ఇమామ్‌ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. ఆలోచనల్లో పడి ఎప్పుడు పొద్దు గూకిందో తెలియలేదు. మసక మసకగా చీకట్లు పరుచుకుంటున్నాయి. ఊరు ఇంకా చాలా దూరంగా ఉంది. వెనక్కి తిరిగి చూశాడు. షాదుల్‌ గుర్రు గుర్రుమని వెంబడిస్తున్నాడు.
‘నీకు చేస్తున్న అన్యాయానికి నన్ను చంపేయకుండా ఎందుకురా …. గుడ్డిగా నమ్ముతున్నావు’ అనుకున్నాడు ఇమామ్‌ షాదుల్‌ను చూస్తూ.
ఇంటికి వెళ్ళాక తను చెప్పిన ఉపాయం పారుతుందా అన్న ఆలోచన ఒకవైపు …. దినదిన గండంగా షాదుల్‌ను ఎన్ని రోజులు ఇలా తప్పించగలను అనే ఆలోచన ఒకవైపు పట్టి కుదిపేస్తుంటే ఇమామ్‌ నడక వేగం తగ్గింది.

అట్లా సారంపల్లిలో దిగినప్పుడు మండలానికి నడిచిపోయి ఎస్సైని కలిసిండు చాంద్‌. ఎస్సై ‘ఆడుక పోండ్రిరా’ అన్నాడు. ఎంత ధర్మాత్ముడు అని చాంద్‌ అనుకున్నాడు.
ఏదో కేసు మీద సారంపల్లి వచ్చిండు ఎస్సై. బజార్లో ఆడుతున్న తండ్రి కొడుకులను చూసి బూతులందుకున్నాడు.
‘‘దొరా …. మొన్న మా కొడుకు కలిసిండు గదా …. మీరే ఆడుకొమ్మంటిరి’’ ఇమామ్‌ అన్నాడు.
‘‘అరేయ్‌ …. స్టేషన్‌కు రాండ్రి మీ సంగతి చెప్పత’’ ఎస్సై అన్నాడు.

‘అమ్మీ …. ఇయ్యాల్లనన్నా పీడ వదిలిపోతదంటవా ….’ చాంద్‌ అడిగాడు.
‘వదిలి పోతదిరా …. పొగాకు మందు గట్టిది. ఎనుకట మా మామ పెట్టిండు’ బీబమ్మ అన్నది.
‘దేనికి ….? ఎలుగుకా ….’’ అడిగిండు చాంద్‌.

‘అబ్బా … అరే అబ్బా …’ చాంద్‌ మాటలతో ఉల్కిపడి తేరుకున్నాడు ఇమామ్‌. మంచంలోంచి లేచి కొడుకు వైపు చూసిండు. నిలువెత్తు గోతిలోంచి బయటకు వచ్చిండు చాంద్‌. వచ్చి తండ్రిని మరోసారి పిలిచిండు చాంద్‌.
ఇమామ్‌ బదులు పలుకలేదు. లేచి కూర్చున్నాడు. బీబమ్మ కోసం చూశాడు. బీబమ్మ వాకిట్లో కొంగు పరుచుకుని పడుకుంది. నిద్రపోతున్నట్టు గుర్రు వినిపిస్తుంది. ఇమామ్‌కు కోపం వచ్చింది. కోపంతో బాధ కూడా కలిగింది.

‘అరే ఇమామ్‌ …’’ వాకిట్లో నిలబడి పిలిచాడు చంద్రయ్య.
ఇమామ్‌ తండ్రి చనిపోయి అప్పటికి సరిగ్గా ఏడాది. తండ్రి చనిపోయిన రోజే తండ్రి తెచ్చుకున్న ఎలుగు చనిపోయింది. తండ్రి చనిపోయి తోడు దూరమై ఎలుగు చనిపోయి బతుకు దెరువు దూరమై పుట్టెడు దు:ఖంతో ఉన్నాడు ఇమామ్‌.

పొద్దు పొడిచింది.
పొద్దు గూకింది.
పగలు గడిచింది. రాత్రి గడిచింది.
ఇమామ్‌ రాలేదు. షాదుల్‌ జాడలేదు.
వాళ్ళు రాకపోవడం బీబమ్మకు సంతోషంగా ఉంది. చాంద్‌కు సంతోషంగా ఉన్నా లోలోపల భయంగా ఉంది. ఇద్దరూ ఇంట్లకూ బయటకు తిరుగుతున్నారు. అడుగుల చప్పుడైతే ఇమామ్‌ అనుకుని చూస్తున్నారు. గురక వినిపిస్తే షాదుల్‌ అనుకుని ఉల్కిపడుతున్నారు.