గల్ఫ్ గీతం: 9. చివరి చరణం

సలాలాలో మొదటిరోజంతా సముద్రతీరం వెంట తూర్పు దిశగా వెళ్ళడం జరిగితే రెండోరోజు అదే సముద్రతీరం వెంట పశ్చిమ దిశలో వెళ్ళాం. ఇంట్లోంచి కాస్తంత తీరిగ్గా ఎనిమిదిన్నరకు బయల్దేరాం. పదీపదిహేను నిముషాల్లో ఊరు దాటి, సలాలా పోర్టు ప్రాంతమూ దాటుకొని సముద్రాన్ని తోడుగా చేసుకొని ముందుకు సాగాం.

నిన్నటి ప్రయాణమంతా ఊళ్ళూ పట్నాలూ వాగులూ మధ్య సాగితే ఈనాటి ప్రయాణం అటు పక్క సముద్రమూ ఇటుపక్క నిర్జన పర్వత శ్రేణి అన్నట్టుగా సాగింది. సముద్రానికీ మా రహదారికీ మధ్య ఎడమంటూ లేకపోవడం వల్ల తీక్షణమవుతోన్న ఎండ సముద్రం మీదపడి సృష్టిస్తోన్న తళతళలు మాకు చక్కని తోడుగా సాగివచ్చాయి. అలా ఓ గంట గడిచాక ఉన్నట్టుండి రోడ్డు కొట్టుకుపోయి కనిపించింది!

“ఇక్కడ ఓ వాగు వచ్చి సముద్రంలో కలుస్తోంది. ఆ వాగు మీద మొన్నటిదాకా వంతెన ఉండేది. రెండేళ్ళ క్రితం వచ్చిన పెనుతుఫాను వంతెనను పడగొట్టింది. రోడ్డంతా ధ్వంసమయ్యింది. అదిగో ఆ చివర దూరంగా ఓ పెట్రోల్ పంపు కనిపిస్తోంది కదా. అక్కడిదాకా అరకిలోమీటరు మేర రోడ్డు కొట్టుకుపోయింది. మనం బాగా చుట్టుతిరిగి వచ్చి మళ్ళా మెయిన్ రోడ్డులో కలవాలి.” వివరించాడు హరికృష్ణ. రోడ్డు కొట్టుకుపోయాక అతను కూడా ఇటువేపుకు రాలేదట.

ఎక్కువ దూరం వెళ్ళకుండానే, పెద్దగా ఇబ్బందిపడకుండానే ఓ మట్టి రోడ్డు సాయంతో వాగును దాటి మళ్ళా వచ్చి రహదారి పట్టుకొన్నాం. ఇంకో పదినిముషాల్లో మా గమ్యం–మర్నీఫ్ గుహలు, అక్కడ ఉన్న బ్లో హోల్–చేరాం.

ఓ పెద్ద కొండచరియ సముద్రంలోకి చొచ్చుకువచ్చిన ప్రదేశమది. మేము చేరిన విజిటర్స్ పాయింట్ సముద్రానికి ఇరవై ముప్ఫై అడుగుల ఎత్తున నిలచి ఉంది. అటూ ఇటూ ఎటు చూసినా విశాల సముద్ర దృశ్యం. అలా చూడటానికి అనువుగా ఏర్పరచిన చెక్క ప్లాట్‌ఫామ్‌లు. గుహలు అన్నారు గానీ పైకప్పులా ఉన్న శిలల దిగువ నుండి నడిచివెళ్ళడమే తప్ప మనం ఊహించుకొనేలాంటి గుహ అంటూ కనిపించలేదు. గుహ సంగతి ఎలా ఉన్నా అక్కడి దృశ్యం మాత్రం అపురూపం. ఎడమన కాస్తంత దూరాన చక్కని బీచ్ కనిపించింది. ముఘ్‌సైల్ బీచ్ అట అది. కుడివేపున మరికాస్త ముందుకు వెళితే బలమైన ఇనుపజల్లెడ బిగించి ఉన్న రెండడుగుల వ్యాసపు బ్లోహోల్ కనిపించింది. దిగువకు చూస్తే ఎక్కడో పాతాళంలోలా సముద్రపు నీళ్ళు! “సముద్రం పోటులో ఉన్నపుడు ఈ రంధ్రంగుండా నీళ్ళు బాగా ఎత్తుకు విరజిమ్ముతాయి. చూడ్డానికి బావుంటుంది.” వివరించాడు హరికృష్ణ. తీరం వెంబడే రాళ్ళు ఉన్నపుడు ఆ రాళ్ళలోని పగుళ్ళు బలమైన అలల తాకిడికి క్రమక్రమంగా విచ్చుకోవడమూ, ఆ పగులు అలా నిట్టనిలువుగా భూతలందాకా వ్యాపించడమూ, ఒక సుముహూర్తాన భూమిని చీల్చుకొని సముద్రజలాలు విపరీతమైన వేగమూ ఒత్తిడితో ఫౌంటైన్‌లా ఎగజిమ్మడమూ–అదీ ఈ బ్లోహోల్ ప్రక్రియ. వేలాది సంవత్సరాలు సముద్రమూ బండలూ పగుళ్ళూ పరస్పరం సహకరించుకొంటూ వెళితే ఇలాంటి వింతలకు రూపకల్పన జరుగుతుంది.

గుహలూ బ్లోహోళ్ళ సంగతి ఎలా ఉన్నా అక్కడ కనిపిస్తోన్న కొండలు నిన్న చూసిన కొండలకు భిన్నంగా బ్రహ్మాండమైన పిండిముద్దల్లా కనిపించి ఆకర్షించాయి. కాస్త లోలోపలికి వెళితే బావుంటుందిగదా అన్న కోరిక పుట్టింది. అది పుట్టడం పుట్టడం ఎంతో సహజంగా హరికృష్ణ మనసుకు చేరినట్టుంది… “పదండి, ఓ అరగంట అలా కొండల్లో తిరిగొద్దాం” అంటూ కారు అటు మళ్ళించాడు! రోడ్డున మరో వంద కిలోమీటర్లు పడమరగా వెళితే యెమెన్ సరిహద్దు వస్తుందట. ఆ రహదారిలో ఓ పదికిలోమీటర్లు ముందుకుసాగి ఆ తర్వాత కారును కుడివేపుకు, కొండలలోకి, మళ్ళించాం. దారి కచ్చా దారి. ఎవరోగాని అటువేపు రారనుకొంటాను- ఒకటి రెండుసార్లు కనిపించిన ఒంటెలు తప్ప మరో ప్రాణి జాడ లేదు. అలా ఐదారు కిలోమీటర్లు వెళ్ళి వెళ్ళి ఒక వెడల్పాటి వాగుపక్కని సమతల ప్రదేశం చేరాం. దూరాన టెలిఫోనువాళ్ళో ఎలక్ట్రిసిటీవాళ్ళో పనిచేస్తోన్న జాడ కనిపిస్తోంది. వాగులో ఇంకా దూరాన ఓ పోలీసు వాను ఆగి ఉంది. అక్కడ టెంటు వేసుకొని వంట చేసుకొంటోన్న పోలీసు సిపాయిలు. మరీ ఎక్కువసేపు అక్కడ ఉండి పోలీసువారి ప్రశ్నలూ జవాబులూ ఘట్టం చేరుకోవడం అనవసరం అనిపించింది. కారును వెనక్కి మళ్ళించాం. ఎప్పుడో చాలా అరుదుగా ఫోటోల్లోనో సినిమాల్లోనో చూసే ప్రాంతాన్ని కళ్ళారా చూసిన సంతృప్తి, ఆ ప్రాంతాల్లో ఓ అరగంట కారులో తిరుగాడిన సంతోషమూ మాత్రం బాగా మిగిలింది.


మా మరుసటి మజిలీ చేరడానికి మరో గంట పట్టింది. ఆ సమయాన్ని హరికృష్ణతో కబుర్లతో గడిపాను.

గతనెల వెళ్ళిపోయిన ఖబూస్ బిన్ సయద్ సుల్తాన్ గురించి, కొత్తగా వచ్చిన సుల్తాన్ బిన్ తారిఖ్ అల్ సయీద్ గురించి, అధికారం చేతులు మారిన ప్రక్రియ గురించీ నా ప్రశ్నలు…

“మీకు తెలుసు గదా. ఖబూస్ సయద్ వాళ్ళ నాన్నను బ్రిటిష్‌వారి సహకారంతో గద్దె దింపి 1970లో అధికారం చేబట్టాడు. ఇంగ్లండ్‌లో చదువుకొన్న మనిషి. బ్రిటిష్ ఆర్మీలో పనిచేశాడు. ముందుచూపుతో రాజ్యపాలన చేశాడు. తైలపు ఆవిష్కరణా ఆ ఆదాయమూ ఆయనకు బాగా సాయపడ్డాయి. వచ్చీరాగానే ఎప్పటినుంచో ఉన్న బానిసత్వం లాంటి పద్ధతుల్ని నిషేధించాడు. ఎన్నో సంస్కరణలు, ఎన్నో మార్పులు… మధ్యలో అరబ్ స్ప్రింగ్ లాంటి పరిణామాలు. వీటన్నిటి మధ్య ఎంతో సమర్థవంతమైన పాలన అందించాడు. పోయేముందు రెండుమూడేళ్ళు అనారోగ్యంతో బాధపడ్డాడు.

ఒమాన్‌లో సుల్తాన్‌లకు తమ వారసుణ్ని తామే నియమించే హక్కు ఉంది. ఖబూస్ సుల్తాన్‌కు స్వంత కొడుకులు లేరు. సంప్రదాయం ప్రకారం వెళితే తన చిన్నాన్న పెద్దకొడుక్కి పట్టం కట్టాలి. ఖబూస్ సుల్తాన్‌కు తన చిన్నాన్న మరోకొడుకు తారిఖ్ సయీద్ ముందుచూపు మీదా, సమర్థత మీదా నమ్మకం ఎక్కువ. అంచేత ఎంతో గోప్యంగా తారిఖ్ సయీద్‌ను తన వారసుడిగా నియమించి వెళ్ళాడు. తారిఖ్ సయీద్ కూడా ఇంగ్లండ్‌లో చదువుకొన్న మనిషి. ఖబూస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈయన నియామకాన్ని దేశం దేశమంతా హర్షించింది.”

కారు ఊరి పొలిమేరలలోకి చేరి, ఎయిర్ పోర్ట్ పరిసరాలు దాటి, కొండలు ఎక్కి, అనేకానేక చిన్నచిన్న గ్రామాలు దాటుకొని, సలాలాకు పాతిక కిలోమీటర్ల దూరాన ప్రవక్త నబి ఆయుబ్ సమాధి, పాదముద్రా ఉన్న ఒక నిర్జనప్రాంతం చేరింది. ఈ ప్రవక్త ప్రస్తావన ఖురాన్‌లో నాలుగుచోట్ల వస్తుందట. బైబిల్‌లోనూ ఈయన ప్రస్తావన ఉందట. ఆ రకంగా, ఆయన అతి ముఖ్యమైన వ్యక్తి. అతని సమాధి ఉన్న హాలులో ప్రవక్తల పరంపరను వివరించే వంశవృక్ష పటం ఉంది. ‘మానవులందరూ ఆదాము బిడ్డలే; ఆ ఆదాము కూడా ధూళి నుంచి సృష్టించబడినవాడే’ అన్న సూక్తి ఆ వంశవృక్షానికి పాదపీఠికగా అమర్చబడి ఉంది.

మేం ఆ ప్రదేశానికి చేరినపుడు అక్కడికి మేమే మొట్టమొదటి సందర్శకులం. కాస్సేపు గడిచాక మరో ఇద్దరు సందర్శకులు వచ్చిచేరారు. నేను చిరునవ్వుల పలకరింపుతో సరిపుచ్చితే వారిలో ఒకరిని కౌగలించుకుని మరీ హరికృష్ణ హర్షం వ్యక్తపరిచాడు. ఆ మనిషి పేరు ఆరిఫ్ అట. తెలుగు మనిషి. హరికృష్ణతో కలసి మస్కట్‌లో పనిచేశాడు. బహుశా ఇద్దరూ బ్రహ్మచారి రోజుల్లో ఒకేచోట ఉండేవాళ్ళనుకొంటాను. మరింకేం, కబుర్లే కబుర్లు. నాదైన బాణీలో నేనూ ఆ కబుర్లలో చేరిపోయాను.


కొండల శోధన ముగిశాక మా ప్రయాణం సలాలా పట్నంలోని విశిష్టమైన ప్రదేశాలవేపు సాగింది. పట్నపు ముఖ్య కూడలి దగ్గర ఓ మసీదు ప్రాంగణానికి అనుబంధంగా ఉన్న ఇమ్రాన్ ప్రవక్త సమాధి దగ్గరకు చేరుకొన్నాం. ఓ పక్కన మసీదు, ఆహ్లాదకరమైన లాన్‍లు, ఒక మూల అసాధరణమైన పొడవు ఉన్న కట్టడం… అదే సమాధి.

ఎవరీ ఇమ్రాన్ ప్రవక్త? స్థానిక అరబ్ ప్రముఖుడు అన్నది ఒక సమాధానం. ఖురాన్‌లోనూ బైబిల్‌లోనూ ప్రస్తావన ఉన్న వ్యక్తి అట. ఆ ప్రస్తావనలు అర్థంచేసుకొనే శక్తి నాకు లేదు గానీ ఆ సమాధి పొడవు మాత్రం ఎంతో ఆశ్చర్యం కలిగించింది. కనీసం ఏభై అడుగులైనా ఉండివుండాలి. ప్రపంచంలోకెన్నా అతి పొడవైన సమాధి అన్న వివరం ఉందక్కడ. ఇద్దరు ప్రవక్తల విశ్రాంతి స్థలాలను చూసినా వారి గురించి కనీస అవగాహన లేకపోవడం వల్ల ఏ రకమైన స్పందనలూ నాలో కలిగే అవకాశం లేకపోవడం విచారాన్నీ అసంతృప్తినీ కలిగించింది.

ఆ దగ్గర్లోనే ఉన్న సలేహ్ ప్రవక్తకు చెందిన ఒంటె పాదముద్రలు చూడటం మేము పెట్టుకొన్న తదుపరి కార్యక్రమం. అనాదికాలంలో అక్కడ నివసించే రెండు తెగల మధ్య నీళ్ళ కోసం వివాదం చెలరేగిందట. ప్రవక్త సలేహ్ ఆ వివాదాల పరిష్కారానికి ఒక ఒంటెను పంపాడట. నీళ్ళ పంపకంలో సంధి కుదిర్చాడట. ‘మాకే నీళ్ళు సరిపోకుండా ఉంటే మళ్ళా మధ్యలో ఈ ఒంటె ఒకటా’ అంటూ ఆ తెగలవాళ్ళు కూడబలుక్కొని ఒంటెను చంపేశారట! అప్పటి ఆ ఒంటె కాలిముద్రలు, రక్తపు మరకలు అని నమ్మే గుర్తులు ఉన్న ఒక బండరాయి అక్కడ పూజింపబడుతోంది. ఈ ఒంటె గాథ ప్రస్తావన ఖురాన్‌లో ఉందట.

“మీకింకో ఆసక్తికరమైన ప్రదేశం చూపిస్తాను పదండి” అంటూ హరికృష్ణ అక్కడి స్థానికులు నివసించే ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. ఒక విశాలమైన ప్రాంగణం. చుట్టూ ఎత్తయిన ప్రహరీ. రోడ్డు పక్కన రావి చెట్టు. ప్రహరీగోడకు తగిలించి ఉన్న హిందూ దేవతల పటాలు. ఆ ఆవరణ లోపల ఏదో మందిరం ఉన్న ఛాయలు… “ఇది ఖింజీ రామదాస్ కుటుంబంవారి నివాసగృహం. కచ్ ప్రాంతపు మాండ్వి నుంచి వచ్చిన వ్యాపారులు వాళ్ళు. పంధొమ్మిదో శతాబ్దపు నడుమ దినాల్లో ఒక తండ్రీ కొడుకూ వ్యాపారం కోసం కచ్ నుండి జాంజిబార్, జాంజిబార్ నుంచి మస్కట్, మస్కట్ నుంచి మాండ్వి నౌకల్లో తిరుగుతూ ఉండేవారు. అలా కొన్నేళ్ళు తిరిగాక కొడుకు రామ్‌దాస్ మస్కట్‌లో స్థిరనివాసం ఏర్పాటుచేసుకొన్నాడు. బియ్యం తీసుకొచ్చి ఖర్జూరాలు కొనుక్కొని మాండ్వి వెళ్ళే వారి వ్యాపారం క్రమక్రమంగా బహుముఖంగా విస్తరించింది. ఇపుడు ఒమాన్‌లోని ప్రముఖ వ్యాపార సంస్థల్లో ‘ఖింజీ రామ్‌దాస్’ ఒకటి. 1970లో సుల్తాన్ ఖాబూస్ అధికారంలోకి వచ్చినపుడు ఈ సంస్థవారు ఆయనకు ఎంతో నమ్మకంగా సాయపడ్డారు. దానితో ఈ కుటుంబానికి పౌరసత్వం ప్రసాదించాడు సుల్తాన్. అలా పౌరసత్వం ఇవ్వడం ఇక్కడి దేశాల్లో అత్యంత అరుదైన విషయం. ఇపుడు ఆ కుటుంబంవారి ఐదవతరం నడుస్తోంది.” వివరించాడు హరికృష్ణ. ఏ మనిషి చరిత్ర చూసినా ఎన్నెన్నో ఆసక్తికరమైన కథలూ గాథలూ అనిపించింది.

ఆనాటి మా చిట్టచివరి కార్యక్రమం కొబ్బరి తోటల మధ్య విశ్రమిస్తోన్న చేరనూన్ పెరుమాళ్‌ను చూడటం! ఏడో శతాబ్దానికి చెందిన ఈ పెరుమాళ్ కేరళలో ఓ రాజవంశీకుడు. భారతదేశంలో ఇస్లాం మతం స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి. ఆ రోజుల్లోనే మక్కా వెళ్ళి ప్రవక్తను కలుసుకొన్నాడు. తిరుగు ప్రయాణంలో సలాలా వచ్చాడు. అక్కడే అనారోగ్యం పాలై మరణించాడు. సలాలా సముద్రతీరపు కొబ్బరి తోటల్లో అతని సమాధి ఉంది. పెరుమాళ్ భక్తిశ్రద్ధలకు ముచ్చటపడి భగవంతుడు అతని సమాధిప్రాంతాన్ని కేరళలో లాగా కొబ్బరివనంగా మార్చాడని ఒక స్థలపురాణం. పురాణాల సంగతి ఎలా ఉన్నా అరేబియా ద్వీపకల్పంలో కొబ్బరిచెట్లూ తోటలూ ఉన్న అరుదైన ప్రదేశం సలాలా సముద్రతీరం!

రోడ్డు వదిలి తోటల్లోపలికి వెళితే అచ్చమైన కేరళ వాతావరణం. విస్తారంగా అరటీ కొబ్బరీ తోటలు. ఆ తోటల్ని నిర్వహించే కేరళీయులు. పెరుమాళ్ సమాధిని కాస్తంత వెదికివెదికి పట్టుకోవలసివచ్చింది. అది కనిపించాక ‘నిజానికి మేవు వెదుకుతోన్నది దీనికోసమేనా’ అన్న సందేహం కలిగింది. ఇదే ఇదే అని నిర్ధారించాడు హరికృష్ణ. సమాధికన్న చుట్టూ ఉన్న తోటలు నన్ను ఎక్కువగా ఆకర్షించడంతో ఉన్న కాస్త సమయమూ వాటిల్లో తిరగడానికి గడిపాను.

కొన్నిసార్లు దగ్గరివారితో కలసి ఏ కాఫీనో తాగడానికి బయటకు వెళ్ళినపుడు అక్కడ గొంతులోకి వెళ్ళిన కాఫీ రుచికన్నా మనసులో చొరబడిన జ్ఞాపకాల మాధుర్యం మనలో ఎక్కువకాలం నిలచిపోతుంది. ఆ మధ్యాన్నపు సమయాన అక్కడి కొబ్బరిబొండాల షాపుల్లో అదే జరిగింది. మన చిన్న చిన్న పట్నాల్లో ఉన్నట్టు ఆ రోడ్డు మీద ఇరవై పాతిక దేశవాళీ కొబ్బరీ అరటిపళ్ళ షాపులు ఉన్నాయి. అవి నడిపేవాళ్ళంతా మళ్ళా కేరళీయులే. చాలామందికి హరికృష్ణ చిరపరిచితుడు. రెండుమూడు షాపుల్లో ఆగడం, ఒకచోట కొబ్బరిబోండాం తాగడం, మరోచోట అరటిపండు తినడం, ఇంకేవో స్థానికి ఫలాలు రుచి చూడటం, షాపులవాళ్ళతో కాస్సేపు ముచ్చట్లు చెప్పుకోవడం… మనతో మనమే సంభాషించుకొనే సమయాలవి! సఖినేటిపల్లికి, కేరళలోని సుల్తాన్ బత్తేరీకి, సలాలాకూ పెద్దగా తేడా అగుపించని క్షణాలవి!!


ఆ ‘కేరళ’ పర్యటనే నా గల్ఫ్ గీతంలో అంతిమచరణం.

ఇంటికి చేరేసరికి ఒకటిన్నర దాటింది. నాలుగూనలభైకి నా మస్కట్ విమానం. ‘చిన్న ఊరు గదా, గంట ముందు వెళ్ళినా చాలు’ హరికృష్ణ భరోసా.

ఇంటికి చేరేసరికి శిరీషా పిల్లలూ మాకోసం ఎదురుచూస్తూ కనిపించారు. ఆ పూట ఊళ్ళోని ‘అన్నపూర్ణ’ సౌతిండియా రెస్టారెంటులో లంచ్ ప్లాన్ చేశాడు హరికృష్ణ. ఏ హడావుడి లేకుండా ఐదుగురమూ కబుర్లు చెప్పుకొంటూ నింపాదిగా భోజనం చేస్తూ గంటా గంటన్నర గడపగలిగాం. శిరీషకు కూడా ఇలా ఊళ్ళవీ తిరగడమంటె ఆసక్తి ఉందని మాటల్లో తెలిసిపోయింది. పిల్లలతో వీలవదనిగానీ లేకపోతే ఆమె ఈ రెండురోజులూ మాతోపాటు వచ్చివుండేవారే!

తిరిగి ఇంటికి చేరడం… నేను సర్దుకొని సిద్ధమవడం… పెద్దలతో కరచాలనాలు, పిల్లలతో కౌగిలింతలు, అందరం కలసి ఫోటోగ్రాఫులు. తనివితీరని భావన. మూడున్నరకల్లా హరికృష్ణ విమానాశ్రయంలో దింపడం… టాటావీడుకోళ్ళు.

వచ్చేటపుడు ఢిల్లీనుంచి దుబాయ్ ఒక్క అంగలో రాగలిగాను గానీ సలాలా ఢిల్లీ తిరుగు ప్రయాణం మూడంచెలుగా సాగింది. సాయంత్రం నాలుగు నలభైకి విమానం ఎక్కి ఆరున్నరకు మస్కట్‌లో దిగడం–అక్కడ అర్ధరాత్రి విమానం పట్టుకొని ఉదయం నాలుగున్నరకు అహమ్మదాబాద్ విమానాశ్రయం–మళ్ళా ఆరింటికి అక్కడ విమానం ఎక్కి ఏడూ నలభైకి ఢిల్లీలో దిగడం… అంతా కలసి పన్నెండు పదమూడు గంటలు పట్టేసింది.


ఇంటికి చేరానేగానీ మనసింకా దుబాయ్ ఒమాన్‌లలోనే చిక్కడిపోయి ఉందని అనిపించింది. అది సహజం. కొన్నిరోజులపాటు ఆ భావతీవ్రత మనసును పట్టి ఊపడం, మరికాసిని రోజులు గడిచాక ఆ తీవ్రత తగ్గి మనసులో జ్ఞాపకాల పరిమళాలు మాత్రం స్థిరంగా నిలచిపోవడం నాకు అనుభవమే.

కానీ తీవ్రతాపరిమళాలకు తోడు ఈసారి ఎందుకో తెలిసీతెలియని అపరాధభావన మనసులో తిష్టవేసినట్టు అనిపించింది. తరచి తరచి చూసుకొన్నాను. కారణం తెలిసివచ్చింది.

నా గల్ఫ్ యాత్ర మానవసంపర్కాల అనురాగవీచికలా సాగిందన్నమాట నిజం. నైసర్గిక సౌందర్యాల కదంబమాలలా సాగిందన్నమాటా నిజం. రోజులన్నీ అతి చక్కని గీతాలాపనలా గడచిపోయినమాటా నిజమే. కానీ ఈ గీతంలో విషాదవీచికలు లేవా?!

దుబాయ్‌మాల్ లాంటి మినీ ప్రపంచాల నీడల్లో బతుకుతోన్న సామాన్యుల జీవితాలను, బుర్జ్ ఖలీఫాలాంటి కట్టడాలకు ఇటుకలు మోసిన వలస కార్మికుల కష్టనష్టాలనూ చూడగలిగానా? గల్ఫ్ గీతాలాపనలో వారి గళాలకూ చోటు ఇచ్చానా?

లేదు. అది నా ప్రణాళికలో లేదు.

అడపాదడపా ప్రయత్నపూర్వకంగానే వివిధ దేశాల శ్రమజీవులతోనూ స్థానికులతోనూ మాటామంతీ సాగించానే కానీ అవన్నీ ఉపరితల పరామర్శలు కావూ? కువాయెట్ సావిత్రమ్మలు, ఒంటెలకు కట్టివేయబడి రేసుల్లో ఆక్రందనలు చేసే పసివారు, కట్టుబానిసల్లా చిక్కుబడిపోయిన అల్పజీవులు–వీళ్ళంతా వార్తల్లోనూ సాహిత్యంలోనూ కనిపిస్తూ ఉంటారు కదా… వారివేపు నా మనసు ఎందుకు వెళ్ళలేదూ? కనీసం ప్రవీణావాళ్ళ లక్ష్మిగారిని మాటల్లో పెట్టినా కాస్తంత అవగాహన కలిగేది కదా… ప్రభువుల వివరాలు అడిగి తెలుసుకొన్నంతగా రాజేష్‌లాంటి వాళ్ళతో పల్లకీలు మోసేవాళ్ళ గురించి ఎందుకు అడగలేదూ?! ఒక పూట ఒక గంట అతనితో మాట్లాడితే ఎన్నో విషయాలు చెప్పేవాడు గదా!

అవకాశాలు కోల్పోయానా? అయినా కోల్పోయానని వాపోవడం ఏమిటీ… అవకాశాలు సృష్టించుకోవాలిగదా? పక్కనే లేకపోయినా నాకూ రాజేష్‌కూ మధ్యన ఉన్న దూరం ఒక్క వాట్సప్ కాలే గదా…

ఫోన్ చేశాను. అరగంట మాట్లాడాను. మరోసారీ, మరోసారీ మాట్లాడాను.


“చెప్పుకొన్నాం గదా… అరబ్ ఎమిరేట్స్‌లో నివసించే తొంభై లక్షలమందిలో పది లక్షలమందే స్థానికులు. వాళ్ళలో పేదరికం అన్నమాట దాదాపు లేదు. ఇతరదేశాలవాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలంటే స్థానిక భాగస్వాముల్ని చేర్చుకోవడం తప్పనిసరి. అలా స్థానికుల్లో అత్యధికులు ఆర్థికంగా స్థిరపడ్డారు. స్థిరపడి ఊరుకోకుండా బాగా దూసుకువెళుతున్నారు. ఎంతోకొంత బలహీనవర్గమూ ఉన్నమాట నిజమే. వాళ్ళ బాగోగులు ప్రభుత్వమే చూసుకొంటోంది. అందరికీ అతిచక్కని ఇళ్ళు కట్టించి ఇచ్చింది. సంక్షేమ పథకాలు రూపొందించి అమలుచేస్తోంది. వాటివల్ల లబ్ధిదారుల్లో సోమరితనం పేరుకుపోకుండా జాగ్రత్తపడుతోంది.” రాజేష్ వివరించాడు.

“మరి వలస కార్మికుల సంగతీ?” అడిగాను.

“వలసవచ్చి ఇక్కడ ఉండేవాళ్ళని మూడు రకాలుగా విభజించవచ్చు: ఉన్నతోద్యోగులూ వ్యాపారాలు స్థాపించినవారూ మొదటి రకం; నాలాంటి మధ్యతరగతి ఉద్యోగులు రెండో వర్గం; శారీరక శ్రమ చేసే మనుషులు మూడో వర్గం. మొదటి రెండువర్గాలవారికీ దుబాయ్ ప్రీతిప్రదమైన ప్రదేశం. నావరకూ నేను ఇక్కడ నివసించడానికి ఎంతో ఇష్టపడతాను…

…శ్రామికవర్గంవాళ్ళకి ఎంతోకొంత అన్యాయం జరుగుతోన్న మాట నిజమే! అసలు ఆ మోసాలూ అన్యాయాలూ మనవాళ్ళకి మన దేశంలోనే మొదలవుతున్నాయి. సౌదీలోను, కువాయిట్‌లోనూ స్థానికులు వీళ్ళను పీడనకు గురిచేస్తారని విన్నాను. అరబ్ ఎమిరేట్స్‌లోనూ ఒమాన్‌లోనూ అలాంటి పీడన నామమాత్రం. అవి జరిగినట్టు ఏమాత్రం ఆచూకీ తెలిసినా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొంటోంది. కట్టడి చేస్తోంది.”

“ఇక్కడ కఫాలా పద్ధతి ఉందనీ, కార్మికులను కట్టుబానిసలను చేస్తోందనీ విన్నానే…”

“ఉంది. స్థూలంగా అది వర్క్ వీసాకు చెందిన విషయం. చెప్పాలంటే నాలాంటివాళ్ళం కూడా సూత్రప్రాయంగా కఫాలా పద్ధతిలో పనిచేసే ఉద్యోగులమే. ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు మా వీసాలు ముడిపెట్టి ఉంటాయి. అమెరికాలో హెచ్‌1బిల్లాగా. ఉద్యోగం మారాలంటే సంస్థలూ ప్రభుత్వమూ అంగీకరించాలి. ఆ అంగీకారాలు పొందడం మాకు సులభమే గానీ శ్రామికవర్గానికి ఎంతో కష్టం. కానీ ఆ పద్ధతిని యజమానులు దుర్వినియోగం చెయ్యకుండా ప్రభుత్వం ఇపుడు జాగ్రత్తపడుతోంది.”

“భారతీయులంటే చిన్నచూపు ఉందా?”

“లేదు. లేకపోగా గౌరవం ఉంది. ఈ ప్రాంతాల్లో ఆయిల్ నిధులు బయటపడ్డాక జరిగిన అభివృద్ధిలో, నిర్మాణాల్లో గుజరాత్, కేరళవాసుల పాత్ర ఎంతో ఉంది. అంచేత వాళ్ళంటే ఇక్కడివారికి కృతజ్ఞత, గౌరవం ఉన్నాయి. చెప్పే ఉంటాను-ఇక్కడి బ్యాంకింగ్ వ్యవస్థ అంతా బ్యాంక్ ఆఫ్ బరోడా రూపకల్పన చేసి నిలబెట్టినదే. 1982 వరకూ ఇక్కడా ఒమాన్‌లోనూ మన రూపాయే వీళ్ళ కరెన్సీగా ఉండేదంటే నమ్మగలరా?”

నమ్మలేకపోయాను.

“ఆయిల్ నిల్వలు ఒట్టిపోయాక వీళ్ళ సంగతేమిటీ? ఈ అట్టహాసపు అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థా ఆ పరిణామానికి తట్టుకొని నిలబడగలవా?”

“ఆ విషయంలో వీళ్ళు బాగా జాగ్రత్తపడ్డారు. ఏదో ఒకరోజు అది జరుగుతుందని వీళ్ళకి తెలుసు. ఉందికదా అని తాతల ముల్లెల్ని తవ్వుకొని తినడం మంచిపని కాదనీ వీళ్ళకి తెలుసు. వాణిజ్యం, టూరిజం, సేవారంగం–వీటిల్ని ఆధారపీఠాలుగా చేసుకొని ఆర్థిక వ్యవస్థను నిర్మించుకొంటున్నారు. చదువు మీద దృష్టి పెట్టారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించారు. చూశారు గదా, అత్యాధునికమైన యూనివర్సిటీలు పెట్టుకొన్నారు. ఇండియా నుంచి, అమెరికానుంచీ పెద్దపెద్ద విద్యాసంస్థలు వచ్చి ఇక్కడ క్యాంపస్‍లు పెడుతున్నాయి. ఇంకా వివరాలు చెప్పలేను గానీ వీళ్ళు బాగా ముందుచూపుతో సాగిపోతున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.”


అరబ్ దేశాలలో ఇతర మతాలవారు ఇబ్బందులు పడతారని విన్నాను. సౌదీ అరేబియాలో ఎన్నో ఏళ్ళు నివసించిన మిత్రులు కొంతమంది ‘మేం గట్టిగా పూజ చేసుకొనే అవకాశం కూడా లేదు. బిక్కుబిక్కుమంటూ ఏదో దొంగతనం చేసినట్టు నాలుగు గోడల మధ్య తలుపులన్నీ మూసుకొని చేసుకోవాలి’ అనటం విన్నాను.

దుబాయ్‌లో గుళ్ళూ గురుద్వారాలూ అంటే ఆశ్చర్యపోయాను. అలా గుళ్ళకు అనుమతులు ఇవ్వడం నిజంగా పరమత సహనమా లేకపోతే వాణిజ్య ఆర్థిక సూత్రాలపరంగా చేస్తోన్న వ్యూహాత్మక చర్యా? ఆ మాట రాజేష్‌నే అడిగాను.

ఓపిగ్గా వివరించాడు రాజేష్.

“ఆ సహనం వీళ్ళలో నిజంగానే ఉంది. రాజవంశీకులు చాలామంది ఇంగ్లండ్‌లో చదువుకొని వచ్చినవారు. విభిన్న సంస్కృతికి అలవాటు పడినవారు. ఎంతో కొంత ఆధునిక భావాలు కలిగినవాళ్ళు. తమ ప్రగతి కోసం రెండువందల దేశాలవాళ్ళూ అనేకానేక జాతులవాళ్ళూ ఇక్కడికి వచ్చి నివసించాలంటే వారివారి నమ్మకాలనూ సంస్కృతినీ గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం వీళ్ళకి ఉంది. అందుకే ఆ శివాలయాలు, కృష్ణమందిరాలు, గురుద్వారాలు. అన్నట్టు పోయిన ఏడాది, 2019, సహన సంవత్సరంగా చాటి ఎన్నో చర్యలూ సంస్కరణలూ చేపట్టారు. ఆ ‘యియర్ ఆఫ్ టాలరెన్స్’ సందర్భంగా పోప్‌ను తమ దేశానికి ఆహ్వానించారు. ‘సహనం’ పెంపొందించే చట్టాలు చేసుకొన్నారు. ఇజ్రాయెల్‌తో కూడా సయోధ్య కోసం చేయి చాపారు.”

నిజమే… నే వెళ్ళినచోటల్లా అసంఖ్యాకంగా మసీదులు కనిపించాయి కానీ అక్కడి గాలిలో మతపరమైన పరిమళాల జాడ నాకు కనిపించనే కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే మనదేశంలో చాలావరకూ ఈసురోమంటూ కనిపించే ప్రార్థనా స్థలాలను చూసిన నా కళ్ళకు అక్కడ ఏమూల చూసినా కళకళలాడే మసీదులు కనిపించి ముచ్చటగా అనిపించింది. ఒక అడుగు వేద్దాం అంటూ అటు వెళితే అక్కడ నిర్వాహకులు చూపించే ఆదరణ నన్ను ఆకట్టుకొంది. ఒకరకంగా ఇది నాకు కనువిప్పు. అనవసరపు సంకెళ్ళ నుంచి విముక్తి.


ప్రయాణాలూ యాత్రల విషయంలో నావంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటి గురించి ఎన్నోసార్లు మాట్లాడాను, రాశాను.

యాత్రలకు ప్రేరణలు వివిధ రకాలుగా ఉంటాయి: కొత్త ప్రదేశాలూ వింతలూ విశేషాలూ చూడాలనే ఉత్సుకత, ప్రకృతిలోకి ప్రయాణం, మనుషుల్నీ ఆయా ప్రదేశాలనూ చూసి ఆకళింపుచేసుకొని అక్కడ కలసిపోవడం, అక్కడ మన ప్రతిబింబాలను చూసుకొంటూ చివరికి మనలోకి మనమే ప్రయాణం చెయ్యడం. అలా అని ఈ పరిణామాలు విడివిడిగా తటస్థపడవు. ఒక దశనుంచి మరో దశలోకి ఎపుడు వెళుతున్నామో గమనించడమే కష్టం. ఈ ఆరంభ బిందువులు ఆలోచనకు అందవు. అవి హృదయానికి చెందిన విషయాలు.

గల్ఫ్ దేశాల పన్నెండు రోజుల ప్రయాణంలో నాకు ఈ పరిణామాలు అన్నీ అనుభవంలోకి వచ్చాయి.

ఆబు దాబి గ్రాండ్ మాస్క్, దుబాయి పామ్ జుమైరా, బుర్జ్ ఖలీఫా లాంటి ఆసక్తికరమైన ప్రదేశాలకు వెళ్ళాను. అబ్బురపడ్డాను. షార్జా ఎడారి, దుబాయ్ క్రీక్, సలాలా కొండలు లాంటి చోట మానవ నిర్మిత ప్రపంచాలను దాటుకొని భూమిపుట్టిన దగ్గర్నించీ నెలకొని ఉన్న ప్రకృతిలోకి వెళ్ళాను. తాదాత్మ్యం చెందాను.

రాజేష్ నుంచి హరికృష్ణ దాకా ఎంతోమందితో అనుబంధం స్వల్పంగానే అయినా ఏర్పరుచుకోగలిగాను. రాజేష్‌లోను, ప్రవీణలోను, ప్రియాంకలోనూ నా ప్రతిబింబాలు కనిపించి అబ్బురపరచాయి. దారిలో తటస్థపడిన అనేకానేక దేశాలవాళ్ళు నాకు చిరపరిచితుల్లా అనిపించారు.

షార్జా రోడ్లమీద, దుబాయ్ సన్నపాటి సందుల మధ్య, సలాలా శిథిలాలలో నన్ను నేను చూసుకోగలిగాను. బాల్యం లోకీ యవ్వనం లోకీ ప్రయాణం చేశాను.

ఒక్కణ్నే తిరిగినా, నలుగురితో కలసి ప్రయాణం చేసినా, మౌలికంగా ఒకే అనుభూతి. ఒంటరి ప్రయాణంలో కవి ఒఖైలీని కలిసినపుడు కలిగిన సంతోషమే నలుగురితో కలసి సలాలా కొండల్లో ట్రెకింగ్ చేసినపుడూ కలిగింది. తిరిగి చూసుకొంటే అనేక కోణాల చక్కని కలయిక ఈ గల్ఫ్ యాత్ర అనిపిస్తోంది.


ప్రయాణాలు చెయ్యడం ఒక ఎత్తు; వాటి గురించి రాయడం మరో ఎత్తు.

చేసిన ప్రతి ప్రయాణం రాయాలన్న తపన కలిగించదు. దొరికిన ప్రతి అనుభవం పదిమందికీ పంచడానికి అనువైనది కాదు. మిగిలిన ప్రతి జ్ఞాపకం చిరకాలం మనసులో నిలచి ఉండకపోవచ్చు.

చాలా అనుభవాలూ జ్ఞాపకాలూ కొద్దిరోజుల్లోనే కరగిపోతాయి. రాద్దామని కూర్చున్నపుడు జ్ఞప్తికి రావు. అలా రాని వాటి గురించి రాయడమూ పెద్దగా అవసరం గాదు. ఏది పదిమందికి చెప్పాలీ? ఏది వదిలెయ్యవచ్చూ అన్న విషయంలో ‘కాలం’ నాకో ఫిల్టర్‌లా ఉపకరిస్తుంది.

ఓ ప్రయాణం గురించి రాయడమంటే మరోసారి మరోసారి అదే ప్రయాణం చేసినట్టే. ఆ ప్రయాణాన్ని తీరిగ్గా సమీక్షించుకొన్నట్టే. ఆయా ప్రదేశాల గురించీ మనుషుల గురించీ మరింత స్పష్టమైన అవగాహన పొందినట్టే. విడివిడి భాగాలుగా, రోజులూ గంటలుగా సాగిన ప్రయాణాన్ని సమీకరించి సమన్వయించి ఒక యాత్రాధారగా పునర్‌నిర్మించుకొని ఒక విస్త్రృత సమగ్ర రూపాన్ని ఆవిష్కరించుకొన్నట్టే.

అదే జరిగింది గల్ఫ్ గీతం రాస్తున్నపుడు.

అనుకోకుండా ఈ రచన ప్రయాణం, ప్రదేశాలు, పరిచయాలు, చరిత్ర అన్న నాలుగు అంశాల సరిపాళ్ళ సమ్మేళనంగా పరిణమించింది. సామాన్యంగా యాత్రల్లో చరిత్ర, స్థల పురాణాల గురించి పట్టించుకోని నేను దుబాయ్ ఒమాన్‌లలో ఆ వివరాలను మనసులో నిక్షేపించుకొన్నాను. సరికొత్త ప్రదేశాలూ ఏమాత్రం పరిచయం లేని నేపథ్యాలూ అవటం అందుకు ముఖ్య కారణం. రాజేష్, హరికృష్ణ లాంటి స్థానిక వివరాలు సవివరంగా అందించే మిత్రుల సాహచర్యం లభించడం ఆ పనిని సులభం చేసింది.


గల్ఫ్ దేశాలు మళ్ళా వెళతానా?

ఎందుకు వెళ్ళనూ, తప్పకుండా వెళతాను!

రాజేష్ భార్గవిలను చూడటానికి వెళతాను. ప్రవీణ సతీష్‌లతో మరో రోజు గడపడానికి వెళతాను. ప్రియాంక రాహుల్‌లతో స్నేహాన్ని బలపరచుకోవడం కోసం వెళతాను. హరికృష్ణ శిరీషలతో మరికాస్త తీరుబడిగా గడపడానికి వెళతాను.

నాగభూషణంగారితో ఒకరోజు పొద్దుపోయేదాకా కబుర్లాడి ఎనభైలనాటి విజయవాడా దిగవల్లులను ఆయనతోపాటు చూడటానికి వెళతాను. హన్ష్, దుబాయ్ కవలలు, సలాలా సాయి-షమితలు కాస్త పెరిగాక ఎలా ఉన్నారో చూడటానికి, వాళ్ళ స్నేహం మరికాస్త సంపాదించుకోడానికి వెళతాను.

మామర్, అమర్‌లతో వర్షాకాలపు సలాలా పచ్చని కొండల్లో మరో రోజు గడపడానికి వెళతాను. ఈ యాత్రలో అనుకోకుండా కోల్పోయిన మస్కట్-సలాలా పగటిపూట ప్రయాణం చెయ్యడానికి వెళతాను. ఆ దారిలో అక్కడ జలరహితంగా పరచుకొన్న అనంత అరేబియా సైకత సాగరంలో గతకాలపు సాహసికులు వదిలివెళ్ళిన పాదముద్రలను వెదకడానికి వెళతాను; ఆ అడుగుల్లో నాలుగడుగులు వెయ్యడానికి వెళతాను.

అన్నిటికన్నా ముఖ్యంగా: ఈ రచనను పుస్తకంగా వేసి, అందులోని పాత్రధారులందరినీ దుబాయ్‌లో ఒకచోట చేర్చి, వారికి ఈ పుస్తకాన్ని మురిపెంగా చూపించి, సంతోషపెట్టి, సంతోషపడటానికి వెళతాను.

వెళతాను. త్వరలో వెళతాను.

ఏమో అది ఈ 2021లోనే జరగవచ్చు

జరిగితే నేను ఆశ్చర్యపడను!