ఉత్తర మొరాకో శోధనలు 5

టాంజీర్‍: ఇబ్న్ బటూటా పుట్టిన చోటు

ఉత్తర మొరాకోలో నా ప్రయాణాలకు మూలకారణం టాంజీర్‍ నగరం. పద్నాల్గవ శతాబ్దపు మహా యాత్రికుడు ఇబ్న్ బటూటా పుట్టిన చోటది. నాకు ఎంతో ఇష్టమయిన యాత్రికుడీయన. ఆ రోజుల్లో ఎరుకలో ఉన్న ప్రపంచమంతటినీ తన స్వగ్రామంగా మలచుకొని తిరిగివచ్చిన విలక్షణ వ్యక్తి ఇబ్న్ బటూటా. ‘యాత్రాభిలాష వేలాది అపరిచిత ప్రదేశాలలో నాకు స్వగృహాలను ప్రసాదించింది. నా సొంత ఇంటికి నన్ను అపరిచితుడ్ని చేసింది’ అంటాడాయన. ఎనిమిదివందల సంవత్సరాలక్రితం పుట్టి, ప్రపంచమంతా ఏళ్ళతరబడి తిరుగాడి, చిట్టచివరికి గూటికి చేరిన ఆ మహానుభావుడి సొంత ఊరుకు వెళుతున్నానన్నమాటే నన్ను పులకరింపజేసింది. ఆయన ప్రయాణ పరంపరలో నేను పుట్టి పెరిగిన దక్షిణ భారతదేశం కూడా ఉంది అన్న విషయం నాకో అదనపు ఆనందహేతువు. మా ప్రాంతాలకు వచ్చి వెళ్ళిన ఇబ్న్ బటూటా స్వగ్రామానికి వెళ్ళి నివాళి అర్పించి రావాలన్నది నా ఆకాంక్ష. అది ఆయనకు నేను ఇవ్వగల ప్రతిబహుమతి అని నా భావన.

జిబ్రాల్టర్ జలసంధి దక్షిణ తటాన, మధ్యధరా సముద్రం అట్లాంటిక్ మహాసముద్రాన్ని పలకరించే చోట కాపలా సిపాయిలా నిలచి ఉండే నగరం టాంజీర్‍. ఆ జలసంధి ఎంతో సన్నపాటిది. ఒకచోటనయితే ఆ జలసంధికి అటూ ఇటూ ఉత్తర దక్షిణ దిశల్లో ఉన్న భూభాగాల మధ్య దూరం పదమూడు కిలోమీటర్లే.  ప్రపంచంలో విరామమంటూ లేకుండా కార్యకలాపాలు సాగే సముద్ర మార్గాలలో జిబ్రాల్టర్ జలసంధి ప్రముఖమైనది.

అట్లాంటిక్ మహాసముద్రం – మధ్యధరా సముద్రాల మధ్యన రాకపోకలు సాగించే ఏ ఓడ అయినా టాంజీర్‍ నగరపు కంటిచూపు పరిధిలో సాగితీరవలసిందే. ఆఫ్రికా ఖండం నుంచి యూరప్‌కు, యూరప్ నుంచి ఆఫ్రికాకూ ఆ నగరాన్ని ఒక ప్రవేశ బిందువుగా పరిగణించవచ్చు. అంత ముఖ్యమైన ప్రదేశంలో ఉన్న నగరం కాబట్టి దేశదేశాల నౌకాదళాల కన్ను దానిమీద పడుతూ వచ్చింది. పదిహేడో శతాబ్దంలో ఇరవై ఏళ్ళపాటు అది బ్రిటీషువాళ్ళ ఆధీనంలో ఉంది. మన బొంబాయి నగరం విషయంలో జరిగినట్టుగానే ఈ టాంజీర్‍ నగరాన్ని కూడా పోర్చుగీసువాళ్ళు తమ రాజకుమారి ఇంగ్లండు రాజును పెళ్ళాడినపుడు కట్నంగా సమర్పించారు. కానీ బ్రిటీషువాళ్ళు ఆ నగరాన్ని స్థానిక బెర్బర్ తెగలవారి ఎడతెగని దాడుల నుంచి, మౌలె ఇస్మాయిల్‌గారి సేనల నుంచీ కాపాడుకోలేకపోయారు.

ఇరవయ్యవ శతాబ్దపు నడుమ దినాలలో టాంజీర్‍ నగరం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తల ఎత్తిన సంస్కృతీ వ్యతిరేక ఉద్యమానికి కేంద్రబిందువుగా పరిణమించింది. అప్పటి వ్యవస్థను, పద్ధతులనూ నిరసిస్తూ ఉద్యమించిన ‘బీట్ జెనరేషన్’ రచయితలకు, కళాకారులకూ స్థావరమయింది. కాలక్రమేణా అప్పటి హిప్పీ తరానికి మక్కువైన ప్రదేశమయింది. ఇంకోరకంగా చెప్పాలంటే మొరాకో దేశంలో అంతర్భాగంగా ఉంటూనే టాంజీర్‍ నగరం తనదైన ఉనికిని సంతరించుకొని కాపాడుకోగలిగింది.


టెటువాన్ పట్టణంలో నేనెక్కిన గ్రాండ్‌టాక్సీ సాయంత్రపు నీడలు పరచుకొంటోన్న సమయంలో టాంజీర్‍ నగరంలోని ఒక అతి సాధారణమైన టాక్సీస్టాండ్‌లో నన్ను దింపింది. ఇక్కడ మరో పెటిట్ టాక్సీ తీసుకొని నేను ఉండబోయే హోటల్‌కు వెళ్ళమని నాతోపాటు టాక్సీల్లో వచ్చినవాళ్ళు సలహా ఇచ్చారు. నా దగ్గర బోలెడంత సమయం ఉందిగాబట్టి మా హోటల్ రెమ్‌బ్రాంట్ దాకా ఇరవై నిమిషాలపాటు నడవటానికే ఇష్టపడ్డాను. సంధ్యాకాంతి పరిసరాలను వెలిగిస్తోన్న దివ్య సమయమది.

రెమ్‌బ్రాంట్ హోటల్ ఐదంతస్తుల భవనం. పైకి గంభీరంగా కనిపిస్తోన్నా బాగా పరిశీలిస్తే అది ‘అలసిపోయిన భవనం’ అని స్ఫురిస్తుంది. అయినా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఛాయలూ కనిపిస్తాయి. రిసెప్షన్ పక్కనే పై అంతస్తులకు దారి తీస్తోన్న చక్కని పాలరాతి వలయాల మెట్ల వరస నా దృష్టిని ఆకట్టుకొంది. ఆ హోటల్ సముద్రతీరానికి ఎంతో దగ్గరలో ఉందన్న విషయం గ్రహించాను. ఆ గ్రహింపు నన్ను ఉల్లాసపరిచింది. హోటల్ గదిలో అవసరమైన దానికన్న నిమిషమైనా ఎక్కువ సమయం గడపటం నాకు సరిపడని పని. గబగబా మొహం కడుక్కుని రోడ్లను అందిపుచ్చుకొన్నాను. మొరాకో దేశపు నగరాలన్నిటా రోడ్లన్నీ ఆయా నగరాల మదీనాకేసి దారితీయడం కద్దు. టాంజియర్ దానికేమాత్రం మినహాయింపు కాదు.

నే వెళుతోన్న దారిలో దక్షిణ ఐరోపాశైలికి చెందిన భవనాలు తటస్థపడ్డాయి. అందులో ఒక భవనం నా దృష్టిని ఆకర్షించి నిలవరించింది. అది ఫ్రెంచి కాన్సులేట్ భవనమట. దానికి సరిగ్గా ఎదురుగా కఫె డి పారిస్ అన్న రెస్టారెంటు కనిపించింది. దీని గురించి జాష్ షుమాకర్ అన్న వ్యక్తి రాసిన ‘టాంజీర్‍, ఎ లిటరరీ గైడ్ టు ట్రావెలర్స్’ అన్న పుస్తకంలో బాగా చదివి వున్నాను. టాంజియర్ నగరంతో అనుబంధం ఏర్పరచుకొన్న అనేకానేక అంతర్జాతీయ రచయితల గురించి,  ఊళ్ళోని వారి వారి అభిమాన ప్రదేశాల గురించీ ఆ పుస్తకం ఎన్నో వివరాలు చెపుతుంది. ఆ సుప్రసిద్ధమైన కఫేలో ఒక కాఫీ తాగుదామనుకొన్నాను. కానీ అప్పటికే అక్కడ విపరీతమైన జనసందోహం–కూర్చునే స్థలం దొరకడం అసంభవమనిపించింది. ఆలోచన విరమించుకున్నాను.

మెల్లగా మదీనా వైపు నడక కొనసాగించాను. మరికాస్త దూరంలో హోటల్ ఎల్‌మిజా భవనం కనిపించింది. నగరపు ప్రతీకల్లో ఈ హోటల్ కూడా ఒకటి. రాజులూ దేశాధినేతలూ వచ్చి ఉండే ప్రదేశమది. నాలాంటి సగటు యాత్రికుడి ఆలోచనకు కూడా అందని భవనమది. అయినా దాని గాంభీర్యాన్నీ సౌందర్యాన్నీ బయటనుంచే తనివితీరా చూసి ఆనందించాను. పెద్దగా అనుమతులడిగే ప్రమేయం పెట్టుకోకుండా అక్కడి సాయుధ సెక్యూరిటీ గార్డుల నడుమ నుంచి లోపలికీ తొంగి చూశాను. వాళ్ళూ ఏం అభ్యంతర పెట్టలేదు.

మరికాస్త నడిచాక గ్రాండ్ సోకో అన్న విశాల ప్రాంగణం చేరుకొన్నాను. దాని నట్టనడుమన ఒక ఉద్యానవనం. పామ్ వృక్షాలు. పేద్ద చలువరాతి ఫౌంటెను–చక్కని ప్రదేశం. ఆ ఉద్యానవనం ట్రాఫిక్‌ను క్రమీకరించే రౌండ్-ఎబౌట్‌గా కూడా ఉపకరిస్తోంది. ఆ గ్రాండ్ సోకో ప్రాంగణంలో ఆర్ట్‌డెకో శైలికి చెందిన సొగసైన శ్వేత భవనమొకటి కనుపించింది. అది సినేమా రిఫ్ అన్న థియేటరని క్షణాల్లో బోధపడింది. ‘ప్రపంచంలోని అతి సుందరమైన సినిమా థియేటర్లు ఏవి?’ అని ఎవరైనా పోటీపెడితే నేను మరో ఆలోచన లేకుండా ఈ సినేమా రిఫ్‍ను ప్రతిపాదించి తీరతాను!

జేగురు రంగు చతురస్రాకారపు మినరెట్ కలిగిన రంగులు నిండిన సిది బు అబిబ్ అన్న మసీదు ఆ గ్రాండ్ సోకో ప్రాంగణంలో మనకు కొట్టొచ్చినట్టు కనిపించే మరో ప్రముఖ కట్టడం.

ఆ సంధ్యాసమయాన మదీనా ప్రాంతమంతా మనుషులలో క్రిక్కిరిసిపోయి కనిపించింది. టాంజియర్ నగరపు ప్రజానీకమంతా అక్కడే చేరిందా అన్నట్టుంది! ఆ జనసందోహంలో పెటిట్ సోకో అన్న ప్రాంతం చేరుకోడానికి సందులూ గొందులూ వెతికి పట్టుకుంటూ ముందుకు సాగాను. ఈ పెటిట్ సోకో అన్నది నివాసభవనాలు, రెస్టారెంట్లు, కెఫెల మధ్యన ఉన్న చక్కని చిట్టి ప్రాంగణం. నేను తిన్నగా గ్రాండ్ కఫె సెంట్రల్ అన్న చోటుకి వెళ్ళాను. టాంజీర్‍ నగరంలోని ప్రముఖమైన కఫెలలో ఇది ఒకటి. ఇరవయ్యవ శతాబ్దంలో అంతర్జాతీయ రచయితలకూ కళాకారులకూ ప్రీతిపాత్రమైన కూడలి ప్రదేశమది. కఫె లోపలే కాకుండా ఆరుబయట కూడా కుర్చీలు అమర్చి ఉన్నాయి. బయట ఉన్న ఓ టేబుల్ దగ్గర స్థిమితపడి ఓ కాఫీకి ఆర్డర్ ఇచ్చాను. పరిసరమంతా ఉత్తేజభరితంగా కనిపించింది. అక్కడే నాకో పండువయసు డచ్‍ దంపతులు పరిచయమయ్యారు. కబుర్లు అలవోకగా సాగాయి. నాలాగే వాళ్ళు కూడా జిబ్రాల్టర్ జలసంధి దాటుకొని స్పెయిన్‌ లోకి అడుగుపెడదామని అనుకొన్నారట. కోవిడ్ పుణ్యమా అని పడవల రాకపోకలు నిలిచిపోయాయి. అంచేత వారికి విమానయానం తప్ప మరో గత్యంతరం లేదు.

ఆ జంట మరాకేష్ నుంచి టాంజీర్‍ దాకా రైల్లో వచ్చారట. నేను సరిగ్గా దానికి వ్యతిరేకదిశలో ప్రయాణం చేస్తున్నాను. వాళ్ళతో మాటల్లో ఉండగానే నేను అడిగిన స్ట్రాంగ్ కాఫీ వచ్చేసింది. క్షణాల్లో నాలోని అలసటను దూరం చేసింది. ఆనాడు మిగిలిన సమయమంతటినీ నగరశోధనలో గడపడానికి అవసరమయిన శక్తిని ఇచ్చింది. ఆ డచ్‍ జంటతో మాటల్లో నే ఉంటోన్న రెమ్‌బ్రాంట్ హోటల్ ప్రస్తావన వచ్చినపుడు నేను చనువు తీసుకొని ‘రెమ్‌బ్రాంట్ పేరు పెట్టుకొన్న ఆ హోటలు మీ దేశపు ఆ మహానుభావుని వర్ణచిత్రాలంత ఘనంగా లేనేలేదు ‘అని చెణికాను. వాళ్ళు నవ్వేశారు. నవ్వి, ‘మేం ఉంటోన్న రియాద్ టింజిస్ నిజంగా బావుంది. నువ్వు అక్కడికి మారిపో’ అన్నారు. ఆ సలహా నాకు నచ్చింది. ఆ రాత్రి గడిపాక మర్నాటికి రెమ్‌బ్రాంట్ హోటలు వదిలి మరో మంచిచోటు చూసుకోవాలని అప్పటికే అనుకొని ఉన్నాను. ఇహ మరో ఆలోచన లేకుండా వీళ్ళు చెప్పిన రియాద్ టింజిస్ వేపు మొగ్గాను. అది మేమప్పుడు కూర్చుని ఉన్న కఫేకు దగ్గర్లోనే ఉందట.

డచ్‍ దంపతులు చెప్పిన గుర్తుల ప్రకారం రియాద్ టింజిస్ వేపు నడక సాగించాను. వెళ్ళి రేపటికి వసతి బుక్ చేసుకోవాలని నా ఆలోచన. నేను అనుసరించిన ఇరుకాటి మార్గం వెళ్ళి వెళ్ళి ఒక సందుగొందుల పద్మవ్యూహంలో భాగమయిపోయింది. ఆ వీధుల వ్యూహాన్ని ఎలాగో ఛేదించి చివరికి రియాద్ టింజిస్ చేరుకోగలిగాను. కానీ నేను చేరుకొన్నది ఆకర్షణీయమైన అలంకరణలు నిండిన వెనక తలుపు దగ్గరకి. పైగా అది శుభ్రంగా మూసివేసి ఉంది!

నాలుగయిదుసార్లు గట్టిగా తలుపు తట్టాక ఓ నవయువకుడు తలుపు తెరిచాడు. నన్ను లోపలికి రానిచ్చాడు. ఆ రియాద్ ప్రాంగణం ఎంతో అందంగా ఉంది. తెలుపూ నలుపుల జలీజ్ పలకలతో ఎంతో చక్కగా అలంకరించబడి ఉంది. ఆ కుర్రాడూ నేనూ మాట్లాడుకోడానికి విభిన్న భాషల్లో కాసేపు ప్రయత్నించాం. లాభం లేకపోయింది. నేను చెప్పింది అతనికీ అతను చెప్పింది నాకూ బొత్తిగా బోధపడలేదు. అయినా మొత్తానికి నేనిలా రూము బుక్ చేసుకోడానికి వచ్చానని చెప్పగలిగాను. ‘మా బాసు మార్కెట్‌కు వెళ్ళాడు, వచ్చేదాకా మీరు ఆగాలి’ అని అతను చెప్పగలిగాడు. చేసేది లేక ఆ రియాద్ వీధి తలుపు మెట్ల దగ్గర చేరగిలబడి ఓనరుగారి రాకకోసం ఎదురు చూడసాగాను.

ఈ లోపల ఒక ఆలోచన నా మనసులో మెరిసింది. నా స్మార్ట్ ఫోన్ తీసి చూశాను. రియాద్ టింజిస్‌కు చెందిన వైఫై సిగ్నల్ ఫోన్లో పలకరించింది. పాస్‌వర్డ్ అవసరంలేని సదుపాయమది. ఈ రియాద్ టింజిస్ కోసం గూగుల్ వెదుకులాట ఆరంభించాను. ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నెన్నో సైట్లను పలకరించాల్సి వచ్చింది. అందులో ‘హోటల్.కామ్’ అన్న సైటు ఒకటి. గబగబా ఆ సైట్లో చొరబడి టకటకా మర్నాటి కోసం రూమ్ బుక్ చేసేశాను. పని అయిపోయింది కాబట్టి ఇహ ఓనరుగారి రాకకోసం నిరీక్షించాల్సిన అవసరం లేదని తేలిపోయింది.

అంతా విచిత్రంగా అనిపించింది. ఇరవయ్యేళ్ళ క్రితం చేసిన ప్రయాణాల్లో ఎప్పటికప్పుడు వసతివేటలో హోటళ్ళ చుట్టూ తిరగడం గుర్తుంది. ఇపుడా ప్రయాస ఏమీ లేకుండా నాకు నచ్చిన హోటల్లో, ఓనరుగారి ప్రమేయం లేకుండా, నాలుగు ఫోను మీటలు నొక్కి రూమ్ బుక్ చేసేసుకోగలిగాను. మళ్ళీ నాకా బుకింగ్ సాధ్యపరచిన వెబ్‌సైట్ ఏ సియాటెల్‌ లోనో హ్యూస్టన్‌ లోనో ఉండి ఉండవచ్చు. ఇదంతా మహాసౌకర్యవంతం అన్నమాట నిజమే గాని, మరి మానవ సంపర్కాల సంగతేమిటీ? ఏ ప్రణాళికా లేకుండా సాగిపోతూ, ముందు ముందు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటామో ఊహించుకొంటూ ప్రయాణించడంలో ఉన్న ఆకర్షణా సాహసస్ఫూర్తుల సంగతేమిటి? ఆధునిక సాంకేతికత అందుబాటులోకి తెస్తోన్న సౌకర్యాలూ నిశ్చింతల పుణ్యమా అని ఎల్లలులేని మునపటి ప్రయాణాల్లో ఇమిడి ఉన్న స్వేచ్ఛాసాహసాలు ఈనాటి యాత్రల్లో కొరవడుతున్నాయా అనిపించింది. ఏ పరికరాలూ కంప్యూటర్లూ వాడకుండానే ఆరోజుల్లో ఇబ్న్ బటూటా ఏళ్ళ తరబడి తాను ఎన్నడూ ఊహించని దూరతీరాలకు ప్రయాణం చేశాడు. అలాంటి ప్రయాణాల్లో ఉండే హర్షాతిరేకతా థ్రిల్లింతలూ ఈ ఆధునిక యాత్రల్లో ఎలా సాధ్యం? బహుశా ఈ కారణాల వల్లే అలాంటివారి అలనాటి ప్రయాణాలను ఈనాటికీ మనం మహాయాత్రలుగా చెప్పుకుంటున్నాం…


మెల్లగా చీకట్లు అలుముకున్నాయి. డిన్నరు వేళ అయింది. మదీనా నుంచి పట్నం వేపుగా నడక ఆరంభించాను. ఆ డచ్‍ దంపతులు చెప్పిన పాపులెయ్‍ర్ సవూ దె ప్వాసాఁ అన్న సీఫుడ్ రెస్టారెంటు కోసం వెదుకులాట ఆరంభించాను. స్థానికులూ యాత్రికులూ ఒకేరకంగా ఆ భోజనశాలను అభిమానిస్తారట. అభిమానాల సంగతి ఎలా ఉన్నా ఆ వెదుకులాటలో ఎక్కడో దారి తప్పాను. ఇరవై నిమిషాల్లో చేరవలసిన గమ్యం ఏభైనిమిషాలు నడిస్తేగానీ చేతికి చిక్కలేదు. కానీ అలా దారి తప్పడం అన్న విషయంలో నాకు ఎప్పుడూ ఎలాంటి అభ్యంతరం గాని, చింత గానీ లేనేలేవు. టాంజియర్‌లాంటి ప్రదేశాల్లో అయితే అలా దారి తప్పడం ఆశించని అనుభవాలకు రహదారి అని తెలుసు. అనుకొన్నట్టే ఆ ఏభై నిమిషాల ప్రక్రియలో నేను ఆశించని, ఊహించని కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలు నాకు తటస్థపడ్డాయి.

అప్పటిదాకా ‘ప్రార్థనల సమయం అయింది రండి’ అంటూ ప్రకటనలతో పరిసరాలను హోరెత్తిస్తోన్న ఒక బడామసీదు దారిలో కనిపించింది. దాని ముఖద్వారంలోంచి లోపలికి తొంగి చూసాను. అది దాటి మరి కాస్త ముందుకు వెళితే ఒక ఎత్తైన ప్రదేశం. అక్కడ్నుంచి స్పష్టంగా చాలాదూరం వరకూ పరచుకొని ఉన్న నగరపు దృశ్యం. ఆ గుట్ట దిగి మరికాస్త ముందుకు వెళితే మండోబియా ఉద్యానవనం-అక్కడ సేదదీరుతోన్న స్థానిక కుటుంబాలు. ఇవన్నీ నన్ను మంత్రముగ్ధుడ్ని చేశాయి. ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా వీటన్నిటినీ చూడగలగడం దారి కోల్పోయిన యాత్రికునికి మాత్రమే సాధ్యం!

అక్కడివారిని వాకబు చెయ్యగా నేను గమ్యానికి ఎంతో దగ్గరలో ఉన్నానని తెలిసింది. అయినా ఆ రెస్టారెంటు చేరుకోవడానికి మరికాస్త నడవాల్సివచ్చింది. నే వెదుకుతోన్న పాపులెయ్‍ర్ రెస్టారెంటు సముద్ర తటానికి చేరే ఒక ఇరుకాటి సందులో అల్ మింజా అనే హోటలు వెనుక ఉంది. అక్కడ్నుంచి సముద్రము, హార్బరూ కనిపించాయి. సులభమార్గం కోసం తాపత్రయపడకుండా తిరుగాడినందుకు నాకు సంతోషమే కలిగింది. అక్కడి వెయిటర్ నన్నో టేబులు దగ్గర కూర్చోపెడుతూ, ‘ఇది కోవిడ్ సమయం కాబట్టి పాశ్చాత్యదేశాల యాత్రికుల జాడలేదు’ అన్నాడు. మామూలు రోజుల్లో అయితే రిజర్వేషను లేకుండా అక్కడ స్థానం సంపాదించడం అసాధ్యం అన్నమాట.

ఆ రెస్టారెంట్లో మెనూకార్డు, దాంట్లోంచి మనం పదార్థాలను ఎంపిక చేసుకోవడం అన్న పద్ధతి లేదు. పంచభక్ష్యాలలో కూడిన ఒకేరకం మృష్టాన్న భోజనం కష్టమర్లందరికీ అందిస్తారక్కడ. ఊరబెట్టిన ఆలివ్ పళ్ళు, పచ్చిమిరప పచ్చడితోపాటు అందించే రకరకాల బ్రెడ్లూ అక్కడి మొదటి కోర్సు. ఆ తర్వాత చేపల సూపు. అదీ ముగిశాక రకరకాల ఫిష్ కబాబ్‌లు. ఇహ అక్కడితో ఆ భోజన కార్యక్రమం ముగుస్తుందనుకొన్నాను. కాదట. మెయిన్ కోర్స్ ఇంకా ముందుందట. నిప్పులపై కాల్చిన జాన్ డోరీ చేప ఒకదానిని ముక్కలు చెయ్యకుండా ఏకఖండంగా వడ్డించారు. మత్స్యహార ప్రియులకు అది అసలు సిసలు విందు భోజనమే! నేనూ ఒక మత్స్యప్రియుడినే అవడం వల్ల అలాంటి అపురూపమైన విందును అందుకోవడం గొప్ప సంతోషం కలిగించింది. ఆ విందు అక్కడితో ఆగలేదు. చివర్లో డిౙర్ట్ వచ్చింది. వేయించిన బాదంగింజలు, వాల్‌నట్లూ తేనెలో పుష్కలంగా వేసి రంగరించిన పదార్థమది. వీటన్నిటి మధ్య ఒక పెద్ద గ్లాసులో ఎడతెగకుండా ప్రవహిస్తోన్న పళ్ళరసపు కాక్‌టెయిల్. మనం తాగిన కొద్దీ వాళ్ళు పోస్తూనే పోతారు. ఖాళీని నింపుతూనే పోతారు. పద్ధతి అర్థమయింది. ఇక చాలు అనిపించినపుడు గ్లాసును ఖాళీ చెయ్యడం ఆపేశాను. ఆ నిండు గ్లాసు అలా నన్ను చూస్తూ ఉండిపోయింది.

అదో సుదీర్ఘ ప్రయాణ ఘడియ. ఉదయమెప్పుడో ఫెజ్ నగరంలో బయలుదేరిన వాడిని టెటువాన్ నగరాన్ని చూసుకొని సాయం సమయానికి టాంజీర్‍ చేరాను. మళ్ళీ సాయంత్రమంతా టాంజీర్‍ శోధన. భోజనం ముగిశాక మెలమెల్లగా సాగుతూ మా హోటలు చేరుకున్నాను. పక్కమీద వాలి రాబోయే రోజు గురించి కలలు కనడం మొదలెట్టాను. నా అభిమాన యాత్రికుడు ఇబ్న్ బటూటాను కలిసే రోజు కదా!


హోటల్ రెమ్‌బ్రాంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ ముగించి, హోటల్‌కు వీడ్కోలు చెప్పాను. నా సరికొత్త నివాస స్థలం రియాద్ టింజిస్ చేరుకొన్నాను. హఫీజ్ అన్న వ్యక్తి అక్కడ నాకు స్వాగతం పలికాడు. నాకు బ్యాక్‌ప్యాక్ తప్ప మరే ఇతర లగేజ్ లేదు. ఆ బ్యాక్‌ప్యాక్‌కు కూడా హోటలు గదుల్లో చిక్కడిపోయి ఉండటం నచ్చదు. నేను ఏ క్షణాన ఎక్కడికి వెళితే అక్కడికి అది కూడా నా వీపు మీద ఎక్కి సవారీ చేస్తూ ఉంటుంది.

హఫీజ్‌ను అడిగి ఇబ్న్ బటూటా సమాధి స్థలానికి దారి కనుక్కొన్నాను. సూర్యుడు మెలమెల్లగా గగనంలోకి ఎగబాకటం మొదలెట్టాడు. అప్పటిదాకా ఆహ్లాదకరంగా తోచిన ఆ ప్రభాత సమయం క్రమక్రమంగా వేడెక్కసాగింది. నే నడుస్తోన్న దారి వెళ్ళినకొద్దీ మెలికలు తిరగసాగింది. సన్నగిల్లసాగింది. దారి తప్పాననే అనుకొన్నాను. ఒకరిద్దర్ని వాకబు చేశాక నేను సరైన దారిలోనే ఉన్నానని ధృవపడింది. అయినా ఒక దశలో ఆ దారి ఎంత సన్నగా ఉందంటే ఇద్దరు మనుషులు ఎదురు బొదురు అయినా తప్పుకోడానికి కష్టమయి పోతుందనిపించింది. పైగా అటూ ఇటూ క్రిక్కిరిసిన నివాస గృహాలు. పళ్ళ బిగువున ముందుకు సాగాను. ఒక మలుపు తిరిగీ తిరగగానే పచ్చటి పైకప్పు ఉన్న వెల్లవేసిన ఒంటిగది చిట్టి కట్టడం ఒకటి కనిపించింది. పరిసర గృహాలలో కలసిపోయి ఉందా కట్టడం. దాని గోడమీద ఇబ్న్ బటూటా యాత్రా మార్గాల చిత్రపటమొకటి అమర్చి ఉంది. అంచేత అదే నే వెదుకుతోన్న ప్రదేశం అని మరే అనుమానమూ లేకుండా నిర్థారించుకోగలిగాను.

ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉంది. కాస్త పక్కనే ఓ పెద్దావిడ నేలమీద కూర్చుని ఉంది. బహుశా తన ఇంటికి వెళుతూ మార్గాయాసం తీర్చుకోడానికి అక్కడ చేరగిలబడి ఉండాలి. ఆ ప్రదేశమంతా నాకోసమే ఎదురు చూస్తున్నట్టునిపించింది. ఒక మహాయాత్రికుడిని అతని అనంత విరామస్థలంలో కలుసుకోడానికి ఆ నిర్మానుష్య ఘడియకు మించిన తరుణం మరింకేం ఉంటుందీ?! తన తర్వాతి ఎన్నో తరాల యాత్రికులకు అపురూపమైన ప్రేరణ కలిగిస్తోన్న ఆ మహానుభావుడి సమాధి స్థలాన్ని దర్శించడమే ఆయనకు నేను అర్పించగల అసలైన నివాళి. యాత్ర అన్న దానిని ఒక జీవన విధానంగా మలచిన మహావ్యక్తి అతను.

సమాధిగది తలుపులు మూసివేసి ఉన్నాయి. ఆ విషయం నన్నేమీ నిరాశపరచలేదు. ఇబ్న్ బటూటా సమాధి స్థలం దగ్గరికి వెళ్ళడమూ అంటే నా వరకూ అది అక్కడ ఉన్న కట్టడాన్ని చూడటం కాదు; ఆ స్థలాన నిలబడి అతని మహా యాత్రలను మరోసారి జ్ఞప్తికి తెచ్చుకొని ప్రేరణ పొందే మహత్తర అవకాశం.

అక్కడ నిలబడ్డ క్షణాన నాకు భారతీయ మిత్రుడు ప్రొఫెసర్ ఆదినారాయణ గుర్తొచ్చాడు. ఆయన ఒక సమకాలీన పాదయాత్రా ప్రవీణుడు. తెలుగు భాషలో రాసిన తన యాత్రాగాథలతో అనేకమందిని ఆకట్టుకొని ప్రేరణ కలిగించిన యాత్రా చరిత్రకారుడు. మా ఇద్దరికీ ఉన్న యాత్రాభిరుచి పుణ్యమా అని ఇబ్న్ బటూటా ప్రయాణాల గురించి మేము చాలాసార్లు మాట్లాడుకొన్నాం. తన మహాయాత్రికులు అన్న పుస్తకంలో ఆయన ఇబ్న్ బటూటా గురించి విలక్షణమైన అధ్యాయం రాశారు. ఈ మధ్యే కరోనా బారినపడి దానితో ఒక మహాయుద్ధం చేసి కోలుకొంటున్నారు.

ఇబ్న్ బటూటా సమాధి స్థలం నుంచి ఆదినారాయణకు ఫోను చేసి ఆ అరుదైన ఘడియను ఆయనతో పంచుకోవాలనిపించింది. అలా చేయగలిగితే ఆయనకు గొప్ప ఉత్తేజం కలుగుతుందని తెలుసు. నెంబరు కలిపాను. విషయం తెలుసుకొని ఆయన మహదానందపడిపోయాడు. అంతకు ముందటి మా కబుర్లూ చర్చలూ గుర్తు చేసుకొన్నాడు. తిన్నగా ఇబ్న్ బటూటా సమాధి స్థలం దగ్గరికి ఫోను ద్వారా తనను చేర్చి ఆ మహావ్యక్తితో అనుసంధానించినందుకు నాకు పదే పదే కృతజ్ఞతలు చెప్పాడు. ఇబ్న్ బటూటా మార్కోపోలోల స్వస్థలాలయిన టాంజియర్, వెనిస్ నగరాలు ప్రయాణికులందరికీ తీర్థయాత్రా స్థలాలన్నాడు. నా ప్రియస్నేహితునికి అతని స్వస్థతా ప్రయాణానికి ఊతమిచ్చే అనుభవం కలిగించగలిగినందుకు నాకు సంతోషమనిపించింది.

ఫోను సంభాషణ సమయంలో నేను చూపించిన ఉత్సాహం, పొందిన ఉత్తేజం చూసి ఆ పెద్దావిడ విస్తుపోయింది. నేనూ నా భారతదేశపు స్నేహితుడూ ఆమె స్వస్థలంలో ఉన్న ఇబ్న్ బటూటా సమాధి సాక్షిగా ఒక అపురూపమైన టెలీకాన్ఫరెన్సు నిర్వహించుకుంటున్న విషయం ఆమె ఊహకు అందే అవకాశమే లేదు. అక్కడి స్థానిక కుటుంబాల నివాసగృహాల నడుమ ప్రశాతంగా నిరాడంబరంగా శతాబ్దాల తరబడి విశ్రమిస్తోన్న ఆ మహాయాత్రికుడు చిరునవ్వుతో మా మాటల్ని ఆలకిస్తున్నాడు అని చెపితే ఆమె నమ్మనే నమ్మదు.


ఇక్కడ ఇబ్న్ బటూటా జీవితం గురించి, ఆయన జీవించిన కాలమాన పరిస్థితుల గురించి, చేసిన ప్రయాణాల గురించీ కొన్ని వివరాలు చెపుతాను.

ఆధునిక రవాణా సౌకర్యాల ఆవిష్కరణలు జరగక ముందటి రోజుల్లో ఏ యాత్రికుడూ – మార్కోపోలోతో సహా – ఇబ్న్ బటూటా అంత విస్తారంగా ప్రయాణించి ఉండడు. అప్పట్లో మనిషికి తెలిసిన ప్రపంచమంతా బటూటా తిరిగి చూశాడు. దాదాపు ముప్పై ఏళ్ళపాటు 75,000 మైళ్ళు ఆయన తిరుగాడాడని చెప్పడానికి మనకు స్పష్టమయిన ఆధారాలు ఉన్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఒక మనిషి తన జీవితకాలంలో ఇంతింత దూరాలు తిరిగి రావడమన్నది ఊహాతీతం. ఆ దూరం మార్కోపోలో తిరిగిన దూరానికి మూడు రెట్లని, భూగోళపు చుట్టుకొలతతో పోల్చినా మూడు రెట్లు ఎక్కువ అనీ గ్రహిస్తే ఆయన పర్యటనా పరిధి ఎంత విస్తారమో మనకు ఒక అవగాహన కలుగుతుంది.

మొరాకోలోని టాంజియర్ నగరంలో 1304లో బెర్బర్ మూలాలు ఉన్న ఇస్లామిక్ న్యాయవాదుల కుటుంబంలో పుట్టాడాయన. ఇరవైయొక్క ఏళ్ళ వయసులో ఒక కంచరగాడిదను తోడు చేసుకొని హజ్ యాత్ర చేద్దామని మక్కా నగరానికి బయలుదేరాడు ఇబ్న్ బటూటా. ఆ యాత్ర ముగించుకొని తిన్నగా ఇంటికి తిరిగి వచ్చేసినట్లయితే ఆయన గురించి మనం ఇపుడు ఇలా చెప్పుకొనేవాళ్ళం కాదు. తన యాత్రను మక్కా దగ్గర ముగించకుండా అలా కొనసాగిస్తూ పోయాడు. ఏక బిగువున అలా ప్రయాణాలు చేసిచేసి ఇరవై ఏడేళ్ళ తర్వాత తిరిగి మొరాకో చేరాడు. ఏ ఒక్క మార్గంలోనూ రెండుసార్లు ప్రయాణం చెయ్యనే చెయ్యలేదాయన. ప్రతి ప్రయాణమూ ఒక నూతన అనుభవ మార్గం. అదీ అతని యాత్రాధోరణి!

తన ప్రయాణ పరంపరలో ఆయన మధ్యధరా సముద్ర ప్రాంతంలోని జెరూసలేమ్, డమాస్కస్, కాన్‌స్టాంటినోపుల్, బాగ్దాద్, ఇస్ఫహన్, షిరాజ్ నగరాలు సందర్శించాడు. అక్కడ్నించి మధ్య ఆసియాలోని సమర్ఖండ్ వెళ్ళాడు. ఆ తర్వాత అఫ్ఘనిస్తాన్ మీదుగా ఢిల్లీ.

ఆయన స్వయంగా ఇస్లామిక్ న్యాయనిష్ణాత. తాను వెళ్ళిన దేశాలలో చాలాచోట్ల న్యాయాధికారిగా పనిచేశాడు. భారతదేశంలో ఏడేళ్ళు గడిపాడు; అందులో ఆరేళ్ళు ఆనాటి ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కొలువులో గడిచాయి. ఢిల్లీ న్యాయశాలలో న్యాయనిర్ణేతగా పనిచేశాడు. ఒక రాజవంశీకురాలిని వివాహం చేసుకొన్నాడు. మొదట మొదట తన పదవిని, తనకు సమకూరిన కుటుంబాన్నీ చూసుకొని ఆయన ముచ్చటపడినా క్రమక్రమంగా సుల్తాన్‌గారి విపరీత ధోరణులను తట్టుకోవడం కష్టమయింది. సుల్తాన్‌గారి క్రూరత్వం అప్పటి ధోరణులతో పోల్చి చూసినా భరించరానిదనిపించింది. ప్రమాదకరం అనిపించింది. ప్రాణభయం సోకిన ఇబ్న్ బటూటా కొలువు విడిచి వెళ్ళిపోదామని కూడా ఆలోచించాడు. కానీ తాను సంతకం పెట్టిన ఒప్పందం ప్రకారం సుల్తాన్‌గారి ఆమోదముద్ర లేకుండా కొలువు విడిచి వెళ్ళే అవకాశం లేదు.

తాను పొంచి ఉందని భయపడిన ప్రమాదం ఇబ్న్ బటూటాకు ఎదురవనే అయింది. తనమీద గూడుపుఠాణీ చేస్తున్నాడన్న అనుమానంతో సుల్తానుగారు బటూటాకు పిల్లనిచ్చిన మామగారిని పట్టి బంధించి మరణశిక్ష విధించి అమలు జరిపారు. తన ప్రాణాలేమవుతాయోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాడు బటూటా. కాస్త కాలం గడిచేసరికల్లా బటూటాకు సుల్తాన్‌గారి అనుగ్రహం తిరిగి లభించింది. సుల్తాన్‌గారి ఉక్కు కౌగిలి నుంచి తప్పించుకోడానికి ఇదే మంచి సమయం అనుకొని ‘నేను హజ్ యాత్రకు వెళ్ళాలనుకొంటున్నాను. అనుమతి ఇవ్వండి’ అని అర్థించాడు. కానీ అనూహ్యంగా సుల్తాన్‌గారి వేపు నుంచి బటూటా తిరస్కరించలేనంత అపురూపమైన ప్రతిపాదన వచ్చింది; తన రాజప్రతినిధిగా చైనా చక్రవర్తి కొలువులో చేరమన్నాడు తుగ్లక్ సుల్తాన్. వెంటనే మందీమార్బలంతో చైనా దేశ నౌకాయానానికి భారతదేశపు తీరం వేపుగా సాగిపోయాడు ఇబ్న్ బటూటా. దారిలో దొంగల దోపిడీకి గురి అయ్యాడు. తన పరివారానికి దూరమయ్యాడు. అష్టకష్టాలు పడి తిరిగి తనవారిని చేరుకోగలిగాడు. మళ్ళీ దొంగలదోపిడీ… పరివారం నుంచి విడివడటం… తిరిగి చేరుకోవడం… చిట్ట చివరికి ఏదో అద్భుతం జరిగినట్టు మలబారుతీరంలో ఆయనా ఆయన పరివారమూ కలుసుకోగలిగారు. కలుసుకొని నౌకాయానం ఆరంభించే దశలో మళ్ళీ పరివారం నుంచి విడివడ్డాను. అలా విషాదరస భరితంగా సాగింది ఇబ్న్ బటూటా చైనా యాత్ర.

కొంత సమయం శ్రీలంక, మాల్దీవుల్లో గడిపాక చిట్టచివరికి సుమత్రా మీదుగా చైనా చేరుకోగలిగాడు. అక్కడ కొన్నాళ్ళు గడిపాక తిరిగి మక్కా వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో పద్నాలుగో శతాబ్దంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ప్లేగు మహమ్మారి ఆయన్ని వెంటాడింది. ఏదో అద్భుతం జరిగినట్లు ఆయన ఆ మహమ్మారి పాలబడకుండా తప్పించుకొన్నాడు. తన ప్రయాణాల్లో ఎన్నో ఉపద్రవాలు, దాడులు, దోపిడీ, వెంట్రుకవాసిలో మరణం నుంచి తప్పించుకోడాలు… అయినా అవేమీ అతని భ్రమణకాంక్షను అరికట్టలేకపోయాయి. అలా తిరిగి తిరిగి ఇరవై ఏడేళ్ళ తర్వాత తన స్వస్థలం టాంజీర్‍ చేరుకొన్నాడు. తాను చేరడానికి కొద్ది నెలల క్రితమే తల్లి మరణించిందని తెలిసింది. అప్పటికి పదిహేనేళ్ళ క్రితమే తండ్రీ పోయాడని తెలిసింది.

టాంజీర్‍ తిరిగి వచ్చాక కూడా నిలకడగా ఉండలేకపోయాడు. ఆయన యాత్రాదాహం తీరనేలేదు. ఇంకా ఇంకా యాత్రలు చెయ్యాలి అన్న సంకల్పంతో అవకాశాల కోసం వెదుకులాడాడు. స్పెయిన్ దక్షిణ భాగాన ఉన్న అండాలూసియా వెళ్ళాడు. ఆ రోజుల్లో ఆ ప్రాంతం ముస్లిమ్ ప్రభువుల పాలనలో ఉంది. ఆ యాత్ర ముగిశాక ఈసారి దక్షిణ దిశగా సాగి సహారా ఎడారిని అధిగమించి మాలి రాజ్యం చేరుకొని అక్కడి రాజు మన్యామాసాను కలుసుకొన్నాడు. ఆ రాజుగారు ఆ కాలంలో ప్రపంచమంతటా జరుగుతోన్న బంగారపు వెలికితీత కార్యక్రమాలను నియంత్రించేవాడని, అప్పటికీ ఇప్పటికీ ప్రపంచంలో నడయాడిన అత్యంత ధనిక వ్యక్తి ఆయనేననీ ప్రతీతి!

ముందే అన్నట్టు ఇబ్న్ బటూటా ఆ కాలానికి ఎరుకలో ఉన్న ముస్లిమ్ ప్రపంచమంతా తిరిగాడు. స్పెయిన్‌కు చెందిన అండాలూసియా నుంచి భారతదేశం వరకూ ప్రయాణించాడు. ఆ దారిలో తూర్పు ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్పం, సిరియా, టర్కీ, పర్షియా, ఈనాటి ఆర్మేనియా, అజర్‌బైజాన్, జార్జియా, క్రిమియా, రష్యన్ స్టెప్పీలు, మధ్య ఆసియా, శ్రీలంక, మాల్దీవులు, దక్షిణ చైనా ఆయనకు తటస్థపడ్డాయి. అరవైమంది రాజులనూ అధినేతలనూ కలిశాడు. అందులో బాగ్దాదు పాలకుడు చుగ్తాయ్ ఖాన్, రష్యన్ స్టెప్పీ అధినేత, కాన్‌స్టాంటినోపుల్ చక్రవర్తి ఉన్నారు. ఈనాటి రాజకీయ సరిహద్దుల ప్రకారం ఆయన నలభై దేశాల్లో ప్రయాణించాడు. నివసించాడు. కొన్నిచోట్ల కొన్నిసార్లు అక్కడి పాలకులూ ప్రభుత్వవర్గాలతో భుజం భుజం కలిపి మెలిగాడు. గౌరవనీరాజనాలు అందుకొన్నాడు. కొన్నికొన్నిసార్లు దారుణ ప్రమాదాలకూ దోపిడీలకూ గురి అయ్యాడు. నేలమీది బందిపోట్లు, సముద్రంలో సాగరచోరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయేవరకూ వెళ్ళి తృటిలో తప్పించుకొన్నాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడి మేధావులు, ఆధ్యాత్మికవేత్తలు, సూఫీ తత్వవేత్తల్నీ కలుసుకొన్నాడు. కాలినడక, కంచరగాడిద, గుర్రం, ఒంటె- కాదేదీ ప్రయాణానికనర్హం అన్నాడు. బల్లకట్లు, తెరచాప పడవలు, ఓడల మీద సముద్రాలు దాటాడు.

దారిలో కనీసం పది వివాహాలు చేసుకొన్నాడు. ఎంతోమంది బిడ్డలకు జన్మనిచ్చాడు. కానీ వాళ్ళంతా తర్వాత ఏమయ్యారో ఎక్కడా చెప్పలేదు. ఆయన న్యాయశాస్త్ర నిష్ణాతుడు కాబట్టి ఆనాటి నియమాల ప్రకారం వారందరికీ విడాకులు ఇచ్చి మరీ ముందుకు సాగి ఉంటాడని మనం అనుకోవచ్చు. ఇప్పటి ప్రమాణాల ప్రకారం ఆయన తన ప్రయాణాల్లో అనుసరించిన పద్ధతులు కొన్ని వివాదాస్పదం అనిపిస్తాయి. బానిసయువతుల్ని కొన్నాడు. మహిళలను ‘వస్తువు’గా పరిగణించాడు. మితిమీరిన మతధోరణి, పరమత అసహనం ప్రదర్శించాడు. మిగతా మతాల వాళ్ళందరినీ విశ్వాసరహితులు అని ఈసడించాడు. కానీ ఏ చారిత్రక పురుషుడినయినా తన కాలపు నీతి నియమాలు, సంప్రదాయాల తరాజు మీద మాత్రమే బేరీజు వెయ్యడం సమంజసమనుకొంటాను. ఏది ఏమైనా అతనిమీద నా గౌరవాభిమానాలు ఆయన ప్రయాణాలకే పరిమితం. ఆయన యాత్రాస్ఫూర్తి, సాహస ప్రవృత్తీ నిరుపమానం అన్న విషయం నిర్వివాదం.

పాశ్చాత్య దేశాలవారికి మహాయాత్రికుడు అంటే మార్కోపోలోనే! బాగా విషయ పరిజ్ఞానం ఉన్నవారికి కూడా బటూటా సంగతి తెలియనే తెలియదు! మార్కోపోలోను మించిన యాత్రికుడు పుట్టనేలేదని వారి భావన. కానీ మార్కోపోలో యాత్రలన్నీ కలిపితే బటూటా చేసిన ప్రయాణాల్లో మూడోవంతు కూడా అవవు. పైగా మార్కోపోలో ఏళ్ళ తరబడి చైనా ప్రభువు కుబ్లయ్ ఖాన్ కొలువులో కుదురుకొని ఉండిపోయాడు. ఇబ్న్ బటూటా విషయానికి వస్తే ఆయన అనేక దేశాలలో న్యాయాధీశుడుగా వ్యవహరించాడు. తుగ్లక్ కొలువులో ఏడేళ్ళపాటు నిలచి ఉండినా ఒకచోట స్థిరపడటమన్నది బటూటా తత్వం కాదు. ఒకచోట నుంచి మరొక చోటికి నిరంతరం సాగిపోతూనే ఉన్నాడు. భౌతిక సుఖసౌఖ్యాలు, తాను సంపాదించిన సిరిసంపదల లాలసా ఆయన్ని ఏనాడూ కట్టిపడేయలేదు.

అసలు ఏ వ్యక్తినయినా మహాయాత్రికుడు అని పిలవడమే అసమంజసమనుకొంటాను. వివిధ కాలాలకు చెందిన యాత్రికుల అనుభవాలు, కష్టాలూ కడగండ్లూ విభిన్నంగా ఉండటం సహజం. కానీ మార్కోపోలో, ఇబ్న్ బటూటాల విషయానికి వస్తే వాళ్ళిద్దరూ సమకాలికులు. డెబ్బైఏళ్ళ వయసులో మార్కోపోలో మరణించేటప్పటికి ఇబ్న్ బటూటా ఇరవై ఏళ్ళ నవయువకుడు. మరో ఏడాదిలో తన యాత్ర ఆరంభించబోతున్న వ్యక్తి. అయినా బటూటాకు మార్కోపోలో గురించీ అతని యాత్రల గురించీ తెలిసిన దాఖలాలు లేవు. అన్నట్టు వాళ్ళిద్దరి ప్రయాణాలలో ఒక ముఖ్యమైన తేడా ఉంది. మార్కోపోలో పాశ్చాత్యదేశాలవారికి అప్పటిదాకా ఏ మాత్రం పరిచయం లేని నిగూఢ రాజ్యం చైనాకేసి ఎంతో సాహసంతో సాగిపోయాడు. ఇబ్న్ బటూటా అప్పటికే చిరపరిచితమయిన ఇస్లామిక్ ప్రపంచంలో తన యాత్రలు సాగించాడు. అవి అటు మొరాకో దక్షిణ స్పెయిన్ నుంచి ఇటు ఆగ్నేయాషియా దాకా ఏళ్ళ తరబడి సాగాయి. ఏది ఏమైనా ఒక్క వ్యక్తినే మహా యాత్రికుడు అని పిలవాలి అని మనకు అనిపిస్త్తే నా దృష్టిలో ఇబ్న్ బటూటా ఆ విశేషణానికి అన్ని విధాలా అర్హుడు.

ఇబ్న్ బటూటా రాసిన యాత్రాగాథ పేరు రిహ్లా. ఆయన దానికి మొదట పెట్టిన పేరు ‘ప్రపంచపు వింతలూ విశేషాలు చూడాలనుకొనే ఔత్సాహికులకు ఒక బహుమతి’. దానికి ఎన్నో ఇంగ్లీషు అనువాదాలు వచ్చాయి. అందులో టిమ్ మెకింటాష్-స్మిత్ చేసిన ది ట్రావెల్స్ ఆఫ్ ఇబ్న్ బటూటా అన్నది నాకు ఇష్టమయిన అనువాదం. ఈయన అరబిక్ మాట్లాడే బ్రిటీషు మనిషి. మధ్యధరా ప్రాంతంలో ఎన్నో ఏళ్ళు నివసించాడు. ఇబ్న్ బటూటా తిరిగిన కొన్ని ప్రదేశాలలో తానూ ప్రయాణం చేశాడు. ఆ యాత్రల అనుభవాలను ట్రావెల్స్ విత్ ది టాంజరీన్ అన్న పేరిట రాశాడు. నా టాంజియర్ ప్రయాణం ముగిశాక ఈ రెండు పుస్తకాలనూ కొని చదివాను. ఏ యాత్రా ప్రేమికుడినయినా బాగా ఆకట్టుకొనే పుస్తకాలివి.

అన్నట్టు టాంజీర్‍ పట్నపు మదీనా నడిబొడ్డున ఉన్న ఆ చిన్నపాటి కట్టడం నిజంగా ఇబ్న్ బటూటా సమాధి స్థలమేనా అన్న వివాదం ఒకటి ఎప్పట్నుంచో సాగుతోంది. నా వరకూ నాకు అది అర్థంపర్థం లేని వివాదం. ఆయన ఈ నగరంలో పుట్టాడు; ఇక్కడే మరణించాడు అన్నది ఒక నిర్వివాద చారిత్రక వాస్తవం. భౌతిక ప్రతీకలకు, సమాధితో సహా శ్రుతిమించిన ప్రాముఖ్యత ఇవ్వడమెందుకూ? ఆ కట్టడాన్ని చేరుకొని ఆ ప్రేరణతో ఆయన జీవితాన్ని, యాత్రలను, అవధులు లేని యాత్రాస్ఫూర్తిని, సాహస ప్రవృత్తిని, కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి వెళ్ళాలి అన్న అతని అసురతపననూ జ్ఞప్తికి తెచ్చుకొంటే, అది చాలు గదా! ఆయనకు గమనమే గమ్యం. ఏదో లక్ష్యం చేరడానికి ఆయన ప్రయాణాలు చెయ్యలేదు. ప్రయాణమే జీవితంగా భావించిన మనిషి బటూటా. ‘ప్రయాణాలు ముందు నిన్ను అవాక్కయ్యేలా చేస్తాయి. ఆ తర్వాత కథాకారుడిగా మారుస్తాయి’ అంటాడు ఇబ్న్ బటూటా.

ఆయన గురించి పాశ్చాత్యదేశాల్లో అంతగా తెలియకపోయినా ఇస్లామిక్ ప్రపంచానికి ఆయన పేరు సుపరిచితం. టాంజీర్‍ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టారు-చక్కని నివాళి. దుబాయ్ నగరంలో ఆయన పేరు మీద ఒక అతిపెద్ద మాల్ కట్టారని ఈ మధ్యే అక్కడి స్నేహితులు చెప్పారు. చంద్రుడి మీద ఒక అతిపెద్ద బిలానికి కూడా బటూటా పేరు పెట్టారట.


బటూటా ప్రయాణాలూ జ్ఞాపకాలూ నెమరు వేసుకొంటూ అక్కడి మదీనా అవతలి కొసకేసి నా నడక కొనసాగించాను. అటు చివరన మధ్యధరా సముద్రతీరాన ఉన్న ఆ ఊరి కస్బా దగ్గరకు చేరుకోవాలన్నది నా ఆకాంక్ష. దక్షిణాన ఉన్న సహారా ఎడారి సువర్ణ సైకత శ్రేణి దగ్గర ఆరంభించిన నా ప్రయాణం హై అట్లస్, మిడిల్ అట్లస్, రిఫ్ పర్వతశ్రేణులను దాటుకొని చిట్టచివరికి మధ్యధరా సముద్ర తీరానికి చేరుతోందన్నమాట! నా ప్రయాణం గురించి తలపోస్తూ వెళ్ళి సముద్రం వైపుకు వేసి ఉన్న ఒక బెంచీ మీద తీరిగ్గా స్థిరపడ్డాను. అక్కడ్నుంచి స్పెయిన్ తీరరేఖ కనిపించసాగింది.

తిరిగి వచ్చేటప్పుడు మహమ్మద్ అన్న పెద్దమనిషి పాలనబడ్డాను. ఇంతకు ముందు ఒకసారి అతని బారినుండి తప్పించుకోగలిగాను గానీ ఈసారి దొరికిపోయాను. ఈసారి కూడా తప్పించుకొందామని నేను చేస్తోన్న ప్రయత్నం చూసి ‘నేను మిమ్మల్ని వేధించడానికి రాలేదు. చక్కని మొరాకన్ సంగీతం వినిపిద్దామని నా ప్రయత్నం’ అన్నాడు. ఆ మాట చెపుతూ ఆ పక్కనే ఉన్న రంగు రంగుల అలంకరణతో నిండిన టీ దుకాణంకేసి చూపించాడు. అక్కడ శ్రావ్యమైన ఆధ్యాత్మిక గీతాలు వాయిస్తోన్న కళాకారుడు కనిపించాడు. అతగాడు నాకో మింట్ టీ అందించి నాకోసం రెండు మూడు మొరాకన్ మెలొడీలు వాయించి వినిపించాడు.

బయట నాకోసం ఎదురు చూస్తోన్న మహమ్మద్ ‘సంగీతం నచ్చిందా?’ అని వాకబు చేశాడు. బావుందని చెప్పాను. ‘మీరు మ్యూజియంలకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇపుడు ఈ కస్బా ప్రాంతాన్ని నింపాదిగా చూసి వెళ్ళండి. ఇది బాగా చూడదగ్గ ప్రదేశం’ అని చెప్పి ఒప్పించాడు మహమ్మద్. సరేనన్నాను. జేమ్స్‌బాండ్ సినిమా స్పెక్టర్ షూటింగ్‌కు వచ్చిన బృందంవారితో సహా ఎంతోమంది ప్రముఖులకు తాను గైడ్‌గా వ్యవహరించానని ప్రవర చెప్పుకొన్నాడు. అక్కడి గృహసముదాయాల దగ్గరికి తీసుకువెళ్ళి చక్కని వెల్లవేసిన ఇళ్ళు చూపించాడు. అందులో కొన్ని ఇళ్ళు అంతర్జాతీయ ప్రముఖులకు చెందినవట. ఆ ప్రముఖుల్లో ఫ్రెంచి చిత్రకారుడు ఆన్రీ మటీజ్, హాలీవుడ్ నటుడు అంతోనియో బందారస్ కూడా ఉన్నారట. ఆ జేమ్స్‌బాండ్ సినిమా షూటింగు జరుపుకొన్న కొన్ని లొకేషన్లు చూపించాడు. అలాగే మటీజ్ చిత్రించిన కొన్ని దృశ్యాలనూ చూపించాడు. అలా నడుస్తూ నడుస్తూ బాబా కఫె ప్రాంతాలకు చేరాం. 1960ల నాటి పాప్ సంగీత బృందం రోలింగ్ స్టోన్స్‌, మరింకెందరో విఖ్యాత వ్యక్తులూ ఆ కఫేలో చేరి సేదదీరేవారట.

మా నడక పూర్తయ్యాక కాసేపు బేరసారాల పెనుగులాట సాగించి ముగించి మహమ్మద్‌కు బాగానే ముట్టచెప్పి పంపించాను. ఆ కాసేపట్లోనే నాకు అక్కడి పద్ధతి బాగా బోధపడింది: ముందు వారివారి సేవలు పొందాలి. పొంది, చివర్లో రుసుము విషయంలో బేరసారాలు మొదలెట్టాలి. మొదలెట్టి పెనుగులాట కొనసాగించాలి. కొనసాగించి ఒక అంగీకారానికి రావాలి. అదీ అక్కడి పద్ధతి! మహమ్మద్‌ను పంపించేశాక కూడా కాసేపు అక్కడే తిరుగాడి, తిరిగి మా రియాద్ టింజిస్‌కేసి కాలుసారించాను.

ఆరోజు బాగా ఎండగా ఉంది. ఆ మలిమధ్యాహ్నపు వేడి భరించరానంతగా ఉంది. అప్పటిదాకా ఎండలో నడిచీ నడిచీ అలసిపోయి ఉన్నాను. ఒక చిన్నకునుకు తీయడం అత్యవసరం అనిపించింది. మా రియాద్‌లో ఆ పని ముగించాను.


ఆ సాయంత్రం పెందరాళే రియాద్ నుంచి బయటపడి మళ్ళీ కస్బాకేసి సుదీర్ఘ యానం సాగించాను. కోటను దాటి, గృహసముదాయాలు దాటి, సముద్రతీరం చేరుకొన్నాను. ఆ ప్రాంతంలో రెండువేల సంవత్సరాల నాటి ఫినీషియన్ సమాధులు ఉన్నాయి. అవి దాటుకొని స్థానికులంతా కూడి ఉల్లాసంగా గడుపుతోన్న సముద్రతీరం చేరుకొన్నాను. వాళ్ళంతా అక్కడి రాతిబండల మీద చేరి సముద్రం మీంచి వీస్తోన్న మందపవనాల సాయంతో ఆ సుందరసాగర దృశ్యాలను ఆస్వాదిస్తున్నారు.

ఉన్నట్టుండి మళ్ళా మహమ్మద్ నా వెనుకనుంచి ఊడిపడ్డాడు. అడగా పెట్టకుండా టకటకా అక్కడ్నించి ఆవలి తీరాన కనిపిస్తోన్న స్పానిష్ భూభాగపు విభిన్న ప్రాంతాల వివరాలు సరఫరా చెయ్యసాగాడు. ఆ వివరణ పూర్తయ్యాక తన పిల్లల్లో ఒకరికి ఆ మధ్యాహ్నం ఎముక విరిగిందనీ దానికి కట్టుకట్టించడానికి, మందులకూ డబ్బు కావాలనీ అడిగాడు. నేను తనతో మందుల షాపుకు వెళ్ళి అవసరమైన మందులు కొనిపెట్టడం గాని, లేని పక్షంలో అందుకు తనకు ఏభై దిర్హమ్‌లు ఇవ్వడం గానీ చెయ్యమని ప్రాధేయపడ్డాడు. అదంతా నిజమో కట్టుకథో ఆ దేవుడికే తెలియాలి. చెప్పిన తీరు మాత్రం నమ్మశక్యంగా ఉంది. అతగాడడిగిన డబ్బులు ఇచ్చి, వాళ్ళబ్బాయి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాని చెపుతూ అతనికి వీడ్కోలు చెప్పాను.

వెళుతూ వెళుతూ కఫే హైఫా వెళ్ళే దారి చెప్పి వెళ్ళాడు మహమ్మద్. మధ్యధరా సముద్రపుటొడ్డున ఒక కొండచరియలో ఉందా కఫే. అక్కడ్నుంచి స్పెయిన్ తీరరేఖ చక్కగా కనిపిస్తోంది. ఆ కఫె అంతస్తులు అంతస్తులుగా విస్తరించి ఉంది. ప్రతి అంతస్తులోనూ సముద్రాన్ని చూడటానికి వీలుగా టేబుళ్ళు వేసి ఉన్నాయి. కస్టమర్లంతా మింట్ టీ సేవనంలో నిమగ్నులై కనిపించారు. నేనూ ఒకటి అడిగి తెప్పించుకున్నాను. ఒక టేబులు దగ్గరకు చేరి అక్కడ్నించి కనిపిస్తోన్న అతి సుందర సూర్యాస్తమయ దృశ్యం చూశాక మళ్ళా మదీనాకేసి సాగాను.

మా టింజిస్ రియాద్‌కు చెందిన హఫీజ్ ఇచ్చిన సలహా పాటించి ఆ ప్రాంతంలోనే ఉన్న చె హుసేన్‍ రెస్టారెంటులో డిన్నరు చేశాను. అది హఫీజ్‌కు ఎంతో ఇష్టమైన రెస్టారెంటట. చక్కని సీ ఫుడ్ దొరుకుతుందని చెప్పాడు. అనుకొన్నట్లే రుచికరమైన టజీన్ బాణీ వంటకం అందించారు: చేపలు, రొయ్యలు, స్క్విడ్లు కలగలసిన అతిచక్కని వంటకమది. మొరాకోలోకల్లా సీఫుడ్‌కు టాంజియర్ ఉత్తమ ప్రదేశమని చెప్పవచ్చు.

టాంజీర్‍ వదిలిపెట్టేలోగా నేను చూడవలసిన మరో ముఖ్యమైన ప్రదేశం ఫ్రెంచి కాన్సులేట్‌కు ఎదురుగా ఉన్న కఫే డి పారిస్. దాన్ని చూడకుండా టాంజీర్‍ వదలడం క్షమార్హం కాదు! డైలీ టెలిగ్రాఫ్‌వాళ్ళు ఎంపిక చేసిన ప్రపంచపు ఏభై ఐకానిక్ కఫేలలో ఇది కూడా ఒకటి. అది ఆరంభించి ఎనభై ఏళ్ళు దాటిందట. అప్పటికీ ఇప్పటికీ దాని రూపలావణ్యాలలో, నిసర్గ సౌందర్యాలలో ఏమాత్రం మార్పు వచ్చినట్టు లేదు. అక్కడ కనీసం కాఫీ అయినా తాగుదామని నిన్న చేసిన ప్రయత్నం ఫలించలేదు. అయినా మరోసారి ప్రయత్నిద్దామని లోపలికి వెళ్ళాను.

ఖాళీ సీటుకోసం నా వెదుకులాట మొదలెట్టాను; ఒక్కటీ కనబడలేదు. ఒంటరిగా కూర్చున్న ఒక పెద్ద మనిషి నా ఇబ్బంది గ్రహించి తన టేబుల్ పంచుకోమని పిలిచాడు. వెళ్ళాను. ఆ సరళ స్వభావి పేరు ఇబ్రహీమ్. చూడ్డానికి డెబ్బై దాటిన మనిషి అనిపించింది. ఇద్దరం కబుర్లలో పడ్డాం.

ఆయన ఓ స్థానిక వ్యాపారి. బాగా ప్రయాణాలు చేసిన మనిషి. వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ వ్యవహారాల్లో ఆయన చికాగో, లండన్ నగరాల్లో కొంతకాలం నివసించాడట. గత ఏభై ఏళ్ళుగా ఈ కఫే డి పారిస్‌కు వస్తున్నానని చెప్పాడాయన. వ్యాపార వ్యవహారాల నుంచి విరమించుకొన్న ఈ వయసులో కూడా ఇక్కడికి తరచూ వచ్చి ఏకాంత సమయం గడుపుతూ ఉంటాడట. ‘నా దినచర్యలో విడదీయరాని భాగమయిపోయిందీ పని’ అన్నాడాయన. వాళ్ళ నాన్న కూడా అలాగే వచ్చేవారట; వాళ్ళిద్దరూ కలిసి కూడా వచ్చేవారట.

మా సంభాషణ ఇబ్న్ బటూటావేపు మళ్ళింది. ‘మాకు ఆయనంటే గౌరవం. మా ఊరికి చెందినవాడని కాస్తంత గర్వం. ఇంకా మీలాంటి దేశదేశాల యాత్రాభిలాషుల్ని తన దగ్గరికి రప్పించుకొంటున్నాడంటే నాకెంతో సంతోషంగా ఉంది’ అన్నాడాయన. టాంజీర్‍ నగరపు ఆకర్షణ శక్తికి బటూటాతోపాటు మరో ముఖ్యకారణమూ ఉందన్నాడు ఇబ్రహీమ్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ వ్యతిరేక భావాలు ఉన్న రచయితలూ కళాకారులూ, అమెరికాకు చెందిన బీట్ జనరేషన్ వాళ్ళూ ఈ నగరానికి వచ్చి నివసించి ఉండటం యాత్రికులను ఆకర్షించే ఆ రెండో కారణం.

1920-60ల మధ్యకాలం టాంజీర్‍ నగరపు చరిత్రలో సంధికాలం-అంతర్జాతీయ సంధికాలం-అని వివరించాడు ఇబ్రహీమ్. ఆ కాలంలో సుల్తాన్ పాలకుడిగా ఉన్నమాట నిజమే అయినా ఆయన నామమాత్రపు పాలకుడట. రాజ్యాధికారం ఆరు పాశ్చాత్య దేశాల సమాఖ్య చేతుల్లో ఉండేదట. అందులో బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ ముఖ్యమయినవి.

ఆ సంధికాలంలో దేశదేశాల అసమ్మతివాదులకు, సంప్రదాయ విరోధులకూ టాంజీర్‍ నగరం కేంద్ర బిందువు అయింది. వాళ్ళ వాళ్ళ దేశాల్లో ఇమడలేనివాళ్ళు, వాళ్ళను భరించడం వారివారి దేశాలకు దుస్సాధ్యమయినవాళ్ళూ టాంజియర్ నగరానికి వరదలా వచ్చి చేరారు. వాళ్ళల్లో ప్రముఖ అమెరికన్ రచయిత పాల్ బౌవెల్స్ ఒకరు. పాశ్చాత్యదేశాల నుంచి వేలాదిమంది వచ్చి చేరడంతో టాంజీర్‍ నగరపు మౌలిక స్వభావంలో గణనీయమైన పరిణామం సంభవించింది. అనేక జాతులకూ, విభిన్న సంస్కృతులకూ నమ్మకాలకూ నిలయమైన అంతర్జాతీయ నగరంగా టాంజీర్‍ రూపొందింది. మిగతా మొరాకో నగరాలకు భిన్నంగా, ఇప్పటికీ టాంజీర్‍ నగరపు పౌరులలో నలభై శాతం ఇస్లామ్‌కు చెందనివాళ్ళే.

యుద్ధానంతర కాలంలో అనేకానేక అమెరికన్ రచయితలకు, కవులకూ టాంజియర్ నివాస స్థానమయింది. ఏ ఆంక్షలూ హద్దులూ లేని వ్యవస్థ, ఉత్ప్రేరక ద్రవ్యాల అందుబాటూ కలగలసి ఒకటిన్నర దశాబ్దాల పాటు నగరం సృజనాత్మకతకు కేంద్ర బిందువయింది. నగరంలో స్థిరపడిన బీట్ జెనరేషన్ రచయితలు ఏ నియమ నిర్భంధాలూ లేని బొహీమియన్ జీవన సరళిని కాంక్షించారు. వారిలో ముఖ్యులు విలియమ్ బరోస్, జాక్ కెరువాక్, అలన్ గిన్స్‌బర్గ్ 1960లలో టాంజీర్‍ను తమ స్థావరంగా చేసుకొన్నారు. నేకెడ్ లంచ్ అన్న తన ప్రఖ్యాత నవలను విలియమ్ బరోస్ టాంజీర్‍లో ఉండగానే రాశాడు. హోటల్ రెమ్‌బ్రాంట్ వెనక ఉండే ఒక గుయ్యారపు హోటలు గదిలో నివసిస్తూ, ఉత్ప్రేరక ద్రవ్యాల ప్రభావంతో ఉంటూ ఆ నవల రాశాడు బరోస్. జాక్ కెరువాక్ రాసిన ఆన్ ది రోడ్ అన్న మరో విఖ్యాత నవల బీట్ కల్చర్‌కు ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. ‘ది గ్రేట్ అమెరికన్ రోడ్ ట్రిప్’ అన్న భావనకు ఒక విలక్షణ ఆకర్షణను సమకూర్చింది. ఈ నవలను కెరువాక్ అమెరికాలో ఉండగానే రాసినా ఆయన బరోస్, గిన్స్‌బర్గ్‌లతో కలసి టాంజీర్‍లో చాలాకాలం గడిపాడు.

ఇబ్రహీమ్ చెపుతోన్నదంతా నేను ఏకాగ్రతతో వింటోన్న సమయంలో ఆయన ఒక మాట అన్నాడు: “ఇదంతా నేను ఎందుకు చెపుతున్నానంటే, ఇదిగో, మనమెక్కడ కూర్చుని ఉన్నామో ఇక్కడే, బీట్ జనరేషన్‌కు చెందిన మూలపురుషులంతా గుమిగూడేవారు. మా నాన్నకు వారిలో కొంతమందితో మంచి పరిచయం ఉండేది. కలసి తేనీరు తాగుతూ ఆయన గంటల తరబడి ఆ అమెరికన్ రచయితలతో ముచ్చట్లాడుతూ గడిపేవాడు. నేను కూడా పాల్ బౌవెల్స్‌ను, ఇంకెంతో మంది రచయితలనూ ఇక్కడ కలుసుకొన్నాను.” ఇదంతా చెప్పాక ఇబ్రహీమ్ మరోమాట అన్నాడు: “మీరంతా ప్రపంచాన్ని చుడుతూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. నేనేమో ఇదిగో ఇక్కడ ఈ కఫేలో కూర్చుని ఉంటే ప్రపంచమే నా దగ్గరికి వస్తోంది. నీలాంటి ఆసక్తికరమైన వ్యక్తులు ఎందర్నో కలుస్తూ ఉంటాను. చక్కని సంభాషణలు చేస్తూ ఉంటాను.”

నేను పాల్ బౌవెల్స్ రాసిన షెల్టరింగ్ స్కై అన్న పుస్తకం ఆధారంగా బెర్నాండో బెర్టొలూచీ తీసిన సినిమా చూసాను. సినిమా చూశాక ఆ ప్రభావంతో పుస్తకం చదివాను. “పాల్ బౌవెల్స్ టాంజియర్‌ను ఎంతోమంది అమెరికన్లకు పరిచయం చేశాడు. అదలా ఉంచి ఈ నగరానికి అమెరికాతో ఎంతో కాలంగా చారిత్రక రాజకీయ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలసుకోవాలని ఉంటే ఇక్కడికి ఇరవై నిమిషాల నడక దూరంలో ఉన్న ‘అమెరికన్ లిగేషన్ మ్యూజియం’కు వెళ్ళి కాసేపు గడుపు” అన్నాడు ఇబ్రహీమ్.

మాట్లాడుకొన్నంతసేపూ కప్పులకొద్దీ మింట్ టీ తాగుతూనే ఉన్నాం. విడివడే ముందు నా స్వల్ప ప్రతిఘటనను పట్టించుకోకుండా బిల్లు ఆయనే చెల్లించాడు. నన్ను కలుసుకోవడం తనకెంతో సంతోషం కలిగిస్తోంది అన్నాడు. మర్నాడు వాళ్ళింటికి డిన్నరుకు వచ్చి ఇంట్లో వండిన మొరాకో భోజనం రుచి చూడమని ఆహ్వానించాడు. తానే వచ్చి నన్ను తోడు తీసుకొని వెళతానన్నాడు. స్థానిక ఆతిథ్యపు రుచి చూడటమంటే- అది ఒక సువర్ణ అవకాశం. అయినా మర్నాడు నాకు రాబత్ వెళ్ళే ప్లాను ఉండటం వల్ల ‘రాలేకపోతున్నాను, క్షమించ’మని అడిగాను. ఆయన తన ఫోన్‍ నెంబరు ఇచ్చి ఒకవేళ నీ ప్లానులో ఏమన్నా మార్పులు వచ్చే పక్షంలో నాకు ఫోను చేసి చెప్పమన్నాడు. అలాగే మొరాకోలో ఉన్నంత కాలం ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అవసరం పడినా సంకోచించకుండా తనకు ఫోను చేసి సాయం పొందమన్నాడు. ఇద్దరం వీడ్కోళ్ళు చెప్పుకున్నాం. నేను నా నివాసంకేసి మెల్లగా నడుస్తూ కఫే డి పారిస్ మానవాళి మీద చూపించే మంత్ర ముగ్ధత గురించి ఆలోచించసాగాను. మనుషుల్ని దగ్గర చేసి, మాట్లాడుకొనేలా చేసి, భావాలు పంచుకొనేలా చేసి, ఒకరి నుంచి ఒకరు విషయ పరిజ్ఞానం పొందేలా చేసే శక్తి ఇలాంటి ప్రదేశాలకు ఉంటుంది!

(సశేషం)