రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మౌనంబంతట మాటలాడె… (3వ భాగం)

రచన: భైరవభట్ల కామేశ్వరరావు
జూన్ 2025

ఆ.వె.
అమ్ము నాటుకొనియె నా మగపక్షికి
నతులశోక మొందె నాడుపక్షి
యార్తి నా మనంబు నాక్రమించుట యేమి?
వా క్కపూర్వ మట్లు పలుకుటేమి! (42)
వ.
అని యాలోచించుచు నింకయు (43)
కం.

తా నాడిన మాటల ని
ర్మాణపుచందమ్ము నూత్నమై పొడసూపన్
గానానుకూల మియ్యిది
కానోపు నటంచు వాక్యగతి గమనించెన్ (44)

వ.

క్షణమాత్రం బట్లు తన వాక్యంబుల కూర్పులోని పొందికనుఁ బరిశీలించి, యందలి విశేషంబు ననుశీలించి, పరమప్రాజ్ఞుండైన యా తపస్వి నిశ్చయజ్ఞానంబున సానందుడై శిష్యునితో నిట్లనియె (45)

చ.
పదములు పాదబద్ధమగు పద్ధతి సూచితె యోయి కుర్ర! సొం
పది కను మోయి! పాదముల యక్షరముల్ సమమై చెలంగె, నిం
పొదవగఁ దీగ మీటి లయ నొద్దికఁ బాడగ శ్రావ్య మౌను! నా
హృదయములోని శోకము స్రవింపగ పుట్టిన దిద్ది శ్లోకమౌ! (46)
వ.
అనిన గురువాక్యంబునకు (47)
ఆ.వె.
అగును శ్లోక మిదియె ఔనౌనటంచును
భక్తితోడ శిష్యవరుడు దాని
వల్లె వేసె వేదవాక్యంబు రీతిని
మునివరుని మనమ్ము ముదిత మంద (48)
వ.
అంత, జరిగిన వృత్తాంతం బెల్ల నంతరంగమ్మున నావృత్తంబుఁ జేసికొనుచు, యథావిధి స్నానాదికంబులఁ గావించి వాల్మీకి యాశ్రమంబునకుఁ దిరుగుప్రయాణమయ్యె వెంట నతని యనుగుశిష్యండు నాతని శ్లోకంబునకుఁ బ్రథమశ్రోతయునైన భరద్వాజుండు తన నామంబు సార్థకంబగు రీతి జలపూర్ణకలశ భారంబును వహించి వినీతుడై గురు ననుసరించి యాశ్రమంబుఁ జేరుకొనియె. (49)
కం.
ఆ సరయువు నా పక్షులు
నా సుడిగొనివచ్చు శోక మా శ్లోకంబే
యే సంగతు లితరంబులు
తా సలుపుచునున్నఁ దోచుఁ దాపసుమదిలో (50)
శా.
ఏలా నా మన మాక్షణం బటుల శోకైకార్తభావంబునం
దా లీనం బయిపోయె! బోయలిటు వేటాడంగ మున్ జూడనే?
నాలో నింతటి సర్వజీవమయచింతాభావ మెట్లూరెనో!
మూలంబందలి ప్రాణ మొక్కటి శిరమ్మున్ దాకిన ట్లాయెబో! (51)
వ.
అని విచారించుచు నా ధర్మవిదుడు నిరంతరధ్యానంబునఁ గాలంబు గడుపుచున్నంత (52)
ఆ.వె
ధ్యానమగ్నుడైన తపసియౌ వాల్మీకి
హృదయకమలమందు నుదయమొందె
రామణీయకము హిరణ్మయమౌ కాంతి
వెలికి వచ్చి పొందె నలువరూపు (53)
ఉ.
ఎవ్వడు మాటమాత్రమున నెల్ల ప్రపంచములన్ సృజించునో
ఎవ్వని చూపుకై మునులు నేండ్లునుపూండ్లు తపమ్ము సేతురో
అవ్వనజాతగర్భుడు స్వయమ్ముగ దర్శనమిచ్చినంతఁ దా
నివ్వెరబోయి తోడనె వినీతమతిన్ బ్రణమిల్లె మౌనియున్ (54)
వ.
అవ్విధి దర్శన మొసంగిన నా విధిని వాల్మీకి యథావిధి నర్ఘ్యపాద్యాద్యుపచారంబులఁ బూజించి స్తుతించి నమస్కరించి యట్టె నిలుచుండిన (55)
తే.గీ.
ఆసనాసీనుడైన వేదాస్యుడంత
విస్మితానను వాల్మీకి వేదవిదుని
సుస్మితాంకురితకటాక్షసూక్ష్మదృష్టి
నాసనాసీనుఁ గమ్మని యానతిచ్చె (56)
చ.
ఎదుట విధాత యుండిన నదేమి విచిత్రమొ కాని మౌనికిన్
హృదయమునందు మున్ దలపులే కదలాడె నదే పదేపదే
చెదరిన గుండె క్రౌంచి తన చెల్మిజతన్ బెడబాసి యార్తిమై
బెదరుచుఁ బెట్టు బెంగ వినిపించెను దుఃఖము పొంగులెత్తగా (57)
తే.గీ.
ఆ మహాశోకవీచిక యాత్మఁ దాకి
విక్రియాపేత బ్రహ్మంబె విరిసెనేమొ
ఒక పరావాక్కు ముమ్మూర్తు లొదవి నోట
నప్రయత్నము శ్లోకమై యవతరించె (58)
వ.
వాల్మీకి నోట నప్రయత్మంబుగ నా శ్లోకంబు మరల వెలువడిన విని తన మందస్మితసందీప్తులు నలుదెసలందుఁ బర్వ నలువ యిట్లు పలికె (59)
క.
మెల్మే లో బ్రహ్మర్షీ
వాల్మీకీ! నిజము నిజము భవదీయమనోఽ
కల్మషభావోద్భవవాక్
కల్మలి యిది నిజము నిజముగా శ్లోకంబే! (60)
ఆ.వె.
నాదు ఛందముననె నా వాణి నీ నోట
ఛాందసాకృతిని ప్రసన్నయయ్యె
ఆదికవిని నేన యా దివ్యలోకాల
నాదికవివి నీవ యవనియందు (61)
వ.
మృదుమధురభావోన్మేషంబున రసార్ద్రమైన మనంబునకు జగదతీతమైన బ్రహ్మంబు జగదాత్మయై గోచరించు, నట్టి మహిమాన్వితదృష్టియే కావ్యసృష్టికి మూలము. నీకట్టిది యలవడె. నీ హృదయమున కింతటి మార్దవం బెట్లు ప్రాప్తించె ననిన నుడివెద విను (62)
క.
ఆనాడు, గురుతులేదా?
మా నారదు డేగుదెంచి మహనీయరసా
స్థానంబౌ రామకథన్
బూనికతో నీకుఁ జెప్పిపోయెను కాదా! (63)
వ.
ఆనాటి నుండియు సదా రామకథాస్వరూపసౌందర్యచింతనాకృషి నొనర్చి (64)
తే.గీ.
నీ మనమ్మును దుక్కిదున్నితివి నీవు
పరమమృదులంబు నతిసారవంతమయ్యె
రామకథలోని సౌందర్యరమసమష్టి
సీతయై యొప్పె నీ మనఃక్షేత్రసీమ (65)
క.
నీవే తగుదువు సకలో
హావిష్కృతి రామచరిత మానందసుధా
శ్రీవిద్యానిధిగాగ “ర
సోవైసః” యనగ కావ్యసుందరసృష్టిన్ (66)
తే.గీ.
ఒగి సనాతనదాంపత్య మొండు కలదు
శక్తిశివ మను పేర ప్రశస్తి బొందె
నదియె జానకీరామమై యవని వెలసె
నుపనిషద్ రహస్య మగు సంయోగలీల (67)
తే.గీ.
వేయిరేకులతామర విచ్చినట్లు
నీదు చేతమ్ము వికసింప నియతచరిత!
ఆ రహఃకేళి యెల్ల నీ వాత్మలోన
తేటతెల్లము సత్యమై తెలియగలవు (68)
వ.
ఇంత యేల (69)
శా.
నీవే రాముడు సీతవౌదు మరి యంతేనా! కథావిశ్వమం
దావిష్కారము నొందు సర్వజనగూఢాంతర్భహిస్సర్వమున్
నీవై చూతువు నీదు వాక్కు లవమేనిన్ బొల్లుపోబోదు శ్రీ
కైవల్యంబుగఁ జెప్పు రామకథ సత్కావ్యంబు హృద్రమ్యమై (70)
క.
ధీమన్మానసరమణము
తామసహరణమ్ము వేదతత్త్వవివరణం
బాముష్మికప్రయాణము
శ్రీమద్రామాయణమ్ము చిరమై వెలుగున్ (71)
ఆ.వె.
ప్రకృతితోడ నరుని ప్రాణంబు ముడివడి
వరలు దనుక గిరులు ఝరులు వరలు
గిరులు ఝరులు ధరణి వరలెడు నందాక
వరలు రామకథయు తరణి కరణి (72)
క.
కవి బ్రతుకును కావ్యమ్మున
భువి రామాయణము వ్యాప్తి పొందిన దనుకన్
గవి వాల్మీకీ! నీ వై
భవమున్ ముల్లోకములను ప్రసరించునయా! (73)
వ.
అని ప్రసంగించి యా విరించి రామాయణమహాకావ్యపారిజాతంబునకు బీజావాపం బొనరించి యంతర్హితుండయ్యె నంత (74)
క.
ఆనందాశ్చర్యంబుల
నా నలినజు నూసె ముచ్చటాడుచును బొరిన్
గానము సేసిరి శ్లోకము
పౌనఃపున్యముగఁ బ్రీతి పంబగ శిష్యుల్ (75)
క.
అనువారికి వినువారికి
మనమున నానంద మెసగి మరిమరి పాడన్
ముని శ్లోకంబున కంతట
ఘనమగు శ్లోకత్వ మబ్బె కవి మది మురియన్ (76)
ఉ.
అంతట భావితాత్ముడగు నా ఋషి భావము కావ్యకల్పనా
చింతన మందు మగ్నమయె శ్రీరఘురామమహత్తు కృత్స్నమున్
సాంతము పద్యకావ్యమహిమాన్విత రూపమునన్ రచింప సం
క్రాంతపథమ్మునన్ దొడరి కాలిడె మౌని వినిశ్చితాత్ముడై (77)
క.
ప్రతి పాత్ర రూపుఁ జూపునుఁ
బ్రతి మాటయుఁ బ్రతి తలపునుఁ బ్రతి కదలికయున్
బ్రతి నవ్వునుఁ బ్రతి యూరుపు
నతనికి సాక్షాత్కరించి యక్షర మయ్యెన్ (78)
సీ.
సత్కామదమ్ము ప్రసాదమధురసామృ
తంబగు పాయసాన్నంబుఁ బోలి
సకలార్థతత్త్వబోధకసమాసితవాక్య
సక్తగురూపదేశంబుఁ బోలి
సంధిసంధ్యంగసౌష్ఠవనిర్మితంబగు
ధర్మదీక్షాయత్తధనువుఁ బోలి
ముక్తికాంతనుఁ జేర్చు భక్తిభావాక్షర
ధుర్యమౌ దివ్యసేతువునుఁ బోలి
తే.గీ.
సుందరోదారసద్గుణశోభితంబు
నుచితరీత్యలంకారసముల్లసితము
రామచరితమ్ము దశకంఠప్రహరణమ్ము
నవతరించెను భువిని రామాయణంబు (79)
    
   

4అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Srinivasa Nyayapati June 1, 2025 2:36 pm

    కామేశ్వరరావుగారూ,

    I enjoyed reading this 3rd installment.

    1. మీరన్న “శ్లోకంబునకుఁ బ్రథమశ్రోతయునైన భరద్వాజుండు తన నామంబు సార్థకంబగు రీతి” నన్ను etymology లోకి తీసుకెళ్ళింది. పూర్తిగా నప్పిందనలేను గానీ “జలపూర్ణకలశం” అన్నారు కనుక నప్పిందేమో!
    2. మీరు ప్రయోగించిన కల్మలి అన్న మాటకు అర్థం నాకు ఆంధ్రభారతిలోనూ దొరకలేదు. Google AI చెప్పింది. చక్కటి మాట.
    3. ఆసనాసీనుఁడు అన్నమాట తొలిసారి చూస్తున్నాను. ఆసీనుడు అంటే సరిపోయేదేమో! అయినా, I am not sureఅండీ. I cannot stake any claim to having read all classical poets thoroughly.
    4. ఇంకా, (వ. 64లో ఇలా ఉంది. “రామకథాస్వరూపసౌందర్యచింతనాకృషి”) చింతనా అన్న మాట Monier-Williamsలోనూ లేదండీ. మీరే ఇంకో చోట (పద్యం 77)లో చింతన, చింతనం అన్నారు. ఇదే కరక్టేమో!
    5. 78వ పద్యం మీ యీ రచనకు అందం తెచ్చింది. ఎంత బాగుందో!

    -వాసు-

  2. 2
    పరిమి శ్రీరామనాథ్ June 3, 2025 4:58 am

    నెలనెలా శ్రీ కామేశ్వరరావుగారి “మౌనంబంతట మాటలాడె” పద్యాలకోసం ఎదురుచూస్తున్నాను. “నీవారశూకవత్” అనే మంత్రపుష్పవాక్యంతో విలక్షణంగా ప్రారంభమైన ఈ కావ్యంలోని ప్రతీభాగమూ మనసును తీయగా స్పృశిస్తూనే ఉంది.

    నేటి ఈ పద్యాలు ఎంతో హృదయావర్జకాలుగా ఉన్నాయి. “తలపులే కదలాడెనదే పదేపదే” అనే కూర్పు చంపకమాల పంక్తి చివరన ఎంతో మధురంగా ఉంది. పొల్లుపోబోని పలుకుల ఈ రామకథను శ్రీ కామేశ్వరరావుగారిలా అందిస్తుండగా ఆస్వాదించగలగడం నా వరకూ భాగ్యవిశేషమే.

    రామాయణాన్ని పాయసాన్నంతోనూ, గురూపదేశంతోనూ, ధర్మదీక్షాయత్త ధనువుతోనూ, దివ్యసేతువుతోనూ హృద్యంగా పోల్చి, పద్యంగా మలచిన ఈ కవిప్రతిభకు ఎన్ని నమస్సులు చెప్పినా తక్కువే.

    రాబోయే భాగాలకై వేయికళ్లతో ఎదురుచూస్తాను.

    విదాంవిధేయుడు,
    పరిమి శ్రీరామనాథ్.

  3. 3
    శిరీష June 3, 2025 12:34 pm

    మీ రామకావ్యం విజయవంతం కావాలని కోరుకుంటానండీ

    సీతయై యొప్పె నీ మనఃక్షేత్రసీమ🙏🙏🌷

    నాగేటి చాలు పంట 🙏🙏🌷

    ఉత్థితా మేదినీ భిత్వా

    అనేకానేక నమస్సులండీ

  4. 4
    కామేశ్వరరావు June 7, 2025 9:29 am

    నా పద్యాలకు ఆనందించి స్పందించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

    “జలపూర్ణకలశం” అన్నారు కనుక నప్పిందేమో!

    అవునండి. వాజ అంటే నీరు అనే అర్థం ఉన్నది.

    చింతనా అన్న మాట Monier-Williamsలోనూ లేదండీ.

    దీర్ఘాంతరూపంకూడా ఉన్నదనుకుంటానండి. శబ్దరత్నాకరం దానిని దీర్ఘాంతంగానే పేర్కొంది.

    “జననాథస్మరచింతనాపరవశస్వాంతంబునం” – చంద్రికాపరిణయం చ.ఆ.16, సురభి మాధవరాయలు

    “…నిరంతర మాధవ చింతనా సము
    త్సుకలలితాధరుండు…” – శ్రీనివాసప్రబంధము చ.ఆ.77 పుట్టపర్తి నారాయణాచార్యులు

    రాబోయే భాగాలకై వేయికళ్లతో ఎదురుచూస్తాను.

    శ్రీరామనాథ్ గారూ, మీ ఆత్మీయమైన మాటలు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. కాని మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి.

    పద్యరచనాభ్యాసంగా ఏదో కొంత ప్రయత్నిస్తున్నాను తప్ప ప్రచురించాలన్న ఉద్దేశం లేదు. “మరల నిదేల రామాయణం బన్నచో… నా భక్తిరచనలు నావి కాన” – అని చెప్పగలనని నాకు అనిపించిననాడు తప్పక ప్రచురిస్తాను. అది ఎప్పుడు, ఎంతవరకూ సాధ్యమవుతుందో!

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా
  • నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు?
  • నాకు నచ్చిన పద్యం: విద్వాన్ విశ్వం ఆధునికస్వరం
  • నాకు నచ్చిన పద్యం: కైలాసాన్నే కాదన్న వీరవనిత
  • అమృత షెర్-గిల్: ఆకృతి చిత్రాలలో ఆత్మాన్వేషణ

ఇటువంటివే…

  1. మౌనంబంతట మాటలాడె… (2వ భాగం)
  2. మౌనంబంతట మాటలాడె…
  3. క్రీడాభిరామము:3 వ భాగం
  4. క్రీడాభిరామము:1 వ భాగం
  5. క్రీడాభిరామము:7 వ భాగం

జూన్ 2025 సంచికలో ...

  • Colonial Park
  • అక్కమహాదేవి వచనాలు – 6
  • అనువాద ప్రస్థానం
  • ఊరట
  • ఎండ్‌లెస్
  • కంప్యూటర్ చిప్ కథ – 3: పారే విద్యుత్తు: స్టీఫెన్ గ్రే ప్రయోగాలు
  • కలల వెలుగు వదులుకోని కథల ప్రపంచం – గన్స్ & మాన్సూన్స్
  • చలం గురించి…
  • చలం నవలా నాయిక — రాజేశ్వరి చెప్పిన కథ
  • చలం సాహిత్యం-విముక్తి
  • జూన్ 2025
  • దర్శనము
  • దేశీయ భాషల భావిగతి
  • నాకు నచ్చిన పద్యం: విశ్వనాథుని దివ్యతేజోవిరాడ్రథము
  • పంచేంద్రియాలు: 4 రుచి
  • పదప్రవాళం
  • పునః
  • పున్నమ
  • పుస్తక సమీక్ష: గ్రామీణజీవితపు బాల్యజ్ఞాపకాల చిత్రణ
  • పుస్తక సమీక్ష: బంగారు తండ్రి
  • ప్రవాసంలో టిబెట్ ప్రతిఘటన
  • మౌనంబంతట మాటలాడె… (3వ భాగం)
  • యూట్యూబ్‍లో ఈమాట: మే 2025
  • లీల … కేదార్‌నాథ్ డైరీ
  • షాంగ్రి-లా – 2
  • హిందూ మతం అంటే ఏమిటి?
  • ౙాబిలి
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఊరట
ఎండ్‌లెస్

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.