శ్రీలలితాలక్ష్మణుడున్
బాలితజనరక్షణోరుభారభరతుడున్
బాలిశశత్రుఘ్నుడుఁ దా
నేలిక యన నొక్క రాముడే యనవలెగా!
Category Archive: పద్య సాహిత్యం
పట్టుపురుగు కోరి యిల్లు కట్టుకొనగ
తనదు పట్టు తననె చుట్టి చచ్చినట్లు
మదిని రేగు కోర్కెలు మనిషిని బంధించునయ్య!
నా మనసు దురాశల నాశమొందగజేసి
నీ దరిని జూపు చెన్నమల్లికార్జునయ్య!
పేరు గుర్తులేదు కాని, నా చిన్నతనంలో, చచ్చిపోతున్న ఒక భాషలో చివరి మనిషైన ఒక కొండప్రాంతానికి చెందిన ముసలామె వినేవారెవరూ లేక, ఒక పక్షితో తన భాషలో మాట్లాడిందని ఎక్కడో చదివేను. ఆ వార్త నన్ను కదిలించిన వైనం నేనెప్పటికీ మరిచిపోలేను. తరువాతనుండీ అనేకభాషలలో చివరివారి గురించి ప్రచురించబడే వార్తలు అడపాదడపా చదువుతూనే ఉన్నాను. ఒక భాషయొక్క ప్రతీ చివరి వ్యక్తి – అది స్త్రీ అయినా పురుషుడైనా వారు చేసేది ఇంతే.
లీలాశుకుడు 17వ శతాబ్దపు కవి. యౌవనోద్రేకంలో వేశ్య చింతామణిని తగులుకొని దారి తప్పాడు. ఒక భయంకరమైన తుఫాను రాత్రి నానా అగచాట్లూ పడి ఆమె ఇంటికి పోతే ఆమె కాస్తా ఈ మాంసపుముద్దకోసం మనసుపడి యింత తుఫానునూ లెక్కచేయకుండా వచ్చావే, ఈ మనసుని ఆ భగవంతునిపై నిలుపరాదా అన్నది. అంతే ఆయన తక్షణం విరాగియై భగవన్నామస్మరణలో పడ్డాడు. ఎంతో మధురమైన భక్తికవిత్వం చెప్పాడు.
కలుషితములు రాగంబులు
కలుషితములు నృత్యగానకవితారీతుల్
కలుషితములు కావ్యంబులు
కలుషితములు సకలకళలు కలికాలమునన్
యక్షగానం అనగానే కొంత సామాన్యజనులు నిత్యవ్యవహారంలో ఉపయోగించే పదజాలం రచనలో చేరడం సహజం అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేని సంగతి. రచనలో ఎక్కడా పేర్కొనబడకపోవడం వలన ఈ రచనకు కర్త ఎవరో తెలియదు. భాషను బట్టి, తాళపత్రప్రతిలోని వ్రాతను బట్టి కనీసం రెండు వందల సంవత్సరాల మునుపటి రచనగా దీనిని నేను భావిస్తున్నాను. అప్రకటితంగా నిలిచిపోదగ్గ రచనగా ఇది అనిపించదని ప్రగాఢంగా నమ్ముతూ ఇప్పుడు మీ ముందుంచుతున్నాను.
అల్పకాంతులతో నసంఖ్యాకముగను
నింగి నాక్రమించుచు నిగనిగలఁ గుల్కు
తారకాతతి సౌరు సందర్శనీయ
మగును రాకేందుఁ డుదయింపనంతవఱకె.
జ్యోతిష్మంతమైన యజ్ఞరథమునెక్కి
తమమునెల్లనీవు తరిమివేసి
భీమరూపమందు శత్రుదంభముజేసి
వేదనిందకులను వెడలగొట్టి
గోత్ర భిదము సల్పి స్వర్గ విభము నిల్పి
రాక్షసులను చంపు రక్షకుడవు!
స్త్రీలో ప్రాకృతికంగా వచ్చిన దేహం వెనుక విలాసమయ శరీరం ఒకటుంటుంది. ఇది భౌతికమైనదే గానీ శరీరసౌష్ఠవాన్నీ, అశ్లీల ప్రదర్శననూ అపేక్షించేది కాదు. ఆ విలాసానికి ప్రేమే హేతువు. వేరేది ఉండే ఆస్కారం లేదు. అటువంటి ప్రేమమయ స్త్రీవిలాసం చాలా గొప్పది. అందుకే అది కావ్యాలలో ఎంతో గొప్పగా వర్ణింపబడింది. ప్రణయకోపంలో ఒక స్త్రీ ప్రవర్తన ఏవిధంగా ఉంటుందో చెప్పే పద్యమిది. ఈ పద్యంలోని నాయిక తన నాయకుడిపై కినుక వహించింది.
దాశరథి ఆధునిక కవితాయుగపు అవతీర్ణభారతి. నిజజీవితం కష్టాలకు పుట్టినిల్లై, జైలుగోడల మధ్య బిగించి పరీక్షపెడితే, అక్కడ మగ్గుతూ పళ్ళు తోముకోవడం కోసం ఇచ్చిన బొగ్గుతో జైలుగోడల మీద పద్యం వ్రాశారు. అంతే కాదు, అర్ధరాత్రి వేరే చోటుకు ఖైదీలని తీసుకుపోతున్నపుడు, మరుసటి రోజుని చూడకుండానే మరణించే అవకాశం ఉన్న ఆ సమయంలో భయపడకపోగా ఆ స్వేచ్ఛామారుతాన్ని చూసి ఆశువుగా పద్యాలు చెప్పారు.
బేలూరు చెన్నకేశవాలయం యునెస్కోవారసత్వనిర్మాణములలో శాశ్వతసభ్యత్వగౌరవము లభించిన ఈశుభతరుణంలో నా మహాశిల్పి జక్కనచరిత్రలోని వర్ణనను నేనిక్కడ పునర్మననం చేసికొంటున్నాను. 1992లో ఆ ఆలయమును దర్శించిన తర్వాత కల్గిన అపూర్వమైన ప్రేరణవల్లనే నేను ఈ మహాకావ్యాన్ని వ్రాసినాను.
ఈ పద్యంలోని ఊహ సరికొత్తది. భగవంతుడి కవితలన్నీ నూటికి తొంభైపాళ్ళు స్తుతులు. కాకుంటే వ్యాజనిందా వ్యాజస్తుతులే కానీ ఇటువంటి ఒక భావన మనకు ఎక్కడో గానీ లభించదు. గ్రీష్మమహోగ్రవేళలో భగవంతుడు ఒక మ్రోడట. అదేవిటయ్యా, అన్ని వాంఛలనూ తీర్చే కల్పతరువు వంటి స్వామిని పట్టుకుని మోడంటావూ అంటే, అన్నీ అయిన స్వామి మోడెందుకు కాడు అని కవి మనకు ఇచ్చే సమాధానం. ఆ మ్రోడుకూడా తుదకు నిల్చినది.
భావపూరితమైన ప్రకృతివర్ణనతో మొదలై, ఒక కవిమృతిజనితదుఃఖం నింపుకొని, ఆ కవిని స్మరిస్తూ, వియోగాన్ని వర్ణించి, కవి వ్రాసిన కావ్యం కవిస్మృతి కన్నా బలీయంగా యెదను పట్టి లాగుతూంటే దాన్ని తల్చుకొని, ఆ స్థితి నుంచి కావ్యనాయికతో సల్లాపమాడి, తిరిగి తేరుకొని మళ్ళీ సత్కవిని స్మరించి ముగిసిన ఈ కవిత వంటి ఎలిజీని నేను మరొకదాన్ని చూడలేదు. చరిత్రకారులు గుర్తింపని ఆధునికాంధ్రయుగంలోని మొట్టమొదటి మాలికాస్మృతిగీతమిది.
అంతఃపురస్త్రీల అపహరణము అనునది యోహాన్ గాట్లియబ్ స్టెఫనీ డి యోంగర్ అను నాటకకర్తచే రచింపఁబడి, వుల్ఫ్‌గాంగ్ అమెడెయుస్ మొజార్టు అను సుప్రసిద్ధుడైన ఆస్ట్ర్రియను సంగీతకారునిచే సంగీతబద్ధము చేయఁబడిన గేయవచన సంభాషాత్మకమైన రూపకము. అట్టివాటిలో నన్నింటికంటె ప్రసిద్ధమైనది ఈ మోజార్టు ఓపెరా.
ఒక సమస్య బుద్ధికంటే హృదయాన్ని మేల్కొల్పినప్పుడు, దాన్ని సాధన చేసినవాడి మెదడు కన్నా కూడా, అతని హృదయం పరివ్యక్తమైనపుడూ ఆ సమస్య గొప్ప సమస్య అవుతుంది. ఆ పూరణ ఉదాత్తమైనదవుతుంది. అప్పుడు ఒక సమస్యను ఇవ్వడమూ, ఒక కావ్యం వ్రాయమని ఒక కవిని అడగడమూ — ఈ రెండూ ఒకటే అవుతాయి. కావ్యానికి నిడివితో పనిలేదు. మనసును పూయించేది ఎంత చిన్నదైనా, పెద్దదైనా కావ్యమే.
ఒక్కోసారి వియోగమనే భావపు ఘాటు ముందర ప్రేమ వెలవెలబోతుందేమో అనిపిస్తుంది. విప్రలంభపు మహిమ ఎవరికీ ఎన్నతరం కాదు. కవిత్వంలో మనకు తెలిసిన ఎన్నో పొరలు దాని దయాభిక్షే. ఒక బలీయమైన అనుభూతిలో శుద్ధతతో కూడినవైన ఎత్తులలో విహారం చేస్తున్నపుడు ఒకవేళ మనస్సు మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఒక్కో పదమూ ఎంతో చిన్నదైనప్పటికీ బరువైన భావాలను మోసేదిగా ఉంటుంది.
అమ్మాయిలు ఉద్యానవనంలో పూలు కోస్తున్నారు. కోస్తూ అల్లరి చేస్తున్నారు. చేస్తూ సల్లాపాలాడుతున్నారు. పండిన పళ్ళని వీరు ఆరగిస్తే, పాపం అక్కడి చిలుకలకు ఏం మిగులుతుంది కనుక? అంచేత చిలుక వీరిపై పగబట్టి, వీరి అధరాలపై పడుతుందట, తిందామని. వాతెర అంటే అధరము. స్త్రీ క్రిందిపెదవిని దొండపండుతో పోల్చుతారు. వీరి పెదవులను దొండపళ్ళనుకొని, అవి మిగిలాయి కను వాటిని తినడానికి వస్తుందట చిలుక! వీరి చెక్కిళ్ళపై సాంకవరుచి అట.
ధర్మంతో కూడి ఉన్న ప్రతీ ప్రేమా గొప్పదే. ప్రియురాలిపై లేదా ప్రియునిపై ప్రేమ; పశుపక్ష్యాదులపై ప్రేమ; తల్లిదండ్రులపై ప్రేమ; పిల్లలపై ప్రేమ; వ్యక్తిత్వంపై ప్రేమ; ఏ ప్రేమనూ తక్కువ చేసేందుకు అవకాశమే లేదు. ఈ సంగతులన్నీ ముందువెనుకలు చెప్పకుండా మీతో మనవి చేస్తున్న కారణం, ఈ సారి నేను మీకు పరిచయం చేద్దామనుకుంటున్న పై పద్యం ఒక కొడుకుకు ఉన్న తండ్రి ప్రేమను వర్ణించే కవిత.
తెలుగు సాహిత్యం చంద్రోదయవర్ణనల ఆటపట్టు కదా. పై రెండు పద్యాలలో మొదటి పద్యంలోని వస్తువదే. రెండవపద్యంలో వెన్నెల వర్ణించబడి ఉంది. ఎక్కువమంది కవులు వర్ణించిన వస్తువుపై మళ్ళీ ఒక కవితనల్లాలంటే ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురాక తప్పదు. ఉదయాస్తమయ వర్ణనలయితే, ఇక కొత్తగా ఊహించడానికి ఏమీ లేదు అనేంతలా వర్ణనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా, ప్రతి చిన్ని కవినీ తమవైపుకు లాగుకొనే ప్రకృతిసమ్మోహనశక్తులవి.
తిలక్ మొదటగా తనను తాను చూసుకున్నది, చెక్కుకున్నది, పక్వమైనదీ ఒక పద్యకవిగానే. అందుకనే ఆయన వచనకవిత్వాన్ని వ్రాయడం మొదలుపెట్టిన తరువాత కూడా పద్యాన్ని విడిచిపెట్టలేదు. తిలక్ పద్యం ఒక మెత్తందనాల జల్లు. కవితాగుణాల పెల్లు. ఆయన ఛందస్సును కించపరచకుండా లొంగదీసుకొని దానికి ఆధునికభాష నేర్పాడు. వినమ్రంగా పద్యసరస్వతి చెంపపై సరికొత్తగా చిటికవేశాడు. ఆమె నవ్వును గమనించి తల పైకి ఎత్తాడు. తన ఛాతీని విప్పార్చాడు.