ఏమిటీ పుస్తకం?
ఇది కొన్ని సంఘటనల కూర్పా? అనుభవాల మాలికా? జ్ఞాపకాల పదచిత్రమా? ప్రయాణాల వివరాలా? యాత్రాసాహిత్యమా?
మొదటిసారి చదివినపుడు తెలుగు యాత్రాసాహిత్యానికి నెమలి ఈక దొరికిందన్న సంబరం కలుగుతుంది. రెండోసారి చదివితే, ఇది యాత్రా సాహిత్యం కాదు. మరింకేదో… అన్న అనుమానం కలుగుతుంది. మూడోసారి చదివితే ఆ అనుమానం నిజమని తేలుతుంది.
పుస్తకంలోనే ఇది ‘యాత్రానుభవాల సంపుటి’ అన్నారు గానీ లోతుల్లోకి వెళితే ఇందులో యాత్ర కేంద్రబిందువు కాదు. ఈ రచనకు ఆధారపీఠం జీవితం అన్న ఎరుక కలుగుతుంది. మరి ఈ పుస్తకాన్ని ఏ కోవకు చేర్చాలీ?
చెప్పడం కష్టం.
కట్టె కొట్టె తెచ్చే బాణీలో చెప్పాలంటే–ఛత్తీస్‌గఢ్ పల్లెల్లోనూ, తూర్పూ పశ్చిమ కనుమల్లోనూ, అరకు నుండి పులికాట్ వరకూ, నర్సీ పట్నం నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరి వరకూ, డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకూ రచయిత ఒంటరిగానూ, సహచరుడు లోహితో కలసీ కాలినడకనా, బస్సు రైలు కారుల్లోనూ, సైకిలు మీదా గత ఆరేళ్ళలో చేసిన ప్రయాణాల అనుభవాలు నిండిన పుస్తకం ఇది. ఆ ప్రయాణ వివరాల పరంపరలో:
– మున్నార్ కొండల్లో మబ్బుల మధ్య–ఆకాశంలో ప్రయాణం చెయ్యడంలేదు కదా అనిపించే బస్సు ప్రయాణం గురించి చెపుతారు రచయిత జయతి లోహితాక్షన్.
– ఓ తెలంగాణా అడవుల్లోని గ్రామంలో రాత్రి చలిమంట దగ్గర కూర్చున్నపుడు–ఎప్పుడో విడిపోయి ఎక్కడెక్కడో తిరిగి తిరిగి మళ్ళా ఈనాడు ఈ మంట దగ్గర కలుసుకొన్నారా అనిపించే గ్రామీణుల బృందం గురించి చెపుతారు.
– పట్నం మనుషులు అడవుల్లో వాళ్ళను వింతగా చూసినట్టే తనను ఎంతో కుతూహలంతో చూస్తోన్న అడవిపిల్ల ఎల్లి గురించి చెపుతారు.
– కలలోకి వచ్చి దుప్పటి కప్పిన ఏడువందల ఏళ్ళనాటి ఓ సూఫీ బాబా సరసన ఓనాటి రాత్రి నిద్రపోయిన వైనం చెపుతారు.
– ఆదిలాబాద్ అడవులు దాటాక ఎల్లి వాళ్ళ పొలం మంచె దగ్గర పొలాలు, రైతులు, పండిన పంట, వాటికోసం వచ్చే అడవి జంతువులు, రైతుల పారాహుషార్లు; వీటిమధ్య తాను అనుభవించిన అపురూపమైన రాత్రి గురించి చెపుతారు.
– బ్రహ్మపుత్ర పరిసరాల్లో థాయ్‌లాండ్ దేశస్తులు ఏనాడో స్థిరపడిన, నిశ్శబ్దమే తన సంతకంగా సంతరించుకొన్న నాన్‌ఫాకే గ్రామం గురించి చెపుతారు.
– అలాగే, ‘ప్రయాణాలు సాఫీగా సీదాసాదాగా సాగడంకన్నా కుదుపులూ ఒడిదుడుకులూ ఉంటే మరింత బావుంటాయి. ఎండ అనీ, చలి అనీ, వాన అనీ ఇంట్లోనే ఉండిపోతే మరి వాటన్నిటినీ చూసేదెపుడూ?’ అని అడుగుతారు. తమ ప్రయత్నమంటూ లేకుండానే పులికాట్ ద్వీపాల్లో ప్రయాణమే తమల్ని ఎక్కడెక్కడికి నడిపించిందీ చెప్పుకొస్తారు.
– ఆ దీవుల్లోనే ఓ ఇసుక దిబ్బమీద వెనక్కివాలి, పరిసర ప్రపంచాన్ని చూస్తూ–జీవితం ఇట్లా సాగిపోతే చాలదా? ఈ చదువులూ ఉద్యోగాలూ ఎందుకూ? అసలు ఏదో ఒకటి చెయ్యాలనుకోవడం ఎందుకూ?–అన్న ఆలోచనలో పడతారు.
నిజానికి ఇవన్నీ అభిరుచి ఉన్న యాత్రికులకు ఏదో ఒకరోజు కలిగే అనుభవాలే, ఆలోచనలే.
‘నేను మనుషుల్ని ప్రేమిస్తాను. కానీ అడవుల్లో ఉండటానికి ఇష్టపడతాను.’ అంటారు రచయిత. అడవుల్ని చూడాలి అన్న కాల్చేసే ఆశ ఉండేదట ఆమెకు. 2012లో ఒక అడుగు ముందుకువేసి అడవికి దగ్గరయ్యారట. ఛత్తీస్‌గఢ్ పల్లెల్లో కట్టెలు ఏరడానికి అడవుల లోలోపలికి వెళ్ళే ఆడవాళ్ళతో జతకట్టి మొదటిసారిగా సాలవృక్షపుటడవుల్లో తిరిగి తిరిగి వచ్చినపుడు అంటారు: ‘నేను మునుపటి నేనులా లేను. ఇన్నాళ్ళూ ఎదురుచూసినదేదో నాలో నింపుకొన్నాను. మనసు ఎపుడూ లేనంత శాంతంగా ఉంది.’
ఇది ఆమె తనను తాను కనుగొన్న సమయం. ఆవిష్కరించుకొన్న తరుణం.
అయినా ‘ఎందుకు నేను నగరాల్లోనూ, మానవ సమూహాల్లోనూ ఇమడలేకపోతున్నాను? ఉద్యోగాల్లో నిలవలేకపోతున్నాను? ఎందుకు అడవి నాకు చెందినదే, అది నా ఊపిరే అనిపిస్తోందీ?’ అన్న మీమాంస ఆమెను వదలలేదు.
తన మూడు నెలల సైకిలు ప్రయాణంలో పాడేరు అడవుల్లో తిరిగివచ్చి ‘తీసుకోగలిగినంత అడవిని నాలో తీసుకుని, అడవిని దాటివచ్చాను.’ అనే అడవి బిడ్డ ఈమె!
ఇప్పటికే రచయితతో పరిచయం ఉన్నవాళ్ళూ ఆవిడ రచనలను విడివిడిగా చదివినవాళ్ళూ, ఈమె దగ్గర మనకు తెలియనిది ఏదో ఉంది. మాటల్లో చెప్పలేనిది ఏదో ఉంది–అనుకోవడం జరుగుతోంది.
ఆ మాట నిజమే. కానీ ఆ ‘ఏదో’ ఏమిటీ?
ఈ పుస్తకంలోని ‘యాపిల్ పండు’ అన్న ఖండికలో దానికి ఆధారం దొరుకుతుంది.
హైదరాబాద్ పరిసరాల్లో షేర్ ఆటోలో చేసిన ప్రయాణపు వివరాలు ఉన్న ఖండిక అది.
భద్రజీవులు చాలామంది షేర్ ఆటో, సెవన్ సీటర్ అనగానే భయపడతారు. ఏవగింపుకు గురి అవుతారు. వాటిది దురుసు నడక. యాక్సిడెంట్లు విపరీతం. రాత్రయితే అంతా తాగుబోతు ప్రయాణీకులు. పగటిపూటా ఏమాత్రం శుభ్రతలేని వాళ్ళే ఉంటారు, అంటూ అటువేపు వెళ్ళడానికే ఇష్టపడరు.
మళ్ళా ఆ భద్రజీవులే–ముఖ్యంగా సాహిత్య అభిరుచి ఉన్నవాళ్ళు–సామాన్య ప్రజానీకం, సమాజం, జీవితం అంటూ ఉంటారు. ఆ విషయాల గురించి రాస్తారు.
కానీ ఎక్కడ ఉందా జీవితం?
ఆ కాస్సేపటి ఆటో ప్రయాణంలో జీవితపు ఆచూకీ దొరుకుతుంది మనకు.
– పిల్లాడికి ఒక పండయినా కొనిపెట్టలేని పేద తల్లి…
– పోటీలూ ఆడంబరాలకు అత్తను బలిచేసి ఆమె మనవడి పుట్టినరోజు పేరిట ఆ పేదతల్లిచేత వేలకు వేలు ఖర్చుపెట్టిస్తోన్న ఆమె అల్లుడు…
– ఆ తల్లిని పదేపదే మాట్లాడించి సముదాయించే చిన్న నవ్వుల పెద్ద అవ్వ…
– ఓ నాన్న ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతోన్న బిడ్డ…
– ఇద్దరు బడుగు రైతుల పురుగుమందుల చర్చలు…
– బాడుగ విషయంలో ఆ పేద తల్లిని దగాచేసిన ఆటో డ్రైవరు…
కాస్సేపటిలో ఒక పెద్ద ప్రపంచాన్ని తాను చూసి మనకు చూపిస్తారు రచయిత.
అలాగే డిబ్రూగఢ్‌లో కన్యాకుమారి వెళ్ళడం కోసం వివేక్ ఎక్స్‌ప్రెస్ ఎక్కినపుడు తమ రిజర్వేషన్ బోగీలో కూడా నడుమువాల్చే సందు లేదంటారు రచయిత. ఆ అనడంలో చిరాకూ అసహనాలు లేవు. ఫిర్యాదు అసలు లేనేలేదు. అందులో తోటి మనుషులు నిలబడి ఉంటే కాళ్ళు చాచుకుని కూర్చోవడానికి ఒప్పని మనసుంది. కష్టాన్ని వందలమంది కలసి పంచుకున్నాం అని చెప్పే సహజ ప్రవృత్తి ఉంది. అందరిదీ ఒకటే కష్టం ఒకటే సుఖం అనే మనస్తత్వం ఉంది. రైలులో కేరళ వెళుతోన్న శ్రామిక అసోమ్ యువకులంతా ప్రయాణం ముగిసేసరికి తమ్ముళ్ళు అయిపోయే మమత ఉంది.
అలాగే తన సైకిలు ప్రయాణంలో ఏదో మిరపమడి గట్టుమీద సైకిలు నిలబెట్టి అక్కడి మనిషితోపాటు–తాను ఊరికే ఉండలేక–మిరపకాయలు కోసే మనిషి ఆమె. ఓ ధాబాలో భోజనానికి ఇంకా సమయం పడుతుంది అని వాళ్ళు చెప్పినపుడు గబగబా కూరగాయలు అందుకొని వాళ్ళకు కోసిపెడతారామె! వరినాట్లు వేస్తున్న ఓ ఒంటరి మహిళను చూసి, ఆ మనిషి ‘నీకిది చేతగాదు…’ అంటున్నా పట్టించుకోకుండా ఆ బురదమడిలో దిగి క్షణాల్లో ఆ ఒడుపు పట్టుకొని పని పంచుకొనే మనిషి ఈ జయతి.
సీతాకోక చిలుకలు, గొంగళిపురుగులు, వడ్రంగి పిట్టలు, గిజిగాళ్ళు, ఊసరవెల్లులు, ఉడుతలు, నల్ల త్రాచులు, సాధారణపు తొండలు, వెదురుపొదలు, కాగితంపూలు, సాలవృక్షాలు, గాలి, నీరు, మట్టి, ఆకాశం–అన్నిటితోనూ సంభాషించి వాటి విశ్వాసం, స్నేహం పొందే శక్తి ఉన్న మనిషి ఈమె.
అలా అని ఆమెకేమీ మహిమలూ అతీంద్రియ శక్తులూ లేవు.
మన అందరిలాంటి మామూలు మనిషే.
ఆమెకు చిలగడదుంపలంటే ఇష్టమట. ప్రయాణాల్లో తటస్థపడిన ఓ పిల్లాడు, ‘ఆంటీ తింటావా?’ అని అడిగితే, అతను మళ్ళా ఎక్కడ మర్చిపోతాడో అని ‘తింటాను తింటాను’ అని సంబరపడే పసి మనసు ఆమెది. కేరళలో కులమావు పట్నం దగ్గరి కొండమీద ఉన్న ఓ స్నేహితుని ఇంటికి వెళ్ళాలని అంతా సిద్ధమయ్యాక ఆ కార్యక్రమం రద్దయితే నిరాశ తట్టుకోలేక చిన్నపిల్లలా ఏడ్చారట. సహచరుడు లోహితాక్షన్ సముదాయింపు కోసం స్కూటరుమీద ఊరు చివర్లదాకా తిప్పుకొచ్చినా కన్నీరు కట్టలేదట!
మళ్ళా ఆమె దగ్గర ఏదో ఉంది అన్నమాట దగ్గరకు వస్తే–ఉంది. నిజమే.
ప్రపంచాన్ని సహృదయంతో, సమహృదయంతో చూసే శక్తి ఉంది. మనుషుల్ని మనుషుల్లా చూడగల మనసు ఉంది. ప్రపంచమంటే సకల చరాచర జీవజాలం అన్న స్పృహ ఉంది. ప్రపంచపు లయను గుర్తెరిగే శక్తి ఉంది.
నిజానికి ఆ శక్తి, ఆ ఏదో మన అందరి దగ్గరా ఉంది.
ఉందని మనకు తెలియదు. తెలిసినా పట్టించుకోం.
మనిషికి, ముఖ్యంగా రచయితకు, ఈ చూపు ముఖ్యంగదా!
అప్పుడేగదా బతుకు తెలిసేదీ?!
నేను మనుషుల్ని ప్రేమిస్తాను అనే ఈ రచయిత సహజంగానే తన ప్రయాణాల్లో ఎంతోమంది అపరిచితులతో అలవోకగా అనుబంధం ఏర్పరచుకొని వాళ్ళందరినీ మనకు పరిచయం చేస్తారు.
నవ్వుతుంటే విరబూసిన సాల వృక్షాలు పలకరిస్తున్నాయా అనిపించే, ఏ పనినైనా అందంగా ధ్యానంలా చేసే కట్టెలమోపుల ఛత్తీస్‌గఢ్ పూర్ణ, పుస్తకం తెరిచీతెరవగానే మనకు కనిపిస్తుంది. ముగించి మూసేసిన తర్వాత కూడా మనకు గుర్తుండిపోతుంది.
విశాఖ-డిబ్రూగఢ్ రైలు ప్రయాణంలో రిజర్వేషను లేని తనను ఆదరించి చోటు ఇచ్చి ఆప్తురాలయిన–అందంగా నవ్వే–అస్సామీ వనిత భూమిదేవి మనకూ ఆప్తురాలవుతుంది.
వీళ్ళ ప్రయాణపు వివరాలను తరచితరచి అడిగి తెలుసుకొని, అర్థం చేసుకొని, ముగ్ధురాలై, ‘అమ్మా, నిన్ను తాకాలని ఉంది!’ అంటూ ఈమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొన్న సంగవరం టీ కొట్టు మనిషి మన జ్ఞాపకాల్లోకి నడచివచ్చేస్తుంది.
అడవికి మాటలు వచ్చినట్టు గలగలా మాట్లాడుతూనే ఉండే ఎల్లీ వాళ్ళమ్మ యశోద మనకు కనపడుతుంది.
ఒకనాటి రాత్రి సహృదయతతో తమ తండా గ్రామపు ఇంట్లో వీళ్ళకు వసతి కల్పించి, నిద్రపోయేముందు తమ ఉమ్మడి కుటుంబం గురించీ, అన్నదమ్ములగురించీ, తండా గురించీ, పంటల గురించీ, అడవి గురించీ మనసువిప్పి చెప్పుకొచ్చిన నిండుమనిషి మదన్మోహన్ మహరాజ్ మనకు పరిచయమవుతాడు.
చెట్టునూ పక్షినీ పొమ్మని మనిషి బాగుపడేదిలేదు అంటూ 70 ఎకరాల అడవిని పెంచి, రచయిత ‘మీరు పోయాక ఈ అడవీ?’ అని అడిగితే రెండు చేతులూ పైకి ఎత్తి ‘పంచభూతాలు. అవే చూసుకొంటాయి.’ అని ప్రకటించే సూర్యాపేట దుశర్ల సత్యన్నారాయణ మన ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తారు.
అడవీ ప్రకృతీ మనుషులూ అంటే ప్రేమ ఉన్న ఏ మనిషి అయినా కవి అవడం అతి సహజం.
ఈ పుస్తకంలో అడుగడుగునా కవిత్వ పాదాలు కనిపించి మనల్ని కట్టిపడేస్తాయి.
ఆదిలాబాద్ అడవుల్లో పోతంపల్లి చెరువును చూసి ‘అది ఒక నీలి తునక. మబ్బు విరిగి నేలను పడినట్లుంది!‘
ఆ అడవి దాటి ఊరు మొగ చేరాక, ‘ఎండ రంగుమారింది. గోధూళి బంగారపు పొగలాగా పైకి లేస్తోంది. సాలెగూళ్ళు వెలుగుతీగల్లా ఊగుతున్నాయి.‘
కట్టెల మోపుల రాణి అన్నామెను వర్ణిస్తూ ‘ఆకాశం రంగు చీర, సంధ్యపొద్దు జాకెట్టు మెల్లగా చెట్ల గుబుర్లలో కలసిపోయింది.‘
గోదావరి నదీతీరాన పర్ణశాల దగ్గర బడిపిల్లలు ‘ఇళ్ళ దారుల్లో రెక్కలు తెరచి ఎగిరిపోయారు!‘
మరికాస్సేపాగి ‘రాత్రిలోకి ప్రవహిస్తోంది గోదావరి.‘
ఏదో కొండవాగు గురించి చెపుతూ, ‘తెల్లటి ఇసుక మీద వంగుతోన్న పొద్దులోంచి నారింజరంగు పారుతోంది!‘
పశ్చిమ కనుమల్లో తిరుగాడుతున్నపుడు ‘సముద్రాన్ని తోడ్కొచ్చి కొండలమీద గుమ్మరిస్తున్నాయి మేఘాలు.’
70 ఎకరాల అడవిలో పున్నమి రాత్రిపూట కరెంటులేని అదృష్టాన్ని అనుభవిస్తూ ‘మోదుగ బీడు వెన్నెల్లో నిప్పులా మెరుస్తోంది. అడవి వేసుకొన్న నెగడు మోదుగ!‘
ఇలా ఎన్నెన్నో మట్టి వాసన నింపుకొన్న కవిత్వపు పంక్తులు…
అలాగే, ‘బుస్సుమని లేచింది నల్ల త్రాచు. ఆ శబ్దానికి అడవి ఉలిక్కిపడింది. ఒక అపూర్వ దృశ్యాన్ని చూస్తున్నాననిపించింది. కళ్ళూ కళ్ళూ కలుసుకొన్న అనుభూతి…‘ అంటూ అద్భుతమైన పదచిత్రాన్ని నిర్మిస్తారు. ఇలాంటి పదచిత్రాలు మనకు పుస్తకం నిండా కనిపించి ఒక దృశ్య కావ్యాన్ని ఆస్వాదిస్తున్న అనుభూతి కలుగుతుంది.
ఇవి చాలు తనలాంటి సమహృదయులకు.
ఈ రచయిత ఒక అన్వేషి.
ఈ రచన ఆమె అన్వేషణకు పదరూపం.
ఏమిటా అన్వేషణ? ఎందుకా అన్వేషణ?
మాటల్లో చెప్పడం కష్టం.
అది ఒక వ్యక్తి చేస్తోన్న అన్వేషణ కాదు.
మన అందరి అన్వేషణ. మానవజాతి అన్వేషణ.
విడచివచ్చిన మూలాలనూ, జీవనసరళినీ తిరిగి చేరుకొనే ప్రయత్నం.
అది గడియారాన్ని వెనక్కి తిప్పడమా?
కాదనే అనిపిస్తుంది.
సరే! రచయిత. అడవి. ప్రయాణాలు. మనుషులు. ప్రకృతి. కవిత్వం. అన్వేషణ – వీటివల్ల చదివేవాళ్ళకి ఏం ఒరుగుతుందీ? ఏవిటీ వీటి ఫలితం?
నిజానికి ఇదో ఆలోచించవలసిన ప్రశ్నే.
ఫలితాలూ ప్రయోజనాల గురించి ఎన్నెన్నో భాష్యాలు చెప్పుకోవచ్చు.
కాని ఒక్క విషయం.
ఒక మనిషి–తన అవసరాలను కనీస స్థాయికి తీసుకువెళ్ళిన మనిషి–ఆధునిక జీవన విధానం గురించీ, ఆరాట పోరాటాల గురించీ, ఆర్థిక సాంఘిక వ్యక్తిగత రక్షణాభద్రతల గురించీ ఆలోచించని మనిషి–తనకు నచ్చిన రీతిలో బతుకుతోంది. దాని గురించి రాస్తోంది. తన ఉద్దేశ్యం అది కాకపోయినా… అలాంటి జీవితం గురించి ఆలోచించే వాళ్ళకీ, కలలుకనే వాళ్ళకీ, కలలు కాదు. ఇలాంటి జీవితం సాధ్యమే–అని స్పష్టంగా చూపిస్తోంది. ఒక స్ఫూర్తి, ఒక నమ్మకం, ఒక కొత్త దృక్కోణం సమకూరుస్తోంది.
ఇవి చాలు తనలాంటి సహృదయులకు!
మళ్ళా మొదటికి వెళితే…
ఈ పుస్తకాన్ని ఏమని పిలవాలీ? ఏ కోవకు చేర్చాలీ? ఎలా నిర్వచించాలీ?
నిర్వచనాలకూ, కేటగరైజేషన్‌కూ లొంగని రచన ఇది. శబ్దానికీ నిశ్శబ్దానికీ, ఊహకూ వాస్తవానికీ, చలనానికీ అచేతనకూ, ఉనికికీ ఉనికి లేమికీ, బయట ప్రపంచానికీ అంతర్లోకాలకూ, ప్రయాణానికీ జీవితానికీ మధ్య హద్దులు చెరిపేసిన రచన ఇది. ఆలోచనకూ, భావానికీ, అనుభూతికీ, అక్షరానికీ, పదానికీ, వాక్యానికీ, రచనకూ మధ్య ఉండే హద్దులు అధిగమించి నిన్నటికీ రేపటికీ మధ్య నిర్మించిన అక్షరవారధి ఈ పుస్తకం.
ఈ పుస్తకం 2018లో రావడమన్నది యాదృచ్ఛికం. కాలానికీ సమయానికీ అతీతమైన రచన ఇది.
(అక్టోబరు 21న హైదరాబాదులో జరిగిన ‘అడవినుండి అడవికి’ ఆవిష్కరణ సభలో చేసిన పరిచయ ప్రసంగానికి వ్యాసరూపమిది.)