ఈమధ్య నాలుగయిదు వారాల్లో పది పన్నెండు ట్రావెలాగ్స్ చదివాను; చాలావరకూ మొదటిసారి చదివినవి. రెండుమూడు రెండోసారీ, మూడోసారీ.
అందులో నాలుగు పుస్తకాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కొన్నికొన్ని సంఘటనలు, అనుభవాలు, భావాలు నాకు సరిక్రొత్తవి. వాటిని నాలోనే దాచుకోవడం కన్నా పదిమందికీ చెపితే బావుంటుందనిపించింది.
మొదటి పుస్తకం అరేబియన్ శాండ్స్ అన్నది. ఓ బ్రిటిష్ నడివయసు పెద్దమనిషి 1945-50ల మధ్య అరేబియా ద్వీపకల్పంలోని, అక్కడి ఎడారి లోని ‘ఎంప్టీ క్వార్టర్’ అన్న భీకర సైకతప్రదేశాన్ని ఒకటికి రెండుసార్లు అటూ ఇటూ దాటివెళ్ళడం – క్రాస్ చెయ్యడం, ఈ పుస్తకంలోని కథావస్తువు.
రెండోది ఇన్‌టు ది వైల్డ్. జాన్ క్రకౌర్ అన్న అమెరికన్ జర్నలిస్టు రాసిన పుస్తకం ఇది. వర్జీనియా రాష్ట్రానికి చెందిన క్రిస్ మెక్‌కాండ్లిస్ అన్న ఇరవైనాలుగేళ్ళ యువకుడు సంచారజీవితాన్ని కౌగిలించుకొని తానెంతగానో కోరుకున్న అలాస్కా లోని నిర్జన అరణ్యాలలో స్వశక్తితో ఒంటరిగా దాదాపు నాలుగు నెలలు గడిపి అనుకోని విధంగా ఆ ప్రకృతిలో కలిసిపోయిన వైనాన్ని ఈ పుస్తకంలో చెపుతారు.
ఇక టేల్స్ ఫ్రమ్ ది రోడ్ అన్నది అనికేత్ కేత్కర్ అన్న పూనా యువకుడు రాసిన పుస్తకం. ఏడేళ్ళు కార్పొరేట్ ప్రపంచంలో మునిగితేలి, తన ఉనికిని తానే కోల్పోతున్నట్టు గ్రహించి, తనను తాను ఆవిష్కరించుకోవడానికి విశాల ప్రపంచాన్ని ఆశ్రయించిన వైనం ఈ టేల్స్ ఫ్రమ్ ది రోడ్.
నాలుగో పుస్తకం ది షూటింగ్ స్టార్. శివ్య నాథ్ అన్న ఓ భద్రజీవితపు బాల తన చుట్టూ ఉన్న ఆంక్షలూ రక్షణకవచాలను బద్దలుకొట్టుకొని, ఆ ప్రక్రియలో తన జీవితంతో చేస్తోన్న ప్రయోగాల వివరాలు ఈ పుస్తకం.
ఇవి సాధారణ యాత్రాకథనాలు కావు. యాత్రాపరిథులు దాటిన బతుకు పుస్తకాలివి.
1. అరేబియన్ శాండ్స్
అరేబియన్ శాండ్స్ రాసినది విల్‌ఫ్రెడ్ థెసీజర్ (Wilfred Thesiger). 1959లో మొదటి ముద్రణ. అప్పట్నించీ ఎన్నో ముద్రణలు. ఇప్పుడు అందుబాటులో ఉన్నది 2017నాటి ఎడిషన్.
నిమ్మగడ్డ శేషగిరిరావు అన్న యు.కె. వైద్యమిత్రులు తన ఒమాన్ పర్యటన విశేషాలను ఆమధ్య ఫేస్‌బుక్‌లో విపులంగా రాశారు. ప్రసంగవశాత్తూ అరేబియన్ శాండ్స్ పుస్తకం గురించి ఒకటికి రెండుసార్లు ప్రస్తావించారు. కొద్దినెలల క్రితమే ఒమాన్ వెళ్ళివచ్చిన నాకు సహజంగానే ఆ పుస్తకం చదవాలనిపించింది. తెప్పించుకున్నాను.
మన భారతదేశమంత వైశాల్యమున్న అరేబియా ద్వీపకల్పంలో మూడింట రెండు వంతులు ఎడారి. ఆ ఎడారి దక్షిణభాగాన మన భారతదేశపు దక్షిణభాగమంత వైశాల్యమున్న ఎంప్టీ క్వార్టర్ అన్న నిర్జన నిర్జల ప్రదేశముంది. పదిహేనువందల కిలోమీటర్లు పొడవు, వెయ్యి కిలోమీటర్లు వెడల్పూ ఉండి, ఊరూ వాడా నీరూ నిప్పూ దారీ తెన్నూ లేని, గడ్డిపోచ మొలవని, ఊహాతీతమైన ఎత్తు వుండే ఇసుకతిన్నెలు తటస్థపడే ఖాళీకోన అది. నైరుతి దిశలో యెమెన్, దక్షిణాన ఒమాన్, తూర్పున అరబ్ ఎమిరేట్స్, ఉత్తరాన సౌదీ అరేబియా, ఈ ఎంప్టీ క్వార్టర్‌కు ఎల్లలు.
ప్రాణాలమీద తీపి ఉన్నవాళ్ళు వెళ్ళడానికి సాహసించని ప్రదేశమది.
థెసీజర్ 1910లో ఇథియోపియాలో పుట్టాడు. తండ్రి అక్కడి బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి. మన దేశపు వైస్‌రాయ్‌గా పనిచేసిన షెమ్స్‌ఫర్డ్ ఆయన పినతండ్రి. థెసీజర్ బాల్యం ఇథియోపియాలోనే గడిచింది. హైల సిలాసీ (Haile Selassie) పట్టాభిషేకం వంటి చారిత్రక ఘటనలను తన బాల్యంలో ప్రత్యక్షంగా చూశాడు. ఇంగ్లండ్ లోని పేరున్న కాలేజీల్లో చదివాడు. చదివి మళ్ళీ ఆఫ్రికాకే వెళ్ళాడు. అక్కడి దేశాల్లో చెప్పుకోదగ్గ ఉద్యోగాలు చేశాడు.
కాని, అతని మనసంతా ప్రయాణాలమీదే. యాత్రలు తన జీవితానికి సుఖమూ అర్థమూ ఇస్తాయని గ్రహించాడు. ఉద్యోగాలు వదిలేశాడు. ఇథియోపియా, సూడాన్, ఈజిప్ట్, సహారా, డన్‌హిల్ ఎడారి ప్రాంతాలూ బాగా తిరిగాడు. ఎన్ని తిరిగినా అతని మనసంతా అరేబియా ఎడారిలోని ఎంప్టీ క్వార్టర్ మీదే. దాన్ని దాటాలన్నది అతని జీవితాశయం. అది కష్టమని తెలుసు. శ్రమ అని తెలుసు. దానికి తోడు తన మతం ఒక ప్రాణాంతక అవరోధం అని తెలుసు. ఆనాటి రాజకీయపరిస్థితులు యూరోపియన్లకు అన్నిటికన్నా పెద్ద అవరోధమనీ తెలుసు.
అయినా అదో కోరిక, తపన, ప్రగాఢవాంఛ.
అదిగో, అప్పుడొచ్చిందొక అవకాశం. మిడిల్ ఈస్ట్ దేశాల్లోను, అరేబియా ద్వీపకల్పంలోనూ ఆరోజుల్లో మిడతలదండ్లు చేసే పంట నష్టాలు అపారమట. ఆ మిడతల అధ్యయనం కోసం సౌదీ అరేబియా కేంద్రంగా ఏర్పడిన ఓ పాశ్చాత్య అధ్యయనసంస్థ ప్రతినిధిగా థెసీజర్‌కు ఎంప్టీ క్వార్టర్ పరిసరాల్లోకీ వెళ్ళే అవకాశమొచ్చింది. ఆ ద్వీపకల్పపు దక్షిణాన ఉన్న మూడు దేశాల్లోనూ తమ తమ తీరప్రాంతాలకూ లోపలవున్న ఎడారికీ మధ్య పర్వతశ్రేణులున్నాయి. ఒమాన్‌లో అయితే ఈశాన్యాన మస్కట్ దగ్గర్నించి నైరుతి కొసన ఉన్న సలాలా పట్నం దాకా కొండలే కొండలు. వర్షం కురిసే కొండలు. ఆ కురిసిన వర్షం వాగులుగా ప్రవహించి ఇటు దక్షిణాన అరేబియా సముద్రంలోను, అటు ఉత్తరాన ఎంప్టీ క్వార్టర్ ఎడారిలోను కలిసిపోతుంది. ఇంకిపోతుంది. ఆ ప్రాంతం మిడతలకు జన్మస్థానమేమో చూసి రమ్మన్నారు థెసీజర్‌ను.
అతణ్ణి అప్పటికే కాల్చివేస్తున్న ఎంప్టీ క్వార్టర్ కాంక్షకు ఈ అవకాశం ప్రాణం పోసింది. తమకు ఉపయోగపడే పరిశోధన కాబట్టి ఆయాదేశాలు సులువుగానే అనుమతులిచ్చాయి – అనేక ఆంక్షలతో.
థెసీజర్ తన అధ్యయనానికి తీరప్రాంతపు సలాలాను కేంద్రంగా చేసుకున్నాడు. ఎంప్టీ క్వార్టర్ అంచున ఉన్న ముమ్‌షిన్ పట్టణాన్ని మరో ముఖ్యబిందువుగా ఎన్నుకున్నాడు. ఈ ముమ్‌షిన్ పట్నం ఎంప్టీ క్వార్టర్‌కు ప్రవేశద్వారం అవడం కూడా యాదృచ్ఛికం కాదు. ఒమాన్ అధికారుల సహకారంతో ముందస్తుగా సలాలా నుంచి ముమ్‌షిన్ దాకా నెలరోజుల పాటు ఒక రెకీ నిర్వహించాడు. ఒంటెలు అతని ప్రయాణసాధనాలు. స్థానిక తెగలవారు అతని బంధువులు, సహచరులు, మార్గదర్శులు. అక్కడి అధికారులు అవసరాన్ని మించి అతనితో ఆ తెగలవారిని తోడుగా పంపారు – వారందరికీ అదో ఆదాయపు వనరు అవడం అందుకు ముఖ్యకారణం.
ఆ దోఫార్ ప్రాంతపు కొండల్లో, ఎడారి అంచుల్లో, ప్రయాణం చేసినన్ని రోజులూ ఆయాప్రాంతాల్లో తన ఎంప్టీ క్వార్టర్ కాంక్షాబీజాల్ని నాటుకుంటూ వెళ్ళాడు థెసీజర్. కానీ ఆ విషయం ఎక్కడా బయటకు పొక్కనివ్వలేదు. మొత్తానికి 1946-48ల మధ్య ఒకటికి రెండుసార్లు ఆ నిర్జన సైకతసముద్రాన్ని ఈదనే ఈదాడు థెసీజర్.
మొదటిసారి సలాలా, ముమ్‌షిన్‌ల నుంచి అబూ ధాబీ ఎమిరేట్ లోని బతీన్ లివా అన్న ఒయాసిస్ పట్నం దాకా – ఇది తూర్పుటిసుకల మార్గం, ఈస్టర్న్ శాండ్స్. రెండోసారి యెమెన్ లోని మున్‌వఖ్ పట్నం నుంచి అబూ ధాబీ నగరం దాకా – ఇది పడమటి సైకతమార్గం, వెస్టర్న్ శాండ్స్.
అనేకానేక అనుభవాలు, మరణపుటంచులు, పునర్జన్మలు.
ఈ ప్రయాణమంతా ఒంటెల మీదే. మనిషికొక ఒంటె. వాటితోపాటు, ఆహారపదార్థాలు తీసుకువెళ్ళడానికి, మంచినీటి తోలుతిత్తులు మోసుకెళ్ళడానికీ ప్రత్యేకంగా ఒంటెలు. మనిషికి రోజుకు లీటరు చొప్పున మాత్రమే మంచినీళ్ళ రేషను. మనిషికి నెలకు పదికిలోల గోధుమపిండి – ఇవి మామూలుగా మనిషికి అవసరమయ్యే కొలతల్లో మూడోవంతు. కానీ ఎడారి ప్రయాణాలకు అదే మహాభాగ్యం. ఇవిగాక ఒకటి రెండు అదనపు ఒంటెలు, ప్రయాణసమయంలో ఏ ఒంటె అయినా కూలబడిపోతే దానికి ప్రత్యామ్నాయంగా. అలాగే, ఆహారపదార్థాలు పూర్తిగా అడుగంటితే ఆ విషమ పరిస్థితుల్లో ఆహారం కోసం కూడా.
ఇరవై పాతిక మంది అనుచరులు, పాతిక ముప్ఫై ఒంటెల బారు. 1831నాటి ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర గుర్తొస్తుంది. కానీ ఇది మరింత దుస్సాహస యాత్ర.
ఎడారి ప్రయాణం. వైవిధ్యం లేని రోజులు. వందలమైళ్ళ వరకూ గడ్డిపోచ ఉనికి కాని, నీటిచుక్క మాట కానీ ఎరగని ఎడారి. ఒకవేళ ఎక్కడైనా నీళ్ళు కనిపించినా వాటి రుచుల జాడే వేరు. ఒంటెలు కూడా తాగడానికి నిరాకరించే చవిలేని చౌడునీళ్ళు…
వివిధ తెగలకు చెందిన విద్యాగంధం లేని సహచరులు. వారితో మనసావాచా కలిసిపోయేలా థెసీజర్ ఎన్నుకున్న స్థానిక ఆహార్యం. ఎడారి వాతావరణం పుణ్యమా అని అతని శరీరంలో రూపురేఖల్లో గుర్తుపట్టలేనంత మార్పు…
ఆ రోజుల్లో ఆ ప్రదేశాల్లో రూల్ ఆఫ్ లా అన్న మాటే లేదు. శిష్టప్రపంచం అనుకునే నాగరికత ఛాయలే లేవు. తెగల నాయకుల పరిపాలనలో జవాబుదారీతనం – ఎకౌంటబిలిటీ – అన్నమాటకు తావే లేదు. అసలు వారెవరికీ అవేవీ తెలియవు, తెలిసినా అంగీకరించరు. క్రమక్రమేణా థెసీజర్ వారి పద్ధతులకూ జీవనసరళికీ అలవాటుపడిపోయాడు. వాటిలోని శక్తీ బలాలూ, స్థానికజీవనానికి దోహదపడే పరమార్థాలూ గ్రహించి హర్షించాడు.
ఆ ప్రాంతంలో పుష్కరానికొకసారి కురిసే వానలు. అంతమాత్రానికే మురిసిపోతూ ‘ఇదిగో ఇక్కడ రెండు మూడేళ్ళ క్రితం గట్టివాన పడింది. అందుకే ఆ గడ్డిపరకలు, తుప్పలూ’ అంటూ థెసీజర్‌కు చూపించి ఒంటెలని మేపుకొనే సహచరులు. ఏ ఒంటె కాలిగుర్తులు చూసినా దాని పుట్టుపూర్వోత్తరాలు చెప్పేయగల వారి పరిజ్ఞానం. ఒకానొక కీలక ప్రదేశంలో తటస్థపడే, ఆరేడు వందల అడుగుల ఎత్తు ఉండే, అధిగమించడం అసాధ్యమనిపించే బృహత్తరమైన ఇసుకతిన్నెలు. పగటిపూట కాళ్ళ చర్మం ఊడి వచ్చేంత ఎండ. రాత్రిళ్ళు రక్తం గడ్డ కట్టించే చలి. నీళ్ళు లేక, శ్రమను భరించలేక, ఎక్కడ ఒంటెలూ మనుషులూ కూలబడి కాలం చెల్లిపోతారో అన్న భయం. మరణపుటంచుల దాకా వెళ్ళి వచ్చి చివరికి గమ్యం చేరడం.
తన ప్రయాణాల్లో బేడుతెగకు చెందిన సలీమ్ బిన్ కబీనా, సలీమ్ బిన్ ఘబైషా అన్న ఇద్దరు యువసహచరుల్ని రచయిత విపరీతంగా అభిమానించాడు. ఆప్తమిత్రుల్లా భావించుకున్నాడు. చివరికి తన అరేబియన్ శాండ్స్ పుస్తకాన్ని వారికే అంకితం ఇచ్చేశాడు. తనతోపాటు వచ్చిన సహచరులకు భిన్నంగా థెసీజర్ తనను తాను ఏనాడూ భావించుకోలేదు. వాళ్ళ తిండి, భాష, నిద్ర, కష్టనష్టాలు – అన్నీ అతనివే. వారి భాష నేర్చుకొని, వారితో బాగా కలిసిపోయి తినీ తాగీ వాగీ – వాళ్ళతోపాటుగా ఇతర స్థానికులూ తనను పరిపూర్ణంగా అంగీకరించడమే తన యాత్రకు అసలైన సార్థకత అని భావించాడు థెసీజర్. ఆపైన అతనికి ముబారక్ బిన్ లండన్ అనే పేరూ వచ్చింది.
తెగింపూ తెగబడటాలూ ఆ తెగలవారి జీవలక్షణం. వారి మధ్య స్పర్థలు, రాగద్వేషాలు, ఘర్షణలు, సంధి ఒడంబడికలు, వాటి ఉల్లంఘనలు, ఒక వందమందిని బృందంగా ఏర్పరుచుకొని తెంపరితనపు నాయకులు చేసే దారిదోపిడీలు, దండయాత్రలు, వారి శరీరంలో భాగంగా అనునిత్యం ధరించే తుపాకీలు. ఏమూల ఏ విరోధి మాటువేసి ఉన్నాడో తెలియని ప్రయాణాలు. దానికి తోడు ‘ఈ కిరస్తానీవాడిని మా నేల మీద అడుగుపెట్టనివ్వం. పెడితే ప్రాణాలు తీస్తాం’ అని హుంకరించే సంప్రదాయ ఛాందసులు – అదో ప్రపంచం. మరో ప్రపంచం.
కాని, వాళ్ళు ఎంత తెగబడేవారయినా వారికంటూ వారివారి ధర్మాలు, విలువలు, సత్సంప్రదాయాలూ ఉన్నాయంటాడు థెసీజర్. వాళ్ళకు తమ మతమంటే ఎంతో గురి. ఆరాధన. ఉదాహరణకు, వాళ్ళు వాతావరణం గురించి అస్సలు మాట్లాడుకోరట. ఈ రోజు, ఈ వారం వాతావరణం ఎలా ఉండబోతోంది అన్న ప్రస్తావనే వారికి నిషిద్ధమట. వాతావరణం దైవసంకల్పం కాబట్టి ఆ విషయంలో ఊహాగానాలు దైవద్రోహమని వారి నమ్మకం.
‘అంతా కలిసి నన్ను చంపేసి ఇసుకలో పూడ్చిపెట్టి నా దగ్గర పుష్కలంగా ఉన్న డబ్బూ దస్కం తీసుకొని ఉడాయించవచ్చు. కానీ వారికా భావన రానే రాదు. వారికా ఆలోచన వస్తుందన్న భయం నాకు కలగనే కలగలేదు’ అంటాడు రచయిత. అలాగే, ‘ఎంత ఎడారిలో ఐనా ఏ సమయంలో ఐనా ఏ అతిథి ఐనా తమ దగ్గరకు వస్తే తమ తమ అరకొర ఆహారాన్ని ఎంతో ఇష్టంగా ఆ అతిథితో పంచుకుంటారీ మనుషులు’ అంటాడు. ‘వారి బతుకు వారికి విధిని నమ్మే వేదాంతాన్ని ఉగ్గుపాలతో నేర్పుతుంది. రేపటిగురించి ఆలోచించే సౌభాగ్యం వారికి లేదు. అసలు రేపంటూ ఉంటుందో లేదో తెలియని వారి జీవితాల్లో వేదాంతధోరణి వారికి తెలియకుండానే పెనవేసుకుపోతుంది’ అంటాడాయన.
‘ఈ పుస్తకం త్వరలో అంతరించబోతున్న ఒక మహోజ్వల పురాతన నాగరికతకు నేను అర్పిస్తున్న నివాళి. నేను ఎన్నెన్ని ప్రాంతాలో తిరిగాను. ఎందరెందరినో సన్నిహితంగా చూశాను. కాని, ఈ అరేబియా ప్రాంతము, ఇక్కడి మనుషులూ నన్ను కదిలించినంతగా ఏ ఇతర ప్రాంతమూ ప్రజలూ కదిలించలేదు. ఆ ప్రాంతపు స్ఫూర్తినీ ఆ మనుషుల ఔన్నత్యాన్నీ పట్టుకొనే ప్రయత్నం ఈ పుస్తకంలో చేశాను’ అంటాడు థెసీజర్.
అని అన్నాడే గానీ స్నేహితులు ఈ పుస్తకం రాయమని పదే పదే హెచ్చరిస్తే రాయనే రాయనని మొదట్లో మొండికేశాడాయన. ‘ఎందుకు నావెంట పడతారూ? ఆ రాయడానికి పట్టే సమయంలో నేను మరికొన్ని ప్రయాణాలు చేసుకోవచ్చు కదా’ అని విసుక్కున్నాడు కూడా. చివరికి, పదేళ్ళ తర్వాత, 1959లో రాశాడు. ఇది అతని మొట్టమొదటి రచన.
చిన్న చిన్న వాక్యాలు. సరళమైన భాష. చరిత్ర గురించి, ఇతర యాత్రాసాహిత్యం గురించీ పెద్దగా ప్రస్తావన ఉండదు. తన అనుభవాలను ఒక పరిశోధకుని నివేదికలా రాసుకువెళతాడు. కానీ అతనిది అతిసూక్ష్మమైన పరిశీలన: మనస్తత్వాలు, రూపురేఖలు, హావభావాలు, వస్త్రధారణ, పద్ధతులు, అలవాట్లు, జీవనవిధానం – వీటన్నిటినీ రసవత్తరమైన పదచిత్రాలుగా మనముందు నిలబెడతాడు. దానితో తడిలేని ఎడారి ప్రయాణగాథ కాస్తా పట్టుకుంటే విడిచిపెట్టలేని రసరమ్యకథనంగా మారిపోయింది థెసీజర్ చేతిలో.
అతనికి ఆయా ప్రదేశాల నైసర్గిక స్వరూపసౌందర్యాలు, అరుదుగా కనిపించే కట్టడాలు, పట్టణాల వాస్తురీతుల వంటివాటిపై బొత్తిగా ఆసక్తి లేదు. అవి అతనికి ముఖ్యం కాదు. మనుషులు, మనుషులు ముఖ్యం అతనికి. ఆయా విశేషాలను, అనుభవాలనూ అక్కడివాళ్ళ కళ్ళతో చూసి గ్రహించి ఆస్వాదించి మనముందు పెడతాడు.
‘ఆ కాలపు పాశ్చాత్య యాత్రారచయితలకంటే భిన్నమైన మనిషి థెసీజర్. ఒక గొప్ప ప్రయాణం చేసి, దాని గురించి రాసి, ఆ ఖ్యాతి జ్యోతి క్రీనీడలో తమ తదుపరి జీవితాన్ని సుఖంగా విలాసంగా గడపడమన్నది అప్పటి కొంతమంది సాహసిక యాత్రీకుల బాణీ. యాత్ర వారికి పెట్టుబడి. థెసీజర్ బాణీ వేరు. యాత్ర అతని జీవితం. చివరిదాకా అతడు యాత్రలు చేస్తూనే ఉన్నాడు. అలా చేస్తూ చేస్తూ 93యేళ్ళ వయసులో (2003లో) వెళ్ళిపోయాడు.’ అంటాడు 2007లో వచ్చిన పెంగ్విన్ ముద్రణకు విపులమైన ముందుమాట రాసిన మరో యాత్రికుడు రోరీ స్టూవర్ట్.
1940ల నాటి అరేబియా దేశాల తీరుతెన్నులకు అద్దంపట్టే రచన ఈ అరేబియన్ శాండ్స్. నిజానికి మనకు కనిపించేది 1940 నాటి చిత్రమే కాదు; వందలాది సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చిన జీవన విధానమది. కానీ 1970ల నాటికల్లా ఆ జీవితాల్లోకి చమురు వచ్చేసింది. ఆధునికతను తెచ్చింది. జీవనచిత్రం మారిపోయింది. నాలుగువేల జనాభా ఉన్న ఆబూ ధాబీ, పాతికవేల దుబాయ్, ఇప్పుడు పదిహేనూ ముప్పై అయిదు లక్షల జనాభా ఉన్న అత్యాధునిక నగరాలయాయి. ఇంత స్వల్పవ్యవధిలో ఇన్నిన్ని మార్పులా అని విస్తుపోవడం మనవంతు. రాబోయే మార్పుల గురించి, తాను తిరిగి 1977లో వెళ్ళినప్పుడు గమనించిన, రానేవచ్చిన మార్పులని చూసి బాగా కలవరపడ్డాడు థెసీజర్. మళ్ళీ 1990లో వెళ్ళినప్పుడు ఆ మార్పులను అంగీకరించి ఆమోదించాడాయన.
నేను చేసినది కేవలం ఉపరితల పరామర్శ. పుస్తకం అందుబాటులో ఉంది. అందుకొని చదివితే కొత్త ప్రపంచం కనబడుతుంది. మనకు అందుతుంది.
2. ఇన్‌టు ది వైల్డ్
జాన్ క్రకౌర్ (Jon Krakauer) రాసిన ఇన్‌టు ది వైల్డ్ పుస్తకంలో క్రిస్టఫర్ మెక్‌కాండ్లెస్ ప్రధానపాత్ర. క్రిస్ పుట్టినది కాలిఫోర్నియాలో అయినా చిన్నతనంలోనే తూర్పుతీరానికి కుటుంబం బదిలీ అయింది. చిన్నప్పటినుంచీ చదువుల్లోనూ ఆటల్లోనూ ఎంతో ప్రతిభ చూపించిన మనిషి. డిగ్రీల మీద పెద్దగా నమ్మకం లేకపోయినా తల్లిదండ్రుల కోరిక మేరకు అట్లాంటా నగరంలోని ఎమరీ యూనివర్శిటీ నుంచి డబల్ మేజర్స్‌తో డిగ్రీ తీసుకున్నాడు. ఆ సమయంలో తాను సంపాదించుకున్న డబ్బంతా దానం చేసి, దేశాటన కొనసాగించాడు. 1992 నాటికి దేశమంతా రెండేళ్ళపాటు తిరుగాడి తన చిరకాలపు కలను సాకారంచేసుకోడానికి అలాస్కా అడవులలోకి వెళ్ళాడు. అక్కడ ఒక నిర్జన ప్రదేశంలో తన స్వశక్తి మీదే ఆధారపడి దాదాపు నాలుగు నెలలు గడిపాడు. అనూహ్యపరిస్థితుల్లో అక్కడినుంచి తిరిగిరాలేక ఆ అడవిలో ప్రాణాలు కోల్పోయాడు.
ఆ వార్త అలాస్కాలో సంచలనం సృష్టించింది.
స్వతహాగా పర్వతారోహకుడు, సాహసీ అయిన జాన్ క్రకౌర్, క్రిస్ రాసుకున్న నోట్స్ ఆధారంగా ఇన్‌టు ది వైల్డ్ అన్న పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. రెండేళ్ళపాటు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. ఎన్నో భాషలలోకి అనువదించబడింది. సినిమాగా కూడా తీయబడింది.
క్రిస్ తండ్రి వాల్ట్, పేదరికాన్ని స్వశక్తితో అధిగమించిన వ్యక్తి. రాజధాని వాషింగ్‌టన్ డి.సి.లో నాసా సంస్థలో మంచి ఉద్యోగం చేసి రాణించాడు. నడివయసులో ఉద్యోగం వదిలిపెట్టి సొంతంగా కన్సల్టెన్సీ నడిపి విజయం సాధించాడు. క్రిస్ తల్లి బిల్లీ, వాల్టర్‌కు నాసాలో సహోద్యోగి. తర్వాత కన్సల్టెన్సీలో బిజినెస్ పార్ట్‌నర్. వీరికి భిన్నంగా క్రిస్ లోతైన మనిషి. పుస్తకాలంటే బాగా ఇష్టం. ఆధునిక జీవనసరళిని వ్యతిరేకించే ఆదర్శవాది. తోల్‌స్తోయ్ జీవనవిధానం పట్ల గురి, అభిమానం. సుఖాలను తృణీకరించడం అతని నైజం. వెల్త్ ఈజ్ షేమ్‌ఫుల్ అని నమ్మాడు. అలా అని ప్రపంచ జ్ఞానానికేమీ లోటు లేదు. గొప్ప సంపాదనాకౌశల్యం ఉన్న మనిషి కూడానూ. హైస్కూలు రోజుల్లోనే చిరువ్యాపారాలు నిర్వహించి రాణించాడు. డిగ్రీ రోజుల్లో తండ్రి నడుపుతున్న కన్సల్టెన్సీ కోసం ఒక సాఫ్ట్‌వేర్ రూపకల్పన చేసి విజయవంతంగా అమ్మాడు.
తల్లిదండ్రుల తమతమ రెండో వివాహాలకు పూర్వమే పుట్టిన బిడ్డ క్రిస్. బిల్లీతో అనుబంధం ఏర్పడినాక కూడా తండ్రి తన మొదటి భార్యతో సంబంధం కొనసాగించాడు. రెండు పడవల ప్రయాణం చేశాడు. ఆ విషయం బైటకు పొక్కి తన గౌరవమర్యాదలకు భంగం కలుగుతున్న తరుణంలో ఎంతో చాకచక్యంతో మసిపూసి మారేడుకాయ చేశాడు. ఈ విషయాలు క్రిస్‌కు తన మలి టీనేజ్ దశలో తెలిసి కలవరపడ్డాడు. అప్పటికే తండ్రి ప్రదర్శించే అదుపూ ఆజ్ఞలూ నిండిన కఠోరమైన పితృత్వం అంటే క్రిస్‌కు వెలపరం. వైవాహిక, వివాహేతర సంబంధాల విషయంలోను, తన పుట్టుక విషయంలోనూ తండ్రి ప్రదర్శించిన కాపట్యం క్రిస్‌ను తన కుటుంబం నుంచి మాత్రమే కాకుండా, యావత్ నాగరికప్రపంచం నుంచి కూడా పారిపోయేలా ప్రేరేపించింది.
డిగ్రీ అందుకోగానే సభ్యప్రపంచం నుంచి మాయమయిపోయాడు క్రిస్. అమ్మకు, నాన్నకు, తాను అమితంగా ప్రేమించే చెల్లికి – ఎవరికీ అందనంత దూరంగా వెళ్ళిపోయాడు. తన దగ్గరున్న ఇరవైనాలుగువేల డాలర్లను అన్నార్తులకు విరాళంగా ఇచ్చేశాడు. తాను తిరిగిన దారుల్లో ఎక్కడో తన కారును వదిలేశాడు. దానితోపాటు తనకున్న కాసిన్ని వస్తువులనూ త్యజించాడు. సమాజపు ఒడిదుడుకుల అంచులమీద తనకో కొత్తజీవితం ఆవిష్కరించుకొనే ప్రయత్నంలో పడ్డాడు. ఆరిజోనా రాష్ట్రంలో, కొలరాడో నదీతీరపు చిన్నచిన్న పట్నాల్లో చిన్నా చితకా ఉద్యోగాలు చేశాడు. అన్ని వయసులవారితో, అన్ని దేశాలవారితో స్నేహం చేశాడు. బాంధవ్యాలు ఏర్పరుచుకున్నాడు. నచ్చినవారికి ప్రాణమిచ్చాడు. తనకు తటస్థపడిన ప్రతివారి మీదా బలమైన ముద్ర వదిలాడు.
తనను చూసి ముచ్చటపడి శృతిమించిన సాయం చేయబోయిన ఒక ఎనభై యేళ్ళ పెద్దమనిషితో ’నేను నిరాధారపు అనాథను కాను. కావాలనే ఇలాంటి జీవితాన్ని ఎంచుకున్నాను’ అని చెప్పాడు. అంతకుముందే కెరీర్ ప్రస్తావన తెచ్చిన తండ్రితో ‘ఈ కెరీర్ అన్నది ఇరవయ్యవ శతాబ్దం సృష్టించిన అందమైన వల’ అని అనేశాడు. ఆ సాయపు పెద్దాయనకే రాసిన సుదీర్ఘమైన ఉత్తరంలో ‘ఎంతకాలం అలా సంతోషం లేని జీవితంలో బందీగా ఉంటావు? ఆ జీవితం ఇచ్చే రక్షణకు అలవాటు పడిపోతావు? నిన్ను నువ్వు గాయపరచుకుంటావు? సంతోషం అనుభవాల నుంచి వస్తుంది. సాహసాల నుంచి వస్తుంది. అది నీకు ఎక్కడో దూరంగా లేదు. చెయ్యి చాచి అందుకో!’ అని చెప్పాడు. ఆ ఎనభైయేళ్ళ పెద్దాయన ఈ యువస్నేహితుని సలహాను పాటించి తానుండే బంగళాను వదిలిపెట్టి నదీతీరాన టెంటు, స్లీపింగ్ బ్యాగ్‌లతో కేంప్ ఏర్పాటు చేసుకున్నాడు!
డిగ్రీ అయిపోగానే అట్లాంటా నగరం వదిలిపెట్టి తాను కోరుకొనే భిన్నమైన అనుభవాల కోసం దేశమంతా తిరిగాడు క్రిస్. అలా తిరుగుతూ తిరుగుతూ దేశపు ఉత్తరాన సౌత్ డకోటా రాష్ట్రంలోని కార్థేజ్ అన్న చిన్న ఊరిలో వేన్ వెస్టర్‌బర్గ్ అన్న ధాన్యపు గిడ్డంగి నడిపే ఒక పెద్దమనిషి దగ్గర కొన్ని నెలలు పని చేశాడు. అతనితో గాఢమైన అనుబంధం ఏర్పరుచుకున్నాడు. తండ్రీకొడుకుల అనుబంధమది. అలాస్కా వెళ్ళేముందు ’ఇంకో పదిరోజులు ఇక్కడే ఉండు. నాకు నీ అవసరం ఉంది. నీ ప్రయాణానికి అవరోధం కలక్కుండా అలాస్కాకు విమానపు టికెట్ కొనిపెడతాను’ అని వెస్టర్‌బర్గ్ అంటే ’అది యాత్రాస్ఫూర్తికి విరుద్ధం. మోసం అవుతుంది’ అంటూ తిరస్కరించాడు క్రిస్.
1992 ఏప్రిల్ 7న వేన్‌కు పంపిన పోస్ట్‌కార్డ్‌లో ‘ఐ నౌ వాక్ ఇన్‌టు ది వైల్డ్’ అని రాశాడు. క్రిస్ రాసిన చిట్టచివరి ఉత్తరమది.
‘అలాస్కానుంచి వచ్చాక తన అనుభవాలను పుస్తకంగా రాస్తానన్నాడు క్రిస్!’ అని క్రకౌర్ దగ్గర వాపోయాడు వెస్టర్‌బర్గ్.
డెబ్భై లక్షల డాలర్లు పోసి 1867లో రష్యానుంచి అమెరికా కొనుక్కున్న విశాల శీతలప్రాంతం అలాస్కా. మంచు, మంచుకొండలు, నదులు, అడవులు, పల్లెలు, పట్నాలు – ఫెయిర్‌బాంక్స్ అన్నది అలాస్కాలో ఒక ముఖ్యమైన పట్టణం. ఆ ఊరికి రెండువందల కిలోమీటర్ల దూరాన అలాస్కా పర్వతశ్రేణి పాదచ్చాయల్లో ఉంది స్టాంపీడ్ ట్రెయిల్ (Stampede trail) అనే పాదయాత్రామార్గం. ఆ 30 కి.మీ.ల దుర్గమమైన ట్రెకింగ్ రూట్‌లో వెళ్ళి ఎవరూ లేనిచోట గడిపిరావాలన్నది క్రిస్ కోరిక. వెళ్ళాడు.
రెండు మూడు నెలలు తాను అనుకున్న రీతిలో గడిపాడు. సుషానా నది ఒడ్డున కనిపించిన ఒక పాత బస్సులో తన నివాసం ఏర్పరుచుకున్నాడు. వెంట తెచ్చుకున్న తుపాకీతో చిన్నచిన్న జంతువుల్ని వేటాడాడు. తనతో తెచ్చుకున్న ఒకట్రెండు పుస్తకాల సాయంతో తినడానికి పనికొచ్చే కందమూలాలు, పళ్ళనూ గుర్తెరిగి వాటితో కడుపు నింపుకున్నాడు. చుట్టుపక్కల అడవుల్లో తిరుగాడాడు. కొండలు ఎక్కాడు. తన పరిశీలనలను, అనుభవాలను నోట్స్‌గా రాసుకున్నాడు.
అలా అరవైఏడు రోజులు గడిపాక వెనకకు వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఫలించలేదు.
ఆ ముప్ఫై కిలోమీటర్ల ట్రెకింగ్ బాటలో రెండు నదులు ఉన్నాయి. తాను అరవైఏడు రోజులుగా గడిపిన సుషానా అందులో ఒకటయితే, దానికన్నా ముందు దాటివచ్చిన టెక్లనికా అన్న నది ఇంకొకటి. ఏప్రిల్ నెలలో మోకాలిలోతు నీటితో అమాయకంగా కనిపించిన టెక్లనికా నది జులై కల్లా వేసవిలో కరిగిన మంచు పుణ్యమా అని ఉగ్రభీకర ప్రవాహమై కనిపించింది. దాటలేకపోయాడు. తను ఒకప్పుడు దాటిన చోటనుంచి కేవలం అరమైలు దూరంలో ఒక పాత కేబుల్ కార్ ఉందన్న సంగతి అతనికి తెలియదు. వెనకకు వచ్చి మళ్ళా ఆ బస్సులో ఉండిపోయాడు. మరో నెలన్నరకు మరణించాడు. మరణించిన పంతొమ్మిది రోజులకు స్థానికులైన వేటగాళ్ళకు క్రిస్ మృతకళేబరమై కనిపించాడు.
క్రిస్ రాసుకున్న నోట్స్ మొత్తం 113రోజులు.
క్రకౌర్‌ను క్రిస్ మరణం వెంటాడింది. క్రిస్ జీవితానికి, తన జీవితానికీ దగ్గర పోలికలున్నాయని అనిపించింది. ఆ మరణం గురించి మరింత విస్తృతమైన పరిశోధనకు పూనుకున్నాడు క్రకౌర్. క్రిస్ కుటుంబాన్ని వదిలివేసి రెండేళ్ళపాటు తిరుగాడిన ప్రదేశాలు, కలసిన మనుషులు, కలుపుకొన్న బాంధవ్యాలు, చేసిన ఉద్యోగాలు, ఎనభైయేళ్ళ పెద్దాయన, తండ్రి లాంటి వెస్టర్‌బర్గ్ – అన్ని చోట్లకూ వెళ్ళాడు. అందర్నీ కలిశాడు, మాట్లాడాడు. రెండేళ్ళ క్రిస్ జీవితాన్ని, నాలుగు నెలల ఒంటరి అనుభవాన్ని, అకాలమరణాన్నీ పునర్నిర్మించే పని పెట్టుకున్నాడు.
ఆ ప్రక్రియలో సమాజపు కాపట్యం క్రిస్‌లాంటి వారిలో నింపే జుగుప్స, ప్రకృతి అలాంటి పడుచువాళ్ళను ఆకర్షించి సేదతీర్చే విధానం, సంపద-అభిరుచుల మధ్య సాగే నిరంతర ఘర్షణ, భద్రజీవితపు పాత తరానికీ స్వేచ్చాపతాకల్లాంటి యువతరానికీ మధ్య ఏర్పడే అగడ్తలు, సంచారజీవితాల్లోని సుఖదుఃఖాలు, జీవనసాఫల్యాలు, సమాజపుటంచులలో బతికేవారి భావధోరణులు, వారు ప్రదర్శించగల ఉదాత్తతలు – ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో క్రకౌర్ అనుభవంలోకి వచ్చాయి. ఆ అనుభవాల అల్లికే ఈ ఇన్‌టు ది వైల్డ్ పుస్తకం.
ఒక నిబద్ధత నిండిన జర్నలిస్టు చేసిన కఠోరశ్రమ ఫలితం ఈ పుస్తకం. నిబద్ధతతో పాటు రచయిత స్వతహాగా యాత్రికుడవటం వల్ల అతను క్రిస్ అంతరాత్మను చక్కగా పట్టుకోగలిగాడు. అలాగే క్రిస్ కుటుంబసభ్యులను, క్రిస్ రెండేళ్ళపాటు కలిసిన, కలిసి గడిపిన అనేకమంది మిత్రులనూ సజీవంగా మనముందు నిలుపగలిగాడు. తరచుగా, పాఠకుల కోసం రచనను ఆసక్తిదాయకంగా మలిచే పాశ్చాత్యధోరణి ఈ పుస్తకంలో కనపడదు. అంచేత ఈ అపురూప విషాదగాథ చదువరుల మనసుల్లో బలమైన ముద్ర వెయ్యగలుగుతుంది.
క్రిస్ గురించి చెప్తూ క్రకౌర్ ఒక మాట అంటాడు: క్రిస్ తలతిక్కమనిషి కాడు. సమాజవిరోధి కాడు. మరి అతనేమిటి? అని అడిగితే చెప్పడం కష్టం. బహుశా అతన్ని తీర్థయాత్రికుడు – పిల్‌గ్రిమ్ – అనడం సబబు.
క్రిస్ మరణానికి కారణాల గురించి అనేకానేక ఊహాగానాలు అప్పట్లో చెలరేగాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అది ఆత్మహత్యా? ఆకలిచావా? ఇంకేమైనానా? అవేమీ కాదంటాడు క్రకౌర్. ఏవో విషపూరితమైన కందమూలాలను పొరపాటున తినడమే కారణమంటాడు.
ఇన్‌టు ది వైల్డ్ చదివి ఎంతోమంది ఎన్నో విధాలుగా స్పందించారు. క్రిస్ ఆదర్శవాదం, నిబద్ధత, ధైర్యసాహసాలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి. కొంతమంది అతడొక నార్సిసిస్టిక్ మూర్ఖశిఖామణి అని నిరసించారు. కానీ అతని కథ మనసును కలచివేస్తుంది. గుండెల్ని పిండుతుంది. కన్నీళ్ళు కురిపిస్తుంది.
క్రిస్, అతని ఆలోచనలు, అభిరుచులు, ఫిలాసఫీ, గమ్యం లేని గమనం, బతుకు, మరణం – వీటన్నిటి గురించీ ఈ నాలుగు మాటల్లో చెప్పడం అసాధ్యం. ఏదేమైనా అతగాడి ఆలోచనలూ అనుభవాలూ నాలాంటివారికి అపురూప వరాలు.
3. టేల్స్ ఫ్రమ్ ది రోడ్
కేశవచంద్ర నాకు ఆమధ్యనే పరిచయమయిన స్నేహితుడు. రెణ్ణెల్ల క్రితం ఒక పుస్తకం పంపారు.
అనికేత్ కేత్కర్ అన్న యువకుడు రాసిన టేల్స్ ఫ్రమ్ ది రోడ్ అన్న పుస్తకమది. పుస్తకం పేరు గాని, రచయిత పేరు గానీ అంతకుముందు వినలేదు. ఏదో వేరే పనిలో ఉండి పుస్తకాన్ని అవతలపెట్టాను. వారం తర్వాత ‘సరే ఏమిటో చూద్దాం’ అని తిరగేశాను. వేళ్ళు పుస్తకానికి అతుక్కుపోయాయి. మనసు అక్షరాల వశమైపోయింది. రెండు మూడు రోజులు విడవకుండా చదివాను. చదవడం ముగించాక ‘ఎంత మంచి పుస్తకం రాశావోయ్ అనికేత్!’ అనుకోకుండా ఉండలేకపోయాను.
ఈ పుస్తకంలోని ప్రయాణాలు చేసే సమయానికి అనికేత్ ముప్ఫై ఏళ్ళ యువకుడు. అప్పుడే తాను ఏడేళ్ళుగా చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి తొమ్మిది నెలలపాటు ఆగ్నేయాసియా దేశాల్లో తిరుగాడటానికి ఉపక్రమించిన సి.ఎ. చదివిన మనిషి.
చిన్నప్పట్నుంచి ప్రయాణాల గురించి ఆశపడ్డాడు. పెరిగి పెద్దయ్యి బాగా డబ్బు సంపాదించాక ప్రపంచమంతా తిరిగి చూడాలని కలలు కన్నాడు. చదువు ముగించి ఉద్యోగంలో చేరాక ఆ బాధ్యత పుణ్యమా అని అమెరికాతో సహా చాలా దేశాలు చూశాడు. అవిగాక ప్రతీ ఏడాదీ రెండు మూడు వారాలు శెలవు తీసుకొని శ్రీలంక, వియత్నామ్, మంగోలియా దేశాలు వెళ్ళాడు.
ఆ మంగోలియా ప్రయాణంలో అతనికో ఫ్రెంచి యువతి తటస్థపడింది. లెక్కల టీచరుగా పనిచేసిన ఆ మహిళ ఉద్యోగం వదిలేసి, ఉన్న సామాన్లన్నీ అమ్మేసి, అత్యవసరమైన మూడంటే మూడే కిలోల వస్తువుల్ని బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకొని, రోడ్డు పట్టుకుంది. ఫ్రాన్స్ నుంచి మంగోలియా దాకా విమానమన్నది ఎక్కకుండా హిచ్‌హైకింగ్ చేస్తూ వచ్చింది. అదే పద్ధతిలో ఆగ్నేయాసియా దేశాలన్నీ తిరగాలన్నది ఆమె ప్రణాళిక. అది చూసి ముచ్చటపడ్డాడు అనికేత్. ముచ్చటే కాదు. అదో ఉత్తేజం, ప్రేరణ.
అదే మంగోలియా ప్రయాణంలో అనికేత్‌కు ఒక టర్కీ జంట పరిచయమయింది. అతనూ అనికేత్ లాగానే ఛార్టర్డ్ అకౌంటెంటు. ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఇద్దరూ ఉద్యోగాలు వదిలేసి రెండేళ్ళపాటు ప్రపంచం చూసొద్దామని బయల్దేరారు. వాళ్ళను చూశాక అనికేత్‌కు తన ‘ఏడాదిలో రెండువారాల యాత్రలు’ అన్న భావనలోని డొల్లతనం తేటతెల్లమయింది. ఆ ప్రయాణంలోనే, అనికేత్ ఓ మంగోలియా సంచారకుటుంబానికి రెండు రోజులు అతిథిగా గడిపాడు. వారికి ముగ్గురు పిల్లలు. అతిథిగా గడిపిన చనువుతో అనికేత్ ఆ మంగోలియన్‌ను అడిగాడు: ‘మీకు మీ పిల్లలు బాగా చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లయి జీవితంలో స్థిరపడాలని అనిపించదా?’
ఆ మనిషి విస్తుపోయాడు. తేరుకొని సమాధానమిచ్చాడు: ‘మా పిల్లల్ని చూడు. సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని చూడు. సంతోషంగా ఉన్నాం. మాకు అవసరమైనవన్నీ ఉన్నాయి – తిండి, వసతి, పెంచుకోడానికి గుర్రాలు… మాది సరళమైన జీవితం. మాకిష్టమైన జీవితం. డబ్బు ప్రమేయం లేని జీవితం. ధనం దురాశకు మూలం. మా పూర్వీకులు ఇలానే బతికారు. మా తల్లిదండ్రులు ఇలానే బతికారు. మేం ఇలానే బతుకుతున్నాం. మా పిల్లలు కూడా ఇలానే సంతోషంగా బతకాలని మా కోరిక’.
ఆ సంభాషణ అనికేత్‌కు ఒక కనువిప్పు.
ఈ పోటీ ప్రపంచంలో, ధనం చుట్టూ తిరిగే ప్రపంచంలో తన ఉనికి తాను కోల్పోతున్నానని స్ఫురించింది అనికేత్‌కు. దానిని తిరిగి సాధించుకోవాల్సిన అవసరం స్పష్టమయింది.
2013లో అనికేత్ ఉద్యోగం వదిలిపెట్టాడు.
ఉద్యోగం వదిలిన అనికేత్ తొమ్మిది నెలల ఆగ్నేయాసియా యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఆరువేల డాలర్లు అతని యాత్రకు మూలధనం. రోజుకు పదిహేను డాలర్లన్నది అతని ఆర్థిక ప్రణాళిక – మళ్ళా అందులో అయిదు డాలర్లు వసతి కోసం.
ముందుగా తనకు అప్పటికే పరిచయం ఉన్న వియత్నామ్ చేరుకున్నాడు. అక్కడ తను ఉంటున్న యాత్రికుల హాస్టల్లో ఓ కొరియన్ అమ్మాయి పరిచయమయింది. మర్నాడు తాను ఓ స్థానిక గ్రామీణరైతు కుటుంబానికి అతిథిగా వెళ్ళి వారి కొత్త సంవత్సరం వేడుకల్లో పాలుపంచుకోబోతున్నానని చెప్పింది. మరో ఆలోచన లేకుండా అనికేత్ ఆ అమ్మాయితో కలిసి ఆ గ్రామం వెళ్ళిపోయాడు. ఆ గ్రామీణకుటుంబం ఏ ఆశ్చర్యమూ పడకుండా అనికేత్‌ను సాదరంగా ఆహ్వానించింది. ఆ కుటుంబీకులు క్షణాలలో అనికేత్‌ను తమలో ఒకడిగా కలిపేసుకున్నారు.
మర్నాడు ఆ కుటుంబం కుటుంబమంతా – తమ కొరియా, ఇండియా అతిథులతో సహా – పక్క ఊరికి ప్రయాణం కట్టారు. ఆనాటి వేడుకలు అక్కడ ఉన్న మరో బంధువుల కుటుంబంతో. ప్రయాణం నదిలో, తమకున్న నాటుపడవలో. పడవ ఎక్కాక అనికేత్ తమ ఇంటి ముఖద్వారం కేసి చూశాడు. ఏ తాళమూ లేని ఆ ఇంటి ద్వారం అనికేత్ వైపు చూసి ఆప్యాయంగా నవ్వింది.
సరళజీవితపు వాస్తవ సారాంశం అనికేత్‌కు పరిపూర్ణంగా అర్థమయింది.
రేపటిదంటూ ప్రణాళిక లేదు. ఏ ఊళ్ళో ఎన్నాళ్ళనిపిస్తే అన్నాళ్ళుండటం – ఆ దేశపు వీసా పరిమితే అతనికి హద్దు. గమ్యం లేని గమనం. భయసంకోచాలు లేని ప్రయాణాలు. ‘రేపు ఎక్కడ ఉండబోతున్నానో తెలియకపోవడమే నాకు గొప్ప ఉత్తేజాన్నీ ప్రేరణనూ కలిగించిన విషయం’ అంటాడు అనికేత్.
అతగాడిని తిరుగుబోతు అందామా? కాదు. సంచారి అనాలి. అతడో అనాది సంచారి.
ఆ సంచారాల్లో ఓ మారుమూల వియత్నామ్ పల్లెటూర్లో అద్దె సైకిల్ మీద తిరుగుతూ స్థానికయువకులతో క్షణాల్లో సైకిల్ రేసుల్లోకి దిగుతాడు అనికేత్. తనతోపాటు డార్మిటరీలో ఉంటోన్న మరో ఇద్దరు మిత్రులతో కలిసి వియత్నామ్ యుద్ధపు శోకభూములు చూసి వస్తాడు. నాపామ్ బాంబుల తాకిడికి భీతిల్లి నగ్నంగా రోడ్డు మీద పరిగెడుతున్న తొమ్మిదేళ్ళ బాలిక ఛాయాచిత్రం… పేలని బాంబులు నిండిన భీకరమైదానాలు… లక్షలాదిమంది అకారణంగా ప్రాణాలు కోల్పోయిన దారుణ విషాదం.
అనుకోకుండా కలిసిన ఓ అమెరికన్ యాత్రికుని మాటలు అనికేత్‌లో ఆలోచనల తేనెతుట్టెను కదిలిస్తాయి: ‘ఏదో మంచి జీవితం, మంచి జీవితం అంటూ మన కలల్ని మనమే పూడ్చిపెట్టుకుంటున్నాం. మనకు దగ్గరవాళ్ళే అయినా ఇంకెవరెవరి కలల్నో సాకారం చేయడానికి మన కలల్ని పాతాళంలోకి నెట్టేస్తున్నాం. ఆ ప్రక్రియలో అసలు మనం జీవించడమే మర్చిపోతున్నాం…’
ఓ శుభోదయాన లాఓస్ లోని హుయాబో అన్న మారుమూల గిరిజనగ్రామం ఆచూకీ వెదుకుతూ మరో ఇద్దరు యాత్రికమిత్రులతో కలిసి బయల్దేరతాడు అనికేత్. పంటకొచ్చిన పొలాలు, జర్రున జారే పొలం గట్లు, అప్పుడప్పుడూ పలకరించే పాములు – మొత్తానికి ఆ గ్రామాన్ని కనిపెట్టి అడుగుపెడతారు మిత్రత్రయం.
పదిహేను పదహారు వెదురువాసాల మంచెల మీద నిర్మించిన ఇళ్ళు. గ్రామం చుట్టూ వెదురు దడి. కుతూహలంతో వీరికేసి తేరిపార చూసే చిన్నా పెద్దా, ఊరి చివర కాస్తంత పెద్దగా ఉన్న ఇల్లు.
కియో అన్న ఒక బానపొట్ట పెద్దాయన ఆ యింటి యజమాని. ఆ ఊరి నాయకుడు. ఉన్న ఒకే ఒక్క రెస్టారెంటు ఓనరు. నాలుగు గదుల ముతక రిసార్టుకు మేనేజరు. సహజ స్నేహశీలి, మాటకారీ అయిన ఇంగ్లీష్ మాట్లాడే మిస్టర్ కియో క్షణాల్లో వీరికి స్నేహితుడయిపోతాడు. గదులు ఇస్తాడు. స్నానానికి చిన్నపాటి కొండవాగు చూపిస్తాడు. స్థానిక సమాచారం అందిస్తాడు. ఎప్పటివో కథలు వినిపిస్తాడు. రుచికరమైన కోడిమాంసపు విందు తినిపిస్తాడు… సురాపానం సరేసరి.
సాయంత్రం పూట పిల్లల చేతుల్లో ఏదో వస్తువు. అది ఆడుకొనే వస్తువే కదా అని పరిశీలిస్తే పిస్తోలు! వెదురు పిస్తోలు, కాగితపు బులెట్లు. వాళ్ళల్లో తనూ పిల్లవాడయిపోయి యుద్ధభూమిలో అడుగుపెడతాడు అనికేత్. తొమ్మిదిమంది గిరిజన బాలబాలికలు, ఒక్క భారతీయ పసియువకుడు – అటూ ఇటూ బారులు తీరి కేరింతలతో ప్రోత్సహించే ఆడా మగా! అదో అరుదైన బాల్యకేళీవిలాసం. ‘ఔరా అనికేత్!’ అనిపిస్తుంది మనకు.
ఇలాంటి అనుభవాలు పుస్తకం నిండా పరచుకొని ఉన్నాయి. బీచ్‌లలో హూలాహూప్స్ విన్యాసాలు చేసి డబ్బులు సంపాదించే డార్మిటరీ సహయాత్రి; ‘మా దేశంలో హిచ్‌హైకింగా? మతిపోయిందా?’ అని వారించే లాఓస్ వాసుల మాటలు పెడచెవిన పెట్టి చక్కని అనుభవాన్ని మూటగట్టుకోవడం; కంబోడియాలో అన్కోర్ వాట్ పురావైభవ దర్శనం, అక్కడి నైట్ మార్కెట్లో విలక్షణ అనుభవాలు; ఇండోనేషియాలో ఓ ఆరిపోయిన అగ్నిపర్వతపు అన్వేషణలో అందరూ వెళ్ళే పద్ధతికి భిన్నంగా వెళ్ళి రెండుమూడు రోజులు కొత్త అనుభవాలు పొందడం, నదీద్వీపాల నడుమ ఉన్న ఓ మత్స్యకారుల పల్లెలో రోజుల తరబడి ఉండిపోయి ఆ పరిసరాల్లో ఇమిడిపోవడం; డబ్బులయిపోతున్నా తైవాన్ మీద ఆసక్తితో కౌచ్‌సర్ఫింగ్ పద్ధతిలో అక్కడ వసతులు సంపాదించి ప్రయాణించడం, ఆ వసతి ఇవ్వడానికి అంగీకరించిన గృహస్తులు తమ ఇంట్లో ఓ సోఫా చూపించి ఊరుకోకుండా ’నువ్వు మాదేశపు అతిథివి. నిన్ను మా దేశమంతా తిప్పి చూపించడం మాకు సంతోషహేతువు’ అని ఆదరించడం; లెక్కకు మిక్కిలి అనుభవాల పరంపర అనికేత్‌ది.
‘యాత్ర అంటే ప్రఖ్యాతస్థలాలకు వెళ్ళడం, వాటితో ఫోటోలు దిగడం కాదు. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశంతో కలిసిపోవడం. అందులో స్వస్థలాన్ని చూసుకోగలగడం.’ అంటాడు అనికేత్. అలాగే ‘టూరిస్టులు తమ పక్క ఊరికి వెళ్ళినా ప్రస్ఫుటంగా కనిపించి పట్టుబడిపోతారు. యాత్రికులు ఎంత పరాయిప్రాంతం వెళ్ళినా అక్కడ క్షణాల్లో ఒదిగిపోతారు.’ అనీ అంటాడు అనికేత్.
‘యాత్ర అంటే అదో అనుక్షణపు అన్వేషణ. జ్ఞాన సముపార్జన. వాటిద్వారా సుప్తచైతన్యంలోని ఎన్నెన్నో కోణాలు మనకు స్పష్టమవుతాయి. ఒక దశ దాటాక ప్రతీ ప్రయాణమూ ఒక స్పిరిచ్యువల్ జర్నీ అవుతుంది’ అన్నది అనికేత్ అనుభవం.
ఓ సాయంత్రాన ఒక బీచ్‌లో తిరుగాడుతున్న అనికేత్‌కు హామక్‌లో ఇలమరిచి పరవశిస్తోన్న ఒక మహిళ కనిపిస్తుంది. క్షణాల్లో కబుర్లు.
‘ఇంట్లో గొడవలవల్ల ఇలా తిరగడానికి వచ్చావా?’ ఆమె ప్రశ్న. లేదంటాడు అనికేత్.
‘ఉద్యోగం విసుగనిపించి ఇలా వచ్చావా?’ మరో ప్రశ్న. అదీ కాదంటాడు.
‘నా పనిని నేను బాగా ఇష్టపడ్డాను. నాకు నా కుటుంబం అన్నా, ఆనాటి జీవితమన్నా ఇష్టమే. కానీ ఇలా ప్రపంచమంతా తిరగాలన్నది నా కల. దాన్ని సాకారం చేసుకునే ప్రయత్నమిది.’ వివరిస్తాడు అనికేత్.
‘నీ ప్రయాణాలకు వనరులు ఎలా సమకూర్చుకుంటావు?’ అనికేత్ ప్రశ్న. ‘ఐ యామ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌డ్!’ ఆమె జవాబు. కబుర్లు అలా కొనసాగుతాయి. విడివడే సమయం వస్తుంది. వెళ్ళొస్తాను అంటాడు అనికేత్. ‘నేనేం పని చేస్తున్నానో అడగలేదు నువ్వు!’ అంటుంది ఆమె.
‘అవసరం అనిపిస్తే చెప్పేదానివి కదా…’
‘అది విని మనుషులు నన్ను జడ్జ్ చేయడం నాకు ఇష్టం లేదు.’
‘చేస్తే చెయ్యనీ. నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోనంతకాలం మరేం పర్లేదు.’ అనికేత్.
ఆ చిరు అధ్యాయం పేరు – ఓ నీలిచిత్రతారతో ఒకానొక సాయంత్రం.
అనికేత్‌ను మనమూ జడ్జ్ చెయ్యనవసరంలేదు. అతగాడో యాత్రికుడు.
అతని పుస్తకాన్నీ జడ్జ్ చెయ్యక్కర్లేదు. అదో బతుకు పుస్తకం.
4. ది షూటింగ్ స్టార్
చివరి పుస్తకం పేరు ది షూటింగ్ స్టార్. ‘ఒక అమ్మాయి, ఆమె బ్యాక్‌ప్యాక్. విశాలప్రపంచం’ అన్నది ఆ పుస్తకపు టాగ్‌లైన్.
రాసిన అమ్మాయి పేరు శివ్య నాధ్. 1988లో పుట్టిన డెహ్రాడూన్ మనిషి. ఇరవైమూడేళ్ళ వయసులో జీవితంతో ప్రయోగాలు చేసి తాను కోరుకున్న స్వేచ్ఛను ప్రయత్నించి సాధించుకున్న వైనం ఈ పుస్తకం.
డెహ్రాడూన్‌లో మధ్యతరగతి రక్షణల మధ్య పెరిగింది శివ్య. చుట్టూ కొండలు ఉన్నా ఎక్కే స్వేచ్ఛలేని రక్షణవలయమది. అప్పుడప్పుడూ శెలవల్లో ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్‌లోని చుట్టాలింటికి వెళ్ళినా, పొరుగున ఉన్న ఢిల్లీ నగరంలో ఎప్పటికైనా చదువుకోవాలని, నివసించాలనీ కలలు కనడంతోనే పన్నెండో క్లాసు దాకా డెహ్రాడూన్‌లోనే గడిచిపోయింది – పన్నెండుకు రాగానే ఆటపాటలు లేవు, విహారయాత్రలు లేవు, వినోద పరికరాలన్నీ బందయ్యాయి. చదువు, మార్కులు, మార్కులు…
మార్కులు బాగా వచ్చాయి. వాటి పుణ్యమా అని సింగపూర్‌లో డిగ్రీ చదివే అవకాశం వచ్చింది శివ్యకు. తల్లిదండ్రులు ధైర్యంగానే అంత దూరం పంపారామెను. డిగ్రీ ముగించాక కాంట్రాక్ట్ ప్రకారం సింగపూర్ లోనే ఉద్యోగం – అదో రెండేళ్ళు.
ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏదో కొత్త విమానయాన సంస్థవాళ్ళు నిర్వహించిన పోటీలో పాల్గొంటుంది శివ్య. మీకు రెండో అవకాశం వస్తే జీవితంతో మీరేం చేస్తారు అన్న విషయం మీద స్పందించమంటుందా పోటీ. అది శివ్యకు ఒక అపురూపమైన అవకాశం. మనసంతా కాగితం మీద ఒలకపోసి తన తీరని ఆకాంక్షలకు అక్షరరూపం ఇస్తుందా అమ్మాయి. ఫలితం: పోటీలో నెగ్గడం. రెండు నెలలు ఎక్కడికైనా తిరిగివచ్చే అవకాశాన్ని బహుమతిగా పొందడం.
ఓ నెలంతా యూరప్‌లో తిరిగాక మరోనెల హిమాలయాల్లోని స్పీతి లోయలో గడుపుదామనుకొని, మధ్యలో ఒక వారం తల్లిదండ్రులతో గడపడానికి డెహ్రాడూన్ వస్తుంది శివ్య. స్పీతి ప్రయాణం గురించి వినగానే ఇంట్లో బ్రహ్మాండం బద్దలయింది. ‘యూరప్ అంటే అది వేరు. మనదేశం ఒంటరి ఆడవారికి క్షేమం కాదు.’ అంటూ తల్లి కన్నీరు. కన్నీటి వరద. శివ్య మొండికెత్తుతుంది. చివరికి డెహ్రాడూన్ నుంచి షిమ్లా దాకా మగతోడు ఇచ్చి పంపిస్తారు తల్లిదండ్రులు. అక్కడ్నుంచి బస్సులో స్పీతి.
స్పీతి లోయ చేరగానే ఓ ననరీ – బాలికాభిక్షువుల ఆవాసం చేరుతుంది శివ్య. అక్కడో మూడు వారాలు. ఆరు నుంచి పదీపన్నెండు సంవత్సరాల వయసు ఉన్న బాలికలు. వారితో శివ్యకు సహజ అనుబంధం… రహస్యంగానే మాటలు, ఆటలు, పాటలూ. అక్కడే ఓ కొండ మీది గుహల్లో పదేళ్ళపాటు ఉండిపోయి ధ్యానంచేసే సన్యాసినులు ఉన్నారంటే వాళ్ళను వెతుక్కుంటూ పన్నెండువేల అడుగుల ఎత్తున ఉన్న ఆ గుహలకేసి ప్రయాణం… గుహలు చేరి వారితో కొన్ని రోజులు.
ఆ రెండునెలల ప్రయాణాల తర్వాత తిరిగి సింగపూర్ చేరినప్పుడు సహోద్యోగులు ‘ఎలా జరిగింది నీ ప్రయాణం?’ అని అడిగితే సమాధానం కోసం ఆలోచనలో పడుతుంది శివ్య: ‘ఎంతో శ్రమపడి ట్రెకింగ్ చేసి మరీ, ఉన్నతమైన పర్వతాల నడుమ ఒక తటాకపు ఒడ్డున కూర్చుని, అందులో ప్రతిబింబిస్తున్న హిమశిఖరాలను చూసినప్పుడు నాలో వీచిన స్వేచ్ఛాపవనాల గురించి వీరికి ఎలా వివరించడం?’
అప్పుడు కలిగింది ఆమెలో ఒక బలమైన ఆలోచన: ‘అధోపాతాళం చేరాకే ప్రత్యామ్నాయాల గురించి ఎందుకు ఆలోచించాలి? దిగులు బావుల్లో దిగబడిపోయినప్పుడే సంతోషం గురించి ఎందుకు ఆలోచించాలి? నా మిగతా జీవితమంతా ఇలా ఓ ఆఫీసుగదిలో గడిపేయడమేనా? ఊఁహూఁ. అలా వీల్లేదు.’
రెండువారాల ఆలోచన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది.
2011లో రాజీనామా చేసిన శివ్య తన కలలనగరం ఢిల్లీ చేరుతుంది. ఒక చిన్నపాటి గదిలో నివాసం. ముందస్తుగా ఒక ఎన్.జి.ఒ.లో చేరుతుంది. రెండ్రోజుల్లోనే ఆ సేవాసహాయ కార్యక్రమాలు ఒట్టి నాటకమనిపించి వదిలివేస్తుంది.
తర్వాత ఈ పుస్తకం రాసిన 2017 వరకూ ఆరేళ్ళపాటు శివ్య జీవితమే ప్రయాణంగా, ప్రయాణమే జీవితంగా గడిపింది. అది మళ్ళీ నల్లేరు మీద బండి నడక కాదు. రోలర్ కోస్టర్ రైడ్ అది.
ప్రయాణాలు మొదలుపెట్టింది శివ్య. భిన్నప్రయాణాలు, విభిన్న ప్రయోగాలు. ఆరేళ్ళలో వందలాది అనుభవాలు. ప్రమోదాలు, ప్రమాదాలు. ఏభై దేశాలు.
ముందస్తుగా పంజాబ్ లోని ఓ మారుమూల సరిహద్దు గ్రామంలో హోమ్‌స్టేకు వెళుతుంది. ఏమాత్రం పూర్వపరిచయం లేని ఆ గ్రామస్థుల అభిమానం, ఆప్యాయత, ఔన్నత్యం అనుభవిస్తుంది. సరికొత్త అనుభవం.
‘మావి అనుక్షణికపు జీవితాలు. సరిహద్దులో ఏ క్షణాన ఎలాంటి ఉద్రిక్తతలు చెలరేగుతాయో తెలియదు. మన బతుకు మీద మనకేదో నియంత్రణ, అధికారం ఉన్నాయనుకుంటాం. అది భ్రమ. మనకేదైనా ఉండగలదూ అంటే అది జీవనకాంక్ష – స్పిరిట్ టు లివ్ – మాత్రమే!’ అంటాడు ఆ గ్రామపు పెద్దాయన. ఆ గ్రామపు అనుభవం శివ్యకు ఒక సరికొత్త ఆలోచననిస్తుంది.
సీరియస్ యాత్రికులకు అసలు సిసలు యాత్రానుభవాలు ఎందుకు అందించకూడదూ? దాని ఆచరణ రూపమే ‘ఇండియా అన్‌ట్రావెల్డ్’ అన్న గ్రామీణ యాత్రాకేంద్రిత సంస్థ. తన అనుభవాల సాయంతో ఆ సంస్థను విజయవంతం చేయడానికి నడుంకడుతుంది శివ్య. గ్రామాలవారిని కూడగట్టుకుని వాళ్ళంతా యాత్రికుల్ని స్వాగతించేలా చేస్తుంది. అది వారికో ఉపాధి మార్గంగా పరిణమించేలా చేస్తుంది.
త్వరలోనే వ్యాపారవేత్తగా ఉండడమన్నది మగతా మత్తులకు నిరంతరహేతువు అని అర్థమవుతుంది. బిజినెస్ నడిపేవారికి ఆర్థిక విజయాల పిపాస అత్యవసరం అని గ్రహిస్తుంది. అలాగే యాత్రలు చెయ్యడం, బ్లాగులు రాయడం, వ్యాపారం నడపడం – ఇవి మూడూ ఏకకాలంలో నిర్వహించడం అసాధ్యమని స్పష్టమవుతుంది. తన సంస్థను తెలిసినవాళ్ళకు అమ్మేస్తుంది. బ్లాగులు రాయడమే తనకిక జీవిక అని ఎంచుకుంటుంది. వాటి ద్వారా వచ్చే ఆదాయం సింగపూర్ ఉద్యోగంతో పోలిస్తే మూడోవంతే అయినా పర్లేదు, తన ప్రాథమికావసరాలు తీరతాయి.
తదుపరి మజీలీ ఇలలో స్వర్గం అని పేరుపడ్డ మారిషస్.
చేరిన రెండోరోజే బీచ్‌లో గవ్వలూ శంకులూ అమ్ముకునే భారతీయ మూలాల అమర్ అన్న పిల్ల్లవాడితో స్నేహం కుదురుతుంది. ఆ అనుభవంతో ‘పరాయివాళ్ళతో పరిచయం పండటానికి మాటల పాత్ర అత్యవసరమేం కాదు’ అన్న ఎరుక కలుగుతుంది శివ్యకు. ‘మాది తిండికి లోటులేని జీవితం. నాకు సముద్రమంటే ఇష్టం. నా పనీ పాటా, నా జీవితం – అంతా సముద్రం మీదే. ఇక్కడ పుట్టుకొస్తున్న రిసార్టుల్లో ఎక్కువెక్కువ జీతాల పనులు దొరుకుతాయి కానీ అవేమీ నాకొద్దు.’ అంటాడు అమర్. ‘అరె, ఇతనూ నాలానే మాట్లాడుతున్నాడే!’ అనుకుంటుంది శివ్య.
‘అదుగో చూడు చూడు. ఆ జంట డబ్బులూ సమయమూ కూడగట్టీ కూడగట్టీ ఈ స్వర్గం చూసి వెళదామని నాల్రోజులకు వచ్చారు. మరి మనల్ని చూడు. ఇక్కడే ఏ ఒత్తిడీ లేకుండా గడుపుతున్నాం!’ అంటాడు అమర్. ‘స్వర్గం ఎక్కడో లేదు. మన మనసూ ఆలోచనల్లోనే ఉంది అన్న విషయాన్ని గ్రహించిన ధన్యజీవి ఈ కుర్రాడు’ అనుకుంటుంది శివ్య.
ఆస్ట్రేలియా వినెయార్డుల్లో హోమ్‌స్టే చేసినప్పుడు ఆ ఇంటి యజమాని కరోల్ – ఒకప్పటి జామ్‌నగర్ రాజు దిగ్విజయ్‌సింగ్ తనకు పితృసమానుడు అంటాడు. యుద్ధకాలపు 1940లలో ఆరువందల మంది పోలిష్ పిల్లల్ని చేరదీసి నాలుగేళ్ళు సాకిన మనిషి ఆ మహారాజు. ఆ పిల్లల్లో ఒకడు కరోల్. అతగాడిని కలవడం, గంటల కొద్దీ హిందీలో డెబ్భై ఏళ్ళనాటి సంగతులు మాట్లాడుకోవడం అచ్చమైన ఘటన అంటుంది శివ్య.
రాణ్ ఆఫ్ కచ్‌లో ఉల్కాపాతం చూడటానికి ఒక స్వల్పపరిచయపు యువకునితో కలసి వెళ్ళి బెరుకుబెరుకుగానే ఒక రాత్రంతా వాచ్‌టవర్ మీద గడుపుతుంది శివ్య. దాని తర్వాత ఈ ప్రపంచం మీద నా నమ్మకవిశ్వాసాలు నమ్మశక్యం కానంతగా బలపడ్డాయి అంటుంది.
ఆంటిగ్వా దేశంలో స్పానిష్ భాష నేర్చుకోవడానికి ఓ మారుమూల అనాది తెగల గ్రామానికి వెళ్ళి వారితో కలిసిపోయినపుడూ, డొమీనికన్ రిపబ్లిక్ అన్న కరీబియన్ దేశం వెళ్ళి అక్కడ కొండలలోని గాలిని మనసంతా నింపుకొని, తనలో ఎన్నో ఏళ్ళుగా పేరుకొనిపోయిన అసూయాభావాన్ని వదిలేయగలిగినప్పుడూ, శివ్యకు ‘భూగోళానికి అవతలి వైపు ఉండే స్నేహాలూ జీవితాలూ ఇవతలి వైపుకు భిన్నంగా ఏమీ ఉండవు. ఈ ప్రయాణాలూ అనుభవాల పుణ్యమా అని నా సుఖమైన రక్షణ వలయాన్ని సవాలు చేసి విస్తరించుకోగలుగుతున్నాను’ అనిపిస్తుంది. ‘నిజానికి మనదేశపు సంస్కృతిలోనే మనుషుల్ని చూపులతో తూచడం, మాటలతో కొలవడం అన్న విపరీత ధోరణి జీర్ణించుకు పోయివుంది’ అని అనుకుంటుంది శివ్య.
ఇన్నిన్ని అనుభవాల తర్వాత ఒకప్పటి డెహ్రాడూన్ శివ్యకు, ఇప్పుడు ప్రపంచపు మూలల్లో నిలబడి పాలపుంతకేసి చూస్తున్న శివ్యకూ పోలికలే లేవని గ్రహిస్తుంది. ఇలాంటి దశలో తనకంటూ ఢిల్లీలో ఒక ఇల్లు ఉండటమే అసమంజసం అనిపిస్తుంది. వెళ్ళి ఇల్లు ఖాళీచేసి సామాన్లు అన్నీ పంచేస్తుంది. ‘నేను బ్లాగులు రాయడమన్న పని ప్రపంచంలో ఏ మూలనుంచైనా చేయగలను. ఉండటానికి ఇల్లు, కచ్చితమైన నివాసప్రణాళికలూ అనవసరం. ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులు, పచారీ కొనుగోళ్ళు, ఇంటి రిపేర్లు, ట్రాఫిక్ విసుగులాటలు, ఎవరెవరితోనో ఎంగేజ్‌మెంట్లు – ఇవేవీ వద్దంటే వద్దు. నేను వర్తమానంలో జీవిస్తాను. ఏ రోజు ఎక్కడుంటే అదే నా ఇల్లు. వాళ్ళే నావాళ్ళు. బంధాలను పట్టుకొని వేళ్ళాడ్డం అర్థంలేని పని. మన వస్తువులు మనల్ని నియంత్రించి మన బతుకును స్వాధీనం చేసుకోవడం మరీ అర్థంలేని పని. ఓ మనిషికి అర్థవంతంగా బతకడానికి అవసరమయ్యే వనరులు అతి స్వల్పం’ అనుకుంటుంది శివ్య.
ఇదేనా జ్ఞానోదయమంటే? శివ్య లాంటివాళ్ళ విషయంలో ఔననే అనాలి.
శివ్యకు పదే పదే ఎదురయ్యే ప్రశ్న: ‘ఒక్కదానివే ఎందుకు ప్రయాణిస్తావూ?’
‘నేను మగపిల్లాడినయితే ఈ ప్రశ్న అడిగేవారా?’ అన్నది ఆమె ప్రతిస్పందన.
‘అసలు నువ్వు ఆడపిల్లవి అంటూ శ్రుతి మించిన కట్టుబాట్ల మధ్య పెంచడంవల్లనే తనలో ఈ ఒంటరి ప్రయాణపు కాంక్ష బలపడిందేమో!’ అంటుంది శివ్య.
‘నీ జీవితం మీద, నీ ఉద్యోగం మీద, నీ సంపాదన మీద, నీ పిల్లల మీద నీకు అధికారం లేదు’ అని సమాజం పదే పదే ఎందుకు ఘోషిస్తుంది? సమాజం నన్ను నిలబెట్టి శిలావిగ్రహంగా ప్రతిష్టించాలని చూసే వేదికను నేను తృణీకరిస్తాను’ అని నినదిస్తుంది పసియువతి శివ్య.
నలుగురు యాత్రికులు – నలుగురిదీ ఒకటే బాణీ.
జీవితానికీ ప్రయాణానికీ అంతరం లేదని భావించినవారు. జడజీవితం మీద తిరుగుబాటు జెండా ఎగరేసినవారు. ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త జీవితాన్ని, ఆ ప్రక్రియలో తమను తాము అన్వేషించుకుంటూ సాగినవారు.
1910లో పుట్టిన థిసీజెర్ తన యాత్రను పరిపూర్ణం చేసుకొని వెళ్ళిపోయారు.
1960ల నాటి క్రిస్ తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పరచుకోగలిగినా అతి తొందరగా నిష్క్రమించాడు.
1980ల నాటి అనికేత్, శివ్యలు జీవితాన్ని పునర్నిర్వచించుకొని తమలోకి తాము ప్రయాణం చేస్తున్నారు.
నలుగురూ ఒకే కోవకు చెందిన మనుషులు.
ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని యాత్రికులందరూ ఒకే బాణీ మనుషులు.
[జులై’21లో తార్నాకలోని స్ప్రెడింగ్ లైట్‌వాళ్ళ జూమ్ మీటింగులో చేసిన ప్రసంగానికి అక్షరరూపం.]