దక్షిణ అమెరికా దృశ్యమాలిక-2

కీతో నగరం – పిచించా జ్వాలాముఖి

అప్పుడే ఎక్వదోర్ దేశంలో అడుగు పెట్టి రెండు రోజులు గడిచిపోయాయి. భూమధ్య రేఖాప్రాంతాలలోనూ, కీతో నగరపు పరిసర పట్టణాల్లోనూ గడిపిన ఆ రెండు రోజులూ ఎంతో సంతృప్తిని కలిగించాయి. మూడవనాడు నగరపు చుట్టుపక్కల ఉన్న అగ్నిపర్వతాలను పలకరించి రావాలని అనుకొన్నాను.

పిచించా (Pichincha) వోల్కనో అన్నది కీతో నగరం ఉన్న లోయలో తూర్పు దిక్కున విస్తరించి ఉన్న అగ్నిపర్వతం. దానికి రెండు శిఖరాలు – వాహ పిచించా (Waha Pichincha) అన్న 4784 మీటర్ల (15696 అడుగులు) శిఖరం ఒకటయితే రూకు పిచించా (Rucu Pichincha) అన్న 4698 మీటర్ల (15413 అడుగులు) శిఖరం రెండవది. ఆ రెండు శిఖరాలూ కీతో నగరం నుంచి స్పష్టంగా కనపడతాయి. కయాంబె (Cayambe) అన్నది కీతో నగరానికి ఈశాన్య దిశలో ఉన్న మరో జ్వాలాముఖి. అంతా కలసి నగరపు పరిసరాల్లో పదిహేడు అగ్నిపర్వతాలు ఉన్నాయట. మొత్తం ఎక్వదోర్ దేశాన్ని లెక్కలోకి తీసుకుంటే వాటి సంఖ్య ఏభై. అందులో కొన్ని చురుకైన జ్వాలాముఖులు, మిగిలినవి చల్లారిన అగ్నిపర్వతాలు. వీటిల్లో మళ్ళా మూడింట రెండు వంతులు ఎక్వదోర్ భూభాగంలో ఉంటే ఆ మిగిలిన మూడో వంతు గలాపగోస్ ద్వీపాలలో ఉన్నాయి. నిజానికి ఎక్వదోర్ దేశం పసిఫిక్ ప్రాంతపు జ్వాలాతోరణంలో (Rim of Fire) ఒక భాగం. ఈ జ్వాలాతోరణమన్నది పసిఫిక్ మహాసాగరంలో అగ్నిపర్వతాలతో కూడిన టెక్టానిక్ భౌగోళిక విశేషం. ఈ తోరణంలో భూమిపొరల ‘చురుకుదనం’ ఎక్కువ. అంచేత అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.

ఈ శంకువు ఆకారపు, మంచు నిండిన అగ్నిపర్వత శిఖరాలు ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉన్న ఆండీస్ (Andes) పర్వత శ్రేణి మూపురం మీద రెండు వరుసలుగా అమరి ఉన్నాయి. సుప్రసిద్ధ జర్మన్ భౌగోళిక నిపుణుడు, బహుశాస్త్రప్రవీణుడూ అయిన ఫాన్ హమ్‌బోల్ట్ (Van Humboldt) ఈ అమరికను ‘ఎవెన్యూ ఆఫ్ వాల్కనోస్’ అని పిలిచాడు. ఈ శిఖర శృంఖల మధ్యభాగాలలో సారవంతమైన లోయలు ఉన్నాయి. మన కీతో నగరం అలాంటి ఒక లోయలో ఉంది. దక్షిణ అమెరికా భౌగోళిక రూపురేఖలను, జీవ పరిణామ చరిత్రనూ స్పృశించే ఏ ప్రస్తావన అయినా వాన్ హమ్‌బోల్ట్ పేరు చెప్పకుండా ఉండలేదు అనడం అతిశయోక్తి కాదు. ఈ వ్యాసపరంపరలో ముందు ముందు అతని వివరాలు మరిన్ని అందిస్తాను.


ఆ రోజు బాగా ఉదయమే మా ‘జైలుగది’ రెస్టరెంట్లో తేలికపాటి అల్పాహారం, గట్టిపాటి కాఫీ కప్పుతో నా దినసరి కార్యకలాపం ఆరంభించాను. తిన్నగా పిచించా వాల్కనో దగ్గరి కేబుల్ కార్ వేపుకు దారి తీశాను. మా హోటల్ నించి కారులో అరగంట పట్టింది. ముందే అన్నట్టు కీతో నగరంలో ఊబర్ టాక్సీలు బాగా చవక. అంచేత పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ కోసం వెదకడం విషయంలో బద్ధకించాను. పైగా కీతో నగరపు పాతపట్నంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను అందుకోవడం అంత సులభం కాదని తెలిసింది.

కీతో నగరం సముద్ర తలానికి 2850 మీటర్లు ఎగువున ఉంది. నేను పట్టుకొన్న కేబుల్ కారు – టెలిఫెరికో, ఆంగ్లంలో కేబుల్ వే – మమ్మల్ని మరో వెయ్యి మీటర్ల ఎగువకు తీసుకు వెళుతోంది – అంతా కలసి 3800 మీటర్లు పైచిలుకు. దాని టికెట్టు పది డాలర్లు. టికెట్టు కొని కారు ఎక్కాను. ఆ కార్లో అప్పటికే ఓ అమెరికన్ తండ్రి, అతని కొడుకు, మరో స్విస్ యువకుడూ చేరి ఉన్నారు. అందరం హుషారుగా హలోహలోలు చెప్పుకున్నాక ఆ స్విస్ మనిషి తన ఫోన్‌లో నిమగ్నమై పోయాడు. ఆ అమెరికన్ తండ్రీ అతని కొడుకూ ఏదో సరదా వాదనలో మునిగిపోయారు. వాళ్ళ వాదన నా చెవిన పడనే పడింది. ‘3640 మీటర్ల ఎత్తులో ఉన్న బొలీవియా రాజధాని ల పాజ్ తర్వాత, 2850 మీటర్ల ఎగువున ఉన్న కీతో నగరం ప్రపంచంలోని రెండవ ఎత్తయిన రాజధాని’ అంటాడా అమెరికన్ తండ్రి. ‘కాదు, బొలీవియాకు అధికారపూర్వకంగా 2790 మీటర్ల సుక్రె (Sucre) రాజధాని కాబట్టి కీతో నగరానిదే ప్రపంచంలో ప్రథమస్థానం’ అన్నది ఆ పుత్రుని వాదన. తన వాదన బలపరచడం కోసం మొబైల్లో నాలుగు నొక్కులు నొక్కి ఏదో వివరం తండ్రికి చూపిస్తాడు. ‘అదంతా కరెక్టు కాదు’ అంటూ తండ్రి కొట్టిపారేస్తాడు. వాళ్ళ వాదప్రతివాదాలు ముగిసేలోగానే మా కేబుల్ కారు తన గమ్యం చేరిపోయింది. అందరం దిగిపోయాం.

మేము దిగిన చోటు ఆటపాటలకూ పిక్నిక్కులు చేసుకోడానికీ అనువుగా ఉంది. రెస్టరెంట్లు కూడా ఉన్నాయి. అక్కడనించి కీతో నగరం ఎంతో సుందరంగా కనిపించింది. చుట్టుపక్కల ఉన్న అగ్నిపర్వతాలూ స్పష్టంగా కనిపించాయి. స్థానికులు, హైకర్లూ వారాంతాలు గడపడానికి ఆ ప్రదేశం అనువైనదిలా కనిపించింది. రూకో పిచించా శిఖరానికి దారితీసే పది కిలోమీటర్ల ట్రెక్కింగ్ బాటకు ఆ ప్రదేశం ఆరంభ బిందువు. వెళ్ళి రావడానికి నాలుగైదు గంటలు పడుతుందట. ఎక్వదోర్ లోని మౌంట్ కొతోపాక్సీ (Cotopaxi), చింబరాసో (Chimbaraso) అన్న ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి వచ్చే శిఖరారోహకులు అక్కడి వాతావరణంలో ఇమడడానికి నాందిగా ముందు ఈ పది కిలోమీటర్ల ట్రెక్కింగు చేస్తారట.

సమున్నతాల దేశం ఎక్వదోర్‌లో నాకది మూడవరోజు మాత్రమే. అంచేత ఆ ఎత్తులకు నా శరీరం అలవాటు పడిపోయింది అని ఖచ్చితంగా చెప్పలేను. అయినా రూకు పిచించా శిఖరంకేసి సాగిపోతోన్న ట్రెకర్ల బృందాలను చూసి నాకూ ఉత్సాహం కలిగింది. నేను ట్రెకింగుకు అనువుగా ఉండే బూట్లూ దుస్తులూ ధరించని మాట నిజమేగాని, నేను వేసుకున్న హైకింగ్ షూసు ఆ అవసరానికి సరిపోతాయనిపించింది. కానీ ఆ శిఖరాగ్రాన తటస్థపడే అతి చల్లని వాతావరణానికి తట్టుకొనే బట్టలు వేసుకొని లేను. పైగా అలాంటిచోట వాతావరణం క్షణక్షణానికీ మారిపోతూ ఉంటుంది. దానికి తోడు అంతంత ఎత్తులు ఎక్కేటప్పుడు ఎంతగానో అవసరమయిన వాకింగ్ పోల్స్ – చేతిఊతాలు– నా దగ్గర లేనే లేవు. ఇలాంటి పరిస్థితిలో ఆ ట్రెకింగు పెట్టుకోవడం దుస్సాహసమవుతుందా?!

అయినా మనసాగక మా కేబుల్ కారు స్నేహితుల్ని సంప్రదించాను. వాళ్ళంతా ఎంతగానో ప్రోత్సహించారు. ‘మరేం పర్లేదు వచ్చేయ్’ అన్నారు. ఈలోగా ఆ స్విస్ యువకుడు క్షణాల్లో ట్రెకింగ్ బాట పట్టి అదృశ్యమయిపోయాడు! ఆ నార్త్ కెరోలినాకు చెందిన అమెరికన్ తండ్రి మైక్, అతని కొడుకు జో మాత్రం ఎంతో సానుకూలంగా కనిపించారు. వాళ్ళతో కలసి ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళదాం అని నిశ్చయించుకున్నాను.

ఉదయం ఎనిమిదిన్నరకు అందరం ట్రెకింగ్ ఆరంభించాం. మా బాట నిడుపాటి గడ్డి భూములగుండాను, స్థానిక వృక్షజాలం నడుమనా సాగింది. వృక్షజాలం అన్నానేగానీ అవన్నీ జెముడు పొదల కోవకు చెందినవి. ఆ పొదలలో చక్కచక్కని నారింజ రంగు పూలు… వాటిల్ని అగ్నిబల్లేలు – స్పియర్స్ ఆఫ్ ఫైర్ – అని పిలుస్తారట. బాటకు రంగులు అద్దుతున్నాయా పూలు.

అంతకు మూడునెలల క్రితమే ఎవరెస్టు బేస్ క్యాంప్ ట్రెక్కు చేసిన నేపథ్యంలో ఈనాటి ట్రెక్కు విషయంలో కాస్తంత నమ్మకంగానే ఉన్నాను. ‘వీలయినంత దూరం వెళదాం, అవసరమయితే చివరిదాకా వెళ్ళకుండా తిరిగి వచ్చేద్దాం’ అనుకొనే వెళ్ళసాగాను. సహ ట్రెకర్లు చాలామంది ట్రెకింగుకు అవసరమయిన దుస్తులూ సరంజామా అంతా ధరించి, చేతబట్టి కనిపించారు. అలా ఆ దారిలో అరగంట నడిచాక నేను అంతంత ఎత్తులకు సరిపడే శారీరక స్థితిలో లేనని, త్వరత్వరగా అలసిపోతున్నాననీ అర్థమయింది. అయినా మైక్, జో, ఎంతో సహకారం అందించారు. వాళ్ళు రెండు వారాలుగా ఆ దేశంలో ఉంటున్నారట. ఆరువేల మీటర్ల చింబరాసో శిఖరం అప్పటికే ఎక్కారట. నేను అలసిపోతున్నాననీ నడక మందగిస్తోందనీ గ్రహించినా వాళ్ళు నాతోపాటే ఉండటానికి సిద్ధపడ్డారు. ‘అలాకాదు, నాతోపాటు ఉండిపోతే మీరు శిఖరాగ్రం చేరుకోలేరు. నేను కాసేపు శ్వాస తీసుకుని ముందుకు వస్తాను. మీరు మీ నడక కొనసాగించండి’ అని నచ్చచెప్పాను. వాళ్ళు అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఒప్పుకొని త్వరత్వరగా సాగిపోయారు. నేను చిన్నపాటి బ్రేక్ తీసుకున్నాను.

నా మొదటి లక్ష్యం నాలుగువేల మీటర్ల ఎత్తుకు చేరడం – మరో గంటలో ఆ ఎత్తుకు చేరుకోగలిగాను. చేరానేగానీ ఆక్సిజన్ పలచబడే ఆ ఉన్నత పరిసరాలు నా శక్తిమీదా నడకవేగం మీదా ప్రభావం చూపిస్తున్నాయన్నది సుస్పష్టం. అయినా సరే నడక వేగాన్ని బాగా తగ్గించి, పరిసర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ముందుకే సాగాను. దిగువున కీతో నగరం, విస్తరించి ఉన్న అగ్నిపర్వతాల నడుమన విలక్షణంగా కనిపించింది. అదో అరుదైన అపురూపమైన దృశ్యం. అలాగే అక్కడ నేను అంతకు ముందు ఎప్పుడూ చూసి ఎరుగని అడవిమొక్కల్నీ పువ్వుల్నీ చూశాను.

ఏదేమైనా ఆ సమయాన నా నడక నత్తతో పోటీ పడుతోందన్న మాట నిజం. దారిలో అంతకు ముందు కలసిన వాళ్ళు మళ్ళా కనిపించినా చిరునవ్వూ కంటిచూపులతో సరిపెట్టాను. 4050 మీటర్ల ఎత్తుకు చేరాక ముందుకు వెళ్ళడమా, వెనక్కి మళ్ళడమా అన్న మీమాంసలో మరోమారు పడ్డాను. అలాంటి సందిగ్ధ దశలో హోసె అన్న యువకుడు తారసపడ్డాడు. ఇద్దరం మాటల్లో పడ్డాం. కలసి నడిచాం.

ఈ హోసె అన్నతడు కీతో నగరానికి చెందిన స్థానికుడు. ఉపాధ్యాయ వృత్తిలో వున్న వ్యక్తి. గాఢమైన యాత్రా పిపాసి. హైకింగూ ట్రెకింగులంటే బాగా ఇష్టపడే మనిషి. స్పానిష్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ – ఈ మూడు భాషలూ ధారాళంగా మాట్లాడగలడు. ఇద్దరం యాత్రలూ ట్రెకింగులలో పరస్పర ఆసక్తీ అనుభవాల గురించి పొడిపొడిగానే అయినా మాట్లాడుకున్నాం. నా ఎవరెస్టు బేస్‌క్యాంప్ అనుభవాలను అతను ఎంతో శ్రద్ధగా విన్నాడు. ఇష్టపడ్డాడు. అలా ఓ గంట గడిచింది. సంభాషణ సజావుగా సాగుతోన్న మాట నిజమేగానీ నా ఉనికి అతని నడకను మందగింపజేస్తోందన్న విషయం సుస్పష్టం. ఆ మాట అతనితో అన్నాను. ‘నువు వెళ్ళిపో… నేను మరో గంటసేపు మెల్లగా సాగి ఆ తర్వాత వెనక్కి మళ్ళుతా’నన్నాను. అప్పటికి మేము 4309 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాం. ‘అలాకాదు. ఇద్దరం కలసే ముందుకు సాగుదాం’ అంటూ హోసె ప్రోత్సాహం అందించాడు. నన్ను మాటల్లో పెట్టి అలసట గుర్తు రాకుండా చేశాడు. ఈలోగా మాకు మాజో అన్న మరో స్థానిక యువతి తటస్థపడింది. అక్కడి యూనివర్శిటీ స్టూడెంటట.

అప్పటికే దారి ఇసుకిసుకగా మారింది. దానికి తోడు పెద్దపెద్ద బండలు… ఆ బండల్ని దాటడానికి రెండు కాళ్ళు చాలడం లేదు – చేతుల్ని కూడా కాళ్ళుగా చేసుకొని నాలుగు కాళ్ళమీద సాగవలసి వచ్చింది. అంతా కష్టపడి వెళితే ఎదురుగా కనిపించిన దృశ్యం నన్ను హతాశుడ్ని చేసింది: దారికి అడ్డంగా ఓ బృహత్‌శిల – ఆ శిలాముఖం డెబ్భై-ఎనభై డిగ్రీల వాలులో ఉంది; అంటే దాదాపు నిట్టనిలువుగా ఎక్కాలన్నమాట. నాకు ఇలాంటి నిట్టనిలువు అవరోధాలంటే ఇప్పుడనే గాదు – ఎప్పుడూ వెరపే! అలాగే అరవై డెబ్భై మీటర్ల దిగువకు జారిపడే ప్రదేశాలలో రాక్ క్లైంబింగ్ అన్నా నాకు ఏమాత్రం సరిపడని విషయం. ఈ నేపథ్యంలో నేను ఒక్కణ్ణీ ఉన్నట్టయితే ఆ బృహత్‌శిల ఎక్కడమన్న ప్రసక్తే ఉండేదిగాదు. కానీ మా హోసె, మాజోలు ఎంతగానో ప్రోత్సహించి ఆ శిలావరోధాన్ని అధిగమించేలా చేశారు. మాజో అయితే నా చేయి పట్టుకుని మరీ ఆ బండ మీదకు ఎక్కించింది. అది దాటిన కాసేపటికే అలాంటి మరో బండ ఎదురయింది. ఆ యువతీయువకుల సాయంతో దాన్నీ దాటగలిగాను. ‘ఈ బండలు ఇక్కడితో ఆఖరు, ముందు ముందు ఇలాంటివి లేవు’ అని వాళ్ళు భరోసా ఇచ్చారు.

మరి కాస్సేపటికల్లా దారంతా నల్లని అగ్నిపర్వతపు ఇసుకతో నిండిపోయి కనిపించింది. ఆ ఇసుక మీద నడవడం మామూలుకన్నా రెట్టింపు కష్టమనిపించింది. అప్పటికే 4500 మీటర్ల ఎత్తుకు చేరుకుని ఉన్నాను. పూర్తిగా అలసిపోయి ఉన్నాను. అయినా మరికాస్త ముందుకు సాగి 4531 మీటర్ల దగ్గర ఉన్న ఒక ల్యాండ్‌మార్క్ బోర్డు దగ్గరకు చేరుకోగలిగాను.

‘సాగిపోదాం పదండి’ అంటూ హోసె మాజోలు తమ ప్రోత్సాహం కొనసాగించసాగారు. వారి పుణ్యమా అని మరి నాలుగు అడుగులు వేశాను. ఆ నల్లటి ఇసుకమీద నడక మరింత మరింత కష్టం కాసాగింది. నా ఐఫోన్‌లో ఆల్టిట్యూడ్ వివరం చూశాను. 4540 మీటర్లని తెలిసింది. అంటే శిఖరాగ్రానికి మరో 158 మీటర్ల దిగువన – అతి చేరువలో – ఉన్నానన్నమాట. ఈ లోగా సన్నపాటి జల్లు మొదలయింది. అలాంటి ప్రదేశాల్లో ఆ పరిణామం ఏమంత శుభశకునం కాదు; దారిని మరింత ప్రమాదభరితం చేస్తుందా జల్లు. ఇక నా ప్రస్థానాన్ని ముగించవలసిన సమయం వచ్చిందన్న ఎరుక నాకు కలిగింది. నిర్ణయం తీసుకున్నాను. ఒంట్లో శక్తి లేదు, గాల్లో ఆక్సిజన్ లేదు – నా వేగం నత్తతోకూడా పోటీపడే స్థాయికి చేరుకుంది. ఇంకా ముందుకు సాగడం అంటే ఆ యువతీ యువకుల్ని నా స్థాయికి దించేయడమే అన్నమాట. అంచేత వారికి ధన్యవాదాలు చెప్పి, ముందుకు సాగిపొమ్మని శుభాకాంక్షలు అందించి, నేనక్కడే ఆగిపోయాను. వాళ్ళిద్దరూ నా నిర్ణయాన్ని గౌరవించారు. మేము ఫోను నెంబర్లు మార్చుకున్నాం. మేము ఎక్కి వచ్చిన నిట్టనిలువు బండలు దిగడం నాకు కష్టమయ్యే అవకాశం ఉంది గాబట్టి వాళ్ళు శిఖరం చేరుకుని తిరిగి వచ్చేదాకా నేనూ ఆగుతానన్నాను. ఈలోగా ఇంకెవరి సహాయమన్నా అందితే వాళ్ళతో వెళ్ళిపోతానన్నాను. హోసె మాజోలు సరేనన్నారు. ముందుకు సాగిపోయారు.


నిట్టనిలువు బండరాళ్ళు ఎక్కడంలో నేను ఎదుర్కొనే కష్టాల్లో ‘వాస్తవం’ కన్నా నా ఊహల పాలే ఎక్కువ అనుకొంటాను. నాబోటి అనేకమంది ట్రెకర్లు అలాంటి వాటిని ఏ సందేహమూ లేకుండా అధిగమించేస్తూ ఉంటారు. అవి క్లిష్టమయినవని, ఎంతో జాగ్రత్తగా వాటిల్ని దాటాలి అన్న విషయం వాళ్ళూ ఒప్పుకుంటారు కానీ అక్కడే దిగాలుగా నిలచిపోరు. ఏ సందేహాలకూ తావు ఇవ్వకుండా, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళంతా ముందుకు సాగిపోతూ ఉంటారు. అంటే నా విషయంలో ఆ అవరోధం చాలావరకూ మానసికం అన్నమాట. నేను జయించవలసింది నా మనస్సును – ఆ పని చేయలేకపోతే ఆ నా తిరుగు ప్రయాణం మరింత క్లిష్టమవుతుందని తెలుసు. నేను అవి దాటి వచ్చినపుడు నాకు ఒక అనుకోని సౌలభ్యం లభించింది: అసలా బండలు అక్కడ ఉన్నాయని తెలియనే తెలియక పోవడమే ఆ సౌలభ్యం! తిరుగు ప్రయాణంలో అవి ఉన్నాయీ అని స్పష్టంగా తెలుసుగాబట్టి మనసులో అదనపు ఆందోళన చోటు చేసుకుంది. అది విషయాన్ని మరింత క్లిష్టం చేస్తుందని తెలుసు. అంచేత నాలోని ఆ భయాన్ని అధిగమించే ప్రయత్నం మొదలుపెట్టాను. నాలోని సైకియాట్రిస్టు నా మనసు మీద కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఆరంభించాడు. ‘అదేమీ నువ్వు అనుకొనేంత కష్టం కాదు. భయాన్ని చేరనివ్వక. అనుభవజ్ఞుల సాయం తీసుకొని జాగ్రత్తగా దిగినట్టయితే ఆ బండల్ని ఏ ప్రమాదమూ లేకుండా దాటేయగలవు’ అని మనసుకు ధైర్యం చెప్పసాగాడు.

దాటివచ్చిన 4531 మీటర్ల ల్యాండ్‌మార్క్ బోర్డ్ దగ్గరికి తిరిగి వెళ్ళి అక్కడి ఓ రాయి దగ్గర విలాసంగా చేరగిలబడ్డాను. హోసె, మాజోలకోసం నిరీక్షణ ఆరంభించాను. అలా కొన్ని నిముషాలు గడిచేసరికి మనసూ శరీరమూ శాంతించాయి. సౌకర్యంగా అనిపించింది. ఆలోచనల్లో పడిపోయాను.

‘శిఖరానికి అంత చేరువలోకి వెళ్ళిన వాడివి అలాగే ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఆ నాలుగు అడుగులూ వేసి ఉంటే బావుండేది గదా… నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదేనా?’ మనసు ప్రశ్నించింది. ‘శరీరం సహకరించనపుడు, ముందుకు సాగనని సంకేతాలు పంపినపుడు దుందుడుకుగా వాటిని నిర్లక్ష్యం చేయడం తగని పని. నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావు’ అని వివేకం సమాధానం చెప్పింది. ఒక డాక్టరుగా క్షీణించిన శక్తీ పూర్తిగా అలవాటుపడని ఎత్తు ప్రదేశాలూ కలగలసి శరీరస్థితిని ఎంతగా ప్రభావితం చేస్తాయో, ప్రమాదాలకు గురిచేస్తాయో నాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది. దాన్ని విస్మరించడం అన్న ప్రసక్తే లేదు. నేను అంతకు ముందు ఇప్పటికన్నా ఎత్తయిన శిఖరాలు చేరుకుని ఉండవచ్చు. మరిన్ని సవాళ్ళు ఎదుర్కొని ఉండవచ్చు. అంతమాత్రం చేత ఆ ఎరుక వ్యతిరేకదిశలో పనిచేసి నా అహాన్ని దెబ్బతీయగూడదు. ప్రతి పర్వతమూ ఒక విభిన్నప్రదేశం. ఇంకా చెప్పాలంటే ఒకే పర్వతం విభిన్న దినాలలో సరికొత్త సవాళ్ళు విసరవచ్చు. మనం ఆయా సందర్భాలలో శరీరానికి ఇచ్చే తర్ఫీదూ మానసిక సంసిద్ధతా వేరు వేరు స్థాయిల్లో ఉండవచ్చు. ఈ అంశాలన్నీ సజావుగా ఇమిడిపోయిన రోజున మనం శిఖరాలను సులువుగా అధిరోహిస్తాం. లేనినాడు అదే శిఖరం దుర్గమం అవవచ్చు. అలాంటి రోజున ప్రకృతికి వందనం చేసి వాస్తవాన్ని అంగీకరించడమే వివేకం అంటే. పైగా ఏ సంసిద్ధతలూ లేకుండా, అవసరమైన పరికరాలూ దుస్తులూ లేకుండా, ఉన్నపళాన పెద్ద పని పెట్టుకొన్నపుడు వివేకం తోడు మరింత అవసరం…

అలా పావుగంట గడిచింది. కొద్దిమంది హైకర్లు నన్ను దాటి వెళ్ళారు. ఆ 4531 మీటర్ల బోర్డు దగ్గర ఫోటోలు తీసుకుంటోన్న పాతికేళ్ళ యువజంట నా దృష్టిని ఆకర్షించింది. చూస్తోంటే వాళ్ళా ప్రదేశంనుంచి పైకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు కనిపించలేదు. వెనక్కి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్లుగా అనిపించింది. వెళ్ళి పరిచయం చేసుకున్నాను. వాళ్ళూ ఎంతో సాదరంగా స్పందించారు. ఆమె పేరు మికీ లీ. న్యూజీలాండ్ మనిషి. అతను కానర్ – కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి. ఇద్దరూ కలిసి దేశాలు తిరుగుతున్నారట. నాలాగే వాళ్ళూ శిఖరాగ్రం చేరడం అన్న ఆలోచన లేకుండానే పిచించా వచ్చారట. వచ్చాక, ‘సరే, ఎక్కగలిగినంత ఎక్కి చూద్దాం’ అని హైకింగ్ బాట పట్టుకున్నారట. వాళ్ళ దగ్గరా శిఖరారోహణకు సరిపడే దుస్తులూ పరికరాలూ లేవు. ఆ 4531 అడుగుల ల్యాండ్‌మార్క్ దగ్గర వాళ్ళూ ఇహ తిరిగి వెళ్ళిపోదాం అని నిశ్చయించుకొన్నారట. ఆ ఒకే జాతి పక్షులతో నా సమస్య చెప్పుకున్నాను. నిడుపాటి బండలు ఎక్కడం దిగడంలో నాకున్న సంకోచాలు చెప్పాను. నేనూ వాళ్ళతో వస్తానని, ఆ బండలు దిగేటప్పుడు సాయం చెయ్యమనీ అడిగాను. వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. అన్నట్టు మికీలీ రాక్ క్లైంబింగ్‌‌లో శిక్షణ పొందిన వ్యక్తి.

మొదటి బండ దగ్గర నేను మికీలీ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ – ఎక్కడెక్కడ ఆవిడ చేతిపట్టు పట్టుకుందో అక్కడే నేనూ పట్టుకుంటూ దిగాను. నా ముందు మికీలీ, వెనుక కానర్ – ఎంతో చక్కగా నాకు సూచనలు ఇచ్చి నింపాదిగా దింపారు. ఆమె అడుగులు వేసిన బిందువులు నా కాళ్ళకూ చక్కని రక్షణనిచ్చాయి. ఆమె పట్టుకున్న ప్రదేశాలు నాకూ చక్కని పట్టు అందించాయి. వారి పరిణత చెందిన సూచనల పుణ్యమా అని మనసు మరింకే ఆలోచనా పెట్టుకోకుండా పూర్తిగా పనిమీదే కేంద్రీకృతమై వారు చూపిన బాటను అనుసరించింది. అలా రెండు బండల్నీ ఎంతో సులభంగా దిగగలిగాను.

ఆ రెండు బండలూ దాటిన తర్వాత గుండెల్లోని గుదిబండలు తొలగిన అనుభూతి… మనసు దూదిపింజ అయింది. మిగిలిన అవరోహణ అంతా సంతోషసంబరాలతో సాగింది. ముగ్గురమూ కబుర్లు చెప్పుకుంటూ ప్రపంచం గురించి మాట్లాడుకుంటూ త్వరత్వరగా దిగిపోయాం. న్యూజిలాండూ కాలిఫోర్నియాలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆ రెండుచోట్లా భేషజాలు లేని జీవనసరళి, జీవితమంటే నిబద్ధత కనిపిస్తుంది నాకు. స్వేచ్ఛగా ఆరుబయట విహరించడంలో ఆ ప్రాంతాల వారికున్న ఆసక్తి నాకు నచ్చుతుంది. బంజీ జంపింగ్, విండ్ సర్ఫింగ్‌ లాంటి సాహస క్రీడలలో వారికున్న అభినివేశం ముచ్చట గొలుపుతుంది. తలచుకొంటేనే నాకు వెన్నులో వణుకు పుట్టే బంజీ జంపింగ్ క్రీడకు రూపకల్పన న్యూజిలాండ్‌ లోనే జరిగిందట. వీళ్ళిద్దరూ ఆ రెండు చోట్లా నివసించారట. ఇపుడు దక్షిణ అమెరికా యాత్రలో ఉన్నారు. ఇలా ప్రపంచంలోని విభిన్న ప్రదేశాల్లో తిరిగి, పనిచేసి, అనుభవాలు మూటగట్టుకుని చివరికి ఏదో ఒక చోట స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలన్నది వారి ఆలోచన.

దిగుతున్నపుడు మాకో కొత్తరకం పక్షి కనిపించింది. దాన్ని ఇంతకుముందు ఎపుడూ నేను చూసి ఎరుగను. దాన్ని కారంకులేటెడ్ కేరకారా (Carunculated Caracara) అంటారట. చిన్నపాటి గ్రద్ద పరిణామంలో ఉంది. తెల్లచారల ఉదరం, నల్లటి వెన్నుభాగం, ముక్కు దగ్గర ప్రస్ఫుటంగా వ్రేలాడే నారింజరంగు చర్మం – విలక్షణమైన రూపమా పక్షిది. ఆ ప్రాంతాల్లో అది విరివిగా కనిపిస్తూ ఉంటుందట.

ముగ్గురమూ కలసి కేబుల్ కారు స్టేషన్ చేరుకున్నాక ఏదైనా పానీయం కలసి తాగాలనిపించింది. కాఫీని ఎంచుకున్నాం. బిల్లు నేనే కడతానని చెప్పి ఒప్పించాను. వాళ్ళ ఋణం అంత సులభంగా తీరేది కాదని తెలుసు. వాళ్ళే లేకపోతే ఆ నిడుపాటి బండలను అంత సులభంగా దాటగలిగి ఉండేవాడిని గాదు. అంతేగాకుండా ఇలాంటి యువతీయువకుల్ని కలసి మెలగినపుడు నాకు కొత్త శక్తి వస్తుంది. ప్రపంచం మీద అవధులు దాటిన అనురాగం కలుగుతుంది.

ముగ్గురమూ కేబుల్ కారులో క్రిందకు దిగి ఊళ్ళోకి వెళ్ళడానికి టాక్సీ తీసుకున్నాం. ప్లాసా (ప్లాజా) సాన్ ఫ్రాన్సిస్కో అన్న చోట వీడ్కోళ్ళు చెప్పుకున్నాం.


ఆ ప్లాజాకు రెండు నిముషాల నడక దూరంలో ఉన్న సాన్ ఫ్రాన్సిస్కో చర్చి వేపు నాలుగడుగులు వేశాను. 1537-1659ల మధ్య నూట ఇరవై రెండేళ్ళ పాటు నిర్మించిన ఈ చర్చి ఎక్వదోర్ దేశంలోకెల్లా అతి పురాతనమైనది. చర్చి నిర్మించడానికి ముందు ఆ స్థలంలో ఇన్కా చక్రవర్తి వాయ్‌న కపాక్ (Huayna Capac) రాజప్రాసాదం ఉండేదట. స్పానిష్ ఆక్రమణ జరుగుతోన్న సమయంలో, ఓటమి అనివార్యం అని గ్రహించిన కపాక్ కొలువులోని ఒక స్థానిక సైన్యాధికారి ఆ రాజప్రాసాదాన్ని నేలమట్టం చేయించాడట. స్పానిష్ ఆక్రమణదారులు ఆ శిథిలాల మీద ఇప్పటి చర్చినీ కొత్త పట్నాన్నీ నిర్మించారట.

చర్చి లోపల ఎంతో కళాత్మకంగా ఉంది. బంగారు పూత పూసిన అలంకరణలు, చక్కని శిల్పాలు, వర్ణ చిత్రాలు – ఎంతో శోభాయమానంగా ఉందా ప్రాంగణం. కీతో నగరం బరోక్ (Baroque) శైలి వాస్తురీతికి సుప్రసిద్ధం. యూరోపియన్ వాస్తుకళను స్థానిక దేశవాళీ అంశాలతో మేళవించడం ద్వారా కీతో బాణీ బరోక్ శైలి పుట్టింది. ఆ శైలికి ఈ సాన్ ఫ్రాన్సిస్కో చర్చి ఒక చక్కని ప్రతీక.

అప్పటికే మధ్యాహ్నం దాటిపోతోంది. కడుపులో ఆకలి కేకలు మొదలయ్యాయి. రోజంతా ట్రెకింగ్ చేసి బాగా శ్రమించాను కదా – ఆకలి మరింత ప్రస్ఫుటంగా తన ఉనికిని చాటసాగింది. కానీ కీతో పాతపట్నం లాంటి చారిత్రక వారసత్వం నిండిన ప్రదేశాలలో ఉన్నపుడు నేను తీరిగ్గా భోంచేస్తూ సమయాన్ని వృధా చేయను. రెస్టరెంట్లకు వెళ్ళను. ఇలాంటి ప్రదేశాలను చూడటం, అనుభవించడం, అనుభూతిని ఇంకించుకోవడం – వీటికి ఆరుబయట స్థలాలే సరైన వేదికలు. రోడ్లమీది మనుషులే మనకు గురువులు. ఆ సందులుగొందులే మన పాఠశాలలు. ఒక్క మ్యూజియముల విషయంలో మాత్రమే మనం మినహాయింపు ఇవ్వాలి.

ఓ చర్చి ముందు ఒంటరిగా కూర్చున్న ఒక పెద్దవయసావిడ పిండితో చేసిన గోళాకారపు వంటకం, దానికి అనుపానంగా ఏదో తియ్యని పాకమూ అమ్ముతూ కనిపించింది. ఎందుకో ఆ వంటకాలు నన్ను ఆకర్షించాయి. ఒక డాలరు చెల్లించి వాటిని తీసుకొన్నాను. వాటిల్ని చేత్తో పట్టుకొని ఆ పాతపట్నం వీధుల్లో తీరిగ్గా ఆరగిస్తూ మిగిలిన మధ్యాహ్నమంతా గడపడానికి ముందుకు సాగాను.

దారిలో ఒక మొబైల్ షాపు కనిపించింది. ఆగి, ఫోన్‌లో లోకల్ సిమ్ కార్డు వేయించుకున్నాను. నా మొబైల్లో మా యూకే సర్వీస్ ప్రొవైడర్ల ఇంటర్నేషనల్ పాకేజ్ ఉంది. అది ఏభై దేశాలలో నాకు కనెక్టివిటీ ఇస్తుంది. 2022లో మధ్య అమెరికా దేశాలన్నీ తిరిగినపుడు ఆ పాకేజ్ శుభ్రంగా పనిచేసింది. మరి ఎంచేతో ఈ ఎక్వదోర్‌లో దాని ప్రవర్తన ఏ మాత్రం బాగోలేదు. సిగ్నల్ చూస్తే పూర్తి స్థాయిలో ఉంటోంది – కనెక్షన్ మాత్రం రావడం లేదు. అంచేత లోకల్ సిమ్ మార్గం పట్టుకున్నాను. ఇరవై డాలర్లకు పది గిగాబైట్‌ల డేటా ఉన్న సిమ్ కార్డు దొరికింది. నా సమస్యకు పరిష్కారం లభించింది.

అక్కడి సెంట్రల్ ప్లాజాలో నా పచార్లు కొనసాగించాను. ఆ పాతపట్నపు కేంద్ర బిందువా సెంట్రల్ ప్లాజా. దానికి నాలుగువేపులా నాలుగు ఘనమైన భవనాలు ఉన్నాయి: మెట్రోపాలిటన్ కథెడ్రల్, ప్రెసిడెన్షియల్ పాలెస్, ఆర్చ్ బిషప్ నివాసం, సిటీ హాల్. ఆ మెట్రోపాలిటన్ కథెడ్రల్‌కు ఎదురుగా ఒక ఆరుబయలు రంగస్థలం ఉంది. అసలా కూడలి కూడలే ఒక చక్కని పార్కులా శోభిస్తూ ఉంది. స్థానిక ప్రజానీకంతో కలసి ఆ కూడలిలో సమయం గడపడం, ఆ రంగస్థలంలో అందరితోపాటు ప్రదర్శనలు చూడటం – అది కదా యాత్రాభినివేశం అంటే! అలా ఓ అరగంట ఆ ప్రదర్శనలు చూసి అక్కడనించి బయటపడ్డాను.

బయటపడి మెట్రోపాలిటన్ కథెడ్రల్‌కు వెళ్ళి ఆ ప్రాంగణంలో కాసేపు గడిపాను. అది నన్నేమంత ఆకట్టుకోలేదు. ఇది కాదు పని అనుకోని అక్కడి నుంచి ‘ఇగ్నేసియా ద ల కంపానియా ద హేసూస్’ అన్న ఆకర్షణీయమైన చర్చి ప్రాంగణానికి వెళ్ళాను. ఎక్వదోర్ అంతటిలోకీ అతిసుందరమైన చర్చి అని పేరు పొందిన ప్రాంగణమది. కానీ నే వెళ్ళేసరికి అది మూసివేసి ఉంది! పట్టువదలని విక్రమార్కుడిలా అక్కడినుంచి బసీలికా దెల్ వోతో నేషనల్ అన్న కట్టడం దగ్గరకు చేరాను. ఆ కట్టడపు నిడుపాటి స్పైర్ నన్ను బలంగా ఆకర్షించింది. ఎక్వదోర్ దేశంలో మొదటిరాత్రి గైడెడ్ నైట్ టూర్ తీసుకున్నప్పుడు ఆ టూర్ గైడు ఈ బసీలికాను చూపిస్తూ అక్కడి ఆ 73 మీటర్ల స్పైర్ తప్పక ఎక్కమని ఘట్టిగా సిఫార్సు చేసింది. ఆ నిడుపాటి స్పైర్ పుణ్యమా అని ఆ చర్చి ఎక్వదోర్‌ లోకెల్లా ఎత్తయిన చర్చిగా పేరు పొందింది. ఆ చర్చి కట్టడానికి వందేళ్ళకు మించి పట్టిందనీ అది దక్షిణ అమెరికాలోకెల్లా అతి పెద్ద నియో-గోథిక్ శైలి చర్చి కట్టడమనీ వివరించింది గైడు. వందేళ్ళ సంగతి ఎలా ఉన్నా కీతో నగరం ఆ చర్చిని అసంపూర్ణ కట్టడంగానే ఇప్పటికీ ఎప్పటికీ పరిగణిస్తుందట. ఆ చర్చి కట్టడం ముగిసిన వెంటనే ప్రపంచానికి అంతిమ ఘడియలు సంభవిస్తాయని అక్కడివారి నమ్మకం! నే వెళ్ళేసరికి స్పైర్ మీదకు అనుమతించే సమయం గడిచిపోయింది. అది నిరాశ కలిగించినమాట నిజమేగానీ నా కాళ్ళు మాత్రం ‘హమ్మయ్య ఇవాళ కొండల్లో ఎక్కింది చాలు. ఇక ఈ మెట్లు ఎక్కే తిప్పలు తప్పాయి’ అని సంబరపడ్డాయి!

అక్కడో కాఫీ అందిపుచ్చుకుని కాలి నడకన నగరశోధన కొనసాగించాను. ప్రతి వీధిలోనూ ఆకట్టుకొనే భవనాలు కనిపించి ముచ్చట కలిగించాయి. ఓ రోడ్డు పక్క దుకాణంలో టెనిస్‌ బాల్ సైజులో ఏదో తినుబండారం అమ్మడం గమనించాను. దాన్ని ‘బోలోన్ దె వర్దె’ అంటారట. పచ్చ అరటిగుజ్జుతోపాటు చీజూ పోర్కూ కలిపి వేయించిన పదార్థమది. ఒకటి అడిగి పుచ్చుకున్నాను. బాగా కడుపునింపే వంటకమది. ఆ పెద్ద పరిమాణపు వంటకం ఎక్వదోర్‌లో బాగా ప్రాచుర్యమున్న తిండి పదార్థమనీ అక్కడివాళ్ళు దాన్ని జాతీయవంటకంగా పరిగణిస్తారనీ తెలుసుకొన్నాను.

అలా మరో రెండు గంటలపాటు గమ్యమన్నది లేకుండా ఆ వీధుల్లో తిరుగాడాను. గంట ఏడు కొట్టింది. డిన్నరు చేయాల్సిన సమయమది. విస్తా హెర్మోసా అన్నది ఆ ప్రాంతంలోకెల్లా అతి చక్కని రెస్టరెంటని ముందే మా హోటలుకు చెందిన సారా చెప్పింది. వెళ్ళాను. ఆ మేడమీది రెస్టరెంటు పాతపట్నపు సంపూర్ణ దృశ్యాన్ని కళ్ళకు కట్టింది. పట్నంలోని ఎన్నో భవనాలూ లాండ్‌మార్కులూ ఆ దీపాల వెలుగుల్లో చక్కగా కనిపించాయి. సెంట్రల్ ప్లాజా, మెట్రోపాలిటన్ కథెడ్రల్, కొండమీద నెలకొన్న వర్జిన్ మేరీ విగ్రహం, ఊళ్ళోని బసీలికా స్పైరు – అన్నీ ఎంతో చక్కగా కనిపించాయి. చల్లని బీరు తాగుతూ అక్కడ గంటలకు గంటలు గడిపేయవచ్చు. కాకపోతే అది ఎన్నికల సమయమట – ఆల్కహాల్ నిషేధం. ఏదేమైనా ఆ రెస్టరెంటును సిఫార్సు చేసినందుకు సారాకు మనసారా ధన్యవాదాలు చెప్పుకున్నాను.

తేలికపాటి డిన్నరు ముగించి అక్కడి దృశ్యాలు చూస్తూ కూర్చుండిపోయాను. ఎదుటి టేబులు దగ్గర నల్లని కురులూ దక్షిణ ఆసియా రూపురేఖలూ ఉన్న ఓ మహిళ కనిపించింది. మేమిద్దరం సోలో యాత్రికులమని, ఒకే జాతి పక్షులమనీ ఇద్దరికీ ఒకేసారి స్ఫురించింది. ఆమె చిరునవ్వుతో పలకరించి తనను తాను పరిచయం చేసుకుంది. మాటల్లో పడ్డాం. అప్పటికే నా డిన్నరు ముగిసింది కాబట్టి నేను వెళ్ళి ఆవిడ టేబులు దగ్గర కూర్చున్నాను. ఆమె తన ప్రయాణం కొలంబియాలో ఆరంభించిందట. ఇపుడు కీతో నగరం ముగించి గలాపగోస్ ద్వీపాలకు వెళుతోందట. ఆమెవి గుజరాతీ మూలాలు. యూకే పౌరురాలు. లండన్ నివాసి. పేరు నీనా. లండన్ నగరంలో ఫైనాన్షియల్ సెక్టర్లో పనిచేస్తోంది. కొలంబియా గురించి కొన్ని ట్రావెల్ టిప్స్ నాతో పంచుకొంది. తనూ మరో స్నేహితురాలూ కలసి కొలంబియా వచ్చారట. ఆ స్నేహితురాలు కొలంబియాలోనే ఉండిపోయింది. ఈమె ఇలా ఎక్వదోర్ చేరుకొంది. అందరూ అనుకునేట్టు కొలంబియా ప్రమాదాలు నిండిన దేశం కాదని, తనకా దేశంలో ఎంతో క్షేమంగా భద్రంగా అనిపించిందని, అక్కడి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ భేషుగ్గా ఉందనీ చెప్పుకొచ్చింది నీనా. నేనూ కీతో నగరం గురించి కొన్ని టిప్స్ అందించాను.

మా మొదటి కలయికను సెలబ్రేట్ చేసుకోవడానికి కలసి ఏదైనా తాగుదాం అనుకొన్నాం. అవి ఆల్కహాల్ రహిత దినాలు కాబట్టి పళ్ళరసంతో సరిపెట్టుకున్నాం. మరికొద్ది రోజుల్లో మేమిద్దరం గలాపగోస్ ద్వీపాలలో కలుసుకొనే అవకాశం ఉందని ఇద్దరికీ స్ఫురించింది. అక్కడ మళ్ళా కలుసుకొని కలసి భోజనం చేద్దామని నిర్ణయించుకున్నాం.

మర్నాటి ఉదయం నగరానికి దక్షిణాన ఉన్న కొతోపాక్సీ నేషనల్ పార్క్‌లోని అగ్నిపర్వతాలనూ, అక్కడే ఉన్న కిలతోవా సరోవరాన్నీ చూడాలన్నది నా ప్రణాళిక. అంచేత మెల్లగా ఆనాటి సంఘటనలనూ కలసిన మనుషులనూ జ్ఞప్తికి తెచ్చుకుంటూ మా హోటలు చేరాను.

చక్కని రోజు. ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు సంభవించిన రోజు. మరోసారి మరోసారి జీవితం నాకు అందిస్తోన్న ఆనందాలకు కృతజ్ఞుడనై ఉండాలనీ, లేనివాటి కోసం వాపోవడం తగదనీ నాకు నేను చెప్పుకున్నాను.

(సశేషం)