దుబాయ్ నుంచి మస్కట్ నాలుగువందల ఏభై కిలోమీటర్లు.
అక్కడి వేగాల ప్రకారం ఐదారుగంటల ప్రయాణమే గానీ మధ్యలో దేశాల సరిహద్దులు ఇమిడివున్నాయి గాబట్టి అక్కడో ఒకటి రెండు గంటలు పడుతుందట. రాత్రి పదకొండు గంటలకు దుబాయ్‌లో బయలుదేరిన బస్సు ఉదయం ఆరూ ఏడూ మధ్య మస్కట్ చేరుతుందట.
ఇప్పటివరకూ ఏడెనిమిది దేశాలు వెళ్ళినమాట నిజమే గానీ భూతలమార్గంలో సరిహద్దులు దాటడం అదే నాకు మొదటిసారి. అలాగే ఈమధ్య పదిహేను ఇరవై ఏళ్ళుగా ఏ దేశం వెళ్ళినా, ఏ నగరం వెళ్ళినా అక్కడ ఎవరో ఒకరు స్నేహితులో బంధువులో ఉండటం, బాగోగులు చూడటం అలవాటయిన ప్రాణానికి ఒమాన్ దేశంలో-ఎవరూ తెలియని దేశంలో-నాల్రోజులు ఉండాలిగదా అన్న చిన్నపాటి బెరుకు. ఎవరూ లేకపోతే ఏమయిందీ? పైగా అక్కడ భాషా సమస్య కూడా ఉండదు గదా. ఇన్నిన్ని ప్రయాణాలు చేశాక బెంగపడటం ఏమిటీ అన్న ఆలోచన మరోవేపు ధైర్యం చెపుతోంది.
మస్కట్‌లో ముందు అనుకొన్నది పన్నెండు మధ్యాన్నానికల్లా చేరి, రాత్రి వరకూ ఊరు చూసి, పదమూడు పొద్దున్నే సలాలా బస్సు పట్టుకుందామని. ఆ ప్రకారమే ఎయిర్ బీ&బీలో రూము బుక్ చేసుకొన్నాను. పన్నెండో తారీఖు దుబాయ్‌లోనే ఉండిపోవలసి వచ్చింది గాబట్టి ఇహ ఆ ఏర్పాటు పోయినట్టే అనుకొన్నాను. కాస్త స్థిమితంగా ఆలోచిస్తే ఆ బుకింగ్ పదమూడు మధ్యాహ్నం దాకా ఉంటుంది గదా, ఉదయం బస్సు దిగగానే అక్కడికి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి సామానక్కడే ఉంచేసి పగలంతా తిరిగివచ్చి సామాను తీసుకొని సలాలాకు రాత్రి బస్సు ఎక్కే వీలు ఉంటుంది గదా అనిపించింది. నేను బుక్ చేసిన ఎయిర్ బీ&బీ నిర్వాహకుని పేరు రూపేష్. అతనికి మెసేజ్ పెట్టాను. ‘నో ప్రోబ్లమ్. ఉదయం రావచ్చు. మధ్యాన్నం దాకా గది మీ అధీనంలో ఉంటుంది’ అన్నది అతని సమాధానం. ఆశ పెరిగిపోయి ‘సాయంత్రం అయిదుగంటలదాకా గది ఉంచుకోవచ్చునా… ప్లీజ్’ అని మరో మెసేజి పంపాను. ‘పర్లేదు. ఇంకేం బుకింగ్‌లు లేవు. ఉండొచ్చు’ అని రూపేష్ సమాధానం. ఏనుగెక్కినంత సంబరం.
దుబాయ్ మస్కట్ బస్సు ప్రయాణం మూడు కునుకులు నాలుగు మెలకువలుగా సాగింది.
ఒమాన్ సరిహద్దు దుబాయ్ నుంచి నూటయాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. రెండు గంటలు. సరిహద్దుకు ఇరవై పాతిక కిలోమీటర్ల ముందే హట్టా అన్న చిన్న పురాతన పట్టణం. అది కొండల మధ్యన ఉండటం వల్ల కాబోలు, అక్కడికి చేరగానే చలి మొదలయింది. సరిహద్దుకు ఇవతల ఒక కార్యాలయం. కొన్ని కాగితాల పరిశీలనలు, కొన్ని చెల్లింపులు, కస్టమ్స్‌వారి లాంఛనపు తనిఖీ. యు.ఎ.ఇ. నుంచి బయటకు వెళ్తున్నాం గాబట్టి ఎగ్జిట్ ఫీజు ఉంటుందట. ఇరవయ్యో నలభయ్యో దిర్హమ్‌లు. ఇది రహదారి యాత్రీకులకే ప్రత్యేకమట-విమానంలో వెళితే ఉండదు! అక్కడే ఒమాన్ అధికారుల వీసాల తనిఖీ, స్టాంపింగు. మళ్ళీ సరిహద్దు దాటి ఓ ఇరవై నిముషాలు వెళ్ళాక మరోసారి తనిఖీ. ఒక్కో తనిఖీకీ రెండు మూడు క్యూలు. అరగంటా గంట… అంతా ముగిసేసరికి నిద్ర కొండెక్కింది. గడియారం మూడు కొట్టేసింది! పనిలో పని అని రెండో చెక్‌పాయింట్ దగ్గర డాలర్లు మార్చి ఒమానీ రియాల్స్ తీసుకొన్నాను. ఒక్కో రియాల్ విలువ మన నూటతొంభై రూపాయలు. మళ్ళా ఒక్కో రియాల్‌కూ వెయ్యి బైసాలు. అంటే ఒక్కో బైసా మన పందొమ్మిది పైసలకు సమానం అన్నమాట.
తెలతెలవారుతూ ఉండగా బస్సు మస్కట్ నగర శివార్లలోకి ప్రవేశించింది. విశాలమైన సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మాస్క్ ప్రాంగణం పక్కనుంచి సాగిపోయింది. ఆబు దాబీ గ్రాండ్ మాస్క్ యు.ఎ.ఇ.కి ఎలానో ఈ ఖబూస్ మాస్క్ ఒమాన్‌కు అలా అట. ఈ రెండు మసీదుల నిర్మాణమూ దాదాపు ఒకే సమయంలో జరిగిందనుకొంటాను. నిజానికి మస్కట్ వచ్చినవాళ్ళు ఈ మసీదు చూడకుండా వెళ్ళరు. నాలాగా చూడకుండా వెళ్ళేవాళ్ళు బాగా అరుదు.
‘మస్కట్ నగరమంతా మన వైజాగ్‌లా ఎత్తుపల్లాలు, చుట్టూ కొండలూ ఉంటాయి. మీరు ఇష్టపడతారు’ అని రాజేష్ ముందే చెప్పాడు. అదిగో అలాంటి నగరమే మెల్లగా కళ్ళముందు విప్పుకోసాగింది. ఆరూ ఆరున్నరకల్లా ఊరుకు బాగా పెడగా ఉన్న బస్టాండులో దించింది మా దుబాయ్ బస్సు.
‘బస్టాండు నుంచి సిటీ సెంటరు పదిహేను కిలోమీటర్లుంటుంది. షేర్‌డ్ టాక్సీలు దొరుకుతాయి. మీరు ఆడే బేరాలబట్టి మూడునాలుగు రియాళ్ళు ఖర్చవుతుంది. ఓపిక ఉంటే బస్సూ పట్టుకోవచ్చు’ అన్నది నేను అప్పటికే సంప్రదించిన అనుభవజ్ఞుల సలహా. నిద్రలేని రాత్రి ప్రయాణం పుణ్యమా అని బస్సు ఆలోచన పెట్టుకోలేదు. నాతోపాటు దిగిన ఓ కేరళ పెద్దాయన, మరో స్థానిక ఒమానీయుడూ–ముగ్గురం కలసి టాక్సీ ఎక్కాం. తలా మూడు రియాళ్ళు.
నే బుక్ చేసిన ప్రదేశం రూవీ స్ట్రీట్‌లో ‘రూవీ రౌండ్ఎబౌట్’కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో మస్కట్ మల్టీయూనిట్ న్యూ బిల్డింగ్‌లో అయిదో అంతస్తులో అని రూపేష్ చెప్పాడు. ఆ భవనం పక్కనే పెట్రోలు పంపు ఉంటుందని గుర్తు చెప్పాడు. ఒక నెంబరూ పాడూ లేకుండా ఆ అరకొర అడ్రసుతో గమ్యం ఎలా చేరాలా అని సంశయం. పైగా టాక్సీ అతనికి ఇంగ్లీషు రాదు. ఉర్దూ కూడా పొడిపొడి మాటలు. నా సహయాత్రికుల సహాయంతో టాక్సీ చోదకుడికి గమ్యం గురించి వివరించి ‘దరిచేర్చే భారం నీదే మహానుభావా’ అని చెప్పి నింపాదిగా కూర్చున్నా. మొత్తానికి క్షేమంగా గమ్యం చేర్చాడా వాహన చోదకుడు.
ఎయిర్ బి&బి బుక్ చెయ్యడమంటే చేశానేగానీ ఆ పద్ధతిలో వసతి చూసుకోవడం నాకు అదే మొదటిసారి. నాకు అలవాటయిన హోటళ్ళకు, యూత్ హాస్టళ్ళకూ భిన్నమైన శైలిలో ఈ వ్యవహారం ఉంటుందని విని ఉన్నాను. సరే ఆ సాహసమూ చేసి ఆ అనుభవమూ పొందుదాం అని బుక్ చేశాను. అయినా మనసు బిక్కుబిక్కుమంటూనే ఉంది. నే వెళ్ళవలసిన భవనం అదే అని అక్కడి పెట్రోల్ బంక్‌లో అడిగి మరీ నిర్ధారించుకొని, అయిదో అంతస్తుకు వెళ్ళి, ఓ ఎపార్టుమెంటు ముందు నిలబడి, సందేహిస్తూనే బెల్లు కొట్టాను. ఓ మధ్యవయసు ఫిలిప్పీన్స్ మహిళ తలుపు తెరచింది. ‘రూపేష్’ అని గొణిగాను. ‘అవును. ఇదే. రండి,’ అని తలుపు తెరచారావిడ. అక్కడ ఆమె పాత్ర ఏమిటో బోధపడలేదు. ఎందుకైనా మంచిది అని ‘నాకు ఈ పద్ధతితో ఇదే మొదటి పరిచయం. ఫార్మాలిటీలూ అవీ తెలియవు’ అన్నాను. ఆమె నవ్వేసి, ‘మరేం పర్లేద’ని భరోసా ఇచ్చి, నా గది, వంటగదీ చూపించి, ‘మరి నేను ఆఫీసుకు వెళిపోతాను. మీరు బయటకు వెళ్ళేటపుడు తాళం మీతో తీసుకువెళ్ళండి. సాయంత్రం ఖాళీ చేస్తున్నపుడు తలుపు క్రింద నుంచి తోపలికి తోసి వెళ్ళండి. ఇంకేమైనా వివరాలూ అనుమానాలూ ఉంటే ఇదిగో నా ఫోన్నెంబరు. నాకు గానీ రూపేష్‌కు గానీ ఫోనుచెయ్యండి’ అన్నారావిడ. గంట ఎనిమిది కొట్టింది.
కాలకృత్యాలు. వంటిల్లు వాడి రెండు వేడివేడి కాఫీలు. బ్రెడ్డు కనపడితే సంశయలాభం నాకే ఆపాదించుకొని దానితో బ్రేక్‌ఫాస్టు. తొమ్మిదికల్లా ఊరిమీద పడ్డాను.
చెయ్యవలసిన మొట్టమొదటి పని సలాలాకు టికెట్టు కొనడం. రూవీ బస్టాండ్ దగ్గర, సుల్తాన్ ఖబూస్ మసీదు వెనక, గల్ఫ్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీవాళ్ళ ఆఫీసు ఉంటుందని, వాళ్ళ ప్రైవేటు బస్సులు సాయంత్రం ఏడింటికి బయల్దేరి మర్నాటి ఉదయం ఏడింటికి సలాలాలో దింపుతాయనీ నేను సేకరించిన సమాచారం. అంచేత ఆ రూవీ బస్టాండ్ ఎక్కడా అని వాకబు చేశాను. ‘ఇక్కడ్నించి షేర్‌డ్ టాక్సీ పట్టుకో. రెండొందల బైసాలిస్తే రూవీ రౌండ్ఎబౌట్‌లో దింపుతుంది. అక్కడ్నించి అంతా కలిసి అరకిలో మీటరు’ అన్నది పెట్రోలు పంపువాళ్ళ సలహా. రౌండ్‍ఎబౌట్ దగ్గర మరో తెనాలి మనిషి తటస్థపడితే అతని సహాయం తీసుకొని ఆ బస్సు కంపెనీవాళ్ళ ఆఫీసు, ఏడు రియాళ్ళు చెల్లించి సలాలా టికెట్టు. ఏ రకంగా చూసినా వెయ్యి కిలోమీటర్ల దూరాన ఉన్న సలాలాకు ఆ టికెట్టు బాగా చవక కిందే లెక్క!
టికెట్టు కొనీకొనగానే సలాలాకు ఫోను చేసి పాటిబండ్ల హరికృష్ణ అన్న నేనెరుగని నా మిత్రునికి ఆ సంగతి చెప్పాను. ‘సాయంత్రం బస్సు ఎక్కాక, అది బయల్దేరాక మరోసారి ఫోను చెయ్యండి. బస్సు నంబరు చెప్పండి,’ అన్నాడతను. ఈ హరికృష్ణ మా దుబాయ్ రాజేష్‌కు ఫేస్‌బుక్ స్నేహితుడు! ‘మీరు తప్పకుండా సలాలా వెళ్ళాలి’ అని సిఫార్సు చేసినపుడే ‘అక్కడ నాకు హరికృష్ణ అన్న స్నేహితుడు ఉన్నారు. మీ ట్రిప్పు సవ్యంగా సాగేలా సాయం చేస్తాడు’ అని చెప్పాడు రాజేష్. బావుంది అనుకొన్నాను. ‘అలా అయితే మరి హరికృష్ణగారిని నాకు హోటల్ కూడా బుక్ చేసిపెట్టమనగూడదా’ అన్నాను రాజేష్‌తో. రాజేష్ అతడిని సంప్రదించాడు. ‘హోటలు అవసరం లేదంటున్నాడు హరికృష్ణ. మీరు అతనికి ఫేస్‌బుక్ ద్వారా తెలుసునట. ఆ రెండు రోజులూ వాళ్ళింట్లోనే ఉండమంటున్నాడు’ అన్నాడు రాజేష్. ఎంతైనా జుకర్‌బర్గ్ మహామహానుభావుడు!
మస్కట్‌లో వసతి, సలాలాకు టికెట్టులాంటి ముఖ్యమైన కార్యాలు ముగిశాయి కాబట్టి ఇహ మిగిలిన ఆరేడు గంటలూ ఊరితో అనుబంధం ఏర్పరచుకొనే దిశగా గడపాలని అనుకొన్నాను. నే ఉన్న రూవీ బస్టాండ్ ప్రాంతం ఊరికి ఒకానొక కేంద్రబిందువే గానీ యాత్రికులు చేరి తీరవలసింది ఆ నగరపు సాగరతీరం అని విని ఉన్నాను. అది అక్కడికి ఐదారు కిలోమీటర్లు. ఒక రియాల్ చెల్లించేటట్టు టాక్సీ మనిషితో బేరం కుదిరింది.
టాక్సీ నగరపు ముఖ్యమార్గాలగుండా సాగింది.
వెంఠనే దుబాయ్‌కీ మస్కట్‌కూ మధ్య ఉన్న తేడా కళ్ళకు కట్టినట్టు కనిపించింది. దుబాయ్ నగరం ఎగువ తరగతి అట్టహాసానికి ప్రతీక అయితే మస్కట్‌ది మధ్యతరగతి మందహాసం. దుబాయ్ రోడ్లమీద కారులో వెళుతోంటే ఆ విశాలమైన రోడ్లూ, ఎత్తైన భవనాలూ, అడుగడుగునా తారసపడే ఫ్లైవోవర్లూ పుణ్యమా అని ఏదో ఆకాశయానం చేస్తున్నట్టు అనిపిస్తుండి. మస్కట్‌లో రోడ్లు పోల్చి చూస్తే చిన్నవి. భవనాలు ఆకాశంలోకన్నా నేలవేపే చూపు ఉన్నవి. నగరపు నైసర్గిక సౌందర్యాన్ని అడ్డుకొని హరించేటంత ఎత్తుపాటి భవనాలు కట్టరాదని, నగరపు నలుమూలలా కనిపించే పర్వతాల దృశ్యాలను భవనాలు అడ్డుకొని సౌందర్యహాని కలిగించగూడదనీ అక్కడి శాసనమట! అంచేత అక్కడి టాక్సీ ప్రయాణం నేలమీది పరుగు అనే అనిపించింది. మళ్ళా అలా అని ఒమాన్ బీద దేశమేం కాదు. ఇసుకలోంచి తైలాన్ని పిండి వృద్ధి చెందిన అరేబియన్ గల్ఫ్ దేశాలలో ఒమాన్ కూడా ఒకటి. తలసరి ఆదాయంలో దుబాయ్‌తో సరితూగకపోయినా షార్జాకు దీటుగా నిలుస్తుంది. 1960లలో తైలపు వనరులు బయటపడ్డాక తనదైన బాణీలో ఆ సంపదను దేశపు సర్వతోముఖాభివృద్ధికి వినియోగించి గణనీయమైన మార్పు సాధించిందట. అందుకు సూత్రధారి ఏభై ఏళ్ళు పరిపాలించి నెలక్రితమే మరణించిన సుల్తాన్ ఖబూస్ అని, ఆయనను ఒమానీయులు జాతిపితగా పరిగణిస్తారనీ విన్నాను. భారతదేశం అంటే సుల్తాన్ ఖబూస్‌కు ఎంతో ఇష్టమని, ఆయన మనదేశంలో చదువుకొన్నాడని, శంకర్‌దయాళ్ శర్మ శిష్యుడని, రెండు దేశాల మధ్య చక్కని సంబంధాలకు అతని చొరవే కారణమనీ విన్నాను.
రాజకీయంగా ఇపుడు ప్రపంచపటం మీద ఒమాన్ అంత చురుగ్గా లేకపోయినా పదిహేడూ పంధొమ్మిదీ శతాబ్దాల మధ్య అరేబియా ద్వీపకల్పంలోను, ఆఫ్రికా తూర్పుతీరమంతటా ఒమాన్ ప్రభ బాగా వెలిగిందట. వాస్కోడిగామా ప్రాచ్యదేశాలకు సముద్రమార్గం కనిపెట్టిన జోరులో ఆ సమయంలో పోర్చుగీసువారు అప్రతిహతంగా సాగించిన వాణిజ్య రాజకీయాల హోరులో మస్కట్ ప్రాంతం 1507 నుంచి 1690 దాకా పోర్చుగీసు పాలనలో ఉందట. ఆ తర్వాత వాణిజ్యపరంగా తనకున్న భౌగోళిక వెసులుబాటుకు చురుకైన పాలకుని సమర్థత తోడవగా ఓ రెండువందల ఏభై ఏళ్ళపాటు బ్రిటన్, పోర్చుగల్ లాంటి బలమైన ఐరోపా శక్తులతో ఆధిపత్యపు పోటీలలో దీటుగా నిలబడి అందరికన్నా ముందుగా ఉండేదట. 1830లో తన రాజ్యానికి ముఖ్యకేంద్రంగా నాలుగయిదు వేల కిలోమీటర్ల దక్షిణాన ఉన్న జాంజిబార్ ద్వీపాన్ని ఎంచుకొని అప్పటి సుల్తాన్ అక్కడే తన రాజప్రాసాదాన్ని నిర్మించాడట! ఆఫ్రికా తూర్పుతీరాన్ని, పర్షియాదేశపు దక్షిణప్రాంతపు చిరుభాగాన్ని, బెలూచీస్థాన్‌లోని గ్వాడర్ రేవు ప్రాంతాన్నీ తన వలసలుగా చేసుకొందట. ఇరవయ్యో శతాబ్దం వచ్చేసరికి అనేకానేక కారణాలవల్ల ఒమాన్ కూడా ఆంగ్లరాజ్య ఆధిపత్యంలోకీ, రక్షణలోకీ వెళ్ళింది. 1970లో ఆ ఆధిపత్యం తొలగి ‘సుల్తనేట్ ఆఫ్ ఒమాన్’ అన్న స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం పొందింది. మూడు లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం-అంటే ఆంధ్రప్రదేశ్‌కు రెట్టింపు-కానీ జనాభా మాత్రం ఏభై లక్షలు; అందులో ఇరవై లక్షలు ఎక్స్‌పాట్స్.
మాటల్లోనే సముద్రం ఒడ్డున దింపాడు టాక్సీ మనిషి. ‘ఫిష్ రౌండెబవుట్’ అన్న ప్రదేశమిది. ‘ఇక్కడ్నించి మీరు సముద్రం ఒడ్డమ్మటే వెళ్ళండి. అయిదు కిలోమీటర్ల తర్వాత సుల్తాన్‌గారి రాజసౌధం వస్తుంది. ఈ లోపల ఒకటిరెండు కోటలు, బీచ్‌లు, పార్కులు, రోడ్డుకు అటుపక్కన ఆఫీసులూ మార్కెట్లూ–ఊరంతా కనిపించేస్తుంది. ఆల్ ది బెస్ట్’ అని చెప్పివెళ్ళాడు ఆ ఫ్రెండ్లీ డ్రయివరు.
ఎడమపక్కన ఓడరేవు, ఎదురుగా అర్ధచంద్రాకారంగా వంపుతిరిగిన సముద్రతీరం. అటుచివర ఏదో కొండమీద భవనాలు- కాస్తంత బొంబాయి నారీమన్ పాయింట్ దగ్గర నిలబడి మలబార్ హిల్స్ వైపు చూపు సారించినట్టు అనిపించింది. పదిగంటలవుతోంది కదా, ఎండ ఊపందుకొంది. మరి ఒక రోజు ఆ ఎడారి ఎండను నాలోకి ఇంకించుకోవాలన్నమాట.
ముందుకు సాగాను. ‘కాస్తంత బిజీగా ఉందే’ అని ముందు అనిపించినా ఆ సముద్రతీరపు అల్‌బహ్రీ రోడ్డు మస్కట్ నగరానికి సరి అయిన కంఠాభరణమని మెల్లగా అర్థమయింది. ఎడమవేపున సాగర జలాలు, వాటిలో సీగల్స్- కుడివేపున ఏవేవో భవనాలు, ఆఫీసులు. పనిరోజు కావడంవల్లనేమో, పర్యాటకులు యాత్రికులు దాదాపు లేరు. అయినా అంత ఎండలో నాలాంటి కొత్త బిచ్చగాళ్ళు తప్ప ఎవరొస్తారూ? ఒక యువ స్థానిక జంట. వారితో కాసేపు ఫోటో కబుర్లు. రోడ్డుదాటి ఓ టీ దుకాణంలో పావుగంట. స్థానిక టూరిస్టు టాక్సీ డ్రయివరుతో మాటలు… ‘నాలుగ్గంటల్లో ఊరంతా తిప్పి చూపిస్తాను. పదిహేను రియాళ్ళివ్వు చాలు’ అతని ఆశ. నిజంగా టాక్సీ తీసుకోవాలంటే అందులో సగం చాలని తెలుసు. మెల్లగా అతనితోపాటు చేరిన ఇతర టాక్సీ డ్రైవర్ల వంతపాట… అప్పటిదాకా మృదువుగా తిరస్కరిస్తూవచ్చినవాడిని కాస్తా వాళ్ళ వత్తిడి ఎక్కువయ్యేసరికి ఇహ లాభంలేదని ‘నాకు టాక్సీ తీసుకొనే ఆలోచన లేదు’ అని ఖరాఖండీగా చెప్పడం… చిన్నబోయిన అతగాడి మొహం. అయ్యోపాపం అనిపించడం.
పక్కనే వరసాగా బ్యాంకులు కనిపించాయి. ‘మనీ ఎక్స్‌ఛేంజ్ సదుపాయం ఉంది’ అంటూ పెద్దపెద్ద బోర్డులు. నా దగ్గర మిగిలివున్న దిర్హమ్‌లు మార్చుకుండామని అటువేపు అడుగువేశాను. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న బోర్డు కనిపించింది. లోపలికి వెళ్ళాను. కౌంటర్లో ఓ ఫ్రెండ్లీ మనిషి- కాస్తంత కబుర్లలో పెట్టాను. రెండుమాటలు మాట్లాడగానే కబుర్లు తెలుగువేపుకు మళ్ళాయి! అతగాడు హైదరాబాదు పాతబస్తీ మనిషి! అలీ అతని పేరు.
‘ఏవిటిలా వచ్చారూ?’ అని అడిగాడు. టూకీగా నా యాత్ర వివరాలు చెప్పాను. అవి విని అతనిలో గొప్ప ఉత్తేజం. పనిచేసుకొంటూనే మధ్యమధ్య కబుర్లు. ఊరు గురించి సలహాలు. బస్సులూ టాక్సీల గురించి స్థానికులకే తెలిసే ‘రహస్యాలు’. ‘పక్కనే చక్కని కేరళ రెస్టారెంటు ఉంది. భోజనం చాలా బావుంటుంది. లంచ్‌కి ఇక్కడికే రండి’ అన్న సలహా. ‘ఇక్కడ బ్యాంకులో దాదాపు పని అంతా మనదేశం నుంచి వచ్చిన వలస ఉద్యోగుల సంపాదనను వారివారి కుటుంబాలకు పంపడమే’ అన్న వివరం. ‘మళ్ళీ తప్పకుండా రండి, లంచ్ సమయంలో తీరిగ్గా ఉంటాను’ అన్న ఆత్మీయ ఆహ్వానం. ఒక మంచిమనిషిని కలిసిన గొప్ప సంతోషంతో బ్యాంకు నుంచి బయటపడ్డాను.
పక్కనే ఆకట్టుకొనే మసీదు. కొంచం లోపలికి వెళితే సౌఖ్‌లు ఉన్నాయన్న సూచన. కానీ ఉన్న సమయమంతా సాగరతీరపు నడకలోనే గడపాలని, రాజసౌధం దాకా వెళ్ళాలనీ నా కోరిక… అతికష్టం మీద సౌఖ్‌లవేపు వెళ్ళాలనే కోరికను అరికట్టుకొన్నాను. ‘వెళితే నగరపు స్పందన తెలుస్తుందోయ్’ అని వివేకం చెపుతోన్న సలహాను పెడచెవిన పెట్టాను. ముందుకువెళ్ళేకొద్దీ జనసమ్మర్థం తగ్గింది. కుడివేపున షాపుల స్థానంలో పచ్చికబయళ్ళు వచ్చి చేరాయి. ఒకరిద్దరు యూరోపియన్ టూరిస్టులు. వాకబు చేస్తే ఇటలీదేశపు సీనియర్ సిటిజన్లని తేలింది. వారికి గైడ్‌గా ఓ స్ఫురద్రూపపు స్థానికుడు. సంప్రదాయ వస్త్రధారణతో. వారి మార్గమూ, నా మార్గమూ ఒకటే అవడం, వారి వేగమూ నా వేగమూ సరితూగడంతో ఒకరికొకరం పదేపదే తారసపడ్డాం. చూపులు కలిశాయి. నవ్వులు విరిశాయి. మాటలు సాగాయి. గల్ఫ్ దేశాలకు రావడం ఇదే మొదటిసారట. ‘దుబాయ్ హడావుడి కన్నా ఇక్కడి నింపాదితనం బావుంది.’ ఆవిడ భావ ప్రకటన. ‘దుబాయ్‌లో కూడా కాస్త వెదికితే ప్రశాంత జలతీరాలు దొరక్కపోవు.’ నిన్నటి క్రీక్‌పార్క్ జ్ఞాపకాల నేపథ్యంలో నా అప్రస్తుత వ్యాఖ్య. ఇండియాను గురించి వారి వాకబు. నాకు తెలిసిన వివరాలు నేను పంచుకోవడం. వికసించిన సౌభ్రాతృత్వంతో ఒక మినీ ఫోటో సెషన్! మా క్షణకాలపు చిరుస్నేహాలకు ప్రతీకలా అక్కడ నిలబెట్టిన ఒ చక్కని మీనమిథునపు శిల్పవిశేషం మా ఫోటోలకు నేపథ్యంగా నిలచింది. స్నేహసాఫల్యం పుణ్యమా అని భుజాలమీద చేతులు వేసుకొని భాయి భాయి అంటూ ఫోటోలు దిగడం. ‘ఇవి చూసి మీ ఆవిడ కోప్పడదా?’ ఆమె కవ్వింపు. ‘మస్కట్‌లో కలసిన ఇటలీ చెల్లి అని చెపుతాను’ నా జవాబు. నిజానికి పరాయివాళ్ళను అన్నా అక్కా అమ్మా చెల్లీ అనడం నా తత్వానికి విరుద్ధం. కానీ ఆవిడ కవ్వింపుకు సరిసమాధానం ఇవ్వాలిగదా… చిరుమందహాసంతో నావేపు ప్రశంసాపూర్వకమైన దృక్కులు సారిస్తోన్న ఆవిడ ఇటలీ దొరగారు.
అప్పటిదాకా రోడ్డుకు కుడి పక్కన ఉన్న సముద్రతీరం రాళ్ళూ బండలతోను, కెరటాల ఉరవడిని ఆపటం కోసం వేసిన పెద్ద పెద్ద కాంక్రీటు శిలలతోనూ నిండివుంది. దిగి కాళ్ళు తడుపుకొనే వీలే లేదు. ఫిష్ రౌండ్‍అబౌట్ నుంచి ఆడుతూ పాడుతూ గంటాగంటన్నర ముందుకు సాగాక బొంబాయిలోని చౌపాటీ బీచ్‌లాగా చిన్నపాటి ఇసుక నిండిన సాగరతీరం కనిపించింది. అప్పటిదాకా ఏదో అందుకోసమే వెదుకుతున్న మనిషిలాగా హమ్మయ్య అనుకొని, బూట్లు విప్పి, కాళ్ళు తడుపుకొని–ఓ పది నిముషాలు. దాని పేరు ముత్రా కార్నిష్ బీచ్ అని, రోడ్డు వదిలి మరికాస్త లోపలికి వెళితే ఆ ప్రదేశంలో మరికొన్ని ఆకట్టుకొనే ప్రదేశాలు ఉన్నాయనీ అక్కడి సైన్‌బోర్డులు చెప్పాయి. అలాగే రోడ్డు క్రాస్ చేసి వెళితే కుడివేపున చిరుకొండ మీద కనిపిస్తోన్న ముత్రా కోట. ఎక్కడానికి కాలిబాట ఉందని దారి గుర్తులు. టైము లేదులే అనేసుకొన్నాను.
బీచ్ వదిలి రోడ్డు ఎక్కుతోంటే చూడగానే తెలుగువాళ్ళు అని అతి స్పష్టంగా తెలిసిపోతోన్న ముగ్గురు మధ్యవయస్కులు కనిపించి ఆశ్చర్యపరచారు. నిజమే. ఒకరిది విజయవాడ, ఇంకొకరిది గొల్లపల్లి, మూడో ఆయనది తెనాలి. ఏదో వ్యాపారపు పనులమీద వచ్చారట. వారితో కాసేపు కబుర్లు. ఫోటో సెషన్!
మరో నాలుగడుగులు వేసీ వెయ్యగానే సువిశాలమైన పార్కు కనిపించింది. తీర్చిదిద్దిన పచ్చికబయళ్ళు. ఖర్జూరపు చెట్లు. మధ్యలో పెద్ద పెద్ద పానపాత్రల్లోంచి నీళ్ళు పొంగిపొరలి వస్తున్నట్లుగా అమర్చిన ఫౌంటైను. ఆహ్లాదకరంగా అనిపించింది. ఒకపక్క చిన్నపాటి రెఫ్రెష్‌మెంటు స్టాలు, టాయ్‌లెట్ కాంప్లెక్స్, కుడివేపున సముద్రంలోకి కాస్తంత చొచ్చుకుపోయిన భూభాగం, ఆ భూభాగంలో మరికాస్త ముందుకువెళ్ళి సముద్రాన్ని చూడటానికి అనువుగా కట్టిన అబ్జర్వేషన్ పాయింటు. ఎడమవేపున ఏదో ఒంటరి మత భవనం. ఏవో పేరు తెలియని పెద్ద వృక్షాలు రెండు. సహజంగానే అక్కడో పావుగంటా ఇరవై నిముషాలు.
అబ్జర్వేషన్ పాయింట్ దగ్గర నిలబడితే ఎటుచూసినా సముద్రమే! అప్పటిదాకా దారిపొడవునా మస్కట్ రేవుకు చెందిన క్రేన్లూ జెట్టీలూ కనిపిస్తూ అదంతా స్థానిక జలనిధిలానే అనిపించింది. ఇక్కడ అనంత జలరాశి కనిపించగానే ‘అవును, నేను ఇపుడు అరేబియా సముద్రాన్ని చూస్తున్నాను. ఇన్నేళ్ళుగా బొంబాయి, గోవా, కోవలం లాంటి చోట్ల చూసిన అరేబియా సముద్రాన్ని ఇప్పుడు అవతలిగట్టున నిలబడి మస్కట్ నుంచి చూస్తున్నాను!’ అన్న భావన. ఏదో తెలియని సంతోషం. ఈ జలాలు దాటుకొని వెయ్యిమైళ్ళు వెళితే భారత భూభాగమే కదా అన్న ఎరుక. సంతోషం.
ఆ అబ్జర్వేషన్ పాయింట్ వదిలి వచ్చానే గాని ఆ ప్రదేశాన్ని అంత తొందరగా విడిచిపెట్టాలంటే మనసు ఒప్పుకోలేదు. అక్కడున్న వృక్షపు కాండం దగ్గర కూర్చోడానికి అనువుగా కట్టిన చప్టామీద చేరగిలబడి సముద్రంకేసి చూడసాగాను. గమనించే లోపే నా పక్కన మరో మనిషి వచ్చి చేరాడు. పక్కనున్న మతభవనం నుంచి వచ్చినట్టున్నాడు… అతగాడు టూరిస్టులా లేడు. టూరిస్టుల గైడ్‌లానూ లేడు. స్థానికుడిలా ఉన్నాడు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్నాడు. నలిగిన బట్టలు, వడలిన ముఖం, కాస్తంత మాసిన గడ్డం, స్థూలకాయం. కానీ మనిషిని చూడగానే గౌరవభావం కలిగేలా ఉన్నాడు. వయసులో నాకన్నా చిన్నవాడే అయివుండాలిగానీ అనుభవాల భారం వల్ల కాబోలు కాస్తంత కుంగినట్టుగా అనిపించాడు. ఎందుకో అజ్ఞాతవాసపు ధర్మరాజు గుర్తొచ్చాడు. చూడగానే అనిపించింది–మాటలు కలపడానికి వచ్చాడని.
నిజమే, మాట కలిపాడు. కుశలమడిగాడు. నా ప్రయాణం వివరాలు చెప్పించుకొని విన్నాడు. ‘బంగ్లాదేశా?’ అని అడిగాడు. ‘నాకున్న అనుభవాల ప్రకారం మీ ప్రాంతం నుంచి వచ్చినవాళ్ళలో బంగ్లాదేశ్‌వాళ్ళు అత్యంత సజ్జనులు’ అన్న కితాబు ఇచ్చాడు. మన పొరుగువారి గురించి ఆ మాట వినడం సంతోషమనే అనిపించింది. ‘ఏంచేస్తూ ఉంటారూ?’ అని అడిగాను. కాస్సేపు ఆలోచించి ‘ఎన్నో చేశాను. లెక్కప్రకారం ఇపుడు బిజినెస్‌లో ఉన్నట్టు లెక్క. కానీ ఆ పనుల్లోకి పెద్దగా వెళ్ళడంలేదు. ఫామిలీ బిజినెస్‌లో నలభై ఏళ్ళు గడిపాను. ఇక ఆ చీకాకులకు దూరంగా, నాకు తోచిన రీతిలో బతకాలని ప్రయత్నం’ అన్నాడు. దగ్గరివారితోనే విబేధాలు వచ్చిన జాడ తెలుస్తోంది. ఇంకా ఆ వివరాల్లోకి వెళ్ళడం సబబుగాదని అనిపించింది. నాకు తోచిన ఉపశమన పదాలు, సమయోచిత అనుభవాలూ అతనితో పంచుకున్నాను. విడివడినపుడు అతని మనసులోని భారం నాకు కాస్త బదిలీ అయినట్లు అనిపించింది. అది ఒకరకమైన సంతృప్తికే దారితీసింది.
మిగిలిన కార్యక్రమం గురించి ఒకసారి గూగుల్‌ను సంప్రదించాను. రాజసౌధం ఇంకా మూడు కిలోమీటర్ల దూరాన ఉందని, ఆ సౌధానికి ఎదురుగానే నేషనల్ మ్యూజియం ఉందనీ గూగుల్ చెప్పింది. ఇహ ఎక్కడా ఆగకుండా వెళ్ళాలి అనుకొంటూ నడక సాగించాను. పాలెస్ దగ్గరపడేసరికల్లా ఒక చిన్నపాటి గ్రామం, అందులోని నీలిరంగు మసీదూ కనిపించాయి. కాసేపు ఆపాయి. అది అలనాటి మస్కట్ పాతపట్నం అని అక్కడి వివరాలు చెప్పాయి. దారిలో కనిపించిన రెండు చక్కని ప్రవేశద్వారాలు నే చేరబోయే సౌధపు గాంభీర్యానికి నాందీప్రస్తావన చేశాయి. గంటగడిచేసరికల్లా ఆ అల్ ఆలం పాలెస్ ముందు, ఒక విశాలమైన రౌండ్ ఎబౌట్ దగ్గరకు చేరాను.
నీలీ బంగారు రంగుల స్థంభాలతో ఆకర్షణీయంగా కనిపించే ఆ పాలెస్ ఒమాన్ సుల్తాన్‌గారు ముఖ్యమైన అతిథులను కలుసుకోడానికి, ముఖ్యమైన కార్యక్రమాలు జరపడానికీ వేదికగా ఉపయోగిస్తారట. భవనపు మొదటి గేటుదాకా రాజమార్గంలో నడచివెళ్ళొచ్చు. ఫోటోలు తీసుకోవచ్చు. భవన ప్రాంగణంలోకి మాత్రం టూరిస్టుల్ని అనుమతించరు!
ఎదురుగా ఉన్న నేషనల్ మ్యూజియం వేపు ఒక అడుగు వేశాను. ఎంతో ఆకట్టుకొనేలా ఉన్న భవనమది. ఓ అరగంట గడుపుదామా అని చూశాను. టికెట్టు ఆరు రియాళ్ళు అన్నారు. సుమారు పన్నెండువందల రూపాయలు. అన్నీ క్షుణ్ణంగా చూడాలంటే కనీసం రెండుగంటలు కావాలి. ఓపిక వుండాలి. ఆ క్షణాన నాకు అవి రెండూ లేవు. అనుక్షణమూ నావెంట ఉండే పిసినారితనం తలయెత్తి, ఉట్టిపుణ్యానికి అంత ఖర్చు ఎందుకోయ్ అంది. ఆ హాల్లోనే కాసేపు తచ్చాడి, వివరాలు చదువుకొని, ఒకరిద్దర్ని పలకరించి మాట్లాడి, మ్యూజియం నుంచి బయటపడ్డాను.
ఒంటిగంట ఎప్పుడో దాటేసింది. ఉదయం చేసీచెయ్యని బ్రేక్‌ఫాస్ట్. ఆకలి అలజడి మొదలయింది. స్టేట్‌బ్యాంక్ మిత్రుడు చెప్పిన కేరళ రెస్టారెంటు గుర్తొచ్చింది. వెంటనే టాక్సీ పట్టుకొని అక్కడికి చేరాను. అయన్ని కూడా నాతోపాటు లంచ్‌కి ఆహ్వానిద్దామని ఆలోచన. ఆయన అప్పటికే ముగించేశారట. ‘ఓ పని చెయ్యండి, భోజనం తర్వాత ఇక్కడికి రండి కలసి టీ తాగుదాం’ అని ఆయనే నన్ను ఆహ్వానించారు.
రెస్టారెంటు బావుంది. ఖాళీగానూ ఉంది. సముద్రం కనిపించేలా ఓ టేబుల్ దగ్గర చేరగిలబడ్డాను. ఎన్నడూ లేనంత నింపాదిగా కేరళవారి మీనకేంద్రిత పంచభక్ష్య భోజనాన్ని ఆస్వాదించాను. ఆకలి, రెస్టారెంటు ప్రశాంత సౌందర్యం, మనసులోని ఆనందం కలగలసి భోజనం రుచిని రెట్టింపు చేశాయి. భోజనంతోపాటు అక్కడ ఉచిత వైఫై సదుపాయమూ ఉంది. యు.ఎ.ఇ.కయితే అవసరాన్ని మించిన వాయిస్ అండ్ డేటా ప్యాకేజి తీసుకొని ఏ చీకూచింతా లేకుండా వారం పదిరోజులు గడిపేశానే గానీ ఒమాన్‌కు ఎందుకనో సరి అయిన ప్యాకేజి లేనేలేదు. ‘ఉండదు. మీరు పబ్లిక్ ప్లేసెస్‌లో దొరికే వైఫై మీదే ఆధారపడాలి’ అని తెలిసినవాళ్ళు అప్పటికే హెచ్చరించివున్నారు. అలాంటి పరిస్థితిలో ఆ రెస్టారెంట్‌లో పిలిస్తే పలికే వైఫై ఉంటే ఎంత సంతోషం! ‘మరో అరగంట కూర్చోవచ్చునా?’ అని అక్కడి మానేజర్ని అడిగాను. ‘నిరభ్యంతరంగా’ అన్నాడాయన. మెయిళ్ళు, వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌లు-చకచకా చదవడం, ప్రశ్నలు పోస్టడం, సమాధానాలు ఇవ్వడం… అది ముగిశాక వెళ్ళి ఎస్.బి.ఐ. అలీతో తేనీరు.
ఇంకా మూడు దాటలేదు. తిరగాలీ అంటే కనీసం గంటా గంటన్నర సమయముంది. ఉన్నది ఊరు మధ్యనే కాబట్టి మార్కెట్లూ మసీదులూ తిరుగుతూ ఆ గంటా గడపొచ్చు. పదపద అని మనసు ఉత్సాహపరుస్తోంటే దిగువనుంచి గాఢ అసమ్మతి స్వరం వినిపించింది.
‘నీ ఉత్సాహం దొంగలుదోలా! మూడు రోజుల్నించీ చూస్తున్నాను. మా సంగతేమిటీ? అడుగుదీసి అడుగు వెయ్యడం కష్టమవుతోందన్న స్పృహ ఏమన్నా ఉందా?! ఇహ తిరుగుళ్ళు ఆపు. రాత్రి నిద్ర కూడా లేదు, కాసేపు విశ్రాంతి తీసుకో. లేదా, ఇదే మా సమ్మె నోటీసు!’ అని కాళ్ళు ప్రకటించేశాయి. దిమ్మెరపోయాను. నిజమే. మనం సమాజమూ వర్గస్వభావమూ అంటూ ఉంటాం గానీ అసలు మన శరీరంలోనే ఆ వర్గ స్వభావం ఉంది! ఆలోచించి ఉత్సాహపడి చెడతిరగమని చెప్పేది తలకాయలోని గుజ్జు. ఆ పనంతా చెయ్యవలసింది కాళ్ళూ చేతులూ! అవి మరి నిరసన స్వరం వినిపించాయంటే వింతేముందీ?! ఉత్సాహపు దుడుకుతనం కన్నా వివేకపు నింపాదితనం మిన్న అయ్యే సందర్భాలు కొన్ని ఉంటాయి. అది అలాంటి సందర్భమని గుర్తుపట్టాను. టాక్సీ చేసుకొని మూడింటికి రూమ్‌కు చేరుకొన్నాను.
ఈమధ్యకాలంలో లేనంత గాఢమైన నిద్ర. దాదాపు గంటన్నరసేపు ఒళ్ళు తెలియని నిద్ర. లేచేసరికి ఎంతో సుఖంగా తాజాగా అనిపించింది. ఈలోగా ఏదో పనిమీద రూపేష్ కూడా అక్కడికి వచ్చాడు. సాయంత్రం దాకా ఉండటానికి అనుమతి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాను. ‘దానిదేముందీ, రేపు ఉదయం దాకా ఇంకే బుకింగూ లేదు. అందుకే ఇవ్వగలిగాను’ అంటూ నవ్వేసి తన సహాయాన్ని తేలిక చేసేశాడు ఆ మహానుభావుడు.
గంటన్నర విశ్రాంతి పుణ్యమా అని కాళ్ళు సమ్మె విరమించి, ‘పద, బస్సు ఎక్కేముందు ఆ రూవీ చౌక్ ప్రాంతంలో సాయంత్రం పూట తిరుగాడదాం’ అంటూ ఉత్సాహపరిచాయి. ముందే అనుకొన్నట్టుగానే అయిదింటికల్లా రూమ్ ఖాళీచేసి బాక్‌పాక్ పట్టుకొని రూవీ చౌక్ చేరుకొన్నాను. ఉదయం చూసిన బస్టాండు ప్రాంతం చేరుకొని అటూ యిటూ పరిశీలనగా చూస్తే రెండుమూడువందల గజాల దూరంలో నిడుపాటి గంట స్థంభం కనిపించింది. అటు వెళ్ళాను.
దారిలో వెడల్పాటి వాగు. అల్‌కబీర్ వాధి అట దానిపేరు. వాధి అంటే బహుశా మన వాగు అన్న అర్థం అయివుండాలి. దానిమీద మహా అయితే అయిదడుగుల ఎత్తున్న ఓ వంతెన. దిగువున ఎంతో వెదికితేగానీ కనిపించని చెదురుమదురు నీళ్ళు. వెతక్కపోయినా కనిపించే లక్షలాది గులకరాళ్ళు. ఊరికి బాగా దగ్గరలోనే చిన్నచిన్న పర్వతాల శ్రేణి ఉందిగదా- అదిగో అక్కడ కురిసిన వాన ఇలా ఈ వాగుల ద్వారా అరేబియా సముద్రం చేరుతుందన్నమాట.
ఆ క్లాక్ టవర్ ఊరికే ఒంటరి పక్షిలా నిలబడి లేకుండా దానిచుట్టూ చిన్నపాటి ఉద్యానవనమూ ఏర్పాటు చేశారు నగర అధినేతలు. అక్కడక్కడ ఆరేడు అంతస్తుల భవనాలు. ఆ భవనాల అద్దాలమీద పడి వాటికి బంగారు వర్ణం పూస్తోన్న సాయంత్రపు సూర్యుడు. ఓ భవనపు మొదటి అంతస్తు మీద ‘కొట్టార్కర్ ఆయుర్వేద మందుల దుకాణం’ అంటూ పెద్ద బోర్డు. క్లాక్ టవరు దిగువన ఉన్న చప్టా మీద అయిదుగురు భారతీయ సీనియర్ సిటిజన్లు.
వాళ్ళను పలకరిస్తే కబుర్లాడి తీరుతారని మనసు చెప్పింది. అటూయిటూ తిరిగి కాసిన్ని ఫోటోలు తియ్యడం ముగించాక వెళ్ళి వాళ్ళను మర్యాదగా పలకరించాను. వాళ్ళంతా సంతోషంగా ఆహ్వానించి పక్కన చోటిచ్చారు. అందులో ముగ్గురు వారివారి పిల్లలతో గడపడానికి ప్రతి ఏడాదీ వచ్చిపోయేవారట. మరి ఇద్దరు అక్కడే వ్యాపారాలు చేసి ఇపుడు వాటిని పిల్లలకు అప్పజెప్పి విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఇలా వచ్చి ఓ గంట కూర్చుని కబుర్లు చెప్పుకొని వెళుతూ ఉంటారట. వాళ్ళతో గడిపిన ఆ పదినిముషాలూ పరాయిదేశంలో ఉన్నట్టు అనిపించలేదు. మనదేశంలోనే ఏదో పూనాలాంటి నగరంలోనో అక్కడి మనుషులతో మాట్లాడుతున్నట్టే అనిపించింది.
ఆనాటి సాయంత్రం ఆ మస్కట్ మహానగరంలో నా అంత రికామీగా తిరిగిన మనిషి ఇంకొకరు ఉండి వుండకపోవచ్చు! క్లాక్ టవర్ నుంచి నా బస్సు ప్రదేశానికి అంతా కలసి అరకిలోమీటరు. చుట్టూ ఉన్న కొండల్ని చూస్తూ, కొండల్లో దిగిపోతోన్న సూర్యునికి వీడ్కోలు చెపుతూ దారిలోని వాగులోకి దిగి, ఆ రాళ్ళమీదుగా వాగు దాటి, ఏదో చిన్నపాటి రెస్టారెంటులో అల్పాహారానికీ భోజనానికీ మధ్యస్థంగా దొరికింది తిని, ఖబూస్ మసీదు ప్రాంగణంలో నాలుగడుగులు వేసి, ఏడు లోపలే బస్సు దగ్గరికి చేరాను. ప్రయాణీకులందరూ చేరి, డ్రైవరూ కండక్టరూ ఆర్చుకొని తీర్చుకొని వచ్చి బండి కదిలించేసరికి ఎనిమిది అవనే అయింది.
చక్కని ప్రయాణం. మన హైదరాబాద్ బెంగళూరు ప్రయాణం గుర్తొచ్చింది. మధ్యలో ఏవేవో ఊళ్ళలో ఆగడం, రెండూరెండున్నర గంటల ప్రయాణం తర్వాత నిజ్వా అన్న ఊళ్ళో అనుకొంటాను, డిన్నరు కోసం బస్సును గంటసేపు ఆపారు. ఆ నిజ్వా పట్టణం ఎప్పుడో మధ్యయుగాలలో ఒమాన్ దేశపు రాజధాని అని చరిత్ర చెప్పిన విషయం గుర్తొచ్చింది. పగటి ప్రయాణం అయితే బస్సులోంచి అయినా ఆ ఊరునూ, కోటనూ చూడగలిగేవాడిని. ప్రాప్తం లేకపోయింది!
దుబాయ్ బస్సుల్లో లాగా మృదువుగా మర్యాదగా గాకుండా డ్రైవరూ కండక్టరూ సహజమైన మాటతీరుతో ప్రకటనలు చెయ్యడం, ఆలస్యంగా ఎక్కేవాళ్ళను విసుక్కోవడం, మందలించడం, వదిలేసి వెళిపోతామని బెదిరించడం-గొప్ప నేటివిటీ ఉన్న ప్రయాణమది.
చేరడం ఓ గంట ఆలస్యమవవచ్చని హరికృష్ణకు సందేశం పంపాను.
(సశేషం)