పోర్ట్‌లాండ్, మెయిన్

“హేయ్, ఇలా రా!” పిలుపు.

చుట్టూ చూశాను.

రోడ్డుకు ఒక వారగా ఆపి ఉన్న ఓ ఎస్‌యూవీ లోంచి ఆ గొంతు.

ఓ పిసరు చిరాకు… మర్యాద లేకుండా ఆ పిలుపేమిటీ?!

అయినా వెళ్ళాను. ఏభై ఏళ్ళ మనిషిలా అనిపించాడు. హుందాగా ఉన్నాడు.

మెయిన్ రాష్ట్రంలోని పోర్ట్‌లాండ్ పట్నం రెండుగంటల క్రితమే చేరుకుని తిన్నగా బాక్‌ కోవ్ (Back Cove) అన్న సువిశాలమైన నీటికయ్య చేరుకొని, గట్టెంట రెండుమూడు కిలోమీటర్లు నడిచి కయ్య చివరికి చేరుకొని పక్కనే ఉన్న చిన్నపాటి గుట్టా… అక్కడ మేజర్ లాండింగ్ అన్న అమరజీవి స్మారకస్థూపం… కింద కనిపించే చక్కని జలదృశ్యాలు. చకచకా పనిచేసుకుపోతున్న నా కెమెరా.

గమనించినట్టున్నాడు. పలకరించాడు. వెళ్ళాను. పెద్దమనిషిలానే అనిపించాడు.

“ఏ ఊరూ?”

“ఢిల్లీ. బోస్టన్ వచ్చాను. ఈ పట్నం చూడాలనిపించింది. డే ట్రిప్‌కు వచ్చాను,” క్లుప్తంగా వివరించాను.

ముందు విస్మయం. వెంటనే అతని మొహంలో సంతోషవీచిక.

“వండర్‌ఫుల్! నిజం చెప్పనా, ఈ పోర్ట్‌లాండ్‌ను మించిన అందమైన చోటు ఈ చుట్టుపక్కల లేదు. నాదీ ఈ ఊరే. పుట్టిపెరిగి ఎక్కడెక్కడో తిరిగి రిటయిరయ్యాక మళ్ళీ ఈ గడ్డకు చేరుకొన్నాను.” ‘జననీ జన్మ భూమిశ్ఛ’ అన్నాడా? అన్నట్టే వినిపించింది.

“ఆ బాక్ కోవ్ సంగతేంగానీ ఈ కొండవాలు వెంబడే ముందుకు నడువు. అతి సుందరమైన దృశ్యాలు చూస్తావు. అది చెబుదామనే పిలిచాను. వెల్‌కమ్ టు పోర్ట్‌లాండ్ సిటీ. మా రాష్ట్రం తరఫున నీకు మా శుభాకాంక్షలు!” మనస్ఫూర్తిగా అతని మాటలు!


అసలీ భూప్రపంచంలో పోర్ట్‌లాండ్ అన్న పట్నం ఉందని వారం పదిరోజుల క్రితమే తెలిసింది. సియాటిల్ నుంచి షికాగో రైల్లో వస్తోంటే ఓ సహప్రయాణీకురాలు తనది పోర్ట్‌లాండ్ అని చెప్పింది. ఆరెగన్ కదా అంటే, “కాదు కాదు. మెయిన్ రాష్ట్రంలో మరో పోర్ట్‌లాండ్ ఉంది. బావుంటుంది. మైక్రోసాఫ్ట్‌వాళ్ళ ఓపెనింగ్ స్క్రీన్‌లో నిన్నమొన్నటిదాకా ఒక బహు ఆకుపచ్చని పచ్చికబయలూ, దీపస్థంభమూ ఉండేవి గుర్తుందా? అది మా ఊళ్ళోనే!” అసంకల్పితంగా ఊరించిందావిడ.

నాకూ ఎలానూ కోరిక ఉండనే ఉంది, బోస్టన్‌లో నా హోస్టులూ వాళ్ళ కారుల్లో గాకుండా సొంతంగా ఏదైనా ఊరు తిరిగిరావాలని. మరింకేం, ఈ పోర్ట్‌లాండ్ వెళదామనుకొన్నాను. అలా పడ్డ బీజం ఆ 2017 సెప్టెంబరు 13 నాటికి నన్ను పోర్ట్‌లాండ్ చేర్చింది.

పోర్ట్‌లాండ్ బోస్టన్‌కు బాగా దగ్గరే.

నూటపది మైళ్ళు. మెగాబస్సులో రెండు గంటలు.

లోకల్ రైళ్ళ సమయమూ బస్సు సమయమూ సరిపోయేలా చూసుకొని మెగా టికెట్ తీసుకొన్నాను.

ఉదయం ఆరింటికల్లా లోకల్ రైలు స్టేషను చేరా. నరమానవుడు లేడు! స్టేషను చూస్తే బోస్టన్ టీపార్టీ నాటి కట్టడంలా ప్రాచీనత ఊడిపడే వాలకం. తుప్పుపట్టిన రైలింగులు. ఫుటోవర్ బ్రిడ్జి. అసలు బండి వెళ్ళేది ఇక్కడ్నించేనా? మా హోస్టు ఇదేనని చెప్పాడే!

ఎవరో భారతీయుడులాంటి మనిషి… ఉదయపు నడకలో… ఆపాను.

తనూ నాలాంటి బాపతే. విశాఖ మనిషి. కొడుకు ఇక్కడ. ఏడాదిలో ఐదారు నెలలు వచ్చి గడుపుతాడట. “నాకూ అంత బాగా తెలియదండీ. మా పిల్లలు అస్సలు రైలెక్కనివ్వరు!” అని వాపోయాడు.

ఈలోపల సప్నోంకా సౌదాగర్ రాజ్‌కపూర్ వేషంలో మరో మనిషి. టోపీ మీద ఈక లేదుగానీ మిగిలిన వేషధారణ అంతా అలానే ఉంది. మైసూరు మనిషట. చిరువ్యాపారి. పెద్ద యాత్రికుడు. చదువూ భాషా అంతగా లేకపోయినా ప్రయాణాల మీది ప్రేమ అతడ్ని దేశదేశాలు తిప్పుతోందట.

ఒకరికి ముగ్గురం! కాస్సేపు ఆత్మీయంగా కబుర్లు.

బండొచ్చింది. విశాఖ మనిషి నడక కొనసాగించడానికి వెళ్ళిపోయాడు. నేనూ మైసూరాయనా డౌన్‌టౌన్ వేపుగా రైల్లో.

“ఇప్పటిదాకా మీలానే నేనూ ఒంటరిగా పదహారు రాష్ట్రాలు తిరిగాను. మీరెన్నీ?” అడిగాడు. అతిశయంలేని గొంతు.

పెద్దగా ఇష్టంలేకపోయినా దాచేదేముందిలే అని చెప్పాను. “ఇప్పటిదాకా అన్న్నీ కలుపుకొని ఈ మూడేళ్ళలో ముప్ఫైతొమ్మిది. వెళ్ళబోయే మెయిన్ రాష్ట్రం నలభయ్యోది,”

“మరి మిగిలిన అన్ని రాష్ట్రాలూ తిరుగుతారా? ఎప్పటిలోగా?”

“అలాంటి లక్ష్యాలూ గమ్యాలూ లేవు. హవాయి, అలాస్కా బహుశా వెళ్ళనే వెళ్ళను. మరింకో రెండేళ్ళలో మిగిలిన ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలూ నా బాటలో తటస్థపడతాయి.”

అతని కనులలో ఆరాధన కానవచ్చింది. ఇబ్బంది అనిపించింది.


బోస్టన్ సౌత్ స్టేషన్. ఊరి నడిబొడ్డనే అనాలి. నాలుగు రోజులుగా వచ్చిపోతూ ఉండటంవల్ల బాగా పరిచయమయిన ప్రాంతం. సులభంగానే మెగాబస్ ఆగే చోటుకు చేరుకున్నాను.

సాధారణంగా మెగాబస్ అనగానే ఎనభై సీట్ల డబుల్ డెక్కర్, దాని ఒంటినిండా చిరాకు కలిగించని రీతిలో మెగాబస్ అని పెద్దపెద్ద అక్షరాలూ $1 అంటూ ప్రస్ఫుటంగా కనిపించే బొమ్మా–వాటికోసం చూశాను. కనిపించలేదు. ఎవర్నో అడిగాను. “ఇక్కడ ఆ రకం బస్సులు కాదు. వాళ్ళకి స్థానిక రవాణా సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయి. ఆ బస్సులు నిన్ను మెయిన్‌కు తీసుకెళతాయి. నీ సర్వీసు నెంబరుతో సరి చూసుకో.” సలహా చెప్పారు. చూసుకొన్నాను. అట్టహాసాలు లేని సాదాసీదా బస్సు. అలా అని సౌకర్యాలకేం లోటు లేదు. మామూలు మెగాబస్సులకన్నా ఎక్కువ సుఖంగా ఉందనే చెప్పాలి.

బస్సు సంగతి ఎలా ఉన్నా డ్రైవరు నన్ను బాగా ఆకట్టుకొన్నాడు. అదంతా న్యూ ఇంగ్లాండ్ ప్రాంతం కదా, దాని బాణీకి తగ్గట్టుగా అత్యంత హుందాగా బ్రిటిష్ పెద్దమనిషి బాణీలో ఉన్నాడతగాడు. మొహంలో ఎంతో గాంభీర్యం. చక్కని సరళమైన ఆహార్యం. టై కట్టి కోటు వేస్తే ఏదో కంపెనీ సి.ఈ.ఓ.లానూ, మెళ్ళో స్టెతస్కోపు వేస్తే సీనియరు డాక్టరులానూ, కళ్ళజోడు పెట్టి కొంచం దుస్తులు మారిస్తే యూనివర్శిటీ ఆచార్యుడిలానూ కనిపిస్తోన్న ఆ హుందామనిషి అవేమీ కాకుండా సింపుల్‌గా బేస్‌బాల్ టోపీ పెట్టుకొని బస్సు ఎక్కాడు. చిన్నపిల్లలున్న పెరాంబులేటర్ నడిపినంత సుతారంగా బస్సును ఉరికించడం; మధ్యలో ఏదో చోట కాఫీకి ఆగినపుడు చిరుజల్లు పడుతోంటే తనవెనుక అరలో ఎంతో పద్ధతిగా పెట్టుకొన్న గొడుగును అంతే పద్ధతిగా వెలికితీసి తెరచి వాడటం; వాహ్! అతగాడిని చూడటమే గొప్ప ప్రకృతి పరిశీలన అనిపించింది. పోర్ట్‌లాండ్‌లో బస్సు దిగాక ఆపుకోలేక “నీ బస్సులో ప్రయాణం చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను,” అన్నాను.

పోర్ట్‌లాండ్‌లో బస్సు ఆగిన ప్రదేశం చూసి హతాశుడినయ్యాను!

అప్పటిదాకా ఏ ఊరు వెళ్ళినా, ఎన్నెన్ని ఊళ్ళు బస్సుల్లో తిరిగినా బస్సు స్టేషన్లన్నీ ఆయా ఊళ్ళ డౌన్‌టౌన్‌లలో ఉండటం ఆనవాయితీ. అక్కడ దిగి ఆ రోడ్లను అల్లుకొంటూ తిరుగాడటం నేను అనుసరించిన పద్ధతి. ఇక్కడ ఈ పోర్ట్‌లాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ సెంటర్ ఊరి శివార్లలో ఉంది! అయినా మనసాగక మరోసారి మరోసారి అడిగాను ఇదేనా చివరి స్టాపూ అని. ఇదే ఇదే అన్నారు!

తెప్పరిల్లి అక్కడి ప్రయాణీకుల హాల్లోని వాతావరణం పరిశీలించడం మొదలెట్టాను.

ఊరి చిత్రాలు… దేశంలోకెల్లా నివాసయోగ్యత విషయంలో నెంబర్ వన్ అన్న సచిత్ర ప్రకటనలు… సముద్ర తీరపు పోస్టర్లు… బ్రోషర్లు … రాకపోకల వివరాలు. కానీ నాకు కావలసిన సిటీమ్యాపు కనిపించదే!

ఏ అడ్డుగోడలూ లేని అక్కడి కౌంటర్లో చర్చిల్‌గారి చిన్న చెల్లెలు లాంటి గంభీర వదనపు ఓ మధ్యవయస్క. అడిగితే ఆవిడ సమాధానం చెపుతుందా? మనసులో బెరుకు. అనుమానం. ‘అడుగుదాం. చెప్పడం, చెప్పకపోవడం ఆవిడ ఇష్టం.’ బుద్ధి చెప్పిన హితవు. చివరికి వెళ్ళి అడిగాను. “సారీ, మ్యాపులు లేవు.” అని మర్యాదగానే చెప్పారావిడ. ముసుగు తొలగించి ఓ అర చిరునవ్వూ అందించారు. ధైర్యం వచ్చింది. “ఊరు చూడ్డానికి పనిగట్టుకొని వచ్చాను. రోడ్లు కొలవడమే ధ్యేయంగా పెట్టుకొన్నాను. దొరుకుతుందిలే అన్న ధీమాతో మ్యాపులేం తెచ్చుకోలేదు. నువ్వేమైనా సాయం చెయ్యగలవా?!” దీర్ఘంగా ఆలోచించింది. కంప్యూటరు తెరిచింది. టకటకలాడించింది. పెద్దసైజు పేపరు మీద ఓ కలర్ ప్రింటు అందించింది. అది ఆ ఊరి మ్యాపు!

పరిశీలించాను. ఈ ట్రాన్స్‌పోర్టేషన్ సెంటరు ఓ చిన్నపాటి ద్వీపకల్పంలో ఉంది. అటో ఇటో రెండుమూడు వందల మీటర్లు సాగితే సముద్రమే. కానీ నాకేమో డౌన్‌టౌన్ చేరుకోవాలన్న ఆత్రం. మ్యాపులో పక్కనే కొండచిలువలా పరచుకొన్న ఐ-295 హైవే. దానికి అటూ ఇటూ పిల్లపాముల్లా స్థానిక రహదారులు. మైలు దూరంలో స్కూళ్ళు. బిజినెస్ సెంటర్లు… మరో అరమైలులో డీరింగ్ ఓక్స్ అన్న పార్కు. ఇంకో మైలు సాగితే బాక్ కోవ్ జలాశయం. దాని ఒడ్డంట విన్‌స్లో పార్కు. కాలిబాట. అలా మరో మైలు కాలిబాటలో సాగితే ఈ బాక్ కోవ్ సన్నపాటి ముఖద్వారం. ఆపైన అచ్చమైన సాగరం. అక్కడ కుడివేపుకు మళ్ళితే ఈస్ట్రన్ ప్రొమినేడ్ అన్న పచ్చని ప్రదేశం. దూరాన లిటిల్ డైమండ్, గ్రేట్ డైమండ్ అన్న ద్వీపాలు…

హర్షాతిరేకం!

బాగా చిన్నప్పట్నించీ మ్యాపులు ఆబగా చదివే అలవాటున్నా, అవి చదివి కలల్లో తేలిపోయే అలవాటు ఉన్నా–ఒక్క మ్యాపు, ఒకే ఒక్క మ్యాపు ఇంత గొప్ప ఆనందానుభూతి ఇవ్వగలదని నేను ఊహించనేలేదు.

థాంక్స్ చర్చిల్‌గారి చెల్లెమ్మా!


ఆరుగంటల పోర్ట్‌లాండ్ నగర యాత్రకు నడుంకట్టాను.

డీరింగ్ ఓక్స్ పార్కు దాకా ఉబర్ తీసుకొందామా అని ఓ క్షణం అనిపించింది. అది యాత్రాస్ఫూర్తికి విరుద్ధం అని మనసు హితవు చెప్పింది.

కొండచిలువలో, సన్న పాములో–అమెరికా రోడ్లు నన్ను భయపెట్టడం మానేసి చాలాకాలమయిపోయింది. 2015 మే నెలలో లాంగ్ ఐలాండ్‌లో మినియోలా నైబర్‌హుడ్‌లో చిన్నపాటి రోడ్డును ఒంటరిగా దాటడానికి అటూ ఇటూ చూసుకొంటూ క్షితిజరేఖ దాకా ఏ కారూ లేదని నిర్ధారించుకొని అట్లాంటిక్ సముద్రాన్ని నాటుపడవలో దాటినంత ‘సాహసంగా’ రోడ్డు దాటిన రోజులనుంచి ఈ రెండేళ్ళలో చాలా ప్రగతిని సాధించాననాలి. పాత్‌వేలు కనిపెట్టడం, జీబ్రాలు పసిగట్టడం, గ్రీన్‌లైట్ కోసం మీట నొక్కడం, వాహనాలకు అనవసరంగా బెదిరిపోకుండా ఉండటం–మామూలైపోయింది. మెల్లగా ఆ ద్వీపకల్పం దాటుకొని సీవాక్ స్ట్రీట్ అందుకొని, ఫోర్ రివర్ పార్క్‌వే దగ్గర లూపులు లూపులు దార్లను జయించి, ఐ-295 మీదకు చేరి డీరింగ్ ఓక్స్ దిశలో సాగాను. గూగుల్ మ్యాప్స్‌లో నావిగేషన్ పెట్టుకోవడం, ఆ పెద్దావిడ(!) సలహాలను పాటిస్తూ నడిచివెళ్ళడం అప్పటికే బాగా అలవాటయిపోయింది నాకు. ‘తక్కువేమి మనకూ గూగుల్ మ్యాపులుండువరకూ’ అనుకుంటూ కులాసాగా ముందుకు సాగాను. ఎండ చురుక్కుమనిపించినా ‘ఎండ ఎన్నెల్లా చల్లగా ఉంది’ అనే పాట పాడి మనసు ఆ తాపాన్ని తగ్గించింది!

ఊరు మొదలయ్యింది. జట్లుజట్లుగా స్కూలుపిల్లలు. నా కళ్ళకు ఆ దృశ్యం–ఏ దేశంలో అయినా–ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. దాదాపు అరవై ఏళ్ళ క్రితం బంటుమిల్లి ఎలిమెంటరీ స్కూలుకు అలా జట్టుగా వెళ్ళడం గుర్తొస్తుంది. ఈ జట్టులో ఆ అమరేంద్ర ఉన్న మనోహరమైన భావన కలుగుతుంది.

ఓ పక్కన శ్రామికుల ప్రతిమలు. హఠాత్తుగా ఎడమవేపున కొట్టొచ్చినట్టు కనిపించే ఎర్రటెర్రటి భవనం. అంతకన్న ప్రస్ఫుటంగా దానిమీద ఏదో కంపెనీ పేరు. లాక్ స్టాక్ అండ్ బేరల్ అన్న ఆ పేరు గొప్ప విభ్రమం కలిగించింది. ఏవిటా పేరూ! ఆ పలుకుబడి మూలం తుపాకీల పరిభాషలో ఉందిగదా, ఇప్పుడా పరిశోధన వద్దులే అని ముందుకు సాగాను.

హైవే వదలి సన్నపాటి సందు పట్టుకొన్నాను. గ్రనైట్ స్ట్రీట్ దాని పేరు. కాస్తంత ముందుకు సాగగానే శరీరం బాధపెట్టడం మొదలయింది. మధుమేహం. లఘుశంక! చుట్టూ చూశాను. ఏవీ కనిపించలేదు. కనిపించిన మనిషిని ఆపి అడిగాను. పెదవి విరిచాడు. లాభంలేదు ఏదైనా సాహసం చెయ్యాల్సిందే!

పక్కనే ఏదో పెద్దపాటి జిమ్నేసియమ్. అర తెరచిన తలుపులు… ట్రెస్‌పాస్ అన్నది అమెరికాలో సహించనేరని నేరమని తెలిసినా తలుపు నెట్టుకుంటూ లోపలికి… మనుషులే కనిపించలేదు! రెస్టురూములెక్కడా?! వెదుకులాట. ఎవరో సెక్యూరిటీ గార్డు. అవమానానికి సిద్ధపడిపోయాను. అయినా బింకం కోల్పోకుండా నా సమస్య వివరించాను. ఎంతో సానుభూతితో రెస్టురూముదాకా నాతోపాటు వచ్చి చూపించాడా మహాత్ముడు!

స్కూలు పిల్లలు జట్లుజట్లుగా ఏ పుట్టలోంచి వస్తున్నారో ఆ నేథన్ క్లిఫర్డ్ స్కూలు రోడ్డు పక్కన కనిపించింది. ఆకర్షించే భవనం, ఆహ్లాదకరమైన ఆటస్థలాలు సరేసరి. స్కూలు మొగదలలో, రోడ్డుకు చేరువగా అక్షరాల మాలలు అల్లి, స్కూలు పిల్లలు వేసిన బొమ్మలు తాపడం చేసి నిర్మించిన రంగురంగుల విద్యాస్థూపం కనిపించి భలే సంతోషపెట్టింది. దాన్ని చూస్తూ విద్యార్థులు పొందే అనుదినస్ఫూర్తిని అంచనా వేశాను.

మరికాస్త ముందుకు నడిచాను. డీరింగ్ ఓక్స్ పార్కు.

అమెరికా లెక్కల ప్రకారం అది అతి మామూలు పార్కే అయినా శ్రుతి అయిన నా మనసుకు అదే నందనవనంలా కనిపించింది. నిడుపాటి చెట్లు, పెద్దగా మార్చకుండా నాగరికం నేర్పకుండా ఉంచేసిన చిన్నపాటి వాగు, మానవ నిర్మిత తటాకాలు, కనిపించి పలకరించే నడకరాయుళ్ళు, ఏదో పిల్లల కార్యక్రమం, బారులు తీరిన పసి బాలురు, టీచర్ల అనుమతితో ఫోటోలు–గంట చులాగ్గా గడిచిపోయింది.

పార్కు దాటి రోడ్డు మీదకు చేరాను. అక్కడ ఎడమకు మళ్ళి ఫారెస్టు ఎవెన్యూ పట్టుకొని వెళ్ళి మళ్ళా కుడివేపుగా ప్రెబుల్ స్ట్రీట్‌లో వెళితే బాక్ కోవ్ చేరుకోగలనని గూగులమ్మ చెప్పింది అనుసరించాను. ఇవి రెండూ ఊరి ముఖ్య రహదారులు. లోపలి రోడ్లూ చూద్దామని ఓ సన్నపాటి సందులోకి మళ్ళాను. అప్పటికే ఊరు నాకు చిరపరిచితం అనిపించసాగింది.

ఆ సన్నపాటి వీథి మొగలో పదీపదిహేనుమంది యువతీయువకులు. అనేక వర్ణాలవారు. రంగురంగుల మాసిన వస్త్రాలవారు. రేజరు మొహం చూడని గడ్డాలవారు. దువ్వెన గుర్తెరుగని శిరోజాల యువతులు. మాటలు. నవ్వులు. కేరింతలు. ధూమపానాలు. బీరు సేవనాలు, మందులూ వాడి వుండాలి… బింకంగా సాగాను. ఒకరిద్దరు కళ్ళతో పలకరించారు. ఒకరిద్దరిని చిరునవ్వుతో, మరో ఇద్దరిని మాటలతో పలకరించాను. వాళ్ళెవరికీ నేను టూరిస్టులా కనిపించకపోవచ్చు. నా శరీరపు రంగు, కాజువల్ వస్త్రాలు, హావభావాలు వాళ్ళకు నేను ఆ ప్రాంతపు మనిషినే, వాళ్ళలోని వాడినే అన్న భావన కలిగించి ఉండాలి. అది నాకున్న సౌలభ్యం!


బాక్ కోవ్. మిట్టమధ్యాహ్నం.

సువిశాల జలాశయం. దాని చుట్టూ కాలి బాట. అవతలి గట్టూ కనిపిస్తోంది. అంతా కలసి మూడునాలుగు మైళ్ళు. ఒడ్డునంతా పచ్చని విన్‌స్లో పార్కు, అరకిలోమీటరు నడచి లంబదిశలో మళ్ళగా బాక్ కోవ్ పార్క్ అన్న మరింత విశాలమైన ఉద్యానవనం. అక్కడి చేట్లూ పక్షుల వివరాలతో ఫలకాలు, సైన్ బోర్డులు. మండించే వెన్నెల ఎండ. వెదికివెదికి సుందర దృశ్యాలను కెమెరాతో బంధించడం. ఆ పార్కులో పనిచేస్తోన్న లాన్ మోవర్ ఆపరేటర్లు… రెస్టురూము ఎక్కడా అన్న నా వాకబు, వెనక్కి అరమైలు వెళితే పార్కింగ్ ఏరియా దగ్గర ఉంది. “అయినా ఎందుకంత ప్రయాస? ఆ పక్కన తుప్పల్లో కానించేయ్,” అన్న కులాసా సలహా! ఈ విషయంలో ఆ దేశంలో అలాంటి సలహా వినడం అదే మొదటిసారి, అదే చివరిసారి!

బాక్ కోవ్ పార్కు దాటుకొని, జలాశయం ఒడ్డంటే మరో పావుగంట. జలాశయం ముఖద్వారం మీద కంటికి నదురుగా కనిపించి రారమ్మంటోన్న వంతెన… వెళ్ళాలన్న ఉబలాటం అరికట్టుకొని కుడివేపుకు మళ్ళి ఈస్ట్రన్ ప్రొమినేడ్ చేరుకొనే ప్రయత్నం. ఎడమవేపున చిన్నపాటి గుట్ట మీద రంగురంగుల పతాకాలు… ఆకర్షణ.

మధ్యాహ్నాన్ని లెక్కపెట్టకుండా జాగింగ్ చేస్తోన్న ఓ అమ్మాయిని ఆపి, దారి తెలుసుకొని, గుట్టమీదకు… మేజర్ లాండింగ్ అన్న అమరజీవి స్మారక స్థూపం! ఈ కథ అక్కడేగదా మొదలయిందీ?!


నిజానికి ఆ పెద్దాయన చెప్పింది నేను వెళదామనుకొంటోన్న ఈస్ట్రన్ ప్రొమినేడ్ ప్రాంతమే. దారి అటు మళ్ళించాను. రోడ్డు వెంబడే రెండొందల గజాలు. ఏదీ సముద్రం?! ఏవీ అద్భుత దృశ్యాలూ?!

అప్పుడే దిగువనున్న అడవిలాంటి ప్రాంతంలోంచి జాగింగ్ చేస్తూ పైకి వస్తోన్న యువకుల బృందం. ఆపి, సముద్రం అడ్రసు అడిగాను.” మేం వస్తోన్న కాలిబాట వెంబడే దిగిపో, సముద్రం వస్తుంది.” అన్నారు. మళ్ళీ క్షణం ఆలోచించి “వద్దు వద్దు. సముద్రం ఒడ్డున వెళితే గొప్ప పేనోరామిక్ దృశ్యమాలిక మిస్సవుతావు. ఇదిగో, ఈ అడవిలోని కాలిబాట పట్టుకో. రోడ్డుకు సమాంతరంగా సాగుతుంది. అతి చక్కని అడవి దారి ఇది. అరమైలు వెళ్ళాక వృక్షాలు తొలగి ఈ ఎలివేషన్ నుంచే సముద్రం కనిపిస్తుంది. అతిగొప్ప దృశ్యమది!” అని హితవు చెప్పారు.

పాటించాను. ఫలించింది.

ఓ పావుగంటా ఇరవై నిమిషాలపాటు సముద్రపు ఊహలను మరపించే అతి చక్కని అడవి. ఈ క్షణంలో ఇక్కడే పోతేమాత్రమేమీ అన్న సంభ్రమం సంతోషం కలిగించే ప్రకృతి. ఏవో చెట్లు. ఏవేవో ఫలాలు… రాలిపడి బాట నిండా. కొండ వాలున లతలు. అగ్నిశిఖల్లాంటి పూలూ ఆకులూ. మనసు పరవశించెనే! స్వీయాసూయ కలిగే అరుదైన క్షణాలు. ఎందుకు నాకీ అదృష్టం! ఏమిటీ సంతోషం! దీనికి నేను అర్హుడనేనా అన్న మధుర సందేహ హేల…

హఠాత్తుగా అడవి అదృశ్యమై సాగర దృశ్యానికి తెరతీసింది. అదో విభిన్న సముద్రం. కంటిచూపుకు ఆనేంత దూరంలో చిన్నాపెద్ద ద్వీపాలు. మ్యాపును సంప్రదించగా అవే లిటిల్ డైమండ్, గ్రేట్ డైమండ్ ద్వీపాలని చెప్పింది.

ఏమని వర్ణించనూ ఆ సాగర దృశ్యాన్నీ! మాటలను కోప్పడి మనసే సర్వస్వంగా ఆ సుందర దృశ్య భావనను మనసులో ఆకళించుకోవలసిన క్షణాలివి. అదీ చాలకపోతే ఫోటోలు తీసి ఆ జ్ఞాపకాన్ని దాచుకోవడమన్న మార్గం అనుసరణీయం. వర్ణించడమా? అది ఆ సౌందర్యానికి ద్రోహం చెయ్యడమే అవుతుంది.

“బాబూ, ఒక మాట!” కాలిబాటకు సమాంతరంగా నడుస్తోన్న రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న పెద్దపాటి స్టేషన్ వాగన్ లాంటి కారులోంచి ఎవరిదో గొంతు. ఆగాను. ఒక పండు ముసలి మహిళ. గౌరవం ఉట్టిపడే రూపం. ఎనభై దాటి వుండాలి. ఆమె పక్క అతను. మరో ఐదేళ్ళు పెద్దాడయి ఉండాలి. కానీ మరింత క్షీణించిన శరీరం.

“ఈ సౌందర్యం చూశావా? ఎంత గొప్ప అనుభూతి కలిగిస్తోందో కదా?”

అరే! ఎవరీవిడా? అచ్చం నా మనసుతో మాట్లాడుతున్నట్టే ఉందే!

“మాదీ ఈ ఊరే! దేశమంతా తిరిగి తిరిగి ఇరవై ఏళ్ళ క్రితం గూటికి చేరి స్థిరపడ్డాం. ఇద్దరం అవుట్‌డోర్ జీవులం. పదేళ్ళపాటు తెగ తిరిగాం. హైకింగూ ట్రెక్కింగూ చేశాం. ఐదేళ్ళ క్రితం ఇతనికి స్ట్రోక్ వచ్చింది. పెద్దగా అడుగులు వెయ్యలేడు. కానీ ప్రకృతి అంటే వల్లమాలిన అభిమానం ఈ స్థలమంటే అవధిలేని అభిమానం. నా శరీరం ఇంకా బానే పనిచేస్తోంది. రోజూ ఇతడ్ని ఇక్కడికి తీసుకువచ్చి గంటలు గంటలు గడుపుతాను…”

బలహీనంగా నవ్వాడు. చెయ్యిచాచి షేక్‌హేండ్ ఇచ్చాడు.

ఎవరీ బంధువులూ? ఏమిటీ అనుకోని కలయికా? క్షణాల్లో అనురాగం వికసించడం ఎంత సుమధుర భరితం!

పరవశం.

కబుర్లు. కాసేపు కబుర్లు. పాత బంధువుల్ని వదిలి వెళుతోన్నట్టు వదలలేక వదలలేక వీడ్కోలు.

ఒక పరిణత మనసుతో క్షణకాలమయినా సంభాషించగలగడం ఎంత గొప్ప అనుభవం! ఎంత గాఢమయిన అనుభూతి! దానిముందు అడవీ సముద్రమూ సౌందర్యమూ సరితూగగలవా? లేవు!


దేవదాసు చూసిన మనసుతో మరికొన్ని రోజులు మరో సినిమా చూడలేం. అదిగో సరిగ్గా అలాంటి మనఃస్థితి ఆ క్షణాన నాది.

ఇహ చాలనిపించింది.

వెనక్కి మళ్ళాను.

ఓషన్ గేట్‌వే పియర్, భూఖండంలోకి ప్రవేశించగా, ఫ్రాంక్లిన్ స్ట్రీట్. పెద్దదారిలో నడవడం ఇష్టంలేక సన్నదారి పట్టుకోగా ఏదో చిన్నపాటి పార్కు, స్థానికుల ఇళ్ళు, ఓ మాన్యుమెంటు, కాంగ్రెస్ స్ట్రీట్, ఎవరో దారి అడగటం, యథాలాపంగా చూపించడం, ఊరు స్వంతమయిన భావన–చనువు, ఏదో బేకరీలో భోజనం, తిరిగి డీరింగ్ ఓక్స్ పార్కు…

తెలిసిన దారినే ట్రాన్సిట్ సెంటర్.

చీకటి ముసిరేలోగా బోస్టన్.

మరపురాని ఆ మహిళ. ఆమె సహచరుడు.

చాలు! ఈ జ్ఞాపకం చాలు. పోర్ట్‌లాండ్ అంటే ఆమే! ఆమె గంభీర వదనమే! చల్లని మందహాసమే!