నాకు నచ్చిన కథ: స్వల్పజ్ఞుడు

సుదూర తీరాలకు ప్రవాసం వెళ్ళి కొత్త జీవితం ఆరంభించే మనిషి ఆ తీరాలకు తన పూర్వ అస్తిత్వాన్ని వెంటతీసుకొని వెళితే ఏమవుతుందీ?!


“ఉయ్ నీడ్ టు సెపరేట్” అని అయిదేళ్ళ క్రితం స్పష్టంగా ప్రకటించింది నటాషా.

ఆమె తన ఆలోచనలను ఎందుకంత అఫెన్సివ్‌గా తీసుకొందో అప్పట్లో మురళికి అర్థంకాలేదు.

అయిదేళ్ళు గడిచాక, అనేక అనుభవాలు కలిగాక, ఎన్నెన్నో ఆలోచనలు మనసును మథించాక–తాను సర్వజ్ఞుడ్ని కాదుగానీ కనీసం స్వల్పజ్ఞుడ్ని–అన్న ఎరుక వచ్చాక ఆమె ఆ ప్రకటన ఎందుకు చేసిందో మురళికి అర్థమవుతుంది. తన ఈ ఎరుక వెనుక ఉన్న నటాషా పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెలోని దేవుడికి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. నమస్కారం కాకపోయినా దగ్గరకు వెళ్ళి – యు డిడ్ ఎ గ్రేట్ ఫేవర్ టు మి బై త్రోయింగ్ మి ఔట్ ఫైవియర్స్ బాక్ థాంక్యూ – అంటాడు. నటాషా ఆశ్చర్యపోవడం మురళికి తెలుస్తూనే ఉంటుంది.

నటాషా మురళి భార్య. కాలేజీ రోజుల్లో మురళి రూమ్మేటు గర్ల్ ఫ్రెండుకు ఫ్రెండ్.

తన బాస్కెట్ బాల్ ప్లేయర్ బాయ్‌ఫ్రెండ్ కొట్టిన కంటిమీది దెబ్బతో సేదదీరడానికి మురళీ వాళ్ళ గదికి వచ్చిన నటాషా అతని సహజ సపర్యలతో స్థిమితపడి ఇంటికి వెళుతుంది. మళ్ళా కలిసినపుడు ‘యు ఆర్ వెరీ నైస్! ఇంకెవరయినా అయితే ఎడ్వాంటేజ్ తీసుకొనేవాళ్ళు’ అని నవ్వుతుంది. ఆ నవ్వు మురళికి నచ్చుతుంది. తనని ‘కావాలి’ అనుకొనేవాళ్ళు ఈ భూప్రపంచంలో ఉన్నారు అనడానికి ఆ నవ్వు రుజువుగా కనిపిస్తుంది. ఆ తర్వాత డేటింగు… వివాహం.

నటాషా ఆఫ్రో అమెరికన్ నల్లపొణ్ణు. ఫిలాసఫీ స్టూడెంటు. లోతు ఉన్న మనిషి. చదివిన ఫిలాసఫీని ఒంటబట్టించుకొని చర్చికి వెళ్ళడాన్ని పెళ్ళిళ్ళకే పరిమితం చేసిన మనిషి.

వెనక్కి తిరిగి చూసుకొంటే ఆమె తన జీవితంలోకి రావడం ‘సిరి రావచ్చును నారికేళ సలిలము భంగిన్’ అని ఇప్పటికీ మురళికి అనిపిస్తూ ఉంటుంది.


తన కుటుంబంలో ఎవరికీ కాలేజ్ డిగ్రీనే కాదు – హైస్కూలు డిప్లొమాలు కూడా లేని నేపథ్యం నటాషాది.

హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు. టాక్సీలు – చిన్న చిన్న ఉపాధులు.

ఫ్లారిడాలోని న్యూఆర్లీన్స్‌లో తక్కువ రాబడి ఉండే లోతట్టు ప్రదేశంలో వాళ్ళ నివాసం.

హరికేన్ కట్రీనా వచ్చినపుడు వాళ్ళంతా రోడ్డునపడి, అష్టకష్టాలు దాటుకొని, మురళి-నటాషాల ఇంటికొచ్చి, రెణ్ణెల్లు ఉండి నిలదొక్కుకున్నారు.


మురళీ నటాషాలకు ఇద్దరు పిల్లలు. కాత్యా, శామ్యూల్. శామ్‌కు సంగీతం అంటే మక్కువ. కాత్యాకు నాట్యమంటే విపరీతమైన అభిమానం. ఏటా గుళ్ళల్లో జరిగే త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో తెలుగు పదాలను స్పష్టంగా ఉచ్చరిస్తూ కర్నాటక సంగీతం పాడే నల్ల పిల్లాడు శామ్. మొదట్లో మురళి తత్వాన్ని నటాషా అంతగా పట్టించుకోకపోయినా పిల్లలు పెద్దాళ్ళయి కాలేజ్ చదువుల్లోకి వచ్చేసరికి తత్వ విభేదాలూ అగడ్తలూ స్పష్టమవుతాయి. కాలేజ్‌లో కాకుండా ఏదో బ్యాండ్ గ్రూప్‌లో చేరతానంటాడు శామ్. ఠాఠ్ వీల్లేదు, కాలేజీలో చేరాల్సిందే అంటాడు మురళి.

“గివ్ హిమ్ ఎ ఛాన్స్. లెట్ హిమ్ లెర్న్ హిజ్ లెసన్” అంటుంది నటాషా.

“ఎ ఛాన్స్ టు బి అ బెగ్గర్?” ఉగ్రుడవుతాడు మురళి.

“సైన్స్ టెక్నాలజీ ఇంజినీరింగ్ మాథ్స్! వీటికే భవిష్యత్తుంది మొర్రో అని ప్రపంచమంతా మొత్తుకుంటోంటే మాలో మ్యూజిక్ జీన్స్ ఉన్నాయి అంటూ ఆ గోతిలోకి దింపుతావా!” రెట్టిస్తాడు మురళి.

“మాలో… మాలో మ్యూజిక్ జీన్సా! ఎంత స్టీరియోటైప్ చేస్తున్నావ్… యూ రేసిస్ట్ పిగ్!” ముక్కుపుటాలు అదురుతూ నటాషా.

“వాట్ డూ యూ థింక్ ఆఫ్ మై డిగ్రీ?” హఠాత్తుగా బుర్రలో లైటు వెలిగినట్టు నటాషా ప్రశ్న.

“గ్రేట్ డిగ్రీ…”

“తప్పించుకోవాలని చూడక…”

“మరేమనమంటావ్? ఈ దేశంలో ఇంజినీరింగ్‌కూ ఫిలాసఫీకీ ఒకటే ఫీజు… కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్సే లేదు…”

“చదువంటే సంపాదనేనా?”

“కోటి విద్యలు కూటికొరకే…” ఎప్పుడో నేర్చుకున్న సామెత.

“నేనూ సంపాదిస్తున్నాగదా!” నటాషా కాలక్షేపానికి మొదలెట్టిన రియాల్టర్ వ్యాపారం కాసులు కురిపించింది.

“దానికి నీ డిగ్రీతో సంబంధం ఏముందీ? నీ తెలివితేటలకీ మైనారిటీ స్టేటస్‌కీ ఇంజినీరింగ్ చేసి ఉంటే ఎక్కడో సిఈవో అయివుండేదానివి.”

“నా విలువను నా సంపాదనతోనూ మైనారిటీ స్టేటస్‌తోనూ ముడిపెడుతున్నావన్నమాట…” విషయపు లోతులు అవగాహనకు రాగా, నటాషా.

అవగాహనలోంచి స్పష్టత.

“ఉయ్ నీడ్ టు సెపరేట్.”

“నువ్వెక్కడికి వెళతావ్?”

“నే వెళ్ళను. యు నీడ్ టు గెటవుట్!” యు అన్న పదాన్ని నొక్కి పలుకుతూ నటాషా.

అమెరికాలో మురళీలకు మరో మార్గం లేదు.


భక్తి ఎక్కువయిందని భార్య బయటకు గెంటేసిన మనిషి రామయ్య. అమెరికాలో కూడా ఆఫీసుకు బొట్టు పెట్టుకొని వెళ్ళే మనిషి రామయ్య. తన పరిస్థితులూ, ఆర్థిక అవసరాలూ మురళిని రామయ్య పంచన చేరేలా చేస్తాయి. అతని ఎపార్ట్‌మెంట్‌లో సర్దుకొనేలా చేస్తాయి. మురళిని వేదం ముందూ వాగ్గేయకారులముందూ ప్రవచనకారులముందూ కట్టిపడేసే శక్తిగల మనిషి రామయ్య. మురళికి మరో మార్గం లేదు. ఇంట్లో టీవీ రామయ్యది. స్టీరియో ఉన్న కారు రామయ్యది.

చిన్నప్పుడు తండ్రి గొంతులో పలికే వేదాలూ అక్క గొంతులోని త్యాగరాజ కీర్తనలూ అమ్మ గొంతులోని అన్నమయ్య పదాలూ విన్న మనిషే మురళి. నిన్నమొన్నటిదాకా వాటిగురించి అంతగా పట్టించుకోలేదు. నటాషా వెళ్ళగొట్టిన నేపథ్యంలో మొదట్లో ఆ ప్రవచనాలూ సంగీతాలూ మురళికి కాస్తంత శాంతినిచ్చిన మాట నిజం. కొత్త ఆలోచనలకు బీజం అయిన మాట నిజం.

అయిదేళ్ళలో ఎంతోకొంత అంతర్మథనం. చీకట్లు తొలగడం. కొత్త ఎరుకలు. వేదాలనూ, బైబిలునూ అడుగడుగున గుడి ఉంది అన్న కృష్ణశాస్త్రి భావననూ సమన్వయపరచుకొనే అప్రయత్న ప్రయత్నం… ఆ గుడిలోని దీపానికి చిన్నపాటి గూడు చాలు కదా. వేరే గుళ్ళూ మసీదులూ చర్చ్‌లూ అవసరమా అన్న మీమాంస… చిచ్చుపెట్టడానికి కొరివి కావాలిగానీ చీకటిని జయించడానికి చిన్న దీపం చాలుగదా అన్న చిరు జ్ఞానం. ఎప్పటివో గీతాలూ గేయాలూ దగ్గర్నించి నిన్న మొన్నటి ప్రవచనాల దాకా అన్నీ ఒక పద్ధతిలో అమరిపోతున్నాయన్న స్పృహ. తనకూ కాస్తంత విజ్ఞత కలుగుతోందన్న స్పృహ… తనను తానే స్వల్పజ్ఞుడిగా గుర్తించుకోగల విజ్ఞత…

ఇంట్లోంచి గెటవుట్ అయినా మురళికి ఇంటిఖర్చులూ చదువుల గురించిన కొన్ని బాధ్యతలున్నాయి. కాట్యాతో పర్లేదనిపించే సంపర్కం ఉంది. శామ్‌తో ఫేస్‌బుక్ స్నేహం ఉంది.

మరి నటాషాతో?!


కథావర్తమానకాలంలో–మురళి ఒకవేపు నుంచీ, కాట్యా మరోవేపునుంచీ, నటాషా శామ్‌లు మరోవేపునుంచీ చర్చికి వస్తారు. ఒకరికొకరు కనబడతారు. తమ – నటాషా – పొరుగింటి డేవిడ్ మెమోరియల్ సర్వీసు సందర్భమది.

నిజానికి ఆ వెళ్ళిపోయిన డేవిడ్ ఈ కథకు కొలికిపూస.

మెమోరియల్ సర్వీసులో డేవిడ్ హైస్కూలు క్లాసుమేటూ కూతురూ కొడుకూ ‘మాటల్ని దుఃఖంలోంచి ముంచి తీస్తూ’ తమతమ జ్ఞాపకాలను పంచుకోవడం చూసిన మురళికి, భార్యతో డేవిడ్‌కు ఉన్న అన్యోన్య అనురాగం గురించి విన్న మురళికి తన మెమోరియల్ సర్వీసులో కాట్యాకిగానీ శామ్‌కిగానీ నటాషాకుగానీ స్నేహితులకు గానీ తన గురించి చెప్పడానికి ఏ సంగతులూ ఉండవుగదా అనిపిస్తుంది.

డేవిడ్‌ను మానవత్వానికి ప్రతీకగా నిలబెట్టిన ఓ సంఘటన గుర్తొస్తుంది.

హరికేన్ కట్రీనా దెబ్బతిన్న నటాషా పరివారమంతా మురళీ నటాషాల ఇంట్లో తలదాచుకొని చుట్టుపక్కల ఉద్యోగాలు వెదుక్కొంటున్నపుడు, అలా అంతమంది అలగాజనం తన ఇంటిముందు పోగుపడటం నటాషావాళ్ళ ఎదురింటి తెల్లాయనకు నచ్చనే నచ్చదు.

‘ఏవిటీ సంత?’ అంటూ సొసైటీ మీటింగులో దురుసుగా చర్చకు పెడతాడు. తీవ్రంగా ప్రశ్నిస్తాడు. తమ సంజాయిషీ ఇవ్వడానికి మురళీ నటాషాలు సిద్ధపడుతోంటే డేవిడ్ కల్పించుకొని ముందుకొస్తాడు.

“మనది సంపన్న దేశం. ఎక్కడ ఉపద్రవం వచ్చినా ఆదుకోవడం మన దేశానికి అలవాటు. కట్రీనా దెబ్బకు న్యూ అర్లీన్స్ బడుగుజీవులు అల్లల్లాడుతున్నారు. నటాషా మన పొరుగావిడ. ఆవిడ కుటుంబం మనకు కావలసిన కుటుంబం. ఆగ్రహాలు కాదు వాళ్ళకు ఆదరణ కావాలి. ఆధారం కావాలి. నా వంతు నేను వెయ్యి డాలర్లు ఇస్తున్నాను. మీరెవరైనా ఇస్తే సంతోషం. పోనీ ఓ పని చేద్దాం… వీళ్ళ కుటుంబంలో సంగీతం తెలిసినవాళ్ళున్నారు. ఒక జాజ్ కన్సర్ట్ ఏర్పాటు చేద్దాం. ప్రొసీడ్స్ వాళ్ళకు ఇద్దాం…” అంటూ హుందాగా పరిస్థితిని చక్కబరచటమేగాకుండా తన ఇంటినిండా బంధువులున్నా క్రిస్మస్‌నాడు ఆ కన్సర్ట్ పెట్టి సాయంచేస్తాడు డేవిడ్.

డేవిడ్ జ్ఞాపకాలూ, అతనిలోని దైవత్వం, అందరిలోనూ దైవం ఉంది అన్న అవగాహన… ఆ ఆలోచనల్లో మునిగిపోతున్న మురళికి ఈ మానసిక పరిణతిలో విడిపోయిన నటాషా పోషించిన పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెలోని దేవుడికి చెయ్యెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. అనుకోవడమేనా వెళ్ళి ఆ పని చెయ్యగూడదా అనిపిస్తుంది. దగ్గరకు వెళతాడు.

“…యు డిడ్ ఎ గ్రేట్ ఫేవర్ టు మి బై త్రోయింగ్ మి ఔట్ ఫైవియర్స్ బాక్!” అని మనస్ఫూర్తిగా అంటాడు. నటాషా ఆశ్చర్యపడటం తెలుస్తూనే ఉంటుంది. శామ్‌తో, నువు సీడీ రిలీజ్ చేస్తున్నావుగదా, కంగ్రాట్స్! అంటాడు. కాట్యా డాన్స్ వీడియోల గురించి ప్రశంసిస్తాడు. వాళ్ళు ముగ్గురూ ఎలా స్పందించాలీ అన్న సందిగ్ధంలో ఉండగానే బైబై చెపుతూ సాగిపోతాడు.


ఉన్న ఊళ్ళూ దేశాలూ వదిలి దూరతీరాలకు ప్రవాసాలు వెళ్ళినపుడు మనమన పూర్వ అస్తిత్వాలు మన వెంటనే రావడం, అంటిపెట్టుకొని ఉండిపోవడం; దూరదేశాలలో కొత్త జీవితాలకు రూపకల్పన చేసుకొంటున్నపుడు ఈ అస్తిత్వాలు అవరోధాలవడం; అవి అవరోధాలన్న గుర్తింపు లేనపుడు మనిషి పడే క్షోభ; వాటిల్ని అవరోధాలుగా గుర్తించి అధిగమించడానికి మనిషికి ఉండవలసిన ఎరుక–ఇదీ కథకు మూల బిందువు. ఈ విషయాన్ని శివకుమార శర్మ ఎంతో ప్రతిభావంతంగా స్వల్పజ్ఞుడు కథలో ఆవిష్కరించగలిగారు. ఆరాధనీయాలనుకొన్న పూర్వ అస్తిత్వాలు ఎలా అవరోధాలవగలవో స్పష్టంగా చూపించారు.

వస్తుపరంగా, ఇతివృత్తపరంగా, శైలీశిల్పాల పరంగా ఒక కొత్త సత్యాన్ని ఆవిష్కరించే వాహికగా కథ పరిపూర్ణంగా రూపొందింది. నిజానికి కథలోని మౌలిక విషయం రచయితను ఎన్నో ఏళ్ళు ఆలోచనల్లో పెట్టి ఉండాలి. మురళి, నటాషా, కాట్యా, శామ్, రామయ్య, డేవిడ్ లాంటి మనుషులు రచయితకు తటస్థపడి వుండాలి. వస్తువుకూ ఇతివృత్తానికీ సరిజోడీ అయిన వ్యక్తీకరణ, భావధార, భాష, శైలి రచయితకు అప్రయత్నంగా అమరివుండాలి. మురళి వేపు నుంచి కథ చెప్పడం, ఏ విధమైన కుదుపులూ తడబాట్లూ లేకుండా కథను కాలపు స్కేలు మీద ముందూవెనుకలకు నడపడం, వాచ్యంగాగాకుండా సన్నివేశాలూ సంభాషణల సాయంతో కథనూ కథాంశాన్నీ ఆవిష్కరించడం, అనేక గంభీరమైన విషయాలను చిన్న కథలో సహజంగా ఇమిడేలా చేసి సమర్థవంతంగా చర్చించడం, అది సాధించడానికి రచయిత పడిన శ్రమ – మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆనందం కలిగిస్తుంది. నాటకీయత పుష్కలంగా నిండిన పాత్రలూ సంభాషణలూ సన్నివేశాలూ కథలో విరివిగా ఉన్నా ఆ నాటకీయతను సహజమే అనిపించేలా రచయిత చేసిన కథనం అబ్బురపరుస్తుంది.

నిజానికి ఇది ఒక్క అమెరికా తెలుగువాళ్ళకే చెందిన కథ కాదు. మూలాల నుంచి విడివడి బ్రతుకుతోన్న ప్రతి ఒక్కరి కథ ఇది. తరాల తరబడి తమ తమ మూలాలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కొత్త జీవితాల నిర్మాణాలకు ఆపూర్వ అస్తిత్వాలు అవరోధమవడమన్న విషయాన్ని గ్రహించడం, వాటిల్ని దాటుకోవడం ఇంకా ముఖ్యం అన్న విషయాన్ని సమర్థవంతంగా ప్రతిపాదించిన కథ ఇది.


అమెరికా తెలుగు కథకు ఆ మధ్య ఏభై ఏళ్ళు దాటాయి.

వైయక్తిక అనుభవాలు, నాస్టాల్జియా, తమతమ పరిసర ప్రపంచాలు, తమ పూర్వ అస్తిత్వాలను కాపాడుకోవడం, వీటి పునాది మీద పాతిక ముప్పై ఏళ్ళు అమెరికా కథ సాగింది. గత పదీపదిహేనేళ్ళుగా ఉమ్మడి ప్రపంచాల గురించీ, కొత్త జీవితాల గురించీ, వాటిల్లో తమ తమ ఉనికి గురించీ కథలొచ్చాయి. అమెరికన్లు, ఆఫ్రికన్ అమెరికన్లు, నేటివ్ అమెరికన్లు, హిస్పానిక్సు తెలుగు కథల్లో పాత్రలయ్యారు. వారి వారి ఆనందాలూ వేదనలూ కథావస్తువులయ్యాయి.

తెలుగు కథను భౌతికమైన మానసికమైన ఎల్లలు దాటించి, నాస్టాల్జియా పరిధులు దాటించి, ఉమ్మడి జీవితాల దగ్గరకు చేర్చి ఒక విశాల దృక్కోణంలోంచి జీవితాలను చూసి చూపించే కథలు గత పదేళ్ళుగా వస్తున్నాయి.

ఆ ధోరణికి మేలిమి కూర్పు 2017లో వచ్చిన తాడికొండ శివకుమార శర్మ కథ స్వల్పజ్ఞుడు.