ఎల్ సల్బదోర్
మధ్య అమెరికాలోకెల్లా అతి చిన్న దేశం ఎల్ సల్బదోర్. విస్తీర్ణంలో మన కేరళతో పోలిస్తే సగం ఉంటుంది. జనాభా 65 లక్షలు. కానీ ఆ దేశానికున్న సమస్యలు సవాలక్ష. గత కొన్ని దశాబ్దాలుగా అపసవ్య కారణాల వల్ల పత్రికల్లో పతాకశీర్షికల్లో నిలిచిన దేశమది: మిలటరీ నియంతృత్వాలు, సైనిక తిరుగుబాట్లు, సాయుధపోరాటాలు, మాఫియా గాంగ్‌వార్‌లు, పౌరుల ఊచకోతలు, అదుపెరుగని నేరాల సంఖ్య – ఆ దేశానికి సమస్యలే సమస్యలు. దేశపు రాజధాని సాన్ సల్బదోర్‌కు ప్రపంచపు హత్యాసామ్రాజ్యపు రాజధాని అన్న కోరుకోని ఖ్యాతి కూడా ఉంది. ఇవన్నీ చూస్తే ఏ యాత్రికుడికైనా గుండె గుభేలుమనడం ఖాయం; ఆ దేశంలో అడుగు పెట్టాలనుకోడు.
ఈ మధ్యకాలంలో ఎల్ సల్బదోర్ దేశం బిట్‌కాయిన్ కంట్రీగా ప్రాచుర్యం పొందుతోంది. ప్రపంచంలో క్రిప్టోకరెన్సీ చలామణీని ఆధికారికంగా అనుమతించిన మొట్టమొదటి దేశంగా ఎల్ సల్బదోర్ 2021లో వార్తల్లోకి ఎక్కింది. అంతకు ఇరవైయేళ్ళకు ముందు 2001లో, దేశమంతటా అలముకున్న ద్రవ్యోల్బణాన్ని నిలువరించే ప్రయత్నంలో భాగంగా అప్పటిదాకా చలామణీలో ఉన్న కొలోన్ (Colon) అన్న కరెన్సీ స్థానంలో యు.ఎస్. డాలర్‌ను తన కరెన్సీగా స్వీకరించింది. ఇపుడక్కడ ఏమి కొన్నా డాలర్లతో కానీ బిట్‌కాయిన్‌లతో కానీ చెల్లించవచ్చు. నా దగ్గర బిట్‌కాయిన్లు లేవు. వాటిని భరించే స్తోమతూ లేదు. అంచేత నాదగ్గరున్న డాలర్లు ఖర్చు పెట్టడమొక్కటే నాకున్న ఏకైక మార్గం.
ఆంగ్వియాతు సరిహద్దు దగ్గర మెతపాన్ (Metapán) వెళ్ళే 235 నంబరు చికెన్ బస్సు ఎక్కినప్పుడు ఆ బస్సు మొత్తానికి నేనొక్కణ్ణే ప్రయాణీకుడిని. మెల్లగా బయల్దేరిన ఆ బస్సు ప్రతి అరకిలోమీటరుకూ ఆగుతూ, ఎక్కేవాళ్ళను ఎక్కించుకుంటూ బహునెమ్మదిగా తన నడక సాగించింది. అలా మూడు నాలుగు చోట్ల ఆగేసరికి బస్సు నిండిపోయింది. నడిచే దారిలో చిన్న చిన్న గ్రామాలు… సస్యశ్యామల ప్రాంతాలు – సారవంతమైన నేలలవి.
ఆ ప్రాంతపు చికెన్ బస్సులన్నిట్లో లాగానే మా బస్సులోనూ సంగీతం హోరెత్తిపోయింది. ఇరవై నిమిషాల్లో మెతపాన్ చేరుకున్నాం. రద్దీగా ఉన్న ఆ ఊరి కూడలిలో ఆగింది మా బస్సు – సాంతా అనా వెళ్ళే బస్సు అక్కడ రెడీగా కనిపించింది. వెంటనే ఎక్కేశాను. అయిదు నిమిషాల్లో ఆ బస్సు పరుగందుకుంది. అలా పరుగందుకున్న మాట నిజమే కాని, ఆ బస్సు మెతపాన్ పట్టణంలోనే ఐదారు చోట్ల ఆగుతూ సాగింది. ప్రతి రెండొందల మీటర్లకీ ఒక స్టాపు. ఈ బస్సులు రవాణా సాధనాలే కాదు, సంచార విపణివీధులు కూడానూ. ప్రతీ స్టాపులోను చిరువ్యాపారులు తమతమ సామాన్లు వేసుకొని బస్సు ఎక్కేవారు – పళ్ళు, చిరు తినుబండారాలు, పొట్లాలలో చుట్టిన భోజన పదార్థాలు, వంటింటి ఉపకరణాలు – చకచకా తమ తమ వస్తువుల్ని అమ్ముకొని మరో రెండు స్టాపుల తర్వాత దిగిపోయేవారు.
మెతపాన్ ఊరు దాటుతున్నప్పుడు ఒక పాటగాడు మా బస్సులో ప్రవేశించాడు. అతని భుజానికి ఒక పోర్టబుల్ కారియోకి సెట్ వేలాడుతోంది. గబగబా రెండు శ్రావ్యమైన పాటలు పాడి వినిపించాడు. అవి నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అతను బస్సంతా తిరుగాడినప్పుడు కొంతమంది ప్రయాణీకులు చిన్న చిన్న మొత్తాలు అతనికి అందించారు. ఆ కాస్త సమయాన్ని పాటలతో పండించినందుకు కృతజ్ఞతాసూచకంగా నేనూ చిన్నపాటి బహుమతిని అందించాను. మరికొన్ని స్టాపుల తర్వాత అతను దిగిపోయాడు. మొత్తానికి ఆ బస్సులో చైతన్యం తొణికిసలాడుతూనే ఉంది. ప్రయాణంలో విసుగుదల అన్న మాటే లేదు. నాలాంటి కుతూహలజీవికి కళ్ళూ చెవులే కాదు, సర్వాంగాలతోనూ ఆస్వాదించవలసిన సజీవ అనుభవాల చైతన్య రథమా చికెన్ బస్సు!
మెతపాన్ నుంచి సాంతా అనా చేరడానికి గంట పట్టింది. మా యు.కె. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ పుణ్యమా అని మధ్య అమెరికాలోని ఏడు దేశాల్లోనూ యు.కె.కి వర్తించే స్థానిక ఛార్జీనే చెల్లిస్తూ వాడుకోగల ఇంటర్నేషనల్ పాకేజ్ సదుపాయం నా ఫోనుకు ఉంది. ఓందూరాస్‌లో నా డ్రైవరు స్నేహితుడు ఫ్రాంక్లిన్ ఇచ్చిన నంబరుకు ఫోన్ చేశాను. ఆ నంబరు మనిషి ఫోనెత్తాడు. ఎల్ సల్బదోర్‌లో సాంతా అనా పట్టణంతోపాటు అక్కడి పరిసర ప్రాంతాలూ తిరిగి చూడవలసినవే అన్నాడు. అలా అని అతగాడు నన్ను తన స్నేహితుడు రికార్దోతో అనుసంధానించాడు.
పది నిమిషాల్లో రికార్దోనుంచి మెసేజ్ వచ్చింది. బస్ స్టేషన్‌కు వచ్చి కలుసుకుంటానన్నాడు. కాసేపటికల్లా బస్సు సాంతా అనా చేరింది. బస్ స్టేషన్ దగ్గర, రోడ్డుకు అవతలి పక్కన, ఉత్సాహంగా చెయ్యి ఊపుతూ పాతికేళ్ళ యువకుడు… అతనే రికార్దో. దిగీ దిగగానే నా బ్యాక్‌ప్యాక్ అందిపుచ్చుకొని తన కారు డిక్కీలో పెట్టాడు. నేను డ్రైవరు పక్క సీట్‌లోకి చేరాను. వెనక సీట్‌లో బిడియంగా కూర్చున్న ఓ టీనేజి కుర్రాడు కనిపించాడు. ‘మా తమ్ముడు అమిల్కర్’ అంటూ అతణ్ణి పరిచయం చేశాడు రికార్దో. ‘ఇంట్లో కూర్చొని కూర్చొని విసుగెత్తిపోతోంటే మనతో కలిసి తిరగడానికి రమ్మన్నాను. నా వృత్తీవ్యాపకాల గురించి కొంచెం అర్థమవుతుంది. మీతో మాట్లాడితే కాస్తంతా ఇంగ్లీషూ వంటపడుతుంది’ అని వివరించాడు రికార్దో.
రికార్దో పూర్తిస్థాయి గైడ్ కాదు; అపుడపుడూ ఇలా టూరిస్టులని తీసుకొని ఊరు తిప్పి చూపిస్తుంటాడు. ముందుగా కారును సాంతా అనా లోని ఇరుకాటి బిజీ రోడ్ల మీద నడిపాడు. సిటీ సెంటరు దగ్గర ఒక పక్కవీధిలో కారు నిలిపి నడక ఆరంభించాం. ముందుగా ఊళ్ళోని లిబర్టీ స్క్వేర్‌కు వెళ్ళాం. నేను చూసిన వలస పాలన నాటి లాటిన్ అమెరికన్ నగరాలన్నిటిలానే సాంతా అనా లోని ముఖ్యకూడలి కూడా చాలా ఆకట్టుకొనేలా ఉంది. అక్కడి పౌరభవనాలు గంభీరంగా ఉంటూనే చక్కచక్కని లేలేతరంగుల్లో ఆహ్లాదకరంగా ఉన్నాయి. అక్కడి ఆపెరా హౌస్ – తియాత్రో సాంతా అనా – ఆ భవనాల్లో ఒకటి. ఆ కూడలికి ఒక కొసన ‘ల కథెడ్రాల్’ భవనం గంభీరంగా నిలిచివుంది. దాని వాస్తుశిల్పరీతి మధ్యయుగాలనాటి యూరోపియన్ గాథిక్ శైలిని తలపించింది. దాని ముంగిట వందలాది పావురాలు ఉన్నాయి.
దారిలో బిట్‌కాయిన్ ఎక్స్‌ఛేంజ్ సెంటర్లు కనిపించాయి. ఎవరైనా వాటిల్లోకి వెళ్ళి తమ దగ్గరున్న బిట్‌కాయిన్లను డాలర్లలోకి మార్చుకోవచ్చు. అలా మార్చుకొనే ప్రక్రియ వివరాలు రికార్దో నాకు ఓపిగ్గా వివరించాడు.
ఆ పరిసరాలు కాసేపు గమనించాక ‘సాంతా అనా సంపద నిండిన నగరంలా ఉందే’ అని వ్యాఖ్యానించాను. ‘అవునవును. 1920ల నాటి కాఫీ పంటల ఉధృతం పుణ్యమా అని ఈ నగరం ఒక వెలుగు వెలిగింది. కాఫీ తోటల యజమానులకు స్థావరమయింది. కాఫీ గింజలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే కేంద్రంగా ఎదిగింది. వాటివల్ల ఎన్నో విధాలుగా సుసంపన్నమయింది. ఇప్పటికీ మా దేశంలో ఇదే రెండవ పెద్ద నగరం’ అని వివరించాడు రికార్దో.
ఊరి సెంటరు నుంచి సాంతా అనా అగ్నిపర్వతం వేపుకు దారి తీశాడు రికార్దో. సముద్రతలానికి 2381 మీటర్ల పైన ఉన్న ఆ అగ్నిపర్వతం ఎల్ సల్బదోర్ లోని వాల్కనోలు అన్నిటికన్నా పెద్దదీ ఎత్తయినదీనట. అప్పటికే మధ్యాహ్నం రెండయింది. ఆకలితో నకనకలాడుతున్నాను. మరొక్క అరగంట ఓపిక పడితే ఎల్ సల్బదోర్ దేశంలోకెల్లా ఎన్నదగిన విస్టా పాయింట్ ఉన్న రెస్టరెంటుకు చేరుస్తాను అని నన్ను సముదాయించాడు రికార్దో. చెప్పినట్టుగానే కొండల మధ్య సాగి మరో అరగంటలో నీలాలు రాశి పోసినట్టున్న లాగో క్వాతెపెకె (Lago de Coatepeque) అన్న సరోవర తీరం చేరాం.
పక్కనే ఉన్న మేడ మీది రెస్టరెంటులో ముగ్గురం కుదురుకున్నాం – దాని పైకప్పు గడ్డితో నేసి ఉంది. కాస్తంత కిందకు చూస్తే మిలమిలలాడే చెరువు. ఈ క్వాతెపెకె చెరువు కూడా అగ్నిపర్వతపు బిలముఖంలో ఏర్పడిన తటాకమే. చుట్టూ పచ్చల పర్వతాలు… ఒకవేపు గట్టున చొచ్చుకు వస్తున్న సాంతా అనా అగ్నిపర్వత శిఖరం… దానికి తోడుగా తటాకపు తీరరేఖ మీద మరికొన్ని పిల్ల వాల్కనోలు – అగ్నిపర్వతాలే అయినా ఆ కొండలు, ఆకాశంలో వేలాడే ధవళ శిఖరాలు, మేఘాలు, నీలితటాకం – అనిర్వచనీయమైన సౌందర్యం అది. అలాంటి సరోవర తీరాన మేడ మీది రెస్టరెంట్‌లో కూర్చుని భోంచెయ్యడమన్నది ఎంత సౌభాగ్యం!
మా అందరికీ రికార్దో పపూసాలు (Papusas) ఆర్డర్ చేశాడు. అది ఆ దేశపు జాతీయవంటకమట. తోర్తీయాలనే (tortillas) మొక్కజొన్న రొట్టెల్లో చీజు, వేయించిన బీన్స్ చొప్పించితే అదే పపూసా వంటకం. ఒక్కో పోర్షన్లో మూడు మూడు పపూసాలు… రుచికరం. కడుపు నిండిపోయింది. ‘మీ దేశపు పపూసాలు నాకు బాగా నచ్చాయి. రాబోయే రెండు రోజుల్లో – దేశం వదిలి వెళ్ళేలోగా ఇవి మరోసారీ మరోసారీ రుచి చూస్తాను’ అన్నానా అన్నదమ్ములతో. వారి ఊరి వంటకం నన్ను అంతగా ఆకట్టుకున్నందుకు రికార్దో అమిల్కర్‌లు ఎంతగానో పొంగిపోయారు.
బిలముఖాల్లో ఏర్పడిన తటాకాలన్నిటిదీ ఒకటే కథ. ఈ లాగో క్వాతెపెకె కూడా వేలాది సంవత్సరాల క్రితం – బహుశా లక్షలాది కూడానేమో – నిప్పులు చిమ్మీ చిమ్మీ అలసిపోయి కూలబడిన అలనాటి బృహజ్జ్వాలాముఖుల లోతైన బిలముఖంలో ఏర్పడిన సరోవరమే. దాని లోతు 394 అడుగులట… చుట్టూ నిడుపాటి కొండచరియలు.
రికార్దో సంకోచాలంటూ లేకుండా చులాగ్గా కలిసిపోయే మనిషి. తనకు యు.ఎస్. వెళ్ళాలనే కోరిక ఉండబట్టి ఇంగ్లిష్ నేర్చుకున్నానని చెప్పాడు. వాళ్ళ నాన్న గత పద్దెనిమిదేళ్ళుగా ఫ్లోరిడా లోని మైయామి (Miami) నగరంలో పని చేస్తున్నాడట – ఇతను తన తమ్ముళ్ళతో కలిసి సాంతా అనాలో ఉంటున్నాడు. ఏదో ఒకరోజున వాళ్ళూ యు.ఎస్. వెళ్ళి వాళ్ళ నాన్నతో ఉంటారన్న ఆశాభావం వ్యక్తపరిచాడు రికార్దో. ఎల్ సల్బదోర్‌లో ఎంతోమందికి అలా యు.ఎస్. వెళ్ళాలనే ఆకాంక్ష ఉందని చెప్పాడు. మీరందరూ అలా కోరుకోడానికి ప్రేరణ ఏమిటీ? అని నేను కావాలనే అడిగాను. మంచి ఉద్యోగాలు, మెరుగైన జీవితం అన్నది అతని జవాబు.
రికార్దో మాటలు నన్ను చిన్నపాటి పరిశోధనకు పురిగొల్పాయి. నిజమే. ఇరవై లక్షలమంది సల్బదోరియన్లు యు.ఎస్.లో ప్రవాసులుగా ఉంటున్నారు. దేశంలో మిగిలిన వారి సంఖ్య అరవై లక్షలు. అంటే ప్రతి నలుగురు సల్బదోరియన్లలో ఒకరు యు.ఎస్.లో ఉంటున్నారన్నమాట! మధ్య అమెరికాలోని ఏ దేశంతో పోల్చినా ఈ సంఖ్య చాలా ఎక్కువ. దానికి ఆర్థిక కారణాలే కాకుండా చారిత్రక, రాజకీయ కారణాలూ ఉన్నాయి. 1980ల నాటి ఆ దేశపు అంతర్యుద్ధపు రోజుల్లో మూడోవంతు ప్రజలు దేశం వదిలి పారిపోయారు. అందులో చాలామంది యు.ఎస్. చేరారు. ఇప్పుడు ఆ ప్రవాసులు పంపే యు.ఎస్. డాలర్లే ఎల్ సల్బదోర్ ఆర్థిక వ్యవస్థలో చెప్పుకోదగ్గ భాగంగా పరిణమించాయి.
అప్పటిదాకా బిడియంగా ఉండిపోయిన అమిల్కర్ మెల్లగా వాళ్ళ అన్న ద్వారా నాతో మాట్లాడడం మొదలెట్టాడు. నాకూ అతనికీ రికార్దో దుబాసీ అన్నమాట. ‘ఇండియా నుండి వచ్చిన నిఖార్సయిన ఇండియన్‌తో మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాను’ అని సిగ్గుసిగ్గుగా సంబరంగా చెప్పాడు అమిల్కర్. ‘అంత దూరం లండన్ నుంచి మా దేశం చూడటానికి ఎందుకు వచ్చారూ? మాదేశంలో మిమ్మల్ని అలా రప్పించిన విలక్షణత ఏమిటీ?’ అని అడిగాడు. అతని ప్రశ్న, దాన్ని అడిగిన పద్ధతీ గమనిస్తే నేను వాళ్ళ దేశానికి ఒక విలక్షణ లక్షణాన్ని ఆపాదించాలని అతను ఆశిస్తున్నాడని స్పష్టమయింది. నిజమే. గ్వాతెమాల, బెలీజ్, కోస్తా రీక లాంటి దేశాలతో పోలిస్తే ఎల్ సల్బదోర్‌కు వచ్చే టూరిస్టులు బాగా తక్కువ. నాకు అమిల్కర్‌ను నిరాశపుచ్చాలని అనిపించలేదు. మిగతా మధ్య అమెరికా దేశాలతోపాటు ఎల్ సల్బదోర్‌లోనూ ఎలాంటి ప్రత్యేకతలున్నాయో కనిపెట్టాలన్న అన్వేషణలోనే నేనక్కడికి చేరానని చెప్పాను.
‘మీకు పసిఫిక్ సాగరతీరానికి వెళ్ళే ఆలోచన ఉందా?’ అని అడిగాడు రికార్దో. అక్కడ నల్ల ఇసుక బీచ్‌లుంటాయి. నిజానికి అది మామూలు ఇసుక కాదు, అగ్నిపర్వతాల విస్ఫోటనంలో ఎగసిన లావా రాళ్ళనుంచి ఏర్పడిన ఇసుక అది. హవైయి ద్వీపాలలోనూ ఈ నల్ల ఇసుక బీచ్‌లు ఉన్నాయి. ఏదేమైనా ఆ బీచులు ఓ గట్టి టూరిస్ట్ ఆకర్షణ. అన్నట్టు మధ్య అమెరికా ఏడు దేశాలలోనూ కరేబియన్ సాగర తీరరేఖ లేని ఏకైక దేశం ఎల్ సల్బదోర్. కానీ బీచ్‌లకు వెళ్ళడమన్నది నాకంత రుచించదు. వెళ్ళి ఏ పనీ లేకుండా అలా చూస్తూ ఉండటమంటే క్షణాల్లో నాకు విసుగెత్తుతుంది. అంతేగాక, నేను ఇంకా చూడవలసిన పనమా దేశం ఉంది కదా – సమయమూ చాలదు.
సాంతా అనా అగ్నిపర్వతం బాగా కనిపించే విస్టా పాయింట్ కూడా చూపించాక రికార్దో సాన్ సల్బదోర్ నగరం వైపుకు దారి తీశాడు. ఆ ప్రయాణంలో కొంతభాగం పాన్ అమెరికన్ హైవే మీద సాగింది. సాయంత్రం అయిదుగంటల వేళ గమ్యం చేరుకున్నాం. ఊరు చేరేముందు రికార్దో మరో విస్టా పాయింట్ దగ్గర ఆపాడు. చుట్టూ అగ్నిపర్వతాలు, మధ్యలో సాన్ సల్బదోర్ నగరం – ఆ దృశ్యం ఊహాతీతమైన అనుభూతిని కలిగించింది. ఆ తర్వాత ఊరి సెంటరుకు చేరుకొని కాసేపు అక్కడ నడిచాం. ఒక చిన్నపాటి మార్కెట్లో వీధివ్యాపారులు పపూసాలను పెనాలపై కాలుస్తూ కనిపించారు. అలా కాలుతున్న పపూసాల కమ్మని వాసన వీధి వీధంతా తెరలు తెరలుగా వ్యాపిస్తూ ఆకలిని ప్రేరేపిస్తోంది.
అక్కణ్ణుంచి గ్రాండ్ మెట్రో కెథడ్రల్‌కు వెళ్ళాం. అక్కడ ఒస్కార్ రొమేరో అన్న ఎల్ సల్బదోర్ దేశపు కేథోలిక్ ఆర్చ్‌బిషప్ సమాధి ఉంది. రికార్దో ఆ ఆర్చ్‌బిషప్ కథంతా చెప్పుకొచ్చాడు. తనకాలంలో ఒస్కార్ రొమేరో పౌరహక్కులు, సామాజిక న్యాయం వంటి విషయాల్లో ఎంతో నిబద్ధతతో, సాహసంతో పనిచేసేవాడట. ఆ విధంగా ప్రజలకు ఎంతో దగ్గరివాడూ ప్రీతిపాత్రుడూ అయ్యాడట. కానీ వ్యవస్థకు రుచించని నిషిద్ధ విషయాల గురించి మాట్లాడటం అతనికి శత్రువులను తెచ్చిపెట్టింది. ఒక ప్రార్థనాశిబిరం నిర్వహిస్తున్న సమయంలో అతణ్ణి కాల్చి చంపారు. అది అంతర్జాతీయంగా నిరసనలకు దారితీసింది. వాటికన్ వ్యవస్థ అతడిని అమరవీరుడిగా ప్రకటించింది. 2018లో పోప్ ఫ్రాన్సిస్ అతనికి సెయింట్‌హుడ్ ప్రసాదించాడు.
1980 నాటి ఒస్కార్ రొమేరో హత్యాకాండ పౌరసమాజంలో తిరుగులేని కదలిక తెచ్చింది. మెల్లమెల్లగా అంతర్యుద్ధానికి దారితీసింది. పన్నెండేళ్ళ పాటు సాగిన ఆ అంతర్యుద్ధంలో షుమారు 70వేలమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 1992లో ఐక్యరాజ్య సమితి పూనుకొని యు.ఎస్. మద్దతు ఉన్న స్థానిక సైనిక నియంతలకు, ఎఫ్.ఎం.ఎల్.ఎన్. అన్న వామపక్ష సాయుధ గెరిల్లాల ఐక్యసమాఖ్యకూ మధ్య సంధి కుదిర్చింది. ఎఫ్.ఎమ్.ఎల్.ఎన్. అంటే ఫరబున్దో మార్తి నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ అని. తర్వాత జరిగిన ఎన్నికలలో ఈ ఫ్రంట్ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఈ ఫరబున్దో మార్తి (Farabundo Martí) అన్నాయన ఎల్ సల్బదోర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులలో ఒకడు. 1930లలో రైతులను సంఘటితపరిచి తిరుగుబాటు చేయించిన మనిషి.
సిటీ సెంటర్లో అనేకానేక కూడళ్ళు ఉన్నాయి. అవన్నీ ఒకదానితో ఒకటి జోడింపబడి ఉన్నాయి. ప్లాసా లిబెర్తాద్ అన్నచోట చక్కని పార్కు ఉంది. అందులో అన్ని వయసుల జంటలూ సంకోచమన్న మాటే లేకుండా ఉల్లాసంగా నృత్యాలు చేస్తూ కనిపించారు. ముసలివాళ్ళు కూడా అలా ఆరుబయలు ప్రాంగణంలో చక్కగా నృత్యం చెయ్యడం చూస్తే ఎంతో ముచ్చటవేసింది.
అక్కణ్ణుంచి ఇగ్లేసియా ఎల్ రొసారీయో (Iglesia el Rosario) అన్న చర్చి దగ్గరకు వెళ్ళాం. చర్చ్ అన్న మౌలికభావనకు ఏమాత్రమూ ఒదగని రీతిలో కట్టిన భవనమది. మధ్య అమెరికా అంతటికీ అంత విభిన్నమయిన చర్చిభవనం ఇంకొకటి లేదట. లోపల కనిపించే శిలువ మాత్రమే అది చర్చి అని గుర్తు చేస్తుంది. సహజంగా వచ్చే వెలుగును గొప్ప కౌశలంతో ఒడిసిపట్టి భవనం లోపల ఇంద్రధనుస్సు రంగులు విరిసేలా చేశారు. నేను చూసిన భవనాల్లోకెల్లా అతి విలక్షణమయినదా చర్చిభవనం.
అందరం కలిసి కాఫీ తాగాం. నాకు రోజంతా తోడుగా ఉండి, సమయాన్ని రసభరితం చేసిన ఆ అన్నదమ్ములకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. ముందుగా అనుకున్న గైడ్ ఛార్జీలు రికార్దోకు చెల్లించాను. కార్యక్రమం ఏ ఒడిదుడుకులూ లేకుండా సాగినందుకు అతనూ సంతోషపడ్డాడు. నన్ను మా గార్డెనియా ఇన్ హోటలు దగ్గర దింపివెళ్ళడానికి ముందుకొచ్చాడు.
ఆనాటి మాటల్లో రికార్దో తనకూ తమ్ముడికీ పోయో కంపేరో (Pollo Campero) అన్న గ్వాతెమాలకు చెందిన ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ రెస్టరెంట్ అంటే ఇష్టమని చెప్పాడు. తమదేశంలో మెక్‌డానల్డ్ రెస్టరెంట్ల కన్నా ఈ కంపెనీ రెస్టరెంట్లంటేనే ప్రజలకు అభిమానం అని చెప్పాడు. వీటికి చెందిన ఎన్నో హోర్డింగులు ఊళ్ళో నాకు కనిపించాయి కూడానూ. ఓసారి వెళ్ళి చూద్దామనిపించింది. ఆ మాట విని రికార్దో ఒక రెస్టరెంట్ దగ్గర ఆగి చికెన్ బర్గర్ తీసుకోడంలో సహాయపడ్డాడు. అది చాలా బావుంది – ఎన్నో రోజుల తర్వాత రుచికరమైన చికెన్ బర్గర్ తిన్నానన్న సంతోషం కలిగింది.
మళ్ళా ఒకసారి ఆ ఊళ్ళోని ప్లాసా సల్బదోర్ దెల్ ముందో అన్న జాతీయ స్మారకచిహ్నం దగ్గర ఆగాం. గ్లోబు మీద నిలిచివున్న క్రీస్తు, ఆ గ్లోబుకు ఆధారపీఠంగా ఎత్తైన వేదిక – ఊళ్ళోని ముఖ్యమైన స్మారకచిహ్నమది.
మర్నాటి ఉదయం నేను ఎంతగానో విని ఉన్న ప్రసిద్ధ ప్రదేశం రూతా దె లాస్ ఫ్లోరెస్ (Ruta de las Flores – పూలదారి) చూద్దామనుకున్నాను. మా గార్దెనియా హోటలు రిసెప్షనిస్టు అక్కడికి ఎలా చేరుకోవాలో ఆ బస్సులు, బస్సు రూట్ల గురించి చక్కని వివరాలు అందించింది.
సాన్ సల్బదోర్‌కు 85 కిలోమీటర్లు పశ్చిమాన ఉన్న ఆ పూలదారి శోధనకు దారిలో వచ్చే సొన్సొనాతె (Sonsonate) అన్నది అనువైన పట్టణం. ఆ ఊరికి సాన్ సల్బదోర్ నుంచి చికెన్ బస్సులు వెళతాయి. సొన్సొనాతె నుంచి మళ్ళా ఔవాచపాన్ (Ahuachapán) అన్న ఊరు వెళ్ళే మరో బస్సు పట్టుకుంటే అది షుమారు పాతిక కిలోమీటర్ల దూరాన ఉన్న పూలదారి లోని గ్రామాల దగ్గర మనల్ని దింపుతుంది.
బ్రేక్‌ఫాస్టు త్వరగా ముగించి మా హోటలు రిసెప్షనిస్టు చెప్పిన ప్రకారం ఒక టాక్సీ పట్టుకొని పదినిమిషాల దూరాన ఉన్న ఆక్సిడెంటల్ (Occidental) బస్ స్టేషన్ చేరుకున్నాను. వెంటనే సొన్సొనాతె వెళ్ళే బస్సు దొరికింది. గంట ప్రయాణం. అరవైనాలుగు కిలోమీటర్లు. ఛార్జి ముప్పావు డాలరు. హోటలు నుంచి బస్ స్టేషనుకు పదినిమిషాల ప్రయాణానికి నేను ఇచ్చింది ఏడు డాలర్లయితే ఈ అరవై కిలోమీటర్ల గంట ప్రయాణానికి ఛార్జి అందులో పదోవంతు! అవును మరి – చికెన్ బస్సులు చవకకు చవక, అనుభవాలకు అనుభవాలు!
సొన్సొనాతె బస్ స్టేషన్ నడిమధ్యన రెండు మూడు వందలమంది పట్టే పెద్ద హాలు ఉంది. దాని మధ్యలో డజన్లకొద్ది టేబుళ్ళు, చుట్టూ చిన్నచిన్న ఫూడ్ స్టాళ్ళు… ఎక్కడో మారుమూలన ఉన్న చిన్న పట్టణంలో అంత పెద్ద ఫూడ్ ప్లాజా ఉండడం వింతగా అనిపించింది. ఆ ప్రాంతాల్లోని ఎన్నో రూట్లకు, ఊళ్ళకూ సొన్సొనాతె కేంద్రబిందువని, ఆ బస్ స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో బస్సులు వచ్చి పోతుంటాయనీ వాకబు చేస్తే తెలిసింది.
ముందే అన్నట్టు రూతా దె ఫ్లోరెస్ శోధనకు సొన్సొనాతె అనువైన ప్రదేశం. అక్కడ 249 నంబరు బస్సు పట్టుకుంటే హుఆయుఆ (Juayúa), అపనేక (Apaneca), అతాకో (Ataco) అన్న అతిచక్కని గ్రామాలు చేరుకోవచ్చు. దారి పొడవునా కొండలు, గుట్టలు, అడవిపూలు… అందుకే ఆ మార్గానికి రూతా దె ఫ్లోరెస్ అన్న పేరు. నవంబర్-ఫిబ్రవరి పూల ఋతువు. అప్పుడు వెళితే అక్కడ పూలే పూలట. నేను వెళుతోంది పూలు పూచే కాలంలో కాకపోయినా ఆ మార్గపు నైసర్గిక సౌందర్యానికేం కొదవ లేదని విన్నాను.
పూల సంగతి అలా ఉంచితే ఆ రూతా దె ఫ్లోరెస్ కొండచరియల ప్రాంతం ఎల్ సల్బదోర్‌లో కాఫీ పంటకు ప్రసిద్ధి. అక్కడి సారవంతమైన భూభాగం అనాదిగా నౌవాత్‌ల్ పిపిల్ (Nahuatl Pipil) అన్న స్థానిక ఇండియన్ల నివాస స్థలం. అక్కడి నేలలో నిన్న మొన్నటిదాకా వాళ్ళు తమకు అవసరమైన మేర తిండిగింజలు పండించుకునేవారు. ఇరవయ్యో శతాబ్దపు తొలిదినాలలో కాఫీ తోటల యజమానుల దృష్టి ఈ ప్రాంతం మీద పడింది. ఇక్కడ కాఫీ పంట వేయడానికి పరిస్థితులు అనువుగా ఉన్నాయని గ్రహించాక మెలమెల్లగా స్థానికులనుంచి భూమిని ఆ యజమానులు హస్తగతం చేసుకున్నారు. వారందరినీ తమ తమ తోటల్లో చవకగా పనిచేసే కూలీలుగా మార్చేశారు. ఏ దేశచరిత్ర చూసినా ఇదేకదా ఆక్రమణ పరిణామక్రమం అనిపించింది.
తన నాణ్యతాపరిమళాల వల్ల ఎల సల్బదోర్ కాఫీ అంతర్జాతీయంగా పేరు పొందింది. పేరుకు తగ్గట్టు చెప్పలేనంత గిరాకీ కూడానూ. 1920లలో అయితే దేశపు ఎగుమతుల్లో తొంభైశాతం కాఫీపంటదే ఉండేది. కాఫీ ద్వారా దేశానికి అందిన సంపదను పధ్నాలుగు కుటుంబాలకు చెందిన కాఫీ తోటల యజమానులే హస్తగతం చేసుకున్నారు. వారందరికీ సాంతా అనా స్థావరమయింది. మిలటరీ పాలకుల ప్రాపకం వారికి ఉండనే ఉంది. తోటలకోసం భూమిని నయానో భయానో స్వాధీనం చేసుకోవడంలో వారిది తీరని దాహం. తరాల తరబడి ఆ నేల మీద జీవిస్తున్న పిపిల్ ఇండియన్ల నుండి భూమిని కొల్లగొట్టడం వారికి మంచినీళ్ళ ప్రాయమయింది. కాని 1920లలో ప్రపంచమంతటా సంభవించిన ఆర్ధికమాంద్యం వల్ల కాఫీ ధరలు పడిపోయాయి. దానివల్ల నిరుద్యోగం పెరిగింది. సమాజంలో అశాంతి నెలకొంది.
ఫరబున్దో మార్తి రష్యన్ బోల్షివిక్ విప్లవంతో ప్రేరణ పొందిన మనిషి. సమాజంలోని అశాంతికి ఒక రూపం ఇచ్చి దాన్ని తిరుగుబాటుగా మలచిన విప్లవ ప్రజానాయకుడు. అప్పటిదాకా దారుణమైన దోపిడీకి గురైన పిపిల్ ఇండియన్లు మార్తి నాయకత్వంలో గొడ్డళ్ళు, కొడవళ్ళు, పలుగూ పారలు చేతబట్టి మిలటరీ పాలకుల మీద తిరగబడ్డారు. వ్యవస్థకు చెందిన రెండు వేలమందిని వధించారు. ఆనాటి మిలటరీ అధినేత ఎర్నాందెజ్ మార్తీనెజ్ (Maximiliano Hernández Martínez) ఉక్కుపాదంతో తిరుగుబాటును అణచివేశాడు. ఆ ప్రక్రియలో నలభై వేలమంది ప్రాణాలు కోల్పోయారని ఒక అంచనా. అందులో అధిక సంఖ్యాకులు దేశవాళీ రైతులు. నిరాయుధులు. సల్బదోర్ చరిత్రలో అది ఒక చీకటి ఘట్టం. 1930ల తొలిదినాలలో జరిగిన ఆ ఊచకోతను ల మతాన్స (La Matanza – the massacre) అని వ్యవహరిస్తుంటారు. విప్లవ నాయకులనందరినీ – ఫరబున్దో మార్తితో సహా – వేటాడి పట్టుకొని కాల్చి చంపారు. ఆనాటి దారుణ మారణకాండలో సల్బదోర్ జనాభాలో నాలుగుశాతం ప్రాణాలు కోల్పోయారట.
పొరుగున ఉన్న గ్వాతెమాల, ఓందూరాస్ దేశాలలో ఉన్నట్టుగా కాకుండా ఎల్ సల్బదోర్ ప్రజల రూపురేఖలు ఎక్కువగా యూరోపియన్లను పోలి ఉన్నాయనిపించింది. కాస్తంత పరిశోధన తర్వాత అక్కడి జనాభాలో ఎనభై ఆరుశాతం మెస్తీహోలు అని, పదమూడు శాతం యూరోపియన్లు అని, ఒకే ఒక్కశాతం నేటివ్ ఇండియన్లనీ తెలిసింది. నేటివ్ ఇండియన్లు అంత తక్కువగా ఉండటానికి వారి పేదరికం, పోషణహీనతలు మాత్రమే కారణం కాదు… ల మతాన్స దారుణకాండలో ప్రాణాలు కోల్పోయిన వారిలో నేటివ్ ఇండియన్ల నిష్పత్తి చాలా ఎక్కువ. అసలు ఆ రోజుల్లో వారికి తమ మూలాలు చెప్పుకోవడమే ఒక భయంకర శాపంగా పరిణమించింది. అంచేత ఆ ఊచకోత లోంచి బైటపడ్డవారు తమ ఆచార వ్యవహారాలను, వస్త్రధారణనూ గుర్తు పట్టలేనంతగా మార్చుకొని తాము కూడా మెస్తీహోలుగా గుర్తింపబడేలా జాగ్రత్తలు పడక తప్పలేదు.
సొన్సొనాతెలో బస్సు దిగాక ఒకరిద్దరిని అడిగి 249 బస్సు ఆగే ప్లాట్‌ఫామ్ చేరుకోగలిగాను. అక్కడ బస్సు రెడీగా ఉంది. నాలుగోవంతే నిండి ఉంది. యథాప్రకారం ప్రతి ఐదు వందలమీటర్లకూ ఒకసారి ఆగి ఆగి పాసెంజర్లను ఎక్కించుకొంది. సొన్సొనాతె పొలిమేరలు చేరేసరికల్లా కిక్కిరిసిపోయింది. నా తదుపరి మజిలీ అయిన హుఆయుఆ అక్కణ్ణుంచి ఇరవై కిలోమీటర్లు. నలభై నిమిషాలు.
ఓ భారీకాయుడి పక్కన కూర్చున్నాను. అతనిలోనూ సంభాషణా కుతూహలం కనిపించింది కాని మరోసారి భాష అవరోధమయింది. ఉంది కదా దానికి విరుగుడు! ఇద్దరం గూగుల్ ట్రాన్స్‌లేట్ సహాయం తీసుకున్నాం. ఆ సాఫ్ట్‌వేరు, స్మార్ట్‌ఫోన్‌ల హార్డ్‌వేరు మేళవింపుతో మా మాధ్య సంభాషణ సరళంగా సాగిపోయింది. అతని పేరు అలెక్స్. హుఆయుఆలో పొలీసు అధికారి. ఇరవయి యేళ్ళనుంచి పొలీసు డిపార్ట్‌మెంటులో పని చేస్తున్నాడట. దేశంలోని పెద్ద నగరాలతో పోలిస్తే ఈ కొండప్రాంతపు పల్లెటూళ్ళలో నేరాలు చాలా తక్కువ అని చెప్పుకొచ్చాడు. భారతదేశం గురించి కుతూహలంతో ఎన్నో ప్రశ్నలు వేశాడు. సమాధానాలు చెప్పాను. ఇద్దరం హుఆయుఆలో దిగిపోయాం. ప్రపంచంలోని అందరు మంచి పొలీస్ అధికారుల్లానే అలెక్స్ కూడా తన ఫోన్ నంబరు ఇచ్చి ‘నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చెయ్యి; మరీ ముఖ్యంగా ఎక్కడైనా భద్రతకు సంబంధించిన ఆందోళన ఎదురయితే తప్పకుండా చెయ్యి’ అన్నాడు. ఆ ఊరి ముఖ్యకూడలి దాకా నాకు తోడుగా వచ్చి వీడ్కోలు పలికాడు.
హుఆయుఆ ముఖ్యకూడలిలో ఒక పచ్చదనాల పార్కు. అప్పటికే ఎండ ముదరడం మొదలయింది… పార్కులోని చెట్ల నీడన ఎంతోమంది సేద తీరుతూ కనిపించారు. ఆ కూడలిలో ఒక పక్కన సాంతా లూసియా అన్న వలసపాలన నాటి ముచ్చటైన చర్చి భవనం కనిపించింది. ఆ చర్చిలో నేను అప్పటికే ఎంతగానో విని వున్న నల్లని క్రీస్తు విగ్రహం చూశాను.
వారాంతాల్లో జరిగే ల ఫెరీయా గాస్త్రొనోమికా (La feria Gastronomica) అనే భోజనోత్సవానికి హుఆయుఆ ప్రసిద్ధి. అనుకోకుండా ఆ రోజు శనివారం. వారాంతాల్లో సాంతా అనా, సాన్ సల్బదోర్ లాంటి దూరప్రాంతాలనుంచి కూడా ఇక్కడి స్ట్రీట్ ఫూడ్ కోసం నాలాంటి భోజనప్రియులు వస్తూ ఉంటారు. సెంట్రల్ ప్లాజా లోని ఒక పొడవాటి రోడ్డు మీద, ఆ రోడ్డుకు అటూ ఇటూ ఉన్న సన్నపాటి సందుల్లోనూ డజన్లకొద్దీ ఫూడ్‌స్టాల్స్ ఉన్నాయి. వాటిముందు ఆరుబయట కుర్చీలూ టేబుళ్ళూ… వీధులన్నిటినీ ఎండ నుంచి కాపాడడానికి పైన పరచిన చాందినీలు – భలే ఏర్పాట్లవి.
ఆ ఫూడ్‌స్టాళ్ళలో రకరకాల ఆహారపదార్థాలు ప్రదర్శన కోసమే అన్నట్టు పరిచివున్నాయి: చేపలు, రొయ్యలు, సాసేజులు, రెడ్ మీట్, లేత మొక్కజొన్న కండెలు, బీన్సు, యుక్కా, పీన్చోస్ – వాటన్నిటినీ చూస్తే ఎవరికైనా లేని ఆకలి పుట్టుకొస్తుంది. వీటిల్లో యుక్కా (Yucca) అన్నది స్థానికంగా పెరిగే వెల్లిపూల తుప్ప. ఆ పూలరేకుల్ని, లేత రెమ్మల్నీ తగురీతిలో వండుకొని స్థానికులు ఆరగిస్తారు. పీన్చోస్ (Pintxos) అన్నవి మనం తినే ఫింగర్ ఫూడ్స్ లాంటివి; సింగిల్ బైట్స్, రకరకాలవి, పళ్ళు కుట్టుకునే పుల్లలకు గుచ్చి ఉంటాయి, అందుకని వాటికా పేరు. ఇవన్నీ కాక ఓ పక్కన మొక్కజొన్న రొట్టెలు, వాటిల్లోకి బీన్సు, చీజూ చొప్పించి చేసే పపూసాలూ తాజాగా తయారవుతున్నాయి. మన ఆర్డర్ ప్రకారం వీటన్నిటినీ మేళవించి మనకు వండి వడ్డిస్తారు. రొయ్యలు, వేయించిన యుక్కా తూళ్ళు, మొక్కజొన్న రొట్టెలూ కలగలసిన వంటకాన్ని ఎన్నుకొని ఆర్డరు చేసి ఒక టేబుల్ దగ్గర చేరగిలబడ్డాను. అక్కడి ఖాద్యకేంద్రిత వాతావరణాన్ని ఆస్వాదించడం మొదలెట్టాను.
పక్క టేబులు దగ్గర కూర్చొని ఉన్న ఒక మెహికన్ కుటుంబానికి నేను ఆసక్తికరంగా కనిపించాను. చక్కగా పలకరించారు. మలి యాభైల వయసు దంపతులు, వారి టీనేజి ఆడపిల్లలిద్దరూ – అదీ ఆ కుటుంబం. మెహికో దేశపు ఒహాకా (Oaxaca) నగరం వాళ్ళట. ఇక్కడి పసిఫిక్ సముద్రతీరాన ఉన్న ఒక రిసార్ట్‌లో హాలిడేకి వచ్చి హుఆయుఆ లోని వారాంతపు భోజనోత్సవంలో పాలుపంచుకోడానికి ఆనాడు ఇటు వచ్చారట. అతని పేరు ఎదువార్దో – లాయరు. ఆమె ఎలేనా. స్థానిక ప్రభుత్వోద్యోగి. పిల్లలిద్దరూ హైస్కూలు.
మేము ఆర్డరు చేసిన భోజనం వచ్చేలోగా మాటల్లో పడ్డాం. ఎదువార్దోకి చక్కని విషయపరిజ్ఞానం ఉంది. ఎంతో అందంగా అమాయకంగా కనిపిస్తున్న హుఆయుఆ వెనుక ఎంతటి రక్తసిక్త చరిత్ర ఉందో చెప్పుకొచ్చాడు. ల మతాన్స మారణకాండకు దారితీసిన పిపిల్ ఇండియన్ల తిరుగుబాటు జనవరి 1932లో ఈ హుఆయుఆ లోనే మొదలయిందట. తిరుగుబాటుదారులు మొట్టమొదటగా ఇక్కడి కాఫీతోటల యజమానిని, అతని కుటుంబాన్నీ హతమార్చారట. దానితోపాటు ఇక్కడి మిలటరీ అధికారుల్నీ అంతమొందించి హుఆయుఆను స్వాధీనం చేసుకున్నారట. తిరుగుబాటు కార్చిచ్చులా పక్కనున్న పట్నాలకు వ్యాపించింది. మిలటరీ నియంత మార్తీనెజ్ యు.ఎస్. వత్తాసుతో రంగంలోకి దిగాడు. ఉక్కుపాదాలతో తిరుగుబాటును అణిచివేశాడు. ఫలితం: ల మతాన్స ఊచకోత, వేలాది మరణాలు.
ఈ మతాన్సలు, ఊచకోతలు ఎల్ సల్బదోర్‌కే ప్రత్యేకం అనుకోవద్దు. లాటిన్ అమెరికాలో ప్రతీ దేశానికి ఒక మతాన్స ఉంది అని మృదువుగా హెచ్చరించాడు ఎదువార్దో. అవునవును, మానవుల చరిత్ర అనాదినుంచీ మహారక్తసిక్తం. బలవంతులు బలహీనుల్ని ఊచకోత కోయని ప్రాంతమంటూ ఈ భూమి మీద లేదు అని నేను మాట కలిపాను. ఎలేనా మా మాటలన్నీ ఎంతో శ్రద్ధగా విన్నారు. అపుడపుడు భర్తకు మాట కలిపారు. పిల్లలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ నయనాలను స్మార్ట్‌ఫోన్లకు అంకితం చేశారు. మేమలా మాటల్లో ఉండగానే భోజనాలు వచ్చాయి. భోంచేస్తూ మా సంభాషణ కొనసాగించాం. ఆ చక్కని భోజనం తృప్తిగా ముగించాక ఒకరికొకరం ఆత్మీయంగా వీడ్కోళ్ళు చెప్పుకున్నాం.
భోజనాలయాక బస్టాపుకు వెళ్ళి, పది కిలోమీటర్ల దూరాన ఉన్న నా తదుపరి మజిలీ అపనేకకు మళ్ళా 249 నంబరు బస్సు పట్టుకున్నాను. ఊరు మహాప్రశాంతంగా ఉంది. రాతిపలకల ఊరిదారుల్లో తీరిగ్గా గంటసేపు నడిచాను. ఆ వీధుల్లో ఎన్నో ఆర్ట్ స్టూడియోలు కనిపించాయి. ఆ ఊరు కళాకారుల స్థావరమన్నమాట! ఊరి కేంద్రబిందువు దగ్గర ఒక మహావృక్షం… దాని కొమ్మలూ రెమ్మలూ బృహదాకారపు గొడుగులా పరచుకొని నీడను ఇస్తున్నాయి. అంతగా ఆకట్టుకొనే వృక్షాన్ని నేను చూసి ఎరగను – అది నా మనసు మీద బలమైన ముద్ర వేసింది. అపనేక అనగానే ఆ మహావృక్షమే ఈనాటికీ మనసులో మెదిలేటంతగా ఆ జ్ఞాపకం నాలో నాటుకుపోయింది. సున్నాలు కొట్టివున్న ఒక సాదాసీదా చర్చి పక్కనుంచి నడిచాను. చూడటానికి ఏ ప్రత్యేకతా లేని కట్టడమే అయినా ఎంచేతో అది నన్ను బాగా ఆకర్షించింది. ఆడంబరాలు లేకపోవడమే దానికి విలక్షణమైన సొగసును సమకూర్చిందనుకుంటాను.
అపనేకలో నడకలు సరిపెట్టి అతాకో వెళ్ళడానికి రోడ్డు మీదకు వెళ్ళి బస్సు పట్టుకున్నాను. అరగంట ప్రయాణం. ముచ్చటైన గ్రామం. రాతిపలకల వీధులు. రంగురంగుల ఇళ్ళు. కాసేపు గడిచేసరికి మ్యూరల్స్ ఆ ఊరి ప్రత్యేకత అని బోధపడింది. ఒక ప్లాన్ అంటూ లేకుండా ఊరి వీధుల్లో తిరిగాను. మరిన్ని రంగులు, మరిన్ని మ్యూరల్స్. ఊరి సెంటర్లో దైనందిన కార్యకలాపాలు ఎంతో చురుగ్గా సాగుతున్నా వాతావరణంలో ఏ రకమైన ఒత్తిడీ ఉద్రిక్తతలు లేవు. గ్వాతెమాల లోని ఆంతీగా నగరం గుర్తొచ్చింది.
అతాకో వీధుల్లో చాలా ఫూడ్‌స్టాల్స్ ఉన్నాయి. అక్కడ దొరుకుతున్న రీగ్వాస్ అన్న వంటకం నన్ను ఆకర్షించింది. రీగ్వా అనేది అరటి ఆకుల్లో మొక్కజొన్న పిండిలో బీన్సు (ఫ్రిహోలెస్) కలిపి ఉడికించిన వంటకం (riguas con frijoles). బీన్సు అనే కాదు, మన అభిరుచిని బట్టి రకరకాల మాంసాలతోపాటు ఆ వంటకంలో ఏమైనా చేర్చుకోవచ్చు: రీగ్వాస్ కాన్ క్రేమా (crema – మీగడ), – కాన్ కేసో (queso – చీజ్), – కాన్ పోయో (pollo – చికెన్) ఇలా. ఆ రిగ్వాస్ వంటకపు మూలాలు మాయన్ నాగరికత కాలాలకు చెందినవి. ముందు ఒక రీగ్వా ఆర్డర్ చేసి చూశాను. అది నచ్చి మరొకటి తెప్పించుకున్నాను. అతాకో వీధుల్లో కూడా ఒక గంటసేపు తిరుగాడి ఆ వాతావరణాన్ని మనసుకు పట్టించుకున్నాను. నేను చూసిన మరో ప్రశాంత సుందరగ్రామమీ అతాకో.
దేశంలోని సాన్ సల్బదోర్, సాంతా అనా లాంటి నగరాలతో పోలిస్తే నేనారోజంతా గడిపిన మూడు గ్రామాలు బాగా మారుమూల ఉన్నట్టు లెక్క. నగరాలు వేగానికీ గందరగోళానికీ నిలయాలయితే ఈ గ్రామాలు నింపాదితనానికి, ప్రశాంత వాతావరణానికీ ప్రతీకలు.
సాయంత్రం అయిదయింది. వెనక్కుమళ్ళే సమయమయింది. మళ్ళా 249 బస్సు పట్టుకొని అపనేక, హుఆయుఆల మీదగా సొన్సొనాతె చేరుకున్నాను. ప్రతీచోటా ఆగడం, ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు షరామామూలే. రెండు గంటల ప్రయాణం.
సాన్ సల్బదోర్ వెళ్ళే బస్సు కోసం సొన్సొనాతెలో అరగంటకు పైగా ఎదురు చూడవలసి వచ్చింది. రాత్రి ఎనిమిదయిపోయింది. వీధుల్లో దుకాణాలు, ఫూడ్‌స్టాల్సూ ఒకొటొకటిగా మూత పడుతున్నాయి. మెల్లగా నాతోపాటు బస్సు కోసం ఎదురు చూస్తోన్న ఒక ప్రయాణికుడితో మాటలు కలిశాయి. అమెరికాలో ఎక్స్‌పాట్‌గా నివసిస్తున్న మనిషి అతను. పేరు హూలియో. ‘మనం సాన్ సల్బదోర్ చేరేసరికి బాగా లేటవుతుంది. ఇక్కడే ఏమన్నా తిని వెళ్ళడం బెటరు. ఆ టైములో సాన్ సల్బదోర్ వీధుల్లో తిరుగాడడం ఏమంత మంచిది కాదు’ అన్నాడు హూలియో. నిజమేననిపించింది. బస్ స్టేషన్ లోని ఫూడ్‌స్టాల్‌లో వేడి వేడి పపూసాలు తీసుకుని అక్కడే తినేశాను. ఫ్లోరిడాలో తన బతుకు గురించి హూలియో చెప్పుకుంటూ వెళ్ళాడు. బస్సు పాన్ అమెరికన్ హైవే మీదుగా ప్రయాణించి సాన్ సల్బదోర్ చేరుకుంది. ఆ దేశంలో అది నా చిట్టచివరి చికెన్ బస్సు ప్రయాణం.
మర్నాడు ఉదయం నాలుగు గంటలకు టాక్సీ తీసుకొని ఎయిర్‌పోర్టుకు వెళ్ళాను. నలభై నిమిషాల ప్రయాణం. నికరాగ్వా దేశపు రాజధాని మనాగ్వా (Managua) నగరానికి నా ప్రయాణం. అబియాంకా (Avianca) అన్న ఎయిర్‌లైన్స్ వారి విమానం. ముందు ఎల్ సల్బదోర్‌కు నికరాగ్వాకు రోడ్డు ప్రయాణమే పెట్టుకుందామనుకున్నాను. వాకబు చేస్తే సాన్ సల్బదోర్ నుంచి మనాగ్వాకు ఒకే ఒక్క బస్సుందని తెలిసింది. పైగా అది ఓందూరాస్ మీదుగా వెళుతుందట. అంతర్జాతీయ సరిహద్దులు ఒకటికి రెండుసార్లు దాటాలి. అంతాకలసి పదకొండు గంటల ప్రయాణం. ఇమిగ్రేషన్ కౌంటర్ల దగ్గర అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పడితే అది పన్నెండూ పదమూడు గంటలు కావచ్చు. అంచేత రోడ్డు ప్రయాణం ఆలోచన పక్కన పెట్టి విమానయానానికి ఉపక్రమించాను. అదయితే గంటలో గమ్యం చేరుకోవచ్చు.
ఎయిర్‌పోర్టులో చీజూ బీన్సూ నింపిన పపూసాలు బ్రేక్‌ఫాస్ట్‌గా తిన్నాను. పపూసాల దేశంలో నేను తిన్న చిట్టచివరి పపూసాలవి.
విమానంలో విండో సీట్ అడిగితే 1-ఎ ఇచ్చారు. నిజానికి అది ప్రీమియం సీటు. పక్క సీట్‌లో అనస్తాసియా అన్న యువతి. మాటల్లో పడ్డాం. గ్రాఫిక్ డిజైనరు. తండ్రి తరఫువాళ్ళది జర్మనీ దేశం. ఈమె తన భర్తతో కలిసి సాన్ సల్బదోర్‌లో నివసిస్తోంది. వాళ్ళ తాతగారు సీమెన్స్ కంపెనీ ఉద్యోగిగా ఎన్నో దేశాలలో పనిచేశారు. ఎల్ సల్బదోర్‌లో కూడా చాలా యేళ్ళు ఉన్నారు. ఆ సమయంలో అనస్తాసియా వాళ్ళ నాన్నగారు ఎల్ సల్బదోర్ యువతిని పెళ్ళి చేసుకున్నారు. ఆయనో రేడియాలజిస్టు. ఆయన కూడా అనేక ప్రదేశాలలో పనిచేసి చివరికి స్పెయిన్ దేశపు మయోర్కా (Mallorca/Majorca) ద్వీపంలో స్థిరపడ్డారు. ఈమె టీనేజ్ దశలో వెళ్ళి స్పెయిన్‌లో కొంతకాలం ఉంది. ఒక ఏడాదిపాటు యు.కె. లోని మెయిడ్‌స్టోన్ లోనూ ఉంది. చివరికి ఎల్ సల్బదోర్‌లో స్థిరపడింది. తన చిన్నప్పటి స్నేహితులు, అమ్మ తరఫు బంధువులు, భర్తవేపు వాళ్ళు – అంతా ఎల్ సల్బదోర్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఆఫీస్ పని మీద మైయామి వెళుతోంది. ఆమెది జర్మన్ పాస్‌పోర్టు.
ఇద్దరం మేం చేసిన ప్రయాణాల గురించి మాట్లాడుకున్నాం. కాసేపటికల్లా ఎల్ సల్బదోర్ లోని నేరాల వైపు, రక్షణా భద్రతల వైపూ మా సంభాషణ మళ్ళింది. యాత్రల విషయంలో బాగా అనుభవమున్న నా స్నేహితులు కొందరు ఎల్ సల్బదోర్‌లో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం గురించి, మధ్య అమెరికా ప్రమాణాల దృష్ట్యా చూసినా ఈ దేశం నేరాల పట్టికలో పైమెట్టున ఉండటం గురించీ నన్ను హెచ్చరించారన్న విషయం ఆమెతో పంచుకున్నాను.
‘మా జర్మన్ తాతగారిది కూడా ఇదే మాట. ఎందుకా ప్రమాదాల దేశంలో ఉంటావ్. ఇంకెక్కడైనా వెళ్ళి ఉండవచ్చు కదా అంటూ ఉంటారు’ అని చెప్పుకొచ్చింది అనస్తాసియా. నాకేమీ ఏ ప్రమాదమూ కనిపించదు. నేను నా జీవితంలో ఎక్కువ కాలం గడిపింది ఇక్కడే. రక్షణా భద్రతా సమస్యలని నాకు ఎప్పుడూ అనిపించలేదు అన్నదావిడ. ‘మీరు ఒక్కరే ప్రయాణాలు చేస్తున్నారు కదా – ఎల్ సల్బదోర్‌లో మీకేమైనా భయాలూ సంకోచాలూ కలిగాయా?’ అని అడిగింది. లేదని ఒప్పుకున్నాను. అయినా నేనక్కడ గడిపింది రెండు రోజులే కాబట్టి, ఆ విషయంలో అటుగానీ ఇటుగానీ నిర్ధారించి చెప్పడం సబబు కాదనిపించింది.
ప్రయాణాల్లో రక్షణ, భద్రత అన్నవి చర్చనీయమైన అంశాలు. ఉదాహరణకు, యు.ఎస్. లోనూ యు.కె. లోనూ ఉండే పాశ్చాత్యులకు ఇరాన్ చాలా ప్రమాదకరమైన దేశం అనిపిస్తుంది. నేను 2015లో ఇరాన్ వెళ్ళాను. నాకు ఆ దేశం ఎంతో భద్రమైన ప్రదేశం అనిపించింది. అలాగే యు.ఎస్. అన్నది చాలామందికి – ముఖ్యంగా భారతీయులకు – కలల గమ్యం. ఈ మధ్య నేను కుటుంబాన్ని తీసుకొని సౌత్ ఆఫ్రికా వెళదామనుకుంటున్నప్పుడు నా శ్రేయస్సు కోరే ఒక ఇంగ్లిష్ మనిషి ‘జాగ్రత్త. అదో ప్రమాదాలు నిండిన దేశం యు.ఎస్.ఎ. లాగా’ అని హెచ్చరించాడు! ఆ మాట ఆయన ఎంతో అక్కరతో నా క్షేమం కోరే అన్నాడు. ఆయన ఆ మాటల వెనక మనం తరచూ వినే ‘అమెరికాలో తుపాకీ కాల్పులు’ లాంటి వార్తలు ఉన్నాయి. అంచేత రక్షణ, భద్రత అన్న విషయాలలో మనమన అవగాహనలు ఎంతగానో విభేదించే అవకాశం ఉంది.
నా యాత్రానుభవాల నేపథ్యంలో ఒక మాట చెప్పగలను: పరాయి దేశాలకూ ప్రాంతాలకూ వెళ్ళినప్పుడు నలుగురు నడిచే దారులు వదిలి పెడబాట పట్టకుండా ఉంటేనూ, నైట్ లైఫ్ అంటూ మరీ దూసుకుపోకుండా ఉంటేనూ, చట్ట వ్యతిరేక కార్యాల జోలికి పోకుండా ఉంటేనూ, సాంస్కృతికంగా అసహనం, అపరిపక్వతా ప్రదర్శించకుండా ఉంటేనూ రక్షణా భద్రతల గురించి దిగులు పడాల్సిన అవసరం ఉండదు. ప్రపంచంలో ఎక్కడైనా యాత్రికులను సమాదరించడం, వారి జోలికి అనుచితంగా వెళ్ళకపోవడం నేను గమనించాను. కొన్ని కొన్ని దేశాలలో అక్కడికి వెళ్ళే పాత్రికేయులకు, ప్రభుత్వోద్యోగులకూ అక్కడి అధికారులతో సమస్యలు తల ఎత్తవచ్చు. ముఖ్యంగా ఆయా దేశాల మధ్య దౌత్యసంబంధాలు సజావుగా లేనప్పుడు ఈ సమస్య వస్తుంది. కానీ నాలాంటి డాక్టర్ల విషయంలో ఎక్కడైనా ఎవరైనా మమ్మల్ని పట్టించుకోకుండా మా మానాన మమ్మల్ని ఉండనిస్తారు.
అనస్తాసియాతో గంటసేపు తెలియకుండా గడిచిపోయింది. ప్రయాణాల్లో నాకు ఎంతోమంది ఆసక్తికరమైన మనుషులు కలిశారు. ప్రయాణాల్లో సమమనస్కులతో స్నేహం ఇట్టే కుదిరిపోతుంది. అలా నాకు తటస్థపడి స్నేహం పంచినవారిలో కొంతమందిది విలక్షణ నేపథ్యం, వ్యక్తిత్వం. మనం వాళ్ళను మళ్ళా కలవక పోవచ్చు; అయినా వాళ్ళు మనమీద చెరగని ముద్ర వేస్తారు. చిరకాలం మన జ్ఞాపకాల్లో ఉండిపోతారు. నిజానికి ప్రయాణాల్లో మన మనస్తత్వం, వ్యక్తిత్వం ఏ అడ్డంకులూ అవరోధాలూ సంకోచాలూ లేకుండా వ్యక్తమవుతుంటుంది. సమాజం – ఒక్కోసారి మనకు మనమే – వేసే ముసుగులూ తొడుగులూ తొలిగిపోతాయి. అడ్డుగోడలు కరిగిపోతాయి. అవతలి మనిషితో మనం మనంగా వ్యవహరించగలుగుతాం.
సోలో ప్రయాణాల్లో మరింత మరింత స్వేచ్ఛా స్వచ్ఛతా ఉంటాయి. మనమెరిగిన సమాజాన్ని, సామాజిక నేపథ్యాన్ని, ఆడంబరాలు అహంకారాలనూ శుభ్రంగా ఇంట్లోనే అట్టేపెట్టి ఏ సోషల్ బ్యాగేజీ లేకుండా నవజాత శిశువులా ప్రపంచంలోకి అడుగు పెట్టవచ్చు. ఆఫీసు పార్టీల్లోనో, శుభకార్యాలలోనో పదిమందీ కలిసినప్పుడు కొత్తవాళ్ళను పలకరించాలన్నా, వారితో మాట్లాడాలన్నా చాలామందికి సంకోచం కలుగుతుంది. అలాంటి సంకోచాలు ప్రయాణాల్లో కలిసిన మనుషుల విషయంలో ఉండనే ఉండవు. పరస్పర కుతూహలాలు ఉంటాయి. స్నేహభావనలు ఉంటాయి. ఏ మోతబరువూ లేకుండా స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతాం. అవతలి వారి రాజకీయ సాంస్కృతిక నమ్మకాలకూ విలువలకూ భంగం కలిగించకుండా జాగ్రత్త పడగలిగితే వారితో మనసు విప్పి ఎన్ని విషయాలైనా పంచుకోవచ్చు.
ఇలాంటి సంపర్కాలూ సంభాషణల విషయంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ముడిపడి ఉంది. ఆసక్తికరమైన మనుషులు తటస్థపడి వాళ్ళతో మాటలు మొదలుపెట్టినప్పుడు ఆ సంపర్కం కొద్దిపాటి సమయానికే పరిమితం, ఒకసారి ప్రయాణం ముగిసి విడివడ్డాక మళ్ళా ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోక పోవచ్చునన్న స్పష్టత ఇద్దరికీ ఉంటుంది. ఆ ఎరుకవల్ల ఒకరి గురించి ఒకరు వీలైనంత ఎక్కువగా స్పష్టంగా తెలుసుకోవాలన్న తొందర ఉంటుంది. ఆ ఉన్న కాస్త సమయంలో మనకున్న ఉత్తమ అనుభవాలను, ఆలోచనలనూ వ్యక్తపరుస్తాం. సహజంగానే ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు ప్రత్యేకమైన బాణీలో సాగుతాయి. మనమీద గాఢమైన ముద్ర వేస్తాయి.
విమానం మనాగ్వా విమానాశ్రయంలో దిగింది. మధ్య అమెరికాలో ఐదవ దేశం చేరుకున్నానన్నమాట. నికరాగ్వా ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీలు, పన్నెండు యు.ఎస్. డాలర్ల ఎంట్రీ ఫీజు చెల్లింపులూ ముగిశాక నేను చెకిన్ చేసిన పెద్ద బ్యాక్‌ప్యాక్‌ను తీసుకుందామని బెల్ట్ దగ్గరికి వెళ్ళాను. నలభై అయిదు నిమిషాలు గడిచి తోటి ప్రయాణీకులందరూ తమ తమ లగేజీలు తీసుకొని వెళ్ళిపోయాక నా కళ్ళకు ఒక కఠోరసత్యం గోచరించింది.
నా బ్యాక్‌ప్యాక్ తన గమ్యం చేరలేదు.
(సశేషం)