గుంటూరు నుంచి చిలకలూరిపేట వేపు పదహారో నెంబరు జాతీయ రహదారి మీద పదహారు కిలోమీటర్లు వెళితే చౌడవరం అన్న ఊరు వస్తుంది. రహదారి నుండి కుడి వైపుకు మళ్ళి మరో కిలోమీటరు వెళితే చేతన అన్న పిల్లలూ పువ్వులూ పక్షులతో కిలకిలలాడే నందనవనం కనిపిస్తుంది.
అప్పటికే ఇరవై ఏళ్ళనుంచీ గుంటూరు పట్నంలో బాలకుటీర్ అన్న విద్యాసంస్థను నడుపుతోన్న నిర్వాహకులు 1986లో కొండవీటి కొండల సమీపంలోని ఆ పది ఎకరాల భూమిని కొనడానికి వెళ్ళినపుడు ఆ ప్రదేశమంతా రాయిరప్పలతో నిండిన బీడుభూమి అట. అక్కడ శంకుస్థాపన చేయడానికి వచ్చిన అప్పటి రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శంకరన్‌గారు ‘దిగులు పడకండి. త్వరలోనే ఈ ప్రదేశమంతా మీ ఆశలకనుగుణంగా పిల్లలతో మొక్కలతో కళకళలాడుతుంది.’ అని ఆశీర్వదించారట.
పోయిన నవంబరులో అక్కడికి వెళ్ళిన అడవిబిడ్డ జయతి, ‘దేవమ్మ మరో ప్రపంచాన్ని సృష్టించారు. ఆ ప్రపంచం సహజంగానే పిల్లలతోపాటు చెట్లకూ, పిట్టలకూ, సీతాకోక చిలుకలకూ ఆనంద నిలయం అయింది.’ అని అంటారు.
బీడుభూమి ఆనందనిలయంగా మారడం వెనక శంకరన్‌గారి ఆశీర్వాదంతో పాటు ఓ ఎనభై ఏళ్ళ పసిమనిషి పిపాస, నిరంతర కృషీ ఉన్నాయి. లతలూ పొదలూ వృక్షాలతో ఆమె సాగించిన పాతికేళ్ళ ప్రేమ కథ ఇది.
అన్నట్టు జయతి చెప్పిన దేవమ్మ పూర్తిపేరు మంగాదేవి. ఆమె తన పాతికేళ్ళ ప్రేమ కథను చెప్పుకొచ్చిన పుస్తకం పేరు పచ్చబంగారులోకం.
‘ఎక్కడ ఏ కాస్త పచ్చదనం కనిపించినా కాళ్ళు నేలకూ, కళ్ళు చెట్ల కొమ్మలకూ అతుక్కుపోతాయి.’ అనే మంగాదేవి 1991లో–స్థలాన్ని కొన్న ఐదేళ్ళ తర్వాత–చౌడవరం లోని స్థలం దగ్గరకు వెళ్ళినపుడు అది ఇందాకే చెప్పుకొన్నట్టు ఓ బీడుభూమి. నీటి వసతి లేని బంజరు భూమి. చవిటి నేల.
పిల్లలూ మొక్కలూ ఒక్కటే మంగాదేవికి. పిల్లల్ని చేతనలో చేర్చడం కోసం ఆ కొండల మధ్య ఉన్న పల్లెల్లో కాలికి బలపం కట్టుకొని తిరిగారు. అక్కడి ఊళ్ళవాళ్ళ తిరస్కారాలను లెక్కచెయ్యలేదు. పిల్లల్ని చేర్చారు. కొత్త బంగారులోకం సృష్టించారు. పిల్లలకు రెక్కలు అమర్చారు. శక్తిసామర్థ్యాలతో ఆ పిల్లలు అన్ని దిక్కుల్లోనూ వ్యాపించడం గురించి సంతృప్తిగా చెపుతారు.
కానీ చెట్ల సంగతి వేరు. వాటి విషయంలో ఇది తారుమారు అవుతుంది.
ఉడతను పెంచాను – పారిపోయింది.
చిలుకను పెంచాను – ఎగిరిపోయింది.
చెట్లను పెంచాను – ఆ రెండూ వచ్చి చేరాయి.
ఈ రహస్యం మంగాదేవికి తెలుసు. అందుకే చేతనను వందలాది పక్షులకూ చిరు జంతువులకూ సురక్షిత నిలయంగా మలచగలిగారు. వాటితోపాటు ఎక్కడెక్కడినుంచో ప్రకృతి ప్రేమికులు వచ్చి చేరే అపురూప ప్రదేశంగా తీర్చిదిద్దగలిగారు.
మొక్కలున్నాయని తెలిస్తే ఎంత దూరమయినా వెళ్ళగలరు మంగాదేవి. తాడేపల్లిగూడెం సమీపంలోని ఇటుకలబట్టి అన్న ఊళ్ళో ఉండే సుందరరామరాజుగారి ఇల్లు ఆమెకు పదేపదే దర్శించుకొనే తీర్థయాత్రాస్థలం. రాజమండ్రి శివార్లలోని కడియం నర్సరీలే ఆమె దర్శించుకొనే గుళ్ళూ గోపురాలూ. ఎక్కడ ఏ కొత్త మొక్క కనిపించినా, దాని గురించి ఏ సమాచారం వినిపించినా, అది చేతనకు రావలసిందే అన్న సంకల్పం మంగాదేవిది. ‘ఏ నిధి ఎక్కడ దొరుకుతుందో… దొరికినపుడే తవ్వి తెచ్చుకోవాలిగదా!’ అంటూ అనునిత్యం కారు డిక్కీలో పలుగూ పారా కట్టరూ పెట్టుకొని తిరిగే విచిత్ర వ్యక్తి ఆమె. ‘అరుదైన మొక్కల్ని సేకరించేటపుడు రెండు మూడు శాల్తీలనయినా తెచ్చుకొని తీరాలి. ఒక్కటే తీసుకురావడం చాలా రిస్కు. అది కొత్త ప్రదేశంలో ఎంతవరకూ బతికి బట్టగలుగుతుందో తెలియదుగదా?’ అంటారామె. మొక్కలూ చెట్లూ అంటే అంతే పిపాస ఉన్న మరుద్వతి, అపురూపమైన మొక్కల్ని బతికించడంలో సిద్ధహస్తుడైన తోటమాలి సింగయ్య, ఆమెకు నమ్మకమైన సహచరులు.
తాను సేకరించిన మొక్కలను బతికించడంలో తీసుకొన్న జాగ్రత్తలు, బతికాక ఎదిగేదాకా సాకటంలోని మెళకువలు, వాటితో పెంచుకొన్న అనుబంధాలు, అవి ఆకు వేసినపుడూ, పువ్వు పూసినపుడూ కలిగే ఆనంద హేల, మొక్క మొక్కకూ వెనుక ఉన్న ఒక్కో కథ; బెంగళూరు నుంచి తెచ్చిన ఓ మొక్క పదేళ్ళ తర్వాత పుష్పించి ఫలిస్తే ఆ చెట్టు పేరు గుర్తు లేక, తెలుసుకోవాలని ఆరాటపడి, ఆ చెట్టు ఫోటో పట్టుకొని కడియంలోని నర్సరీలన్నీ తిరిగిన వైనం; తాము సేకరించిన ఓ అరుదైన మొక్క నీలిరంగు పూలు పూసినపుడు ఆ సంబరాన్ని మరుద్వతి, సింగయ్య, ఫోటోగ్రాఫర్ ప్రదీప్, ఆ మొక్కనిచ్చిన దేవినేని జయశ్రీలతో పంచుకొన్న వైనం–ఇలా మొక్కలు, మనుషులు, ప్రకృతి, జీవితం కలగలిపి చెప్పుకొచ్చిన రచన పచ్చబంగారులోకం.
ఈ పుస్తకంలో చేతనలో స్థిరపడిన అరవై అయిదు రకాల చెట్ల గురించి వివరాలూ కథలూ ఉన్నాయి. ఆయా వివరాలు సాంకేతిక సమాచారానికే పరిమితం అయిన పక్షంలో ఇది ఒక రంగురంగుల పొడిపొడి వివరాల గ్రంథమే అయివుండేది. మామూలు పాఠకులకు మొక్కల గురించి ఎంత అవసరమో అంతే ప్రాథమిక సమాచారం ఇస్తూ, సమగ్ర సమాచారం అందించాలన్న ప్రలోభానికి లొంగకుండా, అనుబంధమూ ప్రేమకథల గురించి మాత్రం అవధులు పెట్టుకోకుండా వివరిస్తూ, ఒక్కో మొక్క తనకిచ్చిన సంతోషాన్ని ఎంతో ప్రతిభావంతంగా పాఠకులకు అందిస్తూ… అదిగో, అందుకే ఇది అపురూపమైన రచన అయ్యింది. ప్రకృతి పరిశీలన, మొక్కలతో తన అనుబంధము, ఏ మనిషినైనా ఎంతగా ఉన్నతీకరించగలవో తెలుసుకోవాలంటే పచ్చబంగారులోకంలో తిరుగాడవలసిందే.
అలా అని ఈ పుస్తకంలో అరుదైన అపురూపమైన చెట్లగురించి మాత్రమే ఉందీ అనుకొంటే అది పొరపాటే.
మనం అంతగా పట్టించుకోని చింతచెట్టు గురించి, చింతపువ్వుల గురించీ అతి విపులమైన కథనం ఉంది. ఆమె మనసు దోచుకొన్న నల్ల తుమ్మచెట్టు గురించి, ఆ చెట్టు ఉన్న స్థలం అమ్మకానికి వస్తే ఏమాత్రం సందేహించకుండా స్థలం కొనేయడం గురించి ఉంది. మనం తరచుగా చూసే రంగురంగుల గుల్‌మొహర్, అడవి బూరుగ, బాడ్మింటన్ బంతుల చెట్టు, పిచర్ ప్లాంట్, మోదుగ, నాగమల్లి లాంటి వృక్షాల గురించి ఆసక్తి కలిగేలా అనితర సాధ్యమైన రీతిలో చెప్తారు. అలాగే పచ్చ తురాయి, బాడిస, ఏనుగు చింత, నిద్రగన్నేరు, ఆస్ట్రేలియా తుమ్మ, ఏడాకులపాల, నీలి తురాయి, ఎడారి గులాబీ, కనక చంప లాంటి మొక్కల గురించి ఆవిడ చెపుతున్నది విన్నపుడు, ‘అరే… ఇవన్నీ మనకు ఎప్పట్నించో తెలిసిన చెట్లే కదా! ఇవన్నమాట వీటి వీటి పేర్లూ లక్షణాలూ!’ అన్న గొప్ప సంతోషం కలుగుతుంది.
మామూలు మనుషులు ఎప్పుడూ ఆయాపేర్లు వింటూనే ఉన్నా, అరుదుగా తప్ప చూడని వృక్షాలు కొన్ని ఉన్నాయి. తపసి, రుద్రాక్ష, సిందూరం, పొన్న, పొగడ, పున్నాగ, దిరిసెన(శిరీష) ఈ కోవకు చెందినవి. వాటి గురించి వివరాలు ఈ పుస్తకంలో చదివినపుడు మనకు పరిచయం లేని మన దూరపు చుట్టాలను కలుసుకొన్న అనుభూతి కలిగితీరుతుంది. అంతే కాకుండా కృష్ణుడు గోపికా వస్త్రాపహరణం పొన్నచెట్టు మీద కూర్చునే చేశాడని, వేణుగానం బృందావనంలోని పొగడ చెట్టు నీడనే సాగించాడని మంగాదేవి చెప్పే కథలు విన్నపుడు దేవమ్మనోసారి కలసి ఆమె చేతుల్ని మన చేతుల్లోకి తీసుకోవాలనిపిస్తుంది. టాంక్‌బండ్ పరిసరాల్లో ఇందిరాగాంధీ బొమ్మ-లుంబినీ పార్కుల మధ్య అనువైన ఋతువులో పసిడి పువ్వులను విరగబూసే చెట్ల పేరు టెకోమా అని తెలుసుకొన్నపుడు కలిగే సంతోషాన్ని మాటల్లో వివరించడం కష్టం.
పువ్వులుగాని పువ్వులు కాగితం పువ్వులు. బూగన్‌విలియా పువ్వులు.
వాటి గురించి ఈ పుస్తకంలో అన్నిటికన్నా పెద్ద వ్యాసం ఉంది.
అందంలో ఏ పూలకూ తీసిపోని ఈ పూలను కాగితంపూలు అని పిలవడం నాకంత బాగోలేదు. ఏం పేరు పెడితే బావుంటుందీ? అని ఫిబ్రవరి 2018లో తమ దగ్గరకు వచ్చిన ఓల్గాను అడిగారట మంగాదేవి. ఆమె సాలోచనగా కాంతిపూలు అంటే ఎలా ఉంటుందీ అన్నారట. అదే రోజున ఈ పూలకు కాంతిపూలు అని నామకరణం చేసేశాం అంటారు మంగాదేవి!
‘నీలితురాయి పూలను చూస్తే ఆకాశంలో నెమలి పింఛం విప్పారినట్లు అనిపిస్తుంది. పూల సోయగాలను చూస్తూ కూర్చోవడమే నాకు ధ్యానం. ఆకులు లేని లోటు తీర్చడానికా అన్నట్టు కొమ్మల మీద లెక్కలేనన్ని చిలుకలు, గోరింకలు, తేనెపిట్టలు!’ అని పరవశించే మంగాదేవి, తమ ప్రాంగణానికి జయతి గత నవంబరులో వచ్చినపుడు, ‘తెల్లవారే లేచి పిల్లల్ని వెంటేసుకొని తోటలో ఏయే పక్షులున్నాయో వాళ్ళకి చూపించాలి,’ అని ప్రేమతో ఆదేశించారట. ఆ పని ఎంతో ఇష్టంగా చేశారు జయతి. ఆ వివరాలను, అనుభవాలను ఈమే, పిల్లలూ రికార్డు చేసిన ముప్ఫైరెండు రకాల పక్షుల గురించీ వివరాలను జయతి ఈ పుస్తకంలోనే రాసుకొచ్చారు.’తాను పక్షులతోనూ చెట్లతోనూ మాట్లాడగలదు’ అని పరిచయం చేయబడ్డ జయతి అక్క ఆ పని ఎలా చేస్తుందోనని కుతూహలంతో గమనిస్తున్నారట పిల్లలు…
పిట్టలు పిట్టలతో మాట్లాడుతున్నట్టు తమలో తాము మాట్లాడుకొంటున్న ఆ పిల్లలకు ‘పక్షులను చూడాలంటే నిశ్శబ్దంగా ఉండాలి. నడక వేగం తగ్గించాలి. మాట్లాడటం ఆపాలి. మీరు ఉన్నా లేనట్టే ఉండాలి. రెండు క్షణాలు కళ్ళు మూసుకోవాలి. ఊపిరితిత్తులనిండా గాలి నింపుకొని వదులుతూ చుట్టూ శబ్దాలను వినాలి.’ అని మంత్రోపదేశం చేశారట జయతి. ‘ఆకులు కదులుతున్న చప్పుడు, ఆకులు రాలిన చప్పుడు, కొమ్మను వదిలి నేలకు వాలుతోన్న పువ్వుల మెత్తని శబ్దాలు వారంతా వింటున్నారు. వారిప్పుడు పక్షిలోకంలో ఉన్నారు. వాటిని వినగలరు. వాటితో మాట్లాడగలరు.’ అంటారు జయతి.
జీవితం ఇంత సరళమా?! ప్రకృతిని మనలో నింపుకోవడం ఇంత సులభమా?!
అవును. ఇంతే సరళం! ఇంతే సులభం!!
ఆ పచ్చబంగారులోకంలో ఏడాది క్రితం ప్రత్యక్షంగానూ, గత రెండురోజులుగా అక్షరాల మాధ్యమం ద్వారానూ తనివితీరా తిరుగాడి, వేళ్ళకూ మనసుకూ అంటిన పరిమళాన్నీ పూల పుప్పొడినీ పదిమందితో పంచుకోవాలని చేస్తోన్న ప్రయత్నమే ఈ వ్యాసం.
తనకోసమూ పదిమంది స్నేహితులకోసమూ పాతికేళ్ళుగా మొక్కలతో అనుబంధం ఏర్పరచుకొన్న మంగాదేవి ఆ పదిమంది కోసమే ఈ పుస్తకాన్ని ప్రచురించారు. వెల అంటూ పెట్టలేదు. షాపుల్లో దొరికే అవకాశం లేదు. కాపీల కోసం గుంటూరు శ్యామలానగర్ లోని బాలకుటీరాన్ని సంప్రదించవచ్చన్న వివరం మాత్రం పుస్తకంలో ఉంది. ఫోన్ నంబరు: 0863-2231620, 2232405.
ఒకవేళ ఎవరికైనా ఏ కారణం చేతనైనా పుస్తకం అందకపోతే చెప్పండి, నా కాపీ పంపిస్తాను.
పువ్వులయినా పుస్తకాలయినా ఒకచోట పోగుపడి ఉండటానికి కాదుగదా పుట్టిందీ… నాలుగు దిశల్లోనూ వ్యాపించి పరిమళాలు వెదజల్లడం కోసమే వాటి పుట్టుక!
జయతి రాసిన అడవి నుండి అడవికి, మంగాదేవి రాసిన పచ్చబంగారులోకం ఒకేసారి విడుదల అవడం యాదృచ్ఛికమేనా?
కాదనుకొంటాను.