మనమెరుగని మధ్య అమెరికా 1

ఆంతీగా గ్వాతెమాల

‘అమెరికా’ అన్న పదాన్ని సాధారణ అర్థంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వర్తించేలా మనం వాడతాం; ఆ దేశపు పౌరుల్ని అమెరికన్లు అంటాం. కానీ ఆ పదానికి అంతకన్నా విస్తృతమైన అర్థం ఉంది. వాస్తవానికి ఆ భూభాగంలో రెండు ఖండాలున్నాయి: ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. మళ్ళా ఒక్కో ఖండంలోనూ చిన్నవీ పెద్దవీ ఎన్నో దేశాలున్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ దేశాలు అన్నిట్లోనూ నివసించేవాళ్ళు అమెరికన్లే – మనం ఏషియన్లు, ఆఫ్రికన్లు, యూరోపియన్లు అనడం లేదూ? అలా అన్నమాట.

ప్రపంచపటం చూసినట్టయితే ఆ రెండు ఖండాలనూ కలుపుతూ ఓ సన్నపాటి నడుమభాగం మనకు కనిపిస్తుంది. పైన స్థూలకాయుడిలా ఉండే ఉత్తర అమెరికా, దిగువున అంతే స్థూలంగా కనిపించే దక్షిణ అమెరికాలను కలుపుతూ సన్నపాటి పేలికలా కనిపించే ఆ భూభాగాన్ని సెంట్రల్ అమెరికా అని వ్యవహరిస్తూ ఉంటారు. సాంకేతికంగా చూస్తే అది ఉత్తర అమెరికాకు చెందిన భూభాగమే అయినా ఆ ప్రాంతానికి తనదంటూ ఒక భౌగోళిక ప్రత్యేకత ఉంది. ఆ భాగంలో ఏడు దేశాలు ఉన్నాయి: గ్వాతెమాల (గ్‌ఉఆ. Guatemala), బెలీౙ్ (Belize), ఓందూరాస్ (Honduras), ఎల్ సల్బదోర్ (El Salvador), నికరాగ్వా (గ్‌ఉఆ. Nicaragua), కోస్తా ఱీక (Costa Rica), పనమా (Panamá) – అంతా కలసి ఏడు దేశాలు. ఈ ఏడు దేశాల ఉమ్మడి జనసంఖ్య ఐదు కోట్ల ముప్ఫై లక్షలు.


మధ్య అమెరికా గురించి నాకు తెలిసింది నామమాత్రమే. అయినా ఆ ప్రాంతమంటే ఎంతో ఆసక్తి మాత్రం నాలో ఎప్పట్నుంచో గూడు కట్టుకుని ఉంది. ఉభయ అమెరికా ఖండాల్లో కూడా ఈ సెంట్రల్ అమెరికా దేశాల గురించి అవగాహన అతి స్వల్పం. అక్కడికి వెళ్ళేవాళ్ళు తక్కువ – ప్రపంచంలోకెల్లా అతి తక్కువమంది యాత్రికులు తిరుగాడే ప్రదేశం అది. నేరాల పుట్టలుగా, రాజకీయ అవ్యవస్థ దిట్టలుగా, నియంతల కంచుకోటలుగా, మాఫియా ముఠాలకు స్వర్గసీమలుగా, సైనిక తిరుగుబాట్లకు కేంద్రబిందువులుగా అక్కడి దేశాలు అపార అపఖ్యాతిని గడించాయి. యాత్రికులకు వెంపరం కలిగించే ఖ్యాతి అది. కానీ నాబోటి యాత్రికుల్ని ఆ అవలక్షణాలే ఆకర్షిస్తాయి కాబోలు – ఆ అపఖ్యాతుల అగాధాలలో యాత్రానుభవాల గుప్తనిధులు దాగి ఉండాలి అని నాకు అనిపించింది. ప్రయత్నం చేసి ఆ నిధులను స్వంతం చేసుకోవాలనుకున్నాను.

అనాదికాలపు మాయన్ నాగరికతకు కేంద్రబిందువు ఈ మధ్య అమెరికా. ఆ ప్రాంతాల్లో కొలంబస్ రాకకు పూర్వం నుంచీ ఉంటున్న స్థానిక ప్రజానీకం మనకు కనిపిస్తుంది. యూరోపియన్ల ప్రభావానికి గురికాని అలనాటి సంప్రదాయాలు, జీవనసరళీ కనిపిస్తాయి. నన్ను మధ్య అమెరికా దేశాలకు వెళ్ళమని ప్రేరేపించిన ముఖ్యకారణం ఇది. అంతేగాకుండా వలస పాలకులు స్థాపించిన ముచ్చటైన పట్టణాలు, నిప్పులు చిమ్మే అగ్నిపర్వతాలు, కంటికి ఆహ్లాదం కలిగించే సుందర తటాకాలు – ఎటు చూసినా ప్రకృతి. చూడదగిన ప్రదేశమది. మాయన్ నాగరికత ఇదివరలో విలసిల్లిన ప్రదేశాల శిథిలాలూ విరివిగా కనిపించడం సరేసరి.

సెంట్రల్ అమెరికా ఉత్తరభాగాన ఉన్న గ్వాతెమాల దేశంలో మొదలెట్టి దక్షిణాన ఉన్న పనమా దేశం దాకా తిరుగాడడానికి 2022 అగస్ట్-సెప్టెంబర్ నెలల్లో 19 రోజులు కేటాయించాను. మొదటి రోజున లండన్ నుంచి న్యూ యార్క్ మీదుగా ఆంతీగా (Antigua) గ్వాతెమాల సిటీ చేరడానికి, పంతొమ్మిదవ రోజున పనమా సిటీనుంచి లండన్ తిరిగి రావడానికీ మాత్రం విమానం టికెట్లు తీసుకున్నాను. మిగిలిన ప్లానింగ్ అంతా ఏరోజుకు ఆరోజే చేద్దామనుకున్నాను – మర్నాటి రాత్రి ఎక్కడ ఉండాలి, ఎలా గడపాలి అన్నవి ఎప్పటికప్పుడూ తీసుకోవలసిన నిర్ణయాలుగా వదిలేశాను. ఎక్కడైనా ఒకరోజు ఎక్కువ గడపాలన్నా, తక్కువ గడపాలన్నా ఈ పద్ధతి ఎంతో సాయపడుతుంది. అలాగే వీలయినంతవరకూ నా ప్రయాణాలకు చికెన్ బస్సులనే అక్కడి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మీదే ఆధారపడాలన్నది నా సంకల్పం. ఒకవేళ చిట్ట చివరిలో పనమా సిటీ చేరుకుని తిరుగు విమానం పట్టుకోడానికి తగినంత సమయం లేదు అనిపిస్తే అంతకు ముందటి ప్రదేశం నుంచి విమానం పట్టుకుని పనమా సిటీ చేరడం అన్న ప్రత్యామ్నాయం ఉండనే ఉంది.

అలాస్కా రాష్ట్రపు ఉత్తర తీరాన ఉన్న ప్రూడో బే (Prudhoe Bay) అన్న చోటునుంచి దక్షిణ అమెరికాలోని అర్హెంతీన (Argentina) దేశపు దక్షిణ కొసన ఉన్న ఉషుఆయ (Ushuaia) నగరం దాకా సుదీర్ఘమైన రహదారి ఉంది. దాని పేరు పాన్ అమెరికన్ హైవే. ముప్ఫైవేల కిలోమీటర్ల పొడవున సాగిపోయే ఈ వాహనాల బాట ప్రపంచంలోకెల్లా పొడవాటి రహదారిగా ఖ్యాతి చెందింది. పనమా, కొలంబియా దేశాల మధ్య – కీకారణ్యాల నడుమన – డేరియెన్ గ్యాప్ (Darien Gap) అన్న నూటారు కిలోమీటర్ల దుర్గమ మార్గంలో కారు ప్రయాణం సాధ్యం కాదు కానీ, మిగిలిన వేలాది కిలోమీటర్ల పొడువునా ఏ అడ్డంకీ లేకుండా వాహనాలు వెళ్ళగలిగిన హైవే అది. ఉత్తర అమెరికా లోని కెనడా, యు.ఎస్.ఎ., మెహికో (México); మధ్య అమెరికా లోని గ్వాతెమాల, మరో ఆరు దేశాలు; దక్షిణ అమెరికా లోని కొలంబియా, ఎక్వదోర్ (Ecuador), పెరు (Peru), చిలే (chilé), అర్హెంతీన – మొత్తం పధ్నాలుగు దేశాలగుండా సాగే మహారహదారి అది. ఆ రహదారి పొడవునా సాగిపోవడమన్నది ఏ యాత్రికునికైనా ఒక అపురూప స్వప్నం. ఒకే విడతలో ఆ 30 వేల కిలోమీటర్లూ అధిగమించడం నాలాంటి వారికి అసాధ్యమే కానీ విడతలు విడతలుగా ఆ హైవేను చుట్టిరావడం ఆచరణ సాధ్యమే. కెనడా, యు.ఎస్.ఎ., మెహికో లాంటి దేశాలలో ఈ రహదారి భాగం ఏ ఒక్క రోడ్డుకో పరిమితం కాలేదు – సమాంతరంగా సాగే విభిన్న మార్గాల సమాహారమది. మధ్య అమెరికా దేశాలలో మాత్రం అది స్పష్టంగా సాగిపోయే ఒకే ఒక్క మార్గం. ఆ మార్గాన్ని ఆయా దేశాలలో తిరుగాడడానికి నా దిశాసూచికగా ఎన్నుకున్నాను.


మధ్య అమెరికా దేశాలలోకెల్లా గ్వాతెమాల అతి పెద్దది. కోటీ డెబ్బది లక్షల జనాభా. విస్తీర్ణంలో ఇంగ్లండ్ కన్నా పెద్దది – యు.ఎస్.ఎ. లోని లూయిసియానా రాష్ట్రంతో సరితూగుతుంది. అలాగే ముప్ఫయ్యేడు లక్షల జనాభా ఉన్న గ్వాతెమాల సిటీ సెంట్రల్ అమెరికాలో అతిపెద్ద నగరం.

లండన్ నుంచి ఏడుగంటల ప్రయాణం తర్వాత నేను ఎక్కిన కె.ఎల్.ఎమ్./డెల్టా విమానం న్యూ యార్క్ నగరపు గగన తలంలోకి ప్రవేశించి చక్కర్లు కొట్టసాగింది. దిగువున మన్‌హాటన్ లోని ఆకాశహర్మ్యాలు, వంపులు తిరిగిన హడ్సన్ నదీ స్పష్టంగా కనిపించసాగాయి. జె.ఎఫ్.కె. విమానాశ్రయంలో విమానం దిగి, ఇమిగ్రేషన్ వ్యవహారాలు ముగించుకుని టెర్మినల్-5 వేపు కాలు సాగించాను.

సాధారణంగా యు.ఎస్.ఎ. వెళ్ళే బ్రిటిష్ పౌరులకు వీసా మినహాయింపు ఉంటుంది. ఎస్టా (ESTA) అన్న స్కీమ్ వారికి 90 రోజులపాటు ఆ మినహాయింపును ఇస్తుంది. కాని డానల్డ్ ట్రంప్ పుణ్యమా అని మళ్ళీ కాన్సులేట్ గడప తొక్కాల్సి వచ్చింది. నిజానికి, కోవిడ్ మహమ్మారి రావడానికి ముందు నేను పదేళ్ళపాటు ఉపయోగించుకోగల విజిటర్స్ వీసా కూడా తీసుకుని ఉన్నాను. ఉన్నట్టుండి 2017లో ఆయన గత అయిదేళ్ళలో సిరియా, ఇరాన్, సుడాన్, ఇరాక్, లిబియా, యెమెన్, సొమాలియా దేశాలకు వెళ్ళి వచ్చినవాళ్ళు యు.ఎస్.ఎ. రావాలంటే మరోసారి వీసా తీసుకుని తీరాలి అని ఆజ్ఞలు జారీ చేశాడు. పైన సూచించిన దేశాల్లో మొదటి మూడింటికి నేను వెళ్ళి ఉన్నాను కాబట్టి పదేళ్ళ వీసా, ఎస్టా స్కీమ్ మినహాయింపులూ పక్కన పెట్టి లండన్ నగరంలోని అమెరికన్ కాన్సులేట్‌కు వెళ్ళి విసిగి వేసారుతూ మళ్ళీ వీసా తీసుకోవాల్సి వచ్చింది.

జె.ఎఫ్.కె. విమానాశ్రయం లోని టెర్మినల్-5 అన్నది జెట్ బ్లూ అన్న విమాన సంస్థ ప్రధాన స్థావరం. అక్కణ్ణుంచి గ్వాతెమాల నగరానికి అయిదున్నర గంటల ప్రయాణం. విమానం ఎక్కడానికి ముందు అదే విమానంలో ప్రయాణం చెయ్యబోతున్నా ఎడ్విన్ ఫిగురోవా అనే మధ్యవయస్కుడితోను, వాళ్ళబ్బాయితోనూ మాట కలిసింది. గ్వాతెమాల దేశంలో పుట్టి పెరిగి, యు.ఎస్.ఎ. లోని కనెటికట్ (Connecticut) రాష్ట్రపు స్టామ్‌ఫర్డ్ నగరంలో స్థిరపడిన మనిషి ఎడ్విన్. నేను కలిసిన గ్వాతెమాల దేశపు మూలాలకు చెందిన మొట్టమొదటి మనిషాయన. ఆ దేశంలో ఉన్న తనవాళ్ళను కలుసుకోడానికి వెళుతున్నాడు. తమవాళ్ళందరినీ కలుసుకోబోతున్నానన్న సంబరం వాళ్ళబ్బాయిలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. వాళ్ళతో ఎన్నో విషయాలు అంతూపొంతూ లేకుండా మాట్లాడే అవకాశం దొరికింది. నాకు ఉపయోగపడే సమాచారం చాలా అందించాడు ఎడ్విన్. గ్వాతెమాల సిటీలో నివసిస్తోన్న తన సోదరిని సంప్రదించి అక్కడ ఏయే రెస్టారెంట్లలో ఎలాంటి ఆహారపదార్థాలు దొరుకుతాయో ఆ వివరాలూ చెప్పాడు.

విమానంలో నా పక్కసీట్‌లో ఓ మధ్యవయసు గ్వాతెమాల మహిళ… ఇద్దరం ఏవో చిన్నపాటి కబుర్లు చెప్పుకునే ప్రయత్నం చేశాం. కానీ భాష అధిగమించలేని అడ్డంకిగా నిలిచింది. ఆ అనుభవం నాకు రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో రుచి చూపించింది. ఆంగ్ల భాషాప్రపంచం లోంచి స్పానిష్ భాషాప్రపంచం లోకి అడుగుపెడుతున్నా అన్నమాట. అది యు.కె. దేశంలో అందరూ నిద్రపోయే సమయం – బయొలాజికల్ క్లాక్ పుణ్యమా అని నేనూ నిద్రలోకి జారుకున్నాను. అలా ఐదు గంటలపాటు నిద్రాసుఖం అనుభవించి విమానం గ్వాతెమాల సిటీ విమానాశ్రయంలో దిగిన తర్వాత కళ్ళు విప్పాను. అక్కడ వీసా ఆన్ అరైవల్ తీసుకోవడం సులువుగా జరిగిపోయింది.


విమానం దిగగానే వంద యు.ఎస్. డాలర్లను స్థానిక కరెన్సీ లోకి మార్చుకున్నాను – అది ప్రతి ప్రయాణంలోనూ నేను క్రమం తప్పకుండా చేసే పని. ఆ దేశపు కరెన్సీ పేరు విని ముచ్చట వేసింది. కెత్‌సల్ (Quetzal) అన్న తమ దేశపు జాతీయ విహంగం పేరే వాళ్ళు తమ కరెన్సీకీ పెట్టుకున్నారు. ఎర్రటి పొట్ట, నీలీ ఆకుపచ్చ రంగుల తలా ఈకలూ – ఎంతో అందమైన పక్షి అది. ఒక పక్షాన మనిషి కంటపడదది. అనాది కాలంనుంచీ మాయా జాతి ప్రజలు ఆ పక్షి రంగురంగుల ఈకలను ఎంతో విలువైనవిగా భావించుకునేవారు. తన సహజ పర్యావరణంలో ఆ పక్షిని చూడటమన్నది పక్షిప్రేమికులకు ఒక చిరకాలపు కోరిక.

రాయల్ పాలెస్ అన్న మా హోటలుకు టాక్సీలో చేరుకునేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. నగరపు మొదటి జోన్‌లో ఉన్న సౌకర్యవంతమైన హోటలది. మర్నాటి ఉదయం అలవాటు ప్రకారం ఏడింటికి వ్యాహ్యాళికి బయల్దేరాను. వీధిలో బారులుతీరి కూర్చున్న షూ పాలిష్ కుర్రాళ్ళు కనిపించారు. అప్పటికే కొంతమంది కస్టమర్లు తమ జోళ్ళకు వారితో పాలిష్ చేయించుకుంటున్నారు. అంతమంది షూ పాలిషర్‌లను ఒకే చోట చూడటం నాకు అదే మొదటిసారి.

పరిసరాల్లో ఎక్కడైనా కాఫీ దొరుకుతుందేమోనని వెతకసాగాను. గ్వాతెమాల కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి – ఆ విషయంలో ఆ దేశానికి కాస్త అతిశయమూ ఉంది. కఫె లియోన్ అన్న పరిమళభరిత ప్రదేశం నన్ను ఆకర్షించింది. లోపలికి నడిచాను. చక్కని ప్రదేశం, సరళ గ్రామీణ సౌందర్యం… కాఫీకి ఆర్డరిచ్చాను. ఇచ్చాక రెండు విషయాలు బోధపడ్డాయి. ఒకటి, అక్కడ కాఫీతో పాటు పాలు ఇవ్వరు. కానీ తియ్యని బిస్కట్ ఒకటి ఇస్తారు. దానికి వేరే ధరంటూ ఉండదు. రెండు, మనం ఒక కప్పు కాఫీ ఆర్డరిస్తే చాలు. దాన్ని ఎన్నిసార్లయినా నింపుకోవచ్చు – దానికీ ఛార్జి ఉండదు. వాళ్ళిచ్చిన కాఫీ మహాస్ట్రాంగ్‌గా ఉంది. అమెరికానో పరిమాణం ఎస్‌ప్రెసో ఘాటూ ఉన్న కాఫీ అది!

పార్కె సెంత్రాల్ (సెంట్రల్ పార్క్) అన్న విశాలమైన కూడలికేసి నడక సాగించాను. ఆ కూడలిలో ఒక పెద్ద ఫౌంటెన్, వందలాది పావురాళ్ళూ… అటూ ఇటూ తలమానికాల్లాంటి గంభీర సౌధాలు – ఒకటి మెట్రోపోలిటన్ కెథెడ్రల్, మరోటి రాయల్ పాలెస్. అక్కడే ఓ కోవిడ్ వాక్సినేషన్ కాంప్ కనిపించింది. లండన్‌లో కన్నా ఎక్కువగా ఇక్కడివాళ్ళు మాస్క్‌లు పెట్టుకుని కనిపించారు.

ఆ పక్కనే మెర్కాదో సెంత్రాల్ – సెంట్రల్ మార్కెట్ – కనిపించింది, అటుకేసి ఒక అడుగు వేశాను. అక్కడ అమ్మని వస్తువు లేదు. ఉత్తేజం ఉత్సాహం నిండి ఆకట్టుకునే విపణి వీధి అది. స్థానిక వంటకాలు లభించే ఫూడ్‌స్టాల్స్ కనిపించాయక్కడ. వాటిగురించి పెద్దగా అవగాహన లేకపోయినా చూడ్డానికి అవన్నీ ఆకర్షణీయంగా కనిపించాయి. మొక్కజొన్న పిండితో చేసిన రొట్టెల్లాంటి తోర్తీయాలు (Tortilla) ఆర్డర్ చేశాను. ఆ రొట్టెల మీద అవకాడో గుజ్జు, చిల్లీ సాస్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఉండేలా చూశాను.

ఆ మధ్యాహ్నం బాగా ఎండగా అనిపించింది. నడకకు ఏమాత్రం అనుకూలంగా లేదు. కాస్తంత వాకబు చేసి అక్కడ చూడదగ్గ మ్యూజియముల వివరాలు సేకరించాను. పొపొల్ వూ (Popol Vuh) అన్న మ్యూజియమ్‌కు టాక్సీ మాట్లాడుకుని బయల్దేరాను. ఈ పొపొల్ వూ అన్నది మాయా ప్రజల పదహారవ శతాబ్దం నాటి పవిత్రగ్రంథపు పేరు. ఆ మ్యూజియమ్‌లో మాయన్ నాగరికత విలసిల్లిన ప్రదేశాల శిథిలాలలోంచి సేకరించిన అపురూపమైన వస్తువులు కనిపించాయి. ఆ నాగరికతను మనకు పరిచయం చేసే చక్కని మార్గంగా ఈ మ్యూజియమ్‌ను మనం పరిగణించవచ్చు. అక్కడ డ్రెస్డెన్ కోడెక్స్ అన్న పుస్తకపు ప్రతి కనిపించింది. అమెరికా ఖండాలకు చెందిన అతి ప్రాచీన గ్రంథాలలో అది ఒకటిట. మాయా జాతికి చెందిన హైరోగ్లిఫిక్ లిపిలో పదకొండు పన్నెండు శతాబ్దాల మధ్య రూపొందించిన పుస్తకమట. అందులో స్థానిక చరిత్రకు, ఖగోళశాస్త్రానికీ చెందిన వివరాలున్నాయట. దాని మూలప్రతి జర్మనీలోని డ్రెస్డెన్ నగరంలో దొరికింది కాబట్టి ఆ పుస్తకానికి డ్రెస్డెన్ కోడెక్స్ అన్న పేరు పెట్టారట. ఆ మూలప్రతి ఇప్పుడు జర్మనీలోని శాక్సనీ మ్యూజియమ్‌లో ఉంది.

ముసేయో ఇషెల్ దెల్ త్రాహె ఇందిహెన (Museo Ixchel del Traje Indígena: The Ixchel Museum of Indigenous Textiles and Clothing) అన్నది పొపొల్ వూ పొరుగున ఉన్న మరో ఆసక్తికరమైన ప్రదేశం. తరతరాలుగా యుగయుగాలుగా గ్వాతెమాల దేశపు దుస్తుల పరిణామక్రమాన్ని కళ్ళకు కట్టే మ్యూజియమ్ అది. ఆ దుస్తుల తయారీలో వాడిన కళ్ళు చెదిరే రంగులు, ఆకట్టుకునే డిజైన్లూ నన్ను కట్టిపడేశాయి.

అవి రెండూ చూడటం ముగించాక అక్కడి ఆర్కియలాజికల్ మ్యూజియమ్ బాట పట్టాను. టాక్సీలో వెళ్ళినా బాగా సమయం పట్టింది. తీరాచేసి వెళితే మరమ్మత్తుల కోసం ఆ మ్యూజియమ్‌ను వారం రోజులపాటు మూసేశారని తెలిసింది. నిరాశ తప్పలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తోంటే అక్కడి ఓ మహిళ ఆ ఊళ్ళో ఉన్న గ్వాతెమాల హ్రస్వ ప్రతిరూపం ఉన్న చోటికి వెళ్ళమని సలహా ఇచ్చింది. నత్తనడక నడుస్తోన్న ట్రాఫిక్‌లో ఈదులాడుతూ చాలాసేపటికి ఆ చోటికి చేరుకున్నాం. చేరేసరికి ఆ ప్రదర్శనాస్థలమూ మూసివేసే సమయం వచ్చింది. మా టాక్సీ డ్రైవరు హోర్హే (Jorge) అక్కడి సెక్యూరిటి అధికారి దగ్గరకు వెళ్ళి ‘వీరు ఇండియా నుండి వచ్చారు. రేపు వెళ్ళిపోతున్నారు. దయచేసి వీరిని లోపలికి అనుమతించండి’ అని వేడుకున్నాడు. ఆ సెక్యూరిటి అధికారి ఆ విన్నపాన్ని అక్కడి నిర్వాహకులకు చేరవేశాడు. వాళ్ళు ఒప్పుకున్నారు. లోపలికి వెళ్ళాను. 1:11000 స్కేల్‌లో దేశపటం మొత్తాన్ని అక్కడ అన్ని వివరాలతోనూ – నదులు, తటాకాలు, కొండలు, గుట్టలు, అగ్నిపర్వతాలు – పునర్నిర్మించారక్కడ. నాకేమో మ్యాపులు చదవడమంటే మహా ప్రీతి. అయినా ఎందుకో ఆక్కడి ప్రయత్నం నన్ను ఆకట్టుకోలేకపోయింది. అదో అదనపు నిరాశ.

ఊళ్ళో సెక్యూరిటీ పరంగా ఒత్తిడి నిండిన వాతావరణం కనిపించింది. లెక్కకు మించిన పోలీస్ ఆఫీసర్లు, వాళ్ళతోపాటు యూనిఫామ్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డులూ అడుగడుగునా కనిపించారు. అందరి చేతుల్లోనూ మెషీన్ గన్‌లు. ఆ సెక్యూరిటీ గార్డులు అక్కడి షాపులవాళ్ళు అదనంగా చేసుకున్న ఏర్పాటులా అనిపించింది. షాపులవాళ్ళంతా ఇనుపతలుపుల రక్షణవలయాల వెనుక కూర్చుని వ్యాపారం సాగించడం గమనించాను. నేరపూరిత వాతావరణపు ఛాయలు పుష్కలంగా కనిపించాయక్కడ.


స్నేహపూర్వకంగా వ్యవహరించే మా హోటల్ రిసెప్షనిస్ట్ కార్లాను గ్వాతెమాల రుచులను పరిచయం చేసే చక్కని రెస్టరెంట్ ఏదైనా చెప్పమని అడిగాను. ఫ్లర్ దె లిస్ (Flor de lis) అన్న రెస్టరెంటును డిన్నరుకు సిఫార్సు చేశారావిడ. పొపొల్ వూ పవిత్రగ్రంథం ప్రేరణతో మాయన్ సంస్కృతికి చెందిన ఖాద్యవిశేషాలను అందించడంలో ఆ రెస్టరెంటు బాగా పేరు పొందింది అని చెప్పారావిడ. కొద్దిగంటల క్రితమే పొపొల్ వూ మ్యూజియమ్ చూసివచ్చిన నాకు ఆ సలహా బాగా నచ్చింది. రాత్రి ఎనిమిది గంటలకు ఆ రెస్టరెంట్‌లో నాకొక సీట్ రిజర్వ్ చేసిపెట్టమన్నాను.

అప్పటికింకా కాస్తంత సాయంత్రం మిగిలే ఉంది. కనీసం రెండు గంటలపాటు ఎటైనా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఊళ్ళో ఖ్యాతి వహించిన పానశాల దేన్నయినా చూసి వద్దామనిపించింది. ఎల్ పోర్తాల్ అన్న బార్ మా హోటల్‌కు దగ్గర్లోనే ఉందని తెలిసింది. అప్పటికే ఆ బార్ గురించి వినివున్నాను. అటువేపు నడిచాను. బార్‌లో అడుగు పెట్టగానే ఉన్నపళాన వందేళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అక్కడి దారు ప్రధాన అలంకరణలు, కనీసం వందేళ్ళ వయసున్న ఫర్నిచరు – 1960ల నాటి వింత సొగసును అణువణువునా ప్రదర్శిస్తోందా బారు.

బార్‌లో నే వెళ్ళేసరికి కనీసం రెండువందల మంది కస్టమర్లు కొలువుదీరి కనిపించారు – అయినా అదేమీ ఇరుకిరుకు అనిపించలేదు. దానికి విరుద్ధంగా అక్కడంతా ఆహ్లాదకరమైన విరామ వాతావరణం నెలకొని కనిపించింది. ఎటు చూసినా సందడి… మామూలుకన్నా మరికాస్త కలుపుగోలుగా కదలాడుతోన్న స్పిరిటెడ్ కస్టమర్లు… నేనో దేశవాళీ బీరు, దానితోపాటు తినడానికి చిరుతిండీ ఆర్డర్ చేశాను. గోడలకు అతికించి వున్న పోస్టర్లను గమనించడానికి మెల్లగా ఇద్దరు కస్టమర్ల నడుమ నుంచి దూరి ముందుకు వెళ్ళాను. చూస్తోంటే గ్వాతెమాల సిటీకి వచ్చిన ముఖ్యమైనవాళ్ళంతా ఆ ఎల్ పోర్తాల్ బార్ దర్శించే వెళ్ళారనిపించింది. చె గెవారా (Che Guevara) తన మోటర్‌సైకిల్ యాత్రాసమయంలో కొంతకాలం గ్వాతెమాలలో గడిపినప్పుడు తరచూ ఇక్కడికి వచ్చేవాడట.

అన్నట్టు చె గెవారా సైద్ధాంతిక మూలశోధన గ్వాతెమాలలో ముగిసిందంటారు. 1954లో గ్వాతెమాల వచ్చిన చె గెవారా తానక్కడ గడిపిన సమయంలో సోషలిస్టుగా మారాడట. అప్పట్లో దేశాధ్యక్షుడిగా యాకోబో అర్బెన్స్ (Jacobo Árbenz) అనే ఆయన ఉండేవాడు. ఆయన భూసంస్కరణలు అమలుపరచి భూమి లేని బడుగు రైతులకు వేల ఎకరాలు పంచి ఇచ్చాడట. ఇది ఎంతోమంది బడాబాబులకు కన్నెర్ర కలిగించింది. అలా కోపించినవారిలో యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ (UFCO) అన్న అమెరికా దేశానికి చెందిన ఒక శక్తివంతమైన కార్పొరేట్ సంస్థ కూడా ఉంది. వాళ్ళంతా కలగలసి అర్బెన్స్ మీద కమ్యూనిస్టు అన్న ముద్ర వేశారు. సి.ఐ.ఎ. సాయంతో మిలటరీ తిరుగుబాటుకు రూపకల్పన చేసి అర్బెన్స్ ప్రభుత్వాన్ని కూలదోశారు.

ఆ సమయంలో చె గెవారా అర్బెన్స్‌కు సహకారమందించాడు. మిలిటరీ తిరుగుబాటును ఎదుర్కోవడంలో తానూ పాల్గొంటానన్నాడు. అలా అతను సి.ఐ.ఎ.వారి హిట్ లిస్ట్‌లోకి ఎక్కాడు. వారి బారినుంచి తప్పించుకోడానికి గ్వాతెమాల సిటీలోని అర్హెంతీనా రాయబార కార్యాలయంలో తలదాచుకున్నాడు. అక్కణ్ణుంచి మెహికో చేరుకున్నాడు. అక్కడ ఉన్న సమయంలో క్యూబా విప్లవకారులతో సంబంధబాంధవ్యాలు నెలకొల్పుకున్నాడు. కూబా (Cuba) చేరుకుని ఫిదెల్ కాస్ట్రో నాయకత్వంలో సాగిన విప్లవసమరంలో భాగస్వామి అయ్యాడు. మిగిలినదంతా జగమెరిగిన చరిత్ర.

అంతా కలసి చె గెవారా గ్వాతెమాలలో ఎనిమిది నెలలు గడిపాడు. అక్కడే అతని తొలి వివాహం జరిగింది. అతను పరిపూర్ణమైన సోషలిస్టుగా రూపుచెందడంలో అతని సహచరి పాత్ర ఎంతో ఉందంటారు.

ఆ ఎల్ పోర్తాల్ బార్‌లోని ఉల్లాస వాతావరణాన్ని, దానితోపాటు కూసింత గ్వాతెమాల చరిత్రశకలాన్నీ ఆస్వాదించాక, ఆ దేశపు ఖాద్యపరిమళాలను వెతుక్కుంటూ ఫ్లర్ దె లిస్ రెస్టరెంట్ బాట పట్టాను. అక్కడ ప్రిసిల్లా అన్న మహిళ నాకు సాదరస్వాగతం పలికింది. ఆనాటి డిన్నరుకు ఆమె నా ఆతిథేయి.

వాళ్ళు అందించే ఎయిట్ కోర్స్ భోజనం వైపు మొగ్గు చూపించాను. ప్రిసిల్లా ఒక వంటకం తర్వాత మరో వంటకం అందించసాగింది. ప్రతి వంటకం గురించీ సమగ్రమైన వివరం అందించింది: అందులో ఏ ఏ పదార్థాలు, పరిమళాలూ ఉన్నాయి, దాని చరిత్ర ఏమిటి, దానిమీద మాయన్ల ప్రభావం ఎలాంటిది – ఈ వివరాలన్నీ చక్కగా చెప్పుకొచ్చింది ప్రిసిల్లా. ఏ సందేహాలూ పెట్టుకోకుండా ఆ పురావంటకాలను ఒకటి తర్వాత ఒకటి రుచి చూశాను. కొన్ని మిగిలిన వాటికన్నా విలక్షణమైన రుచి కలిగి ఉన్నాయి. రుచి సంగతి ఎలా ఉన్నా ప్రతి వంటకమూ ఒక కళాకృతిలో అమర్చి అందించడం నన్ను అబ్బురపరచింది. ఆ వంటకాలన్నీ పొపోల్ వూ ప్రేరితాలని, అలనాటి రోజుల్లో వాడిన పదార్థాలనే ఇపుడూ ఈ వంటకాలలో వాడారనీ చెప్పుకొచ్చింది ప్రిసిల్లా. ఏదేమైనా ఖాద్యపదార్థాల పరంగా అలాంటి పరిమళాలను నేను ఎరుగనే ఎరుగను. వాటిల్లో నాకు చీమల ఎమల్షన్‌తో కూడిన పుట్టగొడుగుల వంటకం సరికొత్త అనుభవం. ఆ ఎమల్షన్ ఆ వంటకానికి ఆమ్లపు రుచిని సమకూర్చింది. అలాగే అక్కడ నాకు అందించిన చాకొలెట్ డిజర్ట్‌లో తీపికన్నా వగరే ఎక్కువ అనిపించింది. నిజమే, కల్తీ లేని చాకొలెట్ రుచి వగరుగానే ఉంటుంది మరి.

అంతా కలసి ఎనభై డాలర్ల బిల్లయింది. కాస్త ఖరీదెక్కువ అన్నమాట నిజమే. గ్వాతెమాల పరంగా చూస్తే ఎక్కువ అనిపించినా అదే భోజనం లండన్‌లో చేసినట్టయితే మూడు నాలుగు రెట్లు ఎక్కువ బిల్లయేది కదా అన్న ఎరుక నాకు ఉపశమనం కలిగించింది. పైగా మాయన్ సంస్కృతి ఇప్పటికీ విరాజిల్లే గ్వాతెమాల దేశపు నడిబొడ్డున, ఆ సంస్కృతికి చెందిన పవిత్ర గ్రంథపు ప్రేరణతో, అప్పటి బాణీలోనే ఆనాటి మాయన్ పూర్వీకుల ప్రస్తుత వారసులు వండిన మృష్టాన్నభోజనం తినే అవకాశం ఎన్నిసార్లు ఎంతమందికి లభిస్తుందీ? జీవితంలో ఎంతో అరుదుగా లభించే అవకాశం కదా అది.

టాక్సీ తెప్పించగలవా అని అడిగితే ప్రిసిల్లా ఊబర్ బుక్ చేసింది. దిగేటపుడు ఎంతివ్వాలో కనుక్కుంటే ఆ ఊబర్ డ్రైవర్ ప్రిసిల్లా మేడమ్ అప్పటికే బిల్లు చెల్లించిందని చెప్పింది!


గ్వాతెమాల వచ్చేవాళ్ళు చాలామంది గ్వాతెమాల సిటీని పట్టించుకోకుండా ఎయిర్‌పోర్ట్ నుంచి తిన్నగా ఆంతీగా నగరానికి వెళుతూ ఉంటారు. గ్వాతెమాల సిటీ నన్ను బాగా ఆకట్టుకుందని చెప్పలేను గానీ సందడి నిండిన మెర్కాదో సెంత్రాల్, మాయన్ నాగరికతను పరిచయం చేసే పొపోల్ వూ మ్యూజీమ్, ఉల్లాసం ఉట్టిపడే ఎల్ పోర్తాల్ పానశాల – వీటితోపాటు మధ్య అమెరికా ప్రాంతంలోకెల్లా అతి పెద్ద నగరం చూడగలగడం – మొత్తం మీద అక్కడ గడిపిన సమయం నాకు సంతృప్తిని మిగిల్చింది.

మర్నాటి ఉదయం నాలుగింటికే మెలకువ వచ్చింది. జెట్‌లాగ్ పుణ్యమా అని తొందరగా పడుకుని బాగా వేకువనే లేవవలసి వస్తోంది. నావరకు నాకు అది అనుకూలమయిన విషయమే – నిద్ర పట్టనపుడు పక్క మీదే దొర్లడంలో సుఖమేముందీ? వెంటనే తయారైపోయి ఆంతీగా వెళ్ళే చికెన్ బస్సుల టెర్మినల్ దారిపట్టాను.

బస్ టెర్మినల్ చేరడానికి టాక్సీ తీసుకున్నానే గాని నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో డ్రైవరుకు చెప్పడానికి భాషాసమస్య అడ్డు వచ్చింది. ఆంతీగా వెళ్ళే బస్సు, చికెన్ బస్ టెర్మినల్లూ అంటూ నేను నట్లుకొట్టడం విషయాన్ని క్లిష్టపరచింది. అసలక్కడ బస్టాండ్ కానీ బస్ టెర్మినల్ కానీ లేనేలేవని తొందరగానే బోధపడింది. ఎల్ త్రెబోల్ మెట్రో స్టేషన్ దగ్గరి రోడ్డు పక్కన బస్సులు ఆగుతాయట. మొత్తానికి మా డ్రైవర్ నన్ను మెట్రో స్టేషన్ దగ్గర దింపగలిగాడు. వచ్చీరాని స్పానిష్ భాషలో వాళ్ళనూ వీళ్ళనూ అడిగి చివరికి ఆ బిజీ రోడ్డు పక్కన నిలబడి ఉన్న రంగురంగుల చికెన్ బస్సుల దగ్గరికి చేరుకోగలిగాను. బస్ కండక్టర్లు తమ తమ బస్సుల అంతిమ గమ్యాల వివరాలు హోరెత్తేలా చెప్పుకొస్తున్నారు. ఆంతీగా వెళ్ళే బస్సు దగ్గరికి చేరేసరికి ఆ కండక్టర్ మాటన్నది లేకుండా నా బాక్‌పాక్ అందిపుచ్చుకుని దాన్ని లాఘవంగా డ్రైవర్ సీటు దగ్గరున్న ఓ ఖాళీ జాగాలోకి విసిరి తిరిగి పాసింజర్ల కోసం తన కేకల ఆహ్వానాలు కొనసాగించాడు.

సెంట్రల్ అమెరికా చికెన్ బస్సుల్లో అది నా మొట్టమొదటి ప్రయాణం. వెలిగి ఆరే రంగుల బల్బులు, హోరెత్తించే స్టీరియో పాటలు – సందడే సందడి. పొద్దు పొడవకముందే పదిమందీ చేరి సంబరాలు జరుపుకుంటున్న నైట్‌క్లబ్బులా ఉందా బస్సు. దాన్ని ప్రయాణం అనడంకన్నా సెలబ్రేషన్ అనడమే సముచితం. ప్రయాణాలంటే విసుగెత్తినవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గ్వాతెమాల చికెన్ బస్సు ఎక్కమని నా సలహా – ఆ అనుభవం వారిలో తప్పకుండా కొత్త సత్తువ నింపుతుంది. బస్సుల్లో సీటు బెల్టుల్లాంటి రక్షణ పరికరాలకోసం వెతకకండి – అలాంటివి అసలు ఉండనే ఉండవు.

బస్సు బయల్దేరింది. కండక్టర్ మహాశయుడు ఆ తలుపుల్లేని ద్వారం దగ్గర ఒక కాలు బస్సు లోపల, మరోటి బయటా పెట్టి – దారిలో వస్తోన్న బస్టాపుల వివరాలు ప్రకటిస్తూ, ఎక్కేవాళ్ళ దగ్గర టికెట్ డబ్బులు సేకరిస్తూ మహాబిజీగా తన పని కొనసాగించాడు. డ్రైవర్ బస్సును అరకిలోమీటరుకోసారి ఆపుతున్నాడు – ఆంతీగా, సాలీకా అంటూ కండక్టర్ ప్రవర చెపుతున్నాడు… చిన్ననాటి ఎర్రబస్సుల పరిమళవీచిక ఒకటి ఖండాంతరాలు దాటుకొని, కాలమానాలు అధిగమించి ఆ క్షణాన నన్ను కమ్ముకున్నట్టు అనిపించింది. బస్సు బయల్దేరినప్పుడు అంతా కలిసి పదీ పన్నెండు మందే పాసింజర్లు – ఆగిన చోటల్లా పాసింజర్లను ఎక్కించుకుంటూ చూస్తూ చూస్తూ ఉండగానే కోళ్ళగంపలా బస్సు నిండిపోయింది. ఆంతీగా చేరేసరికి బస్సునిండా ఇసకవేస్తే రాలనంతమంది జనం – కిక్కిరిసిన గూట్లో కోడిపిల్లలున్నట్టు కాలు మెదపడానికి కూడా చోటు లేనంతగా నిలబడి ప్రయాణిస్తోన్న పాసెంజర్లు… అసలా కోళ్ళగూడు పోలిక వల్లే వీటికి చికెన్ బస్సులు అన్న ముద్దుపేరు వచ్చిందేమో!

పూర్వాశ్రమంలో ఈ చికెన్ బస్సులన్నీ యు.ఎస్.ఎ.లో తిరుగాడిన స్కూలు బస్సులట. అక్కడ వాటికి కాలం చెల్లాక ఇక్కడికి దిగుమతి అయి, చికెను బస్సులుగా రూపాంతరం చెంది, కాలవ్యవధి లేని చిరంజీవుల్లా తిరుగాడుతున్నాయట. ఏ మాటకామాట – వాటి ఇంజన్లు పటిష్టమైనవి; ఇక్కడి ఎత్తుపల్లాలని, కొండల్నీ అధిగమించగలవి. అడపా దడపా డ్రైవరు తనముందున్న ఓ తాడు లాగుతున్నాడు – హారను మోగుతోంది. ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, వాళ్ళ గబగబలు – వాటి నడుమ సాగిపోయే చికెన్ బస్సు.

దూరమెంతో కాదు – నలభై అయిదు కిలోమీటర్లు. షటిల్ బస్సులో అయితే గంటంబావు, కారయితే గంట చాలు. మా చికెన్ బస్సు మాత్రం రెండు గంటలు తీసుకుంది. అనుక్షణమూ ఆసక్తికరమైన ప్రయాణం – ఇంకా చెప్పాలంటే సంతోషం నిండిన ప్రయాణం… అంచేత రెండుగంటలు అన్నది నాకు చిన్నపాటి వరమే. ఎక్కడన్నా సంబరం పాలు తగ్గుతుందేమో అని కాబోలు, స్టీరియో నిర్విరామంగా శబ్దసత్తువను పరిసరాల్లో నింపి వదులుతోంది. అన్నట్టు ఈ చికెన్ బస్సు కారు చవక – మా హోటల్ నుంచి బస్సు ఆగే చోటికి టాక్సీకీ పన్నెండు డాలర్లిచ్చాను – గ్వాతెమాల సిటీనుంచి ఆంతీగాకు బస్సు టికెట్టు రెండే రెండు డాలర్లు.

చికెన్ బస్టాపు నుంచి మా హోటల్ ‘పొసాదా సాన్ బిసెన్తె’కు పదిహేను నిమిషాల నడక. లోపల చక్కని ప్రాంగణం, అందులో ఓ ఫౌంటెనూ – ముద్దొచ్చే ముత్యం మా హోటలు. హోటలు చేరీ చేరగానే ఒక మ్యాపు అడిగి పుచ్చుకున్నాను. రిసెప్షన్‌లో ఉన్న సాంద్రా అన్న ఆవిడతో మాట్లాడి కాస్త సమాచారం సేకరించాను. సేకరించి ఆ ఊరి సెంట్రల్ ప్లాజాకి దారి తీశాను.

ఆంతీగా నగరం చుట్టూ కొండలు అగ్నిపర్వతాలూ నిండిన ఒక లోయలో ఉంది. ఊళ్ళో నిలబడి చుట్టూ చూస్తే ఒక బృహదాకారపు లోహాల మూసలో నిలబడినట్టనిపిస్తుంది. అన్నివేపులా గోడలు కట్టిన పచ్చని ప్రకృతి, నీలాకాశం దానికి పైకప్పు. అదే సమయంలో ఊళ్ళో ఆకాశహర్మ్యాలు, వాహనాల వత్తిడీ లేకపోవడం వల్ల ఒక స్వేచ్ఛాప్రపంచంలో అడుగు పెట్టిన భావనా కలుగుతుంది. దాదాపు అయిదు వందల సంవత్సరాల క్రితం ప్రాణంపోసుకున్న ఆంతీగా నగరంలో రోడ్లన్నీ అప్పటి బాణీలో రాతిపలకలు పరిచి వేసినవి. వందలాది సంవత్సరాల నాటివి. సమమట్టంగా లేని ఆ రాతి రహదారుల పుణ్యమా అని అక్కడ కార్లూ ఇతర మోటారు వాహనాలూ మనిషి నడిచే వేగంతో మాత్రమే సాగగలవు.

ఎగుడుదిగుడు రోడ్ల సంగతి ఎలా ఉన్నా వాటిమీద నిలబడి అటూ ఇటూ చూశామంటే దారులకు రెండు వేపులా రంగులీనే భవనాలు, వాటికి నిలువుగా అల్లుకుపోయిన లతలు, ఆ భవనాల గోడల్లోంచి లోపలికి తొంగిచూసే వృక్షాలు – సహజంగానే వర్ణభరితమైన అక్కడి పరిసరాలకు మరిన్ని రంగులద్దుతోన్న ప్రక్రియ అది. 1979లో ఆంతీగా నగరానికి యునెస్కోవారి ‘ప్రపంచ వారసత్వ సంపద’ గుర్తింపు వచ్చింది.

అక్కడి ఒకప్పటి మతపరమైన శిక్షణ ఇచ్చే కాన్వెంట్ భవనంలో ఇప్పుడు నడుస్తున్న దెల్ ఆర్కో రెస్టరెంటులో బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆగాను. ఆ కాన్వెంటును రోడ్డుకు అవతలి పక్కన ఉన్న పాఠశాలతో గగనమార్గాన కలిపే సాంతా కాతలీనా ఆర్చ్ నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ ఆకాశమార్గాన్ని 1694లో నిర్మించారట. రోడ్డున వెళ్ళే జనానీకం కంటపడకుండా పాఠశాలలో పనిచేసే నన్‌లు ఆ భవనాల నడుమ తిరగాడడం కోసం అప్పట్లో ఆ ఆర్చ్‌ని నిర్మించారట. చూడగానే ఇది మామూలు ఆర్చ్ కానే కాదనిపించింది. ఇలాంటి నడకబాటలు సామాన్యంగా నిడుపాటి భవనాల నడుమ తమకంటూ ఉనికి లేకుండా బిక్కుబిక్కుమంటూ ఉంటాయి. ఈ ఆర్చ్ సగర్వంగా ఆకాశంలోకి చూస్తోంది. ఒక కోణంలోంచి చూస్తే వెనకనున్న ఆగ్వా (ఆగ్ఉఆ) అగ్నిపర్వతానికి చక్కని ఫ్రేములాగా అమరిందా సాన్తా కాతలీనా ఆర్చ్. మధ్య అమెరికా ప్రాంతాలలో ఎంతగానో ఫోటోలు తీయబడ్డ ఆర్చ్ అది. ఆ ప్రాంగణంలో ఇప్పుడు నెలకొల్పిన దెల్ ఆర్కో రెస్టరెంటులో బ్రేక్‌ఫాస్ట్‌కు తొస్తాదాలు (Tostadas) ఆర్డర్ చేశాను. మొక్కజొన్న పిండితో చేసిన పిజ్జా బేస్ లాంటి రొట్టె, దానిపైన అవొకాడో కాయల నుంచి చేసే వాకమోలె (guacamole) టాపింగు, దానితోపాటు కొంచెం నీళ్ళ చట్నీ లాంటి సల్సా, వేయించిన అరటి ముక్కలు, కోడిగుడ్డు పొరటు, సైడ్ డిష్‌గా బ్లాక్ బీన్స్ ముద్ద – వెరసి నేను ఆర్డర్ చేసిన తొస్తాదా.

అక్కడి సెంట్రల్ ప్లాజా నడుమన చక్కని ఉద్యానవనం ఉంది. అది నగరపు కేంద్రబిందువు కూడానూ. దానికి మూడువేపులా తోరణాలు నిండిన ప్రభుత్వ – పౌరచారిత్రిక భవనం. నాలుగోవేపున 1541లో నిర్మించిన సాంతియాగో కెథెడ్రల్ – మధ్య అమెరికాలోకెల్లా అతి పురాతనమైన కెథెడ్రలట అది.

ఊరి గొగ్గిరి రహదారులకు అటూఇటూ ఎన్నెన్నో పురాతన భవనాలు, చర్చులు – వాటిల్లో ఇగ్లేసియా దె ల మెర్సెద్ (Iglesia de la Merced) అన్నది బాగా పేరున్న చర్చి. స్పానిష్ భాషలో ఇగ్లేసియా అంటే చర్చిట. దాని ముందుభాగం లోని తెలుపూ పసుపూ వర్ణాల స్టక్కో పనితనం ఆ చర్చికి ఒక విలక్షణతను చేకూర్చింది. లోన్‌లీ ప్లానెట్ వాళ్ళ గ్వాతెమాల దేశపు గైడ్‌బుక్ ముఖచిత్రంగా ఈ చర్చ్ బొమ్మే ఉంటుంది. దాని అంతర్భాగంలో ఇప్పుడు ఉపయోగంలో లేని పెద్దపాటి ఫౌంటెన్ ఉంది.

చిన్నపాటి రుసుము చెల్లించి ఆ చర్చి అంతర్భాగం లోకి వెళ్ళాను. లోపలినుంచి దాని ఉపరితలానికి చేరుకోవచ్చు. అక్కడ్నించి ఆంతీగా నగరానికి రక్షగా నిలబడ్డ మూడు అగ్నిపర్వతాలూ చక్కగా కనిపిస్తాయి. ఒకదాని పేరు ఆగ్వా (Agua: నీరు) – 12340 అడుగుల ఎత్తు; రెండోది ఫుయేగో (Feugo: అగ్ని) – 12346 అడుగులు; మూడోది అకతెనాంగో (Acatenango: మొక్కజొన్నల బారు) – 12045 అడుగులు. ఈ మూడింటిలో ఫుయేగో బాగా చురుకైన అగ్నిపర్వతం – తరచూ పొగలు కక్కుతూ ఉంటుంది. ఆగ్వా అన్నది ఊరికి బాగా దగ్గర – ఆంతీగా నగరం దాని నీడలోనే గూడు కట్టుకుని ఉందా అనిపించేంత దగ్గర.



లాటిన్ అమెరికా అనగానే నాకు వెంటనే గుర్తొచ్చేది ఆ దేశాల్లో మనకు కనిపించే వీధిగాయకుల బృందాలు. ముఖ్యమైన వీధిమొగల్లో అలాంటి సంగీతకారుల బృందాలు తమ గానవాద్యప్రతిభతో అటు వెళ్ళేవారిని ఆకట్టుకోవడం మనం గమనించవచ్చు. అక్కడి సెంట్రల్ పార్క్ దగ్గర ఏదో సంగీతోత్సవం జరుగుతున్నట్టుంది. స్టేజ్ మీద పాడుతోన్న గాయకుల బీట్‌కు అనుగుణంగా వేదికకు దిగువన వందమంది వలంటీర్లు అడుగు కలపడం నన్ను బాగా ఆకట్టుకుంది. ఒకలాంటి పరవశం కలిగించే సన్నివేశమది. సమయోచితంగా చిన్నపాటి చినుకులు పడ్డాయి. అవేవీ ప్రేక్షకుల ఉత్సాహానికి అడ్డుకట్ట వెయ్యలేకపోయాయి. కొంతమంది అక్కడి భవనాల ఆర్చిల నీడకు చేరారు. కొంతమంది చెట్ల నీడకు చేరుకున్నారు. ఎక్కడకు చేరినా ఎవ్వరూ సంగీతాస్వాదన మరువలేదు.


స్పెయిన్ ఆధిపత్యంలోని మధ్య అమెరికా భూభాగానికి వలస రాజధానిగా మొదట్లో వ్యవహరించింది ఆంతీగా నగరం. ఆ తర్వాత స్వతంత్ర గ్వాతెమాల దేశానికీ రాజధాని అయింది. అప్పట్లో ఈ ఊరి పేరు ‘గ్వాతెమాల సిటీ’నే. 1773లో వచ్చిన భీకర భూకంపంలో నగరం ధ్వంసమయ్యాక రాజధానిని కొత్త గ్వాతెమాల సిటీకి తరలించారు. ధ్వంసమయిన పాత రాజధానిని ఆంతీగా గ్వాతెమాల సిటీ అని వ్యవహరించసాగారు. ఆంతీగా అంటే ‘పాత’ అని అర్థం. అలా ఆ ఊరిని పాత గ్వాతెమాల సిటీ అని స్థానికులు పిలుస్తారు. రానురానూ పాతనగరానికి ఆంతీగా అని పొట్టిపేరే స్థిరపడిపోయింది. ఇప్పటి (కొత్త) గ్వాతెమాల సిటీలో జరుగుతున్న అర్బన్ క్షయానికి విలోమ ప్రతీక ఈ ఆంతీగా నగరం. చక్కటి పచ్చటి ప్రదేశం. చింతలు లేని చిట్టి నగరం. ఆ ఊర్లో మనకు ఇంకా ప్రకృతి ఒడిలో ఓలలాడుతున్నట్టు అనిపిస్తుంది.

డెబ్భై పైచిలుకు అగ్నిపర్వతాలున్న మధ్య అమెరికా భూభాగాన్ని పసిఫిక్ ప్రాంతపు అగ్నిరేఖలో భాగంగా చెప్పుకోవచ్చు. భూగర్భంలో ఇంకా కొనసాగుతోన్న సర్దుబాట్ల పుణ్యమా అని అక్కడ భూకంపాలు సర్వసాధారణం. గ్వాతెమాల దేశంలో అంతా కలసి 37 అగ్నిపర్వతాలు ఉన్నాయి – అందులో మూడు ఇప్పటికీ సజీవంగా ఉండి నిప్పులు కక్కే కోవకు చెందినవి.

మధ్యాహ్నం వర్షం పడింది. ఆ సెంట్రల్ ప్లాజాలోని దుకాణసముదాయంలో తలదాచుకున్నాను. అడపాదడపా ఒకటి రెండు దుకాణాల్లోకి ఓ అడుగు వేసి చూశాను. ఆ ప్రక్రియలో అక్కడ ఉన్న ఒక చాకొలెట్ మ్యూజియమ్ కంటపడింది. ఆ మ్యూజియమ్‌లో మన కళ్ళముందే చాకొలెట్‌లు తయారుచేస్తున్నారు. అంతేకాకుండా వాటి తయారీ గురించి వర్క్‌షాపులూ నిర్వహిస్తున్నారు. అలాంటి ఓ వర్క్‌షాపులో ఆ సాయంత్రం చేరేలా సీట్ రిజర్వ్ చేసుకున్నాను.

ఆ రంగులు నిండిన వీధుల్లో యథేచ్ఛగా గంటసేపు తిరుగాడాను. అలా తీరిగ్గా తిరుగాడి తిరుగాడి సెర్రో దె ల సాంతాక్రూస్ అన్న గుట్ట దగ్గర తేలాను. ఆ గుట్ట ఊరికి ఒక కొసన ఉంది. దానిమీద ఒక బృహత్తరమైన దారుశిలువ ఉంది. నా నడక కొనసాగించి, ఓ చెక్కదారి మీదుగా సాగి ఒక చక్కని వ్యూపాయింట్ దగ్గరకి చేరాను. ఊరంతా చక్కగా కనిపించింది. ఊరు వెనక ఆగ్వా అగ్నిపర్వతపు ఉనికి తెలియవచ్చింది. కానీ ఆగ్వా పర్వతపు శిఖరభాగం మబ్బుల్లో మునిగిపోయి కనిపించింది. నేనూ నాతోపాటు మరో పన్నెండు మందిమి ఆ మబ్బులు విడిపోతాయేమోనని ఓపిగ్గా నిరీక్షణ సాగించాం. ఆ సందర్భంలో హాన్స్ అన్న డచ్ మనిషితో మాట కలిసింది. అతను ఈమధ్యనే యూనివర్సిటీ చదువు ముగించాడట. అది ముగిశాక ఒక్కడే గ్వాతెమాల దేశంలో పర్యటిస్తున్నాడట. రేపు ఉదయం ఈ ఆగ్వా పర్వతం ఎక్కబోతున్నాను అని చెప్పాడు హాన్స్.

అగ్నిపర్వతాలు ఎక్కడమనేది ఆ ప్రాంతాల్లో యాత్రికులు చేపట్టే ముఖ్యమైన కార్యక్రమం. వాటికి గైడెడ్ టూర్లు కూడా ఉంటాయి. పకాయా (Pacaya) అనే నిప్పు ఇంకా చల్లారని అగ్నిపర్వతం యాత్రికుల్ని బాగా ఆకర్షించే ప్రదేశమట. నాకు అలాంటి హైకింగ్ ఒకటి చేసేద్దామా అన్న ఊపు వచ్చేసింది. కానీ మరో నాలుగు దేశాలు దాటుకుని పనమా చేరుకోవాలి కదా – ఆ ఊపును ఆపుకున్నాను. పైగా అగ్నిపర్వతాలు ఎక్కడమూ అంటే అందుకు అవసరమయిన పరికరాలు, సరంజామా వేరు. నేను అలాంటివి ఏం సర్దుకుని రాలేదు కాబట్టి చేద్దామన్నా ఆ హైకింగ్ నాకు వీలుపడదు.

నా వెనుక నిలబడిన మనిషి హిందీలో పలకరించాడు! అతని పేరు పెద్రో అట. ఎల్ సల్బదోర్ మనిషి. పనమా కెనాల్‌లో పనిచేస్తూ ఉంటాడట. ఆ కాలువను దాటే దేశదేశాల ఓడలకు చేయూతనివ్వడం అతని వృత్తి. ఆ ప్రక్రియలో ఇండియా నుంచి వచ్చే ఓడల్లోకి అడపాదడపా ప్రవేశించడం, తద్వారా కాసిన్ని హిందీ మాటలు నేర్వడం జరిగిందట. కుటుంబసమేతంగా ఆంతీగాకు శెలవు మీద వచ్చాడట. భారతదేశం వెళ్ళి హిమాలయాలు చూడాలన్న కోరిక ఉందన్నాడు. తాను ఆధ్యాత్మిక మార్గాన్వేషణలో ఉన్నానని, అంచేతనే భారతదేశం, హిమాలయాలు అంటే ఆసక్తి అనీ చెప్పుకొచ్చాడు. పనమా కెనాల్ దాటడానికి ఓడలకు ఎన్నో గంటలు పడుతుందట… అక్కడ ఇండియాకు చెందిన ఓడలని దాటించే పని పడినప్పుడు ఆ ఓడల్లోని భారతీయ నావికులతో ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూ ఉంటాడట. నన్ను తన సతీమణికి పరిచయం చేశాడు. ఆమె కూడా ఎంతో ఉత్సాహంగా పలకరించారు. వాళ్ళ టీనేజ్ కూతుళ్ళు మాత్రం ముక్తసరిగా ఓలా – హలో – చెప్పి మళ్ళా తమ మొబైళ్ళలో మునిగిపోయారు.

ముప్పావు గంట గడిచినా ఆగ్వా శిఖరపు మేఘమాలలు చెదిరే లక్షణం కనిపించలేదు. నిరీక్షణ విరమించుకొని తిరుగుదారి పట్టాను. రేపు బాగా ఉదయాన్నే వచ్చినట్టయితే మేఘాలుండవు, శిఖరం స్పష్టంగా కనపడుతుందని సలహా ఇచ్చాడు పెద్రో. అవును, ఉదయాకాశం నిర్మలంగా ఉంటుంది. రోజు గడిచేకొద్దీ మేఘాలు కమ్ముకొస్తాయి.

మర్నాడు ఆంతీగా నుంచి లేక్ అతిత్‌లాన్ (Lago de atitlán) ఒడ్డున ఉన్న పనహాచేల్ (Panajachel) అన్న ప్రదేశం చేరాలని ప్లాన్ చేశాను. ఎలా వెళ్ళాలీ అన్నది పెద్దగా ఆలోచించలేదు; పొద్దున్నే చికెన్ బస్సుల దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఎలా వెళ్ళాలో తెలుసుకోవడం, అంతే. గుట్టదిగి పట్నంలోకి నడుస్తున్నప్పుడు మాయా ట్రావెల్స్ అన్న ఆఫీసు కనిపించింది. వెళ్ళి వాకబు చేశాను. హోర్హె అన్న అక్కడి ట్రావెల్ ఏజంట్ ఆంతీగా నుంచి తిన్నగా పనహాచేల్ వెళ్ళే చికెన్ బస్ సర్వీస్ లేదని చెప్పాడు. ఈ ఏజెన్సీవాళ్ళు ఉదయం ఎనిమిదిన్నరకి బయల్దేరే షటిల్ బస్ నడుపుతున్నారట – వెంటనే ఆ బస్సులో సీటు రిజర్వ్ చేసుకొని నా సాయంకాలపు నడక కొనసాగించాను.

ఆ సాయంత్రం గంటన్నర సేపు సాగిన చాకొలెట్ వర్క్‌షాప్ ఒక అరుదైన అనుభవం. చాకొలెట్‌లు లేని ప్రపంచాన్ని ఊహించగలమా? మాయా జాతి ప్రజలు ప్రపంచానికి ప్రసాదించిన బహుమతి అది. కోకో పంట నుంచి చాకొలెట్ తయారుచెయ్యడం కనిపెట్టింది మాయన్లే. కోకో గింజలు వాళ్ళకు ఎంతో విలువైన సంపద – వాటిని అప్పట్లో నాణేలుగా వాడేవారు. వాటినుంచి తిసిన చాకొలెట్‌ను దేవుని ఆహారంగా పరిగణించేవారు. స్వచ్ఛమైన చాకొలెట్ కృష్ణవర్ణంలో ఉంటుంది. వగరుగా ఉంటుంది. దానిలో చాలా ఎక్కువ శాతం కోకోనే ఉంటుంది. వారికి అది ఒక పానీయం. మాయా నాగరికతకు కేంద్రబిందువైన గ్వాతెమాల దేశం సహజంగానే కించిత్తు అతిశయంతో, మాదీ చాకొలెట్ అన్నట్టు ఉంటుంది.

ఆ వర్క్‌షాప్‌లో చాకొలెట్ తయారీలోని వివిధ ఘట్టాల్ని వివరించారు. మాతో అవన్నీ చేయించి చూపించారు. అందులో మొదటి ఘట్టం పక్వానికి వచ్చిన కోకో గింజల్ని బాగా వేయించి వాటిలోంచి ద్రవాన్ని వెలికితీయడం – అదయ్యాక మా అందరికీ తలా కాస్త చిక్కటి నల్లటి కోకో ద్రవాన్ని అందించి దాన్ని చాకొలెట్‌గా చేయడం ఎలాగో నేర్పారు. కోకో ద్రవాన్ని ముందుగా గోధుమరంగు పొడిగాను, తెల్లరంగు వెన్నగానూ విడదీయాలి. కోకో గింజల్లో యాభై శాతం పొడీ మిగిలిన యాభై శాతం వెన్నా ఉంటాయి. డార్క్ చాకొలెట్‌లో అయితే కోకో పాలు యాభైశాతం మించి ఉంటుంది. వైట్ చాకొలెట్‌ను పూర్తిగా కోకో వెన్న నుంచి తయారుచేస్తారు. ఈ వెన్నను స్కిన్ క్రీముల్లోను, కాస్మటిక్స్ లోనూ వాడతారు. నేను చేసిన చాకొలెట్ సవ్యంగానే వచ్చింది. కానీ మరీ చేదుగా అనిపించి తినలేకపోయాను. ఈ చాకొలెట్ యూరప్‌లో అడుగు పెట్టినప్పుడు వాళ్ళు దానికి పంచదార జోడించి ఖాధ్యయోగ్యం చేశారు. స్విస్ దేశస్థులు మరో అడుగు ముందుకు వెళ్ళి పాలను కూడా జోడించి మిల్క్ చాకొలెట్‌ను ఆవిష్కరించారు.

వర్క్‌షాప్ కాగానే ల ఫోందా దె ల కాయె రియాల్ (La Fonda de la Calle Real) అన్నచోట డిన్నరు చేశాను. మా రిసెప్షనిస్టు శాంద్రా సిఫార్సు చేసిన ప్రదేశమది. రెస్టరెంటు లోపలి వివరాలను గమనిస్తే ఎంతోమంది ప్రముఖులు అక్కడికి వచ్చివెళ్ళారని బోధపడింది. అందులో ఆ రెస్టరెంటువారు అతిశయంగా చెప్పుకొనేదీ ఆ జ్ఞాపకాన్ని తడుముకొని సంబరపడేదీ 1999లో అమెరికా ప్రెసిడెంటు బిల్ క్లింటన్ రాక. 1968 తర్వాత గ్వాతెమాల సందర్శించిన మొదటి యు.ఎస్. ప్రెసిడెంటు క్లింటనేనట. అతని రాక ఆ దేశంలో టూరిజానికి బాగా ఊతమిచ్చిందట.

‘ఏమార్డర్ చెయ్యమంటావ్, నీ సలహా చెప్పు’ అని అక్కడి సహాయకురాలిని అడిగితే ఆమె ఠక్కున ‘చికెన్ బ్రోత్’ అని సమాధానమిచ్చింది. అది ఆ రెస్టరెంటువారి ప్రముఖ వంటకమట. క్లింటన్‌గారు అదే ఆర్దర్ చేశారట – అప్పట్నించీ అది ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది. అది గ్వాతెమాల దేశంలో నేను గడుపుతోన్న రెండవ రోజు. రెండ్రోజుల పుణ్యమా అని మనం ఎక్కడ ఎప్పుడు ఏ వంటకం ఆర్డర్ చేసినా దానితోపాటు వేడివేడి మొక్కజొన్న రొట్టె కూడా అందుతుంది అన్న విషయం తెలిసిపోయింది. చిన్న చిన్న వీధి దుకాణాల్లో కూడా అక్కడి మహిళలు ఈ రొట్టెల తయారీలో నిరంతరం నిమగ్నమై ఉండటం గమనించాను. మనకు భోజనం అంటే అన్నమూ చపాతీ ఎలాగో గ్వాతెమాలవారికి మొక్కజొన్న రొట్టెలు అలా అన్నమాట.


మర్నాటి ఉదయం బాగా పెందరాళే లేచి సూర్యోదయం చూడటం కోసం సెర్రో దె ల సాంతాక్రూస్ గుట్టకేసి బయల్దేరాను. ఇంకా చీకట్లు తొలగలేదు. వీధుల్లో ఇంకా భీకర శునకాల హడావుడి సమసిపోలేదు. రోడ్లమీద మనిషి జాడలేదు. అంతా నిగూఢ నిశ్శబ్దం. ఇలాంటి వాతావరణంలో ముందుకు సాగడం క్షేమమేనా అన్న సంశయం కలిగింది. ఎందుకైనా మంచిదని తిరిగి రూముకు వెళ్ళాను. వెళ్ళి నా పాస్‌పోర్టు, బాంక్ కార్డులు, క్యాషూ రూములో ఉంచేశాను. తగుమాత్రం కరెన్సీ నోట్లు దగ్గర పెట్టుకొని రూము నుంచి బయటపడ్డాను. ఎవరైనా దారిలో అడ్డగించినట్లయితే నా దగ్గర ఉన్న డబ్బులూ, ఇంకా వాళ్ళు ఏమి అడిగితే అవీ వాళ్ళకిచ్చేద్దామన్నది నా ఆలోచన. ఆ మాత్రపు రిస్కు తీసుకోవచ్చనే అనిపించింది. లేనిపక్షంలో గదికే పరిమితమై వెలుగు కోసం ఎదురుచూడాలి. అది నాకు సమంజసం అనిపించలేదు. ప్రయాణమంటేనే ఎంతో కొంత రిస్కు ఉంటుంది కదా… ఎక్కడ రిస్కు తీసుకోవాలో ఎక్కడ బాగా జాగ్రత్తగా ఉండాలో మనకు తెలియాలి కదా – అదే గ్వాతెమాల సిటీలోనయితే ఇలాంటి రిస్కు తీసుకోవడమన్న ప్రసక్తే ఉండేది కాదు!

ఊరి సెంట్రల్ ప్లాజా చేరాక మరికాస్త ధైర్యం వచ్చింది. మనుషుల జాడ కనిపించింది. నడక సాగించాను. అయిదున్నరకల్లా సెర్రో దె ల సాంతాక్రూస్ పర్వతపాదాల దగ్గరకు చేరుకొన్నాను. అనువైన వ్యూపాయింటును ఎంపిక చేసుకొని మారబోతున్న ఉదయ వర్ణాలను గమనించాను. అవి అతి చక్కని సూర్యోదయానికి నాంది పలకడం చూశాను.

ఆ వ్యూపాయింట్ దగ్గర ఇద్దరు యువతులతో మాట కలిసింది. జర్మనీ నుంచి వచ్చిన మెడికల్ విద్యార్థులట. గుట్టమీది దారుశిలువకేసి సాగిపోతోన్న సమయంలో మా మా దేశాల వైద్య వ్యవస్థల గురించి చర్చకు వచ్చింది. జర్మనీలోని ఆరోగ్య వ్యవస్థ సంక్లిష్టభరితం అన్నారా మెడికల్ స్టూడెంట్లు. ‘దాన్ని ఒక పట్టాన అర్థం చేసుకోలేం. అందులో ముఖ్యమైన పరమార్థమేమిటీ అంటే ప్రతి మనిషికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి తీరాలి – అది వారి వారి ఆఫీసులవాళ్ళు ఏర్పాటు చేస్తారో, వ్యక్తులే తమంతట తాము ఏర్పాటు చేసుకొంటారో, అది వేరే మాట. ఇన్సూరెన్స్ మాత్రం తప్పనిసరి’ అని వివరించారా యువతులు. మా పద్ధతితో పోలిస్తే మీ బ్రిటిష్ నేషనల్ హెల్త్ సిస్టమ్ చాలా మెరుగు. మీ సేవలన్నీ ఉచితం – ఇన్సూరెన్సు ప్రతిబంధకాలు లేని వ్యవస్థ మీది అనీ అన్నారు. యు.కె. వచ్చి కొంతకాలం పనిచెయ్యాలన్న అభిలాషను వ్యక్తపరిచారు. ముగ్గురమూ కొండమీది వ్యూపాయింట్ చేరుకొన్నాం.

ఆశించినట్టే స్పష్టమైన శంకువు ఆకారపు ఆగ్వా అగ్నిపర్వత దృశ్యం మా కళ్ళముందు నిలబడింది – మేఘాల జాడే లేదు. మరొవైపు చూస్తే దిగువున రంగులీనే ఆంతీగా నగరం కనువిందు చేసింది. ఏదేమైనా ఆ చిన్ని నగరానికి చక్కగా అమరిన శిరోమణి ఆగ్వా పర్వతం.

పనహాచేల్ వెళ్ళే షటిల్ బస్సుకు ఇంకా గంటన్నర టైముంది. నింపాదిగా ఊరి వీధుల్లో పచార్లు చేస్తోంటే ఊరి కేంద్రానికి కాస్తంత పెడగా ఉన్న మహత్తర భవనమొకటి కనిపించింది. వివరాల్లోకి వెళితే అది చర్చ్ ఆఫ్ సాన్ ఫ్రాన్సిస్కో అని తెలిసింది. లోపలికి వెళుతోన్న భక్తులు కనిపించారు. అనుసరించాను. లోపల చూస్తే చర్చంతా నిండిపోయి కనిపించింది. ఆ ప్రాంగణంలో సెయింట్ హెర్మన్ పెడ్రో సమాధి ఉంది. ఆయన పదిహేడో శతాబ్దం తొలి దినాలలో కేనరీ ద్వీపాల ప్రాంతం నుంచి ఆంతీగా చేరి జీవిత పర్యంతం అక్కడివారి సేవలో గడిపాడట. 2002లో పోప్ జాన్‌పాల్ II ఆయనకు సెయింట్‌హుడ్ ప్రకటించారట.

చర్చి ప్రాంగణంలోంచి బయటకు వస్తున్నపుడు ఒక వీధి వ్యాపారి కనిపించింది. ఆమె దగ్గర ఉన్న బుట్టలోంచి పరిమళ ధూమం వెలికివస్తోంది. అది నా నోరూరేలా చేసింది. దగ్గరకు వెళ్ళి పరిశీలించాను. ఆమె తమాలేలు (Tamales) అన్న ఉదయపుటల్పాహారం అమ్ముతోంది. బరక మొక్కజొన్న పిండిలో మాంసపు తునకలో, ఛీజ్ ముక్కలో కలిపి అరిటాకుల్లో పెట్టి ఆవిరితో ఉడికించిన పదార్థమది. రెండు ముక్కలు అడిగి తీసుకున్నాను. చక్కని రుచి.

మెల్లగా సెంట్రల్ ప్లాజాకేసి నడిచాను. అక్కడ్నించి సాంతా కాతలీనా ఆర్చి మీదుగా హోటలుకు. ఆ తర్వాత అతిత్‌లాన్ సరోవర తీరాన ఉన్న పనహాచేల్ పట్టణం… షటిల్ బస్సు…

ఆంతీగా వదిలేటపుడు ఒక భావన మనసులో మెదిలింది. నన్నెవరైనా జీవిత పర్యంతం ఒకేచోట ఉండిపో అని ఆదేశించినట్లయితే ఆ ప్రదేశం ఈ ఆంతీగా నగరమే!

(సశేషం)