలంకారంలా తెల్లని కొండచరియ… రోడ్డుకు అటువేపున విశాలంగా పరచుకొన్న సాల్ట్ డీన్ పట్నం… ఎదురుగా చూస్తే ఆకాశపు అంచులను తాకుతున్నామా అన్న భావన… రెక్కల బస్సు ఎక్కి దిగంతాలకు ఎగిరివెళుతోన్న అపురూప అనుభూతి. తొమ్మిదిన్నర ప్రాంతంలో బస్సు బ్రైటన్ చేరింది. రైల్వే స్టేషన్ దగ్గర మమ్మల్ని దింపింది.


బ్రైటన్ నేను అనుకున్నదానికన్నా పెద్ద ఊరు. సముద్రతీరం వెంబడే తూర్పు పడమరగా విస్తరించిన నగరం. గడుపుదామనుకున్నది మూడు నాలుగు గంటలు – ఒకరకంగా అంత తక్కువ సమయం గడపడం అంటే అది ఆ ఊరికి అన్యాయం చేసినట్లే.

ఎలాగూ స్టేషన్ దగ్గరే బస్సు దిగాను కదా అని రైళ్ళు చూడటానికి అటువైపు ఒక అడుగు వేశాను. అప్పటిదాకా మెట్రో స్టేషన్లు రైళ్ళే తప్ప నిఝం రైళ్ళను చూసింది లేదు. కాసేపు అక్కడి వాతావరణంలో గడిపి – ఎప్పుడూ రైలెక్కని వాడిలాగా – లండన్ తిరిగి వెళ్ళేప్పుడు రైలు పట్టుకుందామా అన్నంత ఉత్తేజం పొందాను.

ఊళ్ళో అనుకున్న నాలుగు గంటలూ ఎలా గడపాలీ అన్న విషయంలో నాకూ ప్రణాళిక అంటూ లేదు. ఏ ఆలోచనా లేకుండా కాళ్ళు ఎటువెళితే అటు వెళ్ళడమన్నదే నా ప్రణాళిక. ఎంత గమ్యం లేని నడకే అయినా దానికీ ఏదో ఒక దిశ అంటూ ఉండాలి కదా – గూగుల్‌ని సంప్రదించాను. తిన్నగా దక్షిణంగా వెళితే వెస్ట్ స్ట్రీట్ అని, ఊళ్ళోని ముఖ్య షాపింగ్ మార్గమనీ చెప్పింది. అది వెళ్ళి వెళ్ళి సముద్రతీరానికి చేరుస్తుందనీ చెప్పింది. ఆ వీధికి సమాంతరంగా రెండు మూడు వందల మీటర్ల దూరాన ఒకటీ రెండు కిలోమీటర్లు సాగిపోతున్న పచ్చని పేలిక కనిపించింది. మ్యాపును కాస్తంత పెద్దది చేసి చూస్తే అందులో రిచ్‌మండ్ స్క్వేర్, సెయింట్ పీటర్స్ చర్చ్, వాలీ గార్డేన్స్, విక్టోరియా గార్డెన్స్ అంటూ విభిన్న భాగాలున్నాయని తేలింది. యెస్! ఉన్న సమయంలో కాస్తంత వెస్ట్ స్ట్రీట్‌లోను, ఎక్కువ భాగం పచ్చని పేలిక దగ్గర, ఇంకాస్త భాగం సముద్రతీరాన, వీలయితే కొంత సమయం ఊరి రహదారిని వదిలి సందులూ గొందుల్లోనూ గడపాలనుకున్నాను. ఊరు కళకళలాడుతూ కాస్తంత సుందరంగాను, మరికాస్త హొయలు ఒలకపోస్తూనూ కనిపించింది.

ముందుకు సాగాను. క్షణాల్లో వెస్ట్ స్ట్రీట్ మీదనుంచి దృష్టి మళ్ళింది. అందుకు కారణం పక్కనే ఉన్న పచ్చని పేలిక అని తెలుసు. ఎడమకు మళ్ళి రిచ్‌మండ్ స్క్వేర్ చేరాను. అటు రోడ్డు, ఇటు రోడ్డు, నడుమన అరవై డెబ్భై మీటర్ల వెడల్పున హరిత నడికట్టు… అలా అది అంతా కలిసి రెండు మూడు కిలోమీటర్లు ఉన్నట్టుంది. చండీఘడ్ అసెంబ్లీ ప్రాంతంనుంచి సెక్టర్ 17లోని నగరపు ప్రధాన వ్యాపారకూడలి దాకా సాగివచ్చే లీజర్ వ్యాలీ గుర్తొచ్చింది. ఆ వ్యాలీలో నడకలు గుర్తొచ్చాయి. మళ్ళీ దశాబ్దాల తర్వాత ఈ బ్రైటన్ నగరంలో అలాంటి నడక.

చేరీ చేరగానే క్షణక్షణానికీ రంగులు మారుతూ పాలవెల్లువలా వివిధ పరిమాణాలలో నీళ్ళను ముద్దలు ముద్దలుగా ఎగజిమ్ముతున్న పెద్ద ఫౌంటెన్ కనిపించింది. దానిచుట్టూ సేదతీరడానికి చక్కని బెంచీల ఏర్పాటు ఉంది. పగటి పూటయినా అక్కడ చేరి విశ్రాంతి తీసుకుంటున్నవాళ్ళు కనిపించారు. ఫౌంటెన్ ఆకర్షించడం వల్ల కొంత, పొద్దుటినుంచీ రోడ్డు మీదే గడపడం వల్ల కలిగిన అలసట వల్ల కొంతా – అక్కడ ఒక బెంచీమీద జారగిలబడ్డాను. అప్పటికే అలవాటయిన పద్ధతిలో కనిపించినవారిని పలకరిస్తోన్న ప్రక్రియలో ఓ నడివయసు మనిషి ఒట్టి పలకరింపుతో సరిపెట్టకుండా పక్కన చేరి కుశలమడిగాడు. నా ప్రయాణపు వివరాలు విని తన ఊరు గురించి కాస్తంత సమాచారం అందించాడు.

ఇంగ్లండ్‌లోని పురాతన జనవాసాలలో బ్రైటన్ ప్రాంతం ఒకటట. తీరప్రాంతం అవడం వల్ల దక్షిణం నుంచి వచ్చే శత్రువుల తాకిడి బాగా ఉండేదట. తుఫానుల ఒత్తిడి సరేసరి. ఆధునిక యుగంలో రోడ్లూ రైళ్ళూ వచ్చాక లండన్‌కు చేరువుగా ఉన్న నగరంగా ప్రాముఖ్యం పెరిగిందట. జార్జ్ రాజుల పాలనాసమయంలో వారి ప్రాపకం నగరానికి బాగా లాభించిందట. “ఈ పార్కు అటుకొసన నాలుగో జార్జ్ విగ్రహం ఉంది, చూడు. ఇపుడు నగరంలో కనిపిస్తున్న ముఖ్యమైన భవనాలు, సముద్రంలోకి పియర్లూ ఆయన పాలనలో నిర్మించినవే. ఆయన అనేక నెలలపాటు లండన్ నుండి వచ్చి ఈ బ్రైటన్ లోనే ఉంటూ ఉండేవాడు. ఆయనకు ఈ ఊరంటే అంత ఇష్టం” అని చెప్పుకొచ్చాడా ఫౌంటెన్ మిత్రుడు.

పార్కు చివరిదాకా దక్షిణదిశలో సాగాను. ఆయన చెప్పినట్టుగానే ముందుగా క్వీన్ విక్టోరియా విగ్రహం, ఆ తర్వాత నాలుగో జార్జ్ విగ్రహం కనిపించాయి. మరి మన భారతదేశంలో కూడా 1910లో పట్టాభిషేకం చేయించుకున్న జార్జ్ చక్రవర్తి ఎవరూ అన్న ప్రశ్న వచ్చింది. గూగుల్‌ని అడిగాను. ఐదవ జార్జ్ అని సమాధానం చెప్పింది.

ఆ పొడవాటి విక్టోరియా గార్డెన్ ముగిసీ ముగియగానే రోడ్డుకు అటువేపున అనేకానేక భవనాలు ఉన్న ప్రాంగణం కనిపించింది. కాస్తంత సందేహిస్తూనే లోపలికి అడుగు పెట్టాను. ముందు అతి చక్కని పూలతోట కనిపించి పలకరించింది. ఎంతోమంది స్కూలు పిల్లలు పోగడి కనిపించారు. వాళ్ళ టీచర్లను అడిగితే అది అక్కడ మ్యూజియమ్ ప్రాంగణమని, పిల్లలంతా స్కూలు తరఫున దాన్ని చూడటానికి వచ్చారనీ తెలిసింది. నేనూ లోపలికి ఒక అడుగు వేశాను.

ప్రవేశద్వారం దగ్గరే విచిత్రమైన ఆకృతి, రంగురంగుల శరీరమూ ఉన్న బొమ్మ ఒకటి నన్ను నిలవరించి ఫోటో తియ్యమంది. తీశాను. మ్యూజియమ్‌లో మరింతసేపు తిరుగాడటానికి నా దగ్గర సమయమూ లేదు, ఆసక్తీ లేదు. ముందుకు నడిచాను. ఆ ప్రాంగణం పేరు రాయల్ పెవిలియన్ గార్డెన్ అట. భారతీయ వాస్తురీతి ఉట్టిపడేలా నిర్మించిన ఆ పెవిలియన్ నన్ను కాసేపు నిలువరించింది. అది నిజంగానే భారతీయ వాస్తురీతి ప్రేరిత కట్టడమట. అనేకానేక విషయాలలో కాలానికి ముందు నిలిచిన నాలుగో జార్జ్ చక్రవర్తి ఈ పెవిలియన్ నిర్మాణంలో భారతీయ శైలిని అనుసరించడం ద్వారా తన అభిరుచిని వ్యక్తపరిచాడట. అది చూశాక సరదా పుట్టి అక్కడి వలంటీరు యువతీయువకులతో ‘ఇదేదో మా భారతీయశైలిలో 1815లో కట్టారట గదా, మా శైలి వాడినందుకు ఇప్పుడు రాయల్టీ డిమాండ్ చేద్దామని వచ్చాను’ అని చతురాడాను. జోకు కాస్తంత పేలింది. వాళ్ళూ నవ్వారు.

మనసు సముద్రం మీదకు మళ్ళింది. ఆ ఉదయమే మా యూకే స్నేహితురాలు, వర్‌ల్డ్ ఫామిలీ అన్న ఫేస్‌బుక్ గ్రూప్ నిర్వాహకురాలూ అయిన షారోన్ బట్లర్ ‘అమరేంద్రా, నాకా సముద్రతీరపు గులకరాళ్ళు అంటే మహాప్రీతి. వాటినడిగానని చెప్పు’ అని మెసేజ్ పెట్టింది. మరి ఆమె సందేశం వాటికి అందించాలి కదా – వెళ్ళాను. నిజమే, అక్కడి తీరప్రాంతంలో ఇసక అన్నది లేదు – అన్నీ గులకరాళ్ళే! అదో విచిత్రం. అక్కడే బ్రైటన్ పాలెస్ పియర్ ఉంది – స్థూలంగా వింతలూ విశేషాల విషయంలో ఈ పియర్ ధోరణి నేను ఈస్ట్‌బోర్న్‌లో చూసిన పియర్ లానే ఉంది. ఒకే ఒక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నిలబట్టిన నిలువెత్తు ఆవు బొమ్మ. బొమ్మ పెట్టడమే కాకుండా ‘మా గోమాత తనతో ఫోటోలు దిగమని మిమ్మల్ని కోరుతోంది. ఆ ప్రక్రియలో తనమీద కూర్చోవద్దనీ హెచ్చరిస్తోంది’ అన్న బోర్డు ఒకటి తగిలించారు.

పియర్‌ను చూసీ ఒడ్డున ఉన్న గులకరాళ్ళను పలకరించీ బయటపడేసరికి పన్నెండు దాటేసింది. తిరుగు ప్రయాణం కోసం సన్నాహాలు మొదలుపెట్టవలసిన సమయం వచ్చింది. బస్సులు బయలుదేరేది ఎక్కడా అన్న పరిశోధన మొదలుపెట్టాను. నేను అంతకు ముందే చూసివచ్చిన విక్టోరియా గార్డెన్స్ దగ్గర అని తెలిసింది. టికెట్ రిజర్వ్ చేసుకుందామని వెళ్ళాను. స్టాప్ అదేగాని, అక్కడ బస్ సర్వీస్ వాళ్ళ ఆఫీసు కాని, టికెట్ కౌంటర్ కానీ లేవు. ఒకప్పుడు ఆ దగ్గరలోనే మ్యూజియమ్ ప్రాంగణం పక్కన ఆఫీసు ఉండేదని, ఏవో నిర్మాణాలు, మరమ్మత్తులు వంటి పునరుద్ధరణ ప్రక్రియల్లో వాటిని తాత్కాలికంగా మూసివేశారని, ఇప్పుడు టికెట్లు ఆన్‌లైన్‌లో కాని, వెస్ట్ స్ట్రీట్‌లో ఉన్న ఒకటీ రెండు ట్రావెల్ ఏజంట్ల ఆఫీసుల్లో కానీ బుక్ చేసుకోవాలని తెలిసింది.

ఆన్‌లైన్‌లో టకటకా టికెట్లు కొనడంలో నా నిరాసక్తత పుణ్యమా అని ట్రావెల్ ఏజంట్ ఆఫీసును వెతుకుతూ వెతుకుతూ వెళ్ళి బ్రైటన్ నగరపు పాతపట్నంలో పడ్డాను. ఇరుకాటి వీధులు, అందమైన వీధులు, శుభ్రమైన వీధులు – నన్ను బాగా ఆకర్షించాయి. అక్కడో అరగంట గడపాలన్న ఆలోచన, వెంటనే ఆచరణ… ఒక వీధిలో ఎంచేతనో ఎల్.జి.బి.టి. చాయలు పుష్కలంగా కనిపించాయి. కొన్ని కొన్ని షాపుల రంగులు, అలంకరణలు, వాడిన చిహ్నాలు నాకు అర్థమయ్యాయి. ఆ వీధుల్లో తిరగడం ముగించి ఓ కాఫీషాపులో సేద తీరుతున్నప్పుడు పక్కన కనిపించిన కాఫీ ప్రియుడితో ఆ విషయం ప్రస్తావించాను. నేను అనుకున్నది నిజమేనట. యూకే అంతటిలోనూ ఎల్.జి.బి.టి.లకు అత్యంత సానుకూలమైన నగరం బ్రైటన్ అట. అక్కడి యువతీ యువకులలో పదిశాతం మించి ఈ కోవకు చెందినవారట. ఆ ధోరణులను సహించడం, సమర్థించడం పుణ్యమా అని బ్రైటన్ నగరం యూకే దేశపు అనధికార ఎల్.జి.బి.టి. రాజధానిగా ఖ్యాతి సంచరించుకొందట.


నా ప్రయాణపు చివరి చరణం కూడా నా భ్రమణకాంక్షకు అనుగుణంగానే సాగింది. బ్రైటన్ నుంచి లండన్‌కు తిన్నగా వెళితే అరవై అయిదుమైళ్ళు. రెండున్నర గంటలు. నేను ఎక్కిన బస్సు నా అదృష్టం వల్ల తిన్నగా వెళ్ళకుండా గాట్విక్, హీత్రో విమానాశ్రయాలను పలకరించి మరీ విక్టోరియా కోచ్ స్టేషను చేరుకుంది. దానికి మరో ఇరవై మైళ్ళు, గంటన్నర సమయమూ అదనంగా పట్టాయి. అది నాకు సంతోషమే కలిగించింది. ఈ దూరాలూ ఆలస్యాలూ నా ప్రమేయం లేకుండా జరిగినవి. అంతా జరిగాక నేను ఐచ్ఛికంగా మరో ముప్పావు గంట నా ప్రయాణపు సమయానికి కలిపాను…

గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ఇండియన్ కుర్రాడు బస్సు ఎక్కాడు. చూడగానే పి.జి. కోసం మొదటిసారి యూకేలో అడుగు పెట్టిన మనిషి అని అర్థమయింది. కాస్తంత తత్తరపాటు కనిపించింది. పలకరించాను. ఢిల్లీకి దగ్గర్లోని రాజస్థాన్‌కు చెందిన ఆల్వార్ పట్నపు మనిషతను. కంప్యూటర్ సైన్సులో డిగ్రీ చేశాడు. న్యూకాసిల్ నగరంలోని యూనివర్సిటీలో అడ్మిషన్ సాధించాడు, వీసా కూడా తెచ్చుకున్నాడు కానీ చిన్న పట్నపు మనిషి అవడంవల్ల ఆ సంకోచం, బెరుకుతనం మొహంలో స్పష్టంగా కనిపించింది. న్యూకాసిల్‌లో ఎవరో తెలిసినవారితో మాట్లాడాడట. ‘లండన్‌లో బస్సు పట్టుకొని న్యూకాసిల్ రా, మేం రిసీవ్ చేసుకుంటాం’ అని ఆ తెలిసినవాళ్ళ అంటీముట్టని సలహా. విక్టోరియా స్టేషన్ దగ్గర మేమున్న బస్సు దిగి న్యూకాసిల్ బస్సు పట్టుకోవాలి. అక్కడి పద్ధతులు తెలియక – నేను ఐదు రోజులక్రితం తడబడినట్టు – తడబడితే ఏ అరగంటో గంటో ఆ కనెక్టింగ్ బస్సు పట్టుకోవడానికి వృధా అవుతుంది. అలా జరిగిన పక్షంలో దేశంకాని దేశంలో నగరంగాని నగరంలో అర్ధరాత్రి దిగుతాడు. మరిన్ని ఇబ్బందులు ఎదుర్కుంటాడు. రంగంలోకి దిగాను. బస్సు దిగగానే గబగబా సామాన్లు తోసుకుంటూ టికెట్ కౌంటర్ల వద్దకు తీసుకువెళ్ళాను. క్యూ పెద్దదిగా ఉంటే క్యూలోనివాళ్ళను బతిమాలి టకటకా టికెట్ ఇప్పించాను. పావుగంటలో న్యూకాసిల్ బస్సు ఎక్కించాను.

ఆ ప్రక్రియలో నేను మా హైగేట్ గూటికి చేరడం గంట లేటయింది. కానీ ఆ చిరుసాయం చెయ్యడం వల్ల కలిగిన సంతృప్తి నెలలు గడిచినా ఇంకా మిగిలే ఉంది.

(సమాప్తం)