ఊహలకందని మొరాకో -1

[యు.కె.కు చెందిన డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి ప్రపంచమంతటా పర్యటించిన వ్యక్తి. మనకు అంతగా పరిచయం లేని మొరాకో దేశంలో మూడు విడతలుగా మొత్తం ముప్ఫై రోజులు తిరుగాడారు. అందులోని పదహారు రోజుల 2021 నాటి మూడవ పర్యటన అనుభవాలు 9 భాగాలుగా ఈమాటలో డిసెంబర్ 2021 నుంచి ఆగస్ట్ 2022 వరకూ వచ్చాయి. ఈ ప్రచురణ స్ఫూర్తితో తన మొదటి (2014) రెండవ (2020) పర్యటనల అనుభవాలు కూడా రాశారు. దాసరి అమరేంద్ర వాటిని అనువదించారు. ఆ అనుభవాలను మూడు భాగాలుగా ఈమాట పాఠకులకు అందిస్తున్నాం. ఈ నవంబర్ 2022 సంచికలోనిది మొదటి భాగం – సం.]


అగాదీర్-స్వీరా-టెరూడెంట్

మొరాకో ఎప్పట్నించో నేను వెళ్ళాలనుకొంటున్న దేశం-నా కలల సీమ అనడం సబబు. నే వెళ్ళాలనుకునే దేశాల్లో అగ్రస్థాయిలో ఉన్న ప్రదేశమది. ఆ దేశంతో అసలైన పరిచయం ఏర్పడటానికి ముందే రెండు విషయాలు నా మనసులో గూడుకట్టుకొని ఉన్నాయి. అది ప్రపంచంలో అతి గొప్ప యాత్రికుడు ఇబ్న్ బటూటా జన్మస్థలం అయివుండటం మొదటి విషయం. నేను ఎప్పట్నుంచో ఎన్నెన్నో ఉత్తేజం కలిగించే కథలూ గాథలూ వింటోన్న మరాకేష్ (Marrakesh – అరబిక్‍లో మఱ్ఱాక్ష్) అన్న ఆ దేశపు విలక్షణ నగరాన్ని ఎలాగన్నా చూడాలనే కాంక్ష రెండో విషయం.

ఆ దేశం వెళ్ళాలని ఎప్పట్నించో ఉన్నా నిజంగా వెళ్ళడం మాత్రం ఎంతో అనుకోకుండా జరిగిపోయింది. 2014లో ఒకానొక ఫిబ్రవరి వారాంతాన మా హేమ ఏప్రిల్‍లో మొరాకో వెళుతున్న మన స్నేహితుల కుటుంబంతోపాటు మనమూ వెళదాం అని ఎంతో యథాలాపంగా ప్రతిపాదించింది. అది ఈస్టర్ పండుగ శెలవల సమయం. వెంటనే ఎస్సన్నాను. వాళ్ళతోపాటు మనకూ విమానం టికెట్లు తీసుకోమన్నాను. మరాకేష్ నగరం మన గమ్యంగా పెట్టుకొందాం అన్నాను. యాత్రికుల బృందాల్లో ఆ నగరం పేరు మారుమ్రోగుతూ ఉంటుంది కాబట్టి ఆమెకూ అదే మొట్టమొదటి ఎంపిక అవుతుందనుకొన్నాను. ఆవిడ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు అగాదీర్ (Agadir) అన్న ఊరికి టికెట్లు కొనేసింది. ఆ ఊళ్ళో సముద్రమూ బీచీ ఉన్నాయి గాబట్టి మా ఆరేళ్ళ కవలపాపలకు అది బాగా నచ్చుతుంది అన్నది ఆవిడ పాయింటు. మా స్నేహితులకూ చిన్నపిల్లలున్నారు గాబట్టి వాళ్ళూ అగాదీర్‌నే ఇష్టపడ్డారు. నిజమే, తండ్రులకన్నా తల్లులే తమ పిల్లల ఇష్టాయిష్టాల గురించి ఎక్కువ పట్టించుకొంటారు!

ఈ ప్రయాణ నేపథ్యంలో మొదటిసారిగా మొరాకో మ్యాపును అందిపుచ్చుకొని శ్రద్ధగా పరిశీలించాను. ఆ దేశం ఆఫ్రికా ఖండపు వాయవ్య దిశలో ఉంది. మధ్యధరా సముద్రానికి దక్షిణాన ఉంది. ఆ సముద్రం ఆవతల ఉన్న ఐరోపా ఖండపు స్పెయిన్ దేశానికి రాతివేటు దూరాన ఉంది. ఈ రెండు దేశాలను విడదీసేది సన్నపాటి జిబ్రాల్టర్ జలసంధి మాత్రమే.

అగాదీర్ మొరాకో దేశపు నైరుతి దిశలో అట్లాంటిక్ మహాసాగరం ఒడ్డున ఉన్న నగరం. ఆంటి-అట్లస్ (Anti-Atlas) పర్వతశ్రేణి ఆ నగరానికి దగ్గర్లోనే ఉంది. అటు మరాకేష్ నగరం మొరాకో దేశపు నడిబొడ్డున ఉంది. ఆ నగరపు దక్షిణాన అట్లస్ పర్వతాలు, ఆగ్నేయ దిశలో సహారా ఎడారి–నిజానికి అది ఉత్తర ఆఫ్రికా భూభాగమంతా తూర్పుపడమరలుగా విస్తరించి ఉన్న ఆ మహా ఎడారి పశ్చిమ కొస. మరాకేష్‌కు ఉత్తరాన మిడిల్ అట్లస్ పర్వతాలు, ఆ పర్వత ప్రాంతాల్లో ఫెజ్ (Fes), మెక్నెస్ (Meknes) నగరాలు. ఇంకా ఉత్తరానికి వెళితే రిఫ్ పర్వతశ్రేణి. మధ్యధరా సముద్రం వరకూ విస్తరించి ఉన్న పర్వతశ్రేణి అది. బాగా పేరున్న టాంజీర్ (Tangier), టెటువాన్ (Tetouan) అన్న నగరాలు మధ్యధరా సముద్రతీరాన ఉంటే, దేశపు రాజధాని రబాత్ (Rabat – ఱ్‍బాత్), అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కాసాబ్లాంకా (Casablanca), వాటితోపాటు స్వీరా (Essaouira – స్‍ఉఈరా) నగరం- అట్లాంటిక్ మహాసాగర తీరాన ఉన్నాయి.

అగాదీర్ గురించి బయటవాళ్ళకు తెలిసింది తక్కువ. అంచేత అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా బాగా తక్కువ. మొరాకో దేశంతో నా తొలి పరిచయం ఇలాంటి స్వచ్ఛమైన ప్రశాంత సీమలో జరగడం నాకు సంతోషం కలిగించింది. నిజానికి మనం టూరిస్టు గమ్యాలకు ఎంత దూరంగా ఉంటే ఆయా దేశాలూ ప్రదేశాల ఆత్మలకు అంత దగ్గర అవుతాం. విభిన్న సంస్కృతులకు నిలయాలయిన రబాత్, కాసాబ్లాంకా, టాంజీర్, మరాకేష్ లాంటి నగరాలకు తమదైన ఆకర్షణ ఉంటుందన్న మాట నిజమే. కానీ దేశపు మారుమూలలకు వెళ్ళి, శతాబ్దాల తరబడి తమ సరళజీవితాన్ని కొనసాగించే స్థానికుల్నీ వారి సంస్కృతినీ చూడటమన్నది అరుదైన అవకాశం. అంతగా బయటవారికి తెలియని ఆ ఊళ్ళు ఒకసారి లోపలికి వెళితే మనకు అందించే అనుభవాలు విలక్షణమైనవి.

మొరాకో దూరానికి కనిపించేంత చిన్నదేశమేం కాదు. గ్రేట్‌ బ్రిటన్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు వైశాల్యం; అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంతో పోలిస్తే పదిశాతం ఎక్కువ విస్తీర్ణత (ఉభయ తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే మొరాకో అరవై శాతం పెద్దది – అను.) మూడుకోట్ల అరవై లక్షల జనాభా. కాసాబ్లాంకా దేశంలోకెల్లా పెద్ద నగరమే కానీ రబాత్ ఆ దేశపు రాజధాని. మరాకేష్ దేశవిదేశాల టూరిస్టులను ఆకర్షించే నగరమే కానీ ఫెజ్ ఆ దేశపు సాంస్కృతిక కేంద్ర బిందువు.


మేం తీసుకున్న ఈజీ జెట్‌వాళ్ళ విమానం లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయం నుంచి బయల్దేరి నాలుగు గంటల్లో మమ్మల్ని అగాదీర్ చేర్చింది–యు.కె. నుంచి ఉత్తర ఆఫ్రికా మరీ అంత దూరమేం కాదు.

అగాదీర్ ఏడులక్షల జనాభా ఉన్న ఒక మోస్తరు నగరం. అక్కడి ఓడరేవులో కార్యకలాపాలు మహా చురుగ్గా సాగుతూ ఉంటాయి. ఈమధ్యే ప్యాకేజ్‍ టూర్లవాళ్ళ దృష్టి ఈ ఊరుమీద పడింది కాబోలు, సముద్రతీరం పొడవునా సరికొత్త ఘరానా హోటళ్ళు పుట్టుకొచ్చేశాయి.

మేమంతా ఇబెరోస్టార్ అన్న పెద్దపాటి రిసార్ట్ హోటల్లో దిగాం. ఎంపిక చేసుకోడానికి ఒకటికి నాలుగు రెస్టారెంట్లు, ఈతకొలనులూ ఉన్న హోటలది. ఆ హోటలు వెనకభాగం తిన్నగా సముద్రపుటొడ్డుకు దారితీస్తుంది. ఆ బీచ్‌లో నిలబడి చూస్తే మా హోటల్లాంటి పెద్దపెద్ద హోటళ్ళు కనీసం ఒక డజను ఆ పొడవాటి తీరరేఖ వెంబడి కొలువుదీరి కనిపించాయి. ఆ రెండు కిలోమీటర్ల మేరా టూరిజం బాగా వర్ధిల్లుతోన్న ఛాయలు… బహుశా వేలాదిమంది స్థానికులకు ఈ హోటళ్ళు ఉపాధి కల్పించి ఉంటాయి. కాస్తంత పరిశీలనగా చూస్తే అక్కడంతా ఉన్నది యూరోపియన్ వాతావరణమే! హోటళ్ళ సందళ్ళు దాటుకొని మరి కాస్త ముందుకు అడుగువేస్తే మనకు అసలు సిసలు మొరాకో కనిపిస్తుంది కాబోలు. తమ నిత్యజీవన స్రవంతిలో సాగిపోయే స్థానికులు తటస్థపడతారు కాబోలు…

మేముండబోయే వారం రోజులూ హాయిగా హోటల్లోను, దానినానుకునే ఉన్న బీచిలోనూ ఏ చీకూచింతా లేకుండా విశ్రాంతి తీసుకుంటూ గడిపెయ్యవచ్చు. కొంతమందికి అలా గడపడం ఇష్టమేమోగానీ నా వరకూ నాకు అలా సమయం గడిపెయ్యడం అన్నది సరిపడని పని. అందులోనూ అంత ఆసక్తికరమైన దేశానికి మొట్టమొదటిసారి వెళ్ళినపుడు అలా గడపడం అన్న ప్రశ్నే లేదు. కాస్తంత వాకబు చేసి మర్నాటికో సుదీర్ఘమైన డే ట్రిప్ ప్లాను చేశాను. మాలో కొంతమందిమి ఒక వాహనం మాటాడుకొని అక్కడికి 175 కిలోమీటర్ల ఉత్తరాన, మూడు గంటల దూరాన ఉన్న స్వీరా అన్న ఊరు వెళ్ళిరావాలన్నది మా ఆలోచన.

కుటుంబంతో సహా హాలిడేకి వెళ్ళినపుడు ఇలా ఉపయాత్రలు పెట్టుకోవడం కాస్తంత ఇబ్బందికరమైన పని. నా యాత్రా వర్ణపటంలో కుటుంబపు హాలిడేలు ఒక కొసన ఉంటే, ఒంటరిగా బ్యాక్‌పాక్ వేసుకుని వెళ్ళిపోవడమన్నది అవతలి కొసన ఉంది. భార్యాపిల్లలతో హాలిడేకి వెళ్ళడంలోని సంతోషాలు వేరు – ఇంటికీ ఇంటిలోని క్రమశిక్షణకూ దూరంగా పిల్లలతో అతిచక్కని సమయం గడిపి బాంధవ్యాన్ని పటిష్టపరచుకొనే అవకాశం ఈ యాత్రల్లో ఉంటుంది. అలాగే దగ్గరి స్నేహితులతో ఏ ఆటంకాలూ లేకుండా సన్నిహితంగా గడిపే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి బృందయాత్రల్లో వేరు వేరు సభ్యులకు వేరు వేరు అభిరుచులు ఉండే అవకాశం ఉంది. ఆ అభిరుచులన్నిటినీ సమన్వయపరచి ఒకే తాటిమీద నడపడం అన్నది నిజంగా ఒక పెనుసవాలు. అంచేత అలాంటి ప్రయాణాలు పెట్టుకొన్నపుడు ఆ ట్రిప్పులో ప్రతి ఒక్కరికీ ఆసక్తికలిగించే విషయం కనీసం ఒక్కటైనా ఉండేలా జాగ్రత్తపడతాను.


మర్నాటి ఉదయం ఏడుగంటలకల్లా మా డ్రైవర్ కమ్ గైడ్ ఖలీల్ హోటల్ లాబీకొచ్చేశాడు. అగాదీర్ నుంచి స్వీరా వెళ్ళేదారి అట్లాంటిక్ తీరానికి సమాంతరంగా సాగిపోతుంది. నీలిరంగు సముద్ర జలాల్లోంచి చొచ్చుకు పైకొచ్చే నిడుపాటి శిఖరాలు మా ప్రయాణం పొడవునా అతిచక్కని చిత్రమాలికల్లా తోడొచ్చాయి.

ఈ రెండు నగరాల మధ్య తటస్థపడే ప్రదేశం సముద్రం పక్కనే ఉందన్న మాటే గాని అది చాలావరకూ నీటి జాడ సోకని చవిటిభూమి. అయినా అక్కడక్కడ మైళ్ళ తరబడి విస్తరించి ఉన్న ఆర్గన్ చెట్లు మాత్రం కనిపించాయి. ఈమధ్య పాశ్చాత్య ప్రపంచంలో వంటల్లోనూ, అలంకరణ సామాగ్రి తయారీలోనూ ఆర్గన్ నూనె వాడకం ఎక్కువయింది. ఈ ఆర్గన్ ఆయిల్ అన్నది మొరాకో దేశానికే ప్రత్యేకమైన వస్తువు – ఇంకే దేశంలోనూ దొరకని పదార్థమది.

చూడ్డానికీ ఆర్గన్ చెట్లు నిండా ముళ్ళతో మన తుమ్మ చెట్లలా ఉంటాయి. మరికాస్త పచ్చగా ఉంటాయి. ఈ చెట్ల పైపైకి ఎక్కి ఆ చిటారు కొమ్మల మీద నిలబడి ఆకులు మేసే మేకల ఫోటోలు ప్రపంచమంతటా గుర్తింపు పొందిన చిత్రాలు. ఆ ఆర్గన్ చెట్ల ఆకులూ కాయలూ అక్కడి మేకల పౌష్టికాహారం. దారిలో ఒకటిరెండు చోట్ల ఆగి ఆ మేకల విన్యాసాలు తీరిగ్గా చూశాం. అక్కడి మేకల కాపరులు మా పాపలకి ఆ మేకల పిల్లల్ని అందించి, వాటిల్ని నిమిరి బుజ్జగించమని ప్రోత్సహించారు. మా పిల్లలకదో సంబరం.

ఈ ఆర్గన్ చెట్లకూ స్థానికంగా ఉండే మేకలకూ ఏదో అవినాభావ సంబంధం ఉందన్నది వాస్తవం. ఆ చెట్ల పళ్ళను తిన్న మేకలు వాటి గింజల్ని తమ పెంటికల ద్వారా దూర ప్రదేశాలకు చేరుస్తాయి. అక్కడివాళ్ళు ఆ పెంటికలు ఏరుకొని గింజలు సేకరిస్తారు. అలాగే మేకల్ని చిటారుకొమ్మల దాకా ఎక్కించి వాటి యజమానులు ఒకపట్టాన చేతికి అందని పళ్ళను చేజిక్కించుకొంటారు. అలా సేకరించిన పళ్ళను ఎండబెట్టి గింజల్ని తీస్తారు. ఆ గింజల్ని బద్దలుకొట్టి లోపలి మెత్తని భాగాన్ని వెలికి తీసే పనికి మహిళల్ని వినియోగిస్తారు. ఆ మెత్తని భాగాన్ని చితకగొట్టి రుబ్బి అందులోంచి తైలం పిండుతారు.

ఆర్గన్ ఆయిల్ ఉత్పత్తి అన్నది ఆ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న కుటీర పరిశ్రమ. స్థానికులంతా సహకార సంఘాలుగా ఏర్పడి పనిచేస్తున్నారు. మేము దారిలో అలాంటి ఒక సహకార సంస్థ దగ్గర ఆగాం. అక్కడి మహిళలందరూ గింజల్లోంచి తైలం తీసే పనిలో నిమగ్నులై కనిపించారు. రెండు రాతి పొత్రాల మధ్యకు గింజల్ని పంపి వాటిల్ని నూనె ఓడే ముద్దగా మలుస్తారు. ఆ ముద్దను గట్టిగా వత్తి నూనెను పిండుతారు. ఆ పనంతా చూడడానికి వచ్చే మాలాంటి సందర్శకుల్ని కూడా ఆ నూనె పిండే ప్రక్రియలో భాగస్వాముల్ని చెయ్యడం ఆ మహిళలకు ఆనందహేతువు.

ఆర్గన్ నూనెలో ఉండే వైటమిన్ ఇ చర్మానికి మంచిదట. అలాగే ఆ నూనెకు శరీరంలోని కొలెస్టరాల్‌ను తగ్గించే గుణముందట. అలంకరణ సామాగ్రి ఉత్పత్తిలోనూ ఈ నూనె ఉపయొగపడుతుందట. అంచేత ఈ ఆర్గన్ ఆయిల్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం లభిస్తోంది.


స్వీరా అన్నది ముచ్చటైన సముద్రతీర నగరం. ఆ నగరపు మూలాలు క్రీస్తు శకం అయిదో శతాబ్దాన్ని తాకుతాయి. పోర్చుగీసువారి ముఖ్యమైన వ్యూహాత్మకమైన వలస ప్రాంతమది. వాళ్ళు ఈ నగరాన్ని మొగడోర్ అని పిలుస్తారు. తెలుపూనీలాలు ఆ నగరపు ప్రముఖ వర్ణాలు. ఇళ్ళ గోడలన్నీ తెలుపురంగులో ఉంటే తలుపులు నీలిరంగువి. ఈ రంగుల సమ్మేళనం నగరానికి వింత శోభను సమకూరుస్తోంది. వచ్చేవారికి సాదర ఆహ్వాన స్ఫూర్తిని అందిస్తోంది. అక్కడి అల్లిబిల్లిగా అల్లుకొన్న సన్నపాటి సందుగొందుల్లో తిరుగాడటం గొప్ప సంతోషాన్ని కలిగించే విషయం. దారంతా చిన్నచిన్న దుకాణాల సముదాయాలు–పింగాణీ వస్తువులు, తోలుతో చేసిన వస్తువులు, హస్తకళాకృతులు, సుగంధ ద్రవ్యాలు, బహుమతి ఇవ్వడానికి సరిపోయే జ్ఞాపికలు–ఎన్నెన్నో వస్తువులక్కడ. వీధుల్లో స్థానిక రాగాలు, పాశ్చాత్య సంగీతమూ వాయించే వీధి కళాకారులు… వారిచుట్టూ చిన్నచిన్న గుంపులుగా శ్రోతలు.

అక్కడ విరివిగా కనిపించిన చిట్టిపొట్టి ఆర్ట్ స్టుడియోలు నన్ను ఆకట్టుకొన్నాయి. ఆ ప్రదేశం కళాకారుల, చిత్రకారుల స్వర్గధామం అనిపించింది. మొత్తానికి ఆ అట్లాంటిక్ సాగరతీర నగరం నాకెంతో నచ్చింది. అక్కడ గాలిలో అంతులేని స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు రెపరెపలాడుతున్నాయనిపించింది.

ఆ వంపులు తిరిగే సందుల్లో తీరిగ్గా సాగిపోయి చివరికి ఓ తేనెరంగు కోట భవనం పైకి చేరుకున్నాం. ఆ కోట ప్రహరీ గోడల దగ్గరకు చేరితే అతి చేరువలో నీలాల అట్లాంటిక్ సాగరజలాలు మిలమిలలాడుతూ స్వాగతం చెప్పాయి. అలా క్షితిజం దాకా సాగిపోయే జలాల నడుమన ఉన్న రంగురంగుల మత్స్యపు వేట బోట్లు ఆ దృశ్యపుటందాన్ని ద్విగుణీకృతం చేశాయి. అదే ఆనాటి మా నడకకు అంతిమ బిందువు. కోట రక్షణ కోసం గోడల్లో బిగించి ఉన్న బృహదాకారపు ఫిరంగులు మమ్మల్ని మధ్యయుగాలలోకి తీసుకువెళ్ళాయి. 1506లో నిర్మించిన ఈ కోట ఆనాటి పోర్చుగీసు వలసపాలకులకు ఎంత ముఖ్యమైనదో ఆ ఫిరంగులు చెప్పకనే చెప్పాయి. పదిహేనూ పదహారో శతాబ్దాలలో డచ్చి పోర్చుగీసు నౌకలు ఇండియాకు ప్రయాణం కట్టినపుడు ఈ అగాదీర్ పట్టణం దారి మజిలీగా వ్యవహరించింది. ఒక వెలుగు వెలిగింది.

అక్కడ వీస్తోన్న చల్లని పిల్లగాలి, కంటిముందు కదలాడుతోన్న తెలుపూ నీలం రంగులు, ఆ పరిసరాల్లో నెలకొని ఉన్న చింతలు లేని వాతావరణం మా శరీరాలనూ మనసుల్నీ ఉల్లాసపరిచాయి. అసలా కోట ప్రాంతాన్ని వదలాలనిపించలేదు. కానీ లంచ్ చేయాలి కదా… ఉదయం తిన్న ఘనమైన బ్రేక్‌ఫాస్ట్ పుణ్యమా అని ఎన్ని సందులూ గొందులూ తిరిగినా, మేడలూ కోటలూ ఎక్కినా, మధ్యాన్నం గడిచిపోతున్నా ఆకలి బాధ ఇంకా తల ఎత్తలేదు. అయినా లంచ్ చెయ్యడానికి దగ్గర్లో ఉన్న ఒక సీ ఫూడ్ రెస్టారెంటుకి వెళ్ళాం. సముద్రతీరాన ఉన్నప్పుడు సీ ఫూడ్‌ను మించిన భోజనం ఇంకేముంటుందీ? భోజనానికి ఆర్డర్ ఇచ్చేలోగా మా మగాళ్ళమందరం ఆ రెస్టారెంట్లో మింట్ టీ తాగుతూ రిలాక్సవుతోంటే ఆడవాళ్ళూ పిల్లలూ పరిసరాల్లో ఉన్న సువనీర్ షాపుల మీద దండయాత్రకు వెళ్ళారు.

అమెరికాలోని సియాటెల్‌కు చెందిన జిమ్మీ హెండ్రిక్స్ అన్న ఆఫ్రికన్-అమెరికన్ సంగీత కళాకారుడు ఈ స్వీరా నగరంలోనూ పేరుప్రఖ్యాతులు సంపాదించిన మనిషి అన్న సమాచారం మా డ్రైవర్-గైడు ఖలీల్ అందించాడు. ఇప్పటికీ హెండ్రిక్స్‌కి ఈ నగరంతో ఉన్న అనుబంధపు ఛాయలు మనకు కనిపిస్తాయి. ఆయన బొమ్మలూ చిత్రాలూ కథలూ గాథలూ మనకు కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఏది ఏమైనా ఆయన 1969లో ఇక్కడ కొంతకాలం గడిపాడన్నదీ, ఈ నగరాన్నీ ఈ ప్రాంతాన్నీ ఎంతో ఇష్టపడ్డాడన్నదీ నిర్వివాదం.

స్థానికుల కథనం ప్రకారం జిమ్మీ హెండ్రిక్స్ తన ఆఫ్రికా మూలాలను వెదుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చాడు. తనను తాను వెదుక్కుంటూ ఇక్కడికి చేరాడనాలి. ఆయనకీ ప్రదేశం ఎంతగా నచ్చిందంటె స్వీరాకు ఐదు కిలోమీటర్ల  దూరంలో ఉన్న దియాబత్ అన్న గ్రామాన్ని కొనేద్దామనుకొన్నాడట. 1960ల చివరి రోజుల్లో ఆ గ్రామం హిప్పీలకు ప్రసిద్ధి.


భోజనం ముగించాక మేవు మరికాస్త సమయం ఆ ఊరి ఓడరేవు ప్రాంతంలో తిరుగుతూ గడిపాం. ఆ ప్రాంతమంతా సీగల్స్ రెక్కల రెపరెపలతో నిండివుంది. మత్స్యకారులు ఆనాటి వేటను ఒడ్డుకు చేరుస్తున్నారు. రోడ్డుపక్క దుకాణాల్లో మండుతోన్న బొగ్గుల మీద సీఫూడ్ పక్వమవుతోంది. ఆ ప్రక్రియతో ఆ ప్రాంతాన్నంతా ఉడుకుతోన్న చేపల సువాసన అలముకొంది.
 
స్వీరా నగరాన్ని ఒక ఆరుబయలు మ్యూజియం అనడం సబబు. అక్కడ మనకు లభించగల చక్కని అనుభవం ఏమిటీ అంటే గమ్యమంటూ లేకుండా ఆ నగరపు వీధుల్లో గంటలతరబడి తిరుగాడటం, ఆ ప్రక్రియలో కాస్సేపు దారి తప్పి మనల్ని మనమే కోల్పోవడం. ఏ ఇతర ఆలోచనలకూ ఆస్కారం లేకుండా మనల్ని సేదదీర్చే ఆ వాతావరణం ఏ మనిషినైనా మత్తెక్కిస్తుంది. అక్కడ టీ దుకాణాల్లో చేరగిలబడి మరి ఏ ఇతర కలాపమూ లేకుండా ఆ పక్కనే సాగిపోతోన్న జీవనసరళిని గమనిస్తోన్న మనుషులు విరివిగా కనిపించారు.

అందమైన రోజు. అతిచక్కని నీలాకాశం. ఆహ్లాదకరమైన వాతావరణం. ఆడవాళ్ళూ పిల్లలూ ఆ నగరపు సోయగంలో మునిగితేలారు. అటూ ఇటూ తిరుగాడటం, అక్కడున్న అనేకానేక షాపుల్లో బేరసారాలు చెయ్యడం- నాకైతే అన్ని షాపులూ ఒక్కలాగానే అనిపించాయి. నేనామాట అంటే మా హేమ ఒప్పుకోలేదు. షాపుషాపుకీ చిన్నచిన్న బేధాలున్నాయి, అవి మీ మగబుర్రలకు బోధపడవు అనేసిందావిడ. వెంఠనే ఆ మాట ఒప్పేసుకొని ముందుకుసాగాను; ఇంకేమైనా వాదన పెంచితే షాపింగు విషయంలో నా ప్రావీణ్యహీనత బయటపడుతుందని తెలుసు.

అట్లాంటిక్ మహాసాగరంలోకి దిగిపోతూ సూరీడు విరజల్లిన బంగరు కాంతులు మా స్వీరా అనుభవాలకు మెరుగులు దిద్దాయి. చక్కనిరోజు మరింత చక్కగా ముగిసింది. ఈ నగరపు చారిత్రక సాంస్కృతిక విలక్షణత దానికి యునెస్కోవారి ‘ప్రపంచ వారసత్వ సంపద’ అన్న గుర్తింపును తెచ్చిపెట్టింది.


మేమున్న ఇబెరొస్టార్ రిసార్టు చక్కనిదనే చెప్పుకోవాలి. రాతివేటు దూరంలో సాగరతీరం ఉండటం దాని ప్రధానమైన సౌకర్యం, ఆకర్షణ. పొద్దున్నే బీచివెంబడి నడుస్తూ అట్లాంటిక్ సాగరం నుంచి వీచే తాజా గాలి పీల్చుకోవడమన్నది ఎంతో చక్కని అనుభవం. పిల్లలంతా బీచ్‌లో చేరి శ్రద్ధగా పిచ్చుకగూళ్ళు కట్టడంతో గంటల తరబడి గడిపారు. అడపాదడపా పెద్దపెద్ద అలలు వచ్చి ఆ గూళ్ళను పడదోసి వెళ్ళేవి. రాబోయే జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినపుడు ధైర్యం కోల్పోకుండా నిలబడి ఎదుర్కోవడానికి ఇవి తొలి పాఠాలా అనిపించింది. ఏదేమైనా బీచిలో ఆటలు, ఇసుకలో కోటలు, సావాసగాళ్ళతో కేరింతలు–బాల్యం ఇచ్చే చక్కని అనుభవాలు. ఈ అనుభవాలే రేపటికి మధుర స్మృతులుగా పరిణమించి జీవితాన్ని పరిమళభరితం చేస్తాయి. అలా పిల్లలు ఆటల్లో ప్రపంచాన్ని మరచి నిమగ్నమైపోవడం ఏ తలిదండ్రులకయినా అమిత ఆనందహేతువు. నా చిన్నతనం ఉత్తర తెలంగాణా ప్రాంతంలో గడిచింది. ఆ ప్రాంతానికి సముద్రం చాలా దూరం. అంచేత సముద్రతీరపు ఆటలు అన్నది మాకు అందని ఆనందం. పదమూడేళ్ళ వయసులో మొట్టమొదటిసారి స్కూలు ఎక్స్‌కర్షన్‌లో భాగంగా విశాఖపట్నం వెళ్ళి సముద్రం చూడటం నాకింకా గుర్తుంది. అది నాలాంటి సముద్ర దూర ప్రాంతం మనిషికి మరువలేని అనుభవం.

మా రిసార్ట్‌లోని ‘ఆంతరేస్ మొరాకన్’ అన్న రెస్టారెంటులో ఎంతో రుచికరమైన టజీన్‌లు లభించాయి. ఈ టజీన్ అన్నది మొరాకో దేశానికి ప్రత్యేకమయిన వంటకం. నిజానికి టజీన్ అన్న పదం ఆ వంటకం తయారీకి ఉపయోగించే శంకువు ఆకారపు మట్టి లేదా పింగాణీ పాత్ర పేరు. ఆ పాత్ర దిగువభాగం మట్టసంగా ఉంటుంది. అందులో ముఖ్యధాతువుతో పాటు కూరగాయలూ డ్రైఫ్రూట్సూ వేసి సన్నటి సెగమీద గంటల తరబడి వండుతారు. అలా ఉడికిన లేత మేకమాంసపు టజీన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి మొరాకన్ వంటకాలు ఇపుడు ప్రపంచమంతటా ప్రాచుర్యం పొందుతున్నాయి. కుస్‌కుస్ అన్నది మరో ముఖ్యమైన మొరాకన్ వంటకం. మొరాకన్ల ప్రధాన ఆహారమది. 

మా రిసార్టుకే చెందిన ‘మెర్క్యురీ బఫే’ అన్న మరో రెస్టారెంట్‌లో ఓనాడు తాజా ఆయిస్టర్లు కస్టమర్లకు అందించడం గమనించాను. ఇవి మన ఆల్చిప్పల్లాంటివి. ఈ ఆయిస్టర్లన్నవి ఖరీదైన వ్యవహారమనీ ఉన్నతశ్రేణి సీఫుడ్ రెస్టారెంట్లలో మాత్రమే వీటి సరఫరా ఉంటుందనీ అనుకొన్నాను. అవి మా రిసార్ట్‌లో ఒక బఫే భోజనంలో దొరుకుతాయని ఊహించనే ఊహించలేదు. ఈ తాజా ఆయిస్టర్లను ఎలా ఆరగించాలో ఆ విధానం నేను ఇంతకుముందు చదివి ఉన్నాను గానీ వాటిల్ని తినడమన్నది ఇంతవరకూ జరగలేదు. ‘అది మనకు సంబంధించని విషయంలే’ అనుకొన్నాను. వాటి రుచీ అదీ విచిత్రమైనవట. శ్రద్ధగా ఆ రుచిని మనం ఆవాహన చేసుకోవాలట.

అక్కడ బకెట్లకొద్దీ ఆయిస్టర్లను తీసుకువచ్చి డైనర్లకు అందించడం నన్ను బాగా ఆశ్చర్యపరిచింది. ఈ ఊరు దేశానికి పెడగా ఉంది గాబట్టి, సముద్రం పక్కనే ఉంది గాబట్టీ అక్కడ ఆయిస్టర్లు బాగా చవక కామోసు అనుకొన్నాను. ఏదేమైనా ఈ ఆయిస్టర్ల సరఫరా ఆ రిసార్ట్‌లో నిత్యకృత్యమట. స్థానికంగా అవి పుష్కలంగా దొరుకుతాయట. ఈ ఆయిస్టర్లను వండటమంటూ ఏమీ లేకుండా పచ్చిగా యథాతథంగా తినేస్తారు. ఆ పచ్చి ఆరగింపు ప్రక్రియను నేనొకపక్కన నిలబడి పరిశీలించసాగాను. కుప్పపోసిన ఆయిస్టర్లను అక్కడి మనిషి ఒకటొకటిగా తీసుకొని చిన్నపాటి చాకుతో వాటి పైడిప్పలను సుతారంగా తెరిచి, క్రింద డిప్పల్లోంచి ఆ మాంసపు తునకను విడదీసి, దానిమీద తాజా నిమ్మరసం పిండి కస్టమర్లకు అందిస్తున్నాడు. కస్టమర్లు ఆ డిప్పను పెదవుల దగ్గరకు చేర్చుకొని అందులోని మాంసపు తునకను జుర్రుకొని నమలకుండా మింగేస్తున్నారు.

దీన్నంతా పరిశీలిస్తున్న నన్ను గమనించాడా ఆయిస్టర్ మనిషి. ఉన్నట్టుండి జుర్రడానికి రెడీగా ఉన్న ఒక ఆయిస్టర్‌ను నా చేతిలో పెట్టి, ‘ఊ, తిను’ అని ప్రోత్సహించాడు. నేను బెరుకుబెరుకుగా చూశాను. పక్కనున్న మరో ఆయిస్టర్ భక్షకుడు ‘పర్లేదు, జుర్రుకో’ అన్నాడు.ఆ తెలిసీ తెలియని స్థితిలో దాన్ని నా పెదాల దగ్గరకు చేర్చి అందులోని పదార్థ విశేషాలను జుర్రేశాను. ఆ మెత్తటి ఉప్పటి జిగురు పదార్థం నా గొంతు లోపలికి దిగిపోయింది. ఆ అనుభవం అనుకొన్నంత ఇబ్బందికరంగా లేదు. జీవితంలో మొదటిసారి ఆయిస్టర్‌ను దిగమింగిన అనుభవాన్ని జీర్ణించుకొనే ప్రయత్నంలో నేను నిమగ్నమై ఉండగానే ఆ ఆయిస్టర్ మనిషి మరో ఆల్చిప్పను నా చేతికి అందించాడు. అది అవగానే మరొకటి- అలా నా ప్రమేయం లేకుండానే అరడజను మింగేశాక ‘ఇక చాలు’ అనగలిగాను. ఏదో బలహీన క్షణాల్లో ఆ మనిషి నా చేతిలో కుక్కినపుడు తిన్నానే గానీ నా అంతట నేను రెస్టారెంటుకు వెళ్ళి ఆయిస్టర్లను ఆర్డరు చెయ్యడమన్నది ఏనాడూ జరిగే పని కాదు. అలా అని అవి తిన్నందుకు విచారమూ లేదు. మొత్తమ్మీద అదో ఆసక్తికరమైన అనుభవం. తలచుకొంటే ఎంతో ప్రీతి కలుగుతోన్న అనుభవం.


అనాదినుంచీ మొరాకో ప్రాంతం స్థానికి బెర్బర్ తెగవారి నివాసభూమి. ఈ సంచార జీవులు ఆఫ్రికా ఖండపు వాయవ్య భాగంలో ఎప్పట్నుంచో ఉంటున్నారు. ఏడూ ఎనిమిది శతాబ్దాల్లో అరేబియా నుంచి వచ్చిన ఇస్లామిక్ గణాలు ఈ ప్రాంతాన్ని జయించినపుడు ఈ బెర్బర్లంతా ఇస్లామ్ ధర్మాన్ని స్వీకరించారు. మతాన్నయితే స్వీకరించారేగానీ తమ తరతరాల సంస్కృతినీ ఉనికినీ వారు కోల్పోలేదు. వాటిల్ని ఈ కొత్త ధర్మంతో మేళవించి తమదైన ప్రత్యేక ఇస్లామిక్ ధర్మాన్ని రూపొందించుకున్నారు.

టెరూడెంట్ (Taroudant) అన్నది అగాదీర్‌కు ఎనభై కిలోమీటర్లు పశ్చిమాన ఉన్న ప్రాకార సహిత పట్టణం. అది ఆ ప్రాంతపు వాణిజ్య కేంద్రం కూడానూ. మా ఖలీల్‌ను వెంటబెట్టుకుని ఆ ఊరికి మరో డే ట్రిప్పు వేద్దామని నిశ్చయించుకున్నాం. అంతా కలసి రెండుగంటల ప్రయాణం. పెద్దగా దూరం లేని మాట నిజమే గానీ ఆ దారంతా దుమ్మునిండిన గతుకుల రోడ్లు. దారిలో చిన్న చిన్న పల్లెల్ని దాటుకొంటూ ఆంటి-అట్లస్ పర్వతాలకేసి చేసే ఆసక్తికరమైన ప్రయాణమది. మా ఖలీల్ కాస్తంత ముభావి. కానీ నిన్నంతా కలిసి తిరిగాం కదా, మాతో కలసిపోయాడు, మాట విప్పాడు. మాకు మొరాకో అంటే ఎలాంటి కుతూహలం ఉందో అతనికి భారతదేశమంటే అలాంటి ఆసక్తి. ఇండియా అనగానే అది ఒక మార్మిక నిగూఢ ప్రదేశం అన్న భావన ప్రపంచమంతటా ఉంది. అక్కడ పుట్టి పెరిగాను గాబట్టి నాకు భారతదేశం మీద అలాంటి భావన ఉండే అవకాశం లేదు గానీ ఇతర ప్రాంతాల్లో ఇండియా కలిగించే వింత కుతూహలం నాకు బాగా పరిచయమే. ఖలీల్ కాస్తంత ఇంగ్లీషు మాట్లాడగలడు; అది మా సాధారణ సంభాషణలకు సరిపోతుంది. తనకు ఫ్రెంచి, అరబిక్, బెర్బర్ భాషలు కూడా వచ్చని చెప్పాడు. అరబిక్ అక్కడ అధికార భాష. ఫ్రెంచి భాష పట్టణాల్లో చదువుకొన్నవాళ్ళ భాష అట. గ్రామసీమల్లో బెర్బర్ భాషే చలామణి అవుతోందట.

దారిలో మాకు ఆర్గన్ చెట్లతో నిండిన చవిటి భూమి తటస్థపడింది. చిటారు కొమ్మల దాకా ఎక్కి ఆకులు మేసే మేకలు సరేసరి. అలా కొన్ని బెర్బర్ గ్రామాలు దాటుకొని వెళ్ళాక ఈతచెట్లతో నిండిన పచ్చని భూములు కనిపించాయి. పరిసరాల్లోని ఈ మార్పును గమనించిన ఖలీల్ మనం టెరూడెంట్‌కు దగ్గర్లో ఉన్నాం అని ప్రకటించారు. ఆంటి-అట్లస్ పర్వత పాదాల దగ్గర ఉన్న సూస్ (Souss) లోయలో ఉందీ టెరూడెంట్ పట్టణం.

ఆ ఊరుకు లిటిల్ మరాకేష్ అన్న ముద్దుపేరు ఉంది. ఊరుచుట్టూ బురుజులతో కూడిన తేనెరంగు రాతితో నిర్మించిన ప్రాకారం. అంతా కలసి ఏడు కిలోమీటర్ల చుట్టుకొలత. ముఖ్యస్రవంతికి దూరంగా ఉన్న ఆ చిట్టి పట్టణం, పెద్దగా మార్పుచెందని బెర్బర్ జీవనసరళికి దర్పణం పడుతోంది. అటు మరాకేష్ నగరం పర్యాటకుల ప్రథమ గమ్యం అయితే, ఇటు ఈ ఛోటా మరాకేష్‌కు టూరిస్టుల తాకిడి అంటేనే తెలియదు.

కోటగోడకున్న పెద్దపాటి దర్వాజాగుండా మేవు పట్టణంలోకి ప్రవేశించాం. ఆ ఊళ్ళో భవనాలన్నీ ఎరుపుఛాయగలవి. కోట గోడ తేనెరంగుది. అంచేత టెరూడెంట్‌కు ఎర్రపట్నం అన్న వ్యావహారికనామం ఉంది. ఆ గోడలు కట్టి అయిదువందల సంవత్సరాలు అయిందట. అప్పట్నించీ ఆ గోడ చెక్కుచెదరకుండా నిలచి ఉంది అని ఖలీల్ సగర్వ సమాచారం.

మాలో కొంతమందిమి ఆ కోట గోడల మీద నడవడానికి ఉపక్రమించాం. పైన బురుజులూ ఫిరంగుల టర్రెట్ల దాకా ఎక్కడానికి మెట్లున్నాయి. నిజమే- ఆ గోడ ఇప్పటికీ దృఢంగా గంభీరంగా నిలచి ఉంది. దానిమీద నడక ఆహ్లాదం కలిగించింది. గోడ పైనుంచి చూస్తే లోపల ఆకర్షణీయమైన మధ్యయుగాల నాటి వాతావరణం, వెలుపల ఆత్మ లోపించిన ఆధునిక కాంక్రీటు అరణ్యం – ఎంత తేడా! అనిపించింది.

ఈ టెరూడెంట్ కొంతకాలం మొరాకోకు రాజధానిగా వ్యవహరించింది. పదిహేనూ పదహారో శతాబ్దాలలో పాలించిన సాదియన్ ప్రభువుల రాజధాని ఈ టెరూడెంట్. అప్పట్లో వారి సామ్రాజ్యం మధ్యధరా సముద్రతీరం నుంచి సహారా ఎడారి దిగువ దేశాలయిన మాలి మారుటానియా వరకూ విస్తరించి ఉండేది. కొంతకాలం తర్వాత ఆ ప్రభువులు తమ రాజధానిని మరాకేష్‌కు తరలించారు.

మా ఖలీల్ కూడా టెరూడెంట్ బాగా పెడగా ఉండటం వల్ల టూరిస్టుల తాకిడి ఆ పట్టణానికి అంతగా లేదన్నాడు. టూరిస్టులు మరీ ఎక్కువగా వచ్చేస్తే అక్కడి వాతావరణం పాడయిపోతుందని అతని భయం. అదే సమయంలో వాళ్ళు అస్సలు రాకపోతే అక్కడివాళ్ళ జీవనోపాధికి గండిపడుతుందన్న చింత కూడా వ్యక్తపరిచాడు. ఫాస్ఫేట్ల ఎగుమతి తర్వాత మొరాకోకు అత్యధికంగా విదేశీ మారకద్రవ్యం సంపాదించి పెట్టే పరిశ్రమ టూరిజమేనట. వేలాదిమందికి ఉపాధి కూడా కల్పించగలిగిందీ టూరిజం. ఖలీల్ సిఫార్సు మేరకు షాల్-ఎ-సలామ్ అన్న రెస్టారెంటుకు లంచ్ చెయ్యడానికి వెళ్ళాం. మొరాకన్ రియాద్ బాణీ భవనంలో, లోపలి ప్రాంగణంలో అతిచక్కని పూల మడుల మధ్య నెలకొని ఉన్న ఆహ్లాదకరమైన ప్రదేశమది. అసలా భవనాన్నీ తోటల్నీ చూడ్డానికే అక్కడికి వెళ్ళొచ్చు. భోజనం సంగతి సరేసరి. ఈ మొరాకన్ రియాద్‌లు మనవైపు వెనుకటి రోజుల్లో కనిపించిన మండువా ఇళ్ళలాంటివి.

సాయంత్రం మేమంతా గుర్రపు బగ్గీ వేసుకుని నగర విహారానికి వెళ్ళాం. పిల్లలకీ పెద్దలకీ సంబరమే సంబరం. ఆ బండి మమ్మల్ని ఊరు చుట్టూ తిప్పింది. సంధ్యాసమయపు పసిడివర్ణంలో ధగధగ మెరిసే నగర ప్రాకారం, దూరాన లీలగా కనిపిస్తోన్న ఆంటి-అట్లస్ పర్వత శ్రేణిలోని హిమశిఖరాలు- చక్కని సాయంత్రమది.

ఆ తర్వాత రికామీగా ఊరి వీధుల్లో తిరుగుతూ, దుకాణాల్లో బేరసారాలు సాగిస్తూ గడిపి గడిపి చివరికి ఒక టీ దుకాణం దగ్గర స్థిరపడ్డాం. ఆ దేశంలో సర్వం తానే అయి కనిపించే మింట్ టీని ఆస్వాదించాం. బహుశా ప్రపంచంలో కెల్లా అత్యధికంగా మింట్ టీ సేవించే దేశం మొరాకోనే అయివుండాలి. అక్కడివాళ్ళంతా రోజూ ఎన్నో కప్పుల మింట్ టీ తాగడం నేను గమనించాను.

ప్రాకారం లోపలి ఊళ్ళో సందడే సందడి. ప్రతి కూడలిలోనూ జీవం ఉట్టిపడే జనచైతన్యం. పాములనాడించేవాళ్ళు, మాయలు చేసేవాళ్ళు, దుకాణాలు, టీషాపులు, సుందరమైన మసీదులు, ఇరుకాటి సందులు- ఉత్తేజకరమైన వాతావరణమది. బెర్బర్ సోక్ అన్నది అక్కడ ప్రఖ్యాతి పొందిన దుకాణ సముదాయం. లోపలికి వెళితే ఆకట్టుకొనే మధ్య యుగాల మార్మిక వాతావరణం. ఆ పాత పట్నమంతా గుర్రపు బగ్గీలే ఏకైక రవాణా సాధనం.


పారడైజ్ వ్యాలీ అన్న ప్రదేశం అగాదీర్‌కు గంట ప్రయాణంలో ఉంది. అట్లస్ పర్వతాల నడుమ ఉన్న సారవంతమైన సుందర లోయ అది. అక్కడికి మరో డే ట్రిప్ పెట్టుకున్నాం.

ఆ కొండదారుల్లో తిరగడానికి అనువుగా ఒక ఫోర్‍వీల్ డ్రైవ్ వాహనం తీసుకుని ఖలీలూ అతని సహచరుడూ మా రిసార్టుకు వచ్చారు. వెంటనే బయల్దేరాం. దారిలో రెండు మూడు వ్యూపాయింట్ల దగ్గర ఆగి ఆ కనిపించే సువిశాల దృశ్యాలను మనసులో నింపుకున్నాం. థమ్రాట్ అన్న నది ఆ లోయ నడుమగా ప్రవహిస్తోంది. నదికి రెండువైపులా పచ్చదనం.

ఆ లోయ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. రాళ్ళ మధ్య అతినీల జలాలతో నిండిన చిన్నచిన్న కొలనులు చాలా కనిపించాయి. అవేగాక అక్కడక్కడ జలపాతాలు… ఎన్నెన్నో పామ్ జాతి వృక్షాల తోటలు… లోతు అంతగా లేని నదీగర్భంలో ప్లాస్టిక్ కుర్చీలూ టేబుళ్ళూ వేసివున్నాయి. మడమల లోతు నీరు పారుతూ ఉండగా ఆ కుర్చీలలో చేరి టీ తాగే కస్టమర్లు సేద తీరడానికి చేసిన ఏర్పాటది. వాటికి రూపకల్పన చేసినవారి సృజనాత్మకత నన్ను అబ్బురపరచింది. అక్కడి స్థానికుడొకతను వచ్చి టీ తాగి వెళ్ళండి అని మమ్మల్ని ఆహ్వానించాడు. సందేహిస్తూనే వెళ్ళి చెప్పులూ బూట్లూ విడిచిపట్టుకొని ఆ కుర్చీల్లోకి చేరాం. నీళ్ళల్లో కాళ్ళుపెట్టి ఆ ఆనందాన్ని ఆస్వాదించాం. నీళ్ళల్లోకి అడుగుపెట్టడానికి మా పెద్దాళ్ళం సందేహించామే గానీ పిల్లలంతా కేరింతలు కొడుతూ దిగిపోయారు. మేం కూర్చున్న చోటికి అటూ ఇటూ నిడుపాటి కొండచరియలు… ఆ చరియల్లో పొరలు పొరలుగా పెద్ద పెద్ద చదునైన బండరాళ్ళు- కళ్ళార్పనీయలేదా ప్రదేశం.

ఆ లోయలో అటూ ఇటూ చిన్నపాటి ట్రెక్కులు చేశాం. అక్కడ ఎడతెగకుండా వినిపిస్తోన్న పక్షుల కలకూజితాలు నన్ను ఆకర్షించాయి. మాతోపాటు ఒక పక్షిశాస్త్ర నిపుణుడు కూడా ఉండి ఉంటే ఎంత బావుండేదో అనిపించింది. ఈ ప్రాంతంలో 1960ల చివరిలో కొంతకాలం గడిపిన జిమ్మీ హెండ్రిక్స్ ఈ లోయకు పారడైజ్ వాలీ అని నామకరణం చేశాడని చెప్పాడు మా ఖలీల్. ఈ లోయలలో ఒకరోజు గడపగలగడం మా అగాదీర్ రిసార్టులో ఉండీ ఉండీ బీచిని చూసీ చూసీ కలిగిన విసుగుకు విరుగుడుగా పనిచేసింది.


మా స్నేహితులు వెళ్ళిపోయాక మేము మరో రోజు అగాదీర్‌లో ఉండిపోయాం. ఆ అదనపు రోజును ఆసక్తికరంగా మలచమని ఖలీల్‌ను అడిగాను. ‘ఆ సంగతి నాకు వదిలెయ్యండి. రేపు ఉదయం ఎనిమిదికల్లా రెడీగా ఉండండి’ అన్నాడు ఖలీల్. ‘ఒంటె సవారీకి తీసుకువెళతాను. పిల్లలు బాగా ఇష్టపడతారు’ అని ఊరించాడు. మరీ బిగుతైన బట్టలు వేసుకోవద్దని సలహా ఇచ్చివెళ్ళాడు.

మర్నాటి ఉదయం ఖలీల్ వచ్చి మా అందర్నీ అగాదీర్ శివార్లలో ఉన్న ఒక చిన్నపాటి బెర్బర్ గ్రామంలోని ఒంటెల శిబిరం దగ్గరకు తీసుకువెళ్ళాడు. మేవు రెండు ఒంటెల మీద ఎక్కాం- ఒక్కోదాని మీద ఒక పాప, ఒక ఎదిగిన మనిషి- వెరసి రెండు. ఆ ఒంటెలు ఎంతో స్నేహశీలంగా ఉన్నాయి. ఆకాశమంత ఎత్తుండే ఒంటెల మూపురం మీద కూర్చుని అటూ ఇటూ కాళ్ళు వేలాడేసి అలా ఉండిపోవడమన్నది అలవాటు లేనివాళ్ళకి కాస్తంత అసౌకర్యం కలిగించే అనుభవం. దానికి పిల్లలు క్షణాల్లో అలవాటు పడిపోయారు గానీ మాకు కొద్దిసేపు పట్టింది. చుట్టూ కనిపిస్తోన్న గ్రామీణ వాతావరణం ఎంతో ఆసక్తిదాయకంగా ఉంది. దారి బాగా తెలిసిన ఆ ఒంటెల ద్వయం గ్రామపు కాలిబాటలు దాటుకొని దాపున ఉన్న తుమ్మచెట్ల వనంలోకి ప్రవేశించింది. ఓ గంట అలా ఎడారి ఓడల మీద విహరించాక స్థానికుల సాయంతో ఖలీల్ మాకు బెర్బర్ బ్రెడ్, మింట్ టీ ఏర్పాటు చేశాడు.

ఒంటెల విహారాలు ముగిశాక ఖలీల్ మమ్మల్ని అగాదీర్‌లోని బెర్బర్ దుకాణానికి తీసుకువెళ్ళాడు. మరోసారి అక్కడ అంతగా ఖరీదుగాని ఆభరణాలూ జ్ఞాపికలూ కొనుక్కున్నాం. ఆ తర్వాత అక్కడి చక్కని రెస్టారెంటుకు వెళ్ళి నింపాదిగా భోజనం చేశాం. నేను మరోసారి వేటమాంసపు టజీన్ తిన్నాను. మరో కారణం ఉన్నా లేకపోయినా ఈ టజీన్లు తినడానికైనా మొరాకో దేశం మరోసారీ మరోసారీ రావొచ్చనిపించింది.

అగాదీర్‌లోని కొండమీది కోటలో మరికాస్త సమయం గడిపి ఊరుకు వీడ్కోలు చెప్పే ప్రయత్నం చేశాం. వ్యూహాత్మక స్థానంలో ఉన్న ఆ కోటకు అయిదువందల సంవత్సరాల చరిత్ర ఉండటమేగాకుండా వర్తమానంలోనూ పర్యాటలకులను ఆకట్టుకొనే శక్తి పుష్కలంగా ఉంది. అక్కడ్నించి చూస్తే ఒక పక్క సముద్రం, మరోపక్క దిగువున అగాదీర్ పట్టణం, సుదూరాన ఆంటి-ఆట్లస్ పర్వతాలు – చక్కని దృశ్యమాలికలవి. నాకు తెలియకుండానే నాకు మొరాకో దేశంతో అనురాగబంధం ఏర్పడిపోయింది. మళ్ళీ మొరాకో తప్పక వస్తాను అని నాకు నేనే వాగ్దానం చేసుకున్నాను. ఆ వాగ్దానం ఒట్టిమాటగానే ఉండిపోలేదు, తర్వాత ఎనిమిదేళ్ళ వ్యవధిలో మరో రెండు సార్లు మొరాకో దర్శించి మొత్తం 30 రోజులు గడిపాను. దేశపు నలమూలలా కలదిరిగాను.

కానీ రెండోసారి మొరాకో వెళ్ళడానికి ఐదేళ్ళు పట్టింది. కోవిడ్ మహామహమ్మారి ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోడానికి కొద్దిరోజులు ముందు నా రెండో మొరాకో యాత్ర జరిగింది. ఆ మరుసటి ఏడాది మూడో ప్రయాణం చేశాను.

(సశేషం)