పనమాలో తొలిరోజు
రెండు రోజులు నికరాగ్వాలోని గ్రనాద నగరంలో గడిపాక కోస్తా రీక వైపు దృష్టి సారించాను. ఉదయమే అయిదింటికల్లా లేచి గబగబా తయారయ్యాను. లగేజి లేకపోవడంలోని గొప్ప సౌకర్యం ఏమిటంటే సర్దుకోవడమనే పని ఉండదు. ఉండబట్టలేక మా హోటలు రిసెప్షనిస్టును నిద్ర లేపి నా లగేజ్ గురించి ఏమైనా సమాచారం అందిందా అని అడిగాను. లేదన్నట్టుగా ఆయన తల అడ్డంగా ఊపి వాచ్‌మన్‌ను లేపి తలుపులు తెరిపించాడు. నా పేరు, యు.కె. అడ్రస్సు, ఫోన్ నంబరూ గబగబా ఒక కాగితం మీద రాసి వాచ్‌మన్‌కు ఇచ్చి, ఆ కాగితాన్ని రూడీ డ్యూటీకి వచ్చినప్పుడు అతనికి అందించమని చెప్పాను. కాసిన్ని కార్దోబాలు టిప్పుగా వాచ్‌మన్ చేతిలో పెట్టడం మర్చిపోలేదు.
గ్రనాద నగరపు ఖాళీ వీధుల్లో తీరిగ్గా నడుచుకుంటూ అరగంటలో ఆ ఊరి బస్ టెర్మినల్ చేరుకున్నాను. నా దగ్గర ఉన్నదల్లా చిన్న బ్యాక్‌పాకు, మరో షాపింగ్ బాగు, ఒంటి మీద బట్టలు… సర్వసంగ పరిత్యాగులైన బౌద్ధ భిక్షువుల ప్రయాణాల పద్ధతి గుర్తొచ్చింది.
నేనారోజు తికా అన్న కంపెనీవాళ్ళ బస్సు తీసుకున్నాను. ఈ తికా కంపెనీవాళ్ళు మెహికోనుంచి మధ్య అమెరికా అంతటా తమ సర్వీసులు నడుపుతూ ఉంటారు. నేను ఎక్కబోతున్న బస్సు మనాగ్వా నుంచి రావాలి – దానికింకా ఒక ముప్పావుగంట సమయముంది.
బస్సుకోసం చూస్తున్నప్పుడు ఏభైల అవతలి గట్టున ఉన్నట్టున్న ఓ జంట, వాళ్ళ ఇరవై ఏళ్ళ అబ్బాయీ వచ్చి కలిశారు. వాళ్ళది పుఎర్తో రీకొ (Puerto Rico) ద్వీపమట. (ఈ కరేబియన్ ద్వీపం అమెరికా రక్షిత ప్రాంతం, కానీ వారి సంయుక్త రాష్ట్రాలలో ఒకటిగా ఇంకా చేర్చుకోబడలేదు. అందువల్ల ఇది స్వతంత్ర్య దేశమూ కాదు, అమెరికా రాష్ట్రమూ కాదు. తమని రాష్ట్రంగా చేర్చుకోమని, పూర్తి హక్కులు ఇవ్వమని, వారు ఎప్పడినుంచో అమెరికా చట్టసభలను అడుగుతున్నారు.) అతని పేరు ఫ్రాన్సిస్కో. ఆమె ఎమిలీ. ఒక క్రిస్టియన్ చారిటీ సంస్థ తరఫున ఇక్కడి రైతులకు ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులు అవలంబించడంలో సాయపడడానికి వచ్చారట. కొండల మధ్యనున్న ఓ చిన్న పల్లెటూర్లో ఆ పనిలో కొన్ని వారాలు గడిపారట. పని ముగిశాక విరామం కోసం కోస్తా రీక ప్రయాణం పెట్టుకున్నారట.
మా మధ్య కబుర్లు మొదలయ్యాయి. పుఎర్తో రికన్లకు అమెరికన్లకు ఉన్న అన్ని హక్కులూ ఉన్నాయిట. పాస్‌పోర్ట్ కూడా యు.ఎస్.ఎ.దే. వోటింగ్ హక్కు మాత్రం లేదు. కరేబియన్ సముద్రంలో ముప్ఫైరెండు లక్షల జనాభా కలిగిన ఆ ద్వీపం 1917 నుంచీ అమెరికా రక్షణ లోకి వచ్చింది. అలా అమెరికా నీడలో ఉండడం మీకు ఇబ్బందిగా లేకుండా ఉందా? అని అడిగాను. ‘మేము రెండో తరగతి పౌరులం అన్నమాట నిజమే. కానీ అదేమంత సమస్య కాదు. మాకు అమెరికా పాస్‌పోర్ట్ ఉంది. అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు వెతుక్కోవడంలో ఏ ఇబ్బందులూ లేవు. మా గవర్నర్‌ని మేమే ఎన్నుకుంటాం. నియంతల, అసమర్థపాలకుల బెడద లేదు. మావాళ్ళు చాలామంది అమెరికాలోనే నివసిస్తూ ఉంటారు. పర్లేదు, అంతా బానే ఉంది’ అని సమాధానమిచ్చారు ఎమిలీ.
తికా బస్సు కంపెనీకి చెందిన ఎలీనా అన్న ఆవిడ వచ్చి ఆఫీసు తెరిచింది. లోపలికి వచ్చి కూర్చోమని పిలిచింది. కోస్తా రీకలో నేను వెళుతోన్న సాన్ హొసే నుంచి పనమా సిటీ చేరడంలో అప్పటికే నేను కాస్తంత వివరం సేకరించి ఉన్నాను. ఆ సంగతి మళ్ళా ఎలీనా దగ్గర కదిపాను. ‘బాగా దూరం. తొమ్మిది వందల కిలోమీటర్లు. రోజంతా పడుతుంది’ అన్నదావిడ. నిజమే. చెక్ చేసి చూస్తే బస్సులో పదహారు గంటల ప్రయాణం. మళ్ళా సరిహద్దుల దగ్గర పట్టే సమయం సరేసరి – దానికి లెక్క అంటూ ఉండదు. ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాను.
ఇంటర్‌నెట్‌లోకి వెళ్ళి మరికాస్త శోధించాక మరో విషయం బోధపడింది – కోస్తా రీక ఇమిగ్రేషన్ వాళ్ళు ఆ దేశంలో అడుగు పెట్టేటప్పుడు అక్కడ్నించి ముందుకు సాగిపోవడానికి ఫ్లయిట్ టికెట్ ఉందో లేదో చూస్తారట. బస్సు టికెట్టు తీసుకుంటే అది వాళ్ళకు సరిపోవచ్చు, సరిపోక పోవచ్చు – సరిహద్దుల్లో చిక్కడిపోయే ప్రమాదం ఉంది. సామాన్యంగా వాళ్ళు బస్ టికెట్ ఒప్పుకుంటారు అని ఎలీనా అన్నా, రిస్కు తీసుకోవడం అనవసరం అనిపించింది. మెల్లగా బస్సు వదిలి విమానం పట్టుకోవాలన్న ఆలోచన నాలో ఘనీభవించింది. గబగబా నిర్ణయం తీసేసుకొని ఎలీనా సాయంతో అక్కడికక్కడ మర్నాటి ఉదయానికి సాన్ హొసే నుంచి పనమా సిటీకి ఆన్‌లైన్‌లో విమానం టికెట్ కొనేశాను. దీనివల్ల పనమా దేశంలో మరో రోజు అదనంగా గడపొచ్చు. ఇవాళ నేనెక్కే బస్సు సమయానికి గమ్యం చేరితే కోస్తా రీకలో ఓ పూటంతా గడపొచ్చు.
ఈలోగా ఒక బ్యాక్‌ప్యాకర్ జర్మన్ యువకుడు వచ్చి మాతో చేరాడు. ఆ మధ్యే మ్యునిక్ యూనివర్సిటీలో చదువులు ముగించాడట. ఉద్యోగంలో చేరడానికి ముందుగా ప్రపంచం చూద్దామని బయల్దేరాడట. నాలాగే అందుకు మధ్య అమెరికాను ఎంచుకున్నాడట. చదువుకునే రోజుల్లోనే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసి తన ప్రయాణాలకోసం కాస్తంత వెనకేసుకుని ఉన్నాడట. తలిదండ్రులు మరికాస్త అందించారు, అప్పుగా. వెరసి ఈ పర్యటన.
మా బస్సు లేక్ నికరాగ్వా పక్కనుంచే సాగింది. బయటంతా పొగమంచు. పరిసరాలు కనిపించనంత పొగమంచు. అంచేత ఆ సరోవర సౌందర్యాలను మూటగట్టుకునే అవకాశం లేదు. నికరాగ్వా-కోస్తా రీక దేశాల సరిహద్దు ప్రాంతం పేన్యాస్ బ్లాంకాస్ (Peñas Blancas) చేరేసరికి బాగా పొద్దెక్కిపోయింది. నికరాగ్వా వాళ్ళ సరిహద్దులు దాటే ప్రక్రియ మరీ చాదస్తంగా అనిపించి ఇబ్బంది పెట్టింది. కోస్తా రీక వాళ్ళ పద్ధతి సూటిగా సరళంగా ఉండి ఉపశమనం కలిగించింది.
ఆ నికరాగ్వా పద్ధతులు కాస్త వివరిస్తాను. గ్రనాదలో బస్సు ఎక్కేటప్పుడు డ్రైవరు అందరి దగ్గరా పాస్‌పోర్ట్‌లు సవ్యంగా ఉన్నాయో లేదో తనిఖీ చేశాడు. తమ దేశపు కస్టమ్స్, ఇమిగ్రేషన్‌లకు చెందిన ఒక పత్రమొకటి నింపడానికి అందించాడు. సరిహద్దు దగ్గర బస్సు ఆగినప్పుడు అందరం లగేజితో సహా బస్సు దిగాం. మునిసిపల్ ఫీజు కింద ఒక డాలరు కట్టి ఇమిగ్రేషన్ కౌంటరు దగ్గరకు వెళ్ళాం. మరో మూడు డాలర్లు చెల్లించి ఎక్సిట్ స్టాంపు వేయించుకున్నాం. మా బాగులు అందిపుచ్చుకొని కస్టమ్స్ తనిఖీకి అందజేశాం. అవతలి వేపున బస్‌స్టాప్ దగ్గర అవి మాకు అందాయి. ఈలోపల మా బస్సు వచ్చి చేరింది. లగేజి బస్సులో ఎక్కించాం. మరో ఇమిగ్రేషన్ అధికారి వచ్చి మా పాస్‌పోర్ట్‌లూ ఎక్సిట్ స్టాంపులూ తనిఖీ చేసిన తరువాత అందరం బస్సు ఎక్కాం. అయిదువందల మీటర్లు సాగాక బస్సు కోస్తా రీక సరిహద్దు చేరింది. మళ్ళీ ఇమిగ్రేషన్, కస్టమ్స్ కౌంటర్లు… లగేజి దింపడం… పాస్‌పోర్ట్‌లు అందించడం… తనిఖీలు… చివరికి మేమూ మా బ్యాగులూ బస్సెక్కడం – ముందుకు సాగడం.
మొత్తానికి కోస్తా రీక చేరుకున్నాను. నా యాత్రాపరంపరలో ఆరవ దేశమది. కొన్ని డాలర్లను ఆ దేశపు కొలోన్‌ల (Colón) లోకి మార్చుకున్నాను. కోస్తా రీక వాళ్ళు తమ కరెన్సీకి కొలంబస్ పేరే పెట్టుకున్నారు – స్పానిష్ భాషలో కొలంబస్‌ను కొలోన్ అంటారు. అక్కడి కరెన్సీ నోట్లు రంగులీనుతూ ఉన్నాయి. వాటి మీద ఆ దేశపు వన్యప్రాణుల బొమ్మలున్నాయి. చిరువ్యాపారులు చాలామంది స్థానిక తినుబండారాలు అమ్ముతూ కనిపించారు. వాటితోపాటు మంచినీళ్ళ బాటిళ్ళు, కూల్‌డ్రింకులూ కూడా దొరుకుతున్నాయి. వాళ్ళ దగ్గర ఆ తినుబండారాలు కొన్నాను – ఆ రోజుకు అదే నా బ్రేక్‌ఫాస్టు.
కరెన్సీ నోట్లను, క్రెడిట్ కార్డులనూ మూడు నాలుగు చోట్ల దాచివుంచటం అవసరమని నా అనుభవం నాకు నేర్పింది. దొంగతనమో, ఎక్కడన్నా పెట్టి మర్చిపోవడమో జరిగితే ఉన్నదంతా ఒక్క పెట్టున ఊడ్చిపెట్టుకుపోదు. దుస్తుల్లో ఒకటీ రెండు చోట్ల పెడతాను. నా శరీరంలో భాగంగా నాతో ఉండే బ్యాక్‌ప్యాక్‌లో మరి కాస్త ఉంచుతాను. ఇవన్నీ కాకుండా నా బెల్ట్‌కు వెనకవేపున ఉన్న జిప్పర్ పాకెట్‌లో ఇంకొంచెం ఉంచుతాను. కొంతమంది బూట్లు, సాక్సుల్లో కూడా చిన్నపాటి నోట్లకట్ట ఉంచమంటారు కానీ అది నాకు మరీ విపరీతమనిపిస్తుంది. ఏదేమైనా ఇలా మూడూ నాలుగూ చోట్ల డబ్బులూ కార్డ్‌లూ ఉంచటమన్నది మంచి పద్ధతి. ముఖ్యంగా బెల్ట్ వెనుక సీక్రెట్ పాకెట్ ఎమర్జెన్సీల్లో బాగా ఉపయోగపడుతుంది. అక్కడ దాచిన డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ స్థలాలలో బయటకు తీయను.
కోస్తా రీకలో చెప్పుకోదగ్గ విశిష్టతలు కొన్ని ఉన్నాయి. మిలటరీ వ్యవస్థను దూరంపెట్టిన దేశమది. ఆ ప్రాంతమంతటా మిలటరీ నియంతృత్వాలు వర్ధిల్లుతోన్నా, కోస్తా రీక వాళ్ళు 1948లో మిలటరీని రద్దు చేశారు. అప్పట్నించీ అక్కడ సుస్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తోంది. తద్వారా ఆ ప్రాంతాల్లో తనకంటూ విలువ, గౌరవం సంతరించుకుంది. అక్కడి దేశాల మధ్యన ఏమన్నా సమస్యలు తల ఎత్తినప్పుడు మధ్యవర్తిలా వ్యవహరిస్తోంది. అన్నట్టు ఆ దేశంలో మధ్య అమెరికా దేశాలలో ఉన్నట్టు మారాస్ మాఫియా బృందాల ఉనికే లేదు. రాజకీయ స్థిరత్వం దేశాన్ని సంపద్వంతం చేసింది. మాఫియాల బెడద లేకపోవడం వల్ల నేరాలు తక్కువ – శాంతిభద్రతలు ఎక్కువ.
కోస్తా రీక ఆర్థిక వ్యవస్థకు కాఫీ, అరటి పంటలు, టూరిజమ్ మూలాధారాలు. ముఖ్యంగా కోస్తా రీక కాఫీకి ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది; నాకూ ఇష్టమైనదది. మధ్య అమెరికాలోకల్లా టూరిస్టులకు ఎంతో స్నేహశీలదేశంగా కోస్తా రీక పేరు పొందింది. ఏడాదికి ఇరవై లక్షలమంది టూరిస్టులు వచ్చివెళుతూ ఉంటారట – ఆ దేశపు జనాభా మొత్తం కలిపి ఏభై లక్షలు అన్నప్పుడు ఈ టూరిస్టుల సంఖ్య ఎంత ఘనమో మనం అంచనా వెయ్యవచ్చు. ప్రపంచపు భూతలంలో కోస్తా రీకది 0.03 శాతమే అయినా బయోడైవర్సిటీ పరంగా ఈ దేశపు వాటా 5 శాతం! పక్షుల వైవిధ్యానికి ఆ దేశం పెట్టింది పేరు; ఒక్క హమింగ్‌బర్డ్స్ లోనే ఏభై రకాలు ఈ దేశంలో ఉన్నాయి.
బస్సులో ఎంతోమంది బ్యాక్‌ప్యాకింగ్ జర్మన్ యువకులు కనిపించారు. సరిహద్దుల దగ్గర ఆగినప్పుడు, ఇతరచోట్ల విరామానికి ఆగినప్పుడూ వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకున్నాను. ముందు కలిసిన మ్యునిక్ యువకుడి లాగానే వీళ్ళంతా చదువుకూ ఉద్యోగానికీ మధ్య కాస్తంత వ్యవధి సృష్టించుకుని యాత్రలకు బయలుదేరిన బాణీ మనుషులు. చదువుకుంటున్నప్పుడే చిన్న చిన్న ఉద్యోగాలు చేసి డబ్బులు కూడగట్టుకుని ఇలా ప్రపంచాన్ని చూస్తున్నారు. వీళ్ళందరికీ మెహికో, నికరాగ్వా, కొలంబియా అభిమాన గమ్యాలు. కోస్తా రీక కూడా వీళ్ళకి ఇష్టమైన ప్రదేశమే కానీ వారి దృష్టిలో అది కాస్త ఖరీదైన దేశం.
సెడ్రిక్ అన్న జర్మనీకి చెందిన స్టుట్‌గార్ట్ నగరపు మనిషి ప్రయాణం పొడవునా నాకు తోడుగా ఉన్నాడు. అతనిది నా పక్క సీటు. ప్రయాణం మొదలుపెట్టి నాలుగు నెలలయిందట. జర్మనీలో ఇప్పటికే అతనికి చక్కని ఉద్యోగం ఉంది. ఉద్యోగం చేస్తూ ప్రయాణాలకోసం డబ్బులు పొదుపు చేసుకున్నాడు. సరిపడా జమ చేసుకున్నాక ఉద్యోగానికి సెలవు పెట్టి ఈ ప్రయాణం పెట్టుకున్నాడు. సెంట్రల్ అమెరికా చేరాడు. నికరాగ్వా లాంటి దేశాలలో తనలాంటివాళ్ళు నెలకు వెయ్యి డాలర్ల ఖర్చుతో సౌకర్యంగా గడపవచ్చని అన్నాడు – కాకపోతే టూరిస్టుల తాకిడి ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
సెడ్రిక్ లేక్ నికరాగ్వా లోని ఓమెతేపె ద్వీపంలో ఇనాన్-ఇటా (Inan Itah) అన్న బృందంలో ఒక నెల గడిపి వస్తున్నాడట. ఏ మతంతోనూ ముడిపడి లేని ఆధ్యాత్మిక సమూహం ఈ ఇనాన్-ఇటా. మానవులు తమను తాము మెరుగుపరుచుకుంటూ తమ గురించి తాము తెలుసుకుని మరింత ఉన్నతులుగా పరిణమించేలా కృషి చేస్తోందిట ఈ కమ్యూనిటీ. వాళ్ళ దగ్గర సెడ్రిక్ నెల రోజుల పాటు వలంటీర్‌గా పనిచేశాడు. వాళ్ళతో పాటు యోగా చేస్తూ, వీగన్ భోజనమే తిన్నాడు. ఆ బృందాన్ని నడుపుతున్నది పాల్ అనే జర్మనీయుడు. బృందపు సభ్యుల సంఖ్య అయిదు నుంచి ముప్ఫై దాకా మారుతూ ఉంటుందట. విజిటర్లుగా వచ్చేవారు ఒకటి రెండు వారాలు ఉంటారు – వలంటీర్లు నాలుగు వారాలు. ప్రకృతిలోకి తిరిగి వెళదామన్న నినాదంతో పాశ్చాత్యులు స్థాపించిన ఎన్నో ఆధునిక తపోవనాల వంటిదే ఇది కూడా అనిపించింది నాకు.
చదువులు ముగించి బ్యాక్‌ప్యాక్‌లు పట్టుకున్న ఇలాంటి యువకులు ఎంతో తక్కువ ఖర్చుతో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువే కాని సమయం అపరిమితం. నాలాంటి ఏభైలు నిండిన డాక్టర్ యాత్రికుల విషయంలో ఇది విలోమం; డబ్బులకు కొదవ ఉండదు కానీ సమయమే సమస్య. మళ్ళీ ఈ ఖర్చులూ సమయాలూ అన్నవి కూడా ఒక విధంగా సాపేక్షం. నేను బ్యాక్‌ప్యాకర్‌గా పెట్టే ఖర్చు మిగతా యువక బ్యాక్‌ప్యాకర్‌లతో పోల్చుకుంటే విలాసవంతం అనిపిస్తుంది. కాని, కుటుంబంతో వెళ్ళినప్పుడు అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. వాళ్ళందరి అనుభవాలు, యాత్రారీతులూ గమనించాక నాకు ఒక విషయం స్పష్టమయింది; వాళ్ళు మూడు నెలల్లో తిరిగే ప్రదేశాలను, పొందే అనుభవాలనూ నేను మూడు వారాల్లో పొందుదామని ప్రయత్నిస్తుంటాను! అదలా ఉంచి, మనిషి మనిషికీ ప్రయాణాల అభిరుచుల్లో తేడాలుండే అవకాశముంది. నాది నిరంతరం సాగిపోవాలనే మనస్తత్వం. ఏదైనా ప్రదేశం నచ్చితే ఒకటీ రెండు రోజులుంటాను. వారం, నెలా అంటే నా వల్లకాదు.
మా బస్సు నత్తనడక నడుస్తోంది. సరిహద్దుల దగ్గర అయిన జాప్యాలు సరేసరి. అక్కడి రోడ్లూ బాగోలేవు. ఆనాటి వాతావరణమూ అనుకూలంగా లేదు. ఇమిగ్రేషన్ వ్యవహారాలూ ఎక్కువ సమయం తీసుకున్నాయి. కానీ అది ఒకరకంగా మేలే చేసిందనాలి. తీరిగ్గా నేను ప్రయాణవివరాలు నోట్సుగా రాసుకోగలిగాను. యువ యాత్రికులతో బాగా సమయం గడపగలిగాను. వాళ్ళ అనుభవాలు, ఆలోచనలూ గ్రహించగలిగాను. వారితో గడిపిన గంటల పుణ్యమా అని నాకూ వయసు తగ్గినట్టు అనిపించింది.
మధ్యాహ్నం రెండింటికి బస్సు ఓ సర్వీస్ స్టేషన్‌లో భోజనాలకు ఆగింది. అక్కడే ఒక పెద్దపాటి రెస్టరెంట్ ఉంది. మా బస్సుతోపాటు మరో అరడజను బస్సులు అక్కడ లంచ్ కోసం ఆగాయి. అంచేత కౌంటర్ దగ్గర పెద్ద క్యూ. అన్నం, బీన్స్, చికెనూ ఆర్డర్ చేసి సహయాత్రికులతో కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించాను.
భోజనం చేస్తున్నప్పుడు అనుకోని ఫోన్ కాల్ వచ్చింది. అబియంకా ఎయిర్‌లైన్స్ వాళ్ళు నా సామాను దొరికిందన్న కబురు అందించారు. దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియా దేశపు రాజధాని బొగొతా (Bogotá) నగరంలో ప్రత్యక్షమయిందట. నా సామాను నాకన్నా చురుగ్గా దేశాంతరాలూ ఖండాంతరాలూ దాటిందన్నమాట! మర్నాడు నేను పనమా సిటీ చేరుకునే సమయంలో నా సామాను నాకు అక్కడ అప్పగించడానికి అబియంకావాళ్ళు ఒప్పుకున్నారు. పర్లేదు – ఈ సాయంత్రం సాన్ హొసే నగరంలో మరోసారి అత్యవసర కొనుగోళ్ళు చెయ్యవలసిన అవసరం తప్పింది.
రోజంతా వర్షం. పొగమంచు. ఆ సోమరి వాతావారణంలో కోస్తా రీక దేశంలో అంతు లేని ప్రయాణం. నదులు దాటాం. వంతెనలు దాటాం. బయటంతా చిక్కని పచ్చని ప్రకృతి నిండి ఉన్న ఛాయలు కనిపిస్తున్నాయి. లైబీరియా నగరం వచ్చి వెళ్ళింది. మోంతెవేర్దె అన్న ప్రఖ్యాత నేషనల్ పార్క్ వచ్చి వెళ్ళింది. ప్రయాణం చాలా వరకూ పాన్ అమెరికన్ హైవే మీదనే సాగింది. కానీ దయలేని వాతావరణం పుణ్యమా అని ఏ ఒక్క ప్రదేశాన్నీ స్పష్టంగా చూడలేకపోయాను. ఆయా సౌందర్యాలను అనుభవించలేకపోయాను. చక్కని అవకాశం చేజారిపోతోందే అని ప్రాణం గిలగిలలాడింది.
లంచ్ సమయానికల్లా సాన్ హొసే చేరుతుంది అనుకున్న బస్సు సాయంత్రం ఏడున్నరకు గమ్యం చేరింది. పగటి సమయాన చేరుకుంటే ఒక పూటంతా ఊళ్ళో తిరగొచ్చునన్నది నా ముందటి ఆలోచన. ఇప్పుడా పనికి ఆస్కారమే లేదు. పైగా విడవని వాన… నాలుగు వందల కిలోమీటర్ల దూరానికి, మామూలుగా అయితే ఆరున్నరా ఏడూ గంటలు పట్టాల్సిన ప్రయాణానికి, ఏకంగా పన్నెండు పదమూడు గంటలు పడితే ఏమనుకోను!
అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది కదా అని సిటీ సెంటర్‌లో హోటల్ బుక్ చేశాను. బస్టాండులో దిగేసరికి ఇంకా వాన బాగా పడుతోంది. మేము బస్సు దిగేసరికి అక్కడ మనుషులు పెద్దగా లేరు. కానీ దిగీ దిగగానే మమ్మల్ని కొంతమంది టాక్సీ డ్రైవర్లు చుట్టుముట్టారు. మా హోటలుకు తీసుకువెళ్ళడానికి పాతిక డాలర్లు అడిగారు. బేరమాడే ప్రయత్నం చేశాను. ఏమాత్రం బెసకకుండా వాళ్ళంతా ఒకే మాట మీద నిలబడ్డారు. ఆ వర్షం, నా అలసట – ఇహ బేరాలు కొనసాగించే అవకాశం లేదని నాకు స్పష్టమయింది. వాళ్ళడిగిన రేటు గ్రనాద నుంచి నాలుగు వందల కిలోమీటర్లు ఇవతల ఉన్న సాన్ హొసే రావడానికి నేను పెట్టిన ఖర్చు కన్నా ఎక్కువ. చేసేదేముందీ, సరేనని టాక్సీ ఎక్కాను. పాతిక డాలర్లు కదా, హోటల్ బానే దూరం ఉంటుందనుకున్నాను. అంతా కలిసి కిలోమీటరు కూడా లేదు – అయిదు నిమిషాల్లో దింపేశాడు. పట్టపగలు నిలువుదోపిడీ అంటే ఏమిటో అనుభవం లోకి వచ్చింది. పాతిక డాలర్లు వర్షార్పణం అయ్యాయి. కోస్తా రీకకు మధ్య అమెరికా అంతట్లోనూ యాత్రికులంటే స్నేహశీలత ఉన్న దేశంగా పేరు ఉంది. బహుశా ఇప్పుడు ఇక్కడ కూడా అవధుల్లేని వ్యాపారపోకడలు ప్రవేశించినట్టున్నాయి. దేశం తన సహజ సౌశీల్యం కోల్పోతున్నట్టుగా ఉంది. టూరిస్టులు తండోపతండాలుగా వచ్చేస్తున్నప్పుడు స్థానికులు వారినుంచి తైలం పిండుకోడానికి సరికొత్త మార్గాలు అన్వేషిస్తారు కాబోలు. అదే జరిగితే సౌశీల్యం హరించిపోయి క్రమక్రమంగా అపఖ్యాతిని సంతరించుకుంటాయి అలాంటి ప్రదేశాలు.
నేను బుక్ చేసిన ఫ్లోర్ దె లిస్ హోటల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయి. చూడడానికి చక్కని ఆశ్రయశిబిరం అనిపించింది. రిసెప్షనిస్ట్ లనియాంక సాదరస్వాగతం పలికింది. టాక్సీవాళ్ళ దోపిడీ గురించి విని సంతాపపడింది. వాళ్ళ తరఫున క్షమాపణలు చెప్పింది. ఆ ట్రిప్పుకు నాలుగు డాలర్లే ఎక్కువ అంది. రేపటి ఉదయం విమానాశ్రయం వెళ్ళేటప్పుడు ఇలాంటివి జరగకుండా చూడటానికి తన స్నేహితుడు హూలియో వచ్చి దింపేలా ఏర్పాటు చేసింది.
వర్షం కురుస్తూనే ఉంది. కనీసం ఆ రాత్రి అయినా బయటకు వెళ్ళి ఊరు చూసి వచ్చే అవకాశమే లేదు. హోటలు గదికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. పాతిక డాలర్లే కాదు, కోస్తా రీక దేశపు యాత్ర అంతా వరుణార్పణం అయిందన్నమాట. ఉదయం బార్డర్ దాటినప్పుడు కొన్న తినుబండారాలు ఉంకా మిగిలి ఉంటే వాటినే తిని కడుపు నింపుకొని డిన్నర్ అయిందనిపించాను.
పొద్దున్నే ఏడింటికల్లా హూలియో వచ్చేశాడు. హ్వాన్ సాంతామరీయ విమానాశ్రయంలో నన్ను పనమా సిటీకి వెళ్ళే విమానం ఎక్కించడానికి సంసిద్ధుడయ్యాడు. నా నిన్నటి కథంతా తెలుసుకొని ‘అయ్యో ఇంత దూరం వచ్చావు. కోస్తా రీకలో ఏమీ చూడకుండా వెళ్ళిపోతున్నావు. ఇక్కడ మరికాస్త సమయముండేలా వస్తే బాగుండేది’ అని వాపోయాడు. ‘మరేం పర్లేదు. ఈసారి తీరిగ్గా వస్తాను. మీ దేశం అందాలు పక్షిసంపదా అన్నీ చూసి వెళతాను’ అన్నాను.
దారిలో పోఆస్ (Poas) అన్న ఎంతో పెద్ద అగ్నిపర్వతాన్ని చూపించాడు. దూరాన క్షితిజరేఖ దగ్గర ఉందా పర్వతం. ‘2697 మీటర్ల ఎత్తు… ఇంకా చల్లారని అగ్నిపర్వతం. అప్పుడప్పుడూ విస్ఫోటనాలు జరుగుతుంటాయి. పైన చక్కని బిలముఖ సరోవరం ఉంది’ అని వివరించాడు జూలియో.
సాన్ హొసే విమానాశ్రయం ఎంతో అధునాతనంగా ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగేలా ఉంది. పనమా సిటీ వెళ్ళడానికి నేను వింగో ఎయిర్‌లైన్స్ వాళ్ళ విమానం పట్టుకున్నాను. గంటంబావు ప్రయాణం. పనమా సిటీ దగ్గర విమానం దిగడం ఆరంభించినప్పుడు పైనుంచి పనమా కెనాల్ స్పష్టంగా కనిపించింది. అందులోని ఓడలూ కనిపించాయి. అంతకన్నా ముఖ్యంగా పనమా కెనాల్ పసిఫిక్ మహాసముద్రాన్ని తాకేచోట ఉన్న బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్ నా కంటిముందు నిలిచి సంబరపరిచింది. ఉత్తర అమెరికా ఖండాన్ని దక్షిణ అమెరికాతో కలిపే వంతెన అది. గగనతలం నుంచి కనిపిస్తున్న పనమా సిటీ దృశ్యాలు ఎంతో ఆకట్టుకొనేలా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్‌లోని ఏదో ముఖ్యమైన నగరానికి వెళుతూ అక్కడి నగర కేంద్రంలోని ఆకాశహర్మ్యాలను చూస్తోన్న భావన కలిగింది.
పనమా సిటీలోని తొకుమెన్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగి పనమా దేశపు భూమిని తాకాను. నా మధ్య అమెరికా యాత్రలో పనమా ఏడవదేశం. చిట్టచివరి దేశం. కస్టమ్స్, ఇమిగ్రేషన్ లాంఛనాలు ఎంతో సులువుగా ముగించాను. సూటి అయిన కార్యసరళి వారిది.
విమానాశ్రయపు అరైవల్స్ ప్రాంగణంలో అబియాంకా ఎయిర్‌లైన్స్ ప్రతినిధిని కలిశాను. ఆమె నన్ను వాళ్ళ ఆఫీసుకు తీసుకువెళ్ళింది. ఇంకో ఉద్యోగి -బహుశా ఆమె బాసు- ఆ బ్యాగులో ఏమేం వస్తువులు ఉన్నాయో చెప్పమని ప్రశ్నల పరంపర గుప్పించాడు. నా సమాధానాలతో సంతృప్తి పడ్డాక నా బ్యాగు అందించాడు. దయనీయమైన స్థితిలో కనిపించింది నా బ్యాగు. తాళం విరిగిపోయి, బట్టలూ వస్తువులు అడ్డదిడ్డంగా కెలకబడి – భద్రతానియమాల వల్ల అదంతా చెయ్యవలసి వచ్చిందని వాళ్ళు వివరించారు. నిజమే – అలా చెయ్యడం వాళ్ళకీ ఏమంత సంతోషం కలిగించే విషయం కాదని తెలుసు. అయినా గత మూడు నాలుగు రోజులుగా నాకు కలిగిన ఈ సమస్య విషయంలో అబియాంకా సంస్థ, వాళ్ళ సిబ్బంది స్పందించిన తీరు నాకు అసంతృప్తినే మిగిల్చింది.
విమానంలో నాతోపాటు వచ్చిన ఓ ప్రయాణికుడు పనమా సిటీలో తిరగడానికి మెట్రోనే బెస్టని సూచించాడు. ఊబర్ సర్వీసులూ ఉన్నాయన్నాడు. పనమా దేశంలో స్థానిక కరెన్సీ బల్బోఆ (Balboa) తోపాటు యు.ఎస్. డాలర్ కూడా అధికారికంగా గుర్తింపబడుతుందట. ఆ రెండిటి మారకపు విలువా ఒక్కటే. అంచేత డాలర్‌లను మార్చాల్సిన పని లేదు.
ఊబర్ టాక్సీ తీసుకుని నేను బుక్ చెసుకున్న విన్‌డమ్ (Windham) హోటల్ చేరుకున్నాను. గబగబా చెకిన్ చేసేసి నగరశోధనలో పడ్డాను. మొదటి గమ్యం పనమా కెనాలే! ఆ జలమార్గపు ముఖ్యబిందువు మిరాఫ్లోరేస్ లాక్స్ (miraflores locks) వేపు దారి తీశాను. మా హోటల్ నుంచి టాక్సీలో ఆ ప్రదేశానికి ఇరవై నిమిషాల్లో చేరుకున్నాను. సుఎజ్ కెనాల్ (Suez canal) గురించి, పనమా జలసంధి గురించీ హైస్కూలు రోజుల్లో చదువుకుని ఉన్నాను. మానవజాతి చరిత్రలో అవి అద్వితీయమైన సాంకేతిక విజయాలు అనడంలో నాకే సంకోచమూ లేదు. ముఖ్యంగా పనమా కెనాల్ విషయంలో అక్కడి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఒక అసంభవాన్ని మానవుడు సంభవంగా మలచిన మహత్తర విషయంగా మనం భావించవచ్చు. తాము ఎదుర్కొన్న ప్రతి సమస్యకూ పరిష్కారాలు సాధించి ఆనాటి ఇంజనీర్లు పనమా కెనాల్ నిర్మించారు. వారి సాంకేతిక ప్రతిభకు కలికితురాయి మిరాఫ్లోరేస్ లాకుల వ్యవస్థ.
ఒక ఓడ ఆ లాకుల వ్యవస్థ దాటుకుని వెళ్ళి పసిఫిక్ మహాసముద్రంలోకి చేరే ప్రక్రియను ప్రత్యక్షంగా చూడాలన్నది నా అభిలాష. అందుకు ఇంకా గంటన్నర టైముందన్నారు. ఆ ఉన్న సమయాన్ని అక్కడ కెనాల్ మ్యూజియమ్‌లో గడపాలని నిశ్చయించుకున్నాను. కెనాల్ నిర్మాణపు చారిత్రిక భౌగోళిక నేపథ్యం తెలుసుకుంటే మహాసాగర జలాలలోకి నౌకాప్రవేశ ప్రక్రియను మరింత గాఢంగా ఆస్వాదించగలనని నా ఆలోచన.
ఉత్తర దక్షిణ అమెరికాల మధ్య జలసంధి ఏమన్నా ఉందేమోనని వెతుకుతూ క్రిస్టఫర్ కొలంబస్ తన తుది నౌకాయాత్ర సందర్భంగా 1502లో ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ రెండు ఖండాలకు పశ్చిమాన పసిఫిక్ మహాసాగరం ఉందన్న విషయం 1513లో వాస్కో నూన్యెజ్ దె బల్బోఆ (Vasco Núñez de Balboa) అన్న స్పానిష్ ఆక్రమణదారుడు కనిపెట్టేదాకా ఐరోపావాసులకు తెలియనే తెలియదు. పనమా భూసంధిని దాటుకొని వెళ్ళి పసిఫిక్ సముద్రజలాలను చూసిన మొట్టమొదటి యూరోపియన్ అతడు. అట్లాంటిక్ మహాసముద్రంతో పోలిస్తే పసిఫిక్ ఎంతో శాంతంగా కనిపించడంతో దానికి పసిఫిక్ (శాంతమైన) అని ఫెర్డినాండ్ మజెలన్ (Ferdinand Magellan) అనే పోర్చుగీసు అన్వేషకుడు 1520లో నామకరణం చేశాడు.
ఆ తర్వాత స్పానిష్ అన్వేషకులందరికీ అక్కడ సన్నపాటి భూసంధి ఉందని, అది దాటి వెళితే పశ్చిమదిశన ఉన్న పసిఫిక్ మహాసాగరం కనిపిస్తుందనీ స్పష్టంగా తెలిసింది. చరిత్రకందని కాలాలలో మానవుడు ఉత్తర దక్షిణ అమెరికాల నడుమ తిరుగాడడానికి ఈ భూమార్గమే ఉపయోగపడింది.
ఈ భూసంధిలో ఒక జలసంధిని ఏర్పరచి ఉభయ అమెరికా ఖండాల మధ్య నౌకాయానాన్ని వేగవంతం చేయాలని అప్పటి ఐరోపావాసులు తపించారు. ఫ్రెంచ్ దేశస్థులు చేసిన ప్రయత్నమొకటి విఫలమయ్యాక యు.ఎస్.ఎ. 1914లో ఆ పని విజయవంతంగా పూర్తి చేసింది. ఎనభైరెండు కిలోమీటర్ల పొడవున కెనాల్ నిర్మించనే నిర్మించింది. మానవుని కలను సాకారం చేసింది. ఓడలు అట్లాంటిక్ నుంచి పసిఫిక్ జలాలలోకి పయనించడానికి పట్టే ఐదు నెలల ప్రయాణాన్ని ఎనిమిదీ పది గంటలకు కుదించింది.
ముందే అనుకున్నట్టు ఆ కాలువ నిర్మాణం మానవజాతి సాంకేతిక ప్రతిభకు అత్యున్నత తార్కాణం. నిర్మించి వందేళ్ళు దాటినా ఆనాటి సాంకేతికత కాలపరిధులను దాటుకుని వచ్చి ఇప్పటికీ విస్మయం కొలుపుతూనే ఉంటుంది. పనమా కెనాల్ నిర్మాణప్రక్రియలో రూపు దిద్దుకున్న ఎన్నో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు ఈనాటికీ తమ తమ ప్రాసంగికతను కోల్పోలేదు. బృహత్తరమైన లాకులను నీటితో నింపడం, ఖాళీ చెయ్యడం అన్న క్రమబద్ధప్రక్రియ ద్వారా – భూమ్యాకర్షణ శక్తిని వినియోగించి – నౌకలను కాలువ దాటించడం మనిషి మేధస్సుకు అపురూప విజయం అని మనకు ఈనాటికీ అనిపిస్తుంది.
ఆ లాకుల ఛాంబర్‌ల పొడవు 304.8 మీటర్లు. వెడల్పు 33.5 మీటర్లు. పనమా కాలువ ద్వారా సరుకుల రవాణాకు వినియోగించే ఓడలను ఈ కొలతలకు అనుగుణంగా నిర్మిస్తారు. ఆ ఛాంబర్లలోని ఒక విభాగం నుంచి మరో విభాగానికి నీటిని వరుసక్రమంలో సమమట్టానికి తీసుకురావడం ద్వారా ఓడలను అడుగంటకుండా చేసి, ఎనిమిదీ పది గంటలలో ఆ మూడొందల మీటర్ల పైచిలుకు ఉన్న లాకుల వ్యవస్థను దాటించి అవతలి వేపున ఉన్న సాగరజలాలలోకి చేరుస్తారు.
ఆ లాకుల నిడివి ఎనిమిది అంతస్తుల భవనానికి సమానం. ప్రతి లాకుకూ రెండు మీటర్ల మందం ఉన్న గేట్ల జత ఉంటుంది – ఆ గేటు వెడల్పు 18 మీటర్లు, ఎత్తు 14 నుంచి 22 మీటర్లు. ఈ జతగేట్‌లు 730 టన్నులు తూగుతాయి – అంటే 200 ఏనుగుల బరువుకు సమానం అన్నమాట. అలాంటి జతగేట్‌లు ఆ కాలువలో నలభై ఉన్నాయి. వాటన్నిటినీ యు.ఎస్. లోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో తయారు చేశారట. ముందే చెప్పుకున్నట్టు అవి నిర్మించి వందేళ్ళు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.
పనమా దేశానికి సైన్యమంటూ లేదు – యు.ఎస్.ఎ. రక్షణలో ఉన్న దేశమది. ఈ పనమా కెనాల్ వ్యవహారాలను చూసుకుని దాని ద్వారా ఆదాయం పొందేది పనమా దేశమే అయినా స్థూలంగా ఈ కాలువ అమెరికాకు చెందిన ఆస్తి. అలా 85 ఏళ్ళపాటు ఆ కాలువ మీద అమెరికా యాజమాన్యం సాగాక 1999లో పనమా ప్రజలు, ప్రభుత్వాల అభీష్టం, ఆందోళనల మేరకు, యు.ఎస్.ఎ. తన యాజమాన్యాన్ని పనమాకు బదిలీ చేసింది. ఈ కాలువను దాటే ఓడలకు వాటి వాటి పరిమాణాలను బట్టి నాలుగు నుంచి ఎనిమిది లక్షల డాలర్ల దాకా ఛార్జి చేస్తారు. సగటున ఏడాదికి 14 వేల ఓడలు ఈ కాలువను దాటుతాయి. అంటే దాదాపు ఐదారు బిలియన్ డాలర్ల ఆదాయమన్నమాట. అది పనమా ఆర్థికవ్యవస్థలో గణనీయమైన భాగం.
ఓడ కెనాల్‌లో ప్రవేశించేముందు కెనాల్ అథారిటీకి చెందిన ఒక కెప్టెన్ ఓడ కంట్రోళ్ళను ఆ ఓడ కెప్టెన్ నుంచి అంది పుచ్చుకుంటాడు. కాలువలో దాని గమనం సాగినంతసేపూ ఓడ నియంత్రణ తన చేతుల్లో ఉంచుకుంటాడు. ఈ పద్ధతికి మిలటరీ షిప్పులు, న్యూక్లియర్ జలాంతర్గాములు సైతం మినహాయింపు కాదు. న్యూక్లియర్ కోడ్‌లు మాత్రం కెనాల్ కెప్టెన్‌కు అందవు. అన్నట్టు ఓడలు కాలువలో సాగినంతకాలం వాటిమీద ప్రత్యేకమైన మెరీన్ పతాకం ఎగురుతూ ఉంటుంది.
ఇలా పనమా కెనాల్‌కు సంబంధించిన సాంకేతిక చారిత్రిక వివరాలలో నేను మునిగిపోయి ఉండగా – లాకుల దగ్గరకు ఓడ వస్తోంది అన్న ప్రకటన వినవచ్చింది. క్షణాల్లో వీక్షకుల గేలరీలన్నీ నిండిపోయాయి. సముద్రాల్లో అనంత జలరాసుల మధ్య ఓడలు తేలియాడుతూ ఉండగా చూడటం వేరు – అంత పెద్దపాటి ఓడలు ఓ సన్నపాటి కాలువ ముందు తలవొంచి ఒదిగి ఒదిగి సాగిపోతూ ఉండగా చూడటం వేరు; ఇదో ఊహాతీతమైన అనుభవం. దీన్ని ఇంకే అనుభవంతోనూ పోల్చలేము. ఓడ లాకుల దగ్గరకు చేరగానే దాన్ని పైదాకా నీళ్ళు నిండివున్న లాకులోకి మళ్ళించారు. మెలమెల్లగా దానితో అడుగులు వేయిస్తూ నింపాదిగా సముద్ర తలానికి చేర్చి శాంత మహాసముద్రపు జలాలలోకి దాన్ని ప్రవేశపెట్టారు. (ఈ లాకుల పద్ధతికి ఒక అతి చిన్న నమూనా షికాగో నగరంలో ఉంది. నగరం మధ్యగా సాగే షికాగో నదినుండి లేక్ మిషిగన్ లోకి విహారనౌకలను ఇలాగే పంపుతారు. ఈ లాకు ఛాంబర్లు కేవలం 600 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పు మాత్రమే.)
మానవ నిర్మాణ అద్భుతాలలో ఒకటైన పనమా కెనాల్ దగ్గర ఆ అపరాహ్ణ సమయం ఎంతో ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా గడిచింది. ఈ కెనాలే లేని పక్షంలో పనమా అనేకానేక చిరుదేశాలలో ఒకటిగా ఉండిపోయేది. ఈ కాలువకున్న వ్యూహాత్మక ప్రాముఖ్యత పనమాను ఒక నిర్దుష్టమైన ఉనికి ఉన్న దేశంగా నిలబెట్టింది. భౌగోళికంగా తనకు అమరిన వెసులుబాటు, అది పనమా కెనాల్‌కు దారి తీయడం ఆధారంగా చేసుకుని – అమెరికా మద్దతుతోనే అయినా – పనమా ఒక స్వతంత్ర దేశంగా మనగలుగుతోంది. కొలంబియా నీడనుంచి విడివడగలిగింది. మిగిలిన దేశాలకన్నా యు.ఎస్.కే పనమా కెనాల్ అవసరం ఎక్కువ. రాజకీయంగా ఈ కెనాల్‌కు ఉన్న ప్రాముఖ్యం అటుంచి అమెరికా తూర్పు తీరంనుంచి పశ్చిమ తీరానికి సరుకులు రవాణా చేసుకోడానికి ఈ కాలువ యు.ఎస్.కు ఎంతైనా అవసరం. నిజానికి వారికి అది ఒక వరం. ఆయా తీరాల మధ్య సాగే వాణిజ్యంలో మూడింట రెండు వంతులు పనమా కెనాల్ ద్వారానే సాగుతోంది.
అక్కడే ఉండిపోయి, మరో ఓడ లాకులు దాటడం చూశాక, ఊళ్ళోని సెంట్రల్ పార్కుకు చేర్చే బస్సు ఒకటి పట్టుకున్నాను. అక్కడ్నించి తీరిగ్గా వియా అర్హెంతీనా అన్న అందమైన ఎవెన్యూ మీదుగా సాగిపోయాను. ఆ ఎవెన్యూ ఒక చక్కని జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఎవరికైనా. చక్కని రెస్టరెంట్‌లతో నిండిన ఆ వీధిలో ఎల్ త్రపీచె (el trapiche) అన్న భోజనశాలలో కుదురుకున్నాను. అక్కడ కనిపించిన వంటకాల వివరాలతోపాటు ఆ ప్రదేశపు సంప్రదాయ అలంకరణలు కూడా నన్ను ఆకట్టుకున్నాయి. ఉత్తేజం కలిగించాయి.
అక్కడి హెడ్ వెయిటర్ సిఫారసు ప్రకారం ఫియెస్తా పనమానియా అన్న వంటకం ఆర్డర్ చేశాను. ముందుగా సంకోచ్చో అన్న పదార్థం, దానితోపాటు చికెన్ సూపూ అందించారు. మెల్లమెల్లగా వరి అన్నం, బీన్సు, వేయించిన యుకా దుంప, మరో రెండు మొక్కజొన్న వంటకాలు వచ్చి చేరాయి. పంది జబ్బల దగ్గరి పొడవాటి మాంసపు తునకలు, వాటితోపాటు కరిమనోలా అన్న కజ్జికాయ ఆకారపు – యూకా పేస్టు, మాంసపు ముక్కలు, ఛీజూ నిండిన, నూనెలో వేయించి తీసిన – మరో పదార్థం కూడా ప్లేటు మీదకు చేరింది. అలా పనమా దేశపు జాతీయ వంటకాలతో నిండిన భోజనాన్ని మనసారా ఆస్వాదిస్తూ, మధ్య మధ్య పనమా బీరును గుటకలు వేస్తూ భోజనం సాగించాను. ఆ దేశపు ఖాద్యవిశేషాలతో ఆనాడు నేను చేసిన భోజనం అతిచక్కని పరిచయం ఏర్పరచింది. అన్ని దేశాల వంటకాలూ రుచి చూడాలని తపనపడే నాలాంటి వమిషికి అంతకన్నా వరం ఇంకేముంటుందీ!
కోస్తా రీకలో మొదలై పనమాలోని రెస్టరెంట్లో ముగిసిన ఆనాటి సుదీర్ఘసమయం చివరికి ఎంతో సంతృప్తికరంగా ముగిసింది. ఈ పనమాయే నేను చూద్దామనుకున్న చిట్టచివరి దేశం కాబట్టీ మొత్తం యాత్రకే ముగింపు పలికే ప్రక్రియ ఈరోజే మొదలయింది. మరో బీరుతో ఆ ముగింపు ఉత్సవానికి నాంది పలికేలా చేసింది. పనమాలో మరో రెండు రోజులు ఉండబోతున్నాను. తీరిగ్గా నగరమంతా కలియదిరగాలి… పరిసర ప్రదేశాలూ చూసి రావాలి… తిరిగి ఇంటికి చేరే విమానం ఎక్కాలి…
(సశేషం)