ఊహలకందని మొరాకో -3

మరాకేష్ – ఒక చైతన్యవేదిక

మొరాకో దేశంలో మరాకేష్ నగరం యాత్రికులకు ప్రధాన ఆకర్షణ అయితే ఆ మరాకేష్‌లో జమా ఎల్ ఫినా (Jemaa El-fna, అరబిక్: జమాల్-ఎ-ఫినా) అన్న కూడలి టూరిస్టులు మొట్టమొదటగా గుమిగూడే ప్రధాన కేంద్రం. అది ఆ నగరపు మదీనా నడిబొడ్డున ఉంది.

నేను వచ్చి చేరేలోగానే పిల్లలూ మహిళలూ ఆ కూడలిని ఒకటికి నాలుగు మార్లు చూసేసి ఉన్నారు. అంచేత వాళ్ళు మళ్ళా రావడానికి ఆసక్తి చూపించలేదు. రిసార్ట్‌ లోనే ఉండి రిలాక్సవుతామన్నారు. మా స్నేహితుడు వెంకట్ నాతో రావడానికి ముందుకొచ్చాడు. ఒకసారి ఊరంతా చూసి ఉన్నాడు కాబట్టి నాకు అతను ముందే చెప్పాడు: “మనం వెళ్ళే జమా ఎల్ ఫినా గురించి ఎంత సమాచారం సేకరించినా, ఎంత ఊహించుకున్నా ఒకసారి అక్కడికి వెళితే ఆ అనుభవంతో ఈ సమాచారాలు, ఊహలు సరితూగనే తూగవు.”

వెంకట్ సరళంగా చులాగ్గా సాగిపోయే మనిషి. ప్రయాణాలకు సరి అయిన జోడు. యాత్రల్లో మనకు సంభవించగల పెద్ద ప్రమాదం ఏవిటీ అంటే అభిరుచులు కలవని, సహనం లేని మనిషితో వెళ్ళవలసి రావడం.

మా రిసార్ట్ నుంచి మరాకేష్ సిటీ సెంటరుకు అరగంట టాక్సీ ప్రయాణం. కొత్త నగరపు వీధుల్లో ఆధునిక భవనాలను చూస్తూ వెళ్ళాక ప్రాకారసహిత పాత నగరం-మదీనా-లోకి ప్రవేశించాం. ఒక్కసారిగా వాతావరణంలో పెనుమార్పు వచ్చినట్టు అనిపించింది. కొన్ని శతాబ్దాలు వెనకకు ప్రయాణించినట్టు అనిపించింది. మా టాక్సీ డ్రైవరు ఎంతో నేర్పుతో ఆ పాతపట్టణపు ఇరుకు సందుగొందుల్లోంచి కారు నడిపి మమ్మల్ని జమా ఎల్ ఫినా దగ్గర వదిలిపెట్టాడు. ముందే చెప్పినట్టు ఈ కూడలి మదీనా నడిబొడ్డున ఉంది.

శీతాకాలపు ఉదయం, పదిగంటల సమయం… ఆ ప్రాంతం మెల్లమెల్లగా వాడీవేడీ సంతరించుకుంటోంది. జనాలంతా తీరిగ్గా కూడుతున్నారు. అప్పటికే వివిధకళల ప్రదర్శనకారులు తమతమ కార్యకలాపాలు మొదలుపెట్టారు. రానురానూ ఆ విశాలప్రాంగణం ఒక ఆరుబయలు రంగస్థలంగా రూపొందసాగింది. అక్కడ కాసేపు అటూ ఇటూ తిరిగి, రూపు దిద్దుకుంటున్న కార్యసరళిని గమనించాం. ఆ జనసందోహంలో విభిన్న వృత్తులవాళ్ళు కనిపించారు. జాతకాలు చెప్పేవాళ్ళు, కథలు వల్లించేవాళ్ళు, పాముల్ని ఆడించేవాళ్ళు, ఇంద్రజాలం చేసేవాళ్ళు, పిల్లిమొగ్గలూ గడవిన్యాసాలూ చేసేవాళ్ళు – అందరూ తమతమ సంప్రదాయదుస్తుల్లో కళ్ళకు ఇంపుగా కనిపించారు. వీళ్ళతోపాటు పుప్పిపన్నులు పీకేవాళ్ళు, చెవి గులిమి శుభ్రం చేసేవాళ్ళు – అక్కడ లేని పురాతన వృత్తి లేదు. పనుల్లో వాళ్ళందరి నైపుణ్యం చూస్తోంటే వాళ్ళు తరాల తరబడి ఆయా వృత్తుల్లో ఉన్నారనిపించింది.

మధ్యయుగాలనాడు సహారా దిగువప్రాంతాలనుంచి మధ్యధరా సముద్రపు ఓడరేవులకు సరకులు చేరవేసే సార్థవాహులకు మరాకేష్ ఒక ముఖ్యమైన మజిలీగా వ్యవహరించేది. కొద్దిక్షణాలపాటు నన్ను నేను అప్పటి వర్తక బృందాలలో సభ్యుడిగా ఊహించుకున్నాను. ఎడారి బిడారుల్లో భాగంగా ఊహించుకున్నాను. నెలల తరబడి నీరూ నిప్పూ లేని ఎడారిలో ప్రయాణం చేశాక ఒక్కసారిగా వింతలు, విశేషాలు, వినోదాల మార్మికభూమి మరాకేష్‌లో అడుగుపెడితే ఆ వ్యాపారుల మనసులు ఎలా గంతులు వేస్తాయో ఊహించుకునే ప్రయత్నం చేశాను. సుదీర్ఘ ప్రయాణపు విసుగూ అలసటలు పోయి మనసులో చిన్నిచిన్ని వినోదాలూ సుఖాలు కలిగించే సంతోషప్రకంపనాలను అనుభవించాను.

ఇంతలోనే కూడలిలో ఒకవైపు కొట్టొచ్చే రంగుల దుస్తులు వేసుకొని టూరిస్టులతో ఫొటోలు దిగుతున్న మరో బృందం కనిపించింది. వాళ్ళ వీపుల మీద తోలు తిత్తులున్నాయి. వాటితోపాటు లోహపు గిన్నెలున్నాయి. వాళ్ళు నీళ్ళు అమ్మేవాళ్ళు. తోలుతిత్తులు, లోహపుగిన్నెలూ పుచ్చుకొని అందరికీ నీళ్ళు అందజేస్తున్న వాళ్ళగురించి మరింత తెలుసుకోవాలనిపించింది. కాసిన్ని డబ్బులు పెడితే బాటిళ్ళలో పరిశుభ్రమైన మినరల్ వాటర్ లభించే ఈ రోజుల్లో వీళ్ళ వ్యాపారం ఇంకా ఎలా కొనసాగుతోంది?! వాళ్ళతో మాట్లాడాను – కాస్తంత రుసుము చెల్లించి. అనాదికాలంలో నీరు అమూల్యసంపదగా ఉన్న రోజుల్లో, ఈ వృత్తిలోని వాళ్ళు ఎక్కడెక్కడినించో నీరు సేకరించి ఈ కూడలిలో అమ్మేవారట; ఈ రోజుల్లో కూల్‌డ్రింక్స్, పళ్ళరసాలూ అమ్ముతున్నట్టు. ప్రస్తుతం వాళ్ళ వృత్తికి కాలదోషం పట్టినా ఒక సంప్రదాయచిహ్నంగా అది ఇప్పటికీ నిలిచి ఉందట. ఆనాటి కథలూ గాథలు, వాళ్ళు ధరించే దుస్తులు, వాళ్ళా మాట తీరు – వాటి పుణ్యమా అని ఈ వృత్తి ఇప్పటికీ కొంతమందికి జీవనోపాధిగా కొనసాగుతోందిట. వీళ్ళనే కాదు, ఆ అనాది కూడలిలో ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు వందలాది యేళ్ళుగా కొనసాగుతున్నాయి.

ఓ పాములబ్బాయి తన కొండచిలువతో సహా నా పక్కకు చేరి దాన్ని మెడలో వేసుకొని ఫోటో తీయించుకోమన్నాడు. వద్దు బాబూ వద్దు అని పక్కకు తప్పుకున్నాను. కోతులతో పిల్లిమొగ్గలు వేయిస్తున్న ఓ మనిషి చుట్టూ వీక్షకులు గుమిగూడి కనిపించారు. కోతులే కాకుండా అతని దగ్గర పంజరాల్లో పక్షులు కూడా ఉన్నాయి. ఒకరకంగా చూస్తే ఇదంతా జంతువులూ పక్షులను క్రూరంగా బాధించడం కిందకు వస్తుంది. ఇంకోరకంగా చూస్తే తరాల తరబడి ఇదే వృత్తిలో సాగుతున్న బడుగుజీవుల జీవనోపాధి కదా అనిపిస్తుంది. మనసులో నా ఈ ద్వైదీభావం వేళ్ళూనడం గమనించి – ‘ఇది మొరాకో. దేశం చూద్దామని వచ్చిన నేను వాళ్ళ పద్ధతులు, వృత్తుల గురించి తీర్పులివ్వకూడదు’ అని సమాధానం చెప్పుకున్నాను.

ఆ కూడలి చుట్టూ దుకాణాలు, రెస్టారెంట్లు, సర్కారీ భవనాలూ కనిపించాయి. పదీ పన్నెండు సన్నపాటి సందులు అక్కడినుంచి వివిధ దిశలలో సాగిపోతున్నాయి – ఒక్కొక్కటీ ఒక్కొక్క విపణి వీధి. ఆ ప్రాంతం యావత్తూ జీవచైతన్యంతో శోభిస్తూ కనిపించింది. ఆ శోభను మనసులో ఇంకించుకుంటూ గమ్యమన్నది లేకుండా ఓ గంట సేపు నేనూ వెంకట్ అక్కడ తిరుగాడాం.

నా దగ్గర ఉన్న చిన్నపాటి గైడ్‍బుక్ తెరచి ఇంకా అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అని వెతికాను. మదరసా బిన్ యూసఫ్ అన్న ప్రదేశం కనిపించింది. వందలాది ఏళ్ళుగా ఇస్లామిక్ విజ్ఞానకేంద్రంగా గణనకెక్కిన ప్రదేశమది. అంతే కాకుండా ఆ భవనపు వాస్తురీతి కూడా చెప్పుకోతగ్గది. కాని, దురదృష్టవశాత్తు ఆ ప్రాంగణం పునరుద్ధరణలో ఉండటంతో సందర్శకులకు ప్రవేశం లేదు.

మరాకేష్ లోని చర్మశుద్ధి పరిశ్రమ ఖ్యాతి దూరదూరాలకు వ్యాపించి ఉంది. ఆ కార్యసరళి చూడాలన్న ఉత్సుకతతో అక్కడి దుకాణదారు ఒకతనిని వాకబు చేశాను. ఆయన మమ్మల్ని ఓ మధ్యవయస్కుడికి అప్పగించి దారి చూపించమని పురమాయించాడు. మేము గైడ్ కోసం చూడటం లేదు కాబట్టి ఆ ఏర్పాటు చూసి కాస్తంత సందేహపడ్డాం. ‘ఈయన ఎలానూ అదే వైపు వెళుతున్నాడు. మీకు దారి చూపిస్తాడు. దీనికి ఛార్జి అంటూ ఏమీ ఉండదు’ అని భరోసా ఇచ్చాడా దుకాణదారు.

ఆ పెద్దమనిషితో కలిసి పావుగంట నడిచాక గమ్యం చేరుకున్నాం. రంగురంగుల రంగునీటితో నిండిన చర్మశుద్ధి భాండాలు వరుసలు తీరి కనిపించాయి. అవన్నీ మేము అంతకు ముందు ఫొటోలలో చూసినట్టే అనిపించాయి. ఏం తేడా లేదు. కర్మాగారాలు చూడటం ముగిశాక మాతో వచ్చిన పెద్దమనిషి మేవు వద్దన్నా అక్కడి ఓ తోలు వస్తువుల దుకాణం లోకి తీసుకెళ్ళాడు. వెళ్ళాం కాబట్టి మేమిద్దరం చెరో ఒంటెచర్మం బెల్ట్ కొనాల్సొచ్చింది. మా పెద్దమనిషికి కాస్తంత టిప్ ఇచ్చి మేము మళ్ళా జమా ఎల్ ఫినా దిశగా సాగాం.

దారిలో స్టూడెంటు కుర్రాడిలా కనిపిస్తున్న ఓ మనిషి మాతో మాట కలిపాడు. జెమా ఎల్ ఫినా దాకా మమ్మల్ని తీసుకెళతానన్నాడు. అవసరం లేదని స్పష్టంగా చెప్పాం. అయినా మాతోపాటే నడుస్తూ వచ్చాడు. వద్దు వద్దంటున్నా వినిపించుకోలేదు. కాసేపయ్యాక నేను మరోవేపుకు వెళుతున్నా, నా ఫీజు ఇవ్వండి అని ఒత్తిడి చేశాడు. మేము ఇవ్వమన్నాం. ‘అసలు మేం నిన్ను రమ్మనే అనలేదు. నీ అవసరం లేదని స్పష్టంగా చెప్పాం. ఇక గైడ్ ఫీజు అన్న ప్రసక్తే లేదు’ అన్నాం. మా మాటలు వినకుండా అతడు వీరంగం మొదలెట్టాడు.

అతని సహమోసగాళ్ళయి ఉండాలి – క్షణాల్లో అరడజను మంది మా చుట్టూ చేరారు. వాళ్ళను పట్టించుకోకుండా మేము నడక కొనసాగించాం. అతగాడిని మేము గైడ్‍గా తీసుకోలేదు అని మరోసారి స్పష్టం చేశాం. వాళ్ళల్లో ఒకతను – గ్యాంగ్ లీడరనుకుంటాను – ఇవ్వకపోతే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి అని బెదిరించాడు. కాసేపటికల్లా ఈ బెదిరింపులను గమనిస్తున్న ఆ కూడలి లోని మనుషులు మా చుట్టూ గుమిగూడారు. వాళ్ళను చూశాక ‘పర్లేదు, మనకేం భయం లేదు’ అన్న నమ్మకం కలిగింది. దానికి తోడు ఫినా కూడలిలో పోలీసుల ఉనికి కూడా కనపడింది. అంచేత ఏ భయమూ లేకుండా, వాళ్ళ ఓటిమాటల్ని లెక్కపెట్టకుండా ముందుకు సాగాం. ఇవి లొంగే ఘటాలు కావని వాళ్ళకి అర్థమయింది. కాసేపట్లో మెల్లగా జారుకున్నారు. ఇలాంటి గ్యాంగులు కొన్ని ఆ కూడలిలో ఉన్నాయని, మెతగ్గా ఉండే టూరిస్టులను ఇలా వేధించి డబ్బు చేసుకుంటున్నాయనీ మాకు మెల్లమెల్లగా తెలియవచ్చింది. ఏదేమైనా ఆ చిరుసంఘటన ఆనాటి మా ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. కానీ ఆ సంఘటన ప్రభావమే కావచ్చు, ఇద్దరికీ దప్పిక అనిపించింది. జెమా ఎల్ ఫినా పళ్ళరసాలకు ప్రసిద్ధి. నారింజరసం, దానిమ్మరసం అందరూ ఇష్టపడే పానీయాలు. అప్పుడే చేసిన దానిమ్మరసం చెరో గ్లాసూ తాగేసరికి మాకు కలిగిన చిరు చిరాకు సంగతి మర్చిపోయాం. కొత్త ఉత్సాహంతో ముందడుగు వేశాం.

జెమా కూడలిలో ఒక పక్కన ఉన్న కుతుబియా మసీదు మరాకేష్ లోని అతి పురాతన భవనాల్లో ఒకటి. పన్నెండవ శతాబ్దానికి చెందిన నిర్మాణమది. ఆ ప్రాంగణంలోని డెబ్భై మీటర్ల నలుచదరపు మినార్ మరాకేష్‍కు ప్రతీకగా నిలిచిన కట్టడం. దాని శిఖరాగ్రంలో మెరిసే రాగిగంటలు గోపురాకారంలో అమర్చబడి ఉన్నాయి. వందలాది సంవత్సరాలుగా ఆఫ్రికా దక్షిణ భాగాలనుంచి సహారా ఎడారిని దాటుకొని వచ్చే వ్యాపారబృందాలకు ఈ మినార్ దూరం నుంచే కనిపించి ‘హమ్మయ్య, ఇహ మరాకేష్ దగ్గర పడింది’ అన్న భరోసా కలిగిస్తోందట. వాళ్ళ శ్రమనంతా తొలగించి సేద తీరుస్తోందట.

పన్నెండో శతాబ్దంలో ఈ మసీదును కట్టించింది అప్పటి అల్మొహద్ ప్రభువులు. ఆనాటి వారి సామ్రాజ్యంలో స్పెయిన్ దేశపు ప్రాంతం ఇమిడి ఉంది. ఈ కుతుబియా టవర్, రబాత్ లోని హసన్ టవర్, ఈనాటి స్పెయిన్ దేశపు సెవిల్ నగరం లోని జిరాల్దా టవర్, అల్మొహద్ ప్రభువుల భవననిర్మాణ కౌశలానికి తార్కాణాలుగా ఈనాటికి నిలిచి ఉన్నాయి.

మధ్యాహ్నం దాటిపోతోంది. భోజనం చెయ్యవలసిన సమయం. మాకు అప్పటికే పరిచయమయిన దుకాణదారు ఒకాయన ఆ దగ్గర్లో ఉన్న చె షెగ్రూనీ రెస్టారెంటుకు వెళ్ళమని సిఫార్సు చేశాడు. మూడంతస్తుల భవనమది. మేము మేడ మీదకు చేరి పచ్చని గొడుగు నీడన ఉన్న ఒక టేబుల్ దగ్గర చేరగిలబడ్డాం. అక్కణ్ణుంచి ఆ కూడలి ప్రాంతమంతా ఎంతో చక్కగా కనిపించింది. గంటగంటకూ అక్కడి వాతావరణం మారడం గమనించాం. ఉదయపు సందోహానికీ ఈ మధ్యాహ్నపు వాతావరణానికీ పోలికే లేదనిపించింది. మెల్లగా కమ్ముకొస్తోన్న చలికాలపు చిరుచలిలో, ఆ మధ్యాహ్నపుటెండలో, మనుషులంతా ఆ కూడలిలో క్రిక్కిరియడం గమనించాం. అక్కడ దొరికే పదార్థాల వివరాలు సేకరించి లేత మేకమాంసపు తజీన్ ఆర్డర్ చేశాం. అది నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది. పెద్ద జగ్గుడు నారింజరసంతో మా భోజనానికి ముక్తాయింపు పలికాం.

భోజనం ముగిశాక అక్కడే ఉందని చెప్పే ఎల్ బాదీ (El Badi) పాలెస్‍ను వెతుకుతూ అరగంట సేపు ఆ సందుల్లో తిరిగాం. మరాకేష్ నగరంలో చూసి తీరవలసిన ప్రదేశమది అని విని ఉన్నాం. దాన్ని వెదుకుతూ ఆ మదీనా సందుగొందుల్లో మహా తికమక పడ్డాం. ఒకటికి రెండుసార్లు ముందుకు దారే లేని డెడ్‍ఎండ్‍లు తటస్థపడ్డాయి. ఆ ప్రదేశమంతా జనావాసాలు ఉన్నాయి. ఆ నివాస భవనాలు శతాబ్దాల క్రిందటవే అయినా ఎంతో చక్కని నిర్వహణతో కనిపించాయి. శ్రద్ధగా వాటిని కాపాడుకుంటున్నారన్నమాట. కాలపు గతిలో ఏనాడో ఊపిరి పోసుకున్న ఆ భవనాల్లో ఇప్పుడు నివసించడమన్నది ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో కదా అనిపించింది.

ఇంతా చేసి మాకు బాదీ పాలెస్ దొరకనే లేదు. దాని బదులు మరో చక్కని కూడలిలో ఉన్న సాదియన్ సమాధులు తటస్థపడ్డాయి. అవి కస్బా మసీదుకు దగ్గర్లో ఉన్నాయి. వాటి చరిత్ర ఎంతో విచిత్రమైనది. సాదియన్ వంశపు మూలాలు దక్షిణ మొరాకో నగరం టెరూడెంట్‍లో ఉన్నాయి. అక్కడి స్థిరపడిన ఆ రాజవంశం క్రమక్రమంగా విజృంభించి పదహారో శతాబ్దంకల్లా ఆట్లస్ పర్వతాలను దాటుకుని వెళ్ళి మొరాకో దేశమంతటినీ తన ఆధీనం లోకి తెచ్చుకుంది. మరాకేష్‍ను తన రాజధానిగా చేసుకొని నూటయిరవై సంవత్సరాలపాటు పాలించింది. ఆ తర్వాత, ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న అలావీ రాజవంశస్థులు ఈ సాదియన్లను గద్దె దింపారు.

పరాజితులు రూపకల్పన చేసిన విలక్షణ భవనాలు, కట్టడాలను విజేతలు ధ్వంసం చెయ్యడమన్నది దేశాలకూ కాలాలకీ అతీతమైన ఒక ఆనవాయితీ. అలావీ వంశపు మౌలె ఇస్మాయిల్ సుల్తాను ఆ పనే చేశాడు. మరాకేష్ నగరంలో సాదియన్ల ఛాయలు లేకుండా తుడిచిపెట్టాడు. కాని, వారి సమాధుల విషయంలో తత్తర పడ్డాడు. వాటిని కూల్చివేస్తే అరిష్టం కలుగుతుందని భయపడి వదిలివేశాడు. అలా వదిలేశాడే గాని, వాటి సౌందర్యం ప్రజానీకాన్ని ఆకర్షిస్తుంది అన్న ఆలోచన భరించలేకపోయాడా ప్రభువు. దానిని అరికట్టడానికి ఒక తెలివైన ఆలోచన చేశాడు; వాటిని కప్పిపెడుతూ ఒక గోడ కట్టేసి అవి ప్రజల దృష్టిలో పడకుండా చూశాడు. అలా వాటి ఉనికి, జ్ఞాపకాలూ గతంలో కలిసిపోయాయి. గందరగోళాలు, విధ్వంసాలూ కొనసాగిన రెండున్నర శతాబ్దాల ఆ కాలంలో ఆ అజ్ఞాతస్వరూపమే వాటిని దుండగీడుల బారిన పడకుండా కాపాడింది.

ఫ్రెంచివారు 1917లో జరిపిన ఒక ఏరియల్ సర్వేలో వాటి ఉనికి బయటపడింది. ఇప్పటికీ ఆ సమాధుల చెంతకు వెళ్ళడమన్నది ఒక రహస్యాన్ని ఆవిష్కరించే బాణీలోనే సాగుతుంది. మెలికలు మెలికల సన్నపాటి అతి సాధారణమైన బాటలో వెళితే ఉన్నట్టుండి ఒక చక్కని ఉద్యానవనం మన కళ్ళముందు నిలబడుతుంది. చుట్టూ ప్రాకారం ఉన్న ఆ విశాలమైన తోట నడుమన పన్నెండు పాలరాతి సమాధులు – కొన్ని ఆరుబయట, మిగిలినవి తమ తమ గదులలో.

ముఖ్యమైన సమాధిగది ముందు అతి మెల్లగా సాగుతున్న పొడవాటి క్యూ ఉంది. ఆ సమాధి ప్రవేశమార్గం మహా ఇరుకైనది. ఒక్క మనిషికి మాత్రమే అక్కడ నిలబడి సమాధిని చూడడం సాధ్యం. కొంతమంది చూసేసి చురుగ్గా కదులుతున్నారు. మరికొంతమంది మహా తీరిగ్గా నిలబడిపోతున్నారు. అలాంటి క్యూలో నిలబడడం నిజంగా అవసరమా అన్న సందేహం మాలో పొటమరించింది. అయినా నిలబడి సాగాం. ఆ నిరీక్షణ ఎంతో ఫలవంతంగా ముగిసింది.

మూడు గదులున్న ఆ ముఖ్యసమాధి నిలువునా అతి చక్కని పాలరాతి చెక్కడాలు, స్టక్కో పనితనం. ఆ సమాధి కేంద్రభాగంలో అల్ మన్సూర్ సుల్తాను సమాధి – పారదర్శకపు పాలరాతి స్తంభాల మీద నిర్మించిన కట్టడం. ఆ ప్రాంగణమంతటికీ తలమానికం ఆ సమాధి. వాటిగురించి మరిన్ని వివరాలు సేకరించినప్పుడు, ఆ సమాధుల నిర్మాణానికి ఇటలీ దేశపు కరార్రా పాలరాయి వాడారని తెలిసింది. సాదియన్ సమాధుల్ని సావకాశంగా చూశాక తిరిగి ఎల్ బాదీ పాలెస్ శోధన కొనసాగించాం. పాలెస్ అయితే చివరికి దొరికింది కాని, దాన్ని అప్పటికి మూసేశారన్న శీతలవార్త మాకందింది.


పట్టు వదలని విక్రమార్కుల్లా మర్నాడు బాగా ఉదయమే ఇద్దరం పాలెస్ ప్రాంగణం చేరుకొని లోపలికి అడుగు పెట్టాం. పాలెస్ బాగా శిథిలమయివుంది. ఒకనాటి వైభవానికి అవశేషంగా మిగిలి ఉంది. 1603లో ఈ పాలెస్‍ను నిర్మించినప్పుడు అది ప్రపంచంలోని విశిష్టమైన రాజసౌధాలలో ఒకటిగా పేరు పొందిందట. అక్కడి గోపురమొకదాని పైకి వెళ్ళి చూసినపుడు ఆ పాలెస్ ఎంత ఘనమైన పరిమాణంలో నిర్మించబడిందో అర్ధమయింది. ఇస్లామిక్ ప్రపంచపు ప్రముఖ కేంద్రాలలో ఘననిర్మాణాలు వెల్లివిరిసిన కాలమది: మొరాకోలో మరాకేష్, ఆటమన్ టర్కిష్ సామ్రాజ్యంలో కైరో-ఇస్తాన్‍బుల్, సఫావిద్ పర్షియాలో ఇసీఫహాన్, మొఘల్ సామ్రాజ్యపు ఢిల్లీ-ఆగ్రాలలో అగ్రశ్రేణి నిర్మాణాలు; సామాన్యుల ఊహకందని ఘనమైన కట్టడాలకు రూపకల్పన జరిగిన సమయమది.

ఆ పాలెస్ పుట్టుక వెనుక ముగ్గురు ప్రభువుల మరణం కారణంగా ఉందంటారు. రెండవ మహమ్మద్ ప్రభువు – పోర్చుగల్ ప్రభువు సెబాస్టియన్ సహకారంతో – తన పినతండ్రి అబ్దుల్ మాలిక్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలన్న సంకల్పంతో ఆయన మీద యుద్ధం ప్రకటించాడట. ఆ యుద్ధంలో పైన చెప్పుకున్న ముగ్గురు ప్రభువులూ ప్రాణాలు కోల్పోయారట. దానితో అబ్దుల్ మాలిక్ తమ్ముడు అహ్మద్ అల్ మన్సూర్ గద్దెనెక్కాడట. అపారసంపదకు వారసుడయ్యాడట. పరాజితులై తనకు పట్టుబడ్డ పోర్చుగీసు సైనికుల ప్రాణాలకు బేరం పెట్టి మరింత ధనం సంపాదించాడట. అలా పోగుపడ్డ ధనరాశులను ఈ అద్భుత రాజసౌధ నిర్మాణానికి వినియోగించాడట. వినవచ్చే కథనం ప్రకారం, మన్సూర్ ప్రభువు ఆస్థాన విదూషకుడు ‘ప్రభూ! ఈ మహత్తర సౌధపు శిథిలసౌందర్యం మరింత మహత్తరంగా ఉండే అవకాశం ఉంది’ అంటూ చెణికాడట. ఒక శతాబ్దం గడిచేసరికి అది జరగనే జరిగింది – సౌధం వినాశనానికి గురి అయింది. సంపదంతా దోచుకోబడింది.

ఆ రాజప్రాసాదపు లోపలి ప్రాంగణంలో నేలమట్టానికి దిగువున రూపకల్పన చేసిన పండ్ల తోట ఉంది. ఆ తోటలో ఎన్నెన్నో మడుగులు, తటాకాలూ… అక్కడే ఓ చిన్నపాటి మ్యూజియమ్ కూడా ఉంది. కుతుబియా మసీదుకు చెందిన పన్నెండో శతాబ్దపు అలంకృత వేదిక ఆ మ్యూజియమ్ లోని ప్రధాన ఆకర్షణ. ఆనాటి ఇస్లామ్ ప్రపంచంలో అది ఎంతో పేరుగొన్న కళాకృతి అట. ఈనాటి స్పెయిన్ దేశపు కార్డోబాలో ఆ వేదిక రూపకల్పన జరిగిందట.

ఆ ప్రాసాదపు గోడలలో గూళ్ళు కట్టుకుని నివసించే గూడకొంగల కుటుంబాలు అక్కడి అదనపు ఆకర్షణ. అవన్నీ అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని తమ తమ పుల్లల గూళ్ళలో హాయిగా చేరగిలబడి రాజసౌధపు ప్రాంగణమంతటినీ పరకాయించి చూస్తూ ఉంటాయి. ఎప్పట్నుంచో వినవస్తున్న స్థానిక కథనం ప్రకారం అవి మామూలు గూడకొంగలు కావు – ఆ ప్రాసాదంలో గతకాలంలో నివసించిన రాజులు, రాణుల ప్రస్తుత ప్రతిరూపాలవి. వారి వారి ఆత్మలే ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఆ సౌధపు నిడుపాటి గోడలలో గూళ్ళు కట్టుకుని ఉండిపోయాయన్నది అక్కడి వాళ్ళ నమ్మకం.

ధృఢంగా నిర్మించిన రాజసౌధపు బయటి ప్రాకారపు బురుజుల పైకి చేరి చుట్టూ చూసినపుడు, దిగువున బాగా విస్తరించి ఉన్న పురాతన నగరం, దాని చుట్టూ పది కిలోమీటర్ల మేర కట్టిన గట్టిపాటి కోటగోడా కనిపించాయి. అవన్నీ తొమ్మిది వందల సంవత్సరాల నాటివి. ఇన్నేళ్ళు గడిచినా ఆ తొమ్మిది మీటర్ల ఎత్తున్న ప్రాకారపు గోడలు, వాటికి ఉన్న అనేకానేక ద్వారాలు, బురుజులూ ధృఢంగా దిట్టంగా ఉన్నాయి. మరాకేష్ నగరాన్ని స్థాపించిన అల్ మొరావిన్ వంశ ప్రభువులు నగరాన్ని దక్షిణాదిన ఉన్న అల్మొహద్‍ల బారినుంచి రక్షించుకోవడానికి కట్టిన ప్రాకారమది.

ఎల్ బాదీ పాలెస్ చూడటం ముగిశాక 19వ శతాబ్దంలో కట్టిన బహీయా పాలెస్‍కు వెళ్ళాం. ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న భవనమది. రంగులీనే ఆ భవనంలో ఎన్నెన్నో ప్రాంగణాలు, ఉద్యానవనాలు, చక్కని అభిరుచితో అలంకరించబడిన గదులు, నడవాలు – పురాతన భవనాలు, శిథిలాలు అంటే ఇష్టపడని వారికి ఆధునిక రీతిలో ఈమధ్యనే నిర్మించిన ఈ బహీయా పాలెస్ ఒక వరప్రసాదం.

సాయంత్రమయింది. మరోసారి ఇద్దరం జెమా ఎల్ ఫినా కేసి దారి తీశాం. అప్పటికే మాకు ఆ కూడలికి వెళ్ళే సందుగొందులతో పరిపూర్ణ పరిచయం ఏర్పడిపోయింది. వెళ్ళే దారిలో మమ్మల్ని ఆకట్టుకునే దృశ్యమొకటి కనిపించింది. పశ్చిమాన క్షితిజం లోకి దిగిపోతున్న సూర్యుడు వెళుతూ వెళుతూ రంగులు విరజిమ్మసాగాడు. నగరమంతా రంగుల హేల. కుతుబియా మసీదు మినార్లు గులాబీరంగు నుండి క్రమక్రమంగా రంగులు మార్చుకుంటూ బంగారు, కాషాయ రంగుల మీదగా ఎరుపుకు మారాయి. అదో మరుపు రాని దృశ్యం.

చీకట్లు కమ్ముకునేదాకా ఆ మినార్లను అలా చూస్తూ ఉండిపోయాం. ఆ తర్వాత జెమా కూడలి వైపు సాగాం. మేం చేరుకున్న సమయానికే ఇతర కుటుంబసభ్యులూ అక్కడికి చేరుకుని చేతులకు హెన్నా పెట్టించుకోవాలన్నది మా ప్రణాళిక. చీకటి కమ్మిన ఆ మలిసంధ్య సమయంలో జెమా ఎల్ ఫినా ప్రాంగణం మాంత్రికత నిండిన ప్రదేశంలా కనిపించింది. పగటిపూటతో పోలిస్తే ఆ సమయంలో అక్కడి జనసందోహం కొన్ని రెట్లు ఎక్కువ. కొత్త కొత్త వీధి దుకాణాలు పుట్టుకొచ్చి కనిపించాయి. అందులో తినుబండారాలు అమ్మేవే అధికం. ఎక్కడ చూసినా మనుషులే మనుషులు!

ఆ కూడలి లోని ఓ రెస్టారెంటు మేడ మీడ కూర్చుని దిగువున సాగిపోతున్న జనజీవనాన్ని గమనించడం: మరాకేష్ నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసిన క్షణాలవి. ఆ మనుషులు, వారి జీవశక్తి, అక్కడి కార్యసరళి, ఆ జనజీవనం – అక్కడి ప్రతీ క్షణం నాలో చైతన్యం నింపింది. ఉత్తేజం కలిగించింది. కొన్ని కొన్ని ప్రదేశాలు తమదైన శక్తితో నిండి ఉండడం మనం అప్పుడప్పుడూ గమనిస్తూ ఉంటాం. ఇక్కడ ఆ జీవశక్తి సజీవంగా భౌతికంగా నా కళ్ళముందు కదలాడుతున్న భావన కలిగింది. నేను ఇప్పుడు చూసి మురిసిపోయిన ఈ జీవనసరళి కొన్ని శతాబ్దాలుగా ఆ కూడలిలో అనునిత్యం సాగిపోతూనే ఉంది అన్న విషయం నన్ను అబ్బురపరచింది. ప్రపంచంలో ఇలా చైతన్యం తొణికిసలాడే ప్రదేశాలు ఎన్నో చూశాను కాని, అవి ఏవీ ఈ జెమా కూడలి అనుభవానికి సాటి రావు. అది ఒక విలక్షణ అనుభవం. మొరాకో దేశం చూసి వచ్చిన ఎవరికైనా ఆ దేశం పేరు చెప్పగానే ముందుగా కళ్ళముందు మెదలాడేది జెమా ఎల్ ఫినా కూడలి దృశ్యమే. అంచేతనే యునెస్కోవారు ఆ కూడలిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి ‘ఇది ప్రణాళికారహితంగా సమకూడిన ఒక జనజీవన కళాఖండం’ అని కీర్తించారు.

పిల్లలూ వాళ్ళ తల్లులూ షాపింగులు చేస్తూ అమితానందం పొందారు. వారికి చక్కగా అలంకరించి ఉన్న ఒక సుగంధద్రవ్యాల దుకాణం ఎంతో బాగా నచ్చింది. అక్కడ స్థానికంగా దొరికే పుదీనానూ కుంకుమనూ కొన్నారు. మందారం వర్గానికి చెందిన చిన్నపాటి మొక్క కుంకుమ. దానికి ఊదారంగులో ఉండే చిన్నపాటి ద్విలింగ పుష్పాలు పూస్తాయి. ఆ పూలలో ప్రత్యుత్పత్తికి ఉపకరించే పుప్పొడి నిండిన కేసరాలు, ఆ పుప్పొడిని తమలో ఇముడ్చుకునే కీలము, కీలాగ్రము, అండకోశమూ కలిగిన స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమూ ఉంటాయి. ఈ కీలభాగం ఎర్రరంగులో ఉంటుంది. ప్రతి కుంకుమ పువ్వులోనూ సాధారణంగా మూడు కీలాలు ఉంటాయి. వాటిని పువ్వునుంచి ఎంతో సున్నితంగా విడదీసి, ఎండబెట్టి కుంకుమను (ఆంగ్లంలో శాఫ్రాన్ అంటారు) చేస్తారు. ఈ శాఫ్రాన్ వంటకాలకు రంగూ రుచీ సమకూర్చే విలక్షణ సుగంధ ద్రవ్యం. మొరాకో వంటకాల్లో దీన్ని బాగా వాడతారు. ఎంతో ఖరీదయిన దీనికి ఎర్రబంగారం – రెడ్ గోల్డ్ – అన్న గౌరవనామం ఉంది. మొరాకో దేశపు ఆట్లస్ పర్వత పాదచ్ఛాయల్లోని లోయలలో కుంకుమ సాగు ఎన్నో శతాబ్దాలుగా సాగిపోతోంది.

హెన్నా పెట్టడం అన్నది ఆ కూడలిలో ఎన్నెన్నో ఏళ్ళనుంచీ సాగుతున్న కళ. ఆ కూడలిలో ఎక్కడ చూసినా హెన్నా కౌంటర్లు… వాటిని నిర్వహించే స్థానిక మహిళలు… వారిముందు చేతులు చాపి కూర్చునే తల్లులూ పిల్లలూ… ఆ చేతుల్నే కాన్వాసుగా మార్చుకొని అద్భుతమైన డిజైన్లు పుట్టించే ఆ కళాకారుల పనితనం – అన్నట్టు ఈ కళ భారతదేశం లోనూ బాగా ప్రచారంలో ఉన్నదే. ఏదేమైనా మావాళ్ళను ఈ కళలో సంతృప్తి పరచడం ఏమంత సులభం కాదు. అప్పటికే మావాళ్ళు ఎంతెంతోమంది హెన్నా కళాకారుల నైపుణ్యాన్ని చవి చూసి ఉన్నారు – వాళ్ళ మనసుల్ని కూడా ఆ జెమా కూడలి కళాకారులు అతిసులభంగా గెలుచుకోగలిగారు.


మరాకేష్‍లో మరింకో రోజు గడిపాం. అది 2019 సంవత్సరపు చివరి రోజు.

మరోసారి మాకెంతో ప్రీతిపాత్రమయిన జెమా ఎల్ ఫినా కూడలి దగ్గరికి వెళ్ళి వీడ్కోలు పలకాలనుకున్నాం. అక్కణ్ణుంచి వెళ్ళి, ల మమున్యా (La Mamounia) అన్న చరిత్ర నిండిన హోటల్ చూసి రావాలన్నది మా ప్రణాళిక. ఈ ల మమున్యా హోటల్ మొరాకో దేశపు ప్రతీకలన్నిటిలోకీ అతి విశిష్టమైనది. వలసపాలన కాలంలో ప్రఖ్యాతి చెందిన ఇంపీరియల్ హోటల్ – న్యూ ఢిల్లీ; ఒబేరాయ్ గ్రాండ్ – కలకత్తా; పెనిన్సులా హోటల్ – హాంగ్‍కాంగ్; రఫాయెల్స్ – సింగపూర్; స్టాండర్డ్ హోటల్ – రంగూన్; ఇలాంటివాటి సమపంక్తికి అర్హమైన హోటలిది.

ల మమున్యా హోటల్‍ను మొరాకో దేశపు వాస్తురీతి ఉట్టిపడేలా నిర్మించారు – అరబిక్, బెర్బర్, అండాలూసియా వాస్తుశిల్ప సమ్మేళనమా కట్టడం. నగరం లోని ప్రముఖ ప్రాంతంలో, ముప్ఫై ఎకరాల స్థలంలో, నడుమన ఉద్యానవనంతో, జెమా కూడలికి నడకదూరంలో ఉన్న హోటలది. ఆ హోటల్లో గెస్టుగా ఉండటమన్నది తలకు మించిన పని. కానీ ఆ హోటల్ వాళ్ళు ఎంతో సహృదయంతో ప్రతిరోజూ పదకొండూ ఒంటిగంటా మధ్య సందర్శకులను అనుమతిస్తున్నారు. ఎవరైనా సరే వెళ్ళి ఆ హోటల్ ప్రాంగణంలో తిరుగాడవచ్చు. వెనుక భాగాన ఉన్న ఆ ఉద్యానవనాన్ని చూసి రావచ్చు. మేమా తోటను ఎంతో నింపాదిగా తిరిగి చూశాం. నన్నడిగితే అసలా తోటను చూడటానికే అక్కడికి వెళ్ళి రావచ్చంటాను. అందులో వందలాది నారింజ చెట్లున్నాయి. రకరకాల గులాబీలు నిండిన రోజ్ గార్డెన్ ఉంది. ఎడారి ప్రాంతపు జెముడు మొక్కలతో మరో ప్రాంగణం… అందులో ఎప్పటిదో ఒక నిడుపాటి జెముడు మొక్క. ఇవి కాక మరో పామ్ చెట్ల ప్రాంగణం…

హోటల్ భవనపు వెనుకతట్టున ఉద్యానవనం లోకి తొంగి చూసేలా ఒక రెస్టారెంట్ ఉంది. ఊరికే వెళ్ళి హోటలంతా దొంగచూపులు చూసి రావడం మాకే సిగ్గనిపించింది. హోటల్ వాళ్ళు ఎంత ఉదారంగా అందుకు అనుమతించినా నిస్సిగ్గుగా దాని ఫాయిదా పొందడం సముచితం కాదనిపించింది. అంచేత మేమంతా ఆ రెస్టారెంట్ లోకి చేరి మింట్ టీ ఆర్డరిచ్చాం. ఎంతో నింపాదిగా అరగంట తర్వాత మాకు టీ వచ్చింది. అక్కడ అన్ని పనులూ నింపాదిగా హుందాగా జరిగిపోవడం మేము గమనించాం. రెస్టారెంటు వాళ్ళు ఎంతో సుందరంగా అందించిన మింట్ టీని తీరిగ్గా ఆస్వాదిస్తూ మేమంతా అక్కడ చక్కని సమయం గడిపాం. ఆ విరామక్షణాల్లో అటూ ఇటూ చూపు సారించినప్పుడు మమున్యాలో ప్రదర్శితమవుతున్న ఒక విశేషం మా అందరినీ ఆకర్షించింది. రెండవ ప్రపంచ యుద్ధసేనాని విన్‍స్టన్ చర్చిల్‍కు ఆ హోటల్‍తో ఎంతో అనుబంధం ఉంది. ఆయన అక్కడ ఎన్నోసార్లు బస చేశాడు. హోటల్ ప్రాంగణంలో ఆ అనుబంధాన్ని గుర్తు చేసే జ్ఞాపికలు ప్రదర్శితమై ఉన్నాయి. ఆయన బృహత్తర వర్ణచిత్రం సరే సరి.

ఆయన అనే కాకుండా ఆ హోటల్లో బస చేసిన రాజప్రముఖులు, దేశాధినేతలు, ఇతర ప్రముఖుల ఛాయాచిత్రాలు కూడా అక్కడి గోడలని అలంకరించి ఉన్నాయి. వారిలో ఫ్రెంచ్ మూలాల దొరలని నేను గుర్తించలేకపోయినా ఆంగ్ల మూలాల వ్యక్తుల్ని సులభంగా గుర్తించగలిగాను. చార్లీ చాప్లిన్, కర్క్ డగ్లస్, బీటిల్స్ బృందపు పాల్ మెక్‍కార్ట్‌నీ – అలా ఆ హోటల్లోని చారిత్రక విశేషాలను నేను ఆసక్తిగా చూడటం గమనించిన హోటల్ మనిషి ఒకతను పాల్ మెక్‍కార్ట్‌నీ కలం లోంచి జాలువారిన మమున్యా అన్న ప్రఖ్యాతగీతం 1970ల నాటి తొలిదినాలలో ఆయన ఈ హోటల్లో బస చేసినప్పుడే రాశాడన్న విలువైన సమాచారం నా చెవిన వేశాడు. నేనడిగిన మరో ప్రశ్నకు అతగాడు ఆ హోటల్ ముప్ఫై ఎకరాల ప్రాంగణంలో విస్తరించి ఉంది అన్న వివరం కూడా అందించాడు.

విన్‍స్టన్‌ చర్చిల్ ఈ హోటల్‍ని తాను బస చేసిన అన్ని హోటళ్ళలోకెల్లా ఎన్నతగినది, ఉత్తమమైనది అని ప్రశంసించాడట. ఇక్కడి ఉద్యానవనంలో వర్ణచిత్రాలు వేస్తూ ఆయన తీరిగ్గా సమయం గడిపేవాడట. అక్కడి ‘చర్చిల్ స్వీట్’లో బస చెయ్యడానికి ఇప్పటి లెక్కల ప్రకారం ఒక రోజుకు మూడువేల పౌండ్లు ఖర్చవుతుంది – మహారాజులకే సాధ్యమైన ఖర్చు అది.

మా చేతిలో ఇంకా కొంత సమయం మిగిలి ఉంది. ఆ సమయాన్ని ఆరుబయట విహారాలకే ఉపయోగిద్దామని ఆ హోటల్ లోంచి బైటపడ్డాం. ఆ సందుగొందుల్లో తిరుగాడి తిరుగాడి తిరిగి జెమా ఎల్ ఫినా కూడలి చేరుకున్నాం. అప్పటికే పది పన్నెండు సార్లు ఆ కూడలిలో తిరుగాడినా అది ఒక బలమైన ఆకర్షణ… ఇంకా చెప్పాలంటే ఒక వ్యసనం. చిట్టచివరిసారిగా అక్కడ దుకాణపు వీధులలో కాసేపు గడుపుదామన్న కోరిక అరికట్టుకోలేనిది. దేశం వదిలి సొంతగూటికి చేరిన తర్వాత కూడా, ఈ కూడలికి చెందిన దృశ్యాలు, పరిమళాలు, శబ్దాలు, రంగులు, రుచులూ నా జ్ఞాపకాల్లోకి, ఇంకా చెప్పాలంటే నా కలల్లోకి కూడా చొరబడి నన్ను పదేపదే సమ్మోహితం చెయ్యడం ఖాయం అనిపించింది.

భోజన సమయమయింది. అక్కడ ఉన్న మహా సొగసైన కఫే ఫ్రెంచ్ అన్నచోట భోజనం చెయ్యాలన్నది మా మొదటి ఆలోచన. కానీ మరి అది ఘటన అనాలో అదృష్టం అనాలో తెలియదు – చివరికి అక్కడి దుకాణాల మధ్యన ఉన్న ముస్తఫా అన్న రెస్టారెంట్లో అడుగు పెట్టాం. స్థానికులంతా బాగా అభిమానించే రెస్టారెంటులా అనిపించిందది. టాంజియా అన్నది వాళ్ళు అందించే ప్రత్యేక వంటకం. కుదురు ఆకారపు మట్టి పాత్రలో నింపాదిగా వండి వడ్డించే మాంసాహారపు వంటకమది. ఆ మరాకేష్ నగరంలో ఎంతో ప్రాచుర్యం ఉన్న వంటకమది. వినడానికి ఈ వంటకం టజీన్ లానే ఉందే అనిపించినా వండే పద్ధతి లోను, వాడే దినుసులు, పాత్రల పరంగానూ భిన్నమైన వంటకమిది.

ముస్తఫా రెస్టారెంటు గోడలకు దాని గురించి పత్రికల్లో వచ్చిన వార్తలూ వ్యాసాల పేపర్ కటింగులు ఫ్రేమ్ కట్టి బిగించి ఉన్నాయి. అక్కడకు వచ్చి విందారగించిన ప్రముఖుల వివరాలు కూడా పొందుపరిచి ఉన్నాయి. చూడ్డానికి అది ఏ హంగులూ ఆర్భాటాలూ లేని సాదాసీదా ప్రదేశంలా అనిపిస్తున్నా ఆ వివరాలను గమనిస్తే అది ఒక అంతర్జాతీయ ప్రఖ్యాతి కలిగిన వంటకాల వ్యవస్థ అన్న విషయం స్పష్టమయింది. మరాకేష్ నగరానికి వన్నె తెచ్చే ప్రదేశమనీ బోధపడింది. దాని ముఖద్వారం దగ్గర చిన్నపాటి అరుగు మీద తన చుట్టూ వడ్డించడానికి సిద్ధంగా ఉన్న టాంజియాలను అమర్చుకొని బాసింపట్లు వేసుకుని కూర్చున్న మనిషి కనిపించాడు. మేము లేత మేక మాంసపు టాంజియాకు ఆర్డరిచ్చాం. వెంటనే తెచ్చి అందించారు. ఎంతో రుచికరమైన టాంజియా అది. కానీ నావరకు నేను టజీన్‍నే ఇష్టపడతాననిపించింది – అది ఎండు ద్రాక్షలు, ఏప్రికాట్ లతో నిండి ఉంటుంది. టాంజియా ప్రధానంగా మాంస కేంద్రిత వంటక.

విడవలేక విడవలేక్ జెమా ఎల్ ఫినాకు వీడ్కోలు చెప్పి అందరం మధ్యాహ్నానికల్లా హోటలు చేరుకున్నాం. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే సన్నాహాల్లో హోటల్ యావత్తూ నిమగ్నమై కనిపించింది. ఆనాటి రాత్రి చక్కటి మొరాకన్ వంటకాలతో హోటల్ యాజమాన్యం నూతన సంవత్సరానికి స్వాగతం చెపుతూ అతిథులందరికీ విందు అందించనుంది.

అందరం సంబరంగా 2020కు స్వాగతం చెప్పాం. చిట్టచివరి సారిగా మొరాకన్ విందుభోజనాన్ని ఆస్వాదించాం. ఎంతో హాయిగా సంతృప్తితో నిద్రాదేవత ఒడిలో సేదదీరాం. తెల్లవారగానే చుట్టూ కమ్ముకున్న కొత్త సంవత్సరపు పరిమళాలను మనసారా ఒంటపట్టించుకుంటూ తిరుగు ప్రయాణం కోసం విమానాశ్రయం దారి పట్టాం.

ఈ రెండో యాత్ర మొరాకో దేశమంటే నాకున్న ఆసక్తిని, అనురక్తినీ ఇనుమడింపజేసింది. ఇంకా ఇంకా ఆ దేశాన్ని మనసులో నింపుకోవాలన్న కోరిక కలిగించింది. ఇంతా చేసి నేను మహాయాత్రికుడు ఇబ్న్ బటూటా పుట్టి పెరిగిన టాంజీర్ నగరం వెళ్ళనే లేదు. మధ్యయుగాలనాటి ఆ మహానుభావుడు ఆడి పాడిన ఇల్లు చూడనే లేదు. టాంజీర్ అనేగాకుండా ఉత్తర మొరాకోలో మరెన్నో చూడవలసిన ఊళ్ళున్నాయి: కాసాబ్లాంకా, ఫెజ్, రబాత్… ఇవన్నీ చూడటం కోసం మరోసారి మొరాకో వెళ్ళాలి కదా… వెళ్ళి ఆ దేశపు అత్యున్నత శిఖరం మౌంట్ తుబ‍కల్ ఎక్కాలి కదా… సహారా ఎడారిలో తిరుగాడాలి కదా… ఇవన్నీ అటుంచి ఆ దేశపు టజీన్‍లూ టాంజియాలూ ఆరగించాలి కదా… అబ్బో! ఇంకా ఎన్నున్నాయో కారణాలు మొరాకో మళ్ళీ వెళ్ళడానికి!