ఎవరెస్ట్ బేస్ కాంప్ – 5

అప్పుడే ఎవరెస్టు బాట పట్టి ఆరు రోజులు గడిచిపోయాయి. మరో మూడు రోజుల్లో బేస్ కాంప్ చేరుకోబోతున్నామన్న మాట మాలో సరికొత్త ఉత్సాహం నింపుతోంది. గడిచింది ఆరు రోజులే అయినా ఎంతో కాలంగా ఆ మంచు కొండల మధ్యనే గడుపుతున్నామన్న భావన మనసును ఊయలలూపుతోంది. ఈ నడక, ఈ ట్రెకింగ్, ఈ కొండలు, ఈ మిత్రబృందం – ఈ సంబరమంతా మరో నాలుగు రోజుల్లో ముగిసిపోతుంది గదా అన్న భావన మరోవైపు మనసులో చిన్నపాటి దిగులు మేఘాన్ని నింపుతోంది.

ఆ రోజు అక్టోబరు 23, 2022 – ఆదివారం. థుక్లాకు నాలుగు గంటలు, ఆరు కిలోమీటర్ల దూరాన ఉన్న లొబూచె గ్రామం చేరుకోవాలన్నది ఆనాటి మా ప్రణాళిక. ఈ లొబూచె సముద్రతలానికి 4910 మీటర్ల ఎత్తున ఉంది. అంటే థుక్లాకు సుమారు 300 మీటర్ల ఎగువన అన్నమాట.

ఓ గంట నడిచాక దగ్గర్లోని కొండ మూపురం చేరుకున్నాం. ఆ రిడ్జ్ ప్రాంతమంతా ఒక పద్ధతి ప్రకారం పేర్చిన రాళ్ళ గుట్టలతో నిండి ఉంది – నిజానికి అవి ఒట్టి గుట్టలు కావు; గతంలో ఎవరెస్టు అధిరోహణలో ప్రాణాలు కోల్పోయిన సాహసికులకు నివాళిగా అమర్చిన జ్ఞాపక చిహ్నాలు. కొన్ని గుట్టల మీద ఆయా సాహసికుల వివరాలు నమోదు చేసి ఉన్నాయి. అన్ని గుట్టల మీదా గాలికి రెపరెపలాడుతోన్న రంగురంగుల ప్రార్థన పతాకాలున్నాయిు.

ఆ జ్ఞాపక చిహ్నాలు, పతాకాలూ నన్ను విషాద వీచికల్లా చుట్టుముట్టాయి. నేను నడుస్తోన్న బాట వెంబడే ఎవరెస్టు శిఖరం వేపు సాగిపోయి మృత్యువును కౌగలించుకున్న నేనెరుగని నా సోదరుల కోసం మనసు పరితపించింది. తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఆ సాహసికుల గురించి ఆలోచనలు నన్ను అలముకున్నాయి. శిఖరారోహణ గురించి కలలుకంటూ ఆ కలల ఒడిలో దీర్ఘనిద్రకు గురి అయిన వారి కథలూ గాథలూ జ్ఞప్తికి వచ్చాయి. ఆ జ్ఞాపకాల తెరల నడుమ నుంచి తెప్పరిల్లి నా ముందు కనిపిస్తోన్న ఓ శిలావేదికకేసి చూడగా, ‘ఎవరెస్టు శిఖరం మీద శాశ్వత విరామం కోరిన వ్యక్తి కోసం’ అన్న అక్షరాల కన్నీటి ధార కనిపించింది. ఆ సాహసాలూ త్యాగాలూ వృథా పోవు… తరతరాల పర్వతారోహకులకు ప్రేరణగా నిలుస్తాయి. మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగమని ప్రోత్సహిస్తాయి అనిపించింది. ‘మా మరణాల గురించి దిగులు పడకండి. మేము మా కలల సాకారం కోసం ఎన్నెన్ని అవరోధాలు దాటుకుని వచ్చామో గమనించండి’ అని ఆ స్మారకచిహ్నాలు చెపుతున్నాయి అనిపించింది. ‘మరణం ఎవరికైనా అనివార్యం. అందరమూ ఏదో ఒక రోజున మరణపు ఒడి చేరవలసిన వారమే. మేము అలా ప్రకృతి ఒడిలో చేరాం. అలా చేరి పునరుజ్జీవనం చెందాం’ అని చాటుతున్నాయి అనిపించింది. మానవ సంకల్పబలపు అవధులను ఊహాతీతంగా విస్తరింపజేసిన ఆ హిమగిరి యోధులకు జేజేలు చెప్పకుండా ఉండలేకపోయాను.

జ్ఞాపక చిహ్నాలలో, శిలల దొంతరలలో మరో వివరం నన్ను ఆకట్టుకుంది. దూరప్రాంతాల నుంచి వచ్చిన పర్వతారోహకుల కన్నా స్థానిక షెర్పాల పేరిట ఉన్న దొంతరలే అక్కడ ఎక్కువగా కనిపించాయి. నిజమే – చాలామంది పర్వతారోహకులకు అది జీవితంలో ఒకసారి చేసే సాహసం. షెర్పాలకు అది నిత్యకృత్యం – జీవన విధానం. మరి ఆ ప్రక్రియలో ప్రాణాలు కోల్పోయేవారిలో షెర్పాలు అధిక సంఖ్యలో ఉండటం సహజమే. నా మౌన పరిశీలన గమనించినట్టున్నాడు, నాతో పాటు నడుస్తోన్న బాబు గురంగ్ – ఎవరెస్టు బాటలో ప్రాణాలు వదిలిన షెర్పాల కథలూ గాథలూ చెప్పడం మొదలెట్టాడు.

అలా చెప్పిన కథల్లో చిరి షెర్పా అన్న సాహసికుని వివరాలు నా మనసులో బాగా ముద్రపడ్డాయి. అప్పటికే పదిసార్లు ఎవరెస్టును జయించిన చిరి షెర్పా, పదకొండో ప్రయత్నంలో 2001లో ఓ హిమనది అఖాతం దగ్గర ఫోటోలు తీస్తూ జారిపడి ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఎవరెస్టు విషయంలో, అతను నెలకొల్చిన మూడు రికార్డులు ఇప్పటికీ చెప్పుకోదగ్గవి. 16 గంటల 56 నిమిషాలలో ఎవరెస్టును అధిగమించడం ఆ మూడింటిలో మొట్టమొదటిది. వెంటవెంటనే రెండు వారాల వ్యవధిలో ఎవరెస్టు ఎక్కిదిగిన ఘనత రెండవది. అదనపు ఆక్సిజన్ సహాయం లేకుండా ఎవరెస్టు శిఖరం మీద 21 గంటలు గడిపిన చిరి షెర్పా మూడవ రికార్డు రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలచి ఉంది. కనీస వసతి అయినా లేని సల్లేరి గ్రామానికి చెందిన మనిషి చిరి షెర్పా. సోలుఖుంబు ప్రాంతానికి చెందిన ఆ సల్లేరి గ్రామంలో పాఠశాల నెలకొల్పాలని ఆయన ఎంతగానో తపించాడు. విజయం సాధించాడు. నేపాల్‍ దేశంలోని గ్రామాలన్నింటిలో పాఠశాలలను నెలకొల్పాలన్న కల నెరవేరకుండానే వెళ్ళిపోయాడు.

ధైర్య సాహసాలు, మొక్కవోని పట్టుదలలూ ఉన్న ఎందరో అనుభవజ్ఞులు హిమాలయాల్లో ప్రాణాలు కోల్పోయారన్నది కఠోర వాస్తవం. వారి కథలు తలచుకుంటే ప్రకృతి ముందు ఎంతటివారైనా తల వంచవలసిందేగదా అనిపిస్తుంది. ‘ఎంత అనుభవం ఉన్నా ప్రతి యాత్రా ఒక నూతన ప్రయత్నం. ప్రమాదభూయిష్టం. ప్రకృతి అనూహ్యంగా ప్రకోపించిన పక్షంలో, మహామహా అనుభవజ్ఞులు కూడా శిరసు వంచి ప్రార్థించవలసిందే, ఆ ప్రార్థనలు ఫలించకపోతే నిష్క్రమించవలసిందే’ అన్న విషయం పదే పదే ఋజువవడం ఒక చారిత్రక సత్యం.

1996 వేసవికాలం ఎవరెస్టు అధిరోహణ చరిత్రలో అత్యంత విషాదకరమైన సమయం. ఆ అధిరోహణ ఋతువులో మొత్తం పన్నెండుమంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎనిమిది మంది మే నెల 10-11 తారీఖుల్లో మంచు తుఫానులో చిక్కుకుని చనిపోయారు. ఆ తుఫానులో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డ జాన్ క్రకావర్ అన్న అమెరికాకు చెందిన జర్నలిస్టు తన ఇన్‌టూ థిన్ ఎయిర్ అన్న పుస్తకంలో ఆనాటి సంఘటనలకు అక్షర రూపం ఇచ్చాడు. (ఈ జాన్ క్రకావరే, క్రిస్ మెక్‌క్లాండిస్ అన్న యువకుని 1992 నాటి సాహస విషాద గాథకు ఇన్‌టు ది వైల్డ్ అంటూ పుస్తకరూపం ఇచ్చాడు – అను.)

ఆ 1996 నాటి విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో రాబ్ హాల్ అన్న న్యూజిలాండ్‌కు చెందిన వ్యక్తి ఉన్నాడు. ‘ఎడ్వంచర్ కన్సల్టెంట్స్’ అన్న కంపెనీ యజమాని ఆయన. అలానే ‘మౌంటెన్ మాడ్‌నెస్’ అన్న ప్రత్యర్థి కంపెనీ యజమాని స్కాట్ ఫిషర్ ప్రాణాలూ ఆ ప్రమాదంలో ఆవిరైపోయాయి. మళ్ళా వాళ్ళిద్దరూ కాకలుతీరిన పర్వతారోహకులు. ధనబలం ఉన్న ఔత్సాహికుల్ని ఎవరెస్టు శిఖరం మీద నిలబెట్టడం అన్నది వారి వారి సంస్థల ప్రధాన కార్యకలాపం. రాబ్ హాల్ ఐదుసార్లు ఎవరెస్టు ఎక్కిన మనిషి. స్కాట్ ఫిషర్ ఎవరెస్టుతో పాటు కె2, లోత్సె లాంటి ఉన్నతశ్రేణి శిఖరాలను అదనపు ఆక్సిజన్ సహాయం తీసుకోకుండా అధిరోహించిన సాహసి. వాళ్ళిద్దరి మధ్య వ్యాపారపరమైన పోటీ ఉన్న మాట నిజమే అయినా అది ఆరోగ్యకరమైన పోటీ. అవసరమైనప్పుడు ఒకరితో ఒకరు సహకరించుకొనేవారు కూడానూ.

రచయిత జాన్ క్రకావర్ రాబ్ హాల్ వాళ్ళ బృందపు సభ్యుడు. ఔట్‌లుక్ అన్న అమెరికన్ పత్రిక అతని 1996 నాటి యాత్రను స్పాన్సర్ చేసింది. ఇంకా వివరాలు చెప్పాలనిపిస్తోంది కానీ చెప్పను. ఆ వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళు క్రకావర్ రాసిన ఇన్‌టూ థిన్ ఎయిర్ అన్న పుస్తకం చదవమని మాత్రం సిఫార్సు చేస్తాను. ఎవరెస్టు లాంటి శిఖరాలు ఎక్కడంలో ఎన్నెన్ని సవాళ్ళు ఎదురవుతాయో, ఎన్నెన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయో ఆ పుస్తకం ఎంతో వివరంగా చెపుతుంది. ఆ విషయాల మీద నేను చదివిన పుస్తకాలన్నిటిలోకీ ఉత్తమమైనది క్రకావర్ రాసిన ఈ పుస్తకం. నామ్చే బాజార్ లోని ఓ పుస్తకాల దుకాణంలో కనబడితే ఆ పుస్తకాన్ని కొని, మా ఈబీసీ ట్రెక్ ముగిశాక చదివాను.

ఈ 1996 ప్రమాదం గురించి 2015లో ‘ఎవరెస్ట్’ అన్న ఎంతో విజయవంతమైన హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. కానీ ఒక్కమాట – ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవాళ్ళు ఎలానూ తమ కథ చెప్పలేరు. ప్రాణాలతో తప్పించుకొన్నవాళ్ళను అపరాధ భావన వెంటాడటం వల్ల వాళ్ళూ పూర్తి వివరాలు అందించలేరు. అంచేత ఒకే విషాద ఘటన గురించి విభిన్న కథనాలు వినిపించే అవకాశం తప్పక ఉంటుంది. ఈ 1996 విషాదం విషయంలోనూ అదే జరిగింది. క్రకావర్ ఆ హాలీవుడ్ సినిమాతో తీవ్రంగా విభేదించాడు. సినిమా నిర్మాతలు కూడా క్రకావర్ కథనాన్ని విమర్శించారు. అలాగే అనతోలి బౌక్రీవ్ (Anatoli Boukreev) అన్న స్కాట్ ఫిషర్ బృందంలోని రష్యన్ సభ్యుడు తన అనుభవాల గురించి ద క్లైంబ్ అన్న పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో క్రకావర్ తన గురించి ఇన్‌టూ థిన్ ఎయిర్ పుస్తకంలో చేసిన ఆరోపణలను అనతోలి త్రోసిపుచ్చాడు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక అంటారు గదా!

1996లో ఐమాక్స్ కంపెనీవాళ్ళు అప్పటి ఎవరెస్టు అధిరోహణల గురించి సినిమా తీస్తున్నపుడు జమ్లింగ్ నార్గే షెర్పా ఆ కంపెనీ వారి ఒక బృందానికి గైడ్‌గా వ్యవహరించాడు. ఈయన ఎవరెస్ట్ హీరో టెన్జింగ్ నార్గే కొడుకు. ఆ సినిమా తీస్తోన్న సమయంలోనే రాబ్ హాల్, స్కాట్ ఫిషర్ వాళ్ళ బృందాలు మంచు తుఫానులో చిక్కుకుపోవడం జరిగింది. ఐమాక్స్ వాళ్ళు ఎంతో ఉదారంగా ఆ బృందాలతో తమ దగ్గరున్న ఆక్సిజన్ పరికరాలు పంచుకొన్నారు. రక్షణ చర్యలలోనూ పాల్గొన్నారట. జమ్లింగ్ నార్గే ఆ వివరాలన్నీ ఒక షెర్పా దృక్కోణం నుంచి రీచింగ్ మై ఫాదర్స్ సోల్ అన్న పుస్తకంలో వివరించాడు. ఎవరెస్ట్ శిఖరం గురించి వచ్చిన పుస్తకాలలో ఈ రచన కూడా చెప్పుకోదగ్గది.

ఆ ఐమాక్స్ వాళ్ళ సినిమాను 2004లో నేను మా నాన్నతో కలసి మా హైదరాబాద్ నగరపు ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో చూశాను. మా నాన్నకి సినిమాలంటే అంతగా పడదు; కానీ ఐమాక్స్ బాణీ సినిమాలను ఇష్టపడేవాడు. ఆయనతో కలిసి చూసిన ఆ సినిమాలోని అచ్చెరువు కలిగించే దృశ్యాలు నాకు బాగా గుర్తున్నాయి. కలల్లో మాత్రమే కనిపించే దృశ్యాలవి. ఆ స్వప్న సీమలోకి నేను ఏదో ఒకరోజున అడుగుపెడతానని, ఆయా దృశ్యాలను కళ్ళారా చూస్తాననీ కలలోనయినా అనుకోలేదు!

ఎవరెస్ట్ 1953 అన్న మిక్ కాన్‌ఫ్రే (Mick Conefrey) రాసిన మరో పుస్తకం నాకెంతో ఇష్టమయినది. 1924లో ఘనత వహించిన జార్జ్ మాలరీ (George Mallory) సాహసయాత్ర దగ్గర్నించి 1953 హిలరీ-నార్గేల విజయం వరకూ జరిగిన ఎవరెస్టు అధిరోహణ ప్రయత్నాలన్నిటినీ వివరించే పుస్తకమది. ఉత్తర దిశలోని టిబెట్ మార్గంగుండా ఎవరెస్టు ఎక్కే ప్రయత్నం చేశాడు మాలరీ. ఆ తర్వాత 1951లో ఎరిక్ షిప్టన్ అన్న బ్రిటీష్ పర్వతారోహకుని నాయకత్వంలో మరో బృందం దక్షిణాన ఉన్న నేపాల్ మార్గం ద్వారా ఎవరెస్టు ఎక్కే ప్రయత్నం చేసింది. 1952లో అదే మార్గంలో మరో స్విట్జర్లాండ్ బృందమూ ప్రయత్నించింది. చిట్టచివరికి 1953 మే నెలలో టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిలరీ ఎవరెస్టును జయించగలిగారు. జాన్ హంట్ నాయకత్వంలోని బ్రిటిష్ బృందపు సభ్యులు ఈ హిలరీ, నార్గేలు. రెండవ ఎలిజబెత్ రాణి పదవీ స్వీకరణకు సరిగ్గా నాలుగు రోజుల ముందు, 1953 మే 29న, బ్రిటిష్ బృందం ఎవరెస్టు విజయం సాధించడం అతి చక్కని యాదృచ్ఛికత!

‘2015 నాటి పర్వతారోహణ ఋతువులో నేపాల్ దేశంలో తీవ్రమైన భూకంపం సంభవించింది. ఎవరెస్ట్ బేస్ కాంప్‌లో ఉన్న ఇరవైరెండుమంది ఆ భూకంపంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సమీప గతంలో ఎవరెస్టు పరంగా సంభవించిన అత్యంత విషాదకరమైన సంఘటన అది’ అంటూ తన ప్రమాద కథనాలకు ముక్తాయింపు పాడాడు మా బాబు గురంగ్.


ఖుంబు ఖోలా నదీతీరం వెంబడి మా నడక సాగింది. మధురంగా వినిపించే నీటి గలగలల శబ్దాలు మా చెవులకు సంగీత ఆస్వాదనా సుఖాన్ని అందించాయి. ఆ నీటి స్వచ్ఛత నన్ను ఎంతగా ఆకట్టుకొందంటే నేను నా సీసాను ఆ నీళ్ళతో నింపుకొని తనివితీరా తాగేశాను!

మా నడక మమ్మల్ని టిబెట్ సరిహద్దు ప్రాంతానికి చేరుస్తోంది – అంతా కలసి పక్షి మార్గాన పది కిలోమీటర్లు వెళితే టిబెట్టు చేరుకుంటాం; అంతే! మరొక్కసారి పర్వత శిఖరాల తోరణమాల మా కళ్ళముందు విచ్చుకుంది: చాంగ్‌త్సే (7550 మీటర్లు), పుమోరి (7145 మీటర్లు), లింగ్‌ట్రెన్ (6697 మీటర్లు), ఖుంబుత్సె (6623), నుప్‍త్సె (7861 మీటర్లు) శిఖరాలు నవ్వుల వెలుగులు చిలకరిస్తూ మమ్మల్ని పలకరించాయి. అలా మూడు గంటలు నడిచాక అక్కడి సెలయేటి ఒడ్డున ఉన్న లొబూచె చిరు గ్రామం చేరుకున్నాం. 4810 మీటర్లు. ‘హోటల్ ఆక్సిజన్ ఆల్టిట్యూడ్’ అన్నది మేమక్కడ ఉండబోతోన్న టీ-హౌస్ పేరు.

అంతా భోజనానికి కూర్చున్నాం. అంతకు ముందర దింగ్‌బోచెలో కలసిన యశ్వంత్ అన్న వైజాగ్ సహయాత్రికుడు ఇక్కడ మళ్ళా కలిశాడు. అతను, అతని బృందమూ ఎవరెస్ట్ బేస్ కాంప్ వరకూ విజయవంతంగా వెళ్ళి తిరిగి వస్తున్నారు. సంతోషమనిపించింది. అభినందనలు తెలిపాను. ఆయన మాకు ఉపయోగపడే కొన్ని సూచనలు చేశాడు. ఇంతకుముందే అన్నట్లు ఇలాంటి యాత్రల్లో స్పర్ధ కన్నా సహయాన స్ఫూర్తే బలంగా కనబడుతుంది. తెలిసినవాళ్ళు తెలియనివాళ్ళు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అవతలి వారి విజయాన్ని కాంక్షించే ‘తీర్థ’యాత్రలివి. ఈ సహకార స్ఫూర్తి, స్వార్థ రాహిత్యం మనిషి ఉన్నత సీమలకు చేరేకొద్దీ వృద్ధి చెందుతూ రావడం నేను గమనించాను. బహుశా అందువల్లనేనేమో, ఇక్కడి స్థానికులలో ఆ నిర్మలత్వం, నిష్కాపట్యం!

ఆ రోజు ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టి-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ కామెంటరీ వస్తోంది. ఆడుతున్నది ఇండియా పాకిస్తాన్ జట్లు. ఇహ చెప్పేదేముందీ, అందరం భోజనం చెయ్యడం కూడా మర్చిపోయి ఒక్క బంతిని కూడా విడవకుండా రేడియో కామెంటరీ వినసాగాం. మళ్ళా మాలో కాస్తంత క్రికెట్ పరిజ్ఞానం కలిగినవాళ్ళు సజీవ వ్యాఖ్యాన నిష్ణాతుల భూమిక నిర్వహించసాగారు. ఆట హోరాహోరీగా సాగుతోంది. ఇండియా బాగా ఆడిన క్షణాల్లో కేరింతలు – చతికిలబడిన సమయాల్లో నిట్టూర్పులు… మా టీ-హౌస్‌లో ఉన్న ఇతర భారతీయ బృందాలు కూడా మాతో కలిసి ఆశానిరాశల డోలాయమానంలో భాగస్వాములయ్యాయి. అక్కడ ఉన్న యూరోపియన్ బృందాలవారికి, నేపాలీ సిబ్బందికి మా భావతీవ్రతలు గొప్ప ఆశ్చర్యం కలిగించసాగాయి. చిట్టచివరికి భారతదేశం గెలవనే గెలిచింది. డైనింగ్ హాలంతా మా సామూహిక కేరింతలతో నిండిపోయింది. ఉదయపు నడక కలిగించిన అలసట మంత్రం వేసినట్టు మాయమయింది!

భోజనాలు ముగిశాక అంతా కలిసి ఖుంబు గ్లేషియర్ చూడటానికి వెళ్ళాం. ఆ ప్రక్రియలో ఓ ఎత్తైన మూపుర ప్రాంతం చేరుకున్నాం. అది ఇతర రిడ్జ్‌ల లాంటి సహజ భౌగోళిక మూపురం కాదు; ఖుంబు హిమనీనదం తాను ఎంతెంతో నింపాదిగా కదిలే ప్రక్రియలో విసర్జించిన మట్టి, రాళ్ళ సమూహమా మొరైన్ (Moraine) మూపురం! (ఢిల్లీ శివార్లలలో దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థపదార్థాల చిరుకొండలు మనకు కనిపిస్తాయి – అను.) అంతా ఖుంబు గ్లేషియర్ కేసి ఉత్సాహంగా దృష్టి సారించాం. తీరా చూస్తే గ్లేషియర్ ఉండాల్సిన చోట మట్టీ రాళ్ళూ నిండి, ఎండిపోయిన నదీగర్భం కనిపించి మమ్మల్ని నిరుత్సాహంలో ముంచింది! ధగధగల మంచు కనిపిస్తుంది అని చూస్తే, ఈ మట్టీ రాళ్ళూ ఏమిటో? గ్లోబల్ వార్మింగ్ పుణ్యమా అని మంచు అంతా కరిగి నీరై ప్రవహించిపోయిందా? అర్థం కాలేదు! మా తికమక చూసిన ప్రకాశ్ అన్న మా గైడ్ ఒకతను ముసిముసి నవ్వులతో సంగతి వివరించాడు: పైకి కనిపించే మట్టీ రాళ్ళ దిగువన అతి నింపాదిగా సాగిపోతోన్న అనంత హిమరాశులు ఉన్నాయి. జాగ్రత్తగా వింటే అపుడపుడు వినిపించే మర్మర ధ్వనులు, అదిగో – ఆ హిమానీనదపు గమనపు చిహ్నాలు! ప్రకాశ్ వివరణ పుణ్యమా అని మా అనుమానపు మబ్బులు విడిపోయాయి. మేము నడుస్తోన్న కాలిబాటలో మంచు తునకలు కనిపించాయి. నడవడానికి ఏ మాత్రమూ సుఖంగా లేని బాట అది. మాటల మధ్యన మేమంతా ఆ గ్లేషియర్ మూపురపు అత్యున్నత బిందువు చేరుకున్నాం. ఆ బిందువు 5000 మీటర్లకు ఎగువన ఉంది. మాలో చాలామందికి అలా ఐదువేల మీటర్లను దాటి వెళ్ళడం అదే మొదటిసారి. అదో సంబరం.


ఖుంబు గ్లేషియర్ నుంచి తిరిగి వచ్చాక అందరం డైనింగ్ హాల్లో బైఠాయించాం. కబుర్లు, ఆనాటి ట్రెకింగ్ అనుభవాలు, ఫోన్లు ఛార్జి చేసుకోవడాలు, ఫోటోల పంపకాలు, ఇంటికి ఫోను చేసి మాట్లాడడాలు – అంతా కోలాహలం. ఆ హాలు అందరికీ వెచ్చదనం పంచుతోందన్నది నిజమే గానీ ప్రతి ఒక్కరికీ ఆ ఉన్నత సీమలో, పల్చని వాతావరణంలో, ఆక్సిజన్ అందీ అందని ప్రాంతంలో నడవడాల వల్ల కలిగిన ఖేదం, మానసిక గ్లాని నీడన ఎంతటి నాజూకైన స్థితిలో మసలుతున్నామో అవగాహన ఉంది. డాక్టర్లం గదా – మాకు ఆ అవగాహన కాస్తంత ఎక్కువగానే ఉంది. ఎంత అవగాహన ఉన్నా, గ్లాని లక్షణాలు అవతలి మనుషుల్లో స్పష్టంగా కనిపిస్తే తప్ప మనం గ్రహించడం కష్టం. మా బృందపు సభ్యుడు దీపు, ఓ రష్యన్ యువతి, ఆ హాల్లో భౌతికంగా బాగా ఇబ్బందిపడటం గమనించాడు. రష్యన్ బృందంలోని ఇతర సభ్యులు కూడా అలసటా నిస్సహాయతలు చుట్టుముట్టిన దశలో ఉండటం వల్ల ఆ యువతికి ఏ మాత్రం సాయం చెయ్యలేకపోతున్నారు. ఆ యువతి ఆక్సిజన్ స్థాయి బాగా దిగువున ఉంది. ఆరోగ్యం క్షీణించిందని తెలిసిపోతోంది. ఎక్యూట్ మౌంటెన్‌ సిక్‌నెస్ లక్షణాలవి.

దీపు పూనికతో మాలోని డాక్టర్లు అనిత, మోహన్ ఆ యువతిని పరీక్షించి మా దగ్గర ఉన్న ఎమర్జెన్సీ మందులు ఇచ్చారు. ధైర్యం చెప్పి సముదాయించారు. ‘ఇక ముందుకు సాగవద్దు, నీ ప్రయాణం ఇక్కడితో ఆపు’ అని సలహా ఇచ్చారు. వీలయినంత త్వరగా మరికాస్త దిగువ ప్రదేశం చేరుకోమని చెప్పారు. ఏదేమైనా ఆనాటి శీతల రాత్రివేళ దిగువ ప్రదేశానికి ప్రయాణం పెట్టుకోవడం అన్న మాటే లేదు. మర్నాటి ఉదయం దాకా ఆగవలసిందే. తెల్లవారేదాకా ఆ అమ్మాయి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ రష్యన్ బ్బందపు సభ్యులకూ వారి గైడ్‌లకు వివరించి చెప్పాం. ఎత్తైన ప్రదేశాలకు ట్రెకింగ్‌లు పెట్టుకున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నొక్కి వక్కాణించాం.

ఆ రాత్రి మాకు వేడి వేడి భోజనం లభించింది. అయినా ఒకే రకం పదార్థాలు పదేపదే తినీ తినీ విసుగనిపించింది. మా దుబాయ్ మిత్రులు తెచ్చిన మన ప్రాంతపు పచ్చళ్ళు ఆ విసుగు నుంచి ఉపశమనం కలిగించాయి. వాటికి తోడు భీమవరం నుంచి రాఘవరాజు తీసుకువచ్చిన ఇంట్లో చేసిన పచ్చళ్ళు అదనపు వరాలయ్యాయి – భీమవరం పచ్చళ్ళంటే మాటలా… క్షణాల్లో సీసాలు ఖాళీ చేశాం.

ఖంబు ప్రాంతానికి వెళ్ళి వచ్చే ట్రెకర్లూ పర్వతారోహకులు సర్వసామాన్యంగా ఎదుర్కొనే ఇబ్బంది మరొకటి ఉంది. అక్కడి పొడి దగ్గు పట్టుకుని వదలదు. దాన్ని ముద్దుగా ‘ఖుంబు దగ్గు’ అని పిలుస్తారు. ట్రెకర్లూ కొండలు ఎక్కేవాళ్ళే గాకుండా ఆ ప్రాంతానికి కంచరగాడిదలు, జడల బర్రెల తాకిడి కూడా బాగా ఎక్కువ కదా – అన్నన్ని పదఘట్టనల పుణ్యమా అని అక్కడ రేగే సన్నపాటి ధూళి ఈ పొడి దగ్గుకు మూలకారణమన్నమాట. ఏదేమైనా ఆ ప్రాంతాల్లో నడుస్తున్నపుడు మెడను కప్పే ఉన్ని తొడుగులను మరి కాస్త పైకి లాక్కొని ముక్కును కూడా కప్పి ఉంచుకోవడం ఉత్తమం. అలా పైకి లాక్కున్న తొడుగు ధూళి నుంచి రక్షణ ఇవ్వడమే గాకుండా ముఖంలోని దిగువ భాగమంతటికీ వెచ్చదనమిస్తుంది.

మర్నాటి కార్యక్రమం గురించి బాబు గురంగ్ వివరించాడు. మా చిట్టచివరి స్థావరం గోరక్షెప్ చేరుకోవడం, చేరుకున్నాక అక్కడే మరో 400 మీటర్ల ఎత్తున ఉన్న కాలాపత్థర్ అన్న కొండ ఎక్కడం – అబ్బో చాలా కార్యక్రమమే ఉంది! బితుకుబితుకుమంటూ అంతా మా గదుల్లోకి దారితీశాం.

హల్లో కాస్తంత వెచ్చగా ఉన్నా గదుల్లో చలి విపరీతంగా వేసింది – 4910 మీటర్ల ఎత్తున ఉన్నాం గదా! డైనింగ్ హాలు మధ్యన ఓ నెగడు ఉంది. అది వెచ్చదనమిచ్చింది. హాలు వదిలి మా గదులకు చేరామో లేదో, చలి పులి మీదకు ఉరికింది.


అక్టోబరు 24. రేపటితో మా ట్రెక్ ముగియబోతోంది. 5170 మీటర్ల ఎత్తున ఉన్న గోరక్షెప్ చేరుకోవాలి. మూడు గంటల నడక. ఆ మూడు గంటలూ 5000 మీటర్లు దాటిన ఉన్నతశ్రేణిలోనే గడపబోతున్నాం. బాబూ గురంగ్ నిన్న చెప్పనే చెప్పాడు – మొత్తం ప్రయాణమంతటికీ ఈ మూడు గంటల నడక కీలకమని. మా ఇరవై మూడుమందిమీ ఐదువేల మీటర్ల ఎత్తున మూడు గంటలసేపు ఏ అవాంతరాలూ లేకుండా సాగిపోగలమా? వెళ్ళగలమని తెలుసు – అయినా అదో చిన్నపాటి ఆందోళన! పైగా మా నడక గోరక్షెప్ దగ్గరే ఆగదు. ఆ రోజు మధ్యాహ్నానికి గోరక్షెప్ చేరుకున్నాక భోజనాలు ముగించి, ఆ తర్వాత 5545 మీటర్లు ఉన్న కాలాపత్థర్ కొండ కూడా ఎక్కాలి గదా…

ఉదయం ఐదింటికే లేచి ఆరింటికల్లా నడక ఆరంభించాలన్నది మా ప్రణాళిక. పాపం మా టీ-హౌస్‌వాళ్ళకి అంత పొద్దున్నే అందరికీ అల్పాహారం అందించి పంపడం సులభమైన పనేం గాదు. అయినా వాళ్ళు శాయశక్తులా పాటుపడి ఆ పని చెయ్యసాగారు.

ఈలోగా రాత్రి మాకు తటస్థపడిన రష్యన్ బృందం వచ్చి మాతో కలిసింది. ఆ యువతి బాగా తేరుకుని కనిపించింది. మేమిచ్చిన మందులు బాగా పనిచేశాయని, రాత్రి కాసేపు నిద్రపోగలిగాననీ సంతోషంగా చెప్పింది. ఎక్యూట్ మౌంటెన్‌ సిక్‌నెస్‌కు, వీలైనంత త్వరగా ‘దిగువ ప్రదేశాలకు’ చేరుకోవటమే అత్యుత్తమ పరిష్కారమని మేము మరొకసారి చెప్పాం. ఆ రష్యన్ బృందంవాళ్ళు అప్పటికే ఆ ప్రయత్నాల్లో ఉండటం మాకు సంతృప్తి కలిగించింది.

ఉన్నత పర్వత ప్రాంతాలలో యాత్రికులు ఎదుర్కొనే కడగండ్లు అన్నీ మా కళ్ళముందు నిలచి కనిపించసాగాయి. గడ్డ కట్టిన నీళ్ళు – టాయిలెట్లలో నీళ్ళు పొయ్యడం అన్న ప్రసక్తే లేదు! మాలో కొంతమందికి టాయిలెట్ పేపర్లు వాడే అలవాటు ఉంది – వాళ్ళకి పర్లేదు. నీళ్ళు లేకుండా టాయిలెట్లను వాడటం అలవాటులేని ఉష్ణమండల మిత్రులకు తొట్టెల్లో ఘనీభవించి పలకరించిన నీళ్ళు తాము ఏనాడూ ఎరుగని ప్రశ్నార్థకాలై కళ్ళ ముందు నిలిచాయి! ఆ ప్రశ్నకు బదులుండదు. దుర్గంధం రాజ్యమేలే ఆ స్థితిలో మెడ తొడుగును ముక్కు పైదాకా సాగదీయడం మాకు బాగా సాయపడింది. దుర్వాసనల నుంచి కొంచెమైనా కాపాడుకోగలిగాం. ఏదేమైనా ఇలాంటి సాహస యాత్రలకు వచ్చేవారిలో ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొని నిలిగబడగలిగే మనోనిబ్బరం తప్పక ఉంటుంది – అంచేత వారికి ఇవేమంత కష్టం కాదు. సర్దుకుపోవడం, కొత్త పద్ధతులు అవలంబించి సమస్య ఉధృతిని తగ్గించడం – ఎవరూ నేర్పకుండానే వారికి అలవాటవుతాయి. అసలిక్కడ స్థానికులు తరతరాలుగా మాకు తెలిసిన సదుపాయాల అవగాహనే లేకుండా బతకటం లేదూ? ఏదేమైనా సగటు ట్రెకర్‌కు టాయిలెట్ పేపర్ లాంటి అల్ప వస్తువులు కూడా, ఈ ప్రాంతాలకు చేరినప్పుడు ప్రాణప్రదం అని చెప్పక తప్పదు.

ఈ ఈతి బాధల పుణ్యమా అని ఆరింటికి అనుకొన్నది మేమంతా నడక ఆరంభించేసరికి ఏడు అవనే అయింది. మాలో కొందరు అప్పటికే అలసిపోయి కనిపించారు; కొంతమంది కడుపు పాడయిందన్నారు. ఆ పరిస్థితిలో వీళ్ళంతా మిగతావారితో పాటు సరితూగి నడవలేరు గదా – వీళ్ళతో పాటు నేనూ కలసిపోయిు మెల్లగా నడవడం ఆరంభించా. చక్కని శారీరక స్థితిలో ఉన్నవాళ్ళకి లొబూచె నుంచి గోరక్షెప్ చేరుకోడానికి మూడు గంటలు పట్టింది. కొంత మంది నాలుగు గంటల్లో చేరుకున్నారు. మా చిట్టచివరి బృందం ఐదు గంటలు తీసుకుంది.

మేము నడిచిన ప్రాంతమంతా ఎడారి. పచ్చదనం ఊసే లేదు. అంతా రాళ్ళూ రప్పలూ. అయినా అదో వింత సౌందర్యం. అయిదువేల మీటర్ల ఎత్తు అంటే మనుషులకే కాదు, ఏ జీవజాతికయినా మనుగడ దుస్సాధ్యమయ్యే ప్రదేశం. అడపాదడపా వినిపించే ఖుంబు గ్లేషియర్ మర్మర ధ్వనులే ఆ ప్రాంతం సజీవంగా ఉంది అన్న విషయాన్ని స్ఫురింప చేస్తున్నాయి. ఉన్నట్లుండి ఫెళ్ళుమని విరుచుకుపడే హిమఖండాల భీతి కలిగించే శబ్దాల సంగతి వేరేమాట. అన్నట్టు మేమున్నది సముద్రతలానికి ఐదు కిలోమీటర్లు ఎగువన అన్నమాట నిజమే అయినా మా అందరికీ ఏదో లోయ దిగువన నడుస్తోన్న భావన కలిగింది. చుట్టూ కోట గోడల్లాంటి హిమ శిఖరాలు పరచుకొని ఉన్న ప్రాంతంలో అలాంటి భావన కలగడం సహజమే మరి.

ఆనాటి బాటలో చివరి భాగం మాకు అసలు సిసలు సవాళ్ళు విసిరింది. మా బాట వెళ్ళి ఖుంబు గ్లేసియర్‌ని తాకే ముందు మేమంతా ఛంగ్రి అన్న మరో గ్లేషియర్ మీద కొంతసేపు నడవవలసి వచ్చింది. బాట నిండా రాళ్ళ గుట్టలు… జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాల్సి వచ్చింది. అలా నడిచాక ఓ మూపురం పైకి చేరాం. అక్కణ్నించి గోరక్షెప్ గ్రామం, కాలాపత్థర్ పర్వతం కనిపించాయి.

ఎవరెస్టుకు వెళ్ళే దారిలో ట్రెకర్లకు గూడునిచ్చే చిట్టవివరి స్థావరం గోరక్షెప్. స్థానిక భాషలో గోరక్షెప్ అంటే చచ్చిపోయిన నల్లకాకి అని అర్థమట! పేరుకు నల్లకాకి అంటున్నారే గానీ అక్కడ ఏ పక్షీ ఉన్న జాడ లేదు. పక్షులే గాదు – మనుషులు కూడా ట్రెకింగ్ ఋతువులోనే అక్కడికి చేరి, ట్రెకర్లకు టీ-హౌస్‌ల సౌకర్యం అందిస్తారట. మిగిలిన సమయంలో మనిషి పొడ సోకని ప్రదేశమది. (దసరా ముగిశాక కేదార్‌నాథ్ బదరీనాథ్ దేవాలయాలను కూడా సంప్రదాయబద్ధంగా మూసివేసి, తిరిగి మే నెలలో తెరుస్తారు – అను.) అక్కడక్కడ చిన్నపాటి గడ్డితుప్పలు మాత్రం కనిపిస్తాయి – జడల బర్రెలకు అవే ఆహారం. మంచు చిరుత, నీలి గొర్రె లాంటి అరుదైన జీవజాలం కూడా ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. సముద్రతలానికి నాలుగువేల నుంచి ఆరువేల మీటర్ల మధ్యన ఉండే ఉన్నతశ్రేణి భూభాగాల్లో కనిపించే ప్రాణులు ఇవి రెండే. అందులో ఒకటి వేటాడేది, రెండోది వేటాడబడేదీ అవడమన్నది ప్రకృతి వైచిత్ర్యం. అలా అవి రెండూ శతాబ్దాలుగా మనుగడ సాగించినా మనిషిలోని దురాశ పుణ్యమా అని ఈ మధ్యన అంతరించిపోతోన్న జీవజాతుల పట్టికలోకి ఎక్కాయి. అన్నట్టు చిన్నపాటి పిల్లి అంత ఉండే హిమాలయన్ పందికొక్కులు ఆ ప్రాంతవు మంచు చిరుతకు ఆహారంగా లభించే మరో ప్రాణి. ఈ మంచు చిరుత అంత తేలిగ్గా మనిషి కంటపడదు. శక్తివంతమైన కెమెరాలు, వాటికి జూమ్ లెన్స్‌లు ఉన్న ట్రెకర్లకు మాత్రం అడపాదడపా దానిని చూసే అదృష్టం దక్కుతుంది.

గోరక్షెప్ గ్రామం మొన్నమొన్నటిదాకా ఎవరెస్టు ఎక్కే బృందాలకు బేస్ కాంప్‌గా వ్యవహరిస్తూ వచ్చింది. 1952లో ఆ ప్రయత్నం చేసిన స్విస్ బృందానికి గోరక్షెప్ శిబిరమే బేస్ కాంప్‌గా ఉపయోగపడింది. కొన్ని కొన్ని భౌగోళిక కారణాల వల్ల ఇపుడా బేస్ కాంప్ మరో రెండు వందల మీటర్ల ఎగువన స్థిరపడింది. మేం చేరబోయే చిట్టచివరి బిందువు ఆ బేస్ కాంపే. కానీ 2022లో నేపాల్ ప్రభుత్వం బేస్ కాంప్ విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఖుంబు గ్లేషియర్ ప్రాంతం ఎంతో వేగంగా ముకుళించుకుపోతున్న దృష్ట్యా ఆ కేంప్‌ను తిరిగి గోరక్షెప్ లోనే ఉంచాలన్నది నేపాలువారి ఆలోచన. అదే జరిగితే గోరక్షెప్‌కు తన పూర్వ ప్రముఖత్వం దక్కుతుందన్నమాట.

గోరక్షెప్ గ్రామం కాలాపత్థర్ పర్వత పాదం దగ్గర ఉంది. ఆ పర్వతం కూడా ఖుంబు గ్లేషియర్ అంచున ఉన్న మూపురం నుంచి చొచ్చుకువచ్చింది. అంతా కలసి ఆ పర్వతం ఎత్తు 5545 మీటర్లు. ఆ ప్రాంతమంతా ఇసుకతో నిండి ఉండటం మాకు ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం గోరక్షెప్ గ్రామం ఉన్న ప్రాంతమంతా ఒకప్పుడు సరోవరమని, ఆ ఉడిగిపోయిన సరోవర గర్భంలో ఈ గోరక్షెప్ గ్రామం రూపుదిద్దుకుందనీ వివరించాడు బాబూ గురంగ్.

అక్కడి మా టీ-హౌస్ పేరు ‘హోటల్ ఎవరెస్ట్ ఇన్’. ఆ చిరు గ్రామంలో వసతి దొరకడం అంత సులభమేం గాదు. అక్కడి గదులన్నీ ఎంతో ప్రాథమిక స్థాయిలో ఉన్న మాట నిజమేగానీ కనీసం అవైనా దొరికినందుకు ఎంతో సంతోషపడాలి. నా గది రెండో అంతస్తులో ఉంది. ఆ చెక్క మెట్లు ఎక్కి రెండో అంతస్తు చేరుకోవడం కష్టమయింది. పదిహేను ఇరవై మెట్లు ఎక్కడానికి అంతగా కష్టపడ్డ అనుభవం నా జీవితంలో అప్పటిదాకా లేదు. ఆ మెట్లూ, అవి ఎక్కుతోన్న దృశ్యం నా మనసులో గాఢంగా ముద్రపడిపోయాయి. రెండో అంతస్తు చేరుకొన్నాక ఊపిరి స్థిరపరచుకోడానికి కొన్ని క్షణాలు పట్టేసింది. గాలి పలచనయినట్లు బాగా తెలిసిపోతోంది. ఊపిరితిత్తులకు ప్రాణవాయువు సరిగ్గా అందడం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. శ్వాసించడమే కష్టమవుతోన్న సందర్భమది. హై ఆల్టిట్యూడ్‌కు చేరినపుడు కలిగే భౌతిక ప్రభావాలు నాకు ఎంతో స్పష్టంగా బోధపడ్డాయి.

(సశేషం)