ఉత్తర మొరాకో శోధనలు 7

కాసాబ్లాంకా నుంచి తిరిగి మరకేష్‌కు

కాసాబ్లాంకా అన్న నగరం మొరాకో దేశంలో ఉన్నది అన్న విషయం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఆ ఊరి పేరు నిండా ఐబీరియన్‌ పరిమళమే మరి. అట్లాంటి పరిమళ వీచిక మొరాకోలో ఉండడం వింతగా అనిపిస్తుంది. పోర్చుగీసు భాషలో కాసాబ్లాంకా అంటే శ్వేత సౌధం అని అర్థమట. మొరాకో దేశమంతటిలోనూ ఐరోపా ఛాయలు ఎక్కువెక్కువగా కనిపించే నగరం కాసాబ్లాంకా. అంతేగాకుండా అది దేశంలోకెల్లా అతి పెద్ద నగరం, వాణిజ్య రాజధాని కూడానూ. అమెరికాకు న్యూయార్కు, ఇండియాకు ముంబయి, చైనాకు షాంఘై ఎలాగో మొరాకోకు కాసాబ్లాంకా అలా అన్నమాట. ఆ మాటకొస్తే ఒక్క మొరాకోకే కాదు, మొత్తం ఆఫ్రికా ఖండమంతటిలోనూ వాణిజ్యపరంగా కాసాబ్లాంకాను కొట్టే నగరమే లేదు.

ఫెజ్‌, మరాకేష్, టాంజీర్ లాంటి అలనాటి నగరాలతో పోల్చిచూస్తే కాసాబ్లాంకా పసినగరం క్రిందే లెక్క. వందేళ్ళ క్రితం, ఫ్రెంచివారి వలసపాలన దినాలలో, కాసాబ్లాంకా తనకంటూ ఒక ఉనికినీ ప్రాముఖ్యాన్నీ సాధించుకొంది. అట్లాంటిక్‌ సాగర తీరాన నిలచి, ఆ సాగరపు అవతలి ఒడ్డున ఉన్న అమెరికా ఖండాలకు యాత్రాద్వారంగా పరిణమించటంతో నగరపు ప్రాముఖ్యం గణనీయంగా పెరిగింది.

మా ఐబిస్‌ వాయేజర్స్‌ హోటలు రైల్వేస్టేషను పక్కనే ఉంది. అక్కడే ట్రామ్‌లైను కూడానూ. హోటల్లో చెక్‌ చేసి మాసిన బట్టలు, టాయిలెట్‌ కిట్టూ బ్యాక్‌‍పాక్‌ నుంచి వదిలించుకొని వెంఠనే ఊళ్ళోకి నడిచాను.

ట్రామ్‌ స్టేషన్‌ దగ్గర ఓ మంచిమనసు పెద్దమనిషి మెషిన్‌ వాడి టికెట్టు ఎలా తీసుకోవాలో ఓపిగ్గా బోధించాడు. ట్రామ్‌లైన్‌కు అటూ ఇటూ ఫ్రెంచి రోజులనాటి కలోనియల్ భవనాలు. వడివడిగా సాగిపోయే ట్రామ్‌బళ్ళు. అక్కడ బండి ఎక్కి నేషన్స్‌ యూనెస్‌ అన్న స్టేషను దగ్గర దిగాను. అదో పెద్ద రైళ్ళకూడలి ప్రదేశం. రైళ్ళకే కాకుండా నగరానికి కూడా ఆ ప్రదేశం ఆయువుపట్టు అనిపించింది. చక్కని కఫేలు ఉన్నాయి. దూరాన క్లాక్‌ టవరు, ఆపైన మదీనాలోకి స్వాగతం చెపుతూ తెలతెల్లని వంపుదిరిగిన ద్వారం. అసలా నేషన్స్‌ యూనెస్‌ కూడలి నుంచి నగరంలోని ఏ ప్రాంతానికైనా చేరుకోవచ్చు అనిపించింది.

రోజు వేడెక్కసాగింది. నాకేమో రోజంతా ఊరంతా తిరగాలని కోరిక. గబగబా తిరిగేసి మధ్యలో అలసిపోవడం ఏ మాత్రం నాకు సమ్మతం కాని విషయం. చిట్ట చివరిదాకా శక్తిని కోల్పోకుండా పొదుపుగా వాడుకోవాలి గదా! అంచేత మనసొప్పకపోయినా రెండవ హసన్‌ మసీదు ప్రాంతం చేరడానికి టాక్సీ తీసుకొందామని నిశ్చయించుకొన్నాను. టాక్సీ స్టాండు దాకా నాలుగడుగులు వేసి ఆ పని చేశాను.

అట్లాంటిక్‌ మహాసాగర తీరాన ఉన్న ఆ రెండవ హసన్‌ మసీదు కాసాబ్లాంకా నగరంలో ముఖ్యమైన ఆకర్షణ. నా మొరాకో ప్రయాణాల్లో తటస్థపడి, స్నేహితులుగా మారిపోయిన ఎంతోమంది ఆ మసీదు తప్పక చూడమని హెచ్చరించారు. అయినా అప్పటికే ఎన్నెన్నో ఘనత వహించిన మసీదుల్ని చూసిన నేను ఈ ఇరవయ్యవ శతాబ్దపు మసీదు మీద పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ వెళ్ళాక ఆ అనుభవం అపురూపం అనిపించింది.

దూరం నుంచి చూసినపుడే విభ్రమ కలిగించే కట్టడమది. దగ్గరకు వెళ్ళి అక్కడి నిర్వాహకులు ఏర్పాటు చేస్తోన్న గైడెడ్‌ టూర్‌ తీసుకున్నాను. మసీదు లోపలికి వెళ్ళి చూడడానికి ఆ టూర్‌ తీసుకోవడం తప్ప మరో మార్గం కూడా లేదు. మొరాకో దేశంలో అనునిత్యం ప్రార్థనలు జరిగే మసీదుల్లోకెల్లా ఇస్లామేతరులను లోపలికి అనుమతించే ఒకే ఒక్క మసీదు ఇది. మసీదుకు ఎంట్రీ టికెట్టు కూడా ఉంది. విదేశీయులకయితే ఏకంగా 150 దిర్హమ్‍ల వడ్డన! ఒక మసీదు చూడటానికి మరీ ఇంత రుసుమా! అని మొదట్లో అనిపించక పోలేదు. అసలిలా మసీదుల్లోకి వెళ్ళినపుడు ప్రపంచంలో ఇంకెక్కడా టికెట్టు కొన్న జ్ఞాపకం లేదు. అయితే వెళ్ళి తిరిగొచ్చాక నేను ఖర్చుపెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయింది అన్న భావన కలిగింది. గంటసేపు సాగిన గైడెడ్‌ టూర్‌ అది.

మా బృందంలో అంతా కలసి 20మందిమి ఉన్నాం. గైడ్‌ వచ్చి కలిశాడు. వచ్చి గలగలా మసీదు విశిష్టతలు ఏకరువు పెట్టాడు. వినడానికి అవి అతిశయోక్తుల్లా అనిపించినా లోపలికి వెళ్ళి మసీదు నట్టనడుమ నిలబడ్డాక అందులో అతి అంటూ ఏమీ లేదని స్పష్టమయింది. పెద్ద మసీదు, ఘనమైన మసీదు, విలాసంగా నిర్మించిన మసీదు. అదే సమయంలో కళ్ళకూ మనసుకూ ఇంపుకలిగించే మసీదు. పాలిష్‌ చేసిన గ్రానైట్‌ స్థంభాలు, వాటిమీద నిలిపిన సీడర్ చెక్కతో చేసిన పైకప్పూ నన్ను బాగా ఆకట్టుకొన్నాయి.

చతురస్రపు అడ్డుకొలత గలిగిన అక్కడి మినరెట్‌ ఎంతో పనితనంతో అలంకరించబడి ఉంది. దాని ఎత్తు ఏకంగా 210 మీటర్లని, ప్రపంచంలోకెల్లా ఎత్తయిన మినరెట్‌ అది అని వివరించాడు మాగైడ్‌. అంటే ఆ మసీదు కూడా ప్రపంచంలోకెల్లా ఎత్తైన మసీదు అయిపోతుందన్నమాట. ఆ మినరెట్‌ వల్ల మొత్తం మసీదంతా మరింత అద్భుతంగా అనిపించింది. (73 మీటర్ల ఢిల్లీ కుతుబ్‌ మీనార్‌తో పోలిస్తే ఈ మినరెట్‌ దాదాపు మూడంతల ఎత్తు! నిజంగా చెప్పుకోదగ్గ విషయం – అనువాదకుడు.) ఎత్తులూ కొలతలూ సంగతులు ఎలా ఉన్నా ఆ మసీదు ప్రాంగణంలో కనిపించే కళాకృతులు, వాస్తు విశేషాలు, వర్ణ సమ్మేళనాలూ సందర్శకుల్ని ఎంతో ఎంతో ముగ్ధుల్ని చేస్తాయనడంలో సందేహం లేదు. మొరాకో దేశవాసులంతా ఈ మసీదు విషయంలో ఎంతో సంబరం, కించిత్‌ గర్వం ప్రదర్శిస్తున్నారంటే అది సహజమే మరి.

ఆ మసీదు లోపల ఒకేసారి పాతికవేలమంది ప్రార్థనలు చేసే వీలు ఉందట. పరిసర ప్రాంగణంలో మరో ఎనభైవేల మంది పాల్గొనవచ్చట. ఫ్రాన్సుదేశపు వాస్తుశిల్పి పిన్‌సౌ ఈ మసీదుకు రూపకల్పన చేశాడట. 1993లో దీన్ని ఆవిష్కరించారట. దీని నిర్మాణానికి కోటీ ఇరవై లక్షలమంది తమంతట తామే విరాళాలు అందించారట.

మసీదు లోపలి టూర్‌ ముగిశాక పరిసర ప్రాంగణంలోకి వెళ్ళాను. వెళ్ళి అనుకోకుండా రెండు మొరాకన్‌ కుటుంబాల బృందచిత్రాలు తీసే అనధికార ఛాయాచిత్ర నిపుణుడి అవతారం ఎత్తాను! మసీదు ప్రవేశానికి టికెట్లు ఇచ్చే భవనంలోనే మొరాకన్‌ వాస్తు శిల్పరీతులను విప్పి చెప్పే అతి చక్కని మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో ఆ క్షణాన నేనొక్కణ్ణే సందర్శకుణ్ణి. మరి కొద్దిసేపట్లో రెండు మొరాకన్‌ కుటుంబాలు వారివారి పిల్లలతో సహా బిలబిలమంటూ వచ్చి చేరాయి. ఆ కుటుంబాల ఓ మగ మనిషి బోధకుని పాత్ర తీసుకుని ఎంతో శ్రద్ధగా అక్కడ ప్రదర్శనకు పెట్టిన వస్తువుల వివరాలు చెప్పడం మొదలెట్టాడు. ఆసక్తి కలిగి, ఆయన అనుమతి తీసుకుని నేనూ ఆ బృందంలో చేరిపోయాను. కాసేపటికల్లా ఆ బృందమంతటిలో ఆయన చెపుతోన్న విషయాలను మనసు పెట్టి వింటోన్నది నే ఒక్కడినే అని స్పష్టమయింది. మిగిలిన వాళ్ళంతా నిరాసక్తంగా మిగిలిపోవడమో, ఆయన చెపుతోన్న చోటు నుంచి శ్రద్ధ లేని విద్యార్థుల్లా దూరంగా తొలిగిపోవడమో జరిగింది. ఆయన అదేమీ పట్టించుకోకుండా తన వివరణలు చివరిదాకా కొనసాగించాడు; బహుశా ఆ శ్రమ ఆయన నన్ను దృష్టిలో పెట్టుకొనే తీసుకొని ఉండాలి.

ఎంతో పిపాసతో పాఠం చెపుతోన్న అధ్యాపకునికి తన పాఠాన్ని ఆకతాయి మూకల మధ్య అమిత శ్రద్ధతో వింటోన్న విద్యార్థిని చూస్తే ఎంత సంబరం కలుగుతుందో, నన్ను చూసి అలాంటి సంబరం ఆ పెద్దమనిషి మొహంలో కనిపించింది. మనం ఏదన్నా మనసు పెట్టి చెపుతున్నపుడు దాన్ని శ్రద్ధగా వింటున్న మనిషి కనపడితే సంబరపడటం అన్న లక్షణం ప్రతి మనిషికీ సహజమనుకొంటాను. కాస్త ఆలోచిస్తే యాత్రల గురించి నే ఎపుడన్నా మాట్లాడినపుడు ఆసక్తిగా వినేవాళ్ళని చూస్తే నాకూ గొప్ప సంతోషం కలుగుతుందన్న విషయం స్ఫురించింది.

నా ఆలోచనా పరంపరను పక్కన పెట్టి వెళ్ళి నన్ను ఆయనకు పరిచయం చేసుకొన్నాను. ఆయన దానికి స్పందించాడు. ఆ హకీమ్ అన్న కసబ్లాంకా పెద్దాయన భవన నిర్మాణరంగంలో పనిచేస్తున్నాడట. వాస్తుశిల్పం అతని అభిమాన విషయమట. పారిస్‌లో స్థిరపడిన ఆయన చిన్ననాటి మొరాకన్ స్నేహితుని కుటుంబానికి హసన్‌ మసీదు చూపించడానికి తీసుకువచ్చాడట.

హకీమ్‌ వివరణల పుణ్యమా అని మొరాకన్‌ వాస్తు శిల్పరీతులకు చెందిన ఒకటి రెండు విషయాలు నాకూ బోధపడ్డాయి. దాని ప్రాథమిక మూలాలు ఇస్లామిక్‌ వాస్తు శిల్పరీతులలో ఉన్నప్పటికీ దానిలో హిస్పానిక్‌, ఫ్రెంచి ప్రభావాలు కూడా ఉన్నాయి. జలీజ్‌ పలకల గురించీ జ్యామెట్రీ అమరికల గురించీ వివరించాడాయన. జలీజ్‌ అన్నది మొరాకన్‌ వాస్తు శిల్పరీతికి చెందిన నైపుణ్యరీతి అట. వివిధ వర్ణాలకు చెందిన పలకలను విభిన్న ఆకృతుల్లో ‘కత్తిరించి’ ఆ ముక్కల్ని ప్లాస్టరులో అమర్చి, నేలలనూ గోడలనూ స్థంభాలనూ ఫౌంటైన్లనూ ఇళ్ళలోపలి చిరుజలాశయాలనూ అలంకరిస్తారట. మనకు హసన్‌ మసీదులో కనిపించే ముచ్చటైన మెజాయిక్‌ పలకలు ఈ జలీజ్‌ కళలకు అతి చక్కని ప్రతీకలని వివరించాడు హకీమ్‌.

భోజనాలవేళయింది. ఊరి నడి బొడ్డున ఉన్న అల్‌మౌనియా రెస్టారెంటు బావుంటుందని సిఫార్సు చేశాడు హకీమ్‌. వెళ్ళాను. లోపలి ప్రాంగణం పచ్చని చెట్లూ లతలతో ఆహ్లాదకరంగా అనిపించింది. సొగసు దుస్తుల ఫెజ్ టోపీ వెయిటర్‌ ఒకాయన నాకు స్వాగతం పలికి చక్కని టేబులు చూపించాడు. కుస్‌కుస్‌ అన్న కసబ్లాంకా ప్రాంతపు వంటకం తెమ్మని చెప్పాను. ఏడు రకాల కూరగాయలు కలగలిసిన ఆ కుస్‌కుస్‌ వంటకం వాయువ్య ఆఫ్రికా అంతటా ప్రధానమైన ఆహారం. ప్రాథమికంగా ఆ వంటకంలో చిన్నపాటి గోధుమ సెమోలినా గ్రాన్యూల్స్‌ ఉంటాయి, వాటితోపాటు ఇపుడు ఏడు రకాల కాయగూరలు. అంతా రుచిగానే ఉంది గానీ ఆ వంటకం నా భారతీయ అభిరుచికి బాగా చప్పగా అనిపించింది. ఇదిగాదు పని అనుకొని అక్కడ అందుబాటులో ఉన్న హరిస్సా అన్న ఎండుమిరప పచ్చడి ఆ కుస్‌కుస్‌లో కలుపుకొని ఆరగించాను.

అక్కడి విపణవీధుల్లో అమ్మే సుగంధ ద్రవ్యాల జోరు చూస్తే మనం మొరాకో ఆహారం ఘాటు ఘాటుగా ఉంటుందని పొరబడతాం. మన వంటల్లానే కారం కారంగా ఉంటాయనుకొంటాం. అయినా మన వంటకాల్లో మనం వాడే మిరపకాయలూ మిరియాల తాకిడి అక్కడి వంటకాల్లో కనిపించదు. వాళ్ళు రెస్టారెంటు టేబుళ్ళ మీద మిరియాల పొడికి బదులు జీలకర్ర పొడి ఉంచుతారు. అలాగే వాళ్ళ వంటకాల్లో మనతోనూ, చైనా వంటకాలతోనూ పోలిస్తే ఉప్పు పాలు బాగా తక్కువ.

బాగా ఖరీదైన రెస్టారెంటది. తీసుకున్నది సాధారణ భోజనమే అయినా ఖర్చు 250 దిర్హమ్‍లు దాటేసింది. కానీ అక్కడి చక్కని అలంకరణ, హడావుడిలేని వాతావరణం నాకు బాగా నచ్చాయి. ఎంతైనా అది ఉన్నతస్థాయి రెస్టారెంటు గదా, ఆ ఊరి మండే మధ్యాహ్న మార్తాండుడి ప్రతాపం నుంచి నన్ను కాస్తంత కాపాడి సేదదీర్చిందిలే అని ఖర్చు విషయంలో సమాధానపడ్డాను.

భోజనం ముగించి అక్కడికి దగ్గరలోనే ఉన్న నాలుగో మహమ్మద్‌కు చెందిన రాజప్రాసాదంకేసి నింపాదిగా అడుగులు వేశాను. అంత మధ్యాహ్నం పూట కూడా అక్కడి కూడలి జీవం తొణికిసలాడుతూ కనిపించింది. ఆ విశాలమైన కూడలికి మూడువేపులా రాజసపు భవనాలు, నాలుగో పక్క చక్కని ఉద్యానవనం. ఆ ఉద్యానవనం మధ్యభాగంలో పేద్ద ఫౌంటైను. వేలాది పావురాలకు ఆహారం దొరికే చోటది. పెద్దాళ్ళూ పిల్లలూ వాటికి మేత వేసి సంబరపడుతూ కనిపించారు. ఆ సంబరాల జన సందోహాన్ని గమనిస్తూ కాసేపు గడిపానక్కడ. మూడు పక్కలా నెలకొని ఉన్న రాజసపు భవనాలు సొగసుగా చూడ ముచ్చటగా అనిపించాయి. అందులో, మఖమా డు పాషా అన్న భవనం నన్ను మరింతగా ఆకట్టుకొంది. అది ఆ నగరపు న్యాయస్థానమట. ఆ కూడలీ అక్కడి భవనాలూ వందేళ్ళ క్రితం, 1920ల నాటి ఫ్రెంచివారి వలస పాలన దినాలలో కట్టినవట. బేరియన్ శైలికి చెందిన మోరెస్క్‌ వాస్తు శిల్పరీతికి చెందిన భవనాలవి.

ఆ కూడలి దాటుకొని ఆపక్కనే ఉన్న రాబిడ్‌ స్ట్రీట్‌వైపు వెళ్ళాను. ఆ వీధి పొడవునా అటూ ఇటూ వెడల్పాటి ఆకుల గుబురు గుబురు ప్లేన్‌ వృక్షాలు కనిపించాయి. మేపుల్ వృక్షాలను గుర్తుకు తెచ్చే చెట్లవి. ఆ పక్కనే కనిపించిన అరబ్‌లీగ్‌ పార్కులోకి వెళ్ళి కాసేపు సేదదీరాను. ఆఫ్రికా ఖండపు విభిన్న ప్రాంతాల వృక్షాలను సేకరించి ఆ పార్కులో కొలువుదీర్చారు ఆ పార్కు నిర్వాహకులు. పార్కంతా పిల్లలూ వారి వారి తలిదండ్రులతో నిండుగా కనిపించింది. పార్కు పక్కనే ఏదో పునర్నిర్మాణంలో ఉన్న చర్చి తాలూకూ తెల్లని జంట గోపురాలు కనిపించాయి. పరిశీలిస్తే అది సెక్రేకర్‌ కెథెడ్రల్‌ అని బోధపడింది. ఫ్రెంచి పాలన సమయంలో ఘనచరిత్ర కలిగిన కెధెడ్రల్‌ అది.

మరికాస్త ముందుకు సాగి నాలుగో మహమ్మద్‌ ఎవెన్యూలోకి అడుగుపెట్టాను. అక్కడి నవంబర్‌ 16 కూడలిలో రెండుగంటలు గడిపాను. ఆసక్తికరం అనిపించిన ప్రతిచోటా ఆగుతూ వెళ్ళాను. ఆర్ట్‌డెకో శైలి భవనాలకు ఆ ప్రదేశం ప్రసిద్ధి. ఆ భవనాల్లో రియాల్టో సినిమా థియేటర్‌ ప్రముఖమైనది. వందేళ్ళ క్రితం నిర్మించిన ఆ సినిమా హాలు ఇప్పటికీ నిక్షేపంగా పనిచేస్తోంది.

కాసాబ్లాంకా నగరపు ట్రామ్‌బళ్ళతో నాకు బాగా చనువు ఏర్పడిపోయింది. నా ఉత్తర మొరాకో ప్రయాణాల్లో అప్పటి దాకా పురాతన మదీనాల్లోనే ఉన్నాను. అవన్నీ కాలినడకన శోధించాను. ఆ సందుగొందుల్లో నిజానికి నడక వినా మరో మార్గం లేదు. ఎపుడైనా బయటకు వెళితే అక్కడి టాక్సీలు ఎక్కాను. అవి బాగా చవక కూడానూ. కసబ్లాంకా ట్రామ్‌బళ్ళు ఎక్కడం పుణ్యమా అని ఆ దేశపు మరో రవాణా సౌకర్యపు రుచి అందుకోగలిగానన్నమాట. గత పదహారు రోజుల ప్రయాణాలు సింహావలోకనం చేసుకొంటే విమానాలు ఎక్కాను. రైళ్ళు, కార్లు, టాక్సీలు, గ్రాండ్‌ టాక్సీలు, మినీ బస్సులు, సహారా ఎడారిలో ఎడారి ఓడలు- ఇహ కాలినడక సరేసరి. మౌంట్‌ తుబ్‌కల్‌ శిఖరారోహణకు కాలి సత్తువే ఆధారబిందువు కదా! ఆ శిఖరారోహణ గురించి, సహారా ఎడారిలో చేసిన ట్రెక్కింగ్‌ గురించీ మరో వ్యాసం రాసే ఆలోచన ఉంది. అవి రెండూ ఈ ఉత్తర మొరాకో నగర శోధనలకు ముందు నే చేపట్టి ముగించిన కార్యక్రమాలు.

కాసాబ్లాంకాలో ఒక్కో ట్రామ్‌ ప్రయాణానికీ ఎనిమిది దిర్హమ్‍లు టికెట్టు. అది బాగా సౌకర్యమన్నమాటతోపాటు అలా అక్కడి స్థానికులతో కలసి మెలసి ప్రయాణాలు చేసి ఆ ఒక్కరోజుకైనా కాసాబ్లాంకా నగరపు ‘గౌరవ పౌరునిగా’ మనగలగడం నాకు మరీ ఇష్టం. అలా ఆ ట్రామ్‌బళ్ళలో తిరుగాడాను. కంటికి నదురుగా కనిపించిన చోటల్లా ఆగి పరిసరాలతో పరిచయం ఏర్పరచుకొన్నాను. చెలిమి చేశాను.

సాయంత్రమయింది. సూర్యుని ఉధృతం బాగా తగ్గింది. ఉష్ణోగ్రత తగ్గింది. నడుస్తోంటే ఉల్లాసంగా అనిపించసాగింది. ఉదయం అనుకొన్న ‘శక్తిని పొదుపుగా రోజంతా వాడుకోవాలి’ అన్న ప్రణాళిక ఫలించిందన్నమాట. నేషన్స్‌ యూనెస్‌ సెంటర్లో కాసేపు తిరుగాడి దగ్గర్లో ఉన్న కఫే డె పారిస్‌లో ఒక మింట్‌ టీ తాగుదామని వెళ్ళాను. ఆ ఊరి మదీనాలోకి అడుగు పెట్టడానికి ఆ సంధ్యాసమయమే సరైన వేళ అనిపించింది. వెళ్ళాను. మొరాకో దేశపు ఇతర నగరాలలోని మదీనాలలానే ఈ మదీనాలో కూడా ఉల్లాసము, తనదే అయిన శక్తీ కనిపిస్తున్న మాట నిజమేగానీ ఆయా నగరాలలోని ప్రాచీనత ఇక్కడ కనిపించలేదు. ఇప్పటి రూపురేఖల కాసాబ్లాంకా నగరాన్ని పద్దెనిమిదో శతాబ్దంలో నిర్మించారట. అంచేత మదీనాపరంగా చూసినా కాసాబ్లాంకా ఇతర నగరాలతో పోలిస్తే పసినగరమే. ఆ వీధుల్లో నడుస్తోంటే నత్తల వంటకం అమ్ముతోన్న వీధి దుకాణాలు కనిపించాయి. పెద్ద పెద్ద డేగిసాల్లాంటి పాత్రల్లో సలసలా మరుగుతోన్న నత్తల పులుసును చిన్న చిన్న గిన్నెల్లో వడ్డించి కస్టమర్లకు అందిస్తున్నారు. కాసాబ్లాంకా నగరపు ఆ స్పెషల్‌ వంటకాన్ని బబూచె అని పిలుస్తారట. వంటకం చూడ్డానికి బావున్నా జిగటగా జారే నత్తల తీరు గుర్తొచ్చి దాన్ని ముట్టుకోడానికి ప్రాణం ఒప్పలేదు.

ఆ వీధుల్లో మరికాస్త తిరుగాడి మదీనా అవతలికొసన ఉన్న రిక్స్ కఫే వేపు నడిచాను. దారిలో తాజా తాజా ఖుబ్జ్‌‍లు తయారుచేసి అమ్ముతోన్న బేకరీ కనిపించింది. మట్టి ఓవెన్‍లో కాల్చి చేస్తోన్న మొరాకన్‌ బ్రెడ్‌ అది. ఆ రొట్టె పరిమళం నన్ను ఆకర్షించింది. అక్కడి బేకర్‌ ఒకాయన చిన్నపాటి రొట్టె ఒకటి తినమని అందించాడు. డబ్బులు ఇవ్వబోతే పుచ్చుకోలేదు. ‘ఇది సాంపుల్‌ రొట్టె. మా తరఫున మీకు బహుమతి. తిని చూడండి’ అన్నాడు. నోట్లో వేసుకోగానే కరిగిపోయిందా రొట్టె ముక్క. ఆ బేకరీ తయారు చేస్తోన్న బ్రెడ్డు ఆ ప్రాంతమంతా బాగా పేరున్న బ్రెడ్డనీ రాజుగారికి కూడా ఇక్కడి బ్రెడ్డంటే మక్కువ అనీ చెప్పుకొచ్చాడా బేకరు. నిజమే, నేనూ రుచి చూశాను కదా. అది మహారాజులను సైతం వశపరచుకొనే రుచి! రిక్స్ కఫే‍కు వెళ్ళి కడుపారా భోజనం చేద్దామన్న ప్రణాళిక ఉండబట్టిగానీ లేకపోతే ఆ బేకరీలోనే రొట్టెల భోజనం ముగించి ఉండేవాడిని!

కాసాబ్లాంకా నగరం ఆ పేరుతో తీసిన హాలివుడ్‌ సినిమా వల్ల మొరాకోదేశం వెలుపల, ముఖ్యంగా వాయువ్య ఆఫ్రికాలోని మఘ్రెబ్‌ ప్రాంతాలలో అందరికీ సుపరిచితం. 1942లో వార్నర్ బ్రదర్స్‌ వాళ్ళు మైఖల్‌ కర్టిస్‌ దర్శకత్వంలో నిర్మించిన కాసాబ్లాంకా అన్న సినిమా ఇప్పటి వరకూ ప్రపంచంలో వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. సినిమా తీసి 80 ఏళ్ళు అయినా అది ఇప్పటికీ అభిరుచిగల సినిమా అభిమానులకు ఇష్టమైన సినిమా. ఆరాధనీయమైన సినిమా. కొంతమంది సినీనిష్ణాతులు దాన్ని హాలీవుడ్‌లో వచ్చిన అత్యుత్తమ సినిమాగా పరిగణిస్తారు. కొంతమంది ఆ స్థానం సిటిజన్‌ కేన్‍కు ఇస్తారు. ఏదేమైనా కాసాబ్లాంకా సినిమాకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ప్రజాదరణ ఉంది అన్నమాట వాస్తవం.

నేనా సినిమాను చాలాసార్లు చూశాను. చూసిన ప్రతిసారీ అది నన్ను ఆకట్టుకొంటూనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపకల్పన చేసిన ప్రేమగాథ ఆ సినిమా. నాజీమూకల దురాగతాల నుంచి తప్పించుకోడానికి ఎంతోమంది యూరప్‌ దేశాలవాసులు అమెరికాకు పారిపోయిన సమయమది. అలా వెళ్ళే ప్రక్రియతో ముందు వాళ్ళంతా ఫ్రాన్సు ద్వారా ఉత్తర ఆఫ్రికాకూ, కాసాబ్లాంకా నగరానికీ చేరి అక్కణ్నించి అమెరికాకు ప్రయాణించేవారు. ఆరోజుల్లో కాసాబ్లాంకా ఫ్రెంచివారి పాలనలో ఉండేది గాబట్టి శరణార్థుల ప్రయాణానికి ఈ పద్ధతి అనువుగా ఉండేది. కానీ అప్పటికే ఫ్రాన్సు దేశం నాజీల దురాక్రమణలో ఉండటం వల్ల కాసాబ్లాంకా మీద కూడా నాజీ దుష్ప్రభావం ఎంతోకొంత ఉంటూ ఉండేది.

రిక్‌ బ్లైన్ అన్న కాల్పనిక అమెరికన్‌ వ్యక్తి కాసాబ్లాంకాలో నడిపే కసీనో-నైట్‌క్లబ్బు ఆ సినిమా కథకు కేంద్ర బిందువు. ఆ క్లబ్బుకు ఆ ప్రాంతంలో ఉండే ప్రముఖ వ్యక్తులంతా వస్తూ ఉంటుంటారు. తాను తటస్థవాదిని అని రిక్‌ ప్రకటించుకున్నా అంతర్గతంగా అతను శరణార్థుల పక్షపాతి. వాళ్ళంతా అమెరికా వెళ్ళిపోడానికి తన రహస్య సహాయం అందిస్తూ ఉంటాడు. ఇల్సా అన్న చెక్‌ మహిళా ఆమె భర్తా అలా శరణుకోరి కాసాబ్లాంకా చేరిన వారిలో ఉన్నారు. ఇల్సా భర్త చెక్‌ దేశంలో నాజీలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి. ఈలోగా రిక్‌–హంఫ్రీ బొగార్ట్‌ అన్న నటుడు ఆ పాత్ర ధరించాడు–ఇల్సాతో ప్రేమలో పడతాడు. ఇన్‌గ్రిడ్‌ బెర్గ్‌మన్‌ ఆ ఇల్సా పాత్రధారి. తన ప్రేమకూ బాధ్యతకూ మధ్య ఘర్షణలో రిక్‌ సతమతమవుతూ ఉంటాడు. ఇంకా ముందుకు వెళ్ళి కథ చెప్పను. చెప్పి ఆ సినిమా ఇప్పటిదాకా చూడని వాళ్ళ ఆసక్తినీ ఉత్సుకతనూ హరించను.

అన్నట్టు ఆ సినిమాలో ఒక్క దృశ్యాన్ని కూడా కాసాబ్లాంకా నగరంలో చిత్రించలేదట. కాలిఫోర్నియా స్టూడియోలలో సెట్లువేసి కాసాబ్లాంకా వాతావరణాన్ని సృష్టించి చిత్రీకరించారట. అసలు కాసాబ్లాంకా నగరంలో రిక్స్‌ కఫే అన్న ప్రదేశమే లేదు. అయినా ఊళ్ళోకి వచ్చిన అమెరికన్లంతా రిక్స్‌ కఫే ఎక్కడా అని వాకబు చేస్తూ పోయారట. మొరాకోలో పనిచేస్తున్న చురుకైన మహిళా దౌత్యవేత్త ఒకామెకు ఈ ప్రశ్నల్లో ఒక చక్కని బిజినెస్‌ అవకాశం కనిపించింది. వెంటనే కార్యాచరణకు పూనుకొంది. సినిమాలో చూపించిన రిక్స్‌కెఫేకు అచ్చుగుద్దినట్టుగా ఒక కఫే నిర్మించింది. ఆ వాతావరణాన్ని పొల్లు పోకుండా సృష్టించింది. సహజంగానే కఫేలో వ్యాపారం ఊపందుకొంది. ఇన్నేళ్ళు గడిచినా ఆ ఊపు తగ్గలేదు.

కాసాబ్లాంకా సినిమా అభిమానులందరూ చేసేటట్టుగానే నేనూ రిక్స్‌ కఫేలో అడుగు పెట్టాను. మొరాకోలో నెలకొన్న అసలు సిసలు అమెరికన్‌ కఫే అనుకొంటూ వెళ్ళాను. ఆహార పదార్థాలు అమెరికా బాణీలో ఉంటాయనుకొన్నాను. నా దగ్గర ఉన్న లోన్లీ ప్లానెట్‌ వారి పుస్తకం కూడా అక్కడ అమెరికా వంటకాలు, మొరాకో వంటకాలూ రెండూ దొరుకుతాయనే చెప్పింది. ‘బర్గర్‌ తిని చాలారోజులయింది, ఇక్కడ ఒక చక్కని అమెరికన్‌ బర్గర్‌ తిందాం’ అనుకొన్నాను. కఫేలో అలంకరణ సమయోచితంగా ఉంది. బార్‌ ఉన్న చోటును అప్పటి కాసాబ్లాంకా సినిమా పోస్టర్లతో అలంకరించారు. ఆ రోజుల్ని గుర్తు చేసే సంగీతమూ వినవస్తోంది. పేద్ద టీవీ అమర్చి దానిలో ఇంగ్లీషు సబ్‌టైటిల్స్‌తో సహా కాసాబ్లాంకా సినిమా చూపిస్తున్నారు. ఆనాటి వాతావరణాన్ని ప్రతిసృష్టి చెయ్యడంతో వాళ్ళు విజయవంతమయ్యారని చెప్పాలి.

330 మిల్లీలీటర్ల చిన్నపాటి లోకల్‌ బీరు ఆర్డరు చేశాను. అప్పటిదాకా అన్ని ఊళ్ళల్లోనూ మదీనా ప్రాంతాలలో ఉండటం వల్ల మద్యం అందుబాటులో లేకుండాపోయింది. అదేమంత ఇబ్బంది పెట్టలేదుగానీ రిక్స్‌ కఫే లాంటి ఉల్లాసభరిత ప్రదేశంలో బీరే సరైన పానీయం అనిపించి దాన్ని ఆర్డరు చేశాను.

అక్కడ సరఫరా చేస్తోన్న వంటకాలు అటు అమెరికన్‌ బాణీవీ కాదు, ఇటు మొరాకన్‌ బాణీవీ కాదు. పక్కా ఫ్రెంచి బాణీ వంటకాలూ వడ్డనలూ. ఆశ్చర్యమనిపించింది. అంత సొగసైన భోజనం చెయ్యాలన్న కోరిక నాకు లేదు. ఆ చప్పిడి కూడు తినే మూడ్ కూడా లేదు. దానికోసం గంటాగంటన్నర అక్కడ గడిపే ఆలోచనా లేదు. నాలాంటి బాక్‌పాకర్‌కు అది తగనిచోటు. మరో బీరు ఆర్డరు చేసి అక్కడ్నించి నిష్క్రమించాను. రెండు బీర్లకూ వాళ్ళు వేసిన 180 దిర్హంల బిల్లు చుక్కల్ని చూపించింది. 180 దిర్హమ్‍లు అంటే 18 యూరోలు. మొత్తానికి ఈ కాసాబ్లాంకా నగరంలోని నకిలీ రిక్స్‌ కఫేకన్నా సినిమాలో చూపించిన ‘అసలీ’ కఫేనే అన్ని రకాలుగా మిన్న అనిపించింది.

రిక్స్‌ కఫే నుంచి బయటపడ్డాక కాసాబ్లాంకా నగరమధ్యాన ఉన్న ట్విన్‌ టవర్స్‌ దగ్గరికి టాక్సీలో వెళ్ళాను. తీరా వెళ్ళానే గానీ అక్కడి వాతావరణం ఏమంత క్షేమదాయకంగా కనిపించలేదు. ఆ టవర్లు ఓ బిజీబిజీ మల్టీలేన్‌ రహదారిని హత్తుకొని ఉన్నాయి. రెండువేపులా ట్రాఫిక్‌ శరవేగంతో సాగిపోతోంది. కాస్తంత నింపాదిగా కూర్చుని భోజనం చేసే అవకాశమే కనిపించలేదు. అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను. మరో టాక్సీ పుచ్చుకొని 16 నవంబర్‌ ప్లేస్‌కేసి సాగిపోయాను.

పలకరింపులు ముగిశాక నేను భారతదేశపు మనిషినని తెలిసిన వెంటనే ఆ టాక్సీ మనిషి స్నేహభావం ప్రదర్శించాడు. మీరు ఇస్లాం మతస్థులా అని అడిగాడు. దాని తర్వాత మీరు మీ ప్రధాని మోడీ సమర్థకులా అని అడిగాడు. నేను అంటీముట్టని జవాబు చెప్పాను. అలాంటి సున్నితమైన విషయాలను అపరిచితులతో చర్చించడం వాంఛనీయం కాదని నాకు తెలుసు. ఒక ప్రయాణీకుడిగా నాకు కొన్ని ప్రాథమిక నియమాలు ఉన్నాయి. స్థానికులతో రాజకీయాలు, సున్నితమైన సాంస్కృతిక విషయాలూ ఏ మాత్రం చర్చించగూడదు అన్నది అందులో మొదటి నియమం. అయినా అతగాడు మాటలు కొనసాగించాడు. వాళ్ళ మసీదులో విన్నాడట- ఇండియాలో, ముఖ్యంగా కాశ్మీరులో ముస్లింలను చంపిపారేస్తున్నారు అని. నాకవన్నీ తెలియవన్నాను. రాజకీయాలు నాకు పట్టవు అన్నాను. పైగా నేను భారతీయ పౌరుణ్ణి కానని, బ్రిటీష్‌ సిటిజన్ననీ వివరించాను. అతను కాస్త శాంతించాడు. ‘ఏమో! ఇదంతా నేను మా మసీదులో విన్న సంగతి’ అన్నాడు. విషయం మార్చడం కోసం ‘మీ’ 16 నవంబర్ ప్లేస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందీ? అని అడిగాను. అయిదో మహమ్మద్‌ రాజు తన ప్రవాసం వదిలి 1955లో మొరాకో దేశంలో తిరిగి అడుగుపెట్టిన రోజట ఆ 16 నవంబరు.

చీకటి పడిపోయింది. 16 నవంబర్‌ ప్లేస్‌ ఆ రాత్రి వేళ మహా చురుగ్గా తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. చిన్న చిన్న రెస్టారెంట్లు ఎన్నో ఉన్నాయక్కడ. వాటి లోపలా, ఆరుబయటా కూడా టేబుళ్ళూ కుర్చీలూ వేసి ఉన్నాయి. అలాంటి ఒక రెస్టారెంట్లో ఆరు బయటి టేబులు దగ్గరికి చేరి రొయ్యల టజీన్, ఖుబ్జ్‌ రొట్టెలకు ఆర్డరు ఇచ్చాను. అక్కడ సాగిపోతోన్న జీవనలీలను పరకాయిస్తూ, మనుషుల్ని పరిశీలిస్తూ చాలా తీరిగ్గా భోజనం చేసాను. రుచికరమైన పదార్థాలు, ఆరుబయట కూర్చోగలగడం, వచ్చేపోయే మనుషుల్ని పరిశీలించడం – అవన్నీ కలగలసి ఆనాటి నా భోజనాన్ని మరపురాని అనుభవంగా మలిచాయి. భోజనం ముగించాక నింపాదిగా నేషన్స్‌ యూనెస్‌ ట్రామ్‌ స్టేషనుకు నడిచి చేరి, మా హోటలువేపు వెళ్ళే బండి పట్టుకున్నాను.


మర్నాటి సాయంత్రం ఆరుగంటలకు నా లండన్‌ విమానం. ఉదయం ఐదింటికేలేచి పావుతక్కువ ఆరింటికి మరకేష్‌కు వెళ్ళే రైలు పట్టుకొనే ప్రయత్నంలో పడ్డాను. అప్పటిదాకా రైళ్ళల్లో నా ప్రయాణాలన్నీ రెండో తరగతిలోనే సాగాయి. అలా వెళ్ళడం నాకు ఇష్టం. సగటు మనుషులతో కలసిమెలసి ప్రయాణించం, వారి జీవితాల గురించీ జీవన విధానాల గురించీ తిన్నగా వారితోనే సంపర్కం పెట్టుకొని తెలుసుకోవడం, నాకెంతో ఇష్టమయిన పనులివి. కానీ ఈసారి, ఈ చివరి ప్రయాణం, మొదటి తరగతిలో చెయ్యాలనిపించింది. ఆ ప్రయాణం కూడా ఎలా ఉంటుందో చవి చూడాలనిపించింది. టికెట్టు ఖరీదులో ఫస్ట్‌క్లాస్‌కూ సెకండ్‌క్లాస్‌కూ పెద్ద తేడా లేదు.

కరెక్టుగా సమయానికి రైలు వచ్చి ఆగింది. ఆ బండికున్న ఒకే ఒక్క మొదటి తరగతి కంపార్టుమెంటు ఆచూకీ తెలుసుకున్నాను. పూర్తిగా చీకటి విడని ఉదయసంధ్యా సమయమది. కంపార్టుమెంట్ లోపలి కాబిన్లు ఇంకా మసకమసకగానే ఉన్నాయి. నా కాబిన్లో ఓ మహిళ. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారామె. ఆ మధ్యే ముఫ్పై నిండి ఉండాలి. మరకేష్‌ దాకా ఆ కాబిన్లో మేమిద్దరమే కలసి ప్రయాణం చేశాం. మొరాకో ఇస్లామిక్‌ దేశమే అయినా అరబ్‌ గల్ఫ్‌ దేశాల్లో ఉన్నంత జెండర్‌ విడదీత మొరాకోలో లేదు.

పొద్దున్నే రైలు పట్టుకోవడం కోసం బాగా పెందరాళే లేవడం వల్ల రైలెక్కగానే ఒక నిద్ర తీశాను. ఆవిడా నిద్రలో మునిగిపోయారు. ఇద్దరం వెలుగు రేకలు విచ్చుకునే సమయంలో నిద్రలేచాం. కారిడార్లో చెక్కర్లు కొడుతోన్న వెండింగ్‌ ట్రాలీలోంచి కాఫీ, క్రొసాంట్లు అంది పుచ్చుకొని, కాఫీ తాగుతూ ఇద్దరం కబుర్లలో పడ్డాం. పొందికైన సంప్రదాయ దుస్తుల్లో ఉందామె. ఏదో బిజినెస్‌ మీటింగ్‌ కోసం రబాత్ నుంచి మరకేష్‌ వెళుతోందట. వాళ్ళది రబాత్‌కు చెందిన పారిశ్రామిక కుటుంబమట. మీటింగవగానే మధ్యాహ్నం కసబ్లాంకా చేర్చే రైలు పట్టుకుంటానని చెప్పిందామె.

మనిషిని చూస్తే స్పష్టతా స్వతంత్రభావాలూ ఉన్నట్టు కనిపించింది. తన కుటుంబంలో ఆడా మగా తేడాలేదని, తన అన్నదమ్ముల్ని పెంచినట్టుగానే తననూ పెంచారనీ, మొరాకో దేశపు అత్యున్నత విద్యాపీఠాలలో తాను చదువుకున్నాననీ చెప్పింది. భర్త కూడా తనకెంతో సహకరిస్తాడని, పిల్లల పెంపకం విషయంలో కుటుంబం నుంచి పుష్కలంగా సహకారం అందుతోందనీ వివరించింది. కుటుంబం కోసం తన వృత్తి వ్యాపకాలను పణంగా పెట్టవలసిన పరిస్థితి తనకు ఎప్పుడూ ఎదురవ్వలేదని చెప్పింది. మొరాకో దేశస్థులు తమతమ సంప్రదాయాలను గౌరవించి నీతి నియమాలను పాటించినా స్థూలంగా వారంతా మత విషయాల్లో బిగిసిపోయి కూర్చునే తరహావారు కాదు అని చెప్పుకొచ్చిందావిడ. ‘మీ భారతీయుల్లాగానే మేము కూడా కుటుంబానికీ కుటుంబపు విలువలకూ సంబంధ బాంధవ్యాలకూ బాగా విలువిస్తాం తెలుసా?’ అని అడిగింది. నేనెంతో అమాయకంగా అనాలోచితంగా మా కుటుంబాల గురించి మీకెలా తెలుసూ అని అడిగితే ‘మీ సినిమాలు లేవూ?’ అని సూటిగా క్లుప్తంగా సమాధానం చెప్పింది!

రైలు రెండు నిమిషాలు ముందుగానే- ఉదయం 8:58 కల్లా- మమ్మల్ని మరకేష్‌ చేర్చింది. ఈ ప్రయాణపు మొదటిపాదంలో సహారా ఎడారి ప్రాంతానికీ, అట్లస్‌ పర్వతాల్లో ట్రెకింగ్‍కూ మాకు గైడ్‌గా వ్యవహరించిన అబ్దుల్‌ స్టేషన్లో నన్ను కలుసుకోడానికి వచ్చాడు. తొమ్మిది రోజుల ఈ ఉత్తర మొరాకో శోధనలు ఆరంభించడానికి ముందు వారం రోజులపాటు ఎడారీ కొండల ట్రెక్కులు ఇతర యూకే మిత్రులతో కలసి చేశాను. అవి ముగిశాక వారి నుంచి విడివడి ఈ సోలో ప్రయాణాలు. మౌంట్‌ తుబ్‌కల్‌ శిఖరారోహణ సమయంలో నాకు ఇలా సోలో ప్రయాణం చెయ్యాలని ఉంది అని గైడ్‌ అబ్దుల్‍తో అంటే అతగాడు కంగారుపడిపోయాడు. ‘ఒక్కరే వెళతారా… ప్రమాదమేమో…’ అని సందేహపడ్డాడు. ఆ ఒంటరి ప్రయాణాలు జయప్రదంగా ముగించుకొని వచ్చిన నన్ను చూసి ఇప్పుడు అదే అబ్దుల్‌ సంతోషభరితుడయ్యాడు. ఆ వారంరోజుల ట్రెకింగ్ సమయంలో అతనూ నేనూ బాగా దగ్గర అయ్యాం. అందుకే ఆ అక్కర. ఆ స్నేహం వల్లనే ఇవాళ తన ఇతర పనులన్నీ మానుకొని ఇక్కడ నాతో గడపడానికి వచ్చాడు.

మరకేష్‌ నగరానికి వెళ్ళిన ప్రతిసారీ నేను మొట్టమొదట వెళ్ళే ప్రదేశం జమా ఎల్‌ఫెనా కూడలి. మేం ఆరోజు వెళ్ళింది బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో. కఫే డి పారిస్‌‍కు వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్‌ చేద్దాం అన్నాడు అబ్దుల్‌. వెళ్ళాం. మరకేష్‌లోకెల్లా ఖ్యాతి వహించిన కఫే అది. ఎన్నో అంతస్తుల భవనమది. పైఫ్లోర్‌కి వెళ్ళినట్లయితే దిగువునున్న కూడలి ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఇంకా ఉదయమే కాబట్టి ఆ కూడలిలో హడావుళ్ళు మొదలవ్వలేదు. ఖాళీ ఖాళీగా కనిపించింది. దుకాణాల వాళ్ళు బద్ధకాలు వదిలించుకొని తలుపులు తెరుస్తూ కనిపించారు. ఇదే ఆఖరిసారి గదా అని మళ్ళా మొరాకన్‌ బ్రేక్‌ఫాస్ట్‌ వేపు మొగ్గాను. మెస్సెమ్మెన్‌, బెఘ్రిర్‌, ఆలివ్‌లు, వెన్న, చీజ్‌లాంటి పదార్థాలు. చివర్లో మింట్‌ టీ. పళ్ళ రసాల దుకాణాల వాళ్ళు కూడా అప్పుడే తమతమ కార్యకలాపాలు ఆరంభించారు. ఒక షాపతను మా జ్యూసు సాంపిలు రుచి చూడండి అని అందించాడు. మా ఇద్దరికీ చెరి ఒక పెద్దగ్లాసుడు దానిమ్మరసం కొనుగోలు చేశాను. నింపాదిగా ఆ సందుగొందుల్లో తిరుగాడుతూ ఊరు నిద్ర విదిలించుకొని చురుకుతనం సంతరించుకోవడం గమనించాను.

సాయంత్రం గదా నా విమానమూ- నాకింకా మరకేష్‌లో కొన్ని గంటలు గడిపే వ్యవధి ఉంది. ‘మీరు ఈ ఊళ్ళో చూద్దామనుకుని కూడా ఇప్పటిదాకా చూడని ప్రదేశమేదైనా ఉందా?’ అని అడిగాడు అబ్దుల్‌. రెండేళ్ళ క్రితం మరకేష్‌ వచ్చినపుడు అక్కడ మజొరెల్ గార్డెన్స్‌ చూద్దామని ఎంతో అనుకొన్నా చూడలేక పోయాను. ఆ మజొరెల్ గార్డెన్స్‌కు ఇవాళ వెళ్ళి వస్తే ఎంతో బావుంటుంది అనిపించింది. అదే అబ్దుల్‌కు చెప్పాను. మేవున్న జమా ఎల్‌ ఫెనా కూడలికి అది 40 నిమిషాల నడక దూరమట. సిందూర వర్ణపు మరకేష్‌ నగర సోయగాలను తీరిగ్గా అవలోకిస్తూ ఇద్దరం ఆ నలభై నిమిషాల నడక సుఖాన్ని అనుభవించాం. ఉత్తర మొరాకోలోని తెలుపూ నీలపు నగరాలను చూశాక ఈ ఎర్రెర్రని మరకేష్‌ను చూస్తే ఎంతో మురిపెంగా అనిపించింది.

ఆ మజొరెల్ ఉద్యానవనంలో రెండుగంటలు గడిపాం. ప్రపంచపు నాలుగుమూలల్నించీ పామ్‌, బ్రహ్మజెముడు మొక్కల్ని సేకరించి తెచ్చి కొలువు తీర్చారక్కడ. చుట్టూ ప్రహరీ గోడలు ఉన్న ఆ విశాల ఉద్యానవనానికి 1923లో జాక్ మజొరెల్ అన్న ఫ్రెంచి కళాకారుడు రూపకల్పన చేశాడు. ప్రపంచస్థాయి ఉద్యానవనంగా తీర్చిదిద్దాడు. అక్కడ ఉన్న కొన్ని బ్రహ్మజెముళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగాయో చూస్తే విస్మయం కలుగుతుంది. వాటి ఎత్తును బట్టి అవి ఏ కాలపునాటివో చెప్పవచ్చుననుకొంటాను.

ఆ ఉద్యానవనపు మరో విశేషం గురించి కూడా చెప్పుకోవాలి. అక్కడి భవనాలూ గోడలకు వెలిగిపోయే నీలిరంగు వేశాడు జాక్ మజొరెల్. దానితో ఆ ఎర్రెర్రని మరకేష్‌ నగరంలో మెరిసిపోయే ఈ నీలిరంగు ఉద్యానవనం ఒక ఒయాసిస్సులాగా భాసిస్తోంది. ఆ నీలిరంగు ఎంత విలక్షణమైనదంటే రంగుల ప్రపంచంలో ఈ వర్ణం ‘మజొరెల్ బ్లూ’ అన్న పేరిట తన ఉనికిని స్థిరపరచుకొంది.

యీవ్స్ సి లరాఁత్ అన్న ఫ్రెంచి ఫాషన్‌ డిజైనర్‌ కొన్నాళ్ళ తర్వాత ఈ మజొరెల్ గార్డెన్‌ను పొందగలిగాడట. ఆయన విగ్రహం గార్డెన్లో ఉంది. మెలమెల్లగా ఈ మజొరెల్ గార్డెన్స్‌ ప్రపంచంలోని అతి విలక్షణ ఉద్యానవనంగా ఖ్యాతి పొందింది. ప్రపంచపు అత్యుత్తమ ఉద్యానవనాల లిస్టుల్లో దీనిపేరు తప్పక ఉంటూ వస్తోంది.

మజొరెల్ గార్డెన్స్‌ నుంచి తిరిగి జమా ఎల్‌ఫెనా కూడలికి నడిచి చేరుకున్నాం. అక్కడ్నించి రియాద్‌ ఆఫ్రికా… ఈ రియాద్‌ ఆఫ్రికాలోనే నేనూ మా మిత్రబృందమూ ఈ మొరాకో యాత్ర ప్రథమ పాదంలో రెండు వారాల క్రితం నివసించింది. మా ట్రెక్కులు ముగిశాక మళ్ళా అందరం ఇక్కడకే చేరాం. మిగిలినవాళ్ళంతా ఇక్కణ్నించి లండన్‌ విమానం పట్టుకొంటే నేను నా ట్రెక్కింగ్‌ సామానంతా ఇక్కడే ఉంచేసి కనీస అవసరాలను బ్యాక్‌పాక్‌లో పెట్టుకొని, ఉత్తర మొరాకో అంతా తిరిగి తిరిగి వచ్చానన్నమాట. ఆ రియాద్‌ మానేజరు నేను రావడం చూసి సంతోషపడ్డాడు. కలసి మింట్‌ టీ తాగుదామని పట్టుపట్టాడు. కోవిడ్‌ మహామహమ్మారి వచ్చి వెళ్ళాక తమ రియాద్‌తో ఉండి వెళ్ళిన అతి పెద్ద బృందం మాదేనని పదేపదే కృతజ్ఞతలు చెప్పాడు.

కోవిడ్‌ ఉపద్రవం ప్రపంచాన్ని వణికించడానికి కొద్దినెలల ముందే డిసెంబరు 2019లో మొరాకో వచ్చి వెళ్ళాను. అది నా రెండో మొరాకో యాత్ర. అపుడు మొరాకో నాకు బాగా నచ్చింది. మళ్ళీ వచ్చి దేశం నాలుగు మూలలా తిరుగాడాలనుకొన్నాను. ఈలోగా కోవిడ్‌ ముంచుకొచ్చింది. ప్రయాణాలు బందయ్యాయి. అక్టోబరు 2021లో కోవిడ్‌ కాస్తంత ఉపశమించిన తర్వాత నేను పెట్టుకొన్న మొట్టమొదటి విదేశీయాత్ర ఈ మొరాకో శోధనయాత్రే… 2019 డిసెంబరులో నా ప్రయాణాలు ఎక్కడ ఆపానో ఖచ్చితంగా మళ్ళా అక్కడ నుంచే 2021లో తిరిగి ప్రారంభించానన్నమాట! ప్రారంభించి స్నేహితులతో ట్రెక్కింగులు చేశాను. ట్రెక్కింగులు చేశాక ఈ సుందర నిగూఢ మార్మిక ప్రపంచంలో ఒంటరి యాత్రకుడినయ్యి నన్ను నేనే కోల్పోదామని సంకల్పించుకొన్నాను. అలా దాదాపు పదిరోజులు నా ఉనికిని కోల్పోతూ కోల్పోతూ ఉత్తర మొరాకోను శోధించాను. శోధించి తిరిగి మరకేష్‌ చేరుకుని నాకు పరిచయమున్న ప్రపంచంలో పడ్డాను.

పదిమంది సమహృదయులతో కలసి ప్రయాణించడంలో ఎంతో ఆనందముంది. సౌలభ్యాలున్నాయి. అలాగే అందరినీ విడిచిపెట్టి ఏకాంతయానం చెయ్యడంలోనూ విభిన్నమైన సొగసు ఉంది. సౌలభ్యముంది. మన ప్రయాణాలకు, ప్రణాళికలకూ మనమే బాధ్యులం. మనదే అధికారం. ఎలా కావాలంటే అలా, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ ప్రణాళికను సవరించుకోవచ్చు. మార్చుకోవచ్చు. ఎవరూ ప్రశ్నించరు, ఏజవాబూ ఆశించరు. మనకు మనమే జవాబు దారులం. నువ్వు ఏకాంత యాత్రికుడివి అని గమనించగానే దారిలోని అపరిచితులు పలకరిస్తారు. మాట కలపడానికి ముందుకొస్తారు. అలా కొత్తకొత్త మనుషులు పరిచయమవుతారు. దానివల్ల ఏ సంకోచాలూ అవరోధాలూ లేకుండా కొత్త ప్రదేశాల్లో క్షణాల్లో ఇమిడి పోగలగుతాం. మనతో మనం ఎక్కువ సమయం గడుపుకోగలుగుతాం. మనలో మనం స్నేహ సామరస్యాలు సాధించుకోగలుగుతాం. అంతేగాకుండా ఎక్కడికక్కడ మనముందున్న విభిన్న అవకాశాలను బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. కొన్ని నిర్ణయాలు రిస్కీగా అనిపించవచ్చు. అయినా తీసుకోవలసి వస్తుంది. ఆ ప్రక్రియలో మనమీద మనకు బాధ్యత, నమ్మకం పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. యాత్రానుభవం మరింత గాఢమవుతుంది. మరింత సంతృప్తినీ సంతోషాన్నీ ఇస్తుంది.

ప్రస్తుత మొరాకో యాత్ర నేను కోవిడ్‌ ఉపద్రవంలో ఎదుర్కొన్న కష్టనష్టాలనుంచి బయటపడటానికి బాగా ఉపకరించింది. మనసుకు ఎంతో అవసరమయిన శాంతిని ఇచ్చింది. నాలో స్ఫూర్తిని నింపింది. ప్రయాణ దాహాన్ని పునరుద్ధరించింది.

గత ఆరేళ్ళలో ఇది నా మూడో మొరాకో యాత్ర. అంతా కలసి దాదాపు నెలరోజులు మొరాకోలో తిరుగాడాను. మూలమూలలూ చూశాను. నేను లండన్‌ విమానం ఎక్కే సమయం దగ్గర పడేసరికి అబ్దుల్‌ ఎంతో భావోద్వేగానికి గురి అయ్యాడు. మిమ్మల్ని బాగా మిస్సవుతాను అన్నాడు. దేశపు నలుమూలలా బాగా తిరిగి చూశారు గాబట్టి బహుశా ఇదే మీ చిట్ట చివరి మొరాకో యాత్ర అవుతుంది అన్నాడు. మనం మళ్ళీ కలుసుకోలేక పోవచ్చు అన్నాడు. దేశం చూడడానికి కాదు, ఈసారి నిన్ను కలవడానికే వస్తాను అని అన్నాను. నిన్నే కాదు ఈ మొరాకో ప్రజలందర్నీ కలవడానికి వస్తాను అన్నాను. వారి సౌమ్యత, సరళత, ఆత్మీయ భావన నన్ను ఎంతో ఆకట్టుకొన్నాయన్నాను. ఈ మాటలు విని ఆశ్చర్యపోతున్న అబ్దుల్‌ కేసి చూసి చిరునవ్వు నవ్వి, ఏది ఎలా ఉన్నా నువ్వు చేసిపెట్టిన రుచికరమైన వంటకాల కోసం మళ్ళా వస్తానన్నాను. నువ్వు వడ్డించిన టజీన్లూ, కుస్‌కుస్‌లూ ఆరగించడానికి వస్తానన్నాను.

నిజానికి అబ్దుల్‌ వృత్తిరీత్యా యాత్రికులకు మార్గదర్శి. తన కస్టమర్ల విషయంలో ఇలాంటి భావోద్వేగాలకు గురికానవసరం లేదు. కానీ అంతరాంతరాల్లో మానవీయ స్పందనలు ఉన్న మనిషి. సహృదయతనూ, స్నేహశీలతనూ గుర్తించగల మనిషి. అందుకే ఆ భావోద్వేగాలు.

నేను ఎంత వద్దన్నా వినకుండా అబ్దుల్‌ ఎయిర్‌పోర్ట్‌ దాకా వచ్చాడు. ఎందుకయ్యా నీ సమయం వృథా చేసుకుంటావూ అన్నా వినలేదు. మీకు విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది అన్నాడు. వృత్తిరీత్యా గైడే అయినా అతను మా బృందంలో ఒకడిగా బాగా ఇమిడిపోయాడు. స్నేహంగా మసలాడు. కలసి చేసిన ట్రెక్కుతో మాకంటూ ఉమ్మడి జ్ఞాపకాలు ఎన్నో రూపుదిద్దుకున్నాయి. మిగిలాయి. బరువెక్కిన గుండెలలో అతనికి వీడ్కోలు చెప్పాను. అతని అతి చక్కని దేశానికీ వీడ్కోలు చెప్పాను. అక్కడి జ్ఞాపకాలను బ్యాక్‌పాక్‌లో నింపుకొని నాతో తెచ్చుకొన్నాను. అవి జీవితాంతం నాతోనే ఉంటాయి.

(సమాప్తం)