గల్ఫ్ గీతం: 6. దుబాయ్ గాలిబ్

“ఇవాళ ఎక్కడికెళదామనుకొంటున్నారూ?” అడిగారు ప్రవీణ.

“ఇంకా ఏం అనుకోలేదు. ఒకపక్క దుబాయ్ లోలోతులు ఇంకా ఇంకా చూడాలని ఉంది. మరోపక్క అత్యాధునిక నగర ప్రతీక దుబాయ్ మాల్ అయినా చూడటం ధర్మం అనిపిస్తోంది. మాల్ సంగతి ఎలా ఉన్నా ఆ ఫౌంటెన్ ప్రాంతంలో గంటా రెండు గంటలు గడపకపోతే మనసూరుకోదు. ఎటూ తేల్చుకోలేకపోతున్నా.”

“ఇందులో తేల్చుకోడానికేముందీ? ఒకపూట అక్కడా ఒకపూట ఇక్కడా పెట్టుకోండి, సరిపోతుంది.” సులభంగా తేల్చేశారావిడ. ఉదయమంతా హెరిటేజ్ విలేజ్‌లోను, ఆ ప్రాంతంలోని విపణివీధుల్లోనూ అని, మధ్యాన్నం దుబాయ్ మాల్ ప్రాంగణంలో అనీ తేలిపోయింది.

కొంతమందిని ఏళ్ళతరబడి కలుస్తూ ఉన్నా వాళ్ళతో మాటలు సాగవు. కొంతమందిని కలిసీకలవగానే మాటలు పరుగులు పెడతాయి. ప్రవీణ రెండోరకపు మనిషి. బాగా ఉదయమే వాకింగ్ చేసిరావడం ఆవిడకు అలవాటు. ఇంటికి రెండుమూడు కిలోమీటర్ల దూరాన ఉన్న ఒక చక్కని పార్కు ఆవిడ నడకల వేదిక. ఆనాటి ఉదయం ఇంకా తెలవారకముందే ఇద్దరం అక్కడకు చేరుకున్నాం. దీర్ఘచతురస్రాకారపు నడకల బాట. మధ్యలో విశాల తటాకం. నడకమార్గంలో పచ్చటి పచ్చిక, ఎడారి చెట్లు… అంతా కలసి ఒక్కో ప్రదక్షిణ మైలు పైచిలుకు. ఏం మాట్లాడుకొంటున్నామో తెలియకుండానే, రెండు రౌండ్లు ఎప్పుడు ముగించామో తెలియకుండానే నడక ఆరంభబిందువును చేరుకొన్నాం. తనివి తీరక మరో రౌండ్ వెళ్దామా అన్నాను. తన ఆఫీసుకు కొంచం ఆలస్యమయ్యే అవకాశమున్నా ఆమె సరే అన్నారు.

నడకలు ముగించుకొని ఇంటికి చేరేసరికి సతీష్ ఆఫీసుకు వెళుతూ కనిపించారు. పిల్లలు అప్పటికే స్కూలుకు వెళిపోయారనుకొంటాను. గబగబా బ్రేక్‌ఫాస్టులు ముగించుకొని, లక్ష్మిగారు కట్టి ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని, ‘మబ్బుపట్టి వుంది. ఎందుకైనా మంచిది’ అంటూ వాళ్ళు పట్టి బలవంతంగా ఇచ్చిన గొడుగునూ బ్యాక్‌పాక్‌లో పెట్టుకొని, ఛలో దుబాయ్  అనుకొంటూ బయటపడ్డాను. దుబాయ్‌లో మబ్బులొకటి, మళ్ళీ దానికి గొడుగొకటా అనిపించకపోలేదు.

ప్రవీణవాళ్ళ ఇంటినుంచి మెట్రో స్టేషను దాదాపు రెండు కిలోమీటర్లు. తను యూనివర్సిటీకి వెళుతూ వెళుతూ స్టేషన్లో దింపి వెళ్ళారు. ఇది గ్రీన్‌లైన్‌లో ఉన్న స్టేషను. నేను వెళ్ళాల్సింది అదే గ్రీన్‌లైన్‌లో ఉన్న అల్‌ రస్ స్టేషను. అరగంట.

ఈ అల్‌ రస్ అన్న ప్రాంతం దుబాయ్ పాతపట్నపు కేంద్రబిందువు అని చెప్పుకోవచ్చు. మూడువేపులా దుబాయ్ క్రీక్ విస్తరించి ఉన్న వాణిజ్యకేంద్రమది. అక్కడే స్వర్ణ విపణి, అక్కడే హెరిటేజ్ విలేజ్, అక్కడే మొన్న చూసిన నాలుగు దేవాలయాలు. అక్కడే నిండా ఆరు అడుగుల వెడల్పు లేని ఇళ్ళమధ్య దారులు.

మొన్న గోల్డ్‌సౌఖ్ దుకాణాలను కళ్ళప్పగించి చూసినమాట నిజమేగానీ ఆ ప్రాంతంలోనే ఉన్న అనేకానేక ఇతర బజార్లను, ఆ సన్నపాటి పాత వీధులను, ఆ వీధుల్లో సాగిపోతోన్న జనజీవనాన్నీ పెద్దగా పట్టించుకోలేదు. అది ఆరోజు చవిచూడాలని నా సంకల్పం. తిన్నగా ఆ సౌఖ్‌ల వేపు సాగిపోయాను. స్వర్ణ విపణి ముఖ్యమార్గం వదిలిపెట్టి వీధుల్లోని ‘పేద’ బంగారు దుకాణాలను కాస్తంత పరామర్శించాను. ఆ బంగారం దుకాణాలు నా కళ్ళలో మెరుపులు కురిపించడం తగ్గి మళ్ళీ మామూలు వెలుగులోకి రావడం గమనించాను. ఆ షాపుల్లో పనిచేసేవాళ్ళు వచ్చి ముచ్చట్లాడుతూ టీ దుకాణాలను పలకరించడం చూశాను. వాళ్ళతోపాటు నేనూ కలగలసి ఒకటి రెండు టీలు తాగాను. నాలుగు ముచ్చట్లు చెప్పాను.

మరికాస్త పక్కకు మళ్ళి మిగిలిన బజారులు కూడా చూద్దామని అటు అడుగువేశాను. నా ఊహ నిజమేనని తేలింది. ఆ ప్రాంతపు వీధులన్నీ వీధికొక ‘వస్తువు’ అమ్మే ప్రత్యేకమైన విపణి ప్రదేశాలు. ఒక వీధిలో బట్టల దుకాణాలు, ఒక వీధి అంతా సుగంధ ద్రవ్యాలు, మరోవీధిలో పరుపుల దుకాణాలు, చివరికి ఒక వీధి వీధంతా వంటసామాన్లు! మళ్ళీ మనమెరిగిన ప్రపంచంలోకి వచ్చిపడిన భావన. ఆ వీధులూ, దుకాణాలూ తీర్చిదిద్దినట్లున్నాయి. వీధులన్నీ కలసిన చోట చిన్నపాటి కూడలి. కాస్సేపు కూర్చుని గాలి పీల్చుకోడానికి వీలుగా అక్కడ అందమైన బెంచీలు, చెట్లు… ఆ వీధుల మధ్య నడుస్తూ నడుస్తూ ఉండగా ఒక ఊహించని అనుభవం తలుపు తట్టింది.

ఏదో దేశంగాని దేశంలో ఊరుగాని ఊళ్ళో సన్నపాటి సందుల్లో తారట్లాడుతోంటే పోతనా కబీరూ గాలిబూ కాళోజీ కలసివచ్చి ‘ఏవోయ్ అమరేంద్రా! ఏవిటీ ఇలా వచ్చావ్?’ అని ఆప్యాయంగా పలకరిస్తే ఎలా ఉంటుందీ?! ఎలా వుంటుందో నాకు ఆ రోజు తెలిసింది! సౌఖ్‌ల మధ్య ఉన్న కూడలిలో కాసేపు చేరగిలబడి, ఊపిరి పీల్చుకొని, ఇహముందు ఎటువెళదాం అని అటూ ఇటూ చూస్తోంటే ‘కవి ఒఖైలీ నివాసగృహం’ అన్న బోర్డు కనిపించింది. ఎవరీ కవీ, ఏవిటా నివాసం అన్న ఆసక్తి కలిగింది. అసలాపేరు ఎప్పుడూ విననిదే అయినా ‘ఎంతయినా కవిగదా, మన జాతి మనిషి’ అనుకొంటూ అటు అడుగులు వేశాను. సైన్‌బోర్డులు ఉన్నప్పటికీ ఆ సందుగొందుల్లో కాస్తంత తడబడుతూనే చివరికి రెండొందల గజాల స్థలంలో ఉన్న రెండంతస్తుల గతకాలపు ఇంటిముందుకు చేరాను. మొదటి గదిలో కార్యాలయం, ఇద్దరు ఉద్యోగులు… పక్కన ఆ కవిగారి వివరాలు ఉన్న గ్యాలరీలు. ఆ కవి నివసించిన ఇంటిని మ్యూజియంగా మలచారన్నమాట!

అల్ ఒఖైలీ 1875-1954ల మధ్య జీవించిన మనిషి. పుట్టింది సౌదీ అరేబియా దేశపు ఆగ్నేయాన ఉన్న అల్ అహ్‌సా అన్న ప్రాంతంలోనే అయినా అతని అనుబంధం అంతా పొరుగున ఉన్న ఒమాన్ దేశంతోనూ, దుబాయ్ ఎమిరేట్‌తోనూ సాగింది. చివరికి దుబాయ్ నగరాన్నే తన శాశ్వత నివాసం చేసుకొన్నాడు. 1923లో తన అభిరుచుల ప్రకారం ఎంతో మనసుపెట్టి ఈ ఇల్లు కట్టించుకొని స్థిరపడ్డాడు. స్థానికంగానే గాకుండా అరబ్ దేశాల్లోనూ ఇస్లామ్ ప్రపంచంలోనూ తనకంటూ ఒక స్థానం సంపాదించుకొన్నాడు. దుబాయ్ పాలకుడే కాకుండా గల్ఫ్ దేశాల అధినేతలందరికీ నమ్మదగ్గ సన్నిహిత సహచరుడిగా వ్యవహరించాడు. ఒమాన్ సుల్తాన్‌కు వ్రాయసకాడుగా వ్యవహరించి దేశదేశాల అధినేతలతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాడు. తన ప్రభావశీల వ్యక్తిత్వంతో-మన ఖుష్వంత్ సింగ్‌లా-రాజ్యాధినేతలనే తన ఇంటికి అతిథులుగా రప్పించుకోగలిగేవాడు.

మొత్తం ప్రదర్శనను ఎనిమిది విభాగాలుగా అమర్చారు. జీవితపు ముఖ్య ఘట్టాలు, కవిత్వం, సాంఘిక జీవనం, నివసించిన గదులు, వంటిల్లు, గ్రంథాలయం, మిత్రులతో గడిపిన గది- అలా ఆ విభాగాలన్నీ రెండు అంతస్తుల్లోనూ విస్తరించి ఉన్నాయి. కవిత్వం విభాగంలో అతని కవితా పంక్తులు, భావనలూ పటంగట్టి పెట్టారు. 

‘జ్ఞానవంతుడు సూక్ష్మ వివరాలను గ్రహించి సరియైన మార్గం ఎన్నుకొంటాడు. స్వార్థం వివేకాన్ని హరిస్తుంది; దుఃఖానికి చేరువ చేస్తుంది. ఋజుమార్గం వదిలిన మనిషికి అవమానం, దుఃఖం, పశ్చాత్తాపాలే మిగులుతాయి’ అన్న వాక్యాలు చదివితే తొమ్మిదోక్లాసు హిందీ పుస్తకంలో పలకరించిన కబీరు గుర్తొచ్చాడు. ‘ధనం కోసం, పలుకుబడికోసం కవిత్వం రాయడమన్నది నాకు ఏమాత్రమూ సమ్మతం కాని పని. అసలు కవిత్వం లక్ష్యం అది కానే కాదు’ అన్నపుడు పోతన గుర్తొచ్చాడు. ‘ప్రభువుల ప్రాపకం దొరికినంత మాత్రాన నువు కవివయిపోవు. కవిత్వాన్ని తూచే శక్తి ప్రభువులకు ఉండదు. కవిత్వానికి సాటి సత్కవులూ, సహృదయ పాఠకులే విలువకట్టగలరు’ అన్నపుడు గాలిబ్ గొంతు వినిపించింది. ‘ఒఖైలీది పురాతన నబాటియన్ కవితాశైలి. సూటిగా సరళంగా కళాత్మకంగా అనర్గళంగా కవిత్వం చెపుతాడతను’ అన్నపుడు కాళోజీ కనిపించాడు.

మాటలమధ్య అక్కడ ఆఫీసు గదిలో పనిచేస్తోన్న యువకుడు వచ్చి కలిశాడు. ఆపుకోలేక ‘ఒఖైలీ బాణీకే చెందిన మా దేశపు కవి గాలిబ్ ఉన్నాడు. అతని జీవితము, జీవన సరళి, కవిత్వ తత్వమూ–ఒఖైలీతో చాలా పోలికలున్నాయి. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ దుబాయ్! గొప్ప సంతోషంగా ఉంది’ అన్నాను. అయితే ’నాతో రండి’ అంటూ ఆ యువకుడు ఆఫీసు లోపలికి తీసుకువెళ్ళి ఒఖైలీ కవితల రాతప్రతులు చూపించాడు! మీ గాలిబ్ గురించి, మా ఒఖైలీ మ్యూజియం గురించీ నాలుగు మాటలు చెప్పండి అంటూ మొబైల్లో రికార్డ్ చేసుకొన్నాడు.

ఆ ప్రాంగణం వదిలివస్తోంటే పాతిక ముప్పై ఏళ్ళ క్రితం టీవీలో వచ్చిన గాలిబ్ సీరియల్ గుర్తొచ్చింది. గుల్జార్ దర్శకత్వంలో నసీరుద్దీన్‌షా గాలిబ్‌గా జీవించిన క్షణాలవి. ఏదో సందర్భంలో ఒక చిన్నపాటి వీధి మలుపు లోంచి గాలిబ్ నడిచివస్తోంటే ఒక వ్యక్తి తన స్నేహితులతో అంటాడు: ‘చూడు చూడు, మన మీర్జా గాలిబ్ నఖశిఖ పర్యంతం పరిపూర్ణమైన కవిత్వంలా కనిపించటంలేదూ! నడచివస్తోన్న కవితాధారలా కనిపించటంలేదూ’ అని. గాలిబ్ కవిత్వాన్నిగానీ ఒఖైలీ కవిత్వాన్నిగానీ తూచే శక్తి నాకు లేదన్నది నిర్వివాదమే అయినా ఆ క్షణాన నాకూ ఒఖైలీ గురించి అలాంటి భావనే బలంగా కలిగిందన్నమాట నిజం.


మర్నాటి ఉదయమే నేను దుబాయ్ వదిలి మస్కట్ వెళ్ళాల్సింది. చూస్తూచూస్తూనే ఆర్రోజులు గడచిపోయాయి. ‘ఇపుడిపుడే దుబాయ్‌తో సాన్నిహిత్యం పొందుతున్నాను… అప్పుడే వెళ్ళిపోవాలా’ అన్న బెంగ మొదలయింది. గుండె ఓటిదవ్వాలేగానీ ఇలాంటి బెంగలకేం లోటూ?

ఒఖైలీతో గంటాగంటన్నర గడపటం పుణ్యమా అని హెరిటేజ్ విలేజ్‌లో ఏ తొందరా లేకుండా గడుపుదాం అన్న కోరిక బీటుపడింది. సమయం లేదని స్పష్టమయింది. అయినా మనసాగక గబగబా నాలుగడుగులు అటు వేశాను. మొన్న నన్ను ఆకర్షించిన పొయెట్రీ హౌస్ వేపుకు తిన్నగా సాగిపోయి, అనుమతి పొంది లోపలికి వెళ్ళాను. క్రీక్ తీరంవెంబడే ఆ చివరినుంచి ఈ చివరిదాకా నడిచి, ఈసారి దుబాయ్ వచ్చినపుడు ఓ పూటంతా ఈ విలేజ్‌లోనే గడపాలని అనుకొని, కాస్తంత ఆశాభంగంతోనే బయటపడ్డాను.ఈసారి దుబాయ్ మాల్‌లో మాత్రం నిజంగానే తనివితీరింది.

మాల్ లోలోపలే గంటా గంటంబావు. ఏ షాపులోకి వెళ్ళగూడదు, మాల్‌లోని వింతలకు లొంగకూడదు అని గట్టిగానే అనుకొన్నాగానీ కొన్ని కొన్ని షాపుల విలక్షణ అలంకరణ నన్ను బలంగా ఆకర్షించి లోపలికి లాగేసింది. ఏపిల్ స్టోర్ నుంచి కనిపించే సరోవరపు సుందర దృశ్యాలు, ఓ రెస్టారెంటు ముందు నిలబడి స్వాగతం పలుకుతోన్న జపాను సంప్రదాయ దుస్తుల వనిత, అనుమతితో ఆవిడ ఫోటో తీసుకోవడం, ఒక చివర మూడునాలుగు అంతస్తుల ఎత్తున నిర్మించిన కృత్రిమ జలపాతం, అందులో పొదిగిన డైవింగ్ చేస్తోన్న మానవ ఆకృతులు, మాల్ పై అంతస్తుల నుంచి కిందకు చూస్తే కనిపించి విభ్రమ కలిగించే పనోరమిక్ దృశ్యాలు… మాల్స్ అంటే ఏమాత్రమూ ఆసక్తిలేని నన్నే ‘అబ్బో’ అనిపించిన క్షణాలవి.

సరోవర ప్రాంగణం చేరగానే నాకు తెలిసిన ప్రపంచంలోకి వచ్చిన భావన. రిలీఫ్. ప్రపంచంలోని సమయమంతా నాదే అన్నంత ధీమాగా అడుగడుగునా ఆగుతూ, దృశ్యాలనూ మనుషుల్నీ మనసులోకి ఇంకించుకొంటూ, అక్కడ వున్న సిమెంటు చప్టాలమీద చేరగిలబడి సాగిపోతోన్న ప్రపంచాన్ని పరామర్శిస్తూ… ఉన్నట్టుండి న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్ గుర్తొచ్చింది. అక్కడ కూడా ఆ బహుబిజీ నగరంలో వందలాదిమంది యాత్రికులు చేరడం, చేరి అక్కడి రెడ్‌స్టెప్స్ మీద చేరగిలబడటం, కనిపించే దేశవిదేశాల మానవబృందాలను పరకాయించడం… అక్కడ కనీసం పదిహేను ఇరవై దేశాల మనుషుల్ని చూసిన గుర్తుంది. ఈ దుబాయ్ మాల్ ఫౌంటెన్ ప్రాంతంలో దానికి రెట్టింపు దేశాల ప్రాతినిధ్యం కనిపించింది! తర్వాత అడిగితే, ‘మీరన్నది నిజమే. దుబాయ్‌లో రెండు వందల దేశాల ప్రజలు పనికోసం వచ్చి నివసిస్తారని ఒక అంచనా’ అని ధృవీకరించాడు రాజేష్!

ఆలోచనలు దాటుకొని మళ్ళీ మనుషుల్లో పడగానే ఓ నేపాలీ అమ్మాయి, వాళ్ళ అమ్మా ఫోటోలతో ఇబ్బంది పడటం కనిపించింది. వెళ్ళి నాలుగయిదు ఫోటోలు తీసిపెట్టాను. ఎంతో కష్టం మీద తన తల్లిని దుబాయ్ రప్పించగలిగిందట ఆ నేపాలీ చిరుద్యోగి. ఆ అమ్మాయితో కబుర్లు, వాళ్ళమ్మగారితో నమస్కారాలు. ఆ పక్కనే ఫోటోల కోసమే పెట్టారా అనిపించే అద్దంలా ప్రతిబింబాలు చూపించే విలక్షణ స్టీలు శిల్పాకృతి. చికాగో మిలేనియం పార్కులో ఉండే ‘ది బీన్’ ఈ శిల్పానికి ప్రేరణ అయివుండాలి. అక్కడో కర్ణాటక కుటుంబం. వాళ్ళకు ఫోటోలు.

ఎడారిలో పూలు చూడటమన్నది వింతగొలపడం ఎప్పుడో మానేసిందిగానీ ఆ సాయంత్రం స్టేడియం మెట్రో స్టేషన్నుంచి ఇంటికి నడుస్తోన్నపుడు కురిసి గొడుగు తెరిచేలా చేసిన పది నిమిషాల వాన మాత్రం నాకు అపురూపమైన అనుభవాన్ని మిగిల్చింది. పూలను వికసింపజేయడం మానవ సాధ్యమే కావచ్చుగానీ ఆరుబయట వాన కురిపించటానికి దేవతలే కరుణించాలి. ఎంతవాన కురిసినా నా కాళ్ళు మాత్రం సమ్మె ప్రకటన స్థాయికి వెళ్ళాయి. నడిచి నడిచి నడిచి కాళ్ళు సీసపుగుళ్ళయ్యాయని బోధపడింది. అలాగే ఆగుతూ ఆగుతూ, కాళ్ళనుబుజ్జగిస్తూ, రెట్టింపు సమయం తీసుకొని ఇంటికి చేరాను.


“ఏం సాయీ! ఈయన్ని అంకుల్ అని పిలుస్తావా, తాతా అనా?” ప్రవీణ వాళ్ళబ్బాయిని మేమంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతోంటే అడిగారు. “తాత” అన్నాడతను కనీసం తల ఎత్తి చూడకుండానే! “సరిగ్గా చూడు” రెట్టించారావిడ. ఓసారి చూసి ఆమాటే రీ-కన్ఫర్మ్ చేశాడా టీనేజీ పిలగాడు.

ఇహ రంగంలోకి దిగకపోతే లాభంలేదనిపించింది.

“ప్రవీణా, ఓ పిట్టకథ చెపుతా వినాలి. మీకు తెలిసిన కథే అయివుండాలి. అయినా వినండి. కోర్టు రూమ్‌లో డిఫెన్స్ లాయరు ఎనభై ఏళ్ళ సాక్షి ఒకామెను అడుగుతాడు, ‘అమ్మా! ఈ ముద్దాయి మీకు తెలుసా?’ అని. ‘వాడా! సుబ్బిగాడుగదా, వెధవ! చిన్నప్పట్నించీ వాడికి దొంగతనాలు అలవాటే’ అంటుందావిడ. ‘ఈయన తెలుసా?’ అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూపిస్తాడు. ‘వీడెందుకు తెలియదూ? వెంకటిగాడుగదూ, పొట్ట పొడిస్తే అన్నీ అబద్ధాలే’ అంటుంది. ‘మరి ఈయనా?’ అంటూ పోలీస్ ఇన్‌స్పెక్టర్ని  చూపిస్తాడు. ‘వీడా! ఏషం ఏసుకొన్నంతమాత్రాన గుర్తుపట్టలేనా! ప్రకాశంగాడు కదూ, ఒట్టి పిరికిసన్నాసి!’ అంటుంది. జడ్జిగారు డిఫెన్స్ లాయర్ని దగ్గరకు పిలిచి చెవిలో, ‘ఆవిడను నా గురించి అడిగావో, నీమీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు ఫైల్ చేస్తాను’ అంటాడు.

నేను దుబాయ్ వచ్చిందగ్గర్నించీ చూస్తున్నా. రాగానే భార్గవి అంకుల్ అంది. సరే, హన్ష్‌తో తాత అనిపించింది. తప్పలేదు. మర్నాటికల్లా రాజేష్ కూడా అండీ నుంచి అంకుల్‌కు మారాడు. ఏమీ చెయ్యలేకపోయాను. నిన్నటికి నిన్న సతీష్‌గారు కూడా గ్లోబల్ విలేజ్ సెక్యూరిటీ అధికారి సాక్షిగా నన్ను అంకుల్ చేసేశారు. నటించాను. ఇప్పుడు మీవాడు తాత అంటున్నాడు. ఇనఫ్! మీరుగానీ…”

“అర్థమయింది, అర్థమయింది. అంకుల్ అని అననే అనను. ఉయ్ ఆర్ ఫ్రెండ్స్, సరేనా” అంటూ చెయ్యి కలిపారావిడ. “సరే సరే. లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ ఛార్జి కింద కేసుపెట్టేవాడినే” అని నవ్వాను.

“కాని ఒక షరతు. మీరు నన్ను ‘మీరు’ అనగూడదు, నువ్వు అనాలి. మీరు అనడం మానేయాలి” అంది ప్రవీణ. ఒప్పుకొన్నాను.

మర్నాటి ఉదయమే నా ఒమాన్ ప్రయాణం. ఉదయం ఏడింటికి మస్కట్ వెళ్ళే బస్సు ఎక్కి మధ్యాహ్నం లోపల గమ్యం చేరాలని, అక్కడ మిగిలిన రోజంతా గడిపి మళ్ళీ మర్నాటి ఉదయం సలాలా వెళ్ళే బస్సెక్కి వెయ్యి కిలోమీటర్లు ఎడారుల్లో పగటిపూట ప్రయాణం చేసి రాత్రికల్లా సలాలా చేరుకోవాలనీ- అదీ నా ప్లాను. విమానాలు ఉన్నమాట నిజమేగానీ ఆయా భూభాగాలను చూసుకొంటూ పరామర్శిస్తూ పగటిపూట ప్రయాణం చేస్తే వచ్చే అనుభవం కావాలి నాకు.

నిన్న ఉదయం వదిలివచ్చిన రాజేష్‌వాళ్ళ షార్జా ఇంటిమీద చిన్నపాటి బెంగ మొదలయింది. ఎమిరేట్స్‌లో నేనుండే చిట్టచివరి రోజు గదా, వాళ్ళనీ డిన్నర్‌కు రమ్మని పిలిచాను. అందరం కలసి ప్రవీణవాళ్ళింటి దగ్గర ఏదైనా రెస్టారెంట్‌లో భోంచేయాలన్నది ఆలోచన. ఎనిమిది ప్రాంతంలో వాళ్ళు ముగ్గురూ చేరారు. ఏదో సొంత ఊరు మనుషుల్ని కలిసినంత సంతోషం. అన్నిరకాల వంటకాల గురించీ ఆలోచించి చివరికి భారతీయ వంటకాలుండే చోటికే ఓటువేశాం. అక్కడో రెండు గంటలు. కబుర్లలో కాలమే తెలియలేదు. బరువెక్కిన గుండెలు, టాటా వీడుకోలులు, కరచాలనాలూ కౌగిలింతలూ-అంతా విడివడేసరికి రాత్రి పదకొండు.

పొద్దున్నే లేవగానే ఎఫ్‌బీలో రాజేష్ పోస్టు కనిపించింది. ‘ప్రయాణం అంటే ఊరికే ఊళ్ళు చూడటమేగాదు, కనిపించిన ప్రతి మనిషిని మనసునిండా నింపుకోవడం అనే నిరంతర యాత్రికుడు. సంతోషం మన చుట్టూనే ఉంటుంది అనుకొనే నిత్యసంతోషి. వారంరోజులపాటు ఆయనతో గడపడం మనసునిండా సంతోషాన్ని నింపింది.’ అంటూ! దుబాయ్ అనుభవాలకు అతి చక్కని ముక్తాయింపు ఆ పోస్టు.


కొన్ని కొన్ని జ్ఞాపకాలు ఏళ్ళూ దశాబ్దాలూ గడచినా వసివాడవు. తలచుకొన్నకొద్దీ సంతోషం కలిగిస్తూనే ఉంటాయి. 1964 నాటి నా ఏలూరు అనుభవం అలాంటివాటిల్లో ఒకటి. ఎప్పటిదో ఎక్కడిదో ఆ ఏలూరు జ్ఞాపకం 2020 ఫిబ్రవరి 12 ఉదయం దుబాయ్‌లో పదేపదే గుర్తొచ్చి ఆహ్లాదం కలిగింది.

అవి హైస్కూలు రోజులు. శెలవల్లో తరచూ మేం ముగ్గురం–నేను, శిరీష, శైలేంద్ర–విజయవాడ నుంచి ఏలూరు వెళుతూవుండేవాళ్ళం. అక్కడ మా పెద్ద మేనమామ, వాళ్ళ పిల్లలు మా ఆకర్షణ. ఆ పిల్లలు ముగ్గురివీ అచ్చంగా మా వయసులే! దాంతో విపరీతమైన మైత్రి. వాళ్ళ ఇంటి పెద్ద కాంపౌండ్‌లో ఆటలు, పాటలు; పక్కనున్న తమ్మిలేరు ఒడ్డునపడి విహారాలు; ఎదురుగా ఉన్న పెద్ద మైదానంలో గాలిపటాలు, ఇంకా ముందుకెళ్ళి రైల్వే స్టేషన్లో షికారులు… రోజులు తెలియకుండా గడచిపోయేవి. తిరిగి విజయవాడ వెళ్ళాలంటే దిగులు, దుఃఖం కలిగేవి! అలాంటి ఒక తిరుగుప్రయాణం ప్రయత్నంలో రైలు నాలుగ్గంటలు లేటయింది. కౌంటర్లోని మనిషి ఆ రోజు టికెట్టు డబ్బులు పూర్తిగా వాపసిస్తామన్నారు. అలా టికెట్లు కాన్సిల్ చేసుకొని, ప్రయాణాన్ని మర్నాటికి వాయిదా వేసుకొని (ఒకరోజు స్కూలు పోతే కొంపలంటుకోవు!) తిరిగి ఇంటికి చేరినపుడు ఏమని చెప్పను మా ఆరుగురి సంతోషం, సంబరం! 

అదిగో ఆ సంతోషసౌరభం మళ్ళీ దుబాయ్‌లో నా మనసులో ఆనాటి ఉదయం విరబూసింది. అంత సంతోషమూ ఒక్కళ్ళే అనుభవించటం న్యాయం కాదుకదా, పంచుకోడానికి మరో మనిషి దొరకడం ఏమంత భాగ్యం?!

పొద్దున్నే ఆఫీసుకు వెళుతూ వెళుతూ నన్ను మస్కట్ వెళ్ళే బస్సులో ఎక్కించి వెళ్ళాలన్నది సతీష్ ప్లాను. బస్సు బయల్దేరే ప్రదేశం, సమయం లాంటి వివరాలు ముందే సేకరించి ఉంచారాయన. అంతకుముందు సాయంత్రం ఒకసారి అటువేపుగా వెళ్ళి చూసికూడా వచ్చారట. ఇద్దరం ప్రవీణకు బైబై చెప్పి ఇంట్లోంచి బయటపడి బస్ స్టేషన్‌కు వెళ్ళాం. బస్ ఎక్కడకు వస్తుందో అక్కడ నిలబడ్డాం. బస్సు వచ్చింది. అంతా ఎక్కడం మొదలెట్టారు. నేనూ నా బాక్‌పాక్ తీసుకొని ఎక్కడానికి తయారయ్యాను. గేటు దగ్గర ‘టికెట్’ అన్నాదో పెద్దమనిషి. ‘తీసుకోలేదు, లోపల తీసుకొంటా’ నా జవాబు. ఎగాదిగా చూశాడు. ‘బస్సు ఫుల్లయిపోయింది. ముందే బుక్ చేసుకోవాలని తెలియదా?!’ అని కోప్పడబోయి జాలిపడ్డాడు.

నిజమే! తెలియదు. మరి ఎలా?!

‘మధ్యాన్నం మూడింటికో బస్సుంది. రాత్రి పదకొండింటికి మరోటి. అందులో టికెట్లున్నాయి.’ బస్సు మనిషి సమాచారం. మాటల్లో అతను తెలుగు మనిషని తెలిసిపోయింది. తెలుగు భాష అదనపు సీటు సృష్టించలేదనీ స్పష్టమయింది. ఈలోగా ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా, కొన్ని కొన్ని అనుభవాలు నీకే ప్రత్యేకం అమరేంద్రా’ అంటూ చెవిలో రాయప్రోలుగారు ఎగతాళిగా గుసగుసలాడటం మొదలయింది. అవును మరి, ముప్పై ఏళ్ళ క్రితం అచ్చం ఇలాగే పారిస్-లండన్ రైలు ప్రయాణం కొండెక్కలేదూ?!

అదిగో అదీ నా ‘ఏలూరు క్షణం’.

పొద్దున్న బస్సు మిస్సు అంటే ఒమాన్ ప్లానంతా తలకిందులయినట్టన్నమాట. ఆరోజు మస్కట్ చూడటం అవదు. మర్నాడు పగలు ఎడారి ప్రయాణం కుదరనే కుదరదు. మస్కట్‌లో బుక్ చేసుకొన్న ఎయిర్ బి అండ్ బి నిరుపయోగమవుతుంది. ఒమాన్‌లో మూడునాలుగు రోజులు అనుకొన్నది కుదించుకుపోతుంది. నిజానికి అది నేను కనీసం హతాశుడ్ని అవవలసిన క్షణం.

కానీ ఏలూరు జ్ఞాపకం తన్నుకువచ్చి మనసులో సంతోషమే నింపింది. ‘నీ మనసింకా దుబాయ్‌లోనే ఉందోయ్. ఇంకోరోజు ఇక్కడ గడిపే అవకాశం వస్తోంది. మస్కట్‌దేముంది, అది మబ్బులోని వాన. దుబాయ్ ముంతలోని నీళ్ళ గురించి సంతోషపడు’ అని బుద్ధి హితవు పలకసాగింది. సంతోషపడ్డాను. రాత్రి బస్సుకే ఓటువేశాను. ‘పగలంతా దుబాయ్’ అన్న సంతోష వీచికలో మునిగితేలాను! కానీ ఈ సంతోషం పంచుకోడానికి సతీష్ సరైన మూడ్‌లో లేరు. నా ప్రోగ్రామ్ కొండెక్కిందని నాకన్నా వందరెట్లు (నాది సున్నగాబట్టి అది అనంతశాతం అనాలి) బాధలో ఉన్నారాయన. ‘బాధ వద్దు, నాకు సంతోషమే’ అంటే ఆయనకు అర్థమయ్యే సన్నివేశం కాదు. అంచేత నేను కూడా బలవంతంగా బాధ నటించాను.

రాత్రి బస్సు టికెట్లు ఉదయం పదకొండింటికిగానీ ఇవ్వడం మొదలెట్టరట. అంచేత ఇంటికివెళ్ళి, ఓ రెండు గంటలు గడిపి తిరిగిరావడం తప్ప మార్గంలేదు. సతీష్ ప్రవీణకు ఫోను చేసి, పరిస్థితి వివరించి, నన్ను పికప్ చేసుకొని ఇంట్లో దింపమని చెప్పి, తన ఆఫీసుకు వెళిపోయాడు. ఆ సాయంత్రమే ఆయనకు ఇండియా షార్ట్ ట్రిప్ ఉంది-ఏదో పెళ్ళి సందర్భంగా. అంచేత ఆనాడు ఆఫీసుకు లేటవకుండా వెళ్ళే అవకాశం ఆయనకు లేదు.

ప్రవీణ రాగానే ఏలూరు సంగతి చెప్పేశాను. ఫక్కున నవ్వింది. ‘తెలుసులే నీ దుబాయ్ బెంగ. మా ఊరిమీద, మా ఇంటిమీద, మామీదా నీ బెంగ తెలుసులే’ అని ఆ నవ్వుకు అర్థం!


“ఈపూట ఎక్కడికెళితే బావుంటుందో చెప్పగలవా? పాత ప్రదేశాలు వద్దు. హెరిటేజ్ విలేజ్ కూడా వద్దు. దుబాయ్‌లో అతి ప్రత్యేకంగా ఉండే ప్రదేశమేమయినా ఉందా? నాలాంటివాడు కూడా ఇలా మస్కట్ బస్సు తప్పితే తప్ప వెళ్ళి చూడని ప్రదేశం?”

కాసేపు ఆలోచించి చెప్పింది ప్రవీణ. ‘క్రీక్ పార్క్’.

మరో ఆలోచన లేకుండా మనసును అటు మళ్ళించాను.

నీ ముక్కేదోయ్ అంటే తిన్నగా వేలుపెట్టి చూపించేవాడు అతిసాధారణ ప్రయాణీకుడవుతాడు. తిప్పితిప్పి తల వెనక నుంచి చేతిని తిప్పి ముక్కును చూపించేవాడు నాలాంటి అసాధారణ యాత్రికుడవుతాడు!

క్రీక్ పార్క్ అనగానే మెట్రోమాప్‌లో అనువైన స్టేషను ఏదా అని వెదికాను. మా గ్రీన్‌లైన్ చిట్టచివరి స్టేషన్ క్రీక్ అని మ్యాపు చెప్పింది. మరింకేం, బండెక్కి చివరిదాకా వెళ్ళిపోయాను. ఏభై అడుగుల ఎత్తున ఉన్న ప్లాట్‌ఫామ్ నుంచి వందా రెండొందల మీటర్ల దూరాన్ ఉన్న క్రీక్ అయితే కనిపిస్తోందిగానీ ఎటు ఎంతగా చూసినా పార్కు జాడే లేదు. మనసు కీడును శంకించింది. టికెట్ల అమ్మాయిని అడిగాను. నా ప్రశ్నకు కాస్తంత తొట్రుపడి, క్షణంలో కూడదీసుకొని “సర్! పార్క్ ఇక్కడికి ఐదారు కిలోమీటర్లు ఉంటుంది. బాగా ముందుకొచ్చేశారు. ఓ పని చెయ్యండి. మళ్ళా మెట్రో పట్టుకొని వెనక్కి వెళ్ళండి. ఒక స్టేషను వదిలేస్తే ‘హెల్త్‌కేర్ సిటీ’ అన్న స్టేషను వస్తుంది. అక్కడ్నించి సుమారు కిలోమీటరుంటుంది మీరు అడిగే పార్కు” అని నింపాదిగా, చక్కని ఆంగ్లంలో వివరించిందా సంప్రదాయ దుస్తుల వనిత.

కానీ ఎదురుగా దూరాన కనిపిస్తోన్న జలరాశిని పలకరించాలి కదా! స్టేషను బయటకు వచ్చి క్రీక్ దిశగా అడుగులు వేశాను. అక్కడి వాతావరణం చూస్తే ఊరు దాటి పొలిమేరలు చేరానా అనిపించింది. గూగుల్‌ను అడిగితే ‘అవును, సముద్రతీరం నుంచి ఏడెనిమిది కిలోమీటర్ల దూరాన ఉన్నావు’ అని నిర్ధారించింది. దుబాయ్‌లాంటి నగరానికి పొలిమేర ఉంటుందని ఊహించటం కష్టం. ఉత్తరాన షార్జా దిశగాను, దక్షిణాన ఆబూ దాబీ వేపూ విస్తరించి ఉన్న దుబాయ్ నగరం తూర్పు దిక్కున పదీపదిహేను మీటర్ల లోపే సన్నగిల్లుతోందన్నమాట. ఊరికి దూరమేగాని, దాదాపు గ్రామీణ వాతావరణమేగానీ ఆ రోడ్లు, అక్కడవున్న ఒకటీ అరా భవనాలూ నగరపు నేవళాన్ని సంతరించుకొనే కనిపించాయి. ఎడమ పక్కన ఓ నూటఏభై రెండువందల అడుగుల పొడవు ఉన్న పెద్ద నౌక నిర్మాణదశలో ఉంది. కాస్తంత పరిశీలిస్తే అది అల్‌ జడాఫ్ వాటర్‍ఫ్రంట్ ప్రాంతమని తెలిసింది. అక్కడి జలాలు ఏ రకమైన హడావుడీ లేకుండా ఏదో మన గ్రామీణ గంగాతీరం లాగా ఒక వింత వ్యక్తిత్వంతో కనిపించి ఆకట్టుకొన్నాయి. 

క్రీక్ పార్క్ స్టేషను కౌంటర్ యువతి చెప్పినట్టుగానే మెట్రో పట్టుకొని హెల్త్‌కేర్ సిటీ స్టేషన్లో దిగాను. గూగుల్ సాయంతో పార్కు ఉనికి పసిగట్టి అటు అడుగులు సాగించాను. ఒకసారి దిశాపరిజ్ఞానం మనసుకు పట్టాక కాస్తంత చనువు తీసుకొని ‘దగ్గరిదారిలోనే వెళ్ళాలి’ అన్న నియమం పెట్టుకోకుండా నన్ను ఆకట్టుకొన్న వేపుకు మళ్ళుతూ, పరిసరాలనూ ప్రకృతినీ పరిశీలిస్తూ ముందుకు సాగాను. రోడ్ల పక్కన పచ్చికను, వృక్షాలనూ అక్కడివాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో బొట్లుబొట్లుగా నీళ్ళు అందిస్తూ పెంచుతోన్న పద్ధతిని అబ్బురంగా చూశాను.

హెల్త్‌కేర్ సిటీ అన్నారుగానీ అక్కడ ఆరోగ్యపు భవనాలకన్నా ఐదు నక్షత్రాల హోటళ్ళే ఎక్కువ కనిపించాయి. నిన్న ఇంటర్నెట్ సిటీ, ఇవాళ హెల్త్‌కేర్. గూగుల్‌లోకెళితే అకడమిక్, మోటర్, ఫెస్టివల్ అంటూ థీమ్ బేస్డ్ మినీసిటీల ఉనికి తెలిసివచ్చింది. మన హైదరాబాద్‌లో ఒకే ఒక్క హైటెక్ సిటీ ఉంటే దుబాయ్‌లో అదే బాణీలో రకరకాల సిటీలకు రూపకల్పన చేశారన్నమాట. మెచ్చుకోవాలి. ఆమాటకొస్తే విజయవాడ ఆటోనగర్ వచ్చి ఏభై ఏళ్ళు దాటిపోలేదూ?! అలా ఆలోచనలు దుబాయి-హైదరాబాద్-విజయవాడ మార్గాల్లో తిరుగుతూ ఉండగా ఎవరిదో ఎంక్వైరీ- హెల్త్‌కేర్ మెట్రోస్టేషన్‌కు ఎలా వెళ్ళాలి సార్? అంటూ. నాలుగు వీధులు ఎక్కువే తిరిగాను గాబట్టి అప్పటికే ఒక అవగాహన రావడంతో అతనికి స్పష్టంగా మార్గం వివరించగలిగాను!

క్రీక్ పార్క్ ప్రవేశద్వారం దగ్గర దాని గణాంక వివరాలు కనిపించాయి. 96 హెక్టేర్లట. అంటే దాదాపు రెండొందల ఏభై ఎకరాలు! చుట్టూ తిరిగిరావాలంటే నాలుగయిదు కిలోమీటర్లు. దుబాయ్ క్రీక్ పక్కనే పొడవుగా అల్లుకొని ఉన్న పార్క్ ఇది. క్రీక్ అవతలి పక్కన గోల్ఫ్ కోర్స్. కుడివేపున నేను రోజూ దాటివస్తోన్న వంతెన. ఎడమవేపుగా సాగిపోతే సముద్రతీరం… ఆ వివరాలు ఎలా ఉన్నా నీటి ఒడ్డు ఒడ్డంతా నడిచెయ్యాలన్న సంకల్పంతో లోపలికి అడుగుపెట్టాను. వెళ్ళగానే ఎదురుగా బహుపెద్ద వృత్తాకారంలో చిల్డ్రన్స్ సిటీ అంటూ కనిపించింది. అందులో కేబుల్ కారు, పిల్లల కోసం ఓ సైన్స్ సెంటరూ ఉన్నాయట. పక్కనే డాల్ఫినారియం. అవన్నీ తప్పించుకొని నీటి ఒడ్డుకోసం నా వడివడి అడుగులు. చివరికి అద్భుత జలదృశ్యం!

ఎదురుగా రెండుమూడు వందల మీటర్ల వెడల్పున దుబాయ్ క్రీక్. ఆ తీరరేఖకు సమాంతరంగా అతి చక్కని కాలి బాట. బాటలో ఎడారి తుమ్మచెట్లు. బాటకూ తీరరేఖకూ మధ్య తెల్లని ఇసుక. అక్కడక్కడ నీళ్ళలోకి చొచ్చుకుపోయేలా నిర్మించిన చెక్కబల్లలు. ఒకచోట ఇరవై అడుగుల ఎత్తున అబ్జర్వేషన్ టవర్. ఉండీలేని విహారులు. తీరరేఖ అర్ధచంద్రాకారపు మలుపు సంతరించుకొన్న చోట ఏవేవో చిన్నచిన్న పక్షులు. వాటిని ట్రైపాడ్ స్టాండ్ మీద కేమెరా బిగించి ఫోటోలు తీస్తోన్న ఓ పాశ్చాత్య యువకుడు. చిరు సంభాషణ. అడిగి తీయించుకొన్న ఛాయాచిత్రం. ఎంత నడిచినా తనివితీరని అద్భుతమైన కాలిబాట. ఇరువైపులా పచ్చల పందిరిలా కాలిబాటను కమ్ముకొన్న చెట్లు. సైకిళ్ళను అద్దెకు తీసుకొని ఎగిరిపోతోన్న పిల్లల పలకరింపులు. చెట్లనీడన నీళ్ళవేపు చూస్తూ మధ్యాన్న భోజనం. ఒక ఇరవై అడుగుల గుట్టమీద స్టీలు శిల్పకళాకృతి. మరో గుట్టమీద ఓ రెస్టారెంటు. బంగ్లాదేశ్ కుర్రాడు. పెప్సీ. హఠాత్తుగా ఒక విశాలవృత్తంలో రంగురంగుల పూలమడులు. వృత్తపు కేంద్రబిందువులో ఓ గజీ‌బో. మరికాస్త దూరం వెళితే ‘ఎడారి ఉద్యానవనం’ ఉంది అని చెప్పే సైన్ బోర్డ్. శ్రుతి అయిన మనసు ఎంత స్వేచ్ఛగా రాగాలాపన చెయ్యగలదో, ఎంతగా సంతోషపు గగనంలో ఎగరగలదో అంతగానూ నా మనసు గగనవిహారం చేస్తూ స్వేచ్ఛాగానం ఆలపించిన క్షణాలవి. క్షణాలు కాదు, రెండు గంటలు!

అసలే ఎడారి. అందులో ఆకుపచ్చని క్రీక్ పార్కు. మళ్ళా అందులో డిసర్ట్ పార్క్ విభాగం. వింతగా ఉందే అనుకొంటూ అటువేపు ఓ అడుగువేశాను. అది నాకు తెలియకుండానే వేయి అడుగులుగా పరిణమించింది.

బ్రహ్మజెముళ్ళు చిట్టివృక్షాలు అల్లుకొన్న పొదలు, వాటిల్లో పక్షుల కేరింతలు. చక్కగా మలచిన కాలిబాటలు. అవి ఎక్కే రాళ్ళ గుట్టలు. మధ్యలో ఎండిపోయిన నీటిచెలమల జాడలు. వాటిమీద చిన్నచిన్న వంతెనలు. ఒక్కసారి కళ్ళు మూసుకొంటే ఉన్నది నగరంలో కాదు, నగరంలోని పార్కులో కాదు-ఎడారి నడుమ ఒయాసిస్సు ఒడ్డున అన్న భావన కలిగేలా జాగ్రత్తగా శ్రద్ధగా రూపకల్పన చేసిన విభాగమది. హేట్సాఫ్!

డిసర్ట్ పార్క్‌లోంచి బయటపడి మళ్ళా పార్కురోడ్డును పట్టుకోగానే ముగ్గురు ఆజానుబాహులు గలగలా నవ్వుకొంటూ మాట్లాడుకొంటూ కనిపించారు. ఆ నవ్వు ఆకర్షించింది. మాటకలపాలనిపించింది. పాకిస్తాన్‌వాళ్ళేమోనన్న ఆశతో హిందీలో పలకరించాను. ఫలించింది. పెషావర్ ప్రాంతమట. ‘సరిహద్దు గాంధీ’ తెలుసా అని అడిగాను. తెలియదన్నారు. పోనీ భారతదేశపు మహాత్మాగాంధీ? తెలుసన్నారు. అదిగో ఆయన అనుంగు శిష్యుడు మీ బాద్షాఖాన్. మన దేశాలకు స్వాతంత్ర్యం రావడం కోసం గాంధీతోపాటు కలసి నడచి తన అహింసామార్గం వల్ల సరిహద్దు గాంధీ బిరుదు పొందాడు. దాదాపు వందేళ్ళు బతికాడాయన అని వివరించాను. బుద్ధిగా విన్నారు. ఏవిటీ ఏదో తింటున్నట్లున్నారూ, మరి నాకు పెట్టరా? అని కవ్వించాను. అవి రేగుపళ్ళు. వద్దంటున్నా బలవంతంగా ఒక పళ్ళ పొట్లం చేతిలో పెట్టారు. అనుకోకుండా అమరిన స్నేహంతో మనసు పరవశం!

‘మనసు పరవశాల సంగతి సరేగానీ కాస్తంత మా సంగతీ చూడవయ్యా’ అంటూ కాళ్ళు మొరపెట్టుకోవడం మొదలయింది. ఆరోజు ఎంచేతో శరీరానికి అలసట ఛాయలు కనిపించాయి. అప్పటికే సాయంత్రం నాలుగయిపోయింది. మళ్ళీ రాత్రి పదకొండింటికి బస్సు. ఇహ పార్కు విహారాలు కట్టిపెట్టి దగ్గర్లో ఉన్న మెట్రోస్టేషను కోసం వెదికాను. ఔధ్‌మేథ అన్న స్టేషను మైలు దూరంలో ఉన్నట్టు తెలిసింది. కాళ్ళను అక్షరాలా ఈడ్చుకుంటూ అటువేపు. రైలు ప్రయాణంలో కాస్తంత సేదదీరానని అనిపించినా మళ్ళీ స్టేడియం స్టేషన్నించి ప్రవీణావాళ్ళింటికి నడిచి వెళ్ళేసరికి ఏదో అంటారే, తలప్రాణం కాళ్ళల్లోకి వచ్చేసింది! నా భౌతికశక్తుల అంచుల దాకా చేరడం వరసాగ్గా ఇది రెండోసారి. రేపు అసలు నడవగలనా అన్న అనుమానం కలిగింది!

నే చేరేసరికి సతీష్ ఇండియా మినీ ట్రిప్ కోసం ఎయిర్‌పోర్టుకు బయల్దేరే సన్నాహాల్లో ఉన్నారు. అందరం కలసి ఆయన్ని సాగనంపాం. ఓ అరగంట కవలపిల్లల బాగోగులు చూశాక ప్రవీణ వచ్చి నాతో కబుర్లకు కూర్చుంది. మళ్ళీమళ్ళీ ఇలా కూర్చునే అవకాశం ఇప్పట్లో రాదని ఇద్దరికీ తెలుసుగాబట్టి కబుర్ల జలపాతంలో ఇద్దరం తడిసిముద్దయిపోయాం…

కథలు, పుస్తకాలు, పాత్రలు, మనుషులు, స్వభావాలు, ప్రాంతాలు, దేశాలు, సినిమాలు, పారసైట్ సినిమాకు ఆస్కారు, నాస్తికత, కమ్యూనిజం, దుబాయ్ జీవితం, ఉద్యోగాలు, పదవీ విరమణ, అధ్యాపకవృత్తి, పిల్లల పెంపకం-కాదేదీ కబుర్లకనర్హం. పాపం మధ్యలో వాళ్ళ బాబు సాయి వచ్చి నా కమ్యూనిజం లెక్చరు పాలబడ్డాడు కూడానూ!

పదిన్నరకల్లా బస్ స్టేషను చేరుకొన్నాను.

రేపు మరో దేశం, మరో అనుభవం!

(సశేషం)