అక్టోబర్ 24. మా ఎవరెస్ట్ యాత్రలో చిట్టచివరి ఘట్టానికి చేరిన రోజు. ఉదయమే లొబూచె నుంచి బయల్దేరి నాలుగయిదు గంటలు నడిచి గోరక్షెప్ గ్రామం చేరుకున్నాం. భోజనసమయానికల్లా గోరక్షెప్ చేరుకున్నామన్న మాటేగానీ మళ్ళా మధ్యాహ్నం కాలాపత్థర్ ఆరోహణ కార్యక్రమం ఉండనే ఉంది.
గబగబా భోజనాలు ముగించుకుని రెండింటికల్లా అంతా కాలాపత్థర్ బాట పట్టాం. ‘అంతా’ అన్నానేగానీ మాలో కొంతమంది మాకన్నా గంటారెండు గంటలు ముందుగా గోరక్షెప్ చేరుకున్నారు గదా – అలాంటివాళ్ళు మాకన్నా ముందే కాలాపత్థర్ దారి పట్టారు.
గోరక్షెప్‌తో పోలిస్తే కాలాపత్థర్ సుమారు నాలుగు వందల మీటర్లు ఎగువన ఉంది. అంతా కలసి సముద్రతలానికి 5545 మీటర్లు – 18208 అడుగులు. మెల్లగా ఆ శిఖరం చేరుకుని అక్కణ్ణించి సూర్యాస్తమయం చూడాలన్నది మా ఆలోచన. అలాగే మా ట్రెక్ అంతటిలోనూ ఎవరెస్ట్ శిఖరపు అతి ఉత్తమ ‘దర్శనం’ కాలాపత్థర్ మీదనుంచే జరుగుతుంది అన్న విషయమూ విని ఉన్నాం. ఎక్కవలసిన ఎత్తులు కాస్తంత సంకోచం కలిగిస్తున్న మాట నిజమే అయినా, పొందబోయే అనుభవాల గురించిన ఆలోచన ఆ సంకోచాలను అధిగమించి ఉత్సాహంగా అడుగులు వేసే శక్తిని ఇచ్చింది. ఎంతో దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తోన్న కాలాపత్థర్, ‘సంకోచాలు వద్దు, రారమ్మని’ పిలుస్తున్నట్టనిపించింది. నల్లని కాలాపత్థర్‌కు సరిగ్గా విరుద్ధమైన వర్ణంలో ఉన్న పిరమిడ్ రూపపు 7161 మీటర్ల పుమోరి శిఖరం ఒళ్ళంతా తెల్లరంగు నింపుకొని, క్షితిజంలో నిలబడి, కాలాపత్థర్ అందిస్తోన్న ఆహ్వానానికి మరింత ఊతమిస్తున్నట్టుగా పలకరిస్తోంది…
గోరక్షెప్ నుంచి బయల్దేరి అంత ఉన్నత పర్వతసీమలో మరో నాలుగువందల మీటర్లు ఎక్కి కాలాపత్థర్ శిఖరం చేరడం మామూలు విషయం కాదని మాకు తెలుసు. అది మిట్టమధ్యాహ్నమే అయినా పరిసర ఉష్ణోగ్రత నీళ్ళనే కాదు, శరీరాలనూ గడ్డ కట్టించే స్థాయిలో ఉంది. అంత చలిలో కూడా సూర్యుని ప్రకాశవంతమైన కిరణాలు మాకు ఉపశమనం కలిగించాయి. మా మనసులకు కాస్తంత వెచ్చదనం అందించాయి. ‘పదండి పోదాం పైపైకి’ అన్న ఉత్సాహాన్ని మాలో నింపాయి.
పైకి వెళ్ళేదారి తీర్చిదిద్దినట్టుగా ఉంది. కొన్ని చోట్ల రాళ్ళూ బండలూ పలకరించాయి. దారి ఎంత బావున్నా పదేపదే ఆగి, గుక్క తిప్పుకుని ముందుకు సాగవలసి వచ్చింది. మొదట్లో ఏభై అరవై మీటర్లకోసారి ఆగుతూ వెళ్ళాం. కాసేపటికల్లా వంద అడుగులకొకసారి ఆగక తప్పలేదు. ఆ తర్వాత ఇరవై అడుగులకొకసారి… ఇలా కష్టపడి ఎక్కాల్సి ఉంటుందని మాకు ముందే తెలుసు కాబట్టి ఆగవలసి వచ్చిన చోట ఆగుతూ, ముందుకు వెళ్ళాలన్న సంకల్పాన్ని దృఢపరచుకుంటూ అడుగులు వేసాం. అప్పటికే పైదాకా వెళ్ళి తిరిగి వస్తోన్న కొంతమంది సహ ట్రెకర్లు మమ్మల్ని పలకరించి ఉత్సాహపరచసాగారు. అలా ముందుకు వెళ్ళి మూడింట రెండువంతుల దూరాన్ని అధిగమించాక ఆ సూర్యాస్తమయ సమయంలో అనుక్షణం రంగులు మార్చుకొంటోన్న పరిసరసీమ కనిపించి మాకు సంబరం కలిగించింది. శిఖరం ఎంతో దూరంలో లేదు అన్న ఎరుకా, సూర్యాస్తమయ సమయం దగ్గర పడుతోంది అన్న మనసు చేసే హెచ్చరికా కలగలసి మాలో ఉత్సాహాన్ని, త్వరపడాలన్న ఆలోచనను కలిగించసాగాయి. వాటి సాయంతో శిఖరాగ్రం చేరనే చేరాం. 18208 అడుగుల ఎత్తును అందుకోగలిగాం!
కాలాపత్థర్ శిఖరం చేరి చూస్తే హిమాలయ సీమ అంతా మా కళ్ళముందు పరచుకుని కనిపించింది. మా వెనుక గంభీరంగా నిలచిన పుమోరి శిఖరం… ఎదురుగా బాగా దగ్గర్లోనే ఉన్నట్టు కనిపిస్తోన్న నుప్త్సె శిఖరం… విశాలమైన వేదిక మీద నిలబెట్టినట్టున్న ఆ శ్వేతశిఖరానికి అటూ ఇటూ పక్షి రెక్కల్లా కొండ మూపురాలు, ఆ మూపురాల శృంఖలలో నెలకొని ఉన్న బృహత్తర హిమసమూహాలు, వీటన్నిటి మధ్య శిఖరభాగంలో త్రికోణాకారంలో నిలచి మెరిసే సూదిమొనలాంటి శిఖరాగ్రం – మనసులో ఎంతగానో ముద్రించుకుపోయిన దృశ్యమది. మేము నడక ఆరంభించినపుడు నుప్త్సె శిఖరం వెనుక దాగి ఉండిపోయిన ఎవరెస్ట్ శిఖరం, ఎగువకు చేరిన కొద్దీ క్రమక్రమంగా కనిపించసాగింది. కాలాపత్థర్ శిఖరం చేరేసరికి అది పరిపూర్ణంగా వికసించి మురిపించింది. ఆశ్చర్యమేమంటే ఆ చుట్టుపక్కల శిఖరాలన్నీ మరకలు లేని తెల్లదనంతో వెలుగుతోంటే, ఎవరెస్ట్ మాత్రం ఒక తెలుపునలుపుల గిరిశిఖరంగా మాకు దర్శనమిచ్చింది. ఆ శిఖరపు సానువుల్లో బలమైన హిమసమూహాలు చారలుచారలుగా పరచుకొని ఉన్న మాట నిజమే అయినా అంతే ప్రస్ఫుటంగా రాతిగోడల జాడలూ విస్తరించి ఉన్నాయి.
కాలాపత్థర్ శిఖరంనుంచి ఎవరెస్ట్, ఇతర శిఖరాలు ఎంతో స్పష్టంగా కనిపించాయి. ఎదురుగా నిలిచి పలకరించే శిఖరాలేగాకుండా దిగువన ఘనీభవించిన పచ్చల తటాకాలు, గ్లేషియర్లు కనిపించి మురిపించాయి. సాయంకాలపు ఎండలో బంగరుకాంతితో నిండిన ఎవరెస్ట్, సభాగారంలో ముఖ్యాసనంలో కూర్చున్న మహారాజులా కనిపించింది. చుట్టూ నాలుగు దిక్కులా పరచుకొని ఉన్న నుప్త్సె, పుమోరి, కుమ్‌ట్సే, లింగ్‌ట్రిన్, కుంబుట్సే, చాంగ్త్సేలాంటి శిఖరాలు రాజసభలో కొలువుదీరిన రాజప్రముఖుల్లా కనిపించాయి.
మెలమెల్లగా పరిసర శిఖరాలన్నీ బంగరువర్ణం నుంచి పసుపు కలసిన నారింజ రంగులోకి మారాయి. పక్షి మార్గాన పట్టుమని పది కిలోమీటర్లు దూరమైనా లేని ఎవరెస్టు శిఖరం, ఎన్నో ఏళ్ళుగా నేనెరిగిన నా స్నేహితుడు ఉన్నట్టుండి పక్కన చేరి ఆత్మీయంగా పలకరించిన అనుభూతి కలిగించింది. తెలుసు… ఇదంతా మనసు చేసే మాయ అని తెలుసు. కానీ ఆ క్షణంలో కలిగిన ఆ అనుభూతి – అది మాత్రం వాస్తవం. ఆ అనుభూతికి తోడుగా పరిసరాల నిండా పరచుకొన్న గాఢమైన బంగారు వర్ణం, ఎటు చూసినా కిరీటధారుల్లా మెరిసిపోతున్న గిరిశిఖరాలు – ఆ దృశ్యం వర్ణనాతీతం. దేవతల విహారభూమి అంటారు, ఇదేనా? దేవుళ్ళ నివాస స్థలం అంటారు, ఇదేనా? మనసులో ఓపలేనంత భావతీవ్రత, మోహావేశం!
కాలాపత్థర్ శిఖరం పైన ఓ పెద్దపాటి శిల, ఆ శిల మీద చదునైన స్థలమూ కనిపించాయి. అందరం అక్కడకు చేరి బైఠాయించాం. ఎవరెస్ట్ బేస్ కాంప్ చేరుకోవడం కన్నా ఈ కాలపత్థర్ శిఖరాగ్రం చేరుకోవడమే మరింత కష్టమనీ, మా ఈ ట్రెక్‌లో అదే ముఖ్యఘట్టమనీ బాబు గురంగ్ చెపుతూనే వచ్చాడు. కాలాపత్థర్ ఎక్కినంతసేపూ ఆ మాట మాకు గుర్తొస్తూనే ఉంది. అవును: ఈ శిఖరారోహణే మా ట్రెక్‌కు కలికితురాయి. ఇదే మా ఎవరెస్ట్ ఘడియ!
సూర్యాస్తమయం తర్వాత ఆ ప్రాంతమంతా మార్మికత నిండిన వెలుగుతో నిండిపోయింది. బంగారు, కాషాయ వర్ణాల స్థానంలో నీలిమెరుపు అన్నివేపులా పరచుకొంది. ఆ మెరుపు ఎవరెస్టుతో సహా అక్కడ కనిపించే అన్ని శిఖరాలకూ మేలిముసుగులా అమరింది. ఆ దృశ్యం చూస్తూ అందరం మైమరచిపోయాం. అతిలోకసౌందర్యమా క్షణాలది. మననుంచి మన మనసు వేరుపడి పరిసరాలతో మిళితమై పోయే క్షణాలవి. కాలం స్తంభించిపోయి, మనసు కోరికలకూ భౌతిక ప్రపంచానికీ దూరాన నిలబడి, మన చుట్టూ ఉన్నదంతా అసంగతం అని స్ఫురింపజేసే క్షణాలవి…
ఎంత కాదనుకున్నా చుట్టూ అలముకుంటోన్న చీకటి ఒక వాస్తవం అన్న స్ఫురణ కూడా మాకు కలిగింది. చీకటిపడ్డాక కొండ దిగి వెళ్ళడం కష్టాలతో కూడిన పని అని తెలిసినా, ఎంచేతో మాతో ఉన్న బాబు గురంగ్ ఆ మాట ఎత్తలేదు. మమ్మల్ని తొందరపరచలేదు. మళ్ళీ మళ్ళీ దొరకని ఆ అపురూప అనుభవానికి మమ్మల్ని దూరం చేయడం అతనికీ ఇష్టం లేదు గాబోలు! అటూ ఇటూ పరిశీలిస్తే ఆ శిఖరాగ్రాన మిగిలింది మా చిన్నపాటి బృందమే అని తేలింది. అప్పటిదాకా పరిసరాలను రాగరంజితం చేసిన వివిధ వర్ణాలను పక్కన పెట్టి నల్లని చీకటి కమ్ముకు రాసాగింది. అందరం మనసుల్ని కూడదీసుకుని తిరుగు ప్రయాణం ఆరంభించాం.
చుట్టూ కారుచీకటి అలుముకొంటున్న మాట నిజమే అయినా అంత చీకటిలోనూ పరిసర శిఖరాల వెలుగు మెరుపులు సమసిపోలేదు! ఆ హిమశిఖరాల పలకరింపులకు మురిసిపోతూ కొండ దిగడం ఆరంభించాం. చీకటి కదా – అందరం మా తలలకు తగిలించి ఉన్న దీపాలు వెలిగించాం. హెడ్‌లాంప్‌ల ఆసరా ఉన్నా సరే – అందరం బాబూ గురంగ్ అడుగుజాడల్లోనే నడవాలి అన్న విషయం విస్మరించలేదు.
ఉన్నట్టుండి నా హెడ్‌లాంప్ పనిచేయడం మానేసింది. ఇలాంటి ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంటుందని తెలుసుగాబట్టి ముందే బాక్‌పాక్‌లో పెట్టుకున్న టార్చిలైట్ తీసి వెలిగించాను. ఏదేమైనా హెడ్‌లాంప్ హెడ్‌లాంపే; టార్చిలైటు టార్చిలైటే. లైటు చాలని ఇబ్బంది పుణ్యమా అని నేను బృందం మధ్యన చేరి జాగ్రత్తగా నడిచాను. అంత చీకట్లో హెడ్‌లాంపయినా లేకుండా వెనక వెనక ఉండిపోయినట్టయితే బృందంనుంచి విడివడిపోయి దారి తప్పే ప్రమాదముంది మరి.
దిగడం ఆరంభించామేగానీ అది ఒక అంతం లేని ప్రయాణంలా అనిపించింది. నిజంగానే ఈ మధ్యాహ్నం ఇదంతా ఎక్కి శిఖరం చేరామా అనిపించింది. చీకట్లో దూరాలూ కాలాలూ సాగిపోయి కనిపిస్తాయనుకుంటాను. ఏదేమైనా బాబు గురంగ్ మాతో ఉండటం కొండంత అండ. అతనే లేకపోతే ఖచ్చితంగా దారి తప్పేవాళ్ళమే!
కాసేపలా నడిచాక దూరాన గోరక్షెప్ దీపాలు మిణుకుమిణుకుమంటూ పిలిచాయి. అందరికీ వచ్చేశాం వచ్చేశాం అన్న ఉత్సాహం కలిగింది. టైము చూసుకుంటే రాత్రి ఎనిమిది… గోరక్షెప్ మరో వందానూటఏభై మీటర్ల దూరాన ఉందని తెలుస్తోంది.
ఈలోగా ఎదురుగా ఉన్న సమతల ప్రదేశం దాటుకొని నలుగురైదుగురు మిత్రులు మాకేసి నడచి రావడం కనిపించింది. వాళ్ళేదో సంజ్ఞలు చేస్తున్నారు. మా మీద అక్కరతో, చీకట్లు జయించి తిరిగి వస్తోన్నందుకు మాకు స్వాగతం చెపుతున్నారా అనిపించింది. కాదు. వాళ్ళంతా ఆగి నిలబడి ఆకాశం కేసి చూడసాగారు.
అప్పటిదాకా ఆ చీకటిపూట ఒక్కో అడుగూ తడుముకుంటూ వస్తోన్న మాకు వినువీధిలో ఏం జరుగుతోంది అన్న విషయం పట్టనే పట్టలేదు. మాకేసి వస్తోన్న వాళ్ళు ఆకాశంకేసి చూడటం గమనించిన మేమూ అప్రయత్నంగా తల పైకెత్తి చూసాం. ఆకాశంనిండా దట్టంగా అలుముకుని ఉన్న నక్షత్రాలు. అన్నన్ని చుక్కల్ని మోయలేక ప్రసవవేదన పడుతున్నట్టున్న గగనం. అంగుళం ఖాళీ లేకుండా వందల వేల నక్షత్రాలను అంతగా పొదవుకుని ఉన్న ఆకాశాన్ని చూడటం నాకు అదే మొదటిసారి. దిగ్భ్రమ. సంతోషం. సంబరం. అవును మరి – సముద్రతలానికి అయిదు కిలోమీటర్లు ఎగువన, నాగరికతవల్ల సోకే మాలిన్యాలను ఎరుగనే ఎరుగని ప్రాంతంలో, కాలుష్యం అన్న శబ్దమే వినిపించని సుందరసీమలో – నక్షత్రాలతో నిండిన ఆకాశం అపురూప సౌందర్యంతో మమ్మల్ని పలకరిస్తే పొంగిపోకుండా ఉండగలమా! ఆ నక్షత్రసమూహాలనూ వాటి వెలుగు వెల్లువనూ ఓపలేని ఆకాశం, తన కడుపును చించుకుని ఆ వెలుగుతారలను మామీద గుమ్మరించబోతోందా అనిపించింది.
ఈలోగా మేమూ దిగువనుంచి వస్తున్నవాళ్ళూ కలుసుకున్నాం. మాలో నక్షత్ర పరిజ్ఞానం కలిగి ఉన్న శ్రీని, పాలపుంత అడుగుజాడలు కొసనుంచి కొస దాకా చూపించి వివరించాడు. ‘మిల్కీ వే’ అన్నమాట వినడమేగానీ దాన్ని అంత స్పష్టంగా ప్రత్యక్షంగా చూడటం నాకు అదే మొదటిసారి. ఆనాడు నాకు అలా మరో ఊహించని బహుమతి లభించింది.
అందరం డైనింగ్ రూమ్ చేరుకున్నాం. నాకేమీ తినబుద్ది కాలేదు. అసలు ఆకలి ఛాయలే కనిపించలేదు. ఎత్తులు పెరిగే కొద్దీ ఆకలి మందగించడం సామాన్యంగా జరిగే విషయమే. అతి కష్టం మీద కాస్తంత సూపు తాగి మరి కాస్త అన్నం-పప్పు తిన్నాను.
త్వరగా నిద్రపోదామని పడక చేరాను. ఆనాటి విశేషాలన్నీ కళ్ళ ముందు గిర్రున తిరిగాయి. లొబూచె వదిలి ఎన్నో సంవత్సరాలు గడిచినట్టు అనిపించింది. ఖుంబు-చంగ్రి గ్లేషియర్లు, ఐదువేల మీటర్ల ఎత్తులు, అతి ఎత్తైన గోరక్షెప్ గ్రామం, ఇంకా ఎత్తైన కాలాపత్థర్ శిఖరం, ఎవరెస్ట్ శిఖరపు మహత్తరదృశ్యం, పాలపుంత సాక్షిగా వేలాది నక్షత్రాలు – ఇవన్నీ ఒక్క రోజులోనే జరిగాయా?!
పడక చేరానేగానీ నిద్ర పట్టనంది. సామాన్యంగా నాకు పడక ముట్టుకోగానే నిద్ర ముంచుకొస్తుంది. రోజంతా శరీరం అలసిపోయి ఉందిగదా – ఆరోజు వెంటనే నిద్ర పట్టి ఉండాలి. కానీ పట్టలేదు. ఐదువేల మీటర్లను మించిన ఎత్తులో ఆక్సిజన్‌తో పోరాడాల్సి రావడం, ఆరోజు గడిచిన తీరు కలిగిస్తోన్న ఉత్తేజం – మొత్తానికి పట్టీ పట్టని నిద్ర.
నిద్రలేమి సంగతి ఎలా ఉన్నా అంతంత ఎత్తులకు చేరుకున్నప్పుడు ప్రాణాంతకం అయ్యేది ఎక్యూట్ మౌంటైన్ సిక్‌నెస్ – AMS – బారిన పడటం. ఆకలి మందగించడం, అలసట, నిద్రపట్టకపోవడం, వాంతి వస్తోన్న భావన, తీవ్రమైన తలనొప్పి, కళ్ళు తిరగడం – ఇవన్నీ AMS లక్షణాలు. శరీరానికి కనీసమాత్రపు ఆక్సిజన్ అందకపోవడం అందుకు మూలకారణం. నిన్న రాత్రి ఆ రష్యన్ అమ్మాయి విషయంలో అదే జరిగింది. ఈ లక్షణాలను ఉపేక్షిస్తే ఊపిరితిత్తుల్లోనూ మెదడులోనూ నీరు చేరే ప్రమాదముంది. అదే జరిగితే పరిస్థితి చాలా త్వరగా విషమిస్తుంది. వెంటనే సరైన చికిత్స జరగకపోతే ప్రాణాలకే హాని కలగవచ్చు.
ఈ లక్షణాలు కనిపించగానే, అది AMS అని గ్రహించిన వెంటనే సదరు వ్యక్తిని వీలయినంత త్వరగా అప్పుడు ఉన్న చోటుకన్నా దిగువ ప్రదేశానికి చేర్చడం ఎంతో అవసరం. అది అనుకున్నంత సులభం కాదు! ఇంతింత ఎత్తులకు చేరేవాళ్ళు గొప్ప ఆశయాలతో వస్తారు. బేస్‌కాంప్ చేరుకోవడం కొందరి జీవితాశయం అయితే ఎవరెస్ట్ ఎక్కడం మరి కొందరి లక్ష్యంగా ఉంటుంది. లక్ష్యానికి అంత చేరువగా వచ్చాక ఏ అడ్డంకినైనా లెక్కచేయకుండా ముందుకే సాగుదాం అన్న పట్టుదల వారికి కలగవచ్చు. ప్రాణాలు పోతే మాత్రమేం అనిపించవచ్చు. అసలు ఆ AMS సోకిన స్థితిలో సరైన విధంగా ఆలోచించే శక్తి కూడా వారికి ఉండదు. అంచేత దిగువ ప్రాంతానికి వెళ్ళడం అన్న విషయంలో నిర్ణయం వారికే వదిలేయడం ఏ రకంగానూ మంచిది కాదు. ఇవన్నీ ఆలోచించే, అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సమగ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే బాధ్యతా అధికారం మేము ఎంపిక చేసిన డాక్టర్ల బృందానికి అప్పజెప్పాం. దానికి డాక్టర్ మోహన్‌ను నాయకుడిగా ఎన్నుకున్నాం. ట్రెక్ ఆరంభించడానికి ముందే ఈ బృందం తీసుకున్న నిర్ణయాలను తు. చ. తప్పకుండా గౌరవించి పాటించాలని అందరం అంగీకరించాం. ఇన్నిన్ని జాగ్రత్తలు తీసుకోవడంవల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి తలఎత్తినప్పుడు సరియైన నిర్ణయం తీసుకోవడం, అవసరమైతే సదరు వ్యక్తుల్ని నయానో భయానో క్రిందకు పంపడం సులువవుతుంది. అదృష్టవశాత్తూ మా బృందానికి అలాంటి కఠిననిర్ణయాలు తీసుకోవలసిన అవసరం కలగలేదు. ఎవరూ AMS బారిన పడలేదు. అయినా మూడువేల మీటర్ల ఎత్తును దాటిన దగ్గర్నుంచీ, గాలి పలచబడటం ఆరంభమయిన దగ్గరనించీ జాగ్రత్తగానే ఉంటున్నాం. నాలుగువేల మీటర్లు దాటాక మరింత అప్రమత్తంగా మెలిగాం.
AMS నుంచి కాపాడుకోటానికి ముందు జాగ్రత్తగా డయామాక్స్ (Diamox) అన్న టాబ్లెట్ వాడటం ప్రాచుర్యంలో ఉంది. ఫిన్లాండ్ దేశంలో చేసిన ఒక అధ్యయనం ప్రకారం, ఈ మందు ఇందుకు ఎంతో సహాయకారి అని తేలింది. కాకపోతే డయామాక్స్ వాడినపుడు కాలివేళ్లూ చేతివేళ్ళూ చిన్నపాటి సూదులు గుచ్చుకున్న భావనకు గురి అయ్యే అవకాశం ఉంది. అలాగే పదేపదే మూత్ర విసర్జన చేయాలనీ అనిపించవచ్చు… ట్రెకింగ్ లాంటి శారీరకశ్రమ కలిగించే కార్యక్రమాలు పెట్టుకున్నపుడు డీహైడ్రేషన్ జరగకుండా తరచుగా మంచినీళ్ళు తాగవలసి ఉంటుంది. కానీ దీనివల్ల AMSను ఆహ్వానించినట్టయ్యే ప్రమాదం ఉంది.
మామూలుకన్నా ఎక్కువగా నీళ్ళు తాగినపుడు ఎదురయ్యే ముఖ్యమైన సమస్య మూత్రవిసర్జన. ఆడవులూ చెట్లూ నిండిన దిగువ ప్రాంతాలలో మరుగు దొరకడం సమస్య కాదు. చెట్లన్నీ అదృశ్యమైపోయి రాళ్ళూ రప్పలే నిండిన ఎడారి ప్రదేశాల్లో మరుగు ఒక సమస్య – ఆడవాళ్ళకు మరీనూ! మొదట్లో అది సమస్యలా కనిపించినా క్రమక్రమంగా దాని ఉధృతి తగ్గుతుంది. ట్రెక్‌లకంటూ వచ్చాక మరుగు అంటూ వెతుకులాడటం అనవసర ప్రయాస అనీ, సమస్త ప్రపంచమూ మన విసర్జనా సమస్యకు పరిష్కార మార్గమేననీ బోధపడటానికి మాకు పెద్దగా సమయం పట్టలేదు.
అన్నట్టు మా వైద్యనిపుణుల బృందానికి మరో బాధ్యతకూడా అప్పజెప్పాం: ఎమర్జెన్సీ మందులు సరైన పరిమాణంలో సేకరించి తీసుకురావడం, అవి అత్యవసర పరిస్థితుల్లో అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం కూడా నిపుణుల బృందపు బాధ్యతే అని ముందుగానే స్పష్టీకరించాం. ఈ జాగ్రత్తల పుణ్యమా అని ‘ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా వైద్యసదుపాయానికి లోటు ఉండదు,’ అన్న నమ్మకం మా అందరికీ కలిగింది. మాకేకాదు – రష్యన్ బృందం లాంటి సహయాత్రికులకు కూడా ఆపత్కాలంలో సహాయం అందించగలిగాం.
అక్టోబర్ 25. మా ట్రెకింగ్‌లో పదవ రోజు. చిట్టచివరి రోజు. గోరక్షెప్‌లో బయల్దేరి ఎవరెస్ట్ బేస్‌కాంప్ చేరుకుని తిరిగి గోరక్షెప్ చేరుకోవడం ఆనాటి కార్యక్రమం.
బాగా పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ ముగించి మా టీ హౌస్ వదిలిపెట్టాం. ఖుంబు గ్లేషియర్ మీదుగా ఉన్న రాళ్ళబాటను పట్టుకున్నాం. బయల్దేరినపుడు బాగా చలిగా అనిపించినా సూర్యోదయం అయ్యేసరికి ఆ కిరణాల వెచ్చదనం మాకు హాయిని కలిగించింది. ఆకాశం నిర్మలంగా ఉండటం, సూర్యుడు వెచ్చదనం పంచుతూ మమ్మల్ని ముందుకు సాగమని ప్రోత్సహించడం – చక్కని నడక అది. నిన్నటి నాలుగువందల మీటర్ల కాలాపత్థర్ అధిరోహణ మాకు పెద్ద సవాలు విసిరింది. ఆ సవాలును స్వీకరించి జయించిన నేపథ్యంలో ఈనాటి సమతలయానం ఎంతో హాయిగా అనిపించింది. అంతా కలసి రెండువందల మీటర్ల ఎగువకే వెళ్ళాలి కదా – అంచేత ఏ వత్తిడీ లేకుండా ఆడుతూ పాడుతూ గమ్యంకేసి సాగిపోయాం.
ఆ బేస్‌కాంప్‌కు వెళ్ళే దారి అంతా రాళ్ళు బండల మయం. చేరువలో ఉన్న ఖుంబు గ్లేషియర్ అడపాదడపా చిటచిటలాడుతోంది. కుడివేపున గంభీరంగా నుప్త్సె శిఖరం. నుప్త్సె శిఖరం వెనక ఉండిపోయిన ఎవరెస్ట్ మా కంటికి కనిపించకుండా పోయింది. ఎడమన పుమోరి శిఖరం. దృశ్యపరంగా కాలాపత్థర్ శిఖరంతో ఏమాత్రం సరితూగలేని ప్రాంతమా ఎవరెస్ట్ బేస్‌కాంప్ ప్రాంతం. ఏదేమైనా గమనం గమనమే గమ్యం గమ్యమే అన్నది బుద్ధి. అదేం కాదు గమ్యంకన్నా గమనమే మిన్న అన్నది మనసు. ఆ మనసూ బుద్ధిల చర్చలో నేను జోక్యం చేసుకోలేదు. గమ్యం చేరుకుంటున్నామన్న ఉత్తేజం మా బృందం అంతటిలోనూ వెల్లివిరిసింది.
ఆ ఉత్సాహాలూ ఉత్తేజాల మధ్య, మా ఎడమపక్కనుంచి పిడుగులు పడ్డ శబ్దం వినిపించింది. రోమాలు నిక్కబొడుచుకున్న క్షణమది. అంతా ఆ శబ్దం వస్తోన్న పుమోరి పర్వతం కేసి చూసాం. నిజమే – అనంత హిమరాశులు ఆ పర్వతసానువులలోంచి విరిగి క్రిందకు జారుతున్నాయి. ఆ ప్రక్రియలో దట్టమైన మంచుపొగ ఆ ప్రాంతమంతా అలుముకొంటోంది. ఎప్పుడూ వింటూ ఉన్న హిమపాతం – ఎవలాంచ్ – దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడటం మాకు అదే మొదటిసారి. ఆ హిమఖండాలన్నీ మా వేపే దూసుకువస్తోన్న భావన కలిగింది. భయపడాలని కూడా తెలియనంతగా మనసులు మొద్దుబారిపోయాయి. మేమంతా మంచు దొంతరలలో చిక్కుపడిపోవడం ఖాయం అనిపించింది. మాతోబాటు వస్తోన్న రేషమ్ అన్న గైడ్ మాత్రం ఏ ఆందోళనా లేకుండా హిమపాత ప్రక్రియను గమనిస్తూ ఉండిపోయాడు. ‘భయపడకండి. మనకూ ఆ హిమపాతానికీ మధ్య పెద్దపాటి లోయ ఉంది. అంచేత ఆ ఎవలాంచ్ మన దాకా వచ్చే ప్రమాదం లేదు’ అని చెప్పి మా భయానికి అడ్డుకట్ట వేసాడు. అంతా సర్దుకున్నాం. ఏదేమైనా ఆ ఉన్నత పర్వతసీమలో మంచుపెళ్ళల మహోగ్రరూపం చూడటమన్నది ఎప్పటికీ మరచిపోలేని అనుభవం.
మా నడక ఓ గడ్డకట్టిన తటాకం పక్కనుంచి సాగింది. మరి కాస్త దూరం వెళ్ళాక బౌద్ధ ప్రార్థనాపతాకాలతో నిండిన బృహత్శిల ఒకటి కనిపించింది. అదిగో ఆ స్థలమే ఎవరెస్ట్ బేస్ కాంప్: ఖుంబు హిమపాతం దగ్గర, ఖుంబు హిమనది పుట్టినచోట ఉన్న ఎవరెస్ట్ బేస్ కాంప్. శరత్కాలం అవడంవల్ల అక్కడ ఎవరెస్ట్ శిఖరారోహకుల ఛాయలు లేవు. మాలాంటి ట్రెకర్లు మాత్రమే చేరుకునే ఋతువు అది. మాలాంటి వారికి ఈ బేస్‌కాంపే అంతిమగమ్యం అయితే శిఖరారోహణ చేసే వారికి ఇదే ఆరంభ బిందువు!
శిఖరారోహణ ఋతువులో ఈ విశాల ప్రాంగణం డజన్లకొద్దీ రంగురంగుల గుడారాలతో పెద్ద గ్రామంలా కళకళలాడుతుంది అని చెప్పుకొచ్చాడు బాబు గురంగ్. శిఖరారోహకులు, షెర్పాలు, గైడ్లు, పోర్టర్లు – దాదాపు వెయ్యిమంది ఈ బేస్‌కాంప్‌లో కూడుకుని శిఖరారోహణకు అనువైన సమయంకోసం రోజుల తరబడి నిరీక్షిస్తూ ఉంటారట. అధికారుల నుంచి ఆ అనుమతి వచ్చాకే వాళ్ళు ముందుకు సాగాలట. టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిలరీ, రీన్‌హర్డ్‌మెస్నర్‌లాంటి మహనీయులు కాంప్ చేసిన ప్రదేశమది అన్న భావన మనసును ఊయలలూపింది. అన్నట్టు ఎవరెస్ట్ పరంగా రెండు బేస్‌కాంప్‌లు ఉన్నాయి. మేమున్నది నేపాల్ ద్వారా శిఖరం చేరుకొనే దక్షిణమార్గపు ఆరంభ బిందువు. టిబెట్ ద్వారా ఉత్తర మార్గాన శిఖరారోహణ చేసేవారికి ఆ ప్రాంతాన మరో బేస్‌కాంప్ ఉంది.
కాంప్ దగ్గర ‘ఎవరెస్ట్ బేస్‌కాంప్’ అని ఎర్రెర్రెని అక్షరాలు రాసి ఉన్న పెద్ద సైజు పుటాకారపు బండరాయి ఉంది. పాతిక ముప్ఫైమంది ఆ బండరాయి దగ్గర చేరి ఆ ఎర్రని అక్షరాలు కనిపించేలా ఫోటోలు తీసుకుంటున్నారు. ఆ కోలాహలం గమనించిన మేము కూడా మెల్లిగా ఆ బండరాయికేసి అడుగులు వేశాం. జాగ్రత్తగా బండ మీదకు ఎక్కాం. ఆ అధిరోహణ మా మనసుల్లో సంతోషాన్ని నింపింది. గమ్యం చేరామన్న సంబరం ఒకవేపు, కష్టసాధ్యమైన కాలినడక ముగిసిందన్న ఉపశమనం మరొక వేపు – వెరసి కొండంత సంతోషం. మా ప్రయత్నాలు, మా సన్నాహాలు, మా శ్రమ ఫలించిన క్షణమది. మా కలలు నెరవేరిన రోజు అది. సంబరాలు జరుపుకొనే రోజు అది.
ఆ రాతిని తాకాం. కౌగలించుకున్నాం. అధిరోహించాం. అరుపులు, కేరింతలు, ఒకరినొకరు వెన్ను తట్టుకోవడాలు, కౌగలించుకోవడాలు, మురిసిపోవడాలు – కాలాన్ని వెనక్కి తిప్పి అందరం పసిపిల్లలమై పోయిన క్షణాలవి. విజయభావంతో, మనసు విప్పి బండమీద నుంచి ప్రసంగాలు చేసిన క్షణాలవి. మా కుటుంబాలకూ, బృంద సహచరులకు, ఇతర స్నేహితులకు, పోర్టర్లకు, గైడ్లకు కేరింతలతో ధన్యవాదాలు అర్పించిన క్షణాలవి. వారందరి ప్రత్యక్ష-పరోక్ష సహకారం లేనట్టయితే ఆ గమ్యం చేరడం సాధ్యమయేది కాదన్న గ్రహింపును కృతజ్ఞతాభావంతో వెల్లడించిన క్షణాలవి. మా బృందమంతా గమ్యం చేరిన సంతోషం, సంతృప్తి, చిరుగర్వం పరిపూర్ణంగా అనుభవించిన క్షణాలవి. ఏ అవరోధమూ లేకుండా మొత్తం బృందాన్ని గమ్యం దగ్గరకు చేర్చగలిగానన్న భావన నన్ను సంతృప్తితో ముంచెత్తిన క్షణాలవి. ప్రతి ఒక్కరం ప్రతి క్షణాన్ని మనసులోకి శాశ్వతంగా ఇంకించుకొని పదిలపరచుకొన్నాం.
ఎంత అవధులులేని ఆనందమైనా దానికీ చిన్న ఆనకట్ట అవసరం. గమ్యం చేరడం సంగతి ఎలా ఉన్నా ఆ ఈబీసీ ప్రాంగణంనుంచి ఎవరెస్ట్ శిఖరం కనిపించనే కనిపించదు అన్నది తిరుగులేని వాస్తవం. దానికీ మాకూ మధ్య కొండలు అడ్డొచ్చాయి. ఆ సంగతి మాకు ముందే తెలుసు కాబట్టి ఆట్టే నిరాశపడలేదు. నిన్ననే గదా కాలాపత్థర్ శిఖరాగ్రంనుంచి వివిధ వర్ణాలతో శోభించిన ఎవరెస్ట్ శిఖరాన్ని తనివిదీరా చూసిందీ అని మాకు మేము సమాధానం చెప్పుకున్నాం.
తిరిగి గూటికి చేరేసరికి నిమ్మరసం పిండిన అల్లం టీతో స్వాగతం పలికారు మా టీ హౌస్‌వాళ్ళు.
ఎంత కాదనుకున్నా మా బృందంలో ఐదుగురికి కాస్తంత నలత సోకింది. వాళ్ళు హెలికాప్టర్లో దిగువకు వెళ్ళిపోయారు. తిరుగుప్రయాణంలో కూడా ఈబీసీ నుంచి లుక్లా వరకూ రెండున్నర రోజులు కాలినడకనే సాగాలనుకొన్నది మేము ముందు వేసుకొన్న ప్రణాళిక. వాతావరణపు ఆటుపోట్లకు గురి ఆవడం, నడచి నడచి డస్సిపోవడం – మాలో కొంత విజ్ఞత నింపాయి. తిరిగి నడిచి వెళ్ళడమన్నది హీరోచిత కార్యమే కావచ్చు కానీ మాలో చాలామంది ఏభై ఏళ్ళు దాటిన వాళ్ళని, కొందరు ఇప్పటికే ‘ఖుంబు దగ్గు’లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి సమయాల్లో వీరోచితంకన్నా విజ్ఞతే మిన్న అనీ మాకు సకాలంలో బోధపడింది. బుద్ధిగా అందరం హెలికాప్టర్‌కే ఓటు వేసాం. అప్పటికే హెలికాప్టర్‌లో వెళ్ళినవాళ్ళు వెళ్లిపోగా మిగిలిన వాళ్ళందరికీ మర్నాడు హెలికాప్టర్ ఏర్పాటు చేయగలనన్నాడు సూర్య. బావుందనిపించింది. ఇంకో రాత్రి గోరక్షెప్‌లో గడపాలన్నమాట – అదీ మంచిదే అనిపించింది.
ఇంకా భోజనం సమయం అవలేదు. గబగబా భోజనం ముగించి దిగువ నడక ఆరంభించాలన్న తొందర లేదు. అంచేత అల్లం-నిమ్మరసం తేనీరు తీరిగ్గా చప్పరిస్తూ కబుర్లలో మునిగిపోయాం. కబుర్లు సాగుతూ ఉండగానే భోజనాలు రెడీ అని పిలుపు వచ్చింది. తీరిగ్గా భోజనాలు ముగించాక చిన్న కృతజ్ఞతా సమావేశం పెట్టుకున్నాం. గత పదకొండు రోజులుగా మాతోపాటు అడుగులో అడుగువేసి అనునిత్యం మమ్మల్ని కనిపెట్టుకొని ఉన్న గైడ్‌లకూ పోర్టర్లకూ ధన్యవాదాలు చెప్పుకోవడం, సరియైన అదనపు పారితోషికాలు అందించడం ఆ సమావేశపు ధ్యేయం. నేనూ, నాతోపాటు మరికొంతమందీ ప్రశంసాప్రసంగాలు చేశాం. అనుభవంనిండిన వారి సహాయసహకారాలకు వినమ్రపూర్వక ధన్యవాదాలు చెప్పాం. ఆ ఉన్నతపర్వతసీమలలో వారి మార్గదర్శకత్వం లేని పక్షంలో మాలాంటి ఔత్సాహికులు అడుగైనా ముందుకు వెయ్యలేరన్న సంగతి నొక్కి వక్కాణించాం. ఈ విషయం నాకు 2022 నాటి ఈబీసే ట్రెక్‌లోనే కాదు – 2019 నాటి కిలిమంజారో శిఖరారోహణ సమయంలోనే ఎంతో స్పష్టంగా తెలిసింది. అక్కడ ఆ గైడ్‌లు అందించిన సహకారం అద్వితీయం. ఇక్కడ బాబు గురంగ్, అతని బృందం కూడా మాకు బాగా సన్నిహితులయ్యారు. వాళ్ళు మా రక్షణ విషయంలో వృత్తిని దాటిన శ్రద్ధ చూపించారు. చక్కని సంఘీభావంతో అందరం ముందుకు సాగాం. మేము నడిచిన దారిలో వాళ్ళు కొన్ని వందలసార్లు నడిచి ఉంటారు గదా – ఆ అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడింది.
సమావేశం ముగిశాక కూడా సాయంత్రం దాకా మేమంతా మా మా అనుభవాలనూ ఆలోచనలనూ పంచుకుంటూ ఎంతో ప్రశాంతంగా సంతోషంగా సమయం గడిపాం. చలి, తగ్గిన ఆక్సిజన్ స్థాయిలాంటి చిన్న చిన్న విషయాలు మర్చిపోయి గడిపాం. బృందంలోని ఇరవై ముగ్గురమూ చిట్టచివరిదాకా చేరగలిగామన్న విషయం ప్రతి ఒక్కరి సంతోషాన్నీ ఇరవై మూడు రెట్లు పెంచింది. మాలో ఒక్కరు వెనక్కి తిరగవలసి వచ్చినా మా సంతోషం శూన్యస్థాయికి చేరుకుని ఉండేదన్నది నిర్వివాదాంశం. మాలో కొంతమందికి ఈ ట్రెక్ భౌతికంగా పెనుసవాలు. విజయం సాధించిన సవాలు. మరికొంతమందికి ఇది ఒక అధివాస్తవిక అనుభవం. ఇంకొంతమందికి ఆధ్యాత్మిక అనుభవం. అనుభవాల బాణీలలో తేడాలు ఉన్నా మేము భౌతికంగా మానసికంగా ఎదుర్కొన్న సవాళ్ళూ వాటిని అధిగమించి లక్ష్యం చేరుకున్న తీరూ – అందరిలోనూ చెప్పలేని సంతృప్తి కలిగించింది.
ఆ రాత్రి నిద్రకు సిద్ధపడ్డవేళ గత మూడేళ్ళుగా ఈబీసీ ట్రెక్ విషయంలో జరిగిన పరిణామాలు, తీసుకున్న నిర్ణయాలు, లభించిన ఫలితాలు ఒకటొకటిగా నా జ్ఞాపకాల పేటికలోంచి బయటపడి మనసును ముసురుకున్నాయి. అవన్నీ కలగలసి ఈనాటి మా యాత్రను విజయవంతం చేసిన తీరు గొప్ప సంతోషం కలిగించసాగింది. మొట్టమొదట్లో సూర్యను సంప్రదించి తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం: ఏ నెలలో ఈ ప్రయత్నం పెట్టుకోవాలీ అన్నది. శరత్కాలమే మేలు అని కూడబలుక్కుని నిర్ణయించాం. ఆ నిర్ణయం ఎంతో సబబైనది అని తేలింది. స్థూలంగా వసంతఋతువూ శరత్కాలమూ ఈబీసీ ట్రెక్‌కు అనువైన సమయాలు. ఋతువు ఏదైనా ఎత్తులు పెరుగుతున్నకొద్దీ వాతావరణం అతి స్వల్పవ్యవధిలో పెనుమార్పులకు గురి అవుతుంది. అలాగే ఆ ప్రాంతాలలో ప్రతి స్థలానికీ తనదైన ప్రత్యేక సూక్ష్మ వాతావరణం ఉంటుంది. హిమపాతాలూ అకాలవర్షాలూ ఏ ఋతువులోనయినా జరగవచ్చు. అయినా మిగతా సమయాలతో పోలిస్తే ఈబీసే ట్రెక్‌కు వసంత, శరదృతువులు మేలు.
ముందే చెప్పుకున్నట్టు మా ఏజెంట్ సూర్య ఏ సూక్ష్మ వివరమూ వదలకుండా ఎంతో పకడ్బందీగా యాత్రా ప్రణాళికలు రూపొందించే మనిషి. అతను మా ఈబీసీ యాత్రకు వేసిన పునాది దిట్టమైనది. 2019 నుంచీ నేను అతనితో ఈ ట్రెక్‌ను గురించి మాట్లాడుతూనే ఉన్నాను. కోవిడ్ పుణ్యమా అని మూడేళ్ళు జాప్యం కలిగినా సూర్య ఏనాడూ తన ఆసక్తి కోల్పోలేదు. అలాగే మా యాత్ర సాగిన పది రోజులూ ఖాట్మండూనుంచి తన సహాయసహకారాలూ సలహాలూ అందిస్తూనే వచ్చాడు. యాత్రికులుగా మా అవసరాలను గ్రహించి తీర్చే నేర్పూ ఓర్పూ ఉన్న మనిషి సూర్య. నా వరకూ నేను సూర్యలాంటివాళ్ళు ఎలాంటి పరిధుల మధ్య పని చేస్తుంటారో, వారి నియంత్రణలో లేని విషయాల మీద వారి నిస్సహాయతలు ఎలా ఉంటాయో, వాతావరణ ప్రకోపాల విషయంలో వారి పరిధి ఎలా కుంచించుకుపోతుందో గ్రహించి, సహకరించే ప్రయత్నం చేశాను. ఏదేమైనా ఒక మాట చెప్పుకోవాలి: సూర్యలాంటి ట్రావెల్ ఏజెంటూ బాబూ గురంగ్‌లాంటి గైడూ దొరికినట్టయితే ఈబీసీలాంటి ట్రెక్‌లు ఒకటేమిటి, పదయినా అవలీలగా చేసేయవచ్చు.
2019లో తొలిసారిగా ఈబీసీ ట్రెక్ వివరాలు శోధిస్తున్నప్పుడు యూకేలోని రెక్స్‌హామ్‌కు చెందిన డాక్టర్ సంజయ్ అగర్వాల్ అన్న రేడియాలజిస్టు స్నేహితుణ్ణి సంప్రదించాను. నేపాలీ మూలాలకు చెందిన ఆ అగర్వాల్ అప్పటికే ఈబీసీ ట్రెక్ చేసి ఉన్నాడు. ఆయన సూర్య పేరు సూచించాడు. మూడేళ్ళ తర్వాత ఆ సూచనే ఒక వరంగా పరిణమించబోతోందని నేను ఆనాడు ఊహించలేదు.
ఆ జ్ఞాపకాల దొంతరల మధ్య నిద్రలోకి ఎపుడు జారుకున్నానో తెలియనే తెలియలేదు. ఐదువేల మీటర్ల ఎగువన వరసగా రెండు రాత్రులు నిద్రించానన్నమాట. మరోసారి ఇలా ఇంత ఎత్తున రాత్రి గడిపే అవసరం, అవకాశం వస్తాయనుకోను.
మర్నాటి ఉదయం అందరం హెలికాప్టర్లో ముందు గోరక్షెప్‌నుంచి పెరిఛె లోయకూ మళ్ళా అక్కణ్ణుంచి లుక్లాకూ చేరుకున్నాం. మా హెలికాప్టర్ నడిపిన పైలెట్ బ్రెజిల్ దేశస్థుడు. ‘ఈ ఉద్యోగం కోసం అంత దూరంనుంచి వచ్చావా’ అంటే ‘హిమాలయాలలో హెలికాప్టర్ నడపడమన్నది ఏ పైలెట్‌కైనా ఒక కల. కొండల మధ్య నడపడం అన్నది దానికదే ఒక సవాలు. కానీ అది కలిగించే సంతోషం వెలలేనిది. జీతభత్యాలు బాగా ముడతాయన్నది మరో అనుకూల అంశం’ అని సమాధానమిచ్చాడా బ్రెజిలియన్ పైలెట్!
మా హెలికాప్టర్ నదుల జాడల వెంబడే లోయలలో ఎగురుతూ సాగింది… దారిలో మేము నడచిన దారులూ దాటిన గ్రామాలూ కనిపించి పలకరించాయి. ఖాట్మండూ చేరుతోన్న సమయంలో నదులన్నీ పుష్టిగా మారి ఒడ్లొరిసి ప్రవహించడం గమనించాను. అదంతా కోసీ నదీ వ్యవస్థ. చిరునదులన్నీ కలసి కలసి కోసీగా పరిణమించి చివరికి గంగానదిలో సంగమిస్తాయన్నమాట.
హెలికాప్టర్ ప్రయాణం వల్ల మా అందరికీ ఖాట్మండూలో ఒక రోజు అదనంగా గడిపే అవకాశం దొరికింది. మా యాత్రలో పన్నెండవరోజు, అక్టోబరు 27, రికామీగా గడిపేశాం. కొంతమందిమి ఊళ్ళోని ప్రసిద్ధ బౌద్ధ ఆలయాలు – బౌద్ధనాథ్, స్వయంభునాథ్ చూడటానికి వెళ్ళాం. కొండశిఖరాన ఉన్న స్వయంభూనాథ్ మందిరం దగ్గర, విశాఖకు చెందిన యశ్వంత్ మరోసారి కనిపించాడు. ఈబీసీ ట్రెక్ మా బృందం కన్నా రెండురోజులు ముందుగా నడచిన మనిషి యశ్వంత్. మొదటిసారి డెంగ్బోచె గ్రామంలో ఇద్దరం కలుసుకున్నాం. పలకరించుకున్నాం. రెండోసారి అతను బేస్‌కాంప్ నుంచి తిరిగి వస్తున్నపుడు లొబూచె గ్రామంలో కలుసుకొని అనుభవాలు పంచుకున్నాం. మూడోసారి ఇలా ఖాట్మండూలో. మేము లొబూచెలో విడివడిన తర్వాత అతనికి కలిగిన దారుణమైన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు యశ్వంత్. నామ్చే బాజార్ చేరుకొనేటపుడు బాగా చీకటిపడిపోయిందట. అంతా దారి తప్పారట. ఆ నిస్సహాయ స్థితిలో వీళ్ళ గైడు వీళ్ళ మానానికి వీళ్ళను వదిలేసి తన దారి తాను చూసుకున్నాడట! ఎంత దారుణమదీ… ఎలాగో అష్టకష్టాలు పడి యశ్వంత్‌వాళ్ళు ఆ రాత్రి నామ్చే బాజార్ చేరుకోగలిగారట. ఏదేమైనా పర్వతాల మధ్య చీకటి వేళ అలా యాత్రికులను వదిలిపెట్టడానికి ఆ గైడుకు మనసెలా ఒప్పిందో… అది ప్రాణాంతకం అని ఆ మహానుభావుడికి తెలియదూ?!
పన్నెండు రోజులు. ఇరవై ఇద్దరు సహచరులు. ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో కార్యక్రమ విజయంలో పాలు పంచుకున్న తీరు. ఒక జీవిత కాలంలో మరచిపోలేని అనుభవాలు, జ్ఞాపకాలు…
పన్నెండు రోజుల తర్వాత మనం పర్వతాలను వదిలి ఖాట్మండూలాంటి నగరాల్లోకి చేరవచ్చు – కానీ పర్వతాలు మనల్ని వదలవు. ఎవరెస్ట్ మనల్ని వదలదు. స్మృతులు వదలడమన్న ప్రశ్నే లేదు.
ఖాట్మండూ తిరిగి చేరానేగానీ ఇంకా ఆశ్చర్యంగా ఉంది – మేమేనా అన్ని రోజులపాటు వర్షం, చలి, పలచబడే గాలి, మందగించే ఆకలి, అడుగు వెయ్యడానికి కష్టపడే శరీరం – వీటన్నిటినీ అధిగమించి అంతంత దూరం, అన్నన్ని ఎత్తులు ఎక్కి ఎవరెస్ట్‌తో గుసగుసలాడి తిరిగివచ్చింది?! సరికొత్త సభ్యులనూ, మహిళలనూ బృందంలో చేర్చుకుని పద్ధెనిమిదివేల అడుగుల ఎత్తుకు విజయవంతంగా చేరి తిరిగి వచ్చింది మేమేనా?!
అవును. మేమే. మమ్మల్ని స్నేహబంధంలో కలిపి ఉంచింది, మా మనసులనీ వ్యక్తిత్వాలనూ పక్కన పెట్టి ఉమ్మడి ధ్యేయంకేసి కలసికట్టుగా నడిపించిందీ ఈ హిమాలయాలే. మా గుండెల్లో కొండగాలిని నింపి, మనసుల్లో సాహసప్రవృత్తిని నింపి, ‘మళ్ళా మళ్ళా రండి’ అని సాగనంపింది హిమాలయాలే. అందరూ మా మనసును కొంత అక్కడ వదిలిపెట్టి వచ్చాం. బదులుగా హిమాలయ జ్ఞాపకశకలాలను భద్రంగా గుండెల్లో నింపుకుని వచ్చాం. ఇది కలకాలం నిలచే బంధం. మా అందరి ఉమ్మడి బంధం.
ఎవరెస్ట్ అంటే మార్మికత. సాహసాలకు మారుపేరు. ప్రకృతి సౌందర్యానికి తిరుగులేని ప్రతీక. ఎవరెస్ట్ శిఖరారోహణ అంటే మానవ సంకల్పం ప్రాకృతిక అవరోధాలను అధిగమించడం. అసాధ్యమనిపించే గమ్యాలను సాధించడం. అది మానవుడు 1953లో సాధించాడు. ఆ తర్వాత ఏడువేలమంది ఆ శిఖరంమీద కాలుమోపారు. కొంతమంది ఒకటికి రెండుసార్లు, పదిసార్లు ఎక్కారు. మరి మేమంతా ఏభై సంవత్సరాలు దాటినవాళ్ళం. మాకు ఎవరెస్ట్ బేస్‌కాంప్ చేరుకోవడమే కొండంత సంబరం… నా వరకూ నాకు ఈ ప్రయాణం బేస్‌కాంప్ చేరడం గురించి కాదు. నా మనసునూ, నా అహాన్నీ, నన్ను నేనూ జయించుకొని వెళ్ళి చైతన్య దీప్తిని నాలో నింపుకోవడం…
లండన్ వెళ్ళే విమానంలో చేరగిలబడినప్పుడు మనసు మరోసారి హిమాలయ విహారానికి ఉపక్రమించింది… ఎన్నెన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో దృశ్యాలు మనసులో తిరుగాడి ఉక్కిరిబిక్కిరి చేసాయి.
మంచుకిరీటాలు పెట్టుకున్న గిరిశిఖరాలు, ఆ పర్వతసానువుల్లో పచ్చల సరోవరాలు, కంటికి కనిపించనంత మంద్రంగా సాగిపోయే హిమనీనదాలు, వాటికి ప్రాణంపోసే హిమపాతాలు, ఉన్నట్టుండి ఫెళ్ళుఫెళ్ళున విరుచుకుపడే హిమకుడ్యాలు, ఆ హిమరాశులు గలగల సెలయేళ్ళుగా పరిణమించడం, తెల్లని కొండలు దిగువకు చేరేకొద్దీ పచ్చల గనులుగా వృక్షాలతో నిండిపోవడం, లోయలు, అఖాతాలు, ఊయల వంతెనలు, షెర్పా గ్రామాలు, టీ హౌస్‌లు, వాటిల్లోని వెచ్చని డైనింగ్ రూమ్‌లు, మంచుపెట్టెల్లాంటి గదుల్లో రాత్రి నిద్రలు, పోర్టర్లు, గైడ్లు, సూర్య, గురంగ్, బౌద్ధారామాలు, ప్రార్థనా పతాకాలు, చిట్టి స్థూపాలు, మృతవీరుల శిలా జ్ఞాపికలు, దారి పొడవునా ఆత్మీయంగా పలకరించి ఆదరించే స్థానిక గ్రామీణులు, నింపాదిగా సాగిపోయే వారి జీవన స్రవంతులు – ఎన్నో జ్ఞాపకాలు… ఎన్నెన్నో అనుభవాలు… మేమంటే మేమని తోసుకువచ్చి మనసును నింపసాగాయి.
అన్నన్ని అనుభవాలు జ్ఞాపకాల మధ్య హఠాత్తుగా ఒక్క విషయం స్ఫురించింది. దాన్ని మాటల్లో చెప్పడం కష్టం – చెప్పాలని ఏమాత్రం ప్రయత్నం చేసినా ఆ అపురూపమైన ఎరుకకు అన్యాయం చేసినవాడినే అవుతానేమో!
శబ్దరాహిత్యం.
హిమాలయ శబ్దరాహిత్యం.
ఆ పర్వతాలు ఎంత ఉన్నతమో అంతకన్న లోతుగా అక్కడి లోయలలో నెలకొన్న శబ్దరాహిత్యం.
అనుదినం మనం అనేకానేక శబ్దాలు వింటూ ఉంటాం. వింటూ ఉంటామేగానీ అవి మనసుకు చేరవు. ప్రభావితం చెయ్యవు.
కానీ హిమాలయాల సంగతి వేరు.
అక్కడ గలగల పారే సెలయేళ్ళు, మంద్రంగానో ప్రచండంగానో వీచే గాలి – ఆ భౌతికశబ్దాలు శ్రవణేంద్రియాలకే పరిమితమై, ప్రకృతి ఆలపించే నిశ్శబ్ద సంగీతం మనసును తాకి ఊయలలూపుతుంది. ఆ నిశ్శబ్దశబ్దాలు అంతరాత్మతో అనుకంపిస్తాయి. యోగులు, ఋషులు హిమాలయాలకు చేరి సాధించేది ఈ శబ్దరాహిత్యాన్నేనా? ఆధ్యాత్మిక దర్శనం అంటే ఇదేనా?
తెలియదు. నాకు తెలియదు. అది తెలుసుకొనేటంత పరిణతి, విజ్ఞత నాకు లేవు. బహుశా ఎప్పటికీ అవి నాకు సమకూరవేమో…
కానీ ఒక్క మాట నిజం. ఆ నిశ్శబ్ద శబ్దసీమ పొలిమేరల్లోకి వెళ్ళి వచ్చాను. శబ్దరాహిత్యం అంటూ ఉంటుందని గ్రహించగలిగాను.
బహుశా ఈ గ్రహింపు, ఈ ఎరుక నన్ను మళ్ళీ మళ్ళీ హిమాలయాల ఒడిలోకి చేరుస్తుందేమో!