ఇక్కడ గమనించవలసింది ఏమంటే, డెత్ బై వాటర్‌ను ఎలియట్ తన మిత్రుడి మరణంతో కలిగిన శోకంలో, తన వివాహవైఫల్యంలో మొదలుపెట్టాడు. ఆ ప్రారంభభాగాన్ని పౌండ్ కత్తిరించేశాడు. ఎలియట్ వద్దనలేదు. ఏమిటి దీని అర్థం పరమార్థం? కవి లేకుండా, కవి కష్టసుఖాలు, కవి అనుభూతి లేకుండా, కవిత్వం లేదు.
అక్టోబర్ 2023
పుస్తక ప్రచురణ ఒక అరుదైన గౌరవం అనుకునే రోజుల నుండీ, నా అల్లిబిల్లి రాతలన్నీ నా సంతోషం కోసం నేనే అచ్చు వేసుకుంటానని ఎవరికి వారే ఓ ముల్లెతో ముందుకు వస్తున్న రోజుల దాకా ప్రచురణ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అవి అక్కడే ఆగితే ఎవరికీ పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ, నా పుస్తకాలు ఎవరూ కొనట్లేదు, తెలుగులో సాహిత్యాభిలాష కనుమరుగయింది, ఉచితంగా ఇచ్చినా ఎవరూ ఒక మంచిమాట చెప్పరు, పత్రికలు గమనించి సమీక్షలు రాయవు, ఆ ప్రచురణకర్తలు ఎన్ని అమ్మారో ఆ డబ్బు ఏమైందో చెప్పరు అంటూ వాపోయే రచయితల రద్దీ గత కొంతకాలంగా ఎక్కువయింది. మార్పు ఎలా అయితే అనివార్యమో, మార్పు తాలూకు ప్రభావాలను అన్ని కోణాలనుంచీ విశ్లేషించుకోవడమూ అంతే అనివార్యం. ప్రచురణ నాణ్యత, రచన నాణ్యత అన్నవి ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు. ప్రచురణలో నాణ్యత సరే, తమ రచనలో నాణ్యతను నిజాయితీగా అంచనా వేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది? కొన్ని కవితలనో, కథలనో, తమ అభిప్రాయాలనో కూర్చుకుని ఏ బుక్ ఎక్జిబిషన్ కోసమో హడావుడిగా ప్రచురించుకునే ముందు, అందులో సాహిత్యపు విలువ ఎంత అన్న ప్రశ్న వినపడే వాతావరణం ఇంచుమించుగా పోగొట్టుకున్నాం. ఇందుకు రచయితల అహాలు, అపోహలు తప్ప వేరే కారణాలు లేవు. తమ వాక్యాన్ని, తమ వస్తువుని నిశితంగా, నిరాపేక్షగా అంచనా వేసుకోలేని వారు, నా రచనను ఇంకెవరూ విమర్శించలేరు అని అహం ఒలకపోస్తారు. పొగడ్త లేకున్నా బతుకుతుంది కాని విమర్శ లేకుంటే సాహిత్యం బతకదని వీరికి తెలియదు. అందుకే వీరు తమ రచనలను పత్రికలకు పంపరు. సంపాదకుల సూచనలు, పరిష్కరణ పట్ల ఏవగింపు, ఆవేశంలో పెల్లుబికిన రచనలో ఉండే నిజాయితీ పరిష్కరణలో పోతుందన్న అజ్ఞానం, ఇంకా సాహిత్యసమాజంలో విస్తృతంగానే ఉన్నాయి. శబ్దవమనం సాహిత్యం కాదని చెప్పడానికి మనకి గురువులంటూ ఎవరున్నారు తాలు సాహిత్య పీఠాధిపతులు, రాయాలి రాయండని ఎగదోసే ముఠాకోర్లూ తప్ప! చాలా మంది రచయితలు బెంగపడుతుంటారు కాని, వాక్యం శ్రద్ధగా రాస్తే నిజాయితీ మాయమవడం, పదును పెడితే రచన విలువ పోవడం ఉండవు. పరిష్కరణ రచన డొల్లతనాన్ని రచయితకు పట్టిస్తుంది, అంతే. వాక్యపుబలిమితో కథలు చెప్పి మెప్పించిన రచయితలు మనకు లేరా? వారెవరూ ఆదర్శం కాదా? అసలు సంగతేంటంటే ఈ తరహా రచయితలది మేకపోతు గాంభీర్యం. విమర్శ అంటే జంకు. వాక్యం మీద శ్రమను వెచ్చించడానికి బద్ధకం. అర్థరాహిత్యాన్ని ప్రశ్నిస్తే వివరణ ఇవ్వడానికి అహం. అనవసరమైన పదాలో వాక్యాలో తీసేయమంటే ఎందుకు ఉంచాలో చెప్పలేని అయోమయం. రాయలేమన్న నిజాన్ని అంగీకరించడం రాసేవాళ్ళకు కష్టం. ఆ నిజం చెప్పినవారిపై తమ గొంతు నొక్కుతున్నారని అఘాయిత్యం చేయడం సులభం. అలా చేస్తూ కూడా, ప్రచురణకర్తలు తమ రచనలు ప్రచురించరేమని ప్రశ్నించే రచయితలు కొందరు. తమ రచనలకు ఇవ్వాల్సిన రాయితీలు, పారితోషకాలు ఇతర దేశాల్లో మాదిరిగానో, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానో లేవని వాపోయే వారు ఇంకొందరు. ఇతర దేశాల్లో ఉన్న పబ్లిషింగ్ హౌస్‌లు ఎన్నెన్ని నియమాలతో ఫుస్తక ప్రచురణ అంగీకరిస్తాయో, రచన నాణ్యతకు సంబంధించి ఎన్ని కఠినమైన పరిశీలనల్లో నెగ్గాలో వీళ్ళకు తెలుసని అనుకోలేం. తెలుసుకునే ఆసక్తి ఉందనీ ఆశించలేం. ఇక్కడ రచయితలకు ప్రచురణకర్త సమయం పట్ల, అతని వనరుల పట్లా చిన్నచూపు, తమ సాహిత్యస్థాయి పట్ల మాత్రం అమితమైన విశ్వాసం. అందుకేనేమో, నా పుస్తకాన్ని ఒక పాఠకుడు తన సమయమూ ధనమూ వెచ్చించి ఎందుకు చదవాలి? అని వీరెవరూ తమను తాము ప్రశ్నించుకోరు. పుస్తకం అమ్ముడు పోవాలంటే అది అచ్చులోకి రాకముందే మంచి రచయితగా పాఠకులలో గుర్తింపు తెచ్చుకోవడం ఒక పద్ధతని గుర్తించరు. సాహిత్య పరిశ్రమ, సాధనతో కూడిన రచన, పత్రికలకు పంపడం, పరిష్కరణ, ప్రచురణ, తద్వారా సమకాలీనులలో తమ రచనల పట్ల ఏర్పడే ఆసక్తి, గౌరవం, ఆదరణ, దరిమిలా ప్రచురణకర్తల ఆహ్వానం – ఇలా ఎన్నో మెట్లు దాటి ప్రచురించబడిన పుస్తకానికి, ఏ మెట్టు ఎక్కని పుస్తకానికీ ఎంతో తేడా ఉంటుంది. ఆ తేడా తెలుసుకోకుండా తమ పుస్తకాలు అమ్ముడు పోవటం లేదని ప్రచురణకర్తలను, పాఠకులనూ ఆడిపోసుకోవడంలో అర్థం లేదు. పుస్తకం అన్నది రచన, ప్రచురణ కలిసి జీవం పోసుకొనే కళాత్మక వస్తువు. ఆ రెండు విలువలూ పరస్పర పూరకంగా ఉంటేనే అంతిమంగా కళకు విలువ. శ్రీరమణ ఒక రచయితకు ముందు మాట వ్రాస్తూ ఇలా అన్నారు: “మనం ఒక పుస్తకం అచ్చుకి ఇస్తున్నాము అంటే దాని అర్థం, ఒక వెదురు పొదను సమూలంగా నాశనం చేస్తున్నామని. ఒక వెదురు పొద పచ్చగా బ్రతకాలా? లేదా మీ పుస్తకం బయటికి రావాలా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.” పుస్తకాలు అచ్చు వేసుకుంటున్న ఎందరో తెలుగు రచయితలకు ఈ విజ్ఞత అత్యవసరం.
గ్రనాద నడకరాయుళ్ళ స్వర్గసీమ. పెద్దగా దూరాలేమీ లేవు. ఏ వీధిని చూసినా రంగులీనుతూ కళకళలాడుతూ కనిపించింది. నాలో ఉత్సాహం నింపింది. ఎలాంటి అభద్రతాభావమూ కలుగలేదు. జనజీవితం నింపాదిగా సాగిపోతోంది. మనుషులు సౌమ్యుల్లా కనిపించారు. ఆప్యాయంగా పలకరించారు. స్నేహంగా సాయపడేవారిలా అనిపించారు.
మా ఊళ్ళో రథయాత్ర పూరీలో జరిగే రథయాత్ర లాగా ఘనంగా చేస్తారు. దాసన్నపేట చివారన రథాన్ని పెడతారు. మూడు కోవెళ్ళ ముందు, కన్యకాపరమేశ్వరి గుడి ముందూ ఊళ్ళోనూ రథాలు పెడతారు. అవీ పెద్ద రథాలే. దాసన్నపేట దూరం అనుకున్నవాళ్ళు ఊళ్ళో పెట్టిన ఈ రథాల దగ్గరికి ఎవరికి వీలైన చోటుకు వారు వెళతారు.
మేరే ప్యారే జవానోఁ… చెరగని చిరునవ్వుతో మీరు సమర్పించిన మీ విలువైన యవ్వనాన్ని ఈ దేశమే కాదు, ఆ దేవుడు కూడా మీకు తిరిగి ఇవ్వలేడు. కొద్ది రోజుల్లో మీరు ఈ రెజిమెంట్‌కీ, భారతీయ సైన్యానికీ వీడ్కోలు పలికి, ఇన్నేళ్ళూ మీరు సగర్వంగా ధరించిన మీ యూనిఫామ్‌ని మీ ఇంట్లో హాంగర్‌కి తగిలించబోతున్నారు. భారతీయ సైన్యం నుంచి రిటైర్ అవుతున్న మీరు అందించిన సేవలకి, ఈ దేశం మీకు సదా ఋణపడి ఉంటుంది.
నా సమస్య కొంతమందికి నవ్వులాట. కొంతమంది శ్రేయోభిలాషుల్లా సలహాలు కూడా ఇచ్చారు. ఇంకొంతమంది వెటకారాలు చేస్తారు ‘ఏంటి, ఈ సారి ఏమైంది’ అని. శరవణన్ మాత్రం ఎప్పుడూ సలహాలు ఇవ్వడం, పెద్దగా తీర్పులు చెప్పడం చేసేవాడు కాదు. అది ఒక్క నా విషయంలోనే కాదు. ఎవరి గురించైనా ఆరా తీసినట్లు కాని, ఎవరికైనా సహాయమో, హానో చేసినట్లు కానీ నేను చూడలేదు. అతను తన కోసం తప్ప ఎవరికీ ఏ పని చేయడు.
అన్ని కంప్యూటర్ ఎంట్రీ పాయింట్లకి మనుషులను నియమించాక ఒక మనిషి ఎక్కువగా ఉన్నారని తెలిసింది. అది ఎవరా అని చూసినప్పుడు అతనితోపాటు ఉద్యోగంలో చేరడానికి వచ్చిన ఆ అమ్మాయేనని గుర్తుకు వచ్చింది. ఆమెను రప్పించాడు. ఆమె వణుకుతూ, కంగారుగా వచ్చి అతని గది గాజు తలుపు బయట నిల్చుంది. నెమ్మదిగా ఆమెకేసి చూశాడు. ఆమె వణుకు స్పష్టంగా కనబడుతోంది. గాలిలో ఆకులు అల్లాడుతున్నట్టు వణుకుతోంది అనుకున్నాడు.
దాశరథి ఆధునిక కవితాయుగపు అవతీర్ణభారతి. నిజజీవితం కష్టాలకు పుట్టినిల్లై, జైలుగోడల మధ్య బిగించి పరీక్షపెడితే, అక్కడ మగ్గుతూ పళ్ళు తోముకోవడం కోసం ఇచ్చిన బొగ్గుతో జైలుగోడల మీద పద్యం వ్రాశారు. అంతే కాదు, అర్ధరాత్రి వేరే చోటుకు ఖైదీలని తీసుకుపోతున్నపుడు, మరుసటి రోజుని చూడకుండానే మరణించే అవకాశం ఉన్న ఆ సమయంలో భయపడకపోగా ఆ స్వేచ్ఛామారుతాన్ని చూసి ఆశువుగా పద్యాలు చెప్పారు.
ఇవన్నీ ఇంట్లో మరుగు దొడ్లు లేనివారికి, డబ్బులిచ్చి వెళ్ళలేని వారికే. ఇప్పుడు ధారావిలో ప్రభుత్వం వసూళ్ళ వేటకు, గుళ్ళకు ఏ మాత్రం తీసిపోని, రాజభవనం లాంటి డబ్బులు చెల్లించే మరుగు దొడ్లను తీసుకువచ్చింది. తెల్లారి నాలుగు గంటలకు తెరిచి, రాత్రి ఒంటి గంటకంతా మూసేస్తారు. తెరిచేటప్పుడు మనుష్యులు వచ్చి తెరవమని చెబుతారు. నాలుగు గంటల నుండి ఒక్కొక్కరిగా ఏడు, ఏడున్నరకల్లా గుమిగూడటం మొదలవుతుంది.
రామదాసు అని పిలువబడే కంచెర్ల గోపన్న భక్తిసంగీతమునకు కాణాచి. తఱువాతి కాలములోని త్యాగరాజువలె రామదాసు కూడ తన సర్వస్వాన్ని ఆ శ్రీరామునికే అర్పించాడు. ఆ రాములవారిని స్మరించాడు, నిందించాడు, స్తుతించాడు. రామదాసు ఎన్ని కీర్తనలను వ్రాసినాడో మనకు తెలియదు. సుమారు 250 – 300 అని అంచనా. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము కొన్ని రామదాసు కీర్తనలలోని ఛందస్సును అందరికి తెలియబరచడమే.
ఇప్పుడూ అదే అంటున్నాను, నువ్వు ఎటో వెళ్ళిన తరువాత మిగిలిన నిశ్శబ్దంలో, ఆవరణలోని రాతి అరుగుపై కూర్చుని. అదే వేసవి, అదే ఇల్లు. నీ మోకాళ్ళు కలుక్కుమన్నట్లు చప్పుళ్ళు, ఎండి రాలే వేప ఆకుల్లో, సన్నని కొమ్మల్లో. వెన్నెల రాత్రి కాదు కానీ, వేసవి కాంతి ప్రజ్వలించే పగలు! ఏం చూడగలను నేను? ఇప్పుడేవీ స్పష్టంగా కనపడవు. కనిపించే ప్రతీదానిలోనూ, బొత్తిగా పేరుకున్న ఎప్పటివో చిహ్నాలు. చేతివేళ్ళకు మట్టి. ఖాళీ వీధి. ఎండిన నేల.
కాలం పేర్చిన కపటపు పొరల లోతుల్లో
స్పందనల చిగురాకులు
మనసు మూలల్లో
కనుదెరుస్తూనే ఉంటాయి
ఒక సన్నని సుపరిచిత స్వరమేదో
నిత్యం మౌనరాగమాలాపిస్తూ
గొంతుక సానపెడుతూనే ఉంటుంది.
ఏటవాలుగా ఉన్న నదీ తీరాన్ని ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతున్న ఆ బండ్లను అక్కడ ఉన్న సైనికులు తోసి సాయం చేస్తున్నారు. కాలినడకన వెళ్ళే రైతులు పాదాలు మునిగిపోయేంత దుమ్ము, ధూళిలో అతికష్టం మీద నడుస్తున్నారు. కానీ ఆ పెద్దాయన మాత్రం కదలకుండా అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇంక ముందుకెళ్ళడానికి ఏ మాత్రం వీలుకానంతగా అలసిపోయాడు. రక్షణ స్థావరాల ఆవలి ప్రాంతం పరిశీలించి నేను మళ్ళీ వంతెన దాటుకొని తిరిగి వచ్చాను.
అభేదమే కవిత్వం
పాఠకుడే కవి
బీజాక్షరం మాత్రమే మొదలు
ఊజా బల్ల మీదకి
పిలిస్తే వచ్చే అశరీరవాణి
పండుగనాడు
గద్దె పలుకు
కానీ తిరిగి చిగురవ్వడానికే
కొంచెం ఊపిరి పోసుకోవాలి
ఇంకొంచెం రేపటిని కలగనాలి
ఒంటరి శరమై లోలోన
ఒక యుద్దం పరంపరవ్వాలి
గెలవాలి. వెల్తురు చీలిక చూడాలి
నదుల నీరు ఇంకిపోతే
సముద్రునితో సమైక్యం
ఎండమావి అవుతుంది.
బిగి కౌగిళ్ళ పొగలు
కక్కే వేడి నిట్టూర్పులు
పడకగది దాంపత్యం పత్యం
మంచాలు విడివడిపోవడం సత్యం
బేలూరు చెన్నకేశవాలయం యునెస్కోవారసత్వనిర్మాణములలో శాశ్వతసభ్యత్వగౌరవము లభించిన ఈశుభతరుణంలో నా మహాశిల్పి జక్కనచరిత్రలోని వర్ణనను నేనిక్కడ పునర్మననం చేసికొంటున్నాను. 1992లో ఆ ఆలయమును దర్శించిన తర్వాత కల్గిన అపూర్వమైన ప్రేరణవల్లనే నేను ఈ మహాకావ్యాన్ని వ్రాసినాను.
ఇష్టాల దప్పిక తీరేలా
కోరికలను పిలుచుకుని
కొత్త రుచులతో
మనసు ఆకలిని తీర్చుకుంటారు
ఒకరి అందాన్ని మరొకరు
రెట్టించుకుంటూ పొగుడుకుంటూ
నిలువెత్తు నిజాలని
ఇంద్ర ప్రసాద్ కవితాసంపుటి నుంచి అతనంటాడు కదా అనే కవితలో ‘ఇంకా వసనాలంపటాలెందుకు’ అని చదవగానే ఝల్లుమన్నాయి నా తలపులు. అది చిన్నాచితకా మాట కాదు. దుస్తుల కాపట్యాన్ని నిరసిస్తూ, భౌతిక సౌఖ్యానికి, మానసిక వికాసానికీ నగ్నత్వాన్ని కోరుకోవడం, తద్వారా ప్రకృతితో తిరిగి మమేకం కావడానికి సంబంధించిన నిన్న మొన్నటి భావాన్ని అధిగమించిన మాట.
క్రితం సంచికలోని గడినుడి-83కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేడుగురు సరైన సమాధానాలు పంపారు. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-83 సమాధానాలు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: