పదప్రవాళం

పదాలకి పవిత్రత లేదు
శబ్దానికి సాపేక్షత లేదు
అర్థమెప్పుడో అడుగంటింది
కవితకి సారూప్యత లేదు

అద్దాల గదిలో
అబద్ధాల మాంత్రికత
యుద్ధాల గడీలో
అవ్యక్త బాష్పజలధి

బాధా పరిష్వంగంలో
మాటలకందదు
గాథ చెమరిస్తుంది
కాలార్ణవమవుతుంది

వలల్లో పడేది కాదు
ములిగి, నిండా ములిగి
నిలువీది చేసే
పగడాల వేట

కాలం చక్రంలా తిరగదు
నాలుగు దిక్కులూ
ఎనిమిది మూలలూ
ఆవిరి పడుతుంది

చరిత్ర చర్వితచర్వణం కాదు
నిత్య సంచరణం
మరణావరణం
ఆమరణ తరణం

సుదూర తీరాల
యానానికి నిప్పు తోడు
జననావశేషాల
జ్ఞాన సంచితం జోడు

పదం ఎప్పటికైనా
పదును తేలుతుంది
జంత్ర ధ్వనితో
ద్వీపాలు తరిస్తుంది

మంత్రమవుతుంది
కవితామంత్రణ మవుతుంది
కాలాన్ని దాటే
అంతర్గామి అవుతుంది


ఇంద్రప్రసాద్

రచయిత ఇంద్రప్రసాద్ గురించి:

ఆవంత్స సోమసుందర్ అంతేవాసిగా సాహిత్యంతో ప్రారంభమయిన ఇంద్రప్రసాద్ గారి సాహిత్య ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నడిచి వచ్చిన దారి (కవిత్వం 1993), కాలం సైకత తీరం (కవిత్వం 2023), మూడు పడవలు (కవిత్వం 2024) అనే సంకలనాలను ప్రచురించారు.

 ...