పసివాళ్ళను పెంచాలంటే ఊరు ఊరంతా ఏకమవ్వాలి అన్న ఆంగ్ల నానుడి ఒకటి ఉంది. అది రచనలకూ పుస్తకాలకూ వర్తిస్తుందని, అనువాదాలకు మరింతగా వర్తిస్తుందనీ నాకు ఇప్పటిదాకా తెలియదు.
ఎప్పుడో ఎవరో ఏదో ఇంటర్‍వ్యూలో అడిగారు – సొంత రచనలు చేసే మీరు అనువాదాలకు ఎందుకు పూనుకుంటున్నారూ అని. నేను అనువదించడానికి తీసుకునే రచనలు అన్నివిధాలా నా రచనలకన్నా మెరుగైనవి అయ్యే అవకాశం ఉంది కాబట్టి – అని సమాధానం ఇచ్చాను. అందుకు ఈ పుస్తకమే పరిపూర్ణ నిదర్శనం.
గత పాతిక ముప్ఫైయేళ్ళుగా అనువాదాలు చేస్తున్నాను. అందులో 1920లనాటి ధన్‌గోపాల్ ముఖర్జీ చిత్రగ్రీవం, 1870లనాటి దోస్తోయెవ్‍స్కీ భార్య చాటు మనిషి, 1990లనాటి స్వదేశ్ దీపక్ కోర్ట్ మార్షల్ ఉన్నాయి. పాల్ జకారియా, ఖుష్వంత్‌సింగ్ లాంటి ఈ కాలపు రచయితల కథలూ ఉన్నాయి. అవన్నీ నాకు బాగా నచ్చి, వాటిని తెలుగువారికి అందించాలన్న తపనతో చేసిన అనువాదాలు. నేను అభిమానించి గౌరవించిన మూలరచనలు.
అనువాదాల విషయంలో నిన్నటిదాకా నేను పరమనిష్ఠాగరిష్ఠుడిని. మూలరచనలోని ఒక్క అక్షరమైనా మార్చే హక్కు అనువాదకుడికి లేదని, ఒక్క పదాన్నైనా అనువదించకుండా వదలకూడదనీ నమ్మినవాడిని. అదే సమయంలో లక్ష్యపాఠకులకూ విధేయుడిగా ఉండాలని తెలిసినవాడిని. ఈ జోడుగుర్రాల స్వారీని కష్టమైన ఇష్టంగా సాగించినవాడిని.
నిమ్మగడ్డ శేషగిరిగారితో నా పరిచయం వయసు ఆరేడేళ్ళు. ఒక సహయాత్రికుడిగా ఆయన ఫేస్‌బుక్‌లో ఆంగ్లంలో రాస్తోన్న యాత్రాకథనాలను అభిమానించాను. వాటిని తెలుగు చెయ్యాలని గట్టిగా అనుకొన్నాను. ఆ పని మూడేళ్ళ క్రితం ఆరంభించాను. ముందుగా మొరాకో దేశం గురించి ఆయన రాసిన యాత్రాకథనాలను అనువదించాను. 2023 ఆరంభంలో ఊహలకందని మొరాకో పుస్తకం ప్రచురించాను.
ఆయనతో పరిచయమూ స్నేహమూ ఉన్నా మొరాకో అనువాదం ఆరంభంలో నేను నమ్మే నిష్ఠాగరిష్ఠతనే పాటించాను. కానీ క్రమక్రమంగా నాలోని యాత్రాకథకుడు ఆయనలోని యాత్రారచయితతో సంభాషించడం మొదలెట్టాడు. మొరాకో చివరకు వచ్చేసరికి ఆ సంభాషణ ఒక నిరంతర ధారగా పరిణమించింది. ఆ అనువాదానికి పుష్టిని సమకూర్చింది.
ఈ నేపథ్యంలో లాటిన్ అమెరికా అనువాదం ఏడాదిన్నర క్రితం ఆరంభించాను. నాకు తెలియకుండానే నేను అప్పటిదాకా నమ్మిన అనువాద నియమాలను విడిచిపెట్టాను. ఆయన ఆలోచనావిధానం, యాత్రలు చేసే పద్ధతీ చాలావరకు నావిలానే ఉన్నాయని స్పష్టమయ్యింది. దానితో నేను చేస్తోన్న అనువాద ప్రక్రియ ఆయనతోపాటు చేసే సహయానంగా పరిణమించింది.
ఆయన వెళ్ళిన చోటుకల్లా నేనూ వెళ్ళడం మొదలెట్టాను. ఆయన ఐదు వారాల్లో తిరిగిన ప్రదేశాల్లో నేను తీరిగ్గా పదహారు నెలలపాటు తిరిగాను. ఆయన సేకరించిన వివరాలు నావి అయ్యాయి. ఆ అనుభవాలూ అనుభూతులూ నా స్వంతం అయిపోయాయి. ఆయన కలిసిన మనుషుల్ని నేనూ కలిశాను. తిరిగిన దేశాలు నేనూ తిరిగాను. ఆనందాలు, విచారాలు, అక్కరలు, వత్తిడులు, స్నేహాలు, ఆశలు, నిరాశాలు, సంతృప్తులు – అన్నీ నాకు స్వంతమయ్యాయి. ఒకోసారి – ‘అక్కడ అంత అనుభూతి పొందారుగదా, మరీ అంతా క్లుప్తంగా ముగించారేం’ అని ఆయన్ని అడిగాను. ‘ఇది మరీ ఎక్కువగా రాశారు, ఈ వివరాలు మరోసారి సరిచూసుకోండి – ఆ జ్ఞాపకాలు మరోసారి మనసులోకి తెచ్చుకోండి’ అంటూ ఆయన్ని తరిమాను. ‘ఇది పాఠకులకు ముఖ్యమైన విషయం – మరికాస్త వివరంగా చెప్పండి’ అన్నాను. అలా అన్ని అనువాద నియమాలనూ పక్కనబెట్టి మూలరచనలో చొరబడి నిలదీయసాగాను.
శేషగిరి పెద్దమనసుతో నా చొరబాటును సహించారు. నా సూచనలను అర్థం చేసుకున్నారు. అవసరమనుకొన్నచోట వాటిని పాటించారు. అలా ఈ అనువాద ప్రక్రియ నేను ఊహించనయినా ఊహించలేని బాణీలో కొనసాగింది. ఆయన గొంతుతో నా గొంతు కలిపే అవకాశం కలిగించింది. ఆ విషయం గొప్ప సంతోషం కలిగించింది.
ఇందాక ఊరు ఊరంతా అన్నానుగదా – చెపుతాను.
ఈ రచన ఈమాట పత్రికలో పదహారు నెలలపాటు వచ్చింది. రచనను మెరుగు పరచడంలో సంపాదకులు మాధవ్ మాచవరం ఎంతో క్రియాశీలంగా వ్యవహరించారు. అవసరమైన చోట వివరాల పూరణ-సవరణ, స్పానిష్ పదాల సరి అయిన ఉచ్చారణలు సూచించడం, ఫోటోలూ మ్యాపులూ జోడించడం – తన స్వంతబిడ్డలా పొదవుకొని లాలించారీ రచనను మాధవ్.
అనువాదాన్ని ఈమాటకు పంపే ముందు వ్రాతప్రతిని కంప్యూటరీకరించడంలో సాయం అవసరమయింది. సన్నిహిత మిత్రుడు, సాటి రచయిత శ్రీనివాస్ బందా తానెంత తీరికలేని పనుల్లో ఉన్నా ఆ సాయం అందించారు. అంతే కాకుండా అనువాద దోషాలు, భాషాదోషాలు ఎత్తి చూపి సవరించారు. అలా శేషగిరి, అమరేంద్ర, మాధవ్ – ఈ ముగ్గురే కాకుండా శ్రీనివాస్ అన్న నాలుగో నాణ్యతాకోణం సమకూరింది ఈ రచనకు.
ఈమాటలో ప్రచురణ జరిగినంత కాలం మిత్రులు సూరాబత్తుల జగన్నాథరావు క్రమం తప్పకుండా ప్రతి భాగమూ చదివి విలువైన సూచనలు చేశారు. పాటించాను. ఈమాట ప్రచురణ ముగిసి మొత్తం పుస్తకం రూపుదిద్దుకుంటున్న సమయంలో అనువాదకులు జె. ఎల్. రెడ్డి అక్షరమక్షరం చదివి వందలాది మెరుగులు సూచించారు. ఆయన ఈ పుస్తకానికి చేర్చిన అదనపు విలువ లెక్కకట్టలేనిది, మాటల్లో చెప్పలేనిది.
ఈ పుస్తకం రూపకల్పన చివరిఘట్టంలో అక్షర సీతగారి నిర్మాణాత్మక జోక్యం ఎంతో ఉంది. ఎన్నో చివరి నిమిషపు సందేహాలూ సంశయాలూ ఆమెతో చర్చించడం, ఆమె ఇచ్చే పరిణత సూచనలు పాటించడం నాకు బాగా అలవాటు. ఇక ఆవిడ స్పర్శతో ఏ పుస్తకమైనా మరింత ప్రాణం పోసుకుంటుంది అన్న మాట చెప్పనవసరం లేదు.
జర్నలిస్టు, యాత్రికుడు ఎన్. వేణుగోపాల్ నిరంతర శ్రామికుడు. పొద్దుచాలని మనిషి. అయినా నా కోరికను మన్నించి అక్షరమక్షరం చదివి ‘యోగ్యతాపత్రం’ అంత చక్కని అవతారిక రాశారు. ఎన్ని ధన్యవాదాలని చెప్పనూ!
ఇలా ఎంతోమంది పూనుకుంటేనే ఈ పుస్తకం ఇంత నిండుగా రూపొందింది. జవసత్వాలు సంతరించుకుని మీ ముందుకు వస్తోంది.
ఇది మామూలు పుస్తకం కాదు.
మనకు తెలియని, మనం తెలుసుకోవలసిన ఎన్నో విషయాలు తనలో ఇముడ్చుకున్న పుస్తకమిది. ఎక్కడో సుదూరపు మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ప్రజల గురించి రాసిన పుస్తకం కాదిది – సమస్త మానవాళి ఆశనిరాశలను, సుఖదుఃఖాలను, కష్టనష్టాలను, ఉత్థానపతనాలను, విజయపరాజయాలను, కరుణాక్రౌర్యాలను, ఉదాత్తతా నైచ్యాలను, స్వార్థాలూ ఉదారతలను విప్పి చెప్పే రచన ఇది. యాత్రారచన పరిధిని దాటి ఎంతో దూరం వెళ్ళిన బతుకు పుస్తకమిది. తెలుగువారికి ఈ పుస్తకం అందించగలిగినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎంతో సంతృప్తిగానూ ఉంది.
పుట్టి జవసత్వాలు సంతరించుకున్న బిడ్డ, ప్రపంచంలోకి అడుగుపెట్టి మనుగడ సాగించాలంటే సమస్త విశ్వమూ అందుకు ఊతమివ్వాలి. ఈ పుస్తకానికి మీ చేయూతనందుకునే అర్హత ఉందని, మీరంతా ఇష్టంగా దీన్ని చదువుతారనీ నా నమ్మకం!
దాసరి అమరేంద్ర
(ఢిల్లీ, 15 నవంబర్ 2024)
యాత్రాకథ: మనమెరుగని లాటిన్ అమెరికా
రచన: నిమ్మగడ్డ శేషగిరి
అనువాదం: దాసరి అమరేంద్ర
ప్రచురణ: ఆలంబన ప్రచురణలు, 2024
వెల: ₹300.00
ప్రతులకు: నవోదయ.