తేనెటీగల్లా నేనూ ఊహల గదుల గూడు కట్టుకుంటా! తేనెటీగలు పువ్వు పువ్వు దగ్గర్నించీ తేనె పట్టుకొచ్చి గదుల్లో పెట్టుకున్నట్టు ఒక్కొక్క ఊహనీ పట్టుకెళ్ళి ఆ గదుల్లో దాచుకోవాలి! అత్తయ్య ఈతపాయల జడల ఫోటోలు ఎప్పటికీ అట్టే పెట్టుకుని మనవలికి చూపెట్టుకోవాలి అంది కదా! అలా నేనూ నా ఊహల్ని అట్టే పెట్టుకోవాలి.

జేన్‌లో ఉన్న ప్రధానమైన గుణం ఎటువంటి పరిస్థితుల్లోనైనా, తన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్నీ కోల్పోకపోవడం. ఎంత గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళతోనైనా తన మనసులో మాట నిక్కచ్చిగా చెప్పడం. మనసుతో కంటే బుద్ధితో జీవించే గుణం. అందుకే ఈమె ఆ కాలం నాటి కథానాయికల కంటే భిన్నంగా ఉంటుంది.

ఎంత కంట్రోల్ లక్ష్మణా, కంట్రోల్ అని నన్ను సముదాయిందుకుందామనుకున్నా ఈ పిచ్చి హాస్య కథకు తన్మయులైపోతున్న వీరి మధ్య నేను మూడు నెలలు ఎలా గడపగలనని బెంగ పట్టుకుంది. అక్కడ మంగలి కుర్చీలో పడ్డ నారదుడికి, ఇక్కడ, ఈ కీ డ్రాయింగ్ ఆర్టిస్ట్ కుర్చీలో పడ్డ నాకు ఉన్న సారూప్యం గురించి ఆలోచిస్తున్నాను.

“ఉఠో! ఉఠో జల్దీ! దో మినట్ మే బాహర్ ఫాలిన్!” అప్పుడే తెల్లారిందా? దిండుకింద పెట్టిన వాచీ తీసి చూశాను. కళ్ళు మండుతున్నాయి. రెండు కావస్తోంది. రిక్రూట్లందరూ మేలుకుంటున్నారు. ఎందుకు లేపుతున్నాడో తెలీకపోయినా, ఛజ్జూరామ్ కేకలకి తత్తరపడుతూ లేస్తున్నారు. దోమతెరలోంచి బయటికొచ్చి, చకచకా ఫాంటూ షర్టూ స్వెట్టరూ తొడుక్కుని, కింద పీటీ షూస్ తగిలించుకుని బారక్ బయటికి నడిచాను.

కాదు. అది తోడేలు కాదు. మరి? తన అనుమానం గట్టిపడేంతలోనే ఆకలి, చలి రెండూ కలిసి తనని ఆ ఆలోచనకి దూరం చేశాయి. ముందు రెండు కాళ్ళను పట్టుకుని ఆ తోడేలు శవాన్ని ఎత్తి భుజం మీద వేసుకుంది. వింతగా ఆ శవం కంటే తను వేసుకున్న చర్మం ఎక్కువ బరువుగా అనిపించింది తనకి. ఆకలి, చలి, చీకటి కమ్ముకుంటున్న లోయ తెచ్చిపెట్టే ప్రమాదాలు తనను ఆ తోడేలు శవాన్ని పరీక్షగా చూడనివ్వలేదు.

అమ్మ, ఉద్యోగానికి వెళ్ళేది-
అన్నం, పప్పు
ఇవి మాత్రమే చేసేది–

మధ్యాహ్నం స్కూల్ నుంచి
వస్తే, నాకు
ఆ వంటగదిలో, ఒక

నీడ కనపడేది;

మధ్యాన్నం అయ్యేసరికి సూర్యుని ప్రతాపం పెరిగిపోయింది. ఎండ తీక్షణమయింది. వేడి భరించడం కష్టమయింది. మనం వర్ణచిత్రాలలో చూసే ఎడారిలోని ఒంటెల బిడారుల్లో ఈ తీక్షణత గోచరించదు. చిత్రకారుల తూలికలకు అందని అసౌకర్యమది. జీవశక్తిని పీల్చేసే ఆ ఎండల మండిపాటును ప్రత్యక్షంగా అనుభవిస్తే తప్ప ఆ అసౌకర్యాలు మనకు బోధపడవు.

నానమ్మ చాలా ఏళ్ళుగా నిద్ర మాత్ర వేసుకుంటుంది రోజూ. ఆమె నిద్రపోయిందని నిర్థారించుకుని తాతయ్య లేచి ఉంగరం కోసం అంతటా వెదికాడు. వాష్ బేసిన్ దగ్గర, బీరువాలో, బాత్‌రూములో, అన్ని చోట్లా. ఉంగరం పోయిన సంగతి భార్యకు ఎలా చెప్పాలో తెలీడంలేదు ఆయనకి. ఏదైనా వస్తువు పోయిందంటే నానమ్మకి నేరమూ నేరస్తులూ వీటి గురించి చాలా అంచనాలుండేవి. పోగొట్టుకున్నవాళ్ళ అసమర్థత మీద కూడా.

నిలోవ్ గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి, నది మీదకి దృష్టి సారించాడు. ఎక్కడా అలల కదలిక లేదు. నీరూ, ఒడ్డూ జంటగా నిద్రపోతున్నట్టున్నాయి. చేప పిల్లల అలికిడికూడా లేదు. అకస్మాత్తుగా నల్లని బంతిలా ఏదో నీడ అవతలిగట్టు మీద దొర్లినట్టు అనిపించింది నిలోవ్‍కి. కళ్ళు చికిలించి చూశాడు. నీడ మాయమయింది. అంతలోనే మరోసారి కనిపించింది. ఈసారి ఆనకట్టమీద అటూ ఇటూ వంకరటింకరగా నడుస్తూ.

శాస్త్రిగారు మాకు బంధువు, చుట్టం అని మా మేనమామ పిలకా రామకృష్ణారావు పదే పదే నాకు గుర్తు చేస్తూ వుండేవాడు. అయినా నేను ఎప్పుడూ కలవడానికి ప్రయత్నం కూడా చెయ్యలేదు. నేను విశాఖపట్నం మెడికల్ కాలేజీలో చదివే రోజుల్లో ఒకసారి కోర్టులో ఆయన్ని చూసేను. మరి నేనేమి ఆశించేనో గాని, ఆయన వాదన ఆరోజు నాకు నచ్చలేదు.

ఏదో ఒక రోజు గేటు పడుతుంది
వాహనాలన్నీ బుద్దిగా
ఒక వరసలో నిలబడిపోతాయి
కారు వేగంలో అప్పటిదాకా వినబడని
రేడియోలో పాటని వింటూ
బద్దకంగా మెటికలు విరుచుకుంటూ
కిటికీలోంచి బయటకి చూస్తావు

ఈ నేల నడవనిస్తుందీ
నాకు గరిక తివాసీ పరుస్తుంది
ఈ ఎండ ఎదురు వస్తుందీ
నా మెడలో పొగడ దండ వేస్తుంది
ఈ గాలి గౌరవిస్తుందీ
నాకు పూల గంధాలు పూస్తుంది
ఈ వాన పలకరిస్తుందీ
నా పై పన్నీరు చిలకరిస్తుంది

గ్రీష్మం గర్జించింది
నీరు ఆవిరై పోయింది
చెరువు ఎవరి మీదా అలగదు

కారుమబ్బులు ముసురెత్తాయి
వాన వరదలై వెల్లువెత్తింది
నేల ఎవరినీ కసురుకోదు

అది నువ్వు ఎక్కుపెట్టిన బాణం కాదు
వాక్ స్వాతంత్ర్యపు ఆభరణమూ కాదు
సారం లేని మాటల తూటాల రణం
గుంపు మనస్తత్వ వ్రణం
అణువంతైనా సంయమనం లేని
క్షణికావేశపు అణ్వస్త్రం
ఆత్మాహుతి దళం

ఈ లోకంలో రహస్యంగా ఉన్న ప్రదేశం, ఏకాంతంగా చేసే కర్మ అంటూ ఏదీ లేదు. దేవతలు, ఋషులు, మొదలైనవారి దివ్యచక్షువులకి కనపడకుండా ఉండేది ఏమీ లేదని నాకు తోచింది. నేను చేసేది ఎవరికీ కనిపించకపోయినా, అణువణువునూ శాసించే ధర్మసూత్రాలకి గోచరం కానిదేదీ ఉండబోదు కదా. శూన్యము అంటే ఏదీ లేనిచోట అని అర్ధం అయితే అక్కడ నేను ఉన్నాను కదా అది అశూన్యం కావడానికి?

ఎగిరే పక్షులన్నీ తమ పాటలను మోసుకుపోతున్నాయి.
మనుషుల అలికిడితో రహదారులు నలుగుతున్నాయి.
ఎవరి బాధో హృదయమై కంటిలో కాన్వాస్ అవుతోంది.
ఏ దృశ్యమూ మనోహరంగా లేదు.
విరిగిన చూపు పెచ్చులై రాలుతోంది.

మధ్యాహ్నం
సగం విరిగిన చందమామలాంటి
అతడి గొడుగు నీడ కింద
సూరీడు కాసేపు అలుపు తీర్చుకుని
వెళ్తూ వెళ్తూ
సంతృప్తి నిండిన చిర్నవ్వు నొకదాన్ని
అతడి పెదాల మీద అతికించి వెళ్తాడు

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: