మనోధర్మపరాగం: ఒక మంచి నవల

ఈ నవలలోని ముఖ్యపాత్ర గురించి ఆ పాత్ర మారుటి కూతురు దీపా చంద్రన్ ఇలా అంటుంది:

దేవదాసినుల వారసత్వం, బ్రాహ్మణుల అభిజాత్యం, తల్లి కాలేని గొడ్రాలి నైరాశ్యత, మాతృత్వాన్ని రంగరించుకున్న పెంపుడుతల్లి మమకారం, మగవాడి నిరంకుశత్వానికి తల వంచిన భీరత్వం, తన సంగీత ప్రపంచం లోకి ఇంకెవరినీ దురాక్రమణ చేయనివ్వని ధీరత్వం, కోరుకున్న దాని కోసం దేన్నయినా వదులుకోగలిగే స్థిరచిత్తం, దొరికిన దానితోనే సర్దుకుపోగల సరళత్వం, ప్రతీకగా మారగలుగుతూనే సాధారణ అంచనాలకు లొంగని వ్యక్తిత్వం–ఇలా ద్వంద్వాలన్నీ కలిసినందుకే అమ్మ అంత గొప్ప గాయని కాగలిగింది. గొప్పతనాన్ని ఆవిడ కోరుకోలేదు. గొప్పతనమే ఆమెను కోరుకుంది.

ముఖ్యపాత్ర పేరు సి. కె. నాగలక్ష్మి – చిత్తూరు కుముదవల్లి నాగలక్ష్మి. సంగీతప్రపంచంలో అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న వ్యక్తి.

ఆ నాగలక్ష్మి గురించి ఆమె మేనకోడలు అభిరామసుందరి ‘అత్తకు గృహిణిగా వుండటం మొదటి ప్రాధాన్యమైతే సంగీతం రెండవది’ అంటుంది. అలా అంటూనే ‘అత్త తాను కోరుకున్నట్టుగా బ్రాహ్మణ గృహిణిగా కాకపోయినా కనీసం సామాన్య గృహిణిగా అయినా జీవించగలిగిందా? బ్రాహ్మణుడిని పెళ్ళి చేసుకున్నాక ఆమె బ్రాహ్మణ గృహిణులు కూడా చూసి నేర్చుకోవలసినంత సంప్రదాయబద్ధంగా జీవించింది. కానీ గృహిణిగా ఆమె నిలదొక్కుకుందా?’అన్న ప్రశ్న కూడా లేవనెత్తుతుంది.

ఈ ద్వంద్వాలు, ప్రాధాన్యాలు, విజయ వైఫల్యాలూ వివరించి విశ్లేషించిన నవల మనోధర్మపరాగం.


120 సంవత్సరాల సంగీత పరిణామాలను 30 ప్రకరణాల సాయంతో చిత్రించిన బృహన్నవల ఇది.

స్థూలంగా కథ చెప్పుకోవాలంటే: 1889లో పుట్టిన వీణాప్రవీణ చిత్తూరు స్కంద కుముదవల్లి తన పోషకుని వెదుకులాటలో 1913లో మదురై వదిలి చిత్తూరు చేరుకోవడం; చేరి స్థిరపడ్డాక తన కూతుళ్ళు నాగలక్ష్మి, మరకతాంబలకు చక్కని పోషకులను సమకూర్చడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకోవడం; నాగలక్ష్మిలోని సంగీత ప్రతిభను గుర్తించి దానిని పోషక అన్వేషణా పరికరంగా మార్చాలని ప్రయత్నించడం; ‘పోషకుడు’ అన్న వ్యవస్థను ఏవగించుకునే నాగలక్ష్మి పెళ్ళి చేసుకుని గృహిణిగా స్థిరపడాలని తపన పడటం…

ఆ ప్రక్రియలో నాగలక్ష్మి ఇల్లు వదిలి పారిపోయి తనలోని అపురూప ప్రతిభను గుర్తించిన జర్నలిస్టు విశ్వనాథన్ ఆశ్రయం లోకి వెళ్ళడం;  ఆ ప్రతిభను సరుకుగా మార్చి సమర్థవంతంగా చెలామణీ చెయ్యడంలో విశ్వనాథన్ విజయపరంపర – జర్నలిస్టు స్థాయి నుంచి పత్రికా యజమానిగా, రాజకీయ నాయకునిగా, సినిమా నిర్మాతగా ఎదగడం; నాగలక్ష్మి నటిగా, గాయనిగా జాతీయ అంతర్జాతీయ నీరాజనాలు, అపురూపమైన పురస్కారాలూ అందుకోవడం; ఆ ప్రయాణంలో ఆమెకు తటస్థపడిన, సాయపడిన అనేకానేక వ్యక్తులు… 

ఆమె ప్రయాణపు విభిన్న దశలలో సంగీత నాట్యాలు క్రమక్రమంగా పరాయీకరణకు గురి అవడం, అవి దేవదాసీల నుంచి అగ్రవర్ణాల చేతుల్లోకి బదిలీ అవడం; ఆ పరాయీకరణలో ఎందరో నాగలక్ష్ములు తమకు తెలిసీ తెలియకుండానే క్రియాశీల భాగస్వాములవడం; 

తన ముత్తవ్వ మోసిన ఏడు శతాబ్దాల బరువుకన్నా తన వెనుక వున్న ఆరు దశాబ్దాల వారసత్వపు బరువు ఎక్కువ అన్న గ్రహింపు ఆమె మునిమనవరాలు నాగలక్ష్మీ నటరాజన్‌కు ఉండడం – స్థూలంగా ఇదీ కథ.


చూడటానికి మనోధర్మపరాగం ఒక జీవితం చుట్టూ తిరిగిన రచనే అనిపించినా ఇంకెన్నో జీవితాలను, మరి కొన్ని కుటుంబాలను, ఒక సామాజిక వర్గపు శతాబ్దాల చరిత్రను, ఒక శతాబ్దకాలపు వర్తమాన చరిత్రను, నాట్య సంగీతాల లోతులనూ తనలో ఇముడ్చుకుంది. ఆయా విషయాలను 30 పాత్రల ద్వారా చెప్పించింది.

ఆ 30 పాత్రలలో మనం ముందు చెప్పుకున్న నాగలక్ష్మి వాళ్ళ అమ్మ చిత్తూరు కుముదవల్లి దగ్గర్నించి మునిమనవరాలు నాగలక్ష్మీ నటరాజన్ దాకా ఉన్నారు. మారుటి కూతురు దీపా చంద్రన్, మేనకోడలు అభిరామసుందరి ఉన్నారు. చెల్లెలు మరకతాంబ, అన్న దండపాణి భార్య కనకరంజని ఉన్నారు. నాగలక్ష్మిని చూసి ప్రేరణ పొంది 1929 లోనే సంగీతం నేర్చుకున్న వకీలు రామస్వామి అయ్యంగార్ కూతురు గాయత్రి, సంగీత కచేరీ, ఇల్లూ తప్ప మరో లోకం తెలియని 1941 నాటి బ్రాహ్మణ భద్రమహిళ మంగతాయారు ఉన్నారు. నాగలక్ష్మి చిన్ననాటి చెలికత్తె ధనకోటి తాయారు, 1937 నాటి సహనటి, నాట్యగత్తె తంజావూరు వరలక్ష్మి ఉన్నారు. ఆదాయం కోల్పోయి అలమటించే దేవదాసి ప్రసూనవల్లి, స్వంత కులం మనిషిని పెళ్ళి చేసుకుని కూడా ఇక్కట్ల పాలయిన దేవదాసి ఆర్ముగాంబ ఉన్నారు. ఏంటీ నాచ్ ఉద్యమనాయకి ముత్తులక్ష్మీరెడ్డి శిష్యురాలు మదురై మోహనాంబ, ఔత్తరాహ్య సంగీత విదుషీమణి జ్ఞానేశ్వరి, మన మహానటి సావిత్రి ప్రతిరూపమైన చిత్తూరు సరళకుమారి, నాగలక్ష్మి సినిమా ప్రస్థానం వివరాలు చెప్పుకొచ్చే ఎన్. టి. రంజితం – ఇలా మూడు పదుల పాత్రలు.

అలా అన్ని పాత్రలనూ అనుసంధానిస్తూ కథకుడు సూత్రధారి పాత్ర నిర్వహిస్తూ కథను ముందుకు నడుపుతాడు. రచయిత మాటల్లోనే: ‘చరిత్రనంతా కల్పనగా, ఆ కల్పనకు మళ్ళీ చరిత్ర నేపథ్యం ఉండేలా చెప్పిన నవల’ ఇది. అలాగే ‘అన్ని పాత్రలకూ చారిత్రక మూలాలు ఉన్నాయి కానీ అవేవీ చారిత్రక వ్యక్తులు కావు’ అనీ అంటారు రచయిత.

నవలలో కనిపించే 30 పాత్రల గురించి మరో ముఖ్యమైన మాట చెపుతారు రచయిత: ‘కర్ణాటక సంగీతానికి ప్రాచుర్యం తీసుకువచ్చిన దేవదాసీల గురించి పరిశోధనలు జరిగాయి. జీవిత చరిత్రలూ వచ్చాయి. కానీ అవి ప్రధానమైన ఒకరిద్దరిని తప్ప ప్రతిభావంతులైన ఎంతోమంది ఇతరులను పట్టించుకోలేదు. వీళ్ళంతా ప్రసిద్ధులైన వ్యక్తుల జీవితాల్లోకి వచ్చి, లెక్కకు రాని పనులేవో చేసి, తుదీ మొదలూ లేని అయోమయంలోకి జారిపోయారు. నవలారూపంలో అయినా వారికి మాట్లాడే కనీసపు హక్కుని ఇవ్వడానికి నేను ప్రయత్నించాను.’ 

అలా వారితో మాట్లాడించి, కథను నడిపించి, నవలను రక్తి కట్టించడానికి అరుదైన శిల్పం ఎన్నుకొని తన ప్రయత్నంలో విజయవంతమయారు రచయిత.


నవలలో ప్రధానంగా కనిపించేది నాగలక్ష్మి జీవితమే అయినా దానితోపాటు కనీసం మరో ఆరు విభిన్న జీవిత గాథలు మనకు తటస్థపడతాయి.

అమ్మ కుముదవల్లిలానే వీణ బాగా వాయించే నాగలక్ష్మి చెల్లెలు మరకతాంబ ‘పోషకుడి’ మార్గాన్ని ఇష్టపడి అనుసరించి, అందరికీ దూరంగా వెళ్ళి ఒంటరిగా జీవించి చివరికి జబ్బుల పాలబడి ‘ఈదడం కష్టమయినప్పుడు మునగడమే సుఖం కదా’ అంటూ వెళ్ళిపోవడం – అదో విషాదగాథ.

తనకంటూ ఏ ప్రత్యేకతలూ లేని అన్న దండపాణి భార్య కనకరంజని భర్త తోను, సవర్ణ సవతి రామలక్ష్మి నీడలోనూ ఒదిగి ఒదిగి బతికి చివరకు తన కొడుకుల ఆస్తి తగాదాలలో చిక్కుబడిపోవడం – సవివరంగా చెప్పుకొచ్చిన నిస్సహాయగాథ.

పోషకుడనే మాటే కాకుండా మొగుడనే మాట విన్నా మండిపడే మదురై రత్నమాల కాలానికి ముందు నిలిచి స్త్రీపురుష సంబంధాలు, కుటుంబ సంబంధాలలోని అసమానతలను గుర్తెరిగి ‘ప్రేమా పెళ్ళీ – వీటి గోల లేకుండా మనం బ్రతకలేమా’ అని, అలా బతికి చూపించడం – అదో ధీరగాథ.

విశ్వనాథన్ కార్యదర్శి అరుణాచలం నుంచి విడిపోయిన లెక్చరర్ భార్య మధురిమ – తమ దాంపత్య క్లేశాల గురించి, నాగలక్ష్మీ విశ్వనాథన్‌ల వైవాహిక జీవితం గురించీ వివరిస్తూనే – ఒక సాధికారత సాధించిన మహిళ జీవితం ఎంత అర్థవంతమో, అదే సమయంలో ఎంత ఒడిదుడుకుల మయమో విప్పి చెప్తుంది.

ఇలాంటి సౌష్ఠవ కథనాలు ఈ నవలలో మరో నాలుగయిదు కనిపిస్తాయి. ఒక్కొక్కటీ ఒక్కో నవలకు సరిపడే ఇతివృత్తం ఉన్న జీవితాలవి. ఇహ నవల పొడవునా మహాప్రవాహంలా సాగే సంగీతం సరేసరి. 

నవలలో పాఠకులను ఆకట్టుకునే మరో అంశం అప్పటి స్థలకాలాల సవివర సాధికార చిత్రణ.

సందర్భానుసారం నవల రంగస్థలం మదురై, చిత్తూరు, తంజావూరు, కాళహస్తి, మద్రాసు, కలకత్తాలకు మారుతుంది. అలాగే 1890లలో మొదలయిన నవల ఇరవయ్యో శతాబ్దం లోకి అడుగు పెట్టి 1910లు, 20లు, 30లు, 50ల మీదగా సాగి 70లు దాటుకుని 21వ శతాబ్దానికి చేరి 2020 దగ్గర ముగుస్తుంది. స్థలం పరంగాను, కాలం పరంగానూ ఎంతో పెద్ద కాన్వాసు మీద గీసిన చిత్రమీ నవల. అయినా ఆయా కాలాలను, ఆయా ప్రదేశాలను, అప్పటి మనుషులను, వారి వారి మాటతీరులనూ చక్కగా పట్టుకుని మనకు అందిస్తుంది. అప్పటి రాజకీయ భౌగోళిక పరిణామాలను, సామాజిక సాంస్కృతిక పరివర్తనలను, ఆధిపత్యాలు, సంగీతనాట్యాలు, సినిమాలు, ఉద్యమాలు – వీటన్నిటినీ గొప్పగా మన కళ్ళ ముందు నిలబెడుతుంది.

స్థల కాలాల పరంగా ఎంతో పెద్ద కాన్వాసును ఎన్నుకున్న ఈ రచన మనుషులు-మనస్తత్వాలను, బంధాలు-బాంధవ్యాలను, వాటిలోని లోతులను-లోతులేనితనాలను, ఈసునయసూయలను – ఈ రకపు అతి సూక్ష్మమైన వివరాలను కూడా ఎంతో సమర్థవంతంగా ఒడిసిపట్టుకుని మనకు అందిస్తుంది. అలాగే, మానవీయమైన ఆర్ద్రతతో నిండిన ఎన్నో సన్నివేశాలు నవల పొడవునా మనకు కనిపిస్తాయి. 


నవల పేరు మనోధర్మపరాగం.

సమర్థులైన గాయకులు – రాగాలపై ప్రభుత సాధించిన గాయకులు – తమ మనస్సును కళకు ఆధీనం చేసి, సంగీత శాస్త్ర నియమాల హద్దులను తాకుతూ, కాలం మెచ్చిన పోకడలకు భిన్నంగా, తమ అంతఃచేతనకు బాహ్యరూపం ఇచ్చి మనోధర్మ సంగీత సృజనకు పూనుకోవడం గురించి మనలో చాలామందిమి విని వుంటాం. కొంతమందికి ఆ వివరం తెలిసే ఉంటుంది. మన మంగళంపల్లి, గజల్ గాయకుడు ఘులామ్ అలీ ఇలాంటి సృజనలో అగ్రగణ్యులు.

మరి, మనోధర్మపరాగం అంటే?

సంగీతం తెలిసిన సాహితీ విశ్లేషకులు ఎస్. జె. కల్యాణి ఈ నవల గురించి మాట్లాడుతూ ‘శరీరమనే లతకు పూసే మనస్సు అనే పుష్పానికి చెందిన పరాగమే సంగీతం. తమ గానాన్ని ఈ పరాగస్థాయికి తీసుకువెళ్ళిన గాయకులు సృజించేదే ఈ మనోధర్మపరాగం’ అని వివరించారు.

రెండేళ్ళ క్రితం వచ్చిన ఈ నవల ఎందరినో మెప్పించింది. కొంతమందిని నొప్పించింది కూడానూ! ‘బ్రాహ్మణ వ్యతిరేక నవల’ అన్న విమర్శకు గురి అయింది. బ్రాహ్మణిజానికి, ఆ ధోరణిలోని ఆధిపత్యానికీ ఇది ఎదురు నిలిచింది అని తెలుసుకోవడానికి వివేచన, సమర్థత, సంయమనమూ ఉండాలి కదా! అలాగే, ఈ నవల దేవాదాసీలు సంగీత నాట్య రంగాలలో సాధించిన పరిణతిని, విజయాలను పట్టించుకోకుండా వారి దుర్భర జీవితాల మీదే దృష్టి నిలిపి, వారి ప్రయోజనాలను దెబ్బతీస్తోంది అని వ్యథ చెందినవారూ ఉన్నారు. ఆయా కళల్లో ఉన్నత శిఖరాలను చేరుకున్న కొద్దిమంది సంగతి అటుంచితే నిజానికి ఈ కళలు సాధారణ ప్రతిభ ఉన్నవారికి కూడూ గుడ్డా ఇవ్వలేవు. వాటిల్ని నమ్ముకుని బతకడం అంటే అది పంజరపు చిలక బ్రతుకే అన్న ఎరుక నవల నిండా స్పష్టంగా కనిపిస్తోన్నా అలాంటి వ్యథలు ఆయా వర్గాల్లో గూడు కట్టుకుని ఉంటే ఎలా?!

ఇది నిస్సందేహంగా మనకు బాగా తెలిసిన భారతరత్న జీవితం ఆధారంగా తీసుకుని రాసిన నవలే. ‘ఈ విషయం ఎందుకు చెప్పలేదూ?’ అన్న గద్దింపూ అడపా దడపా వినబడుతోంది. రచయిత చరిత్రనంతా కల్పనగా చెప్పి, ఆ ప్రక్రియలో నవలకు మరింత భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ విస్తృతిని సమకూర్చడం గమనిస్తే – నవల సాధించిన అదనపు ప్రయోజనాలనూ పరిగణనలోకి తీసుకుంటే ఆ గద్దింపులు తాటాకు చప్పుళ్ళగానే వినబడతాయి!

ఏతావాతా గత కొన్నేళ్ళలో వచ్చిన అతి మంచి నవల మనోధర్మపరాగం.


నవల: మనోధర్మపరాగం
రచన: మధురాంతకం నరేంద్ర
వెల: రూ. 375/-
ప్రచురణ: అన్వీక్షికి ప్రచురణలు, 2020.
లభ్యత: నవోదయ, అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్.