క్వెన్క – గుయాకీల్
క్వెన్క విమానాశ్రయం నుంచి మా హోటలు బొటీక్ లాస్ బాల్కనేస్ చేరుకోడానికి పెద్దగా సమయం పట్టలేదు. చూడగానే నచ్చిందా ప్రదేశం. విశాలమైన ప్రాంగణం, పద్ధతిగా వేలాడదీసిన పూలతొట్టెలు, అడుగడుగునా వలసకాలపు వింత శోభ – ఒక్కసారిగా వందలాది సంవత్సరాలు వెనక్కి నడచినట్టనిపించింది.
రిసెప్షన్‌లో ఎద్వార్దో అన్న వ్యక్తి సాదర స్వాగతం పలికాడు. పురాస్మృతులు నిండిన ఆ ప్రాంగణం గురించి అతనికి రెండు మంచిమాటలు చెప్పాను. సంతోషించాడు. ఆ ప్రాంగణం ఒకప్పుడు ఎక్వదోర్‌కు చెందిన 18వ శతాబ్దపు చిత్రకారుడు గస్పార్ సంగురీమాకు (Gaspar Sangurima) చెందినదని, అతను చిత్రకళలోనే కాకుండా శిల్పకళలోనూ ప్రసిద్ధుడని, ఇపుడా భవనాన్ని ఓ వ్యాపారవేత్త కొనుగోలు చేసి హోటలుగా మార్చాడని చెప్పుకొచ్చాడు ఎద్వార్దో. ఆ సంగురీమా వేసిన చిత్రాలు ఎక్వదోర్‌లోని అనేక చర్చిల ప్రాంగణాల్లో మనకు కనిపిస్తాయట. హోటలుగా మార్చిన తర్వాత ఆ ప్రాంగణపు పునరుద్ధరణలో మూలరూపం చెదరకుండా జాగ్రత్తపడ్డారట. అలంకరణ విషయంలో అప్పటి శోభకు ఏ మాత్రం భంగం కలగకుండా శ్రద్ధ తీసుకున్నారని తెల్సింది.
గబగబా హోటల్లో చెకిన్ చేశాను. నా బాక్‌పాక్‌ను గదిలో విడిచిపెట్టి వెంటనే క్వెన్క నగరపు రాతిపలకల గరుకురోడ్లు పట్టుకున్నాను. రిసెప్షన్‌లో తీసుకున్న మ్యాపునూ ఎద్వార్దో చెప్పిన సూచనలనూ అనుసరించి కాల్దెరోన్ ప్లాజా అన్న కూడలికేసి సాగాను. ఆ ప్లాసా కతెద్రాల్ దె ల ఇమకులాదా కాన్సెప్సియోన్ (Catedral de la Inmaculada Concepción) ప్రాంగణానికి ఎదురుగా ఉంది. ఈ కాల్దెరోన్ (Abdon Calderon) అన్న వ్యక్తి ఎక్వదోర్ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మనిషట. 1822లో కీతో నగర పరిసరాల్లో స్పానిష్ సేనలతో జరిగిన బాటిల్ ఆఫ్ పిచించాలో వీరోచితంగా పోరాడి మరణించిన యోధుడు కాల్దెరోన్. ఆయన జ్ఞాపకార్థం ఆ ప్లాజాలో పాలరాతి వేదికమీద చక్కని కట్టడం నిర్మించారు. ఎక్వదోర్ దేశపు అత్యున్నత సైనిక పురస్కారాన్ని అతని పేరిటే ఇస్తున్నారు.
కతెద్రాల్ దె ల ఇమకులాదా కాన్సెప్సియోన్ – కథెడ్రల్ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ – సామాన్య పరిభాషలో న్యూ కథెడ్రల్ – దక్షిణ అమెరికాలోని అతి పెద్ద ప్రార్థనాస్థలాలలో ఒకటి. తొమ్మిది వేలమంది పడతారట. మూడు పెద్ద పెద్ద నీలిరంగు గోపురాలు, వాటితోపాటు రెండు నిడుపాటి టవర్లు – క్వెన్క నగరంలో చప్పున కనిపించే కట్టడమది. కథెడ్రల్ లోపలి భాగమంతా చక్కని పాలరాయి-బంగారు రేకుల సమ్మేళనంతో అలంకరించబడి ఉంది.
యూరోపియన్లు దక్షిణ అమెరికాలోకి వచ్చాక కట్టిన అనేకానేక నిర్మాణాలతో పోలిస్తే ఈ ఇమాకులాదా కథెడ్రల్ ఇటీవలి కాలానిది అని చెప్పవచ్చు. 90 ఏళ్ళు నిర్మాణం కొనసాగాక 1975లో పూర్తయిన కథెడ్రల్ ఇది. వందేళ్ళు దాటిన ఏ మానవనిర్మిత కట్టడమయినా నన్ను ఒక పట్టాన ఆకర్షించదు. అది ఎంత గొప్పగా కనిపించినా పెద్దగా పట్టించుకోను. ఈ నా ధోరణి అన్నిసార్లూ సమంజసం కాకపోవచ్చునన్న సంగతి నాకు తెలుసు. కొన్ని కొన్ని కట్టడాలకు సమయం గడిచేకొద్దీ చరిత్రపరంగాను, కళాపరంగానూ కాలం అదనపు సౌరభాన్నీ ప్రముఖతనూ సమకూర్చుతుందనీ తెలుసు.
కథెడ్రల్ భవనం పైదాకా ఎక్కి గోపురాల పాదపీఠాలు చేరుకున్న మనుషులు నా కంటబడ్డారు. నాకూ అక్కడి దాకా ఎక్కాలనిపించింది. మెట్లెక్కడున్నాయో కనిపెట్టాను. స్వల్పధరలో ఉన్న టికెట్టు కొని, పైకి చేరుకున్నాను. ఒక్కసారిగా నా కళ్ళముందు నగరం నగరమంతా రెక్కలు విప్పుకుంది. ఎంత చక్కని దృశ్యాలు! ఎంతెంత దూరాలనుంచో కనిపించే ఆ గోపురాల దగ్గరికి చేరుకోవడం, వాటిని చేతితో తాకగలగడం – అద్వితీయమైన అనుభవమది.
ఆ అనుభవాలూ అనుభూతుల మధ్య ఆ గోపురాల ఛాయలో పొడవాటి లెన్సులున్న కెమెరాతో విభిన్న కోణాల్లో నగరాన్ని ఫోటోలు తీస్తోన్న ఓ తైవాన్ దేశపు మనిషి తటస్థపడ్డాడు. అసలిలా క్వెన్క నగరాన్ని ఫోటోలు తియ్యాలనే ఆయన అంత దూరంనుంచి ఎక్వదోర్ వచ్చాడట! నగరాల ఫోటోలు తీయడంలో ప్రత్యేకత చూపించే కళాకారులకు క్వెన్క నగరం అతి చక్కని వేదిక అని వివరించాడాయన. ‘ఈ గోపురాల మీదినుంచి చూడటమే కాదు – అదిగో ఆ దూరాన కనిపిస్తోన్న కొండలమీద మిరాదోర్ దె తూరి అన్న ప్రదేశం ఉంది. అక్కణ్ణించి ఊరు ఇంకా బాగా కనిపిస్తుంది. తప్పకుండా అక్కడికి వెళ్ళండి’ అని సలహా ఇచ్చాడు.
క్వెన్క నగరపు శోభాలహరిలో కొట్టుకుపోతూ నేను భోజనం చేయలేదన్న విషయం మర్చిపోయాను. నా చిరుబొజ్జ గుర్తు చేసేదాకా ఆ విషయం మనసుకు తట్టలేదు. కథెడ్రల్ పరిసరాల్లోనే రాయ్‌మిపాంప అన్న రెస్టరెంటు కనిపించింది. కస్టమర్లతో మహా బిజీగా ఉందా రెస్టరెంటు. పొద్దున్న ప్రయాణంలో ‘మా ఊరు మోతె పీయో (Mote pillo) అన్న మా ప్రాంతపు వంటకానికి పెట్టింది పేరు. తప్పకుండా రుచి చూడు’ అని ఎస్మరాల్ద చెప్పడం గుర్తొచ్చింది. అదే ఆర్డర్ చేశాను. కోడిగుడ్డూ పచ్చ ఉల్లిపాయలతో కలిపి వండిన తెల్ల మొక్కజొన్న వంటకమది. చక్కని తేలికపాటి భోజనం – ఆత్మారాముడు శాంతించాడు.
కడుపు నిండింది కదా, మనసునూ నింపుకుందాం అని ఆ పరిసరాల్లో ఉన్న మెర్కాదో దె ల ఫ్లోరేస్ అన్న పూల మార్కెట్టు కేసి దారి తీశాను. కార్మెన్ చర్చ్ అన్న కట్టడానికి ఎదురుగా ఉన్న చిన్న కూడలిలో ఉన్నదా పూల మార్కెట్టు. వరస వరసంతా రంగురంగుల చిరుదుకాణాల అమరికలు, వెనుక వలసకాలపు కార్మెన్ చర్చ్ ముఖప్రాంగణం – మనసును ఆకట్టుకొన్న దృశ్యమది. ఎక్వదోర్ దేశంలో నేను చూసిన సుందర దృశ్యాలన్నిటికీ ఆ పుష్పలహరి తలమానికం అని చెప్పవచ్చు. నేషనల్ జియోగ్రాఫిక్ పత్రిక అయితే ఈ విపణిని ప్రపంచంలోని పది అతి చక్కని పూల మార్కెట్లలో ఒకటిగా గుర్తించి గౌరవించింది. అక్కడ పూలే అమ్ముతారనుకొన్నాను. కాదు. ఒక పూల దుకాణంలో ఆగ్వా దె పితీమాస్ (Agua de Pítimas) అన్న పానీయం అమ్ముతున్నారు. అది పూలతో చేసిన పానీయమట. స్థానికంగా బాగా ప్రాచుర్యమున్న గులాబీరంగు డ్రింక్ అది. దానికోసం చిన్నపాటి క్యూ ఉంది! వెళ్ళి నిలబడ్డాను. క్యూలో వాళ్ళ మాటల్ని బట్టి ఆ పానీయాన్ని తయారుచేసే పద్ధతి కొద్దిమందికే తెలిసిన పరమ రహస్యమని, దాన్ని తాగడం ద్వారా అనేక రుగ్మతలు తొలగిపోతాయని అక్కడివాళ్ళు నమ్ముతారనీ అర్థమయింది. ఆందోళనా తాకిడికి, నిద్రలేమికీ ఈ పితీమాస్ పానీయం తారకమంత్రంలా పనిచేస్తుందని వాళ్ళ నమ్మకం. అరడాలరు చెల్లించి ఓ గ్లాసు పుచ్చుకున్నాను. తియ్యగా పూల రుచి నిండి ఉందా డ్రింకు. నలుగురితో నారాయణ!
ఆ ఊరిగుండా ఓ నది ప్రవహిస్తోంది. దాని పేరు రియో తొమెబాంబ (Rio Tomebamba). మూడు నాలుగు వీధులు దాటి వెళ్ళి నదీతీరం చేరుకున్నాను. ఒడ్డు వెంబడే నడక ఆరంభించాను. వడివడిగా గులకరాళ్ళ మధ్య పారుతోన్న నది అది. తీరప్రాంతం ఎంతో సుందరంగా ఉంది. నడక చాలా సుఖమనిపించింది. ఆ నది వెడల్పు అంతా కలసి వంద అడుగులు. నదికి రెండు వేపులా పచ్చని పచ్చిక. చక్కని చెట్లు… పార్కులో నడుస్తున్నట్లనిపించింది. కాస్త దూరం నడిచాక ఊదారంగు గొడుగులతో అలంకరించిన వంతెన ఒకటి కనిపించింది. ఆ ఊళ్ళో అది ఎంతో పేరు పొందిన వంతెనట.
నది పక్కన నడుస్తోంటే అవతలి ఒడ్డున సీడాప్ (CIDAP, Centro Inter Americano de Arlesaniasy Artes Populares) మ్యూజియం కనిపించింది. లాటిన్ అమెరికా దేశాలలోని కళారూపాలనూ వస్త్రవిశేషాలనూ హస్తకళలనూ భద్రపరచే లక్ష్యంతో ఏర్పరచిన మ్యూజియమది. నది దాటి మ్యూజియంలోకి వెళ్ళాను. ఇరవై ఎనిమిది లాటిన్ అమెరికా దేశాల నుంచి సేకరించిన 8000 కళాకృతులను అక్కడ భద్రపరచారట.
ఆ దగ్గరలోనే పుమపుంగొ అన్న తొమెబాంబ ప్రాంతానికి చెందిన ఇన్కా నాగరికత అవశేషాల పురావస్తు ప్రదేశం ఉందని తెలిసింది. దురదృష్టవశాత్తూ అది మూసివేసే సమయం అయిపోయిందట. టైము చూసుకుంటే సాయంత్రం అయిదే అయింది. ఇంకా ఆ రోజు తిరగడానికి రెండు మూడు గంటల సమయం ఉంది. ఎటు వెళితే బావుంటుందీ?!
కథెడ్రల్ గోపురం దగ్గర కలసిన తైవాన్ ఫొటోగ్రాఫర్ ఇచ్చిన సలహా చటుక్కున గుర్తొచ్చింది. కొండల నడుమ ఉన్న మిరాదోర్ దె తూరి వెళ్ళమన్నాడు గదా! వెంటనే టాక్సీ పట్టుకుని అక్కడి విస్టా పాయింట్ చేరుకున్నాను. అనుకున్నట్టే అక్కడినుంచి నగరపు సువిశాల దృశ్యాలు కనిపించి సంబరపడేలా చేశాయి. అసలు క్వెన్క నగరమే అతి చక్కని లొకేషన్‌లో ఉంది. చుట్టూ అన్నివేపులా ఆండీస్ పర్వతాలు – మధ్యన లోయలో అమరిన క్వెన్క నగరం. ఎంతో గొప్ప ప్రాంతీయ సౌందర్యం ఆ నగరానిది.
అక్కడ దొరికిన తాజా తాజా కాఫీ కప్పును చేతబట్టి, నింపాదిగా ఆ కాఫీ పరిమళాలను ఆస్వాదిస్తూ, ఎదురుగా కనిపిస్తోన్న నగరశోభను తనివీదీరా చూస్తూ అక్కడ మరికాసేపు గడిపాను. అసలా ప్రదేశం విడిచి రావాలనిపించలేదు. అక్కడ ఉన్నవాళ్ళలో ఆ ఊరివాళ్ళే గాకుండా ఎక్వదోర్‌లోని ఇతర ప్రదేశాలనుంచి, విదేశాలనుంచి వచ్చిన టూరిస్టులు కూడా కనిపించారు. స్థానికులు స్నేహంగా సౌమ్యంగా ఉన్నారు. బయటనుంచి వచ్చినవాళ్ళతో మాట కలుపుదామనీ సాయం చేద్దామనీ వారు చొరవ చూపడం నాకు సంతోషం కలిగించింది.
నాకు క్వెన్కలాంటి చిన్న నగరాలంటే ఇష్టం. యాత్రికులకు చిన్న చిన్న ఊళ్ళు ఎప్పుడూ అనువుగా ఉంటాయి. కాలినడకన ఊరంతా చుట్టి రావడం సాధ్యమవుతుంది. ఆ ఊళ్ళతో ఒక అనుబంధం ఏర్పరచుకొనే అవకాశం ఉంటుంది. అదే పెద్ద పెద్ద నగరాలయితే అవి కొత్తవాళ్ళను బెంబేలు పెడతాయి. ఆత్మీయతాభావమన్న మాటకు ఎంతో దూరాన ఉంటాయి. నా వరకూ నాకు ఈ మెగాసిటీలు మనిషిలోని దురాశకు, అభివృద్ధి పేరిట జరుగుతోన్న ప్రకృతి విధ్వంసానికీ నిలువెత్తు నిదర్శనాలనిపిస్తాయి.
క్వెన్క నగరాన్ని స్పానిష్ వలస పాలకులు 16వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించారు. అంతకుముందు ఆ ప్రదేశంలో ఇన్కా సామ్రాజ్యానికి చెందిన తొమెబాంబ నగరం ఉండేది. ఆ నగరపు శిథిలాల మీద నిర్మించినదే క్వెన్క నగరం. అసలు ఇన్కా ప్రభువులు కూడా ఆ ప్రాంతాన్ని స్పానిష్‌వారి రాకకు కేవలం ఒక ఏభై యేళ్ళకు ముందరే జయించి తమ సామ్రాజ్యంలో కలుపుకున్నారు. అంతకుముందు కనారి అన్న స్థానిక తెగలవారు అక్కడ ఉండేవారు. ఆ కనారిలను జయించాక ఇన్కా ప్రభువులు ఎంతో ప్రీతితో ఆ స్థలంలో తొమెబాంబ నగరాన్ని శోభాయమానంగా నిర్మించారు. ఆ తొమెబాంబ ప్రాభవం గురించీ ఇన్కా సామ్రాజ్యపు రాజధాని నగరం కుస్కోతో సరితూగే అక్కడి బంగారు దేవాలయాల గురించీ వార్తలు స్పానిష్‌వారి చెవినబడ్డాయి. తాము శోధిస్తోన్న ఎల్ దొరాదో (El Dorado) – సువర్ణ సీమ – ఇదే ఇదే అని ఆ ఆక్రమణదారులు సంబరపడ్డారు. తీరా ఆ నగరాన్ని జయించి అక్కడకు చేరిన స్పానిష్‌వారికి శిథిలాలే స్వాగతం చెప్పాయి. ఓడిపోయిన స్థానికులు అప్పటికే నగరాన్ని ధ్వంసం చేసి వదిలారు. కానీ నగరానికి చెందిన మార్మిక కథనాలు అక్కడితో ఆగలేదు. నగరపు బంగారాన్నీ సంపదనూ స్థానికులు తరలించివేశారు అన్న మరో కథ ప్రచారంలోకి వచ్చింది. ఏదేమైనా ఆ సంపద ఆచూకీ ఎప్పటికీ తెలియరాలేదు.
క్వెన్కలో టాక్సీలు బాగా చవక. ఎక్కడనించి ఎక్కడికి వెళ్ళినా మూడు నాలుగు డాలర్లకు మించదు. కాకపోతే టాక్సీ దొరకడమే గగనం. ఊబర్ టాక్సీ దొరకడమన్న ప్రసక్తి లేనే లేదు. ఊబర్ లాంటిదే మరో స్థానిక ఆప్ వాడాలి. ఏదేమైనా ఊరు చిన్నదిగాబట్టి టాక్సీల కోసం వెదకకుండా నా అవసరాలన్నీ నడకతోనే తీర్చుకున్నాను. అక్కడి రాతి పలకల వీధుల్లో నడవడం ఒక విలక్షణ ఆనంద హేతువు.
మిరాదోర్ దె తూరి దగ్గర పరిచయమైన ఓ జంట నన్ను సిటీ సెంటర్లో డ్రాప్ చేస్తామన్నారు. సంతోషంగా ఒప్పుకున్నాను. ప్లాసా దె సాన్ ఫ్రాన్సిస్కో అన్న విశాలమైన కూడలి దగ్గర వాళ్ళు నన్ను వదిలివెళ్ళారు. ఆ పాతపట్నపు కూడలికి ఒక వేపున చర్చ్ ఆఫ్ సాన్ ఫ్రాన్సిస్కో ఉంది. అక్కడనించి ఆ ఊరి కథెడ్రల్‌కు చెందిన నీలి గోపురాలు చక్కగా కనిపిస్తున్నాయి.
అలా రికామీగా రోడ్లవెంట తిరుగుతూ తిరుగుతూ ప్లాసా దె సాన్ సెబాస్తియన్ అన్న అందమైన కూడలి దగ్గర చేరాను. ఆ కూడలి పేరిటే ఉన్న చర్చి ఒకటి అక్కడ కనిపించింది. అలా నడక కొనసాగించగా ఇగ్లేసియా ఎల్ సగ్రారియో అన్న మరో ఆకర్షణీయమైన చర్చి కనిపించింది. కన్నులు మిరుమిట్లు గొలిపే తెల్లరంగు వేశారా చర్చికి. ఇపుడు అది మ్యూజియంగా మారింది. కాస్తంత పరిశోధించగా ఆ ఊళ్ళో ముఖ్యమైన చర్చిలు కనీసం ఏభై ఉన్నాయనీ అవన్నీ చూడతగినవేననీ తెలిసింది.
డిన్నరు చేయడానికి ఇంకా గంట సమయముంది. అంతా ఎంతగానో సిఫార్సు చేసిన గ్వాహిబాంబ (Guajibamba) అన్న రెస్టరెంటులో రాత్రి ఎనిమిదిన్నరకు ఓ టేబులు బుక్ చేసి ఉన్నాను. అప్పటికే ఊళ్ళోని వీధులన్నీ కొలిచేసి ఉన్నాగదా, మిగిలిన ఆ గంట సమయంలో ఆ ఊళ్ళోని ట్రామ్ బళ్ళ అనుభవమూ పొందుదామనిపించింది. అవి ఎక్కితే ఊరి పొలిమేరలు కూడా చూసినట్టవుతుంది అనిపించింది.
ట్రామ్‌లు ఆగేది ఎక్కడా అని చూశాను. సులభంగానే కనిపెట్టాను. కానీ కొత్త ఊళ్ళలో కొత్త రవాణా సౌకర్యాలు వాడాలంటే కాస్తంత తర్ఫీదు అవసరం. ఆ ట్రామ్ స్టేషన్లో టికెట్లిచ్చే మెషీన్లున్నాయిగానీ వాటిని వాడే వివరాలు కనిపించలేదు. దిక్కులు చూడసాగాను. నా ఇబ్బంది గమనించిన ఓ టీనేజి స్కూలు కుర్రాడు వచ్చి సహాయం అందించాడు. ఎంతో సంబరంగా ట్రామ్ బండిలో చేరి ఎక్కేవాళ్ళనూ దిగేవాళ్ళనూ గమనిస్తూ చిట్టచివరి స్టాపు దాకా వెళ్ళాను. అక్కడ మరో టికెట్టు కొనుక్కుని నగరపు మరో చివరిదాకా వెళ్ళాను. గంట గడిచేసరికి అక్కడి ట్రామ్‌లు ఎక్కడంలో ప్రావీణ్యం సంపాదించేశాను. చిట్టచివరికి మా రెస్టరెంటుకు దగ్గర్లోని స్టాపులో ట్రామ్ దిగాను. మొత్తానికి కాసిన్ని డాలర్ల ఖర్చుతో క్వెన్క నగరపు ట్రామ్ దారులన్నీ ఆపోశన పట్టానన్నమాట.
ట్రామ్‌లో విహారాలు చేస్తున్నప్పుడు దారిలో వాయిన కపాక్ ఫుట్‌బాల్ స్టేడియమ్ అన్న స్టాపు రావడం గమనించాను. ముందే చెప్పుకున్నట్టు ఈ కపాక్ చక్రవర్తి ఇన్కా సామ్రాజ్య నిర్మాత. చిట్టచివరి చక్రవర్తి అటవాల్ప వాళ్ళ కన్నతండ్రి. ఇన్ని శతాబ్దాలు గడిచినా ఎక్వదోర్ దేశం ఒకప్పటి ఇన్కా సామ్రాజ్యాన్నీ ఆయా అధినేతలనూ ఇష్టంగా గుర్తుంచుకుంటోదన్నది ఎంతో ఆసక్తికరమైన విషయం. తమ సామ్రాజ్యానికి ఇప్పటి పెరూలోని కుస్కో నగరం రాజధానిగా ఉన్నప్పటికీ ఈ కపాక్ చక్రవర్తి సామ్రాజ్యానికి ఉత్తరపు కొసన రెండవ రాజధానిగా తొమెబాంబను నిర్మించాడు. అన్నన్ని ఆశలతో ఊహాలతో సామ్రాజ్యాన్ని విస్తరించి నగరాలను నిర్మించిన కపాక్ చక్రవర్తి అంత హఠాత్తుగా తాను మరణిస్తానని, ఆ తర్వాత అయిదేళ్ళకల్లా తన మహాసామ్రాజ్యం ఛిన్నాభిన్నమై స్పానిష్ ఆక్రమణదారుల ఆధిపత్యంలోకి వెళుతుందనీ ఏ మాత్రం ఊహించి ఉండడు.
ట్రామ్ దిగి కాస్తంత దూరం నడిచి మా గ్వాహిబాంబ రెస్టరెంటు చేరుకున్నాను. చేరానేగానీ తెలియక దొడ్డి దారిన రెస్టరెంటులోకి ప్రవేశించాను! వంటలు వండే చోట మన పొడవాటి గాడిపొయ్యిల్లాంటి ఏర్పాటులో డజన్ల కొద్దీ గినీ పిగ్‌లు, కుయేస్ (Cuyes) అంటారు, నిప్పుల్లో కాలడం నా కంటబడింది. ఈలోగా రెస్టరెంటు ఉద్యోగి ఒకరు నా తడబాటును గమనించి సాదరంగా రెస్టరెంటులోకి తీసుకువెళ్ళాడు. బాగా పేరున్న ప్రదేశంలా ఉంది – రెస్టరెంటు నిండా కస్టమర్లు.
సహప్రయాణీకురాలు ఎస్మరాల్ద చెప్పినట్లు ఆ ప్రాంతపు ప్రఖ్యాత వంటకం కుయ్ (Cuy) తినాలంటే ఈ గ్వాహిబాంబ రెస్టరెంటే సరి అయిన ప్రదేశం. కానీ చిట్టి పొట్టి గినీ పిగ్‌లను కాల్చి చేసిన ఆ వంటకం తినడానికి నాకు మనస్కరించలేదు. అంటే ఎక్వదోర్ దేశపు ప్రఖ్యాత వంటకాల్లో ఒకదాన్ని రుచి చూడకుండా వదిలిపెడుతున్నానన్నమాట. అయినా అది నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆ విషయంలో నిరాశ, విచారాలు లేవు. కుయ్‌కు బదులుగా సెకో దే చీవో అన్న వంటకాన్ని ఎంచుకున్నాను. మేక మాంసం, పసుపు రంగు అన్నం, అవొకాడోలతో కూడిన సంప్రదాయ/ పారంపరిక వంటకమది. నాకు నచ్చింది.
మర్నాటి ఉదయం బాగా పొద్దున్నే లేచి బ్రేక్‌ఫాస్ట్ చేసి సిటీ సెంటర్ కేసి వెళ్ళాను. ఊరంతా ప్రశాంతంగా ఉంది. అప్పుడే నిద్రలేచినట్లు అమాయకంగా కనిపించింది. ముచ్చటగా అనిపించింది. చెదురుమదురుగా మనుషులు. అదంతా చూశాక క్వెన్కలో మరో రోజు గడపాలని, ఆ పరిసరాల్లో ఇన్గాప్రీకా అన్న పట్నంలో ఉన్న ఇన్కా శిథిలాలను చూసి రావాలనీ బలంగా అనిపించింది. ఒక రోజు కేటాయిస్తే ఆ పని చేసి రావచ్చు. కానీ నాకు మర్నాడు గుయాకీల్ నుంచి గలాపగోస్ ద్వీపాలకు చేర్చే విమానం బుక్కయి ఉంది. ఆ గుయాకీల్ అన్న ప్రదేశానికి క్వెన్క నుంచి నాలుగయిదు గంటల బస్సు ప్రయాణం. అంచేత ఆ రోజే గుయాకీల్ చేరుకోవడం అన్నివిధాలుగా శ్రేయస్కరం. ఏదేమయినా ఇన్గాప్రీకా నేపథ్యాన్నీ చరిత్రనూ మనసులోంచి తొలగించుకోవడం అంత సులభం కాదని బోధపడింది. ఇన్కా సామ్రాజ్య విస్తరణకు ముందే ఆ ప్రాంతపు కనారి తెగలవారు నిర్మించిన పట్నమది. రాజ్యాన్ని ఉత్తర దిశలో విస్తరించే ప్రక్రియలో ఇన్కా ప్రభువులు ఆ పట్నం మీద ఆధిపత్యం సాధించి, మరిన్ని భవనాలు నిర్మించి దాని పెంపుదలకు దోహదం చేశారు. అంచేత అక్కడ ఇన్కా ఛాయలతోపాటు ఇన్కా పూర్వపు వాస్తురీతి పోకడలు కూడా మనకు కనిపిస్తాయట. అన్నట్టు ఇన్కా ప్రభువులకు ఈ కనారి తెగలవారు గట్టివారని, అంత సులభంగా లొంగే బాపతు కాదనీ తెలిసిందట. దానితో ఇన్కా చక్రవర్తి అణచివేత ఆలోచనలను కట్టిపెట్టి అక్కడి యువరాణిని పెళ్ళి చేసుకుని కథను సుఖాంతం చేశాడట.
పనమా టోపీలు తయారుచేసే ఫ్యాక్టరీ చూడకుండా వెళ్ళిపోతే అసలు క్వెన్క నగరం వెళ్ళినట్టే కాదు. ఎక్వదోర్ దేశంలో తయారయ్యే విలక్షణమైన టోపీలకు ఎక్కడో ఉన్న పనమా దేశపు పేరు ఎలా చేరువయిందో ఇంతకుముందు చెప్పుకున్నాం. క్వెన్క నగరానికి దగ్గరలో ఉన్న మోంతెక్రిస్తీ అన్న పట్టణం ఈ పనమా టోపీలకు పుట్టిల్లట. స్థానికంగా సోంబ్రేరోస్ దె పాహా తొకీయా (Sombreros de Paja Toquilla) అని పిలుచుకొనే ఈ టోపీల ఉత్పత్తికి క్రమక్రమంగా క్వెన్క నగరం, దాని పరిసరప్రాంతాలూ కేంద్రబిందువులుగా పరిణమించాయి. మళ్ళా ఆ టోపీలు తయారుచేసే కంపెనీల్లో కొన్ని కొన్ని బాగా ప్రాచుర్యం పొందాయి. అలాంటి బ్రాండ్‌లలో ఒమేరో ఓర్తేగా (Homero Ortega) ఒకటి. ఆ కంపెనీ వాళ్ళ ప్రాంగణంలోకి పర్యాటకుల్ని స్వాగతిస్తూ ఉంటారు. వాస్తవానికి అది ఒక పనమా టోపీల మ్యూజియం కూడానూ! ఈ ఓర్తేగా కుటుంబీకులు పనమా టోపీల తయారీకి పూనుకున్న మొట్టమొదటి కుటుంబాల్లో ఒకరట. ‘ఇప్పటి లెక్కల ప్రకారం వాటిల్ని తయారుచేస్తోన్న కుటుంబాల్లో మాదే పురాతనమైనది’ అంటారు ఆ కుటుంబంవారు. ప్రస్తుతం ఆ వ్యాపారం నడుపుతోన్నది ఆ కుటుంబంలోని ఐదవ తరంవాళ్ళు.
నేను వెళ్ళిన సమయంలో ఆ ఫాక్టరీ అంతా తిప్పి చూపించే టూరు ఒకటి నడుస్తోంది. అందులో చేరాను. కాకపోతే భాష స్పానిష్. టూరు గైడు వివరిస్తోన్నది ఏమంత అర్థం కాకపోయినా మొత్తానికి సారాంశం గ్రహించగలిగాను. నాతోపాటు ఉన్న ఒక అమెరికన్ సహృదయుడు ముఖ్యమైన చోట్ల తర్జుమా చేసి వివరించాడు. ఫాక్టరీ అంతా తిరిగి చూశాం. అక్కడి కార్మికులంతా తమతమ పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. మా ఉనికిని ఏ మాత్రం పట్టించుకోలేదు. అవును మరి – పట్టించుకుంటే పని ఎలా అవుతుందీ?! ఆ టోపీల తయారీ మౌలికంగా హస్తకళాప్రావీణ్యతకు సంబంధించిన విషయమని బోధపడింది. అల్లిక, కూర్పు కార్మికుల చేతుల మీదుగానే సాగుతోంది. మిషన్లు వాడడంలేదు. మామూలు పనితనంగల పనమా టోపీ చెయ్యడానికి ఒక రోజు పడుతుందట. ఇరవై డాలర్ల ఖరీదు. అదే అత్యంత నాణ్యత, పనితనమూ ఉన్న టోపీకయితే ఆరు నెలలు పడుతుందట. వెల 1500 డాలర్లు!
మధ్యాహ్నం దగ్గర పడింది. గుయాకీల్ ప్రయాణ సన్నాహాలు ఆరంభించాల్సిన సమయమయింది. హోటలుకు వెళ్ళి బ్యాగ్ సర్దుకుని చెకౌట్ చేశాను. టాక్సీ పట్టుకుని క్వెన్క బస్టాండు చేరాను. గంటకో బస్సుందన్న సమాచారం అప్పటికే సేకరించి ఉన్నాను. వెళ్ళి పది డాలర్లు పెట్టి టికెట్టు కొనుక్కుని గుయాకీల్ బస్సు ఎక్కాను. ఎంతో ఆర్తితో క్వెన్కకు వీడ్కోలు పలికాను.
క్వెన్క నుంచి గుయాకీల్ 250 కిలోమీటర్లు. మధ్యలో ఒకచోట విరామం కోసం ఆగాం, అంతే. అంతా కలసి ప్రయాణానికి నాలుగున్నర గంటలు పట్టింది. దారంతా వర్షం – బయట అసలేమీ కనిపించనంత వర్షం. క్వెన్క వదిలీ వదలగానే రోడ్డు ఆండీస్ పర్వతాల మధ్య మెలికలు తిరుగుతూ సాగింది. అంచేత ప్రయాణాన్ని పెద్దగా ఆస్వాదించే అవకాశం లేకపోయింది.
బస్సు పూర్తిగా నిండలేదు – నాలుగోవంతు ఖాళీ సీట్లు. ఇద్దరు కూర్చునే సీట్లలో నే ఒక్కడినీ సుఖంగా కూర్చోగలిగాను. ఆ బస్సు దశాబ్దాల క్రితం నిర్మించిన బస్సులా అనిపించింది. సీటు బెల్టులు లేవు. బెల్టులు పెట్టుకోవడం అలవాటయిన వాళ్ళకి అవి లేకుండా ప్రయాణం చెయ్యడం కష్టమనిపిస్తుంది. నేను అలాంటి ఆందోళనను దగ్గరికి రానివ్వలేదు. నిజమే – నేను సీటు బెల్టుల విషయంలో గట్టిగా పట్టుబట్టే మనిషినే. కానీ స్థలకాలాలను బట్టి పట్టు విడుపులు ఉండాలి కదా… ఆ సంగతులు ఎలా ఉన్నా మెలికలు మెలికల రోడ్ల మీద బస్సు ప్రయాణం పుణ్యమా అని నేను నా రెండు సీట్ల మధ్యా లోలకంలాగా ఊగులాడుతూనే ఉన్నాను.
బయట మసకమసకగా ఉంది కదా – మెల్లగా నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. దారిలో మిరాదోర్ ఎల్ పరీసో అన్నచోట రెస్టు కోసం బస్సు ఆగినపుడు, క్రికెట్ బంతి పరిమాణంలో ఉన్న బొలాన్ దె వెర్డె అన్న వంటకం అంది పుచ్చుకున్నాను. అది ఎక్వదోర్ దేశపు జాతీయ వంటకమట. అరటి గుజ్జు, పోర్క్, చీజ్ కలగలపి చేసిన ఆ వంటకం, దానితోపాటు అనుపానంగా అందించిన అరటి చిప్స్, కాఫీ ఆ నాటి నా లంచ్ అవసరాన్ని అతి చక్కగా తీర్చాయి. అక్కడి సుందర దృశ్యాలను ఫ్రేముగట్టి గోడలనలంకరించారు. ఆ బొమ్మలు బావున్నాయి. కానీ వర్షం, పొగమంచుల వల్ల పరిసరాలను చూడటం సాధ్యమే కాలేదు.
ఆ రెస్టు పాయింటు తర్వాత బస్సు మెల్లగా తీరప్రాంతపు మైదానాలకేసి క్రిందకు దిగసాగింది. అంతా కలసి అలా 2600 మీటర్లు దిగాం. దిగుతున్నకొద్దీ అరటితోటల హడావుడి… ఇంకా క్రిందకు దిగగా వరిపొలాలు.
ఏదో చిన్నపాటి పట్నంలో బస్సు ఆగింది… కొద్దిమంది దిగారు. కొద్దిమంది ఎక్కారు. ఈలోగా నా పక్కనున్న సీట్లలోని వాకీన్ (Joaquín), స్తెఫానియా (Stefania) అన్న, ముప్ఫైలలో ఉన్న ఒక యువజంటతో సోపతి ఏర్పడింది. క్వెన్క నగరంనుంచి వస్తున్నారు. ముందే చిరునవ్వుల పలకరింపులు సాగాయి కానీ ముందుకు వెళ్ళడానికి భాష అడ్డమయింది. నాకు తెలిసిన పదీ పరకా స్పానిష్ పదాలను అప్పటికే వాడేసి ఉన్నాను. వాళ్ళకు తెలిసిన ఇంగ్లీష్ పదాల అంబులపొది కూడా ఖాళీ అయిపోయింది.
బస్సు గుయాకీల్‌కు దగ్గరవుతోన్న సమయంలో ముగ్గురం గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను ఆశ్రయించాం. ‘సంభాషణ’ చకచకా సాగింది. వాళ్ళది గుయాకీల్ అట. అక్కడే చిన్నపాటి దుకాణం నడుపుతున్నారట. ఏదో ఫామిలీ ఫంక్షన్ కోసం క్వెన్క వచ్చారట. నా వివరాలు విన్నాక, ‘బస్సులో ఎందుకు వస్తున్నావూ? ఫారినర్‌లంతా క్వెన్క గుయాకీల్ మధ్య విమానాల్లో గదా తిరిగేదీ?’ అని అడిగారు. ‘నాకు బస్సుల్లో ప్రయాణమంటే ఇష్టం’ అని చెప్పాను. ‘గుయాక్విల్‌లో కాస్తంత జాగ్రత్తగా ఉండు. సిటీ సెంటర్‌లో పర్లేదుగానీ లోపలి పేటలు అంత క్షేమం కాదు’ అని వాళ్ళు హెచ్చరించారు. ఆ ఊళ్ళో నేరాలూ హత్యలూ ఎక్కువని, మత్తుమందు సామ్రాజ్యాల ప్రభువుల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయని, ఎక్వదోర్ దేశంలోకెల్లా గుయాకీల్ ప్రమాదభరితమైన ప్రదేశమనీ విని ఉన్నాను. ‘మీరు చెప్పినట్టే బాగా జాగ్రత్తగా ఉంటాను. ఏదేమైనా నేను అక్కడ ఉండేది ఒక్క పూటే. థాంక్స్’ అని చెప్పాను. ఆనాటి నా సాయంత్రాన్ని మలెకోన్ 2000 (Malecón 2000) అన్న బోర్డ్ వాక్ మీద గడపమని వాళ్ళు సిఫార్సు చేసారు. ఆ ప్రాంతంలో రుచికరమైన సీ-ఫుడ్ దొరుకుతుందట.
బస్సు గుయాకీల్ నగరంలో ప్రవేశించింది. కానీ బస్ స్టేషన్ చేరడానికి మరో అరగంట పట్టింది. బస్సు టెర్మినల్ భవనం బాగా పెద్దది. డజన్ల కొద్దీ బస్సులు అక్కడ బారులు తీరి ఉన్నాయి. కాలేజీ రోజుల్లో నేను తరచూ చూసిన విజయవాడ, హైదరాబాద్ బస్ స్టేషన్లు గుర్తొచ్చాయి.
గుయాకీల్ ఎక్వదోర్‌లోకెల్లా అతి పెద్ద నగరం. ముప్ఫై లక్షల జనాభా. దేశంలోని ముఖ్యమైన రేవు పట్నం కూడానూ. ఇరవై లక్షల జనాభా ఉన్న రాజధాని నగరం కీతోది జనాభాపరంగా దేశంలో రెండవ స్థానం. బస్సు దిగాక జనాల మధ్యనుంచి దారి చేసుకుంటూ టాక్సీ స్టాండు వేపు నడిచాను. లాస్ పేన్యాస్ అన్న మా హోటలు చేరుకున్నాను. యూరప్‌తో పోలిస్తే ఎక్వదోర్‌లో హోటళ్ళు బాగా చవక. నగరం మధ్యన, భద్రతా సమస్యలు ఏమాత్రం లేని పరిసరాల్లో ఉన్న పేన్యాస్ హోటల్‌కు నేను కడుతోంది రోజుకు 32 పౌండ్లు. అందులోనే బ్రేక్‌ఫాస్ట్ ఇమిడి ఉంది. ధరనుబట్టి చూస్తే హోటలు ఎంతో బావున్నట్టు లెక్క.
బయట వర్షం పడుతోంది. అయినా వెలుగు పూర్తిగా పోలేదు. ఆ ఊర్లో నేనుండేది కొద్ది సమయమే కాబట్టి వర్షం అన్న పట్టింపు పెట్టుకోకుండా ఊర్లోని ముఖ్యప్రదేశం మలెకోన్ 2000 వేపు నడిచాను. దారిలో యూనివర్సిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కనిపించింది. ఆ ప్రాంగణంలో ఎన్నో విగ్రహాలు కనిపించాయి. వాటి వివరాలు స్పానిష్ భాషలో ఉండటంవల్ల అవి ఎవరెవరి విగ్రహాలో తెలుసుకోలేకపోయాను. అయినా సువర్ణాక్షరాలతో నిండి ఉన్న ఒక ఫలకం నా దృష్టిని ఆకర్షించింది. పరీక్షగా చూస్తే అది 2019లో అలెగ్జాండర్ ఫాన్ హుమ్‌బోల్ట్ 250వ జయంతి సందర్భంగా ఆవిష్కరించబడిన ఫలకం అని అర్థమయింది. ఆ మహానుభావుడి గురించి ఈ వ్యాసాల్లో ఇప్పటికే నేను ఒకటి రెండుసార్లు ప్రస్తావించాను. ఆ శిలాఫలకం చూశాక ఆయన గురించి నేను విన్నవీ చదివినవీ తెలుసుకొన్నవీ – వివరాలూ విశేషాలూ మనసును ఆక్రమించాయి.
ఎక్వదోర్ చరిత్రా సంస్కృతులతో ఇద్దరు యూరోపియన్ల పేర్లు విడదీయలేని భాగమయ్యాయి. వారి జీవిత కాలమూ కార్యకలాప సమయమూ ముగిసి నూట ఏభై – రెండు వందల సంవత్సరాలు గడిచినా ఎక్వదోర్‌లో వారిని ఇప్పటికీ గౌరవంగా ఘనంగా గుర్తుంచుకొంటూనే ఉంటారు. బహుశా వారివారి దేశాలలోకన్నా వారికి గుర్తింపూ గౌరవమూ ఎక్వదోర్‌లోనే ఎక్కువ లభించాయనుకొంటాను.
వారిలో ఒకాయన ఛాల్స్ డార్విన్ (1809-1882). ఆయన జీవితమూ పరిశోధనలూ ఎక్వదోర్‌కు చెందిన గలాపగోస్ ద్వీపాలతో ముడివడి ఉన్నాయి. ఆయన కార్యరంగం అవడం వల్లనే ఆ ద్వీపాలకూ ఆ దేశానికీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి లభించింది. రెండవ వ్యక్తి అలెగ్జాండర్ ఫాన్ హుమ్‌బోల్ట్ (1769-1859). అనేక రంగాలలో శాస్త్రీయమైన పరిశోధనలు చేసి ఆయా రంగాల మీద కొత్త వెలుగులు ప్రసరించిన వ్యక్తి ఈయన. హుమ్‌బోల్ట్ కార్యకలాపాలు ఛాల్స్ డార్విన్‌కు కూడా ప్రేరణ అందించాయి.
డార్విన్, హుమ్‌బోల్ట్ లాంటి అన్వేషకులూ పరిశోధకులంటే నాకు చాలా ఇష్టం. నా ప్రయాణాల గురించి రాస్తున్నప్పుడు సందర్భానుసారం అలాంటి వారి గురించి వివరంగా రాస్తూ ఉంటాను. అనేక రంగాలలో వారు ప్రపంచానికి అందించిన పరిశోధనా ఫలాలను ఎంతో ఇష్టంగా ఉదహరిస్తూ ఉంటాను. వాళ్ళు నా మీద చూపించిన ప్రభావం సంగతి సరే సరి. ఇంతకుముందు చెప్పినట్లుగా నేను ఎక్వదోర్ దేశం చూద్దామనుకోవడానికి ఛాల్స్ డార్విన్, గలాపగోస్ ద్వీపాలు ఒక ముఖ్యకారణం. అలాగే అలెగ్జాండర్ హుమ్‌బోల్ట్ దక్షిణ అమెరికాలోనూ, ముఖ్యంగా ఆండీస్ పర్వతశ్రేణిలోనూ చేసిన భౌగోళిక పరిశోధనల గురించీ; తన సమకాలీనులనే కాకుండా, తర్వాతి తరాలవారినీ అనేక రంగాల ప్రముఖులనూ ఆయన ప్రభావితం చేసిన వైనం గురించీ చెప్పడానికి ఎక్వదోర్ దేశంలో నేను పర్యటిస్తోన్న సమయమే సరైనది అనిపిస్తోంది.
హుమ్‌బోల్ట్ పేరు నేను చాలా కాలంబట్టీ వింటున్నాను. ఆయన పరిశోధనల గురించి చూచాయగా తెలుసు. కానీ గత సంవత్సరం ‘గ్రేట్ కోర్సెస్’ శృంఖలలో ‘హిస్టరీస్ గ్రేటెస్ట్ వాయేజెస్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్’ (ప్రపంచంలోని అతి గొప్ప శోధనా యాత్రలు) అన్న పన్నెండు గంటల లెక్చర్ సిరీస్ పూర్తి చేసినపుడు, హుమ్‌బోల్ట్ గురించి నాకు ఎన్నో సూక్ష్మ వివరాలు తెలిశాయి. ఆ 12 గంటల సీరీస్‌లో ఒక పూర్తి అధ్యాయం ఆయన గురించే ఉంది. ‘ఎక్స్‌ప్లోరర్ జీనియస్’ – శోధనా పరిపూర్ణుడు – అని ఆయనను ఆ సీరీస్‌లో శ్లాఘించారు.
1769లో జర్మనీకి చెందిన సంపన్న కుటుంబంలో పుట్టాడు హుమ్‌బోల్ట్. తన జీవితమంతా అన్వేషణలకూ, శాస్త్ర పరిశోధనలకూ అంకితం చేశాడు. వివాహం చేసుకోలేదు. తన సంపదనంతటినీ పరిశోధనల కోసం, అన్వేషణల కోసం ఖర్చు చేశాడు. అలా 90 సంవత్సరాలు బ్రతికాడు. బహుశాస్త్రప్రవీణుడిగా పరిణమించాడు. ప్రపంచంమీద తన చెరగని ముద్రను వదిలాడు. 1799-1804 మధ్య ఐదేళ్ళపాటు దక్షిణ అమెరికాలో విస్తృతంగా శాస్త్రపరిశోధనలు చేశాడు. ఆ పరిశీలనలు, తాను సేకరించిన నమూనాలను యూరప్ శాస్త్రప్రపంచం ముందుంచాడు. వాటి గురించి 20 యేళ్ళపాటు రాశాడు. అతని పుణ్యమా అని యూరపుకు తెలిసిన వృక్షజాలపు సంఖ్య రెండు రెట్లు పెరిగింది. తన జీవితకాలంలో 700 పరిశోధనా పత్రాలు, 50 పుస్తకాలూ రాశాడు. తన మొదటి పుస్తకం కాస్మోస్‌లో (Kosmos) అనేకానేక విషయాలు స్పృశించాడు. అగ్నిపర్వతాలు, ఉత్తర ధృవపు వెలుగుల (Northern Lights) నుంచి కళలు, కవిత్వం వరకూ అనేక విషయాలను మిళితం చేస్తూ సాధికారంగా రాశాడు. దాని ద్వారా శాస్త్ర పరిజ్ఞానానికీ సాంస్కృతిక జనజీవనానికీ మధ్య వారధులు నిర్మించాడు. సహజంగానే ఆ పుస్తకం ప్రపంచపు దృష్టిని విశేషంగా ఆకర్షించింది.
ప్రకృతి అన్న అంశాన్ని తన సమకాలీన శాస్త్రవేత్తల ఆలోచనలకు భిన్నమైన రూపంలో దర్శించాడు హుమ్‌బోల్ట్. అనేక అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి విడదీయలేనంతగా అల్లుకుపోయిన మహా జీవనాంశంగా ఆయన ప్రకృతిని భావించాడు. దానినొక సజీవమూర్తిగానూ తన ఉనికిని కాపాడుకోవడం కోసం అనునిత్యం పోరాడే శక్తిగానూ భావించాడు. ఈ భావనే డార్విన్ రూపొందించిన నేచురల్ సెలెక్షన్ అన్న సిద్ధాంతానికి మూలబిందువు అయింది. డార్విన్ శోధనాయాత్రలో ‘కాస్మోస్’ గ్రంథం ఆయనకు ఎప్పుడూ తోడుండేది.
ముందే చెప్పుకున్నట్టు హుమ్‌బోల్ట్ ఏ ఒక్క రంగానికో పరిమితమైన శాస్త్రవేత్త కాదు. భూగోళ శాస్త్రంతోబాటు జీవశాస్త్రంలోనూ నిపుణుడాయన. అంచేత ఒక ప్రాంతపు వృక్ష-జంతుజాలాల పరిణామక్రమాన్ని ఆ ప్రాంతపు భౌగోళికాంశాలతో అనుసంధించడం ఆయనకు సులభసాధ్యమయింది. అలా ఆయన ప్రపంచంలోని వృక్ష మండలాలను – వెజిటేషన్ జోన్స్ – గుర్తించి వర్గీకరించగలిగాడు. ఆ రకంగా ఆయన ప్లాంట్ జియోగ్రఫీ రంగంలో ఆద్యుడిగా, వైతాళికుడిగా నిలిచాడు.
ఆధునికయుగంలో హుమ్‌బోల్ట్‌ను మొట్టమొదటి పర్యావరణ శాస్త్రవేత్తగా మనం పరిగణించవచ్చు. పర్యావరణ సమతౌల్యం గురించి, వృక్షవిధ్వంసమూ అడవులు నరకడమూ వల్ల వచ్చే విపరీత భౌగోళిక పరిణామాల గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించీ పసిగట్టాడు. దక్షిణ అమెరికా వర్షారణ్యాలలో విస్తృతంగా పర్యటించాడు. అమెజాన్ అడవుల పర్యావరణ వ్యవస్థను పరిశోధించాడు. ప్రకృతితో చెలిమి చేసి మమేకమవుతోన్న అక్కడి అనాది తెగలను చూసి అబ్బురపడ్డాడు. ప్రకృతి పరిశీలనా ఆరాధనలలో వారిని మించినవారు లేరని గుర్తించి ప్రశంసించాడు. ఆధునిక ప్రపంచం – ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచం – పర్యావరణ స్పృహ, దాని విధ్వంసంవల్ల దాపురించగల అనర్థాల స్పృహను సంతరించుకోవడానికి రెండువందల సంవత్సరాల ముందే, 1800లో ఆ విషయాన్ని గురించి స్పష్టమైన అవగాహన పొంది, మానవ జాతిని హెచ్చరించిన దార్శనికుడు హుమ్‌బోల్ట్.
వాతావరణ అధ్యయనానికి ఆయన శాస్త్రస్థాయిని సమకూర్చాడు. సముద్ర ప్రవాహాలనూ అయస్కాంత క్షేత్రాల తుఫానుల్నీ పరిశీలించాడు. భౌగోళికంగానే కాకుండా అయస్కాంత పరంగానూ భూమధ్యరేఖ – మాగ్నెటిక్ ఈక్వేటర్ – ఉంటుందని కనిపెట్టాడు. ఒకే స్థాయి ఉష్ణోగ్రతలూ వాతావరణ పీడనా ఉన్న ప్రదేశాలను కలుపుతూ ప్రపంచపు వాతావారణ పటం మీద గీసే ఊహారేఖలకు – ఐసోథర్మ్ (Isotherm), ఐసోబార్ – రూపకల్పన చేసింది హమ్‌బోల్టే! అలా జ్వాలముఖుల గురించీ (వాల్కనోలజీ) భూకంపాల గురించీ (సైస్మాలజీ), భూమిలో నిరంతర చలనశీలత కలిగిన భూఖండాల గురించీ (ప్లేట్ టెక్టానిక్స్) భూగర్భశాస్త్రాన్ని గురించీ (జియాలజీ) భూగోళాన్ని గురించీ (ఎర్త్ సైన్సెస్) ఆయన చేసిన నిరంతర పరిశోధనలు ఆయా శాస్త్రాలకు పునాదిరాళ్ళుగా నిలిచాయి. తన పరిశోధనలలో భాగంగా ఒరినాకో (Orinaco) నదీతలంమీద 70 రోజులపాటు 1400 మైళ్ళు ప్రయాణించి ఆ నదినీ అమెజాన్ నదినీ అనుసంధించే కాసికియారె (Casiquiare) అన్న చిరునది ఉనికిని కనిపెట్టాడు.
ఆయన పేరు మీద ఉన్నన్ని ప్రదేశాలు, మొక్కలు, జీవజాలం, భౌగోళిక విశేషాలు బహుశా ఇంకెవరి పేరునా ఉండి ఉండవు. ఒక లిల్లీ పువ్వు, ఒక పెంగ్విన్ పక్షి, ఒక విలక్షణ మత్స్యం, పార్కులు, పర్వతాలు, విలక్షణ భౌగోళిక ప్రదేశాలు, సముద్ర ప్రవాహాలు – మొత్తం 3000 దాటి ఆయన పేరిట ఉన్నాయి. ఇవేగాకుండా రెండు గ్రహశకలాలకు, చందమామలోని ఒక ప్రదేశానికీ ఆయన పేరు పెట్టారు. యు.ఎస్. లోని నెవాడా రాష్ట్రానికి ఆయన పేరు పెట్టబోయారుగానీ ఎంచేతో అది కుదరలేదు.
అలెగ్జాండర్ ఫాన్ హుమ్‌బోల్ట్‌తో పోలిస్తే ఛాల్స్ డార్విన్ ప్రపంచానికి బాగా తెలిసిన మనిషి. డార్విన్ గురించి అధ్యయనం చేస్తున్నపుడు – గలాపగోస్ ద్వీపాల గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఆ డార్విన్‌గారే హుమ్‌బోల్ట్‌కు అర్పించిన ఘనాతిఘనమైన నివాళి నన్ను ఆకట్టుకొంది. నాకు హమ్‌బోల్టే ప్రేరణ అంటాడు డార్విన్. శాస్త్రశోధనా పితామహుడు అని కీర్తిస్తాడు! అవును. హుమ్‌బోల్ట్ అపూర్వమైన దార్శనికుడు. శాస్త్రవేత్తలను, కళాకారులను, కవులను, రచయితలను ప్రభావితం చేసిన వ్యక్తి. కళలకూ సైన్స్‌కూ తమ తమ ప్రయోజనాల విషయంలో ఏ వైరుధ్యమూ లేదంటాడు. అవి పరస్పర పూరకాలు అంటాడు. ఆ రెండింటినీ మేళవించి ముందుకు సాగాలి అంటాడు.
ముందే అన్నట్టు ఆమధ్య వరకూ నాకు హుమ్‌బోల్ట్ పేరు చూచాయగానే తెలుసు. గత ఏడాది పూర్తి చేసిన లెక్చర్ సీరీస్ పుణ్యమా అని ఆయన గురించి ఎన్నెన్నో వివరాలు తెలిసినా ఎక్వదోర్ లోకి అడుగుపెట్టిన తర్వాతే ఆ వివరాలూ ఎరుకల వల్ల శాస్త్రపరంగాను, కళలపరంగానూ, మానవ విజ్ఞాన సంపదను పరిపుష్టం చేయడంలోనూ ఆయన చేసిన కృషి నా కళ్ళకూ మేధకూ మనసుకూ స్పష్టంగా కనిపించసాగింది. మహానుభావులు నివసించి చరించిన ప్రదేశాలకు మనం ప్రత్యక్షంగా వెళ్ళినపుడు మానవజాతికి వారు అందించిన జ్ఞానసంపద గురించి మరింత గాఢంగా తెలుసుకోగలుగుతాం. మనసూ వివేకమూ ఆ వివరాలు గ్రహించడానికి సంసిద్ధమై ఉంటాయి. ఎక్వ్‌దోర్‌లో అడుగుపెట్టినప్పుడు హుమ్‌బోల్ట్ విషయంలో నాకదే జరిగింది. ఇలాంటి పరిణామం నా ఒక్కడికే పరిమితమో లేక అందరి విషయంలోనూ ఇలాగే జరుగుతుందో తెలియదు. నావరకూ నాకు వాళ్ళ గురించి పుస్తకాలలో చదవడం, టీవీల్లో చూడడం వంటివి కలిగించే అవగాహనా అనుభూతీ వేరు. వారివారి కార్యరంగస్థలాలలో నిలబడి వారినీ వారి కృషినీ ఆకళింపజేసుకునే ప్రయత్నం చేసినపుడు ఆ ‘స్థలం’ నా దృష్టికి ఒక కొత్త కోణం సమకూరుస్తున్నట్టనిపిస్తుంది. అదిగో ఆ అదనపు కోణం నా మనసులో కొత్త ద్వారాలు తెరచి అవగాహనా అనుభూతులను మరింత గాఢం చేస్తుందనుకొంటాను.
సామాన్య ప్రజానీకంలో హుమ్‌బోల్ట్ పేరు అంతగా ప్రాచుర్యంలో లేకపోయినా ఆయన మేధావుల్లో మేధావి. శాస్త్రవేత్తల్లో శాస్త్రవేత్త. అమెరికాలో నేషనల్ పార్కుల వ్యవస్థకు ఆద్యుడు జాన్ ముయిర్ (John Muir), ఫ్రాన్స్ అధినేత నెపోలియన్, వాల్డెన్ (Walden) అన్న సుప్రసిద్ధ గ్రంథం రాసిన హెన్రీ డేవిడ్ థోరో, జర్మన్ తత్వవేత్త గెర్తా (Gertha) – వీళ్ళంతా హుమ్‌బోల్ట్ వల్ల ప్రభావితులైన అతని సమకాలికులు. అలాగే యు.ఎస్.ఎ. మూడవ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్‌కు హుమ్‌బోల్ట్ అంటే ఎంతో గౌరవం, అభిమానం. అమెరికాలో స్థాపించబడిన స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూట్ వెనుక హుమ్‌బోల్ట్ అందించిన ప్రేరణ ఉంది.
శాస్త్రవేత్తల ప్రపంచంలో అలెగ్జాండర్ హుమ్‌బోల్ట్‌ను అమెరికా ఖండాలను రెండవసారి ‘కనిపెట్టిన’ వ్యక్తిగా పరిగణిస్తారు. అంతకు ముందే కొలంబస్‌లూ వాస్కోడిగామాలూ మాజెలాన్‌లూ హెన్రీ హడ్సన్‌లూ కొత్త కొత్త ప్రపంచాలను ఆవిష్కరించిన మాట నిజమేగానీ వారికి ముఖ్యమైనవి వ్యాపార ప్రయోజనాలు, సంపదను సమకూర్చుకోవడం. ఆ తర్వాత ఆయా ప్రదేశాలలో పర్యటించి క్షుణ్ణంగా ఆవిష్కరించిన కెప్టెన్ కుక్, అలెగ్జాండర్ ఫాన్ హుమ్‌బోల్ట్, ఛాల్స్ డార్విన్ లాంటివారికి నూతన ప్రదేశాల అన్వేషణ, వాటి గురించి శాస్త్రీయమైన పరిశోధన అన్నవి మౌలిక ప్రేరణలు. ఆ ప్రదేశాలలో విస్తారంగా పర్యటించి, అనేక కోణాల నుంచి వాటిల్ని పరిశోధించి, ఆయా ఫలితాలను గ్రంథస్తం చేసి మూడు తరాల వారికి అందించిన మహానుభావులు వీరు.
అమెరికా ఖండాలలో తన పరిశోధనలు ముగిశాక హుమ్‌బోల్ట్ యూరప్‌లోనూ, రష్యా దేశపు మారుమూల ప్రాంతాలలోనూ తన అన్వేషణ కొనసాగించాడు. ఆయన సిగలో ఎన్నెన్నో రంగుల పువ్వులు ఉన్నమాట నిజమే అయినా అతను మౌలికంగా యాత్రికుడు, అన్వేషి అన్నది నా భావన. ఈ విషయాలలో ఆయనది తీరని దాహం. ఆ దాహమే ఆయనను తన 90వ యేటి దాకా అన్వేషణలు- ఆవిష్కరణలు అన్న, ముగింపులేని మార్గంలో నడిపించిందనుకొంటాను.
నేను గుయాకీల్‌లో గడిపింది ఒక్క సాయంత్రమే. ఏమాటకామాట – గుయాకీల్ నాకు ఏమంత ఆసక్తికరమైన ప్రదేశం అనిపించలేదు. కానీ ఆ ప్రదేశం నాలో హుమ్‌బోల్ట్ జ్ఞాపకాలను రేకెత్తించింది. అతడిని బాగా గుర్తు చేసుకొనేలా చేసింది. అవన్నీ ఇప్పుడు అక్షరాలలో పెట్టేలా స్ఫూర్తినిచ్చింది. అంచేత మనం ఏ ప్రదేశాన్నీ తక్కువ చేసి చూడగూడదన్నమాట. ఆ ఉత్తేజరహిత ప్రదేశాలు కూడా ఒకోసారి అనూహ్యమైన ప్రేరణ కలిగించగలవు అని అర్థమయింది.
యూనివర్సిటీ ప్రాంగణం దాటి మరికాసేపు నడిచి మలెకోన్ 2000 చేరుకున్నాను. అక్కడి గ్వాయాస్ (Guayas) నదీతీరం పొడవునా చక్కని పచ్చిక బయళ్ళూ కాలిబాటలతో కూడిన ఎస్‌ప్లనేడ్ ఉంది. ఈ గ్వాయాస్ నది గుయాకీల్ దగ్గర పసిఫిక్ మహాసాగరంలో కలుస్తోంది. దక్షిణ అమెరికాలో పశ్చిమ దిశగా ప్రవహించి పసిఫిక్ మహాసాగరంలో కలిసే ముఖ్యమైన నది ఈ గ్వాయాస్ ఒక్కటే. అమెజాన్ లాంటి మిగిలిన నదులన్నీ తూర్పు దిశగా సాగి అట్లాంటిక్ సాగరంలో కలుస్తాయి. మన దేశంలో కూడా ఇతర ముఖ్యమైన నదులకు భిన్నంగా పశ్చిమ దిశలో సాగి అరేబియా సముద్రంలో కలిసే నర్మద, తపతి నదులు గుర్తొచ్చాయి.
మలెకోన్ 2000 ఎంతో ఆధునికంగా కనిపించింది. పచ్చిక బయళ్ళూ కాలిబాటలకు తోడు పూలమడులు, షాపింగ్ మాల్స్, రెస్టరెంట్‌లు, ఎమ్యూజ్‌మెంట్ ఆర్కేడ్‌లు – అంతా అట్టహాసంగా ఉంది. కానీ ఆగి ఆగి పడుతోన్న వర్షం వల్ల కాబోలు అక్కడ పెద్దగా మనుషులు లేరు.
ఓ మధ్యవయసు మనిషి వచ్చి మాకు ఫొటోలు తీసిపెడతావా అని అడిగాడు. ఏవిటా అని చూస్తే అక్కడ పెద్ద సైజు తలగలిగిన కార్టూన్ కేరెక్టర్ లాంటి మనిషి చెక్కసోఫాలో చేరగిలబడి కూర్చుని ఉన్న కంచు విగ్రహం కనిపించింది. బండ ముక్కు, నెత్తి మీద టోపీ, మళ్ళా ఆ టోపీ మీద ఓ నక్షత్రం… దగ్గరకు వచ్చిన మనిషనే గాదు, మరికొంతమంది పర్యాటకులు కూడా అక్కడ ఫొటో దిగడానికి బారు తీరి కనిపించారు. కాసేపు నేను వారి ఫామిలీ ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తాను. వాళ్ళు నాకూ ఫొటో తీసిపెట్టారు. అసలింతకీ ఆ విగ్రహంలోని మహానుభావుడెవరూ? మా మధ్యవయసు మనిషి సమాధానం చెప్పడానికి తడబడ్డాడు. వాళ్ళ టీనేజ్ కుర్రాడు అందుకుని చకచకా వివరాలు అందించాడు: ఆ కేరెక్టర్ పేరు వాన్ పుయేబ్లో (Juan Pueblo) అట. గుయాకీల్ నగరపు సామాన్య మానవుడి ప్రతీక అట. ఊళ్ళోనూ ఆ పరిసర ప్రాంతాల్లోనూ అందరికీ ఇష్టుడైన మనిషి అట. వివరాలు విన్నాక నాకు మన ఆర్కే లక్ష్మణ్‌గారి కామన్ మాన్ గుర్తొచ్చాడు. దేశమంతా తెలిసిన మనిషిగదా ఆ లక్ష్మణ్‌గారి మానస పుత్రుడు… పుణేలోనూ ముంబైలోనూ లక్ష్మణ్‌గారి కామన్ మాన్ విగ్రహాలు ఉన్నాయని విన్నాను… మా టీనేజ్ కుర్రాడు వాన్ పుయేబ్లో పేరు చెప్పి ఊరుకోలేదు – గబగబా యూట్యూబ్ లోకి వెళ్ళి పుయేబ్లో పేరిట కట్టిన స్థానిక గీతపు వీడియో కూడా చూపించాడు! అది నన్ను ఆకట్టుకొంది. ఆ సాయంత్రం మరో రెండు, మూడుసార్లు చూశానా వీడియోను! (అనువాదం చేస్తూ చేస్తూ నేను కూడా రెండుసార్లు చూశానా వీడియోను – అను.)
నడుస్తూ ఉండగా మొక్కజొన్న కండెలు అమ్ముతోన్న వీథి దుకాణం కనిపించింది. ఒకటి తీసుకున్నాను. నిండుగా పండిన కండె అది. దోరగా కాల్చిన తర్వాత ఆ దుకాణదారుడు చక్కగా దాని మీద టమేటో సాసు, మస్టర్డు సాసూ విరజల్లాడు. వాటికి తోడు చీజు కూడా జోడించాడు. మామూలు మొక్కజొన్న కండె కాస్తా రుచికరమైన చిరుభోజనం రూపు తీసుకుంది. ఆ కండెను ఎంతో ఇష్టంగా ఆరగిస్తూ నింపాదిగా మలెకోన్ ఎన్‌ప్లనేడ్ మీదుగా సాగాను. ఆ విలాసం అలా ఓ అరగంట సాగింది. నన్ను అక్కడి ఫుడ్ కోర్ట్‌కు చేర్చింది.
తీరప్రదేశం గదా – గుయాకీల్‌లో సీ-ఫుడ్ పుష్కలం. నేను మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాలలో అంతకుముందే చవిచూసిన సెవీచె అన్న వంటకం ఇక్కడా విరివిగా దొరుకుతోంది. దాని తయారీలో స్థానికంగా చిన్న చిన్న మార్పులు ఉంటాయి గదా. అయినా ఎక్వదోర్ వాసులు తమ ప్రాంతంలో దొరికే సెవిచే మాత్రమే సర్వోత్తమం అని భావిస్తారు.
అక్కడ కనిపించిన అనేకానేక రెస్టరెంట్లలో దేనిని ఎంచుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు బస్సులో పరిచయమైన వాకీన్- స్తెఫానియాల సిఫార్సు గుర్తొచ్చింది. ‘గూస్త్ కోంచాస్’ అన్నది వారు చెప్పిన రెస్టరెంటు. దాన్ని వెతికి పట్టుకొన్నాను. వివరాల్లోకి వెళితే ఆ రెస్టరెంటు దక్షిణ అమెరికాలోకెల్లా అగ్రగణ్యమనీ, దాని గురించి ఎన్నెన్నో సానుకూల సమీక్షలు వచ్చాయనీ, ‘టేస్ట్ ఆట్లస్’ అన్న సంస్థవాళ్ళు ఈ రెస్టరెంటును ప్రపంచంలోని అత్యుత్తమ సెవీచెలు అందించే రెండు రెస్టరెంట్లలో ఒకటిగా పేర్కొన్నారని తెలిసింది. రెండో రెస్టరెంటు పెరూ రాజధాని లిమ లో ఉందట.
నేనొక రొయ్యల సెవీచె ఆర్డరు చేశాను. స్థానికంగా దొరికే బీరూ అడిగాను. ఆ ప్రక్రియలో ఆ రెస్టరెంటు యజమానితో మాట కలిసింది. ‘టేస్ట్ ఆట్లస్ వాళ్ళ రేటింగుల్లో మీది అగ్రస్థానంలో ఉంది’ అని చూపించినపుడు ఆయన సంబరపడ్డాడు. ‘అక్కడ రాసి ఉన్నదంతా స్పానిష్‌లో ఉంది, అనువదించి చెప్పగలవా’ అని అడిగాను. చెప్పాడు. ‘రొయ్యల సెవీచెతోపాటు మా నల్ల ఆల్చిప్పల సెవీచె కూడా రుచి చూడు’ అన్నాడు. అదీ ఆర్డరు చేశాను. దానితోబాటు మరో బీరూ అందించాడు. రెండు సెవీచెలూ నాకు నచ్చాయి. గాఢమైన రుచి – నమలడానికి సులువుగా ఉన్న రొయ్యలు, ఆల్చిప్పలు… వాటిమీది పుల్లని నిమ్మజాతి రసాలు – ఆ భోజనం నాకు బాగా నచ్చింది.
బిల్లు దగ్గరికి వచ్చేసరికి పొరపాటు కనిపించింది. నేను రెండు సెవీచెలు తీసుకుంటే అందులో ఒకదానికే బిల్లు వేసి ఉంది. యజమానికి చెప్పాను. ‘అదేం పొరపాటు కాదు. ఆ రెండో సెవిచె, బీరు మా అతిథికి నేను ఇచ్చే కానుక’ అన్నాడు. ఆ చర్య వెనుక ఉన్న సహృదయత, సౌహార్ద్రత నన్ను ముగ్ధుణ్ని చేశాయి.
ఆ ప్రొమనేడ్ చిట్టచివరిదాకా నడవాలనిపించింది. ఆ కొసన ఉన్న చిన్న కొండ, దానిమీది ఇళ్ళూ వాటిలోని దీపాలూ రారమ్మంటున్నాయి. కానీ వర్షం మాత్రం ఆగనంటోంది. నడవడానికి అనుకూలమైన వాతావరణం కాదది. కొండదాకా వెళ్ళడం అన్న ఆలోచన విరమించుకొని మా హోటలుకు దగ్గరలో ఉన్న రోడ్ల మీద కాలు సాగించాను. వర్షం ఇంకా ఎక్కువయ్యేసరికి అదీ ఆపేశాను. అప్పటిదాకా నాకు చిన్నపాటి రక్షణ ఇస్తోన్న వానకోటు పెరిగిన వర్షపు ఉద్ధృతికి తట్టుకోలేదని తేలింది. పైగా వీధులూ ఇళ్ళూ అన్నీ ఒకేలా కనిపించాయి. బుద్ధిగా హోటలు చేరుకున్నాను.
మర్నాటి ఉదయమే నేను గలాపగోస్ ద్వీపాలకు ఎగిరి వెళ్ళేది.
(సశేషం)