మనమెరుగని మధ్య అమెరికా ౩

ద్వీపనగరం ఫ్లోరెస్

మర్నాడు ఉదయం ఆరున్నరకల్లా నన్ను గ్వాతెమాల సిటీ విమానాశ్రయంలో దింపడానికి ఆంతోనియో అన్న పెద్దమనిషి హాస్టల్‌కు వచ్చేశాడు. నేను ఫ్లోరెస్ నగరానికి వెళుతోన్నది రెండు రోజులకే కాబట్టి నా దగ్గర ఉన్న అరవై లీటర్ల బడా బ్యాక్‌ప్యాక్‌ను టూరిస్టు హాస్టల్లోనే వదిలేశాను. ఒక జత బట్టలు, మరికొన్ని ముఖ్యమైన వస్తువులూ మరో చిన్న బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకున్నాను. విమానాల్లో వెళ్ళేటప్పుడు చెకిన్ బాగేజ్ లేకుండా ఇలా చిన్న బాగ్‌తో వెళ్ళడమన్నది గొప్ప విలాసం. ఫ్లోరెస్ వెళ్ళడానికి నేను ఎన్నుకున్నది టాగ్ (TAG) అన్న స్థానిక ఎయిర్‌లైన్స్ విమానం. గంట ప్రయాణం.

ఫ్లోరెస్ గ్వాతెమాల సిటీకి ఉత్తరాన అయిదు వందల కిలోమీటర్ల దూరాన ఉన్న నగరం. తూర్పుకు వెళితే బెలీజ్ దేశపు సరిహద్దు, ఉత్తరానికి వెళితే మెహికో దేశపు సరిహద్దు, వందా నూటయాభై కిలోమీటర్లలో వస్తాయి. గ్వాతెమాల దేశపు పెతేన్ (Petén) భౌగోళిక విభాగంలో (డిపార్ట్‌మెంట్స్ అని పిలుస్తారు – గ్వాతెమాల దేశం 22 డిపార్ట్‌మెంట్స్‌ గానూ, అవి 340 మునిసిపాలిటీలు గానూ విభజించబడింది) ఉన్నది ఈ ఫ్లోరెస్ చిరునగరం. మాయన్ పురానాగరికతకు చెందిన ప్రఖ్యాత శిథిల నగరం తికాల్‌ను (Tikal) చూడడానికి, ఇంకా ఆ ప్రదేశంలో విస్తరించి ఉన్న డజన్ల కొద్దీ మాయన్ శిథిలాల ఆవరణాలు చూడడానికి ఫ్లోరెస్ నగరం అనువైన స్థావరం. ఆ శిథిలాలు చూడడానికి, అలాగే వీలయితే పక్కనే ఉన్న బెలీజ్ దేశంలో ఒక అడుగు వేసి రావడానికీ నేను రెండు రోజులు కేటాయించాను.

టాగ్ ఎయిర్‌లైన్స్ వారి ట్రావెల్ మాగజైన్ కథనం ప్రకారం ఫ్లోరెస్ ఒక అద్భుతసీమ. ఆ ద్వీపనగరం పెతేన్ ఇత్సా (Petén Itzá) అన్న సరోవరం నడుమన ఉందట. ఆ సరోవరం గ్వాతెమాల దేశంలోకెల్లా మూడవ పెద్ద సహజ సరోవరమట. సరోవరం ఒడ్డున ఉన్న సాంతా ఎలేనా అన్న పట్టణాన్ని తన జంటపట్టణం ఫ్లోరెస్‌లో కలుపుతూ ఒక బాట ఉందట.

నేనెక్కిన విమానం బాగా దిగువన ఎగురుతూ సాగింది. నిర్మల వాతావరణం పుణ్యమా అని దిగువన భూభాగం ఎంతో స్పష్టంగా కనిపించింది. ఎత్తుపల్లాలు, కొండలు, లోయలు, పల్లెలు, పట్నాలు – భూదేవి బొమ్మ చక్కగా కనిపించి సంతోషం కలిగించింది. ఎటు చూసినా పచ్చదనమే. మాయన్ భాషలో గ్వాతెమాల అంటే వృక్షాల సీమ అని అర్థమట. ఎంతో అర్థవంతమైన పేరది – ఎక్కడ చూసినా వృక్షాలే వృక్షాలు. కొండల నడుమ అక్కడక్కడ నీలి జాడలు – అవి చిన్నా పెద్దా చెరువులన్నమాట.

గంటన్నర గగన విహారం తర్వాత విమానం ఫ్లోరెస్‌ లోని ముందో మాయా (మాయన్ల ప్రపంచం అని అర్థం) విమానాశ్రయంలో దిగింది. చిన్న విమానాశ్రయం. దాని ఉనికికి ముఖ్యకారణం తికాల్ చూడడానికి వచ్చే పర్యాటకులే. అక్కడే ఒక టూరిస్ట్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్ కనిపించింది. గబగబా అటు నడిచాను. నే ఉండబోయే రెండు రోజుల్లో అక్కడి ప్రదేశాలు తిరిగి రావడం గురించి, ఒక అడుగు అటువేసి పొరుగు దేశం బెలీజ్ చూసి రావడం గురించీ సూచనలు, సలహాలూ చెపుతారని నా ఆశ.

అనుకున్నట్టే అక్కడి మనిషి చక్కటి సలహాలిచ్చాడు. అప్పటిదాకా ఆంతీగాలో నేను సంప్రదించిన ట్రావెల్ ఏజంట్లు అందరూ ఒక్కరోజులో ఫ్లోరెస్ నుంచి బెలీజ్ వెళ్ళి రావడం సాధ్యం కాదనే అన్నారు. ఈ టూరిస్ట్ సెంటర్ మనిషి మాత్రం ‘అది సాధ్యమే. కానీ నువ్వు వెంఠనే ఆ పనిలో పడితేనే అది సాధ్యం’ అన్నాడు.

ముందుగా ఎయిర్‌పోర్ట్ లోని కౌంటర్‌లో ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ తీసుకుందామని వెళ్ళాను. క్యూలో హొసే అన్న మనిషి తటస్థపడ్డాడు. మర్నాడు తికాల్ చూడడానికి వెళ్ళే టూర్ ఒకదానిలో నాకు టికెట్ తీసుకోడానికి సాయం చేస్తానని నన్ను తనతోపాటు ఎయిర్‌పోర్ట్ లాబీలో ఉన్న కఫేకు తీసుకువెళ్ళాడు. అక్కడ తన ట్రావెల్ ఏజంట్ మిత్రుడిని సంప్రదించి తెల్లవారుజామున మూడింటికి బయల్దేరే తికాల్ సూర్యోదయ దర్శనం టూర్‌లో టికెట్ ఇప్పించాడు.

బెలీజ్ వెళ్ళడం గురించి హొసేను సంప్రదించాను. ‘తిన్నగా టాక్సీ తీసుకుని సరిహద్దుకు వెళ్ళిపో. అక్కడ ఆ టాక్సీ నీకోసం నాలుగయిదు గంటలు ఆగుతుంది. తిరిగి ఫ్లోరెస్ తీసుకువస్తుంది’ అన్నది హొసే సలహా. దానికయే ఖర్చు ఆరు వందల కెత్‌సల్‌లు – అంటే వంద యు.ఎస్. డాలర్లు. మంచి ఆలోచనే అనిపించింది. కానీ నాకేమో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్ళడం ఇష్టం. అది చవక అనే మాట ఎలా ఉన్నా ఆ ప్రయాణాలు అందించే అనుభవాలు అమూల్యం. స్థానిక ప్రజలు, ఆ వాతావరణం, వారితో ప్రయాణం – అది ఎలా వదులుకోగలనూ? అంచేత బస్సు వైపే మొగ్గు చూపాను.

అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో బస్ స్టేషన్ ఉందని, అక్కడ సరిహద్దు దాకా వెళ్ళే చికెన్ బస్సు దొరుకుతుందనీ చెప్పాడు హొసే. టాక్సీ పట్టుకొని బస్ స్టేషనుకు వెళ్ళాను. మెల్‌చోర్ దె మెంకోస్ (Melchor de Mencos) అన్న సరిహద్దు పట్నానికి వెళ్ళే చికెన్ బస్సు రెడీగా కనిపించింది. ఆలస్యం చేయకుండా ఎక్కేశాను.

బస్సెక్కి పరిసరాలు గమనిస్తే ఎక్కడ చూసినా కోలాహలం, సందడి, గందరగోళం. అవీ ఇవీ అమ్మే చిరువ్యాపారులు బస్సు కిటికీల దగ్గరికి వచ్చి పాసింజర్లతో వాటిని కొనిపించే ముమ్ముర ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే బస్సు, వెళ్ళే బస్సు – బస్సులే బస్సులు. అప్పటికే ఎండ పొద్దెక్కింది. వాతావరణమంతా సరదా పుట్టించే గందరగోళంతో నిండిపోయి ఉంది. మా చిన్నప్పుడు బోధన్ పట్నపు బస్టాండులో ఇలాంటి వాతావరణమే చూసేవాడిని – మళ్ళా ఇప్పుడు, ఇక్కడ! నలభై ఏళ్ళ నాటి జ్ఞాపకాలు గిర్రున కళ్ళముందు తిరుగాడాయి. మొన్నామధ్య బోధన్ వెళ్ళినపుడు అదంతా గుర్తు పట్టలేనంతగా మారిపోయి కనిపించింది. మళ్ళా ఇప్పుడు, నలభై ఏళ్ళనాటి ఆ జ్ఞాపకాల ప్రవాహం, ఇప్పుడు వట్టిపోయిన అక్కడి ప్రవాహం, మధ్య అమెరికాలో, గ్వాతెమాల దేశంలో, ఫ్లోరెస్ అన్న చిన్న పట్నం వెళుతూన్న నన్ను మళ్ళా తడపటం ఏమిటో! తలచుకుంటేనే ఎంతో వింతగా అధివాస్తవికంగా అనిపించింది. కానీ యాత్రల్లోని విలక్షణత ఇదే – కొత్త కొత్త జ్ఞాపకాలకే కాదు; పాత జ్ఞాపకాలను తవ్వి తీయడానికీ యాత్రలు సాయపడతాయి.

బస్సు నిండా స్థానికులు… అడుగడుగునా ఆగడం, పాసింజర్లను ఎక్కించుకోవడం… వాళ్ళంతా దిగేటప్పుడు బస్సు డ్రైవరుకు డబ్బులిచ్చి దిగడం. వేరే కండక్టరంటూ లేడు. ఆగిన ప్రతీచోటా డ్రైవరు ఛెంగున దిగి, పాసింజర్లు దిగే తలుపు తెరిచి, డబ్బులు తీసుకుని వాళ్ళను దింపి, కొత్తవాళ్ళను ఎక్కించుకుని, తలుపు వేసి, తిరిగి తన డ్రైవర్ సీటులోకి లంఘించడం, చక్రం తిప్పుతూ ముందుకి సాగిపోవడం – ఇదంతా కొద్ది సెకన్ల వ్యవధిలో పదేపదే సాగిపోతున్న ప్రక్రియ. ఫార్ములా వన్ రేసుల్లో టైర్లు చకచకా మార్చుతారు కదా – అదిగో, అలాంటి లాఘవంతో ఇతగాడి ఈ భిన్న పాత్రల పోషణ. అతడిని అలా ఇరుసులో కండెలా తిరుగుతూ ఉండగా చూడడం నాకు ముచ్చట కలిగించింది. బస్సు కుదుపులు కలిగించే చిరు అసౌకర్యం అసలలా స్థానికులతో కలిసి ప్రయాణం చెయ్యటమన్నది అరుదైన అవకాశం అన్న అవగాహన ముందు దూదిపింజలా తేలిపోయింది. పరిసరాలన్నీ ఉష్ణమండలపు అడవుల్లో కనిపించే పచ్చదనంతో ఆహ్లాదకరంగా భాసించాయి. చుట్టూ వ్యవసాయ భూములతో అడపాదడపా కనిపించే గ్రామాలు సరేసరి.

ఒక అడుగు బెలీజ్‌కు

ఫ్లోరెస్ నుంచి బెలీజ్ సరిహద్దున ఉన్న మెల్‌చోర్ దె మెంకోస్ వరకూ నూటపది కిలోమీటర్ల దూరం. రెండున్నర గంటలు పట్టింది. బస్సు మెంకోస్ దగ్గర ఆగీ ఆగగానే కరెన్సీ ట్రేడర్లు చుట్టూ చేరి ఒక యాభై యు.ఎస్. డాలర్లను బెలీజ్ డాలర్లలోకి మార్చుకోమని చెప్పి ఒప్పించారు. నాకూ అది సౌకర్యవంతమైన ఏర్పాటనే అనిపించింది.

ఆ సరిహద్దు ప్రాంతంలో ఉన్న మొపాన్ (Mopan) నది మీది వంతెన దాటి ముందుకు సాగాను. గ్వాతెమాల దేశపు ఇమిగ్రేషన్ ఫార్మాలిటీలు ముగించుకొని ఆ రెండు దేశాల మధ్య ఉన్న తటస్థప్రదేశం లోకి అడుగు పెట్టాను. బెలీజ్‌కు సుస్వాగతం అన్న ఫలకం కనిపించింది. అది దాటి బెలీజ్ దేశపు ఇమిగ్రేషన్ ప్రక్రియ ముగించుకొని ఆ దేశంలోకి ప్రవేశించాను. మధ్య అమెరికాకు చెందిన రెండో దేశంలో అడుగు పెట్టానన్నమాట. ఇలా కాలినడకన దేశాల సరిహద్దులు దాటడం నాకు ఉత్తేజం కలిగించింది.

బెలీజ్‌లో నేను వెళ్ళి చూద్దామనుకున్న ప్రదేశం సాన్ ఇగ్నాసియో (San Ignacio) అన్న పట్టణం. సరిహద్దు నుండి ఇరవై కిలోమీటర్లు. ఈ సాన్ ఇగ్నాసియో వెళ్ళమన్న సలహా అతిత్‌లాన్ సరోవరం దగ్గర పరిచయమైన ఐర్లండ్‌వాసి బైరన్ ఇచ్చాడు. రాజధాని బెల్మొపాన్ (Belmopan) కన్నా ఇగ్నాసియో ఆసక్తికరమైన ప్రదేశం అని అన్నాడు బైరన్. ‘బెల్మొపాన్‌లో ఆఫీసులు, రొటీన్ భవనాలూ తప్ప పెద్ద ఆసక్తికరమైన విషయాలేమీ లేవు. నువ్వు వెళ్ళి నిరాశ పడతావు’ అన్నాడు. ఇదేమాట ఈ యాత్రలో తారసపడిన మరికొందరు కూడా అన్నారు. అంచేత ఇగ్నాసియో వేపే మొగ్గు చూపాను.

సాన్ ఇగ్నాసియో వెళ్ళడానికి టాక్సీ ఆశ్రయించడమే అతి సులభమైన పద్ధతి. నేనదే చేశాను. ఇరవై డాలర్లు. మా డ్రైవరు మార్కో చక్కని ఇంగ్లీషు మాట్లాడడం మొదలు పెట్టాడు. అదో గొప్ప సంతోషం! గ్వాతెమాల చేరిన దగ్గర్నుంచీ గూగుల్ ట్రాన్స్‌లేట్ అనే మూగబాసే తప్ప నోరు విప్పి మాట్లాడింది లేదు – మరి సంబరం అంటే సంబరం కాదూ!?

బెలీజ్‌లో ఇంగ్లీషు అధికార భాష అని చెప్పాడు మార్కో. అందరూ స్కూళ్ళల్లో ఇంగ్లీషు నేర్చుకుంటారట – చక్కగా మాట్లాడతారట. అక్కడి డాలర్ నోటు మీద ఎలిజబెత్ రాణిగారి బొమ్మ చూడగానే ‘ఆ ప్రదేశంతో నాకు ముందుగానే ఆత్మీయ పరిచయం ఉన్నది’ అన్న భావన కలిగింది. ఎక్కడో ఓ చోట డాలరు నోటు మీద కూడా రాణిగారి బొమ్మ ఉందన్నమాట. ‘మా దేశానికి ఆమే అధికారిక అధినేత. మేమంతా ఆమెను ఇష్టపడతాం’ అని చెప్పుకొచ్చాడు మార్కో. అధినేత అన్నది నిజమే అయినా ఆమె రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు – గౌరవ అధినేత మాత్రమే.

ఒకప్పుడు బెలీజ్ బ్రిటిష్‌వారి పాలనలో ఉండేది. అప్పుడు దానిపేరు బ్రిటిష్ ఓందూరాస్. 1981లో అది స్వాతంత్ర్యం పొందింది. అంటే మధ్య అమెరికా దేశాలలో అతి పసి దేశమన్నమాట. అలాగే మధ్య అమెరికాలో బ్రిటిష్ రాణి అధినేతగా ఉన్న ఏకైక దేశం కూడానూ. ‘మీకు స్వాతంత్ర్యం వచ్చినా రాణిగారినే అధినేతగా ఎందుకు ఎంచుకున్నారు?’ అని అడిగాను. ‘1821లో స్పెయిన్ నుంచి గ్వాతెమాల స్వాతంత్ర్యం సాధించినప్పటినుంచీ బెలీజ్ ప్రాంతం మీద తనకే హక్కు ఉందన్న వాదన గ్వాతెమాల ముందుకు తెస్తూనే ఉంది. ఆ తాకిడి నుంచి తప్పించుకోడానికి, గ్వాతెమాల దురాక్రమణకు పాల్పడకుండా ఉండడానికి బెలీజ్ బ్రిటిష్ కామన్‌వెల్త్‌లో సభ్యత్వం తీసుకుంది’ అని వివరించాడు మార్కో. (బెలీజ్‌తో పాటు, ఆంతీగా, బహామాస్, బార్బదోస్, కేమన్ వంటి ఇంగ్లీష్ మాట్లాడే తదితర కరిబియన్ తీరదేశాలు, ద్వీపదేశాలను ‘ది కామన్‌వెల్త్ కరిబియన్’ అని పిలుస్తారు.)

రెండు వందల సంవత్సరాల పాటు సాగిన బ్రిటిష్‌వారి వలసపాలన, ప్రభావాల వల్ల బెలీజ్ ఆంగ్లశైలికి చెందినప్పటికీ తనకే ప్రత్యేకమైన వలస సంస్కృతిని అలవర్చుకుంది. అది పొరుగున గ్వాతెమాలలో ఉండే లతీనో (Latino) సంస్కృతికి బాగా భిన్నం. బ్రిటిష్ సంపర్కం వల్ల ఆంగ్ల సంస్కృతీ సువాసనలు కూడా బెలీజ్‌కు సహజంగా అబ్బాయి. దానితోపాటు భౌగోళికంగా మెహికో, గ్వాతెమాల, ఓందూరాస్‌ల నడుమన ఉండడం వల్ల లతీనో పద్ధతుల్లోనూ ఒక అడుగు వేసే సౌలభ్యం కూడా అంతే సహజంగా బెలీజ్‌కు లభించింది.

బెలీజ్ దేశపు కరిబియన్ సాగర తీరరేఖ వెంబడే మూడు వందల కిలోమీటర్ల పాటు విస్తరించి ఉన్న పగడాల దిబ్బలు ఉత్తర అమెరికా నుంచి వచ్చే టూరిస్టులను బాగా ఆకర్షిస్తాయి. ఆస్ట్రేలియా లోని గ్రేట్ బారియర్ రీఫ్ తర్వాత ప్రపంచంలో పొడవాటి కోరల్ రీఫ్ బెలీజ్ దేశానిదేనట.


మార్కో నన్ను సాన్ ఇగ్నాసియో పట్టణం లోని రిసార్ట్ హోటల్ దగ్గర దింపాడు. ఆ రిసార్ట్ ప్రాంగణం లోనే ఇగ్వానా (Iguana) అనే, ఉడుములా కనిపించే పెద్ద సైజు తొండల శాంక్చువరీ ఉంది. ఈ ఇగ్వానాలు మధ్య అమెరికాకే ప్రత్యేకమైనవి. బాగా ఎదిగిన ఇగ్వానా రెండు మీటర్ల పొడవుంటుంది – ఆరు కేజీలు తూగుతుంది. ఆ రిసార్ట్ లోని అభయధామంలో గాయపడిన ఇగ్వానాలకు చికిత్స చెయ్యడం, అంతరించిపోయే ప్రమాదంలో పడిన పచ్చజాతి ఇగ్వానాలను పెంచి పోషించడం చేస్తూ ఉంటారు. పచ్చ ఇగ్వానాలే కాకుండా ఈ శాంక్చువరీలో గోధుమరంగువీ ఉన్నాయి. హోటల్‌వాళ్ళు తమ అతిథుల్ని చిన్న చిన్న బృందాలుగా చేసి రెండు గంటలకు ఒకసారి ఆ శాంక్చువరీ లోకి పంపిస్తున్నారు. అలాంటి టూర్‌కు టికెట్ కొనుక్కొని, కాస్తంత సమయం ఉండడంతో లాబీలో తిరుగాడాను. ఆ లాబీలో ఒక పక్కన 1994లో రెండవ ఎలిజబెత్ రాణి అక్కడికి వచ్చినప్పటి ఫొటోలు ప్రదర్శించి ఉన్నాయి. దగ్గర్లోనే ఉన్న హోటల్ అధికారి ఒకతను ఆ రాణిగారి పర్యటన మా హోటల్ చరిత్రలోనే ఎన్నదగ్గ ఘట్టం అన్నాడు. ఆ పర్యాటనలో ఆమెను కలిసే అదృష్టమూ తనకు దక్కిందని చెప్పాడు.

ఇగ్వానా సంరక్షణకు కృషి చేస్తున్న ఒక బయాలజిస్టు అక్కడి శాంక్చువరీ లోకి మమ్మల్ని తీసుకువెళ్ళాడు. మా బృందంలో నాతోపాటు, యు.ఎస్. లోని నెబ్రాస్కా రాష్ట్రం నుంచి వచ్చిన ఓ మధ్య వయసు దంపతులు, వాళ్ళ ముగ్గురు టీనేజి పిల్లలూ ఉన్నారు. అక్కడి చిక్కని పచ్చదనం మధ్య మాకు ఎన్నో ఇగ్వానాలు కనిపించాయి. మేమంతా అక్కడ ఉన్న ఇగ్వానాల బ్రీడింగ్ సెంటర్ కూడా చూశాం. నాతోపాటు వచ్చిన అమెరికన్ కుటుంబానికి ఇలాంటి పెంపుడు జంతువుల్ని ముట్టుకోవడం, ముద్దు చెయ్యడం బాగా అలవాటులా ఉంది – వారంతా ఆ పని చేస్తూ ‘నువ్వూ పట్టుకొని చూడు’ అని ప్రోత్సహించారు. ప్రయత్నించానే గానీ నాకా పని చేతకాలేదు. కానీ ఇగ్వానాలను ముట్టుకొనే అవసరం లేకుండా తిండి తినిపించే పనిలో మాత్రం వాళ్ళతోపాటు ఉత్సాహంగా పాల్గొన్నాను.

ఆ ఇగ్వానా శాంక్చువరీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కహాల్ పెక్ (Kahal Pech) అనే మాయన్ శిథిలాలు ఉన్న ప్రదేశం ఉంది. కాస్తంత దూరం సమతల ప్రదేశంలో వెళ్ళాక చివరి భాగంలో నిటారైన కొండదారి… కహాల్ పెక్ మాయన్ నాగరికత ప్రథమ పాదానికి చెందిన ప్రదేశం. క్రీస్తు పూర్వం 300వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 900 దాకా ఒక వెలుగు వెలిగిన ప్రదేశమది. ఆనాటి పెద్ద పెద్ద భవనాలు, కట్టడాల శిథిలాలూ ఇప్పుడు మనకక్కడ కనిపిస్తాయి. అవన్నీ ఓ కొండశిఖరం మీద, చదునైన ప్రాంగణంలో ఉన్నాయి. గణనీయమైన పరిమాణమా ప్రదేశానిది.

అడవి వృక్షాలు, వాటిని ఆనుకున్న దట్టమైన పొదలూ లతల మధ్య ఉన్నాయా శిథిలాలు. మేము వెళ్ళినప్పుడు మరికొంత మంది సందర్శకులు ఉన్నారు కాబట్టి సరిపోయింది గానీ లేనట్టయితే అదంతా వింతగా, కాస్తంత భీతి కొలిపేలా అనిపించేదే. అక్కడ అవన్నీ చూపించడానికి సహాయకులు, గైడ్‌లూ లేరు. కనీసం సమాచారం చెప్పే బోర్డులన్నా లేవు. ఏదో పురాతన రాజభవనాలు నిండిన కోటనో దుర్గాన్నో చూసిన భావన మాత్రం కలిగింది.

తిరిగి వచ్చేటపుడు కొండ దిగి కిలోమీటరు నడిచేసరికి మనుషులున్న ప్రదేశం కనిపించింది. అక్కడున ల అఫీసినా అన్న రెస్టరెంట్లో ఏమన్నా తినడానికి ఆగాను. ఆ రెస్టరెంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకరకం భోజనం చేస్తూ కనిపించారు. వంటకాలు సరఫరా చేస్తున్న మహిళను అదేం వంటకం అని అడిగాను. ‘అన్నమూ బీన్సూ’ అని చెప్పి, అది బెలీజ్ దేశపు జాతీయవంటకం అని ముక్తాయించిందావిడ! నాకూ ఆ పదార్థం తెచ్చివ్వమన్నాను. అందించింది. అందులో చికెన్ ముక్కలు, సాలడ్, వేయించిన అరటిపండు, అన్నం ఉన్నాయి – ఎంతో రుచిగా అనిపించింది. పైగా బాగా ఆకలితో ఉన్నానేమో, మరింత మరింత రుచిగా అనిపించిందా భోజనం.

భోజనం ముగించాక ఆ ఊళ్ళోని మకాల్ నదీతీరాన ఉన్న సిటీ సెంటర్ వైపుకు నడిచాను. సాన్ ఇగ్నాసియో పట్టణాన్ని దాని కవల పట్టణం సాంతా ఎలేనాతో కలుపుతూ ఒక సుందరమైన వారధి ఉంది అక్కడ. ఇంకా ముందుకు వెళ్ళే ఓపిక గానీ సమయం గానీ నాకు లేవు. అక్కడంతా చక్కని కరిబియన్ పట్టణ వాతావరణం. దాన్ని ఆస్వాదిస్తూ కాస్సేపు అక్కడే చేరగిలబడ్డాను.

అలా సేద తీరే సమయంలో భారతీయుడా? అనిపించే ఒక మనిషి కనిపించాడు. పలకరించాను. వాళ్ళది గుజరాత్‌కు చెందిన కుటుంబమట. బెలీజ్‌లో వ్యాపారాలున్నాయి. ఈ దేశానికి, బ్రిటన్‌కూ ఉన్న సంబంధ బాంధవ్యాల నేపథ్యంలో బెలీజ్‌లో స్థిరపడిన భారతీయ కుటుంబాలు కొన్ని ఉన్నాయట.

బెలీజ్ జనాభా అంతా కలిసి నాలుగు లక్షలు. మధ్య అమెరికా దేశాలన్నిటిలోకీ అతిస్వల్ప జనాభా కలిగిన దేశమది. అయినా అక్కడి ప్రజానీకం నానాజాతి సమ్మేళనం. దాదాపు ముప్ఫైశాతం మందివి ఆఫ్రికన్ మూలాలు. మధ్య అమెరికాలోకెల్లా పెద్ద శాతం అది. అంచేత అక్కడి వాతావరణంలో లాటిన్ అమెరికాకన్నా కరిబియన్ సంస్కృతీ ఛాయలే ఎక్కువగ కనపడతాయి. దేశంలో అధిక సంఖ్య మెస్తీహోలు – దేశవాళీ ఇండియన్లు, యురోపియన్లు, ఆఫ్రికన్లూ కలగలసిన మిశ్రమ జాతి అది. వీరితోపాటు బ్రిటిష్ వారి వలసపాలన కాలంలో ఇక్కడ స్థిరపడిన మెనొనైట్స్ (Mennonites) అన్న మతసంబంధిత బృందమూ ఉందక్కడ.

తిరిగి సరిహద్దు చేరవలసిన సమయం ఆసన్నమయింది. టాక్సీ కోసం వెతికాను. లాభం లేకపోయింది. సహాయం కోసం అక్కడ ట్రాఫిక్‌ను నియంత్రిస్తోన్న ఆఫ్రికన్ పోలీస్ మహిళను ఆశ్రయించాను. ఆమె సానుకూలంగా స్పందించింది. నేను యు.కె.నుంచి వచ్చానని విని ఆమె మొహం విప్పారింది. తన భర్త యు.కె.లో ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్నాడట. తాను త్వరలోనే అతడిని కలవడానికి లండన్ వస్తోందట. అయినా తనకు బెలీజ్‌లో ఈ పోలీస్ ఉద్యోగం వదిలే ఆలోచన లేదట… చెకచెకా ఓ టాక్సీని ఆపి డ్రైవరుతో మాట్లాడి నన్ను టాక్సీ ఎక్కించింది. అది షేర్‌డ్ టాక్సీ అని, మామూలుకన్నా చవక అనీ చెప్పి ఆత్మీయంగా గుడ్‌బై చెప్పింది. ఆమె సహాయ ప్రవృత్తి, కార్యదక్షతా నన్ను ఆకట్టుకున్నాయి. ఏ దేశంలోనయినా ఆ దేశపు పోలీసు ఉద్యోగులు కొత్తవాళ్ళ పట్ల చూపించే శ్రద్ధా మర్యాదలు, ఆ దేశపు నాగరికతకు కొలబద్దలుగా నిలుస్తాయి కదా అనిపించింది.

ఆ టాక్సీ బాగా వయసు మళ్ళినది. సరిహద్దు చేరేలోగా అది విడివిడి భాగాలుగా విడివడుతుందేమో అనిపించింది. దాన్ని నడిపే పెద్దాయన ఎంతో ఏకాగ్రతతో తన పని తాను చేసుకుపోతున్నాడు. పలుకే బంగారం అన్నట్టు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. షేర్‌డ్ టాక్సీ కాబట్టి ఎక్కేవాళ్ళను ఎక్కించుకోవడం, దిగేవాళ్ళను దింపడం… అసలింతకూ ఈ టాక్సీ గ్వాతెమాల సరిహద్దు దాకా వెళుతుందా లేదా అన్న వివరం తెలుసుకోవాలన్నా అది చెప్పడానికి డ్రైవరుగారికి క్షణం తీరిక లేదు. నాతోపాటు వస్తున్న ఓ ఇంగ్లీషు మాట్లాడే మహిళ ‘కంగారు పడక. సరిహద్దు దాకా వెళుతుంది’ అని భరోసా ఇచ్చింది. అలా సరిహద్దు దాకా ప్రయాణం చేసిన పాసెంజర్ నేనొక్కడినే.

టాక్సీ దిగుతూ నా చేతిలో ఉన్న బెలీజ్ డాలర్ నోట్లను, నాణేలనూ ముందుకు చాపి ఎంత తీసుకోవాలో సరిచూసి తీసుకోమని డ్రైవరుకు చెప్పాను. అతనలాగే చేశాడు. రెండే రెండు యు.ఎస్. డాలర్లకు సరిపడా తీసుకున్నాడు. వచ్చేటప్పుడు అయిన ఖర్చులో ఇది పదోవంతు. నాదగ్గర ఇంకా బెలీజ్ కరెన్సీ మిగిలి ఉంది కాబట్టి రెండును ఆరు చేసి అతనికి అందించాను. అది చూసి ఉబ్బితబ్బిబ్బయిన ఆ డ్రైవరు నాకో చక్కని షేక్‌హాండ్ ఇచ్చి స్నేహపూర్వక మందహాసంతో వీడ్కోలు చెప్పాడు.

సరిహద్దు దగ్గర ఫార్మాలిటీలు ముగించుకొని మళ్ళా గ్వాతెమాల దేశంలో అడుగు పెట్టాను. నేను ఎక్కి వచ్చిన చికెన్ బస్సు నాకోసమే ఎదురు చూస్తున్నట్టుగా నా ఎదుట నిలిచి కనిపించింది. అదే బస్సు, అదే డ్రైవరు! నన్ను అక్కడ అయిదుగంటల క్రితం వదిలిపెట్టిన ఆ చికెన్ బస్సు ఆ వ్యవధిలో ఫ్లోరెస్‌కు మరో ట్రిప్పు వేసి వచ్చిందట.

అంతా కలసి బెలీజ్‌లో అయిదు గంటలు. అంత దగ్గరగా వచ్చిన వాడిని – కనీసం ఆ సమయమన్నా అక్కడ గడపగలిగినందుకు ఎంతో సంతోషం కలిగింది.


సాయంకాలం ఇంకా చీకట్లు కమ్ముకోకముందే పెతేన్ ఇత్సా సరోవరతీరం చేరుకోగలిగాను. బస్టాండ్ నుంచి స్థానికులు ముద్దుగా టుక్-టుక్ అని పిలుచుకొనే ఆటోరిక్షా ఎక్కి సరోవరం చేరేసరికి సూర్యుడు తన దినచర్య ముగించడానికి సమాయత్తం అవుతూ కనిపించాడు. తటాకం ఒడ్డున వేలకొద్దీ పక్షులతో నిండిన చెట్ల సమూహం కనిపించింది. అక్కడ ఒక బెంచ్ మీద కూర్చున్నాను. క్షితిజం లోకి దిగిపోతున్న సూర్యుడు, పోతూ పోతూ సరస్సులో గుమ్మరించిన రంగులు, అవి క్షణక్షణానికీ మారే విధానం – గొప్ప సౌందర్యమది. బంగారానికి సువాసన లాగా వెనక పక్షుల కూజితాల నేపథ్య సంగీతం – చక్కని క్షణాలవి.

బెంచ్ మీద నాతోపాటు కూర్చుని ఉన్న ఒక చక్కటి దుస్తులు వేసుకున్న యువకుడు పలకరించాడు. యథాప్రకారం మాటల్లో పడ్డాం. ఆయన ఒక లాయరు. పేరు ఎస్త్రాదో హెర్నాందెజ్. చక్కని ఇంగ్లీష్ మాట్లాడాడు. ఆ పక్కనే ఉన్న క్రిమినల్ కోర్ట్ ప్రాంగణం నుంచి సాయంసంధ్య కోసం కాసేపు ఇటు వచ్చాడట. గ్వాతెమాల సిటీకి చెందిన మనిషి. అక్కడి ఒక ఎన్.జి.ఒ.తో అనుబంధం ఉందట. వారిద్వారా కోర్ట్ ఖర్చులు భరించలేని పేదవాళ్ళ క్రిమినల్ కేసులు చేపడుతూ ఉంటాడట. అలాంటి ఒక కేసులో ముద్దాయి తరఫున వాదించడం కోసం ఫ్లోరెస్ వచ్చాడు. పౌరహక్కుల రంగంలో కృషి చేస్తోన్న మనిషి కాబట్టి తన దేశపు సామాజిక రాజకీయ వెలుగునీడల గురించి గట్టి అవగాహన ఉంది.

గ్వాతెమాల సిటీ లోని నేరప్రకోపం చర్చకు వచ్చింది. మీ వృత్తివ్యాపకాలలో ఏమైనా సతాయింపులు, బెదిరింపులూ ఎదుర్కొన్నారా అని అడిగాను. అవి వస్తూనే ఉంటాయి; అది నా వృత్తిలో ఒక భాగం అన్నాడా యువ న్యాయవాది. ‘దేశాల గమనం విభిన్న దిశలలో సాగిపోతూ ఉంటుంది. నాగరిక సమాజం ఆ ఒడిదుడుకులని ఎదుర్కొని నిలబడాలి. నేర బృందాలను ఎదురొడ్డి పోరాడాలి’ అన్నాడు. మేం మాటల్లో ఉండగానే చీకటి కమ్ముకు వచ్చింది. అయినా ఇద్దరికీ సంభాషణ విరమించాలని లేదు. కానీ నేను శెలవు మీద తిరుగుతున్నానని, అతడు పని మీద ఉన్నాడని – ఆ స్పృహ నాకు ఉంది. అంచేత నేనే చొరవ చేసి సంభాషణ ఆపాను. ఇష్టముండీ లేకుండానే మేము విడిపడ్డాం.

నేనింకా హోటల్లో చెకిన్ చెయ్యనే లేదు. మా దెల్ పాతియో హోటల్ అక్కడికొక కిలోమీటరు దూరం. వలస దినాల నాటి భవనంలో ఉన్న చక్కని వసతి గృహమది. వేడి వేడి నీళ్ళతో తలస్నానం చేసేసరికి ఆ రోజంతా పేరుకుపోయిన శ్రమా అలసటా ఉఫ్‌మంటూ ఎగిరిపోయాయి. రిసెప్షన్‌లో ఉన్న జూలియాను ఇక్కడ చక్కని పెపియాన్ దొరికే ప్రదేశం ఏదీ అని అడిగాను. మరా కాయా అన్న రెస్టరెంటును సిఫార్సు చేసిందావిడ. ముందే చెప్పుకున్నట్టు ఈ పెపియాన్ అన్నది గ్వాతెమాల దేశపు జాతీయవంటకం. మరా కాయా రెస్టరెంట్ పెతేన్ సరోవరం ఒడ్డున ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉంది. వాళ్ళు ఒడ్డించిన పెపియాన్ ఎంతో రుచిగా ఉంది. ఈ పెపియాన్ వంటకం లోనూ ఎన్నో రకాలున్నాయి. మరా కాయా రెస్టరెంట్‌లో వడ్డించిన పెపియాన్ రెసిపీ అక్కడి షెఫ్ వాళ్ళ అమ్మమ్మ రూపకల్పన చేసినదట.


మర్నాటి ఉదయం బాగా పొద్దున్నే బయలుదేరి వెళ్ళి సూర్యోదయ సమయంలో తికాల్ లోని మాయన్ శిథిలాలను చూసి రావాలన్నది నా ప్రణాళిక. దానికోసం తెల్లవారుజామున మూడింటికి ఫ్లోరిస్‌లో బయలుదేరే బస్సుకు టికెట్ బుక్ చేసుకొని ఉన్నాను.

పొద్దున్నే రెండున్నరకు లేచి గబగబా తయారయ్యాను. మూడింటికల్లా బస్సు హోటలుకు వచ్చి నన్ను ఎక్కించుకుంది. బస్సు ఎక్కీ ఎక్కగానే నిద్రలో పడ్డాను. గంటన్నర తర్వాత తికాల్ చేరాక గైడ్ లేపేవరకూ నిద్రే నిద్ర. తికాల్ చూడడానికి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలే అనువైనవట. మధ్యాహ్నాలు ఎండా ఉక్కా ఇబ్బంది పెడతాయి… టూరిస్టు బస్సులూ జనసందోహమూ సరేసరి.

ఎంట్రీగేట్ దగ్గర మా టికెట్లు తనిఖీ చేయించుకొని శిథిలాల ప్రాంగణం లోకి అడుగు పెట్టాం. అదంతా చిక్కని అడవి. చిమ్మ చీకటి. మేమంతా కలిసి ఆరేడు బృందాలం. ఒక్కో బృందంలో ఆరు నుంచి పన్నెండు మంది సభ్యులు – ఒక గైడు. అన్ని బృందాలూ ఒకదాని వెనుక ఒకటి చీకట్లోకి అదృశ్యమైపోతున్నవే. గైడ్‌ల దగ్గర శక్తివంతమైన టార్చ్‌లైట్లున్నాయి. మిగిలిన వాళ్ళం మొబైల్ ఫోన్‌లలోని టార్చ్‌లైట్లు వాడాం.

చుట్టూ ఉన్న అడవి లోంచి పక్షులు పాడే పాటలు వినిపించసాగాయి. మధ్య మధ్యలో పెడబొబ్బలు పెట్టే కోతులు… దారిలో మా గైడ్ – అతని పేరు సోల్ – కొన్ని అడవి జీవాలను మాకు చూపించాడు… జింకలు, రాక్షస సాలీళ్ళు. ఆ సాలీళ్ళు చూడడానికే భయంకరంగా ఉంటే మా సోల్ మహాశయుడు వాటిని తన చేతిమీదకు పాకించుకున్నాడు. అది చూసి మేము హాహాకారాలు చేస్తోంటే నవ్వేసి ‘మరేం పర్లేదు, ఇవి హానికరం కాదు’ అన్నాడు!

మాయన్ నాగరికత ఉజ్వలంగా వెలిగిన ప్రదేశాలలో తికాల్ అతి ముఖ్యమైనది. క్రీస్తు పూర్వం 300 నుంచి క్రీస్తు శకం 800 వరకూ పదీ పదకొండు వందల సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలిగిన ప్రదేశమది. మచ్చల చిరుతపులి – జాగ్వార్‌తో ముడివడిన నగరమది. మాయన్ సంప్రదాయంలో జాగ్వార్ అధోలోకపు అధిపతి. కాలక్రమేణా నగరమంతా చుట్టూ అలుముకున్న దట్టమైన అడవిలో తికాల్ అజ్ఞాతంగా ఉండిపోయింది.

బయట ప్రపంచానికి అజ్ఞాతమే కానీ స్థానిక ప్రజానీకానికి ఆ అడవి మాటున ఒక ఊరు ఉందని ముందునుంచీ తెలుసు – అది ఎంత పెద్ద నగరం అన్న విషయం మీద వారికీ అవగాహన లేదు. 1840లో జాన్ లాయిడ్ స్టీవెన్స్ అన్న అమెరికన్ పురావస్తు శాస్త్రవేత్త ఫ్రెడ్‌రిక్ కేథర్‌వుడ్ అన్న బ్రిటిష్ వాస్తుశిల్పితో కలసి అడవి గర్భాన ఉన్న తికాల్ శిథిలాలను కనిపెట్టి ప్రపంచానికి పరిచయం చేశాడు. చిక్కని అడవి లోంచి చొచ్చుకు వస్తోన్న నిడుపాటి పిరమిడ్ల శిఖరాలను చూసి వాళ్ళిద్దరూ విస్తుపోయారట. 20వ శతాబ్దం వచ్చేసరికి తికాల్ నగరం పురావస్తు శాస్త్రవేత్తల ఇష్టప్రాంగణం అయింది. 1979లో యునెస్కోవాళ్ళు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన తొలి విడత ప్రదేశాలలో ఇదీ ఒకటయింది.

తికాల్ శిథిలాలను, అలాగే మెహికో లోని పలెంకె (Palenque), కలాక్‌ముల్ (Calakmul); ఒందూరాస్ లోని కొపాన్ (Copán) ప్రాంగణాలనూ 19వ శతాబ్దంలో వెలుగులోకి తీసుకురావడమన్నది సహజంగానే స్థానిక ప్రజానీకానికి సంతోషహేతువయింది. వారిలో స్వాభిమానానికి, తమ ఉనికి పట్ల గౌరవభావానికీ కారకమయింది. ‘యూరోపియన్లు వచ్చేదాకా ఆ ప్రాంతాలు నాగరికత అన్నమాట ఎరుగవు’ అన్న అభిప్రాయాన్ని బద్దలు కొట్టింది. మాయన్ నాగరికత విస్తరించిన ప్రాంతం సువిశాలం. దక్షిణ మెహికో, గ్వాతెమాల, బెలీజ్, ఓందూరాస్, ఎల్ సల్బదోర్, నికరాగ్వా దేశాలలో మాయన్ శిథిలాల ప్రాంగణాలు ఉన్నాయి. ఈ దేశాలలో ఇప్పటికీ మాయన్ సంస్కృతి సజీవంగా కనిపిస్తుంది – అది వారి వారి జాతి ఉనికిగా భాసిస్తోంది. ఒక్క గ్వాతెమాల లోనే ఇరవైరెండు మాయన్ భాషలు ఇప్పటికీ వాడుకలో ఉన్న విషయం ఇప్పటికే చెప్పుకున్నాం.

సోల్ మా అందరినీ ఒక పిరమిడ్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. దాని పేరు సర్పమందిరం (Temple of Snake) అట. తికాల్ ప్రాంగణం అంతటికీ ఎత్తయిన కట్టడమది – అరవై ఐదు మీటర్లు! మేమంతా యాభై మీటర్ల ఎత్తు దాకా ఎక్కాం. పిరమిడ్ పై అర్ధభాగంలో పర్యాటకుల సౌకర్యం కోసం చెక్కమెట్లు ఉన్నాయి. ఆ మెట్లు సూర్యోదయం చూడటానికి చక్కని గ్యాలరీల లాగా ఉపయోగపడుతున్నాయి. అలా ఆ మెట్ల మీద మేమంతా చేరాం. మేం కూర్చున్న ప్రదేశం చిటారు కొమ్మలకి ఇంకా పైన ఉంది. అంత ఎత్తున చేరిన మేమందరం సూర్యోదయం కోసం రెప్ప వాల్చకుండా చూశాం.

కానీ ఆ రోజు ఆకాశం మబ్బులు కమ్మి ఉంది. అంచేత స్పష్టమైన సూర్యోదయాన్ని చూడలేక పోయాం. సూర్యబింబపు ఆరోహణాక్రమం చూడలేదన్న మాటే గానీ ఆ ప్రక్రియలో గగనం క్షణాల్లో రంగులు మారడం, దిగువనున్న పచ్చని చెట్ల మీద ఉదయపు వెలుగులు విస్తరించుకోవడం – నేనంతవరకూ ఏనాడూ చూడని అద్భుతమైన దృశ్యాలవి.

పక్షుల కిలకిలారావాలు ఎడతెగకుండా సాగిపోతున్నాయి. కోతుల బొబ్బలు అడపాదడపా వినవస్తూనే ఉన్నాయి. ఒక ఉష్ణమండలపు చిక్కని పచ్చని అడవిలో ప్రకృతి నిర్వహిస్తోన్న సహజ సంగీతోత్సవమది.


సూర్యోదయ సంబరం ముగిశాక ఆ ప్రాంగణమంతా తిరిగి చూడడం ఆరంభించాం. ఆ తికాల్ ప్రాంగణం ఉండడమే అడవి మధ్యన ఉంది గదా – వన్యప్రాణులకు కొదవ లేదు. టర్కీ కోళ్ళు, కుందేలు పరిమాణంలో ఉండే అగోతీలనే (Agouti) ఎలుకలు, కాళ్ళూ చేతులూ తోకా విపరీతమైన నిడివితో ఉండి సాలీళ్ళను గుర్తు చేసే స్పైడర్ కోతులు, తుకాన్ (టూకాన్: Toucan) జాతి రంగురంగుల వంపు తిరిగిన పెద్దముక్కుల పక్షులు – మధ్య అమెరికాకే పరిమితమైన అలాంటి ప్రాణులు కొన్నిటిని చూసే అవకాశం లభించింది.

మేమంతా అక్కడ శిఖరాగ్రాన సమతలంగా ఉన్న మరో పిరమిడ్ దేవాలయం పైకి ఎక్కాం. అది ఖగోళ వేధశాలగా ఉపయోగపడిన ప్రదేశమట. అక్కడ్నించి చక్కగా చుట్టూరా, మూడొందల అరవై డిగ్రీల దృశ్యమాలికలను ఆస్వాదించగలిగాం. అలా ఎన్నో ఆసక్తికరమైన శిథిలాలను చూసుకుంటూ సాగి చివరికి ఆవరణ లోని గ్రాండ్ ప్లాజా దగ్గరికి చేరాం. ఆ కూడలిలో తికాల్ నగరపు ప్రతీక అయిన జాగ్వార్ మందిరముంది. దానికెదురుగా టెంపుల్ ఆఫ్ మాస్క్‌స్ – ముఖపు తొడుగుల మందిరం – ఉంది.

ఉచ్చదశలో ఉన్నపుడు తికాల్ పేరొందిన నగర రాజ్యమట. ఇప్పుడు మనకు కనిపించే ప్రాంగణమే పదహారు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దాదాపు 1500 సంవత్సరాలపాటు అక్కడ నిర్మాణాలు, పాలన సాగుతూనే ఉండేవని మా గైడ్ సోల్ చెప్పాడు. కారణాలు ఏమైనా ఆ తర్వాత నగరం పాడుబడిపోయింది. ఇప్పటిదాకా నాలుగు వేల ప్రముఖ కట్టడాలను తవ్వి వెలికి తీశారట. అక్కడి అరవై చదరపు కిలోమీటర్ల పరిధిలో అరవై వేల చెప్పుకోదగ్గ కట్టడాలున్నాయట.

మాయన్ జాతివాడిని అయినందుకు నాకెంతో గర్వంగా ఉంటుంది అన్నాడు సోల్. గణితం, ఖగోళశాస్త్రం, చిత్రకళ, వాస్తుశిల్పం, వ్యవసాయం, నగర నిర్మాణం – ఇలాంటి ఎన్నో రంగాలలో మాయన్లు పరిణతి సాధించారట. వారి క్రతువులు, కర్మకాండలూ కూడా ఎంతో ఉన్నతస్థాయికి చేరుకున్నాయట. ఆ ప్రక్రియల్లో రక్తతర్పణ ఒక భాగంగా ఉండేదట.

ఆ ప్రాంగణంలో చూడదగ్గ కట్టడాలు డజన్ల కొద్దీ ఉన్నాయి. అందులో కొన్ని చూడగానే కొట్టొచ్చినట్టు మనల్ని ఆకట్టుకుంటాయి. ముందే చెప్పుకున్న జాగ్వార్ మందిరం, మాస్కుల మందిరం ఆ కోవకు చెందినవి. వీటితోపాటు, రెండుతలల పాము మందిరం (Bicephalous snake), ఖగోళ వేధశాల (Observatory), పురోహితుల మందిరం (Temple of Priests) కూడా చెప్పుకోదగ్గ కట్టడాలు.

‘మీ అంతట మీరు ప్రాంగణం అంతా ఒక గంట తిరిగి రండి’ అన్నాడు సోల్. ఓ అరగంట అలా తిరిగాక వెనక్కి వచ్చి సోల్‌తోను, మరికొందరు బృందపు సభ్యులతోనూ కబుర్లలో పడ్డాను. ఆరిజోనా నుంచి వచ్చిన స్పానిష్ టీచర్ డేవిడ్‌తో బాగా మాట కలిసింది. ఎన్నో విషయాలు తెలిసిన మనిషి డేవిడ్.

ఇంత చిక్కని అడవి మధ్యన ఉన్న నగరం ఎలా మనుగడ సాగించగలిగింది? అన్న ప్రశ్న నేను లేవనెత్తాను. ఈ అడవిలో ఎన్నో సహజవనరులున్నాయి. దానికి తోడు మాయన్లు మొక్కజొన్న సాగులో నిష్ణాతులు అని వివరించాడు సోల్. ఆ రోజుల్లో తికాల్ ప్రముఖ వ్యాపార కేంద్రమట. మాయన్ వాణిజ్యమార్గంలో ఉన్న నగరమట.

మా బృందంలోని సభ్యుడొకరు మెల్ గిబ్సన్ తీసిన హాలీవుడ్ సినిమా ఎపోకలిప్తో (Epocalypto) ప్రస్తావన తీసుకువచ్చారు. ఆ సినిమాలోని కొంతభాగం మాయన్ నాగరికతను నిర్దిష్టంగా చిత్రించినా మిగిలిన భాగమంతా తప్పుల తడక అన్నాడు సోల్. ‘మాయన్లు అందరినీ రక్తపిపాసులు గాను, నరబలిలో మునిగి తేలేవారు గానూ ఆ సినిమా చిత్రించింది. నిజానికి రక్తతర్పణం అన్నది మాయన్ల కర్మకాండలలో ఒక భాగం. ఆ విషయాన్ని సరైన కోణంలో చెప్పడంలో ఆ సినిమా విఫలమయింది ‘ అన్నాడు సోల్.

సోల్‌కు చరిత్ర మీద మంచి పట్టు ఉంది. అతనితో చర్చల వల్ల ఆ ప్రాంతపు ప్రజల మూలాలు, జాతుల సూక్ష్మవివరాలు, వారి వారి చారిత్రక పరిణామగతి లాంటి విషయాల మీద చక్కని వివరాలు అందాయి. వాటిని, నాకు అప్పటికే ఉన్న కొద్దిపాటి అవగాహనతో మేళవించి మరికాస్త లోతయిన అవగాహన సంతరించుకోగలిగాను. నేను అప్పటికే, ఛాల్స్ షాస్టెన్ రాసిన బోర్న్ ఇన్ బ్లడీ ఫైర్ (Born in bloody fire – Charles Chasten); మార్షల్ ఈకిన్ రాసిన కాంక్వెస్ట్ ఆఫ్ అమెరికాస్ (Concquest of Americas – Marshall C. Eakin) అన్న పుస్తకాలు చదివి ఉన్నాను. వీటితోపాటు నేను మొదటగా చదివిన మైఖల్ ఉడ్ పుస్తకం ద కాంక్విస్టడోర్స్ (The Conquistadors – Michael Wood) స్పానిష్‌వారి అమెరికా ఆక్రమణల ప్రక్రియను నాకు బాగా పరిచయం చేసింది.

పరిణామక్రమంలో హోమో సెపియన్స్‌కు (Homo Sapiens) ముందటి వర్గానికి చెందిన హోమినాయిడ్‌ల (Hominoid) ఉనికి అమెరికా ఖండాలలో కనిపించనే కనిపించక పోవడం ఈ భూభాగంలో మానవజాతి క్రమపరిణామ ప్రక్రియ జరగనేలేదన్న విషయాన్ని ధృవపరుస్తుంది. ఇప్పటికి అందరూ ఆమోదిస్తోన్న వివరణ ఏమిటీ అంటే మొదటి మానవులు ఆసియా ఖండం నుంచి అమెరికాలకు భూమార్గాన వచ్చి చేరారు. సైబీరియా, అలాస్కాల మధ్యలో అప్పట్లో ఉన్న భూవారధి – లాండ్ బ్రిడ్జ్ – వారి ఖండాంతరయానానికి ఉపకరించింది. కాలక్రమేణా ఆ భూమార్గం సముద్రంలో భాగమయింది – అదే ఇప్పుడు ఆసియా, అమెరికాలను విడదీసి ఉంచుతున్న బేరింగ్ జలసంధి. ఇప్పటికీ ఆ జలసంధి వెడల్పు పదహారు కిలోమీటర్లే; లోతు కేవలం యాభై మీటర్లే.

అలా అమెరికా భూభాగం మీద కాలుమోపిన మానవులు క్రమక్రమంగా దక్షిణానికి విస్తరించారు. కాస్తంత వేడిగాను, సుఖంగానూ ఉండి, బ్రతకడానికి అవసరమయ్యే వృక్షాలూ అడవులు, వేటకు సరిపడా వన్యప్రాణులు ఉండే ప్రదేశాల కోసం వెదుకులాట – వారి ఆ దక్షిణాయనానికి ప్రేరణ.

పదమూడు వేల కిలోమీటర్ల దూరం దాటుకొని అలాస్కా నుంచి దక్షిణ అమెరికా కొట్టకొన వరకూ వారంతా ఎలా వెళ్ళగలిగారు అన్న ప్రశ్న రావడం సహజం. ఏదైనా బృందం ఉన్నచోటు నుంచి ఏడాదికి పాతిక కిలోమీటర్లు ముందుకు సాగినా వెయ్యేళ్ళలో పాతిక వేల కిలోమీటర్ల దూరం చేరుకోగలుగుతారు. అంచేత పదమూడు వేల కిలోమీటర్లు అన్నది సంభావ్యమే. మెరుగైన జీవనాధారాల కోసం మానవజాతి వేలాది మైళ్ళు వలస వెళ్ళడం అన్నది చరిత్ర ఎరుగని కాలం నుంచీ ప్రపంచంలో ఎన్నో చోట్ల సంభవించిన విషయమే.

కొలంబస్ అమెరికాను కనిపెట్టినప్పుడు అది ఇండియా అని పొరబడ్డాడు. అక్కడివారిని ఇండియన్స్ అన్నాడు. కాలక్రమేణా ఆ పదం రెడ్ ఇండియన్స్‌గా మారింది. ఇప్పుడు భౌగోళికంగా, జాతుల పరంగా అవగాహనలు పెరిగాక ఆ మాట వాడుక లోంచి తొలిగిపోయింది. వారందరినీ నేటివ్ ఇండియన్స్ అని పిలవడం పరిపాటి అయింది. ఈ నేటివ్ ఇండియన్స్ అన్న పదం కూడా మారుతున్న కాలాలకు అనుగుణంగా మారే అవకాశం ఉంది. (ఉదా. యు.ఎస్.లో ఇప్పటికీ వీరిని నేటివ్ అమెరికన్స్ అని పిలవడమే మర్యాద.)

వీరంతా తెగలు తెగలుగా ఉభయ అమెరికా ఖండాల్లో విస్తరించిన మాట నిజమే గానీ అందులో రెండు ముఖ్యమైన ప్రాంతాలు వికసిత నాగరికతా కేంద్రాలుగా రూపు దిద్దుకున్నాయి. మెసో అమెరికా అని పిలవబడే ప్రాంతంలో విలసిల్లిన మాయన్ నాగరికత అందులో ఒకటి. ఇప్పటి మెహికో, గ్వాతెమాల, బెలీజ్, ఓందూరాస్, ఎల్ సల్బదోర్, నికరాగ్వా దేశాలు ఈ మాయన్ నాగరికత ఆధార పీఠాలు. దక్షిణ అమెరికాలో రూపు దిద్దుకున్న ఇన్‌కా (Inca) నాగరికత రెండవది. ఇప్పటి కొలంబియా, పెరూ, ఎక్వెదోర్, బొలీవియా, చిలే దేశపు ఉత్తరభాగం ఈ ఇన్‌కా నాగరికతకు కేంద్రబిందువులు.

మాయన్లు వ్యవసాయరంగంలో పరిణతి సాధించారు. మిగులు ధాన్యాల స్థాయికి చేరుకోగలిగారు. అది స్థిరనివాసాలకు, వాణిజ్యానికీ బీజమయింది. క్రమక్రమంగా నగరాలు విరిశాయి. నాగరికత రూపు దిద్దుకుంది. గణితం, ఖగోళశాస్త్రం వంటి శాస్త్రీయ విద్యలు అభివృద్ధి చెందాయి. అలా రెండున్నర సహస్రాబ్దాల పాటు కొనసాగిన మాయన్ నాగరికత ఆ తర్వాత వచ్చిన ఆస్తెక్ (Aztek) నాగరికత ధాటికి తట్టుకోలేక క్రమక్రమంగా క్షీణించిపోయింది. గ్రీకు నాగరికతను రోమన్ నాగరికత ఎలా అధిగమించిందో అలానే మాయన్ల మీద ఆస్తెక్‌ల ఆధిపత్యం స్థిరపడింది.

పదహారో శతాబ్దపు ఆరంభంలో స్పెయిన్‌వాళ్ళు ఇన్‌కా, ఆస్తెక్ సామ్రాజ్యాలను జయించి అమెరికా ఖండాలలో వలసపాలనకు నాంది పలికారు. ఎంతోమంది నేటివ్ ఇండియన్స్ స్పానిష్ యుద్ధాలలో అంతరించిన మాట నిజమే గానీ దానికి ఎన్నో రెట్లమంది యూరోపియన్ల సంపర్కం వల్ల వచ్చిన వ్యాధుల పాలబడి మరణించారు. దాదాపు తొంభై శాతం ప్రజలు ఇలా యూరోపియన్ వ్యాధుల వల్లనే ప్రాణాలు కోల్పోయారు.

ఆ సమాచారమంతటినీ నెమరు వేసుకొని, కొత్త సమాచారాన్ని మనసులోకి ఇంకించుకొని ఆ శిథిల నగర ప్రాంగణం నుంచి అందరం బయటపడ్డాం. సమయం ఉదయం పది గంటలు.


మధ్యాహ్నం పన్నెండు లోపలే ఫ్లోరెస్ తిరిగి చేరుకున్నాను. సాయంత్రం ఏడు గంటలకు నా గ్వాతెమాల సిటీ విమానం. అంటే మధ్యాహ్నమంతా ఫ్లోరెస్‌లో గడిపే అవకాశం ఉందన్నమాట.

భోజనం విషయంలో తిపికో ఇంపీరియో అన్న చెరువు పక్క రెస్టరెంటును సోల్ సిఫార్సు చేశాడు. ‘నీకు చేపలు ఇష్టమయితే అదే బెస్టు రెస్టరెంటు. ఈ ప్రాంతానికి పరిమితమయిన పెస్కాదో బ్లాంకో – తెల్ల చేపలు (pescado blanco) – ఈ పెతేన్ చెరువులోనే దొరికేవి, వండి వడ్డిస్తారక్కడ, వెళ్ళు’ అని ప్రోత్సహించాడు. చేపల వంటకం అంటే నాకు మనసాగదు. వెళ్ళాను. ఆ చేపల భోజనం నాకు ఎంతో నచ్చింది. మర్నాటి ఉదయానికల్లా నేను ఓందూరాస్ దారి పట్టుకుంటున్నాను గదా – ఆ సందర్భంగా గ్వాతెమాల దేశం నాకు అందించిన వీడ్కోలు విందుభోజనమది అనిపించింది.

మిగిలి ఉన్న నాలుగు గంటలూ రంగులీనే ఫ్లోరెస్ వీధుల శోధనకు వినియోగిద్దామని రెస్టరెంటు నుంచి బయటపడ్డాను. అంతకు ముందు సోల్ ఇచ్చిన సలహా ప్రకారం బోటు ప్రయాణం చేసి సరోవరపు అవతలి ఒడ్డున ఉన్న సాన్ మిగేల్ (San Miguel) అన్న గ్రామం చేరాను. ఈ ఊరు కాస్తంత ఎత్తున ఉంది; ఫ్లోరెస్ నగరపు అందాలు చూడడానికి అనువైన స్థలంలో ఉంది. ఆ గ్రామపు వెనుక ఉన్న చిన్నపాటి కొండ మీదకు చేరి, ఆ పైనున్న వ్యూపాయింట్ దగ్గరినుంచి ఫ్లోరెస్ ద్వీపాన్ని చూడాలన్నది నా ప్రణాళిక. కానీ సరిగ్గా అప్పుడే హోరున వర్షం అందుకుంది. నా ఆశలను నీరు కార్చింది. గబగబా ఒక చోట తలదాచుకొని మెల్లగా బోటు ఎక్కి ఫ్లోరెస్ తిరిగి చేరాను.

అక్కడి ఒక కఫేలో నా స్పానిష్ అమెరికన్ టీచర్ మిత్రుడు డేవిడ్ మళ్ళా కలిశాడు. కాస్తంతా తీరిగ్గా మా మా ప్రయాణపు వివరాలు పంచుకున్నాం. ఇక్కడి నుంచి ఓందూరాస్‌కు, మళ్ళా అక్కడ్నించి ఎల్ సల్బదోర్‌కూ వెళ్ళాలన్న నా ఆలోచన అతనికి చెప్పాను. డేవిడ్ ఈమధ్యనే ఓందూరాస్ వెళ్ళి వచ్చాడు. ‘ఇక్కడ్నించి సరిహద్దు దాటి ఓందూరాస్ వెళ్ళడం సులభమే. కాని, ఓందూరాస్ నుంచి ఎల్ సల్బదోర్ చేరుకోడమే కాస్తంత క్లిష్టమైన పని. రోడ్లు సరిగ్గా లేవు. రవాణా సౌకర్యాలు దాదాపు లేవు. గుర్తుంచుకో’ అన్నాడు డేవిడ్. ఆ ముఖ్యమైన సమాచారం అతడి దగ్గర సంగ్రహించి, అతనితో కలిసి ఒక హాట్ చాకొలెట్ పానీయం తాగి, గుడ్‌బై చెప్పి, గ్వాతెమాల సిటీకి విమానం పట్టుకోడానికి ఫ్లోరెస్ విమానాశ్రయం దారి పట్టాను.


గ్వాతెమాల సిటీ విమానాశ్రయంలో ఆంతోనియో నాకోసం ఎదురు చూస్తూ కనిపించాడు. మా వసతిగృహం విల్లా తోస్కానా చేరేసరికి మిత్రుడు సెర్గియో సాదర ఆహ్వానం పలికాడు. నా బట్టలన్నీ రెడీ అయ్యాయన్న శుభవార్త అందించాడు.

మర్నాటి ఉదయం నాలుగున్నరకు ఓందూరాస్ లోని కొపాన్ రుయినాస్ (Copan Ruinas) వెళ్ళే షటిల్ బస్సు. ఆ బస్సు ఆంతీగా నుంచి వస్తుంది. కొద్దిరోజుల క్రితమే ఆంతీగా లోని మాయన్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర ఈ బస్‌టికెట్ తీసుకున్నాను. ఆ టికెట్ ఇచ్చిన హోర్హే అన్న పెద్దమనిషి నన్ను గ్వాతెమాల సిటీలోని 11వ జోన్‌లో, యుతిత్‌లాన్ మెక్ డానల్డ్స్ దగ్గర నాలుగింటికల్లా వేచి ఉండమని చెప్పాడు. మూడుమ్ముప్పావు కల్లా అక్కడ నన్ను దింపమని ఆంతోనియోకు పురమాయించాడు సెర్గియో. కానీ మనిషి జాడలేని, షాపులన్నీ మూసి ఉన్న సమయంలో ఆ రోడ్డు మీద ఒంటరిగా నిలబడి ఉండడం అన్న విషయం నాకేమంత శుభమనిపించలేదు. ఇంకో మనిషి తోడు దొరికేదాకా నాతో ఉండిపోవడానికి ఆంతోనియో సిద్ధపడ్డాడు. అవసరమయితే నన్ను అక్కడి సెక్యూరిటీ గార్డుకు అప్పగించి వెళతానన్నాడు.

ఆ మెక్ డానల్డ్ పాయింటు మా హాస్టల్ నుంచి పన్నెండు కిలోమీటర్లు. ట్రాఫిక్ లేకపోవడం వల్ల త్వరగానే చేరుకున్నాం. మెల్లమెల్లగా నాకు నమ్మకం చిక్కి ఆంతోనియోతో నువ్వెళ్ళు, పర్లేదన్నాను. వెళ్ళాడు. అరగంట గడిచాక షటిల్ బస్సు వచ్చింది. ఆ బస్ డ్రైవర్ నన్ను ఠకామని గుర్తు పట్టాడు. నా వాలకం, బ్యాక్‌ప్యాక్, ఆశ నిండివున్న చూపులు నన్ను పట్టించి ఉంటాయి.

బస్సెక్కాను. మధ్య అమెరికాలో నా తదుపరి దేశం ఓందూరాస్ కేసి సాగిపోయాను.

(సశేషం)