ఉత్తర మొరాకో శోధనలు 4

రిఫ్ కొండలకావల – షెఫ్‌సాన్, టెటువాన్

రోజంతా మౌలె ఇద్రిస్, మెకనెస్ నగరాలలో గడిపి అలసిసొలసి చీకటిపడ్డాక నా స్థావరం- డర్‌డోర్‌ఫెజ్ – చేరుకున్నాను. చేరీ చేరగానే పక్కమీద వాలిపోయాను. మర్నాటి షెఫ్‌సాన్ ప్రయాణానికి ఎలాంటి వాహనం చూసుకోవాలా అన్న ఆలోచనలో పడ్డాను. ఈ రెండు ఊళ్ళ మధ్య దూరం రెండువందల ఇరవై కిలోమీటర్లు. మిడిల్ అట్లస్ పర్వతాలను వదిలిపెట్టి రిఫ్ కొండల ప్రాంతానికి ప్రయాణమన్నమాట. మొరాకో దేశంలో తూర్పు-పడమరలుగా విస్తరించి నాలుగు పర్వతశ్రేణులున్నాయి. ఆంటె అట్లస్ శ్రేణి దక్షిణ కొసన ఉంటే రిఫ్ కొండలు ఉత్తరాన; నడుమన హై అట్లస్, మిడిల్ అట్లస్ శ్రేణులు.

మరోసారి నమీరూ అతని భార్యా నాకోసం అతిచక్కని బ్రేక్‌ఫాస్ట్ తయారు చేశారు. ఓ కప్పు మింట్ టీ తాగుతూ షెఫ్‌సాన్ వెళ్ళడం ఎలా? అన్న విషయం నమీర్‌తో మాట్లాడాను. “మామూలు బస్సయితే ఆగి ఆగి వెళుతూ అయిదు గంటలు తీసుకుంటుంది. గ్రాండ్ టాక్సీ తీసుకో, మూడుగంటల్లో చేరిపోతావు” అన్నాడు నమీర్. టాక్సీలో వెళ్ళడం నాకస్సలు ఇష్టం లేదు అన్నాను. వివరాల్లోకి వెళ్ళీ వెళ్ళగానే ఆ గ్రాండ్ టాక్సీ వైఖరి నాకు అర్థమయింది. పేరు గ్రాండ్ టాక్సీనే అయినా నిజానికి అదో షేర్‌డ్ టాక్సీ వ్యవస్థ. మొరాకో దేశపు ఈ ప్రాంతాలలో నగరాల మధ్య ప్రయాణానికి మామూలు బస్సులతోపాటు ఈ గ్రాండ్ టాక్సీ వ్యవస్థ కూడా ప్రజలు బాగా ఇష్టపడే పద్ధతి. కాస్త ఖర్చు ఎక్కువ అయినా బస్సుతో పోలిస్తే ఇది బాగా వేగవంతం. ఆ గ్రాండ్ టాక్సీ స్టాండుకు వెళ్ళి వరసలో మొట్టమొదట ఉన్న టాక్సీ ఎక్కడం, నాలుగు సీట్లూ నిండాక ఆ టాక్సీ బుర్రుమని ముందుకు సాగిపోవడం–అదీ పద్ధతి. ఇది వెళ్ళీ వెళ్ళగానే వెనక ఉండే రెండో టాక్సీ వంతు వస్తుందన్నమాట…

నమీర్ కుటుంబానికి ఎంతో ఆత్మీయంగా వీడ్కోలు చెప్పాను. మూడునాలుగు రోజులు వాళ్ళ వారసత్వపు రియాద్‌లో – డర్‌డోర్‌ఫెజ్‌లో – గడపడం అన్నది ఆ ఇంటితో ఆత్మీయభావన కలిగించడమే గాకుండా ఒక చక్కని మొరాకో కుటుంబంతో సన్నిహితంగా గడిపే అపురూపమైన అనుభవం నాకు అందించింది. ఆ ఇంటిని వదిలివెళుతోంటే సొంత ఇంటిని వదిలి వెళుతున్నట్టు అనిపించింది.

మా టాక్సీ ఉరకలు వేస్తూ ఫెజ్ నగరపు కొత్త ప్రాంతాలలోని రాజసౌధాల పక్కగా సాగిపోతున్నప్పుడు నాలో నేను అనుకున్నాను: ‘మళ్ళా వస్తాను. తప్పకుండా వస్తాను. ఓ ఫెజ్ నగరమా! త్వరలో వస్తాను.’


నగరం దాటి నాలుగు కిలోమీటర్లు వెళ్ళగానే ఉన్నట్టుండి పోలీసుల సందడి, హడావిడి. రోడ్డుమీద బారులు తీరిన పోలీసు కార్లు – ‘మా రాజుగారు ఇప్పుడు ఇక్కడ తన పల్లెవిడిదికి వచ్చారు. అందుకే ఈ సందడి’ అని వివరం అందించాడు మా డ్రయివరు. మొరాకోలో ఉన్నది పార్లమెంటరీ ప్రజావ్యవస్థ. దానికి ఆ దేశపు రాజే రాజ్యాంగపరంగా అధినేత. ఇప్పటి రాజు – ఆరో మొహమ్మద్ – ఆలోవైట్ రాజవంశానికి చెందున వ్యక్తి. ఆ వంశం గత నాలుగు వందల సంవత్సరాలుగా మొరాకోను పాలిస్తోంది. ముందే చెప్పుకున్నట్టు పదిహేడూ పద్ధెనిమిది శతాబ్దాలకు చెందిన ‘ఘనత వహించిన’ మౌలే ఇస్మాయిల్ ఆ వంశపు దీపమే. 

అక్కడ అన్ని కరెన్సీ నోట్ల మీదా – బ్రిటీషు రాణిగారి బాణీలో – ఆరో మొహమ్మద్‌గారి చిత్రమే మనకు కనిపిస్తుంది. ప్రపంచంలోని బిలియనీరు ప్రభువుల్లో వీరూ ఒకరు. రాచరికమే కాకుండా ఆయనకు వ్యాపార వ్యవహారాలూ ఉన్నాయి. వీరి ఆస్తిపాస్తుల విలువ రెండు బిలియన్ డాలర్లు – అంటే పదిహేను వేల కోట్లు. పోల్చి చూస్తే రాణిగారి ఆస్తిపాస్తులకన్నా నాలుగురెట్లు ఎక్కువ!

మాతో వస్తోన్న ఓ అరవై ఏళ్ళ పెద్దాయనతో కబుర్లాడే ప్రయత్నం చేశాను. చూడ్డానికి ఏదో ప్రొఫెసర్‌లా అనిపించాడు. మాటలు అందుకోడానికి కాస్తంత సమయం తీసుకున్నాడు. మొదట మొదట బింకంగా ఉన్నా రాజుగారి మీద, రాచరికం మీదా తనకున్న అసంతృప్తీ అసహనాల దగ్గరకొచ్చేసరికి గలగలా మాట్లాడ్డం మొదలెట్టాడు. టాక్సీలో ఉన్న మిగతావాళ్ళకు ఇంగ్లీషు తెలియదన్న గ్రహింపుతో ఆ విషయంలో పదునైన వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ రాజును పెంచి పోషించడానికి దేశం రోజుకు పదిలక్షల డాలర్లు ఖర్చు పెడుతోంది. అదో పనికిమాలిన ఖర్చు. తన విలాసజీవితం కోసం ఆయనే తన సొమ్ము ఖర్చు పెట్టుకోవచ్చు కదా’ అన్నది ఆయన భావన. ‘ఆయన ప్రజల్లో బాగా అభిమానం పొందిన వ్యక్తి కదా. అరబ్ స్ప్రింగ్ లాంటి ఉపద్రవాలను ఎదుర్కొని నిలబడ్డ మనిషి కదా’ అని నేనంటే. ‘అతగాడో తెలివైన రాజకీయవేత్త’ అని తిప్పికొడుతూ ‘ఎంత అమాయకుడివయ్యా’ అన్నట్టు నాకేసి ఓ చూపు చూశాడా పెద్దాయన. ఏదేమైనా గత అయిదారేళ్ళలో మూడుసార్లు వచ్చి మొరాకోలో ముప్ఫై రోజులు గడిపిన అనుభవంతో నాకు కలిగిన అభిప్రాయం ఏమిటీ అంటే – ఓ సంపన్న ఆఫ్రికా దేశపు అధినేతగా ఈ రాజు ఎన్ని విపరీతపు పోకడలు పోయినా, ఆయన మొరాకో దేశపు స్థిరత్వానికి, సాంస్కృతిక వారసత్వానికి, దేశపు అఖండయానానికీ దోహదం చేశాడు. ఆఫ్రికాలో అయిదో స్థానంలో నిలిచే ఆర్థికవ్యవస్థకు కారణభూతమయ్యాడు. ఎంతో కొంత అభ్యుదయ భావాలు, రాజకీయ స్థిరత్వమూ దేశానికి ఉండేలా చూశాడు. కాని, నా ఈ అభిప్రాయాలు వాస్తవానికి దూరమయినా అవవచ్చు.


కొద్దిరోజుల క్రితం హై అట్లస్ పర్వత శ్రేణిలోని మౌంట్ తుబ్‌కాల్ శిఖరారోహణలో మూడురోజులు గడిపినప్పుడు మాతో వచ్చిన గైడ్‌లతోను, ఇతర సహాయబృందంతోనూ చాలా సమయం గడిపాను, మాట్లాడాను. వాళ్ళల్లో రషీద్ అన్న మనిషి దేశమంతా బాగా తిరిగిన వ్యక్తి. అతనితో మాటల మధ్య నేను ఉత్తర మొరాకో వెళదామని అనుకుంటున్నాను అని చెప్పాను. అయితే మీరు నాకు ఇష్టమైన ఊరు తప్పక వెళ్ళాలి అన్నాడు రషీద్. అతను ఫెజ్, టాంజియర్, రాబత్, కాసబ్లాంకా – ఇలాంటి వాటి గురించి చెపుతున్నాడనుకున్నాను. కాదు. నేను ఊహించని, నాకు తెలియనే తెలియని నగరం గురించి ఠకాలున చెప్పాడతను! ఆ నగరం పేరు షెఫ్‌సాన్. ‘అది దేశంలోకెల్లా అతి సుందరమైన నగరం’ అని ముక్తాయించాడు రషీద్. అది విన్నాక నాకూ ఆసక్తి కలిగింది. ఆ ఊరి పేరు వినడం నాకదే మొదటిసారి. అసలలాంటి ఊరుందనే నాకు అప్పటిదాకా తెలియదు. తెలిశాక కాస్త పరిశోధన చేశాను. ఆ పరిశోధన మొదలెట్టగానే లోన్లీ ప్లానెట్, డికె ఐ విట్‌నెస్ గైడ్ లాంటి పుస్తకాల ముఖచిత్రాలలో ఈ షెఫ్‌సాన్ నగరమే కనిపించి పలకరిస్తోందని గ్రహించాను. 

మా టాక్సీ ఓ సర్వీస్ స్టేషన్ వద్ద చిన్న బ్రేక్ తీసుకుంది. అప్పటికే మేము రిఫ్ పర్వత శ్రేణిలోకి అడుగుపెట్టాం. ఈ పర్వత శ్రేణి ఉత్తరాభిముఖంగా సాగి సాగి మధ్యధరా సముద్రాన్ని చేరుకుంటుంది. కారు ప్రయాణంలో ఆవహించిన మగతనిద్రను అక్కడ తాగిన మింట్ టీ తరిమేసింది. మనసులో మళ్ళీ ఉత్సాహం నింపింది. మరో రెండు గంటలు గడిచాక మా డ్రయివరు దూరాన పర్వతసానువుల్లో కనిపిస్తోన్న నీలిరంగు మిలమిలలకేసి చూపించాడు. అదే షెఫ్‌సాన్ నగరం! దగ్గరకు చేరగానే తనకున్న పేరు ప్రఖ్యాతులకు తగిన సౌందర్యంతో మమ్మల్ని ఆకట్టుకుందా నగరం.

అంతకు ముందు రోజే ఎల్‌మౌజెన్ అనే ఆ నగరపు సెంట్రల్ ప్లాజాలో ఉన్న పారాడోర్ అన్న హోటల్లో నేను రూము బుక్ చేసుకున్నాను. ఆ హోటలు గది కిటికీలు తెరవగానే చుట్టూ ఉన్న నీలిభవనాలు పలకరించాయి. దూరాన కొండ మీద ఒక చర్చ్ కనిపించింది – దానిపేరు స్పానిష్ చర్చ్ అట. 

గదిలోంచి బయటపడి పట్నంలోకి నడిచాను. మూడొందల గజాలలోనే ఉటా అల్‌హమామ్ అనే విశాలప్రాంగణం కనిపించింది. దానికి ఒకపక్కన పాత మట్టికోట ఉన్న కస్బా ప్రాంతం, గ్రాండ్ మసీదూ ఉంటే మరో పక్కన ఆ నగరపు మదీనా ప్రాంతం విస్తరించి ఉంది. ఆ ప్రాంగణంలోనే అలకాలపు వృక్షాలతో నిండిన ఒక పార్కు కూడా ఉంది. చూడచక్కని ప్రదేశమది. చెదురుమదురుగా మనుషులు కనిపించారు – చాలావరకూ స్థానికులే. అక్కడ ఉన్న అనేకానేక కఫేలు మాత్రం కస్టమర్లతో కిక్కిరిసి కనిపించాయి. ఫెజ్, మరకేష్ లాంటి వడినిండిన నగరాలతో పోలిస్తే షెఫ్‌సాన్‌ ఎంతో నింపాదిగా సాగిపోయే ప్రదేశం అనిపించింది. 

ఉటా అల్‌హమామ్ ప్రాంగణం నుంచి మెలికలు మెలికలుగా సాగిపోయే చిరువీధి నొకదానిని పట్టుకుని మెల్లిగా ఆ ఊరి మదీనా నడిబొడ్డుకు చేరుకున్నాను. అదంతా నేల మీద పరచుకున్న నీలిసముద్రం అనిపించింది. అందుకే ఆ నగరాన్ని ‘మొరాకోదేశపు నీలిముత్యం’ అని వ్యవహరించేది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఒకరూ ఇద్దరూ టూరిస్టులు తప్పిస్తే నాకు తటస్థపడిన వాళ్ళంతా తమ తమ రోజువారీ పనుల్లో తిరుగాడే స్థానికులే. అన్నట్టు, ఆ నగరం కళాకారుల అభిమాన ప్రాంగణం. అక్కడ కొన్ని ఆర్ట్ గ్యాలరీలు కనిపించాయి. కొంతమంది వీధికళాకారులు కూడా కనిపించారు. ఆ నగరపు ఉల్లాస వాతావరణం కళాకారులను తనకేసి ఆకర్షిస్తుందనుకుంటాను. 

షెఫ్‌సాన్ నాలుగున్నర శతాబ్దాల చరిత్ర కలిగిన నగరం. క్రిస్టియన్ పాలకులు స్పెయిన్ దేశపు దక్షిణ భాగాన ఉన్న అండాలూసియా ప్రాంతాన్ని, దాన్ని పరిపాలిస్తోన్న మూరిష్ రాజునుంచి తిరిగి గెలుచుకున్న సందర్భం ఒకటి ఉంది. ఆ సమయంలో ఆ ప్రాంతం విడిచి పారిపోయిన యూదులకు, ముస్లిములకూ ఆశ్రయమిచ్చిన నగరమది. ఏ కారణం వల్లనో 1930లలో ఆ నగరవాసులు తమ ఇళ్ళకు నీలిరంగు వేయడం మొదలెట్టారు. ఆ రంగు పుణ్యమా అని నగరానికి ఒక విలక్షణమైన గుర్తింపు వచ్చింది. అలా ఆ రంగూ స్థిరపడిపోయింది.

నగరపు వీధులు, ఆ వీధులలో తిరుగాడటం – ఆ అనుభవాల మధ్య నేను భోజనం సంగతి మరిచేపోయాను. అది గ్రహించేసరికి లంచ్ చేసే వేళ గడిచిపోయింది. ఇహ లంచ్ సంగతి పక్కన పెట్టి తినడానికింకేమైనా దొరుకుతుందా అని అటూ ఇటూ చూశాను. వేడి వేడి ఉప్పుకళ్ళ మధ్య వేరుశెనగలు వేయిస్తున్న వీధివ్యాపారి కనిపించాడు. రుచికరమైన వేడి వేడి వేరుశెనగలు ప్రపంచమంతటా ప్రాచుర్యం ఉన్న తినుబండారం కదా – పైగా అవి శుచికరం, ఆరోగ్యకరం! వాటిని తినాలనే కోరికకు సంతోషంగా లొంగిపోయి శంకువు రూపపు న్యూస్‌పేపరు పొట్లంలో ఆ వ్యాపారి అందించిన వేరుశెనగలు తీసుకున్నాను. 

పలకలు పరిచిన సందులగుండా గోరువెచ్చని వేరుశెనగలు ఆరగిస్తూ ఆ మదీనాలో గమ్యం లేని ఉల్లాసపు నడక కొనసాగించాను. అక్కడి అడుగడుగూ ప్రతి మలుపూ విలక్షణంగా సుందరంగా కనిపించాయి. మనసును గొప్ప సంతోషంతో నింపాయి. ఫోటోలు తీసుకో రా రమ్మన్నాయి. ఆ వీధులన్నీ పాదచారులకే అంకితం. భవనాలే కాకుండా అక్కడి వీధులూ సందుగొందులూ కూడా నీలిరంగు సంతరించుకొని కనిపించాయి. వాతావరణమంతా ప్రశాంతంగా సమ్మోహనంగా తోచింది. ఆ మదీనాలో అగమ్యంగా తిరుగాడుతూ ఎన్నెన్ని ఫోటోలు తీశానో నాకు లెక్కే తెలియలేదు. అలా తిరిగి తిరిగి రెండు గంటల తర్వాత మళ్ళీ ఊరి ముఖ్యప్రాంగణం చేరాను. అక్కడి పాత మట్టికోటలో యాత్రికులకు ప్రవేశం ఉంది. రుసుము అరవై డిర్హమ్‌లు. లోపల ఒక మ్యూజియమ్ కూడా ఉంది. అంతకు రెండురోజుల క్రితం షెఫ్‌సాన్‌లో తిరుగాడిన నా చైనా స్నేహితుడు రుఇ అప్పటికే నాకో మెసేజ్ పంపాడు – కస్బా కోటలోకి వెళ్ళక, అరవై డిర్హమ్‌లు దండగ అవుతాయి, అని. అయినా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. నిజానికి ఆ కోట లోపలకంటే బయటనుంచే బాగుందనాలి. కోటలోంచి బయటకు వచ్చేటపుడు కనిపించిన ఒక నిడుపాటి గోపురం నన్ను ఆకర్షించింది. అందరితో పాటు నేనూ ఆ టవర్ ఎక్కాను. పైనుంచి అన్ని దిక్కులా చక్కని దృశ్యాలు కనిపించాయి. ఈ టవరొక్కటే చాలు నా పైసా వసూల్‌కు అనిపించింది. 

ఆ గోపురం అంతస్తులు అంతస్తులుగా ఉంది. ప్రతీ అంతస్తులోనూ ధనువు ఆకారపు ఖాళీ కంతలున్నాయి. అవి చక్కని విస్టాపాయింట్లుగా ఉపకరిస్తున్నాయి. ఆ అంతస్తులు ఒకదానిలో రబాత్ నుంచి వచ్చిన ఇద్దరు యూనివర్శిటీ విద్యార్థినులు తారసపడ్డారు – షెఫ్‌సాన్‌లో హాలీడే కోసం వచ్చారట. వాళ్ళల్లో ఒకామె కాస్త చురుకు. మీదే దేశం అని అడిగింది. అలా దేశదేశాలనుంచి వచ్చిన వాళ్ళను పలకరించి మాట్లాడటం ఆవిడకి ఇష్టమట. అలా మాట్లాడితే ప్రపంచమంతా తిరిగిన సంతోషం కలుగుతుందట! ‘ఇప్పటిదాకా ఏ ఒక్క భారతీయుడినీ కలుసుకోలేదు. ఇప్పుడు కలుసుకున్నాను’ అని సంబరపడిందామె. ‘కలవనే లేదా!’ అనే నా ఆశ్చర్యపు ముఖభంగిమ చూసి ‘అహ, కలవలేదని కాదు కాని, సరిగ్గా మాట్లాడటం కుదరలేదు’ అని చెప్పిందావిడ. కాసేపు కబుర్లు చెప్పుకొని రెండు మూడు ఫోటోలు తీసుకున్నాం. ఒక భారతీయుడితో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది అని ఆమె అంటే, నీ కోరికల కుచ్చుటోపీలో ఒక నెమలి ఈకను చేర్చినందుకు నాకూ సంతోషంగా ఉందని నేను స్పందించాను. 

షెఫ్‌సాన్‌ ప్రజలు మృదుభాషులు, ప్రశాంతజీవులు. తమ పనేదో తాము చేసుకుంటూ పోయేవాళ్ళు. మరకేష్, ఫెజ్ నగరాల్లో మొహం మీద గుచ్చి గుచ్చి మాట్లాడే మనుషుల్ని చూశాక ఇక్కడివాళ్ళను చూస్తే మలయపవనం సోకిన భావన. ఇతర పట్టణాల్లో లాగా ఇక్కడ దళారీల వేధింపులు లేవు. బలవంతపు అమ్మకాలు లేవు. 

ఓ కప్పు కాఫీ తాగుతూ ఒక రాతిబెంచి మీద చేరగిలబడి అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించసాగాను. మెలమెల్లగా జనసందోహం పెరిగింది. రెస్టారెంట్లు, టీ షాపులు, పళ్ళరసాల దుకాణాలలో అమ్మకాలు ఊపందుకున్నాయి. అప్పటిదాకా నాకు కాస్త దూరంలో కూర్చొని ఉన్న ఇద్దరు యువకులు నా దగ్గరకు వచ్చి పలకరించారు. కబుర్లు మొదలెట్టారు. దళారీలేమో అని ముందు సంకోచించాను. నాలుగు మాటలు సాగేసరికి నా అనుమానాలు తొలగిపోయాయి. వాళ్ళిద్దరూ మర్యాద ఉట్టిపడే నవయువకులని బోధపడింది. మహమ్మద్, జుబ్స్ అన్నవి వాళ్ళ పేర్లు. వాళ్ళీమధ్యే డిగ్రీ ముగించి స్థానిక పాఠశాలలో టీచర్లుగా చేరారట. కాసేపు మాటలు సాగాక వాళ్ళు అక్కడికి ఇరవై నిమిషాల నడక దూరంలో ఉన్న కొండ మీది స్పానిష్ చర్చ్‌ దగ్గరికి సూర్యాస్తమయం చూడటానికి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తేలింది. నా ఆసక్తిని గమనించి నన్నూ రమ్మని ఆహ్వానించారు. అక్కడ్నించి సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తుందని చెప్పారు. సరే అన్నాను. మాటల మధ్య ‘మేమిద్దరం ఇంగ్లీషు నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాం’ అన్నారా యువకులు. మీరిప్పటికే చక్కని ఇంగ్లీషు మాట్లాడుతున్నారని భరోసా ఇచ్చాను. 

నడక మొదలెట్టగానే ఊరంతా సూర్యాస్తమయం చూడటానికి స్పానిష్ చర్చికేసి సాగిపోతోందా అనిపించింది. మేము ముగ్గురం కాస్త దూరం మదీనా ప్రాంతం గుండా నడిచి, ఓ వాగును దాటుకొని మెల్లగా కొండపైకి చేరాం. ఎంతో అందమైన ప్రదేశమది. ‘మొరాకోలో ఇంత అందమయిన ప్రదేశం ఉంటుందని నేను ఊహించనయినా ఊహించలేదు’ అన్నాను వాళ్ళతో. మహమ్మద్ మంచి ఫోటోగ్రాఫరు – మొరాకోలో ఏ ఇతరప్రదేశం కన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో షెఫ్‌సాన్‌ ఫోటోలే ఎక్కువ కనిపిస్తాయి అన్న వివరమందించాడతగాడు. బయట ప్రపంచంలో షెఫ్‌సాన్‌ గురించి తెలిసింది అతి తక్కువ అన్నాడు జుబ్స్. నిజమే – అలా అనామకంగా ఉండటం, చేరుకోడానికి కష్టమయిన ప్రదేశం అవడం షెఫ్‌సాన్‌కు ఒకరకంగా వరాలు. తండోపతండాలుగా టూరిస్టులు చేరడం, ఆ ఊరి సమ్మోహనసౌందర్యానికి గండి కొట్టడం – అన్న ప్రమాదం అలా తప్పింది. మేము దారిలో మదీనాలో చూసిన చక్కచక్కని ఇళ్ళు యూరోపియన్లకు చెందినవని, వాళ్ళంతా ఉద్యోగవిరమణ తర్వాత ఈ సుందరప్రదేశంలో స్థిరపడటానికి ఇష్టపడ్డవారనీ చెప్పాడు మహమ్మద్. ఆ యువకులిద్దరికీ వాళ్ళ ఊరంటే ప్రేమ. కాస్తంత గర్వం కూడా. 

ఆ స్పానిష్ చర్చి దగ్గర అప్పటికే రెండు మూడు వందలమంది చేరుకుని ఉన్నారు – అందులో ఎక్కువమంది స్థానికులే. సూర్యాస్తమయం చూడటానికే కాదు, ఊరంతటినీ విహంగవీక్షణం చెయ్యడానికి కూడా అది ఎంతో అనుకూలమైన ప్రదేశం. చుట్టూ నిడుపాటి రిఫ్ పర్వతశిఖరాలు – అందులోని ఒకటి రెండు కొండవాలుల మధ్య విస్తరించి వున్న షెఫ్‌సాన్‌ నగరం, పడమటి దిక్కున అస్తమిస్తోన్న సూర్యుడు ఆ శిఖరాలను బంగారు రంగులో వెలిగించడం – చూడచక్కని, జ్ఞాపకాల అరల్లో భద్రంగా దాచుకోవలసిన దృశ్యమది. 

చీకటి పడిపోయింది. ముగ్గురం మెల్లగా నడిచి నగరమధ్యానికి చేరాం. నా మర్నాటి టాంజియర్ పట్నపు ఆలోచన గురించి విని ఆ యువకులు మధ్యలో వచ్చే టెటువాన్ పట్నాన్ని కూడా తప్పకుండా చూసి వెళ్ళమని గట్టిగా చెప్పారు. ఆ పట్నం దారిలోనే వస్తుంది కాబట్టి అక్కడ కాసేపు ఆగినా పొద్దుపోయే సమయానికల్లా నేను టాంజియర్ చేరుకోగలనని చెప్పారు. వాళ్ళిద్దరూ టెటువాన్ యూనివర్శిటీలో చదివారు. మంచి మంచి జ్ఞాపకాలను సంతరించుకున్నారు. ఊరంతా తిరిగి ఎలా చూడాలో, ఊళ్ళోని ముఖ్యమైన ప్రదేశాలు ఏమిటో – ఆ వివరాలన్నీ అందించారా యువకులు. 

మూడు నాలుగు గంటల సాహచర్యం తర్వాత ముగ్గురం విడివడ్డాం. హోటలు చేరుకొనే ముందు డిన్నర్ పని ఒకటి ఉంది కదా. పైగా మధ్యాన్నం లంచ్ కూడా చెయ్యలేదు – పుష్టికరమైన భోజనం తినడం తప్పనిసరి. నా కొత్తమిత్రులు సిఫారసు చేసిన హిచిమ్ రెస్టారెంటు వైపు దారి తీశాను. అక్కడి డైనింగ్ ఏరియా అనేక అంతస్తుల్లో విస్తరించి ఉంది. పై అంతస్తు లోని ఒక టేబుల్ని ఎంచుకున్నాను. అక్కణ్ణించి దిగువనున్న విశాలప్రాంగణం చక్కగా కనిపిస్తోంది. వెలుగు తగ్గించిన దీపాలకాంతిలో కళాకారులు సృష్టిస్తోన్న వాద్యసంగీతం మంద్రంగా వినిపిస్తోంది. 

ముందుగా బిసారా అన్న కాయధాన్యాల సూప్ ఆర్డర్ చేశాను. పొడుగుపాటి బీన్స్‌తో చేసిన వంటకమది. ఎంతో రుచిగా ఉంది. జుబ్స్ సిఫారసు చేసిన సూప్ అది. తనకెంతో ఇష్టమైన సూప్ అన్నాడు జుబ్స్. శీతాకాలంలో కుటుంబసభ్యులంతా కలిసి తాగే సూప్ అట. అది అయ్యాక చికెన్ బుర్ఖక్ తెప్పించాను. అది షెఫ్‌సాన్‌ నగరపు ప్రత్యేకవంటకం – అల్ బుఖారా, బాదం పప్పూ వేసి వండిన టుజిన్ వంటకమది. డిన్నరు ముగించేసరికి రాత్రి తొమ్మిదయింది. మెల్లగా నా హోటలుకేసి సాగాను. దారిలో ఇద్దరు ఆగంతకులు దగ్గరకు చేరి గంజాయి కావాలా అని గుసగుసలాడారు. ఆ ప్రాంతంలో గంజాయి వాడకం విరివిగా సాగుతున్నట్టుంది. అలా అడిగిన వాళ్ళందరికీ వద్దు అని స్థిరంగా చెబుతూ హోటలుగది చేరుకున్నాను. మర్నాటి ప్రయాణంలో టెటువాన్ పట్టణం కోసం రెండు మూడు గంటలు ఎలా కేటాయించాలా అన్న ఆలోచనలో పడ్డాను. 


మర్నాడు బాగా పొద్దున్నే లేచి మదీనా ప్రాంతపు పలకల దారుల్లో నడిచాను. దారులన్నీ నిర్మానుష్యం. ఆహ్లాదకరమైన వాతావరణం. ఉదయభానుని బంగారు కిరణాల వెలుగులో మెరిసిపోతున్న నీలిరంగు బాటలు. ఊరంతా నాకోసమే పరచుకొని ఉన్న భావన. నగరపు అంతరాత్మతో వ్యక్తిగతంగా సంభాషిస్తోన్న భావన – అదో అమూల్యమైన అనుభవం. ఆ నగరం గురొచ్చినప్పుడల్లా ఆ ఉదయపుటనుభవం మనసులో మెదలాడుతుంది. 

మదీనా ముఖ్యప్రాంగణంలో నడకలు ముగించేసరికి ఉదయం ఎనిమిది అయింది. కస్బా దగ్గరి కఫే ఒకదాంట్లో వేడి వేడి కాఫీ కోసం చేరగిలబడ్డాను. కొంతమంది స్థానికులు అప్పటికే ఉదయపు అల్పాహారం తీసుకుంటున్నారు. ‘బెర్బర్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటారా?’ అని వెయిటర్ అడిగాడు. వద్దనలేక పోయాను. అనాది కాలంనుంచీ రిఫ్ పర్వతాలు బెర్బర్ తెగవారి నివాసప్రాంతాలు. ఆ బెర్బర్ బ్రేక్‌ఫాస్ట్ రుచి చూడటానికి ఆ షెఫ్‌సాన్ కఫే కన్నా సరి అయిన ప్రదేశం ఇంకేం ఉంటుందీ!? తాజా బ్రెడ్డు, మెస్సెమ్మెన్ అనే మొరాకోబాణీ పరోటాలు, ఒక ఆమ్లెట్టు, తేనె, పచ్చనీ నల్లనీ ఆలివ్‌లు, శెనగలు, బాదంపప్పులు, తేనే ఆలివ్ ఆయిలూ కలగలిపి చేసిన ఆమ్‌లౌ అనే గోధుమరంగు లేహ్యం – ఇవీ బ్రేక్‌ఫాస్ట్‌ లోని ఆధరువులు. బాగా పుష్ఠికరమైన అల్పాహారమది. అవన్నీ ముగించాక మింట్ టీ రానే వచ్చింది. అక్కడితో సరిపెట్టకుండా నా కెఫీన్ లాలస తీర్చుకోవడానికి ఒక స్ట్రాంగ్ కాఫీ కూడా పుచ్చుకున్నాను. 

షెఫ్‌సాన్‌కు వీడుకోలు పలికే సమయం వచ్చింది. అనుకోకుండా ఇలాంటి ఆణిముత్యం లాంటి నగరంలోకి అడుగు పెట్టినందుకు చాలా సంతోషం కలిగింది. టెటువాన్ ప్రయాణం కోసం గ్రాండ్ టాక్సీ స్టాండ్ వేపుగా సాగాను. ఈ సారి నా వంతుకు ఒక పాతబడిన మెర్సిడెస్ కారు వచ్చింది. అప్పటికే ఆ టాక్సీ వెనక సీట్లో ఒక మధ్యవయసు దంపతులూ మరో పెద్దవయసు మహిళా కూర్చొని కనిపించారు. మిగిలివున్న ఒకే ఒక్క ముందు సీటూ తీసుకోవడానికి వచ్చే ఒంటరి ప్రయాణీకుడి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు వాళ్ళంతా. నేను వెళ్ళి ఆ ఖాళీ పూరించగానే టాక్సీ నగరపు సీమను దాటుకొని కొండల బాటలో ఉత్తరాన ఉన్న టెటువాన్ నగరం వైపుకు దౌడు తీసింది. 

రిఫ్ పర్వతాల దృశ్యమాలిక కనువిందు చేసింది దారిలో. రెండు అందమైన చెరువులు దాటుకొని వెళ్ళాం. ఆ అందాల ప్రకృతి నీలినీడలలో నలనల్లని రహస్యమొకటి దాగివుందట. ఆ ప్రాంతమంతా చట్టవిరుద్ధంగా గంజాయి పండించడానికి ప్రసిద్ధి. ఆ రిఫ్ పర్వతప్రాంతానికి ‘ప్రపంచపు గంజాయి రాజధాని’ అన్న అపఖ్యాతి కూడా ఉంది. ఆ ప్రాంతానికి చెందిన అయిదు లక్షలమందికి జీవనాధారం ఈ గంజాయి పంటేనట! ఏభైవేల హెక్టార్‌లలో గంజాయి సాగు సాగుతోందట. గంజాయి రెసిన్ నుంచి హషీష్ అనే మరింత గాఢమైన మత్తుమందు తయారు చేస్తారట. ‘ప్రపంచంలోని హషీష్ సరఫరాలో సగభాగం సరఫరా చేస్తుంది’ అన్న చెప్పరాని గొప్ప ఖ్యాతి ఆ ప్రాంతానికి ఉందట. ఆ గంజాయి సాగును నివారించడంలో చేతులు ఎత్తేసిన మొరాకో దొరతనం ఆమధ్యనే దాన్ని చట్టబద్ధం చేసిందట. వైద్యరంగం లోను, పరిశ్రమల్లోనూ ఉపయోగించటం కోసం ఆ పంటను ఎగుమతి చేసేందుకు రైతులకు ప్రోత్సాహం ఇస్తోందట. 

గంటన్నర ప్రయాణం తర్వాత తళతళలాడే ధవళవర్ణపు టెటువాన్ పట్నం దూరం నుంచి కనిపించింది. గ్రాండ్ టాక్సీ స్టాండ్ చేరుకున్నాక ప్లాజా ప్రీమో అన్న ప్రదేశానికి మరో టాక్సీ తీసుకున్నాను. ఈ ప్లాజా పరిసరాల్లో దక్షిణ యూరోపియన్ శైలి బడా భవనాలు కనిపించాయి. ఎవరినైనా చిన్న విమానంలో ఇక్కడ దించితే సదరు వ్యక్తి స్పెయిన్‌లో ఉన్నానని పొరబడినా మనం తప్పు పట్టక్కర్లేదు. 1912నాటి ఫ్రాన్స్ సంధి ఒప్పందం తర్వాత ఈ పట్నమూ పరిసర రిఫ్ పర్వతప్రాంతమూ స్పెయిన్ రక్షితప్రదేశాలయ్యాయి. 1956లో మళ్ళా మొరాకోలో కలిశాయి. ఈ పరిణామాల పుణ్యమా అని ఈ ప్రదేశం మీద స్పానిష్ ప్రభావం చాలా ఎక్కువ. భౌగోళికంగా చూసినా ఈ ప్రాంతానికి స్పెయిన్ రాతివేటు దూరంలోనే ఉందనాలి – జిబ్రాల్టర్ జలసంధి దగ్గర మధ్యధరా సముద్రం దాటి అవతల ఒడ్డుకు చేరితే ఇహ అదంతా స్పెయిన్ దేశమే. 

ప్లాజా ప్రీమో దగ్గర్నించి ప్లేస్ ఎల్ ఫెడేన్ అన్న చోటుకు నడుచుకుంటూ వెళ్ళాను. ఎంతో సంభ్రమాశ్చర్యాలు కలింగించేంత అందమైన ప్రదేశమది. అక్కడ నిలబడి చూస్తే తెల్లటి ఇళ్ళతో నిండిన పర్వతసానువులు కనిపించాయి. టెటువాన్ పట్నాన్ని ‘మధ్యధరా ప్రాంతపు శ్వేతకపోతం’ అని ఎందుకంటారో ఆ క్షణాన అర్థమయింది. ఆ పార్కులో ఉన్న అనేకానేక మొజాయిక్ బెంచీల్లో ఒకదానిమీద చేరగిలబడి పరిసర సౌందర్యాస్వాదనలో పడ్డాను. ఈ ఊళ్ళో ఇంకా ఎంతసేపు గడపాలీ? అన్న మీమాంసలోనూ పడ్డాను. అప్పటికే ఊరు చూపిస్తామనే ఒకరిద్దరు జలగ గైడ్‌ల బారిన పడటం, విడిపించుకోవటం జరిగింది. అలా ఆ బెంచ్ మీద కూర్చుని ఆలోచిస్తూ పది నిమిషాలు గడిచాక ఒక స్థానికుడు వచ్చి నా పక్కన చేరాడు. మెల్లగా సంభాషణ ఆరంభించాడు. అతని ధోరణి మృదువుగా ఒత్తిడి చేయని విధంగా అనిపించింది. నాకు రుచించింది. రెండు గంటలపాటు ఆ మదీనా ప్రాంతమంతా తిప్పి చూపిస్తానన్నాడు. అందుకు అడిగింది కూడా మరీ ఎక్కువేం కాదు. సరే అన్నాను. అతని పేరు రహీమ్. 

అక్కడి మదీనా ఒక గుట్ట మీద ఉంది. ఓ పెద్ద దర్వాజా గుండా ఆ మదీనాలోకి ప్రవేశించాం. పచ్చ తలుపులతో, వెల్లవేసిన పురాభవనాలను అబ్బురంగా చూస్తూ రహీమ్ వెంట నడిచాను. స్థానికులు స్థిరనివాసం ఉండే మదీనా – వారి నిత్యజీవన సరళిని గమనించడానికి చక్కటి అనుకూలమైన ప్రదేశం. సువనీర్ షాపులు, టూరిస్టు ఆకర్షణల బెడద లేని ప్రాంతమది. అంచేత అదంతా ఎంతో సరళంగా ఆత్మీయంగా అనిపించింది. యునెస్కో వాళ్ళు ఆ మదీనాను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారట. 

మధ్యాహ్నం రెండయింది. అక్కడి స్వీట్ల షాపుల పక్కనుండి వెళుతుంటే లంచ్ చేయలేదన్న సంగతి ఉన్నట్టుండి గుర్తొచ్చింది. గుర్తు వచ్చీ రాగానే ఆకలి నేనున్నా అంటూ ప్రత్యక్షమయింది. ఆ ఉదయాన్నే షెఫ్‌సాన్‌లో తిన్న పుష్ఠికరమైన బ్రేక్‌ఫాస్ట్‌ నన్ను ఇప్పటిదాకా నడిపించిందన్నమాట. ఇక్కడ ఏమన్నా తినడానికి వీలు అవుతుందా అని రహీమ్‌ను అడిగాను. మరో పదినిమిషాల్లో తినుబండారాల దుకాణం కనిపించింది. ఇరికించి ఇరికించి అమర్చిన కొద్దిపాటి కుర్చీలు. వాటి నిండుగా ఇరుక్కొని కూర్చున్న కస్టమర్లు. 

కాసేపు ఆగాక మాకో రెండు కుర్చీల టేబుల్ దొరికింది. ‘నువ్వూరా, కలిసి తిందాం’ అని రహీమ్‌ను పిలిచాను. సంకోచించాడు. కాస్తంత సర్దిచెప్పాక వచ్చి నాతో కూర్చున్నాడు. రెండు గంటల్నించీ నాతోనే కలసి తిరుగుతున్నాడు కదా. అతను లంచ్ చేసి ఉండటమన్న మాటే లేదు. మా పక్క టేబుల్లో కూర్చున్న టీనేజ్ కాలేజ్ అమ్మాయిలు అక్కడ కనిపిస్తున్న తినుబండారాల వివరాలు అందించడానికి, ఏమేం ఆర్డర్ చెయ్యాలో తేల్చుకోడానికీ ఎంతో ఉత్సాహంతో సాయపడ్డారు. చివరికి మా వెయిటర్ త్రికోణాకారపు పఫ్‌లాంటి పేస్ట్రీలు అందించి వెళ్ళాడు. వాటిని బ్రైయౌట్ అంటారట. చూడ్డానికి సమోసాల్లా ఉన్నాయి కాని రుచి వేరు. ఏదేమైనా తినడానికి బాగున్నాయి. వాటిల్ని కొరికి తింటూ ఆ కాలేజ్ పిల్లలతో వాళ్ళ ఊరు గురించి ముచ్చట్లు పెట్టుకున్నాను. గొప్ప సంతోషోల్లాసాలతో తుళ్ళిపడుతున్నారు వాళ్ళంతా. నవయవ్వనం… అవధి లేని చురుకుదనం… ఇంకా అవగాహనకు రాని జీవన వాస్తవాలు…మరి కొన్నేళ్ళలో వాళ్ళూ ఈ అనుదిన పోరాటాల అనుభవాలు పొందే మాట నిజమేగాని, ఆ క్షణాన వాళ్ళంతా మూర్తీభవించిన జీవనోత్సాహపు ప్రతీకలు. నేనూ రహీమూ మా మా తిండీతిప్పలు ముగించి, తాజా దానిమ్మరసంతో ముక్తాయించాం. నాకు సాయపడినందుకు ఆ పిల్లలకు థాంక్స్ చెప్పాను. తామంతా ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి సాయం చేసినందుకు వాళ్ళు నాకు థాంక్స్ చెప్పారు. 

లంచ్ ముగించాక రహీమ్ నన్నో మూలికలు, హర్బల్ తైలాలూ అమ్మే దుకాణానికి తీసుకెళ్ళాడు. వారి సంప్రదాయ వైద్యపు ఉపకరణాలవి. ఆ దుకాణం ఓ అలకాలపు భవనంలో ఉంది. మేము ఆ దుకాణంలో సమయం గడిపినందుకు ప్రతిగా మమ్మల్ని ఆ భవనపు పైకప్పుకు వెళ్ళి అక్కడినుంచి దృశ్యాలను చూసి ఆనందించేందుకు అనుమతించాలన్న కోరికను రహీమ్ దుకాణదారుడి ముందు ఉంచాడు. నేను మాత్రం అక్కడి మనిషికి స్పష్టంగా చెప్పాను: నా బాక్‌పాక్‌లో ఏమాత్రం చోటు లేదు కాబట్టి కొనడం లాంటి పనులేమీ పెట్టుకోను కాని, ఓ పదినిమిషాలు అక్కడ సంతోషంగా గడుపుతాను. అన్నట్టుగానే వాళ్ళు వాళ్ళ మూలికలూ తైలాల గురించి చెప్పిన వివరాలన్నీ ఎంతో శ్రద్ధగా విన్నాను. అరబ్ ప్రపంచంలో  బాగా ప్రాచుర్యం ఉన్న వైద్య ఉపకరణాలవి. అంతా విన్నాక రెండతస్తుల మెట్లు ఎక్కి భవనం పైకి చేరుకున్నాం. అనుకున్నట్టే అక్కణ్ణించి తెల్లతెల్లని భవనాలు, రిఫ్ పర్వతాలు కనిపించి కళ్ళకు విందు చేశాయి. ఎదురుగా చూస్తే ఆ మధ్యే రూపు దిద్దుకున్న కొత్తపట్టణం, బాగా దూరాన తళుకులీనుతున్న మధ్యధరా సముద్రం కనిపించాయి. మొరాకో దేశపు ముఖ్యమైన రేవు పట్టణాలలో టెటువాన్ ఒకటి.

అక్కణ్ణించి మేమిద్దరం యూదుల సంప్రదాయ గృహాలు ఉన్న చోటుకు వెళ్ళాం. వాటన్నిటికీ ఆకుపచ్చ రంగు వేసిన ద్వారాలు. ఆపైన మదీనా నుంచి బైటపడి అక్కడ ఉన్న ఒక రాజప్రాసాదం దగ్గరికి వెళ్ళాం. ఆ భవనంలోకి సాధారణ ప్రజానీకానికి ప్రవేశం లేదు. 

నగర సందర్శన ముగిసిందనిపించాక ఇద్దరం మింట్ టీ తాగుతూ కబుర్లు పెట్టుకున్నాం. రహీమ్ ప్రాథమికవిద్య దశను దాటి పై చదువులు ఏమీ చదవలేదని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. తను నేర్చుకున్నదంతా అనుభవం లోంచేనట! అయినా అతనికి అయిదు భాషల్లో ప్రవేశం ఉంది. అరబిక్, బెర్బర్‌లతో పాటు, ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్ మాట్లాడగలడు. టెలివిజన్ కార్యక్రమాలు చూసి, ఆపైన నాలాంటి వాళ్ళతో మాట్లాడీ ఇంగ్లీషు నేర్చుకున్నాడట. ముచ్చట వేసింది. అంతా కలిసి ఇద్దరం నాలుగు గంటలు గడిపాం – మధ్యాహ్నమంతా కలిసి గడిపాం. విడిపోయేముందు నేను అనుకొన్న దానికన్నా ఎక్కువగా ముట్టచెప్పాను. అది మా ఇద్దరికీ సంతోషం కలిగించింది. అతనితో గడిపినంతసేపూ ఎప్పట్నుంచో నేను ఎరిగిన స్నేహితుడితో గడిపినట్టనిపించిందే తప్ప ఒక అపరిచిత టూరిస్ట్ గైడుతో గడిపినట్టు అనిపించనే అనిపించలేదు. 

షెఫ్‌సాన్‌లో కొత్తగా పరిచయమయిన మహమ్మద్, జుబ్స్‌ల ప్రేరణ లేనట్టయితే అసలు నేను టెటువాన్ వైపు వచ్చేవాణ్ణే కాదు. తుబ్‌కన్ శిఖరారోహణలో గైడుగా వ్యవహరించిన రషీద్ గట్టిగా చెప్పకపోతే షెఫ్‌సాన్‌ కూడా చూచేవాణ్ణి కాదు – తిన్నగా ఫెజ్ నగరం నుండి టాంజియర్ వెళ్ళిపోయి ఉండేవాడిని. ఒక పూర్వనిర్థారిత ప్రణాళిక అంటూ లేకుండా యథేచ్ఛగా ప్రయాణాలు చేస్తే ఉండే సౌలభ్యమిది. హోటల్ బుకింగులు, ప్రయాణాల టికెట్లూ ముందే ఏర్పాటు చేసేసుకుంటే అవి అవరోధాలుగా మారే ప్రమాదముంది. అవేమీ లేకపోవడం వల్ల నేనూ నా బాక్‌పాకూ మాకు ఇష్టమయిన రీతిలో తిరగగలుగుతున్నాం. చిట్టచివరి రోజున ఇంటికి వెళ్ళే విమానం మిస్సవకుండా పట్టుకుంటే సరిపోతుంది – మిగిలిన సమయమంతా ఎప్పుడు ఎలా తోస్తే అలా తిరగవచ్చు. 

గ్రాండ్ టాక్సీ స్టాండ్‌కు వెళ్ళడానికి మరో చిన్న టాక్సీ కుదిర్చి పెట్టాడు రహీమ్. ఎంతా ఆత్మీయంగా ఉల్లాసంగా సంతోషంగా వీడ్కోలు పలికాడు. నా తదుపరి మజిలీ – మహాయాత్రికుడు ఇబ్న్ బటూటా స్వస్థలం – టాంజియర్. 


యథాప్రకారం టాక్సీ ముందు సీట్లో కూర్చున్నాను. ముగ్గురు సభ్యుల కుటుంబమొకటి వెనక సీట్లో కూర్చుంది. టాక్సీ టెటువాన్ వదిలి టాంజియర్ దిశలో పరుగు ప్రారంభించింది. మధ్యవయసు దంపతులూ వారి పాతికేళ్ళ కూతురూ నా వెనుక సీటులో సహయాత్రికులు. చిరునవ్వులూ చిట్టిమాటల మధ్య వాళ్ళకు నేను యు.కె. నుండి వచ్చానని తెలిసింది. యూకేకు సంబంధించిన తాజా వార్తలు విన్నావా అని అడిగాడా తండ్రి. ఏమయిందా అని కంగారు పడ్డాను. వినలేదని చెప్పి ‘ఏమయింది, ఏమయింద’ని అడిగాను. యూకేనుంచి వచ్చే విమానాలన్నిటినీ మొరాకో ఆరోజు నుంచీ రద్దు చేసింది అని చెప్పాడాయన. అక్టోబర్ 2021 నెలచివరి రోజులవి. యూకేలో కోవిడ్ కేసులు మళ్ళీ అనూహ్యంగా పెరగడం వల్ల మొరాకో దేశం యు.కె. విమానాల మీద నిషేధం పెట్టింది. నా ఫోన్‌లో మెసేజులు చూసుకున్నాను. కొంత మంది స్నేహితుల దగ్గర్నించి ఈ విషయం చెపుతూ మెసేజ్‌లు ఉన్నాయి. వాళ్ళల్లో కొంతమంది నా తిరుగు ప్రయాణం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ ఉత్తర మొరాకో యాత్ర నేను కలలు గన్న ప్రయాణం. ఈ ప్రకటనలూ నిషేధాలూ నా కలలను భగ్నం చేయనివ్వను’ అని నాకు నేను చెప్పుకున్నాను. మా ఎయిర్‌లైన్స్ వాళ్ళు విమానం రద్దయిందని ఏమన్నా మెసేజ్ పంపితే అప్పుడు పట్టించుకుందాం అనుకున్నాను. అప్పటిదాకా ఈ విషయం గురించి ఆలోచించడం, ఊహాగానాలు చెయ్యడం వృథాప్రయాస అనిపించింది. ప్రభుత్వాలు ఏయే నిర్ణయాలు తీసుకున్నా నేను ఎలాగోలా మా దేశం తిరిగి చేరగలనని, నా దైనందిన కార్యకలాపాలు అంది పుచ్చుకోగలననీ నమ్మకం నాకుంది. కానీ ఈ ప్రాంతంలో తిరుగాడే అవకాశం మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. అంచేత ఈ వార్తలు, ప్రకటనలూ పట్టించుకోకుండా నా యాత్రను కొనసాగించాలని నిశ్చయించుకున్నాను. నా గురించి బెంగ పడవద్దని, ఎవరు ఏం చెప్పినా ఆందోళనకు గురి కావద్దనీ ఇంటికి మెసేజ్ పంపాను. ఒకవేళ పరిస్థితులు నిజంగా విషమించిన పక్షంలో ఎలాగో ఒకలాగా తిరిగి ఇంటికి చేరుకునే శక్తి సామర్థ్యాలు, నైపుణ్యమూ ఉన్నాయని నమ్మబలికాను. మరో గంటన్నర గడిచేసరికి మరుసటి నగరం టాంజియర్ ఉనికి లోకి వచ్చింది. లీలామాత్రంగా కనిపించసాగింది.

(సశేషం)