మెదెయీన్, కొలంబియా
మనిషి గతించి ముప్పైయేళ్ళు దాటినా సమసిపోని ఎస్కోబార్ నీలినీడలూ జాడలూ మూడునాలుగు రోజుల క్రితం నేను కొలంబియాలోని కార్తహేన నగరంలో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ గమనిస్తూనే ఉన్నాను. కార్తహేన నుంచి మెదెయీన్ (Medellin) నగరం చేరీచేరగానే నన్ను హోటలుకు చేర్చిన టాక్సీ మహిళ కార్మెన్ ఎస్కోబార్‌తో తన ప్రత్యక్ష అనుభవం గురించి, తన సమీపకుటుంబంమీద అతని కార్యకలాపాల పడగనీడ ప్రసరించడం గురించి, ప్రాణాలు తీయడం గురించీ చెప్పుకొచ్చింది.
నిజానికి 1970లు, 80లలో పెరిగి, వార్తాపత్రికల స్పృహ ఎంతో కొంత ఉన్న మా తరం వారికి కొలంబియా పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది పాబ్లో ఎస్కోబార్ మహానుభావుడే. అతని మాదకద్రవ్యాల నేరసామ్రాజ్యమే. ఆ సామ్రాజ్యపు రాజధాని నేను ఇపుడు చేరిన ఈ మెదెయీన్ నగరం – అతని మాఫియా బృందాన్ని క్లుప్తంగా మెదెయీన్ కార్టెల్ అని వ్యవహరిస్తారు. ఒకోసారి ఆలోచిస్తే విధ్వంసకర శక్తులూ వాటి వివరాలూ మానవ చరిత్రలో అవాంఛనీయ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్నాయా అనిపించక మానదు. అభ్యంతరకరమైనదే అయినా ఆ ప్రాముఖ్యం ఒక విషాద వాస్తవం. అలా అని అలాంటి వాటిల్ని పనిగట్టుకుని విస్మరించడం ఇంకా ప్రమాదకరం. ఉండనే ఉంది గదా – చరిత్రను విస్మరిస్తే అది తప్పక పునరావృతమౌతుంది అన్న నానుడి. అంచేత అలాంటి చరిత్రలు ఎంత విషాదభరితమైనా వాటిల్ని అర్థం చేసుకోవడం, గుణపాఠాలు నేర్చుకోవడం ఎంతో అవసరం. ఈ భావ పరంపర ముసురుకొన్న మనఃస్థితిలో నేను మెదెయీన్ నగరంలోకి అడుగు పెట్టాను. ఆ నగరపు మూలాలలోకి వెళ్ళాను. మరుగున దాగిన వివరాలు కొన్ని తెలుసుకున్నాను.
అప్పటి రోజుల్లో ప్రపంచమంతటికీ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా ‘ఖ్యాతి’ పొందిన నగరం మెదెయీన్. ముందే అన్నట్టు పాబ్లో ఎస్కోబార్‌కు చెందిన మెదెయీన్ కార్టెల్‌కు కేంద్రబిందువు ఆ నగరం. ప్రభుత్వం, చట్టబద్ధత అన్న పదాల ప్రభావం ఏమాత్రం సోకని ప్రదేశమది. హత్యల రాజధాని, కొకైన్ కాపిటల్ లాంటి ఎన్నో ‘గౌరవ’నామాలుండేవా నగరానికి. అసలా నగరాన్ని చూడాలన్న కోరికగానీ చూడగలనన్న ఊహగానీ ఇంతకు మునుపు నాకు ఉండేదే కాదు. కానీ గత పదేళ్ళుగా ఆ నగరంలో వచ్చిన చెప్పుకోదగ్గ మార్పు నా చెవిన పడుతూ వచ్చింది. విశ్వవ్యాప్తంగా నగరపునరుజ్జీవన ప్రతీకగా మెదెయీన్ నిలుస్తోందన్న సంగతి తెలియవచ్చింది. ఆ మాటలు నాలో ఆసక్తి కలిగించాయి. అంతేగాకుండా మెదెయీన్‌కు నిత్యవసంతపు నగరం అన్న కితాబు ఈమధ్య జోడింపబడుతోంది. వీటన్నిటివల్ల నా కొలంబియా పర్యటన ప్రణాళికలో మెదెయీన్‌నూ చేర్చాను.
మెదెయీన్ జనాభా ముప్పై రెండు లక్షలు. కొలంబియా దేశంలో రెండవ పెద్ద నగరం. ఆన్తియోకియా (Antioquia) రాష్ట్రపు రాజధాని. ఆండీస్ పర్వతశ్రేణి మధ్యనున్న ఒక లోయలో, చుట్టూ చిక్కటి అడవులతో, సముద్రతలానికి సుమారు 5000 అడుగుల ఎత్తున అందాలు ఒలుకుతూ కనిపించే నగరం మెదెయీన్. ఊరంతా ఉద్యానవనాలు, అటూ ఇటూ బారులు తీరిన చెట్లతో కూడిన రహదారులు కనిపిస్తాయి. ఇన్ని సుగుణాల పుణ్యమా అని ఇప్పటి మెదెయీన్ నిత్యవసంతపు నగరం అన్న కీర్తిని గడించింది.
1675లో అక్కడి ఖనిజాల వెలికితీత కోసం స్పానిష్ ఆక్రమణదారులు స్థాపించిన నగరం మెదెయీన్. క్రమక్రమంగా ఇరవయ్యవ శతాబ్దం వచ్చేసరికి అది ఒక పారిశ్రామిక నగరంగా రూపు దిద్దుకుంది. అక్కడ వెలసిన అనేకానేక బట్టలమిల్లుల పుణ్యమా అని ‘మాంచెస్టర్ ఆఫ్ కొలంబియా’ అన్న బిరుదునూ పొందింది. పరిశ్రమలతోపాటు కొలంబియా దేశపు ముఖ్య ఎగుమతి అయిన కాఫీ పంటకు వాణిజ్య కూడలిగానూ పరిణమించింది. ఇది మెదెయీన్ నగరపు ధవళ పార్శ్వం.
ఎయిర్‌పోర్ట్‌లో నన్ను ఎక్కించుకుని వచ్చిన మా టాక్సీ డ్రైవర్ కార్మెన్ సాయంత్రం ఏడున్నరకు మెదెయీన్ లోని మా హోటలు తెర్రా బియో దగ్గర దింపింది. రిసెప్షన్‌వాళ్ళు సాదరంగా ఆహ్వానించి వెంటవెంటనే చెకిన్ చేసేశారు. ఆ ప్రక్రియ ఎంత సులభంగా సాగిపోయినా ఫోటో కాపీయర్‌లో క్షణకాలం చిక్కడిపోయిన నా పాస్‌పోర్ట్‌ను చూస్తే ప్రాణం గిలగిలలాడింది. మరి ఏ హోటలుకు వెళ్ళినా వాళ్ళకి పాస్‌పోర్టు కాపీ కావాలి – తప్పదు. అలా ఎన్ని వందలసార్లు నా పాస్‌పోర్టు ఉక్కిరిబిక్కిరి అయి ఉంటుందా అని ప్రాణం ఉసూరుమనిపించింది. తెర్రా బియోలో మూడు రోజులు ఉండాలన్నది నా ఆలోచన కాబట్టి వెంటనే బట్టలు లాండ్రీకి వేశాను.
మా తెర్రా బియో హోటలు ఏ ఆడంబరాలూ లేకుండా, అదే సమయంలో కనీసావసరాలకు ఏ మాత్రమూ లోటు లేకుండా ఉంది. దాని మినిమిలిస్టు వైఖరి నాకు బాగా నచ్చింది. ఎక్వదోర్‌లో తటస్థపడిన గుజరాతీ మహిళ నీనా సిఫార్సు చేసిన హోటలది. చక్కని సిఫార్సు. లారెల్స్ అన్న చెట్లు నిండిన ప్రదేశంలో ఉంది మా హోటలు. హోటలు లోపలకూడా పర్యావరణ స్పృహ పుష్కలంగా కనిపించి నన్ను సంతోషపరచింది. గబగబా స్నానం చేసి హోటల్‌నుంచి బయటపడ్డాను.
మా ఎయిర్‌పోర్ట్ మహిళ కార్మెన్ ఆనాటి డిన్నరుకు మాందోంగో (mondongo) అన్న రెస్టరెంటుకు వెళ్ళమని సిఫార్సు చేసింది. రిసెప్షన్‌వాళ్ళు కూడా ఆమాటే అన్నారు. రెండు కిలోమీటర్లు దూరమట. చెట్లతో నిండిన కాలిబాటలగుండా నడక సాగించాను. ఏ ప్రమాదాలూ సోకని భద్రమైన ప్రదేశంలా అనిపించిందా వాడకట్టు. యు.ఎస్.లోని ఉన్నతశ్రేణి ఇలాకాలను తలపించింది. నడక ఎంతో ప్రశాంతంగా సాగిపోయింది. మనసు ఆనందంతో నిండిపోయింది. పనిలోపనిగా ఆ రెండు కిలోమీటర్ల నడక పుణ్యమా అని కడుపులో ఆకలి చిరుగంటలూ మ్రోగసాగాయి. దానికి తోడు మెదెయీన్ నగరంలోని ఒక చక్కని నివాసప్రాంతంతో మంచి పరిచయాన్ని ఏర్పరచుకోగలిగానన్న సంతృప్తి సరేసరి.
నేను వెళ్ళిన మాందోంగో అన్నది ముచ్చటైన రెస్టరెంటు. లాటిన్ అమెరికా దేశాలకు చెందిన ఓ వంటకం పేరే ఆ రెస్టరెంటుకు పెట్టారు. మొట్టమొదటగా మాందోంగో సూప్ ఆర్డర్ చేశాను. ఈ మాందోంగో సూప్‌లో రెండు రకాలున్నాయి. సీమపంది పొట్టభాగపు కొవ్వు (tripe) తునకలను సుగంధద్రవ్యాలతో కలిపి నింపాదిగా ఉడికించిన సూప్ ఒకటైతే చికెన్‌తో కాచిన సూప్ రెండోరకం. నేను చికెన్ సూప్‌ను ఇష్టపడ్డాను. సూప్ ముగించాక బన్దేహా పాయిసా (Bandeja Paisa) అన్న కొలంబియా జాతీయ వంటకాన్ని మెయిన్ కోర్సుగా తెప్పించాను. ఈ వంటకపు మూలాలు ఆన్తియోకియా ప్రాంతానివే. చికెన్, అన్నం ముద్ద, బీన్సు, ఉడికించిన కోడిగుడ్డు, అవకాడో, అరేపా, అరటిపండు – అన్నీ ఒకే ప్లేటులో అమర్చి అందించారు. తీరిగ్గా భోజనం ముగించాను. కడుపు నిండింది. మెల్లగా నడిచి, దారిలో దీపాల వెలుగులో మిసమిసలాడుతోన్న ఇతర రెస్టరెంట్లను గమనిస్తూ నా గదికి చేరుకున్నాను. ఫిబ్రవరి 13కు వీడ్కోలు చెప్పి 14న చేయబోయే పనుల గురించి ఆలోచిస్తూ పడక మీదకు చేరాను.
మెదెయీన్ నగరంలో కళ్ళు చెదిరే కట్టడాలు కాని, మనసును పట్టి ఊపేసే శిల్పకళావిశేషాలు కానీ లేవు. ఉన్నదంతా ప్రకృతి. దానిని మించి మానవ ప్రకృతికి చెందిన మహా విషాదగాథలు. అక్కడివాళ్ళు పడిన బాధలు, వారి ఆందోళనలు, వ్యక్తిగత విషాదాలు, ఆ కష్టనష్టాలను దాటుకొని వచ్చి వారు గత కొన్ని దశాబ్దాలుగా తమతమ జీవితాలను, తమ నగరాన్నీ పునర్నిర్మించుకొన్న విధానం – ఆ నగరపు ముఖ్య ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఆ పరిణామాలను ప్రత్యక్షంగా చూడాలన్న కాంక్షే అక్కడికి యాత్రికులను రప్పిస్తోంది. నిజానికి ముందు నేనూ తటపటాయించాను – ఆ మాఫియా రాజధానికి వెళ్ళడమెందుకు, ఆ దారుణాల కేంద్రబిందువుకు చేరడమెందుకు అని నాకూ సందేహాలు కలిగాయి. కానీ మనిషి ఎంతటి దుర్భర పరిస్థితుల్ని దాటుకొని వెళ్ళి తన జీవితాన్ని మళ్ళా నిర్మించుకోగలడో చూసే అవకాశం మెదెయీన్ నగరం నాకు అందించగలదన్న చిన్నపాటి ఆశ నన్నా నగరానికి చేర్చింది. అలాంటి మానవ విజయగాథను క్రమబద్ధంగా తెలుసుకోవడానికి సమర్థవంతమైన స్థానిక మార్గదర్శిని ఏర్పరుచుకోవాలి. ఆ మార్గదర్శి నేను ఆన్‌లైన్‌లో బుక్ చేసిన టాక్సీ డ్రైవరు కార్లోస్ రూపంలో నాకు తటస్థపడ్డాడు. నేను పరిశోధించి బుక్ చేసిన టూరు పేరు ‘మెదెయీన్ ప్రైవేట్ పాబ్లో ఎస్కోబార్ టూర్ విత్ కేబుల్ కార్ రైడ్’. టాక్సీ టూర్‌లో మళ్ళా కేబుల్ కారు ఏమిటీ అంటారా – అదో ఆసక్తికరమైన, మెదెయీన్‌కే పరిమితమైన విశేషం. అది ముందు ముందు వివరిస్తాను. ఈ టూరుకు వంద డాలర్ల రుసుము. కొంచెం ఖరీదే అనిపించినా టూరు వివరాలు ఆన్‌లైన్‌లో చూశాక పర్లేదు, ఆ మాత్రం ఇవ్వవచ్చు అనిపించింది.
టాక్సీ డ్రైవరు కార్లోస్ ఎనిమిదికల్లా వస్తున్నాను అన్న మెసేజ్ పంపాడు. చెప్పిన సమయానికి ఠంచనుగా వచ్చాడు. నేను మొట్టమొదట గమనించింది అతని మాటతీరులో అమెరికన్ యాస. తలిదండ్రులు మెదెయీన్‌కు చెందినవారేనట. 1970ల నుంచి 90ల దాకా కొనసాగిన మెదెయీన్ కార్టెల్ దుర్భరకాలంలో వాళ్ళంతా యు.ఎస్. చేరిపోయారట. సమస్యలు సద్దుమణిగాక తిరిగి మెదెయీన్ వచ్చారట. ‘అలా రావడం నాకెంతో సంతోషంగా ఉంది’ అన్నాడు కార్లోస్. ‘ఆ రోజుల్లో మాలాగే ఎంతోమంది మెదెయీన్ వదిలి వెళ్ళిపోయారు. వీళ్ళు పోలీస్ ఇన్ఫార్మర్‌లు అని మాఫియా ముఠాలకు ఏమాత్రం అనుమానం వచ్చినా వాళ్ళ ప్రాణాలకు ఆ రోజుల్లో ఠికాణా ఉండేది కాదు.’
టాక్సీ తిన్నగా ఊరి శివార్లలోని ఒక కేబుల్ కార్ స్టేషన్ దగ్గరికి చేరింది. ‘ఇపుడు మనం ఈ కేబుల్ కారు ఎక్కి అదిగో ఆ కొండలమీద ఉన్న కమ్యూన్‌లు అనబడే పేటల్లోకి – కొలంబియా పరిభాషలో కొమూనాలు – వెళుతున్నాం. మెదెయీన్ నగరం మీద సరి అయిన అవగాహన కలగడానికి ఆ పేటల్లోకి వెళ్ళడం ఉత్తమ మార్గం. అలా పైకి వెళ్ళడానికి మా ఊళ్ళో ఉన్న ఈ కేబుల్ కార్లే ఇక్కడి పేటల్లోని ప్రజానీకం వాడే రవాణా వ్యవస్థ. కొండలమీద ఉన్న పేటలన్నిటినీ నగర కేంద్రంతో అనుసంధించే వ్యవస్థ ఈ కేబుల్ కార్లు’ అని చెప్పాడు కార్లోస్. అలాంటి వ్యవస్థ నేను ఇంకే నగరంలోనూ చూడలేదు!
ఆ పేటలన్నీ నిన్న మొన్నటిదాకా పెద్ద పెద్ద మురికివాడలట. ఆ వాడల్లోకి అడుగుపెట్టడానికి బయటవాళ్ళెవరూ సాహసించేవాళ్ళు కాదు. చట్టమనే మాటే అక్కడ వినిపించేది కాదు. నేరాలు అపారం. రోజులు మారి ఆ ప్రాంతాలన్నీ కేబుల్ కార్ల ద్వారా నగరానికి చేరువ అయ్యాక అక్కడికి బయటవాళ్ళు వెళ్ళడం ఆరంభమయింది. ఆ పేటల్లోని జనానీకం కూడా దిగువనున్న విశాలనగరంలో పనీపాటా వెతుక్కుంటూ దిగిరావడం ప్రారంభమయింది. ఇదీ ఆ పేటలకూ కేబుల్ కార్లకూ చెందిన సంక్షిప్త చరిత్ర. మాటల్లోనే మేము కొండచరియల్లో కనిపించే చిన్న చిన్న జనావాసాలను దాటుకొని కొండమీది కేబుల్ కారు స్టేషనుకు చేరుకున్నాం. అక్కడి ఓ విస్టా పాయింటుకు తీసుకువెళ్ళి కార్లోస్ నాకు నగరాన్ని ‘పరిచయం’ చేశాడు. నగరంలోని ప్రముఖస్థలాలు, విభిన్నదిశల్లో దూరాన కొండలమీద కనిపిస్తున్న పేటలూ చూపించాడు. వాటన్నిటిలోకీ కమ్యూన్ 13 అన్న పేట చూసి తీరవలసిన ప్రదేశమని గట్టిగా చెప్పాడు. దానికి విలక్షణమైన నేపథ్యముందని కూడా చెప్పాడు.
ఆనాటి మా టూరంతా పాబ్లో ఎస్కోబార్ జీవితం చుట్టూ తిరగబోతోందని సూచించాడు కార్లోస్. ఆ విషయం ఊహించినదే అయినా ‘అలాంటి మహానుభావుడితో రోజంతానా’ అన్న చిన్నపాటి అసౌకర్యం నాలో మళ్ళా తొంగిచూసింది. అది గమనించాడనుకొంటాను, ‘ఈ మన టూర్ అతని వీరోచిత కార్యసరళిని ఎత్తి చూపించదు. అతని ప్రభావం ఈ నగరం మీదా మా దేశం మీదా ఎన్ని విధాలుగా ప్రసరించిందో వివరిస్తుంది’ అని భరోసా ఇచ్చాడు కార్లోస్. ఎస్కొబార్ చుట్టూ అల్లిన టూర్లు ఊళ్ళో చాలా ఉన్నాయట. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ ‘నార్కో’ సీరీస్‌లో లాగా అతగాడిని వీరమూర్తిగా చూపించే టూరు కాదు నాది. అతని జీవితంతో ముడిపడిన ప్రదేశాలకు తీసుకువెళ్ళి వాస్తవాలను ఎత్తిచూపేలా నేనీ కార్యక్రమాన్ని రూపొందించాను. అంచేత నా టూరు రంగులద్దిన నెట్‌ఫ్లిక్స్ సీరీస్ అంత రసవత్తరంగా ఉండదు, అని కూడా హెచ్చరించాడు!
ఎస్కోబార్ దుష్టచరిత్ర గురించి నగరంలో రెండు రకాల ధోరణులున్నాయట. ఆ విషాద ఘడియల్ని పూర్తిగా విస్మరించి ముందుకు సాగిపోవాలన్నది ఒక ధోరణి. ఆ చరిత్రను మరచిపోకుండా, అందులోంచి గుణపాఠాలు నేర్చుకుంటూ, వాటి ద్వారా భవిష్యత్తులో ఎప్పుడూ అలాంటి పొరపాట్లు జరగకుండా అలాంటి విషపరిణామాలు తలెత్తకుండా కాచుకోవాలి అన్నది రెండవ ధోరణి.
కొండమీద కాస్తంత సమయం గడిపి తిరిగి కేబుల్ కారులో దిగి వచ్చేటపుడు కొన్ని ఆటస్థలాలు కనిపించాయి. ‘ఆటలనేగాదు, పదిమందికోసం ఇలాంటి సదుపాయాలు కూడా ఎస్కోబార్ కొన్ని కల్పించాడు. ప్రజల్లో ఇప్పటికీ అతని గురించి రెండు భిన్నమైన అంచనాలున్నాయి… విధ్వంసాలు సృష్టించి వేలాదిమంది ప్రాణాలు తీశాడు అన్నది నిజం. అయితే అతని కొలువులో పనిచేసి శతవిధాలుగా ప్రయోజనాలు పొందిన వారి అభిప్రాయం ఇంకొక రకంగా ఉంది. అందుకు కారణం ఎన్నో దానధర్మాలు చేపట్టి తనకంటూ ఓ రాబిన్‌హుడ్ ఇమేజ్‌ని సృష్టించుకొనే ప్రయత్నం చేశాడతను. యు.ఎస్.కు కొకైన్ అక్రమంగా రవాణా చేసి బిలియన్లు సంపాదించాడు. అందులో కొంతభాగాన్ని అనుచరుల బాగోగులకోసం ఖర్చు పెట్టాడు. ఆ ప్రక్రియలో తనకంటూ ఓ విశ్వసనీయమైన అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకోగలిగాడు’ – వివరించాడు కార్లోస్.
కొండ దిగివచ్చాక కార్లోస్ నాకు ఊరంతా తిప్పి చూపించాడు. అన్ని పేటలనీ పరిచయం చేశాడు. అది ముగిశాక మొనకో భవనం అన్న ఘనత వహించిన ప్రదేశం దగ్గర టాక్సీ ఆపాడు. ఒకప్పుడు అక్కడ ఆరంతస్తుల భవనముండేదట. ఎస్కోబార్ ఆ భవనంలోని నాలుగో అంతస్తులో నివసించేవాడు. అతని కార్యకలాపాల ముఖ్యకేంద్రమూ ఆ భవనమే. 2019లో ఆ భవనాన్ని నేలమట్టం చేశారు. చేసి, అక్కడ ఆ విషాదదినాలలో ప్రాణాలు పోగొట్టుకున్నవారి జ్ఞాపకార్థం ఓ మెమోరియల్ పార్కు (Inflexión Memorial Park) నిర్మించారు. మెరుగుపెట్టిన నల్లని గ్రానైట్ శిలాఫలకాల మీద ఆ రోజుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న 46,600 మంది పేర్లు చెక్కి ఉన్నాయక్కడ.
నా పర్యటనలో ఆ మెమోరియల్ దగ్గర గడిపిన సమయం ఒక మ్లాన ఘట్టం. ‘మెదెయీన్ నగరం ఎలాంటి కత్తుల వంతెనమీద, నిప్పుల దారులగుండా నడచి వచ్చిందో ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నమా మెమోరియల్ నిర్మాణం’ అన్నాడు కార్లోస్. నిజమే. అటు హాలీవుడ్ సినిమాలూ ఇటు బాలీవుడ్ సినిమాలూ మాఫియా చరిత్రలకూ నిర్దాక్షిణ్యపు హత్యాకాండలకూ రంగులద్ది మెరుగులు దిద్ది మనకు రుచిరుచిగా అందిస్తున్నాయి. మన మన ఇళ్ళల్లో సుఖంగా కూర్చుని ఆ సినిమాలను టీవీ తెరలమీద వినోదమార్గాలుగా పరిగణించి ఆనందాలు పొందుతున్నాం. తప్పులేదు. కానీ ఒక్కసారి ఈ మెమోరియల్ లాంటి ప్రదేశాలకు వస్తే, గతించిన తమ వారి పేర్లను అక్కడ వెదుక్కునే బంధుమిత్రులను చూస్తే సత్యపు అసలు రూపం మన మొహంమీద చాచి కొడుతుంది. వెక్కి వెక్కి ఏడుస్తోన్న ఓ పెద్దామెను చూశాను. ఆమెను సముదాయించే విఫలయత్నం చేస్తోన్న పెద్దాయనను – బహుశా భర్త అయుండవచ్చు, చూశాను. అక్కడ కనిపించిన అలాంటివాళ్ళంతా దశాబ్దాల క్రితం అకాలమరణం పొందిన తమతమ ఆప్తులూ సన్నిహితుల కోసం కన్నీరు కారుస్తున్నవారే. తమకు ప్రియతములైన వారి ఆకస్మిక మరణం, అకాల మరణం ఏ కుటుంబానికైనా పిడుగుపాటే… పూరించలేని నష్టమే… భరించలేని కష్టమే – మెదెయీన్ నగరంలో అది వేలాది కుటుంబాలు చవిచూసిన విషాదం… సామూహిక విషాదం…
ఎస్కోబార్ జీవితపు విశేషాలు క్లుప్తంగా చెప్పుకొచ్చాడు కార్లోస్.
అతగాడు మెదెయీన్ నగరపు ఒక సామాన్యకుటుంబానికి చెందిన వ్యక్తి. టీనేజి దశలో అల్లరిచిల్లరిగా తిరిగాడు. చిల్లర దొంగతనాలు సరేసరి. పాతికేళ్ళ వయసులో, 1976లో కొకైన్ స్మగ్లింగ్‌లో అంతులేని సంపద ఉందని గ్రహించాడు. మరికొంతమంది స్నేహితులతో కలసి మెదెయీన్ కార్టెల్‌ని రూపొందించాడు. అరకొర రవాణాలకు పరిమితం కాకుండా పెద్ద ఎత్తున కొకైన్ ఉత్పత్తీ రవాణాలకు సరికొత్త మార్గాలు కనిపెట్టాడు. స్థానిక రైతులకు వారు ఊహించలేనంత పెద్ద మొత్తాలు ముట్టజెప్పి వాళ్ళంతా కోకా పంట పండించేలా ప్రోత్సహించాడు. ఆ కోకా ఆకులే కొకైన్ తయారీకి మూలధాతువులు.
అలా ఉత్పత్తి చేసిన కొకైన్‌ను అత్యంత లాఘవంగా యు.ఎస్.కు చేర్చే వ్యవస్థకు రూపకల్పన చేశాడు. ప్రతిరోజూ పదిహేను టన్నుల కొకైన్‌ను ప్రైవేటు విమానాల ద్వారా అమెరికాకు రవాణా చేశాడు. కొలంబియా లోను, యు.ఎస్. లోనూ ప్రభుత్వోద్యోగులు, పోలీసులు, న్యాయాధికారులు తన కొలువులో ఉండేలా చేసుకున్నాడు. తన మాట విననివారిని గల్లంతు చేశాడు. వెండి కావాలో సీసపు గుళ్ళు కావాలో – సిల్వర్ ఆర్ లెడ్? – వారినే తేల్చుకోమన్నాడు. (డబ్బును వెండి అని పిలవడం ఎన్నో దేశాల్లో ఆనవాయితీ – అను.) సిల్వర్ వద్దన్న వందలాదిమంది పోలీసు అధికారులను, న్యాయమూర్తులను, శాసనసభ్యులనూ చంపించాడు. అలా తన అక్రమ రవాణాకు ఆటంకాలు లేని రాజమార్గాలు నిర్మించుకున్నాడు.
ఒక సమయంలో అతని సంపాదన రోజుకు 200 మిలియన్ డాలర్లట! అలా కోట్లకు పడగెత్తాడు. ప్రపంచంలోని ధనికుల్లో అగ్రగణ్యుడిగా పరిగణింపబడ్డాడు. 1989లో ఫోర్బ్‌స్ అన్న అంతర్జాతీయ వ్యాపార పత్రిక, ప్రపంచంలోని ధనవంతుల్లో ఏడవ వ్యక్తిగా ఎస్కోబార్‌ను ఎంచింది. తాను నెలకొల్పిన మెదెయీన్ కార్టెల్ సంపాదనలో నలభై శాతం ఎస్కోబార్‌కు ముట్టేది. తనకు వచ్చిపడే డాలర్ నోట్లను ఎస్కోబార్ ఎన్నెన్నో విధాలుగా ఎన్నెన్నో స్థలాలలో దాచి ఉంచేవాడు. అందులో నేలలో పాతిపెట్టడం ఒకటి. ఎంత జాగ్రత్తగా దాచినా ఏడాదికి రెండు బిలియన్ డాలర్ల విలువగల నోట్లు – మన ఇప్పటి లెక్కల్లో 16,600 కోట్ల రూపాయలు – ప్రాకృతిక శక్తులకు, ఏదైనా సరే తిని హరాయించుకొనే ఎలుకలకూ ఆహుతి అయ్యేవట.
ఆరేళ్ళలో వచ్చిపడ్డ అపార సంపద ఎస్కోబార్ ఆత్మవిశ్వాసాన్ని తెగవూదిన గాలిబుడగలా పెంచి పెద్ద చేసింది. 1982లో రాజకీయాల్లో అడుగుపెట్టాడు. 1983లో కొలంబియా ప్రజాప్రతినిధుల సభకు – కొలంబియన్ ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ – ఎన్నికయ్యాడు. అది చూసి సాటి రాజకీయ నాయకులు హాహాకారాలు చేశారు. రొద్రీగో లారా బొనీయా (Rodrigo Lara Bonilla) అన్న న్యాయశాఖామంత్రి చొరవతో 1984లో ప్రతినిధుల సభ ఎస్కోబార్‌ను గెంటివేసింది. ఈ బొనీయా అన్న వ్యక్తి అప్పటికే డ్రగ్ మాఫియాల మీద యుద్ధం ప్రకటించిన మనిషి. ఆయన 1984 చివరిలో మెదెయీన్ నగరానికి ఆఫీసు పనిమీద వచ్చినపుడు ఎస్కోబార్ అనుచరులు నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు.
ఎస్కోబార్ దమనకాండ విడివిడి మనుషులకే పరిమితం కాలేదు – సామూహిక హత్యాకాండలకూ పాల్పడ్డాడు. బొగొతా లోని యు.ఎస్. ఎంబసీ మీద బాంబుల దాడి జరిపించాడు. 1989లో కొలంబియాకు చెందిన అబియాంకా ఎయిర్‌లైన్స్ వాళ్ళ బోయింగ్ 721-21 విమానంలో ఉన్న 107 మంది ప్రయాణీకుల్లో, ప్రెసిడెంటుగా ఎలక్షన్లలో పోటీ చేస్తోన్న సెసార్ గవిరీయా త్రుహీయో (César Gaviria Trujillo) అన్న వ్యక్తి ఉన్నాడనుకొని ఆ విమానాన్ని కూల్చాడు. అందులో త్రుహీయో లేడు. ప్రమాదం తప్పించుకొన్న త్రుహీయో కొలంబియా దేశపు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. కానీ ఆ 107 మంది ప్రయాణీకులు, ఇద్దరు అమెరికన్లతో సహా హతమయ్యారు. దాదాపు అదే సమయంలో ఎస్కోబార్ మాఫియా బృందాలు లుయీస్ కార్లోస్ గలాన్ (Luis Carlos Galán) అన్న మరో ప్రెసిడెంటు అభ్యర్థిని చంపేశాయి. మాదకద్రవ్యాల మాఫియా బృందాలను తుదముట్టిస్తానని, ఆ బృందాల అధినేతలను యు.ఎస్. ప్రభుత్వానికి అప్పగిస్తాననీ ప్రచారం చేయడమే గలాన్ చేసిన ఘోరమైన నేరం.
ఈ ఎస్కోబార్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని, అరెస్టు చేయడంగానీ తుదముట్టించడంగానీ అత్యవసరం అనీ కొలంబియా ప్రభుత్వం గ్రహించింది. ఆ ప్రయత్నాలు కొనసాగించింది. అందుకు అమెరికా ప్రభుత్వంనుంచి సహాయ సహకారాలు లభించాయి. అక్కడితో ఆగకుండా కొలంబియా ప్రభుత్వం కొకైన్ వ్యాపారంలో ఎస్కోబార్‌కు ప్రత్యర్థులయిన కాలి కార్టెల్ అన్న మాఫియా బృందపు సహకారమూ అడిగి పొందింది. ఈ కాలి కార్టెల్‌కు ఒరెహుయేలా (Orejuela) సహోదరులు అధినేతలు. వారి కార్యసరళి ఎస్కోబార్‌తో పోల్చి చూస్తే సుకుమారమైనది. హత్యలూ రక్తపాతమూ అంటే వాళ్ళకు పడదు. మెదెయీన్ కార్టెల్ ఒరవడి దుందుడుకు మారణకాండ అయితే కాలి కార్టెల్ వారిది అధికారులూ రాజకీయ నాయకుల అవినీతి ప్రవృత్తి మీద ఆధారపడిన కార్యసరళి. వీరికి అధికార బృందాలతో పటిష్టమైన బంధాలున్నాయి. ఏదేమైనా మొత్తం వ్యాపారంలో మెదెయీన్ కార్టెల్ వారిది ఎనభై శాతమయితే కాలి వారిది ఇరవై. అడపా దడపా ఇరుపక్షాలూ కొలంబియా లోను, యు.ఎస్. లోనూ తలపడడం, చంపుకోవడం జరుగుతూనే ఉండేది.
ఈ కాలి కార్టెల్ 1989లో ఎస్కోబార్ నివసించే మొనకో బిల్డింగు మీద ఒక కారుబాంబు దాడి జరిపింది. ఫలితం లేకపోయింది. ఎస్కోబార్ ఆ సమయంలో అక్కడ లేడు. కొలంబియా ప్రభుత్వం లాస్ పెపేస్ (Los Pepes) అన్న మరో చురుకైన బృందానికి కూడా తన వ్యూహాత్మక సహకారాన్ని అందించింది. ఎస్కోబార్ అకృత్యాల బాధితులు నెలకొల్పిన బృందమా లాస్ పెపేస్. ఈ బృందం ఎస్కోబార్‌కు చెందిన మనుషుల్ని ఒక్కరొక్కరుగా ఏరివేసే ప్రక్రియను ఆరంభించింది.
ఈ వత్తిళ్ళ సెగకు ఎస్కోబార్ తలవంచాడు. 1991లో ప్రభుత్వంతో ఒప్పందానికి వచ్చాడు. శాంతిస్థాపన జరిగినట్టే అనిపించింది. ఒప్పందంలోని నియమాల ప్రకారం తనకు తాను ల కథెడ్రాల్ అన్న జైలు గృహాన్ని నిర్మించుకొని ఆ గృహానికే కట్టుబడి ఉండటానికి ఎస్కోబార్ అంగీకరించాడు. మళ్ళా ఆ జైలు సౌధపు నిర్వహణ అంతా ఎస్కొబార్ అనుచరులే చూసుకొనేలా ఒప్పందం జరిగింది. తనను యు.ఎస్.కు తరలించకుండా చూసుకోవడానికి ఎస్కోబార్ ఎన్నుకున్న మార్గం ఈ ల కథెడ్రాల్ ఒప్పందం.
మనం ఇపుడు వెళ్ళబోయేది ల కథెడ్రాల్ దగ్గరికే అన్నాడు కార్లోస్. టాక్సీ ముందుకు సాగింది. ఎంబిగాదో (Embigado) అన్న మెదెయీన్ నగరపు శివారు ప్రాంతం మీదుగా వెళ్ళింది. ఎస్కోబార్ పుట్టి పెరిగింది ఈ ఎంబిగాదో ప్రాంతంలోనేనట.
ఊరు వదిలాక టాక్సీ ఒక ఉష్ణమండలపు అటవీప్రాంతంగుండా సాగింది. కొంతదూరం అలా వెళ్ళాక ఒక నిడుపాటి కొండశిఖరం చేరింది. దాని ఎత్తు 2350 మీటర్లట – అంటే మెదెయీన్ సిటీ సెంటర్‌తో పోలిస్తే మరో 850 మీటర్లు ఎగువన ఉందన్నమాట. అక్కడనించి నగరమంతా చక్కగా కనిపించింది. నగర పరిసర ప్రాంతాలూ స్పష్టంగా కనిపించాయి. ఎస్కోబార్ తన కారాగారవాసానికి చక్కని ప్రదేశాన్నే ఎన్నుకున్నాడనిపించింది. తన కార్యకలాపాలను ఏ అడ్డంకులూ లేకుండా కొనసాగించడానికి అనువైన ప్రదేశమది. తన జైలులోంచి కనిపించే రన్‌వే ద్వారా కొకైన్ నిండిన విమానాలను యు.ఎస్.కు పంపుతూనే ఉన్నాడట ఎస్కొబార్.
డబ్బు సమకూర్చగల అన్ని విలాసాలూ ఆ కారాగారంలో ఉన్నాయి. బహుశా ఈ ల కథెడ్రాల్ జైలు ప్రపంచంలోకెల్లా అతి విలాసవంతమైన జైలయి ఉండాలి. అలాగే ఓ ఖైదీ తనకు తానే నిర్మించుకుని తన వారినే కాపలాగా పెట్టుకొన్న ఏకైక కారాగారమూ ఇదే అయి ఉండాలి. ఎంత తాపత్రయపడినా ఎస్కోబార్‌కు తన స్వంతజైలులోనూ రక్షణ లభించలేదు. ఓ ఏడాది అక్కడ గడిపాక, తనను పట్టుకొని వెళ్ళడానికి అమెరికా మద్దతుతో కొలంబియా దళాలు సిద్దపడుతున్నాయని తెలుసుకుని అక్కణ్ణించి తప్పించుకొని పారిపోయాడు ఎస్కోబార్.
ఇపుడా ల కథెడ్రాల్ కట్టడాన్ని ఓ నర్సింగ్ హోమ్‌గా మార్చారు. కార్లోస్ నాకు ఆ ప్రాంగణమంతా తిప్పి చూపించాడు. టెన్నిస్ కోర్టులు, హెలిపాడ్‌లు, వాడుకలో లేని భవనాలు కనిపించాయి. తన సహచరులతో కలిసి ఎస్కోబార్ తప్పించుకుని వెళ్ళిన అడవిబాట కూడా చూపించాడు. జైలు చూడటం ముగిశాక కార్లోస్ టాక్సీని నగరం వైపుకు మళ్ళించాడు. పావుగంట గడిచాక నగరం శివార్లలో వృక్షాలు దట్టంగా నిండిన మరోప్రాంతంలో ఉన్న ఓ ఇంటిని చూపించాడు. ‘ఇదిగో ఇక్కడే పోలీసు కాల్పుల్లో ఎస్కోబార్ 1993లో మరణించింది’ అని చెప్పాడు. ఆ అజ్ఞాతగృహంలో ఒకే ఒక్క అంగరక్షకుణ్ణి పెట్టుకుని ఎస్కోబార్ కాలం గడిపాడట. అతని కుటుంబసభ్యులు తమ ప్రెవేట్ జెట్‌లో జర్మనీకి పారిపోయే ప్రయత్నంలో బొగొతా నగరంలోని ఒక హోటల్లో రక్షణ విభాగాలకు దొరికిపోయారట. ఎస్కోబార్ ఆ హోటల్లో ఉన్న తనవాళ్ళకు ఫోన్ చేశాడు. యు.ఎస్. ఇంటెలిజెన్స్ విభాగం ఆ ఫోన్ కాల్ ఆధారంగా ఎస్కోబార్ ఎక్కడున్నదీ కనిపెట్టి కొలంబియా సైన్యానికి ఉప్పందించిందట. అలా ముగిసింది ఎస్కోబార్ దుష్టశకం.
చిట్టచివరిగా కార్లోస్ నన్ను మోన్తే సాక్రో సెమెటరీకి తీసుకువెళ్లాడు. ఎస్కోబార్‌ను ఖననం చేసిన స్థలమది. అతని తలిదండ్రుల సమాధుల పక్కనే ఏ ప్రత్యేకతలూ లేని అతని సమాధి ఉంది. కానీ అతని ఖననప్రక్రియకు పాతికవేలమంది హాజరయ్యారట. కొలంబియాలోనూ ప్రపంచమంతటా అతడ్ని ద్వేషించేవాళ్ళు కొల్లలుగా ఉన్నమాట నిజమే అయినా, మెదెయీన్ నగరంలో అతనివల్ల లాభపడినవాళ్ళకు కొదవలేదన్న సంగతి అతని ఖననసమయంలో మరోమారు ఋజువయిందన్నమాట!
అదే సెమెటరీలో గమనార్హమైన మరో సమాధి ఉంది. అయిదుగురు భర్తలను చంపిన గ్రిసెల్దా త్రుహీయో అన్న మహిళ సమాధి అది. ఎస్కోబార్ తన కార్యకలాపాలను ఆరంభించినపుడు ఆమె చేయూతనిచ్చిందట. తర్వాత వాళ్ళిద్దరికీ పడలేదు. అలాగే ఎస్కోబార్ బారిన పడి మరణించిన గలేనో సోదరుల సమాధులూ అక్కడ ఉన్నాయి. వాళ్ళిద్దరూ నిజానికి ఎస్కొబార్ సహచరులే – కానీ ఎక్కడో ‘చెల్లింపుల’ విషయంలో వారికి చెడింది. ల కథెడ్రాల్ రోజుల్లో ఎస్కోబార్ వాళ్ళను చర్చలకు పిలిచి చంపేశాడు. ఈ పాత్రలన్నీ నెట్‌ఫ్లిక్స్‌లో నార్కోస్ సీరీస్ చూసినవాళ్ళకు సుపరిచితమే.
మధ్యాన్నమయింది. కార్లోస్ కారు టూరు ముగిసింది. ‘మిమ్మల్ని మెట్రో స్టేషన్ దగ్గర దింపుతాను. అక్కణ్ణించి సిటీ సెంటర్‌కు వెళ్ళొచ్చు’ అన్నాడు కార్లోస్. సరేనన్నాను. ‘కొలంబియా అంతటిలోనూ – ఆ మాటకొస్తే దక్షిణ అమెరికా అంతటికీ, అత్యుత్తమ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మా ఊళ్ళో ఉందని’ మురిపెంగా చెప్పాడు కార్లోస్. మెట్రోలూ కేబుల్ కార్లే గాకుండా ఇంకో ఊహాతీతమైన ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ కూడా ఆ నగరంలో ఉందట. ‘మీరు కమ్యూన్ 13కు వెళ్ళినప్పుడు ఆ వ్యవస్థనూ చవిచూస్తారు’ అన్నాడు కార్లోస్.
‘మీ ఊరు పచ్చగా చెట్టూచేమలతో నిండి ఉంది’ అన్నాను కార్లోస్‌తో. వెంటనే చక్కగా స్పందించాడు. ‘ఇప్పటిదాకా హింస, మాఫియా ముఠాలు, మాదకద్రవ్యాలు, హత్యలు – వీటి గురించే మనం మాట్లాడుకున్నాం. మీరన్నట్టు మెదెయీన్‌లో ప్రకృతి సౌందర్యం అపారం. కొలంబియా దేశపు పూల రాజధాని అన్న ఖ్యాతి కూడా మా మెదెయీన్‌కు ఉంది. ఇక్కడనించి బళ్ళకొద్దీ పూలు రోజూ ఎగుమతి అవుతూ ఉంటాయి. ప్రతి ఏడాదీ ఆగస్టులో ఇక్కడ అంతర్జాతీయ కుసుమోత్సవం జరుగుతుంది. ప్రపంచపు నాలుగుమూలలనుంచీ ప్రతినిధులు వస్తూ ఉంటారు. స్థూలంగా ఆ ఘనత అంతా మెదెయీన్‌కు దక్కేమాట నిజమేగాని, నిజానికి ఈ పుష్పాలకు అసలు సిసలు కేంద్రం ఊరి శివార్లలో పదిమైళ్ళ దూరాన కొండ లోయల్లో ఉన్న సాంతా ఎలీన అన్న పట్నం…’ సంబరంగా వివరించాడు.
కార్లోస్‌తో విడివడే సమయం వచ్చింది. ఇద్దరం కలసి నాలుగున్నర గంటలు గడిపాం. అంతసేపూ ఇష్టమున్నా లేకపోయినా ఎస్కోబార్ మాతోనే ఉన్నాడు. అంతసేపు గడిపినా, నా సంగతి ఎలా ఉన్నా కార్లోస్‌కి తనివితీరినట్టు లేదు. నాకు ఇంకా ఇంకా చూపించాలని అతని తాపత్రయం… ‘ఇక్కడికి రెండు మూడు గంటల దూరంలో హసియెందా నపోలెస్ (Hacienda Napoles) అన్నచోట ఎస్కోబార్ రాంచ్ – జంతుక్షేత్రం, ఉంది. ఒక పూటలో వెళ్ళిరావచ్చు. అదీ చూస్తే మీ ఎస్కోబార్ యాత్ర సంపూర్ణమవుతుంది’, అన్నాడు కార్లోస్. చాలా ఏళ్ళ క్రితం నా టీనేజి దశలో ఇలస్ట్రేటెడ్ వీక్లీ పత్రికలో ఈ రాంచ్ గురించి చదివిన విపులమైన వ్యాసం గుర్తొచ్చింది. తను సేకరించిన అనేకానేక విలాస ఉపకరణాలతో ఎస్కోబార్ ఆ రాంచ్‌ను నింపేసిన మాట గుర్తొచ్చింది. వస్తువులే కాకుండా అతనక్కడ ఓ జంతు ప్రదర్శనశాలని కూడా నెలకొల్పాడట. ప్రపంచపు నలుమూలలనుంచీ తెప్పించిన జంతువులతో దాన్ని నింపాడట. అందులో ఆఫ్రికానుంచి తెప్పించిన నీటి ఏనుగులు – హిప్పోపాటమస్‌లు కూడా ఉన్నాయట!
ఎస్కోబార్ నిష్క్రమణ తర్వాత ఆ రాంచ్ పాడుపడింది. హిప్పోలన్నీ పక్కనున్న అడవుల్లోకి వెళ్ళిపోయాయి. వెళ్ళి తండోపతండాలుగా సంతానాభివృద్ధి చేశాయి. ఆ ప్రక్రియలో అక్కడి పర్యావరణ సమతౌల్యం దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. అది గమనించిన ప్రభుత్వం రంగంలోకి దిగింది. హిప్పోలను అవాంఛనీయ జీవజాతిగా ప్రకటించింది. వాటిల్ని పట్టి బంధించి, సంతానోత్పత్తిని హరించే ఆపరేషన్లు చేసి విభిన్న దేశాలకు పంపించే ప్రక్రియను ఆరంభించింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అలా ఎస్కోబార్, కొలంబియా పర్యావరణ వ్యవస్థ మీద అనుకోకుండా వదిలి వెళ్ళిన పాదముద్ర – భస్మాసుర పాదం – కొలంబియాను ఇప్పటికీ కలవరపరుస్తోందన్నమాట! ఆలోచనల్లోంచి తేరుకుని కార్లోస్ ప్రతిపాదనకు స్పందించాను. ‘వద్దు. ఇప్పటికే ఆ మహానుభావుడితో అనుకొన్నదానికన్నా ఎక్కువ సమయం గడిపాను. జీవితానికి సరిపడా సమాచారాన్ని సేకరించాను. మళ్ళా ఆయన తన రాంచ్‌లో చేసిన విన్యాసాలు చూడాలన్న కోరిక నాకు ఏమాత్రం లేదు. ఇక ఎస్కోబార్ జాడ సోకని మెదెయీన్ నగరాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చెయ్యాలని ఉంది’ అన్నాను. కార్లోస్ నవ్వేశాడు. ‘సాయంత్రం ఊళ్ళోని ఆసక్తికరమైన ప్రదేశాలకు తీసుకువెళ్ళే వాకింగ్ టూర్‌లు ఉంటాయి. వాటిల్లో చేరండి’ అని చక్కని సలహా ఇచ్చాడు.
కార్లోస్ నన్ను దగ్గర్లోని ఫ్లొరెత్తా మెట్రో స్టేషన్లో దింపి వెళ్ళాడు. అక్కడనించి సిటీ సెంటరు లోని పార్కె బెరియో స్టేషన్‌కు మెట్రో తీసుకున్నాను. చేరేసరికి మధ్యాన్నం ఒంటిగంట అయింది. కడుపులో కాస్తంత ఇంధనం వేయవలసిన సమయం. స్టేషను దగ్గరే వీధి దుకాణాలు కనిపించాయి. వాటిల్లో తాజాతాజాగా తయారవుతోన్న బున్యుయెలోలు (buñuelos) కనిపించాయి. జామ్ గానీ ఛీజ్ గానీ పిండిలో నింపి చేసిన చిరువంటకాలవి. కొలంబియాలో బాగా ప్రాచుర్యమున్న స్ట్రీట్‌ఫుడ్ అది. మన మైసూరు బోండాల ఆకృతి – పరిమాణంలో కాస్తంత పెద్దవి.
బెరియోస్ పార్కులో సహజోల్లాస వాతావరణం గాఢంగా కమ్ముకొని కనిపించింది. నులివెచ్చగా చిరు ఎండ… అనేకానేక వృక్షాలు… సంగీత సృజనలో నిమగ్నమైన వీధి గాయకులు… పార్కులోని బెంచీలమీద చేరగిలబడి ఉల్లాసంగా ఆస్వాదిస్తోన్న ప్రజానీకం – అదిగో అలాంటి పరిసరాల్లో నేను నా బున్యుయెలోలను చేతబట్టుకుని, ప్రజల్ని చూస్తూ సంగీతాన్ని వింటూ పచ్చదనాల వెచ్చని ఎండను నాలోకి ఇంకించుకుంటూ లంచ్ ముగించాను. వీధి గాయకులు అన్నానే గానీ వాళ్ళంతా అచ్చమైన కళాకారులు. చక్కని ప్రతిభ కలవారు. గొప్ప సంగీతసృజన చేశారు.
శ్రుతి అయిన మనసుతో ఆ బెరియోస్ పార్కులో తిరుగాడాక ఎదురుగా ఉన్న కథెడ్రల్ వేపు అడుగు వేశాను. అక్కడనించి దగ్గర్లోనే ఉన్న బొతేరో ప్లాజా చేరాను. లాటిన్ ఆమెరికాలోకెల్లా పేరుపొందిన చిత్రకారుడు, శిల్పీ అయిన ఫెర్నాండో బొతేరో (Fernando Botero) రూపకల్పన చేసిన ఇరవై నాలుగు విగ్రహాలు అక్కడ కొలువుదీరి ఉన్నాయి! ముందే చెప్పుకున్నట్లు అతని కళాకృతులు న్యూయార్క్, పారిస్ లాంటి అనేక నగరాలలో ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. రెండురోజుల క్రితమే కార్తహేన నగరంలో ఈ శిల్పి ప్రాణం పోసిన నగ్నమూర్తి ప్రతిమను చూశాను. ఏ నగరమైనా బొతేరో రూపొందించిన శిల్పం ఒకటి తమ ఊళ్ళో ఉన్నదంటే దాన్ని ఎంతో మురిపెంగా చూసుకుంటుంది. గర్వంగా చెప్పుకుంటుంది. అలాంటిది ఈ మెదెయీన్ నగరపు ప్లాజాలో ఇరవై నాలుగు బొతేరో శిల్పాలు ఒక్కసారిగా మనల్ని పలకరిస్తాయి. అవన్నీ బొతేరో శైలిని సంతరించుకొని – స్థూలత, ఊబకాయం, నగ్నత్వం, అతిశయ ఆకృతి – చూడగానే ఇవి ఆ మహాశయుడి క్రియాకల్పనలు అని తెలియజెప్పుతాయి. అతని గాఢాభిమానులందరికీ ఈ ప్లాజా ఓ దర్శనీయ స్థలమట. ఎక్కడెక్కడినుంచో వచ్చి చూసి వెళుతుంటారట. మెదెయీన్ నగరంలో పుట్టి పెరిగిన 90 సంవత్సరాల బొతేరో ఇపుడు మొనకోలో ఉంటున్నాడని విన్నాను. ఏదేమైనా ఎక్కడ ఉన్నా, ఆయన మెదెయీన్ నగరపు ముద్దుబిడ్డ అన్నది నిర్వివాదం. (శేషగిరిగారు వెళ్ళి వచ్చిన ఏడు నెలలకు, సెప్టెంబరు 2023లో తొంభై ఒక్కేళ్ళ వయసులో బొతేరో మొనకో దేశంలోని మాంటెకార్లో నగరంలో మరణించారు – అను.)
పక్కనే రెండుమూడు మ్యూజియమ్‌లు ఉన్నాయి. మెదెయీన్ లోనే ఉన్న కాసా దె ల మెమొరీయా (జ్ఞాపకాల మ్యూజియమ్) కూడా చూడాలన్నది నాకు ఎప్పట్నుంచో ఉన్న కోరిక. అది సిటీ సెంటర్ నుంచి ఇరవై నిముషాల టాక్సీ దూరంలో ఉంది. మెదెయీన్ నగరపు కల్లోల దశాబ్దాలూ సంక్షోభ సమయాలూ ప్రతిబింబించే మ్యూజియమది. ప్రవేశమార్గం దగ్గరే బృహదాకారపు కృష్ణవర్ణపు మ్యూరల్ పలకరించి నిలవరించింది. ఆ మ్యూజియంలో ప్రదర్శించిన వస్తువులన్నీ, నగరంలో సమీపగతంలో కొనసాగిన హింసాకాండలో బ్రతికి బయటపడినవారి అనుభవాల ప్రతీకలు – వాటి మీద కేంద్రీకృతమైన ప్రదర్శనశాల అది. ప్రవేశ రుసుము లేదు. ఆయా జ్ఞాపకాల్లో ప్రవేశించిన సందర్శకుల మనస్సులు వాటి గురించిన ఆలోచనలూ భావనలతో బరువెక్కుతాయి. కల్లోలసమయాలకు బలి అయిన అమాయకపు ప్రాణాలు ఆయా సంక్షోభాల నిరర్థకత్వాన్ని, వాటికి మానవజాతి చెల్లించిన అనవసర మూల్యాన్నీ మనకు విప్పి చెప్పి నిలదీస్తాయి.
మ్యూజియమ్ బయట ఓ పార్కు కనిపించింది. అందులోంచి ఆండీస్ పర్వతశ్రేణి మనోహరంగా కనిపించింది. అనుకోకుండా ఆ పార్కులో మనకు బాగా తెలిసిన ఓ మహావ్యక్తి విగ్రహం కనిపించింది: ఎవరో కాదు – మహాత్మా గాంధీ! హింసా సంక్షోభాలకు గురి అయిన ఆ నగరంలో ఆ అహింసామూర్తి ఉనికి ఎంతో సముచితం అనిపించింది.
సాయంత్రం నాలుగున్నర అయింది.
ఆ సాయంత్రం కమ్యూన్ 13కు తీసుకువెళ్ళే వాకింగ్ టూర్‌లో చేరాలని అప్పటికే నిర్ణయించుకొన్నాను. అది మొదలయ్యే జేవియర్ మెట్రో స్టేషన్ దగ్గరకు టాక్సీలో చేరుకున్నాను. పావుగంట పట్టింది. టూరు మొదలవడానికింకో పావుగంట సమయముంది. ఏమన్నా తిందామనిపించి అక్కడున్న వీధి దుకాణంలో రెండు బున్యుయెలోలు, ఓ కప్పు కాఫీ అంది పుచ్చుకున్నాను. ఠంచనుగా సమయానికి మా నడక టూరు గైడు జేసన్ దగ్గరికి చేరుకున్నాను.
మా బృందంలో ప్రపంచపు నాలుగు దిక్కులనుంచీ వచ్చిన పన్నెండుమంది సభ్యులు తేలారు. అందులో నలుగురు ఇటలీ విద్యార్థులు. ముగ్గురు గ్రీకు వనితలు. ఒక ఫ్రెంచి జంట. మరో ఇద్దరు కెనడా వాసులు. వారికి తోడు నేను – మొత్తం పన్నెండుమందిమి. టూరు భాష ఇంగ్లీషు. లాటిన్ అమెరికా దేశాలలో ఇలాంటి నడక టూర్లు సామాన్యమట. వీటికి రుసుము అంటూ ఉండదు. కానీ కార్యక్రమం ముగిశాక అందులో చేరినవాళ్ళు తమతమ సంతోషాలూ సంతృప్తులను బట్టి ఎంతైనా ఇవ్వవచ్చు. మామూలుగా అయిదు-పది డాలర్లు ఇస్తూ ఉంటారు. మంచివాడూ సమర్థుడూ అయితే ముందుగా రుసుము వసూలు చేసే టూరు గైడు కన్నా ఇలాంటి గైడే ఎక్కువ సంపాదిస్తాడట.
పరస్పర పరిచయాలు ముగిశాక మా గైడు జేసన్, కమ్యూన్ 13 నేపథ్యాన్ని క్లుప్తంగా చెప్పాడు. 21వ శతాబ్దం తొలి దినాలలో అది లాటిన్ అమెరికా మొత్తానికి ప్రమాదకరమైన ప్రదేశంగా అపఖ్యాతిని పొందిందట. పేటపేటంతా గెరిల్లా బృందాల అదుపులో ఉండేదట. ‘ఇప్పుడు పరిస్థితి మారింది. మెదెయీన్ నగరంలోని ఒక ఆసక్తికరమైన ప్రదేశంగా ఈ పేట నూతన స్వరూపాన్ని సంతరించుకుంది. తుపాకీల గర్జనల స్థానంలో సంగీత స్వరాలు చోటుచేసుకున్నాయి. లక్షా అరవైవేల జనాభాతో చక్కని నివాస ప్రదేశంగా రూపుదిద్దుకుంది’ వివరించాడు జేసన్. అందరం కొన్ని జనావాసాల మధ్యనుంచి నడుచుకుంటూ వెళ్ళి ఒక పెద్దపాటి కొండవాలున ఉన్న కమ్యూన్ 13 ఆరంభ బిందువును చేరుకున్నాం. ఆ పర్వతపు పాదాలనుంచి చరియ అంతా విస్తరించి శిఖరం దాకా ఉన్న ఇళ్ళు… అదంతా కమ్యూన్ పదమూడేనట!
1960ల నుంచీ కొలంబియా ప్రభుత్వానికీ వామపక్ష గెరిల్లా బృందాలకూ మధ్య నిరంతర ఘర్షణలు కొనసాగాయి. ఆ బృందాలలో ఎఫ్.ఎ.ఆర్.సి. (FARC – రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా), ఇ.ఎల్.ఎన్. (ELN – నేషనల్ లిబరేషన్ ఆర్మీ) అన్నవి ముఖ్యమైనవి. అందులో మళ్ళా ఫార్క్ బాగా బలమైన బృందం. దేశంలోని అడవులలో తమ స్థావరాలు నెలకొల్పుకుని ఈ మార్క్సిస్టు గెరిల్లా బృందాలు ప్రభుత్వం మీద నిరంతర పోరాటాన్ని సాగించాయి. ఆ పోరాటాల్లో రెండు లక్షలమంది ప్రాణాలు కోల్పోయారట. లక్షమంది ఆచూకీ తెలియకుండా పోయారు. విశాలమైన అటవీ భూభాగాల్లో ఫార్క్ తన ఆధిపత్యాన్ని స్థాపించుకొని సమాంతర ప్రభుత్వాన్ని నడపగలిగింది. చిట్టచివరికి 2016లో కొలంబియా ప్రభుత్వానికీ ఫార్క్ దళాలకూ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దళాలు ఆయుధాలు విడిచిపెట్టి రాజకీయ ముఖ్యవాహినిలో భాగమయ్యాయి. ఘర్షణలు తారాస్థాయిలో ఉన్నప్పుడు ఫార్క్ ఆర్థికంగా ఎంతో పుష్టిగలిగిన బృందమట. తమ అధీనంలో ఉన్న భూభాగంలో కోకా పంట పండేదట. ఆ విధంగా వారికి డ్రగ్ కార్టెళ్ళతో సంబంధాలు ఉండేవి. ఫార్క్‌తో పోలిస్తే ముందు చెప్పినట్టు ఇ.ఎల్.ఎన్. చిన్నపాటి బృందం. ఆ బృందం తన గెరిల్లా పోరాటం ఇప్పటికీ సాగిస్తోంది. అదే సమయంలో శాంతి సంప్రదింపులూ కొనసాగుతున్నాయి.
1993లో ఎస్కోబార్ నిష్క్రమణ తర్వాత పైన చెప్పిన వామపక్ష దళాలూ దేశంలోని మితవాద దళాలూ ఈ కమ్యూన్ 13లో తమతమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఎస్కోబార్ వదిలి వెళ్ళిన ‘ఖాళీ’ ప్రదేశంలో ఈ బృందాలు తమ తమ ప్రభావాన్ని ప్రసరించి నిలబెట్టుకొనే ప్రయత్నాలు చేశాయి. అంచేత కమ్యూన్ 13 అన్నది ఆ కుడి ఎడమల తీవ్రవాద బృందాలకు యుద్ధభూమిగా మారింది. 1998-2001ల మధ్య ఆ ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముందే చెప్పుకున్నట్టు దక్షిణ అమెరికా అంతటికీ ప్రమాదకరమైన ప్రదేశంగా కమ్యూన్ 13 పరిణమించింది. అసలు మొత్తం ప్రపంచంలోనే ఆ ఘర్షణలు కలవరం రేపాయి. 2002 ఆరంభదినాలలో కొలంబియా ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తేవడానికి నిర్వహించిన రెండు సైనికచర్యలు విఫలమయ్యాయి. చివరికి అక్టోబర్ 2002లో ‘ఆపరేషన్ ఓరియన్’ (Operation Orion) పేరిట కొలంబియా ప్రభుత్వం వెయ్యిమంది సైనికుల్ని రంగంలోకి దింపింది. వారికి మద్దతుగా టాంకులూ హెలికాప్టర్లను నియోగించింది. రెండున్నర రోజుల భీకరపోరాటం తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆపరేషన్ ఓరియన్ విజయవంతమయింది. ఆ ప్రయత్నంలో ఎనభై ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరిగినా కమ్యూన్ 13లో పూర్తి స్థాయి శాంతిభద్రతలు నెలకొల్పడానికి మరో ఎనిమిదేళ్ళు పట్టింది.
నా మనసులోని ఆలోచనలను పసిగట్టినట్టుగా జేసన్ ఒక పదునైన మాట అన్నాడు: ‘మా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి రెండువందల సంవత్సరాలు దాటినా, మా గతచరిత్ర అంతా రక్తభరితం. దక్షిణ అమెరికా దేశాలన్నిటిలోనూ మా దేశమంత సంక్షోభభరితదేశం మరొకటి లేదు.’ ఆ మాట నన్ను ఆశ్చర్యపరచింది. మరింత ఆలోచనలో పడవేసింది. వివరాల్లోకి వెళితే అతనన్నమాట నూటికి నూరుపాళ్ళూ నిజమని తేలింది.
అప్పటికీ ఇప్పటికీ కొలంబియాలో ఉన్నది ప్రజాస్వామ్యమే. మధ్యలో 1950లలో కొద్దికాలం పాటు నియంతృత్వం రాజ్యమేలినా పేరుకు కొలంబియాలో ఉన్నది ప్రజాస్వామ్యమే. అది రక్తసిక్త ప్రజాస్వామ్యం అన్నది వేరే మాట. అన్నిచోట్లా ఉన్నట్టే కొలంబియాలోనూ కన్సర్వేటివ్‌లూ లిబరల్సూ ముఖ్యమైన రాజకీయ పక్షాలు. కానీ వారి మధ్య పోటీ ఓట్ల పెట్టెలకే పరిమితం కాలేదు. కక్షలూ కార్పణ్యాలూ వీధుల్లోకి విస్తరించాయి. దేశంలో అంతర్యుద్ధాలకు దారి తీశాయి. రక్తపాతాలు జరిగాయి. ఈ రెండు పక్షాల మధ్యా సర్దుబాట్లు చేసిన క్రమంతో అసంతృప్తి చెందిన వామపక్ష గెరిల్లా దళాలు మూడవ శక్తిగా రంగప్రవేశం చేశాయి. ఈ వామపక్ష దళాలను అదుపు చేయలేని ప్రభుత్వమూ సైన్యమూ లోపాయికారీగా మితవాద అర్ధసైనిక దళాలకు మద్దతునిచ్చాయి. అలా నాలుగవ శక్తి అవతరించింది. 1970లు వచ్చేసరికి డ్రగ్ మాఫియాలు కార్టెళ్ళ రూపంలో అయిదో శక్తిగా పుట్టుకొచ్చాయి. వారి ప్రైవేటు సైన్యాలు దేశాన్ని భౌతికంగానూ భావనాపరంగానూ అతలాకుతలం చేశాయి. ఇన్నిన్ని అగ్నిగుండాలను దాటుకుని 2000 సంవత్సరానికల్లా ప్రభుత్వం డ్రగ్ కార్టెళ్ళను, ఆ తర్వాత క్రమంగా మితవాద అర్ధసైనిక దళాలను, వామపక్ష గెరిల్లా దళాలను అదుపు చెయ్యగలిగింది. చివరికి 2020 వచ్చేసరికి దేశంలో శాంతిభద్రతలు నెలకొన్నాయి. నాలాంటివాళ్ళు ఏ భయసంకోచాలూ లేకుండా దేశంలో తిరుగాడే పరిస్థితి ఏర్పడింది. అన్నట్టు కమ్యూన్ 13లో మెదెయీన్ నగరంలోకి అడుగు పెట్టకుండానే కొండల మధ్యనుంచి పసిఫిక్ సాగరతీరానికి చేరుకునే రోడ్డు ఒకటి ఉందట. అంచేత అప్పట్లో కొకైన్ స్మగ్లర్లకు అది మరికాస్త అనువైన స్థావరంగా నిలిచింది. ఏదేమైనా అదంతా గతం. ఇపుడున్న ‘శాంతి’ వర్తమాన వాస్తవం.
కమ్యూన్ 13 చేరుకున్నాక జేసన్ కొంత దూరం మమ్మల్ని సన్నపాటి సందులగుండా నడిపించాడు. అలా నడుస్తూ కాస్తంత ఎగువకు చేరుకున్నాక మా ముందు ఎస్కలేటర్ల పరంపర ఆవిష్కృతమయింది. ‘మీరు కమ్యూన్ 13కు వెళ్ళినపుడు మరో విలక్షణ రవాణా వ్యవస్థను చవిచూస్తారు’ అని మధ్యాహ్నం మా టాక్సీ మిత్రుడు కార్లోస్ అన్నది ఈ ఎస్కలేటర్ల గురించేనా? ఔనన్నాడు జేసన్! కొండశిఖరం వరకూ పాకిన కమ్యూన్ 13ను మెదెయీన్ నగరంతో అనుసంధించడానికి రూపకల్పన చేసిన ఏర్పాటు ఈ ఎస్కలేటర్ల పరంపర. (మన సిమ్లా నగరంలో కూడా దిగువనున్న బస్టాండు ప్రాంతంనుంచి ఎగువనున్న రిడ్జ్ {కొండ మూపురం} ప్రాంతానికి చేర్చడానికి ఇలాటి పబ్లిక్ ఎస్కలేటర్ ఉంది – అను.). సహజంగానే కమ్యూన్ 13కూ మెదెయీన్ నగరానికీ మధ్య ఈ ఎస్కలేటర్ల వ్యవస్థ ‘బొడ్డుతాడు’లా ఉపకరిస్తోంది. ఇపుడా వ్యవస్థ లేని కమ్యూన్ 13ను ఊహించనేలేము.
కమ్యూన్ 13 వర్ణభరితంగా కానవచ్చింది. ఇళ్ళకు కొట్టొచ్చే రంగులు… వీధుల్లో పెద్ద పెద్ద కుడ్యచిత్రాలు, మ్యూరల్స్… పర్యాటకుల్ని వెంటనే ఆకట్టుకొనే వర్ణభరిత ప్రదేశమా కమ్యూన్ 13. సహజంగానే నా మనసు మ్యూరల్స్ విశ్లేషణ వేపు మళ్ళింది. కొన్ని వాస్తవరీతిలో ఉంటే మరికొన్ని అధివాస్తవిక రూపంలో ఉన్నాయి. మా సౌలభ్యంకోసం జేసన్ ఆ అధివాస్తవిక రూపాలను వివరించి చెప్పాడు. అంతా కలసి అక్కడ వెయ్యికి మించి మ్యూరల్స్ ఉన్నాయట!
అన్నన్ని మ్యూరల్స్ మధ్య, ఓ అదుపులేని రంగులు నిండిన పెద్దగోడ కనిపించింది. పర్యాటకులంతా ఆ గోడ మీద స్ప్రే పెయింట్ వాడి తమ తమ ముద్రలు వదలవచ్చునట! జేసన్ తనతోబాటు ఒక స్ప్రే కాన్ తీసుకొనే వచ్చాడు. అందరం ఆ క్యాను తీసుకొని గోడమీద స్ప్రే చేశాము. అలా స్ప్రే పెయింట్ చెయ్యడం నాకు అదే మొదటిసారి. కమ్యూన్ 13లో ఆ పని చేశాను కాబట్టి సరిపోయిందిగానీ ప్రపంచంలో మరెక్కడ చేసినా అది పోకిరీ పనిగా పరిగణించబడేదే!
మెదెయీన్ నగరాన్ని గురించి నేను తెలుసుకున్న చరిత్ర అంతా సమీపగతానికి చెందినది. అధః పాతాళం లోంచి రెక్కలు విప్పుకొని వచ్చి విజయకేతనం ఎగరవేసిన మెదెయీన్ గాథ స్ఫూర్తిదాయకం. కానీ నగరంలో ఇప్పటికీ మాదకద్రవ్యాల అక్రమ రవాణా కొనసాగుతోందని, అజ్ఞాతంగా అణగిమణగి ఉంటూ మాఫియా బృందాలు తమ కార్యకలాపాలు చిన్న ఎత్తునే అయినా కొనసాగిస్తున్నాయనీ చెప్పాడు జేసన్. యు.ఎస్.కు కొకైన్ సరఫరా చెయ్యడంలో ఇప్పటికీ మెదెయీన్‌ది ప్రముఖ పాత్ర అట.
మేమంతా ఆ వీధుల్లో బాగా తిరుగాడాం. అంతస్తులు అంతస్తులుగా ఉన్న పేట వీధుల్ని పరామర్శించాం. పై అంతస్తుకు చేరేసరికి సంధ్యాసమయం దాటింది. మా టూరు ముగిసింది. జేసన్‌కు థ్యాంక్స్ చెప్పి పారితోషికాలు అందించాం. వెళ్ళేముందు జేసన్ మాకో ఆప్షన్ ఇచ్చాడు: ‘నాతో నగరానికి వస్తామంటే నేను వెంట ఉండి తీసుకువెళతాను. కాదు, మరికాసేపుండి నగరపు దీపాల వైభవం చూసి వస్తామంటారా మరి మీరే జాగ్రత్తగా దిగిరావాలి’ అన్నాడు. నేను దీపవైభవానికే ఓటు వేశాను. నాతోపాటు గ్రీకు మహిళలూ ఫ్రెంచి జంటా ఉండిపోయారు. ‘అందరం కలసికట్టుగా ఉందాం. దిగేటపుడు సులువవుతుంది’ అని అంతా అనుకున్నాం. అయినా ఆ జనసందోహంలో ఫ్రెంచి జంట మానుంచి విడివడ్డారు. మిగిలిన నలుగురం కలిసి ఉండగలిగాం. తలా ఒక కాఫీ అందుకుని వెలుగు రేకలను చీకట్లు ఆక్రమించే ప్రక్రియను శ్రద్ధగా చూసాం. మరి కాసేపు ఆ నగర వైభవాన్ని చూసి సంబరపడి ఏ తడబాటూ లేకుండా ఎస్కలేటర్లు ఒక్కొక్కటే ఎక్కి క్రిందకు దిగాం. వాళ్ళు ముగ్గురికీ వీడ్కోలు పలికి నేను మెట్రో స్టేషను దిశగా నడిచాను.
ఊళ్ళో డిన్నరుకు ఎల్ రాంచేరొ అన్న రెస్టరెంటుకు వెళ్ళమని జేసన్ సిఫార్సు చేసాడు. వెళ్ళాను. సంకోచొ అన్న వంటకాన్ని ఆర్డరు చేసాను. లాటిన్ అమెరికా దేశాలలో విశేష ప్రాచుర్యమున్న వంటకమది. ప్రాంతం ప్రాంతానికీ ఆ వంటకంలో చిన్నపాటి మెరుగులు తరుగులు ఉంటాయట. రోజంతా తిరిగి తిరిగి అలసిపోయాను గదా – చికెన్ సంకోచొను చల్లని కొలంబియన్ బీరుతో కలపి నింపాదిగా ఆస్వాదించాను.
ఫిబ్రవరి 15 రోజంతా గ్వాతాపె (Guatapé) అన్న ఊళ్ళో గడపాలని ఒక డే టూర్ తీసుకున్నాను. కార్తహేన నుంచి మెదెయీన్‌కు విమానంలో వస్తున్నప్పడు సహ ప్రయాణీకుడు సాంతియాగో ప్రస్తావించి, తప్పకుండా వెళ్ళి రండి, బావుంటుంది అని నొక్కి చెప్పిన పట్టణమది. మెదెయీన్ నుంచి 85 కిలోమీటర్లు. ఉదయం ఏడున్నరకల్లా బస్సు వచ్చేసింది. అంతా కలిసి ఇరవై మందున్నామా బస్సులో. చిట్టచివర ఎక్కిన మనిషిని నేనే. గ్వాతాపె వెళ్ళడానికి చక్కని పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఉంది కానీ అలా వెళ్ళినట్టయితే ఓ రాత్రి ఆ ఊళ్ళో ఉండవలసి వస్తుంది. నాకు అంత సమయం లేదు. అంచేత కండక్టెడ్ టూర్ వేపు మొగ్గాను.
గ్వాతాపె చేరడానికి రెండుగంటలు పట్టింది. కొలంబియా దేశంలోనే రంగులీనే పట్నంగా గ్వాతాపెకు పేరుంది. పరిసరాలన్నీ పచ్చని కొండల మయం. కొండ చరియల్లో అరటి, జామలాంటి పళ్ళతోటలు. మా ప్రయాణం సారవంతమైన కొండలూ లోయలగుండా సాగింది. నడుమన అక్కడక్కడ గ్రామాలు, ఒక పట్టణం… ప్రయాణం చాలా వరకూ నెగ్రో నది ఒడ్డున సాగింది. ముందే అన్నట్టు అసలు కొలంబియా దేశమే జీవవైవిధ్యానికి కాణాచి.
బస్సు తిన్నగా గ్వాతాపెలో ప్రముఖంగా కనిపించే ఎల్ పెన్యోన్ దె గ్వాతాపె (El Peñón de Guatapé) అన్న సహజ శిలావిశేషం దగ్గరకు చేరింది. ప్రపంచంలో అత్యధికంగా ఫోటోలు తీయబడే శిలలలో ఇది ఒకటట. శంకువు ఆకారపు ఆ శిల పరిసరాలనుంచి 200 మీటర్లు ఎగువన ఉంది. ఊరికే చూడటమే కాకుండా ఈ శిలా శిఖరాగ్రం చేరుకోవడానికి మెట్లు ఉన్నాయి. 708 మెట్లు ఎక్కి పైకి చేరడమన్నది ఓ మాదిరి సాహస క్రీడ. మెట్లు చక్కగా పటిష్టంగా ఉన్నా అవి ఎక్కడం అంటే దాదాపు నిలువుగా ఎగబ్రాకడమే! దానికెంతో శారీరక శక్తి ఉండాలి. నా హిమాలయాల ట్రెక్కుల పుణ్యమా అని ఆట్టే కష్టపడకుండా శిలాశిఖరం చేరుకోగలిగాను.
మెట్లకటూ ఇటూ గోడలూ అడ్డంకులూ లేవు – అంచేత పరిసర దృశ్యాలను తనివి తీరా చూసే అవకాశం లభించింది. ఎగువకు చేరే కొద్దీ దృశ్యవైభవం రెక్కలు విప్పుకోసాగింది. శిఖరాగ్రం చేరేసరికి ఏ అడ్డూ లేని మూడువందల అరవై డిగ్రీల దృశ్యమాలిక – శ్వాస తీసుకోవడం కూడా మరచిపోయేంత అద్భుత సౌందర్యం… దూరాన ఓ విశాల సరోవరం… ఆ సరోవరంలో అనేకానేక చిరుద్వీపాలు; నిజానికా సరోవరమన్నది నెగ్రో నదికి ఆనకట్ట కట్టడం వల్ల ఏర్పడిన జలాశయం. కొలంబియాకు విద్యుచ్ఛక్తి సరఫరా చేసే ముఖ్యమైన వనరులలో ఈ ఆనకట్ట ఒకటట. ఆ జలాశయం ఏర్పడడంతో, ఎల్ పెన్యోన్ అన్న గ్వాతాపె పట్టణపు కవలపట్నం నీట మునిగిపోయిందట.
ఆ దృశ్యాలలో లీనమైపోయి కాసేపు గడిపానక్కడ. సందర్శకులంతా ఫోటోలు తీసుకోవడం, పోజులివ్వడంలో నిమగ్నమై కనిపించారు: అవును మరి, ఎన్ని ఫోటోలు దిగినా, ఎన్ని ఫోటోలు తీసినా తనివి తీరని ప్రదేశమది. కాసేపు అక్కడ గడిపాక, మెల్లగా దిగడం ఆరంభించాను. దిగడం బాగా సులువనిపించింది. దిగుతున్నపుడు నాతోపాటు బస్సులో వచ్చిన కొలంబియన్ యువజంట కనిపించింది. పలకరించాను. సానుకూలంగా స్పందించారు. మాటల్లో పడ్డాం. ఎడిసన్, ఎస్టెఫాని అన్నవి వారి పేర్లు. ఎస్టెఫాని ఒక క్రూజ్ కంపెనీలో పని చేస్తోంది. తద్వారా ప్రపంచమంతా తిరగగలుగుతోంది. వాళ్ళిద్దరూ మెదెయీన్ నగరానికి కొన్ని గంటల దూరాన ఉన్న ఓ పట్టణానికి చెందిన వారట. చక్కని స్నేహశీలులు. కానీ నా మాటలన్నీ ఎస్టెఫానితోనే సాగాయి – ఆమెకు ఇంగ్లీషు వచ్చు. ఎడిసన్‌తో మాటాడినప్పుడు మాకు ఆమే దుబాసీ.
గ్వాతాపె ఊరు అనుకున్న దానికన్నా అందంగా ఉంది. అందువల్లనే మెదెయీన్ నుంచి సాగే డే ట్రిప్పులకు అంత గిరాకీ. శిలాశిఖరంనుంచి దిగివచ్చాక మా అందరికీ ఊళ్ళో తిరిగి రావడానికి గంటన్నర సమయమిచ్చారు. నింపాదిగా ఆ వీధుల్లో తిరిగాను. ఎంతో అందమైన వీధులు. ఎటు చూసినా ఆకట్టుకొనే రంగులు. ఒక వీధిలో రంగురంగుల గొడుగులు పందిరిలా పైన అలుముకొని కనిపించాయి. వీధులేకాదు, అక్కడి ఆటోరిక్షాలు కూడా రంగుల విషయంలో ఏం తక్కువ తినలేదు. మన బజాజ్ వారి రిక్షాలకు మెరిసిపోయే రంగులద్ది, ఆ రంగులకు సరిజోడుగా అలంకరణలు చేసి నడుపుతున్నారు. బహుశా ప్రపంచమంతటికీ అత్యంత ఆకర్షణీయమైన రిక్షాలు కనిపించే ప్రదేశం ఈ గ్వాతాపె పట్టణమే! కనీసం నేను చూసిన నూటపాతిక దేశాలలో ఇంతకన్నా అందమైనవి కనిపించలేదు.
ఎస్టెఫాని-ఎడిసన్ జంట మళ్ళా తటస్థపడ్డారు. వాళ్ళకు ఫోటో తీసి పెట్టడానికి మనిషి అవసరమయినపుడు నేను కనిపించి పిలిచారు. వాళ్ళు నాతో ఫోటోలు తీయించుకోవడమే కాకుండా వాళ్ళు నాతోకూడా ఫోటోలు దిగడానికి ఇష్టపడ్డారు. ‘నేను క్రూజ్ డ్యూటీల్లో వెళ్ళినపుడు చాలామంది ఇండియాకు చెందిన సహోద్యోగులు తటస్థపడుతూ ఉంటారు’ అని చెప్పింది ఎస్టెఫాని. ఆమె అలా అంటూ ఉండగానే ఆమెకు ఓ ఇండియా మనిషినుంచి ఫోను వచ్చింది. నా గురించి ఆ తమిళ మనిషికి చెప్పి ఇదిగో మాట్లాడు అంటూ నాకు ఫోను అందించింది. కాసేపు మాట్లాడుకున్నాం. మేమిద్దరం ఇంగ్లీషులో మాట్లాడుకోవడం చూసి ఎస్టెఫాని ఆశ్చర్యపోయింది. ఇండియాలోని భాషావైవిధ్యం గురించి ఆమెకు వివరంగా చెప్పాను. ఆమె ఆ వివరాలు ఎడిసన్‌కు అనువదించి అందించింది.
తను చేస్తోన్న ఉద్యోగమంటే తనకెంతో మక్కువ అని చెప్పుకొచ్చింది ఎస్టెఫాని. చిన్నప్పట్నించీ ఆమెకు ప్రపంచమంతా చుట్టిరావాలన్న కోరిక ఉండేదట. ఈ ఉద్యోగంవల్ల ఆ కోరిక అతి సులభంగా తీరుతోంది అన్నది ఆమె సంబరం. ఇపుడు పెళ్ళయింది గదా – ఇంకెన్నో రోజులు ఈ ఉద్యోగం చేయలేను. ఒకసారి పిల్లలంటూ పుడితే ఇలాంటి ఉద్యోగం చెయ్యడం అసాధ్యం. అంచేత మిగిలిన ఈ కాస్త సమయంలో వీలయినంత ఎక్కువగా తిరిగేస్తున్నాను – చెప్పుకొచ్చింది ఎస్టెఫాని. ఆమె స్వరంలో నిరాశ లేదు. ఫిర్యాదు అసలే లేదు. ఉన్నదానితో సరిపెట్టుకొనే విజ్ఞత ఉన్న మనిషి అనిపించింది.
అక్కడి ఒక వీధి దుకాణంలో ఒక తమాషా వంటకం కనిపించి ఆకర్షించింది. మనం కొన్ని ప్రాంతాల్లో గులాబీ మొగ్గలు అని పిలుచుకొనే కరకరలాడే చిరుతీపి వంటకంలా ఉందా వాఫెల్. కాకపోతే సైజులో పెద్దది. ఆ ‘మొగ్గల’ నడుమన నారింజ రంగు కస్టర్డ్ వేసి ఆ పైన క్రీమ్ పోశారు. ఎడిసన్ ఒక పెద్ద పోర్షన్ కొన్నాడు. ముగ్గురం పంచుకున్నాం. ‘కొలంబియాలో బాగా పేరున్న స్వీట్ ఇది’ అని వివరించింది ఎస్టెఫాని. ‘ఇక్కడ అమ్మింది చక్కని నాణ్యత గలది’ అని సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. ఆ వీధుల్లో అటూ ఇటూ పచార్లు చేస్తూ ముగ్గురం సరదాగా గడిపాం. అసలక్కడ నడవగలగడమే ఒక ఉత్సవ సమానం. కనులకు విందు.
లంచ్ ముగించాక ముగ్గురం శిలాశిఖరం మీదనుంచి కనిపించి ఆకట్టుకున్న పుంచీనా (Punchiná) రిజర్వాయర్లో నౌకావిహారానికి వెళ్ళాం. సరోవరం చూడచక్కనిది. మహా శాంతంగా ఉంది. పచ్చని కొండల నేపధ్యంలో అది యూరప్‌లో కనిపించే ఆల్ప్స్ పర్వత సీమల్లోని సరోవరాలను గుర్తుచేసింది. బోటులో సంగీత వాహినులు ఆరంభమయ్యాయి. సంగీతకారుల బృందమొకటి తన గీతాలాపనను ఆరంభించింది. వారిలో గిటారు ధరించిన కళాకారుడొకాయన అందరి దగ్గరికీ వెళ్ళి, వాళ్ళు ఏయే దేశాలనుంచి వచ్చారో తెలుసుకుని, ఆ దేశపు వివరాలను తన స్పానిష్ పాటలో చొప్పించి పాడి సంతోషపెడుతున్నాడు. అలా నా దగ్గరికి వచ్చి ఇండియా అని తెలుసుకొని భారతదేశపు ప్రస్తావనతో ఒకటి రెండు చరణాలు పాడాడు. అంతా బానే చప్పట్లు కొట్టారు. నాకు భాష తెలియకపోయినా మన దేశాన్ని గురించి సహజంగానే ప్రశంసా ప్రస్తావన చేశాడన్నది స్పష్టంగా బోధపడింది.
సరోవరతీరాల్లో ధనికులూ ప్రముఖుల పెద్ద పెద్ద విల్లాలు కనిపించాయి. ఆ ప్రముఖుల వివరాలు సందర్భానుసారంగా బోటువాళ్ళు అందిస్తూ వెళ్ళారు. ఉన్నట్టుండి, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఇపుడు పాడు పడిపోయిన భవనం కనిపించింది. అది ఎస్కోబార్‌దట. మెదెయీన్ ప్రాంతాలలో ఎస్కోబార్ తటస్థపడని ప్రదేశమంటూ లేదు. ఉండదు. ఒకచోట నీట మునిగిన ఎల్ పెన్యోల్ పట్టణపు సెంట్రల్ ప్లాసా పునర్నిర్మించబడి కనిపించింది. అక్కడ కాసేపు గడిపాం. ఓ కాఫీ తాగాం.
బస్సు దిగి మెదెయీన్ చేరేసరికి సాయంత్రం ఏడయింది. నేనో మెట్రో స్టేషన్ దగ్గర దిగి సిటీ సెంటరు వేపు వెళ్ళాను. ఈ ప్రాంతాల్లో సాయంత్రం ఆరూ తొమ్మిదీ మధ్య సిటీ సెంటర్లు మహా బిజీగా ఉంటాయి. యు.కె.లో అయితే చీకటి పడగానే సిటీ సెంటర్లలో హడావుడి తగ్గుముఖం పడుతుందిగానీ ఆసియా, లాటిన్ అమెరికా నగరాలలో ఆ సమయంలోనే కార్యకలాపాలూ కోలాహలాలూ తారాస్థాయికి చేరుకుంటాయి. అదిగో ఆ జనసందోహం సృష్టించే ఆహ్వానించదగ్గ కోలాహల పరంపర అనుభవానికి తెచ్చుకుందామని సిటీ సెంటరు చేరాను. ఏ తొందరలూ లేకుండా వీధుల్లో తిరుగాడుతూ చకచక సాగుతోన్న మెదెయీన్ నగరపు వేగాన్ని నా జ్ఞాపకాల్లో ఇంకించుకొనే ప్రయత్నం చేశాను.
పచార్లు ముగిశాక మెట్రో ఎక్కి మా హోటలు దారి పట్టాను. మెట్రో దిగాక ఓ సూపర్ మార్కెట్ కనబడితే ఆగి నీళ్ళబాటిల్ కొన్నాను. అక్కడనించి మా హోటలు మైలు దూరాన ఉంది. అంతగా పరిచయంలేని దారులే అయినా గూగుల్ మ్యాపుల సాయంతో సులువుగా చేరుకోగలనని నమ్మి నడక సాగించాను. చీకట్లు కమ్ముకొచ్చాయి. ఎక్కడ ఏ పొరపాటు చేశానో తెలియదు – దారి తప్పనే తప్పాను! ఎవరినన్నా అడుగుదామంటే అంతా నిర్మానుష్యం. ఇళ్ళున్న నివాసస్థలమే అయినా అవన్నీ పలు అంతస్తుల భవనాలు. ఎలారా బాబూ అనుకొంటోంటే ఓ పడుచు జంటా వారి శునకమూ నడిచి వస్తూ కనిపించారు. ప్రాణం లేచివచ్చింది. నా అవతారం, నా బేలమొహం చూడగానే వారికి విషయం అర్థమయింది. అయినా గబగబా నా కష్టం చెప్పుకొచ్చాను. విన్నారు. వారికేమీ పొడిపొడిగా జవాబు చెప్పేసి దారి చూపించి వెళ్ళిపోవాలన్న ఆత్రం ఉన్నట్లు కనిపించలేదు. నింపాదిగా నా వివరాలడిగారు. చెప్పాను. తమను తాము పరిచయం చేసుకున్నారు. అతని పేరు పెడ్రో. ఆమె పేరు లిడియా. ఆ వాడకట్టువాళ్ళే. డిన్నరు చేసి వాహ్యాళికి వచ్చారట… అతను సివిలింజనీరు. ఆమె ఫిజియో థెరపీ క్లినిక్‌లో పనిచేస్తోంది…
‘పదండి మీతోబాటు హోటలుదాకా వస్తాం’ అన్నదా జంట. దేవుడే దిగివచ్చి వరమిచ్చినట్టనిపించింది. ఆమె చక్కని ఇంగ్లీషు మాట్లాడుతోంది. అతను కూడా పర్లేదు. వాళ్ళిద్దరూ మెదెయీన్ లోనే పుట్టి పెరిగిన పాయిసా (Paisas) మనుషులట. ఆన్తియోకియా రాష్ట్రపువాళ్ళను కొలంబియాలో పాయిసాలు అని వ్యవహరిస్తారని వివరించింది లిడియా. ఈ మధ్యే పెళ్ళయిందట. వారి మధ్య అనురాగస్రవంతుల జాడ స్పష్టంగా కనిపించింది. ఆ జాడలు గమనించిన స్ఫూర్తితో ‘మీరిద్దరూ మొట్టమొదట ఎక్కడ కలుసుకున్నారూ’ అని అడిగేశాను. ఎలిమెంటరీ స్కూల్లో అన్నది వారి జవాబు. బాల్యస్నేహం. అనురాగంగా పరిణమించిన లేగప్రేమ. నా ప్రయాణాల గురించీ మా కుటుంబం గురించీ కుతూహలం నిండిన ప్రశ్నలు వేసారు. అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే మా హోటలు చేరుకున్నాం. వారి శ్రద్ధ, ఆప్యాయత, పరస్పర అనురాగం, ఇతరులకు సహాయం చేసే ప్రవృత్తి నన్ను ఎంతగానో ఆకట్టుకొన్నాయి.
రెండురోజుల క్రితం మెదెయీన్ వచ్చినప్పుడు అగ్నిగుండాలను దాటుకుని, హింసల బారినుంచి తప్పించుకుని తన మనుగడను పునర్నిర్వచించుకొంటోన్న నగరాన్ని చూస్తాననుకున్నాను. నగరాన్ని వదిలిపెట్టే క్షణాల్లో అక్కడ అలుముకున్న అనురాగసుగంధం నన్ను నిలువునా ముంచెత్తుతోంది. నగరానికి చెందిన ఒకే ఒక్క జ్ఞాపకం, ఒకే ఒక్క పదం ఇపుడు నా వెంట వస్తోంది – ప్రేమ.
మర్నాటి ఉదయం కొలంబియా రాజధాని బొగొతా చేరబోతున్నాను. నా ఈ దక్షిణ అమెరికా ప్రయాణాలలో అది ఆఖరి మజిలీ…
(సశేషం)