ఒక అనువాదకుని అంతరంగం

నాకు దోస్తయేవ్‌స్కీ అంతగా తెలియదు.

దాదాపు ఏభై ఏళ్ళనుంచీ పేరు వింటున్నానేగానీ చదివింది కాసిన్ని కథలు, నేరము-శిక్ష. అంతే.

ద్విశత జయంతి సందర్భంగా ఆయన రచనలన్నీ తెలుగులోకి తెద్దాం అన్న కూనపరాజుగారి ప్రకటన ఒక కొత్త ఆశ కలిగించింది – ఏదైనా అనువాదం చేసి రచయితతో బాంధవ్యం ఏర్పరచుకోవాలన్న ఆశ. ‘నేను సైతం…’ స్ఫూర్తి ఉండనే ఉంది.


1870లో వచ్చిన ‘ది ఎటర్నల్ హస్బెండ్’ నా వంతుకు వచ్చింది. సంతోషంగా ఒప్పుకున్నాను. ఒకటికి రెండు ఆంగ్ల అనువాదాలు మూలధాతువుగా పంపారు నిర్వాహకులు.

ఒప్పుకొన్నానేగానీ నవల మొదటిసారి చదివినపుడు గాభరా కలిగింది. అస్సలు ఒంటబట్టలేదు. అనుమానం: అధికోత్సాహంతో దేవతలు కూడా భయపడే సీమల్లోకి దెయ్యంపిల్లాడిలా చొరబడ్డానా? అయినా తాంబూలాలిచ్చేశాక ఈ తన్నులాట ఎందుకూ! రెండోసారీ మూడోసారీ ఓపిగ్గా చదివాను. నవల అంకెకు వచ్చింది. పాత్రలు, ప్రదేశాలు, సన్నివేశాలు, సంఘటనలు, మనస్తత్వాలు, ప్రవర్తనలు, విశ్లేషణలు, వీటన్నిటిమధ్యా సంబంధ బాంధవ్యాలు – మెల్లగా మనసుకు పట్టాయి. సమగ్ర చిత్రం కళ్ళముందు విచ్చుకోసాగింది…

…అయినా అనువాదానికి దిగినపుడు బండి నడవలేదు. మొదటి రెండు అధ్యాయాలు కొరకరాని కొయ్యలనిపించాయి. ఒక రోజంతా దిగులుపడ్డాక వివేకం మేలుకొంది: ‘వాటిని పక్కన పెట్టి మిగిలిన పదిహేనింటి పనీ పట్టు’ అని సలహా ఇచ్చింది. పాటించాను. బండి గాడినపడింది. సరళంగా చివరికి చేరింది. అపుడు మళ్ళా ముందుకు వచ్చి మొదటి అధ్యాయాలు చేపట్టినపుడు అవి కుందేలుపిల్లల్లా ఒదిగిపోయాయి.


నవల నచ్చిందా? నిస్సందేహంగా!

ఒకసారి చదివి వదిలేసే నవలగాదు. అలా చేస్తే ఆ అనుభవం ‘కష్టాల కొలిమి’ అనిపించే అవకాశం ఉంది. రెండోసారీ మూడోసారీ చదవడం, అనువాదం కోసం ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్నీ మథించడం – ఏ నవల విషయంలో అయినా ఇవి ఒక సమగ్ర అవగాహనకు రహదారి అవుతాయి. ఈ నవల విషయంలోనూ అదే జరిగింది.

అనువాదం ముగిసేసరికి రచయిత దగ్గరయ్యాడు. పాత్రలు దగ్గరయ్యాయి. ఆయా ప్రదేశాలు చిరపరిచితం అయ్యాయి. కథలోని ఘర్షణలు, సంఘర్షణలు నావి అయ్యాయి. ఒక అనువాదకునిగా నాకు పూర్తి ఫలితం అందిన భావన కలిగింది.

ఇందులో వెల్షనినోవ్ ముఖ్యపాత్ర. కానీ పావెల్ పావ్లొవిచ్ టైటిల్ పాత్రధారి. వారిద్దరి మధ్యా ఉన్న విచిత్ర విపరీత అనుబంధం కథావస్తువు. వారితోపాటు లిజా, నటాలియా, క్లౌడియా, బగౌటేవ్, నాద్యా, కాత్యా, మవ్రా, మార్యా – ఎన్నో సహపాత్రలు. ముఖ్యపాత్రలయినా, సహపాత్రలయినా సహజంగా, జీవంతో మన కళ్ళముందుకు వస్తాయి. సమకాలీనమనిపిస్తాయి. మనమీద ముద్రవేస్తాయి. కథను నడిపిస్తాయి. వాటివాటి సాయంతో కథను, ఆ కథ కలిగించే ఎరుకను గ్రహించడం పాఠకుల వంతు.

అనువాదం మొదలెట్టినప్పుడు వచ్చిన మొదటి సందేహం: ఏ భాష వాడాలి? సమకాలీనపు సరళభాషా, నవల రాసిన కాలానికి దగ్గరగా ఉండే శిష్టవ్యవహారికమా? అనుభవజ్ఞులు లక్ష్మీరెడ్డిని అడిగాను. ‘అన్ని క్లాసిక్స్‌నూ పదేళ్ళకొకసారి సమకాలీన భాషలోకి మరోసారీ మరోసారీ అనువాదం చేసుకోవాలి అన్నది ఇపుడు ప్రబలంగా ఉన్న అభిప్రాయం’ అన్నారాయన. అనుమానం తొలిగింది. రెండో సందేహం: పాత్రలనూ ప్రదేశాలనూ ఎలా పిలవాలి? మూల రష్యన్ భాషలో పిలిచినట్టుగానా, మనకు అలవాటయిన టాల్‌స్టాయ్ బాణీలోనా? మూల ఉచ్చారణకోసం కాస్త ప్రయత్నించాగానీ అది కష్టమని తేలింది. టాల్‌స్టాయ్ బాణీలో ఆంగ్లపదాల ట్రాన్స్‌లిటరేషన్ దగ్గర సర్దుకుపోయాను.

వీలయినంతవరకూ సరళమైన పదాలే వాడాను. పెద్దపెద్ద మాటలూ సమాసాలూ రాకుండా జాగ్రత్తపడ్డాను. కానీ నేను వాడే ‘సరళపదాలు’ ఇప్పటి తరానికి నారికేళాలు అయ్యే అవకాశం ఉందని తెలుసు. అది నా పరిమితి.

ఏ ఒక్క పదాన్నీ వదలకుండా అనువదించాలన్నది నేను నమ్మిన బాణీ. చాలావరకూ అలా చెయ్యగలిగాను. ఆ ప్రతిపద అనువాదం కృతకంగా మారిన సందర్భాలలో వాక్యంలోని భావాన్ని ప్రధానంగా తీసుకొన్నాను. నాకు అనువదించడం కష్టమవుతోంది అన్న కారణంవల్ల ఏ పదాన్నీ, భావాన్నీ  విస్మరించలేదు.


అనువాదం ఒక సవాలు.

విదేశీరచనల అనువాదం పెనుసవాలు. భారతీయ భాషలన్నిటికీ ఒక కామన్ కల్చరల్ రిజిస్టర్ ఉంది. దేశవ్యాప్తంగా అర్థమయ్యే విభీషణుడు, జయచంద్ర లాంటి ప్రతీకలున్నాయి. సమానార్థాల సామెతలూ జాతీయాలూ ఉన్నాయి. విదేశీ రచనల విషయంలో ఆ కల్చరల్ రిజిస్టర్ సదుపాయం ఉండదు. విభిన్న ప్రదేశాలు, మనస్తత్వాలు, సంస్కృతి, సంప్రదాయాలు – వీటిని పాఠకులకు చేరవేయడం నిస్సందేహంగా ఒక సవాలు. అనువాదం చేస్తున్నపుడు దూసుకువచ్చే మన సంస్కృతీ ప్రతీకల్ని గుర్తించి అరికట్టడం, మూలభాషకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలు భంగపడకుండా వాటిల్ని లక్ష్యపాఠకులకు అందించడం – ఏ అనువాదకునికైనా అది కత్తిమీదసాము. అది నాకు తెలుసు. అలాగే ‘అసలిది అనువాదంలా లేనే లేదు, తెలుగులోనే రాసినట్టుగా ఉంది’ అన్నది ప్రశంస కాదని, అనువాదకుని పరిమితులకు చిహ్నమనీ తెలుసు. ఈ విషయంలో బాగా జాగ్రత్తపడ్డాను. అయినా కొన్ని కొన్ని అనుచిత ఉపమానాలు, ప్రతీకలూ తప్పక చొరబడి ఉంటాయని తెలుసు. అది నా పరిమితి.


అనువాదం ఒక సృజనాత్మక ప్రక్రియ.

గత ముప్ఫై ఏళ్ళుగా అనువాదం చేస్తోన్న మనిషిగా ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను.

యాంత్రికతా కృత్రిమతా లేకుండా అనువాదపాఠం సాగిపోవడానికి సృజనాత్మకత ఎంతో అవసరం. అనువాదోచితమైన భాషనూ, పలుకుబళ్ళనూ, సున్నితపు వివరాలనూ ఒడిసిపట్టుకోడానికి సృజనాత్మకత అవసరం. మూలపరిమళం చెదరకుండా చూడటానికీ అనువాదకుడు సృజనశీలి అయివుండాలి.

అనువాదకుడు ముగ్గురికి విధేయుడు: మూల రచయిత, లక్ష్య పాఠకులు, తనకు తాను. నా విధేయత ముగ్గురికీ సమానంగా పంపిణీ అవుతూ ఉంటుంది. నిజానికిది మూడుగుర్రాల స్వారీ. కానీ ఈ స్వారీ సజావుగా సాగించలేనపుడు ఆ అనువాదం మృతశిశువుగా మారే ప్రమాదం ఉంది.

ఇంత చెప్పాక ఈ నవలను ‘భార్యచాటు మనిషి’గా అనువదించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అని చెప్పడం చర్విత చర్వణమే అవుతుంది. నాకు కలగవలసిన సంతృప్తి కలిగిందన్న మాట నిజమే అయినా ఆ సంతృప్తి కలగవలసింది పాఠకులకు.

పాఠకుల సంతృప్తి అన్న విషయంలో నేను ఆశాభావంతో మాత్రమే ఉండగలను.

ఇది నేను అందిపుచ్చుకొన్న చక్కని అవకాశం.

దీనికి కారకులయిన నిర్వాహకబృందానికి ధన్యవాదాలు.

పుస్తకం నవంబర్ 13న విడుదల అవుతోంది – ‘ఆరగించవయ్యా పాఠకా’ అని ఆహ్వానిస్తున్నాను.

అమరేంద్ర
25.10.2021

[ప్రచురణ: సాహితీ పబ్లికేషన్స్, విజయవాడ. 176 pages.]