మనమెరుగని మధ్య అమెరికా – 8

పనమా నగరం, పరిసర ప్రాంతాలు

మిరాఫ్లోరెస్ లాక్స్ దగ్గర పనమా కెనాల్‌తో చక్కని పరిచయం, అనుబంధం ఏర్పరచుకున్నాక పనమా నగరాన్ని చుట్టివచ్చే ప్రక్రియను ఆరంభించాను. ముందే చెప్పుకొన్నట్లు ఎవరైనా కొత్త మనిషి ఉన్నట్టుండి పనమా నగరపు కేంద్ర బిందువు దగ్గరకు చేరుకున్నట్టయితే తాను యు.ఎస్.కు చెందిన ప్రధాన నగరమొకదానిలో ఉన్నట్టు తప్పక భ్రమ పడతాడు. అక్కడి ఆకాశ హర్మ్యాల హడావుడి చూసి ఎవరైనా అలా పొరబడి తీరతారు – అందుకు వారిని తప్పు పట్టలేం! బహుశా మధ్య అమెరికా అంతటిలోనూ ఈ పనమా నగరాన్ని మించిన కాస్మోపాలిటన్ నగరం మరొకటి లేదనుకుంటాను.

ఎల్ తోర్నీయో (El Tornillo: మరమేకు) అన్నది అక్కడి డౌన్‌టౌన్‌లో అతి ముఖ్యమైన భవనం. మెలిపెట్టిన ఆకుపచ్చ మరమేకు లాంటి ఆకృతి, శిఖరాగ్రాన ధవళవర్ణపు పిరమిడ్ – ఆ 243 మీటర్లు ఎత్తున్న భవనాన్ని 2011లో నిర్మించారు. ఆ తర్వాత అంతకన్నా ఎత్తయిన భవనాలు నగరంలో వెలసినా ఈ తోర్నీయో భవనం ఆధునిక పనమా నగరపు ప్రతీకగా నిలచిపోయింది.

నేను సామాన్యంగా తేలికపాటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటూ ఉంటాను – ఒక్కోసారి అదీ ఉండదు. అంచేత హోటల్స్ బుక్ చేసుకొనేటప్పుడు వీలయినంత వరకూ బ్రేక్‌ఫాస్టు లేకుండా ఉండేలా జాగ్రత్త పడతాను. అలా వీలుకానపుడే అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. పనమా నగరంలో ఉన్నన్ని రోజులూ అక్కడి కరకరలాడే మొక్కజొన్న పాటీలే నాకు ప్రధాన అల్పాహారం అయ్యాయి. అంతగా అవి నాకు ఇష్టమయ్యాయి. ఆసియా దేశాల ఆహారాల్లో వరి ధాన్యం, యూరప్‌లో గోధుమ ముఖ్యమైన దినుసులయితే లాటిన్ అమెరికా దేశాల్లో మొక్కజొన్న ముఖ్యాహారం.


మర్నాటి ఉదయం బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్ దగ్గరకు ఊబర్ టాక్సీలో చేరుకున్నాను. పనమా కెనాల్ పసిఫిక్ మహాసాగరాన్ని కలిసే చోట నిర్మించిన మహాజల సేతువు అది. రెండు అమెరికా ఖండాలనూ కలుపుతూ 1962లో నిర్మించిన 1654 మీటర్ల వంతెన అది. పనమా కెనాల్ ద్వారా వెళ్ళే ప్రతి ఓడా ఈ వంతెన దిగువ నుంచి వెళ్ళి తీరాల్సిందే. ఘనత వహించిన పాన్ అమెరికన్ హైవే ఈ బ్రిడ్జి మీదుగానే సాగుతుంది. మధ్య అమెరికా దేశాలతో ఉత్తరదిశ నుంచి దక్షిణ దిశకు ప్రయాణం చేసే క్రమంలో ఈ హైవేనే నాకు దిశాసూచికగా ఉపకరించింది. గ్వాతెమాల నుంచి పనమా దాకా నాకది రిఫరెన్స్ పాయింటుగా పని చేసింది. ఆ మహాసేతువు దగ్గర ఆ మహారహదారికి లాంఛనప్రాయంగా గుడ్‌బై చెప్పాను – ఒకవిధంగా నా మధ్య అమెరికా యాత్రలో అంతిమ బిందువు ఆ సేతువూ రహదారి కలసిన ప్రదేశం.

నిజానికి ఆ సేతువును దాటి మరో 200 కిలోమీటర్లు సాగాక, అప్పటిదాకా అఖండంగా సాగుతున్న పాన్ అమెరికన్ హైవేకు 90 కిలోమీటర్ల పాటు గండి ఏర్పడుతుంది. నరమానవుడు చొరలేని ఉష్ణమండలపు వర్షారణ్య ప్రాంతమది. ఆ 90 కిలోమీటర్లలో కొంత పనమా భూభాగమయితే మిగిలినది దక్షిణ అమెరికా ఖండం లోని కొలంబియా దేశానికి చెందినది. ఆ గండిని దరియేన్ గాప్ (Darién Gap) అంటారు. గండిని దాటాక ఆ మహా రహదారి తన పరుగును కొలంబియా భూభాగంలో అందిపుచ్చుకొని తిన్నగా అర్జెంటీనా దేశపు ఉషుఆయ (Ushuaia) పట్టణం దాకా కొనసాగిస్తుంది.

లెవీసన్ వుడ్ (Levison Wood) అన్న నా అభిమాన ఆధునిక సాహసికుడు రాసిన వాకింగ్ ది అమెరికాస్ (Walking The Americas) అన్న పుస్తకాన్ని ఈ మధ్యన చదివాను. మధ్య అమెరికా అంతటా ఆయన కాలినడకన నడిచాడు. బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్ దాటడం గురించి, దరియేన్ గాప్ కేసి ప్రయాణం చేయడం గురించీ ఆయన రాసిన వివరాలు ఆ క్షణాన నాకు గుర్తొచ్చాయి.

దరియేన్ గాప్‌ను దాటుకుని వెళ్ళడమన్నది ఏ సాహస యాత్రికుడైనా ఎదుర్కొనే అతి గొప్ప సవాలు. అసలది ఈ భూమండలంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన ప్రయాణమని కొందరి భావన. అక్కడ బాటలూ రహదారులూ అన్న మాటే లేదు; అంతా చిత్తడి నిండిన పర్వత ప్రాంతపు కీకారణ్యం. విషసర్పాలు, నల్ల తేళ్ళు, రాక్షస సాలీళ్ళు, కీటకాలు, కప్పలు, మొసళ్ళు, పెద్దపెద్ద దోమలు – మనిషన్నవాడు అడుగుపెట్టడానికి సాహసించలేని ప్రదేశమది. ఏ చట్టాలు, చట్ట వ్యవస్థలూ అడుగు పెట్టలేని ప్రదేశం గదా – అంచేత అది అసాంఘిక బృందాల విహారభూమి! మాదక ద్రవ్యాలవాళ్ళు, సాయుధ గెరిల్లా బృందాల వాళ్ళ క్రీడా ప్రాంగణమది. హరిశ్చంద్రుడిలా కత్తులూ కొడవళ్ళతో కొమ్మలూ రెమ్మలను నరుక్కుంటూ వెళితే తప్ప కాలు ముందుకు సాగని ప్రాంతమది.


బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్‌ను ఆనుకొని ఉన్న చిన్నపాటి కొండ మీద ఒక పార్కులో చైనీస్ మెమోరియల్‌ కట్టడం ఒకటి ఉంది. ఆ పార్కు ముఖద్వారం దగ్గర చక్కని అలంకరణలతో నిండిన ఆర్చి ఒకటి సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. 1850లలో పనమా రైలు మార్గం నిర్మాణంలో ప్రాణాలు పోగొట్టుకున్న 700మంది చైనా దేశపు వలస కార్మికుల స్మృతి చిహ్నంగా ఆ కట్టడాన్ని నిర్మించారట. ఆ పార్కు నిజానికి ఒక చక్కని విస్టా పాయింటుగా కూడా పనిచేస్తుంది; దిగువున ఉన్న మహాసేతువు, పనమా కెనాల్ పసిఫిక్ మహాసముద్రంలో కలిసే చోటూ అక్కడ్నించి చక్కగా కనిపిస్తాయి. ఏదో చైనా దేశపు టూరిస్టుల బృందానికి వాళ్ళ గైడు చెప్పుతోన్న మాటలు కొన్ని నా చెవిన పడ్డాయి: పనమా దేశంలో రెండు లక్షల మంది చైనీయులున్నారట – అంటే ఆ దేశపు జనాభాలో వారిది ఐదు శాతం! మధ్య అమెరికా దేశాలన్నిటిలోకీ చైనీయులు అత్యధికంగా ఉన్న దేశం పనమా అన్నమాట.

నా ఊబర్ ప్రయాణాన్ని ఆ దగ్గర్లోనే ఉన్న బయో మ్యూజియమ్ దాకా కొనసాగించాను. 2014లో ఆరంభించబడిన ఆ ప్రాంగణం ప్రపంచంలోని మొట్టమొదటి బయోడైవర్సిటీ మ్యూజియమట. ఆ ప్రాంగణమంతా రాబోయే కాలానికి ఈనాడే రూపకల్పన చేసిన అలంకరణలా నిండి కనిపించింది. రంగులీనే లోహపు పలకలు క్రమబద్ధత లేని అమరికలతో కనిపించాయి. ఫ్రాంక్ గేరీ (Frank Gehry) అన్న మనకాలపు ఆర్కిటెక్టు రూపొందించిన ప్రాంగణమది. స్పెయిన్ దేశపు బిల్బావ్ (Bilbao) నగరం లోని గ్యూగెన్‌హైమ్ (Guggenheim) మ్యూజియమ్‌కు రూపకల్పన చేసిన వ్యక్తి ఈ ఫ్రాంక్ గేరీ. తీరా చేసి నేను వెళ్ళిన సమయానికి ఆ బయోమ్యూజియమ్ మూసేసి ఉంది. ఏదేమైనా ఆ నైరూప్య భవనాన్ని బయట నుంచి చూడటానికైనా అక్కడికి వెళ్ళవచ్చు.

అన్నట్టు ఈ బయో మ్యూజియమ్‌ పనమా అఖాతం లోకి చొచ్చుకువచ్చిన అమదోర్ కాజ్‌వే (Amador Causeway) అన్న చక్కని ప్రదేశంలో ఉంది. అక్కడ్నించి బ్రిడ్జ్ ప్రాంతం ఎంతో సుందరంగా కనిపించింది.


డౌన్‌టౌన్‌ లోని అత్యాధునిక ఆకాశ హర్మ్యాలకు దూరంగా, ఒక మూలన కాస్కో వియేహో (Casco viejo) అన్న పనమా నగరపు పాతపట్నం ఉంది. కొలోనియల్ భవనాలు, రాతి పలకల రహదారులూ నిండిన చారిత్రాత్మక ప్రదేశమది. నిజానికది నగరపు నీడన దాగిన ఆణిముత్యం అనడం సబబు.

ఆ మధ్యాన్నం పూట మా హోటలు దగ్గర్నించి మెట్రోరైలు పుచ్చుకొని కాస్కో వియోహో చూడడానికి వెళ్ళాను. పనమా నగరమంతటికీ అందాలొలికే, రంగులీనే ప్రదేశమది. ఆ పట్టణపు కూడళ్ళలో చక్కని ఉద్యానవనాలున్నాయి. వాటికి నాలుగు పక్కలా లేలేత రంగుల వలసకాలపు సుందరభవనాలున్నాయి. అక్కడి కూడళ్ళ నుంచి నలు దిశలకూ సాగిపోతోన్న రాతి పలకల వీధులు – ఆ వీధులకు రెండు పక్కలా చొచ్చుకు వచ్చే భవనాల బాల్కనీలు… చక్కని అనుభవమది.

పనమా దేశం వెళ్ళిన ఏ మనిషీ ఆ దేశపు పేరును సంతరించుకొని ఉన్న టోపీలను కొనకుండా ఉండడు. కాస్కో వియేహోలో పనమా టోపీలు అమ్మే దుకాణాలు విరివిగా ఉన్నాయి. సుకుమారమైన గరికపోచలతో అల్లిన టోపీలవి. వాటిని చూడగానే ఎంతో నైపుణ్యం గల హస్తకళ వాటి రూపకల్పన వెనుక దాగి ఉందన్న విషయం మనకు తెలిసిపోతుంది. వీటిని మీ దేశంలోని ఏ ప్రాంతంలో తయారు చేస్తారూ? అని అక్కడి షాపతడిని అడిగాను. అతను చెప్పిన సమాధానం నాకు ఆశ్చర్యం కలిగించింది – కాస్తంత నిరాశ కూడా. ఆ టోపీలను పనమా దేశంలో చెయ్యరట! ఎక్వెదోర్‌లో అట వాటి తయారీ.

నా ముఖకవళికలను చూసి ఆ షాపతను మరికాస్త విశదీకరించాడు; పనమా కెనాల్ నిర్మాణంలో ఇబ్బంది పెట్టే ఎండ బారి నుంచి కార్మికులను కాపాడటం కోసం ఈ విలక్షణ ఉపకరణాలను ఎక్వెదోర్ నుంచి దిగుమతి చేసుకొన్నారట. ఎండ బారి విషయంలో ఈ టోపీలు ఎంతో సమర్థవంతంగా పనిచెయ్యగలగడంతో వాటికి ఆదరణ పెరిగిందట. ఎక్కువ సంఖ్యలో వాటిని దిగుమతి చేసుకొన్న పనమా దేశం పుణ్యమా అని వాటికి పనమా టోపీలన్న పేరు వాడుకలోకి వచ్చిందట. మొత్తానికి మరో దేశపు విలక్షణ వస్తువు ఒకదానికి తన ప్రమేయం లేకుండానే పనమా దేశం తన పేరును జోడించగలిగిందన్నమాట!

రమ్యమైన కాస్కో వియేహో పట్నపు సుందరమైన వీధుల్లో అలా అలా గమ్యమంటూ లేకుండా తిరుగాడుతూ కాలం గడిపాను. నచ్చిన చోట ఓ చర్చిలోకో, పురాతన భవనంలోకో, ఏదైనా దుకాణంలోకో తొంగి చూశాను. ఆ ప్రక్రియలో ఒక విశేషం తెలిసింది: క్వాంటమ్ ఆఫ్ సొలేస్ అన్ని జేమ్స్ బాండ్ సినేమా లోని కొన్ని దృశ్యాలను ఈ కాస్కో వియోహో సన్నపాటి వీథుల్లోనే చిత్రీకరించారట.

అక్కడి పనమా కెథడ్రల్ అన్నది ఒక విలక్షణమైన కట్టడం. స్పానిష్ వలస కాలాల నాటి రొకొకొ శైలి ముఖభాగం. దానికి ఇరువైపులా శ్వేతవర్ణవు బెల్ టవర్లు – ఆకట్టుకొనే భవనమది. ఆ కూడలి అంతటినీ శాసిస్తోందా అనిపించే ఘనమైన భవనమది. దాని ముందు భాగాన చక్కని ఉద్యానవనముంది. లోపల వస్తు సామాగ్రిని ఉంచే పూజాపీఠం బంగారు తాపడంతో మెరిసిపోతోంది.

ఇగ్లేసియా ల మెర్సెద్ (Iglesia la Merced) అన్నది మరో ఆకట్టుకొనే చర్చి ప్రాంగణం. దాని లోపలి భాగం పనమా లోని ఇతర చర్చిలతో పోలిస్తే విభిన్నమైనది. పదమూడు మీటర్ల ఎత్తు ఉన్న పది నిస్పేరొ (nispero) వృక్షాల కాండాలతో చేసిన స్తంభాల మీద నిలచిన చెక్క పైకప్పు. ఆ స్తంభాలకు ఆధార పీఠాలుగా రాతి పునాదులు… అలా 300 ఏళ్ళ నుంచి చెక్కు చెదరని ఆ దారు కట్టడం – కొలోనియల్ వైభవానికి సాక్షిగా నిలచిన ప్రాంగణమది.

అన్నట్టు, ఆ చర్చి ప్రాంగణంలో ఒక చిన్నపాటి నిస్పేరా చెట్టు కనిపించింది. పనమా దేశంలోని తేమ నిండిన అడవుల్లో పెరిగే వృక్షమది. బాగా ఎదిగిన నిస్పేరా నలభై మీటర్ల వరకూ చేరుతుంది. దాని కలప మహా గట్టిది. బాగా మన్నిక కలది. ఆ కలపను భవనాలు, పడవల నిర్మాణానికి విరివిగా వాడతారు. దాని కాండం లోంచి వచ్చే పాలను చూయింగ్ గమ్ తయారీలో వాడేవారు, అంచేత నిస్పేరా వృక్షానికి చూయింగ్ గమ్ ట్రీ అన్న మరో పేరు కూడా ఉంది.

నే వెళ్ళే సమయానికి ఆ ఇగ్లేసియా భక్తులతోను, సందర్శకులతోనూ నిండిపోయి కనిపించింది. చర్చి నడవాలో తిరుగాడుతున్నపుడు ఒక సన్యాసిని పలకరించి చర్చికి అనుబంధంగా ఉన్న మ్యూజియమ్ కూడా చూసి వెళ్ళమంది. వెళ్ళాను. మత సంబంధిత కళాకృతులతో నిండిన మ్యూజియమది. ఈ చర్చీ మ్యూజియమూ మెర్సిడోనియన్ ఆర్డర్ – ది ఆర్డర్ ఆఫ్ మెర్సీ – అన్న మతబ్బందపు ఆధ్యాత్మిక ఆవాసం అని తెలియవచ్చింది. ఈ మతబృందాన్ని 1218లో సాంతా పేద్రో నొలాస్కో (Saint Pedro Nolasco) అన్న ఆధ్యాత్మిక గురువు స్థాపించాడట. ఆయనకు మేరీమాత నుంచి ‘ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాడు’ అన్న పిలుపు అందిందట. అంచేత ఈ మెర్సిడియన్లు అందరిలా బీదరికం (Poverty), ఒద్దిక (Obedience), పవిత్రత (Chastity) అన్న మూడు ప్రతిజ్ఞలనే కాకుండా తమ విశ్వాసాలకు అఘాతం సంభవించే సమయంలో ప్రాణాలను అర్పిస్తామన్న నాలుగో ప్రతిజ్ఞ కూడా తీసుకుంటారట.


ఆ సాయంత్రం జనెట్ అన్న మహిళ నిర్వహించే ఫుడ్‌ టూర్‌లో పాల్గొనడానికి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాను. పనమా నగరపు పాతపట్నంలో ఉన్న అమెరికన్ ట్రేడ్ హోటల్‌లో, ఎల్ తియెంపో కఫే దగ్గర తనను కలుసుకోమని ఆమె మెసేజ్ పెట్టారు. వెళ్ళాను. స్థానికంగా సాగే ఇలాంటి ఫుడ్ టూర్లు ఆయా ప్రాంతాల ఖాద్య విశేషాలను రుచి చూసే అతి చక్కని అవకాశాన్ని అందిస్తాయి. ఆయా ప్రాంతాలలోని వీధుల్లో దొరికే ఆహారాన్ని మనకు పరిచయం చేస్తాయి. నేను ఫుడీని కదా – ఇలాంటి టూర్ అవకాశం దొరికితే వదులుకోను. ఈ టూర్లలో చేరడం ద్వారా ఆయా ఆహార పదార్థాలు ఏయే రెస్టరెంట్లలో లభిస్తాయో ఆ ఖచ్చితమైన వివరాలూ మనకు దొరుకుతాయి.

జనెట్ సరిగ్గా సాయంత్రం నాలుగింటికి వచ్చి కలిసింది. నాతోపాటు మా బృందంలో డాలస్ నుంచి వచ్చిన కేథీ, ఎడ్వర్డ్ అన్న జంట కూడా చేరారు. మేము కలసిన కఫెలో అతి విశిష్టమైన కాఫీ దొరుకుతుంది కాబట్టి ఆ ప్రదేశాన్నే ఆనాటి టూర్‌కు ఆరంభ బిందువుగా ఎన్నుకున్నానని వివరించింది జెనెట్. అక్కడ దొరికే ‘గీషా కాఫీ’ కాఫీ ప్రియులకు ఎంతో ఇష్టమైనదట. అక్కడివాళ్ళు ఆ కాఫీని మాకోసం తయారుచేస్తోన్న సమయంలో జనెట్ దాని పూర్వాపరాలు చెప్పుకొచ్చింది. ఇథియోపియాలోని గోరీ గాషే (Gori Gashe) అన్న ప్రాంతంలో పండే పరిమళ భరితమైన కాఫీ గింజలలోంచి గీషా కాఫీని తయారుచేస్తారట. ఇప్పుడా రకపు కాఫీ పంట పనమాలోనూ దక్షిణ అమెరికాలలోనూ కూడా వేస్తున్నారు. ప్రత్యేకమైన శీతోష్ణస్థితుల్లో పెరిగే ఈ పంటకు – దాని పరిమళము, అరుదైనతనాల పుణ్యమా అని – చాలా గిరాకీ ఉంటుందట. గిరాకీకి తగిన ఖరీదు సరేసరి – కిలో గింజల ధర రెండు వేల అమెరికన్ డాలర్లట. నిర్దుష్టమైన భూసారం, సముద్రతలం నుంచి సరియైన ఎత్తు ఉన్న ప్రాంతాల్లోనే ఈ పంట పండుతుందట. పైగా పంట దిగుబడి అతి పరిమితమట. వెరసి ఆ భరించలేనంత ఖరీదు. పనామాలోని బొకేతె (Boquete) ప్రాంతం ఈ పంట వేయడానికి ఎంతో అనువైనదని గుర్తించి అక్కడా పండిస్తున్నారు. దానితో గీషా కాఫీ ఉత్పత్తిలో పనమా గణనీయమైన ఖ్యాతి సంతరించుకుంది.

అప్పుడే కాచిన గీషా కాఫీని ఒక పెద్ద పింగాణీ గిన్నెలో మాకు అందించారు. తలా ఒక చిన్న కప్పు కాఫీ తీసుకున్నాం. కాఫీలో పాలు కలుపుకోకండి, అలా కలిపితే ఈ కాఫీలోని సున్నితమైన పరిమళాల జాడలు గ్రహించలేరు అని జనెట్ మమ్మల్ని హెచ్చరించింది. ఆ కాఫీలో చాకొలెట్, తేనె, మల్లె లాంటి వివిధ పరిమళాల జాడలు కనిపిస్తాయని వివరించిందావిడ. మెల్లగా ఆ కాఫీ తాగాను. అది చక్కని కాఫీ లానే అనిపించింది తప్ప జనెట్ చెప్పిన పరిమళాల జాడలు నాకు అందలేదు. బహుశా నా నాలుకకా సున్నితత్వం లేదు కాబోలు… కేథీ, ఎడ్వర్డు ఒకటి రెండు రుచుల జాడలను గ్రహించామని చెప్పారు. మీరు తాగిన ఈ కప్పు కాఫీ ఖరీదు పది యు.ఎస్. డాలర్లు అని చెప్పింది జనెట్. అని చెప్పి ఊరుకోకుండా ఇదే కాఫీ మీరు యు.ఎస్.లో తాగితే వంద డాలర్లు, జపాన్‌లో అయితే నూట పాతిక, దుబాయ్‌లో రెండు వందలు అని కూడా వివరించింది. దాన్ని దుబాయ్‌లో కాకుండా పనమా సిటీలో తాగగలిగినందుకు నన్ను నేను అభినందించుకున్నాను.

కేథీ ఎడ్వర్డ్‌లతో సంభాషణ ఎంతో సులువుగా సాగిపోయింది. బాగా త్వరగా అవతలి వాళ్ళలో కలసిపోయే మనుషులు వాళ్ళు. మీరు పనమానే మీ గమ్యంగా ఎందుకు ఎన్నుకున్నారూ అని ఆ యువతీయుకులని అడిగాను. ‘ఎంతో చవక కాబట్టి’ అన్నది వారి సమాధానం. ఎడ్వర్డ్‌కు దంతచికిత్స చేయించుకోవలసిన అవసరం ఉందట. దానికయే ఖర్చు యు.ఎస్.తో పోలిస్తే పనమాలో మూడోవంతట. అంచేత పనమా సిటీలో ఒకరోజు దంత చికిత్స చేయించుకొని మరుసటి రోజు బొకేతె నగరానికి గగనమార్గాన చేరుకొంటారట.

అలా మేము కబుర్లు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ల రానా దొరాదా (La Rana Dorada – బంగారు మండూకం అన్నది అనువాద అర్థం) అన్న చిట్టి బ్రూవరీ దగ్గరికి చేరాం. ఆహ్లాదకరమైన ప్రదేశమది. స్థానిక యువతీ యువకులు బీరు తాగుతూ కేరింతలు కొడుతూ కనిపించారు. వాళ్ళందరినీ చూశాక నాకు యవ్వనం తిరిగి ప్రాప్తించినట్టు అనిపించింది. వైద్యకళాశాలలో విద్యార్థిగా గడిపిన రోజులు గుర్తొచ్చాయి. మాకు ఆ బ్రూవరీలో ఏడు రకాల శాంపుల్సు అందించారు. వాటి రుచులే కాదు రంగులూ విభిన్నం – లేత గోధుమ రంగు, బంగారు వర్ణం, గాఢ గోధుమ చాయ – చివరికి నలుపురంగుకు చేరువ! మేమంతా తలా ఒక రకపు బీరును ఇష్టపడ్డాం. మాకిష్టమైన బీరును తలకొక పైంట్ చొప్పున అందించారు. ఈ ప్రదేశం, ఈ బ్రూవరీ అందరికీ ప్రీతిపాత్రమని, ముఖ్యంగా యువతను ఆకర్షించే గుణమున్నదనీ వివరించింది జనెట్. డౌన్‌టౌన్‌ లోని వియా అర్హెంతీనా వీధిలో దీనికో బ్రాంచి ఉందట.

అక్కణ్ణించి చాలా దూరం నడిచి నలుగురం పనమా బే ఏరియా చేరుకున్నాం. దారిలో దేశాధ్యక్షులవారి రాజభవనం కనిపించింది. చివరికి మెర్కాదో దె మరిస్కాస్ (Mercado de mariscas) అన్న చేపల బజారు చేరుకున్నాం. అక్కడి వ్యవహార సరళి మహా బిజీ బిజీగా ఉంది. డజన్ల కొద్దీ దుకాణాలు తాజా తాజా సీ ఫుడ్ అందిస్తున్నాయి. ఆ దుకాణాల ముందు నిలబడ్డ వర్తకులు సెవీచె (ceviche) శాంపుళ్ళను కస్టమర్లకు అందిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సెవీచె అన్నది దక్షిణ మధ్య అమెరికా దేశాల్లో ఎంతో ప్రఖ్యాతి చెందిన చేపల వంటకం. చేపలను నిమ్మరసంలో ఊరబెట్టి చేసే వంటకమది. అప్పుడే పట్టుకొచ్చిన చేపలతో చేస్తారా వంటకాన్ని – చేసి తాజా బాజాగా వడ్డిస్తూ ఉంటారు. అది నిలువ ఉంచడానికి అనువైన వంటకం కాదు – ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు ఆరగించాల్సిన వంటకమది. సామాన్యంగా దాన్ని భోజనాల్లో స్టార్టర్‌గా అందిస్తారు. ఈ బజారు సెవీచెలకు ప్రసిద్ధి. చేపలతోనే గాకుండా ఆక్టోపస్, మసెల్స్, రొయ్యలతో చేసిన సెవీచెలు కూడా లభిస్తున్నాయక్కడ.

ఈ సెవీచెను నేను మొట్టమొదట చిలె దేశంలో రుచి చూశాను. ఆ మొదటి ప్రయత్నంలో దాని రుచిని ఎలా అర్థం చేసుకోవాలో బోధపడలేదు. ఇపుడు సెవీచెతో మరికాస్త అనుభవం వచ్చేసరికి ఆ రుచిని ఇష్టపడసాగాను. దాని చిక్కని పుల్లని తాజా రుచి నన్ను ఆకట్టుకోసాగింది. ఒక్కసారి నోట్లో పెట్టుకోగానే ఏదో సాగర విస్ఫోటం జరిగిన భావన! ఈ సెవీచెకీ జపాను వంటకం సూషీకీ కాస్తంత పోలికలున్నాయి. కానీ సూషీలో పచనం చెయ్యని మాంసం ఉంటుంది. సెవీచెలో చేపలూ ఇతర సముద్రజీవులను నిమ్మపళ్ళ రసాలలో ఊరబెడతారు.

మా చేపల బజారు పర్యావలోకనం ముగిసేసరికి చీకటి పడింది. అందరం కలిసి మరో కిలోమీటరు దూరం నడిచి పాతపట్నంలోని మరో గమ్యం – బార్ తాంతాలో – చేరుకున్నాం. సంప్రదాయాలకు లొంగని, ఆకట్టుకునే మ్యూరల్స్ నిండిన అధునాతన ప్రదేశమది. చిన్నగా అక్కడ రూఫ్‌టాప్ బార్ లోకి చేరుకున్నాం.ఆ పై అంతస్తు నుంచి పనమా డౌన్‌టౌన్ ఒకవేపున, పాతపట్నం మరో వేపునా కనిపించి కనివిందు చేశాయి.

రాన్ అబుఎలో (Ron Abuelo) అన్న రమ్ పనామాకు చెందిన ప్రఖ్యాత పానీయం. గత వందేళ్ళుగా ఆ రమ్మును అక్కడ ఉత్పత్తి చేస్తున్నారట. అనువదిస్తే ఆ పేరుకు అర్ధం ‘తాత రమ్ము.’ ఆ పాత రమ్ముకు అది సరి అయిన పేరు అనిపించింది. జనెట్‌తో మా టూరు కార్యక్రమంలో ఆ రమ్ము రుచి చూడడం అంతిమ ఘట్టం. ఏడేళ్ళూ పన్నెండేళ్ళుగా నిలవ ఉంచిన ‘రాన్ అబుఎలో’లను రుచి చూశామక్కడ. పనమా పానీయాల్లోకెల్లా తలమానికమయిన ఈ రమ్ము బాటిళ్ళను తిరిగి స్వదేశం చేరుకొనేటపుడు సువనీర్లుగా తీసుకు వెళ్ళమని సిఫార్సు చేసింది జనెట్.

ఫుడ్ టూర్ ముగిసేసరికి రాత్రి ఎనిమిదయింది. పనామాకు చెందిన ఖాద్య విశేషాలను తీరిగ్గా రుచి చూసే చక్కని అవకాశం కలిగించినందుకు జనెట్‌కు మనసారా ధన్యవాదాలు చెప్పాను. ఆమె మాతో దాదాపు ఐదుగంటలు గడిపింది. ఎంతో పిపాసతో తన నగరపు రుచులను మాకు పరిచయం చేసింది. ఆ పని తనకెంతో ప్రీతిపాత్రం అన్నది ఎంతో స్పష్టం. పనిలోనే సంతోషాన్ని వెదుక్కోడానికి ఇలాంటి వ్యాపకాలు ఎంత బాగా సాయపడతాయో!

ఆ మేడమీది బార్ లోంచి కనిపిస్తోన్న పాత పట్నపు దీపాలు మమ్మల్ని ఎంతగానో అలరించాయి. కలసి భోంచేద్దాం అని కేథీ ఎడ్వర్డులు ఆహ్వానించారు. సంతోషంగా ఒప్పుకున్నాను. కొబ్బరి పాలతో వండిన కరేబియన్ రొయ్యల వంటకాన్ని నేను తెప్పించుకున్నాను. భోజనం చేస్తూ ముగ్గురం మా మా ప్రయాణాల గురించి, యు.ఎస్. రాజకీయాల గురించీ మాట్లాడుకున్నాం. భోజనం ముగిశాక మరి కాసేపు తమతో గడిపి మరో రెండు మూడు పెగ్గులు తీసుకోమని వాళ్ళు అడిగారు. మృదువుగా తిరస్కరించాను. నాది అలా పొద్దు పోయేదాకా గ్లాసులు ఖాళీ చేసే వయసు కాదు. అప్పటికే బీర్లు రమ్ముల శాంపుల్స్ తలకెక్కి ఉన్నాయి. మరో రౌండూ మరో రౌండూ అంటే తూలిపడటం ఖాయం. మర్నాటి కార్యక్రమాలు సజావుగా సాగాలంటే ఈ రాత్రి బాగా నిద్రపోవడం అవసరం కదా – వాళ్ళకి గుడ్‌నైట్ చెప్పేశాను.


మర్నాటి ఉదయం పనమా కెనాల్ ఒడ్డునే ప్రయాణించి అట్లాంటిక్ మహాసాగరపు తీరాన, 75 కిలోమీటర్ల దూరాన ఉన్న కొలోన్ (Colón) అన్న నగరానికి వెళ్ళే టూరు ఒక దానిలో చేరాను. ముందుగా నేననుకొన్నది ఈ ప్రయాణం రైలులో చేద్దామని. తీరా చూస్తే ఆ మార్గంలో వెళ్ళే రైళ్ళు కోవిడ్-19 సమయంలో రద్దయ్యాయట. పునరుద్ధరణ జరగలేదు. రెండు మహాసాగరాలను కలుపుతూ 1849లో నిర్మించిన ఈ పనమా కెనాల్ రైలుమార్గం ప్రపంచంలో తొలి ఖండాంతర రైలుమార్గంగా ఖ్యాతి చెందింది. ఇపుడు ఆ రైలు లేని లోటును ప్రైవేటు టాక్సీలవాళ్ళు తీరుస్తున్నారు.

గోంజో – పూర్తి పేరు గోంజోలో – అన్న చురుకైన చిరునవ్వుల మనిషి మాకు ఆనాటి డ్రైవర్ కమ్ గైడు. ఫబియన్, కార్మెన్ అన్న స్విట్జర్లండ్ దేశపు జ్యూరిక్ నగరానికి చెందిన జంట నా సహయాత్రికులు. మేము నగరాన్ని వదిలేసరికి దట్టమైన ఉష్ణమండలపుటడవి మాకు స్వాగతం చెప్పింది. పనమా దేశంలోని జీవవైవిధ్యం – బయో డైవర్సిటీ – యు.ఎస్., కెనడా, యూరప్‌లన్నిటినీ కలిపిన దానికి మూడురెట్లకంటే ఎక్కువట!

పనమా కెనాల్ నిర్మాణానికి దోహదం చేసేలా ఆ ప్రాంతపు చాగ్రేస్ (Chagres) అన్న నదికి ఆనకట్ట కట్టి గతూన్ (Gatún) సరోవరానికి శ్రీకారం చుట్టారు. ఈ సరోవరం పనమా కెనాల్‌కు నడుమున ఉంది. సముద్రతలానికి 26 మీటర్ల ఎగువున ఉంది. ఏ దిశ నుంచి వచ్చే ఓడలయినా ఈ 26 మీటర్ల ఎత్తును ఎక్కి తిరిగి సముద్రతలానికి చేరాలి. ఈ గతూన్ లేక్ వల్ల ఎనభై కిలోమీటర్ల పనమా కెనాల్‌లో నలభై కిలోమీటర్ల మేరనే తవ్వి నిర్మించాల్సి వచ్చింది. మిగిలిన నలభై కిలోమీటర్ల దూరాన్ని ఓడలు గతూన్ లేక్‌లో ప్రయాణం చెయ్యడం ద్వారా అధిగమిస్తాయి. పసిఫిక్ ముఖద్వారం దగ్గర పనమా కెనాల్‌కు మిరాఫ్లోరెస్ లాక్స్ ఉన్నట్లే అట్లాంటిక్ ముఖద్వారం దగ్గర ఆక్వా ఫ్లోరా లాక్స్ (Aqua Flora Locks) ఉన్నాయి. మేమంతా ఆ లాకుల దగ్గరికి చేరాం.

మేము చేరిన సమయంలోనే రెండు నౌకలు ఆక్వా ఫ్లోరా లాక్స్ దాటుతూ కనిపించాయి. అందులో ఒకటి చైనా దేశానికి చెందిన బృహత్తర కంటైనర్ షిప్పు. ఆ రెండు ఓడలకూ టగ్ బోట్లు దారి చూపిస్తూ ముందు నడుస్తున్నాయి. ఇక్కడ పాత లాకులూ కొత్త లాకులూ వేరువేరుగా ఉన్నాయి. సమాంతరంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పాత లాకులు 33.5 మీటర్ల వెడల్పు ఉండే పానామాక్స్ కేటగరీకి చెందిన ఓడలకోసం ఉపయోగపడుతున్నాయి. కొత్త లాకుల్లో 55 మీటర్ల వెడల్పు ఉండే నియోపానామాక్స్ ఓడలు కూడా సాగిపోగలవు. పనమా కెనాల్ దాటాలన్న ఉద్దేశ్యంతో నిర్మించే ఓడలను ఈ లాకుల కొలతలను దృష్టిలో పెట్టుకుని మరీ నిర్మిస్తూ ఉంటారు.

ప్రపంచంలోని మరో ముఖ్యమైన ఇలాంటి జలమార్గం – సుఎజ్ కెనాల్ (Suez canal) – ఇలా లాకులను ఉపయోగించదు. అక్కడ అసలు ఆ అవసరమే లేదు. 193 కిలోమీటర్ల పొడవున ఉన్న ఆ కెనాల్‌ యావత్తూ సముద్రమట్టానే ఉంది. అంచేత అధిరోహణ అవరోహణల ప్రస్తావన లేకుండా ఆ కెనాల్‌లో ఓడలు సాగిపోతాయి. దాని వెడల్పు రెండు వందల మీటర్లు అవడం వల్ల అక్కడ అన్నిరకాల ఓడలూ ఏ ఇబ్బందీ లేకుండా సాగిపోగలుగుతున్నాయి. స్థూలంగా చెప్పాలంటే ఓడలు ఈ పనమా కెనాల్‌ను దాటడమన్నది సుఎజ్ కెనాల్‌తో పోలిస్తే మహా క్లిష్టభరితం.

ఓడలు లాకులు దాటడానికి బాగా సమయం తీసుకుంటుంది. ఓపిగ్గా అదంతా చూస్తున్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. మా భారతదేశపు యాత్రిక మిత్రుడు ప్రొఫెసర్ ఆదినారాయణకు ఫోను చేశాను. సిగ్నల్ బావుండడంతో కెనాల్ ద్వారా ఓడ సాగిపోయే ప్రక్రియను ఆయనతో వీడియోలో పంచుకోగలిగాను. మేమిద్దరం సమయం సందర్భం అనుకూలించినపుడు మా మా యాత్రానుభవాలను ఇలా పంచుకొంటూ ఉంటాం.

అక్కణ్నించి గోంజో మమ్మల్ని పుఎర్తో సాన్ లొరేంజో (Puerto San Lorenzo) తీసుకువెళ్ళాడు. దారిలో పనమా కెనాల్ అట్లాంటిక్ మహాసాగరాన్ని కలిసే ఉత్తర దిక్కున ఉన్న పొడవాటి వంతెన మీదగా వెళ్ళాం. ఈ వంతెన పనమా కాలువ దక్షిణాన పసిఫిక్ సాగరంలో కలిసే చోట ఉన్న బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్ సమవుజ్జీ అన్నమాట. పనమా కాలువ అట్లాంటిక్ సాగరాన్ని కలిసే చోటు ఉత్తరాన ఉందని, పసిఫిక్‌ను కలిసే చోటు దక్షిణాన ఉందనీ అనడం కాస్తంత వింతగా, తికమకగా అనిపించవచ్చు. చదివే వాళ్ళకి ఈయనేమన్నా పొరపడుతున్నాడా అన్న అనుమానమూ కలగవచ్చు. వివరిస్తాను.

స్థూలంగా చూస్తే ఉభయ అమెరికా ఖండాలకూ తూరుపు దిక్కున అట్లాంటిక్ ఉంది. పడమరన పసిఫిక్ ఉంది. మరి పనమా కెనాల్ కూడా తూర్పు పడమర దిక్కుల్నే పాటిస్తూ ఉండి ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ పనమా దేశపు నైసర్గిక వివరాల్లోకి వెళితే నిజానికి పనమా కెనాల్ ఉన్న ప్రాంతం ఉత్తర దక్షిణాలలో విస్తరించి ఉంది. అంచేత పనమా ఉత్తరాన అట్లాంటిక్ తోనూ దక్షిణాన పసిఫిక్ తోనూ ముడివడి ఉంది. ఒకసారి పనమా దేశపటాన్ని చూసినట్టయితే దిక్కుల చిక్కుముడి క్షణాల్లో విడివడిపోతుంది.


పుఎర్తో సాన్ లొరేంజో అన్నది ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న స్పానిష్ కోట. స్పెయిన్ వైపు వెళ్ళే ఓడలు అట్లాంటిక్ మహాసాగరం లోకి అడుగు పెట్టడానికి ఎంతో అనుకూలమైన ప్రదేశంలో – చాగ్రేస్ నదీ ముఖద్వారంలో – నెలకొని ఉన్న కోట అది. స్పానిష్ ఆక్రమణదారులు దక్షిణ అమెరికాలో దోచుకున్న సంపద అంతా ముందు ఈ కోట స్థావరానికి చేరి అక్కణ్నుంచి ఓడలకెక్కి స్పెయిన్ చేరుకొనేది. ఆ సంపదల పుణ్యమా అని లొరేంజో కోటకు సాగరచోరుల తాకిడి బాగానే ఉండేది.

కెప్టెన్ హెన్రీ మోర్గన్ అన్న సాహసిక సాగరచోరునికి ఆనాటి ఆంగ్ల ప్రభుత్వపు ప్రాపకం ఉండేది. 1670లో ఫోర్ట్ లొరేంజో అతగాడి విధ్వంస కాండకు గురి అయింది. మరుసటి సంవత్సరం పనమా సిటీకీ అదే గతి పట్టింది. కరేబియన్ ప్రాంతాల్లోని స్పానిష్‌వారికి ఆ సాహసి ఓ పీడకలగా పరిణమించాడు. కానీ ఆ రోజుల్లోనే ఇంగ్లీషువారు స్పానిష్‌వారు సంధి ఒడంబడికలు చేసుకున్నారన్న సంగతి అతనికి తెలియలేదు. స్పానిష్‌వారిని సంతృప్తి పరచడం కోసం ఆంగ్ల ప్రభువులు హెన్రీ మోర్గన్‌ను జమైకాలో అరెస్టు చేసి లండన్‌కు తరలించారు. లండన్ నగరంలో అతనికి వీరోచిత స్వాగతం లభించింది. ప్రభువు రెండవ ఛాల్స్ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అతని మీద ఏదో తూతూ మంత్రపు విచారణ జరిపి నిర్దోషిగా తేల్చేశారు. అక్కడితో ఆగకుండా రెండవ ఛాల్స్ అతగాడిని జమైకా ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ నియమించాడు. మరణ పర్యంతం హెన్రీ మోర్గన్ ఆ ప్రాంతాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా బలమైన రాజకీయశక్తిగా కొనసాగాడు. బ్రతుకులోనూ చావులోనూ రంగులీనే మనిషిగా కొనసాగాడు. కరేబియన్ పైరేట్స్‌కు చెందిన కెప్టెన్ మోర్గన్ జీవితమూ సాహసకృత్యాలూ ఎన్నో కథలు, నవలలకు మూల ధాతువులయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కరేబియన్ రమ్ ‘కెప్టెన్ మోర్గన్’కు అతగాడు ఇప్పటికీ ప్రతీకగా విలసిల్లుతున్నాడు.

ఫోర్ట్ లొరేంజోకు యునెస్కోవారు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు నిచ్చారు. ఆ కోట శిథిల బురుజుల దగ్గర చేరి చూసినట్టయితే చాగ్రేస్ నది అలా అట్లాంటిక్ సాగరంలో కలిసే చోటు స్పష్టంగా సుందరంగా కనిపించి కనువిందు చేస్తుంది.


షెల్టర్ బే మరీనా అన్న చోట ఉన్న యాటింగ్ క్లబ్‌లో లంచ్ చెయ్యడం కోసం గోంజో మా అందరినీ తీసుకు వెళ్ళాడు. చక్కని ప్రదేశమది. అణువణువునా సాగరతీర వాతావరణం ఉట్టిపడే ప్రదేశమది. దానికి తోడు నౌకాయాన చరిత్రకు చెందిన ఎన్నో విషయాలను విప్పి చెప్పేలా ఉందనిపించే ప్రదేశమది. నా స్విస్ సహయాత్రికులు ఫబియన్, కార్మెన్ కూడా ఎంతో చక్కగా కలసిపోయి ఎన్నెన్నో కబుర్లూ చర్చల్లో భాగస్వాములైపోయారు. అందరం కలిసి ఆహ్లాదకరంగా లంచ్ ముగించి మళ్ళా మా ప్రయాణం కొనసాగించాం. ఆ క్రమంలో గోంజో జీవిత విశేషాలు మెలమెల్లగా మాముందు విచ్చుకొన్నాయి.

బేర్‌ఫుట్ టూర్స్ అన్న ఏజెన్సీలో పనిచేస్తోన్న మనిషి గోంజో. పనమాకు చెందిన అట్లాంటిక్ తీరపు నగరం కొలోన్‌లో పుట్టి పెరిగాడు. ఆ నగరంలో భారతీయులు, చైనీయులు, ముస్లిమ్‌ల ఉనికి బాగా ఉంది. అలాంటి విభిన్న సంసృతుల ప్రభావంలో పెరిగిన మనిషి గోంజో. ఆ నగరం స్వేచ్ఛావిపణి కేంద్రం అవడం వల్ల అనేకానేక వ్యాపార సమూహాలు అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొన్నాయి. అక్కడి వాణిజ్యకేంద్రాలలోను, రీడిస్ట్రిబ్యూషన్ సెంటర్లలోనూ తమ తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

గోంజో ప్రపంచం తెలిసిన మనిషి. స్పష్టమైన ఆలోచనలు ఉన్న మనిషి. స్కూల్లో ఇంగ్లీషు నేర్చుకున్నాడు. మాలో ఒకరం యునైటెడ్ స్టేట్స్‌ను ఉద్దేశించి అమెరికా అన్న మాట వాడినపుడు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తపరిచాడు. ‘ఉభయ అమెరికా ఖండాలు కలసి మొత్తం ముప్ఫైకంటే ఎక్కువ దేశాలున్నాయి. ఆ దేశాల వాళ్ళందరూ అమెరికన్లే. ఆ పేరును యునైటెడ్ స్టేట్స్ వారికే పరిమితం చెయ్యడం తగనే తగదు. వాళ్ళను యూఎస్ వాసులు అనే పిలవాలి తప్ప అమెరికన్లు అనడం సబబు కాదు’ అని నొక్కివక్కాణించాడు.

ఆ చర్చ పుణ్యమా అని అక్కడి ఉభయఖండాలకూ తన పేరును ప్రసాదించిన అమెరిగో వెస్పూచ్చి (Amerigo Vespucci) అన్న ఇటలీకి చెందిన అన్వేషి మీదకు నా ఆలోచనలు మళ్ళాయి. ఫ్లోరెన్స్ నగరంలో మెదీచి అన్న సంస్థ ఉద్యోగి అమెరిగో. 15, 16 శతాబ్దాలలో జీవించిన మనిషి. ఆ రోజుల్లో ఇటలీ రాజకీయంగా ఏకీకృతమయి ఉండేది కాదు.; ఇటాలియన్ భాష మాట్లాడే అనేక నగర రాజ్యాల సమాఖ్యగా ఉండేది.

అమెరిగో వెస్పూచ్చి మొట్టమొదటగా గ్వాతెమాల, ఓందూరాస్, నికరాగ్వా, కోస్త రీక ప్రాంతాలను శోధించి వాటి పటాలు గీశాడు. అతను గీసిన చిత్రపటాల ప్రాంతాలను అప్పటి స్పానిష్‌వారు అతని పేరిట అమెరికా అని పిలిచారు. అయినా అతని ఇంటిపేరు అయిన వెస్పూచ్చి కాకుండా పెట్టిన పేరయిన అమెరిగో ఉభయ ఖండాలకూ ఎలా జోడుపడిందీ అన్నది ఇప్పటికీ విడివడని మిస్టరీనే. దక్షిణ అమెరికా తూర్పుతీరం వెంబడి అమెరిగో విస్తారంగా తిరుగాడాడు. అలా తిరుగాడి తిరుగాడి కొలంబస్ ఆవిష్కరించిన ప్రదేశం భారతదేశం కాదనీ మరో నూతన ఖండమనీ నిర్థారించగలిగాడు.

అమెరిగో కాలానికే చెందిన మరో విఖ్యాత నావికుడూ అన్వేషీ అయిన క్రిస్టఫర్ కొలంబస్ నూతన ఖండాన్ని కనుగొన్నమాట నిజమే గానీ ఆ ఖండానికి అతని పేరు జోడు పడలేదు. ఆ ఖ్యాతి అమెరిగోకే దక్కింది. అలా అని కొలంబస్ మరీ అనామకంగా మిగిలిపోలేదు. ఉభయ ఖండాలలోనూ అతని పేరు ఎన్నో నగరాలకు పెట్టారు. దక్షిణ అమెరికాలో ఒక దేశానికి అతని పేరు పెట్టారు. అలాగే గోంజో స్వస్థలం, కొలోన్, కొలంబస్ పేరిటే ఏర్పడింది. స్పెయిన్ దేశీయులూ ఇంగ్లీషువాళ్ళూ నూతన ఖండాలను ఆక్రమించి వలస ప్రాంతాలుగా మార్చిన మాట నిజమే గానీ వాటి ఊర్లూ పేర్ల విషయంలో ఈ ఇద్దరు ఇటాలియన్ నావికులూ తమదైన ముద్ర వేయగలిగారు.


అన్నట్టు ఈ మధ్యన పనమా పేరు ప్రస్ఫుటంగా పేపర్ల కెక్కింది. పనామా పేపర్లు లీకవడం వల్ల ఒక మహత్తర స్కాండల్ వెలుగులోకి వచ్చింది. 50 దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, ఇతర ప్రముఖులూ పన్నులు ఎగగొట్టడం కోసం, ఇతర చట్టవ్యతిరేక ఆర్థిక కారణాల వల్లా విదేశాల్లో ఎకౌంట్లు తెరిచి ధనరాసుల్ని అక్కడ మూటగట్టి పెట్టారు. అలాంటి ప్రబుద్ధుల్లో 500మంది ఇండియావారు. అంతర్జాతీయ న్యాయవాద సంస్థ మొసాక్ ఫాన్‌సేకా (Mossack Fonseca) వాళ్ళ పనమా ఆఫీసు నుంచి ఆ వివరాలున్న కోటీపదిహేను లక్షల పత్రాలు 2016లో ప్రపంచానికి వెల్లడయ్యాయి. మొత్తం రెండు లక్షల పదిహేను వేలమంది ‘ఆర్ధిక సాహసికుల’ వివరాలు ఆ పేపర్లు తేటతెల్లం చేశాయి.

ప్రపంచమంతా గగ్గోలు పుట్టింది. ఆ సంగతి గోంజో దగ్గర ప్రస్తావిస్తే ‘ఆ స్కామ్‌తో మా దేశానికి ఏ సంబంధమూ లేదు. ఆ స్కామ్ వివరాలన్నీ ఆ కంపెనీ వాళ్ళ పనమా ఆఫీసునుంచి లీకయిన మాట నిజమే. అంతర్జాతీయంగా గొడవ గొడవ జరిగిన మాటా నిజమే. కానీ మా దేశం వరకూ అది పెద్ద విషయమే కాదు. మా వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఆ విషయం పట్టించుకున్నారు’ అని తేల్చేశాడు.


పనమా సిటీ తిరిగి చేరినప్పుడు గోంజో నన్ను సింతా కోస్తేరా అన్న పార్కు దగ్గర దింపాడు. ఈ పార్కు సముద్రతీరాన్ని ఆనుకుని కాస్కో వియోహో నుంచి పనమా బే వరకూ విస్తరించి ఉంది. డౌన్‌టౌన్‌ లోని ఆకాశహర్మ్యాల దాకా వెళుతోంది. ఎన్నో కిలోమీటర్ల పాటు ఆ పార్కులో తీరిగ్గా నడవవచ్చు. ఆ సాయంసమయాన నేనదే చేశాను. ఉల్లాస భరిత వాతావరణంలో కుటుంబాలకు కుటుంబాలు పార్కులో చేరి ఆ సాయంత్రపు పూట సేద తీరుతున్నాయి. పిల్లలంతా ఆటలూ కేరింతలూ… వీళ్ళే కాకుండా పార్కులోని లతలూ పొదల మాటున లేగప్రేమల టీనేజర్లూ కనిపించారు. పసిఫిక్ మహాసాగరంలో సూర్యాస్తమయ సమయంలో జరిగే రంగుల హేల చూడడానికి ఈ పార్కు ఎంతో అనువైన ప్రదేశం.

ఆ సంగతి ఎలా ఉన్నా ఆ పార్కులో ఉన్న బల్బోఆ (Balboa) మాన్యుమెంటు చూడాలని నేనెంతో కుతూహలపడ్డాను. ఈ బల్బోఆ అన్న వ్యక్తి ఒక విధంగా పనమా నగరం స్థాపకుడు. పసిఫిక్ తీరరేఖను చూసిన మొట్టమొదటి ఐరోపావాసి. ఆ సంఘటన 510 సంవత్సరాల క్రితం 3 సెప్టెంబరు 1513న జరిగింది. ఆ మాన్యుమెంటు ఎంతో ఆకట్టుకొనేలా ఉంది; ఎత్తయిన పాలరాతి వేదిక, దాని మీద గ్లోబు బొమ్మ. ఆ పైన దిగువకు వాలి ఉన్న ఖడ్గం ధరించి పసిఫిక్ మహాసాగరం కేసి చూస్తూ ఉన్న వాస్కో నూన్యెజ్ దె బల్బోఆ (Vasco Núñez de Balboa) శిల్పం. ఆయన రెండో చేతిలో ఓ పెద్దపాటి పతాకం. 1924లో స్పెయిన్ దేశం పనమాకు ఈ విగ్రహాన్ని బహుకరించిందట. నేను మద్రీద్ నగరంలో ఈ బల్బోఆ విగ్రహం మరొకటి చూసిన విషయం ఆక్షణాన నాకు గుర్తొచ్చింది.

గోంజో సిఫార్సు ప్రకారం ఆ పరిసరాల్లో ఉన్న మారియాట్ హోటల్లో అరవై ఆరో అంతస్తులో ఉన్న బార్ కేసి దారి తీశాను. అక్కడి నుంచి రాత్రివేళ కనిపించే పనమా సిటీని చూడాలన్నది నా ఆకాంక్ష. అక్కడికి చేరుకోడానికి పది డాలర్ల ప్రవేశరుసుము ఉంది. ఆశించినట్టే సిటీ ధగధగలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఊరు ఊరంతా వెలిగిపోతోన్న ఆకాశహర్మ్యాలతో ఎంతో రమ్యంగా కనిపించింది. చేతిలో బీరు గ్లాసు, దానికి అనుపానంగా ఓ సెవీచె, దానికి తోడు బనానా చిప్సు – మరపురాని క్షణాలవి. అక్కడ నాకు నచ్చిన బర్గర్‌తో భోజనం కూడా ముగించాను. వదలలేక వదలలేక ఆ ప్రదేశం విడిచిపెట్టాను.


ఆ మర్నాడు నా విమానం బాగా రాత్రి పూట ఉంది. అంటే రోజు రోజంతా నా ముందు పరచి ఉందన్నమాట. అన్నట్లు నా మధ్య అమెరికా 18రోజుల యాత్రలో అదే చిట్టచివరి రోజు. ఆనాటి ఉదయం పనమా వియేహో అన్న యునెస్కోవారు వారసత్వ సంపదగా గుర్తించిన ప్రదేశానికి వెళ్ళాను.

ఈ పనమా వియేహో అన్నది 1519లో పనమా జనావాసాన్ని మొట్టమొదటగా స్థాపించిన ప్రదేశం. పేద్రో ఆరియాస్ దావిలా (Pedro Arias Dávila) అన్న వ్యక్తి దాని స్థాపకుడు. స్పానిష్‌వారు అమెరికా ఖండాల పసిఫిక్ తీరరేఖ వెంబడి స్థాపించిన మొట్టమొదటి నగరమది. అసలు యావత్ పసిఫిక్ తీరరేఖలో సాపించబడిన నగరాల్లో ఇదే మొదటిదని ఒక ప్రస్తావన ఉంది. నగర స్థాపనకు పూర్వం అక్కడ ఒక స్థానికవాసుల గ్రామం ఉండేది. అక్కడ స్పానిష్‌వాళ్ళు రాకముందు కనీసం వెయ్యి సంవత్సరాలుగా జనావాసాలు ఉండేవన్న దానికి దాఖలాలు ఉన్నాయి.

ముందు చెప్పుకున్న వెల్ష్ సాగరచోరుడు హెన్రీ మోర్గన్ 1671లో ఈ పనమా వియేహో నగరాన్ని నేలమట్టం చేశాడు. ఆ దెబ్బ నుంచి ఈ నగరం ఏనాడూ కోలుకోలేదు. రాజధాని నగరం దగ్గరలో ఉన్న కాస్కో వియేహో (Casco Viejo) అన్న సురక్షిత స్థలానికి తరలించబడింది.

స్పానిష్‌వారి వలస విస్తరణల క్రమంలో కేథోలిక్ చర్చికి ప్రముఖ స్థానం ఉంది. వారి ఆక్రమణలకు ధర్మబద్ధత ప్రసాదించడంలో చర్చి వ్యవస్థది ప్రముఖ పాత్ర. అంచేత స్పానిష్‌వారు ఏ కొత్త ప్రదేశంలో కాలు పెట్టి స్థిరపడినా అక్కడ ముందు వెలిసేది చర్చి భవనమే…

ముందే చెప్పుకున్నట్టు పనమా దేశం జీవవైవిధ్య నిధి. ఆ ప్రాంతంలో నాకు ఎన్నో ఇగ్వానాలు కనిపించాయి. అలాగే నాకు గుర్తు తెలియని పక్షులు పదీ పన్నెండు కనిపించాయి. అందులో కొన్ని నీటి పక్షులు.


ఆ మధ్యాన్నం నగరపు వియా అర్హెంతీనా ఎవెన్యూలో ఉన్న ఐన్‌స్టయిన్ బృహదాకారపు శిరోప్రతిమను వెదుక్కుంటూ వెళ్ళాను. నగరపు ప్రధాన ఆకర్షణలలో ఈ ప్రతిమ ఒకటి. ఆ స్థలం నేనున్న హోటలకు దగ్గర్లోనే ఉంది. నాజీ ప్రభుత్వపు పీడన నుంచి తప్పించుకొని యునైటెడ్ స్టేట్స్‌కు వలసవెళ్ళే క్రమంలో ఐన్‌స్టయిన్ పనమా నగరంలో కొద్ది రోజులు ఆగాడట. ఆగి ఆ తర్వాత కాలిఫోర్నియా చేరుకున్నాడట.

పనమా నగరంలో ముచ్చటైన ఎవెన్యూలలో ఒకటయిన వియా అర్హెంతీనాలో ఒక కిలోమీటరు నడిచి ఐన్‌స్టయిన్ స్మారక చిహ్నం ఉన్న ప్రదేశానికి చేరుకున్నాను. శిరస్సు మాత్రమే మలచిన ఐన్‌స్టయిన్ మూడు మీటర్ల ప్రతిమ ఆకట్టుకునేలా ఉంది. తమ దేశంలో ఆ అద్వితీయ భౌతికశాస్త్రవేత్త అడుగుబెట్టిన వైనాన్ని పనమా నగరం సముచితంగా జ్ఞాపకం చేసుకోడానికి నిర్మించిన స్మారక చిహ్నమది. అబ్బురంగా ఆ చిహ్నాన్ని చూస్తూ ఉండిపోయాను.

శిరోవిగ్రహం సందర్శన ముగిశాక దగ్గర్లోనే ఉన్న వియా అర్హెంతీనా మెట్రో స్టేషన్లో బండి పట్టుకుని దెల్ కార్మెన్ అన్న ప్రదేశం చేరుకున్నాను. అక్కడి ఇగ్లేసియా కార్మెన్ చూడాలని నా కోరిక. ఎంతో సుందరంగా ఉందో ఆ చర్చి. మా హోటలుకు బాగా దగ్గర. పనమా నగరంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన అనేకానేక చర్చిల్లో ఇది సరికొత్తది. కార్మెనైట్ మొనాస్టిక్ ఆర్ధర్ అన్న పనమా కాథోలిక్ సంప్రదాయ బృందానికి ముఖ్య కార్యాలయమది·

మధ్యాన్నం గడిచిపోయి సాయంత్రానికి తావిస్తోన్న సమయమది. ఆ రాత్రి నేను ఎక్కవలసిన విమానానికి సమాయత్తం అయ్యే సమయం వచ్చేసింది. చివరిసారిగా తృప్తిగా పనమా దేశపు భోజనం చేసేంత సమయం మాత్రం మిగిలి ఉంది. ఆ చివరి భోజనానికి ఆ దేశపు జాతీయ వంటకం సంకోచ్చోను మించిన ఎంపిక ఏముంటుందీ? ఆ వంటకాన్ని ఆరగించడానికి మా హోటలు దగ్గరే ఉన్న ఎల్‌ త్రపీచె రెస్టరెంటును మించిన వేదిక ఏముంటుందీ? వెళ్ళాను. అక్కడికి వెళ్ళడం నాకు రెండో సారి – బాగా తెలిసిన ప్రదేశం అన్న భావన కలిగింది. అన్నమూ చికెన్ పులుసులతో కలిపి వడ్డించిన సంకోచ్చో నా కడుపునే కాదు, మనసునూ తృప్తి పరిచింది.


విమానాశ్రయం చేరుకున్నాను. నాది లేట్ నైట్ ఫ్లైట్ కదా – ఇంకా రెండు గంటల సమయం మిగిలి ఉంది. విమానం ఎక్కవలసిన గేటు దగ్గర ఒక్కణ్ణే కూర్చున్నాను. మెలమెల్లగా సహప్రయాణీకులు వచ్చి అక్కడ కూడసాగారు. కొంతమంది యువకులు, ఒక యువతి, వారితోపాటు వారి టీచర్లలాగా కనిపిస్తోన్న ఇద్దరు పురుషులూ ఉన్న బృందం కనిపించింది. ఆ ఇద్దరిలో ఒకాయన నా పక్కన కూర్చున్నాడు. పలకరించాను. అతని పేరు ఆంటోన్ బనాఫ్. మీరేమన్నా హైస్కూలు పిల్లల్ని విహారయాత్రకు తీసుకు వచ్చారా అని అడిగాను. కాదు. బల్గేరియా దేశపు జూనియర్ ఎథ్లెటిక్ టీమ్ మానేజరు ఆయన. కొలంబియాలో జూనియర్ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని వస్తున్నారట. వాళ్ళ నలుగురు క్రీడాకారుల బృందం ఒక బంగారు పతకం, ఒక వెండి పతకం సాధించిందని ఎంతో సంతోషంగా ఉన్నారాయన. తమ బృందపు సభ్యడయిన సరాబో యుకోవ్ అన్న యువకుడిని పరిచయం చేశాడు. హై జంప్‌లో రజతం గెలిచాడా యువకుడు. అలాగే ప్లమేనా మిత్కోవా అన్న యువకుడు లాంగ్ జంప్‌లో స్వర్ణం సాధించాడు. మా గమ్యం ఒలింపిక్ పతకం అన్నారా ఇద్దరు క్రీడాకారులు.

ప్రచ్ఛన్న యుద్ధపు రోజుల్లో బల్గేరియా ఒలింపిక్ క్రీడల్లో ఎంతగానో రాణించడం గుర్తొచ్చింది. ఇపుడు కూడా మాకు సరైన వనరులు సమకూర్చగలిగితే అదే క్రీడావైభవం సాధించగలం అన్న నమ్మకం వ్యక్తపరిచాడు ఆంటోన్. మా మాటల్లో ప్రసిద్ధ క్రీడాకారుడు సెబాస్టియన్ కో, ఈ జూనియర్ ఎథ్లెటిక్స్‌కు వచ్చాడని, ఆయన బాగా తెలుసుననీ చెప్పాడు ఆంటోన్. సెబాస్టియన్ రక్తంలో భారతీయ మూలాలున్నాయని, అతని తల్లి అర్ధభారతీయురాలనీ ఆంటోన్ వివరం అందించాడు.

భారతదేశం గురించి మేమిద్దరం మాట్లాడుకున్నాం. ‘మీ స్వస్థలం హైదరాబాదు జనాభా ఎంత’ అని అడిగాడు ఆంటోన్. తొమ్మిది మిలియన్లు ఉండవచ్చు అని చెప్పినప్పుడు ఆయన విస్తుపోయి, ‘మా బల్గేరియా జనాభా కన్నా మీ ఊరి జనాభా రెండున్నర మిలియన్లు ఎక్కువన్న మాట’ అన్నాడు. భారతదేశపు జనాభా సంఖ్యలు తనను విస్మయపరుస్తాయని, అసలు అంతంత పెద్ద సంఖ్యలు తనకు బోధపడనే పడవనీ విస్తుపోయాడు.


నేనెక్కబోయే విమానం అమ్‌స్టర్‌డామ్ వెళుతుంది. అక్కణ్నించి మరో విమానం పట్టుకొని లండన్ చేరుకోవాలి. విమానం గాలిలోకి ఎగరగానే పనమాకు చిట్టచివరి గుడ్‌బై చెప్పేశాను. మరో రెండు క్షణాల తర్వాత నేను గుడ్‌బై చెపుతున్నది ఒక పనమాకే కాదు; 18 రోజులు తనివితీరా తిరుగాడి ఆయా ప్రదేశాలు, మనుషులు, సంస్కృతులతో సహజీవనం చేసిన యావత్ మధ్య అమెరికాకు అన్న విషయం మనసులోకి ఇంకింది. నేను చేసిన అనేకానేక ప్రయాణాల్లో ఇది ఒక ముఖ్యమైన, సంతృప్తికరమైన ప్రయాణం. భూగోళంలోని విలక్షణమైన ప్రాంతాలు – భద్రజీవులు అంత త్వరగా అడుగుపెట్టని ప్రాంతాలు – నాకిప్పుడు సన్నిహితమయ్యాయి. ఉత్తర దిశలో ప్రయాణం మొదలుపెట్టి, ఏడు దేశాలు దాటుకుని, దక్షిణ కొసన ఉన్న పనమా దేశంలో నా యాత్ర ముగిస్తున్నాను. అంతర్జాతీయ సరిహద్దుల్ని పదేపదే దాటుకుంటూ అనునిత్యం ఒక చోటి నుంచి మరో చోటుకు తిరుగాడుతూ పద్దెనిమిది రోజులు గడిపాను. ఆయా దేశాలనూ ప్రదేశాలనూ ఇష్టపడ్డాను. ప్రేమించాను. నన్ను నేను మరచాను. అక్కడి మనుషులతో తాదాత్మ్యం చెందాను. ఆ మధ్య అమెరికా యావత్తూ నాదే అనిపించింది. నేనే అనిపించింది. ఆలోచించిన కొద్దీ ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో ప్రదేశాలు, ఎంతెంతమందో మనుషులు – మేమంటే మేమని ముందుకు తోసుకు వచ్చి మనసును ఆక్రమించేసి తియ్యని బాధకు కారకమవుతున్నాయి. ఆంతీగా గ్వాతెమాల, గ్రనాద, సాంతా ఆనా, పనమా పాతపట్నం లాంటి సుందరసీమలు; ముచ్చటైన లేక్‌ అతిత్‌లాన్, చిచికాస్తెనాంగో, ఫ్లోరెస్, సాన్ ఇగ్నాసియో, కోపాన్ శిథిలాలు, రూ దె ఫ్లోరేస్ గ్రామాలు; విభ్రమ కలిగించే తికాల్, కోపాన్‌ల లోని మాయన్ నాగరికతా అవశేషాలు; హడావిడీ గందరగోళాలూ నిండినా ఆహ్లాదమే కలిగించే గ్వాతెమాల సిటీ, పనమా, సాన్ సల్బదోర్ లాంటి మెగా నగరాలు; నిగూఢ రహస్యాల అగ్నిపర్వతాలు, అతిసుందర సరోవరాలు, ఉష్ణమండలపుటడవులు, సంస్కృతి, భాష, విభిన్న రుచుల వంటకాలు, స్నేహాలు కురిపించే అపరిచితులు, ప్రేమలో ఓలలాడించే పరిచితులు – ఎన్నెన్ని అనుభవాలు… ఎన్నెన్ని జ్ఞాపకాలు… జీవితాంతం మరిచిపోలేని యాత్రానుభూతులు – నాలో అంతర్భాగమైపోయిన సుందర మధుర మధ్య అమెరికా…

ముఖ్యంగా ఈ పదునెనిమిది రోజులూ నన్ను మరికాస్తంత మెరుగైన మనిషిగా మలచలేదూ?!

(సమాప్తం)