ఉత్తర మొరాకో శోధనలు 1

నిమ్మగడ్డ శేషగిరి కాకినాడలో వైద్యం చదివి మానసిక వైద్యునిగా ఇంగ్లండ్‌లో పాతికేళ్ళుగా స్థిరపడిన వ్యక్తి. యాత్రలన్నా, జీవితమన్నా ఆయనకు అంతులేని పిపాస. విభిన్న ఖండాల్లోని వందకు పైగా దేశాలను ఒక యాత్రికుడిగా తిరిగిచూశారు. ఆయన విస్తారంగా పర్యటించిన దేశాల్లో ఆఫ్రికాఖండపు వాయవ్యభాగాన ఉన్న మొరాకో ముఖ్యమైనది. ఆ దేశంలో మూడు విడతలుగా నెలరోజులపాటు పర్యటించారు శేషగిరి. అందులో చివరిది 2021 అక్టోబరులో చేసిన పదహారు రోజుల యాత్ర.

ఈ యాత్రలో ఉపభాగంగా తొమ్మిది రోజులపాటు ఒంటరి యాత్రికునిగా మొరాకో ఉత్తరభాగంలోని చారిత్రక సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న చిన్నా పెద్దా పట్టణాలలో ఒక బాక్‌పాక్ వేసుకొని మూడువేల కిలోమీటర్లు తిరిగివచ్చారు శేషగిరి. తన యాత్రానుభవాలను ఆంగ్లంలో రాసి స్నేహితులతో పంచుకోవడం ఆయనకు ఎంతో ఇష్టమయిన పని.

సహయాత్రికులు శేషగిరిగారితో నాకు సామాజిక మాధ్యమాల ద్వారా గత నాలుగయిదేళ్ళుగా చక్కని పరిచయం ఉంది. ఆయన ప్రయాణాలూ వాటి గురించిన రాతలూ అంటే నాకు బోలెడు ఇష్టం. వాటిని తెలుగు పాఠకులకు చేర్చాలన్న కోరికకు కూడా మూడునాలుగేళ్ళ వయసు. ఆయన రాస్తోన్న ఉత్తర మొరాకో శోధన వివరాలు ఆ పని వెంటనే చెయ్యమని నన్ను ప్రేరేపించాయి. ఆయన అనుమతి తీసుకొని అనువాదానికి ఉపక్రమించాను. అనుమతి ఇవ్వడమేగాకుండా ఎన్నెన్నో నేపథ్యపు వివరాలనూ, ఆయా ప్రాంతాల ప్రదేశాల ఉచ్చారణా విధానాలనూ ఎంతో శ్రద్ధగా వివరించి అనువాదానికి సహకరిస్తున్నారు శేషగిరి.

ఈ మొరాకో అనుభవాలు ఈమాట పాఠకులను ఆకట్టుకోగలవన్న నమ్మకం నాకు ఉంది. – అనువాదకుడు.


1. ఫెజ్: మొరాకో సాంస్కృతిక రాజధాని

మా మిత్రబృందంతో కలసి మొరాకో దేశపు హై ఆట్లస్ (High Atlas) పర్వత శ్రేణిలోని తుబ్‌కల్ శిఖరారోహణ విజయవంతంగా ముగించాక, అదే ఊపులో దక్షిణ మొరాకో ప్రాంతపు సహారా ఎడారిలో ట్రెకింగ్‍ చేశాక ఆ జ్ఞాపకాలను మనసులో పొదవుకొని మారకేష్ నగరం చేరాను. మావాళ్ళంతా అక్కడ యు.కె. వెళ్ళే విమానం పట్టుకొన్నారు. నాకేమో మరికొన్ని రోజులు ఆ దేశంలో ఒంటరి ప్రయాణాలు చెయ్యాలన్న కోరిక… ఆ దేశపు ఉత్తరభాగమంతా శోధించాలన్న ఆకాంక్ష.

అలనాటి రాచరిక వైభవపు ప్రతీకలయిన ఫెజ్, మెకనెస్, రబాత్ నగరాలను సంస్కృతిపరంగానూ వాస్తురీతిలోనూ ఘనకీర్తి ఉన్న టాంజియర్, కాసబ్లాంకా, మౌలె ఇడ్రిస్, షెఫ్‍ సాన్, టెటువాన్ లాంటి పట్నాలను చూసిరావలన్నది నా కోరిక.

ఏ ప్రణాళికా లేకుండా స్వేచ్ఛగా యథేచ్ఛగా పదిరోజులపాటు ఆయా ప్రదేశాలలో తిరుగాడాలనుకొన్నాను. వసతి, రవాణాలాంటి ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోలేదు. ఏరోజుకారోజు గానీ, మహా అయితే ఒకరోజు ముందుగా గానీ ఆ ఏర్పాట్లు చూసుకున్నాను. బస్సులూ రైళ్ళూ లాంటి రవాణా సౌకర్యాలనే వాడదామనీ అనుకొన్నాను. ఈ ప్రదేశాలన్నిటిలోనూ నేను తప్పక చూడాలని ఎప్పట్నించో అనుకొంటున్నది ఒకే ఒక్కటి – మహాయాత్రికుడు ఇబ్న్ బటూటా శాశ్వతంగా విశ్రాంతి తీసుకొంటున్న టాంజియర్ పట్టణం.

మారకేష్‌లో బయల్దేరి మొరాకో దేశపు ఉత్తరభాగమంతా ఒక చుట్టుచుట్టి తిరిగి మారకేష్ చేరాలన్నది నా భావన. గడియారమార్గంలో ముందుగా కాసబ్లాంకా వేపుగా వెళ్ళి చివరికి ఫెజ్ నగరం చేరాలా లేకపోతే దానికి వ్యతిరేక దిశలో ముందు ఫెజ్‌తో నా ప్రయాణం మొదలెట్టాలా అన్న మీమాంస. ఫెజ్ అంటే ఎంతో చరిత్రగలిగిన పురాతన నగరం. గతకాలపు రవాణా వ్యవస్థతో మహా నింపాదిగా సాగిపోయే నగరం. ఇటు కాసబ్లాంకా చూస్తే శరవేగంతో సాగిపోయే రైళ్ళు తిరుగాడే ప్రదేశం. కాస్తంత ఆలోచించి చివరికి ఫెజ్ నగరంతోనే నా యత్ర ఆరంభించాలని నిర్ణయించుకొన్నాను. ఆ నగరం గురించి నాకు అప్పటికే తటస్థపడిన మొరాకోవాసులు ఎంతో చెప్పారు.

నేను ఎన్నుకొన్న మార్గం మిడిల్ ఆట్లస్ పర్వతశ్రేణి మీదుగా నన్ను ఫెజ్ నగరం చేరుస్తుంది. ఆ తర్వాత రిఫ్ పర్వతాలమీదుగా షెఫ్ సాన్, టెటువాన్ పట్నాలు, ఇంకా ముందుకు సాగితే మధ్యధరా సముద్రతీరపు టాంజియర్ పట్టణం. ఆ తీరరేఖ వెంబడే పశ్చిమంగా సాగితే కాసబ్లాంకా. తీరం వదిలి మళ్ళా దక్షిణానికి మళ్ళితే హై ఆట్లస్ పర్వతశ్రేణి పాదచ్ఛాయలలోని మారకేష్ నగరం–అంతా కలసి మూడువేల కిలోమీటర్లు, తొమ్మిది పదిరోజులు.

ఫెజ్ అన్నపేరు వినగానే మొరాకోవాసులు పులకించిపోతారు. అది ఆ దేశపు సాంస్కృతిక ఆధ్యాత్మిక రాజధాని. ఇటు మారకేష్ నగరం చూస్తే అది ఆధునికతకు ప్రతీక. విదేశీయాత్రికులకు ఇష్టమైన ప్రదేశం. అయినా ఫెజ్ అన్నది మహా సొగసైన నగరం అని మొరాకోవాళ్ళు భావిస్తారు. దేశంలో మూడో పెద్ద నగరమట. పదకొండు లక్షల జనాభా.

రబాత్, మారకేష్, మెకనెస్ నగరాలతోపాటు ఫెజ్ కూడా విభిన్నకాలాలలో మొరాకో రాజధానిగా ఓ వెలుగు వెలిగింది. ప్రాచీనకాలపు బెర్‌బర్ తెగల ముఖ్యకేంద్రంగా ఫెజ్ ఉనికిలోకి వచ్చింది. ఎనిమిదో దశాబ్దంలో స్పెయిన్ ప్రాంతపు అండలూషియా నుంచీ, ట్యునీషియా దేశపు కైరవాన్ నుంచీ వేలాది అరబ్బు శరణార్థులు వచ్చిచేరడంతో ఫెజ్ నగరం ఒక ప్రాముఖ్యతను సంతరించుకొంది. అప్పటికే ఆ ప్రాంతంలో తొలి ఇస్లామిక్ వంశం వేళ్ళూని ఉంది. సహజంగానే ఫెజ్ నగరం ఆ వంశపు రాజధాని అయింది.


మారకేష్ నుంచి ఉదయం తొమ్మిదీ ఏభైకి బయల్దేరే అల్ ఆట్లస్ రైలు బండిలో నా ఫెజ్ ప్రయాణం ఆరంభించాను. ఏడుగంటల ప్రయాణం, 536 కిలోమీటర్లు. కోవిడ్ వాక్సినేషన్ సర్టిఫికేట్ల డబుల్ తనిఖీ ముగిశాక మా రెండో తరగతి కంపార్టుమెంటులోకి చేరాను. ఒక నడవా లోకి తెరుచుకొనే అనేక కాబిన్ల సమూహమా రెండోతరగతి కంపార్టుమెంటు.

నేను వెళ్ళేటప్పటికే మా కాబిన్లో అయిదుగురు ప్రయాణీకులు ఉన్నారు. అందులో ఒకటి పండువయసు జంట. మరో నడివయసు దంపతులు. వారిమధ్య ఓ పొడవాటి బక్కపల్చటి మధ్యవయస్కుడు తతిమ్మావాళ్ళను కబుర్ల వెల్లువలో ముంచెత్తుతూ కనిపించాడు. నేను వెళ్ళగానే వాళ్ళంతా నాకేసి ఆశ్చర్యంగా చూశారు.

నేను అక్కడ కుదురుకోడానికి సాయపడ్డారు. నా వేషధారణ, వీపున ఉన్న బ్యాక్‌ప్యాకూ సహజంగానే వాళ్ళ కుతూహలానికి హేతువు అయ్యాయి. కిటికీ పక్కనున్న రెండు సీట్లూ ఇంకా ఖాళీగానే కనిపించాయి. అందులో ఒకదాన్ని నేను తీసుకున్నాను. మరికాస్సేపట్లో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఓ మధ్యవయసు మహిళ, జీన్సూ ఆధునికదుస్తుల్లో ఉన్న ఓ పాతికేళ్ళ యువతీ మా క్యాబిన్లో ప్రవేశించారు. ఆ పెద్దావిడ కోసం కిటికీ సీటు ఖాళీ చెయ్యవలసివచ్చింది. వాళ్ళు మాతో కలసేసరికి మా క్యాబిన్లో అంతా కలసి ఎనిమిదిమందిమి అయ్యాం. ఎదురూబొదురుగా నలుగురు నలుగురం. కాబిన్ కిక్కిరిసిపోయింది.

ఆ పాతికేళ్ళ యువతి చక్కని ఇంగ్లీషు మాట్లాడుతోంది. కలివిడిగా ఉంది. అప్పటిదాకా భాషాసమస్య వల్ల తమతమ కుతూహలాలకు కళ్ళెం వేసిన మా క్యాబిన్ సహయాత్రికులందరూ ఈ యువతిని దుబాసీగా చేసి నామీద ప్రశ్నలవర్షం కురిపించారు: ఎక్కడ్నించి వస్తున్నావ్? ఎక్కడిదాకా వెళుతున్నావ్? ఏం పని చేస్తూ ఉంటావ్? ఫెజ్ నగరానికి ఎందుకు వెళుతున్నావ్-ప్రశ్నల పరంపర. వాటన్నిటికీ సంతృప్తికరమైన సమాధానాలు పొందాక వాళ్ళు మళ్ళా తమ స్థానిక సంభాషణల్లో నిమగ్నమైపోయారు. నాకు ఏ ప్రశ్నా అడిగే అవకాశమే ఇవ్వలేదు.

మాటలు సాగాక ఆ యువతి తనపేరు షాఫియా అని, తనతోపాటు ఉన్న మధ్యవయసావిడ వాళ్ళ అమ్మ అనీ చెప్పింది. మారకేష్‌లో చుట్టాల్ని కలుసుకొని ఇపుడు సొంత ఊరు ఫెజ్ వెళుతున్నారట. ఆరుగురు తోబుట్టువుల్లో ఆమే అందరికన్నా చిన్నదట. నాన్న రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా పనిచేసి రిటయిరయ్యాడట. వాళ్ళ నాన్న తరంవాళ్ళు ఫ్రెంచిభాష అనర్గళంగా మాట్లాడేవారని, కాస్త కాస్త ఇంగ్లీషు కూడా వాళ్ళకు తెలుసునని, తన తరం వచ్చేసరికి అంతా ఫ్రెంచితోపాటు ఇంగ్లీషూ నేర్చుకుంటున్నారని, అవకాశమిస్తే ఫ్రెంచి కన్నా ఇంగ్లీషువేపే మొగ్గు చూపుతారనీ చెప్పిందాయువతి.

ఆమెకు లాజిస్టిక్స్‌లో డిగ్రీ ఉంది. ప్రస్తుతం చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తోంది. చైనాలోని జియాన్ నగరంలో లాజిస్టిక్స్‌లో ఇంగ్లీషు మీడీయంలో మాస్టర్స్ చెయ్యడానికి త్వరలో తాను వెళ్ళనున్నానని ఆమె చెపితే నాకు గొప్ప ఆశ్చర్యం కలిగింది. చైనా దేశం ఎన్నో యూనివర్సిటీ చదువుల్ని ఇంగ్లీషుభాషలో దేశవిదేశాల విద్యార్థులకు అందించగలగడం తననూ ఆశ్చర్యపరుస్తోంది అందామె. తన కోర్సులో ఆసియా నుంచీ ఆఫ్రికా నుంచీ వస్తోన్న ఎంతోమంది విద్యార్థులు చేరబోతున్నారట. అలా చైనా వెళ్ళి మాస్టర్స్ చేస్తే తనకెన్నో సరికొత్త అవకాశాలు వచ్చే సౌలభ్యం ఉంటుందని ఆమె భావన. ఆమెకు ఫ్రాన్సు వెళ్ళి చదువుకొనే అవకాశమూ ఉందట-వాళ్ళ అక్క ఒకావిడ ఆ దేశంలో స్థిరపడింది. కానీ ఆ దేశంలో మొరాకోవాళ్ళకు క్రమక్రమంగా నిరాదరణ పెరుగుతోంది కాబట్టి అక్కడికి వెళ్ళడం ఈమెకు ఇష్టం లేదట. చైనా భాష నేర్చుకోకుండానే చైనాలో చదువుకోవడమన్నది ఒక అద్భుతమైన అవకాశం అని సంబరపడుతోంది. అంతర్జాతీయ విద్యార్థులకు ఐరోపాకన్న చైనా ఆకర్షణీయంగా పరిణమిస్తోంది అని మొదటిసారి నాకు అనిపించింది. ఇతర ఎన్నో రంగాల్లో జరిగినట్టుగానే విద్యారంగంలో  కూడా చైనా దూసుకుపోయి మరికొన్ని దశాబ్దాలు గడిచేసరికి పాశ్చాత్య విశ్వవిద్యాలయాలను వెనక్కి నెట్టేస్తుందన్నమాట.

భాష అర్థం కాకపోయినా ఆ పొడవాటి మధ్యవయసు మనిషి మాటలమీద దృష్టిపెట్టాను. అందరి తరఫునా తానే గలగలా మాట్లాడేస్తున్న అతగాడి పేరు ఖాలిద్. అతని మాటల్లో క్యూబా అల్జీరియాల ప్రస్తావన దొర్లినపుడు క్యాబిన్‍లో నిరసన ధ్వనులు వినిపించాయి. షాఫియాను అడిగితే సంభాషణ పశ్చిమ సహారా ప్రాంతం గురించి సాగుతోందని వివరించింది. ఆ ప్రాంతం మా భూభాగమే అన్నది మొరాకో దేశపు వాదన. ఆ ప్రాంతంలోని ఓ సాయుధవర్గం తమకు స్వతంత్రం కావాలి అంటోంది. ఆ ప్రాంతపు ఒక చిన్న భాగం ఈ సాయుధవర్గం అధీనంలో ఉంది. ఈ విప్లవకారులకు పొరుగున ఉన్న అల్జీరియా ద్వారా క్యూబా దేశం ఆయుధాలు సరఫరా చేస్తోందని అందరికీ వివరిస్తున్నాడు ఖాలిద్. ప్రతి విషయంలోనూ మొరాకోతో కయ్యానికి కాలుదువ్వే చరిత్ర అల్జీరియాకు ఉందట. అదిగో ఆ నేపథ్యమే క్యాబిన్‌లో అపుడు వినిపించిన నిరసనధ్వనులకు మూలం. నే వెళ్ళాలనుకొనే దేశాల్లో అల్జీరియా కూడా ఉంది అని షాఫియాకు చెప్పినపుడు సహజంగానే ఆమెకు ఆ మాట రుచించలేదు. అక్కడ చూడ్డానికేం లేదు, అదేమంత మంచి ప్రదేశం కాదు, ప్రమాదకరం-అంటూ నన్ను వారించే ప్రయత్నం చేసిందామె!

ఖాలిద్ మాటలు పెద్దగా బోధపడకపోయినా అతగాడో చక్కని సంభాషణాశీలి అన్నది నిర్వివాదం. క్యాబిన్లో మిగతావాళ్ళంతా మామూలు మనుషులు. సంక్లిష్ట రాజకీయ మర్మాలు అర్థం చేసుకోవడం, వ్యాఖ్యానించడం వారిని మించిన పని. అసలు ప్రపంచమంతా ఇదే ధోరణి కాదూ? తమతమ పరిసర వ్యక్తులమీద ఖాలిద్‌లాంటి వాళ్ళ ప్రభావమే ఎక్కువ. అది సానుకూల ప్రభావమా వ్యతిరేక ప్రభావమా అన్నది విషయాన్ని చూసే దృక్కోణం మీద ఆధారపడి ఉంటుంది. ఇదిగో ఇలాంటి రైలు క్యాబిన్లలోనే ప్రపంచపు పబ్లిక్ ఒపీనియన్ రూపు దిద్దుకునేది!

ఖాలిద్ రబాత్ స్టేషన్లో బండి దిగగానే నాలుగు గంటల నుంచీ క్యాబిన్లో వెల్లివిరిసిన సందడి ఒక్కసారిగా చల్లారిపోయింది. మిగిలినవాళ్ళు కూడా తర్వాత వచ్చిన సాలె, కెనిత్రా అన్న స్టేషన్లలో బండి దిగిపోయారు. లంచ్ టైమయింది. షాఫియావాళ్ళ అమ్మ నాకు ఖర్జూరాలూ కప్‌కేక్‌లూ కాఫీ అందించింది. మర్యాద కోసం వాటిల్ని సున్నితంగా తిరస్కరించాను. పదే పదే కోరాక కాసిని డ్రైఫ్రూట్సూ కాఫీ మాత్రం తీసుకొన్నాను. ఆమె కాఫీ ఫ్లాస్కే కాకుండా ప్లాస్టిక్ కప్పులు, పేపర్ ప్లేట్లూ కూడా వెంట తీసుకువచ్చింది, అందరు మంచి అమ్మల్లానే…

ఫెజ్ నగరం చేరేలోపు రైలుబండి సిడ్ కాసిం, మెకనెస్ ఊళ్ళగుండా సాగింది. ఆ గంటసేపూ మరో ఇద్దరు స్నేహంగా మాట్లాడే యువకులు మాతోపాటు ప్రయాణించారు. బాలీవుడ్ తారల గురించి వాళ్ళ కుతూహలం నిండిన ప్రశ్నలే ప్రశ్నలు. నాకు తెలిసినంతమేర – కాలం చెల్లినవే అయినా – ఆయా వివరాలు వాళ్ళకు అందించాను.

చిరు పర్వత శ్రేణులూ ఆలివ్ తోటలూ వినెయార్డుల గుండా సాగాక, మా బండి నింపాదిగా ఫెజ్ స్టేషన్లో మమ్మల్ని దింపింది. ఆ యువతికి, వాళ్ళ అమ్మగారికీ వీడ్కోలు చెప్పేలోగా ఆ ఊళ్ళోని రెస్టారెంట్ల వివరాలు, వాటిమీద వాళ్ళ అభిప్రాయాలూ సేకరించాను.


స్టేషను బయటకు వచ్చి ఒక శిథిలావస్థలో ఉన్న టాక్సీ ఎక్కాను. చూస్తోంటే అది ఏ క్షణంలోనయినా విడివిడిభాగాలుగా ఊడిపడిపోడానికి సంసిద్ధంగా ఉన్నట్టనిపించింది. ఏదేమైనా ఆ టాక్సీ, దాంట్లో ప్రయాణించిన నేను అలాంటి ఉపద్రవం ఏమీ లేకుండా ఏకఖండంగా గమ్యం చేరుకొన్నాం.

ఆ ఊళ్ళో నేనెంచుకొన్న నివాసం- డర్‌డోర్‍ఫెజ్ -పాతపట్నంలోని మదీనా ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతాల్లో ‘మదీనా’ అంటే రక్షణ ప్రాకారాల నడుమ ఉండే పాతపట్నం అని అర్థం. అందులోకి నిర్దేశిత ద్వారాలగుండానే ప్రవేశించగలం. ఇవన్నీ ఆయా నగరాల అతి పురాతన ఆవాసకేంద్రాలు. ఎన్నో శతాబ్దాల క్రితం నెలకొన్న నివాసగృహ సముదాయాలు.

నేను ఉండే చోటుకు చేరడానికి ఒక అతి సన్నని గొందిలోంచి నడిచివెళ్ళాల్సివచ్చింది. ఒక్కసారి మా డర్‌డోర్‌‍ఫెజ్ చేరగానే నిబిడాశ్చర్యాలతో నిండిపోయాను. అతి సుందరమైన, సంప్రదాయం ఉట్టిపడే ‘రియాద్’ అది! సుందరమైన పలకలు పరచిన విశాలమైన మండువా, దానికి నాలుగువేపులా మూడు అంతస్తుల్లో మాలాంటివాళ్ళ గదులు. ఆ ఇంటి యజమాని నమీర్ నా రాకను ఆశిస్తూ కనిపించాడు. అతనికా భవనం వంశపారంపర్యమైన ఆస్తిగా వచ్చిందట. 2018లో దాన్ని టూరిస్టులకోసం బ్రెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ వసతిగా రూపొందించాడట. ఆ భవనం నిర్మించి రెండువందల సంవత్సరాలయిందట.

మొరాకో ప్రాంతపు సంస్కృతిలోకి తొంగిచూడటానికి, ఆ దేశపు స్థితిమంతులు ఎలాంటి జీవితాలు జీవించారో ప్రత్యక్షంగా తెలుసుకోడానికీ ఇలాంటి రియాద్‌ల్లో ఉండటం అత్యత్తమ మార్గం అనిపించింది. ఆ విశాలమైన మండువా ప్రాంగణంలో అతిథులకోసం చక్కని డైనింగ్ టేబులు ఏర్పాటుచేసి ఉంది. పై కప్పులేని మండువా అవడంవల్ల గాలీ వెలుతురూ ధారాళంగా ప్రసరిస్తున్నాయి. ఆ భవనపు ప్రతి అంగుళం అంగుళమూ మొరాకో పలకలు, కంటికి ఇంపైన స్టక్కో వర్క్‌తో అలంకరించబడి ఎంతో సుందరంగా కనిపించింది.

నమీరూ అతని భార్యా చక్కని ఆతిథ్యమిచ్చే మనుషులు. ఆ రియాద్ వాళ్ళిద్దరి చిన్నపాటి సుందర ప్రపంచం. ప్రపంచపు నలుమూలలనుంచీ వచ్చే అతిథులతో దాన్ని పంచుకోవడం వారికి ప్రీతిపాత్రమైన విషయం. ఫెజ్ నగరంతో స్నేహ సామరస్యాలు సాధించడంలో నమీర్ నాకు ఎంతో సాయంచేశాడు. చక్కని సలహాలూ సూచనలూ ఇచ్చాడు. సాధారణంగా చూపించే శ్రద్ధకన్నా ఎక్కువ స్నేహభావం ప్రదర్శించి క్షణాల్లో నేను వాళ్ళ ఇంటిమనిషిని అన్న భావన కలిగేలా చేశాడు. ఉదాహరణకు ఒక సాయంత్రం వేళ మేడపైకి వెళ్ళి సూర్యాస్తమయం చూడాలన్న కోరిక వ్యక్తపరిస్తే నేనా సౌందర్య వీక్షణంలో మునిగితేలే క్షణాల్లో ఒక పాత్ర నిండుగా మింట్ టీ తీసుకొని మాడంతస్తులు ఎక్కివచ్చి దాన్ని నాకు అందించాడు. ఆయన భార్య ఎంతో రుచికరమైన ఉదయపుటల్పాహారాలు అందించింది. ఒక్కమాటలో చెప్పాలంటే మా డర్‌డోర్‌ఫెజ్ సుందర సుఖవంతమైన చిన్న ప్రపంచం. అతిథుల్ని స్వంత మనుషుల్లా చూసుకొనే నమీర్ దంపతులు… నగరపు అతిగొప్ప ప్రదేశంలో ఆ వసతి ఉండటం… మళ్ళా నేను ఫెజ్ నగరమంటూ రావడం జరిగితే ఈ డర్‌డోర్‌ఫెజ్‌లోనే ఉంటానన్నది నిస్సందేహం.

ఓ కప్పు మింట్ టీ తాగుతూ నమీర్‌తో కబుర్లు ముగించాక ఊళ్ళో తిరగడానికి బయటపడ్డాను. సంధ్యాసమయపు తొలి ఘడియలవి. మింట్ టీలు తాగుతూ గలగలా కబుర్లు చెప్పుకొంటోన్న కస్టమర్లతో నిండి కళకళలాడుతోన్న కెఫేలు ఆ దారుల్లో పుష్కలంగా కనిపించాయి. వాటి అలంకరణ, అక్కడి వాతావరణం నాకు మా స్వస్థలం హైదరాబాద్‌లో కనిపించే ఇరానీ చాయ్ దుకాణాలను గుర్తుచేసింది. అలా నడుస్తూ ఉంటే ఉన్నట్టుండి రాజసం ఉట్టిపడే ఓ నీలి దర్వాజా కనిపించింది. బాబౌజులోన్ అట దానిపేరు. తళతళ మెరిసే ఆ దర్వాజా నీలి పలకలు మన దృష్టిని వెంటనే ఆకట్టుకొంటాయి. ఆ దర్వాజా ఆర్చిగుండా చూస్తే మహా బిజీగా వ్యాపారం చేసుకొంటోన్న షాపుల వరస, నీలి ఆకాశంలోకి చొచ్చుకుపోతోన్న రెండు మీనార్లూ కనిపిస్తాయి. అరేబియన్ నైట్స్ కథల పుస్తకంలోంచి వెలువడి తిన్నగా మనముందుకు నడచివచ్చిన పిక్చర్ పోస్ట్‌కార్డ్ లాంటి మనోహర దృశ్యమది.

ఆ మదీనాలోని ముఖ్య మార్గం పేరు తలహ్ కబీరా. అతి కష్టం మీద ఒక చిన్న కారు పట్టేంత సన్నని మార్గమది. ఆ పొడవాటి మార్గానికి అటూ ఇటూ సుందర పురాతన భవనాలు కిక్కిరిసి కనిపించాయి. అసౌకర్యం కలిగించని ఎత్తుపల్లాలతో సాగిపోయే మెట్టమార్గమది. ఆ భవనాల దిగువన దుకాణాలూ పై అంతస్తుల్లో నివాసగృహాలూ…

నజరీన్ అన్నది అలాంటి ఒక గృహసముదాయం. మధ్యయుగాల్లో ఆ భవనం యాత్రికుల సత్రమట. ఇపుడక్కడంతా దుకాణాలు. ఆ భవనపు విశాలమైన కేంద్ర ప్రాంగణం మధ్యయుగాలనాటి వర్తక శ్రేణుల ఒంటెలకూ గుర్రాలకూ విశ్రాంతి శిబిరమై ఉండాలి. మధ్యయుగాల్లో సహారా ఎడారిగుండా సాగే సార్థవాహుల వాణిజ్య మార్గాల్లో ఫెజ్ నగరం ఒక ముఖ్య బిందువు.

ముఖ్యమార్గానికి రెండువేపులా ఉన్న అతి సన్నని సందుల్లో మరింకెన్నో పురాతన నివాస భవనాలూ రియాద్‌లూ కనిపించాయి. అందులో కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని కొన్ని సందుల్లో మనిషి ఉనికి అన్నదే లేదు. అది కొంత సంకోచానికి కారణమయింది.

అల్లిబిల్లిగా అల్లుకుపోయిన ఆ మదీనా ఇరుకాటి సందుల్లో యాత్రికులు దారితప్పడం అన్నది సర్వసాధారణమట. ఎంత కాకలుతీరిన యాత్రికునికయినా ఆ ఇరుకుదారుల్లో ఈదులాడటం ఒక కఠిన పరీక్ష. ఎంత జాగ్రత్తపడినా దారి తప్పితీరుతాం. అలా దారి తప్పడమూ ఆనందహేతువే అన్నది వేరే విషయం. అలా దారి తప్పి అనూహ్యమైన మూలలకు చేరడం, ఒక ఊహించని విపణివీధికి చేరడం, విభిన్నమైన గృహసముదాయాలూ వృత్తికారుల ప్రాంగణాలూ కనిపించడం- అదో ఉత్తేజం. అసలక్కడి దారులు ఎంత సన్నపాటివంటే -ఆ మదీనా ప్రాంతమంతా వాహనాలు నిషిద్ధమట. ఆ నిషేధాలూ నిబంధనలూ లేకపోయినా అక్కడ కార్లు పట్టనే పట్టవన్నది వేరేమాట.

అలనాటి దుకాణాలు, ఫలహారశాలలు, ప్రార్థనాకేంద్రాలు, విభిన్న వృత్తికళాకారుల కార్యశాలలూ సందుగొందుల్లో అల్లుకుపోయి ఇంకా క్రియాశీలంగా నిలచి ఉన్న పురాతన మదీనాలకు అతిచక్కని ప్రతీక ఆ ఫెజ్ మదీనా. ఆ ప్రాంతాన్ని టూరిస్టుల అవసరాలకు అనుగుణంగా మార్చడమూ తీర్చిదిద్దటమూ అన్నది జరగనే జరగలేదు. మొరటుతనం అనిపించే ఆ గందరగోళం యాత్రికులకు మొదటమొదట ఇబ్బందిగా అనిపించవచ్చు గానీ అసలు అందమంతా ఆ స్వాభావికమైన అమరికలోనే ఉంది. మనం అరేబియన్ నైట్స్ కథల్లో చూసే అసలుసిసలు వాతావరణం అక్కడ కనిపిస్తుంది. అలా నడుస్తూ వెళితే సైలర్ సింద్‌బాదో, అలీబాబానో, అల్లాఉద్దీనో మనకు ముఖాముఖీ అయినా ఆశ్చర్యపడనవసరంలేని కాలాతీతమైన ప్రదేశమది.

మదీనా ప్రాంతంలో వీధి బేరగాళ్ళు, ఆ బేరాల్లో మోసం చేసేవాళ్ళు పుష్కలం అని నమీర్ ముందే నన్ను గట్టిగా హెచ్చరించాడు. మనమెంత అతి సాధారణమైన దుస్తులు వేసుకొని స్థానికుల్లో కలసిపోవాలని ప్రయత్నించినా వీళ్ళు తమకే ప్రత్యేకమైన నైపుణ్యంతో మన ఉనికిని ఠక్కున పసిగడతారు. వాళ్ళ బారినుంచి తప్పించుకోవడం కష్టాతికష్టం. వాళ్ళ ప్రతి ప్రయత్నానికీ గండిపడేలా ఒక్కటే సమాధానం పదేపదే చెపుతూ, వాళ్ళకు ఏమాత్రం ప్రోత్సాహం, ఉత్తేజం కలిగించకుండా, వాళ్ళు నాతో బేరాలు సాగించడం గానీ, నన్ను మురిపించి వాళ్ళు తీసుకెళదామనుకొన్న దుకాణాలకు తీసుకువెళ్ళడం గానీ చెయ్యకుండా వాళ్ళను అరికట్టగలిగాను. కానీ మళ్ళా ‘అయ్యో పాపం!’ అనిపించింది. ఈ కోవిడ్ రోజుల్లో టూరిస్టుల ధార కొడిగట్టిన సమయంలో -వాళ్ళ ఆశలు వాళ్ళవి, వాళ్ళ తాపత్రయాలు వాళ్ళవి, వాళ్ళ బతుకు పోరాటం వారిది… పోషించాల్సిన కుటుంబాలు వాళ్ళకూ ఉన్నాయి గదా!

రైల్లో షాఫియా సిఫార్సు చేసిన ప్రకారం ఫయాద్ అన్న వ్యక్తి నడిపే డర్‌హలీమ్ అన్నచోట డిన్నరు చేద్దామని నిశ్చయించుకొన్నాను. ఈ డర్ అన్నది (ఇల్లు అని అర్థం ఆ మాటకు) రియాద్‌ లాంటిదేనని, అసలా రెండు పదాలనూ అటూ ఇటూ మార్చి చెప్పుకున్నా తేడా ఉండదనీ తెలిసింది. ఈ డర్‌హలీమ్‌లో ‘ఇంట్లో వండిన వంట’ అతిథులకు అందిస్తారట. ‘బాగా ముందుగానే ఫోనుచేసి రిజర్వేషను చేయించుకో, అక్కడ ఎక్కువమంది అతిథులను స్వీకరించే సౌకర్యం లేదు’ అని షాఫియా ముందే చెప్పింది. ఆ ప్రకారం మదీనాలో నడక ఆరంభించే ముందే అక్కడికి ఫోను చేశాను. ఫయాద్ ఫోను తీశాడు. వాళ్ళ డర్‌హలీమ్ మదీనాకు ఎదుటి దిశలో ఉందని చెప్పాడు. నేనిపుడు అలా మదీనాలో తిరుగాడటానికి వెళుతున్నానని, తిరిగి తిరిగి భోజనం సమయానికి వాళ్ళ డర్‌హలీమ్‌కు చేరుకుంటాననీ చెప్పాను. అలా చెయ్యడానికి పుష్కలంగా సమయముందన్నాను. అతను నవ్వేసి ‘మా మదీనా చిక్కుదారుల్లో అది సాధ్యంగాదులే, నువు దారి తప్పడం తథ్యం’ అన్నాడు. ఆ మాటతో నాలోని యాత్రికుని అహం దెబ్బతింది. ‘అదేం కాదు, నేను బాగా అనుభవమున్న యాత్రికుడ్ని. దారితప్పడం అన్న ప్రశ్నే లేదు’ అంటూ బింకాలు పోయాను. అయినా అతగాడెంతో మర్యాదగా, అంతే గట్టిగా- ‘అదేం వద్దు, నేను వచ్చి నిన్ను తోడ్కొని వస్తాను. అంతే!’ అనేశాడు. మదీనా ఇరుకిరుకు మార్గాల్లో అడుగుపెట్టగానే ఫయాద్ మాట్లల్లోని విజ్ఞత, ప్రాక్టికాలిటీ నాకు స్పష్టమయ్యాయి. చివరికి ఆ సందుల్లో దారి తప్పనే తప్పినపుడు, ఫయాద్ అనుభవం ఎంతటి మహాయాత్రికుడైనా ఫెజ్ మదీనాలో మార్గశూన్యుడయి తీరతాడు అన్న విషయం నేర్పిందని నాకు బోధపడింది.

సరిగ్గా రాత్రి ఎనిమిదింటికి ఫయాద్ తన తెల్ల ఆడీ కారులో వచ్చి నన్ను తమ ఇంటికి తీసుకువెళ్ళాడు. కారును మదీనా చుట్టూ తిప్పి, ఆ మదీనాలోంచి బయటపడి, ఎదురుదిశలో ఉన్న తన ఇంటివేపుకు మళ్ళించాడు. ఇదంతా కాస్తంత దూరపు వ్యవహారం! ఈ ప్రయత్నంలో కాసిన్ని కిలోమీటర్లు నడిచాయి. తన కారుని మదీనా గోడలు దాటాక ఓ పక్కన పార్క్ చేసి, మరో ఘనమైన దర్వాజా గుండా పది నిమిషాలు నన్ను నడిపించి చివరికి డర్‌హలీమ్ చేర్చాడు.

ఆనాటి వంట ఫయాద్‌ సతీమణి కరీమా వండారు. తనకూ తన అత్తగారికీ చెందిన విడివిడి రెసిపీల ప్రకారం వంట వండారామె. నాకు వంటకాల్లో మూడు ఛాయిస్‌లిచ్చారు: ఒకటేమో శాకాహారపు వంటకం. మరోటి మాంసపుటిగురు – ఇది కరీమా రెసిపీ ప్రకారం వండినది. మూడోది శంకువు రూపపు మట్టికుండలో – టజీన్‌ (Tagine)అంటారు దాన్ని –  వండిన గొర్రెపిల్ల మాంసపు వంటకం. ఇది అత్తగారి రెసిపీ. నేను ఈ మూడో వంటకం ఎంచుకొన్నాను. అది గొప్ప రుచిగా ఉంది. కడుపు నింపేలానూ ఉంది. నేను రుచి చూసిన అతి ఉత్తమ మాంసాహారమది. ఆ మెయిన్ కోర్సుకు వెళ్ళేముందు చిన్న చిన్న మోతాదుల్లో అరడజను స్టార్టర్లు అందించారు. అలా ఆనాడు ఒక స్థానిక ఫెజ్ కుటుంబం తమ వంటగదిలో వండిన ఆ ప్రాంతానికి చెందిన భక్ష్యాలను ఆరగించడమన్నది ఎంతో అద్భుతమైన అనుభవం. ఆ పూట ఫయాద్ కరీమాలకు నేను ఒక్కణ్ణే అతిథిని. నాకు వడ్డిస్తూనే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటిపనులు చూసుకోసాగారు. స్వంత ఇంట్లో మృష్టాన్నం భుజించిన అనుభూతి. కడుపూ మనసూ నిండాయి. అంత చక్కని భోజనం పెట్టినందుకూ, ఒక గొప్ప అనుభవానికి కారకులయినందుకూ వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాను. అంతా అయ్యాక ఫయాద్ మళ్ళా నన్ను మదీనా చుట్టూ తిప్పి మా రియాద్ దగ్గరకు చేర్చాడు. దార్లో మాటల మధ్య తామూ నదీర్ కుటుంబమూ దగ్గరి స్నేహితులమని, తరచూ కలుసుకొంటూ ఉంటామనీ చెప్పాడు.

(సశేషం)