తూరుపుగాలులు

ఏ రచయితకయినా తాను ఎందుకు రాస్తున్నది, ఎవరికోసం రాస్తున్నది, ఏ ప్రయోజనం కోసం రాస్తున్నదీ లీలగానయినా తెలిసి ఉంటుంది. ఆత్మసంతృప్తి నుంచి ప్రపంచాన్ని మార్చేయడం వరకూ ఆ కారణాలు ఏవైనా కావచ్చు.

సాహిత్యం పట్లా చరిత్ర పట్లా నాకున్న ఆసక్తి నన్నో పాఠకుడిగానూ చరిత్ర విద్యార్థిగానూ మలిచింది. చరిత్ర పుటల మధ్య పేరుకుపోయిన సుదీర్ఘ నిశ్శబ్దాలు నన్ను వేధించాయి. ఎన్నో విషయాలు తెలుసుకోవాలనిపించింది. ఆ తెలుసుకొనే ప్రక్రియలో భాగంగా కొన్ని సమాధానాలు, మరెన్నో (కొత్త) ప్రశ్నలు… ఈ తెలుసుకోవాలన్న ఆసక్తి, పరిశోధన, దానివల్ల సంక్రమించే ఎరుక–ఇవన్నీ మేధోపార్శ్వపు గుణగణాలు మాత్రమే అన్న స్పృహ ఉంది. చారిత్రికశక్తుల సంఘర్షణలో నలిగిపోయిన సామాన్యుల నిట్టూర్పులూ ఆక్రందనలూ నా మనసును తాకాయి. నేను తెలుసుకున్న విషయాలను మానవీయంగా పాఠకులకు అందించాలనిపించింది. గతానికి వర్తమానంతోనూ భవిష్యత్తుతోనూ ఉండే సజీవసంబంధాన్ని ఆవిష్కరించాలనిపించింది. అందుకు వ్యాసాలు కాకుండా కథాప్రక్రియే సరి అయిన వాహిక అనిపించింది.


ఛాయ ప్రచురణలు, 2018.

తూరుపుగాలులు కథాసంపుటికి ముందుమాటగా తన కథల గురించి, తన గురించి ఉణుదుర్తి సుధాకర్ చెప్పిన మాటలివి.

ఇంత పెద్ద ఉద్దేశంతో, ఎంతో విస్తృతమైన కాన్వాస్ మీద అక్షరాలను చిత్రించడం, పాఠకులకు అందించడం చాలా క్లిష్టమయిన కష్టమయిన పని. ఆ పనిని గత కొన్నేళ్ళబట్టి చేస్తున్నారు రచయిత సుధాకర్. ఆ ఫలితాలను తూరుపుగాలులు కథాసంపుటిగా ఈ ఆగస్ట్ నెలలో పాఠకుల ముందుకు తీసుకువచ్చారాయన. అంతా కలసి పదమూడు కథలు. అందులో రెండు 1994 నాటివి. మిగిలిన పదకొండూ అరవై దాటిన పరిణత వయస్సులో గత మూడు నాలుగేళ్ళలో రాసినవి.


కథలని ఇష్టపడేవాళ్ళు, మంచికథల కోసం శ్రద్ధగా వెతుక్కునేవాళ్ళు సంతోషపడి సంబరాలు చేసుకొనే సందర్భాలు అప్పుడప్పుడూ ఎదురవుతూ ఉంటాయి. మూడేళ్ళ క్రితం మూడు కోణాలు అన్న కథ వెలుగులోకి రావడం–అదిగో, అలాంటి సందర్భం.

హైదర్ అలీ, టిప్పు సుల్తాన్‌లతో యుద్ధాల తర్వాత ఆంగ్ల పాలకులు ది గ్రేట్ ట్రిగనామెట్రికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్న మహాకార్యాన్ని చేపట్టడం, అది అరవై యేళ్ళపాటు సాగి చిట్టచివరి దశలో తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి చుట్టుపక్కల సాగుతూ ఉండడం, ఆ పనికి బాధ్యుడిగా క్లార్క్‌సన్ అన్న ఆంగ్లేయుడు వ్యవహరించడం, అతనికి సహాయకుడిగా పనివాళ్ళతో ఎంతో సామరస్యంగా వ్యవహరించి ఫలితాలు రాబట్టుకొనే సూర్యనారాయణరాజు అనే సూపర్వయిజరు, జమాఖర్చులూ వగైరా బాగా రాస్తూ అధికారులకు నమ్మదగిన వ్యక్తిగా వ్యవహరించే గుమస్తా రామయ్య పంతులు…

సర్వే పనులు మాంచి ఊపులో సాగిపోతూ, ముగించవలసిన తారీఖు దగ్గర పడుతూండగా, అనుకోని ప్రమాదం జరిగి ఒక అతిముఖ్యమైన పరికరం దెబ్బతినడం, సర్వే పనులు కనీసం నెల రోజులు వెనకబడతాయి కదా అని క్లార్క్‌సన్ ఆందోళన, సూపర్వయిజరు రాజు అక్కడి సవరగూడెంలో ఉండే ఒక ముసలతను ఇలాంటి రిపేర్లు చెయ్యగలడని చెప్పడం, అది నమ్మశక్యం అనిపించకపోయినా అధికారి అందుకు ఒప్పుకోవడం, రాజుతో కలిసి తానూ డుంబ్రీ అనే ఆ ముసలతని దగ్గరకు వెళ్ళడం, అపురూపమైన నైపుణ్యంతో డుంబ్రీ ఆ పరికరాన్ని బాగుచేయడం, మరో రెండు వారాల్లో క్లార్క్‌సన్ బృందం సర్వే ముగించి విశాఖపట్నం చేరుకోవడం–ఇదీ కథ.

ఇదేనా కథ?!

ఈమాత్రానికే చెప్పుకోదగ్గ కథ ఎందుకయిందీ?

నూట అరవై యేళ్ళనాటి వాతావరణ చిత్రణ. మనస్తత్వాల ఆవిష్కరణ. ఒక చారిత్రిక కార్యక్రమానికి సజీవ రూపకల్పన. మారుమూల బ్రతికే సవర మనిషి సాంకేతిక నైపుణ్యానికి నివాళి, ప్రతిఫలంగా అతగాడు తనవారందరి కోసం ఒక బస్తాడు ఉప్పు కావాలనడంలోని మానవీయత… ఇవన్నీ ఒక కోణం.

ఇంకా ముందుకు వెళ్ళి, ఆ ఆంగ్లాధికారితోనే, ‘త్రికోణమితి నిష్పత్తులన్నీ ఇండియా నుంచి అరబ్బుల ద్వారా ఐరోపా చేరాయంటారు గదా, మరి ఆ శాస్త్రాలన్నీ ఎటుపోయాయి? ప్రస్తుతం నైపుణ్యం ఉన్నచోట శాస్త్రం లేదు. శాస్త్రం ఉన్నచోట నైపుణ్యం లేదు. ఇక్కడి చదువుల్లో శాస్త్రం, నైపుణ్యం రెండూ లేవు,’ అని ఆర్తితో అనిపిస్తారు రచయిత. ఇది కథలో ఇమిడిన మరో పొర. రెండో కోణం.

కథ ముగింపులో ‘మన్యం, ఏజెన్సీ ఘాట్‌రోడ్‌లకు సవివరమైన సర్వేలు మొదలయాయి. రామయ్య పంతులు ఆఫీసు సూపర్నెంటుగా రిటైరయ్యాడు. సూపర్వయిజర్ రాజు ఉద్యోగం మానేసి రైల్వే కాంట్రాక్టర్‌గా మారి కోటీశ్వరుడయాడు. అన్నట్టు, డుంబ్రీ ఏమయ్యాడో తెలియలేదు.’ అని అలవోకగా చెప్పడంలో రచయిత గతాన్ని ముందుకు నడిపించి సమీపగతం దగ్గరకూ ఆయా పరిణామాల ఛాయల దగ్గరకూ నడిపిస్తారు.

అంతే కాకుండా, ‘డుంబ్రీ ఉండే ప్రాంతాల్లో కదలిక మొదలవ్వడానికి చాలాకాలమే పట్టింది.’ అంటూ కథను వందేళ్ళు ముందుకు తీసుకువచ్చి అరవైలనాటి శ్రీకాకుళం దగ్గర నిలబెడతారు.


తూరుపు గాలులు అన్న కథలో బౌద్ధమతానిది ప్రధానపాత్ర.

కథాకాలం పన్నెండో శతాబ్దం చివరి రోజులు. నలందా విశ్వవిద్యాలయాన్ని, ముఖ్యంగా అక్కడి గ్రంథాలయాన్ని భక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేయడం కథానేపథ్యం.

పంపానదీతీరాన ఉన్న బౌద్ధవిహారం, దాని ఆచార్యులు భద్రపాలుడు, నలభై యేళ్ళ క్రితం వందలాది భిక్షువులతో కళకళలాడిన విహారం ఇప్పుడు పదీ పన్నెండు మందికి మాత్రమే ఆవాసం అవడం, విహారపు గుహలు శివాలయాలుగా మారి జంతుబలులకు నెలవవడం, విహారపు భవిష్యత్తు అని భావించి నలందాకు పంపబడిన శిష్యుడు దీపాంకరుడు నలందా విధ్వంసం నేపథ్యంలో మనసు చెదరి తిరిగిరావడం, బౌద్ధానికి ఆదరణ తగ్గడం గురించి గురుశిష్యులు చర్చించడం, ‘మనదేశంలో రాజాదరణ ఉన్నంతగా ప్రజాదరణ లేదు… హర్షుని తర్వాత రాజాదరణా లేదు… కిందపొరల వాళ్ళని బౌద్ధానికి ఆకర్షితులయ్యేలా చేసి హేతుబద్ధమయిన ధర్మపథం వైపు నడిపించాలి’ అన్న దీపాంకరుని ప్రతిపాదన, అదే సమయంలో ఆ విహారానికి వచ్చిన సింహళ భిక్షువు శాంతిదేవుడు ‘మా దేశంలో ప్రజాదరణ ప్రాతిపదికన బౌద్ధం నడుస్తోంది. దీపాంకరుడు నాతోపాటు వచ్చి అక్కడి పరిస్థితులూ పద్ధతులూ పరిశీలిస్తే ఇక్కడ వాటిని అమలుపరిచే ప్రక్రియ సరళమవుతుంది,’ అని ప్రతిపాదించడం, ఆపైన దీపాంకరుడు సింహళం చేరడం, అక్కడ కూడా మతమూ రాజకీయమూ దారుణంగా కలగలసిపోయి శాంతిదేవుని హత్యకు దారితీయడం, ప్రాణహాని పరిస్థితుల్లో దీపాంకరుడు హుటాహుటిని ఆ దేశాన్ని విడిచి రావడం, తన పంపానదీతీరపు విహారం నశించిపోగా ధాన్యకటకపు విహారానికి చేరి ఇరవై యేళ్ళు అక్కడ అధ్యాపకుడిగా గడిపి మరణించడం…

బౌద్ధం గురించి, ఆ మతవిధానాల గురించి, అప్పటి పరిస్థితుల గురించి, ఆ మతం భారతదేశం నుండి నిష్క్రమించడం గురించి ఎంతో వివరంగా చర్చించిన పెద్ద కథ తూరుపుగాలులు.


తెగిన నూలుపోగు అన్న కథకు వేదిక పదిహేడో శతాబ్దపు బందరు రేవుపట్టణం. గోల్కొండ ప్రభువుల పాలనలో ఉన్న ఆ రేవుపట్టణంలో ఇంగ్లీష్, ఫ్రెంచ్, డచ్ వ్యాపారులు మస్లిన్ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి బందరు రేవును విరివిగా వాడుతున్న తరుణమది. పోర్చుగీస్ వ్యాపారులను ఈ ముగ్గురూ కలగలిసి తరిమికొడుతున్న సమయమది.

పన్నెండు మగ్గాలతో నూలు బట్టలు ఉత్పత్తి చేసే సిద్ధయ్య, కుర్రతనం పూర్తిగాపోని అతని కొడుకు గురవయ్య, తమ సరుకును తండ్రీకొడుకులు సుబ్బయ్యశెట్టి గోదాముకు చేర్చడం, అతికీ అతకని ప్రతిఫలం, గోదాముల్లోని సరుకును విదేశాలకు తీసుకుపోవడానికి సంసిద్ధంగా ఉన్న ఓడల సమూహం, అక్కడి సముద్రజలాల్లోకి చొరబడిన బుడతకీచు సముద్రపు దొంగ, అతనిమీద విచారణ, ‘పోపు ప్రభువు పూర్వార్ధగోళం పోర్చుగీసులకూ, ఉత్తరార్ధగోళం స్పెయిను వారికీ ఏనాడో పంపకం చేశారు – దాన్ని అతిక్రమించిన అసలు దొంగలు ఈ ఆంగ్ల, ఫ్రెంచి, డచ్చి వ్యాపారులే!’ అన్న బుడతకీచు కెప్తాను అసఫలవాదన, అతనికి జరిమానా విధిస్తూనే ‘బుడతకీచులు ఇకమీదట ఇటు రాకుండా చేసేందుకు’ అయిదువందల పగోడాలు రాబట్టిన మున్సబ్‌దారు… అదంతా గమనించిన గురవయ్యకు–అసలు ఈ సుబ్బయ్యశెట్టి గోదాములు, విదేశీనౌకలు, సముద్రజలాలు, ఆధిపత్యాలు–ఇదంతా ఎందుకు, మన శ్రమ మన ఆధీనంలోనే ఉంటే మంచిది గదా- అన్న ఆలోచన రావడం, దాన్ని బహిరంగంగా వ్యక్తపరచినందుకుగానూ మున్సబ్‌దారు గురవయ్యకు జరిమానా, కొరడాదెబ్బలూ ప్రసాదించడం…

మూడువందలయాభై యేళ్ళనాటి సామాజిక, ఆర్థిక, వాణిజ్య, రాజకీయ పరిస్థితులను తవ్వి తీస్తున్న పద్ధతిలో కాకుండా సజీవస్పందనగా మన కళ్ళముందు నిలబెట్టిన కథ, తెగిన నూలుపోగు!

1857నాటి పరిణామాలు, అందులో అప్పుడే అడుగుబెట్టిన టెలిగ్రాఫ్ వ్యవస్థ పాలకులకు పట్టుకొమ్మ అయిన వైనం, అలాంటి ప్రమాదకరమైన వ్యవస్థను ధ్వంసంచేయడానికి పూనుకున్న దళిత యువకుడు-ముస్లిమ్ యువతి, వారి సాహసం-త్యాగం: ఈ నేపథ్యంలో సాగిన కథ, వార్తాహరులు.

ఒక వీడ్కోలు సాయంత్రం కథలో ఇద్దరు ఆంగ్లాధికారులు. వారి స్వభావాలు అంతగా కలవకపోయినా ఒక సాయంత్రం పూట సమకాలీన పరిణామాలని చర్చిస్తూ గడపడం కథావస్తువు. అప్పుడే అడుగు పెడుతున్న రైల్వే, టెలిగ్రాఫ్ వ్యవస్థలు, కాలూనుకుంటున్న విద్యాన్యాయ వ్యవస్థలు, ప్రజల కోసం తపనపడే ఆర్థర్ కాటన్, ‘బ్రిటిష్ వారు ప్రవేశపెడుతున్న రైల్వేలే వారి కొంప ముంచుతాయి’ అని రాస్తున్న యువ జర్మన్ పాత్రికేయుడు, కొత్తగా రూపు దిద్దుకుంటున్న ఇండియన్ సివిల్ సర్వీస్ విభాగం–ఇలాంటి ఎన్నో విషయాలు ఈ 1860 నేపథ్యపు కథలో కనిపించి భవిష్యవాణిని వినిపిస్తాయి.


తూరుపుగాలులు సంపుటంలోని కథలన్నీ బౌద్ధమతానికి, విదేశీయుల రాకడకు, బ్రిటిష్ పరిపాలనకు, నూతన సాంకేతిక వ్యవస్థలు దేశంలో అడుగుపెట్టడానికి సంబంధించినవేనా అన్న అనుమానం రావచ్చు.

నిజానికి పదమూడు కథల్లో ఐదు మాత్రమే ఈ నేపథ్యాలకు చెందినవి.

మిగిలిన ఎనిమిదీ సమకాలీన జీవితానికి, కనీసం స్వాతంత్ర్యానంతర స్థితిగతులకు చెందిన కథలు. కానీ కథాకాలం మారినా కథలలో మౌలికమైన ప్రశ్నలు వేసుకోవడం, వాటికి సమాధానాలు వెతకడం అన్న ప్రక్రియ మాత్రం కొనసాగింది.

2018లో వచ్చిన చేపకనుల రాజకుమారి కథాకాలం 1970ల నాటిది. ఒక మామూలు తొమ్మిదో క్లాసు పిల్లాడికి, అంతరించిపోయిన రాచరికాల కుటుంబపు రాజకుమారి మీనాక్షికి, అలవోకగా అమరిన స్నేహపు కథ ఈ చేపకనుల రాజకుమారి. ఆ స్నేహం గురించి చెప్పుతూనే, కొడిగట్టుతున్న రాచరికాలు, దివాణాలు, పుట్టుకొస్తున్న దళారీ వ్యవస్థ, రాబోయే పరిస్థితుల తీరుతెన్నులు, స్వాతంత్ర్యం తరవాత వచ్చేస్తుందని అమాయక ప్రజానీకం ఆశపడ్డ సమసమాజాన్ని దళారీలు ఎగరేసుకుపోతున్న వైనం–ఈ కథలోని అసలు పొరలు.

మతోద్ధారణ కోసం జీవితాన్ని వెచ్చించిన పెద్దమామయ్య, విప్లవం కోసం తనవంతు కృషి చేసిన చిన్నమామయ్యలది ఇద్దరు మామయ్యల కథ. కాలక్రమేణా పెద్దమామయ్య మతంనుంచి ఆధ్యాత్మికత వైపు, చిన్నమామయ్య మహాసంగ్రామాలనుంచి చిన్న చిన్న పోరాటాల వైపూ మళ్ళడాన్ని చూపిస్తుందీ కథ. సందర్భానుసారం కథలో ‘మార్పు కోసం పోరాడిన నేతలు అధికారానికి వచ్చాక నియంతలుగా ఎందుకు మారుతున్నారూ? ఎంచేత ప్రపంచవ్యాప్తంగా సామ్యవాద వ్యవస్థలు కుప్పకూలాయీ?’ అన్న విషయాలు కథలో చర్చకు వస్తాయి. ‘(కాషాయం అయినా ఎర్రజెండా అయినా) చివరికి అన్నీ ఒకటేరా!’ అని కథను చెప్పే వ్యక్తి అమ్మ చివరిలో అంటుంది. ‘విశ్వాసంతో మొదలుపెట్టి అక్కడే ఆగిపోతే అది మూఢనమ్మకాలకు పునాది అవుతుంది.’ లాంటి మంచి పరిశీలనలు ఈ కథలో ఉన్నాయి.

‘బలహీనుణ్ణి కూడా ధీరులుగా మార్చే ధైర్యం దేవదూతలది. ప్రతీవాడినీ పీడించి బలహీనపరచే ధైర్యం క్రూరమనస్కులది.’ అంటూ ధైర్యానికి ఉన్న రెండు పార్శ్వాలను విడమర్చి చెపుతుంది, దేవదూతలు కథ.

‘మనుషుల్ని చంపడం అంటే అంత తేలిక కాదు. నిర్దాక్షిణ్యంగా ఉండాలి. మీవాళ్ళా సంగతి ఇప్పుడిప్పుడే మా దగ్గర నేర్చుకుంటున్నారు,’ అంటాడు ఇన్‌స్పెక్టర్ సూర్యారావు, తనకు గడ్డం గీస్తూ పీక మీద పదునుపాటి కత్తి పెట్టి క్షణకాలం తటపటాయించిన వర్గచైతన్యం ఉన్న బార్బరు షాపు కుర్రాడితో. కొంచెం సబ్బునురగ, ఒక కత్తిగాటు- ఈ కథ పేరు.

ఎన్‌కౌంటర్ల సంప్రదాయానికి నాంది పలికిన పంచాది కృష్ణమూర్తి కాలానికి చెందిన ఒకానొక ఘట్టం గురించి చెప్పిన కథ, ఏడుకానాల వంతెన.

వర్ణవ్యవస్థ శిఖరాగ్రానికి చెందిన ఒక యువకుడు విదేశాలలో వర్ణవివక్షకు బలి అయ్యానని భావించి బాధపడుతూ ఉండటం, కులవ్వవస్థ దిగువ పీఠాలకు కూడా చెందని అతని చిన్ననాటి సహాధ్యాయి తటస్థపడి అతనిలో నమ్మకం నింపడం, వాళ్ళు-మనం మీరు-మేము కథ.

‘సత్యానిది తెలుపు రంగూ కాదు, నలుపు రంగూ కాదు. బూడిదరంగు. సృష్టిలో సమతౌల్యం ఉంది. మన జీవన విధానాల పుణ్యమా అని ఆ బాలెన్స్ కోల్పోతున్నాం.’ అని ప్రతిపాదిస్తుంది, బూడిదరంగు అద్వైతం కథ.


ఎనిమిది వందల సంవత్సరాలనాటి విషయాల గురించి, బౌద్ధం నుంచి సామ్రాజ్యవాదం, రాచరికం, ఫ్యూడలిజం, కమ్యూనిజం, నక్సలిజం వరకూ వివిధ నేపథ్యాలలో కథలు కట్టాలంటే ఎంతో సాహసం కావాలి. దాన్ని మించిన ఆత్మవిశ్వాసం ఉండాలి. ఈ రెంటినీ మించిన అధ్యయనం, పరిశీలన, సాంఘిక ఆర్థిక రాజకీయ తాత్వికత ఉండాలి. విషయాలను పైపైన ముట్టుకొని ఊరుకోకుండా లోతుల లోలోతుల్లోకి వెళ్ళగల సామర్థ్యం ఉండాలి. ఈ పదమూడు కథల్లోనూ ఆయా లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయి.

కాలమాన పరిస్థితులకు చెందిన వాతావరణ చిత్రణ, పాఠకులను ఆయా ప్రపంచాలలోకి అలవోకగా తీసుకువెళ్ళడం, గతం వర్తమానాన్ని శాసిస్తున్న విధానాన్ని చిత్రించడం, కథల్ని ఒక తలంపై చెప్పుకొస్తూనే అందులో ఇమిడిన అనేకానేక అంశాలను పొరలు పొరలుగా గుప్తపరచడం–అరుదైన కథలివి.

కాలాలూ ప్రాంతాలూ సిద్ధాంతాలూ చారిత్రిక పరిణామాలూ– వీటన్నిటి నడుమనా కథకుని ఊహాశక్తి, భావనాబలం, కవి హృదయం అడపాదడపా బయటపడుతూనే ఉంటాయి.

నేత నిపుణుల శ్రమఫలాన్ని ఎగరేసుకుపోవడానికి రేవుపట్నంలో సంసిద్ధంగా ఉన్న ఓడలని ‘దొంగజపం చేస్తున్న కొంగల్లా తళతళా మెరుస్తున్నాయి’ అని వర్ణించడం యాదృచ్ఛికం కానే కాదు. ‘ఎవరో జర్మన్ పాత్రికేయుడు’ అంటూ అలవోకగా కార్ల్ మార్క్స్‌ను ఒక వీడ్కోలు సాయంత్రం కథలో ప్రవేశపెట్టడం అతి చక్కని మెరుపు. అదే కథలో ఆ సాయంత్రాన్ని వర్ణిస్తూ ‘క్లబ్బు ఆవరణ లోని మామిడిచెట్ల మీది బంగారు ఎండ తేనె రంగుకు మారుతోంది. తీరం వెంట ఇసుకతిన్నెలు రాగిరంగులో మెరుస్తున్నాయి. వాటికి నేపథ్యంగా గాఢనీలం నుంచి ఊదారంగుకు మారిన సముద్రం’ అంటూ చేసిన పదచిత్ర ప్రయోగం కథకుడిలోని కవినీ భావుకుడినీ పట్టిస్తుంది.


ఎన్నో విషయాలను పాఠకుల ముందుంచే బృహత్ప్రయత్నంలో గాఢత లోపించడం, తెచ్చిపెట్టుకున్న ధోరణి కనిపించడం ఉంటాయా? అని వెదికాను. దాదాపు లేవనే చెప్పాలి. ఒక్క తెగిన నూలుపోగు విషయంలో మాత్రం ఆ లోపం.


(అన్ని పుస్తకాలషాపుల్లోనూ లభ్యం)

ఉత్పత్తి గురించి, దాని పంపిణీ గురించి, అందులోని బలాబలాలు గురించి, వీటిలో అంతగా సంబంధం లేదనిపించే రవాణా మార్గాల గురించి, ఆయా మార్గాల మీద (అది సిల్క్‌రూట్ అవచ్చు, సముద్రజలాలు కావచ్చు) ఆయా వ్యాపారవర్గాలకుండే ఆధిపత్యం గురించి, ఆ ఆధిపత్యాన్ని నిలబెట్టడంలో రాజ్యం (రాజ్యాలు) వారికి అందించే చేయూత గురించీ సరళంగా విశదీకరించిన కథ, తెగిన నూలుపోగు. కానీ ఆ విశదీకరణకు వాడిన పాత్ర గురవయ్య. ఈ గురవయ్య ఇంకా కుర్రతనం పోని, దొంగచాటుగా కల్లుపాకలకు వెళ్ళే తండ్రిచాటు కొడుకు. చూస్తే పెద్దగా చదువూ ఉన్నట్టు కనిపించదు. అలాంటి పాత్ర అంత నిశితంగా పరిశీలించడం, స్థానిక జాతీయ అంతర్జాతీయ వాణిజ్యపు లోతులను ఆకళింపు చేసుకోవడం, చేసుకొని సరియైన పదజాలంతో భావధారతో ‘రాజ్యం’ ముందు ఆ విషయాలు వ్యక్తపరిచే సాహసం చెయ్యడం; ఇవన్నీ గురవయ్యకు సాధ్యం కాని పనులు. రచయితే ముందుకు వచ్చి చేసిన పనులు.

అలాగే తూరుపు గాలులు కథలో ఏకసూత్రత లోపించిందా అనిపించింది. కథలో మొట్టమొదటిగా వినిపించేది రాజాదరణ పోయిన తరవాత బౌద్ధం కనుమరుగవుతోంది అన్న పరిశీలన. కథలోనే చెప్పినట్టు బౌద్ధాన్ని ఆదరించిన చిట్టచివరి ముఖ్యమైన రాజ్యాధినేత హర్షుడు. ఏడో శతాబ్దపు హర్షుడు. ఆ తర్వాత ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరుని కృషి కూడా బౌద్ధాన్ని భారతదేశం నుంచి బయటకు వెళ్ళేలా చేసింది అన్న చారిత్రక అంశం ఎందుచేతనో ప్రస్తావనకు రాలేదు. ‘నలభై ఏళ్ళక్రితం ఈ విహారంలో వందలాది భిక్షువులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య ఏ పదో పన్నెండుకో చేరింది,’ అనడంలో బౌద్ధం పన్నెండో శతాబ్దపు యాభైయవ దశకం వరకూ కనీసం ఆ విహారంలో కళకళలాడుతూ ఉందన్న ధ్వని వినిపిస్తుంది. ఈ ధ్వని రాజాదరణ లేకపోవడమే బౌద్ధమత క్షీణతకు కారణం అన్న ప్రతిపాదనతో విభేదిస్తుంది.

అలాగే దీపాంకరుని సింహళయాత్ర వెనుక ఉన్న ఒకే ఒక ఉద్దేశం ఆ దేశంలో బౌద్ధమతం ప్రజాదరణకు పాత్రమై ఎలా వేళ్ళూనిందో పరిశీలించడం. అతగాడు ఆ దేశానికి చేరగానే ప్రజాదరణ పరిశీలన అన్న అంశం పక్కకు వెళ్ళి, ఇపుడు భారతదేశానికి కావలసింది మతగ్రంథాల సేకరణ, ప్రాచుర్యం (నలందా విధ్వంసంలో అన్నీ పోయాయి కాబట్టి) అన్న అంశం ముందుకొస్తుంది. అది అలా జరుగుతూ ఉండగానే అనేకానేక రాజకీయ కలహాలూ కుట్రలూ ఆ దేశంలో చెలరేగి దీపాంకరునికి అండగా నిలిచిన శాంతిదేవుడే హత్యకు గురి అవడం కనిపిస్తుంది. చివరికి దీపాంకరుడు ఏ ప్రయోజనమూ సాధించకుండానే సింహళదేశం నుండి తిరిగి వస్తాడు. తాను నమ్మిన ప్రజల ఆదరణే మతం నిలబడడానికి అవసరం అన్న అంశం మీద ఏ కృషీ చెయ్యకుండానే రంగస్థలం మీంచి శాశ్వతంగా నిష్క్రమిస్తాడు.


గుణగణాల సంగతి ఎలా ఉన్నా ఈమధ్య కాలంలో ఇలాంటి విలక్షణమైన, విభిన్నమైన, అపురూపమైన కథాసంపుటి రాలేదు అన్నమాట నిజం.

ఇవి మామూలు కథలు కావు. ఏ మూసకూ చెందని కథలు ఇవి.

దశాబ్దానికో, తరానికో ఒక్కసారి మనముందుకు వచ్చే కథలు.