మనమెరుగని మధ్య అమెరికా 6

నికరాగ్వా

మనాగ్వాలోని సాందీనో విమానాశ్రయంలో దిగుతున్నప్పుడే అక్కడి విశాలసరోవరం నాకు స్వాగతం చెప్పింది. దాని మహోన్నతరూపం నన్ను ఆకట్టుకుంది. అన్నట్టు ఈ విమానాశ్రయానికి నికరాగ్వా దేశపు ప్రియతమ నాయకుడు అగూస్తో సాందీనో (Augusto Sandino) పేరు పెట్టారట.

నికరాగ్వా మధ్య అమెరికా దేశాలన్నిటిలోకీ పెద్దది. సరిగ్గా మన తమిళనాడు అంత వైశాల్యం. అరవై ఐదు లక్షల జనాభా. దేశానికి ఉత్తరాన ఎల్ సల్బదోర్, ఓందూరాస్, దక్షిణాన కోస్తా రీక దేశాలు. తూర్పున కరేబియన్ సముద్రం, పడమరన పసిఫిక్ మహాసముద్రం. దేశపు జనాభాలో ఎనభైశాతం పైచిలుకు పసిఫిక్ మహాసాగరపు పైతట్టు ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నారు. మనాగ్వా (Managua), గ్రనాద (Granada), లెయోన్ (Leon) లాంటి ప్రముఖ నగరాలన్నీ ఈ పసిఫిక్ తీరరేఖకు అందేటంత దూరంలోనే ఉన్నాయి. దేశపు మహాసరోవరాలు – లేక్ మనాగ్వా, లేక్ నికరాగ్వా – ఈ నగరాలకు చేరువలోనే ఉన్నాయి. నికారో అన్న స్థానిక ఇండియన్ తెగ పేరుకు ఆగ్వా (agua: నీరు) అన్న పదాన్ని జోడించగా నికరాగ్వా అన్న పేరు రూపు దిద్దుకుంది.

ఇమిగ్రేషన్ ఫార్మాలిటీలు ముగించుకొని లగేజ్ తీసుకునే హాలుకి వెళ్ళి ముప్పావు గంట ఓపిగ్గా ఎదురు చూశాక ‘నా సామానులు తమ గమ్యం చేరలేదు’ అన్న చేదు నిజం కళ్ళకు కట్టింది. అయినా నా విమానం వచ్చిన మరో గంట తర్వాత సాన్ సల్బదోర్ నుంచి వచ్చే మరుసటి విమానం కోసం ఆశగా ఎదురుచూశాను. ఆ విమానమూ వచ్చింది – సామాన్లు రాలేదు. నా ప్రయాసను గమనిస్తోన్న కెన్నీ అన్న అధికారి గిరగిరా తిరుగుతున్న ఆ లగేజ్ కన్వేయర్ బెల్టుకేసి ఆశగా చూడడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండబోదని నిర్ధారించాడు. ఇహ ఆ పూటకు లగేజ్ వచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పాడు. మిసింగ్ లగేజ్ రిపోర్ట్ నింపమని చెప్పి, అందుకు అవసరమైన కాగితాలు ఇచ్చి, నింపడంలో సహాయపడ్డాడు.

నా దుస్తులు, ఫోన్ ఛార్జర్, టాయిలెట్ సామాన్లు ఆ బ్యాగ్‌లో ఉండిపోయాయి. మా అమ్మాయిలకోసం నేను కొన్న చిన్న చిన్న బహుమతులు, సువనీర్‌లూ అందులోనే ఉన్నాయి. ‘అయ్యో’ అనిపించింది. ‘మరేం దిగులుపడక. రేపు ఉదయం సాన్ సల్బదోర్ నుంచి ఇక్కడికి డైరక్టుగా వచ్చే ఫ్లైట్‌లు రెండున్నాయి. అందులో ఏదో ఒకదానిలో నీ బ్యాగ్ వచ్చి తీరుతుంది’ అని కెన్నీ ధైర్యం చెప్పాడు.

ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఏ మనిషికయినా మొదట కలిగేది నిరాశ, నిస్పృహ. కాళ్ళకింద నేల కదిలిపోతోందన్న భావన. కానీ ఒక యాత్రికుడిగా నాకున్న అనుభవాలు అలాంటి భావన నుంచి నన్ను కాపాడాయి. కాస్తంత విజ్ఞతతో ప్రవర్తించేలా చేశాయి. నాముందు ఉన్న యాత్రామాధుర్యాన్ని సామాన్లకోసం చింతిస్తూ నష్టపరచుకోవద్దని నాకు నేను నచ్చచెప్పుకున్నాను. నా పాస్‌పోర్ట్, డబ్బులు, క్రెడిట్ కార్డ్‌లు, ఫోన్ – ఇవన్నీ నాదగ్గరే క్షేమంగా ఉన్నాయి గదా అని సంతోషపడ్డాను. మరో జత బట్టలు, ఫోన్ ఛార్జరూ కూడా నాతోపాటే ఉన్న కాబిన్ క్యారీ బ్యాగ్‌లో ఉంచుకుంటే బాగుండేది కదా అనిపించింది. ఏదేమైనా జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఆ చెకిన్ బ్యాగు రావలసినప్పుడే వస్తుంది. దానికోసం ఊరికే మనసు పాడుచేసుకోవడం ఎందుకూ? ఇప్పుడీ పరిస్థితిలో నేనేం చెయ్యాలో, ఎలా సమస్యను ఎదుర్కోవాలో – అది కదా ఆలోచించవలసిందీ… ఇటువంటి అనూహ్యమైన పరిస్థితులను ఎదురుకోవడంలో కాకపోతే ఇక మరి యాత్రికునిగా నా అనుభవం ఇంకెక్కడ ఉపకరిస్తుందీ… ఇలాంటి ఘటనలన్నీ యాత్రాప్రక్రియలో భాగంగానే తీసుకోవాలి. కెన్నీ చెప్పినట్టు మర్నాటి ఉదయంకల్లా నా బ్యాగు నాకు అందుతుందని బాగా నమ్మాను. సంయమనం కోల్పోకుండా ముందు ఏం చెయ్యాలో ఆలోచించాను.

సాందీనో విమానాశ్రయం నుంచి బయటపడ్డాను. అక్కడికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రనాద నగరానికి షటిల్ బస్సేమయినా దొరుకుతుందేమోనని వాకబు చేశాను; అటువంటిదేమీ లేదు. టాక్సీలున్నాయి గాని వాళ్ళు నూటయాభై అమెరికన్ డాలర్లు అంటున్నారు. వాకబు చేస్తే ముప్ఫై డాలర్లలో మనాగ్వా బస్ స్టేషన్ చేరుకునే ప్రత్యామ్నాయం ఉందని బోధపడింది. బావుందని అనిపించింది. ఈ పద్ధతివల్ల పనిలోపనిగా, గ్రనాద వెళ్ళడానికి ముందుగా, మనాగ్వా నగరంలోనూ కాస్తంత సమయం గడిపే అవకాశం దొరుకుతుంది కదా అనిపించింది. టాక్సీ తీసుకున్నాను.

మనాగ్వా బస్టాండుకు వెళ్ళేదారిలో కనిపించిన ట్రాఫిక్ చూసి నాకు మతిపోయింది. ఆ ఊర్లో ఆగి కాసేపు గడపడమన్నది సరి అయిన ఆలోచనేనా అన్న అనుమానం మదిలో పొడసూపింది. ఈ గందరగోళమంతా మింగీతో (Minguito) ఉత్సవాల ప్రభావం అని సాటి ప్రయాణీకుడు ఒకడు వివరించాడు. ఆ సంబరాలన్నీ మనాగ్వా నగరాన్ని కాపాడుతూ ఉంటాడని వాళ్ళు నమ్మే సాంతా దొమింగో అన్న సాధువు – పేట్రన్ సెయింట్ – గౌరవార్థం ప్రతి ఏడూ జరిపే ఉత్సవం. ఆ సమయంలో ఎక్కడెక్కడినుంచో వచ్చే భక్తులు, వారి వారి ప్రభల ఊరేగింపులతో మనాగ్వా క్రిక్కిరిసిపోతుందట. ‘అసలీరోజు మీకు గ్రనాద వెళ్ళడానికి బస్సు దొరుకుతుందో లేదో’ అన్న సందేహం వెళ్ళబుచ్చాడు ఆ సహృదయ ప్రయాణీకుడు. దానితో వేడి పుట్టి గ్రనాద వెళుతున్న బస్సు కనిపించీ కనిపించగానే ఎగిరి అందులోకి దూకేశాను. గంటన్నరలో అది నన్ను గమ్యం చేర్చింది.


గ్రనాద చేరుకున్నాక రెండు రోజుల క్రితం బుక్ చేసుకున్న ఎల్ అల్మిరాంతె అన్న నగరపు నడిబొడ్డులో ఉన్న హోటల్లో చెకిన్ చేశాను. రిసెప్షన్‌లో ఉన్న రూడీ అన్నతనికి గూగుల్ ట్రాన్స్‌లేట్ సహాయంతో గల్లంతయిన నా లగేజ్ సంగతి చెప్పాను. సామాను దొరికాక అందించడానికి ఎయిర్‌లైన్స్ వాళ్ళకు ఈ హోటలు అడ్రసే ఇచ్చానని, కాస్తంత కనిపెట్టి చూడమనీ చెప్పాను.

రూడీకి నా పరిస్థితి అర్థమయింది. ఈ అబియాంకా ఎయిర్‌లైన్స్ వాళ్ళకి ఇలా పాసెంజర్ లగేజిని గల్లంతు చేయడం అలవాటుగా మారిందని వ్యాఖ్యానించాడు. ఈ మధ్యే వాళ్ళ బాసుకూ ఇలాంటి అనుభవమే ఎదురయిందట… ఎనిమిది రోజుల తర్వాత లగేజ్ అందిందట. ఆ మాట విని నా గుండె గుభేలుమంది. కానీ అది నన్ను గట్టిపర్చిందనే చెప్పాలి; దాని గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవడం అనవసరం అని గుండె దిటవు చేసుకున్నాను. ‘జరిగేదేదో జరగక మానదు. ఏదో ఒకరోజు నా సామాను నాకు చేరుతుంది. ఈలోగా దాని గురించి బెంగపడటం అనవసరం. బెంగపడటం వల్ల సామాను ఒక్క క్షణం కూడా ముందుగా అందదు కదా’ అని నాకు నేను పాఠం చెప్పుకున్నాను. ఏదేమైనా ముందు బాగా అవసరమైన టాయిలెట్ కిట్ సమకూర్చుకోవాలి. కాసిన్ని బట్టలు కొనుక్కోవాలి.

రూడీని అడిగి ఎలా వెళ్ళాలో దారి తెలుసుకొని షాపుల వెతుకులాటలో ఒక రోడ్డు పట్టుకున్నాను. అప్పటికే మధ్యాహ్నమయింది. వేడి… ఉక్క… సిటీ సెంటర్ లోని పార్కె సెంత్రాల్ దె గ్రనాద అన్న చోటుకు చేరుకున్నాను. చతురస్రాకారపు పార్కు అది. ఫౌంటెన్లు, నీడనిచ్చే పెద్ద పెద్ద చెట్లు, ఫూడ్ స్టాల్సు, సువెనీర్లూ హస్తకళారూపాలూ అమ్మే చిన్న చిన్న దుకాణాలు – సందడి సందడిగా ఉందా ప్రదేశం. వేడీ ఉక్కా నిండిన మిట్టమధ్యాహ్నపు సమయమే అయినా అక్కడ చెట్ల నీడన చేరి విశ్రాంతి తీసుకుంటోన్నవాళ్ళు ఎంతోమంది కనిపించారు. ఆ పరిసరాల బాటలో చక్కటి పలకరాళ్ళు అమర్చి ఉన్నాయి.

పార్కుకు ఆనుకొని ఉన్న పసుపు పచ్చరంగు గ్రాండ్ కెథెడ్రల్ నా దృష్టిని ఆకట్టుకుంది. దాని గోపురాలు ఎంతో గంభీరంగా కానవచ్చాయి. అది గ్రనాద నగరంలోకెల్లా ముఖ్యమైన కట్టడమట. పార్కుకు మిగిలిన మూడు వైపులా చూడచక్కని సహజాలంకరణలు నిండిన భవనాలు కనిపించాయి. గ్రనాద మధ్య అమెరికాలోకెల్లా అతి పురాతనమైన నగరం. రెండు అమెరికా ఖండాలు కలిపి లెక్క వేసినా వాటిలోని పురాతన నగరాలలో గ్రనాద ఒకటి. 1524లో స్థాపించబడిన ఆ నగరం నికరాగ్వా దేశంలో టూరిస్టులు ఎక్కువగా వచ్చి వెళ్ళే నగరం. వలసకాలపు శిల్పరీతిలో నిర్మించిన భవనాలు, వాటి సరళసుందర వర్ణాలు, జేగురురంగు పెంకుల పైకప్పులు, ఆకట్టుకొనే చర్చి భవనాలు, అందమైన రాళ్ళు పరచిన వీధులూ బాటలూ – సొగసు ఉట్టిపడే నగరం గ్రనాద. ఆ ఊరును చూడగానే గ్వాతెమాల దేశపు ఆంతీగా, క్యూబా దేశపు త్రినిదాద్ గుర్తొచ్చాయి.

దాదాపు గంటసేపు అక్కడి చెట్ల నీడల్లో సేదతీరుతూ, భవనాలను పరిశీలిస్తూ ఆ సెంట్రల్ పార్క్ పరిసరాల్లో నింపాదిగా తిరుగాడాను. మెల్లగా కడుపులో ఎలుకలు పరిగెడుతోన్న సూచనలు కనిపించాయి. లంచ్ సమయం అయిందని గ్రహించాను. మా ఊరి ప్రత్యేక వంటకం వీగోరాన్ (Vigoron) తప్పకుండా ప్రయత్నించు అంటూ రూడీ ఇచ్చిన సలహా గుర్తొచ్చింది. ఆ వంటకాన్ని గోర్దీతో అన్న రెస్టరెంట్ లోనే తినమని చెప్పాడు రూడీ. అదెక్కడో వెతకడం మొదలెట్టాను. వాకబు చెయ్యగా చెయ్యగా ఆ సెంట్రల్ ప్లాజా లోనే ఒక మూలన చెట్టు నీడన ఉన్న ఒక ఫూడ్ కియోస్క్ చూపించారు! చూడ్డానికది చిన్న కియోస్కే అయినా బాగా పేరున్న ప్రదేశమని అక్కడి జనసందోహం చెప్పింది. అందరు తింటోన్నదీ ఒకే వంటకం – వీగోరాన్. వేయించిన పంది వాఱులు, ఉడికించిన కర్రపెండలం, బాగా సన్నగా తరిగిన కాబేజి – ఇవన్నీ కలగలసిన పదార్థం వీగోరాన్. దాన్ని అరటి ఆకుల్లో అందిస్తున్నారక్కడ. రుచికరమైన ఆ వంటకానికి తోడుగా అక్కడో కళాకారుడు శ్రావ్యమైన సంగీతం వినిపిస్తున్నాడు. ఆ రుచీ శ్రావ్యతలను నింపాదిగా మనసులోకి ఇంకించుకోవడానికి అనువుగా ఆ చెట్ల కింద కుర్చీలు బల్లలు వేసి ఉన్నాయి. చక్కని భోజనానందమది.

అలా ఆనందంలో తేలిపోతూ ఉండగా ఉన్నట్టుండి గుర్తొచ్చింది: ఆ క్షణాన ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప మరో జత లేదు, కనీసం టూత్‌బ్రష్ అయినా లేదు. ఏదో ఒకటి చెయ్యాలి కదా – వెంటనే కార్యాచరణకు పూనుకున్నాను. సెంట్రల్ ప్లాజా లోని ఒక వీధి దుకాణంలో టీషర్టు కొనడంతో నా అత్యవసర కొనుగోళ్ళు మొదలయ్యాయి. అక్కడి ట్రాఫిక్ నిండిన రోడ్డు మీద ఒక కిలోమీటరు వెళ్ళాను. ఆ రోడ్డు సెంట్రల్ ప్లాజా షాపింగ్ ఏరియాకు సమాంతరంగా సాగింది. దారంతా నానా గజిబిజిగా ఉంది. ఎడాపెడా పరిగెత్తే వాహనాలు, ఎక్కడ పడితే అక్కడ రోడ్డుసైడు దుకాణాలు, పళ్ళ అమ్మకాలు… చిరుతిళ్ళ వ్యాపారాలు… చేతగాని నేతగాడు అల్లినట్టు స్తంభాలకు వేలాడుతోన్న కరెంటు తీగలు – మహా గందరగోళమది! సెంట్రల్ ప్లాజా లోని షోకైన షాపులు, కియోస్కులకు విరుద్ధంగా ఇక్కడ రోడ్డుకు అటూ ఇటూ ఏ సొగసూ సొంపూ లేని పచారీ దుకాణాలు – అవును సెంట్రల్ ప్లాజా టూరిస్టులకి, ఈ రోడ్డు స్థానికులకూ కదా, అలాగే ఉంటాయి మరి! ఆ షాపుల్లో కొనుగోళ్ళు మొదలెట్టి నేనూ కాసేపు స్థానికుడిగా మారిపోయాను. మనుషుల మధ్య దారి చేసుకుంటూ చివరికి ఓ లోకల్ సూపర్‌ మార్కెట్‌కు చేరుకోగలిగాను. అక్కడి నడవాలలో ఈదుతూ నాకు కావలసిన వస్తువుల కోసం ట్రెజర్ హంట్ మొదలుపెట్టాను. అలా స్థానిక జీవనసరళిలో కాసేపయినా ఒక భాగం అయిపోవడం నాకు నచ్చింది. వారితోపాటు వస్తువులు కొనడం, క్యూలో నించుని వాటి ఖరీదు చెల్లించి బయటపడటం, భలేగా అనిపించింది. నిజానికి నాకదో అరుదైన అపురూపమైన అనుభవం. దేశపు వింతలూ విశేషాలూ చూడటమెలాంటి అనుభవమో ఆ దేశపు జనవాహినిలో భాగమై అసలు సిసలు నికరాగ్వాను దర్శించడమూ అంత విలక్షణమైన అనుభవమే. పశ్చిమార్ధ గోళంలోని అత్యంత బీద దేశాలలో రెండో స్థానంలో ఉన్న నికరాగ్వాలో ఆ అనుభవం పొందడానికి నిస్సందేహంగా నా గల్లంతయిన సామానే కారణం! అవును – ప్రయాణాల్లో ప్రతి ప్రతికూలతా ఒక అవకాశాన్ని సృష్టించి వదులుతుంది. మనల్ని మనం సవ్యంగా శ్రుతి చేసుకోగలిగితే ప్రతి దురదృష్టమూ ఒక అదృష్టంగా మారే అవకాశం ఉండి తీరుతుంది.


సాందీనో విమానాశ్రయంలో నేను మార్చుకున్న లోకల్ కరెన్సీ ఖర్చయిపోయింది. మరోసారి డాలర్లను ఇక్కడి కోర్దొబాల్లోకి (córdoba) మార్చుకోవడం అవసరం… అన్నట్టు ఈ కరెన్సీకి 1524లో నికరాగ్వాను స్థాపించాడని పేరుపడిన ఫ్రాన్సెస్కో ఎర్నాందేజ్ దె కోర్దొబా అన్న స్పానిష్ ఆక్రమణదారుని పేరు పెట్టారు. దేశంలోని ముఖ్యమైన నగరాలు గ్రనాద, లెయోన్‌లకు పునాది వేసిందీ ఆయనేనట. కానీ అప్పటి ఆక్రమణదారుల రాజకీయ పరమపద సోపానపదకేళిలో పరాజయం పొంది, తన పై అధికారితో దేశద్రోహిగా ముద్ర వేయించుకొని శిరచ్ఛేదానికి గురి అయ్యాడట ఈ కోర్దొబా! ఏదేమైనా ఆ పై అధికారి పేరు ఇప్పుడు పిట్టకు కూడా తెలియదు కాని కోర్దొబా పేరు అందరి నోటా తిరుగుతూనే ఉంది… గ్రనాదలో ఈయన విగ్రహం నిటారుగా నిలబడి మనకు కనిపిస్తూ ఉంటుంది.

కరెన్సీ మార్చుకోవడానికి అనువైన ప్రదేశం కోసం అటూ ఇటూ చూస్తుంటే దారిలో ఓ బ్యాంకు కనిపించింది. లోపలికి వెళ్ళాను. వివరాలు నింపమని ఓ ఫామ్ అందించారు. ఎలా నింపాలా ఆ ఫామ్‌ని అని అటూ ఇటూ తిప్పి చూస్తుంటే పక్కనే ఉన్న ఓ మహానుభావుడు ‘నాతో రా. ఇక్కడికన్నా బెటరు రేటు ఇస్తాను. ఫామ్ నింపాల్సిన అవసరం లేదు’ అన్నాడు. అతగాడిని అనుసరించాను. బ్యాంకు ఎదురుగా వీధి మూలన ఉన్న మరో మనిషికి నన్ను పరిచయం చేశాడు. ఆ రెండో మనిషి కాల్‌క్యులేటర్‌లో రేటు వేసి చూపించాడు. సరేనన్నాను. టకటకా కరెన్సీల మారకం జరిగిపోయింది. క్షణాల్లో పని ముగించి వాళ్ళిద్దరూ మరో కస్టమరు పనిలో పడ్డారు. అంతా కలిసి ఓ నిమిషం కూడా పట్టలేదు. ఆ బ్యాంక్ కన్నా ఎన్నో రెట్లు చురుగ్గా సాగింది వ్యవహారం!

అక్కడి సెంట్రల్ ప్లాజాలో ఓ యాత్రిక సమాచార కేంద్రం కనిపించింది. వెళ్ళాను. చక్కని సమాచారం అందించారు. ఆ సాయంత్రం ఆరంభమయే మసాయ అగ్నిపర్వతం టూర్ తీసుకోమని సలహా ఇచ్చారు. నచ్చింది. సీట్ బుక్ చేసుకున్నాను. నికరాగ్వా నుంచి కోస్తా రీక పోవడానికి టీకా అన్నవాళ్ళ బస్ సర్వీసుందన్న సమాచారం అందించారా కేంద్రంవాళ్ళు.

టీకావాళ్ళ అడ్రస్ అడిగి తీసుకొని గ్రనాద నగరపు చిన్నపాటి వీధులగుండా రెండు కిలోమీటర్లు నడిచి అక్కడికి చేరాను. గ్రనాదలో మరి రెండు రోజులు గడపాలని, అందులో ఒకరోజు గ్రనాద నగరపు ప్రత్యర్థి ప్రదేశం లెయోన్‌కు ఓ డే ట్రిప్పు వెయ్యాలనీ నా అభిమతం. తీరా వెళితే ఆ టీకావాళ్ళు కోస్తా రీక వెళ్ళడానికి ఎల్లుండి బస్సులో మాత్రమే సీట్లు ఉన్నాయని, ఆ తర్వాత మరో రెండు రోజులపాటు లేవనీ చెప్పారు. అదో నిరాశ. లెయోన్ వెళ్ళలేనన్నమాట. ఇహ చేసేదేం లేక ఆ ఉన్న టికెట్టే తీసుకున్నాను. కోస్తా రీక వెళ్ళాలి, ఆపైన పనమా వెళ్ళాలి – అందుచేత నికరాగ్వాలో గడపగలిగే రోజుల విషయంలో నాకు అట్టే వెసులుబాటు లేదు.

నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకోకుండా ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లూ చేసుకోకుండా ప్రయాణాలు చేస్తున్నప్పుడు అపుడపుడూ ఇలా చిక్కడిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. మన ఇష్టప్రకారం ఏ ఊళ్ళో అయినా ఎక్కువో ఒకరోజు తక్కువో ఉండే అవకాశం ఈ పద్ధతిలో ఉందన్నమాట నిజమే గాని, ఒక్కోసారి అది మన ఇష్టాలకు వ్యతిరేకంగా పని చెయ్యవచ్చు. నికరాగ్వాలో ఇంకో రోజు అదనంగా ఉండి పరిసర ప్రదేశాల్లో మరికాస్త తిరుగాడుదామన్న కోరిక నాకు కలిగింది. మనాగ్వా జనారణ్యంలో తిరగాలన్న కోరిక లేకపోయినా పక్కనే ఉన్న లెయోన్‌కు ఒకసారి వెళ్ళిరావాలని నాకు ఎంతగానో ఉండింది. ఇంకా కుదిరితే ఓమెతేపె (Ometepe) ద్వీపాన్ని చూసి రావాలనీ ఉంది. వీటన్నిటికీ కనీసం మరొక్క రోజయినా కావాలి. బస్సులో సీట్లు లేకపోవడం పుణ్యమా అని ఆ కోరికలను కోరికలుగానే ఉంచుకోవలసివస్తోంది. ఏదేమైనా నికరాగ్వాలో నాకు కనీసం మరో రోజు గడిపే వ్యవధి ఉంది. ఆ ఉన్న సమయాన్ని గ్రనాదలో గడిపి ఆ మర్నాడు కోస్తా రీకా వెళ్ళే బస్సు పట్టుకుందామని నిశ్చయించుకున్నాను.

నడక మళ్ళా సాగించాను. మనుషులు… ఇళ్ళు… పౌరభవనాలు… చర్చులు – కొన్ని ఘనంగా పటిష్ఠంగా, మరికొన్ని శిథిలావస్థలో – గ్రనాద నడకరాయుళ్ళ స్వర్గసీమ… పెద్దగా దూరాలేమీ లేవు. ఏ వీధిని చూసినా రంగులీనుతూ కళకళలాడుతూ కనిపించింది. నాలో ఉత్సాహం నింపింది. ఎలాంటి అభద్రతాభావమూ కలుగలేదు. జనజీవితం నింపాదిగా సాగిపోతోంది. మనుషులు సౌమ్యుల్లా కనిపించారు. ఆప్యాయంగా పలకరించారు. స్నేహంగా సాయపడేవారిలా అనిపించారు.

అలా నడిచే ప్రక్రియలో నికరాగ్వాకు చెందిన ఒక ఆసక్తికరమైన విషయం నా దృష్టికి వచ్చింది. విలియమ్ వాకర్ అన్న అమెరికా దేశస్తుడు ఎంతోకాలం క్రితం నివసించిన పురాతన భవనమొకటి కనిపించింది. 1856లో అతగాడు నికరాగ్వా అధ్యక్షుడు అయ్యాడట. అలా అయ్యాక నికరాగ్వా యు.ఎస్.ఎ. లోని బానిసల స్థావరపు రాష్ట్రాల్లో ఒకటిగా విలీనం అయిపోవాలని ప్రతిపాదించాడట. ఆ మహానుభావుడి పేరు యు.ఎస్.లో ఈనాడు ఎవరికీ తెలియదు కానీ ఈ ప్రాంతాల చరిత్రలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మనిషిగా ఇప్పటికీ నిలచి ఉన్నాడు.

విలియమ్ వాకర్ వాళ్ళ నాన్న ఇంగ్లండ్ నుంచి వలస వచ్చిన మనిషి. టెనెసీ రాష్ట్రంలోని నాష్‌విల్‌కు చెందిన ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన మహిళతో ఆయనకు వివాహం జరిగింది. విలియమ్ వాకర్ పుట్టాడు. ఫిలడెల్ఫియా, స్కాట్‌లండ్ లోని ఎడిన్‌బరో, జర్మనీ లోని హైడెల్బర్గ్ నగరాల్లో వైద్యం చదివాడు. అదయ్యాక మళ్ళీ న్యాయశాస్త్రం చదివాడు. ఇవన్నీ ముగిశాక ఒక వార్తాపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు. 1853లో యాభైమందితో కూడిన కిరాయి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని, మెహికో లోని ల పాజ్ అన్న నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దానితోపాటు కాలిఫోర్నియాలో మనుషులు ఉండలేని బాజా (Baja) ప్రాంతాన్నీ ఆక్రమించి తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. మెహికో ప్రభుత్వం వెంటనే అతన్ని తమ భూభాగం నుంచి తరిమివేసింది.

1850లో, అంటే యు.ఎస్.ఎ. ఒక దేశంగా ఉత్తర దక్షిణ దిశల్లో విస్తరించే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్న సమయంలో, నికరాగ్వాలో కొలోన్ నగరాన్ని స్థావరంగా చేసుకున్న లిబరల్స్ మధ్య, గ్రనాదను కేంద్రంగా చేసుకున్న కన్సర్వేటివ్స్ మధ్యా అంతర్యుద్ధం చెలరేగుతోంది. 1855లో కొలోన్ లిబరల్స్ విలియమ్ వాకర్‌ను సాయం అడిగారు. అడిగిందే తడవుగా తన కిరాయి సైన్యంతో వెళ్ళి లిబరల్స్‌తో చేతులు కలిపాడు వాకర్. గ్రనాదను జయించి కన్సర్వేటివ్స్‌ను ఓడించడంలో తనదైన పాత్ర పోషించాడు. ఆ వెంటనే తనను తాను దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. వెంటనే ఎలక్షన్‌ల తతంగం నిర్వహించి, ఆ ఎన్నికల్లో రిగింగ్‌కు పాల్పడి గెలిచి, ప్రజాబలంతో గెలిచిన అధ్యక్షుడిగా తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నాడు. ఆ ప్రభుత్వానికి యు.ఎస్.ఎ. వెంటనే గుర్తింపు ప్రకటించి అంతర్జాతీయంగా విలియమ్ వాకర్ దొరతనానికి చట్టబద్ధమైన గౌరవమూ సమకూరడంలో సాయపడింది. కాని, అతని జిత్తులమారితనం దేశంలోని రాజకీయ వర్గాలన్నీ సంఘటితం కావడానికి దోహదం చేసింది. అతనంటే మెల్లగా వ్యతిరేకత గూడు కట్టుకోసాగింది.

ఈ నేపథ్యంలో యు.ఎస్.ఎ. లోని బానిస వ్యవస్థ నెలకొని ఉన్న దక్షిణాది రాష్ట్రాల మాదిరిగా నికరాగ్వాను కూడా ఆ దేశంలోని రాష్ట్రంగా విలీనం చెయ్యాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించాడు విలియమ్ వాకర్. అది ఆ ప్రాంతమంతటా గగ్గోలుకు దారితీసింది. ఈ పరిణామం నికరాగ్వాకే పరిమితమవదన్న అనుమానంతో కోస్తా రీక, ఎల్ సల్బదోర్, ఓందూరాస్ దేశాల సైన్యాలు తమ తమ దేశాల ఉనికిని కాపాడుకోవటానికి మూకుమ్మడిగా దాడి చేసి అతడిని ఓడించాయి. గ్రనాద నుంచి పారిపోతూ పోతూ విలియమ్ వాకర్ ఆ నగరానికి నిప్పంటించి మరీ పోయాడు!

మొత్తానికి విలియమ్ వాకర్ నికరాగ్వాను 1856-57లలో రెండేళ్ళ పాటు పాలించాడు. ఓటమి చవిచూశాక కూడా తన దుస్సాహసాలను మధ్య అమెరికాలో కొనసాగించాడు. చివరికి బ్రిటిష్ బలగాలకు చిక్కాడు. వాళ్ళు అతణ్ణి ఓందూరాస్ ప్రభుత్వానికి అప్పగించారు. ఓందూరాస్ ప్రభుత్వం వెంటనే ఏ ఆలస్యమూ చేయకుండా అతడిని వధించి సమస్యను పరిష్కరించింది.


సాయంత్రం నాలుగయింది. ఆలోచనల్లోంచి బయటపడి వెళ్ళి మసాయ అగ్నిపర్వతానికి చేరే గైడెడ్ టూర్ బస్సు పట్టుకున్నాను. ఇప్పటికీ అప్పుడప్పుడూ నిప్పులు చిమ్మే సజీవ అగ్నిపర్వతాలలో మసాయ ఒకటి. అంతా కలసి నికరాగ్వాలో పంతొమ్మిది అగ్నిపర్వతాలున్నాయి. అవి పసిఫిక్ అగ్నివలయంలో (pacific ring of fire) భాగంగా నికరాగ్వా దేశపు పడమటి తీరాన ఆ దేశానికి మూపురం లాగా విస్తరించి ఉన్నాయి.

గ్రనాద నుంచి మసాయ నేషనల్ పార్క్ చేరడానికి గంట పట్టింది. మా మినీబస్సంతా అక్కడి యూత్ హాస్టల్‌కు చెందిన బ్యాక్‌ప్యాకర్‌లతో నిండిపోయి వుంది. నేనూ ఆ బృందంలో ఒక భాగమై ఉంటే ఎంత బావుండేదీ అని క్షణకాలం అనిపించింది. వీళ్ళంతా తమ తమ ఉద్యోగపర్వాలలో నిమగ్నమై పోయేముందు ఇలా స్వేచ్ఛగా తిరుగాడటానికి వచ్చిన మనుషులు. నేనేమో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి పదవీవిరమణ వైపుగా సాగిపోతున్న యాభైమూడేళ్ళ మనిషిని. ప్రపంచమూ జీవితమూ వారి ముందు పరచుకొని ఉన్నాయి. నేను అటు సగం ఇటు సగంగా నడిమధ్యన నిలిచిన జీవిని. జీవితాన్ని ఆస్వాదించడానికి నాకున్న సమయం పరిమితం. వాళ్ళకయితే అలా హడావిడి పడాల్సిన అవసరం లేదు…

ఆ బృందంలోని పడుచువారిలో చాలామందితో పలకరింపులు సాగాయి. అందులో రీడ్ అన్న యు.ఎస్. లోని కాలిఫోర్నియా రాష్ట్రపు యువకుడు, లారా అన్న ఇంగ్లండ్ దేశపు కంబ్రియా ప్రాంతానికి చెందిన యువతీ నన్ను బాగా ఆకట్టుకున్నారు. లారాకు దాదాపు ముప్ఫై ఏళ్ళుంటాయి. కంబ్రియా దగ్గర్లోని లేక్ డిస్ట్రిక్ట్‌లో పుట్టి పెరిగిన మనిషి. డెర్బీ నగరంలోని రోల్స్ రాయిస్ ఇంజన్లు తయారుచేసే ఫాక్టరీలో ఇంజనీరుగా పనిచేస్తోంది. ఒక ఏడాదిపాటు సెలవు పెట్టి ఉభయ అమెరికా ఖండాల్లో తిరుగాడడానికి వచ్చింది. తన ప్రయాణం దక్షిణ అమెరికాలో ప్రారంభించి ఉత్తర దిశగా కొనసాగిస్తోంది. నేను వెళ్ళబోయే పనమా దేశం గురించి ఆమె దగ్గర కొన్ని వివరాలు సేకరించాను.

ఆరోజు అంతకు ముందే ఇంగ్లండ్ లయొనెసెస్ బృందం జర్మనీని 2-1తో ఓడించి ఫుట్‌బాల్ వర్‌ల్డ్‌కప్ కైవసం చేసుకున్నదన్న సంగతి తెలిసింది. ఆనాటికి అత్యంత ప్రముఖమైన క్రీడావార్త అది. నేను ఇంగ్లండ్ వాసిని అని లారా పరిచయం చేసుకోగానే గొప్ప ఉత్సాహంతో ఆ విజయవార్త ప్రస్తావన తెచ్చాను. ఆవిడకు అప్పటికే ఆ వార్త తెలిసి ఉంటుందని, మరోసారి ఆ సంతోషాన్ని ఇద్దరం పంచుకోవచ్చనీ నా ఆలోచన. ఆమె కూడా నాలానే ఉత్సాహంతో ఉరకలు వేస్తుందనుకుంటే అందుకు విరుద్ధంగా పేద్ద నిట్టూర్పు విడిచి నిరాశతో తల పట్టుక్కూర్చుంది లారా!

అరె! ఏమయింది! అని నేను ఆశ్చర్యపడుతుంటే ఆమె వివరించింది: తను అప్పటిదాకా కావాలనే ఆ వార్త గురించి పట్టించుకోలేదట. ఆనక తీరిగ్గా ఆ మ్యాచ్ చూసి ఆ సంబరం, ఆ ఉద్వేగం పరిపూర్ణంగా అనుభవించాలని ప్లాన్ చేసుకుందట. ఆ విషయం తెలియని నేను ఆమె ఉత్సాహంపై చన్నీళ్ళు పోసేశానన్నమాట. తెలియని పొరపాటుతో ఆమె ఉత్సాహాన్ని నీరుగార్చినందుకు క్షమాపణలు చెప్పాను. ‘మీ స్థానంలో ఎవరున్నా ఇలా ఈ వార్త చెప్పే ఉండేవారు’ అంటూ ఆమె ఉపశమన వాక్యాలు పలికింది.

కాలిఫోర్నియాలో యువనేరస్తులకు విద్యాబుద్ధులు మప్పే వృత్తి రీడ్‌ది. తన పనంటే ఎంతో పిపాస చూపించాడు. నా వృత్తి కూడా ఒక విధంగా అలాంటిదే కాబట్టి ఇద్దరం ఆ విషయాలు కొంచెంసేపు మాట్లాడుకున్నాం.

మా బస్సు ఆ జ్వాలాముఖి బిలపు అంచుల దాకా మమ్మల్ని తీసుకువెళ్ళింది. చురుకైన అగ్నిపర్వతమది. అనుక్షణం పొగలు సెగలు కక్కుతోంది. మేము అక్కడికి చేరేసరికి సూర్యాస్తమయ సమయమయింది. ఇంకా కాస్త వెలుగు మిగిలే ఉంది. అందరం ఆ అంచున ఉన్న విస్టా పాయింట్ దగ్గరకు చేరాం. ఐదు వందల మీటర్ల వెడల్పు, రెండు వందల మీటర్ల లోతూ ఉన్న బిలమది. అడుగున మండుతోన్న నిప్పుతునకలు. ఆ దిగువ నుంచి ఎగసిపడుతోన్న పొగల మేఘాలు. పరిసరాలనిండా అగ్నిపర్వతపు గంధకపు ఘాటు…

మమ్మల్నందరినీ మా గైడ్ ఆ పరిసరాల్లోని మరికొన్ని విస్టా పాయింట్‌లకు తీసుకువెళ్ళాడు. పరిసరాలను పరిచయం చేశాడు. క్రింద నేల మీద కాటుక నలుపు రంగుతో అగ్నిపర్వత ధూళి. ఘనీభవించిన లావా తునకలు. ఆ మరుభూమిలోనే కాస్తంత ఆవల చిక్కని పచ్చని వృక్షజాలం. ఇంకాస్త దూరాన కొండలు. మరికొన్ని శంఖాకారపు అగ్నిపర్వత శిఖరాలు…

బాగా చీకటిపడ్డాక మరోసారి మసాయ అగ్నిపర్వతపు బిలపు అంచులోని విస్టా పాయింట్‌కు చేరాం. ఈసారి మాకు పూర్తిగా భిన్నమైన దృశ్యం కనిపించింది. ఏదో రాక్షసాకృతి బాణలిలో కుతకుతా ఉడుకుతున్నట్టు ఉన్న ఎర్రెర్రని శిలాద్రవం – మాగ్మా – కనిపించి విభ్రాంతి కలిగించింది. ఆ శిలాద్రవం నిప్పుల కెరటాలుగా, అలలు అలలుగా కదలాడుతుండటం… అడపాదడపా విస్ఫోటనాలు సంభవించి మంటలు పైకి ఎగసిపడటం… అదంతా ఒక ఊహాతీత అధివాస్తవిక దృశ్యం. నేనేనాడూ చూడనిది, ఊహించనిది. చుట్టూ చిమ్మ చీకటి… దిగువన శిలాద్రవపు కుతకుతలు… అగ్నిపర్వతాలలో అనునిత్యం సాగిపోయే భీషణ అగ్నికాండను చూడటానికి, గ్రహించడానికీ ఎంతో అనువైన సమయం అది. మన మాతృభూమి గర్భంలో, రెండు వందల మీటర్ల దిగువన సాగిపోతోన్న ఆ అరుణారుణ ప్రకృతి ప్రక్రియను చిరుసంకోచంతో గమనిస్తూ, అందరం అక్కడ నలభై నిమిషాలు గడిపాం. ఆ బిలముఖాన్ని చూస్తే భూగర్భం లోకి దారితీసే భీషణ ప్రవేశ మార్గంలా అనిపించింది. శాంతమన్నదే తెలియని జ్వాలాముఖిలో సాగిపోయే భయద సౌందర్యలీల మాకు లీలగా బోధపడింది. ఇక మనం తిరిగివెళ్ళే సమయమయిందని గైడ్ హెచ్చరించాక కానీ ఎవరూ తెప్పరిల్లలేదు.

ఆ యూత్ హాస్టల్ బృందంలో కొన్ని గంటల పాటు గడపగలగడం అన్నది నాకు అనుకోకుండా దొరికిన చక్కని అవకాశం. ఎన్నో మాటలు… ఎన్నో చర్చలు… వాటిల్లో నేనూ భాగస్వామిని కాగలిగాను. రీడ్ విషయానికి వస్తే అతని విషయపరిజ్ఞానం, విశ్లేషణాపటిమ, వివరణాశక్తి చెప్పుకోదగ్గవి. డానల్డ్ ట్రంప్ ఎందుకు టెక్సస్‌లో ఘనమైన వ్యక్తో, అదే ట్రంప్ కాలిఫోర్నియాలో ఎందుకు జనవికర్షణ పొందుతున్నాడో దగ్గర్నుంచి బిట్‌కాయిన్లు, క్రిప్టో కరెన్సీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో – అన్నీ వివరంగా చెప్పాడు. అప్పటిదాకా ఆ క్రిప్టో కరెన్సీ అన్నది నాకు గ్రీక్ అండ్ లాటిన్‌లా అనిపించేది. రీడ్ పుణ్యమా అని అది కరతలామలకం అయింది. ఇపుడా వివరాలన్నీ గుర్తులేని మాట నిజమే కానీ మళ్ళా ఎవరైనా ఆ సంగతి ఎత్తి ఆ వివరాలు చెపితే అతి సులభంగా అర్థం చేసుకోగలనన్న నమ్మకం రీడ్ పుణ్యమా అని నాలో ఏర్పడింది.

నికరాగ్వా దేశం బ్యాక్‌ప్యాకర్‌లకు ఇష్టమైన ప్రదేశం. ముఖ్యంగా జర్మనీ నుంచి వీళ్ళు బాగా వస్తూ ఉంటారు. వ్యవసాయం తర్వాత నికరాగ్వాకు టూరిజమే అతి ముఖ్యమైన ఆర్థిక వనరు. మీ అమెరికావాళ్ళకు నికరాగ్వా అంటే ఎందుకంత ఇష్టం అని రీడ్‌ను అడిగాను. ‘అదేం లేదు, మామూలు అమెరికన్లు నికరాగ్వా గురించి ఆలోచించనయినా ఆలోచించరు. ఈ దేశానికి రావాలంటే బాగా భయపడతారు. రక్షణా భద్రతా లేనే లేవని అనుకుంటారు. మా బ్యాక్‌ప్యాకర్ల సంగతి వేరు. ఈ దేశంలో అతి తక్కువ ఖర్చుతో తిరుగాడవచ్చు. చక్కటి హాస్టల్ నెట్‌వర్క్ కూడా ఉంది. అందుకే మాకు మక్కువ’ అని వివరించాడు రీడ్.

తనూ మరికొందరు హాస్టల్‌మేట్‌లూ కలిసి ఒక బోట్ అద్దెకు తీసుకొని నికరాగ్వా సరోవర విహారానికి వెళుతున్నామని చెప్పాడు రీడ్. ఒక పూటంతా పట్టే ప్రయాణమట. నన్నూ రమ్మని ఆహ్వానించాడు. ఖర్చులు పంచుకుందాం అన్నాడు. నేను సంతోషంగా ఒప్పుకున్నాను.

ఆనాటి రాత్రి బాగా పొద్దుపోయేదాకా జరిగే సురాపానపు సమావేశం, కబుర్లలో చేరమని ఆహ్వానించాడు రీడ్. ఆ పక్కనే అతి తక్కువ ధరలో మద్యం దొరికే చోటు ఒకటి కనిపెట్టారట. ఆ ప్రదేశం బ్యాక్‌ప్యాకర్ ప్రపంచంలో బాగా పాపులర్ అట. నేను పెందరాళే పడుకునే మనిషిని. పైగా రేపంతా అటూ ఇటూ తిరిగే పని ఉంది. అంచేత మరీ పొద్దు పోకముందే పడుకొని మంచి నిద్రపోవడం ఎంతైనా అవసరం. సున్నితంగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాను. మర్నాడు ఎనిమిదింటికల్లా బోటు జెట్టీ దగ్గర కలుసుకుందామని నిర్ణయించుకొని విడివడ్డాం.

అక్కడి సెంట్రల్ ప్లాజా దగ్గర ఓ రెస్టరెంట్‌లో ఆనాటి డిన్నర్ అయింది. గాయో పింతో (Gallo Pinto) అన్న నికరాగ్వా దేశపు పదార్థం ఆర్డర్ చేశాను. అన్నం, ఉల్లిపాయలు, ఎర్ర చిక్కుడు గింజలు కలగలసిన సరళ పదార్థమది. ఇందీ వియేహో (Indie Viejo) అన్నది నేను అడిగిన మరో పదార్థం. చికెనూ ఆనియన్‌ల సూపులో జొన్నపిండి కలిపి చిక్కబరచిన పదార్థమది. ఆకలితో నకనకలాడుతూ ఉన్నానేమో ఆ రెండూ మెతుకు వదలకుండా ముగించాను.


పెందరాళే లేచి ఏడింటికల్లా బ్రేక్‌ఫాస్ట్ ముగించాను. పడవల జెట్టీకి అరగంట నడక. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అక్కడో మనిషి… ఇక్కడో మనిషి… తీరా వెళ్ళి రీడ్, అతని మిత్రబృందం కోసం చూస్తే ఏముందీ, ఒక్క మనిషీ అయిపు లేడు! అక్కడి బోటువాళ్ళను వాకబు చేశాను – ఆ ఉదయం అక్కడికి చేరిన మొట్టమొదటి కస్టమర్ నేనే అని వాళ్ళు నిర్ధారించారు. క్షణాల్లో వారంతా నా బేరం కోసం పోటీపడటం మొదలుపెట్టారు. అది పట్టించుకోకుండా మరో పావుగంట రీడ్ కోసం ఎదురుచూశాను. రాలేదు. రాత్రి వాళ్ళంతా పడుకునేసరికి తెల్లవారిపోయుంటుంది. ఇక రాడని స్పష్టమయింది. ఈలోగా మా బోటంటే మా బోటంటూ ఆ బోటు వాళ్ళ హడావిడి.

అదంతా పట్టించుకోకుండా వాళ్ళకు దూరంగా వెళ్ళే ప్రయత్నంలో సరోవర తీరాన అర కిలోమీటరు ముందుకు సాగాను. అక్కడ ఒక ఒంటరి బోటు మనిషి తటస్థపడ్డాడు. ఇంగ్లీషులో మర్యాదగా మాట్లాడాడు. బోటు తీసుకోమని ఏమాత్రం ఒత్తిడి పెట్టలేదు. అతని ధోరణి నచ్చింది. బోటు తీసుకుందామని నిశ్చయించుకున్నాను. మూడు గంటల నౌకావిహారానికి వంద డాలర్ల ఛార్జి అని చిన్నపాటి బేరం తర్వాత ఇద్దరం ఒప్పందానికి వచ్చాం. బోటు ఎక్కాను. అతని పేరు రొబేర్తో దియాస్ (Roberto Díaz).

మేము మూడు గంటల్లో పెట్టుకున్న కార్యక్రమం లాస్ ఇస్లాతాస్ దె గ్రనాద (Las islatas de Granada) అన్నది. లేక్ నికరాగ్వాలో గ్రనాద పరిసరాల్లో ఉన్న చిన్న చిన్న ద్వీపాలు చూసి రావడమన్నది ఆ కార్యక్రమ లక్ష్యం. దానికి మూడు గంటలు అవసరమా అన్న సందేహం నాకు కలిగింది. దానికోసం, నా ఒక్కడి కోసం, ఒక బోటు, ఒక బోటు మనిషి; మరీ అతి అవుతోందా అనిపించింది. అదేం లేదు, మూడు గంటలు ఇట్టే గడిచిపోతాయి అని భరోసా ఇచ్చాడు రొబేర్తో. నిజంగా అదే జరిగింది. కాసేపటికల్లా ఈ రొబేర్తో మర్యాదస్తుడూ అభిమానపాత్రుడే కాదు, ఆ ప్రాంతాల గురించి క్షుణ్ణంగా తెలిసిన మనిషి కూడా అని అర్థమయింది.

మధ్య అమెరికా అంతటిలోనూ అతి పెద్ద మంచినీటి చెరువు లేక్ నికరాగ్వా. విస్తీర్ణం 8264 చదరపు కిలోమీటర్లు – గోవాకి రెండుంపావు రెట్లు! నికరాగ్వా దేశానికి జీవరేఖ ఆ సరోవరం. అమెరికా ఖండాల్లో అది పదో పెద్ద సరోవరం. ప్రపంచం మొత్తమ్మీద చూస్తే పంతొమ్మిదవది. ఈ సరోవరాన్ని నేటివ్ ఇండియన్లు కోసీబోల్క (Cocibolca: తీపి సముద్రం) అని పిలిచారు. ఆ పేరు ఇప్పటికీ వాడుకలో ఉంది. దాన్ని తొలిసారిగా చూసిన స్పానిష్ ఆక్రమణదారులు అది సముద్రం అని భ్రమించారట. వారూ ఈ సరోవరాన్ని తీపి సముద్రం (La Mar Dulce) అనే పిలిచారు. ఈ సరోవరంలో పక్షులు పుష్కలం. ద్వీపాల్లో వృక్షాలూ పచ్చదనం నిండుగా ఉన్నాయి. మా బోటు సరోవరంలో సాగిపోతున్నప్పుడు రొబేర్తో రకరకాల పక్షులను పరిచయం చేశాడు. వాటికి మా బోటు చేరువ అయినప్పుడు ఇంజను ఆపేసి నింపాదిగా పక్షుల దగ్గరకు బోటును తీసుకువెళుతూ సాగాడు. ఆ పక్షులకు కూడా ఈ వ్యవహారమంతా చిరపరిచితం కాబోలు; మా ఉనికికి అదరకుండా బెదరకుండా ఉండిపోయాయి.

గ్రనాదకు బాగా దగ్గర్లోనే నికరాగ్వా సరోవరంలో 365 చిరుద్వీపాల ఆర్కిపెలాగో (ద్వీపసమూహం) ఉంది. ఇంకా ముందుకు వెళితే కొన్ని పెద్ద ద్వీపాలు ఉన్నాయి. ఓమెతేపె అన్నది అలాంటి ఒక ద్వీపం. ఆ ద్వీపంలో కాన్సెప్సియోన్ (Concepción), మదేరాస్ (Maderas) అన్న జంట జ్వాలాముఖులున్నాయి.

ఈ ద్వీపాల్లో షుమారు మూడు వందలు గ్రనాద తీరరేఖకు చేరువలో ఉన్నాయి. ఆ ద్వీపాల్లో కొన్నిటిని నికరాగ్వా, ఉత్తర అమెరికా, ఐరోపా ప్రాంతాలకు చెందిన సంపన్న గృహస్తులు తమ స్వంత ఆస్తిగా మలచుకున్నారు. వాటిల్లో విలాసవంతమైన భవనాలు నిర్మించారు. వాటిలో కొన్నిటిని ఖరీదైన హోటళ్ళుగా రూపొందించారు. మరికొన్ని ద్వీపాలలో తరతరాలుగా స్థానికులైన జాలరులు నివాసముంటున్నారు.

‘దేశపు సంపదలో అధికభాగం ఆరేడు సంపన్న కుటుంబాల ఆధీనంలో ఉంది’ అన్న వివరం అందించాడు రొబేర్తో. పేయాస్ (Pellas), చమోర్రొ (Chamorro), బల్తొదానో (Baltodano) అన్నవి అలాంటి కుటుంబాలలో కొన్ని. సొమోసా (Somoza) నియంతపాలన సమయంలో ఈ కుటుంబాలు ఆయా ద్వీపాలను కారుచవకగా కొనుక్కున్నాయట.

ఆ విషయం గురించి నాకు అప్పటికే కాస్తంత అవగాహన ఉండటం వల్ల రొబేర్తోను సాందీనో గురించీ అతనికీ సొమోసాకూ ఉన్న విభేదాల గురించీ మరిన్ని వివరాలు అడిగాను. ‘గత వందేళ్ళుగా నికరాగ్వా రాజకీయాలను పాలించి శాసించినవాళ్ళు వాళ్ళిద్దరూ’ అని వ్యాఖ్యానించాడు రొబేర్తో. సొమోసా కుటుంబీకులు మూడు దశాబ్దాల పాటు నియంతలుగా నికరాగ్వాను పాలించారట. సాందీనో ప్రేరణతో మొదలైన సాందినిస్తా ఉద్యమం ఆ సొమోసాల పాలనకు చరమగీతం పాడిందట.

1821లో నికరాగ్వా స్పానిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. యు.ఎస్.ఎ.కు మొదటినుంచీ ఈ దేశం అంటేనూ ఇక్కడి పరిణామాలంటేనూ వ్యూహాత్మక ఆసక్తి ఉంది. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను అనుసంధించే జలసంధి నిర్మాణానికి అనువైన ప్రదేశాల్లో నికరాగ్వా ఒకటి. చివరికి ఆ జలసంధి పనమా దేశంలో నిర్మింపబడిన తర్వాత కూడా నికరాగ్వా విషయంలో యు.ఎస్. ఆసక్తి తగ్గలేదు. తన దేశంలోని యునైటెడ్ ఫ్రూట్ కంపెనీవారి ప్రయోజనాలు కాపాడటం కోసం అమెరికా నికరాగ్వాను ఒక బనానా రిపబ్లిక్‌గా మార్చి అదుపులో పెట్టుకుంది. తమ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే కీలుబొమ్మ ప్రభుత్వాలను పీఠమెక్కించి నిలబెట్టే క్రీడ అమెరికా కొనసాగించింది.

1925-33ల మధ్యన యు.ఎస్.ఎ. నికరాగ్వాను ఆక్రమించినప్పుడు అగూస్తో సాందీనో దేశపు రైతులను సమీకరించి అగ్రరాజ్య ఆధిపత్యాన్ని ఎదురుకుంటూ గెరిల్లా పోరాటం ఆరంభించాడు. పేదరైతుల సమీకరణ అన్న కారణం చూపించి సాందీనోను కమ్యూనిస్టుగా ముద్ర వేసే ప్రయత్నం చేసింది అమెరికా. కానీ సాందీనోది సంపన్న కుటుంబం. అందరూ చెప్పుకునే కమ్యూనిస్టు ముద్ర అతనికి ఏమాత్రమూ సరిపడేది కాదు.

1933లో యు.ఎస్.ఎ. నికరాగ్వా నుంచి నిష్క్రమించాక అమెరికా ప్రాపకంలో జనరల్ సొమోసా అధ్యక్షపీఠం ఎక్కాడు. శాంతి ఒప్పందం చేసుకుందాం రమ్మని పేదల నేత సాందీనోను డిన్నరుకు ఆహ్వానించాడు. అలా వచ్చిన సాందీనోను దారుణహత్యకు గురికావించాడు. ఎదురులేని అధికారం అనుభవిస్తూ జనరల్ సొమోసా, అతని ఇద్దరు కొడుకులూ నలభై ఏళ్ళపాటు భయభీభత్సాలను ఆయుధాలుగా చేసుకొని దేశాన్ని పాలించారు. యు.ఎస్.ఎ. మద్దతు అలా ఉంచి, రోజువారీ విషయాల్లో తమకు అండదండలుగా ఉండటం కోసం గ్వార్దియా నాసియొనాల్ అన్న రక్షక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అధినేతలకు అంగరక్షకులుగా ఉండటమే కాకుండా దేశమంతటా భయభీతులు నెలకొల్పడంలో ఈ నేషనల్ గార్డ్స్ సైన్యం ఎంతో సమర్థవంతంగా పని చేసింది.

1960లో సాందీనో ఆదర్శాలనుండి ప్రేరణ పొందిన సోషలిస్టుల బృందం ఒకటి తమ ఆరాధ్యనాయకుని పేరున ‘సాందినిస్తా’లన్న పార్టీని నెలకొల్పింది. వధింపబడి పాతికేళ్ళు నిండినా ప్రజల్లో సాందీనోకు మద్దతు కొనసాగుతూనే ఉంది. 1960లో మొదలయిన సాందినిస్తా పార్టీ క్రమక్రమంగా బలం సమకూర్చుకొని 1970లో విప్లవమార్గాన అధికారాన్ని చేజిక్కించుకుంది. సొమోసాల పరంపరలో చివరి వాడైన అనాస్తాసియో సొమోసా పెరుగ్వాయ్ (Peruguay) దేశానికి పారిపోయాడు. తిరిగి 1980లో నికరాగ్వాలో అడుగు పెట్టినప్పుడు సాందినిస్తాల చేతుల్లో వధింపబడ్డాడు. అలా సొమోసాల వంశపాలన సమూలంగా నిర్మూలించబడింది. అమెరికా చలవతో, నేషనల్ గార్డుల మద్దతుతో అతిక్రూరంగా పాలన సాగించిన చరిత్రహీనుడిగా సొమోసా మిగిలిపోయాడు. ప్రత్యర్థిగా భావింపబడిన సాందీనో, సిమోన్ బొలీవార్, హొసే మార్తిల కోవకు చెందిన మహోన్నత జాతీయనాయకుడిగా చరిత్రకెక్కాడు.

దానియెల్ ఓర్తేగా (Daniel Ortega) నికరాగ్వా ప్రస్తుత అధ్యక్షుడు. 1970ల నాటి సాందినిస్తా విప్లవపు రోజులనుంచీ నాయకత్వ భూమికలో ఉన్న మనిషి. నాకు అంతర్జాతీయ పరిణామాలను వార్తాపత్రికల్లో చదివి గ్రహించుకునే అలవాటు చిన్నప్పటి నుంచీ ఉంది. 1980ల్లో ఓర్తేగా పేరు పత్రికల్లో ప్రతిరోజూ కనబడటం నాకు బాగా గుర్తుంది. ‘ఈ నలభై ఏళ్ళలో ఓర్తేగా ఎన్నోసార్లు పదవిలోకి పదవి బయటకూ వెళ్ళి వస్తూనే ఉన్నాడు’ అన్నాడు రొబేర్తో. ‘ఏదేమైనా ఇప్పటి సాందినిస్తా ప్రభుత్వంలో అప్పటి విలువలూ ఆదర్శాలూ అదృశ్యమయ్యాయి. అన్ని ఇతర ప్రభుత్వాల బాణీలోనే వీరి పాలనా కొనసాగుతోంది. ఒకప్పుడు దారిదీపంగా నిలిచిన మార్క్సిస్ట్-లెనినిస్ట్ భావాల ప్రభావం ఇపుడు కొడిగట్టింది’ అని చెప్పుకొచ్చాడు రొబేర్తో. ‘అదలా ఉంచినా సాందినిస్తాలు అధికారం లోకి వచ్చిన తొలిదినాలలో కొన్ని మంచి పనులు చేశారు. జాతీయ అక్షరాస్యతా కార్యక్రమానికి రూపకల్పన చేసి అమలు పరిచారు. అలాగే భూసంస్కరణలు. అంతకన్నా ముఖ్యంగా మారాస్ (Maras) లాంటి చీకటి మూకలు దేశంలో నిలదొక్కుకోకుండా నిరోధించారు. ఈ పని మా పొరుగు దేశాలైన ఎల్ సల్బదోర్, ఓందూరాస్, గ్వాతెమాలలలో జరగలేదు. అంచేత మాకు నేరాలు, హత్యాకాండలూ తక్కువ’ అని కూడా వివరించాడు రొబేర్తో.

మేమిలా చర్చించుకుంటూ ఉండగానే దారిలో వచ్చే అనేక ద్వీపాలను రొబేర్తో నాకు పరిచయం చేశాడు. అవి ఏయే కామందులకు చెందినవో ఆ వివరాలూ చెప్పాడు. వాటిల్లోని చెట్లూ పక్షుల వివరాలు అందించాడు. ఒక ద్వీపంలో ఉన్న 18వ శతాబ్దపు స్పానిష్ కోట – ఎల్ సాన్ పాబ్లో – శిథిలాలు చూపించాడు.

ఒకే ఒక్క పడవ, అందులో ఒకే ఒక్క జాలరీ ఉన్న ఒక ద్వీపం దగ్గరకు తీసుకువెళ్ళి ఆపాడు రొబేర్తో. ఆ జాలరిని మనసారా పలకరించి ‘ఇదిగో ఇతను మా తమ్ముడు ఒర్లాందో’ అని పరిచయం చేశాడు. అన్నదమ్ములిద్దరూ కాసేపు కుశలప్రశ్నల్లో నిమగ్నమయ్యారు. అప్పటికి ఉదయం పదిన్నర అయింది. ఈరోజు బాగా చేపలు పడ్డాయని, మరో గంటసేపు వేటాడి గ్రనాద నగరంలో వాటిని అమ్ముకుంటాననీ చెప్పాడు ఒర్లాందో. వాళ్ళ అన్నకు నన్ను చూపిస్తూ స్పానిష్ భాషలో ఏదో అన్నాడు. ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు. సంగతేమిటీ అన్న ప్రశ్న నా మొహంలో గమనించి రొబేర్తో ‘మీరు గాని గ్రనాదలో ఈరోజు ఎక్కడైనా భోజనంలోకి చేపల కూర ఆర్డరు చేసినట్టయితే అవి నేను పట్టినవే అయ్యే అవకాశం ఉంది అంటున్నాడు మావాడు’ అని వివరించాడు. అది విని వాళ్ళ నవ్వుల్లో నేను నవ్వు కలిపాను. అన్నదమ్ములిద్దరూ వీడుకోళ్ళు చెప్పుకొని విడివడ్డారు.

మళ్ళా మా బోటు ప్రయాణం కొనసాగించాం. కబుర్లు మొదలుపెట్టాం. ఆ కబుర్ల మధ్య దారిలో కనిపించే పక్షుల వివరాలు, ద్వీపాల ప్రత్యేకతలు చెప్పుకుంటూనే వచ్చాడు రొబేర్తో. ఈ సరోవరం నికరాగ్వా దేశమంతటికీ జీవనాధారం అని చెప్పుకొచ్చాడతను. మంచినీరు అందించడం, వ్యవసాయానికి నీటి సరఫరా, మత్స్య సంపద, టూరిస్టులను ఆకర్షించడం – ఎన్నో విధాలుగా దేశపు మనుగడకు ఈ విశాల సరోవరం దోహదం చేస్తోందని వివరించాడు.

ఈ విషయాలతోపాటు మరో ఆసక్తికరమైన అంశం మా మాటల్లో దొర్లింది. నిజానికి పనమా కెనాల్ నిర్మాణానికి ముందే – నూట యాభై ఏళ్ళ క్రితం – నికరాగ్వాలో అలాంటి జలమార్గం నిర్మించాలన్న ఆలోచన యు.ఎస్. వారికి బలంగా ఉండేదట. లేక్ నికరాగ్వాను ఆధారపీఠంగా చేసుకొని, ఈ సరోవరంలో పుట్టి తూర్పున కరేబియన్ సముద్రంలో కలిసే సాన్ హ్వాన్ (San Juan) అనే నదిని నౌకాయానానికి సహజ జలమార్గంగా ఉపయోగించుకొని పసిఫిక్‌నూ అట్లాంటిక్‌నూ కలపాలన్నది వారి యోచన. అన్నట్టు కరేబియన్ సాగరచోరులు అప్పట్లో ఈ సాన్ హ్వాన్‌ నదీమార్గమే వాడుకొని లేక్ నికరాగ్వా దాకా వచ్చి గ్రనాద మీద దాడి చేసేవారట. అనేకానేక రాజకీయ కారణాల వల్ల ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. చివరికి అలాంటి జలమార్గ నిర్మాణం పనమా దేశంలో జరిగిపోయింది. ‘అది జరిగిన మాట నిజమే కానీ ఇప్పటికీ అలాంటి జలసంధి నికరాగ్వాలో నిర్మించాలన్న కోరికను యునైటెడ్ స్టేట్స్ అప్పుడప్పుడూ బయటపెడుతూనే ఉంటుంది. అది ఆలోచనే కానీ దాన్ని వాళ్ళు అమలుపరచరని మా అందరికీ తెలుసు. కానీ ఈ ఆలోచనను సజీవంగా ఉంచడం అమెరికావారికి వ్యూహాత్మక అవసరం. ఇటు చైనా నికరాగ్వాలు చేతులు కలిపి పనమా కెనాల్‌కు ప్రత్యామ్నాయంగా, తమతమ రాజకీయార్థిక అవసరాల కోసం ఆ జలమార్గం నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నాయి. దాన్ని అరికట్టడానికి అమెరికా అడపాదడపా తన పాత ప్లాన్‌లను బయటకు తీసి దుమ్ము దులుపుతూ ఉంటుంది’ అంటూ ప్రాంతీయ రాజకీయ సంక్లిష్టతలను వివరించాడు రొబేర్తో. ఒకటి మాత్రం నిజం – ఇప్పుడిప్పుడే ఎవరి ఆలోచనా కార్యరూపం దాల్చగలిగే దాఖలాలు అయితే లేవు.

మా తదుపరి మజిలీ మంకీ ఐలండ్ అన్న చిరుద్వీపం. కాపాడబడిన మర్కటాలకు ఏర్పరిచిన రక్షితవనం ఆ మంకీ ఐలండ్. అక్కడంతా చెట్లే చెట్లు – ఎక్కువగా మామిడి చెట్లు. వాటిమీద ఆటలాడుతూ, ఊయలూగుతూ, కొమ్మ మీద నుంచి కొమ్మ మీదకు గెంతుతూ, ఒక చెట్టు మీంచి మరో చెట్టు మీదికి ఎగిరి దూకుతూ – కోతులే కోతులు. మరో బోటు కొద్దిమంది టూరిస్టులతో మా వెనకనే ద్వీపం చేరింది. నీటిమట్టానికి దగ్గరగా ఉన్న కొమ్మల మీద చేరిన కోతులకు ఆహారం అందించింది. అవి సంబరంగా అందుకున్నాయి.

తిరిగి తీరం చేరేటప్పుడు దూరాన గ్రనాద నగరపు గగనరేఖ కనిపించి ఆహ్లాదం కలిగించింది. నగరపు చర్చి గోపురాలు, గుమ్మటాలు, ఆపైన క్షితిజాన నగరానికి నేపథ్యయవనికలా మొంబాచో (Mombacho) అగ్నిపర్వతం – ఆకట్టుకునే దృశ్యమది.

తీరం చేరుకునేలోగా నికరాగ్వా సరోవరానికి చెందిన మరో విశేషం చెప్పుకొచ్చాడు రొబేర్తో – ప్రపంచంలోకెల్లా సొరచేపల్ని కలిగివున్న ఒకే ఒక్క సరోవరం లేక్ నికరాగ్వా అట. అక్కడ ఉండే సొరచేపలు బుల్‌షార్క్ అన్న వర్గానికి చెందినవి. సముద్రాలకే చెందిన ఈ జాతి సొరచేపలు సాన్ హ్వాన్ నదీజలాలకు ఎదురీది ఈ సరోవరం చేరుకొని ఇక్కడ వర్ధిల్లాయన్నది ఒక వివరణ. [ఇలాంటి అనూహ్యవిశేషమే మనకు చంబల్ లోయలో కనిపిస్తుంది. సముద్రంలో ఉండే తిమింగలాల వర్గానికి చెందిన డాల్ఫిన్లు గంగానదీ ముఖద్వారం దగ్గర నదికి ఎదురీది వందలాది మైళ్ళు దాటుకొని, గంగకు ఉపనది అయిన చంబల్ నదిలో ప్రవేశించి, ఆ నది ఎంతో విశాలంగా ఉండే చంబల్ లోయ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి – అను.] అయితే బుల్‌షార్కులే కాకుండా తార్పోన్, స్వోర్డ్ ఫిష్ వంటి ఇతర సముద్ర జలచరాలు కూడా ఈ సరోవరంలో కనిపిస్తాయి. అందువల్ల, ఈ సరోవరం ఒకప్పుడు సముద్ర అఖాతమని, అగ్నిపర్వతాల విస్ఫోటనలలో వెలువడిన లావా అడ్డుకట్ట వేసి అఖాతాన్ని సముద్రం నుంచి విడదీసి సరోవరంగా మార్చిందని, అలా అందులో చిక్కుకుపోయిన సముద్రచరాలు క్రమేణా మంచినీరుగా మారుతున్న సరోవర జలాలకు అలవాటు పడిపోయాయనీ ఇంకొక శాస్త్రీయ ప్రతిపాదన కూడా ఉంది. ‘ఏదేమైనా ప్రపంచంలోకెల్లా సముద్ర జలచరాలకు ఆశ్రయమిచ్చే ఏకైక మంచినీటి సరస్సు ఈ లేక్ నికరాగ్వా మాత్రమే’ అని నొక్కి వక్కాణించాడు రొబేర్తో.

రొబేర్తో పుణ్యమా అని మూడుగంటలు తెలియకుండా గడిచిపోయాయి. అర్థవంతంగా గడిచిపోయాయి. మనస్ఫూర్తిగా అతనికి ధన్యవాదాలు చెప్పి ఊళ్ళోకి నడిచాను. భోజనాల సమయమయింది. గ్రనాద గ్రిల్ అన్న రెస్టరెంటుకు వెళ్ళి భోంచేశాను. మామూలే – అన్నమూ చికెనూ కలిసిన గాయో పింతో ఆర్డర్ చేశాను.

ఊర్లో గడపడానికి నా చేతుల్లో ఒక పూటంతా ఉంది. ఇది చూడాలి అది చూడాలి అని పెట్టుకోకుండా ఊళ్ళో తిరుగాడాలని నా ఆలోచన. ముందుగా దగ్గర్లో ఉన్న ఇగ్లేసియా ల మెర్సేద్ అన్న అందమైన చర్చి ప్రాంగణం చూశాను. 1534లో కట్టిన చర్చి అది. గ్రనాదలోకెల్లా అతి పురాతనమైన చర్చి. చర్చి చూడటం ముగించాక అదే ఊపులో గ్రనాద కెథెడ్రల్ వైపుకు సాగాను. వెళ్ళి మెట్లెక్కి విస్టా పాయింట్ చేరుకున్నాను. నగరము, దూరాన లేక్ నికరాగ్వా, ఇంకా ఆపైన అగ్నిపర్వతాలు – మనసు నిండే దృశ్యమాలిక. అగ్నిపర్వతాల శిఖరాగ్రాలు మేఘాలతో దోబూచులాడటం కనిపించింది.

సాయంకాలమయింది. దారి పొడవునా రెస్టరెంట్లున్న ఒక వీధిని కనిపెట్టాను. చీకట్లు ముసిరే వేళ కదా – మెల్లగా ఆ భోజనాల వీధిలో కోలాహలం మొదలయింది. నేను కూడా ఇక నా శోధనలు కట్టిపెట్టి మిగిలిన రెండు మూడు గంటలూ అక్కడే తీరిగ్గా గడపాలనుకున్నాను. అనువైన రెస్టరెంట్ కోసం చూస్తూ, ఆయా మెనూ వివరాలు పరిశీలిస్తూ వీధి వీధంతా సర్వే చేశాను. కొమీదాస్ తిపికాస్ యి మాస్ (Comidas Típicas y más) – అన్న రెస్టరెంట్ కనిపించింది. హొసే అన్న వ్యక్తి నాకు స్వాగతం పలికాడు. అమెరికన్ యాసతో కూడిన చక్కటి ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడాడు. అది వాళ్ళ ఫామిలీ రెస్టరెంట్ అని, ఈ రోజు సాయంత్రం ఇక్కడికి వచ్చే, ఇంగ్లిష్ మాత్రమే తెలిసిన కస్టమర్లకు సాయపడటం కోసం తాను రెస్టరెంట్‌లో ఉన్నాననీ చెప్పాడతను. నన్ను ఆ రెస్టరెంట్ ప్రాంగణంలో ఒక టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళి సుఖాసీనుడిని చేశాడు.

అతను ఫిలడెల్ఫియాలో పెరిగాడట. మా మాటలు గాడిన పడ్డాక ఒక కోరిక కోరాడు: ‘మా దగ్గర ఇంగ్లిష్ నేర్చుకుంటోన్న ఒక మనిషితో మీరు కాసేపు మాట్లాడగలరా? అతనికి ఇంగ్లిష్ ప్రాక్టీస్ అవుతుంది.’ నేను సరే అన్నాను. లొరేంజో అన్న ‘విద్యార్థి’ని తీసుకువచ్చి పరిచయం చేశాడు హొసే. ఆ విద్యార్థిని చూసి ఆశ్చర్యపడ్డాను. అతనికి ముప్ఫై ఏళ్ళుంటాయి. ఏదో మల్టీనేషనల్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఉద్యోగంలో పదవోన్నతికి సాయపడుతుందని ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాడు.

చూస్తోంటే హొసే ఇంగ్లిష్ బోధన చక్కని ఫలితాలనిచ్చిందని అర్థమయింది – లొరేంజో నాతో చక్కగా మాట్లాడగలిగాడు. గ్రనాద నగరంలో తన జీవనసరళి గురించి చెప్పాడు. నికరాగ్వా దేశంలో జీవితం గురించీ చెప్పాడు. నేను భోజనం ఆర్డర్ చెయ్యడానికి సాయపడ్డాడు. మధ్యమధ్యలో మా సంభాషణ ఎలా సాగుతోందో చూడటానికి హొసే వచ్చి వెళ్ళాడు. నాకు కృతజ్ఞతాసూచకంగా కాంప్లిమెంటరీ పానీయాలు, స్థానిక భోజన పదార్థాల శాంపుల్సూ అందించి వెళ్ళాడు.

మా సంభాషణను మరికాస్త గాఢం చేసేందుకు రానల్డ్ రీగన్ ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపి వదిలిన ఇరాన్-కాంట్రా వ్యవహారం గురించి అడిగాను. ‘నేనప్పటికి పుట్టనేలేదు. ఆ విషయాలు నాకు అంతగా తెలియవు. నాకు అర్థమయినంత వరకూ ఆ విషయం యునైటెడ్ స్టేట్స్‌లో అతి ముఖ్యమైనదే కానీ ఇక్కడ నికరాగ్వాలో ఇపుడా సంగతి పట్టించుకొనేవాళ్ళే లేరు’ అన్నాడు లొరేంజో.

1980లో అమెరికా వ్యవస్థను అతలాకుతలం చేసి రీగన్ పదవిని ప్రశ్నార్థకంగా చేసిన ఇరాన్-కాంట్రా వ్యవహారంలో నికరాగ్వా ప్రముఖపాత్ర పోషించింది. సాందినిస్తాలు అధికారం కైవసం చేసుకొని సొమోసా దేశం వదిలి పారిపోయాక, అప్పటిదాకా అత్యంత విధేయులుగా ఉన్న నేషనల్ గార్డ్స్ సైనికులు చెల్లాచెదురైపోయారు. క్రమక్రమంగా వాళ్ళంతా తమను తాము పునఃసమీకరించుకొని అమెరికా మద్దతుతో కోంత్రాస్ (Contras) అన్న మితవాద సంస్థగా ఏర్పడ్డారు. అమెరికా మద్దతుతో సాందినిస్తా ప్రభుత్వానికి ఎదురు నిలిచి గెరిల్లా యుద్ధం మొదలుపెట్టారు. ఇరాన్‌కు ఆయుధాలు అమ్మి ఆ ధనాన్ని కాంట్రాల గెరిల్లా యుద్ధపు అవసరాల కోసం అందించమని రీగన్ ప్రభుత్వం సి.ఐ.ఎ.ను ఆదేశించింది. ఈ విషయం యు.ఎస్. కాంగ్రెస్‌కు తెలియకుండా దాచిపెట్టారు. విషయం బైటకి పొక్కగానే దేశమంతా గగ్గోలు గగ్గోలు అయింది. రీగన్ ప్రభుత్వంలో కొన్ని పెద్ద తలలు దొర్లిపడ్డాయి.

డిన్నరు ముగిశాక లొరేంజో నన్ను రాత్రి సమయంలో ఊరు ఎలా ఉంటుందో చూపించడానికి వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఊళ్ళోని కొన్ని చర్చులు చూపించాడు. అందులో చర్చ్ గ్వాదాలూపె (Guadalupe) శిథిలావస్థలో ఉన్నా కూడా తన పాతకాలపు సొగసును ఏమాత్రం కోల్పోకుండా కనిపించింది. అది చూశాక సాన్ ఫ్రాన్సిస్కో చర్చికి వెళ్ళాం. ఎంతో అందమైన ముఖభాగం ఆ చర్చిది. గ్రనాద లోని ఆడపిల్లలు ఈ చర్చిలో పెళ్ళాడాలని కోరుకుంటారని చెప్పాడు లొరేంజో. అలా గంటన్నర పాటు ఊళ్ళో తిరిగిన తర్వాత నన్ను నా హోటల్ దగ్గర దిగబెట్టాడు. ఆ సాయంత్రం అతనితో ఎంతో చక్కగా గడిచింది. అతనికి తన ఇంగ్లిష్ ప్రాక్టీస్ అయింది. నాకు ఆ ఊరి గురించి చక్కగా వివరించి చూపించగల స్థానికుని సాహచర్యం లభించింది. ఉభయతారకం.

నా సామాన్ల ఆచూకీ ఇంకా దొరకనే లేదు. అబియాంకా ఎయిర్‌లైన్స్ నుంచి ఏమన్నా ఫోన్ కాల్ వస్తే వాళ్ళకి నేను వెళ్ళిపోయానని, తిన్నగా నాకే ఫోన్ చెయ్యమని చెప్పమనీ హోటల్ వాళ్ళకి చెప్పాను.

మర్నాటి ఉదయం ఆరున్నరకల్లా కోస్తా రీక లోని సాన్ హొసే వెళ్ళే బస్సు పట్టుకోవాలి. అంచేత వెంటనే నిద్రకు ఉపక్రమించాను.