తెలుగులో యాత్రారచన అనగానే తాను 1830లో చేసిన ప్రయాణం గురించి ఏనుగుల వీరాస్వామి రాసిన కాశీయాత్ర చరిత్ర గుర్తొస్తుంది. మహిళల యాత్రా చరిత్ర అనగానే నాయని కృష్ణకుమారి 1967నాటి ప్రయాణపు వివరాల కాశ్మీర దీపకళిక మనసులో మెదులుతుంది. ఆ ఒరవడికి చెందిన పుస్తకమే పోతం జానకమ్మ 1873 నాటి విదేశీయాత్రా విశేషాలు ఉన్న జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర. అసలిలా ఒక తెలుగు మహిళ దాదాపు నూట ఏభై ఏళ్ళ క్రితమే రాశారని, దాన్ని స్నేహితుల కోరిక ప్రకారం ఇంగ్లీషులోకి తానే అనువదించి పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లండ్ అన్నపేరిట 1876లో ప్రచురించారని- ఆ వివరాలు 2022 జూన్‌లో ఆ ఇంగ్లీషు ట్రావెలాగ్‌ను కాళిదాసు పురుషోత్తం తిరిగి తెలుగులోకి అనువదించి ప్రచురించే దాకా చాలామందికి తెలియదు.
జానకమ్మ యాత్రాకథనం గురించి పురుషోత్తం ఎన్నో వివరాలు సేకరించారు. ఆమె రాసిన తెలుగు వెర్షన్ దొరక్కపోయినా ఆ తెలుగు కథనానికి పరిచయం లాంటి ఒక విపులమైన లేఖ కొక్కొండ వెంకటరత్నం పంతులు నడిపే ఆంధ్రాభాషా సంజీవని అన్న పత్రికలో 1874లో ప్రచురించబడిందని, ఆ లేఖావ్యాసం గురించి 39 సంవత్సరాల తర్వాత 1913లో ఆర్యమత బోధిని అన్న పత్రికలో ప్రస్తావన ఉందని, ‘వ్యాసమునందలి శైలి, యందలి యుక్తులు మిక్కిలి ప్రౌఢముగా నున్నవి’ అని ఆ పత్రికలో రాశారనీ పురుషోత్తం చెపుతారు. ఏది ఏమైనా ఆమె రాసిన తెలుగు కథనం ప్రచురించబడిన దాఖలాలు లేవు. అసలా తెలుగు వర్షన్ దొరకడమే లేదు. దాని ఇంగ్లీషు అనువాదం ప్రచురణ వివరాలే కాకుండా ఆ పుస్తకమూ దొరుకుతోంది. ఇపుడది మళ్ళీ అనువదించబడి మన చేతికి అందింది.
పుస్తకమయితే అందింది కానీ జానకమ్మ ఇతర వివరాలు ఏ మాత్రం అందుబాటులో లేవు. ‘జానకమ్మ 1840 ప్రాంతంలో తెలుగు బలిజ వ్యాపారస్థుల కుటుంబంలో జన్మించి ఉంటుందని ఊహించుకోవచ్చు’ అంటారు పురుషోత్తం. ఈ ట్రావెలాగ్‌లో ఉన్న ఆధారాలను బట్టి ఆమెది సంపన్న కుటుంబమని, చదువుకొన్న మనిషి అని, ఇంగ్లీషు భాషలో తగుమాత్రం ప్రవేశం ఉందని, దేశకాలమాన పరిస్థితుల విషయంలో ఆమెకు సగటును మించిన పరిజ్ఞానం, సంప్రదాయాలను అధిగమించే మానసిక బలం ఉందనీ అర్థమవుతుంది.
జానకమ్మ యాత్రా రచనలో ఉన్న వివరాలు, ఆమె ఆలోచనలు, అనుభవాలు ఆధారంగా చూస్తే ఆమె సంపన్న మహిళే కాకుండా మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరులాంటి ఉన్నత అధికారులతోను, ఆనాటి బొంబాయి పురప్రముఖుడు డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ కుటుంబంతోను, లండన్ నగరానికి చెందిన విద్యావేత్తలూ సంస్కరణాభిలాషులతోనూ చక్కని పరిచయాలు ఉన్న వికసిత మనస్వి అని తెలుస్తుంది. కానీ ఆమె పరిచయాల గురించీ అనుభవాల గురించీ చెప్పినపుడు అతిశయం, ఆడంబరం ఛాయలు కనిపించవు. ఈ సహజ సంయమనం వల్ల సగటు యాత్రా రచనల్లో కనిపించని అనుభవాలూ, లోతులూ మనకు ఈ పుస్తకంలో అందుతాయి.
భర్తతోపాటు ఇంగ్లండ్ వెళుతున్నారన్న వార్త విని జానకమ్మ బంధువులు, ఆత్మీయులు ప్రేమగా మందలించారట. అయినా వినకుండా వెళుతుంటే అందరూ అన్నపానీయాలు ముట్టకుండా కన్నీళ్ళు పెట్టుకొని బిగ్గరగా రోదించారట. ‘ఈ సానుభూతే మనుషులను జంతువుల నుంచి వేరు చేస్తుందనుకొంటాను’ అనే వివేచన ఉన్న వ్యక్తి జానకమ్మ. సముద్ర ప్రయాణం ప్రమాదకరం అన్న భావన వాళ్ళ కన్నీళ్ళకు ముఖ్యకారణం కావచ్చు. పైగా అప్పటికే అది పాపమని, ప్రాయశ్చితం చేసుకోవలసిన పని అనీ సామాజికంగా పాతుకుపోయి ఉంది. జానకమ్మ స్వతంత్ర ప్రవృత్తి ముందు ఆ కన్నీళ్ళు గానీ, ‘పాపభీతి’ కానీ పనిచెయ్యలేదు. ‘నేను కట్టుబాట్లను ఉల్లంఘించినట్లు అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. నాకంటే ముందు కొంతమంది హిందూ మహిళలు ఇంగ్లండ్ వెళ్ళి ఉంటే నా నేస్తులు ఇంతగా దుఃఖించి ఉండరు. అటువంటి సంప్రదాయం లేకపోవడమే వాళ్ళ దుఃఖానికి కారణమనుకొంటాను’ అంటారు జానకమ్మ.
1873 జూలై – 1874 ఫిబ్రవరిల మధ్య జానకమ్మ ఇంగ్లండ్ ప్రయాణం సాగింది. మద్రాసులో ఓడ ఎక్కి (శ్రీలంకలోని) గాల్, ఈడెన్, సూయజ్ కెనాల్, అలెగ్జాండ్రియా, మాల్టా, జిబ్రాల్టర్, సౌతాంప్టన్‌ల మీదుగా లండన్ చేరడానికి ఆమెకు నలభైరోజులు పట్టింది. అయిదు నెలలు విదేశాల్లో గడిపాక మరో అయిదు వారాల సముద్రయానం చేసి 1874 ఫిబ్రవరి ఒకటిన ఆమె తిరిగి మద్రాసు చేరారు. ఆమె భర్త రాఘవయ్య ఈ ప్రయాణం పొడవునా ఆమెతో ఉన్నారు. ‘ఇంగ్లండ్ గురించి ఏమీ తెలియని రోజుల్లో ఆ దేశం చూడాలనే ఆలోచనను కూడా తీవ్రంగా ఏవగించుకొన్నాను. నా ఆలోచనల్లో ఎలా మార్పు వచ్చిందో చెప్పలేను కానీ దాని ఫలితంగానే ఆ దేశానికి వెళ్ళొచ్చానని సంతోషంగా, గర్వంగా చెప్పగలుగుతున్నాను’ అంటారు జానకమ్మ. తన యాత్రలో ఎక్కువ సమయం లండన్ నగరంలో గడిపారు. నగరపు శివార్లలోనూ బాగా తిరిగారు. లండన్‌తో పాటు మాంచెస్టర్ నగరం కూడా వెళ్ళారు. దానితోపాటు ‘విక్టోరియా రాణి ఏలుబడిలో లేని దేశాలను కూడా చూసి రావాలనే కోరిక’తో పారిస్ కూడా వెళ్ళి కొన్నాళ్ళు గడిపి వచ్చారు.
చురుకుదనం మూర్తీభవించినట్టు కనిపించే జానకమ్మ తన అయిదు నెలల నివాసాన్ని, రెండు నెలల పైచిలుకు సాగరయానాన్ని వింతలూ విశేషాలూ వినోదాలకే పరిమితం చెయ్యలేదు. ఉన్న సంపదతో, తమతో తీసుకువెళ్ళిన ముగ్గురు సేవకుల సాయంతో సుఖంగా, విలాసంగా గడపలేదు. జిజ్ఞాస, ఆలోచన, పరిశీలన, పరిశోధన ఆమెను అనుక్షణం నడిపించాయి. ఎన్నో అనుభూతి నిండిన అనుభవాలను, సహృదయ స్పందనలనూ తన పుస్తకంలో ఆమె పంచుకొంటారు. సమకాలీన సంఘటనలను, వర్తమాన చరిత్రనూ నమోదు చెయ్యడం, అవసరమైనచోట ఆయా ప్రదేశాలూ వ్యక్తుల చారిత్రక నేపథ్యాలూ వివరించడం, తరచుగా ఇంగ్లండ్ పరిస్థితుల్ని భారతదేశ పరిస్థితుల్ని పోల్చిచూడడం – వీటి వల్ల ఈ పుస్తకం సాధారణ యాత్రాగాథ పరిమితులు దాటుకొని ఒక అసాధారణ చారిత్రక పత్రంగా పరిణమించింది. ఇప్పటికీ ప్రాసంగికత ఉన్న విలువైన రచనగా మనకు మిగిలింది. నూట ఏభై ఏళ్ళ నాటి కట్టుబాట్లు, మహిళల స్థితిగతులు, పరిశ్రమలు, సాంకేతిక ఆవిష్కరణలు, రాజకీయ పరిణామాలు ఈ పుస్తకంలో నమోదు అయ్యి దానికి ఒక ప్రత్యేకతను సమకూర్చాయి.
జానకమ్మలోని కుతూహలం, జిజ్ఞాస, పరిశీలనాశీలత మనకు పుస్తకం మొట్టమొదట్లోనే మద్రాసు-ఇంగ్లండు సముద్ర ప్రయాణంలో అర్థమవుతాయి. ప్రయాణం ఆరంభంలో ఓడ సిబ్బంది మహిళా ప్రయాణీకులందర్నీ ఓడంతా తిప్పి అందులోని సౌకర్యాలు వివరించినపుడు జానకమ్మ ఆ వివరాలు తెలుసుకోవడంతోనే సరిపుచ్చుకోలేదు. దిక్సూచి సహాయంతో ఓడను సరి అయిన దిశలో నడిపించే విధానం, ఓడ ఎంత దూరం ప్రయాణం చేసిందో అది తెలుసుకొనే పద్ధతి, రెండు ఓడలు ఎదురెదురు అయినపుడు అవి పరస్పరం పలకరించుకొనే పద్ధతి–ఇవన్నీ గమనించి వివరిస్తారు.
అలాగే ఓడలోని ఇతర ప్రయాణీకులూ సిబ్బందీ ప్రవర్తనా రీతి, వారి సహృదయత, కలుపుగోరుతనం, భోజనాల దగ్గర గంటలకొద్దీ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే పాశ్చాత్య ప్రయాణీకులు ఇతర సమయాల్లో క్షణం వృథా చెయ్యకుండా పుస్తకాలు చదువుతూ పొద్దుపుచ్చడం, ఓడలో మరణం సంభవించినపుడు అంత్యక్రియలు సగౌరవంగా నిర్వహించి సీ బరియల్ చేసే పద్ధతి, ఓడ ప్రయాణంలో అది ఆగినచోటనల్లా అక్కడి స్థానిక జన జీవనపు వివరాలు, సూయజ్ కెనాల్, మాల్టా, జిబ్రాల్టర్ లాంటి ప్రదేశాల వివరాలు–ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చెప్పుకొస్తారు జానకమ్మ.
‘ఈ పుస్తకం ముఖ్యంగా మనదేశ స్త్రీల కోసమే రాశాను’ అనే జానకమ్మ పుస్తకం పొడవునా తాను తన ప్రయాణంలో గమనించిన మహిళల స్థితిగతులు, వాటిల్ని మనదేశపు స్త్రీల పరిస్థితులతో పోల్చిచూడడం చేస్తూనే ఉంటారు. ఇంగ్లండ్ దేశంలో అడుగుపెట్టిన మొదటిరోజునే సౌతాంప్టన్ హోటల్లో ‘పనివాళ్ళలో దాదాపు అందరూ స్త్రీలే. ఈ యువతులు పురుషులకన్నా తెలివిగా పనిచేస్తున్నట్టు అనిపించింది. రైల్వేస్టేషన్లో కూడా పనులన్నీ మహిళలే చేస్తున్నారు’ అని చెప్పి మురిసిపోతారు. లండన్‌లో కుదురుకున్నాక ‘ఈ దేశపు మహిళల్లో దాదాపు అందరూ అక్షరాస్యులే’ అని ఆనందపడతారు. తమ యాత్ర ముగిసే దశలో తన పరిశీలనకు ఒక రూపం ఇచ్చి ‘హిందూ దేశపు స్త్రీలకంటే ఇక్కడి స్త్రీలు మంచి స్థితిలో ఉన్నారు. పురుషులతో సమానమైన గౌరవం పొందుతున్నారు. ఇక్కడి దంపతుల మధ్య ప్రేమ చాలా గొప్పది. మగవాళ్ళు స్త్రీలను ఏ విషయంలోనయినా తమతో సమానంగా చూస్తారు. మనదేశంలో పురుషులు స్త్రీలను అన్ని విషయాల్లోనూ తక్కువగా చూస్తున్నారు’ అంటారు.
ఈ పుస్తకం చదివితే పరిశీలన, విశ్లేషణ, వివరణ జానకమ్మ సహజ లక్షణం అనిపిస్తుంది. లండన్ నగరం గురించి చెపుతూ ‘షాపులు రాత్రి బాగా పొద్దుపోయేదాకా తెరచి ఉంటాయి. దీపాల కాంతులతో అంతా శోభాయానంగా ఉంటుంది’ అంటూనే ‘లండన్ నగరంలో ఖర్చులు పెరిగిపోవడం, జీవితావసరాలకోసం ఇబ్బంది పడటం రెండూ త్వరత్వరగా జరుగుతున్నట్టు అనిపిస్తోంది’ అంటారు. అలాగే ఇంగ్లండ్ హోటల్లో కొద్దిరోజులు గడిపి, తాము సుదీర్ఘకాలం ఉండటానికి అనువుగా ఒక ఇల్లు అద్దెకు తీసుకున్న తర్వాత అక్కడి ఉన్నత వర్గాల మహిళలూ కుటుంబాల గురించి, వారి అనుదిన జీవన సరళి గురించి వివరంగా చెపుతారు. అలాంటి ఇళ్ళల్లో ఉండే హౌస్‌కీపర్, బట్లర్, పార్లర్ మెయిడ్, ఫుట్‌మ్యాన్, కుక్, నర్స్, నర్స్‌మెయిడ్, లేడీస్ మెయిడ్, జంట్స్ మెయిడ్, వాలే–వీళ్ళందరి మధ్య పని విభజన గురించి సమగ్ర సమాచారం అందిస్తారు. లండన్‌లో ఎలాంటి బసలూ ఇళ్ళూ సందర్శకులకూ విద్యార్థులకూ దొరుకుతాయి అన్న విషయం, అందులోని బాగోగులు, అరుదుగా జరిగే మోసాల గురించి వివరిస్తారు. లండన్‌లోని విద్యావంతులైన కొందరు మహిళలు భారతీయుల స్థితిగతుల పట్ల మనస్ఫూర్తిగా శ్రద్ధ వహిస్తున్నారని, ఇష్టాగోష్ఠులు ఏర్పాటు చేసి, భారతీయుల అసౌకర్యాలూ కోరికలూ తెలుసుకొంటారని, ఉభయ జాతుల ప్రజలు సన్నిహితులయ్యేలా చూస్తున్నారనీ చెపుతారు జానకమ్మ. తాను ఎంతగానో కోరుకున్న మేరీ కార్పెంటర్‌ను కలవలేకపోయినా లండన్ లార్డ్ మేయర్ పదవిలో ఉన్న సర్ సిడ్నీ వాటర్లూను, ఆయన సతీమణినీ వారి అధికారిక గృహంలో చాలాసార్లు కలుసుకొన్న సంగతి చెపుతారు. ఇంగ్లండులోని భయంకరమైన చలికాలం గురించి, 1873 నాటి లండన్ మంచు బీభత్సం గురించి, ఆ చలినుంచి కాపాడుకోడానికి ఆ దేశవాసులు అనుసరించే పద్ధతుల గురించి వివరంగా చెపుతారు.
ఈ పుస్తకంలో మనకు ఎన్నోసార్లు కనిపించే విషయం హిందూ క్రైస్తవ మతచర్చ. తన మొదటి ఓడ ప్రయాణంలో సహప్రయాణీకులు ప్రతిరోజూ ప్రార్థనలు చెయ్యడం, తోటి ప్రయాణీకుడి అంత్యక్రియల్లో చదివే ప్రార్థనలు విని ‘ఈ ప్రార్ధనలు చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగినంత సరళమైనవి. హృదయాలను స్పృశిస్తాయి. మన మంత్రాలను కూడా దేశభాషల్లోకి అనువదించే రోజు రావాలి’ అంటూనే, ‘దీని అర్థం నేను క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తున్నట్లు కాదు. ఈ లోకంలోని సంపదనంతా నా ముందు కుప్పపోసినా నేనాపని చెయ్యనుగాక చెయ్యను’ అని స్పష్టీకరిస్తారు. అలాగే ‘ఇంగ్లండ్ వెళితే కులభ్రష్టులవుతారని, మతం మారాలని ఇంగ్లీషువాళ్ళు ఒత్తిడి చేస్తారనే అసంబద్ధ భావన మనలో చాలామందిలో ఉంది. ఇది ఊహాగానమే. ఆంగ్లేయులు మతవ్యాప్తికి ప్రయత్నిస్తారే తప్ప వాళ్ళ మతాన్ని ఎవరిపైనా రుద్దరు’ అని నమ్మకంగా చెపుతారు జానకమ్మ. పారిస్‌లో ఒక చర్చిలో జరిగిన ఆదివారపు ప్రార్థనల్లో పాల్గొని, చర్చి అంతా కలయతిరగటానికి సంకోచించరామె.
జానకమ్మ ఎంతవరకూ చదువుకొన్నారు అన్న విషయం స్పష్టంగా తెలియకపోయినా ఆమె విషయ పరిజ్ఞానం, ఆంగ్ల భాషా పరిచయం ఆధారంగా ఆమె కళాశాల మెట్లు ఎక్కి ఉంటారని మనం భావించవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆమెలోని సాంకేతిక జిజ్ఞాస మనల్ని ఆకట్టుకొంటుంది. ఓడలోని దిక్సూచి గురించి వివరించిన జానకమ్మ లండన్‌లో తాను గమనించిన టెలిగ్రాఫ్, భూగర్భ రైలు వ్యవస్థలను, విద్యుత్‌తో పనిచేసే కాలింగ్ బెల్లులనూ వివరిస్తారు. రాయల్ పాలిటెక్నిక్ అన్న వైజ్ఞానిక సంస్థకు వెళ్ళి డైవింగ్ బెల్, గృహ విద్యుత్తు, మోడల్ ఇంజన్, సిల్బర్ లైట్‌లాంటి వాటి పనితీరును గమనిస్తారు. అవకాశం వచ్చినపుడల్లా వెళ్ళి అక్కడి శాస్త్రీయ ప్రయోగాలను చూస్తారు. అక్కడ నిర్వహించే సాంకేతిక ప్రసంగాలకు వెళ్తారు. గృహ విద్యుత్తు మీద జె. ఎల్. కింగ్ అన్న నిష్ణాతుడు చేసిన ప్రసంగం అందులో ఒకటి. తపాలా వ్యవస్థ గురించి, అగ్నిమాపక దళాల గురించీ తెలుసుకొని వివరిస్తారు. మాంచెస్టర్‌లో పరిశ్రమల గురించి చెపుతారు. ఆమె ఆయా వివరాల గురించి చెప్పే పద్ధతి చూస్తే ఈనాటికీ సగటు మనుషుల్లో అరుదుగా గానీ కనిపించని సైంటిఫిక్ జిజ్ఞాస ఆమెలో పుష్కలంగా ఉందని అర్థమవుతుంది.
అలా అని ఆమె వింతలూ విశేషాలూ వినోదాలకు దూరమేం కాదు.
లండన్ నగరంలోని చూడవలసిన విశేషాలన్నీ చూశారు జానకమ్మ. సెయింట్ పాల్ కథడ్రల్, వెస్ట్ మిన్‌స్టర్ హాల్, పార్లమెంటు భవనాలు, వెస్ట్ మిన్‌స్టర్ ఆబీ, లండన్ టవర్, గ్యాసులైట్లు, ఆమ్ని బస్సులు-క్యాబులు (నిజానికి అవి గుర్రపు బగ్గీలు), పార్కులు, థేమ్స్ నది, నాటకశాలలు, పారిస్‌లోని రాజభవనం, వర్సాయ్ పట్టణం-కోట వీటన్నటినీ చూడటమే గాకుండా వాటి పుట్టుపూర్వోత్తరాలు వివరంగా చెపుతారు. లండన్‌లోని విండ్సర్ కాజిల్ గురించి చెపుతూ ‘విండర్స్ కోట, పట్టణాల చరిత్రను ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు. ఆ చరిత్రను తప్పుల్లేకుండా ఏకరువు పెట్టగలను’ అంటారు. అలాగే రవి అస్తమించని విశాల సామ్రాజ్య అధినేత విక్టోరియా మహారాణిని దర్శించాలన్న ఆకాంక్షతో ఆమె శీతాకాలం గడిపే విండర్స్ కోటకు ఒకటికి నాలుగుసార్లు వెళ్ళి ఆ కోరిక తీర్చుకుంటారు. సెలవల తర్వాత కోర్టులు తెరిచిన రోజున ఉత్సవ సంప్రదాయంగా జరిగే వెస్ట్‌మిన్‌స్టర్ హాల్ దగ్గరి జడ్జీల ఊరేగింపు చూస్తారు. ఆ మధ్యే లండన్ నగరంలో ఏర్పాటు చేసిన మేడమ్ టుసాడ్ మైనపు బొమ్మల ప్రదర్శనకు వెళ్ళి, గొప్ప ఆశ్చర్యానికి గురియై ఆ సంబరం మనతో పంచుకొంటారు.
యాత్రికులందరిలోనూ ఉండే సామాన్యగుణం, తాము తమ ప్రయాణాల్లో చూసిన విశేషాలను, పొందిన అనుభవాలనూ తమ తమ ప్రాంతాల సంప్రదాయాలు, సంస్కృతులతో పోల్చిచూడటం. మేడమ్ టుసాడ్ ప్రదర్శన జానకమ్మకు మయసభను గుర్తుకు తెస్తుంది. మానవ నిర్మిత అద్భుతం అయిన సూయెజ్ కనాల్ ఆమెకు అలాంటి అద్భుతాలే అనిపించే తంజావూరు, కంచి దేవాలయాల్ని గుర్తు చేస్తుంది. లండన్‌లోని వెస్ట్ ఎండ్ ప్రాంతం ఆమెకు అడయార్, నుంగంబాక్కంలను గుర్తుచేస్తుంది. సముద్రయాన సమయంలో ఆమెకు సముద్రంలో కొండలు గుట్టలు ఉంటాయని తెలిశాక సముద్ర గర్భంలో దాక్కొన్న మైనాక పర్వతపు రామాయణ గాథ గుర్తొస్తుంది. వైస్‍రాయి అలెగ్జాండ్రియా వచ్చినపుడు టర్కీ సైనికులు స్వాగతం చెపుతూ కాల్చిన తుపాకుల శబ్దం ఆమెకు అర్జునుడి రథం వెళుతున్నపుడు వచ్చే ఫెళఫెళ శబ్దాన్ని గుర్తు చేస్తుంది.
ఇన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్న పుస్తకంలో కొన్ని విస్మయం కలిగించే విషయాలూ కనిపిస్తాయి.
విండ్సర్ కోట చరిత్రను, అలాంటి అనేక వివరాలనూ ‘ఏ తప్పులూ లేకుండా ఏకరువు’ పెట్టే జానకమ్మ తన కళ్ళముందే జరిగిన 1857 నాటి సంఘటనలను ఎక్కడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారతీయ స్త్రీల విద్యకోసం, సమానత్వం కోసం పాశ్చాత్య మహిళలు పడుతోన్న శ్రమ గురించి చెప్పిన రచయితకు తన ముందు తరపు రాజారామ్‌మోహన్ రాయ్ గాని, తన తరపు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గానీ గుర్తు రారు. మాంచెస్టర్‌లో పరిశ్రమల గురించి వివరించిన జానకమ్మకు ఆనాటి కార్మికుల స్థితిగతుల వివరాలు తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నట్టు కనిపించదు. సాంకేతిక పారిశ్రామిక పురోగతి గురించి తెలుసుకొన్నారే గానీ వాటి వెనుకా, వలస దేశాల ఆధిపత్యాల వెనుకా పొంచి ఉండే వ్యాపార స్వభావాలు, అసమానతల వ్యవస్థ గురించి కనీస అవగాహన ఉన్నట్టు కనిపించదు.
అయినా ఒకచోట ఇలాంటి విషయాలు ఆమె సుప్త చైతన్యాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయేమోనన్న సూచన మనకు అందుతుంది. ఎన్నెన్నోసార్లు ఇంగ్లండ్ గురించీ లండన్ నగరం గురించీ ఎన్నెన్నో పొగడ్తలు కురిపించిన జానకమ్మ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏ కారణమూ లేకుండా, ఉన్నా వివరించకుండా ‘ఇంగ్లండ్ ఎంతో గొప్పదని గర్వించడానికి, ఎంతో నీచమని దుఃఖించడానికీ సమాన కారణాలు ఉన్నాయి. క్రూరత్వానికీ, దౌర్జన్యాలకూ ఈ నగరమే మూలం’ అనేస్తారు.
పుస్తకంలోని వివరాలు చూస్తే జానకమ్మ ఒక వికసిత సంపన్న భద్రమహిళ అని, ఆనాటి బ్రిటిష్ పాలన మీద, అది తీసుకువచ్చిన అనేకానేక మార్పుల మీదా ఎంతో అభిమానమూ గౌరవమూ ఉన్న వ్యక్తి అనీ అర్థమవుతుంది. ఆ పాలన వల్ల లాభపడిన వర్గాలలో సహజంగా గూడుకట్టుకొనే కృతజ్ఞతాభావం, సమర్థన మనకు ఈ రచనలో స్పష్టంగా కనిపిస్తుంది. 1871నాటి పారిస్ కమ్యూన్ ఫలితాలను పారిస్ నగరంలో చూస్తూ ఆ తిరుగుబాటు దారుల గురించి చేసిన వ్యాఖ్యల్లో అప్పటి వ్యవస్థ, మెజారిటీ ప్రజల ఆలోచనా విధానమే కనిపిస్తుంది గానీ ఆ పరిణామాలను అవగాహన చేసుకుని మాట్లాడటం ఏ మాత్రం కనిపించదు. ఇంతటి అవగాహన జానకమ్మలాంటి భద్ర మహిళకు ఉండాలని ఆశించడం కూడా అసమంజసమేమో!
ఏది ఏమైనా జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర అన్న యాత్రాగాథ ఒక ముఖ్యమైన పుస్తకం. ట్రావెలాగ్ పరిధులు దాటి వెళ్ళిన ప్రయోజనకరమైన పుస్తకం. నూట ఏభై ఏళ్ళనాటి సామాజిక పరిస్థితులను కొంత పరిణతితో చిత్రించిన పుస్తకం. పసితనపు ఉత్సుకతతో ప్రపంచాన్ని చూసి రాసిన పుస్తకం. విద్యుచ్ఛక్తి లాంటి నూతన ఆవిష్కరణల గురించీ, డేవిడ్ లివింగ్‌స్టన్ లాంటి అన్వేషకుల గురించీ, పారిస్ కమ్యూన్ లాంటి చారిత్రక ఘటనల గురించీ ప్రత్యక్ష సాక్షి కంఠస్వరంతో వివరాలు అందించడం ఈ పుస్తకం విశిష్టత. ఏనుగుల వీరాస్వామి ఎలా 1830-31ల నాటి భారతదేశపు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, భౌగోళిక, చారిత్రక వివరాలకు తన కాశీయాత్ర చరిత్రలో పట్టం కట్టాడో అదే బాణీలో నడచిన కాలాతీతమైన యాత్రాగాథ ఈ జానకమ్మ ఇంగ్లండు యాత్ర. ఎంతో ప్రయాసపడి ఈ పుస్తకపు ఆంగ్ల ప్రతిని సంపాదించి, శ్రద్ధగా పఠన సౌలభ్యంతో అనువదించిన కాళిదాసు పురుషోత్తం ఎన్నెన్నో అభినందనలకు అర్హులు.