షాంగ్రి-లా – 1

షాంగ్రి-లా — ఈ మాట మొదటిసారి నేనెప్పుడు విన్నానూ?

బహుశా విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్ చదువుతున్న రోజుల్లో – సుమారు నలభై యేళ్ళ క్రితం…

ఊరో చిన్నపాటి దేశమో – అది హిమాలయాల నడిమధ్యన ఉందనీ, బయటివాళ్ళకి వెళ్ళిరావడం దాదాపు అసాధ్యమనీ, నిత్యయవ్వనులైన స్త్రీ పురుషులు కొద్దిమంది మాత్రమే అక్కడ ఉంటారనీ, వాళ్ళంతా అలెగ్జాండర్ కాలంలో వచ్చి స్థిరపడిన యవనులు అనీ – టీనేజి వయసు కదా, ఊహలకు రెక్కలు రావడం ఎంతసేపూ? గ్రీకు గుర్రాలను ఎగిరేలా చేయడం ఎంతసేపూ?!

తర్వాత చాన్నాళ్ళకి జేమ్స్ హిల్టన్ రాసిన ‘లాస్ట్ హొరైజన్’ అన్న 1934 నాటి క్లాసిక్ నవల చదివాను. చదవగానే దానికి వీరాభిమానినయ్యాను. నే విన్న షాంగ్రి-లా అన్నది ఈ నవలలో చెప్పుకొచ్చిన ఊహాలోకపు స్వర్గసీమ అని బోధపడింది. హిమాలయాల నడుమ ఉండటం సంగతి ఎలా ఉన్నా – నవలలో షాంగ్రి-లా సూక్ష్మవివరాలు చదివిన చాలామంది ఆ ప్రదేశం నిజంగానే మంచుకొండల మధ్య ఉందని నమ్మేసారు. బయట ప్రపంచంతో ఏ సంబంధమూ లేని ఆదర్శలోకం అని నమ్మారు. వనరులకు లోటు లేదనీ, అక్కడి వారంతా నిత్యయవ్వనులనీ, మేధావులనీ, వందలాది సంవత్సరాలు జీవించే చిరకాల జీవులనీ, అక్కడ అన్ని వేళలా గొప్ప సంతోషం వెల్లివిరుస్తుందనీ నవల చెప్పింది. పాఠకులు నిజమని నమ్మారు. అదిగో ఆ నమ్మకమే వడపోతలకూ అతిశయోక్తులకూ గురియై మా ఇంటరు నాటి గ్రీకు గుర్రాలను ఎగరవేసిందన్నమాట.

కాలక్రమేణా, నేపాల్ యాత్రలు 2005లో ఆరంభించాక, ఆ దేశపు ఉత్తర సరిహద్దుల్లో, టిబెట్‌కు చేరువలో ఉన్న ఎగువ ముస్తంగ్ గురించి విన్నాను. చైనా వారి 1959 ఆక్రమణకు ముందు టిబెట్ ఎలా ఉండేదో ఆ సంప్రదాయసీమను ఇప్పటికీ చూడాలంటే ఎగువ ముస్తంగ్ సరి అయిన ప్రదేశం అని విన్నాను. 1933లో ఓ నవలాకారుని ఊహల్లో ప్రాణం పోసుకున్న షాంగ్రి-లాకు సజీవరూపం ఈ ఎగువ ముస్తంగ్ అనిపించింది. అప్పటికే నేను చదివి ఉన్న నేషనల్ జియోగ్రాఫిక్ వారి ఎగువ ముస్తంగ్ వ్యాసాలూ, చదివిన లాస్ట్ హొరైజన్ నవల, విన్న టిబెట్ స్థానికుల కబుర్లూ కలబోసుకుంటే – ‘అవును, ఇవన్నీ షాంగ్రి-లా అన్న భావనకు దగ్గరగా ఉన్నాయి. నిజజీవితంలో షాంగ్రి-లా చూసి రావాలంటే ఎగువ ముస్తంగ్ చేరుకోవడమే ఉత్తమం’ అన్న ఆలోచన మొలకెత్తింది. అప్పటికే ఆ షాంగ్రి-లా అన్న కాల్పనిక భావన హోదాకు హిమాలయాలలోనూ, వాటి బయట కూడానూ పదుల కొద్దీ ప్రదేశాలు తహతహలాడుతున్నాయని తెలిసినా నా ఆలోచన ఎగువ ముస్తంగ్ దగ్గర స్థిరంగా నిలచిపోయింది.

2023 అక్టోబర్‌లో అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్‌కు వెళ్ళడానికి ముందు సాటి యాత్రా రచయిత, అనువాదకుడు దాసరి అమరేంద్ర ‘నేపాలీ మండూకం సాహసాలు’ అన్న పుస్తకం ఇచ్చారు. ప్రముఖ నేపాలీ రచయిత కనకమణి దీక్షిత్ రచనకు అనువాదమది. అందులో భక్తప్రసాద్ అన్న యువ మండూకం ప్రబలమైన యాత్రాకాంక్షతో నేపాల్ నలుమూలలా తిరిగి వస్తాడు. పోర్టర్లు, కంచర గాడిదలు, జడల బర్రెలు, లారీలు, విమానం అతని రవాణా సాధనాలు. అతను వెళ్ళివచ్చిన ప్రదేశాలలో లోమాన్‌థాంగ్ అన్నది దుర్భేద్యమైన ప్రదేశం. ప్రపంచంతో సంపర్కం లేని ప్రదేశం. సాంస్కృతికంగా పూర్వ విలక్షణతలు పుష్కలంగా మిగిలి ఉన్న ప్రదేశం.

తీరా చూస్తే ఈ లోమాన్‌థాంగ్ ఉన్నది ఎగువ ముస్తంగ్‌లోనే! అంటే ఇదేనన్న మాట నేను ఎదురు చూస్తోన్న షాంగ్రి-లా…


అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ అన్నది నేపాల్‌లోని లమ్‌జోంగ్ జిల్లా ముఖ్యపట్టణం బేసిషహర్‌లో మొదలై, అన్నపూర్ణ పర్వతశ్రేణిలోని శిఖరాలను అర్ధవృత్తాకార మార్గంలో పలకరించి, పశ్చిమాన ఉన్న జోమ్‌సోమ్ అన్న పట్టణంలో పది పన్నెండు రోజుల తర్వాత ముగిసే పాదయాత్ర.

ఆ జోమ్‌సోమ్ అన్నది ముస్తంగ్ జిల్లా ముఖ్య పట్టణం. నేపాల్‌లోని 77 జిల్లాల్లో ముస్తంగ్ ఒకటి. ఈ ముస్తంగ్ జిల్లాలో ఉత్తర భాగాన్ని అప్పర్ ముస్తంగ్ అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం అన్నపూర్ణ ధౌళగిరి శిఖరాల నీడలో ఉంది. ఈ ఎగువ ముస్తంగ్‌లోని ప్రముఖ జనావాసం లోమాన్‌థాంగ్ – మన షాంగ్రి-లా!

లోమాన్‌థాంగ్ చేరుకోవడం అంత సులభం కాదన్నది అందరూ అనే మాట. మన నేపాలీ మండూకం భక్తప్రసాద్ కూడా అదే చెప్పాడు. జోమ్‌సోమ్ మీదుగా వెళ్ళాలి. జోమ్‌సోమ్ పట్టణం చేరుకోవడం కూడా అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అన్నపూర్ణ ట్రెక్‌లో ఎలానూ జోమ్‌సోమ్ చేరుతున్నాం కాబట్టి, దాన్ని ఒక అవకాశంగా మలచుకుని ఆ ట్రెక్ ముగిసాక రెండు మూడు రోజులు జోమ్‌సోమ్ నుంచి లోమాన్‌థాంగ్ వెళ్ళి వస్తే ఎలా ఉంటుందీ అనిపించింది. క్షణాల్లో అది సంకల్పంగా ఘనీభవించింది. అలా ప్లాన్ చేసాను. అన్నపూర్ణ సహట్రెకర్లతో ట్రెక్ మొదలవక ముందే ఆ ఆలోచన పంచుకున్నాను. కొంతమంది ఉత్సాహం చూపించారు. మొత్తం ప్రణాళికలో మూడురోజులు నా షాంగ్రి-లా కోసం కేటాయించాను. అలా ద డై వజ్ కేస్ట్!


అనుకున్న ప్రకారం అన్నపూర్ణ ట్రెక్ ముగించాక మా బృందంలోని వాళ్ళంతా జోమ్‌సోమ్ నుంచి విమానాలు పట్టుకుని తమ తమ గమ్యాలకేసి సాగిపోయారు. వారిలో కొంతమంది ఎగువ ముస్తంగ్ గురించి ఆసక్తి చూపించినా అందుకు అవసరమైన గవర్నమెంటు పర్మిషన్లు తెప్పించుకోవడానికి సమయం లేకపోవడంవల్ల వాళ్ళు మాతో రాలేకపోయారు. అంచేత దాదాపు అందరూ జోమ్‌సోమ్ నుంచి తిరుగు ప్రయాణం ఆరంభించేసారు. ఎగువ ముస్తంగ్ యాత్రకు నేను, ఆప్తమిత్రుడు సోమేశ్, మాతోపాటు అన్నపూర్ణ ట్రెక్‌కు వచ్చిన మా గైడు రేషమ్ – ముగ్గురం మిగిలాం. ఈ రేషమ్ అన్నపూర్ణ ట్రెక్‌లోనే గాకుండా 2022 నాటి ఎవరెస్ట్ బేస్ కాంప్ ట్రెక్‌కు కూడా ముఖ్యమైన గైడ్‌గా వ్యవహరించిన మనిషి. అనుభవజ్ఞుడు. స్నేహశీలి. పదేళ్ళ క్రితం ఒక ట్రెకింగ్ టీమ్‌తో లోమాన్‌థాంగ్ వెళ్ళివచ్చిన మనిషి. అన్నట్టు 1992 వరకూ ఎగువ ముస్తంగ్ ప్రాంతం టూరిస్టులకు అందుబాటులో ఉండేదిగాదు. పదేళ్ళ క్రితం రేషమ్‌వాళ్ళు వెళ్ళినపుడు కూడా లోమాన్‌థాంగ్‌కు రోడ్డు లేదు. ఇపుడు పరిస్థితి మారిందనీ, చివరిదాకా జీపులు వెళ్ళే సౌకర్యం అమరిందనీ రేషమ్ భరోసా ఇచ్చాడు.

సోమేశ్‌ నాకు బాగా పాతకాపు. వృత్తిపరంగా వైద్యుడు. పదేళ్ళ క్రితం ఆస్ట్రేలియాకు నివాసం మార్చేదాకా సోమేశ్‌వాళ్ళ కుటుంబం మాకు దగ్గర్లోనే ఉంటూ ఉండేది. మాది లండన్ శివార్లలోని న్యూబెరీ అయితే వాళ్ళది స్విండన్ – వారం వారం కలుస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళావిడ సుధ, మా హేమ కూడా మంచి స్నేహితులు. దానికి తోడు మాకు ఉన్నట్టు వాళ్ళకీ కవల ఆడపిల్లలు; నలుగురిదీ ఒకే వయసు. అలా మా జీవనయానం ఒకే బాణీలో సాగిందన్నమాట. వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్లిపోయినా మా మధ్య సంపర్కం సడలలేదు. కానీ కలసి గడిపింది చాలా తక్కువ. అన్నపూర్ణ ట్రెక్‌లో దాదాపు రెండు వారాలు కలసి ఉన్నా అంతమంది మధ్య మాకు మాదంటూ దొరికిన సమయం ఎంతో తక్కువ. ‘సంపర్కలేమి’ అన్న లోటు లోటుగానే ఉండిపోయింది. ఈ మా షాంగ్రి-లా యాత్ర ఆ లోటును బాగా పూడ్చగలదన్న నమ్మకం ఇద్దరికీ సంతోషం కలిగించింది.


ముందే చెప్పుకున్నట్టు ముస్తంగ్ జిల్లా నేపాల్ – టిబెట్ సరిహద్దు ప్రాంతం; లోమాన్‌థాంగ్‌ నుంచి పదిపదిహేను కిలోమీటర్లు వెళితే టిబెట్ చేరుకుంటాం. నిజానికి ఈ ఎగువ ముస్తంగ్ ప్రాంతం హిమాలయ పర్వత శ్రేణికి ‘అవతలి వేపున’ ఉంది. అంటే ఆ మహాపర్వత శ్రేణిని దాటుకొని వెళ్ళాలన్నమాట. అప్పటిదాకా హిమాలయాల కోసం ఉత్తరం వేపున చూసే మనం ఎగువ ముస్తంగ్‌లో దక్షిణాన ఉన్న జోమ్‌సోమ్ వేపు చూడాలన్నమాట. ఈ దక్షిణం వేపు చూడాలన్న భావన భారత ఉపఖండంవాళ్ళకి మనసులో ఇంకడం కష్టం. వాస్తవానికి ఎగువ ముస్తంగ్ అన్నది – అది రాజకీయంగా నేపాల్‌కే చెందినా, భౌగోళికంగా సముద్రతలానికి 13000 అడుగుల ఎత్తున ఉన్న టిబెట్ పీఠభూమికి చెందిన భాగం. అందుకే ఇప్పటికీ బయటవాళ్ళకు అంతగా తెలియదు. నేపాలీ గైడ్‌లకు కూడా పరిచయం లేని ప్రదేశం. రేషమ్‌లాంటివాళ్ళు అందుకు అరుదైన మినహాయింపు. వెరసి మనమనుకొనే ఆధునికత అక్కడ ఇంకా అడుగు పెట్టలేదు. మోటారు వాహనాల నీడ కూడా అరుదుగా తప్ప సోకని నిర్మల పురాతన జీవన విధానం ఇంకా అక్కడ నిలచి ఉంది. పేరుకు నేపాల్ దేశానికి చెందినా అక్కడ నివసించేది టిబెటియన్లే. విస్తీర్ణం రీత్యా నేపాల్ జిల్లాల్లో అయిదో స్థానం; మన గోవాకు సమానం. జనాభా అంతా కలసి పదిహేను వేలు.

చరిత్ర పరంగా చూస్తే ఎగువ ముస్తంగ్ ప్రాంతం ఆరువందల సంవత్సరాలపాటు ‘కింగ్‌డమ్ ఆఫ్ లో’ అన్న రాజ్యంగా మనుగడ సాగించిన దాఖలాలు కనిపిస్తాయి. 1380లో అమెపాల్ అన్న వ్యక్తి ఆ రాజ్యాన్ని స్థాపించాడు. 1795లో ఆ రాజ్యం, పొరుగున ఉన్న పెద్దన్న – నేపాల్ రాజ్యం కబళింపుకు గురి అయింది. సామంత రాజ్యమే అయినా కింగ్‌డమ్ ఆఫ్ లో స్వతంత్ర ప్రతిపత్తిని నేపాల్ రాజులు గుర్తించి గౌరవించారు. 1959లో చైనా దేశం టిబెట్‌ను తనలో కలుపుకున్నప్పుడు ఈ ప్రాంతం టిబెట్ గెరిల్లాలకు స్థావరమయింది. అమెరికా సీఐఏ వారి మద్దతూ ఆ గెరిల్లా బృందాలకు లభించింది. 1972లో నిక్సన్ చైనా పర్యటన తర్వాత సీఐఏ మద్దతుకూ గెరిల్లా బృందాలకూ కాలదోషం పట్టింది. నేపాల్ రాజ్యంలో భాగంగా ఉంటూనే, వారి అదుపాజ్ఞలలో ఉంటూనే 2008 దాకా కింగ్‌డమ్ ఆఫ్ లో తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకొంది. 2008లో నేపాల్ దేశం రాచరికాన్ని వదిలి ప్రజాస్వామ్య దేశంగా రూపొందాక సహజంగానే ఈ రాజ్యమూ ఆ ప్రజాస్వామ్యాన్ని వరించవలసి వచ్చింది. అలా వరించినా ఇప్పటికీ అక్కడి ప్రజలు తమ రాజును గౌరవిస్తారు. అభిమానిస్తారు. అన్నట్టు 1380లో అమెపాల్ స్థాపించిన రాజవంశం – అదే వంశీకుల పాలనలో 2008 దాకా కొనసాగింది. 2008 దాకా రాజుగా వ్యవహరించి 2016లో మరణించిన జిగ్మె డోర్జె పల్బరీ బిస్తా ఆ రాజ్యపు చిట్టచివరి రాజు.


జోమ్‌సోమ్‌లో మేమంతా ఉన్న హోటల్ విమానాశ్రయానికి బాగా దగ్గర – అంతా కలసి కిలోమీటరు దూరం కూడా ఉండదు. మా వాళ్ళంతా ఆ విమానాశ్రయం నుంచి తమతమ గూళ్ళకు ఎగిరి వెళ్ళిపోయాక నేను మరికొంత సమయం అక్కడ గడిపాను. చిన్న విమానాశ్రయం. ఉదయపుటెండ పరిసరాలను ప్రకాశవంతం చేస్తోంది. వాతావరణం చల్లగా ఉన్నా ఇబ్బందికరంగా లేదు. మంద్రంగా వీస్తోన్న గాలి… ఎయిర్‌పోర్ట్‌కు ఎంతో చేరువలో ఉన్నట్టు అనిపించే నీల్‌గిరి హిమల్ శిఖరం పరిసరాలను ప్రభావితం చేస్తోంది. ఆ నీలిశిఖరం నీడలో ఉన్న విమానాశ్రయం మరింత శోభాయమానంగా కనిపించి నన్ను బాగా ఆకట్టుకొంది. ఆ దృశ్యాన్ని చూస్తూ అలా చాలాసేపు ఉండిపోయాను.

ఎగువ ముస్తంగ్ ప్రాంతానికి వెళ్ళడానికి నేపాల్ ప్రభుత్వపు అనుమతులు తప్పనిసరి. ఖాట్మండూలోని మా ట్రావెల్ ఏజెంటు సూర్య ఆ అనుమతులన్నీ ముందే సంపాదించి మా షాంగ్రి-లా యాత్రకు రంగస్థలం సిద్ధం చేసాడు. ఆ అనుమతుల రుసుము కాస్త భారీగానే ఉంది – 500 డాలర్లు. పది రోజులకు పర్మిషను.

రేషమ్‌ను మాతో వెంటబెట్టుకు వెళ్ళడం, లోమాన్‌థాంగ్‌లో రెండు రాత్రులకు వసతి బుక్ చేయడం తప్ప అప్పటిదాకా ఎగువ ముస్తంగ్ విషయంలో ఏ ఇతర ఏర్పాట్లూ చేసుకోలేదు. జోమ్‌సోమ్‌లో వివరాలు సేకరించి మా యాత్రకు అనువైన వాహనం సమకూర్చే పని రేషమ్‌కు అప్పజెప్పాం. అలాగే మా యాత్ర ఎలా సాగాలి అన్న విషయంలో కూడా స్థానికుల సహాయంతో ప్రణాళిక రూపొందించే బాధ్యత అతనికే అప్పజెప్పాం.

ఆ ఉదయం మేము బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉండగా రేషమ్ వెళ్ళి కారు తీసుకు వచ్చాడు. మమ్మల్నీ చూసి ఆమోదించమన్నాడు. అది ఒక చిన్నపాటి మారుతీ కారు. అనేక రహదారి యుద్ధాలలో అలసిపోయినట్లు కనిపించిందా కారు. దాని డ్రైవరు మాత్రం ‘30 వేల నేపాలీ రూపాయల్లో మిమ్మల్ని లోమాన్‌థాంగ్ దాకా తీసుకువెళ్ళి తిరిగి తెచ్చే బాధ్యత నాది’ అని నమ్మకంగా పలికాడు. మాకే నమ్మకం చిక్కలేదు. ‘మనం వెళ్ళబోయేది ఉండీ లేని దారి, ఉట్టి మట్టీ రాళ్ళూ, మధ్యమధ్యలో సెలయేళ్ళను దాటవలసి ఉంటుంది’ అన్న సమాచారం అప్పటికే రేషమ్ సేకరించి ఉన్నాడు. సోమేశ్‌కూ నాకూ ‘ఈ మారుతీతో పని గడవదు; 4×4 ఎస్‌యూవీ అవసరం’ అని గట్టిగా అనిపించింది. మారుతీ డ్రైవరు మాత్రం ‘నన్ను నమ్మండి, సందేహించకండి’ అని నొక్కి వక్కాణిస్తున్నాడు. ఆలోచించుకోడానికి ఐదు నిముషాలు ఇవ్వమన్నాం.

మా తర్జనభర్జనలు గమనిస్తున్న పక్క టేబులు పెద్దమనిషి ‘ఏమిటీ సంగతీ?’ అని వాకబు చేసాడు. నిజానికి గత రాత్రి ఈయనకు మేము కాస్త ఇబ్బంది కలిగించి ఉన్నాం. అన్నపూర్ణ సర్క్యూట్ విజయవంతంగా ముగించిన సంబరంలో మా కోలాహలాలు హద్దులు దాటాయి. బాగా పొద్దుపోయేదాకా మా విజయోత్సవాలు సాగాయి. చూసి చూసి విసుగెత్తిన ఈ ఆస్ట్రేలియా వాసి వచ్చి అల్లరికి అభ్యంతరం చెప్పాడు. నిద్ర పోనిమ్మని అడిగాడు. మేమంతా నాలుక కరచుకొని క్షమాపణలు చెప్పాం. శబ్దాలు పూర్తిగా తగ్గించాం. అదిగో ఆయన ఇపుడు రేషమ్ ద్వారా మా మారుతి వెర్సెస్ 4 x 4 సందిగ్ధం తెలుసుకున్నట్టున్నాడు. కిటికీలోంచి మారుతిని చూసి పెదవి విరిచాడు. ఈలోగా అతనికి సోమేశ్‌ కూడా ఆస్ట్రేలియా వాసి అని తెల్సింది. ఉత్సాహపడ్డాడు. ఇద్దరూ కబుర్లలో మునిగారు.

ఈ ఆస్ట్రేలియా మనిషి – అతని పేరు టామ్ – నిన్ననే ఎగువ ముస్తంగ్‌లో వారం రోజులపాటు మౌంటేన్ బైకింగ్ చేసి తిరిగి వచ్చాడట. 4×4 తప్పనిసరి అని తేల్చి చెప్పాడు. అనుసరించాం. ఆ తర్వాత మూడు రోజులూ మేం వెళుతోన్న దుర్గమ మార్గాలలో టామ్‌కు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నామో! అతని పరిచయం, సరైన సమయంలో సరైన సలహా – అవి లేని పక్షంలో మా యాత్ర గుంట పూలు పూచి ఉండేది.

ఓ 4×4 ను వేటాడి తెమ్మని రేషమ్‌ను ఊళ్ళోకి పంపాం. అరగంటలో అతనో మహీంద్రా స్కార్పియోను వెంటబెట్టుకుని వచ్చాడు. దాని సారధి దీపక్; తొలి ముప్ఫయిలలో ఉన్న స్థానికుడతను. ఈ స్కార్పియోకు మేము చెల్లించింది మారుతీతో పోలిస్తే దాదాపు రెట్టింపు; అయినా అది ఎంతో అవసరమయిన ఖర్చు!

బండిలో సామాన్లు నింపి, జోమ్‌సోమ్‌కు వీడ్కోలు చెప్పి, నలుగురం ముందుకు సాగాం. జోమ్‌సోమ్‌నుంచి లోమాన్‌థాంగ్ 100 కిలోమీటర్లు. అరగంట గడిచేసరికి కాలీగండకి నదీ తీరాన ఉన్న కాగ్‌బెని అన్న చిన్న ఊరు వచ్చింది. అక్కడి నదీ దృశ్యం అద్భుతంగా తోచింది. అక్కణ్ణించి ముక్తినాథ్ క్షేత్రానికి దారి ఉందట. ఊళ్ళో ఉన్న టిబెటియన్ గొంపా మా దృష్టిని ఆకర్షించింది. కాసేపు ఆగాం. మట్టి ఇటుకలతో కట్టిన ఇళ్ళ మధ్యనుంచి సన్నని సందుల్లో నడచి ఆ గొంపా దగ్గరికి వెళ్ళాం. దాని పేరు కాగ్ ఛోడే థుప్టెన్ సమ్‌ఫెల్ లింగ్ మానెస్ట్రీ – నోటి నిండుగా పలికే పేరు!

అలంకరణ నిండిన ద్వారంలోంచి నడచి అక్కడి విశాలమైన ఆవరణలోకి అడుగుపెట్టాం. ఆకట్టుకొనే ఘనాకారపు ముదురు ఎరుపు రంగు భవనమది. వివిధ రూపాలలోని బుద్దుని ప్రతిమలు, చిత్రాలు, శిల్పాలు, రకరకాల మత సంబంధిత కళాకృతులూ కనిపించాయక్కడ. ఆ భవనప్రాంగణంలోంచి నీల్‌గిరి హిమల్ శ్వేతశిఖరం వివిధ కోణాలలో కనిపించి పలకరించింది.

అక్కడి చిత్రాలు, శిల్పాలు, కళాకృతుల వివరాలు చెప్పడానికి ఓ యువభిక్షువు ముందుకొచ్చాడు. టిబెటియన్ బుద్ధిజాన్ని మాకు క్లుప్తంగా పరిచయం చేశాడు. మహాయాన బౌద్ధానికి చెందినదీ టిబెటియన్ బుద్ధిజం. జాతకకథల్లో చెప్పినట్టు బుద్ధుడు అనేక అవతారాలు ఎత్తిన మహనీయుడు అని వీరు నమ్ముతారు. అందులో కొన్ని జంతురూపపు అవతారాలు కూడానట. వాటి వాటి గుణధర్మాలు సామాన్యులు గ్రహించి అనుసరించాలన్నది ఆ అవతారాల ఉద్దేశ్యమట.

ఆ యువకుడిది కాగ్‌బెని పరిసరాల్లోని గ్రామం. ఈ మధ్యే తన శిక్షణ ముగించాడు. ఆ గొంపాను 1427లో టెన్‌పాయ్ గయల్‌సేన్ అన్న లామా స్థాపించాడనీ, ఈ ఆరు శతాబ్దాల కాలంలో ఎన్ని ఒడిదొడుకులు సంభవించినా మఠం మాత్రం ఆగకుండా కొనసాగుతోందనీ వివరించాడా యువ భిక్షువు. మఠంలో 70 మంది భిక్షువులు ఉండే సదుపాయం ఉందట – శిక్షణ పొందుతోన్న భిక్షువులు అదనం.

అక్కడ ఉన్న ఒక బొమ్మ నా దృష్టిని ఆకర్షించింది. చెట్టుకింద నిలబడ్డ ఒక ఏనుగు, దాని వీపు మీద ఒక మర్కటం, ఆ కోతి మీద కుందేలు, ఆ కుందేలు వీపు మీద ఓ పక్షి! ఇదే ఆకృతిని నేను మొదటిసారి భూటాన్‌లో చూసాను. ఆ తర్వాత భూటాన్, నేపాల్ మఠాలలో ఎన్నోసార్లు చూసాను. ఈ ఆకృతి ఉన్న చెక్కబొమ్మ ఒకటి కొన్నాను కూడానూ – అది ఇప్పటికీ మా ఇంటి గోడను అలంకరిస్తోంది. ఇంత చేసినా ఆ ఆకృతి నేపథ్యమేమిటో అప్పటిదాకా తెలుసుకోలేకపోయాను.

ఆ యువ భిక్షువు దాని వెనుక ఉన్న కథ చెప్పుకొచ్చాడు.

స్నేహానికీ పెద్దరికానికీ పట్టంగట్టే ఒక టిబెటియన్ బౌద్ధ జాతకకథకు ప్రతిరూపమట ఆ బొమ్మ. ఓనాడు ఆ బొమ్మలోని నాలుగు ప్రాణులూ ఆ పెద్ద చెట్టు క్రింద చేరి తమలో ఎవరు పెద్ద అన్న విచికిత్సలో పడ్డాయట. తమ తమ వయస్సులను ఆ మహావృక్షంతో సరితూచి ప్రకటిద్దామని నిశ్చయించుకున్నాయి. ‘నా తొలి యవ్వనం నాటికే ఇది మహావృక్షంగా రూపు దిద్దుకొని ఉంది’ అని ఏనుగు చెప్పిందట. ‘నాకీ చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పట్నించీ తెలుసు’ అని వెల్లడించింది కోతి. ‘నేను పిల్ల కుందేలుగా ఉన్న రోజుల్లో ఇది అపుడే మొలుచుకొచ్చిన చిన్న మొలక’ అని వివరించింది కుందేలు. ‘అసలు నేను ఆ పక్కన ఉన్న చెట్టు పళ్ళు తిని విసర్జించినపుడే ఈ వృక్షానికి బీజం పడింది’ అని చెప్పుకొచ్చింది పక్షి. తగువు తీరింది. పక్షి అన్నిటికన్నా పెద్దదనీ ఆ తర్వాత కుందేలు, కోతి, ఏనుగు వస్తాయని అన్నీ ఒప్పుకొన్నాయి. అదిగో ఆ వరుస క్రమం నేను చూసిన బొమ్మలో ప్రతిఫలించిందన్నమాట. వివాదం ముగిశాక ఆ నాలుగూ సఖ్యంగా సామరస్యంగా ఉండసాగాయి. పెద్దరికమన్నది పరిమాణం, బలాల మీద ఆధారపడదనీ, వాటిని దాటుకుని వెళ్ళి పెద్దలను గుర్తించి గౌరవించాలనీ ఆ జాతకకథ తాత్పర్యం!

ఈ గొంపాలన్నవి బౌద్ధ ఆలయాలుగానూ మఠాలుగానూ వ్యవహరిస్తూ తామున్న ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ ఉంటాయి. పురాతన వ్రాతప్రతులను, చిత్రాలను, శిల్పాలను, కళాకృతులను పరిరక్షిస్తూ ఉంటాయి.

కాగ్‌బెని గ్రామాన్ని వదిలి మా ప్రయాణం కొనసాగించాం. కాలీగండకి నది ఒడ్డునే మట్టి దారి. ఎండ, కాస్తంత బలంగా వీస్తోన్న గాలి, ఆ గాలి చేసే గలగల శబ్దాలు, వెచ్చని వాతావరణం – ఇబ్బంది లేకుండా సాగింది మా ప్రయాణం. స్టీరియోలో హిందీ నేపాలీ పాటలు వినిపిస్తూ వెళ్ళాడు దీపక్.


ఈ కాలీగండకి నది నేపాల్ – టిబెట్ సరిహద్దు ప్రాంతంలో పుట్టి ముస్తంగ్ జిల్లా గుండా ప్రవహిస్తుంది. దిగువ ముస్తంగ్ చేరేసరికి నది విశాలమవుతుంది. ఆ గండకి నదీగర్భం సాలిగ్రామాలకు పెట్టిన పేరు. ఆ ప్రాంతమంతా సముద్రం దిగువన ఉన్న సుమారు వంద కోట్ల సంవత్సరాలనాటి క్రిటేషియస్ (Cretaceous) కాలానికి చెందిన శిలాజాలతో కూడిన నునుపైన శిలలతో నిండి ఉంది. ఆ శిలాజాలే మనం అనుకొంటున్న సాలిగ్రామాలు.

శిలాజాల శోధన అన్నది అక్కడ విరివిగా సాగుతోన్న కార్యకలాపం. వాటి విషయం తెలిసిన నిపుణులు ఏ రాతిలో శిలాజం నిక్షిప్తమై ఉందో, ఎలా ఆ రాతిని బద్దలుగొడితే ఆ శిలాజం బయటపడుతుందో చెప్పగలరు. అలా వెలికి తీసిన శిలాజమే సాలిగ్రామంగా మన్నన అందుకొంటుంది. హిందూ పురాణాల ప్రకారం సాలిగ్రామమన్నది మహావిష్ణువు ప్రతిరూపం. ఆ ప్రాంతపు విశ్వాస పరంపరలో ఈ సాలిగ్రామాలు ఒక భాగం. ఇక్కడ సేకరించిన సాలిగ్రామాలను పూజాగృహాలలో ఉంచుకోవడం కద్దు. ఈ కాలీగండకి నదీగర్భంలో దొరికినంత విరివిగా మరింకెక్కడా సాలిగ్రామాలు లభించవు.

ఒక నేలబారు వంతెన దాటాక నది ఒడ్డున ఆగాం. మేము కూడా శిలాజాల వెదుకులాటలో పడ్డాం. ఆ కాలీగండకి నది మేము ఆగిన చోట కొన్ని చిన్న పాయలుగా కుదించుకుపోయి కనిపించింది. అటూ ఇటూ చెట్టూచేమా లేని నిడుపాటి అఖాతంలో ప్రవహిస్తోందా నది. ఆ నదీగర్భంలో శిలాజాల వేటగాళ్ళకు కొదవలేదు. ‘వాళ్ళల్లో కొంతమంది ముక్తినాథ్ క్షేత్రానికి వచ్చిన యాత్రికులు’ అని వ్యాఖ్యానించాడు రేషమ్. ఈ యాత్రికులతోపాటు నేపాల్‌లోని వ్యాపారులకు సాలిగ్రామాలు సరఫరా చేసే వృత్తి వేటగాళ్ళూ అక్కడ విరివిగా కనిపించారు. 2005లో నేపాల్ వచ్చినపుడు నేనూ రెండు సాలిగ్రామాలను కొన్నాను. అవి ఇపుడు మా ఇంట్లో కనిపిస్తాయి.

దీపక్ అక్కడి స్థానికుడు గదా – అతనికి సాలిగ్రామాలను గుర్తించి వెలికి తీయడం బాగా తెలుసు. మాకూ ఆ మెళుకువలు చెప్పాడు. ఏ రాయిలోనైనా కంటికి కనిపించీ కనిపించనంత పగుళ్లు ఉన్నట్టయితే అందులో సాలిగ్రామం ఉండే అవకాశం పుష్కలమట. అలా ఉన్న రాతిని ఎంతో నైపుణ్యంతో మరో రాయితో బద్దలుకొట్టాలట. ఆ పగుళ్ళలోంచి సాలిగ్రామం బయటపడుతుందట. మేమంతా అరగంటసేపు సాలిగ్రామాల వెదుకులాట కొనసాగించాం. దీపక్, రేషమ్‌లు మాతో ఉన్నా మాకు ఒక్కటంటే ఒక్కటైనా సాలిగ్రామం దొరకలేదు!

శిలాజాల వేట జరిగే ప్రాంతం దాటాక దారి బాగా నిర్మానుష్యం అయిపోయింది. అరుదుగా తప్ప వాహనాలు కనిపించలేదు. పరిసరాలు మనకు ఏమాత్రం పరిచయం లేని విలక్షణ శోభతో కనిపించి పలకరించాయి. ఆ లోయలు, అగడ్తలు, అఖాతాలు, రాతి బండల కూర్పు – విభిన్న ప్రపంచం మాకు పరిచయమయింది. ఎప్పుడూ వింటూ ఉండే చంద్రమండలపు ఉపరితలం ఇలాగే ఉంటుందా అనిపించింది. ప్రకృతి రూపకల్పన చేసిన అందాలను తనివీదీరా చూడటానికి పదే పదే మా బండిని ఆపవలసి వచ్చింది. దీపక్ కూడా సహనంతో చిరునవ్వుతో మేము ఆపమన్న చోటల్లా ఆపాడు. అసలు ఎవరికీ ఆ గ్రహింపు లేకుండానే అతను డ్రైవరు భూమికనుంచి సహయాత్రికుని భూమికలోకి పరిణామం చెందాడు. ఎన్నోచోట్ల అలా ఆగాం. కళ్ళు విప్పార్చుకుని చూసాం. ఫోటోలు తీసుకున్నాం. కష్టం మీద ముందుకుసాగాం. యాత్రికులకు పదే పదే దిశానిర్దేశం చేసే ‘గమ్యం కన్నా గమనం మిన్న’ అన్న భావనకు సజీవరూపం అక్కడి పరిసరాల విలక్షణ సౌందర్యం. విభ్రమ కలిగించే సౌందర్యం. అప్పటికే అన్నపూర్ణ, ఎవరెస్టులాంటి ఉన్నత హిమాలయసీమలు చూసి ఉన్నా కూడా నాకు ఈ ఎగువ ముస్తంగ్ నైసర్గిక సౌందర్యం ఎంతో విభిన్నంగా తోచింది. హిమాలయాల ‘అవతలివేపు’ కదా మరి!

దారి పొడవునా మాకు చిన్న చిన్న గ్రామాలు కనిపించాయి. మార్గమంతా పొడిపొడిగా ఎడారిలా కనిపించినా ఈ చరిత్ర నిండిన గ్రామాల దగ్గర కాసింత పచ్చదనం కనిపించింది. దాదాపు గ్రామాలన్నీనదీగర్భం దగ్గరా సెలయేళ్ళ ఒడ్డునా ఉన్నాయి. చిన్నచిన్న మళ్ళలో కూరగాయాల పెంపకం కనిపించింది. కొన్నిచోట్ల కూరగాయలే కాకుండా బార్లీ, కుట్టు (బుక్వెట్) గింజల సాగు కూడా కనిపించింది. అలా అలా సెలయేళ్ళను దాటుతూ నదీగర్భాల్లోంచి కొనసాగుతూ ముందుకు వెళ్ళాం. ఎన్నో వంతెనలు – కొన్ని అతి పురాతనం, కొన్ని ఈ మధ్య కట్టినవి.

దారిలో సమర్ అన్న గ్రామంలో ఉన్న ‘కర్మా ఇన్’ అన్న టీ హౌస్ దగ్గర భోజనానికి ఆగాం. ఎగువ ముస్తంగ్ ప్రాంతానికి వచ్చే ట్రెకర్ల అవసరాలకు ఏర్పడిన టీ హౌస్ అది. నేను థెన్‌థుక్ అన్న టిబెటియన్ నూడిల్ సూప్ ఆర్డర్ చేసాను. ఆ సూపు శరీరంలో సత్తువ నింపింది. మనసును తాజా పరచింది.

సమర్ దాటాక పరిసరాలు పచ్చదనం కోల్పోయి కనిపించాయి. కొండలు రంగురంగులు సంతరించుకుని కనిపించాయి. కన్నార్పకుండా చూసే సౌందర్యమది. క్షితిజం దగ్గర మంచు నిండిన కొండగుట్టలు… మాకు చేరువలో కనిపించీ కనిపించని మంచు నిండిన కొండలు… అవును. ఆ ప్రాంతమంతా అన్నపూర్ణ, ధవళగిరి శిఖరాల నీడన ఉంది గదా, వర్షపాతం ఎంతో తక్కువ. ల్హే లడఖ్ ప్రాంతంలో మనకు కనిపించే ఉన్నత సీమలలోని ఎడారి లాంటి ప్రాంతమిది.

మా వాహనం ముందుకు సాగుతూ ఉండగానే గైడు రేషమ్, డ్రైవరు దీపక్ ఘర్‌గొంపా అన్న మఠం గురించి మాట్లాడుకోవడం గమనించాను. అది మేము వెళ్ళే లోమాన్‌థాంగ్ దారికి కాస్తంత పెడగా ఉంది. వెళ్ళి రావాలంటే అదనంగా రెండు గంటలు పడుతుంది. రోడ్డు మరీ దారుణంగా ఉంది, సమయం చాలదేమో అని దీపక్ సందేహించాడుగానీ చివరికి వాహనాన్ని అటు మళ్ళించనే మళ్ళించాడు. అప్పటికే సాయంత్రపు ఛాయలు కనిపించసాగాయి. అయినా బండి ఘర్‌గొంపా దిశలో సాగింది. అనుకున్నట్టే దారంతా కుదుపులే కుదుపులు. అయినా చురుగ్గానే ముందుకు సాగాం. ఉన్నట్టుండి వడివడిగా సాగిపోతోన్న ఓ కొండ సెలయేరు మా దారికి అడ్డం వచ్చింది… వందా నూట ఏభై మీటర్ల వెడల్పున పరుచుకొని ఉంది ఆ సెలయేరు. బండి దాటగలదా – అనుమానం. రేషమ్, దీపక్ బండి దిగి పరిస్థితిని అంచనా వేశారు. ముందుకే సాగుదామని నిశ్చయించారు. సోమేశ్, నేనూ ఊపిరి బిగబట్టి కూర్చున్నాం. రెండే రెండు నిమిషాల్లో దీపక్ బండిని అవతలి ఒడ్డుకు చేర్చాడు!

అప్పటికే సూర్యాస్తమయ క్రీడ మొదలయింది. సాయంసమయపు సంజకెంజాయ రంగుల్లో తడిసి ముద్దవుతోన్న అర డజను ముదురు ఎరుపు రంగు చోర్టెన్లు మాకు స్వాగతం పలికాయి. ఈ చోర్టెన్లన్నవి దుష్ట శక్తులను దూరంగా ఉంచడానికో మతాచార్యుల స్మారక చిహ్నాలుగానో నిర్మించిన చిరుస్థూపాలు. వీటిలో పెద్దవి విడివిడిగా ఉంటాయి. చిన్నవి మూడుగానీ ఎనిమిదిగానీ కలసి ఉంటాయి. ఈ ఎనిమిది అన్నది బుద్ధుడి జీవితంలోని ఎనిమిది ముఖ్యమైన సంఘటనలను సూచించే సంఖ్య.

ఈ ఘర్‌గొంపా ఉన్నది సౌక్రె అన్న గ్రామంలో. మా స్కార్పియో మెల్లగా గ్రామంలోకి ప్రవేశించింది. క్షణాల్లో గొంపా దగ్గరికి చేర్చింది. ముదురు ఎరుపు రంగులో కట్టిన అద్భుతమైన ఘనాకారపు భవనమది. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలు ఒక నిర్దిష్ట నిర్మాణ ప్రణాళికను అనుసరించినట్లుగానే హిమాలయ ప్రాంతంలోని గొంపాలు స్థూలంగా ఒకే వాస్తుశిల్పాన్ని అనుసరిస్తాయి. గొంపాకూ గొంపాకూ మధ్య చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయన్నది వేరే మాట. కొన్ని మెట్లు ఎక్కి గొంపాలోకి ప్రవేశించాం. ప్రవేశించాక రేషమ్, దీపక్‌లు మాకు ఆ గొంపాను ఎందుకు చూపించాలని తాపత్రయపడ్డారో అర్థమయింది. వారి నిబద్ధత చూసి ముచ్చటనిపించింది. రేషమ్ కోరికను అనుసరించి అక్కడి భిక్షువు ఒకాయన మఠం వివరాలు మాకు చెప్పుకొచ్చాడు. ఆయన నేపాలీలో చెపితే రేషమ్ దాన్ని అనువదించాడు.

ఆ మఠం ఎనిమిదవ శతాబ్దానికి చెందినది. ప్రాచీనమైన, చరిత్ర నిండిన టిబెటియన్ బుద్ధిస్ట్ గొంపాల పరంపరకు చెందినది. ముస్తంగ్ ప్రాంతమంతటిలోనూ అతి పురాతనమైనది. సముద్రతలానికి 3900 మీటర్ల ఎత్తున ఉంది.

ఆనాటి టిబెట్ చక్రవర్తి ఈ గొంపా నిర్మించమని గురు పద్మసంభవను అడిగాడని ఐతిహ్యం. పద్మసంభవునికి ‘రింపో ఛె’ అన్న పేరు కూడా ఉంది. టిబెట్-నేపాల్ దేశాలలో బౌద్ధమతాన్ని ప్రవేశపెట్టిన గురువు ఈ రింపో ఛె. ఆయనతో ముడిపడిన కథనాలు అనేకమున్నాయి. ఘేమి అన్న చోట ఒక దుష్టశక్తిని సంహరించిన తర్వాత పద్మసంభవుడు ఈ గొంపాను నిర్మించాడన్నది ఆ కథనాలలో ఒకటి. ఆ రాక్షసి గుండెకాయ ఈ గొంపాలో ప్రార్థనా వేదిక దిగువన భూస్థాపితమై ఉందని అక్కడి వారి నమ్మకం. ఆ గురువు స్థాపించిన 49 పుణ్యక్షేత్రాలలో ఈ ఘర్ గొంపా ఒకటి. 49 క్షేత్రాలలోనూ అపురూపమైన మత గ్రంథాలను ఆయన దాచి ఉంచాడట. టిబెట్ వారు అనుసరించే మహాయాన బౌద్ధంలో పురాణాలు, ఐతిహ్యాలు, ఆత్మలు, దుష్టశక్తులకు కొదవ లేదు.

ఈ ఘర్‌గొంపాను సంప్రదాయ బౌద్ధ పద్ధతిలో రాయి, మట్టి, కలప కలగలిపి కట్టారు. లోపలి ఆవరణలో ఆకట్టుకొనే దారు చెక్కడాలు ఉన్నాయి. మెరిసే రంగుల థంగ్కా చిత్రపటాలున్నాయి. బట్టమీద వేసిన ఈ వర్ణపటాలలో బుద్ధుని జీవితం, బౌద్ధానికి చెందిన ‘మండల’లాంటి ప్రతీకలూ చిత్రించి ఉన్నాయి. ముఖ్యమంటపంలో తన ఇద్దరు సహచరిలతో కూడిన పద్మసంభవుని గంధపు శిల్పం ఉంది. గొంపా చూడటం ముగిసేటపుడు ‘ఈ గొంపాకు గొప్ప పేరు ఉంది. అందుకే దారి అంత బాగోలేకపోయినా మీరు చూడాలని తీసుకువచ్చాం’ అన్నాడు రేషమ్. సోమేశ్, నేనూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాం.

ఘర్‌గొంపా వదిలేసరికి ఆరు దాటింది. చీకటి పడింది. ఆ చీకటిలో జాగ్రత్తగా బండి నడుపుతూ రెండు గంటలు సాగాక లోమాన్‌థాంగ్ చేరుకున్నాం. ఎనిమిది గంటల సమయంలో అక్కడి రాయల్ ముస్తంగ్ రిసార్ట్‌లో స్థిరపడ్డాం.

జోమ్‌సోమ్‌నుంచి లోమాన్‌థాంగ్ చేరుకోడానికి అంతా కలసి పదిగంటలు పట్టింది. మధ్యలో ఘర్‌గొంపాకు పట్టిన రెండు గంటలు తీసేసినా నికరంగా ఎనిమిది గంటలన్నమాట. అంటే సగటున గంటకు పన్నెండు కిలోమీటర్లు. దారి అంతగా బాలేదన్న సంగతి ఎలా ఉన్నా ఏ హడావుడీ లేకుండా ఇష్టమైన చోట ఆగుతూ ఆడుతూ పాడుతూ నింపాదిగా ప్రయాణం చెయ్యగలిగినందుకు సంతోషం కలిగింది. అలా నింపాదిగా రాబట్టే అనిర్వచనీయమైన ప్రకృతి సౌందర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించగలిగాం.

రాయల్ ముస్తంగ్ రిసార్ట్ ఎంతో సౌకర్యవంతంగా ఉంది. గదులు బావున్నాయి. సొగసుగా ఉన్నాయి. రెండువారాలపాటు కనీస సౌకర్యాలైనా లేని అన్నపూర్ణ సర్క్యూట్ టీ హౌసుల్లో ఉండి వచ్చాక ఈ రిసార్ట్ సురలోక సమానం అనిపించింది. నేను మర్చిపోయిన సుఖాలన్నీ తిరిగి వచ్చిన భావన… ఎంతైనా ఇది నేను ఎప్పట్నించో కలలు కంటోన్న షాంగ్రి-లా కదా…


రెండో రోజు బాగా పొద్దున్నే లేచాను. సోమేశ్‌ను నిద్ర లేపి గది బయటకు వచ్చాను. రాత్రి చేరేసరికి బాగా చీకటి పడిపోయింది గదా – ఊరితో పరిచయం కలగనే లేదు. అదిగో ఆ పరిచయం ఇపుడు చేసుకుందామని నా తాపత్రయం.

బయటకు రాగానే సూర్యోదయ సన్నాహాలు కనిపించాయి. గబగబా మేడ మీదికి చేరాను. అనుకున్నట్టుగానే సూర్యుని తొలికిరణాలు హిమరాశులను రాగరంజితం చేస్తోన్న దృశ్యం కనిపించి కన్నుల పండుగ చేసింది. అవే కిరణాలు ఆ రాశుల మీదుగా జాలువారి దిగువనున్న సమతల ప్రదేశాల మీద ప్రసరించడం – ఓహ్! వర్ణనాతీతం. నిన్నంతా మేము వచ్చిన దారికి విరుద్ధంగా లోమాన్‌థాంగ్ పచ్చదనం నిండి కనిపించింది. ఎడారిలో ఒయాసిస్సు అన్నమాట!

సూర్యోదయశోభను ఆస్వాదించడం ముగిశాక రిసార్ట్ ప్రాంగణం మూలమూలలా శోధించడం ఆరంభించాను. అక్కడి కళాకృతులూ, రాజవంశీకులు వదిలివెళ్ళిన వస్తువులు, అలనాటి తెలుపు-నలుపు చిత్రాలు, జ్ఞాపకాలే జ్ఞాపకాలు. క్షణాల్లో ఆ ప్రాంగణం నాతో సంభాషిస్తున్నట్టనిపించింది.

ఈలోగా సోమేశ్ వచ్చి బ్రేక్‌ఫాస్ట్‌కు కలిసాడు. ఆ రిసార్ట్ మానేజరు ధోండుప్ ఫుంట్సోక్ వచ్చి సాదరంగా పలకరించాడు. బ్రేక్‌ఫాస్ట్‌ చేసి రేషమ్ దీపక్‌లు వచ్చి కలిసేలోగా సోమేశ్, నేనూ వెళ్ళి ధోండుప్‌తో కాసేపు గడిపాం.

అతను ఆ ఊరికి చెందిన మనిషి. ముస్సోరీలో చదువుకున్నాడు. ఈ ఊళ్ళో 125 కుటుంబాలున్నాయి. 1000 మంది జనాభా. ‘మాది టిబెట్ వారసత్వం. మమ్మల్ని లోబో మనుషులు అని వ్యవహారిస్తూ ఉంటారు. అంటే దక్షిణాదివాళ్ళు అని అర్థం,’ చెప్పుకొచ్చాడు ధోండుప్.

అతనికి తన రిసార్ట్ అన్నా అక్కడికి వచ్చే అతిథులన్నా అమితమైన మక్కువ. మేము అడగటం ఆలస్యం – ఆ ఊరు గురించీ, ప్రాంతం గురించీ, రాజకుటుంబీకుల గురించీ, సామాన్య ప్రజానీకం గురించీ, మఠాలు, చరిత్ర, జీవితం – అంతా వివరంగా చెప్పాడు.

రాయల్ ముస్తంగ్ రిసార్ట్‌కు 2017లో చిట్టచివరి రాజుగారి కుమారుడు పుల్వెర్ బిస్తా రూపకల్పన చేసాడట. ఆయనకు ఈ రిసార్టంటే ప్రాణమట. దాని అలంకరణ మీద ఆయన ఎంతో శ్రద్ధ పెట్టాడట. ఒట్టి అలంకరణే గాదు, రిసార్ట్‌ను చక్కని మ్యూజియంగా మలచి అందులో కింగ్‌డమ్ ఆఫ్ లో కు చెందిన చరిత్ర, సంస్కృతి నిక్షిప్తం చేసి దాన్ని ఒక వారసత్వ సంపదగా నిలిపాడట.

నిన్న చూసిన గొంపాలానే ఈ రిసార్ట్ కూడా రాయీ కలపల సమ్మేళనం. సంప్రదాయ ఆధునిక వాస్తురీతులు ఎంతో చక్కగా కలసిపోయిన నిర్మాణం. ఉన్నది ఇరవై గదులే అయినా విశాలమైన లాబీల పుణ్యమా అని సుఖసౌందర్యాలు ఉట్టిపడే ఘనమైన నివాసగృహంలా శోభిల్లే రిసార్టది. అంతా కలసి పదిమంది ఉద్యోగులు. ఏప్రెల్ నుంచి నవంబర్ వరకే తెరచి ఉంటుందట – శీతాకాలంలో మూసివేస్తారు. రోజుకు 500 డాలర్ల అద్దె.

సంస్కృతి అంటే ఆసక్తి ఉన్న పర్యాటకులు లోమాన్‌థాంగ్‌కు ఎక్కువగా మే నెలలో వస్తారని చెప్పాడు ధోండుప్. అది ‘తేజి’ పండుగ సమయం. దుష్టశక్తుల్ని తరిమి కొట్టడాన్ని ప్రతీకాత్మకంగా ప్రదర్శించే పండుగ అది. అక్కడి బౌద్ధ భిక్షువులు రంగు రంగుల చేలాంచలాలు ధరించి చేసే సంప్రదాయ నృత్యం ఆ పండుగకు చెందిన విశిష్ట అంశం.

‘యార్తుంగ్’ అన్నది ఆ ప్రాంతానికి చెందిన మరో ముఖ్యమైన పండుగ. నిజానికి అది మన సంక్రాంతీ వైశాఖీలా పంటల పండుగ. గుర్రాల పరుగుపందాలు ఆ పండుగకు చెందిన విలక్షణ అంశం. ఆ వేడుకల్లో రాజుగారు, యువరాజులు, రాజకుటుంబీకులు తప్పక పాల్గొంటారట. అన్నట్టు ఆ రోజు ‘మహాకాల’ పండుగ దినం అనీ, మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడి చోదే మఠంలో ఉత్సవ ఊరేగింపు ఉంటుందనీ మేమారోజున ఆ ఊళ్ళో ఉండటం ఎంతో సంతోషకరమనీ అన్నాడు ధోండుప్.

రేషమ్ దీపక్‌లు ఎనిమిదిన్నర ప్రాంతంలో రిసార్ట్‌కు వచ్చి కలిశారు. ఆనాటి కార్యక్రమం గురించి చర్చించుకున్నాం. మధ్యాహ్నం తప్పకుండా చోదే మఠంలో ఉత్సవాల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాం. మధ్యాహ్నం అక్కడికి వెళ్ళేలోగా ‘కోరా-లా’ అన్న నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతం చూసి వద్దామనుకున్నాం.

దీపక్ తిన్నగా సరిహద్దు వేపు బండి నడిపాడు. సరిహద్దు ఇంకా పది కిలోమీటర్ల దూరాన ఉందనగానే అక్కడి నేపాలీ సైనికులు మమ్మల్ని ఆపారు. మా పాస్‌పోర్ట్‌లు తనిఖీ చేశారు. చేసి నేపాల్ దేశస్థులు మాత్రమే ఆ బిందువు దాటి ముందుకు వెళ్ళగలరనీ ఇతర దేశస్థులు అక్కడితో ఆగి తీరాలనీ చెప్పారు. ఈ తనిఖీలు చేస్తోన్న నేపాల్ సిపాయి ఎంతో స్నేహంగా, సరదాగా వ్యవహరించాడు. మాతో చక్కగా మాట్లాడాడు. కానీ ముందుకు వెళ్ళడం విషయంలో అంగుళమైనా తగ్గలేదు. ‘మాకు ఖచ్చితమైన ఆర్డర్లు ఉన్నాయి. క్షమించాలి. మిమ్మల్ని ముందుకు పంపలేం’ అనేశాడు. అదో నిరాశ.

ఈ కోరా-లా కనుమ అన్నది టిబెట్-నేపాల్ దేశాల మధ్య వాణిజ్యం కొనసాగిన అనాది సాల్ట్‌రూట్‌లో ఒక ముఖ్యబిందువు. సముద్రతలానికి 4660 మీటర్ల ఎగువన ఉన్న కనుమ అది. లామాల సోపాన క్రమంలో దలైలామా తర్వాత రెండవ స్థానంలో ఉన్న కర్మప లామా 1991లో ఈ కోరా-లా కనుమగుండానే టిబెట్‌నుంచి తప్పించుకుని లోమాన్‌థాంగ్ చేరాడు. అక్కణ్ణించి ముక్తినాథ్, ఆ తర్వాత థొరాంగ్-లా కనుమ దాటుకుని చివరికి మనంగ్ పట్టణం చేరాడు. అక్కణ్ణించి ఆకాశమార్గాన భారతదేశం చేరి ఆశ్రయం కోరాడు. ఈ కర్మప లామా ఉదంతం తర్వాత చైనా అధికారులు సరిహద్దు ప్రాంతంలో రక్షణ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు. ఆ చర్యల ప్రతిఫలనం నేపాల్ వేపూ కనిపిస్తోంది.

ఈలోగా దూరాన కనిపిస్తోన్న ధుంగ్‌మారా హిమల్ అన్న గిరిశిఖరాన్ని మాకు చూపించాడు రేషమ్. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న శిఖరాలలో ఈ ధుంగ్‌మారా ఒకటి. ఆ శిఖరవ్యవస్థలో ఒక హిమనది కూడా భాగమట. కాలీగండకి నది జన్మస్థానం అదేనట.


చైనా సరిహద్దుకు వెళ్ళడం ఎలానూ సాధ్యపడలేదుగాబట్టి మిగిలిన ఉదయపు సమయం ఛోసెర్ గుహల దగ్గర గడుపుదాం అని అటువేపు అడుగు వేశాం.

ఎగువ ముస్తంగ్ ప్రాంతంలో గుహలకేం కొదవ లేదు: అందులో కొన్ని సహజంగా ఏర్పడ్డ గుహలు, కొన్ని మానవ నిర్మితాలు. బౌద్ధ భిక్షువుల జీవన సరళిలో గుహానివాసం ఆదినుంచీ ఓ అంతర్భాగం.

కాసేపట్లో గుహలున్న చోటికి చేరాం. టికెట్టు వెయ్యి రూపాయలు. అక్కడ ఉన్న షెల్కర్ మ్యూజియంకు 300 అదనం.

గుహలలోకి ప్రవేశించడానికి చిన్నపాటి కొండ ఎక్కవలసి వచ్చింది. కొండ ఎక్కడం అంటే విశాల దృశ్యాలు మన కోసం ఎదురుచూస్తున్నాయన్నమాట. దిగువనంతా ఎడారి భూమే అయినా అక్కడక్కడా చిక్కని వృక్ష సముదాయాలు కనిపించాయి. ఆకురాలే కాలంగదా – ఆ చెట్లన్నీ బంగారు పత్రాలను సంతరించుకొని ఉన్నాయి. అవన్నీ స్థానికంగా పెరిగే బుర్ర జాతి విల్లో చెట్లనీ, అవి వంటచెరుకుగా బాగా ఉపయోగపడతాయనీ అక్కడి మ్యూజియం నిర్వాహకుడు పేమా వివరించాడు. ‘వంటచెరుకు సేకరణా, నిల్వలను పెంచుకోవడం రానున్న శీతాకాలం దృష్ట్యా ఇక్కడివాళ్ళకు ఎంతో ముఖ్యమైన పని’ అని కూడా వివరించాడు. లోమాన్‌థాంగ్ పట్టణం సముద్రతలానికి 3000 మీటర్ల ఎగువన, వర్షపాతం ఏమాత్రం లేని, గాలులు బలంగా వీచే పొడి మైదానప్రాంతంలో ఉండటంవల్ల వ్యవసాయానికి ఏమాత్రం అనుకూలం కాదనీ పరిసరాల్లో ప్రవహించే సెలయేళ్ళు మాత్రం బంగాళాదుంప, గోధుమ, బార్లీలాంటి పంటలు పండించే చిన్న చిన్న కమతాలకు ఊతమిస్తాయనీ వివరించాడాయన.

అక్కడి మ్యూజియం కూడా ఒక గుహలోనే నిలకొల్పబడి ఉంది. వస్తువులను గాజు పలకల అరల్లో ప్రదర్శనకు ఉంచారు. ఆ గుహ అంతా గాఢమైన వాసన నిండిపోయి కనిపించింది. ఆ వస్తువులను చూస్తే అవి అరుదైనవి అమూల్యమైనవి అని తెలుస్తోంది. మరి వాటిల్ని ఇంకాస్త అనువైన ప్రదేశంలో భద్రపరచి ప్రదర్శనకు పెడితే ఎంత బావుంటుంది అనిపించింది. నిర్వాహకుడు పేమా ఎంతో పిపాసతో ఆ మ్యూజియంలోని వస్తువులను పరిచయం చేశాడు. మంచి నిబద్ధత కలిగిన మనిషి. జీతనాతాలూ శిక్షణా మద్దతూ మరికాస్త అందితే ఇంకా చక్కని పని తీరు సంతరించుకునే శక్తి ఉన్న మనిషి.

ఆ మ్యూజియం పక్కనే ఉన్న మరో గుహలో అతిథుల కోసం రెండు పడకల గది ఒకటి ఏర్పాటై ఉంది. గుహానివాసపు అనుభవం పొందాలనుకునే ఉత్సాహవంతుల కోసం ఆ ఏర్పాటట. ఏర్పాటు బావుందిగానీ అక్కడ రాత్రి గడపడమూ అంటే విపరీతమైన చలికి సిద్ధపడాలి.

మ్యూజియం చూడటం ముగిసాక ఛోసెర్ గుహలు చూడటానికి వెళ్ళాం. వాటిల్ని ఆకాశగుహలు అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అది ఎన్నో గుహల సముదాయం. కొండ కొమ్మున ఉన్నాయా గుహలు – అందుకే ఆకాశగుహలు అన్న ముద్దు పేరు. మధ్యన ఉన్న ఓ కొండ మీదికి ఎక్కాం. ఆ కొండ మీదే ఎక్కువ గుహలు ఉన్నాయి. ఆ పర్వత పాదానికి బాగా దగ్గరగా ఉన్న గుహలోకి ప్రవేశించాం. ఈ గుహలలో కొన్ని ఐదు అంతస్తుల వరకూ ఎగసి ఉన్నాయి. గుహలను అనుసంధిస్తూ నిచ్చెనలున్నాయి. కష్టపడి జాగ్రత్తగా ఎక్కాలి. లోపలికి వెళితే ఒక దానితో మరొకటి కలపబడి ఉన్న గదులు కనిపించాయి.

ఈ గుహలకు కూడా తమదైన చరిత్ర ఉందని చెప్పుకొచ్చాడు రేషమ్. అవి శతాబ్దాల తరబడి అనేకానేక కారణాల వల్ల టిబెట్‌నుంచి తప్పించుకొని వచ్చే శరణార్థులకు ఆశ్రయమిచ్చాయట. శరణార్థుల సంఖ్య పెరిగిన ప్రతిసారీ మరిన్ని గుహలను తొలిచేవారట. చివరికి అది ఒక ఆధునిక బహుళ అంతస్తుల నివాసప్రాంతంగా పరిణమించిందన్నమాట. 1950ల చివరి దినాలలో టిబెట్‌ను చైనావారు ఆక్రమించినపుడు ఈ గుహలు ఆఖరిసారిగా శరణార్థుల ఆశ్రయాలుగా వ్యవహరించాయి. ఇపుడు వాటి పాత్ర పర్యాటకులను ఆకర్షించడానికే పరిమితమయింది.

ముందే చెప్పుకున్నట్టు ఎగువ ముస్తంగ్ ప్రాంతం అనేకానేక గుహలకు నెలవు. యూఎస్, నేపాల్ దేశాలకు చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు ఇక్కడ జరిపిన పరిశోధనలలో రెండు మూడు వేల సంవత్సరాల నాటి, రసాయనాలు వాడి పదిలపరచిన మానవ కళేబరాలను కనుగొన్నారట… అంటే ఈ గుహలు చరిత్ర పూర్వపు దినాలనుంచీ మానవ నివాసాలుగా ఉపకరించాయన్నమాట. అలాగే పురాతత్వ పరిశోధనలలో పన్నెండవ, పధ్నాలుగవ శతాబ్దాలకు చెందిన బౌద్ధమతపు రాతప్రతులు, కళాకృతులూ, చిత్రపటాలు, శిల్పాలు కూడా ఇక్కడ లభించాయట.

2008లో నేషనల్ జియోగ్రఫిక్ వారి బృందం ఈ ప్రాంతంలోని దుర్డ్ జోంగ్ గుహాశృంఖలలో పురాతన రాత ప్రతులను కనుగొన్నది. అవి ఇపుడు లోమాన్‌థాంగ్‌లోని చోదే మఠంలో భద్రపరచి ఉన్నాయి…