ఉత్తర మొరాకో శోధనలు 2

ఫెజ్ నగరమూ, పరిసర ప్రదేశాలూ…

ఫెజ్ మదీనాతో నా మొదటి సంపర్కం కాస్తంత గజిబిజిగా అనిపించడమూ, ఆ ప్రదేశపు చారిత్రక నేపథ్యాన్ని కాస్తంత పద్ధతిగా తెలుసుకోవాలన్న కోరికా ఒక గైడ్‌ను చూసుకోవాలన్న ఆలోచనకు దారితీశాయి. ఆ గైడ్‌తో కలసి ఆ ప్రాంతమంతా కాలినడకన తిరిగిరావాలనుకొన్నాను. నమీర్‌తో ఈ మాట అంటే తన స్నేహితుడు రషీద్‌ను నాకు పరిచయం చేశాడు. ఇలాంటి విషయాల్లో రషీద్ బాగా అనుభవశాలి అట. అతనితో కలసి ఎన్నో గంటలపాటు మదీనా ప్రాంతమంతా తిరిగివచ్చాను.

ఇరవయ్యో శతాబ్దంలో ఫ్రెంచివారి అధీనంలోకి వచ్చేవరకూ ఫెజ్ నగరం ఏ విదేశీ శక్తుల అధికారానికీ గురి అవ్వలేదని చెప్పాడు రషీద్. ఘనత వహించిన టర్కీప్రాంతపు ఆటమన్ ప్రభువులకు కూడా లొంగలేదట. అంచేత తన పద్ధతులనూ సంస్కృతినీ ఏ ఇతర ప్రభావాలూ లేకుండా స్వచ్ఛంగా నిలబెట్టుకోగలిగిందట. ఆ విధంగా ఫెజ్ నగరం మొరాకో దేశపు సంస్కృతిక వారసత్వానికి చిట్టచివరి పట్టుకొమ్మగా నిలచి ఉందట…

ఫెజ్ మదీనాకు చెందిన ఎన్నెన్నో వివరాలు గబగబా చెప్పుకొచ్చాడు రషీద్. ఆ మదీనా ప్రాంతం ప్రపంచంలోని మదీనాలన్నిటిలోనూ పెద్దదట. పదమూడు గేట్లూ, పద్నాలుగు కిలోమీటర్ల ప్రాకారమూ మధ్య 540 ఎకరాల విస్తీర్ణమట ఆ మదీనాది. మొత్తం 9400 వీధులున్నాయట. 350 విభాగాలట. ప్రతి విభాగంలోనూ ఒక జలయంత్రం (ఫౌంటెన్), ఒక స్నానశాల (హమ్మామ్), బేకరీ, మసీదు, మదరసా ఉన్నాయట. యునెస్కోవారు దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారట.

మదీనా ప్రాకారపు నడుమ నివసించే తొంభైవేల ప్రజానీకం, వాళ్ళకు తోడు అనునిత్యం పనికోసం వచ్చేవాళ్ళూ, ఆయా ప్రదేశాలను చూడటంకోసం వచ్చే వేలాదిమంది యాత్రికులు – వీటన్నిటివల్ల ఆ ఫెజ్ మదీనా ప్రపంచంలోకెల్లా అతి పెద్ద మోటారువాహన రహిత ప్రదేశంగా పరిణమించిందట. ఈనాటికీ ఆయావీధుల్లో కార్లకూ, ఇతర ఫోర్‌వీలర్లకూ ప్రవేశం లేదు. అంచేత ఆ మదీనా ప్రాంతం నుంచి బయటకూ, బయటనుంచి మదీనా ప్రాంతానికీ వస్తువుల సరఫరాకు గార్దభాలే ఈనాటికీ ముఖ్యమైన వాహనాలు.

అక్కడున్న పదకొండో శతాబ్దపు చవోరా చర్మశాల-టానరీ- అన్నది ప్రపంచంలో అవిఘ్నంగా కార్యకలాపాలు సాగిస్తోన్న అతి పురాతన టానరీ ప్రాంతమట. వందలాది సంవత్సరాలుగా అక్కడి చర్మశాలలు తమతమ రూపురేఖలనూ పద్ధతులనూ ఏమాత్రం మార్చుకోలేదట.

రంగురంగుల పీపాలతో నిండి ఉన్న ఆ చర్మశాలల కార్యకలాపాలను చూడటానికి ఆ ప్రాంతాన ఉన్న షాపులూ భవనాల పైకప్పులు చేరడం అతిచక్కని మార్గం అన్నాడు రషీద్. అన్నట్టుగానే అక్కడున్న ఓ దుకాణదారుడి అనుమతి అందుకు సంపాదించాడు. ఆ అనుమతికి ప్రతిగా అక్కడ నేను ఏదైనా కొనుగోలు చెయ్యాలన్నది వాళ్ళిద్దరి మధ్యా ఉన్న విప్పిచెప్పని ఒప్పందం. ఆ ప్రకారం ఆ షాపులో నేనో బెల్టు కొన్నాను. బయట ధరలతో పోలిస్తే కాస్తంత ఎక్కువ చెల్లించిన మాట నిజమేకానీ ఆ టానరీల సుందర దృశ్యాలు చూడగలిగినందుకు నేనిచ్చిన అదనపు రుసుముగా అది సరిపోతుంది.

ప్రపంచంలోని అతి పురాతన విశ్వవిద్యాలయానికి కూడా ఫెజ్ నగరం నిలయం అన్నాడు రషీద్. అతి పురాతన టానరీ అంటే పర్లేదు గానీ అతి పురాతన విశ్వవిద్యాలయమన్నమాట మరీ విపరీతం అనిపించింది. దాన్ని జీర్ణించుకోడానికి కాస్త సమయం పట్టింది. నా మొహంలోని మిశ్రమ భావాలను పసిగట్టిన రషీద్ ఒక సన్నపాటి సందులోకి ప్రవేశద్వారం ఉన్న భవనంకేసి చూపించాడు. అది కైరవాన్ విశ్వవిద్యాలయ భవనమని, యునెస్కోవాళ్ళూ గిన్నీస్ బుక్‌వాళ్ళూ దాన్ని యావత్ ప్రపంచంలో అవిఘ్నంగా కార్యకలాపాలు కొనసాగిస్తోన్న అతి పురాతన విశ్వవిద్యాలయంగా గుర్తించారనీ వివరించాడు. ఇంకా ముందుగా స్థాపించిన విశ్వవిద్యాలయాలు ఉన్నాయిగానీ అవన్నీ కాలగతిలో కలసిపోయాయి. ఈ విశ్వవిద్యాలయం క్రీస్తుశకం  859లో ఒక మదరసాగా ఆరంభమయిందట. కైరవాన్ కుటుంబానికి చెందిన భర్తృహీన ఫాతిమా అల్‌ ఫిహరీ అందించిన వనరుల ఆధారంతో ఈ విశ్వవిద్యాలయం మొదలయిందట. ఫెజ్ చరిత్రలో పన్నెండూ పదమూడు శతాబ్దాల కాలం స్వర్ణయుగం. 1170 ప్రాంతాల్లో రెండు లక్షల జనాభాతో ఫెజ్ నగరం ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యాకులు నివసించే ప్రదేశంగా అరుదైన గౌరవం పొందింది అన్న వివరం కూడా రషీద్ అందించాడు.

కైరవాన్ యూనివర్సిటీ నాలో కుతూహలం రేకెత్తించింది. మరిన్ని వివరాలు శోధించాను. ఇస్లామిక్ ప్రపంచ చరిత్రలో ఒక అతి విశిష్ట విద్యాలయంగా ఈ యూనివర్సిటీ నిలిచింది. తన ఉచ్చదశలో ఈ విద్యాలయం ఇస్లామిక్ దేశాలనుంచి, దక్షిణ ఐరోపా నుంచీ విద్యార్థుల్ని ఆకర్షించగలిగింది. ఆ కాలపు ప్రతిభావంతులైన మేధావులు, చింతనాశీలుల అధ్యాపకత్వంలో చదువుకోడానికి విద్యార్థులు దూరదూరాలనుంచి వచ్చేవారట. ఇస్లామిక్ మత అధ్యయనాల కేంద్రంగా మొదలయిన ఆ విశ్వవిద్యాలయం క్రమక్రమంగా వైద్యం, సంగీతం, వ్యాకరణం, భాషాశాస్త్రం, న్యాయశాస్త్రం, ఖగోళశాస్త్రం లాంటి విభిన్న మతప్రమేయం లేని అంశాలనూ తన ప్రణాళికలో చేర్చుకొంది…

ప్రపంచంలోకెల్లా అతి పురాతన విశ్వవిద్యాలయం అన్న విషయంలో ఏమన్నా అనుమానాలు ఉండొచ్చేమోగానీ ఇస్లామిక్ ప్రపంచంలో – కైరోలోని క్రీ.శ. 970లో మొదలయిన అల్ అజర్ విశ్వవిద్యాలయంతో సహా పోల్చి చూసినా కూడా ఇది కనీసం వందేళ్ళు ముందే మొదలయిన విద్యాలయం అన్నది నిర్వివాదం. కాలానుసారం ఈ విద్యాలయమూ మార్పులకు గురి అయ్యింది. ప్రస్తుతం ఫెజ్ మదీనా ప్రాంతంలో ఉన్న అలనాటి విద్యాలయ భవనాలు ఇప్పటి అల్ కైరవాన్ విశ్వవిద్యాలయంలో ప్రముఖ భాగాలు.

విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసిన మొట్టమొదటి విద్యాలయం ఈ కైరవాన్ యూనివర్సిటీ. అప్పటి ఆ సంప్రదాయం ఇపుడు విశ్వవ్యాప్తంగా కొనసాగుతోంది. ఆ పట్టాలను గొర్రెచర్మపు పత్రాల మీద చేసేవారట. అలాగే వైద్యవిద్యలో పట్టాలు అందించిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం కూడా ఇదేనట. ‘మొరాకో వరల్డ్ న్యూస్’ సంస్థ కథనం ప్రకారం 1270 సంవత్సరంలో అబ్దుల్లా బెన్‌సలేహ్ అల్ కౌటామి అన్న మొరాకో విద్యార్థి ఇక్కడ మొట్టమొదటి డాక్టరు పట్టా అందుకొన్నాడట. అంచేత ఒక వైద్యశాస్త్ర పట్టభద్రునిగా నా మూలాలను ఇదిగో ఈ మొరాకో విశ్వవిద్యాలయంలో నేను వెదుక్కోవచ్చునన్నమాట!

ఇప్పటికే చెప్పుకొన్న 8 నుంచి 14వ శతాబ్దం దాకా కొనసాగిన ఇస్లామిక్ స్వర్ణయుగ సమయంలో ఈ విశ్వవిద్యాలయం ఒక ముఖ్యమైన విజ్ఞాన కేంద్రంగా జ్ఞాన సింధువుగా నిలచింది. ఐరోపాకు హిందూ-అరబిక్ సంఖ్యలను పరిచయం చేసిన పోప్ సిల్విస్టర్ II ఏడో శతాబ్దంలో – తాను పోప్‌గా ఎన్నిక అవడానికి ముందు – ఈ కైరవాన్ విశ్వవిద్యాలయంలో చదువుకొన్నాడు. సున్నాను తనలో ఒక ప్రముఖభాగంగా అమర్చుకొన్న భారతీయ సంఖ్యా శృంఖల అప్పటికే అరబిక్ ప్రపంచంలోకి అడుగుబెట్టి అక్కడ స్థిరపడింది. ఇబ్న్ రూష్ద్ లాంటి – ఇస్లామిక్ స్వర్ణయుగకాలపు – పన్నెండవ శతాబ్దపు తత్వవేత్తలు ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులు.

ఈ ఇబ్న్ రూష్ద్‌కు అవెర్రోస్ అనే మరో పేరు కూడా ఉంది. అరిస్టోటిల్ రచనల మీద విపులమైన వ్యాఖ్యానాలు రాసిన వ్యక్తి ఈ ఇబ్న్ రూష్ద్. ఆ వ్యాఖ్యానాల పుణ్యమా అని ప్రాచీన గ్రీకు ప్రపంచానికి చెందిన అరిస్టోటిల్ తాత్విక రచనలు భద్రపరచబడి తిరిగి పాశ్చాత్య ప్రపంచానికి చేరాయన్నమాట. అలాంటి ప్రాచీన విశ్వవిద్యాలయపు భవనాలను చూసిరావాలని నేను సహజంగానే ఆకాంక్షించాను. ఆ ప్రాంగణంలో ఒక గ్రంథాలయం, ఒక మదరసా, ఓ మసీదూ ఉన్నాయి. కానీ అక్కడ మసీదు ఉంది కాబట్టి ఇతర మతాలవారికి ప్రవేశం నిషిద్ధం అని చెప్పాడు రషీద్. గొప్ప నిరాశ. ఆ ప్రాంగణపు ముఖద్వారం దాకా తీసుకువెళ్ళి ఇక్కడ్నించే ఆ ప్రాంగణాన్ని గబగబా చూసేయమన్నాడు రషీద్. అక్కడి పవిత్ర ప్రదేశాలను మతప్రమేయం లేని ప్రదేశాల నుంచి విడదీసి నాలాంటి యాత్రికులకి ప్రపంచంలోకెల్లా పురాతనమైన విద్యాలయాన్ని దగ్గరగా చూసే అవకాశం కలిగిస్తే ఎంత బావుణ్ణు అనిపించింది.

బౌ ఇనానియా, అల్ అత్తరీన్ అన్నవి ఆ మదీనా ప్రాంతంలో ఉన్న మరో రెండు ముఖ్యమైన మదరసాలు. ఆ అల్ అత్తరీన్ మదరసాను నేను క్షుణ్ణంగా చూడగలిగాను. అక్కడి పాలరాయి మీది పనితనం, సీడర్ దారువు మీద సృష్టించిన లలితమైన ఆకృతులూ నన్ను ఆకట్టుకొన్నాయి. ఆ ప్రదేశపు అబ్బురం కలిగించే వాస్తుశిల్పాన్ని గమనించాక అసలీ ప్రదేశం మరింత  తీరికగా అధ్యయనం చెయ్యవలసిన చోటు అనిపించింది.

మధ్యాన్నమయింది. ఓ కప్పు మింట్ టీ తాగొద్దామని ఇద్దరం బయల్దేరాం. ఉన్నట్టుండి రషీద్ నన్నో సన్నపాటి గొందు లోకి లాక్కెళ్ళాడు. ‘మోజెస్ హౌస్’ అన్న ఫలకం ఉన్న ఓ రెస్టారెంటు అతిమామూలు ప్రవేశద్వారం దగ్గరికి తీసుకెళ్ళాడు. ‘ఈ ఇంట్లో యూదు తత్వవేత్త మైమానిడిస్ నివశించాడు’ అన్న వివరణ చెప్పే ఫలకం అక్కడ కనిపించింది. ఆ మైమానిడిస్ అన్న ఆయన 12వ శతాబ్దపు ప్రతిభావంతులూ ప్రభావశీలురూ అయిన తోరా మేధావి బృందానికి చెందిన వ్యక్తి. ఫెజ్ నగరంలో కొన్నేళ్ళపాటు నివసించారాయన. ఆ తర్వాత ఈజిప్టుకు వెళ్ళారు.

ఎత్తూపల్లాల దారుల్లో మా మదీనా నడకలు సాగుతోన్న సమయంలో రషీద్ నన్నో ధూపగంధం నిండిన ప్రదేశానికి తీసుకెళ్ళాడు. ఫెజ్ నగరపు వ్యవస్థాపకుడు జౌనియా మౌలె ఇద్రిస్-2 సమాధి స్థలమది. ఆ పుణ్యస్థలపు ఉనికి ఫెజ్ నగరాన్ని పవిత్రనగరంగా మార్చింది. ఇస్లామ్‌కు చెందిన మనిషిని కాకపోవడం వల్ల ఆ స్థలాన్ని దాని ప్రవేశస్థానం నుంచి తొంగిమాత్రమే చూడగలిగాను.

ఫెజ్‌లో ప్రతి ఏడాదీ జరిగే ప్రపంచ ధార్మిక సంగీతోత్సవం ఒక విలక్షణ కార్యక్రమం. ఈ ఉత్సవం గురించి షఫియా రైలు ప్రయాణంలో చెప్పింది కూడానూ. ఈ సంగీతోత్సవానికి ప్రపంచపు నాలుగు మూలలనించీ విద్వాంసులు వస్తారట. సూఫీ ఖవ్వాలీల నుంచి హిందూ భజనల దాకా, క్రైస్తవ గీతాల నుంచి బౌద్ధమతపు మంత్రోచ్ఛారణ దాకా విభిన్న బాణీల సంగీత ప్రపంచంలోని చిన్నా పెద్దా మతాలన్నీ తమతమ సంగీత విధానాలను ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తాయట.

ఓ టోపీల దుకాణం ముందు నుంచి సాగిపోతున్నపుడు ‘ఈ ఎర్రటి స్తూపాకారపు టోపీలను చూస్తోంటే టర్కీ టోపీలు గుర్తుకొస్తున్నాయి’ అన్నాను. ‘మీరన్నది నిజమే, వీటి అసలు పేరు ఫెజ్ టోపీ. మా ఊరి పేరిట వాటికా గుర్తింపు’ అన్నాడు రషీద్. ఈ టోపీలు టర్కీలో బాగా ప్రాచుర్యం పొందాయట. ఆ దేశపు సైన్యపు శిరోధారణ సౌభాగ్యం లభించాక అవి పందొమ్మిదో శతాబ్దపు ఆటమన్ సామ్రాజ్యపు చిహ్నాలుగా పరిణమించాయట. అప్పటి సుల్తాన్ కూడా ఫెజ్ టోపీ ధరించసాగాడట. ఆ తర్వాత సివిల్ అధికారులకు కూడా అవి నిర్దేశించబడ్డాయట. 1925లో అప్పటి అధినేత కమాల్ అటాటుర్క్ తన ఆధునీకరణలో భాగంగా దానిని నిషేధించేదాకా ఫెజ్ టోపీ ప్రభ టర్కీలో వెలిగిపోయిందట. ప్రపంచంలో ఆ టోపీ ఉద్థానపతనాల సంగతి ఎలా ఉన్నా ఫెజ్ నగరంలో ఆ టోపీల ఉత్పాదన తరతరాలుగా సాగిపోతూనే ఉంది. ఆ కథంతా విని ముచ్చటపడిపోయి ఒక టోపీ కొనేద్దామా అనిపించినా ప్రస్తుతం బ్యాక్‌పాకర్ని గాబట్టి ఆ టోపీ కొనడం, దాన్ని ఆ చిన్నపాటి బాక్‌పాక్‌లో ఇరికించడం- అదంతా సాధ్యం కాదులే అని ఆ ఆలోచన విరమించుకొన్నాను.

ఫెజ్ మదీనాలో మరో రెండుసార్లు తీరిగ్గా తిరుగాడాను. ఒక శక్తివంతమైన అయస్కాంతంలా ఆ ప్రదేశం నన్ను ఆకట్టుకొంది. గతకాలపు గురుతులు అంటే నాకున్న ఆకర్షణ అందుకు కారణమై ఉండొచ్చు. ఒక కాలనాళికలో ప్రవేశించి శతాబ్దాల తరబడి ఏ మార్పుకూ గురికాని గతాన్ని దర్శించిన భావన అక్కడ కలిగింది. ఆ ప్రదేశాల్లో తిరుగాడుతూ, సరికొత్త సందుగొందుల్ని ఆవిష్కరిస్తూ, అపుడపుడు ఎంతో సంతోషంగా దారి తప్పుతూ ఆ ఊళ్ళో కాలం గడిపాను. అక్కడ ఉన్న మూడు రోజుల్లోనూ నే చేసింది ఉపరితల పరామర్శ మాత్రమేనని, తెలుసుకోవలసిన విషయాలు అపారం అని, ఆ నగరగర్భంలో ఎన్నో అరలూ పొరలూ ఇమిడి ఉన్నాయనీ తెలుసు. అలాగే ఫెజ్ నగరంలో మదీనానే గాకుండా ఇతర ప్రాంతాలూ ఉన్నాయి- వాటిల్ని నేను చూసింది నామమాత్రంగానే.

ఫెజ్ నగరపు మార్మికతా నిగూఢతా నన్ను విస్మయపరచిన మాట నిజం. ఇంకా పూర్తిగా ఆవిష్కరించబడని, ఏ కుదుపులకూ గురికాని, అర్హతకు తగ్గ గుర్తింపు పొందని నగరమాణిక్యమీ ఫెజ్ సిటీ. బయట ప్రపంచానికి ఈ నగరం గురించి తెలిసింది బాగా తక్కువ. ఆ మదీనా ప్రాంతంలో ఇప్పటికీ అచ్చమైన మధ్యయుగాలనాటి జీవన రూపమే కనిపిస్తోందనిపించింది నాకు. మరకేష్ నగరంలాగా తళుకుబెళుకులు లేకుండా స్వచ్ఛమైన సౌందర్యంతో కనిపించే నగరం ఫెజ్. అసలు సిసలు మొరాకో దేశం చూడాలనుకొనేవాళ్ళు తిన్నగా ఫెజ్ నగరానికి వెళ్ళండని నేను చెపుతాను. ఈ నగరానికి మళ్ళీ మళ్ళీ రావాలన్నది నా అభిలాష.


నా ఉత్తర మొరాకో శోధనలో మూడవరోజును ఫెజ్ పరిసరాల్లోని మూడు ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్ళిరావడానికి కేటాయించాను: ప్రాచీన రోమన్ నగరం ఓలుబులిస్, పవిత్ర ప్రదేశం మౌలె ఇద్రిస్, రాచరిక రాజధాని మెకనెస్.

ఆనాటి ఉదయం మా డర్ డోర్ ఫెజ్ రియాద్‌లో బాగా పెందలాడే నిద్రలేచాను. నాకారోజు సుదీర్ఘ ప్రయాణాలు ఉన్నాయన్న సంగతి మా నమీర్‌కు ముందే తెలుసు. అంచేత ఆరున్నరకల్లా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసిపెట్టాడు. మీరంతా అంత పెందలాడే లేచి ఆ ఏర్పాట్లు చెయ్యవద్దు అని వారించే ప్రయత్నం చేశాను గానీ అతను వినిపించుకోలేదు. ఏడింటికల్లా తలుపు తట్టిన శబ్దం- మా డ్రైవరు యజీద్ వచ్చేశాడని చెప్పాడు నమీర్. టాక్సీలూ అవీ ఏర్పాటు చేసుకోకుండా ఆయా ప్రాంతాల బస్సుల్లోనే తిరగాలన్నది నా కోరికే అయినా ఆనాడు నేను పెట్టుకొన్న లక్ష్యాల దృష్ట్యా నాకు తెలిసిన ఓ స్థానికుని సాయంతో కారు ఏర్పాటు చేసుకోక తప్పలేదు. నే పెట్టుకొన్న – రోజంతా పట్టే 250 కిలో మీటర్ల ప్రయాణానికి – నాతోపాటు రోజంతా ఉండటానికి యజీద్ తీసుకొంటున్నది ఎనభై యూరోలు. అది సరసమైన ధర అనిపించింది. ఆమాత్రం నేను ఖర్చుపెట్టగలను.

నిజానికి నే వెళదామనుకొంటోన్న మూడు ప్రదేశాలూ నేను ముందు అనుకొన్న మార్గానికి కాస్త పెడగా ఉన్నమాట నిజమే. కానీ వాటి చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యాల దృష్ట్యా వాటినీ చూసివద్దామని నిర్ణయించుకొన్నాను.

నా బ్యాక్‌పాక్ తగిలించుకొని తలుపు దగ్గరికి వెళ్ళేసరికి నోరారా నవ్వుతోన్న కుదిమట్టపు పెద్దమనిషి పలకరించాడు. ఏభైల నడుమ వయస్సు అనిపించింది.

ఇద్దరం మెయిన్ రోడ్డుదాకా నడిచాం. అక్కడ అతని కారు పార్క్ చేసి ఉంది. దానికి ఇరవయ్యేళ్ళ వయసుండాలి. అయిదు నిముషాలు గడిచేసరికల్లా ఆ కారు శబ్దాలకూ వాసనలకూ ఆకృతికీ అలవాటుపడిపోయాను. కారుకు సంబంధించి ఏమన్నా చిన్నచిన్న అసౌకర్యాలున్నట్టయితే అవి యజీద్ చిరునవ్వులూ, మర్యాదల మధ్య నాకు అంత ముఖ్యమనిపించలేదు. అన్నట్టు యజీద్‌కు ఒక్క ముక్క ఇంగ్లీషు రాదు; నాకు ఫ్రెంచీ అరబిక్ రానే రావు. అయినా మా హావభావాలతోనూ, అడపాదడపా మేం వల్లిస్తున్న నామవాచకాలతోనూ చక్కగా సంభాషించుకోగలిగాం.

ఫెజ్ నగరం వదిలేముందు యజీద్ ఒక వ్యూపాయింట్ దగ్గర కారాపాడు. నగరపు విశాల దృశ్యం కళ్ళముందు పరచుకొంది: లోయలోని నగరం, పటిష్టమయిన నగర ప్రాకారాలు, వాటి బృహత్తర ద్వారాలు, మసీదుల మీనార్లు-గుమ్మటాలు, ఆకట్టుకొనే దృశ్యమది.

ఫెజ్ దాటాక మా మార్గం పొడవునా ఆలివ్ తోటలు కనిపించాయి. మొరాకో దేశంలో ఆలివ్ పంటకు ప్రసిద్ధి చెందిన ప్రాంతమది. మొరాకోలో కెల్లా సారవంతమైన భూమి, అంతగా ఎత్తులేని కొండల వరసలూ ఆలివ్, ద్రాక్ష పంటలకు, ఆహార ధాన్యాలకూ ఆ ప్రాంతం అనువైనది. ఆ ప్రాంతాన్ని మొరాకో దేశపు ధాన్యాగారంగా పరిగణిస్తారు.

దారిలో తటస్థపడిన సిది సహద్ చెరువుల దగ్గర కారును కాసేపు ఆపాడు యజీద్. విశాలమైన, అంతగా లోతులేని లోయలో ఉన్నాయా చెరువులు. వాటివెనుక బూడిదరంగు కొండల వరుస… చెరువుల పరిసరాల్లో అక్కడక్కడా తోటలూ పంటపొలాలూ, చిన్న చిన్న గృహ సముదాయాలూ కనిపించాయి.

ఫెజ్ నుంచి గంటన్నర దూరంలో ఉంది ఓలుబులిస్ అన్న ‘రోమన్’ నగరం. అది మొదట్లో ఒక బెర్బర్ శిబిరంగా ఉనికి లోకి వచ్చింది. కాలక్రమేణా మారిటానియా రాజ్యానికి రాజధాని అయింది. క్రీస్తుశకం 44లో రోమన్ల ఆక్రమణకు గురయింది. వాళ్ళు దానినో బృహత్తర రోమన్ నగరంగా పునర్నిర్మించి  వారి పాలనలోని మారిటానియా టింజిటానా ప్రాంతపు రాజధానిగా చేశారు. అప్పటి రోమన్ కట్టడాలు ఎంత పటిష్టమైనవంటే వాటికన్నా ముందు కట్టినవి, వాటి తర్వాత కట్టినవీ పూర్తిగా కాలగర్భంలో కలసిపోయినా ఆ రోమన్ కట్టడాల అవశేషాలు ఇంకా నిలబడే ఉన్నాయి.

మైళ్ళకొద్దీ వ్యాపించిన విశాల మైదానాల మధ్య ఓ కొండమీద నిలచి ఉంది ఓలుబులిస్ నగరం. దూరం నుంచి కనబడే శిథిల భవనాలు, అర్ధచంద్రాకారపు స్వాగతద్వారాలు, దృఢమైన స్తంభాలూ వింత గాంభీర్యతను సంతరించుకొని ఆకట్టుకొన్నాయి.

ఓలుబులిస్ శిథిలాల ప్రాంగణంలో టూరిస్టుల సన్నపాటి సందడి కనిపించింది. టికెట్టు కొనుక్కుని ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే రుఇ అన్న వ్యక్తి కలిశాడు. మేమేవీ పద్ధతిగా పలకరించుకోకపోయినా మౌనాంగీకారాలతో ఇద్దరం కలసి నడవడం మొదలెట్టాం. ఆ ప్రదేశం చూపిస్తామంటూ ఇద్దరు గైడ్లు మా వెంటపడ్డారు. వద్దన్నాం.

డెన్మార్క్‌ లోని కోపెన్‌హగెన్‌లో కంప్యూటర్ సైన్స్‌లో పిఎచ్డి చేస్తోన్న చైనా యువకుడు రుఇ. షాంఘైకి చెందిన మనిషి. యూరప్‌లో నివసించడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ తనకు తెలియని ప్రపంచంలోని ఈ ప్రాంతాల్లో విరివిగా పర్యటిస్తున్నాడట. చైనా నుంచి వచ్చి చూడడంకన్నా యూరప్‌లో ఉండగానే ఈ ప్రాంతాలు తిరగడం సులువు అన్నది అతని ఆలోచన. ప్రస్తుతం మొరాకో బ్యాక్‌పాక్ యాత్రలో ఉన్నాడతను.

నేనూ, రుఇ- ఇద్దరం సోలో బ్యాక్‌పాక్ యాత్రికులం. అసలీ ఒంటరి బ్యాక్‌పాక్ యాత్రికులన్నదే ఒక ప్రత్యేక వర్గం. భిన్న ప్రాంతాలకు, భిన్న దేశాలకూ చెందినవాళ్ళయినా వీళ్ళు ఒకరికొకరు అతి సులభంగా ‘గుర్తించు’కొంటారు. క్షణాల్లో మాటల్లో పడిపోతారు. అనుభవాలూ వివరాలూ పంచుకొంటారు. వారి మధ్య ఒక పూర్వ నిర్దేశిత స్నేహభావం, చనువు ఉంటాయి. అంచేత కలిసిపోడానికి ఆట్టే సమయం పట్టదు. భాషలు వేరయినా, జాతులూ రూపురేఖలూ వేరయినా వారి మధ్య ఒక అవగాహన కలగడానికి భాషా జాతీ అడ్డం రావు. అనుభవాల పునాది మీద నిలబడే ఒక విశ్వవ్యాప్తమయిన ‘యాత్రాభాష’లో వారి సంభాషణ నడుస్తుంది. ఆ యాత్రాభాషకు మామూలు భాషానియమాలు వర్తించవు. వారు కలసి కొద్దిక్షణాలే గడిపినా వారి మధ్య అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవడమన్న ప్రక్రియ ఒక సహజవాహినిలా సాగిపోతుంది. వారిని కలిపివుంచే పటిష్టమైన బంధం యాత్రాపిపాస. విశాల ప్రపంచంలో, ఎల్లలు లేని గగనంలో పక్షుల్లా స్వేచ్ఛగా తిరుగాడాలి అన్న ప్రవృత్తి వారి మధ్య ఉండే ఉమ్మడి సొత్తు. ఒంటరి యాత్ర ఇచ్చే స్వేచ్ఛను, ఏకాంతాన్ని, ప్రపంచం పట్ల నిర్లిప్తతనూ వీళ్ళు పరిపూర్ణంగా అనుభవించగలరు.

పరిచయాలు ఎంత స్వల్పకాలికం అయినా వారిమధ్య స్నేహాలు దీర్ఘకాలికంగా పరిణమిస్తాయి. ఆ పరిచయాలు వ్యక్తుల మధ్యవే అవచ్చుగానీ ఆ తర్వాత ఏర్పడే స్నేహాలు వారిలో నిక్షిప్తమై ఉన్న ఇద్దరు యాత్రాపిపాసుల మధ్య. ఆ స్నేహాలలో వారివారి వ్యక్తిగత రాగద్వేషాలకు చోటే ఉండదు-వాటికి ప్రాతిపదిక వారిలోని యాత్రాపిపాస. అంచేతా ఆ స్నేహాలు దైనందిన ఒడిదుడుకుల ప్రభావాలకు గురికాకుండా చిరకాలం కొనసాగుతాయి.

అక్కడి పురా సౌధాలలోని రాళ్ళనూ ఇతర గృహోపకరణాలనూ ఇళ్ళు కట్టుకోవడం కోసం కొల్లగొట్టడమన్న ప్రక్రియ రెండువేల సంవత్సరాలుగా సాగిపోయినా, ఆ శిథిలాల సొగసూ గాంభీర్యాలు ఇంకా నిలచే ఉన్నాయి. ఒక బృహత్తర ప్రవేశద్వారం ఇంకా నిటారుగా నిలిచే ఉంది. దాన్ని చూస్తే పారిస్ నగరంలో ఫ్రెంచి విప్లవ అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించిన ఆర్క్ డి ట్రయంఫ్ గుర్తొచ్చింది. ఆ ప్రాంగణం రోమన్ కాలం నాటి సున్నిత సుకుమారమైన మొజాయిక్ పలకలకు కూడా ప్రసిద్ధి. వాటిల్లో కొన్నిటిని మ్యూజియంలకు తరలించారు. అలాంటి మ్యూజియం ఒకటి ఆ ప్రాంగణంలోనే ఉంది. అలా మ్యూజియంలకు తరలిపోకుండా మిగిలి ఉన్న మొజాయిక్ పలకల్ని మనమింకా అక్కడి భవనాల నేలల మీద చూడవచ్చు. ఆ భవనాలు ఆనాటి ధనికులవై ఉంటాయి. అలా మిగిలిపోయిన పలకలు ఆనాటి రోమన్ సామ్రాజ్యపు కళాభినివేశానికి దర్పణాలనిపించింది.

శతాబ్దాల తరబడి ప్రకృతీ మనిషీ కలిగించిన ఒడిదుడుకులను ఎదుర్కొని ఓలుబులిస్ ప్రాంగణం ఇప్పటికీ నిలబడి ఉంది. ఉత్తర ఆఫ్రికాలో అప్పట్లో విస్తరించి ఉన్న రోమన్ సామ్రాజ్యపు అతి పశ్చిమ కొసన ఇప్పటికీ నిలచివున్న ప్రముఖ ప్రాంగణమే ఈ ఓలుబులిస్. యునెస్కోవారు దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు.


శరదృతువు నడుమ కాలమది. ఎండ మండిపోతోంది. అదంతా బహిరంగ ప్రదేశం అవడం వల్ల తలదాచుకొనే చోటులేదు. ఆ శిథిలాల శోధనలో ఓ గంట గడిపాక అక్కడి మ్యూజియం చూశాం. అందులోని విభ్రమ కలిగించే మొజాయిక్ పలకల్ని చూశాం.

పొద్దున్నే ఎవర్నడిగో లిఫ్టు తీసుకొని రుఇ ఓలుబులిస్ చేరుకున్నాడని మాటల మధ్య తెలిసింది. తిరిగి మెకనెస్ వెళ్ళడానికి అతనికి వాహన వసతి లేదు. ‘నాతోపాటు రా, మౌలే ఇద్రిస్ పుణ్యస్థలం దర్శించుకొన్నాక నిన్ను నేను మెకనెస్ దగ్గర వదిలిపెడతాను’ అన్నాను. సంతోషంగా ఒప్పుకొన్నాడు. కృతజ్ఞతలు చెప్పాడు. ముందు అనుకొన్న ప్రకారం యజీద్‌ను కలుసుకోవడం కోసం గేటు దగ్గర ఉన్న పెద్ద చెట్టు దగ్గరికి చేరాం. చేరామే కానీ యజీద్ కనిపించలేదు. అతనికోసం చూస్తూ ఆ చెట్టు నీడన కూర్చున్నాం. ఆ సమయంలో ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకొన్నాం.

భారతదేశపు సంస్కృతి, భిన్నత్వమూ అంటే తనకెంతో ఆసక్తి అని, ఆ దేశాన్ని చూడాలని ఉందనీ చెప్పాడు రుఇ. నాకు చైనా అంటే ఉన్న ఆసక్తి గురించి, ఆ దేశాన్ని చూడాలన్న కోరిక గురించీ చెప్పాను. వా వృత్తి వ్యాపకాల వివరాలు విన్న రు, ‘మీరు మళ్ళీ తిరిగి భారతదేశం వెళ్ళి మెడికల్ ప్రాక్టీసు పెట్టే అవకాశం ఉందా?’ అని అడిగాడు. బహుశా అది జరగకపోవచ్చు అన్నాను. నా ఫొరెన్సిక్ సైకియాట్రీ రంగంలో అక్కడ ఉద్యోగాలు దొరికే అవకాశాలు అతి స్వల్పం అన్నాను. అంతేగాకుండా మేమంతా గత పాతికేళ్ళుగా యు.కె.లో ఉన్నాం కాబట్టి మా కుటుంబ మూలాలు, వృత్తి మూలాలూ ఇక్కడే బాగా స్థిరపడిపోయాయని చెప్పాను. రిటయిరయిన తర్వాత భారతదేశంలో మరింత కాలం గడపాలనే కోర్కె ఉందని చెప్పాను. మీరు ఇండియాలోనే ఉండిపోయినట్టయితే మీరింత విరివిగా యాత్రలు చేసి ఉండేవారు కాదు గదా అన్నాడు రుఇ. తాను యూరప్‌లో పిఎచ్డి చెయ్యడానికి దానివల్ల దొరికే విస్తృత యాత్రావకాశాలు కూడా ఒక కారణం అన్నాడు. మరి పిఎచ్డి తర్వాత చైనా తిరిగి వెళతావా అని అడిగితే ఆ విషయం ఇప్పుడే ఆలోచించడం ఇష్టం లేదన్నాడు. అక్కడా అవకాశాలు బాగా ఉండేమాట నిజమేగానీ అక్కడ పని వత్తిడీ పోటీ తత్వం విపరీతం అని వివరించాడు. పశ్చిమ యూరప్‌లో ఉన్న జీవన సరళి, వర్క్‌లైఫ్ బాలెన్సూ చైనాలో దుర్లభం అన్నాడు. ఒక్కసారి పశ్చిమ ఐరోపా జీవనసరళికి అలవాటుపడితే ఇండియా చైనాలాంటి దేశాల్లోనూ, ఆమాటకొస్తే అమెరికాలోనూ ఉండే పోటీతత్వానికి అలవాటు పడటం దుస్సాధ్యం అన్నమాట నేనూ ఒప్పుకొన్నాను.

ఇంకో అరగంట గడిచింది. యజీద్ అయిపు లేదు. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మమ్మల్ని వదిలేసి అర్ధంతరంగా వెళ్ళిపోయాడా? అలా వెళ్ళే మనిషిలా లేడే… మరేమయిందీ? ఇలా ఆలోచిస్తూ ఉండగానే దూరాన మాకేసి వస్తోన్న యజీద్ కారు కనిపించింది. తన ఆంగికంతోనూ, ఒకటి రెండు పదాలు వాడీ తాను ఆ పక్కనే ఉన్న తన స్వస్థలం మౌలే ఇద్రిస్‌లో భోజనానికి వెళ్ళానని చెప్పాడు. ఉదయం బాగా పొద్దున్నే వచ్చి నన్ను పికప్ చేసుకున్నాడు గాబట్టి బ్రేక్‌ఫాస్ట్ తినే సమయం దొరకలేదట.

(సశేషం)