సహారా సైకత సీమలో

మౌంట్ తుబ్‌కల్ శిఖరారోహణ మిగిల్చిన మధురస్మృతులు, ఒళ్ళునొప్పులూ గిలిగింతలు, చిరుచింతలూ కలిగించడం ముగియకముందే మేమంతా సహారా ఎడారిలో ట్రెకింగ్‍కు నడుము బిగించాం. మా తుబ్‌కల్ బృందంలోని పధ్నాలుగు మందిలో అన్బు, శ్రీనివాస్ ముందటిరోజునే వెళ్ళిపోయారు. రమేశ్ ఈనాడు మా వీడ్కోలు అందుకున్నాడు. ఆ ఆట్లస్ పర్వతశ్రేణిలోని ఇమ్లిల్ గ్రామంలో చివరకు మిగిలింది పదకొండుమందిమి. ఇమ్లిల్ నుంచి దక్షిణ దిశగా సాగి పర్వతశ్రేణి అవతలి తీరం చేరుకుంటే సహారా ఎడారి అంచులు అందుతాయి. పన్నెండు గంటల సుదీర్ఘ ప్రయాణమది. సహారా ఎడారిలో మేము మొట్టమొదట చేరుకొనే స్థావరం మెర్‌జోగా అన్న చిన్న పట్టణం.

ఉదయం ఆరుగంటలకు ఇమ్లిల్ నుంచి మా మినీవ్యానులో ప్రయాణం ఆరంభించాం. సింహం, రాజు, గోపి, రాజశేఖర్, రవి, తిరు, రిచి, జీకే, కిషోర్, విజయ్-నాతో కలిసి ముచ్చటగా పదకొండుమందిమి. మాతోపాటు తుబ్‌కల్ శిఖరం దాకా తోడు వచ్చిన అబ్దుల్, రషీద్‌లే ఈ ఎడారి ట్రెక్‌లో కూడా మాకు సారథులు.

ఆట్లస్ పర్వతశ్రేణిని దాటుకొనే దిశగా మా ప్రయాణం సాగింది. పాము మెలికల పర్వత మార్గంలో ప్రయాణమన్నది అందరి ఒంటికీ సరిపడే పనిగాదు. కడుపులో తిప్పడం, తలనొప్పి సాధారణ సమస్యలు. వీలయినన్నిచోట్ల ఆగుతూ, ఆగి తాజా గాలి పీల్చుకొంటూ ముందుకు సాగాం. అది సమస్యను కాస్త సరళం చేసింది. అలా కొన్ని గంటలు సాగాక ఒక కొండ కొమ్మున, 4800 అడుగుల ఎత్తున ఉన్న టిజి ఐత్ బర్కా అన్న కఫే దగ్గర మింట్ టీకోసం కాసేపు ఆగాం. అక్కడికి చేరగానే ఏదో పూర్వజన్మ స్మృతిలాగా – ఈ ప్రదేశం నాకు తెలుసు, బాగా తెలుసు – అన్న వింత భావన నన్ను అలుముకొంది, విస్తుపోయేలా చేసింది. కాస్తంత తమాయించుకొని ఆలోచిస్తే ఆ భావన వెనక ఉన్న కారణం తెలిసి వచ్చింది. రెండేళ్ళ క్రితం మా కుటుంబమంతా ఈ కొండల్లో తిరుగాడినపుడు సరిగ్గా ఇదే కఫేలో మింట్ టీ కోసం ఆగాం! అదీ సంగతి.

ఇంతకుముందే ఈ ప్రాంతాల్లో ప్రయాణించాను గాబట్టి ఇక్కడి రోడ్ల తీరుతెన్నులతో నాకు పరిచయం ఉంది. ఎంత ఎత్తుకు చేరుకొంటామో ఎలాంటి పరిసరాలు తటస్థపడతాయో అవగాహన ఉంది. కాసేపటికల్లా మేము చెట్లు కనుమరుగయ్యి బోసిభూములు ఎక్కువగా కనిపించే ఆల్‌పైన్ సీమల్లో ప్రవేశించాం. అవి కూడా దాటుకొని రాళ్ళూ రప్పలూ మాత్రమే కనిపించే పరిసరాల్లోకి చేరుకున్నాం. ఎన్నెన్నో చెంపపిన్ను మలుపులు తిరిగి తిరిగి టిజ్ న్‍టిక్కా అన్న 7414 అడుగుల కనుమ ప్రదేశం చేరుకొన్నాం. ఆట్లస్ పర్వత శ్రేణిలోకెల్లా ఎత్తయిన కనుమ ఇది.

మధ్యాన్నం రెండింటికి వర్‍జజట్ (Ouarzazate) అన్న పట్నంలో లంచ్ కోసం ఆగాం. ఆ ఊళ్ళో ఎక్కడ చక్కని భోజనం దొరుకుతుందో మా గైడ్లు అబ్దుల్, హుస్సేన్‌లకు బాగా తెలుసు. మమ్మల్ని ల జార్డీన్స్ అన్న రెస్టారెంటుకు చేర్చారు. రకరకాల సలాడ్లు, టజీన్లూ నిండిన రుచికరమైన భోజనం దొరికిందక్కడ. ఆ పూట మేమెవరం చెప్పుకోదగ్గ బ్రేక్‌ఫాస్ట్ చేసి ఉండకపోవడం వల్ల ఆ రెస్టారెంట్లో చేసిన లంచ్ మాకు విందు భోజనం అనిపించింది. నింపాదిగా భోజనాన్ని ఆస్వాదించాం.

అక్కడి పరిసరాలు సమతలంగా ఉన్నాయి. తుప్పలూ పొదలే తప్ప చెప్పుకోదగ్గ పచ్చదనం లేదు. నీళ్ళులేని రాళ్ళు నిండిన వాగుల జాడలు మాత్రం కనిపించాయి. ఆ వర్‍జజట్ ప్రాంతాన్ని సహారా ఎడారి మొట్టమొదటి ముఖద్వారంగా పరిగణించవచ్చు. దక్షిణాన ఉన్న టింబక్టూ నుంచి వచ్చే వాణిజ్యమార్గంలో ముఖ్యమైన బిందువు ఆ వర్‍జజట్ పట్టణం. అనాది నుంచీ వ్యాపారాలకు ఆయువుపట్టుగా నిలిచిన ప్రాంతమిది. ప్రస్తుతకాలంలో అక్కడ వెలసిన సినిమా స్టూడియోల వల్ల, వాటిల్లో నిర్మించిన హాలీవుడ్ హిట్ సినిమాల వల్ల ఆ పట్నం పేరు సినిమా ప్రియులకు సుపరిచితం అయింది.

అప్పటికే ఇమ్లిల్‌లో బయల్దేరి ఏడుగంటలు గడిచాయి. మరో ఐదు గంటల ప్రయాణం మిగిలి ఉంది. అది దాటాక సహారా అంచుల్లోని మెర్‌జూగా (Merzouga) పట్టణం…

దారిలో ఒక బెర్బెర్ గ్రామంలో ఆగి ఎడారి ప్రయాణాలకు అనుకూలంగా ఉండే బెర్బెర్ దుస్తులు కొన్నాం. మరో రెండు గంటలు ప్రయాణం చేశాక మెర్‌జూగా పట్నం చేరుకొన్నాం. ఆ పట్నం దాటి మరికొన్ని కిలోమీటర్లు వెళ్ళాక ఉన్నట్టుండి రోడ్డు అంతమయింది. ఇహ ఆపైన అంతా సువిశాల సైకత సాగరమే!

ఆరోజు అంతా కలసి 600 కిలోమీటర్లు ప్రయాణించాం. ఏ విధంగా చూసినా అది నడుములు విరగ్గొట్టే ప్రయాణమే. మొరాకో దేశపు మధ్య బిందువు దగ్గర మొదలెట్టి అల్జీరియా సరిహద్దుల్లో ఉన్న మెర్‌జూగా పట్నాన్ని చేరడానికి పూర్తిగా పన్నెండు గంటలు పట్టింది. సూర్యాస్తమయం అయిపోయి చీకట్లు కమ్ముకొంటున్న సమయమది. అక్కడ్నించి మా ఎడారిలో ఉన్న క్యాంపు చేరుకోడానికి ఒంటె మీద గంట ప్రయాణం. కాస్తంత వెలుతురుండగానే చేరుకొంటే ఒంటె సవారీ రుచి చూస్తూ ఆ గంటా ప్రయాణం చేద్దామనుకొన్నాం. చీకటి పడిపోతోంది గాబట్టి మా అందరికీ ఇసుకలో సాగిపోగల దిట్టమైన ఫోర్‌వీల్‌ డ్రైవ్ జీపుల్ని ఏర్పాటు చేశారు మా నిర్వాహకులు. అయినా కొంతమందిమి ఒంటెల మీద వెళ్ళడానికే ఇష్టపడ్డాం.

మసకమసక చీకటిలో అలా ఒంటెల స్వారీ చెయ్యడానికి మొదట్లో కాస్తంత బెరుకు పుట్టించినా త్వరగానే మేమందుకు అలవాటు పడిపోయాం. నా వరకూ నాకు ఒంటెను ఎన్నుకొన్నందుకు చాలా సంతోషమనిపించింది. పైనుండి చల్లని వెన్నెల ప్రసరిస్తోన్న చందమామ పుణ్యమా అని ఆ ఎడారి అంతా చిరువెలుగు పరచుకొని ఎంతో మనోహరంగా అనిపించింది. సాగిపోతోన్న ఒంటెల బారు, రేఖా మాత్రంగా కనిపించే ఇసుక తిన్నెలు- సుందర దృశ్యమది. ఆ తిన్నెలు చలనం లేకుండా నిలచిపోయిన కెరటాలను తలపించాయి. ఆకాశమంతా గుత్తులు గుత్తులుగా నక్షత్రాలు-ఏ క్షణాన్నైనా ద్రాక్షపళ్ళలా రాలి నేలన పడిపోతాయా అనిపించే నక్షత్రాలు… దిగువన ఇసుక తిన్నెలు, ఎగువున నక్షత్ర తోరణాలు ఏదో తెలియని మార్మిక జగత్తులోకి ప్రవేశించిన భావన!

తిన్నెలను అవలీలగా దాటుకొంటూ ఒంటెలు సాగిపోతున్నాయి. పరిసరాల్లో మసకచీకటితో మమేకమై మేమంతా మా నిశ్శబ్దయానం సాగించాం. నా వరకూ నాకు డేవిడ్ లీన్ తీసిన లారెన్స్ ఆఫ్ అరేబియా అన్న క్లాసిక్ సినిమాలోని ఒమర్ షరీష్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన ఒక వింత భావన కలిగింది. అరేబియా ఇసుక సముద్రాలలో డెబ్బై ఎనభై ఏళ్ళ క్రితం ఈదులాడిన మహా యాత్రికుడు విల్‌ఫ్రెడ్ థెసీజర్ పుస్తకం – అరేబియన్ శాండ్స్ లోకి అడుగు పెట్టి అందులోని పాత్రగా ఒదిగిపోతున్న అనుభవం కలిగింది. కలలో కూడా ఆ మహాయాత్రికుని దరిదాపుల్లోకి చేరుకోలేనని తెలిసినా, అప్పటి నా అనుభూతి అది. థెసీజర్‌ను చేరుకోవడం చేరుకోలేకపోవడం సంగతి ఎలా ఉన్నా ఆ క్షణాల్లో థెసిజర్ అడుగుజాడల్లో ఒంటెమీద సాగిపోతూ అతని అనుభవాలను కాస్తంత రుచి చూశానన్నమాట వాస్తవం.

తలకు ఇసుక తెరల నుంచి కాపాడే గుడ్డ కట్టుకొని, స్థానిక దుస్తులు ధరించి, ఒంటెను అధిరోహించి ఆ ఒంటెల బిడారులో సాగిపోయిన కాలాతీత యాత్రికుడు థెసీజర్ చిత్రం ఎప్పట్నించో నా మనసులో బలంగా ముద్ర పడిపోయింది. చెరపలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది. దానివల్ల అతనిలాగా ఎడారిలో ఒంటె మీద ఎక్కి సాగిపోవాలన్న కోరిక పుట్టింది. అది ఎదిగి మానైపోయింది. ఆ కోరిక, ఆ ఆకర్షణ బహుశా నన్ను థెసీజర్ వీరాభిమానిగా మార్చి ఉంటాయి. అరేబియా ఎడారుల ఎంప్టీ క్వార్టర్ ‘రబ్ అల్ ఖాలీ’లో ఆయన చేసిన వీరోచిత యాత్రలంటే నాకు ఎంతో ఆరాధన.

సమయం గడిచి పోతున్నా మేము చేరవలసిన మజిలీ జాడ కనిపించనే లేదు. అలా అని దాన్ని చేరుకోవాలన్న ఆత్రుత మాకు ఏమాత్రం లేదు. అలా ఒంటె మీద ఎక్కి ఎడారిలో సాగిపోవడం మాకు ఆనందం ఆహ్లాదం కలిగిస్తోంది. ఒక గంటసేపు అలా సాగాక, ఒక ఇసుక తిన్నె పైనుంచి, మాకు దూరాన దీపాలు కనిపించాయి. అదే మా మొదటి ఎడారి మజిలీ. ఇసుక తిన్నెల మధ్యన మనుషులు చేసే మజిలీ… ఆ ఎర్గ్ ఛబీ ఇసుక తిన్నెల మధ్య ఉన్న మజిలీ… సాన్‌మావ్ క్యాంప్ అన్నది ఆ మజిలీ పేరు. చుట్టూ ఇసుక సముద్రమే తప్ప గుర్తుపట్టడానికి మరే ఇతర సాధనాలూ లేని చోట నెలకొన్న క్యాంప్ అది.

ఈ ఎర్గ్‌-లన్నవి ఎడారుల్లో ఇసుకతిన్నెలే తప్ప మచ్చుకైనా చెట్టూచేమా లేని విశాల సమతల ప్రదేశాలు. సరైన సమయంలో మనసు పెట్టి చూస్తే ఎంతో సుందరంగా కనిపించే ప్రదేశాలు. మేము మజిలీ చేసిన ఎర్గ్ ఛబ్బీ ఉత్తర దక్షిణ దిశల్లో ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవు, తూర్పు పడమర దిశల్లో ఏడు కిలోమీటర్ల వెడల్పున విస్తరించి, సన్నపాటి ఇసుకతో నిండిన సైకత సరోవరం. ప్రదేశం సమతలమే అయినా అక్కడి ఇసుక తిన్నెలు దాదాపు 500 అడుగుల ఎత్తు వరకూ చేరుకొని ఉంటాయి. చూడటానికి పరమాద్భుతం అనిపిస్తాయి. వీటి పుణ్యమా అని ఈ ఎర్గ్ ఛబీ ప్రపంచపు ప్రకృతి వింతల్లో ఒకటిగా పరిగణించబడుతోంది.

క్యాంపులోని గుడారాల్లో అన్ని సదుపాయాలూ ఉన్నాయి. శుభ్రమైన పడకలు, స్నానాలకు షవర్లు ఉన్నాయి. కాస్తంత తాజాపడ్డాక అందరం కాంప్ ఫైర్ చుట్టూ చేరాం. బెర్బెర్ వాద్యకారుల సంగీతోత్సవం సాగుతోందక్కడ. ఇసుక తిన్నెల నడుమ వినిపిస్తోన్న లయబద్ధమైన మృదుమృదంగనాదాలు నన్ను స్వప్నావస్థకు చేర్చాయి. బెర్బెర్ బాణీ భోజనాలు చేశాక సంగీతమూ, సంబరమూ, ఉత్సవహేలా బాగా పొద్దుపోయేదాకా సాగాయి. మేమంతా తలా ఒక వాయిద్యం చేత బట్టుకొని దరువులు వేసేంత ఉత్సాహం వెల్లివిరిసిందక్కడ. మాతోపాటు ఆ క్యాంపులో ఉంటోన్న రెండు జంటలు పరిచయమయ్యాయి. ఒక జంట రబాత్ నుంచి వచ్చిన స్థానికులు- ఇరవైలలో ఉన్న యువతీ యువకులు. రెండో జంట ఫ్రాన్సుకు చెందిన అరవైలు దాటిన పరిణత వయస్కులు. రబాత్ జంట శాండ్ స్కేటింగ్, క్వాడ్ బైకింగ్‌లాంటి సాహసక్రీడల కోసం వచ్చారు. ఫ్రెంచి జంట ఇసుక తిన్నెల వన్నెచిన్నెలు చూద్దామని వచ్చారు.


మర్నాటి ఉదయం అందరం సూర్యోదయం చూడ్డానికి వెళ్ళాం. ఆ తొలిసంజె వెలుగుల్లో మా క్యాంపు పరిసరాల్లోని ఇసుకతిన్నెలు ఎక్కి ఒక ఉన్నత బిందువు చేరుకున్నాం. చేరుకుని సూర్యునికి స్వాగతం చెప్పడానికి ఎంతో ఉత్సాహంతో ఉత్సుకతతో ఎదురుచూశాం. దూరపు తిన్నెల మీద మాలాగే ఎదురుతెన్నులు చూస్తోన్న మరికొంతమంది కనిపించారు. వాళ్ళంతా ఓ బృహత్తరమైన మట్టికొండపైకి ఎగబ్రాకుతోన్న చిరుచీమల్లా అనిపించారు.

కొద్ది నిమిషాల్లో తూర్పు క్షితిజంలోంచి సూరీడు ఉన్నట్టుండి ఎగసిపడ్డాడు. ఒక్కసారిగా ఇసుక తిన్నెలన్నీ వర్ణభరితం అయ్యాయి. సూర్యుడు ఆకాశంలోకి ఎగబాకే కొద్దీ పరిసరాలు వివిధ వర్ణాలను సంతరించుకొన్నాయి- కుంకుమ వర్ణం, నారింజ రంగు, బంగారు ఛాయ. ప్రపంచమే ఒక బృహత్తరమైన రంగులు మారే వర్ణపటంగా పరిణమించిన క్షణాలవి…

కడుపారా బ్రేక్‍ఫాస్ట్ చేసి, తనివితీరా షవరు జలకాలాడాక ఆనాటి అతి ముఖ్యమైన ట్రెక్కుకు మానసికంగా, శారీరకంగా సంసిద్ధమయ్యాను. భౌతికంగా కూడా బాగా సిద్ధపడాల్సి వచ్చింది. తలకు, మొహానికీ బెర్బెర్ బాణీ తలగుడ్డ చుట్టుకున్నాం. ఆ పొడవాటి మెత్తటి వస్త్రం మమ్మల్ని ఎండ, ఇసుకల నుంచి కాపాడే మహత్తర పరికరం. తలను వేడి నుంచి కాపాడి చల్లగా ఉంచే ఉపకరణం. ఆ వస్త్రాన్ని తలా నోరూ ముక్కూ మరుగుపడేలా కట్టుకోడానికి అనుభవమూ నైపుణ్యమూ కావాలి. అబ్దుల్, హుస్సేన్‌లు వాటిని కట్టుకోవడంలో మాకు సాయపడ్డారు. మాలోని కొందరు చురుకైన వాళ్ళు క్షణాల్లో ఆ ఒడుపును పట్టుకోగలిగారు.

ప్రపంచంలోని పొడి ఎడారుల్లో కల్లా పెద్దది సహారా. ఉత్తర ఆఫ్రికాలో తూర్పు పడమరల్లో పదిదేశాల్లో విస్తరించి ఉన్న ఎడారి అది. తూర్పున ఈజిప్టు ఉంటే పడమర కొసన మొరాకో – ఈ రెండు దేశాల నడుమ సుడాన్, ఛాడ్, లిబియా, నైజర్, ట్యునీషియా, అల్జీరియా, మాలి, మౌరుటానియా – అన్నీ కలసి పది దేశాలు. ఆఫ్రికా ఖండంలో 31 శాతం భూభాగంలో విస్తరించిన ఈ సహారా ఎడారి విస్తీర్ణంలో దాదాపు అమెరికా, చైనాలతో సరితూగుతుంది!

ఎడారులన్నీ ఇసుకతో నిండి ఉంటాయన్న అభిప్రాయం మనలో చాలామందికి ఉంది. అది నిజం కాదు. ఎడారుల్లో చాలా భాగంలో అసలు ఇసుకే ఉండదు. సహారా ఎడారిలో పదిహేను శాతమే ఇసుక. అరేబియా, ఇరాన్, అటకామా, మన థార్ ఎడారి- అన్ని ఎడారులదీ అదే బాణీ. వర్షపాతం ఉండదు, భూసారం శూన్యం, ఏ పంటా సవ్యంగా పండదు అన్నమాట నిజమే గానీ ఎడారుల్లో వాటివాటి బాణీకి చెందిన పచ్చదనం, జంతుజాలం ఉంటాయి. మనుషులు నివసించే గ్రామాలు ఉంటాయి. సహారా ఎడారి ఇరవై లక్షలమందికి జీవనాధారం కన్పిస్తోంది. వాళ్ళంతా తెగలుగా, తండాలుగా, సంచార జీవితం సాగిస్తూ ఉంటారక్కడ.

మా క్యాంపు నుంచి బయటపడి అందరం ఇసుకతిన్నెల మధ్య నడవడం మొదలెట్టాం. నడవడానికి కంటికి కనపడే దారి అంటూ ఏమీలేదక్కడ. కానీ మమ్మల్ని ఎటు ఎలా తీసుకువెళ్ళాలో తెలిసిన గైడ్ల మార్గదర్శకత్వం ఉంది కదా- వాళ్ళను అనుసరించాం. ఇసుక మృదువుగా, మెత్తగా, బంగారురజనులా ఉంది. కనుచూపుమేర ఎటుచూసినా ఆ బంగారపు రాసులే. ఒకే పరిమాణానికి చెందిన వందల వేల లక్షల కోట్ల ఇసుక రేణువుల్ని ప్రకృతి ఎలా రూపొందించగలిగిందీ అన్నది మన ఊహకు అందని వివరం. అసలా వివరం తెలుసుకోవాలనుకోవడమే అసమంజసం అన్న భావన కలిగే ప్రదేశమది. ప్రకృతిలోని మహత్తును గుర్తించి, అంగీకరించి, ఆనందించేలా చేసే ప్రదేశమది.

ఆ సన్నపాటి ఇసుకలో నడవడం ఏమంత సులభం కాదు. ఎడారి ప్రయాణం ఆరంభించే ముందే కాస్తంత రిసెర్చి చేసి ఎడారి ట్రెక్కులకు అనుకూలంగా ఉండే బూట్ల వివరాలను సంపాదించాను. కానీ మేవు తుబ్‌కల్ శిఖరారోహణకు వాడిన బూట్లే ఎడారి నడకలకూ సరిపోతాయని అబ్దుల్ భరోసా ఇచ్చాడు. అంచేత స్పెషల్ షూస్ కొనడమన్న ఆలోచన విరమించాను. ఏది ఏమైనా ఎడారి నడకలోని పరిపూర్ణ అనుభూతి పొందాలంటే కొంతమేర అయినా నగ్నపాదాలతో నడవడం సరియైన పద్ధతి. నడిచీ నడవగానే ఎడారి ఇసుక బూట్లలో చేరుకోవడం ఆరంభించింది. బూట్లు ఇసుకతో నిండగానే వాటిల్ని విప్పి, ఇసుక వంపేసి, మళ్ళీ వేసుకోవడం- ఆ ప్రక్రియ పదేపదే కొనసాగింది.

ఇసుకలో అడుగులు వేసేటపుడు కాళ్ళ క్రింద ఇసుక కాస్తంత మేర జారిపోవడం సహజం. అంచేత పాదాలకు స్థిరమైన ఆధారం దొరకదు. అడుగు ముందుకు వెయ్యడం మామూలు నేలమీద వేసినంత సులభం కాదు. అంచేత ఇసుకలో నడక మనల్ని త్వరగా అలసిపోయేలా చేస్తుంది. దానికి తోడు నిడుపాటి ఇసుకతిన్నెలు ఎక్కే క్రమంలో అడపాదడపా కాలు బెసికి జారిపోవడం, లేచి దులుపుకొని అష్టకష్టాలు పడి మళ్ళా ఎక్కడం – అదో ప్రహసనం. అలసటకు హేతువు. అలా అని అందులో ప్రమాదాలు ఏ మాత్రం లేవు. మామూలు కన్నా రెట్టింపు శ్రమ. అంతే. వీలయినంత వరకూ ఆ ఉన్నతమైన ఇసుకతిన్నెల మూపురాల మీదే నడిచే ప్రయత్నం చేశాం. కాలు బెసికి తిన్నెల మీంచి దొర్లిపడకుండా జాగ్రత్త పడ్డాం. అలా మూపురాల మీద నడుస్తూ వాటిమీద మా పాద ముద్రలను విరివిగా వదిలాం. సుందరంగా ఒక క్రమంలో పరచుకొని ఉన్న ఇసుక మీద మా పాదాల గుర్తులు వదలడం అన్నది నాకు అంతగా రుచించలేదు. ఆ మాట అబ్దుల్‌తో అంటే అతను నవ్వేసి ‘మరేం బాధపడకండి. ఇక్కడ వీచే గాలులు మీ పాద ముద్రల్ని చెరిపేసి ఆ తిన్నెల్ని యథాస్థితికి చేర్చడానికి పెద్దగా సమయం పట్టదు’ అన్నాడు. సమాధానపడ్డాను. పాదముద్రలు అనే కాదు, ఆ బలమైన గాలుల వల్ల ఇసుక తిన్నెల రూపురేఖలూ, ఘన పరిమాణాలూ కూడా ఎంతో తరచుగా మారిపోతూ ఉంటాయట. గాలి అన్నది ఆ ప్రాంతాల్లో విహరించే అద్భుత శిల్పి.

ఆ ఎడారి ప్రాంతాల్లో కాస్తంత పొద్దెక్కగానే సూర్యుడు మండిపడటం ఆరంభమవుతుంది. అంత మండే ఎండ కూడా మాకు ఎక్కువ ఇబ్బంది కలిగించలేదు. అక్కడ ఆ మండిపాటు ఎంతో సహజంగా అనిపించింది. ఇసుక తిన్నెల సుందరత ఎండను మరిపించింది. మాతోపాటు ఎందుకైనా మంచిదని నాలుగు ఒంటెల్ని తీసుకువెళ్ళాం. మధ్యలో ఎవరన్నా నడవడానికి ఇబ్బంది పడితే వాళ్ళను ఒంటె మీద ఎక్కిద్దామన్నది మా ఆలోచన. ఆ నాలుగు ఒంటెలకీ చక్కని పేర్లున్నాయి – బాబ్‌ మార్లో, జిమ్మీ హెండ్రిక్స్, స్కూబీ డూ, మౌస్ – ఆ పేర్లకు అవి స్పందిస్తాయి కూడానూ!

మధ్యాన్నం అయ్యేసరికి సూర్యుని ప్రతాపం పెరిగిపోయింది. ఎండ తీక్షణమయింది. వేడి భరించడం కష్టమయింది. మనం వర్ణచిత్రాలలో చూసే ఎడారిలోని ఒంటెల బిడారుల్లో ఈ తీక్షణత గోచరించదు. చిత్రకారుల తూలికలకు అందని అసౌకర్యమది. మనమే అక్కడికి వెళ్ళి, జీవశక్తిని పీల్చేసే ఆ ఎండల మండిపాటును ప్రత్యక్షంగా అనుభవిస్తే తప్ప ఆ అసౌకర్యాలు మనకు బోధపడవు.

అలా నాలుగుగంటలు నడిచాక ఇసుక తిన్నెలు దాటుకొని ఎండిపోయిన తుప్పలూ, అకేషియా పొదలూ ఉన్న ప్రాంతం చేరుకొన్నాం. ఒంటెలకు ఆ అకేషియా పొదలు అంటే అది విందు భోజనమే! మరో అరగంట గడిచాక బెర్బెర్ సంచారజీవులు ఉన్న మరో క్యాంప్ చేరుకున్నాం. అక్కడ కొన్ని నేలబారు గుడారాలు కనిపించాయి. వాటి మధ్య ఉన్న ఓ పెద్దపాటి గుడారంలో మేమంతా స్థిరపడ్డాం. ఆ గుడారాలన్నీ అక్కడి బెర్బెర్ ప్రజలకు చెందినవి.

ఆత్మీయ స్వాగతాలు, చిరునవ్వుల పలకరింపులూ ముగిశాక వాళ్ళు మాకు బెర్బెర్ తినుబండారాలూ తేలికపాటి సలాడ్లూ లంచ్‌గా పెట్టారు. మా నడకలకు విరామం ఇచ్చి అందరం లంచ్ చేశాం. లంచ్ ముగిశాక కూడా బయట కాస్తోన్న మండుటెండ పుణ్యమా అని ఎవరికీ కదలానిపించలేదు. అలా ఓ గంట గడిచాక మా గైడ్లు వచ్చి ‘మనం మన క్యాంపుకు తిరిగి వెళ్ళాల్సిన సమయమయింది’ అని చెప్పారు. మెల్లగా లేచి నడక ఆరంభించాం. నిడుపాటి ఇసుక తిన్నెలను తప్పించుకొంటూ, సులభ మార్గాలను వెదుక్కుంటూ రెండుగంటలు నడచి మా క్యాంపుకు చేరుకున్నాం. అంతా బాగా అలసిపోయి ఉండటం వల్ల ఓ గంట విశ్రాంతి తీసుకుని ఎండ తగ్గుమొహం పట్టేదాకా నీడ పట్టున ఆగడం మంచిదని అందరం భావించాం. మా టెంట్ల లోపల ఎంతో వేడిగా ఉన్నా మా అలసటా, డస్సిపోవటాల పుణ్యమా అని ఓ గంటసేపు ఒళ్ళు తెలియకుండా నిద్రపోగలిగాం.

మా నిర్వాహకులు ఆ సాయంత్రం మా అందరికీ వెడల్పాటి టైర్లూ, తక్కువ ఎత్తూ, నాలుగు చక్రాలూ ఉన్న శక్తివంతమైన మోటారు బైక్‌ల మీద ఇసుక తిన్నెల్లో విహరించమన్న కార్యక్రమం పెట్టారు. నిర్మలమైన ఇసుక తిన్నెలను మోటారు బైకుల గుర్తులతో మలినపరచడం అన్నది నాకు ఏ మాత్రమూ సరిపడని విషయం. అంచేత విముఖత చూపించాను. కానీ మిగిలిన అందరూ ఉత్సాహపడేసరికి మైనారిటీ వర్గానికి చెందిన నేను కూడా వాళ్ళతో చెయ్యి కలిపాను. ఏ మాటకామాటే, అది ఒక విభిన్న అనుభవం. నేను కోరుకొనే అనుభవాలకు అది కడుదూరం అన్నది వేరేమాట. ఆ పిల్లసైజు యంత్ర భూతాలనధిరోహించి నిడుపాటి ఇసుక తిన్నెలు ఎక్కిదిగడమన్నది ధ్రిల్లింత కలిగించే విషయం. మామా బైక్‌లను ఒక తిన్నె శిఖరాగ్రాన నిలిపి అద్భుతమైన సూర్యాస్తమయాన్ని చూశాం. సంధ్యాకిరణాలలో తడిసి మెరిసే ఇసుక తిన్నెలూ వాటిలో లీలగా ప్రతిఫలించే ఆకాశపు వర్ణాలూ- మరపురాని అనుభవమది.

ఒకరోజు గడిచింది గదా- రాత్రి చలిమంట చుట్టూ చేరడం, చేరి బెర్బెర్ సంగీతం ఆస్వాదించడం, ఆస్వాదించి కబుర్లలో మునిగి తేలడం మాకు అవలీలగా అబ్బేసింది. మా క్యాంప్‌ను నడిపే అబ్దుల్లా చురుకైన మనిషి. గొప్ప మాటకారి. రంగులీనే వ్యక్తిత్వమతనిది. ఎవరితోనైనా ఇట్టే మాటగలిపే మనిషాయన. కోవిడ్ పుణ్యమా అని టూరిస్టుల రాకడ బాగా తగ్గిందని, అంచేత అతిపరిమితమైన సహాయక బృందంతోనే క్యాంపులు నడుపుతున్నామనీ తమ ఇబ్బందులు చెప్పుకొచ్చాడు అబ్దుల్లా.

ఈ అబ్దుల్లా మానవ సంపర్కాన్ని బాగా ఇష్టపడే బహిర్ముఖజీవి. ఒకోసారి ఆ లక్షణం అతనిలో శ్రుతిమించి ఉందా అని కూడా అనిపిస్తుంది. ఎవరితోనయినా క్షణాల్లో కలిసిపోతాడు. ఎంతటి ముభావుల్ని అయినా క్షణాల్లో మాటల్లోకి దింపగల సహజమైన నేర్పు అతనిలో ఉంది. ముడుచుపోయే మనుషులలో కూడా ఎంతో సులువుగా స్నేహం కలిపేయగలడు. ఎడారి జీవితపు కథలను ఆసక్తికరంగా చెపుతూ ఆ సాయంత్రం మా అందర్నీ అలరించాడు. దేశాలూ సరిహద్దులూ పట్టని సంచారపు తెగల మనిషి అతను. వాళ్ళందరికీ వారివారి తెగల నియమావళి శిరోధార్యం. ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వాల మీద గురి లేదు. లెక్క లేదు. ‘మేమంతా సహారా ఎడారికి మాత్రమే చెందిన బెర్బెరులం. మొరాకోదేశానికో, అల్జీరియాకో, లిబియాకో చెందిన వాళ్ళం కాదు. మా కుటుంబాలు దేశాల పరిధులు దాటి విస్తరించి ఉన్నాయి. మమ్మల్ని ఏ సరిహద్దులూ ఆపలేవు. అక్కడి సిపాయిలు కూడా మేము సరిహద్దులు దాటుతున్నపుడు చూసీ చూడనట్టుగా ఉండిపోతారు’ అంటూ చెప్పుకొచ్చాడు అబ్దుల్లా. నిజానికి ఆ సరిహద్దులన్నీ పంతొమ్మిదో శతాబ్దంలో ఫ్రెంచి వలసపాలకులు సృష్టించినవి. ఏర్పరచినవి. ‘ఈ దేశాలూ సరిహద్దులూ మాకు పట్టవు. సహారా ఎడారే మా ప్రపంచం. అనాది కాలం నుంచీ ఈ ఎడారిలో మేం తిరుగాడుతున్నాం. తిరుగాడుతూనే ఉంటాం.’ విస్పష్టంగా ప్రకటించాడు అబ్దుల్లా.


మర్నాటి ఉదయం మేమంతా బ్యాగులు సర్దుకొని పదిహేను కిలోమీటర్ల దూరాన ఉన్న తస్సీలీ అన్న మరుసటి మజిలీకేసి కాలినడకన బయల్దేరాం. వెళ్ళేముందు సాన్‍మావ్‍ లోని సిబ్బందికి ఆత్మీయంగా వీడ్కోలు చెప్పాం. బయలుదేరి కొంతదూరం ఇసుకలో నడిచాక నల్లరాళ్ళు నిండి, ఆర్చుకుపోయి, తడిజాడలేని ఓ మైదాన భూభాగంలోకి అడుగుపెట్టాం. ఈ ప్రదేశం శిలాజాలకు ప్రసిద్ధి అట. ఒకానొక పురాతన యుగంలో సహారా ఎడారి ప్రాంతం అంతా సముద్రపు దిగువున ఉండేదట. అక్కడ కనిపించిన అనేకానేక సముద్రజీవుల శిలాజాలు ఆ మాట నిజమే అని నొక్కి వక్కాణించాయి. అక్కడి శిలల్లో కనిపించే సముద్ర శిలాజాలను ఒక్కటొక్కటిగా హుస్సేన్ మాకు చూపించి పరిచయం చేశాడు. భూగోళపు పరిణామ క్రమంలో ఇపుడు నీటి చుక్క కనిపించని ఈ భీకర ఎడారి ప్రాంతం ఒకప్పుడు సాగరపుటడుగున ఉండేదని వినడమూ, అందుకు ఆధారాలు చూసి విస్తుపోవడమూ మా వంతు. ఈ వింతను పరిపూర్ణం చెయ్యడానికా అన్నట్టు మాకాచోట సుదూరాన ఎండమావులు కూడా కనిపించాయి.

ఆ తస్సీలీ క్యాంప్ ఎర్గ్‌ ఇజ్నగీ (Erg Znaigui) అన్నచోట నెలకొని ఉంది. అక్కడి ఇసుక తిన్నెలు ఛెబీ క్యాంపులో ఉన్నంత ఎత్తుగా లేవు గానీ మమ్మల్ని ఆకట్టుకోవడంలో ఛెబ్బీ తిన్నెలకేమీ తీసిపోవు. నాలుగు గంటల నడక తర్వాత మధ్యాన్నం ఒకటిన్నర ప్రాంతంలో మేమా ఇజ్నగీ క్యాంప్ చేరుకున్నాం.

ఇక్కడి భోజనాల గుడారం సాన్‌మావ్ క్యాంప్‌లో ఉన్నంత విశాలంగా లేదు. ఇక్కడి బెర్బెర్ నిర్వాహకులు కూడా మమ్మల్ని సాదరంగా స్వాగతించి గబగబా భోజనం వడ్డించారు. తాజా సలాడ్లు, అప్పుడే కాల్చి తీసిన ఖూబ్జ్ రొట్టెలు, ఆలివ్ పళ్ళు, టర్కీ చికెన్ మాంసపు తునకలూ- అదీ మా రుచికరమైన భోజనం.

భోజనం చేశాక అందరికీ కునుకు తియ్యాలనిపించింది. కానీ ఆ టెంట్ల లోపల ఉన్న విపరీతమైన వేడి కునుకు తీయడానికి అనుకూలంగా లేదు. దానికన్నా ఆరుబయట పడుకోవడమే సుఖమనిపించింది. కానీ అక్కడ ఈగలమోత. టెంట్ల లోని వేడిని భరించడమా, బయట ఈగల దాడినా- అన్నది మా ముందు సమాధానంలేని ప్రశ్నలా నిలబడింది. చిన్నప్పుడు మే నెల ఎండల్లో మండే ఎండల రుతువులో అచ్చంగా ఇలాంటి ప్రశ్నే మాకు ఎదురవడం గుర్తొచ్చింది. మా బృందం వాళ్ళమంతా ఈ వేడీ ఈగల యుద్ధంలో నిమగ్నమైపోయాం.

ఎటూ తేలని ఆ యుద్ధం ముగిసేసరికి మా వాళ్ళంతా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తమతమ యు.కె. ప్రయాణపు పాసింజర్ ఫారాలను నింపుతూ కనిపించారు. వాళ్ళంతా ఈ ఎడారి ట్రెక్కు ముగిసీ ముగియగానే ఇంటిదారి పడుతున్నారు మరి. నా ఉత్తర మొరాకో శోధనలకోసం నేను ఇంకా అక్కడ కొంతకాలం ఉండబోతున్నాను కాబట్టి నాకా హడావుడి లేదు. అంచేత నా మనసును ఆ విషయం మీంచి తప్పించి పరిసర నిసర్గ సౌందర్యం వేపు మళ్ళించాను.

దూరాన సూర్యాస్తమయ ప్రదేశం చేరుకోడానికి ఒంటెల్ని సిద్ధపరుస్తూ అబ్దుల్ కనిపించాడు. ఒంటెల సదుపాయం ఉన్నా కొంతమందిమి నడిచి వెళ్ళడానికే ఇష్టపడ్డాం. అందరమూ ఒంటెల్ని అక్కడి అన్నిటికన్నా ఎత్తయిన ఇసుక తిన్నె పాదాల దగ్గర నిలిపివేశాం. నింపాదిగా ఆ తిన్నెను అధిరోహించాం. పైకి చేరాక అక్కడి ఆనాటి నిర్మల ఆకాశంలో క్షితిజపు దిగువకు సూర్యుడు చేరిపోయి అదృశ్యమవడం మనసారా చూశాం. కళ్ళకు విందు చేసిన దృశ్యమిది.

తిరిగి క్యాంపు చేరేసరికి దాదాపు చీకటి పడిపోయింది. ఆ ఎడారిలో మాకు అదే చివరిరోజు గాబట్టి అందరం సరదాగా పూర్తి బెర్బెర్ దుస్తులు ధరించాం. కాసేపు మా ఎడారి అనుభవాలను పునశ్చరణ చేసుకొని మెల్లగా మా చివరి ఎడారి భోజనం కోసం గుడారంకేసి సాగాం. మా బృందంలోని రాజు, రిచీ పాకశాస్త్ర ప్రవీణులు. కాసేపు ‘వంటగది’ని తమ ఆధీనంలోకి తీసుకొని, అక్కడ కనిపించిన దినుసుల్ని అడిగి పుచ్చుకొని సహారా ఎడారిలో భారతీయ వంటకపు తయారీ మొదలెట్టారు. కాంటినెంటల్ వంటకమయిన స్క్రాంబుల్డ్ ఎగ్‌కు ఉల్లిపాయలూ మిరపకాయలూ జోడించి దాన్ని కోడిగుడ్డు పొరటుగా మార్చారు. అక్కడి బెర్బెర్ వంటవారి వంటకాలకు ఈ పొరటును జోడించి భోజనానికి భారతీయ పరిమళం సమకూర్చారు. చేరువలో వినవస్తోన్న బెర్బర్ వాయిద్యాల మృదు శబ్దాల నేపథ్యంలో మేమంతా ఆ చిట్టచివరి ఎడారి భోజనాన్ని నింపాదిగా ఆస్వాదించాం.


మర్నాడు బాగా పొద్దున్నే మేమంతా శక్తివంతమైన 4×4 వాహనాల్లో ఎడారిలోంచి బయటపడి మా మినీబస్సు చేరుకొనే ప్రయత్నం మొదలెట్టాం. యథాప్రకారం సుదీర్ఘ ప్రయాణం. పన్నెండు గంటలు, మరకేష్ నగరం చేరడానికి! దారిలో కలాత్ మ్‍గూనా (Kalaat MGouna) అన్న చిన్నపట్నంలో టీకోసం ఆగాం. ఆ చిన్న పట్నాన్ని మొరాకోలోని రోజ్ వ్యాలీ ప్రాంతానికి రాజధానిగా పరిగణిస్తారు. గులాబీలే అక్కడి ప్రధాన ఆదాయపు వనరు. గులాబీ పూలతోపాటు రోజ్ ఆయిల్, రోజ్ వాటర్, కాస్మొటిక్స్- అక్కడి వారి వాణిజ్యపు దినుసులు. అవన్నీ దేశం మారుమూలలకే గాకుండా ప్రపంచమంతటికీ ఎగుమతి అవుతాయట. స్థానికంగా ఏర్పడ్డ సహకార సంస్థలు ఆ కార్యకలాపాలు నిర్వహిస్తాయట. అలాంటి ఒక కోపరేటివ్ స్టోర్ దగ్గర మేమంతా ఆగాం. దాని నిర్వాహక బృందమంతా మహిళలే. వాళ్ళక్కడ ఉత్పాదనలు ప్రదర్శించడమే గాకుండా వాటి తయారీ గురించి చిన్న వివరణ ప్రసంగం కూడా చేశారు. ఒక లీటరు రోజాయిలు చెయ్యడానికి నాలుగు టన్నుల గులాబీ రేకులు అవసరం పడతాయి అని వారు చెప్పినపుడు నాకు గొప్ప ఆశ్చర్యం కలిగింది.

అఇత్ బెన్‍హద్దూ అన్నచోట లంచ్‌ కోసం ఆగాం. మేం భోజనం చేసిన రెస్టారెంటు ఖ్సర్ బెన్‍హద్దూ అన్న కోట ప్రాంతానికి సరిగ్గా ఎదురుగా ఉంది. గతంలో కోవిడ్ మహమ్మారి విరుచుకుపడటానికి కాస్తంత ముందు కుటుంబ సమేతంగా ఆ ప్రాంతాల్లో ఒక పూట గడిపాను. ఆ కోట ప్రాంగణం అంతా అప్పుడు కలియదిరిగాము.

టిజ్ న్‍టిక్కా కనుమల గుండా మా ప్రయాణం కొనసాగించి బాగా సాయంత్రం అయ్యే సమయంలో మరకేష్ నగరం చేరుకున్నాం. ఆ నగరం చేరేసరికి ఏదో స్వంత ఊరు చేరిన భావన కలిగింది. ఆ రాత్రి అక్కడి ఉన్నత శ్రేణి మెరాకన్ రెస్టారెంట్లో అసలు సిసలు మొరాకో భోజనం రుచి చూద్దామని అంతా సంకల్పించాం. అల్ ఫరాష్ అన్న రెస్టారెంటుకు వెళదామని రిచీ, కిషోరూ ప్రతిపాదించారు. అది మేము మొరాకో వచ్చేటపుడు లండన్, గాట్విక్ విమానాశ్రయంలో మాకు తటస్థపడిన కొంతమంది మొరాకీయులు గట్టిగా సిఫార్సు చేసిన రెస్టారెంటు.

ఆ అల్ ఫరాష్ అన్నది ఒక మహిళ నడుపుతోన్న అతి విలక్షణమైన భోజనశాల. అక్కడి సిబ్బంది అంతా – వంటవాళ్ళూ, వెయిటర్లతో సహా – మహిళలే. ముస్లిందేశం అనగానే అక్కడి మహిళల సామాజిక స్థాయి గురించి పాశ్చాత్య సమాజాల్లో స్థిరపడి ఉన్న భావనలను బద్దలు కొట్టే బలమైన వ్యాఖ్యగా ఆ రెస్టారెంటు ప్రయోగాన్ని మనం భావించుకోవచ్చు. అసలు అలాంటి మూస భావనలకు చోటివ్వడమే గొప్ప అనుచితం అన్నది నా అభిప్రాయం. ముస్లిం ప్రపంచంలో కరుడుగట్టిన సంప్రదాయవాదం నుంచి స్వేచ్ఛా పతకాలు రెపరెపలాడే ఆధునికత దాకా వివిధ వర్ణాలు ఉన్నాయి. మొరాకో ఆ పతాకాల రెపరెపలకు చెందిన దేశం.

మొట్టమొదటగా మాకు చిన్న చిన్న గిన్నెల్లో అనేకానేక ఎపటైజర్లు సరఫరా చేశారు. ప్రూన్సూ ఆల్మండ్సూ కూర్చిన లేత గొర్రె మాంసపు టజీన్‌ను మెయిన్ కోర్స్‌గా నేను ఆర్డర్ చేశాను. సువాసనలు విరజల్లే వంటకం నా ముందుకు వచ్చింది. తింటోంటే ఆ రుచి నన్ను స్వర్గానికి బెత్తెడు దూరానికి చేర్చింది. అప్పటిదాకా మొరాకో దేశంలో నేను రుచి చూసిన అతి మధురమైన లాంబ్ టజీన్ అదేనని నేను నిస్సందేహంగా చెప్పగలను. మేం విన్నట్టుగానే ఆ రెస్టారెంటు మొరాకో వంటకాల ఉత్సవ ప్రాంగణం. అక్కాచెల్లెళ్ళూ మాతృమూర్తులూ మనసుపెట్టి వంటవండితే ఎలా ఉంటుందీ? ఇదిగో ఈ అల్ ఫరాష్ భోజనంలా ఉంటుంది. ఆ అద్భుతమైన విందు ఆరగింపుతో మా అట్లస్ పర్వతాలూ సహారా ఎడారుల్లోని సాహసయాత్రా గీతానికి అంతిమచరణం పాడాం.

ఒకరికొకరం వీడ్కోళ్ళు చెప్పుకొనే సమయం వచ్చింది. అందరం కలసి అబ్దుల్, హుస్సేన్‌లకూ అల్విదా చెప్పే సమయం వచ్చింది. మా తుబ్‌కల్ శిఖరారోహణా, సహారా ఎడారి ట్రెక్కూ మేమంతా అనుకొన్న దానికన్న రసవత్తరంగా సాగాయన్న మాట నిజం. అందులో అబ్దుల్, హుస్సేన్‌ల పాత్ర ఎంతో ఉంది.


సహారా ఎడారిలో రెండు మూడు రోజులు గడపడమన్నది అరుదైన అనుభవం. గతకాలపు సార్ధవాహులూ యాత్రికులూ ఎడారి ఓడల బిడారులతో కలసి ఎలా సాగిపోయారో ఏ రకమైన అనుభవాలూ, సమస్యలూ, ఇబ్బందులూ ఎదుర్కొన్నారో అణుమాత్రం అవగాహన నాకు కలిగింది. నిజానికి విల్‌ఫ్రెడ్ థెసీజర్ రాసిన అరేబియన్ శాండ్స్ అన్న విస్తృత ఎడారి యాత్రానుభవాలను చదివాకే నాకూ ఇలా ఒకసారి ఎడారిని రుచి చూడాలనిపించింది. నెలలూ సంవత్సరాల తరబడి ఇలా ఎడారుల్లో తిరుగాడిన యాత్రికుల అనుభవాలతో ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకోవాలనిపించింది.

ఎడారిలో రెండు చక్కని క్యాంపుల్లో చుక్కల పందిరి క్రింద కాలం గడిపాం. సూర్యోదయాన్నీ, సూర్యాస్తమయాన్నీ ఎత్తయిన ఇసుకమేటల మీంచి గమనించాం. నక్షత్రాలు నిండిన వినీలాకాశాన్ని తాపీగా పరికించాం. ఇంతకు ముందటి ప్రయాణాల్లో సూడాన్, ఈజిప్ట్, ట్యునీషియా దేశాల్లో ఎడారుల్లో రోడ్డు ప్రయాణాలు చేసిన మాట నిజమే. కానీ ఇలా అచ్చంగా ఎడారి ఇసుకల్లో కాలినడకన విస్తృతంగా తిరుగడం అన్నది ఇదే మొదటిసారి. ఒంటెల మీద ఎక్కి నిడుపాటి ఇసుక తిన్నెలు ఎక్కడం, బంగారు వర్ణపు ఇసుక సాగరంలో ఈదులాడటం- చక్కని అనుభవం. ఇలా సహారా ఎడారితో ఏర్పడిన సన్నిహిత బాంధవ్యం మరోసారి మరింత సాహసాలు నిండిన ఎడారి యాత్రకు నన్ను పురికొల్పినా నేను ఆశ్చర్యపోను.