సరిగ్గా అయిదూముప్ఫైఅయిదుకు ఆ బురఖా ఆమె వాళ్ళబ్బాయిని నడిపించుకొంటూ మెయిన్‌రోడ్డు మలుపు దగ్గరకు వెళుతూ కనిపించింది. ఎదురుగా ఉన్న ఫ్లాటులో ఉంటారామె. పిల్లాడి వయసు ఏడో ఎనిమిదో ఉంటుంది. మరి అంత తెల్లారుఝామునే ఎందుకలా? వాడి స్కూలు యూనిఫామ్ సమాధానం చెప్పింది. ఈలోగా స్కూలు బస్సు వచ్చి వాడిని ఎక్కించుకొని వెళ్ళిపోయింది. ఆమె వెనక్కి తిరిగివచ్చి తన ఫ్లాటులోకి వెళ్ళడానికి మెట్లెక్కిందో లేదో- ఇటు పక్కనుంచి ఓ మధ్యవయసు ఫార్మల్ దుస్తుల మనిషి… ఆఫీసుకన్నమాట. ఆఫీసుదేగాబోలు మినీవ్యాను, ఆయన అది ఎక్కేశాడు. అది జరుగుతూ ఉండగానే వీధిని శుభ్రపరచేవాళ్ళ కోలహలం మొదలయింది.
గత నాలుగు రోజులుగా పొద్దున్నే అయిదులోపల లేచి, మైక్రోవేవ్ సాయంతో పెద్ద కప్పు కాఫీ చేసుకొని, హాలులోని నిలువెత్తు గ్లాసు తలుపులు తెరచి, ఇసుక లోపలికి వెళ్ళకుండా మళ్ళా జాగ్రత్తగా వాటిని గట్టిగా మూసి, బాల్కనీలో నిలబడి మేలుకొంటోన్న ప్రపంచాన్ని చూస్తున్నపుడు క్రమం తప్పకుండా జరుగుతోన్న కార్యసరళి అది. నిన్న శుక్రవారం శెలవయి ఉంటుంది. ఆమే బాబూ కనిపించలేదు. ఇవాళ పలకరింపుగా చెయ్యి ఊపిన ఆ మధ్యవయసు మనిషి మాత్రం నిన్న కూడా కనిపించాడు. కాఫీ ముగిసేసరికి రోడ్డుకవతల ఉన్న సూపర్ బజారు భవనపు రాత్రి దీపాలు ఆరిపోవడం, భవనపు కప్పుమీద సూర్యుడి వెలుగులు పొడసూపడం–ఇదీ నా దైనందిన అనుభవం. అసలు ఇలా బాల్కనీలో నిలబడి మొట్టమొదటి కాఫీ తాగడమన్న అలవాటు దశాబ్దాలనాటిది. ఏ ఊరు వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఆయా ఇంటివారిని ఒప్పించి, అనుమతి సంపాదించి, వంట ఇంటిలోకి అడుగుపెట్టి నా కాఫీ నేను కలుపుకోవటం నాకెంతో ఇష్టమయిన అలవాటు.
రెండో కాఫీ కూడా ముగించాక–ఇది భార్గవి చేతి కాఫీ–ముగ్గురం హాల్లో కబుర్లలో పడ్డాం. యువకిశోరం హన్ష్‌కు ఇంకా తెలవారలేదు.
“అమరేంద్రా అంకుల్, మీకు క్రికెట్టంటే బాగా ఇష్టంగదా… అపుడపుడు ఫేస్‌బుక్‌లో మీ పోస్టులు చూస్తూ ఉంటాను. రెండు రోజులు దాటిపోయినా మీరు ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం ఆశ్చర్యం కలిగించింది!” రెండురోజులపాటు ‘గారూ’ అన్న సంబోధనతో యాతనపడి ఆ రోజు తనకు ఇష్టమయిన ‘అంకుల్’ దగ్గర స్థిరపడ్డాడు రాజేష్. భార్గవి మొదటిరోజే ఆ మాట అన్నది. హన్ష్‌కు ‘తాతా’ అని పిలవమని నేర్పింది. నేను చెయ్యగలిగిందేమీలేదని నాకు తెలిసిపోయింది!
ఇంతకీ రాజేష్ ఏ విషయం గురించి ప్రస్తావిస్తున్నాడూ?!
“షార్జా క్రికెట్ స్టేడియం! మీరు ఈ ముప్పై నలబై ఏళ్ళలో ఈ స్టేడియంను ఎన్నోసార్లు టీవీలో చూసివుంటారు…”
“అవునవును… ఆ మాట గుర్తే రాలేదు. వెళదామా?” ఆశగా నేను.
“అది చెపుదామనే… ఇవాళ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత ముందుగా అక్కడికి వెళదాం. ఆ తర్వాత షార్జా యూనివర్సిటీ చూద్దాం. వీటితోపాటు మీకు మరో సర్‌ప్రైజ్ ఐటమ్ ప్రోగ్రామ్‌లో చేర్చాను. ఇప్పుడే చెప్పను. ఇవన్నీ ఉదయం చూసి వచ్చి, ఎర్లీగా లంచ్ చేసి భార్గవీ హన్ష్‌లతోపాటు దుబాయ్ సిటీకి వెళదాం.” కార్యక్రమం వివరించాడు రాజేష్. గొప్ప సంబరమనిపించింది.
రాజేష్‌వాళ్ళ ఇంటిదగ్గర్నించి స్టేడియం మరీ దూరమేం కాదు. ఆమాటకొస్తే అసలు ఊరే చిన్నది కదా. పది నిముషాల్లో చేరుకొన్నాం. చిన్న ప్రాంగణం. ఒక్క ఊపులో ప్రవేశద్వారం దగ్గరికి చేరుకోగలిగాం. లోపలికి వెళ్ళొచ్చా?! ఎవరి అనుమతి అయినా తీసుకోవాలా? అడగడానికి మనిషి కనిపించలేదు. సరే కానిద్దాం అనుకొని లోపలికి అడుగుపెట్టాం.
ఎదురుగా వృత్తాకారపు పచ్చిక నిండిన క్రీడాప్రాంగణం. ఇరవై పాతికవేలమంది పట్టే వీక్షకుల గ్యాలరీలు. బోలెడంత పులకరింత తప్పలేదు.
వరల్డ్ కప్ గెలుచుకొని మనదేశమంతా క్రికెట్ జ్వరంతో మధురమైనబాధతో ఉన్నరోజుల్లో హఠాత్తుగా షార్జా అన్న తెలిసీతెలియని గల్ఫ్ నగరం ప్రపంచ క్రికెట్ పటం మీద బలమైన పాదం మోపడం గుర్తుంది. అడపాదడపా టెస్టుమ్యాచిలు జరగడమూ గుర్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్‌లో శాంతిభద్రతల సమస్య దృష్ట్యా ఇతర దేశాలవాళ్ళు షార్జాను తటస్థవేదికగా అంగీకరించి సిరీస్‌లు ఆడటం గుర్తుంది. 1985లో అనుకుంటాను ఏదో టోర్నమెంటు ఫైనల్లో జావెద్ మియాందాద్ అనే సింహం చేతన్ శర్మ అనే చిరుత వేసిన చిట్టచివరి బంతిని బౌండరీ అవతలికి సిక్స్‌గా కొట్టి మ్యాచ్ నెగ్గి ప్రపంచాన్ని ఆశ్చర్యంలోనూ, భారతీయులందరినీ శోకసముద్రంలోనూ ముంచెత్తడం గుర్తుంది. మరో పదేళ్ళకు గాబోలు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సచిన్ ఆస్ట్రేలియా మీద వీరోచితంగా 134 పరుగులు చేసి ఒంటిచేత్తో మనదేశాన్ని గెలిపించడం గుర్తుంది. షేన్‌వార్న్‌తో ఆ రోజుల్లో సచిన్ పోటాపోటీ గుర్తుంది. ప్రేక్షక సమూహాల్లో మహామహా డాన్‌లు టీవీలో కనబడటం, మొన్నామధ్య ‘స్పెషల్ ఛబ్బీస్’ సినిమాలోని మాయగాళ్ళు దేశం నుంచి తప్పించుకొనివెళ్ళి షార్జా (దుబాయ్?) స్టేడియంలో క్రికెట్‌ను మజాచేస్తున్నట్లు చూపించిన దృశ్యం; ఇరవై ఏళ్ళ క్రితం మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాలకు షార్జానే కేంద్రబిందువవడం–తెలియకుండానే నాలాంటి సగటు క్రికెట్ అభిమాని జ్ఞాపకాల్లో కూడా షార్జా ముఖ్యభాగమయిపోయింది.
“ఈమధ్య దుబాయ్‌లోనూ ఆబు దాబిలోనూ క్రికెట్ స్టేడియంలు వచ్చాయి. దాంతో షార్జా ప్రాముఖ్యత బాగా తగ్గిపోయింది. ఇంటర్నేషనల్ మ్యాచిలు దాదాపు ఆగిపోయాయి.” చెప్పుకొచ్చాడు రాజేష్. ఆ కళతప్పిన వైనం స్టేడియంలో అడుగడుగునా కనిపించి ప్రాణం ఉసూరుమనిపించింది. బాగా బతికిన మనిషయినా, స్టేడియమయినా, చెట్టూపుట్టా అయినా, కారణాలు ఏమైనా, మన కళ్ళముందే చితికిపోతే బాధనిపించదూ!
స్టేడియం తర్వాత యూనివర్సిటీ ప్రాంగణం చేరుకొన్నాం. ఎడారిలో వెదక్కుండానే కనిపించే ‘ఆశ్చర్యాలలో’ ఈ యూనివర్సిటీ ఒకటి!
అతి విశాలమైన ప్రాంగణం, కనుచూపు ఆనినంతమేరా పరచుకొన్న సుదీర్ఘమైన రోడ్లు, ఆ వెడల్పాటి రోడ్లకు అటూ ఇటూ కనీసం వందమీటర్ల దూరాన నిలబడి కనిపించే గంభీరమైన వివిధ విభాగాల భవనాలు, గబుక్కున ఢిల్లీలోని రాజ్‌పథ్, దానికటూయిటూ ఉండే పచ్చికబయళ్ళు, అవి దాటాక కనిపించే నేషనల్ మ్యూజియంలాంటి విలక్షణ భవనాలు–అదంతా గుర్తుకొచ్చింది. నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్లమీద యూనివర్సిటీ సైనేజ్ కనిపించేలా నాలుగయిదు ఫోటోలు దిగాం. అంతా బావుందిగానీ ఏదో లోటు అనిపించింది. అటూ ఇటూ పచ్చదనం, ఖర్జూరపు చెట్లూ ఉన్నాయిగానీ వృక్షాలు అన్న మాటే లేదు. ఎడారిలో వృక్షాలేమిటీ అని వివేకం హెచ్చరించినా, ఏమో! రహదారికి వృక్షాలే ఆభరణాలు!
“ఎన్నాళ్ళయిందీ ఈ యూనివర్సిటీ పెట్టీ? స్టూడెంట్లు ఎంతమంది ఉంటారూ? వాళ్ళ స్టాండర్డ్ ఎలా ఉంటుందీ? టీచర్ల స్థాయి ఎలా ఉంటుందీ?” నా ప్రశ్నల పరంపర.
“పాతికేళ్ళు అయినట్టుంది మొదలెట్టి. అప్పటి షార్జా రాజుగారి కలల రూపమిది. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం తన ఎమిరేట్‌లో పెట్టాలని చాలా శ్రమపడ్డాడు. ఫలించింది. పదిహేనువేలమంది విద్యార్థులు ఉన్నారని విన్నాను. టీచర్లూ స్టాఫూ కలసి మరో రెండువేలట. స్టూడెంట్ల స్థాయి అంతంతమాత్రం. టీచర్లూ అంతే. కాస్త స్థాయీ స్థోమతూ ఉన్న విద్యార్థులు యూరప్ వెళ్ళడమన్నది ఇక్కడ సర్వసామాన్యం.” రాజేష్ సమాధానం.
“అన్నట్టు ప్రవీణగారు పనిచేసేది ఇక్కడేనా?”
“కాదు. ఆమె అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ షార్జాలో పనిచేస్తున్నారు. అదిగో ఆ యూనివర్సిటీ ప్రాంగణం కూడా ఈ విశ్వవిద్యాలయపు ఆవరణలోనే ఉంది.” అంటూ అటువేపుకు దారితీశాడు రాజేష్. “అమెరికన్ యూనివర్సిటీలో పాఠాలు చెపుతున్నారూ అంటే ఆమె చాలా సత్తా ఉన్న మనిషై ఉండాలి. మామూలువాళ్ళు ఆ స్థాయిని అందుకోలేరు.” రాజేష్ వ్యాఖ్య. అది విన్నాక ‘అవునా! ఆవిడ ఇంకా నా బాపతు మనిషే అనుకొని ఫేస్‌బుక్‌లో జోకులూ చెణుకులూ తెగ గుప్పించానే! ఇహముందు జాగ్రత్తగా ఉండాలి.’ నన్ను నేను సంభాళించుకొన్నాను.
“ఇక్కడ్నుంచి ఎక్కడికీ?”
“పక్కనే షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. పదండి, ఓ చూపుచూద్దాం.” అంటూ దారితీశాడు రాజేష్. చిన్న విమానాశ్రయం. విశాఖపట్నంతో పోల్చవచ్చు. గల్ఫ్ దేశాలకే కాకుండా దూరతీరాలకూ వెళ్తాయట ఇక్కడ్నించి విమానాలు. ఆ దూరతీరాలలో భారతదేశమూ ఉంది.
“అంకుల్! ఇప్పుడే ఒక ముఖ్యమైన సరిహద్దు దాటివచ్చాం, గమనించారా?!”
నేను గమనించనేలేదు.
“మీకో సర్‌ప్రైజ్ ఐటమ్ అన్నా కదా, ఇపుడు మనం షార్జా ఎమిరేట్ దాటుకొని ‘ఆజ్మాన్’ ఎమిరేట్‌లో ప్రవేశించాం.
నోట మాట రాలేదు. మరీ ఇంత దగ్గరా!
“అవును దగ్గరే. షార్జా సిటీనుంచి ఆజ్మాన్ సిటీ ఇరవై పాతిక కిలోమీటర్లు. అంతే. ఉత్తరంగా వచ్చాం. ఇంకో ఇరవై కిలోమీటర్లు వెళితే ‘ఉమ్ అల్ కువైన్’ ఎమిరేట్ వస్తుంది. మరో ఎనభై కిలోమీటర్లు వెళితే ‘రస్ అల్ ఖైమా’. అన్నీ పక్కపక్కనే. ఫుజైరా ఎమిరేట్ మాత్రం షార్జా నుంచి పడమటి దిక్కున వందకిలోమీటర్లు దూరం. అసలు మిమ్మల్ని ఒక్క ఊపులో ఏడు ఎమిరేట్లూ తిప్పి చూపించేద్దామనుకొన్నా కానీ ప్లానులో చేర్చలేకపోయా.”
“మరేం పర్లేదు. ఆజ్మాన్ నేను చూస్తోన్న నాలుగో ఎమిరేట్ అన్నమాట. ఇదే చిన్నదా ఏడు ఎమిరేట్లలోనూ?”
“ఎస్ అండ్ నో! భౌగోళికంగా చిన్నదే. అంతా కలసి రెండొందల ఏభై చదరపు కిలోమీటర్లనుకొంటాను. పెద్దన్న ఆబు దాబి అయితే అరవైవేల కిలోమీటర్లు. దానితో పోలిస్తే ఇది నలుసుకిందే లెక్క. కానీ జనాభా మాత్రం బానే ఉంది. అయిదు లక్షలు. వాణిజ్యపరంగా ఉద్యోగులపరంగా ఇది కళకళలాడే ప్రదేశం. హన్ష్ పుట్టకముందు భార్గవి కొంతకాలం ఇక్కడ పనిచేసింది. రోజూ షార్జా నుంచి వచ్చేది.
“జనాభాపరంగా చిన్న ఎమిరేట్ ఏది?”
“ఉమ్ ఆల్ ఖువైన్. ఎనభైవేలు. అంతే!”
“బావుంది. ఏడు ఎమిరేట్లు. ఎనభైవేలనుంచి ముప్ఫయిమూడు లక్షలదాకా జనాభా వ్యత్యాసాలు. రెండొందల ఏభై చదరపు కిలోమీటర్ల నుంచి అరవైవేల కిలోమీటర్ల దాకా భౌగోళిక వ్యత్యాసాలు. అసలు ఈ ఉమ్మడి కుటుంబం ఎలా బతుకుతోందీ? డబ్బుల విషయంలోనో సరిహద్దుల విషయంలోనో, హక్కులూ ఆధిపత్యాల విషయంలోనో గొడవలు పడరా వీళ్ళు?!”
“ఒకప్పుడు పడేవాళ్ళు. ఆమాటకొస్తే దుబాయ్ అబు దాబిలు 1979 దాకా సరిహద్దు వివాదాల్లో మునిగితేలినవాళ్ళే. 1940ల దాకా యుద్ధాలూ రక్తాలూ చేసినవాళ్ళే. ఇప్పుడు పరిస్థితి మారింది. అబు దాబి అధినేతను తిరుగులేని నాయకుడిగా మిగిలినవాళ్ళంతా అంగీకరించారు. ఆ అధినేత కూడా హుందాగా, ఒక సురక్షకుడిలా వ్యవహరించటం మొదలయింది. నాకు తెలిసి ఈ నలబై ఏళ్ళలో గొడవలూ తగాదాలూ అంటూ జరగలేదు. బుర్జ్ ఖలీఫాకు అబు దాబి ఆర్థిక ఊతం ఇవ్వడంలాంటి స్నేహపరిణామాలే జరిగాయి. అన్నట్టు మీకింకో విషయం చెప్పాలి; మీరు మ్యాపుల్లో గమనించే ఉంటారు… యూఏఈ ఈశాన్యభాగం ఖడ్గమృగం కొమ్ములాగా సముద్రంలోకి చొచ్చుకుపోయి ఆపైనున్న ఇరాన్‌కు నలభై ఏభై కిలోమీటర్లు చేరువకు చేరుతుంది-మనకూ శ్రీలంకకూ లాగా. ఆ ఖడ్గమృగపు కొమ్ము అగ్రభాగం–ముసందమ్ పెనిన్సులా అంటారు దాన్ని–మళ్ళీ ఒమాన్ దేశపు భూభాగం. దాదాపు రస్ అల్ ఖైమా అంతే ఉంటుందది.
“ఓహ్! అవునా. ఇదేదో ఆసక్తికరంగా ఉందే!”
“ఇంకా వినండి. షార్జా పడమటిప్రాంతంలో, సముద్రానికి దగ్గర్లో మాధా అన్న ప్రాంతం ఉంది. చిన్న ప్రదేశం. మన యానాం కన్న కాస్త పెద్దది. మళ్ళా అది ఒమాన్ భూభాగం! చుట్టూ షార్జా, మధ్యలో ఒమాన్ అన్నమాట. మాధాలో అంతా కలసి మూడునాలుగువేలు జనాభా.”
“ఓ మై గాడ్! భలే ఉందే! ఎలా జరిగిందీ ఈ విచిత్రం?!”
“చెప్తా వినండి, ఇంకా ఉంది విచిత్రం. ఆ మాధా అన్న భూభాగం నట్టనడుమన నహ్వా అన్న మరో గ్రామం ఉంది. దానికి కాస్తంత దూరంలో షిస్ అనే మరో కుగ్రామం. రెండూ కలసి నలభై ఇళ్ళు. ఇవి రెండూ మళ్ళా షార్జా కిందకి వస్తాయి.”
“వింటోంటే భలే ఆసక్తికరంగా ఉందే! అసలిలా ఎలా జరిగిందీ?”
“వినండి చెప్తా… ఈ ప్రాంతాల్లో చమురు పడకముందూ, బ్రిటిష్‌వాళ్ళ రక్షణలో ఉన్న సమయంలోనూ ఇవన్నీ తండాలు తండాలుగా ఉండేవి. వీటిల్లో మళ్ళా ఒమాన్‌దే లీడింగ్ రోల్. అప్పట్లో అది సంపన్నదేశం. 1940ల్లో అనుకొంటాను, మాధా ప్రాంతపు వివిధ గ్రామాల్లో తమ తమ ఆధిపత్యం నెరపుకొంటూ వస్తోన్న షార్జా, ఒమాన్, ఫుజైరా, రస్ అల్ కువైన్‌ల పాలకులు ఆ ప్రాంతపు గ్రామపెద్దలనంతా ఒకచోట చేర్చి ‘మీరు ఎవరి పాలనలో ఉండాలో మీరే తేల్చుకోండి’ అన్నారు. మిగిలిన గ్రామాలన్నీ షార్జాలో చేరతామంటే మాధావాళ్ళు ఒమాన్ అన్నారు. మళ్ళీ నహ్వావాళ్ళు షార్జానే అన్నారు. అదిగో అలా మొదలయింది ఈ వినూత్న సహజీవనం.”
“బావుంది కానీ ఇంత చిక్కుముడుల సమీకరణం వల్ల వీళ్ళకు సరిహద్దుల దగ్గర తగాదాలంటూ రావా?” నా ప్రశ్న వెనుక బెల్గాంలూ, కాసరగడ్‌లూ రావణాసురుడి కాష్టంలాగా తరాలతరబడి తగలబడుతోన్న నేపథ్యం ఉంది.
“ప్రశ్నే లేదు. ఈ విషయంలో ఇక్కడవాళ్ళంతా ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలోనే ఉంటారు. షార్జా, మాధా, నహ్వాల మధ్య బారికేడ్లూ, సరిహద్దులూ అసలు లేనేలేవు. ఎవరైనా సరే, టూరిస్టులు కూడా, ఎంతో స్వేచ్ఛగా అటూ ఇటూ అన్నీ తిరిగేసెయ్యవచ్చు.”
మాటల్లోనే మేం ఆజ్మాన్ నగరం చేరుకొన్నాం.
చిన్న ఎమిరేట్, చిన్న నగరం అన్నమాటేగానీ నేను చూసినంతమేరకు ఇదీ ఒక అత్యాధునిక నగరంలానే అనిపించింది. షార్జాతో పోలిస్తే మరికాస్త సొగసుగానూ తోచింది. ఊర్లో తనకు ఇష్టమయిన ఓ ప్రదేశానికి తీసుకువెళ్ళి అరగంట తిప్పాడు రాజేష్.
పన్నెండూ పన్నెండున్నరకల్లా తిరిగి ఇంటికి చేరాం.
మరో గంటలో నలుగురం కలిసి తిన్నగా ‘పామ్ జుమైరా’ వేపుకు సాగిపోయాం.
ఎప్పుడో 1978లో బొంబాయిలో ‘బాక్ బే రిక్లమేషన్’ అన్న ప్రాంతం చూసి ‘హమ్మో! సముద్రాన్ని పూడ్చి భవనాలు కట్టారా! నిజమే… మానవుడే మహనీయుడు!’ అని ఆశ్చర్యపడ్డా.
దుబాయ్‌లో పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం నఖీల్ ప్రోపర్టీస్ అన్న సంస్థ చేసిన పని చూస్తే ‘మానవుడు మహనీయుడేగాదు, మహా రాక్షసుడు కూడానూ’ అనిపిస్తుంది.
దుబాయ్‌లో తీరరేఖ వెంబడే సముద్రాన్ని పూడ్చి పామ్ జుమైరా, పామ్ డెయ్‌రా, పామ్ జెబిల్ అలీ అంటూ మూడు మినీ నగరాలు సృష్టించారు ఈ నఖీల్ సంస్థవాళ్ళు. వాళ్ళు చేసిన ఈ పని ఏ పరిమాణంతో ఉందో తెలుసుకోవాలంటే ఒక్క వివరం చూస్తే చాలు: ఈ మూడు మినీ నగరాలూ కలసి దుబాయ్ నగరానికి అయిదువందల ఇరవై కిలోమీటర్ల సరికొత్త తీరరేఖను సృష్టించి ఇచ్చాయట. ఈ తీర రేఖ పొడవు మన ఆంధ్రదేశపు తీరరేఖలో సగం ఉంటుంది అంటే విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది!
ఆ మూడింటిలోనూ పామ్ జుమైరా పెద్దది, ముఖ్యమైనది. 2000వ సంవత్సరంలో పుట్టిన నఖీల్ సంస్థ 2001లో పామ్ జుమైరా నిర్మాణం మొదలెట్టి 2006కల్లా ముగించిందట. ఖర్జూరం చెట్టు ఆకృతిలో అనేకానేక ద్వీపకల్పాల ద్వీపకల్పంగా–ఆర్కిపెలాగోగా–రూపకల్పన చెయ్యబడ్డ ప్రాంగణమది. ఈ చెట్టు ఒక్కో కొమ్మా సముద్రంలోకి చొచ్చుకువస్తోన్న ఒక ద్వీపకల్పం; ఇహ మొత్తం చెట్టుచెట్టంతా చూస్తే ద్వీపకల్పాల మహాద్వీపకల్పం. ఆ కొమ్మల తీరంలో అనేకానేక సువిశాల నివాస భవనాలూ, ఎపార్ట్‌మెంట్లూ… ఇరవై పాతిక దాకా చిన్నాపెద్దా హోటళ్ళు… ఈ పామ్ జుమైరాలోనే పదివేలమందికి నివాసం కల్పించారట. దేశదేశాల సంపన్న ఔత్సాహికుల్ని ఆకర్షించి అక్కడి విల్లాలూ ఎపార్ట్‌మెంట్లూ కొనేలా చేశారు నఖీల్ సంస్థవారు. ఈ పామ్ జుమైరా ఆలోచన, నిర్మాణం, విలక్షణత, విశిష్టత నా జ్ఞాపకాల భాండారంలో మొదటినుంచీ నిక్షిప్తమైవున్నాయి. గత పదిహేను ఇరవై ఏళ్ళుగా దాని పురోభివృద్ధిని గమనిస్తూనే ఉన్నాను. నిజానికి నాకున్న ఆసక్తికీ కుతూహలానికీ నేను దుబాయ్ వచ్చీరాగానే ఈ ఖర్జూరం చెట్టుమీద వాలి ఉండాల్సింది. రాజేష్ ఆపాడు. శనివారం మనమంతా కలసివెళదాం అని ప్రతిపాదించాడు. ఆగిపోయాను.
ఇంటినుంచి పామ్ జుమైరా గంట దూరంలో ఉంది. దుబాయ్ నగరపు ముఖ్య రహదారుల్లోంచి వెళ్ళాలి. నగరానికి ఉత్తరాన షార్జా ఉంటే దక్షిణాన జుమైరా ఉంది. మొన్న తిరిగిన ఆ రహదారుల్లో మళ్ళా వెళుతోంటే అవన్నీ నన్ను గుర్తుపట్టి పలకరించినట్టుగా… రహదార్లే కాకుండా దుబాయ్ క్రీక్, కాలిగ్రఫీ మ్యూజియం, డౌన్‌టౌన్ భవనాలు, క్రీక్ పక్కని గోల్ఫ్ కోర్సు, దూరాన దుబాయ్ గేట్- అన్నీ ‘వచ్చావా మళ్ళా’ అంటూ ఆహ్వానిస్తున్న భావన!
రాజేష్, భార్గవిలకు పామ్ జుమైరా కొట్టినపిండి. ఎన్నోసార్లు వచ్చివుంటారీ ఏడెనిమిదేళ్ళలో. “జుమైరా చిట్టచివరి భాగంలో అట్లాంటిస్ అన్న పెద్ద హోటలు ఉంది. హోటలే కాకుండా అది టూరిస్టు ఆకర్షణ కూడానూ. కొత్తవాళ్ళు లోపలికి వెళ్ళడం కష్టం. నాకు కాస్తంత అవగాహన ఉందిగాబట్టి వీలయినంత లోపలికి వెళ్ళగలుగుతాం.” వివరించాడు రాజేష్.
రహదారి వదిలి ఖర్జూరపు చెట్టు కాండం మీదుగా శిఖరాగ్రం వేపు ప్రయాణం సాగించాం. అటూ ఇటూ భవనాలూ, అడపాదడపా సముద్రమూ కనిపిస్తోన్నా మేవు నేలబారుగా సాగడంవల్ల ఆ చెట్టు ఆకృతి అనుభవంలోకి రావడంలేదు. నా ఆత్రుత గ్రహించిన రాజేష్, “మనం వెళ్ళే చివరి పాయింటు అట్లాంటిస్ హోటల్. అక్కడ్నించి మళ్ళీ ఈ చెట్టు మొదలుదాకా అయిదుకిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే మోనోరైల్ ఉంది. అది నేల నుంచి ముప్పై నలభై అడుగుల ఎత్తున సాగుతుంది. అపుడు మీకు విహంగవీక్షణ సౌభాగ్యం, ఖర్జూర వృక్ష దర్శనం కలుగుతాయి.” అని ఊరడించాడు.
చివరి బిందువు దగ్గరయ్యేకొద్దీ అక్కడ ఉన్న ఒక మహాద్వారం కనిపించి ఆకర్షించసాగింది. ‘ఏమిటా ద్వారమూ’ అని ఆలోచిస్తోంటే “అదే అట్లాంటిస్ హోటల్!” అని రాజేష్ వివరమందించాడు. ఈ ద్వారాన్ని హోటలంటాడేమిటీ అని అశ్చర్యపడేలోగానే ఆ ప్రాంగణంలోకి చేరుకొన్నాం.
అది దూరం నుంచి ద్వారంలా కనిపించినా నిజానికదో ద్వారమూ కాదూ హోటలూ కాదు; ఓ మినీ ప్రపంచం. బహుశా సెవెన్ స్టార్ హోటల్ అయివుండాలి. దాని ప్రవేశమార్గం దగ్గర కొంతభాగం సందర్శకులకోసం తెరచివుంచారు. పెద్ద పెద్ద తిమింగలాలను కూడా చూపించే అక్కడున్న బడా అక్వేరియం మా పిలగాడు హన్ష్‌కే కాదు, మాకూ ఆసక్తి కలిగించింది. రాచరికం ఉట్టిపడే అలంకరణ, ఫర్నిచరు. ‘వచ్చి ఒకరోజు ఈ హోటల్లో గడిపారంటే రాజభోగాలు మీవే!’ అని ఊరించే అట్టహాసం… అనుబంధంగా ఓ వాటర్ పార్క్. హోటలు ఎదురుగా నెలవంక ఆకృతితో సముద్రం ఒడ్డున కాలిబాట…
హోటల్లోని వింతలూ విశేషాలూ చూడటం, సముద్రం ఒడ్డున కాసేపు ఆ ఎండలోనే నడవటం ముగించాక మోనోరైల్ స్టేషను చేరాం. రానూపోనూ టికెట్లు తీసుకొన్నాం. ఊహించినట్టుగానే ఆకాశయానానికి సరితూగే ప్రయాణమది. పామ్‌ట్రీ ప్రాభవం మెల్లగా కళ్ళముందు విచ్చుకొంది. కొమ్మలవెంట నిర్మించిన విల్లాలు, మొదలుభాగంలోని ఎపార్ట్‌మెంట్లూ పక్కనే నిలబడి కనబడి పలకరించాయి. కాస్తంత దూరాన దుబాయ్ స్కైలైన్ కనిపించి, ‘అక్కడెంతసేపు ఉంటారు? తిరిగి నా దగ్గరకు రావలసిందే కదా!’ అని సవాలు విసిరింది. మోనోరైలు మార్గానే నఖీల్‌వాళ్ళు ఈమధ్యనే తెరచిన మాల్ ఉందట. ఆ స్టేషన్లో దిగి మాల్‌లో ఓ అరగంట.
ఒకేరోజు రెండు సర్‌ప్రైజ్‌లు మనకోసం ఎదురుచూస్తూ ఉంటాయని ఊహించగలమా? రాజేష్‌లాంటి స్నేహితుడుంటే అది ఊహాతీతమేమీ కాదు.
పామ్ జుమైరా విహారాలు ముగిసీముగియగానే “అంకుల్, మనం ఇప్పుడు వెళుతోంది ‘ఇబ్న్ బటూటా మాల్’ అన్నాడు. పేరు పరిచితమే, మధ్యయుగాలనాటి మహా యాత్రికుడుగదూ?! ఎవరో నాలాంటి ప్రయాణాల పక్షి అతనంటే గౌరవంతో తాను కట్టిన వ్యాపారానికి బటూటా పేరు పెట్టాడనుకొన్నాను. వెళ్ళి చూస్తే వాస్తవం ఊహకన్నా ఎన్నో రెట్లు ఆసక్తికరమని తేలింది. ఆ యాత్రికుడు ఏడువందల సంవత్సరాల క్రితం ఎక్కడెక్కడయితే దశాబ్దాల తరబడి తిరుగాడాడో ఆయా దేశాలూ ప్రాంతాల అప్పటి వాతావరణం సృష్టించి, ఆ రకపు నిర్మాణాలూ కళారూపాలూ నిర్మించి ఒక్కసారిగా మనందరినీ అతనితోపాటు యాత్రలకు తీసుకువెళ్ళిపోయే ప్రదేశమది!
ఇబ్న్ బటూటా మొరాకో దేశపు మనిషి. పద్నాలుగో శతాబ్దపు మొదటి ఆరేడు దశాబ్దాల్లో జీవించిన మనిషి. ఇరవై ఏళ్ళు దాటీదాటగానే ఇల్లూ ఊరూ దేశమూ వదిలిపెట్టి ప్రపంచం మీదపడి ఏకబిగిన ముప్పై ఏళ్ళు ప్రయాణాలు చేసి తిరిగివచ్చిన మనిషి. రహదారులూ రవాణా సౌకర్యాలూ ఏమాత్రమూ లేని ఆ రోజుల్లో లక్షా పదిహేడు వేల కిలోమీటర్లు నడక, ఒంటె, గుర్రం, పడవ సాధనాలుగా చేసుకొని తిరుగాడిన మనిషి. అదేకాలపు మరో మహాయాత్రికుడు మార్కో పోలో తిరిగినది అంతా కలసి పన్నెండువేల కిలోమీటర్లే అని తెలిసినపుడు ఈ బటూటా ఎలాంటి యాత్రా రాక్షసుడో అర్థమవుతుంది.
ఆఫ్రికా, ఆసియా, యూరప్ ఖండాల్లో విరివిగా తిరిగాడు బటూటా. ఈజిప్టు, స్పెయిన్ దక్షిణాన ఉన్న గ్రెనడా, సిరియా, అరేబియా, పర్షియా, టర్కీ, హిందుస్తాన్, మాల్దీవులు, శ్రీలంక, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్-అతను తిరగని ప్రదేశం లేదు. ఢిల్లీలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనా సమయంలో ఆరేళ్ళు గడిపాడట. నవాబుగారి అనుగ్రహమూ ఆగ్రహమూ రెండూ చవిచూశాడట. దొంగల దోపిడీలు, యుద్ధాల్లో మరణపుటంచులు చేరటాలు, సముద్రయానంలో నౌకాభంగాలు, ఢిల్లీలాంటి చోట న్యాయమూర్తిగా ఉద్యోగాలు, నమ్మశక్యంగాని జీవితమతనిది. అదంతా తన చివరి రోజుల్లో గ్రంథస్థం చేయించాడు.
అతను తిరుగాడిన ప్రదేశాలు ఆరింటిని ఎన్నుకొని పర్షియా కోర్ట్, ఇండియా కోర్ట్, చైనా కోర్ట్ అంటూ ఆ మాల్‌లో విభిన్న విభాగాలకు రూపకల్పన చేశారు. స్పానిష్ ఫౌంటెన్లు, ఈజిప్టు పిరమిడ్లు, పర్షియా గుమ్మటాలు, చైనా దేశపు నౌకలు–వీటిల్ని ప్రతిసృష్టి చేసి ఆయా విభాగాలను అలంకరించారు. ఒక యాత్రికుడికి ఇంత ఘనమైన గౌరవం, నివాళి ప్రపంచంలో ఇంకెక్కడయినా, ఎప్పుడయినా లభించిందా అన్నది నాకు అనుమానమే.
అక్కడున్న షాపుల్నీ వస్తువుల్నీ ఉపేక్షిస్తూ, ఇబ్న్ బటూటా జ్ఞాపకాలనూ వివరాలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అతని జ్ఞాపకాలతో ఫోటోలు దిగుతూ రెండుగంటలు తెలియకుండానే గడిచిపోయాయి. ఆ రెండు గంటల పుణ్యమా అని అతని గురించి ఎన్నెన్నో విషయాలు తెలుసుకోగలిగాను. కానీ ఒక్కమాట. అక్కడ ఎన్ని విషయాలు తెలిసినా ఇంకా తెలుసుకోవలసిన విషయాలు చాలా చాలా ఉన్నాయన్న మాట స్పష్టమయింది. అతని ట్రావెలాగ్ నెట్‌లో ఉందని తెలియగానే సంపాయించి చదవాలన్న నిర్ణయం.
ఆ ఇబ్న్ బటూటా మాల్ పుణ్యమా అని నాకు మరో లాభం కలిగింది. భార్గవితో సంభాషణలు సరళంగా సాగిపోయాయి. ఇద్దరికీ అప్పటిదాకా ఉన్న చిన్న చిన్న సంకోచాలు తొలగిపోయి సాఫీగా స్నేహంగా మాట్లాడుకోడం మొదలుపెట్టాం. అంతకన్నా ముఖ్యమయిన పరిణామం- హన్ష్ చేరిక కావడం. ‘ఈ తాత మంచాడే’ అన్న నమ్మకం కలిగింది గాబోలు, అమ్మా నాన్నలను వదిలిపెట్టి నా చిటికెనవేలు పట్టుకొని మాల్‌లో తిరగడం మొదలుపెట్టాడు! చైనా కోర్ట్‌లో రాతి బండలకు ఢీకొట్టి భంగపడిన నౌక ప్రతిరూపం ఉంటే దాని దగ్గర అతగాడి చిన్నిచిన్ని ప్రశ్నలు… పెద్దవాళ్ళ విషయం ఎలా ఉన్నా చిన్నపిల్లల విశ్వాసమూ, అభిమానమూ పొందడం అంత సులభంగాదు. అవి పొందగలిగితే అది ఉత్సవాలు చేసుకోవలసిన సమయం!!
తిరిగి ఢిల్లీ ఇంటికి చేరాక నెట్‌లో వెదికి బటూటా ట్రావెలాగ్ సంపాదించాను. ఎంతో ఉత్సుకతతో చదవడం మొదలెట్టాను. ఆశువుగా చెప్పిన అతిశయ కథనమది! అతిశయోక్తులు ఎలానూ ఉన్నాయి. కానీ అడుగడుగునా కనిపించిన అతిశయ ప్రదర్శన పుస్తకాన్ని ముందుకు సాగనివ్వలేదు! ప్రయాణాలు సాగించేకొద్దీ యాత్రికుడు నమ్రతా అణకువా సమకూర్చుకోవాలిగదా… తనను చూసి తానే మురిసిపోయి మిడిసిపడితే మనుషులు దూరమవుతారుగదా!
ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ ఓ విషయం చెప్పాడు. 1980లలో తానేదో ముఖ్యమైన అమెరికన్ ఎంబసీవాళ్ళ డిన్నరు పార్టీకి వెళ్ళాడట. అక్కడ ఎంబాసిడర్‌గారి సతీమణి తన పొడవును చూసి కాబోలు, వచ్చి మాట కలిపిందట. కలిపి ‘ఏం చేస్తుంటావూ?’ అని మర్యాదపూర్వకంగా అడిగిందట. ‘నేను ఏక్టర్ని’ అని చెప్పాడట. ‘అది సరే కానీ నీ జీవనోపాధి కోసం ఏం పని చేస్తూవుంటావూ?’ అని ఆమె రెట్టించిందట. ‘ఏం చెప్పాలో బోధపడక బుర్రగోక్కున్నా’ అన్నాడు అమితాబ్ బచ్చన్.
అదిగో అలాగే బుర్రగోక్కొని ఉంటారు ఆ సాయంత్రంవేళ మద్దుకూరి హరిబాబుగారు. అప్పటికీ రాజేష్ చెపుతూనే ఉన్నాడు, ఈ సాయంత్రం మీకో విలక్షణమైన ఫేస్‌బుక్కర్ని పరిచయం చేస్తాను, అని. అయినా ఫేస్‌బుక్‌లో నేను తప్ప విలక్షణమైనవాళ్ళు ఎవరుంటారూ, ఉంటే వాళ్ళు విలక్షణులు ఎందుకవుతారూ అని నా అహంకారం.
ఆ సాయంత్రం హరిబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అతను, ఆమె అరుణ, బాబు సాకేత్. చిన్న సంసారం. ముప్పై ముప్పై అయిదేళ్ళ వయసు. సామర్లకోట స్వస్థలం. గత పదేళ్ళుగా దుబాయ్ జీవితం. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్టీ విభాగంలో అధికారి.
“హరిబాబు గొప్ప హాస్యం రాస్తారు. అనుకోకుండా రెండేళ్ళ క్రితం ఈయన మా ఊళ్ళోనే ఉంటారని తెలిసింది. పరిచయం చేసుకొన్నాను.” రాజేష్ పరిచయం చేశాడు.
మనిషి మీద కాస్తంత శ్రద్ధ కలిగింది. కానీ ఏ మాటకు ఆమాట- అంతవరకూ నేను హరిబాబుగారు రాసినవి చదవడం సంగతి అటుంచి ఆయన పేరుకూడా వినలేదే! అవును అజ్ఞాన సాగరానికి హద్దులు ఉండవు.
“ఈమధ్యే రాస్తున్నారా? ఏయే పత్రికల్లో రాస్తున్నారూ? వెబ్ పత్రికలా, ప్రింటులోనా?” మర్యాదగానే అడిగాను.
“లేదండీ, నాది ఫేస్‌బుక్ మీడియం. రాయడం మొదలెట్టి చాలాకాలమే అయింది. ఒకటిరెండు ఆర్టికల్స్ న్యూస్ పేపర్లలోనూ తానా పత్రికలోనూ వచ్చాయి.” ఒద్దికగా హరిబాబు జవాబు.
“అంకుల్, ఆయనకు ఫేస్‌బుక్‌లో గొప్ప ఫాలోయింగ్ ఉంది. ఏం రాసినా వందలమంది జేజేలు కొడతారు. కోనసీమ, గోదావరి ఈయన అభిమాన విషయాలు. వంశీనీ రమణనీ అభిమానిస్తారీయన. నిజానికి నాకు వంశీ రచనలకన్నా హరిబాబు రాసినవే ఎక్కువ నచ్చుతాయి.” రాజేష్ నన్ను అజ్ఞానాంధకారంలోంచి బయటపడేసే ప్రయత్నం చేశాడు.
పది నిముషాల తర్వాత సంకోచాలూ అజ్ఞానాలూ పోయి మాటలు బాగా సాగాయి. వాళ్ళింట్లో ఓ అరగంట గడిపి అందరం ఓ ఆరుబయలు రెస్టారెంటుకు వెళ్ళాం. అక్కడో గంటన్నర.
ఇంటికి తిరిగొచ్చాక కుతూహలం పట్టలేక హరిబాబు గోడమీదకి వెళ్ళి మచ్చుకు నాలుగయిదు పోస్టులు చదివాను. గొప్ప స్పార్కు వున్న పోస్టులవి. ఇంటింటి వంటింటి రామాయణాల దగ్గర్నించి రాజకీయ సామాజిక విషయాల దాకా ఆరోగ్యకరమైన హాస్యవైభవంతో, చదివేవాళ్ళంటే ప్రేమా ఆపేక్షలతో, కుర్రకారుకు సరిపడే చిలిపి మసాలా దినుసులతో, అడపా దడపా సంగీతం గురించీ సినిమాల గురించీ కూడా విరివిగా ఆయన రాయడం కనిపించింది. పోస్టుకు సగటున నాలుగువందలమంది స్పందించడం కనిపించింది. నేను విడవకుండా చదివే కొచ్చర్లకోట జగదీష్, శైలజాచందుల కోవకు చెందిన మనిషి ఈ హరిబాబు అని అర్థమయింది. ‘అయ్యో! ఇదంతా ముందే తెలుసుకొని ఉంటే అతనితో గడిపిన మూడు గంటలూ మరికాస్త అర్థవంతంగా సాగేవిగదా!’ అనిపించింది. మర్నాడు ఫేస్‌బుక్‌లో ఇలా హరిబాబును కలిశాను అని రాస్తే, ‘నువ్వు హరిబాబును కలిశావా!’ అంటూ నలుగురయిదుగురు అభినందనలు తెలిపారు! ఫేస్‌బుక్ వినువీధిలో మెరిసే తార ఈ హరిబాబు అని నాకు జ్ఞానోదయమయింది.
(సశేషం)