నటనకు గీటురాయి

నలభై మూడేళ్ళ క్రితం నిశాంత్ అనే శ్యామ్ బెనెగల్ సినిమా వచ్చింది.

అంతకు క్రిందటి ఏడాదే అతని అంకుర్ రావడం, ఆర్ట్ సినిమాల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాయడం–నేపథ్యంలో మేమంతా నిశాంత్ కోసం ఎదురు చూశాం.

గిరీశ్ కర్నాడ్ ఉన్నాడన్నారు. సాధు మెహర్, షబానా ఆజ్మీ, వాళ్ళతోపాటు పుంజీడుమంది తెలిసీతెలియని తారలు.

ఇంకా పసితనం వదిలినట్టులేని ఓ కుర్తా పైజామా కుర్రాడు. గ్రామపు దొరల కుటుంబంలో విడిచీ విడవని కుబుసంవాడు. ఊళ్ళోని టీచరు భార్య మీద మనసుపడ్డవాడు. తన అన్నలు ఆమెను చెరబట్టి తెచ్చినపుడు సంక్షోభపడినవాడు…

ఆ పాత్ర వేసింది కొత్త నటుడు నసీరుద్దీన్ షా అట. కొత్తవాడే అయినా పదిమంది మంచినటుల మధ్య తన ఉనికిని నిలబెట్టుకోగలిగాడు. ఆ తర్వాత హిందీ చిత్రసీమలో మంథన్, స్పర్శ్, బాజార్, మిర్చ్ మసాలా, మండి, ఆక్రోశ్, మాసూమ్, సర్, ఏ వెన్స్‌డే, ఇలా ఎన్నో సినిమాలలో నటనకు గీటురాయిగా నిలచాడు.

ఆయన 2014లో–తన అరవయ్యయిదో ఏట–అండ్ దెన్ వన్‌డే: ఎ మెమ్‌వార్ (And then one day: A memoir) అంటూ తన జ్ఞాపకాలను విపులంగా రాశాడు. ఎంచేతనో ఆ జ్ఞాపకాలను 1983-84 వరకే పరిమితం చేశాడు.

ఆ నటుడి నేపథ్యాన్ని, నటుడిగా పరిణమించడంలోని ప్రేరణలనూ, నటుడిగా అతని జీవనయానాన్నీ, ఒడిదుడుకులనూ, వ్యక్తిగా అతని జీవన క్రమాన్నీ అతని ‘జ్ఞాపకాల పుస్తకం’ ఆధారంతో ఆవిష్కరించే ప్రయత్నం ఈ పరిచయ వ్యాసం.


సుమారు రెండొందల సంవత్సరాల క్రితం కాబూల్ ప్రాంతం నుంచి జీవిక కోసం సిపాయిగా భారతదేశానికి వచ్చి, 1857 సంగ్రామంలో బ్రిటిషువాళ్ళ తరఫున సైనికుడిగా పాల్గొని, ఆ సేవలకుగానూ మీరట్ దగ్గరి సర్ధానా అన్నచోట ఒక ఎస్టేటును ఈనామ్‌గా పొందిన జాన్-ఫిషన్ ఖాన్, నసీరుద్దీన్ షా కుటుంబపు పూర్వీకుడు. షా వాళ్ళ నాన్న సివిల్ సర్వీస్ ఉద్యోగి. ఉద్యోగరీత్యా అనేకానేక ప్రాంతాలు తిరిగిన పెద్దమనిషి. ఆ ప్రక్రియలో 1949లో లక్నో దగ్గరి బారాబంకీలో షా పుట్టాడు. అతనికిద్దరు అన్నలు. జమీర్ చిన్నన్న. జహీర్ పెద్దన్న. రెండు రెండు ఏళ్ళ ఎడం.

చిన్నతనంలో నసీర్ ఒక కొరకరాని కొయ్య. అల్లరి. మొండితనం. బలాదూరు తిరుగుళ్ళు. నాన్నతో వైమనస్యం. ఏమయిపోతాడో అని నాన్న దిగులు. అన్నలతోపాటు నైనితాల్, అజ్మీర్‌లలో సుప్రసిద్ధ స్కూళ్ళలో చదివినా, చదువు మీద దృష్టి లేకపోవడం. కానీ సినిమాలు. సినిమాలు. బెన్‌హర్, బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్, దారాసింగ్ సినిమాలు. షమ్మీకపూర్, కిషోర్ కుమార్, బల్‌రాజ్ సహాని, దిలీప్, దేవానంద్, క్రికెట్, సిగరెట్స్, డ్రగ్స్. తొమ్మిదోక్లాసు పదేపదే తప్పడం…

…తమ తమ ఫ్యూడల్ సుగుణాలకు ఆంగ్ల మర్యాదలను అనుసంధానించి సోలా టోపీ లేకుండా బయటకు వెళ్ళని ఒక పెద్దమనసు పెద్దమనిషి నసీర్‌వాళ్ళ నాన్న. ఇలాంటి కొడుకంటే ఆ తండ్రిలో ఎంత దిగులూ విముఖతా ఉండాలో అంతా రూపుదిద్దుకోగా– టీనేజ్‌ వచ్చేసరికల్లా సమాంతర జీవన వలయాల్లో చిక్కుకొన్న తండ్రీ కొడుకులు… అనురాగమే తప్ప మేధాసాహచర్యం ఇవ్వలేని తల్లి.


అతి పసితనానే–రెండేళ్ళ వయసులో–రామలీల ప్రదర్శనలో ఒక పాత్ర విపరీతమైన మేకప్‌తో కళ్ళల్లో విస్ఫులింగాలతో కనిపించిందట. అది ఏ పాత్రో గుర్తులేదుగానీ ఆ పాత్ర తన మనసు మీద బలమైన ముద్రవేసింది అంటాడు నసీరుద్దీన్.

ఆరో క్లాసులో ఏదో స్కూలు డ్రామాలో ఓ చిన్న పాత్ర. ఆ తర్వాతి కాలంలో షేక్స్‌పియరానా బృందపు వ్యవస్థాపకుడు జెఫ్రీ కెండాల్ ధరించిన పాత్రలు ఆకట్టుకోగా నటనవేపు ఆకర్షితుడయ్యాడు నసీర్. మళ్ళీ అనుమానం: తన ఏ విలక్షణతా లేని రూపం నటనకు పనికొస్తుందా? కానీ అందమూ తెలివీ స్నేహశీలతా కొరవడిన అతనికి నటిస్తూ మరో మనిషిలా వ్యవహరించడమన్న ప్రక్రియలో గొప్ప ఓదార్పు దొరకగలదని అనిపించిందట.

నసీర్ ఆ సమయంలో, ది ఓల్డ్ మాన్ అండ్ సీ అన్న సినిమా చూశాడు. అందులో ముసలిమనిషిగా వేసింది ఒక నటుడు (స్పెన్సర్ ట్రేసీ) అన్నమాట నమ్మలేకపోయాడు. ఆ అనుభవం అతని ఊహలకు రెక్కలు తొడిగింది. మెట్లెక్కుతూ హిమశిఖరాలను అధిరోహిస్తున్నట్టు భావించుకోవడం, మంచం మీద పడుకొని నడిసంద్రాన పడవలో వెళుతున్నట్టు ఊహించుకోవడం, స్కూలు కారిడార్లో నడుస్తూ తానేదో నిధికోసం గాలిస్తున్నట్టూ, శత్రువుల తుపాకీ గుండ్లను తప్పించుకొంటున్నట్టూ నమ్మడం… అదే సమయంలో మనుషుల ప్రవర్తననూ మాటతీరునూ సునిశితంగా పట్టుకోగల శక్తి తనలో ఉందని నసీర్‌కు అవగాహన కలిగింది.

స్కూలు వార్షికోత్సవానికి డ్రామా కాంపిటీషన్ జరిగింది.

కెండాల్ నాటకాలూ, షైలాకూ ఇంకా మనసులో తాజాగా మెదులుతూ ఉండగా నసీరుద్దీన్ చొరవ చేసుకొని పోటీకి సహచరులను సిద్ధంచేశాడు. మర్చంట్ ఆఫ్ వెనిస్‌లోని దృశ్యాలను తమ ఎంట్రీగా ఇచ్చాడు. షైలాక్ పాత్ర సహజంగానే నసీరుద్దీన్‌ది.

ప్రదర్శన రక్తి కట్టింది. రంగస్థల భీతి సంగతి అటుంచి నసీరుద్దీన్‌కు స్టేజ్ ఎక్కగానే కొత్త శక్తి సమకూరినట్టు అనిపించిందట. అలా నటిస్తూనే ఉండిపోవాలనిపించిందట. అయినా మరో నాటకం, ది రిఫరీ, బహుమతి గెలుచుకుంది.

నసీర్ పిపాస వృథా పోలేదు. అతని నటన అందరి గుర్తింపూ పొందింది. తదుపరి దినాలలో ‘ఉత్తమ నటుడు’ బహుమతి. ‘నేను పుట్టింది నటించడానికే’ అన్న గాలిలో తేలిపోయే భావన. సత్సంబంధాలు లేని తన తండ్రి దగ్గర కూడా ఈ విషయం నొక్కి వక్కాణించగలనన్న విశ్వాసం… నటనను వృత్తిగా తీసుకోవచ్చునన్న పసితనపు ఆశ.

స్కూలు ముగిశాక కాలేజీ సీటుకోసం వెదుకులాట మొదలయింది. అప్పటికే వాళ్ళ నాన్న ఆశలు నేలముఖం పట్టాయి. పెద్దపెద్ద ఉద్యోగాలూ మంచిమంచి కాలేజీలూ గగనకుసుమాలు అన్న సంగతి స్పష్టమయింది. అనాసక్తంగానే నసీర్ తనకు అందుబాటులో ఉన్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ప్రయత్నించాడు. ఫలించలేదు. చివరికి మీరట్‌లో నానక్‌చంద్ కాలేజీలో చేరడం, అంటీముట్టని అనుబంధం.


తన స్నేహితుని స్నేహితురాలి నాన్న బొంబాయి సినిమా రంగంలో చిరు పాత్రధారి అని విన్న నసీర్‌కు బొంబాయి వెళ్ళాలన్న తపన కలిగింది. ఆ చిరుపాత్రధారి తనకు నిలదొక్కుకొనే ఆసరా ఇవ్వగలడనే పసితనపు ఊహలతో బొంబాయి చేరిపోయాడు. సైకిలూ వాచీ అమ్మేడు. ఐదొందలు చేతబట్టుకొని, తల్లిదండ్రులకు చెప్పకుండా బొంబాయి. అక్కడి స్నేహితులూ వాళ్ళ బంధుగణమూ నిరాదరించకపోయినా, అతి త్వరలోనే నసీర్ పనికోసం నిరంతరం వెదుకులాడే వందలాది నిరుద్యోగ నటుల బృందంలో సభ్యుడయ్యాడు. ఉన్న ఆశ్రయం పోయింది. డబ్బులు అయిపోయాయి. తిండికి కటకట. టీనీళ్ళకు మొహం వాచడం. స్టూడియోల చుట్టూ చెక్కర్లు. అమన్, సప్నోంకా సౌదాగర్ లాంటి సినిమాల్లో గుంపులో గోవిందయ్య పాత్రలు. భవిష్యత్తంటే నిరాసక్తత, ఖాళీ కడుపంటే ఉదాసీనత, తాజ్‌మహల్ హోటల్లో బెల్‌బోయ్ ఉద్యోగం కోసం ప్రయత్నం, తిరస్కృతి…

అలాంటి విపరీత పరిస్థితిలో నసీర్‌వాళ్ళ నాన్న తమ పిల్లాడు బొంబాయిలో ఉన్నాడని ఎలాగో పసిగట్టి, తెలిసినవాళ్ళ సాయంతో (ఆ తెలిసిన ఆవిడ దిలీప్‌కుమార్ సోదరి) అతని ఉనికిని పట్టుకోగా, చివరికి మళ్ళీ ఇంటికి. వెళ్ళేలోగా దిలీప్‌తో చిరు కలయిక.

బొంబాయి సాహసాల తర్వాత నసీర్‌కు అలీగఢ్ వెళ్ళక తప్పలేదు. ఆంగ్ల సాహిత్యం, చరిత్ర, రాజకీయ శాస్త్రం పాఠ్యాంశాలుగా బి.ఎ.లో సీటు దొరికింది.


వెయిటింగ్ ఫర్ గోడో – నసీరుద్దీన్ షా

ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్‌లో జహీదా జైదీ అన్న అభ్యుదయభావాలున్న అధ్యాపకురాలు. ఆవిడ మార్గదర్శకత్వంలో జూ స్టోరీ, వెయిటింగ్ ఫర్ గోడో లాంటి నాటకాలు. ఆ ప్రక్రియలో పర్వీన్ మొరాద్ పరిచయం.

పర్వీన్ ముప్ఫైనాలుగేళ్ళ పాకిస్తానీ యువతి. తన వీసా కొనసాగింపు కోసం ఒకదానివెంట ఒకటిగా డిగ్రీలు చేస్తూ నసీర్‌ను కలిసేనాటికి మెడిసిన్ చివరి సంవత్సరంలో ఉంది. అతనికన్నా పద్నాలుగేళ్ళు పెద్దది. తన తల్లితో కలసి యూనివర్సిటీ ప్రాంగణంలో నివాసం.

నసీర్ పర్వీన్‌ల పరిచయం వెంఠనే స్నేహంగా మారింది. అతని మార్గదర్శిగా మారిందావిడ. రోజువారీ కలయికలు. కలసి ఢిల్లీ వెళ్ళి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నాటకాలు చూడటం. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎక్కడచూసినా వీళ్ళే అవడం. పరిస్థితులు అతివేగంగా ముందుకు సాగి 1969లో, నసీర్‌కు పందొమ్మిదేళ్ళ వయసులో, ఆమెతో పెళ్ళి. అనతికాలంలోనే ఆమె గర్భం దాల్చడం. హతాశుడైన నసీర్ తండ్రి.

అడపాదడపా వెళ్ళి చూస్తోన్న ఎన్.ఎస్‌.డి. డ్రామాలు నసీర్‌ను ఎంతగానో ప్రభావితం చేశాయి. యూనివర్సిటీ, ఇంగ్లీషు సాహిత్యం, నాటకాల ప్రదర్శన, ఎన్.ఎస్‌.డిలో ఇబ్రహీం అల్కాజి రూపొందించే అద్భుత నాటకాలు, అవి ప్రదర్శించే అతి సామాన్య కుటుంబాలలోంచి వచ్చిన విద్యార్థి నటులు: ఈ విశ్వమంతా పన్నాగం పన్ని తన జీవితాన్ని నాటకరంగం వేపు మళ్ళిస్తోందన్న భావన నసీర్‌లో. ఎన్.ఎస్‌.డి.లో చేరితీరాలన్న నిర్ణయం. దొరికిన సీటు.

కాని, పర్వీన్‌తో ఎడం పెరిగింది. గర్భాన ఉన్న తన బిడ్డ అంటే మమకారం అటుంచి కనీసపు ఆసక్తీ శ్రద్ధా లేనితనం. ఎన్.ఎస్‌.డి.లో దొరికిన విపరీతమైన స్వేచ్ఛ… దేనికీ ఎవరినీ అడగవలసిన అవసరం లేకపోవడం… ఆడబిడ్డ పుట్టడం… ఏ స్పందనా కలగకపోవడం… పర్వీన్ జీవితం పాప హీబాతో నిండిపోగా, వాళ్ళిద్దరిమధ్యా పంచుకోడానికీ మాట్లాడుకోడానికీ ఏమీలేనితనం. అసలు తనకో పాప ఉందన్న భావనే లేని ఇరవై ఒక్క సంవత్సరాల నసీర్… ఎన్.ఎస్‌.డి.లో రెండో సంవత్సరం చదువుతోన్న ‘ఆర్’తో అనుబంధం… జీవితం ఎటు వెళుతోందీ?!


ఎన్.ఎస్‌.డి. అధినేత ఇబ్రహీం అల్కాజీకి నసీర్ అభిమాన విద్యార్థిగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. ఒథెల్లో, త్రీ పెన్నీ అపేరా, జస్మా ఓడన్‌, లాంటి నాటకాలు… తమ బృందంతో కలసి బొంబాయి, పూనా, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పర్యటన… సహవిద్యార్థి రాజేంద్ర జస్పాల్ స్నేహం… అవిభక్త కవలల్లా కలసి తిరగడం… మరో సహ విద్యార్థి ఓమ్‌ పురి… అతని పద్ధతులు తన పద్ధతులకు వ్యతిరేకమని తెలిసినా అతని ప్రతిభకు ముగ్ధుడై చాలాకాలం అతని నుంచి ఉత్తేజం పొందడం…

ఎన్.ఎస్‌.డి.లో విజయవంతంగా సాగిపోతోన్న నాటకరంగ శిక్షణా జీవితంలోంచి నసీరుద్దీన్‌ను పూనా లోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) వేపు మళ్ళించిన అంశం ఏమిటీ?!

ఢిల్లీలోని రీగల్ థియేటర్లో పియా కా ఘర్ సినిమా చూడటం ఆ పరిణామానికి నాంది.


మహాత్మా vs గాంధీ – కె.కె., షా

అందులోని ఐదురుగు ముఖ్య పాత్రధారులు ఎఫ్.టి.ఐ.ఐ. పూర్వ విద్యార్థులు. అరవైల నడుమ నుంచి డెబ్భైల నడుమ దాకా ఆ సంస్థ నుంచి వచ్చి తారలుగా వెలుగు వెలిగిన వారి సంఖ్య చాలా పెద్దది. ఆ వెలుగు చాలామంది విషయంలో స్వల్పకాలికం అన్నది వేరేమాట. ఎన్.ఎస్‌.డి. నేపథ్యంలో తమతమ గ్రామాలకూ, నగరాలకూ ప్రాంతాలకూ వెళ్ళి రంగస్థల ఉద్యమాన్ని నిర్మించి కళాసేవ చెయ్యడమన్న అల్కాజీ స్వప్నంతో నసీర్‌కు ఏమాత్రం ఏకీభావం లేదు. తారలను తయారుచేసే ఎఫ్.టి.ఐ.ఐ. ద్వారా బొంబాయిలో తన జాతకాన్ని తానే రాసుకోవాలన్న తపన అతనిది. అంచేత తన తదుపరి గమ్యం ఎఫ్.టి.ఐ.ఐ. అన్నది అతి సులభంగా అతను తీసుకొన్న నిర్ణయం.

మరి తన ముఖారవిందం సంగతేమిటీ? సినిమాకు పనికిరాదుగదా… చాలాకాలం అద్దంతో పోట్లాడాడు. మంచి భంగిమల్లో ఫోటోలు ప్రయత్నించాడు. ఊహూఁ! లాభంలేకపోయింది. చివరికి ‘ఆ సినిమారంగానికి నా ముఖారవిందాన్ని అంగీకరించడం తప్ప మరో మార్గం లేదు’ అని స్పష్టపరచుకొన్నాడు!

ఆ పూనా ఇన్‌స్టిట్యూట్‌లో సీటు సంపాదించుకొన్నాడు.

అక్కడ నసీర్ ముందుగా అందిపుచ్చుకొన్న అవకాశం- ప్రపంచపు అత్యుత్తమ సినిమాలను చూడటం, అధ్యయనం చెయ్యడం.

‘ప్రపంచపు సినిమాలను చూసినపుడు మనదేశపు సినిమాల్లోని నటన ఎందుకంత అన్యాయంగా ఉంటుందో అర్థమయింది. ఇది కదా నటన అంటే, అన్న ఉద్వేగం కలిగేది. నటన విషయంలో నేర్చుకోవలసింది ఎంతో వుంది అని స్పష్టమయింది,’ అంటాడు నసీర్.

అలాగే ‘మూడేళ్ళ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ తర్వాత కూడా నేనేమీ నేర్చుకోలేదనీ, ఎప్పటిలాగే అహంకారం నిండిన వదరుబోతుగా కొనసాగుతున్నాననీ అర్థమయింది. నన్ను నేను మాయబుచ్చుకుంటున్నాననీ తెలిసివచ్చింది. అటు ఓమ్‌ పురిని చూస్తే తన వినమ్రతా స్వభావంతో అంకితభావంతో ఎంతో ఎంతో నేర్చుకుంటున్నాడన్నదీ స్పష్టం,’ అంటూ ఆత్మవిమర్శ చేసుకొంటాడు నసీర్.

‘నటుడిగా మనుగడ సాగించాలంటే సామర్థ్యం, చాకచక్యం మాత్రమే సరిపోవు. ఆ వృత్తికి సంబంధించిన లోతుపాతులూ సరిహద్దుసీమల గురించి తెలుసుకొని తీరాలి!’ అని తనకు తాను చెప్పుకొంటాడు.

ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఉండగా ఒక దీర్ఘకాలిక సమ్మెలో భాగమయ్యాడు నసీర్. నిజానికి నాయకత్వం వహించాడనాలి.

డైరెక్షన్ కోర్సు చేసే విద్యార్థులు కోర్సు చివరలో నలభై నిముషాల డిప్లొమా ఫీచర్ ఫిల్మ్ తీసి ప్రదర్శించవలసి ఉంటుంది. అందుకు ఆక్టింగ్ చదువుతోన్న విద్యార్థులను వినియోగించుకోవడమే ఆనవాయితీ అయినా బయటి నటులనూ తీసుకొనే వెసులుబాటు డైరక్షన్ చదివే విద్యార్థులకు ఉంది. దానితో కొంతమంది నటులకు అవకాశాలు తప్పిపోతున్నాయి. అందుకూ ఆ సమ్మె, నిరాహార దీక్షలు.

అతి త్వరలో అది ‘నటన విద్యార్థులు’ వర్సెస్ ‘మిగతా ప్రపంచం’ మధ్య ఘర్షణగా పరిణమించింది. హృషీకేశ్ ముఖర్జీ, మృణాల్‌సేన్, గవర్నమెంట్ సెక్రటరీ సర్దుబాటు ప్రయత్నాలు చేశారు. అప్పటి ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ గిరీశ్ కర్నాడ్ ‘ఈ సమ్మె అత్యంత సిల్లీ కారణపు సమ్మె!’ అని అభిప్రాయపడ్డాడు. సమ్మె గాడితప్పింది.

‘ఓటమి అంచున ఉన్న పోరాటాన్ని కొనసాగించడం అనవసరం’ అని భావించాడు నసీర్. ‘మరణం దాకా రణం’ అన్నాడు సహనాయకుడూ ఆప్తమిత్రుడూ రాజేంద్ర జస్పాల్. చివరికి అంతా కలసి సమ్మె విరమించాలనే నిర్ణయించారు. నిర్ణయం అందరిదీ అయినా జస్పాల్‌కు మాత్రం అది నసీర్ చేసిన ద్రోహం అనిపించింది.

స్నేహం బీటలువారింది. అతుక్కోలేని బీటలవి.


ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చదువు ముగియకముందే నసీర్‌కు ఓ అద్భుత అవకాశం తలుపు తట్టింది.

అప్పటికే అంకుర్ సినిమా తీసి కీర్తిప్రతిష్టలు పొందిన శ్యామ్ బెనెగల్ తన తదుపరి చిత్రం నిశాంత్‌కు ఒక ముఖ్య పాత్ర కోసం నసీరుద్దీన్‌షాను ఎంచుకున్నాడు.

ముందే చెప్పినట్టు ప్రతిభావంతులైన సహనటులు… తన ప్రతిభను నిరూపించుకోవాలన్న నసీర్ తహతహ… అక్కడ శ్యామ్ చక్కని హెచ్చరిక: ‘నటన అనేది బాక్సింగ్ మ్యాచ్ కాదు. అది పదిమంది కలసి ఆడే ఆట. ఆ పదిమందీ సఫలీకృతులవడానికి అవకాశం ఉన్న ఆట. అయితీరవలసిన ఆట.’ నసీర్‌కు ఈ హెచ్చరిక సరైన సమయంలో అందింది. అయినా అతను తన సహజ ప్రవృత్తిని పూర్తిగా నియంత్రించలేకపోయాడన్నది వేరే మాట. శ్యామ్‌తో పనిచేశాక సినిమా అన్నది డైరెక్టరుకు చెందిన విషయమని, దర్శకునికి తన పని ఏమిటో అవగాహన లేకపోతే నటులు చేయగలిగింది దాదాపు శూన్యమనీ నసీర్‌కు అర్థమయింది. ‘కెమేరా అన్నది ఆ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడి కన్నూ అన్నమాట మరవక’ అన్న శ్యామ్ ఉపదేశం మంత్రంగా మారింది నసీర్‌కు.

1975లో విడుదలయిన నిశాంత్ విజయవంతమయింది. షబానా, స్మితా, అమ్రిష్‌పురి, గిరీశ్ కర్నాడ్, అంతా ఆ విజయఫలాలు అందుకోగలిగారు. ‘నాకు గుర్తింపూ పేరూ వచ్చాయి కానీ సినిమా అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు’ అంటాడు నసీర్.

మరో మంచి అవకాశం త్వరలోనే వచ్చింది. శ్యామ్ బెనెగల్ తదుపరి చిత్రం మంథన్‌లో పాత్ర దొరికింది. వ్యవస్థ కల్పించిన వివక్ష మీదా అన్యాయాల మీదా తిరుగుబాటు ధోరణి ప్రదర్శించే దళిత యువకుని పాత్ర అది. అద్భుతంగా పండిన పాత్ర. నటుడిగా నసీర్ స్థానాన్ని సుస్థిరం చేసిన పాత్ర. 1976లో విడుదలయిన ఆ చిత్రం చక్కని విజయం సాధించింది.

సినిమాలలో నటిస్తూనే రంగస్థలం మీద తనకున్న అనురక్తి వల్ల నాటకాలూ వేశాడు నసీర్. అదిగో అప్పుడు పరిచయమయింది రత్నా పాథక్. దీనా పాథక్ కూతురు. సుప్రియా పాథక్ వాళ్ళ అక్క. నసీర్‌కన్నా ఏడేళ్ళు చిన్నది.

పరిచయం స్నేహంగా, స్నేహం అనుబంధంగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. కానీ ఆ అనుబంధానికి దీనా పాథక్ అంత సుముఖం కాదు. మత్తుమందులకు లొంగే, వృత్తిపరంగా నిలకడలేని వ్యక్తితో తన కూతురు కలసి తిరగడమన్నది ఆవిడకు మింగుడు పడలేదు. ఆ సమయంలోనే అసూయాగ్రహాలతో స్థిమితం కోల్పోయిన ఒకనాటి ఆప్త మిత్రుడు రాజేంద్ర జస్పాల్ నసీర్ మీద కత్తితో దాడి, చేసిన తీవ్ర గాయం. అది చూసి ఇదిగాదు పని అని రత్నను లండన్‌లో ఏదో కోర్సుకు పంపింది దీనా.

మంథన్ తర్వాత- భూమిక, గోధూళి, అన్న చిత్రాలలో ప్రధాన పాత్రలు కాకపోయినా చెప్పుకోదగ్గ పాత్రలే దొరికాయి నసీర్‌కు. గోధూళిలో పూజారి పాత్రలో అతను రాణించడం గొప్పగా చెప్పుకొన్నారారోజుల్లో.

నసీర్ నట జీవితంలో జునూన్ సినిమా ఓ ముఖ్యమైన ఘట్టం.

పాప్యులర్ సినిమా నటుడిగా విపరీతమైన గిరాకీలో ఉన్న శశికపూర్ తన ఆత్మసంతృప్తి కోసం అర్థవంతమైన సినిమాలు తియ్యాలని కోరుకొని 1857 సమరపు కథతో జునూన్ నిర్మాణానికి పూనుకున్నాడు. శ్యామ్ బెనెగల్ దర్శకుడు.

‘ఆ సినిమాలో ఆంగ్ల యువతిని ప్రేమించి ఆరాధించే పఠాన్ పాత్ర నాకు వస్తుందని ఆశించాను. అది శశికపూర్‌కు వెళ్ళింది. నాది ఆ సంగ్రామంలో క్రియాశీలంగా పాల్గొనే మరో యువకుని పాత్ర. నేననుకున్న పాత్ర దొరకని పక్షంలో అందరికన్న మిన్నగా నటించడమే నా తక్షణ కర్తవ్యం అనుకొన్నాను. అందుకు శ్రమించాను. జట్టు సభ్యుడిగా మసలుకోవాలన్న సంగతి విస్మరించాను…

…ఆ సినిమాను ఇపుడు మళ్ళా చూస్తే -అది గొప్ప సినిమానే అయినా- ఒఠ్ఠి నటనపోటీగా అనిపిస్తుంది’ అంటాడు నసీర్. ‘పాత్రను నువు చూసే కోణంలోంచి చూసి నటించక. దాన్ని రచయిత ఎలా చూశాడో రాశాడో అలా చెయ్యి అని చెప్పాడు శ్యామ్. మంథన్, జునూన్ సినిమాల్లో దానికి వ్యతిరేకంగా చేశాను. అందుకే ఇప్పుడు తిరిగి ఆలోచిస్తే ఆ రెండు పాత్రలూ ఎంత విజయవంతమయినా నాకు ఇష్టమయిన పాత్రల్లో మాత్రం అవి చేరవు,’ అని నిస్సంకోచంగా చెప్పుకొస్తాడు నసీర్.

ప్రతిభ ఉన్న చిన్నకారు నటులతో పెద్ద పెద్ద సినిమాలు తియ్యడమన్నది తారాచంద్ బార్జాత్యా రాజశ్రీ ఫిలింస్‌ వారి అలవాటు. వారి సినిమా, దుల్హన్ జొ వహీ పియా మన్ భాయేలో నటించిన తాళ్ళూరి రామేశ్వరి రాత్రికి రాత్రి దేశమంతటా తెలిసిన పేరయిపోయింది.

ఆమెతో కలిసి నటించడానికి నసీర్‌ను తీసుకొన్నారు రాజశ్రీవారు. చార్లీ చాప్లిన్ తీసిన సిటీలైట్స్ సినిమా ఆధారంగా సునయన అన్న చిత్రం తీసే సన్నాహమది. రంగస్థలమూ ఆర్ట్ సినిమాలూ తనకు సంతృప్తినీ కీర్తినీ ఇస్తే, వ్యాపారపు సినిమాలు ఇంట్లో పొయ్యి వెలిగిస్తాయి అన్న స్పష్టత ఉన్న మనిషి నసీర్. సంతోషంగా ఆ సినిమా చేశాడు. అయిష్టంగానూ అసౌకర్యంగానూ సినిమాల్లో పాటలకూ నటించాడు. విడుదలయ్యాక చూస్తే అదో అతిపెద్ద దుస్సాహసం అని బోధపడిందతనికి. ‘ఆ పిచ్చి వాలకం పెద్దమనిషి ఆ సినిమాలో ఏం చేస్తున్నాడా అనిపించింది నాకు. ప్రేక్షకులకూ అలానే అనిపించి ఉంటుంది,’ అంటాడు నసీర్.

అదే ఒరవడిలో షాయద్, ఖ్వాబ్‌ లాంటి మరచిపోదగ్గ సినిమాలు చేశాడు. ఏవీ సరిగ్గా ఆడలేదు. ‘ఇది ఒకరకంగా మంచిదే అనాలి. హీరోగాగానీ, విలన్‌గాగానీ, ఏ ఇతర ముఖ్య పాత్రగాగానీ వ్యాపారపు సినిమాల్లో నాకు హిట్లు దొరకలేదు. అంచేత ఒకే మూసపాత్రలు పదే పదే చెయ్యవలసిన అవసరం తప్పింది. ఇంకెవ్వరూ చెయ్యని పాత్రలూ, చెయ్యలేని పాత్రలూ మాత్రమే నాకు దక్కేవి.’ అంటాడు నసీర్.

1979లో సాయి పరాంజపే దర్శకత్వంలో వచ్చిన స్పర్శ్ చిత్రం నసీర్‌కు ఓ మైలురాయి. ‘చెత్త సినిమాల్లో కూరుకుపోతున్న నాకు ఆ సినిమా గొప్ప స్ఫూర్తినీ శక్తినీ ప్రసాదించింది,’ అంటాడాయన. ఆ పాత్రను పోషించడానికి తనను తాను ఎలా సిద్ధం చేసుకున్నాడో, మలచుకున్నాడో విపులంగా వివరిస్తాడీ పుస్తకంలో. ఆ సినిమాకు నేపథ్యమయిన అంధుల పాఠశాల విద్యార్థులూ ఉపాధ్యాయుల గురించి చెపుతూ ‘ఏ మాత్రమూ తొందరపాటు లేకుండా సహజంగా సామాన్యంగా సాగిపోయే వాళ్ళ జీవనసరళి, నవ్వడానికీ ఆనందించడానికీ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండే వారి మానసిక సంతులనం, జీవితాన్ని ఆస్వాదించాలనే వారి ప్రయత్నం, తమ సఫలీకృత ప్రయత్నాల విషయంలో వారికి ఉండే ఆత్మగౌరవం, శాశ్వత అంధకారాన్ని వాళ్ళు అంగీకరించి అధిగమించే పద్ధతీ నాకు ఎంతో ఎంతో స్ఫూర్తి కలిగించిన విషయాలు.’ అంటాడు నసీర్.

ఏడేళ్ళ సాహచర్యం తర్వాత 1982లో రత్నతో వివాహం జరిగింది. ఈలోగా రత్న కూడా ఎన్.ఎస్‌.డి.లో చదువుకోవడం, నటిగా గుర్తింపు సాధించడం జరిగింది.

అదే సమయంలో నసీర్ మొదటి బిడ్డ హీబా–పన్నెండేళ్ళ తర్వాత–‘వచ్చి నిన్ను చూడాలని వుంది’ అని ఉత్తరం రాసింది. అమ్మ పర్వీన్ ఎప్పుడో భారతదేశం వదిలి ఇరాన్, ఇరాన్ వదిలి లండన్ వెళ్ళిపోయింది. తండ్రి దగ్గరకు వచ్చిన హీబా తండ్రి దగ్గరే ఉండిపోయింది. రత్న ఏ సంకోచమూ లేకుండా హీబాను అంగీకరించింది.

జీవితం సినిమాలలోంచా? సినిమాలు జీవితంలోంచా?!

పర్వీన్-హీబా-నసీర్-రత్న పరిణామాలు జరిగిన 1982 ప్రాంతంలోనే శేఖర్ కపూర్ తీస్తోన్న మాసూమ్ సినిమాలో నసీర్‌కు అవకాశం వస్తుంది. కథ అచ్చం వీళ్ళ కథ. అద్భుతంగా రక్తి కట్టించిన సినిమా అది. వ్యాపారపరంగా లాభాలు తెచ్చింది. సెంటిమెంట్ పరంగా ప్రేక్షకులతో కన్నీరు కార్పించింది. ‘ఓయ్ వెర్రి ప్రేక్షకులారా, మీకు కావలసింది కడవలకొద్దీ కన్నీళ్ళ సెంటిమెంట్లే కదా, ఇదిగో తీసుకోండి! అంటూ ఒక కసితో తీశానీ సినిమా,’ అంటాడు శేఖర్ కపూర్ ఒక ఇంటర్‌వ్యూలో.

కానీ నసీర్‌కు బాగా నచ్చిన, సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది.


ఇప్పటిదాకా చెప్పి తన జ్ఞాపకాల తోరణాలను ముగిస్తాడు నసీరుద్దీన్ షా. 2014లో వచ్చిన పుస్తకాన్ని 1983-84ల దగ్గరే ఎందుకు ఆపాడో ఆ వివరణ లేదు.

చీకటి వెలుగులూ, తీపి చేదులూ, విజయ పరాజయాలూ, కించిత్ అహంకారం, ఎంతో ఆత్మజ్ఞానం, మరెంతో నిజాయితీ, అసామాన్యమైన నటనా ప్రతిభ– వెరసి నసీరుద్దీన్ షా.

‘ఈ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. వాటిల్ని వదిలించుకోవాలి. నాలోంచి తొలగించుకోవాలి. అందుకే ఈ పుస్తకం రాశాను,’ అంటాడు నసీర్.

అలా అంటూనే ఎపిలోగ్‌లో ఇలా చెప్తాడు: ‘నాకో పీడకల తరచూ వస్తూ వుంటుంది. నన్ను ఎంతోకాలంగా గమనిస్తోన్న ఓ వృద్ధుడు కనబడి, “ఏమయ్యా జనమంతా నువ్వు చాలా మంచి నటుడివి అంటున్నారు, కానీ…” అంటాడు. ఆ కానీ తర్వాత ఏముందో నాకు తెలియదు. దేన్నీ తేలికగా తీసుకోగూడదనీ, ఇంకా ఇంకా నేర్చుకోవలసింది ఉందనీ మాత్రం తెలుసు.’

గొప్ప నమ్రతతో కూడిన పరిపక్వపు ఆలోచన అది.

ఉపశ్రుతి
చాన్నాళ్ళ క్రితం నసీరుద్దీన్‌షాను ఒక ఇంటర్వ్యూలో అడిగారు, “మీరు కొన్ని కొన్ని సన్నివేశాల్లో తెరకు నిప్పంటుకొందా అన్నంత తీవ్రమైన గాఢమైన నటన ప్రదర్శిస్తారు. ఉదాహరణకు మంథన్, బాజార్ సినిమాలు. ఆ ప్రదర్శన ఎలా సాధిస్తారూ? ఏవిటి దాని రహస్యం?”

నసీర్ జవాబు: నేను సినిమా స్క్రిప్టు ముందే అడిగి తీసుకొంటాను. అధ్యయనం చేస్తాను. కీలకమయిన సన్నివేశాలను గుర్తించి ఉంచుతాను. సినిమా పొడుగూతా నా 100% ఇవ్వను. ఎనభై ఎనభై ఐదు దగ్గర ఆగుతాను. గుర్తించి ఉంచిన కీలక సన్నివేశాల్లో వంద దగ్గర ఆగను. నూటపదీ నూట ఇరవై కోసం శ్రమిస్తాను…

ఈ పద్ధతి జీవితాల్లోనూ వర్తించుకొంటే ప్రతిక్షణమూ వందమీటర్ల స్ప్రింటులా కాకుండా సుదీర్ఘ దూరపు పరుగులా పరిగణిస్తే గమ్యమూ చేరగలం, మధ్యలో ఆగిపోవడమూ ఉండదుగదా అన్న ఎరుక నాకు ఆ పాతికేళ్ళ క్రితం కలిగింది. అది నసీర్ చలవ!!