అక్టోబర్ 18, 2022.
ట్రెక్ మొదలుపెట్టి మూడవరోజు, నామ్చే బాజార్‌లో ఎక్లమటైజేషన్ కోసం ఆగిన రెండవ రోజు. నిన్నంతా ఎవరెస్ట్ వ్యూ హోటల్‌కు వెళ్ళడం, ఓలాఫ్ వాళ్ళ ప్రాజెక్టు ప్రాంగణం చూడటం – కాస్తంత హడావిడిగానే గడిచింది. ఇవాళ అలాంటి పనులేమీ పెట్టుకోలేదు. బృందపు సభ్యులందరం ఒకరినొకరు పలకరించుకొంటూ, ఒకరినొకరు తెలుసుకుంటూ ఉల్లాసంగా గడిపాం. ఆ వత్తిడి లేని వాతావరణం మా అందరికీ బాగా ఉపకరించింది – ముఖ్యంగా అనిత, ఉమలకు.
అపరిచిత వ్యక్తులు కలుసుకున్నప్పుడు వారి మధ్య కనిపించని అడ్డుగోడలు ఉంటాయి. సంకోచాలూ బిడియాలూ ఉంటాయి. అవి దాటుకుని సంభాషణ కొనసాగించడానికి నిత్యజీవితంలో కాస్తంత సమయం పడుతుంది. ఒక్కోసారి అలాంటి సంభాషణ జరగకనే పోవచ్చు. కానీ ఒక బృందం దేశం కాని దేశంలో మొదటిసారి కలుసుకుని నిత్యజీవితంలో తలపెట్టని లక్ష్యాలూ గమ్యాలకేసి సాగిపోతున్నప్పుడు ఈ బిడియాలూ సంకోచాలూ ఎంత త్వరగా సమసిపోతే అంత మంచిది. అపుడే ఆ బృందం ఒక్కతాటిన నడవగలుగుతుంది.
మా గ్రూప్‌లోని గోపి, విజయ్, మోహన్ మనుషుల్ని కలుపుకొని చేరువ చేసుకోవడంలో గొప్ప సహజ ప్రావీణ్యం కలవాళ్ళు. అడ్డుగోడలన్నిట్నీ అవలీలగా పడగొట్టి, సభ్యులంతా ఒకరితో మరొకరు అరమరికలు లేకుండా మాట్లాడేలా చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. సమయస్ఫూర్తితో హాస్యస్ఫూర్తిని మేళవించి దాన్ని అందరికీ సమపాళ్ళలో పంచి బృందంలోని వాళ్ళంతా క్షణాల్లో గలగలా మాట్లాడుకునేలా చెయ్యగలరు. వెరసి మర్యాదల ముసుగులన్నీ పక్కనపెట్టి అందరం ఒకే కుటుంబంలా వ్యవహరించడం ఆ నామ్చే బజార్‌లో రెండవరోజున జరిగిపోయింది. మాలోని శాంతగంభీరులు సింహం, తిరు, రాఘవ్, మనోజ్ తమదే అయిన మౌనప్రశంసతో ఈ కలివిడి ప్రక్రియ సాగిపోవడానికి తమ వంతు సాయం చేశారు.
అనిత ఉమల దగ్గరకొస్తే వాళ్ళు మా బృందానికి కొత్తవాళ్ళు. అంతే కాకుండా మాతో ట్రెకింగ్ చేస్తోన్న మొట్టమొదటి మహిళలు. ఈ మహిళలు అన్నది మరో పెద్ద గాజుగోడ. అది బాగా పెద్ద గోడే అయినా వాళ్ళిద్దరూ దాన్ని లెక్క చేయలేదు; దాన్ని రెండు కోణాలనుంచి పరిష్కరించుకొంటూ వచ్చారు. ముందుగా మహిళలమైనంత మాత్రాన శక్తి సామర్థ్యాలలోనూ పట్టుదలా సాహసాలలోనూ తాము ఎవరికీ తీసిపోమని తమకు తాము చెప్పుకున్నారు. నమ్మకం తెచ్చుకున్నారు. అలా తమను తాము నమ్మిన ఆ మహిళలిద్దరూ మెలమెల్లగా తమ ఉనికి మిగతా బృందానికి ఏ మాత్రం ఇబ్బంది కాదు, అవరోధం కాదు – నిజానికదో విలువైన అంశం, ఎసెట్ – అన్న విషయాన్ని అందరికీ స్పష్టపరచగలిగారు. మాటలతో కాకుండా తమ చేతలతో ఆ విషయం నిరూపించగలిగారు. తాము మహిళలు కాబట్టి తమను ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదన్న సంగతి అందరికీ తెలియవచ్చేలా మసలుకోగలిగారు. వెరసి రెండే రెండు రోజుల స్వల్పకాలంలో జెండర్ సంకోచం అన్నది అందరి మనసుల్లోంచీ అవలీలగా తొలగిపోయింది. మిగిలిన వాళ్ళంతా వాళ్ళిద్దరినీ తమతో సరిసమానులైన వ్యక్తులుగా పరిగణించసాగారు. నా వరకూ నాకు ఈ పరిణామం గొప్ప ఉపశమనం.
ఇలాంటి పరిణామమే మా బృందంలోని మరో వర్గపు సభ్యులతో కూడా, మేము నామ్చే బాజార్‌లో ఎక్లమటైజేషన్ కోసం గడిపిన రెండు రోజుల్లో జరిగింది. మాది స్థూలంగా ఏభై ఐదేళ్ళు నిండిన యు.కె. వైద్యుల బృందం. బృందం విస్తరించి సభ్యుల సంఖ్య 23కు చేరినపుడు అందులో నలభై ఏళ్ళకు అటూ ఇటూగా ఉన్న యువ ఐటీ నిష్ణాతుల వర్గమొకటి రూపొందింది. వాళ్ళకీ మాకూ వృత్తి పరంగాను, వయసు పరంగానూ సారూప్యం లేదు. ఆ వృత్తి–తరాల అంతరాన్ని దాటడానికి ఈ విరామసమయం దోహదపడింది. కనిపించీ కనిపించని అగడ్తలూ అవరోధాలూ దాటుకుని అందరమూ ఒకేలా ఆలోచించి ఒకేలా స్పందించడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒకే గమ్యం ఒకే లక్ష్యం ఒకే స్ఫూర్తి అయినపుడు కంటికి కనిపించే అంతరాలను మనసులు అవలీలగా దాటగలవని ఆ రెండు రోజులూ మరోసారి నిరూపించాయి. అందరమూ ఒకే బృందం అన్న సంఘీభావన ఎవరూ చెప్పనవసరం లేకుండానే ప్రతి ఒక్కరిలోనూ చోటు చేసుకుంది. పరస్పర విశ్వాసాలు, చెదిరిపోయిన సంకోచాలు, సమసిన బిడియాలు – ఇదంతా చూసి ఆ బృందపు బాధ్యత ఉన్న వ్యక్తిగా నా మనసు సంతోషంతో నిండిపోయింది. సభ్యులంతా ఒకే రీతిలో ఆలోచించి ప్రవర్తిస్తారనీ వారిని ఏకతాటిన నడిపించడం నల్లేరు మీద బండి నడక అనీ నాకు నమ్మకం చిక్కింది. భౌతికంగా పరిసరాలకు అలవాటు పడడానికి తీసుకున్న ఎక్లమటైజేషన్ విరామసమయం బృందం బృందమంతా మానసికంగా దగ్గర అవడానికి కూడా చక్కగా దోహదపడిందన్నమాట!
మా టీహౌస్‌లో నింపాదిగా భోజనం ముగించాక కొంతమంది మిత్రులతో కలసి నామ్చే బాజార్ ఊరు చూడటానికి వెళ్ళాను. టూరిస్టులతో కళకళలాడుతోన్న పట్టణపు ముఖ్యమార్గాలను విడిచిపెట్టి సన్నపాటి సందుల్లోకి మళ్ళి ఊళ్ళో వాళ్ళ ఇళ్ళూ వాకిళ్ళు, వాళ్ళ వాళ్ళ పచారీ దుకాణాలూ ఉండే ప్రాంతాలకి చేరుకున్నాను. మార్కెట్ వీధిలో సందడి సందడిగా ఉంటే ఈ ఊరి వాళ్ళ నివాసప్రాంతాలలో జీవితం నింపాదిగా సాగిపోవడం గమనించాను. ఊరి ఊపిరినీ నాడినీ పట్టుకోగలిగాననిపించింది. ఎంత నింపాదిగా ఉన్నా ఆ నింపాదితనంలోనే శాంత సౌందర్యం కనిపించి సంతోషపెట్టింది. ఊరంతా లోయలో ఉంది. కొన్నికొన్ని రంగురంగుల ఇళ్ళు కొండచరియల మీదకు ఎగబ్రాకుతున్నాయి. ఆ చరియల వెనుక హిమశిఖరాల నేపథ్యం – అంతా సరళ సౌందర్యం.
ఊరి మూలాలు చూడటం కట్టిపెట్టి మళ్ళా పట్టణపు మెయిన్ బజారు దగ్గరకు చేరుకున్నాం. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి షెర్పా మహిళ పసంగ్ లాము షెర్పా స్మారక చిహ్నం ఒకటి కనిపించిందక్కడ.
చీకట్లు కమ్ముకోసాగాయి. చుట్టూ అలుముకున్న మసక వెలుతురు. సుదూరాన అస్తమయ సూర్యకిరణాల సాయంతో ధగధగా మెరిసిపోతోన్న కాంగ్డే శిఖర దృశ్యం కళ్ళకూ మనసుకూ విందు చేసింది. అక్కడున్న నామ్చే బేకరీలో ఓ కేకు ముక్కా కప్పుడు కాఫీ అందిపుచ్చుకున్నాం. మరి నామ్చే బాజార్ అంటే ప్రపంచంలోని ట్రెకర్లందరినీ ఏకం చేసే ప్రదేశం గదా – అక్కడ బేకరీలూ కేకుల సంస్కృతి సహజంగానే నెలకొని ఉంది. ఎవరైనా ఏమైనా ట్రెకింగ్ పరికరాలు కొనాలంటే అవి దొరికే చిట్టచివరి ప్రదేశం ఈ నామ్చే బాజార్. దొరకడమే గాదు – మొక్కవోని నాణ్యత అక్కడి పరికరాలది!
రాత్రి ఎనిమిదయింది. చలి పంజా విప్పడం మొదలెట్టింది. మా హోటల్‌కి చేరి వెచ్చని నిద్రాసుఖం అనుభవించే సమయమది…
నేపాల్ చేరుకుని నాలుగు రోజులు గడిచాయి.
లుక్లాలో ట్రెకింగ్ మొదలెట్టి మూడు రోజులు గడిచాయి.
నాలుగో రోజు ఉదయం, అక్టోబర్ 19న, బాగా పొద్దున్నే మా నడక ఆరంభించాం. ఆనాటి మా గమ్యం దెబోచె గ్రామం. తెన్గ్‌బోచె గ్రామం మీదుగా సాగిపోయే ఆనాటి మా బాటలో మేము చేరుకొనే అత్యున్నత స్థానం 3870 మీటర్ల ఎత్తున ఉంటుంది. అంతా కలసి పదకొండు కిలోమీటర్ల నడక.
రోజూ చేసే వ్యాయామం మోహన్ నాయకత్వంలో ముగించుకుని అంతా మా హోటల్ ప్రాంగణంలోంచి బయట పడ్డాం. మేమున్నది నామ్చే లోయలో. ముందుకు సాగాలంటే ఆ లోయలోంచి బయటపడాలి. మెట్లు మెట్లుగా ఉన్న కాలిబాట సాయంతో అందరం అందులోంచి బయటకు సాగాం. వచ్చేపోయే ట్రెకర్లను పెద్దగా పట్టించుకోకుండా తమ రోజువారీ కార్యకలాపాలలో నిమగ్నమై పోయి వున్న స్థానికులు అడపాదడపా మాకు కనబడుతూనే ఉన్నారు. వారి బతుకు వారిది… మా గమ్యం మాది! రాత్రి నామ్చే బాజార్‌లో బస చేసిన ట్రెకర్లందరూ ఒకే గమ్యం కేసి దాదాపు ఒకే సమయంలో నడక ఆరంభించేసరికి ఆ మెట్ల మీద కాస్తంత వత్తిడీ కించిత్తు తొక్కిసలాటా సహజంగానే సంభవించాయి. అందరమూ పరిణత యాత్రికులమే గాబట్టి ఆ వత్తిడి శ్రుతి మించకుండా చూసుకోగలిగాం.
వత్తిళ్ళ సంగతి ఎలా ఉన్నా మా బృందానికి సంబంధించిన మరో విషయం నాకు సంతోషం కలిగించింది. మా అందరి మూలాలూ భాషా ఒకటే అయినా ఇపుడు మేమంతా ఏడేడు దేశాలలో స్థిరపడిన వాళ్ళం. మూడంటే మూడే రోజుల్లో ఆ ఇరవై ముగ్గురు సభ్యులూ ఒకే కుటుంబానికి చెందిన వారిలా కలసిమెలసి సంతోషసంబరాల్లో మునిగితేలుతోంటే ఎవరికైనా సంతోషం కలుగుతుంది. బృందపు సారథిగా నాకు రెట్టింపు సంతోషం కలిగింది. అనితా ఉమా మిగిలినవాళ్ళందరినీ ఎప్పట్నించో ఎరిగినట్టుగా వ్యవహరించడం, మిగతా వాళ్ళంతా వీళ్ళను కొత్తగా చేరిన వాళ్ళుగా గాకుండా అలవాటయిన పాత సభ్యులుగా పరిగణించడం – ఇదంతా ఎంతో సహజంగా జరిగిపోవడం – ఓహ్ – జట్టు ఇంత కలసికట్టుగా ఉంటే బేస్ కాంపే కాదు; ఎవరెస్టయినా ఎక్కేయగలం అనిపించింది.
నామ్చే లోయను అధిగమించి దాని అంచులు చేరుకోగానే అందరం రెండు నిమిషాలు వెనక్కి తిరిగి చూశాం. లోయకు రంగులద్దుతూ ఉదయపు ఎండలో మెరిసిపోతోన్న నామ్చే బాజార్ పట్టణం దివ్యమనోహరంగా కనిపించి పలకరించింది. రంగురంగుల ఇళ్ళు, ఎండలో మెరిసిపోతోన్న వాటి పైకప్పులు, వృక్షాలతో పచ్చగా వెలుగుతోన్న కొండచరియలు, ఆ దృశ్యానికి చక్కని నేపథ్యం అద్దుతూ కాంగ్డే హిమ శిఖరం – మరపురాని దృశ్యమది. ఈబీసీ ట్రెక్ గురించి ఆలోచన రాక ముందే నామ్చే బాజార్ గురించి ఎంతో విని ఉన్నాను. అంచేత ఆ ఊళ్ళో అడుగు పెట్టినప్పుడు ఎవరో పాత స్నేహితుడిని పలకరించినట్లు అనిపించింది. అక్కడ రెండు రాత్రులు గడపడం ఏ ట్రెకర్‌కైనా అపురూప అనుభవం. ఆ అనుభవం నాకు దక్కింది. పేరు పొందిన పర్వతారోహకులు తమతమ రచనలలో నామ్చే బాజార్ గురించి ఎంతో ఘనంగా చెప్పడం నేను గమనించాను. వారందరి అనుభవాలూ నా వ్యక్తిగత అనుభవమూ కలగలసి గొప్ప అనుభూతికి కారణమయ్యాయి.
కాస్తంత ముందుకు సాగాక జంట శిఖరాల మౌంట్ థామ్‌సెర్కు మా కంటబడింది. ఆరువేల ఆరువందల మీటర్లు ఎత్తున్న పర్వతమది. ఇలాంటి ప్రసిద్ధి చెందిన గిరిశిఖరాలన్నీ మనం అంతకుముందే పదే పదే చూసిన వాటి ఛాయాచిత్రాల పుణ్యమా అని మన ఊహాల్లోనూ మనసుల్లోనూ ఒక విశిష్ట ఆకృతితో ముద్ర వేసుకుని నిలిచిపోతుంటాయి. కానీ ఆ పర్వతాల సన్నిధిలో నిలబడినపుడు మనకు కనిపించే వివరాలూ దృశ్యాలూ వేరుగా ఉంటాయి. ఏ పర్వతమయినా అనేక బృహత్‌శిలల కలయిక. పెద్ద పెద్ద పర్వతాలు ఒక శిఖరానికే పరిమితం కాకుండా కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంటాయి. మనకు ఫొటోల్లో కనిపించే శిఖరాలను మాత్రమే చూసి అదే ఆ పర్వతం అనుకోగూడదు. ఆ పర్వతసీమల్లో తిరుగాడుతున్నప్పుడు ఆయా పర్వతాలను ముందు వెనుకలనుంచి, కుడి ఎడమలనుంచీ విభిన్నకోణాల్లో విభిన్నభంగిమల్లో మనం చూడగలుగుతాం. అప్పుడే ఆ పర్వతపు సంపూర్ణ స్వరూపం మనకు తెలిసి వస్తుంది. థామ్‌సెర్కు విషయంలో మాకు అదే జరిగింది. మాంజో గ్రామం పరిసరాల్లో మొదటిసారి చూసినపుడు అది ఒక గొగ్గురు మూపురం అనిపించింది. ఇపుడీ నామ్చే బాజార్ లోయ అంచున నిలబడి దగ్గరగా చూస్తున్నపుడు ఆంగ్ల అక్షరం M లాగా రెండు స్పష్టమైన శిఖరాలతో భాసిల్లిందా జంట శిఖరాల థామ్‌సెర్కు పర్వతం.
ఈ పర్వతాల రంగులు కూడా వివిధ సమయాల్లో వివిధ రకాలుగా మనకు కనబడతాయి. సూర్యోదయ సమయంలో నారింజరంగు కలసిన పసిడి వర్ణం, మధ్యాహ్న సమయంలో మచ్చ లేని ధవళ వర్ణం, సూర్యాస్తమయ సమయంలో ధగధగల బంగారు వర్ణం… క్రమక్రమంగా అరుణారుణ గిరిశిఖరం! మళ్ళా రాత్రిపూట వెన్నెల్లో చూస్తే తెలుపు కలగలసిన నీలాల రాశి – హిమాలయాల సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించాలంటే వాటిని రోజురోజునా పూటపూటనా చూస్తూ ఆ భిన్నదృశ్యాలను మనసులో నిక్షిప్తం చేసుకోవడం ఉత్తమమార్గం.
ట్రెకింగ్ యాత్రల్లో గైడ్‌లూ పోర్టర్‌ల పాత్ర, వారి ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ గిరిపుత్రులు అందించే సహాయం, సహకారం వెలకట్టలేనివి. వాళ్ళతో స్నేహంగా వ్యవహరించడం, వారిని మన బృందంలో సభ్యులుగా పరిగణించగలగడం మన యాత్రానుభవాన్ని ఎంతగానో సంపన్నపరుస్తుంది. భిన్నభాషా సంస్కృతులకు చెందిన వాళ్ళవడం వల్ల వారితో సమభావం సాధించి వ్యవహరించడానికి కాస్తంత సమయం పడుతుంది. కానీ ఒక్కసారి ఆ కరచాలనం జరిగితే వాళ్ళంతా యాత్రాపరంగా సాయపడటమే కాకుండా తమ తమ విస్తృత అనుభవాలను కథలూ గాథలుగా మనతో పంచుకోవడం కూడా మొదలు పెడతారు. హృదయాలు పరచి మనముందు ఉంచుతారు. అదిగో ఆ స్థాయికి అందరం చేరగలిగితే అదే యాత్ర అనూహ్యమైన అదనపు అనుభవాలూ అనుభూతులను అందించగలుగుతుంది.
స్వతహాగా నాకు మనుషుల్ని పలకరించి మాట్లాడటమంటే ఇష్టం. ఆ ఇష్టంవల్లనే కాబోలు ఆ పని నేను ఎంతో సులువుగా చేయగలను. రెండ్రోజులు గడిచేసరికల్లా మా గైడ్‌లూ పోర్టర్‌లూ ఇతర సహాయకులూ నాకు స్నేహితులైపోయారు. కబుర్లు సాగాయి. ఆ కబుర్ల మధ్య మాతోబాటు వస్తోన్న పోర్టర్లలో కొంతమంది, 28సార్లు ఎవరెస్ట్‌ను ఎక్కిన మహాపర్వతారోహకుడు కామీరితా షెర్పా లాంటివాళ్ళతో వారి వారి సాహసయాత్రల్లో కలసి పనిచేశారని తెలిసింది. అది విని గగుర్పాటు తప్పలేదు. నామ్చే బాజార్ పరిసరాలు దాటినపుడు మా బాబూ గురంగ్, దగ్గరలోని థామె అన్న గ్రామానికి దారి తీస్తున్న కాలిబాట చూపించాడు. ఆ థామె గ్రామానికి చెందిన వ్యక్తేనట కామీరితా షెర్పా!
అపా షెర్పా అన్న ప్రఖ్యాత పర్వతారోహకునిది మరింత ఘనమైన చరిత్ర. అతనూ ఈ థామె గ్రామానికి చెందిన మనిషే. మొదట్లో వంటమనిషిగాను, పోర్టర్‌గానూ తన జీవితారోహణ ఆరంభించాడు అపా షెర్పా. ఆ క్రమంలో 1990లో అతనికి మొట్టమొదటిసారి ఎవరెస్ట్ శిఖరం చేరుకునే అవకాశం దొరికింది. అంతే – ఇక వెనక్కి తిరిగి చూడలేదు. 1990-2011 మధ్య, ఇరవై ఒక్కేళ్ళ వ్యవధిలో మొత్తం 21సార్లు ఎక్కి దిగాడు – అంటే సగటున ఏడాదికి ఒకసారన్నమాట! ‘వాళ్ళావిడకు 2011కల్లా పర్వతారోహణ విరమిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి అపా షెర్పా ఎవరెస్ట్ ఎక్కడం ఆపాడుగాని, లేని పక్షంలో ఇంకెన్నో సార్లు ఎక్కగలిగేవాడు’ అన్న వివరం అందించాడు గురుంగ్. ఎవరెస్టంటే భార్యకు ఇచ్చిన మాట ప్రకారం పక్కన పెట్టాడేగానీ ఆ మరుసటి ఏడాదే 2012లో హిమాలయాలు మొత్తం 1700 కిలోమీటర్ల పాటు కాలినడకన చుట్టి వచ్చే సాహసయాత్రకు నాయకత్వం వహించాడు అపా షెర్పా! బహుశా ప్రపంచంలోకెల్లా అతి కష్టమైన ట్రెక్ అదే అయి ఉండాలి…
థామె గ్రామపు ఘనత కామీరితా, అపా షెర్పాలకే పరిమితం కాలేదు; టెన్సింగ్ నార్గేకూ ఆ గ్రామంతో అనుబంధం ఉందట. అతని చిన్నతనంలో కొంతకాలం థామెలో గడిపాడు. వాళ్ళ కుటుంబం టిబెట్‌కు చెందినది. జడల బర్రెల పాలన వారి ముఖ్య వృత్తి. ఆ బర్రెల బృందాలను వేసుకుని టిబెట్–సోలు ఖుంబు ప్రాంతాల మధ్య ఏ అడ్డంకీ లేకుండా తిరుగుతూ ఉండేవాకుటుంబాలు. టిబెట్ మీద చైనా దేశం పట్టు బిగించడం మొదలయాక ఆ కుటుంబాల వారికి టిబెట్-నేపాల్‌ల మధ్య స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకపోయింది. నార్గే వాళ్ళ కుటుంబం సోలు ఖుంబు ప్రాంతానికి తరలి వచ్చేసి మొదట థామె గ్రామంలోనూ ఆ తర్వాత తెన్గ్‌బోచెలోనూ స్థిర పడ్డారు. అలా నార్గే బాల్యంలో కొంతకాలం థామెలో గడిచింది.
పెరిగి పెద్దయ్యాక నార్గే డార్జిలింగ్‌లో స్థిరపడ్డాడు. టిబెట్‌కు చెందిన షెర్పాలు ఎందరో ఆ రోజుల్లో అలా డార్జిలింగ్‌లో స్థిరపడ్డారు. అలా అతనికి మూడు దేశాలతో అనుబంధం కుదిరింది; పుట్టిన టిబెట్, చిన్నప్పటి నేపాల్, స్థిరపడ్డ భారతదేశం. ఎడ్మండ్ హిలరీతో కలసి ఎవరెస్ట్ ఎక్కిన మొదటి వ్యక్తిగా అతని పేరు మారుమోగాక నార్గే మా వాడంటే మా వాడని మూడు దేశాలూ పోటీపడ్డాయి. చివరికి అతను నేపాలీ ఇండియన్ అని స్థిరపడింది. ఎవరెస్ట్ ఎక్కిన మరుసటి ఏడాది, 1954లో, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ టెన్సింగ్ నార్గేను డార్జిలింగ్‌లో ఏర్పడ్డ హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు డైరెక్టర్‌గా నియమించి భావి పర్వతారోహకులకు శిక్షణ ఇచ్చే బాధ్యత అప్పజెప్పాడు. అలా నార్గేకూ నెహ్రూకూ జీవితపర్యంతపు స్నేహం కుదిరింది. మాన్ ఆఫ్ ద ఎవరెస్ట్ అన్న తన ఆత్మకథలో టెన్సింగ్ నార్గే తన జీవన పరిణామక్రమాన్ని చక్కగా చెప్పుకొస్తాడు. కొండలలో కూలీగా మొదలెట్టి సాహస యాత్రికుల బరువులు మోసిన తాను చివరికి అనేకానేక పతకాలతో బరువెక్కిన కోటును ఎలా ధరించవలసి వచ్చిందో, అణాలూ పైసలూ లెక్కబెట్టుకునే తాను క్రమక్రమంగా విమానాల్లో తిరుగుతూ ఆదాయపు పన్ను బాపతు దిగుళ్ళను ఎలా మోయవలసి వచ్చిందో హృద్యంగా చెప్తాడు నార్గే.
ఇలా టెన్సింగ్ నార్గే, కామీరితా లాంటి వాళ్ళ కథలు ప్రపంచానికి తెలియవచ్చాయి కానీ అజ్ఞాతంగా ఉండిపోయిన వందలాది షెర్పాల గురించి వినే ఓపిక మనకు ఉంటే ఈ హిమాలయాలు ఎన్ని కథలైనా చెప్పగలవు అని వ్యాఖ్యానించాడు బాబు గురంగ్. ఆ మాట నిజమే. నార్గే లాంటి వాళ్ళ హీరోచిత గాధలు ప్రపంచంలోని అన్ని దేశాల పర్వతారోహకులకూ ప్రేరణ ఇస్తోన్న మాట నిజమే కాని, ఈ వందలాది వేలాది అనామక షెర్పాలే లేని పక్షంలో ఏ సాహస యాత్రా సఫలం కాలేదు అన్నది అంతే విలువైన వాస్తవం. తమకేమాత్రం పరిచయం లేని సాహసికుల కోసం ఈ గిరిపుత్రులు తమ ప్రాణాలు ఒడ్డి బాటలు సుగమం చేస్తారు. దారి పొడవునా ప్రాణాధారాలైన తాళ్ళను బిగిస్తారు. మంచు అగడ్తలను దాటడానికి నిచ్చెనలు అమరుస్తారు. ఆ ప్రక్రియలో ప్రాణాలు పోవచ్చని తెలిసినా వెనుకాడరు. వారి వృత్తి నిబద్ధతనీ సేవానిరతినీ ఎంత ప్రశంసించినా తక్కువే! మా విషయమే తీసుకుంటే మాది ఇరవై ముగ్గురున్న బృందం అంటున్నామేగానీ అది పాక్షిక సత్యం. నిజానికి మాది 49 మంది సభ్యులున్న బృందం. ఆరుగురు గైడ్‌లు, ఇరవైమంది పోర్టర్లు లేని పక్షంలో మేము ఎవరెస్ట్ బేస్ కాంప్ దాకా చేరడమన్నది ఒట్టి మాటే!
ఎవరెస్ట్ అధిరోహణలు, పర్వతారోహణ సాహస యాత్రల గురించి ఆలోచనలో పడ్డ నాకు సహజంగానే మా చిన్నప్పటి షీరో బచేంద్రిపాల్ గుర్తొచ్చింది. హిలరీ నార్గేలు ఎవరెస్ట్ ఎక్కిన మరుసటి ఏడాదే, 1954లో ఉత్తర కాశీలో పుట్టారామె. 1984లో ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళగా ప్రపంచమంతటినుంచీ ఆమె నీరాజనాలు అందుకొంటున్నప్పుడు నాకు పదిహేనేళ్ళు. ఆమె సాధించిన విజయం వేలాదిమంది భారతీయ మహిళలు తమ ఇంటి గడపదాటి సాహస క్రీడల్లో పాల్గొనేలా చేసింది. మగవారికి మేమేమీ తక్కువ కాదు అన్న ఆత్మస్థైర్యం వారిలో నింపింది. ఒక పక్క సమాజమూ మరో పక్క తమకు తాము విధించుకున్న నిబంధనలను, పరిమితులను దాటుకొని అనేక రంగాలలో ముందడుగు వెయ్యడానికి స్ఫూర్తినిచ్చింది. ఎంతో చిన్న స్థాయినుంచి ఎదిగి అత్యున్నత శిఖరాలను జయించిన ఆమె గాథ ఎంతోమంది సామాన్య మహిళలకు ప్రేరణ కలిగించింది.
మా నడక దూధ్‌కోసీ నదీ మార్గంలో పైన్, జూనిపర్ వృక్షాల నడుమన సాగింది. ఆ ప్రక్రియలో ఎత్తులు ఎక్కడం దిగడం సర్వసామాన్యమైపోయింది. దారిలో చిన్న చిన్న షెర్పా గ్రామాలు కనిపించాయి. కాబేజ్, కాలీఫ్లవర్, బంగాళాదుంప అక్కడ విరివిగా పండటం గమనించాం. అమా దబ్లమ్, థామ్‌సెర్కు, కుంబీలా, తబోచె శిఖరాలు అడపాదడపా పలకరించసాగాయి.
దూధ్‌కోసీ నదిని వంతెన మీదుగా దాటుకుని ఫుంకీ థంగా అన్న చిన్న గ్రామం చేరుకున్నాం. అక్కడ నది ఒడ్డున భోజనానికి ఆగాం. అందమైన ప్రదేశం. కాళ్ళు కాస్తంత జాపుకుని కాసేపు విశ్రాంతి తీసుకోడానికి ఎంతో అనువైన ప్రదేశం. వేగంగా పారే నీళ్ళు – వాటికి అడ్డంగా నిలబడే రాతి బండలూ కలగలసి చేస్తోన్న గలగల శబ్దాలు చెవులకు ఇంపుగా ఉండి మనసుకు హాయిని సమకూర్చసాగాయి. అలసటా వత్తిళ్ళను తగ్గించసాగాయి. నిజమే – ప్రకృతి అతి చక్కని సంగీతకర్త. ప్రకృతి సంగీతాలాపన చేస్తున్నపుడు మనం మౌనం వహించి సర్వాంగాలతోనూ ఆ సంగీతాన్ని ఆవాహన చేసుకోవాలి. అలా చేసుకోగలిగితే ఆ ముద్ర మనసులోంచి చెరిగిపోదు. సుదూర ప్రదేశాలకు రోజుల తరబడి ట్రెక్ చేసే పని పెట్టుకున్నపుడు ప్రకృతి కూడా మన కళ్ళకూ చెవులకూ మనసుకూ తన సౌందర్య రాగాలాపన వినిపించడం ఆరంభిస్తుంది. మామూలు కంటికి ఎంతో సాధారణంగా కనిపించే ప్రదేశాలే ఒకోసారి మన మనసుల్ని శ్రుతి చేసి, మధుర నేపథ్యసంగీతం అందించి, దానినొక మరువలేని అనుభవంగా మలచడం నేను చాలాసార్లు గమనించాను.
అక్కడ మాకు మళ్ళా అరవింద్ వాళ్ళు కనిపించారు. కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. వాళ్ళ పాపల్ని చూస్తే నాకు మా అమ్మాయిలు గుర్తొచ్చారు. బాబూ గురంగ్ అప్పటికే మా బృందమంతటికీ భోజనం ఆర్డర్ చేసేసి ఉన్నాడు. అయినా మాలో కొంతమందిమి ఆర్డర్ చేసిన దాల్‌భాత్‌కు తోడుగా అరవింద్ బాగా సిఫార్సు చేసిన మిరప తునకల రామెన్ నూడిల్స్ ఆర్డర్ చేశాం. అరవింద్ వాళ్ళు ఉండే కాలిఫోర్నియాలో నాణ్యమైన రామెన్ నూడిల్స్ దొరికే జపనీస్ రెస్టరెంట్లు బాగా ఉన్నాయి. ఆ నాణ్యతా ప్రమాణాలనుంచి వచ్చిన అరవింద్ సలహాను మరో ఆలోచన లేకుండా మేమంతా అనుసరించాం. తీరా చూస్తే ఆ రెస్టరెంటు వాళ్ళు మాగీ నూడిల్స్ మీద మిరప తునకలు జల్లి అందించారు! మరి ఈ మాగీ నూడిల్స్‌ను అరవింద్ రామెన్ నూడిల్స్‌గా ఎలా పొరబడ్డాడా అని ఆశ్చర్యం కలిగింది.
మధ్యాహ్నమయింది గదా – ఉష్ణోగ్రత పెరిగింది. ఉక్కపోత కూడా మొదలయింది. ఎప్పుడన్నా మేఘాలు గొడుగు పట్టినపుడు కాస్తంత సులువుగా అనిపించసాగింది. దానికి తోడు నదీగర్భాన ఉన్న మేమంతా సుష్టుగా భోజనాలు ముగించిన వెంటనే బాగా ఎగువకు నడవాల్సి వచ్చింది. నడక కఠిన పరీక్షగా మారింది. పరిసరాల సౌందర్యం గ్రహించే వెసులుబాటు లేకుండా పళ్ళ బిగువున నడక సాగించాం. అయినా దూరాన మబ్బుల మాటునుంచి కనిపిస్తోన్న కాంటేగా హిమశిఖరం మా దృష్టిని దాటిపోలేదు. మా బృందంలో ఒక సభ్యుడు ఆ దృశ్యాన్ని శివుని వాహనమయిన నందీశ్వరుడితో పోల్చాడు. పరీక్షగా చూస్తే ఆ శిఖరం మేఘాల మధ్య కూర్చుని ఉన్న నందీశ్వరుడిలానే అనిపించింది.
మరొక్కమారు కఠినారోహణం చేసి కాస్తంత పొద్దువాలిన వేళ ఆ ప్రాంతాలలో బాగా పేరుపొందిన తెన్గ్‌బోచె బౌద్ధారామం చేరుకున్నాం. సోలు ఖుంబు ప్రాంతంలోకెల్లా అతి పెద్ద బౌద్ధారామం అది. పదహారవ శతాబ్దపు బౌద్ధ ఆచార్యులు స్వాంగా దోర్జీ తన పాదముద్రలు ఆ ఆరామంలో వదిలి వెళ్ళాడని స్థానిక ప్రజల నమ్మకం.
ఆ ప్రాంగణమంతా టిబెటియన్ శైలిలో పరిపూర్ణంగా అలంకరించబడి ఉంది. బుద్ధ భగవానుడి జీవిత ఘట్టాలకు చెందిన చిత్రపటాలు గోడల మీద అమర్చి కనిపించాయి. పద్మాసనపు బుద్ధవిగ్రహం ఎదుట ఉంచిన పాత్రలలోంచి జూనిపర్ ధూమం వెలువడుతోంది. అక్కడి బౌద్ధ భిక్షువులంతా తమ తమ దైనందిన కార్యకలాపాలను ముగించడం గమనించాం. సాయం సమయపు ప్రార్థనా కార్యక్రమాలు అప్పటికే ముగిశాయి. మేమంతా ఆ ప్రాంగణంలో కూర్చుని భక్తి శ్రద్ధలతో కొద్ది సేపు గడిపాం. మా శరీరాలకూ మనసుకూ విరామమిస్తూ ధ్యానంలో మునిగాం.
ఆ ఆరామంలో అరవైమంది భిక్షువులు ఉంటున్నారట. కొంతమంది స్థానిక బాలురకు అక్కడ తర్ఫీదు ఇస్తున్నారట. టెన్సింగ్ నార్గేను కూడా భిక్షువుగా శిక్షణ పొందడానికి అతని చిన్నతనంలో ఇక్కడికి పంపారట. అతనికది రుచించలేదన్నది వేరే మాట.
ఎవరెస్ట్ శిఖరారోహణకు వెళ్ళే బృందాలన్నీ ఈ తెన్గ్‌బోచె ఆరామాన్ని దర్శించి ఆశీర్వచనాలు అందుకోవడమన్నది ఎప్పట్నించో వస్తోన్న ఒక సంప్రదాయం. ఏ దేశానికి చెందిన పర్వతారోహకుల బృందమైనా స్థానిక షెర్పాలను తమ బృందంలో చేర్చుకోకుండా ఎవరెస్ట్ వేపు సాగరు. ఆ షెర్పాలందరికీ ఎవరెస్ట్ పర్వతం పవిత్రభూమి. ఆ శిఖరం మీద కాలుమోపడమంటే అది వారి దృష్టిలో ఒక అనుచిత కార్యం. అంచేత తెన్గ్‌బోచె ఆరామం దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవడం వారు చేసే కనీసమైన పని. వారికి ఈ ఆనవాయితీ తప్పడమన్న ప్రసక్తే లేదు. ఆ షెర్పాలతోపాటు వారిని తమతో చేర్చుకున్న దేశ విదేశ బృందాల వారూ ప్రార్థనలు చేయడం ఆశీస్సులు తీసుకోవడం అన్నది ఒక తిరుగులేని సంప్రదాయమయింది.
ఆ సాయంకాలం పూట మేమంతా ఆ ఆరామంలో ప్రార్థనలు ముగించుకుని బయటకు వచ్చేసరికి ఎవరెస్ట్, లోత్సె శిఖరాలు పలకరించాయి. అస్తమిస్తోన్న సూర్యుడు ఆ శిఖరాల మీద బంగారు రంగులు విరజిమ్మసాగాడు. శిఖరాల మీదే గాకుండా వాటికి అటూ ఇటూ ఉన్న మేఘాల మీదా తన చిత్రకళను ప్రదర్శించసాగాడు. ఆ మేఘాల బంగారపుటంచుల నడుమనుంచి తొంగిచూస్తోన్న స్వర్ణశిఖరాల దివ్యదృశ్యం మా అందరి మనసులనీ రాగరంజితం చేసింది. మాటల అవసరం లేకుండా ఒకరినొకరం కళ్ళతో పలకరించుకొని సంతోషం వ్యక్తపరచుకున్నాం. గత నాలుగు రోజుల్లో ఎవరెస్టును చూడటం మాకది నాలుగోసారి. అయినా మేఘాలు ఆ శిఖరాలను కమ్ముకుపోయేదాకా అలా చూస్తూ ఉండిపోయాం. ఎనిమిదివేల మీటర్లకు మించిన ఆ రెండు శిఖరాలనూ తమతమ స్వర్ణరూప వైభవంతో చూడగలగడం ఆ రోజు అందిన అపురూప కానుక అనిపించింది. రోజంతా కొండ నడక వల్ల కలిగిన అలసట చేత్తో తీసేసినట్టయింది.
ఆనాటి మా గమ్యం దెబోచె గ్రామం – ఇంకో అరగంట నడక. దిగుడు దారి. దారంతా రోడోడెండ్రన్ వృక్షాలు… కమ్ముకుంటోన్న చీకటిలో ఆ రోడోడెండ్రన్ వృక్షాల నడుమ అరగంట నడవాల్సి వచ్చింది. చీకట్లు జయించడానికి మా హెడ్‌లైట్లను తలకు బిగించుకోవలసి వచ్చింది!
దెబోచె గ్రామంలో పట్టుమని పది ఇళ్ళు లేవు. అక్కడ మేము బస చేసిన టీ హౌస్ పేరు హోటల్ రివెండల్. అతి చిన్న గ్రామంలో ఉన్నప్పటికీ ఆ హోటల్లో కనీస సౌకర్యాలకు కొదవ లేదు. గబగబా స్నానాలు చేసి అందరం డిన్నర్ కోసం డైనింగ్ హాలు చేరుకున్నాం. అన్నట్టు మా ఆ నడక దారిలో నేను చేసిన చిట్టచివరి స్నానమది. మరో వారం తర్వాత ఖాట్మండూ చేరాకగానీ మళ్ళా స్నానం చేసే అవకాశం దొరకలేదు!
అంతా కలుపుకుని మేమారోజు 430 మీటర్లు ఎగువకు చేరుకున్నాం. దెబోచె గ్రామం 3870 మీటర్ల ఎత్తున ఉంది. మేం బయల్దేరిన నామ్చే బాజార్ ఎత్తు 3440 మీటర్లు.
ఐదో రోజు ఉదయం అందరం మా హోటల్ డైనింగ్ హాల్లో కలిశాం. ఆనాటి మా గమ్యం 4410 మీటర్ల ఎత్తున ఉన్న తెన్గ్‌బోచె గ్రామం. పది కిలోమీటర్ల దూరం. నడక ఆరంభించే ముందు బాబూ గురంగ్ ఆనాటి మా దారి వివరాలు చెప్పుకొచ్చాడు. నాలుగువేల మీటర్ల ఎత్తున ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయో వివరించాడు.
రోడోడెండ్రన్ అడవుల గుండా మా నడక కొనసాగింది. ఆ వృక్షాలు ఫిబ్రవరి – ఏప్రెల్ నెలల్లో గులాబీరంగు పూలతో నిండిపోయి ఉంటాయట. ఆ పూవు నేపాల్ దేశపు జాతీయ పుష్పం. నేపాల్ అనేగాకుండా ఈ వృక్షం పాకిస్తాన్ నుంచి థాయ్‌లాండ్ దాకా ఎన్నో దేశాల పర్వత ప్రాంతాల్లో విరివిగా కనిపిస్తుంది. భారతదేశపు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఇది రాష్ట్ర వృక్షం; నాగాలాండ్‌కు రాష్ట్ర పుష్పం. పూలు పూసే కాలంలో ఎంతో మనోహరంగా ఉండే ఆ వృక్షం ఆ అక్టోబర్ నెలలో పూల సంగతి అటుంచి ఆకుల్ని కూడా రాల్చివేసి కనిపించింది. కొమ్మలన్నీ నాచుతో నిండి ఉన్నాయి. మళ్ళా ఒక్కో కొమ్మా దిట్టంగా, చిన్నపాటి చెట్ల పరిమాణంలో ఉన్నాయి. మొత్తానికి ఆ రోడోడెండ్రన్ అడవిలో ఉదయపు పొగమంచులో నడవటం వింతగా భయావహంగా తోచింది.
3500 మీటర్లనుంచి 4000కు చేరువ అవుతున్నపుడు వృక్షజాలంలో చెప్పుకోదగ్గ మార్పు కనిపించింది. వెండి రంగు కోనిఫర్ వృక్షాలు, భూర్జ వృక్షాలు, జూనిపర్ పొదలు – పొట్టిపాటి రెడోడెండ్రాన్ చెట్లు; మొత్తానికి పెద్ద చెట్ల స్థానంలో చిట్టి చెట్లు, పొదలు చేరుకున్నాయన్నమాట.
దారిలో మాకు ఇమ్జా ఖోలా నది తటస్థపడింది. అక్కడ ఉన్న ఉయ్యాల వంతెన మీదుగా నదిని దాటాం. ఖుంబు గ్లేషియర్ జలధారలతో ఏర్పడిన ఇమ్జా షో అన్న సరోవరం ఈ ఇమ్జా ఖోలా నది జన్మస్థానం. ఇది దూధ్‌కోసీ నదికి ఉపనది. నిన్న మేము దాటివచ్చిన తెన్గ్‌బోచె గ్రామం దగ్గర దూధ్‌కోసీ నదిలో కలుస్తుంది. మళ్ళా ఆ దూధ్‌కోసీ అన్నది ఆ హిమాలయ సీమలో ఉన్న సప్తకోసీ నదులలో ఒకటి. ఈ ఏడు పాయలూ కలసి కోసీ నదిగా రూపు దిద్దుకుంటాయి. అలా రూపు దిద్దుకున్న కోసీ నది బీహార్ రాష్ట్రంలో గంగానదితో సంగమిస్తుంది.
మరికాస్త దూరం వెళ్ళాక 6812 మీటర్ల అమా దబ్లమ్ శిఖరం మా ముందు నిలచింది. హిమాలయ పర్వతశ్రేణుల్లో అందమైన శిఖరాలలో అమా దబ్లమ్ ఒకటి. టిబెట్ వారి భాషలో అమా దబ్లమ్ అంటే ‘అమ్మ మెడలోని హారం’ అని అర్థమట. పేరుకు తగిన సుందరాకృతి ఆ శిఖరానిది. అటూ ఇటూ సాగిన పంక్తులు అమ్మ చేతులు. మధ్యలో శిఖరం అమ్మ మెడలోని నగకు ఉన్న లాకెట్. దేవుడి బొమ్మలు ఉన్న బిళ్ళల నగను (దబ్లమ్) ఇక్కడి షెర్పా స్త్రీలందరూ ధరిస్తారు. హెచ్చుతగ్గులు లేని శంకువు ఆకారం, రెండు వేపులా అమ్మ తెరచిన బాహువుల్లాగా సరళ సుందరంగా దిగువకు దిగి వచ్చే కొండచరియలు, ఆ చరియల్లో నిక్షిప్తమై ఎండకు వెండి రాసుల్లా మెరిసే గ్లేషియర్లు – చూడ చక్కని శిఖరమది. యూరప్‌నుంచి వచ్చే పర్వతారోహకులు ఈ శిఖరాన్ని ఆల్ప్స్ పర్వత శ్రేణిలోని మాటర్‍హార్న్ శిఖరంతో పోల్చి మాటర్‍హార్న్ ఆఫ్ హిమాలయాస్ అంటూ ఉంటారు. నేను ఈ రెండు శిఖరాలనూ చూశాను. నన్నడిగితే ఆ యూరప్ శిఖరాన్నే ఆమా దబ్లమ్ ఆఫ్ స్విట్జర్లాండ్ అనడం సబబు అంటాను.
మేమంతా మెల్లగా ఒక కొండ చరియ పైకి ఎక్కడం ఆరంభించాం. ఆ అధిరోహణ మమ్మల్ని ఇమ్జా ఖోలా నదీ తీరానికి చేర్చింది. కాస్త దూరాన బుద్ధుని విశాలనేత్రాలు చిత్రించి ఉన్న స్తూపం ఒకటి కనిపించింది. ఆ కళ్ళు మాకేసి నిశితంగా చూస్తున్నట్లుగానూ, చూసి ఆశీర్వదిస్తున్నట్లుగానూ అనిపించింది. ఆ మొత్తం దృశ్యాన్ని చూడటానికి మా కళ్ళు చాలవనీ అనిపించింది. ఎదురుగా విశాలనేత్రాల స్తూపం, నేపథ్యంలో అందాలొలికే అమా దబ్లమ్ శిఖరం, నడుమన నురగలు గక్కుతూ సాగిపోతూన్న ఇమ్జా ఖోలా నది – పిక్చర్ పోస్ట్‌కార్డుల్లో కనిపించే సుందర దృశ్యమది. ఇలాంటి దృశ్యాలే అమా దబ్లమ్‌కు ప్రపంచంలోకెల్లా అతి సుందరమైన శిఖరం అన్న ఖ్యాతిని సమకూర్చిపెట్టాయి. కళ్ళు తిప్పుకోలేని సౌందర్యమా శిఖరానిది!
ఏదైనా పేరుపొందిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనమంతా ఒక పొరపాటు చేస్తూ ఉంటాం: ఆ ప్రదేశాన్ని గురించి అతిగా ఊహించుకోవడమే ఆ పొరపాటు. ఈ అత్యూహ తరచూ నిరాశకు హేతువవుతుంది. నాలాగా ఊహలకు రెక్కలు తొడిగే అత్యూహాశీలులకు ఈ నిరాశ తరచూ అనుభవంలోకి వచ్చేదే! కానీ హిమాలయాల్లో తిరుగాడినపుడు ఇలాంటి నిరాశలకు ఆస్కారమే లేదు. మనం ఎంత ఊహించుకొని వెళ్ళినా ఆ పర్వతాల నడుమ నిలబడి చూస్తే కనిపించే వాస్తవ సౌందర్యం ఊహలను మించిపోయి దర్శనమిస్తుంది. చేష్టలుడిగి మాటలు మరచి అలా చూస్తూ ఉండిపోతాం. ఆ శిఖరాల రాజస సౌందర్యం వర్ణనాతీతమని గ్రహిస్తాం.
మధ్యాహ్నానికల్లా పంగ్బోచె అన్న షెర్పా గ్రామం చేరుకున్నాం. ఆ ఊళ్ళోని పదహారో శతాబ్దపు బౌద్ధారామం పక్కగా సాగాం. ఈ పంగ్బోచె ఆరామం ఖుంబు ప్రాంతం అంతటికే పురాతనమైనదట. ఖేచర శక్తులు ఉన్న సాంగ్వా దోర్జీ అన్న లామా ఈ గొంపాను నిర్మించాడన్నది స్థానిక ఐతిహ్యం. అక్కడ సంచరించే యెతి ఒకటి అక్కడి మంచు గుహలో ధ్యానం చేస్తోన్న దోర్జీ లామాకు ఆహారమూ నీళ్ళూ అందించిందట. అలా అందిస్తూ అందిస్తూ ఆ యెతి కూడా బౌద్ధ మత అనుయాయిగా మారిందట. దోర్జీ లామా అనుచరిగా పరిణమించిందట. ఆ యెతి పుర్రె, చేతి ఎముక అక్కడి ఆరామంలో భద్రపరచి ఉన్నాయంటారు.
యెతి గురించిన కథలూ గాథలూ హిమాలయాల ఐతిహ్యంలో విడదీయలేని భాగాలు. ‘వానర రూపపు మంచుమనిషిని కళ్ళారా చూశాం’ అన్న ప్రత్యక్ష కథనాలు స్థానికుల నోటి నుంచీ యాత్రికుల నోటి నుంచీ తరచూ వినిపిస్తూ ఉంటాయి. యెతి చూపిన ఔదార్యం గురించి ఒక వేపునా క్రౌర్యం గురించి మరో వేపునా ఎన్నెన్నో కథనాలు హిమాలయ ప్రాంతంలోనే గాకుండా వాటి వెలుపల కూడా తరతరాలుగా వ్యాపించి ఉన్నాయి. కొన్ని పర్వతారోహణ బృందాలు యెతి పాదముద్రల ఛాయాచిత్రాలు ప్రజానీకానికి చూపించడమూ జరిగింది. స్థూలంగా పాశ్చాత్య ప్రపంచంలో యెతి అన్నది గర్హించదగ్గ ప్రాణి. అలా ఆ ప్రాణిని చిత్రిస్తూ సాహిత్యం వచ్చింది. సినిమాలు వచ్చాయి. వీడియో గేమ్‌లు కూడా వచ్చాయి. ఏదేమైనా యెతి అన్న విషయాన్ని స్థానికులు ఎంతో బలంగా నమ్ముతారు. ఆ నమ్మకాన్ని కొంతమంది అంతర్జాతీయ నిపుణులు బలపరచడమూ జరిగింది. అయినా యెతి ఉనికి గురించి ఇప్పటికీ ఖచ్చితమైన ఋజువులు లభించలేదు.
పంగ్బోచె గ్రామం అమా దబ్లమ్ శిఖరారోహణకు పూనుకొనే బృందాలకు బేస్ కాంప్‌గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఊళ్ళో నింపాదిగా సాగిపోతోన్న జనజీవితాన్ని చూసుకుంటూ అందరం ఊరు దాటి ముందుకు సాగాం. ఆ తర్వాత వచ్చిన మరో చిరు గ్రామం షొమారెలో లంచ్ కోసం ఆగాం. అక్కడ అరవింద్ కుటుంబం మరోసారి కనిపించింది. వాళ్ళను కలుసుకోవడం మాకు అదే తుదిసారి అని తెలిసింది. ఆ తర్వాత వాళ్ళవీ మావీ మార్గాలు వేరయ్యాయి. విడివడే ముందు మా అందరినీ కాలిఫోర్నియాలోని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు అరవింద్. మేమూ అదే ఆహ్వానాన్ని అతనికి అందించాం. మళ్ళా మన మార్గాలు రాబోయే రోజుల్లో మరో కొత్త పర్వత మార్గంలో కలవాలని అంతా మనసారా కోరుకున్నాం.
మరికొన్ని గంటలపాటు ఇమ్జా ఖోలా నది పైతట్టు ప్రాంతం వేపుగా మా నడక సాగించాం. ఖుంబు గ్లేషియర్‌నుంచి వస్తోన్న ఖుంబు ఖోలా అన్న చిరునది వచ్చి ఇమ్జా ఖోలాలో సంగమించే బిందువుదాకా మా నడక సాగింది. ఈ నదీ సంగమస్థలాలకు భారత ఉపఖండంలో గణనీయమైన ప్రాముఖ్యతా పవిత్రతా ఉన్నాయి. ఎక్కడో పుట్టిన నదులు మైళ్ళ కొద్దీ ముందుకు సాగి మరో నదీప్రవాహంలో సంగమించడమన్నది భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికంగానూ ముఖ్యమైన ఘట్టం. మన పరిమితులు దాటుకొని, అహాలు విస్మరించి, ఉమ్మడి ప్రయోజనం కోసం ఉనికినే కోల్పోవడమన్నది చిన్న విషయం కాదు. అలాంటి సంగమ స్థలాల్లోకి వెళ్ళినపుడు మనమూ ఆలోచనలోపడతాం – మనమెంత? మన ఉనికి ఎంత?!
ఆ సంగమస్థలం నుంచి మరో అరగంట కొండ చరియల్ని అధిరోహించి దెన్గ్‌బోచె లోయలోకి ప్రవేశించాం. అక్కడినుంచి లోత్సె శిఖరం ఎంతో చక్కగా కనిపించింది. మనమింతకు ముందు చెప్పుకున్న ప్రపంచంలోని ఎనిమిదివేల మీటర్ల ఎత్తును దాటిన పధ్నాలుగు శిఖరాల్లో లోత్సె ఒకటి. ఎవరెస్టుకు బాగా పక్కనే ఉన్న సహోదరి శిఖరం ఈ లోత్సె.
(సశేషం)