ఆ లేఖలన్నీ చేరినప్పుడే కదా,
మన చుట్టూ అడవులు విస్తరించేది
అందరికీ నాలుగు వేళ్లూ నోట్లోకి పోయేది!

మరొక శరీరం ఉంటుంది
దీనికి అలుపు లేదు, ఆశాభంగం లేదు
వయసు లేదు, వృద్ధాప్యం లేదు
ప్రాణమై ప్రవేశించే ఒక పద్య పాదం కోసం
అనంత కాలం నిరీక్షిస్తుంది

గిరియందు గాక గడ్డిదిబ్బల మీద ఆడునా నెమలి?
కొలనులో గాక చిన్నికాల్వల నీరాడునా కలహంస?
మావిచిగుళ్ళు మెసవక మోమెత్తి పాడునా కోకిల?
పరిమళములు లేని పూలపై వ్రాలునా తుమ్మెద?
నా దేవుడు చెన్నమల్లికార్జునుని గాక నా మనసు
ఇతరుల నెట్లు చేరగలదో? చెప్పరమ్మా?

ఆకుల మధ్య ఖాళీల్లో ఇరుక్కుపోయిన సూర్యుడు పెరోల్ మీద పలకరింపుకొస్తాడు. అక్కడక్కడా కొన్ని గడపలకు చేతులు మొలిచి గాల్లో ఊగుతాయి. సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకునే తలుపు పాడే నిరసన పాటకు గోడలు దాచుకున్న నిశ్శబ్దం మట్టిబొమ్మ పగులుతుంది.

తియ్యని రాత్రి, నమ్మదగని
అసంగతం కాని రాత్రి
ఆకాశంలో చంద్రుడు
నిండుకున్నాడు.

ఎన్ని ప్రభూతులం గలవరింతల తాకితినో రవంత వి-
చ్ఛిన్నతలేని పున్నెముల శీతలపుంజము కోరి; యెంత కా-
వ్యాన్నమునాబ చేత ముఖమంతట కూరితినో, గురూక్తిగా
విన్న పురాకవీశ్వరుల వేదనలో, సిరిలో, ప్రపత్తిలో
మన్ననలో, గవేషణము మానక సల్పితినో; చికాకు లో-
గొన్న మనమ్ము గింజుకొన కూరిమి బల్మిని క్రుక్కికొంటినో

పూల మీది రంగుల్లా పుట్టాల్సినవాడివి
సీతాకోక రెక్కల నిశ్శబ్దంలా,
ఇంద్రధనువులోని చెమ్మగాలిలా,
అడవిచెట్ల నీడల్లా ఉండాల్సినవాడివి
ఇలా ఎందుకున్నావని దుఃఖపడతావు

చిటచిట నిప్పులు రేగిన
నా ఆకలి తీర్చుట కనుకొందును!
పెళపెళ మొయిళ్ళు కురిసిన
నా స్నానము కొరకే ననుకొందును!
తొటదొట రాళ్ళే పైబడిన
రాలిన పుష్పములనుకొందును!

కకావికలై దారితప్పిన మిత్రులనూ;
రెక్కలు తెగిన ఆప్తులనూ;
మళ్ళీ కలుస్తానో లేదోనన్న బెంగ
కంటి గోళాల్లో ప్రతిఫలిస్తోంటే…
నిన్నటినుంచీ ద్వారం మీద
నిశ్చలంగా వాలినది వాలినట్టే

తెరిచిన పుస్తకంలో
కళ్ళు మూసిన అక్షరాలు
అక్షరాల మధ్య
గగుర్పొడుస్తున్న అర్ధవిన్యాసం

కంఠంలో ఇరుక్కున్న విషం
విషాద మేఘాల కంట తడి