ఉత్తర మొరాకో శోధనలు 3

మౌలె ఇద్రిస్, మెక్నెస్

యజీద్ రాగానే ముగ్గురం కలసి ఆ పక్కనే కొండల మధ్య ఉన్న మా తదుపరి గమ్యం మౌలె ఇద్రిస్ వేపు సాగిపోయాం. బాగా దగ్గర–అంతా కలసి అరగంట ప్రయాణం. ఆ ఊరు మా యజీద్ స్వస్థలం. ఆ కొండమీది పట్నంకేసి వెళ్ళే దారిలో కొండచరియల్లో బాగా పెరిగిన ఆలివ్ తోటలు కనిపించాయి. అవి వందలాది సంవత్సరాలనాటివి అనిపించింది. ఆ చెట్ల కాండాల పరిమాణం చూస్తే ‘అవి ఎంత పురాతన వృక్షాలో గదా’ అనిపించింది.

మొరాకో దేశమంతటికీ అతి పవిత్రమైన ప్రదేశం మౌలె ఇద్రిస్. అక్కడ పుణ్యమూర్తి మౌలె ఇద్రిస్ సమాధి ఉంది. మొరాకో దేశానికి రూపకల్పన చేసిన వ్యక్తి ఈయన. అంచేత దేశమంతా ఆరాధించే పుణ్యస్థలమది.

ఈ మౌలె ఇద్రిస్ అల్ అక్బర్, మహమ్మద్ ప్రవక్త మునిమనమడు. ఆధిపత్య పోరాటాల్లో వెనుకంజ వేయాల్సి వచ్చాక అరేబియా ద్వీపకల్పపు ముఖ్యభాగాలనుంచి పారిపోయి ఈయన క్రీస్తుశకం 789లో మొరాకో ప్రాంతం చేరాడు. చేరి అక్కడి స్థానిక బెర్బర్ తెగలవారికి ఇస్లామ్ ధర్మాన్ని పరిచయం చేశాడు. వారిని ఆకట్టుకోవడంలో ఆయనకు ప్రవక్తతో ఉన్న బంధుత్వం బాగా ఉపయోగపడింది. అలా ఆ ప్రాంతంలో మొట్టమొదటి ముస్లిమ్ రాజవంశానికి అంకురార్పణ చేశాడు మౌలె ఇద్రిస్. జర్‌హూన్ పర్వతపాదాల దగ్గర ఉన్న ఖైబర్, టజ్గా అన్న జంట శిఖరాల మీద ఓ పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణం ఆయన పేరు మీదుగా మౌలె ఇద్రిస్ జర్‌హూన్ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిలోకి వచ్చింది. ఇప్పటికీ మొరాకో దేశమంతా ఆరాధించే పవిత్రస్థలంగా నిలచి ఉంది.

ఆ ప్రాంతాల్లో సామాన్యుల మక్కాగా భావించే ప్రదేశమది. అంత దూరపు మక్కా వెళ్ళే వెసులుబాటు లేనివాళ్ళు అయిదుసార్లు ఈ మౌలె ఇద్రిస్ యాత్ర చేసినట్టయితే దాన్ని ఒక మక్కా యాత్రకు సరిసమానంగా పరిగణించే సంప్రదాయం ఇక్కడ ఉంది. ప్రతి ఏడాదీ అగస్టు నెలలో ఇక్కడ జరిగే మతోత్సవం వేలాదిమంది యాత్రికులను ఆకర్షిస్తుంది. వాళ్ళంతా వచ్చి ఆ పట్నం పరిసరాల్లో తమతమ గుడారాలు వేసుకొని గడపడం కద్దు.

గొప్ప నైసర్గిక సౌందర్యమే కాకుండా ఇలాంటి పవిత్రస్థలాల్లో ప్రపంచమంతటా కనిపించే ఒక దివ్యభావన నాకు ఆ పట్నంలోనూ కనిపించింది. బహుశా ఇలాంటి ప్రదేశాలతో ముడిపడి ఉండే పురాణగాథలూ దైవభావనలూ మన మనసుపొరల్లోని ఆధ్యాత్మిక భావనాబిందువులతో ఎక్కడో కలసిపోతాయి కాబోలు! ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళిన ప్రతిసారీ ఒక ఆరాధన, గౌరవం నిండిన ఉత్సుకత నాలో చెలరేగుతుంది. ‘వందలాది సంవత్సరాలుగా లక్షలాదిమందిని ప్రభావితం చేసిన దివ్య ప్రదేశానికి వెళుతున్నావు సుమా!’ అని మనసు పదేపదే చెపుతూ ఉంటుంది.

మౌలె ఇద్రిస్ సమాధి ప్రాంగణం ఎదుట మమ్మల్ని కారు దింపాడు యజీద్. ఆ ప్రాంగణంలో ఇస్లామేతరులకు ప్రవేశం లేదు. 1912 వరకూ అసలు అన్యమతస్థులకు ఆ ఊర్లోకే ప్రవేశముండేది కాదు. 2005 వరకూ వాళ్ళు ఊళ్ళోకి వచ్చినా రాత్రిపూట అక్కడ గడపటం నిషిద్ధం.

అక్కడి ముఖద్వారం లోంచి ప్రాంగణం లోకి తొంగి చూసే అవకాశం మాత్రం మాకు లభించింది. ‘మిమ్మల్ని దొడ్డితలుపుల ద్వారా లోపలికి తీసుకువెళతాను, కొంచం ఖర్చవుతుంది’ అంటూ మా దగ్గరికో మహానుభావుడు వచ్చాడు. అతగాడెంతగా నచ్చచెప్పినా నేను ఖచ్చితంగా వద్దని చెప్పేశాను. ఏదేని పవిత్ర ప్రదేశంలో ఒక నియమం, సంప్రదాయం అంటూ ఉందంటే దానివెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది. అది మనకు అసంబద్ధం గానూ, తర్కవిరుద్ధం గానూ అనిపించవచ్చు. కానీ అది వాళ్ళ మతవిశ్వాసాలకు సంబంధించిన విషయం. ఆ నియమాలను పాటించకపోవడం నైతికంగా సమర్థనీయం కాదు. పైగా ఆ నియమాలను లెక్కపెట్టకుండా వెళ్ళి పట్టుబడితే వచ్చే పరిణామాల సంగతి సరేసరి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నేను ప్రయాణాల్లో ఒకటే నియమం పాటిస్తా: పరాయి దేశం వెళ్ళినపుడు అక్కడి నియమాలు, కట్టుబాట్లూ తుచా తప్పకుండా అనుసరించు. స్థానికుల విలువలనూ సంప్రదాయాలనూ గౌరవించు…

పుట్టిపెరిగిన ఊరు కాబట్టి యజీద్‌కు అక్కడి కీలక ప్రదేశాలు, విస్టా పాయింట్లూ కరతలామలకం. గ్రేట్ టెర్రేస్ అన్నది అలాంటి చక్కని విస్టా పాయింటు. అక్కడ్నించి ఊరంతా చక్కగా కనిపిస్తుంది. నీలిరంగు పైకప్పు ఉన్న మౌలె ఇద్రిస్ సమాధి ప్రాంగణం కూడా అక్కడ్నించి బాగా కనిపిస్తుంది. సెంటిస్సీ మసీదుకు చెందిన పచ్చటి పలకలతో నిండిన స్తూపాకారపు మినరెట్ యజీద్ మాకు చూపించిన నిగూఢ సంపద. ఆ మినరెట్ మీద ఖురాన్ సూక్తులు చెక్కి ఉన్నాయి. మొరాకో దేశమంతటా పలకల మినరెట్లే ఉంటాయి. స్తూపాకారంలో ఉండే మినరెట్ ఇదొక్కటేనట.

ఈ ప్రయాణంలో ఈడిత్ వార్టన్ అన్న ప్రముఖ అమెరికన్ రచయిత 1920లో రాసిన ఇన్ మొరాకో అన్న పుస్తకం నా కళ్ళబడింది. ఫెజ్ నగరంలోని ఒక షాపులో అది కనబడగానే వెంటనే కొనేశాను. ది ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అన్న నవలకుగానూ పులిట్జర్ బహుమతి పొందిన మొట్టమొదటి మహిళా రచయిత ఈడిత్ వార్టన్. ఆ నవలను చాలాసార్లు హాలీవుడ్ సినిమాగా తీశారు; 1994లో విఖ్యాత దర్శకులు మార్టిన్ స్కోర్సేసీ తీసిన సినిమా ఆ పరంపరలో చివరిది. ఈడిత్ వార్టన్ 1919లో తాను చేసిన మౌలె ఇద్రిస్ ప్రయాణం వివరాలు ఈ ట్రావెలాగ్‍లో రాశారు. అప్పట్లో మౌలె ఇద్రిస్ ఫ్రెంచివారి వలసపాలనలో ఉండేది. వందేళ్ళ తర్వాత మళ్ళీ ఇపుడు మౌలె ఇద్రిస్ వచ్చినా ఈడిత్‌కు పెద్దగా మార్పుచేర్పులు కనిపించే అవకాశం లేదు. ఒకటీ అరా హోటళ్ళు, అక్కడక్కడ సావెనీర్ షాపులు- అంతే. ఆమె కాలంలో ఈ చిన్న పట్నం ఎంత నిద్రాణంగా ఉండేదో, ఇప్పటికీ మౌలె ఇద్రిస్ అదే నిద్రాణ నగరం.


మౌలె ఇద్రిస్‌కు ముప్పైరెండు కిలోమీటర్ల దూరాన ఉంది మెక్నెస్ నగరం. అరగంట ప్రయాణం. నేనూ రుఇ మాటల్లో మునిగితేలుతూ ఉంటే యజీద్ కారును నింపాదిగా ముందుకు నడిపాడు. మెక్నెస్ నగరం దగ్గరపడేసరికి ఆ నగరపు బలమైన ప్రాకారం మా దృష్టికి వచ్చింది. కారు నగరపు మహాముఖద్వారపు ఆర్చుల దగ్గరకు చేరేసరికల్లా మొరాకో దేశపు మరో విశిష్ట నగరాన్ని చూడబోతున్నాం అని మాకు అర్థమయింది. ఆ భావన ముఖద్వారం దగ్గరే ఆగలేదు; వృత్తాలు వృత్తాలుగా పరచుకొని ఉన్న ప్రాకారాలు దాటుకొని, వాటి వాటి ద్వారాల గుండా సాగుతున్నకొద్దీ అది ఒక విలక్షణ నగరమన్న భావన బలపడసాగింది. మొత్తం మూడు వృత్తాకారపు ప్రాకారాలు ఉన్నాయట. మట్టీ సున్నాలతో నిర్మించిన ఆ ప్రాకారాలు మైళ్ళకు మైళ్ళు పరుచుకొని ఉన్నాయి.

మెక్నెస్ నగరానికి చెప్పుకోదగ్గ చరిత్ర ఉంది. ఆ చరిత్రకు మూల ఆధారం సుల్తాన్ మౌలె ఇస్మాయిల్ ఇబ్న్ షరీఫ్. మొరాకో చరిత్రలో ఎంతో శక్తివంతమైన వర్ణభరితమైన పాలకుడీయన. మెక్నెస్ నగరానికి కర్తా కర్మా క్రియా ఈ సుల్తానే. బాగా చిన్నప్పుడే గద్దెనెక్కాడీయన. అంతకుముందు వాళ్ళ అన్న పాలకుడుగా ఉన్న సమయంలో ఈయన మెక్నెస్ ప్రాంతానికి గవర్నరుగా ఉన్నాడు. తాను సుల్తాను అవగానే 1672లో రాజధానిని ఫెజ్ నగరం నుంచి మెక్నెస్‍కు తరలించాడు.

బడాబడా కట్టడాలంటే ఈయనకు మక్కువ. తన ఏభై అయిదేళ్ళ సుదీర్ఘ పాలనలో ఎన్నో రాజభవనాలు నిర్మించాడు. డజన్లకొద్దీ మసీదులు నిర్మించాడు. ప్రాకారాలు, వాటికి దర్వాజాలు, వీధులు, బహిరంగ ప్రాంగణాలు- పదో శతాబ్దంలో స్థాపించబడి అప్పటిదాకా అంతగా ఉనికి లోకి రాని చిన్నపాటి పట్నంగా ఉండిపోయిన మెక్నెస్, ఈ సుల్తాన్‌గారి పుణ్యమా అని ఒక రాచరిక వైభవం సంతరించుకొన్న సమయమది.

కారును ఓ పబ్లిక్ పార్కింగ్‌లో నిలిపి యజీద్ మమ్మల్ని ఆ ఊరి మదీనా వేపుకు తీసుకెళ్ళాడు. దారిలో కనీసం అరడజనుమంది అతగాడిని పలకరించారు- ఊళ్ళోవాళ్ళంతా అతనికి బాగా తెలుసన్నమాట. కాసేపట్లో ముగ్గురం ఆ మదీనా ముఖద్వారం – బాబ్ అల్ మన్సూర్ – చేరుకున్నాం. బహుశా ఈ ముఖద్వారం ఆఫ్రికా ఖండంలోకెల్లా అతి బృహత్తరమైనదై ఉండాలి; ప్రపంచంలోని ఇలాంటి ఏ నిర్మాణంతో అయినా సరితూగగల ముఖద్వారమది. బృహత్తర పరిమాణం సంగతి సరేసరి, చూడ్డానికి కూడా ఈ దర్వాజా ఎంతో సుందరంగా ఆకట్టుకొనేలా ఉంది. రెండు కళ్ళూ చాలవనిపించేలా ఉంది. నిడుపాటి పాలరాతి స్థంభాలు, రంగురంగుల చలువ ఫలకాలమీద సుందరమైన అలంకృతులు, స్టక్కో పనితనం, వాటిమీద చెక్కివున్న ఖురాన్ సూక్తులు, చక్కని ఆర్చులు- వీటన్నిటి కలయికతో ఆ ముఖద్వారం ఒక సుందరగంభీరతను సంతరించుకొంది. మెక్నెస్ నగరపు విలక్షణ ప్రతీకగా పరిణమించింది. ఆ ద్వారపు నిర్మాణంలో ఉపయోగించిన పాలరాతి స్థంభాల మీద రోమన్ చిహ్నాలూ ప్రతీకలూ ఇంకా కనపడుతూనే ఉన్నాయి. అవన్నీ ఓలుబులుస్ నుంచి తీసుకువచ్చి ఇక్కడ వాడినవన్నమాట. ఆ జాడల్ని దాచిపెట్టే ప్రయత్నం మెక్నెస్ నగర నిర్మాతలు ఏమాత్రం చేసినట్టులేదు. మౌలె ఇస్మాయిల్‌కు ఉన్న నిర్మాణాభినివేశం మెక్నెస్ నగరానికి అతి పెద్ద వరంగానూ, ఓలుబులుస్ పట్నానికి తీరని శాపంగానూ పరిణమించిందన్నమాట!

అల్ హదీమ్ అన్నది బాబ్ అల్ మన్సూర్ దర్వాజాకు ఎదురుగా ఉన్న ఒక విశాల ప్రాంగణం. బాగా పేరున్న మరాకేష్ నగరపు జమా అల్ ఫనా చౌరస్తాకు ఇది మెక్నెస్ నగరపు ప్రతిరూపం అంటారు. మెక్నెస్ నగరపు అతిముఖ్యమైన చౌరస్తా ఇది. చుట్టూరా చరిత్ర నిండిన ఎన్నో భవనాలు. ఆ చౌరస్తా నుంచి చిలవలు పలవలుగా పరిసర విపణి ప్రాంతాల మదీనాలోకి దారితీసే సందుగొందులు.

ఇక్కడ మా సరికొత్త చైనా బ్యాక్‌పాకర్ మిత్రుడు రుఇ నాకూ యజీద్‌కూ గుడ్‌బై చెప్పి ఆ అల్ హదీమ్‍ ప్రాంగణాల్లో కలిసిపోయాడు. అతను మెక్నెస్ నుంచి కాసబ్లాంకా వెళుతున్నాడు. దానికి వ్యతిరేక దిశలో నా ప్రయాణం. అంచేత అక్కడ ఇద్దరం విడిపోవలసి వచ్చింది. అతను వెళ్ళాక కూడా నాకు మరో పూటంతా మెక్నెస్‍లో గడిపే సమయముంది.

యజీద్‌ను కాసేపు రెస్టు తీసుకోమన్నాను. ఆ ప్రాంతంలో ఒంటరిగా తిరుగాడి కాస్తంత ఏకాంత అనుబంధం ఏర్పరచుకోవాలన్నది నా ఆలోచన. ‘విశ్రాంతి’ అన్నమాట యజీద్‌కు నచ్చలేదు. నాతోపాటు ఉండి నాకు అన్నివిధాలా సాయపడాలి అన్నది అతని అభిమతం. ఇద్దరం అక్కడ రోడ్డు పక్క ఫలహారశాల దగ్గర ఆగాం. యజీద్ అప్పటికే భోజనం చేసేశాడు కాబట్టి ఇహ ఏమీ తినడానికి ఇష్టపడలేదు. స్థానికంగా దొరికే రొట్టెల ఎంపికలో నాకు సాయపడ్డాడు. మన పరోటాల్లా కనిపిస్తోన్న ఓ పల్చటి రొట్టెను స్థానికంగా సెమ్మోన్ అంటారని చెప్పాడు. అలాగే ఇంగ్లీషువాళ్ళ మఫిన్‌లా కనబడుతోన్న మరో రొట్టెను హర్ష అంటారని చెప్పాడు. దాన్ని సెమొలినా అనే గోధుమ రవ్వతో పెనం మీద కాల్చి చేస్తారని చెప్పాడు.

ఆ అల్ హదీమ్ ప్రాంతంలోని మదీనా పరిసరాల సందుగొదుల్లో మా నడక కొనసాగించాం. నేను తీసుకొన్న రొట్టెల్ని నములుతూ ఉండగా యజీద్ ఆ ప్రాంతం గురించి తన భాషలో ఏదో చెప్పాలని విశ్వప్రయత్నం చేశాడు. కానీ అతను చెప్పబోతున్నది నాకు ఏమాత్రం బుర్రకెక్కడం లేదని అతనికి అర్థమయింది. నా నిరాసక్తపు హావభావాల పుణ్యమా అని అతని మాటలకు నేను ఏదో మర్యాద కోసం స్పందిస్తున్నానే గాని అందులో ఒక్కటి కూడా నాకు అర్థం కావటం లేదని అతనికి స్పష్టమయింది. అతనికి అదేమంత నచ్చలేదు. ఇది కాదు పని అనుకొన్నాడు. ఏవో రెండుమూడు ఫోన్ కాల్స్ చేశాడు. ఈలోగా మేమిద్దరం ఆ పక్కనే ఉన్న పళ్ళరసాల స్టాలు దగ్గరకు చేరి దానిమ్మపళ్ళ తాజారసాన్ని ఆస్వాదించడం మొదలెట్టాం. మేవాపనిలో ఉండగానే హఫీద్ అన్న యజీద్ స్నేహితుడొకాయన వచ్చి మాతో చేరాడు. అతనికి ఇంగ్లీషు బాగా వచ్చు. ఆ మధ్యాహ్నమంతా మాతో ఉండి నాకు గైడ్‌గా వ్యవహరించడానికి ఇతగాడిని యజీద్ పిలిపించాడన్నమాట! ఎలాగైనా సరే నాకు సహాయపడి తీరాలి అన్న యజీద్ కృతనిశ్చయం నన్ను ముగ్ధుడ్ని చేసింది. హఫీద్ రంగప్రవేశం పుణ్యమా అని ఇహ నా ఒంటరి నడకల కోరికకు కళ్ళెం వేసి నన్ను నేను ఆ జంట గైడ్‍లకు సమర్పించుకొన్నాను.

హఫీద్ ఆ మదీనా ప్రాంతంలోని కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలు చూపించాడు. బౌ ఇనానియా అన్న మదరస అందులో ఒకటి. ఆ తర్వాత బాబ్ అల్ మన్సూర్‌కు అవతలివేపున ఉన్న అలనాటి రాచనగరం వేపు వెళ్ళాం. మౌలె ఇస్మాయిల్ సమాధి అక్కడి ఒక ముఖ్యమైన ఆకర్షణ. దార్శనికుడైన ఆ సుల్తాన్ ప్రజల దృష్టిలో ఒక ఆరాధనీయ వ్యక్తిగా పరిణమించాక అతని సమాధి ప్రదేశం కూడా ఒక తీర్థస్థలంగా మారింది. ఇస్లామ్‍కు చెందని యాత్రికులను కూడా లోపలికి అనుమతించే అరుదైన ప్రదేశమది. అయినా ఏదో కారణం వల్ల ఆనాడు ఆ ప్రదేశం మూసేసి ఉంది.

హఫీద్ ఆ రాచనగరం లోని మరో ఆకర్షణీయమైన ప్రాంగణానికి మమ్మల్ని తీసుకువెళ్ళాడు. కానీ ఈ సుందర ప్రాంగణం దిగువన ఒక కఠోర వాస్తవం దాగి ఉందని చెప్పాడు. మేం నిలబడి ఉన్నది ఒకప్పటి నేలమాళిగ కారాగారం పైకప్పు అట! మౌలె ఇస్మాయిల్ కాలంలో ఆ జైల్లో అరవై వేలమంది బానిసలు ఉండేవారట. అందులో సగానికి మించి యూరప్‌కు చెందినవారట!

నాకు ఆశ్చర్యమనిపించింది. ఈ ప్రాంగణం ఎంతో విశాలంగా ఉన్నమాట నిజమే గానీ దీని దిగువున అరవైవేలమంది బానిస ఖైదీలు ఉండటం సాధ్యమనిపించడం లేదు అన్నాను. ఒక గట్టి నిట్టూర్పు విడిచి- వాళ్ళంతా గొలుసులతో గోడలకి కట్టివేయబడ్డారు. నిలబడటానికి కూడా చోటు లేనంతగా కిక్కిరిసి ఉండేదీ జైలు. వాళ్ళల్లో చాలామందికి నిలబడే నిద్రపోవలసివచ్చేది – అని వివరించాడు హఫీద్. పగలంతా శారీరక శ్రమ, చాలీచాలని తిండి, పెద్ద ఎత్తున మరణాలు అంటూ చెప్పుకొచ్చాడు. ‘అది అమానుషం గదా!’ అని నేను అమాయకంగా అడిగాను. ఆ రోజుల్లో మానవహక్కులు అన్న పదమే లేదని, కిందవాళ్ళ బతుకులకు విలువే ఉండేది కాదని, బానిసలంటే ఒక చరాస్తిగా, వ్యాపారపు వస్తువుగా చూసేవారనీ వ్యాఖ్యానించాడు హఫీద్. నిజమే. అవన్నీ కఠోర వాస్తవాలు. మింగుడు పడని నిజాలు. ఆనాటి బానిసఖైదీల ఆకృతులు నా మనసులోకి తొంగిచూడటం ఆరంభించాయి. ఆందోళన కలిగించడం మొదలెట్టాయి. అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను.

మౌలె ఇస్మాయిల్ ముద్ర మెక్నెస్ నగరంలో ఏ మూలకు వెళ్ళినా మనకు కనబడుతుంది. అక్కడి నేలలో గాలిలో- ఎక్కడ చూసినా అతని జాడే. అతని ప్రస్తావన లేకుందా అక్కడ ఏ సంభాషణా సాగదు. మొరాకో చరిత్రలో ఈయన ఒక సంక్లిష్టమైన వ్యక్తి. అక్కడి ప్రజల దృష్టిలో ఆయన మొరాకోను ఐక్యం చేసి, పరిసర దేశాలన్నీ యూరోపియన్ల వలసలుగా మారిపోతున్న సమయంలో దేశాన్ని అటు యూరప్ శక్తుల నుంచీ ఇటు ఆటమన్ సామ్రాజ్యపు దాడుల నుంచీ కాపాడి దేశ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టిన మహానుభావుడు. చారిత్రక పురుషుడు. కానీ యూరప్‌వాసుల దృష్టిలో అతనొక రక్తపిపాసి. కామవాంఛా పీడితుడు. ఏదేమైనా ఆయన బ్రిటిష్‌వాళ్ళ అధీనంలో ఉన్న టాంజియర్ రేవు పట్నాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగలిగాడు. స్పెయిన్ అధీనంలో ఉన్న మొరాకో తీరపు మరిన్ని రేవు ప్రాంతాలను స్వాధీనం చేసుకోగలిగాడు. ఏభై అయిదు సంవత్సరాల సుదీర్ఘ పాలన అతనిది. శక్తివంతమైన పాలకుడిగా అతను మొరాకో దేశానికి స్థిరత్వం కలిగించాడు. మొరాకో చరిత్రలో అతని అంత సుదీర్ఘ పాలన చేసిన వ్యక్తి మరొకరు లేరు. మహమ్మద్ ప్రవక్తకు తిన్నగా చెందిన వారసులం అంటూ ఏర్పడిన ఆ ఆలోవైట్ రాజవంశం ఈనాటికీ తన పాలన మొరాకోలో కొనసాగిస్తోంది. ప్రస్తుతం పాలన కొనసాగిస్తోన్న ఆరో మహమ్మద్ ఆ వంశానికి చెందిన మనిషే.

ఉన్నత శ్రేణికి చెందిన బ్లాక్‌గార్డ్స్ అన్న దళాన్ని ఏర్పాటు చెయ్యడం మౌలె ఇస్మాయిల్ సైనికపరంగా చేపట్టిన విలక్షణ కార్యక్రమం. ఆ కాలంలో ఏర్పాటు చేసిన ఈ దళం గురించి ఇప్పటికీ మొరాకోలో ఘనంగా చెప్పుకుంటారు. పశ్చిమ ఆఫ్రికా నుంచి పట్టితెచ్చిన లక్షలాది మంది నల్లబానిసలకు సైనిక శిక్షణ ఇప్పించి ఈ బ్లాక్‌గార్డ్స్ దళాన్ని ఏర్పాటుచేశాడు మౌలె ఇస్మాయిల్. సహజంగానే వాళ్ళంతా ఆయనకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉండేవారు. తడవతడవకూ మార్పులు చెందే స్థానిక తెగల విశ్వాసబలం మీద ఆధారపడటంకన్నా స్థిరంగా నిలచే ఇలాంటి దళపు అండ తనకు ఉండటం మేలు అని నమ్మాడు మౌలె ఇస్మాయిల్. ఆ ఆలోచన ఫలించింది. అర్ధ శతాబ్దం పాటు మొరాకో దేశాన్ని తన ఉక్కు పిడికిట్లో ఉంచుకోడానికి ఈ దళం కీలకమయింది. ఇప్పటి మొరాకోవాసుల్లో ఎంతోమంది ఆ బ్లాక్‌గార్డ్ దళాల సంతతివారే.

వైభవంలో తన మెక్నెస్ నగరం ఫ్రాన్స్‌ లోని వెర్సాయితో (Versailles) తలతూగాలని ఆకాంక్షించాడు మౌలె ఇస్మాయిల్. ఈయన అప్పటి ఫ్రెంచి అధినేత లూయీ పద్నాలుగుకు సమకాలీనుడు. సూర్యప్రభువుగా ప్రజల్లో పేరుపొందిన లూయీ పద్నాలుగు ఘనత వహించిన‍ వెర్సాయి రాజప్రాసాదాన్ని నిర్మించాడు.

మౌలె ఇస్మాయిల్ భవన నిర్మాణ పరంపరలో శ్రమించిన ముప్ఫై వేలమంది బానిసల్లో అధిక సంఖ్యాకులు యూరోపియన్లే. నల్ల బానిసలను యుద్ధానికీ, తెల్ల బానిసల్ని భవన నిర్మాణానికీ వినియోగించాడు మౌలె ఇస్మాయిల్.

పదిహేడూ పద్దెనిమిది శతాబ్దాలనాటి ఉత్తర ఆఫ్రికాలోని శ్వేతబానిస వ్యవస్థకు చెందిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నాకు గైల్స్ మిల్టన్ రాసిన వైట్‌ గోల్డ్ అన్న పుస్తకంలో దొరికాయి. థామస్‌ పెల్లో అన్న ఆ పుస్తకపు ముఖ్యపాత్రధారి కార్న్‌వాల్ కౌంటీకి చెందిన ఇంగ్లీషు మనిషి. ఉప్పుచేపల వ్యాపారం కోసం ఇటలీలోని జెనోవా నగరానికి వెళ్ళే నౌకలో తన పినతండ్రితోపాటు పదకొండేళ్ళ థామస్ పెల్లో కూడా వెళతాడు. తిరుగు ప్రయాణంలో ఆ నౌక ఉత్తర ఆఫ్రికాకు చెందిన సాగరచోరులకు- ముద్దుగా వారిని బార్బరీ పైరేట్స్ అంటారు- చిక్కుతుంది. పెల్లోనూ అతని పినతండ్రినీ ఆ సాగరచోరులు మొరాకో లోని సాలె అన్న బానిస వ్యాపారం సాగే నగరానికి తీసుకువెళతారు. వీళ్ళతోపాటు మిగతా నావికులందర్నీ మౌలె ఇస్మాయిల్‌కు బానిసలుగా అమ్ముతారు. యుక్తవయస్కులైన తెల్లబానిసలందరినీ భవన నిర్మాణపు పనుల్లో పెట్టగా వాళ్ళంతా ఏడాది తిరిగేలోగా ప్రాణాలు విడుస్తారు. కఠిన శారీరక శ్రమ, కఠోరమైన నిరాదరణ, దుర్భరమైన నివాసాలు, చాలీచాలని తిండి- దుర్మరణానికి రహదారులివి.

శారీరక శ్రమకు పనికిరాని పసివాడు కాబట్టి థామస్‌ పెల్లోకు దుర్మరణం తప్పింది. అతన్ని పట్టి బలవంతాన ఇస్లాం మతంలోకి మార్చి స్థానిక భాషలూ ఆచారవ్యవహారాలూ నేర్చుకోడానికి, రాజాస్థానపు నియమాలూ మర్యాదలూ నేర్చుకోడానికీ స్కూల్లో వేస్తారు. ఆ ప్రక్రియలో అతను మౌలె ఇస్మాయిల్ అభిమానం పొందుతాడు. ఒక ఉన్నతశ్రేణి బానిసగా రూపొందుతాడు. సైనికుని గానూ, రక్షకదళ భటుని గానూ, అనువాదకుడి గానూ పని చేస్తాడు. పశ్చిమ ఆఫ్రికా లోని సహారా ఎడారి ప్రాంతాల్లో బానిసల సేకరణకూ నియోగించబడతాడు. సుల్తాన్‌గారి పూనికతో అతనికి ఒక కులీన వధువుతో పెళ్ళవుతుంది. ఒక పాప కూడా పుడుతుంది. ఇరవైమూడేళ్ళు అలా బానిసగా బతికాక తాను ఎలా తప్పించుకొని ఇంగ్లండు చేరిందీ, మౌలె ఇస్మాయిల్ ఆస్థానంలో తన బానిస జీవితం ఎలా సాగిందీ- ఆ వివరాలన్నీ వైట్‌గోల్డ్ పుస్తకంలో వివరంగా చెప్పుకొస్తాడు థామస్‌ పెల్లో. అవి తెలుసుకోడానికి ఆ పుస్తకం చదవడమే చక్కని మార్గం.

పదిహేడూ పద్దెనిమిది శతాబ్దాల్లో యూరప్ ఖండపు అగ్ర రాజ్యాలన్నీ- బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్- అమెరికా ఖండానికి పశ్చిమ ఆఫ్రికా నుంచి నల్ల బానిసలని చేరవేయడమన్న వ్యాపారంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాయి. అదే సమయంలో అవే దేశాలకు చెందిన వేలాదిమంది శ్వేతజాతీయులు మొరాకో, అల్జీరియా, ట్యునీషియా లాంటి ఉత్తర ఆఫ్రికా దేశాలలో బానిసలుగా గడిపారు. వాళ్ళతోపాటు కొంతమంది తెల్ల అమెరికన్ నావికులూ బానిసలుగా చిక్కి మగ్గారు. సుల్తాన్ మౌలె ఇస్మాయిల్ ఆనాటి ప్రముఖ బానిస యజమాని. సాలె నగరపు బర్బెరీ పైరేట్స్ సుల్తాన్ ఇస్మాయిల్‌కు బానిసలను సరఫరా చేసే ముఖ్య యంత్రాంగం.

ఈ బర్బెరీ పైరేట్లు ఇంగ్లండ్ దేశపు పశ్చిమ తీరప్రాంతంలో తమతమ దాడులు సాగించేవారు. అక్కడి తెల్లవారిని బంధించి ఉత్తర ఆఫ్రికా తీరప్రాంతపు బానిస వ్యాపార కేంద్రాలయిన సాలె, అల్జీర్స్, ట్యునిస్ నగరాల్లో వాళ్ళని అమ్మేవారు. ఈ ప్రక్రియ ఇంగ్లండ్‌కే పరిమితం కాదు; ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ తీరప్రాంతాల్లోనూ ఇలాంటి దాడులు జరిగేవి. తీరప్రాంతాల్లోనే గాకుండా మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రాలలో వెళ్ళే వ్యాపార నౌకలమీదా ఈ పైరేట్ల దాడులు జరిగేవి. నౌకా సిబ్బంది కూడా బానిస వ్యాపారానికి గురి అయ్యేది. ధనికవర్గాలకు చెందిన బందీల పరిస్థితి కాస్త మెరుగు- పైరేట్లకు బాగా ధనం ముట్టజెప్పి వాళ్ళని వారివారి బంధువులు విడిపించుకొనేవారు. పేదజీవులకు అలాంటి సౌలభ్యం లేదు. రాజుగారికి వినతిపత్రాలు సమర్పించుకోవడం, కొన్ని కొన్ని ఊళ్ళలోని సానుభూతిపరులు నిధులు సేకరించి మనుషుల్ని మొరాకో పంపి వాళ్ళను విడిపించడం, తిరిగి వాళ్ళను తమ దేశానికి రప్పించుకోవడం- ఇలా సాగేది వ్యవహారం. ఏదేమైనా ఇదంతా కొద్దిమంది ధనికులకూ, అదృష్టవంతులకూ అబ్బే భాగ్యం. అత్యధిక సంఖ్యాకులకు అక్కడి బానిస జీవితంలో మగ్గిపోయి అంతరించడం తప్ప మరో మార్గముండేది కాదు. బలహీనులూ వయసుమళ్ళినవాళ్ళూ రోగాలు, అశక్తతల పాలబడి మరణించేవారు. మహిళలంతా సుల్తానూ ఇతర ప్రభువుల జనానాలలోకి చేరిపోయేవారు. పిల్లలు సేవకులుగా మారేవారు. కండబలం ఉన్న యువకులకు కాయకష్టం ఉండనే ఉంది.

సుల్తాన్ మౌలె ఇస్మాయిల్‌కు ఆపాదించబడిన- చెప్పుకో తగని- ఘనత మరొకటి ఉంది. తన నలుగురు భార్యలూ, అయిదువందలమంది రాణీవాసపు మహిళల ద్వారా ఆయన 880మంది పిల్లలకు జన్మనిచ్చాడట. ఈ విషయం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌వారు కూడా శోధించి నిర్ధారించారట. సుల్తాన్ ఇస్మాయిల్ రాజాస్థానంలో ఫ్రెంచి దూతగా పనిచేసిన డొమెనిక్ బుస్నాట్ ఆ సంఖ్య 1171 అంటాడు. ఇవన్నీ విన్నాక నాకు 2014లో చదివిన ఒక వ్యాసం గుర్తొచ్చింది. ఆస్ట్రియాకు చెందిన ఒక శాస్త్రవేత్తల బృందం కంప్యూటర్ సిమ్యులేషన్ మోడల్స్ ఉపయోగించి, మౌలె ఇస్మాయిల్ అంతమంది పిల్లలకు జన్మనిచ్చే అవకాశం పుష్కలంగా ఉంది అని నిర్ధారించిందట.

విరోధులూ విమర్శకులూ మౌలె ఇస్మాయిల్‌ను రక్తపిపాసి అంటారు. తన సేవకుల్ని, ఆస్థానంలోని వాళ్ళని, పౌరుల్నీ విచక్షణారహితంగా చంపేసేవాడంటారు. కారణమంటూ లేకుండా, కోపావేశానికి లోనయ్యి ముప్పైవేలమందిని చంపాడంటారు!

మెక్నెస్ నగరవీధుల్లో కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ తిరుగుతూ ఉండగానే సాయంత్రపు కాంతి మా చుట్టూ పరచుకొంది. ఆ సాయంత్రపు బంగారు నీరెండలో అల్ హదీమ్ ప్రాంతం వింతశోభను సమకూర్చుకొంది. అలరించే ఆటగాళ్ళూ పాటగాళ్ళూ, తాజా పళ్ళరసాలు అందించే దుకాణాలు, ఘుమఘుమలాడే ఖాద్యపదార్థాలను అందించే ఆరుబయలు ఫలహారశాలలూ, వీటికి తోడు కెబాబ్‌లు అమ్మే షాపులు- అదో సంతోష సమయం. “మనం రోజంతా ఈ మెక్నెస్ నగరాన్ని పుష్కలంగా ఆస్వాదించాం. ఇపుడు ఓ మింట్ టీని ఆస్వాదించే సమయం వచ్చింది” అని హఫీద్‌తో అన్నాను. అతను సరే అంటే సరే అన్నాడు. ఆ టీ తాగుతోన్న సమయంలో మెక్నెస్ నగరం తన ప్రాభవాన్ని ఎలా కోల్పోయిందో ఆ కథ కూడా హఫీద్ చెప్పుకొచ్చాడు. 1755లో వచ్చిన ది గ్రేట్ లిస్బన్ భూకంపం పోర్చుగల్‌ లోని లిస్బన్ నగరాన్నేగాక మొరాకోలోని మెక్నెస‌నూ ధ్వంసం చేసిందట. ఆ భూకంపం మెక్నెస్‍కు మరణమృదంగమే అయిందట. అ దెబ్బనుంచి మెక్నెస్ ఎప్పటికీ కోలుకోలేకపోయిందట. భూకంపం వచ్చిన రెండేళ్ళకు, మౌలె ఇస్మాయిల్ గతించిన ముప్పై ఏళ్ళ తర్వాత, 1757లో ఆయన వారసులు రాజధానిని మెక్నెస్ నుంచి మరకేష్‌కు తరలించారట.

నా మెక్నెస్ నగరశోధనకు ప్రాణవాయువు అందించిన హఫీద్‌కు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పాను. గుడ్‌బై అన్నాను. ఫెజ్ నగరం వేపుగా మా ప్రస్థానం ఆరంభించాడు యజీద్. ఈసారి ఫెజ్ నగరపు ఆధునిక ప్రాంతాలగుండా కారు పోనిచ్చాడు. ఆ ప్రాంతాలలో వలసదినాలనాటి ఫ్రెంచి పరిమళం గుబాళించింది. రోడ్లకు రెండువేపులా బళ్ళబాటలు, వాటి అంచుల్లో నిడుపాటి పామ్ వృక్షాలు…

ఆనాటి అనుభవాలు నెమరువేసుకొంటే ఒకే రోజులో రెండువేల సంవత్సరాల టైమ్‌ట్రావెల్ చేసిన అనుభూతి కలిగింది. రెండువేల సంవత్సరాల నాటి రోమన్ నగరం ఓలుబులిస్ శిథిలాల నుంచి ఎనిమిదో శతాబ్దపు నిగూఢ పుణ్యక్షేత్రం మౌలె ఇద్రిస్, మళ్ళా అక్కడ్నించి పదిహేడో శతాబ్దపు రాచవైభవాల మెక్నెస్… నగరాలేగాకుండా దారిపొడవునా కలసిన ఆసక్తికరమైన మనుషులు యజీద్, రుఇ, హఫీద్; వీళ్ళతోపాటు మౌలె ఇస్మాయిల్, థామస్‌ పెల్లోల పవిత్రాత్మలు!

ఫెజ్ నగరంలో ఆ రాత్రి గడిపి మర్నాడు రిఫ్ పర్వతాల మీదుగా షెఫ్‌సాన్ అన్న నీలిరంగు నగరం చేరాలన్నది నా ప్రణాళిక.

(సశేషం)