‘ఏ ఊరు?’
‘ఈ అడవిలో ఉంటాను.’
‘ఏం చేస్తారు?’
‘ఊరికే ఉంటాను.’
అడవి అన్నమాట వినగానే అందరికీ మనసూరుతుంది.
ఏముందీ! చెట్లు పుట్టలు తీగలు పాములు ముళ్ళు ప్రమాదాలు–అనేవాళ్ళు లేకపోలేదు గానీ, తక్కువ. అడవి గురించి అందంగా, పచ్చగా, పూలుగా, సెలయేళ్ళుగా, కృష్ణ జింకలుగా, రొమాంటిక్‌గా ఊహించుకొనేవాళ్ళు ఎక్కువ. ఊహకు కుతూహలం తోడయితే ఓ గంట, ఓ పూట ఏ అభయారణ్యంలోనో జీపు సవారీ చేసి ‘హమ్మయ్య! అడవి చూసేశాం’ అని సంతృప్తిపడేవాళ్ళకూ కొదవలేదు. అదీ చాలదనిపించి కీకారణ్యాలలో రోజులతరబడి ట్రెక్కింగుల్లాంటివి చేసి, ప్రమాదాలను ఎదుర్కొని, వాగులూ నదులూ దాటుకొని, కొండలు ఎక్కి శరీరం అలసినా నిండిన మనసుతో తిరిగొచ్చే ప్రకృతి ప్రేమికులు అరుదుగానైనా కనిపిస్తారు.
కానీ, విప్పారిన కళ్ళతో, వికసించిన మనసుతో, శ్రుతి అయిన సర్వాంగాలతో అడవిని తమలోకి ఆవాహన చేసుకొని కాలపు ప్రమేయమూ స్పృహా లేకుండా ఏనాడో వదిలివచ్చిన తమని తాము వెదుక్కుంటూ, తిరిగి ఆవిష్కరించుకొంటూ తిరుగాడే వ్యక్తులు అత్యంత అరుదు.
కాస్తంత ఇంగిత జ్ఞానం, చిత్తశుద్ధి ఉన్న ఏ మనిషి అయినా ఎంతో సులువుగా కనీస అవసరాలు తీర్చుకొని మధ్యతరగతి జీవితం గడపగలిగే కాలంలోనూ వ్యవస్థలోనూ మనమంతా ఉన్నాం. పేదరికం, బీదరికం, మధ్యతరగతి, ధనికవర్గం లాంటి పదాల పూర్వ నిర్థారిత అర్థాలను పూర్వపక్షం చేసి – ఈ వర్గ విభజనలకు అందనంత దూరానికి చేరి, స్పష్టమైన జీవన అవగాహనతో తమతమ ప్రాథమిక అవసరాలను సమకూర్చుకుంటూ జీవనయానం సాగించడమన్నది ప్రాణులన్నిటి సహజ లక్షణం కావాలి. కానీ ఈ లక్షణాలను దాటుకొని ఎంతో ముందుకు వచ్చేసిన మానవుడు మళ్ళీ బాక్ టు బేసిక్స్ అంటూ వెళితే చూసేవాళ్ళకి విచిత్రంగా ఉంటుంది. అలా వెళ్ళగలిగినవాళ్ళకి మాత్రం అది అనుక్షణం ఒక జీవన ఆనంద హేల.
ఆ అన్వేషణనూ అనుభవాలనూ మాటల ప్రమేయం లేకుండా తమ మనసులోంచి సమహృదయాల మనసుల్లోకి ప్రసారం చేసేవాళ్ళు నూటికీ కోటికీ ఒకరు ఉంటారు. ఈ అడవి పుస్తకం రచయిత అందులో ఒకరు.
ఆమె ఎన్నో పనులు చేశారు, టీచరత్వంతో సహా.
అతడు వృత్తీ ప్రవృత్తుల రీత్యా అధ్యాపకుడు.
ఎక్కడెక్కడో చదువులు చెప్పారు. ఆ జీవితం చాలనుకొన్నారు. అడవుల్లో నెలల తరబడి సైకిళ్ళమీద తిరిగారు. నగరపు వాసనలకు దూరంగా నివసించారు. స్థిర నివాసాన్ని వీరు ఇష్టపడరు.
తూర్పు కనుమల పాదచ్ఛాయల్లోని ధారపల్లి చేరారు. అక్కడి ఆశ్రమంలో కొంతకాలం గడిపాక కొండపక్కనే ఉన్న, చిన్న సెలయేరు తోడుగా ఉన్న, టంగుడు చెట్టును ఆనుకొని ఉన్న, సూర్యవతి కుటుంబానికి చెందిన గొడ్లపాకను నివాసంగా చేసుకొందామనుకొన్నారు. మట్టి తవ్వి, వెదురుకొట్టి, గోడలు మెత్తి, దాన్ని కుటీరంగా మార్చారు. కుటీరం పక్కనున్న స్థలాన్ని తోటగా మలచుకొన్నారు.
‘ఈ కుటీరం, ఈ తోట, ఇదంతా అనిశ్చితం కదా…’ ఆమె సందేహం.
‘అనిశ్చితం కాకపోతే నీకు సరిపడదుగదా!’ అతని వ్యాఖ్య.
అయినా ఆమెకు సందేహం తీరలేదు. కుటీరం పనిమీద నీళ్ళకోసం వాగు దగ్గరికి వెళితే అక్కడ ఓ అడవి కుక్క ఆ సందేహం తీర్చింది. పిల్లను నోట కరచుకొని ఆ పిల్లల తల్లి అడవిదాటి రావడం చూసిందామె. ఏరుదాటి ఊరికి దగ్గరలో ఉన్న గూటిలోకి పిల్లల్ని చేర్చుతోందా అడవితల్లి. పాతగూడు వదిలేసింది. అప్పుడు ఈమె బెంగ తీరింది. ‘పాక నిర్మించినంత మాత్రాన ఇక్కడ ఆగిపోను. దూరంగా ఉండే గాఢారణ్యం నన్ను ఆకర్షించక మానదు’ అని ఆమెకు స్పష్టమయింది.
కుటీరం ఒక రూపానికి వచ్చాక ముందు చేసిన పని అక్కడి కొండలూ వృక్షాలూ సెలయేళ్ళూ చిరుజీవులతో స్నేహం. రాత్రిపూట నమ్మశక్యం కాకుండా వెలిగేపోయే ఆకాశంతో చెలిమి. పడమరకొండా ఉత్తరకొండా పిలిచినప్పుడల్లా వెళ్ళి పలకరించి రావడం… విప్పచెట్లు ఉన్నాయని తెలిస్తే వాటిల్ని వెదుకుతూ సాగడం… పసుపుపచ్చ కొండగోగు విరిసి పిలిస్తే ఆ పిలుపు అందుకోవడం. ఓనాడు కొండ దిగివచ్చి సర్టిఫికెట్లన్నీ కుప్పపోసి మంటపెట్టడం…
అక్కడ మిణుగురులే అడవి కుటీరానికి వెలుగులు.
అక్కడ రాత్రి రాత్రిలాగా ఉంటుంది-మరకలేని చీకటిగా ఉంటుంది.
తమతోపాటు ఉండే వైటీతోపాటు అర్ధరాత్రి లేచి జెర్రిలాంటి కీటకపు వెలుగులు చూస్తుందామె. ఏ గ్రద్దో మైదానం నుంచి తన్నుకొచ్చి విడిచిన ఉడుత చెట్లకొమ్మల మీద దూకుతూ కనిపిస్తే దానితో స్నేహం చేసే ప్రయత్నం చేస్తుందామె. ఏ రాత్రో మెలకువ వచ్చి పైకి చూస్తే పట్టనన్ని చుక్కలతో ధగధగలాడుతూ ఎనిమిది దిక్కులా ఎనిమిది కొండల పైకప్పుగా తళుకుతళుకున మెరిసే ఆకాశం!
తోటలో తాను నాటిన మొక్కలు… అడవిలో ఒకచోట బలంగా ఎదిగి కనబడ్డ చిలకతోటకూర… క్రమక్రమంగా తెలిసివస్తోన్న రకరకాల అడవి దుంపలు, ఆకుకూరలూ. ఒక మనిషి బతకడానికి ఇరవై సెంట్ల స్థలం చాలు అనలేదూ ఆ గడ్డిపరకతో విప్లవం జపాను పెద్దాయన!
వర్షాకాలమా? గాలీ వానా? కుటీరపు పదడుగుల తాటాకు కప్పు ఎక్కువా కాలేదు, తక్కువా కాలేదు, ఆ ముగ్గుర్నీ కాపాడటానికి.
కుటీరపు అరుగు మీద సోమరిగా కూర్చుని ఉంటే పక్కనే నదీప్రవాహంలా రెండడుగుల వెడల్పున సాగిపోతోన్న చీమలదండు, క్షణాల్లో దాటిపోయిన చీమలదండు… గచ్చుమీద కూరలు కోస్తూ కూర్చుంటే ఎటునుంచో వచ్చి ఒకదానివెంట ఒకటిగా ఆమెమీదుగా నడుచుకొంటూ వెళ్ళిపోయిన నాలుగు గొంగళి పురుగులు.
కొంతకాలంగా కుటీరం పైకప్పున ఏదో ప్రాణి మరో ప్రాణి కోసం ప్రతిరోజూ జరుపుతోన్న వేట… ఏవిటా ప్రాణులూ? ఆ అంతుచిక్కని క్షణాల్లో ఓనాటి సాయంత్రం బయట బెంచీ మీద పుస్తకంతోపాటు ఆమె వాలబోగా చూరులోంచి పెనగులాడుతోన్న ఎలుకతోపాటు జారిపడిన పాము! ఇంతకాలం వీరికంట పడకుండా జాగ్రత్తపడిన పాము! ‘ఇన్నాళ్ళూ మనతోపాటు కలసి నివసిస్తోంది, ఎప్పట్లాగే ఉండనిద్దాం’ అంటాడతను. వారి కుటుంబంలో కొత్త సభ్యులు చేరినందుకు ఆమెకు సంతోషం.
చూరులోని పాము కుటుంబంలోని సభ్యురాలయితే అడపాదడపా వచ్చిపోయే ప్రాణులకూ ఏం కొదవలేదు. పగటి పని ముగించుకొనిన ఆమె పడీపడని వాన తరువాత వీస్తోన్న చల్లగాలినీ నీరెండనూ హేమక్‌లో వాలి అనుభవిస్తుండగా తొండను వెంటాడుతూ పందిరి అంచుదాకా వచ్చి ఆగిపోయిన త్రాచు! అతడిని పిలిచి చూపించేలోగా వెనక్కి తిరిగి కాలిబాటలో అదృశ్యమైన త్రాచు…
పెరిగిన కుటీరపు సందర్శకులు… తరగని ప్రశ్నలు. ‘ఒక ఏడాది అడవిలో గడిపిరండి, అప్పుడు మాట్లాడుకొందాం’ అంటే చెదిరిపోయే జిజ్ఞాసులు… మిగలని ప్రశ్నలు.
సూర్యవతీ నాగేశ్వర్రావూ కుటీరం కట్టుకోడానికి సావడి ఇచ్చిన మిత్రులు. కొండరెడ్లు. కొండలు దిగి ధారపల్లి చేరి వ్యవసాయం చేసుకొంటోన్న కొండరెడ్లు. అలాగే ఊళ్ళో మరికాసిని కుటుంబాలు.
కోతలకూ ఊడ్పులకూ వెళ్ళి వాళ్ళతో పనిచేస్తుందీమె. అలా కోతలకోసమే వచ్చిన ఎన్నో పెనుగాలులను చూసిన కాంతమ్మ. వందల యేళ్ళనాటి చింతచెట్టును జ్ఞప్తికి తెచ్చే కాంతమ్మ. కొండలోంచి నడచివచ్చినట్టుండే కాంతమ్మ. ఆ కాంతమ్మ ఓ రోజు కోతకోసి కుటీరంలో సేదదీరాక ‘ఈ పందిరి నీడలోంచి వెళ్ళబుద్ధి కావడంలేదు.’ అంటుంది.
తాను పెళ్ళిచేసుకొని అడుగుపెట్టిన ఊరికి ఈమెను తీసుకువెళ్ళడానికి ఓరోజు వచ్చింది సూర్యవతి. ఆ ఊరిపేరు బాపనదార.
బాపనదార చేరుకోవాలంటే ఒక కొండ ఎక్కి ఘాటీలో ఎంతో దూరం నడవాలి. నడిచారు ఆమే సూర్యవతీ. దారిలో మహావృక్షాలున్న అడవి. మూడు ఊళ్ళు. దారంతా సూర్యవతి బంధువులు. ఆ కొండలూ దారులూ సూర్యవతి బాగా ఆడిపాడిన ప్రదేశాలు. ఘాటీలో ఓ కోట-ఎవరో ఎప్పుడో కట్టిన కోట. చుర్రుమనే ఎండ. వీచే చల్లగాలి. దోసిళ్ళు పట్టి దాహం తీర్చుకోడానికి అక్కడక్కడా ఊటనీళ్ళు. కొండదాటి కోటదాటి అడవి దాటాక బాపనదార.
ఊరి నిశ్శబ్దాన్ని ముక్కలు చేస్తూ ఎవరో కొండ మనిషి బట్టలుతుకుతోన్న మోత. రకరకాల పనుల్లో ఊరిజనం. పలకరింపులు మర్యాదలు ఆతిథ్యం–మళ్ళా ఎండలోనే తిరుగుప్రయాణం ధారపల్లికి.
‘తోట ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు’ అంటాడు అతను.
ఇద్దరూ కుటీరం నిర్మించడానికి కృషిచేస్తున్న రోజుల్లో, ఆకలివేసిన సమయాన, పాకలో కర్రకు తగిలించిన అన్నం సంచి దించి, చేసిన టమేతో పచ్చడి, కోసుకొచ్చిన మిరపకాయలు, చేసి ఉంచిన మజ్జిగతో భోజనం చేశాక మట్టి చల్లదనం, వెదురుల పచ్చదనం, తాటాకుల నీడలు నంజుకొని భోజనం చేశాక అతడు అంటాడు: ‘ఆకలి తీరడమంటే ఇది!’
అక్టోబరు పసుపుపచ్చని మధ్యాన్నపు పూట.
‘ఈ నీడల్ని చూస్తే నీకేమనిపిస్తుందీ?’ అడుగుతుంది ఆమె.
అడిగిందేగానీ ఈ నీడలు, ఈ ఎండ, ఈ తీరిక, ఆ వెదురు మీద పాకుతోన్న చీమల్ని చూస్తూ కాలంగడపడం–అవి తప్ప ఇంకేమీ కావాలనిపించదని ఆమెకు తెలుసు.
ఉత్తరకొండ అడవిలోకి ఆమె వెళ్ళినపుడు చల్లగాలి దాడిచేస్తుంది. శరీరంలోని కణాలన్నీ తెరచుకొన్న కోటానుకోట్ల కిటికీలుగా మారగా, చల్లగాలి లోపలికి దూరి బయటకు వచ్చేస్తుంది. శరీరమూ మనసూ శుభ్రపడిన అనుభూతి. ‘ఒక్కరోజు ఇక్కడ జీవించినా చాలు, సంతోషంగా ప్రాణం వదిలేస్తాను.’ అనుకొంటుందామె.
సెప్టెంబరు మొదటివారపు ఉదయాలు హింసిస్తాయామెను. నీరెండ పడుతోన్న ఉదయపువేళలు కలిగించే తియ్యని బాధ. వెయ్యేళ్ళయినా చాలవేమో అనిపిస్తుంది ఒక క్షణాన. చాలు, చాలు, హృదయం ముక్కలవుతోంటే తట్టుకోవడం కష్టం అనిపిస్తుంది మరో క్షణాన.
కుటీరం చుట్టూ పడిపోతోన్న ఆ ముక్కల్ని ఏరుకొనేలోపే గడచిపోయే రోజులు.
ఈ ‘అడవి పుస్తకం’లో కుటీరపు వివరాలు మాత్రమే ఉన్నాయా?
కాదు. నిజానికి ఈ పుస్తకం ఆమె రెండున్నర సంవత్సరాల క్రిందట రాసిన ‘అడవి నుండి అడవికి’ అన్న రచనకు కొనసాగింపు. ఎక్కడ ఆ పుస్తకం ముగిసిందో అక్కడ్నించి ఆరంభమవుతుందీ పుస్తకం…
కుటీర జీవితపు వివరాలతోపాటు ఇందులో ఎడారి ప్రయాణాలు, పాకాల అడవులు, తమతోపాటు ఉంటోన్న వైటీ, దాని మిత్రులు, తాము చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, తమకు తెలిసిన విలక్షణ యాత్రికులు–ఈ వివరాలన్నీ ఉన్నాయి. విడివిడి అధ్యాయాలున్నాయి. నిజానికి ఈ పుస్తకం విస్తృతి ఎంతో పెద్దది. అందులో నన్ను బాగా ప్రభావితం చేసిన ‘కుటీరం’ చుట్టూ ఈ మాటలు అల్లాను. అసలు అడవికి ఆదీ అంతం ఉండవు. అలాగే అడవి పుస్తకానికీ ఉండవు. ఇది ఒక సశేష సజీవ అనుభవ భావధార.
అడవి నేపథ్యంగా ఉన్న పుస్తకాలు తెలుగులో రాకపోలేదు. కానీ నాకు తెలిసి అడవిని ఇంతగా ఇంకించుకొన్న పుస్తకం తెలుగులో ఇంతవరకూ లేదు.
పుస్తకం వెల: ₹200/-
ప్రచురణ: ఏప్రిల్ 2021
పేజీలు: 220
దొరుకు చోటు: పుట్ట పుస్తక శిబిరం, మొబైల్: 98480 15364, అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు.